వేమన పద్యాలు ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రోగియైనవాఁడు రోగి నెఱుంగును[మార్చు]

రోగియైనవాఁడు రోగి నెఱుంగును
రోగి నరసిచూచి రూఢిగాను
రోగి కిడినవానిరాగి బంగా రౌను
విశ్వదాభిరామ వినర వేమ!

రేచకపూరక కుంభక[మార్చు]

రేచకపూరక కుంభక
సూచకములు రాజయోగి సుస్థిరమతియై
లోచూపుచూడనొల్లక
వాచాబ్రహ్మంబు పలుకవద్దుర వేమా!

రాజయోగి మహిమ రాజయోగికి గాక[మార్చు]

రాజయోగి మహిమ రాజయోగికి గాక
ఇతర జనులకెల్ల నేమిదెలియు
తాను దేవుఁడైన దైవముఁ గొలుచునా
విశ్వదాభిరామ వినర వేమ!

రాజయోగీంద్రుఁ డాతఁడై తేజరిల్లు[మార్చు]

నియమాది సంగుఁడై నిలిచినఁ దత్వంబు - తామసంబగుఁ నిద్రఁ దలఁగఁజేయు
నిద్ర తలంగిన నిర్భీతినొందించు - శమమున నానంద సమితి పుట్టు
నానందమున విశ్వమంతయుఁ దానగుఁ - దాను విశ్వంబయినఁ దత్వమగును
తత్వ మింద్రియ పంచతత్వంబునను - నిల్చుఁ దత్వంబు నిలిచినఁ దానయగును

రాజయోగీంద్రుఁ డాతఁడై తేజరిల్లు
వెలయ జగముల విహరించు విశ్రుతముగ
బాలు విధమున వృద్ధుని పగిదిసోకు
కరణివెంగలిక్రియ చూడ ఘనత వేమా!

రాజవరుల కెపుడు రణరంగముల చింత[మార్చు]

రాజవరుల కెపుడు రణరంగముల చింత
పరమ మునులకెల్ల పరముచింత
యల్పనరుల కెల్ల నతివలపై చింత
విశ్వదాభిరామ వినర వేమ!

రాజుమాటవలెను రసికుఁ డాడగవలె[మార్చు]

రాజుమాటవలెను రసికుఁ డాడగవలె
నెంతపనికి నుబికి యెగురరాదు
కదిసి యెగిరెనేని గ్రహసమానము గాదె
దొడ్డ కొంచె మేల దొరకు వేమ!

రాతిప్రతిమ దెచ్చి రాజసంబుననుంచి[మార్చు]

రాతిప్రతిమ దెచ్చి రాజసంబుననుంచి
పూజసేయు నరుఁడు బుద్ధిమాలి
భావమందుఁ బరము భావించ నేరఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

రాతిబసవని గని రంగుగా మ్రొక్కుచు[మార్చు]

రాతిబసవని గని రంగుగా మ్రొక్కుచు
గునుకుబసవని గని గ్రుద్దుచుండ్రు
బసవభక్తులెల్ల పాపులె తలపోయ
విశ్వదాభిరామ వినర వేమ!

రతిలేక ముదియు నంగన[మార్చు]

రతిలేక ముదియు నంగన
రతి కలిగిన ముదియు నశ్వరత్నము ధరలో
సతతము భ్రాంతిని చేసెడు
తతిరతిచే ముదియు నరుఁడు తథ్యము వేమా!

రానిధనమునకును దానును కొడుకును[మార్చు]

రానిధనమునకును దానును కొడుకును
వాంఛఁబడుటె కాని వట్టి భ్రమలు
భాగ్యహీనునకును ఫలము లభించునా
విశ్వదాభిరామ వినర వేమ!

రెప్పలు మూసియు మూయఁగఁ[మార్చు]

రెప్పలు మూసియు మూయఁగఁ
దప్పక తనమనమునందుఁ దత్వము గూడున్‌
ఎప్పుడు చూచెడువానికిఁ
జొప్పెడు నెచ్చోట ముక్తి సులభము వేమా!

రమణి నవ్వుచుండు రమణుఁడు నేడ్చును[మార్చు]

రమణి నవ్వుచుండు రమణుఁడు నేడ్చును
రమణ సేయుచుండు ఱంకుమీర
ఱంకు చూడఁగానె పరమైన తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

రామనామపఠన మహిమచే వాల్మీకి[మార్చు]

రామనామపఠన మహిమచే వాల్మీకి
పరఁగ బోయ యయ్యు బాపఁడయ్యె
కులము ఘనము గాదు గుణము ఘనంబురా
విశ్వదాభిరామ వినర వేమ!

రామవిభుఁడు పుట్టి రఘుకులం బలరించె[మార్చు]

రామవిభుఁడు పుట్టి రఘుకులం బలరించె
గురువిభుండు పుట్టి కులముచెఱచె
ఎవరి మంచిచెడ్డ లెంచిచూచినఁ దేట
విశ్వదాభిరామ వినర వేమ!

రాయియై యహల్య రాము పాదముసోకి[మార్చు]

రాయియై యహల్య రాము పాదముసోకి
యాడుదయ్యె నందు రవని జనులు
చేయు సుకృతములిట్లు శిలలైన దప్పవు
విశ్వదాభిరామ వినురవేమ!

రోయవచ్చుఁ బరము రూఢిగాఁ దెలిసిన[మార్చు]

రోయవచ్చుఁ బరము రూఢిగాఁ దెలిసిన
గానవచ్చు గ్రుడ్డు కదలకున్న
రెప్పలార్పకున్న రెంటి సందుననుండి
విశ్వదాభిరామ వినర వేమ!

రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించి[మార్చు]

రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించి
భ్రష్టుత్రోవఁ దిరుగు భ్రష్టజనులు
ఱంకులకునుదిరుగు రమణులవలె నుండు
విశ్వదాభిరామ వినర వేమ!

రూఢిగాను భక్తి రూపించి చెప్పిన[మార్చు]

రూఢిగాను భక్తి రూపించి చెప్పిన
వాడె పరమగురుడు వసుధలోన
వేడి పరము గనుటె వేదాంతవేద్యము
విశ్వదాభిరామ వినురవేమ!

రూపడఁగక జీవరూపంబుఁ గనరాదు[మార్చు]

రూపడఁగక జీవరూపంబుఁ గనరాదు
నట్టిరూప మడగ నలవిగాదు
బ్రహ్మ మడఁగకున్న బ్రహ్మంబుఁ గనఁరాదు
విశ్వదాభిరామ వినర వేమ!

రూపవతులు ముగ్గురు రూపవంతులు చూడ[మార్చు]

రూపవతులు ముగ్గురు రూపవంతులు చూడ
వారి వారి నేల గారవింప
మొద లెఱుగకయున్న మోక్షంబు గలుగునా
విశ్వదాభిరామ వినర వేమ!

రూపు పేరు రెండు రూఢితోఁ గలిసిన[మార్చు]

రూపు పేరు రెండు రూఢితోఁ గలిసిన
పేరు రూపిక్రియలు పెనగిఁయుండు
నామరూపమ్ములు నాశ మొందుటమేలు
విశ్వదాభిరామ వినర వేమ!

రూపు మాయ చూపు రూఢియై వెలుగొందుఁ[మార్చు]

రూపు మాయ చూపు రూఢియై వెలుగొందుఁ
గాదుమాయమ్రానుఁ గల్పతరువు
చూపు గ్రుంగఁ జేసి చూచుట సుఖమురా
విశ్వదాభిరామ వినర వేమ!

రూపులేని వనితరూఢి పతివ్రత[మార్చు]

రూపులేని వనితరూఢి పతివ్రత
నీటు లేనివాఁడు బంటు కాఁడు
తెలుప వచ్చువాఁడు దేవరబంటురా
విశ్వదాభిరామ వినర వేమ!

రూపువంక పేరు రూఢిగా నిలుచును[మార్చు]

రూపువంక పేరు రూఢిగా నిలుచును
పేరువంక క్రియలు పెనగుచుండు
నాశమౌను తుదకు నామరూప క్రియల్‌
విశ్వదాభిరామ వినురవేమ!వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |