వేమన పద్యాలు ద

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి[మార్చు]

దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి
ఱంకులాడికింత శంకపుట్టు
దొంగకన్న ఱేవెలుం గొప్పకానట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

దొంగతనమువలన ద్రోహమెంతయుచేసి[మార్చు]

దొంగతనమువలన ద్రోహమెంతయుచేసి
ఎవ్వరెరుగకుండ నిముడుకున్న
తాఙూచేయుపనుల తగులకోకుందురా
విశ్వదాభిరామ వినురవేమ!

దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు[మార్చు]

దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు
చేతఁగానిపనులఁ జేయరాదు
గ్రుడ్డనంగ వలదు గుణహీనుఁడనవలె
విశ్వదాభిరామ వినర వేమ!

దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు[మార్చు]

దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు
చేతగానికూత చెల్ల దెపుడు
గురువుపద్దు గాదు గుణహీన మగుఁగాక
విశ్వదాభిరామ వినర వేమ!

దెందమందు దలచు తెప్పరమెప్పుడు[మార్చు]

దెందమందు దలచు తెప్పరమెప్పుడు
నోర్వలేని హీను నరునికంటె
తనకుమూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ!

దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన[మార్చు]

దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన
పురుషుఁడిహమునందు పూజ్యుఁడగును
పరమునందు వాని భాగ్య మేమనవచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి[మార్చు]

దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి
యడ్డమైన జనులనంటఁగట్టి
దోఁచుకున్న నట్టి దోష మెక్కడఁబోవు
విశ్వదాభిరామ వినర వేమ!

దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరి[మార్చు]

దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరి
చాడిచెప్పు పాపజాతినరుడు
చాడిచెప్పువాడు సాయుజ్యమొందునా?
విశ్వదాభిరామ వినురవేమ!

దాత లేని కొంప దయ్యాల పెనువాడ[మార్చు]

దాత లేని కొంప దయ్యాల పెనువాడ
నీతిగాని పాట వాతిచేటు
ప్రీతిలేని లంజ ఫూతియై తోఁచురా
విశ్వదాభిరామ వినర వేమ!

దాతగానివాని తఱచుగా వేఁడిన[మార్చు]

దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!

దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక[మార్చు]

దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక
మనము నమ్మెనేని మాయ గల్గు
జ్ఞానకలిక నమ్మఁ జంపును వైరుల
విశ్వదాభిరామ వినర వేమ!

దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు[మార్చు]

దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు
తేజ మొసఁగుకన్నఁ దెలివి హెచ్చు
తెలివికన్న నాసఁ దెగ వేయునది హెచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

దానధర్మములను తెగ రేపు నేఁడని[మార్చు]

దానధర్మములను తెగ రేపు నేఁడని
కాలవ్యయముఁ జేయు కష్టజనుఁడు
తానునేమి యౌనొ తనబ్రతు కేమౌనొ
మాయఁదెలియ లేదు మహిని వేమా!

దానధర్మములును దయయు సత్యము నీతి[మార్చు]

దానధర్మములును దయయు సత్యము నీతి
వినయ ధైర్య శౌర్య వితరణములు
రాజుపాలిటి కివి రాజయోగంబులు
విశ్వదాభిరామ వినర వేమ!

దానమడుగువాఁడు ధరలోన నధముండు[మార్చు]

దానమడుగువాఁడు ధరలోన నధముండు
దానమడుగఁడేని దైవసముఁడు
దానమీనివాఁడు ధన్యుండు కాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

దానములను జేయఁ దన చేతులాడక[మార్చు]

దానములను జేయఁ దన చేతులాడక
బహుధనంబుఁగూర్చి పాతిపెట్టు
తుదను దండుగ నిడు మొదలు చేర్చునరుండు
విశ్వదాభిరామ వినర వేమ!

దానములలో నన్నదానము దొడ్డది[మార్చు]

దానములలో నన్నదానము దొడ్డది
గానములను సామగాన మెచ్చు
ధ్యానములను శివునిధ్యానము శ్రేష్ఠము
విశ్వదాభిరామ వినర వేమ!

దీపంబు లేని యింటను[మార్చు]

దీపంబు లేని యింటను
రూపంబును దెలియలేరు రూఢిగఁ దమలో
దీపమగు తెలివి గలిగియు
పాపంబుల మఱుగుత్రోవఁ బడుదురు వేమా!

దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత[మార్చు]

దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత
దోఁచుకొన్నవాఁడు ద్రోహి యయ్యె
ప్రాపుఁ జూపువాఁడు పరమపుణ్యుం డయ్యె
ప్రాపుఁజెఱచువాఁడు పశువు వేమ!

దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు[మార్చు]

దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు
పాపియైన మనసుఁ బట్టరాదు
వీడు గదలిపోవ వెళ్లుదు రెటులనో
విశ్వదాభిరామ వినర వేమ!

దర్శనంబులందు ధర షణ్మతములందు[మార్చు]

దర్శనంబులందు ధర షణ్మతములందు
వర్ణకాశ్రమముల వదల కెపుడు
తిరుగుచున్నవాఁడు ధరలోన నధముండు
విశ్వదాభిరామ వినర వేమ!

ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన[మార్చు]

ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
నటననైన సాహసముననైన
సంపదధికునుండి సాధించి ధనమును
బడుగు కిచ్చి బాగుపడును వేమ!

ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి[మార్చు]

ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి
స్నేహితునికినైనఁ జెరపుచేయు
నూహకలిగియుండు నోగుబాగులులేక
విశ్వదాభిరామ వినురవేమ!

ద్విజకులంబునందు తేజరిల్లుచు బుట్టి[మార్చు]

ద్విజకులంబునందు తేజరిల్లుచు బుట్టి
తా తరించి యెరుల దాట జేయ
లేని యాత డున్న లేకున్న నొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ!

ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె[మార్చు]

ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె
పేరటాలు మురువు పెండ్లిమొనసె
కులము మొదలుఁ బోయెఁ గూలెఁబో మానంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు[మార్చు]

ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు
మృతిని బొంది తాను వెతల బడగ
కాలు దరిని చేరు గడతేర లేడయా
విశ్వదాభిరామ వినురవేమ!

దేవపూజ సేయ దివ్యభోగము గల్గు[మార్చు]

దేవపూజ సేయ దివ్యభోగము గల్గు
తత్వ మెఱింగెనేని దైవసముఁడె
యేమిలేనినరున కేగతిలేదురా
విశ్వదాభిరామ వినర వేమ!

దేవభూములందు దేవాలయములందు[మార్చు]

దేవభూములందు దేవాలయములందు
దేవుఁడంచుఁ జెప్పి తెరువుఁజూపె
తెలియ విశ్వమెల్ల దేవాది దేవుఁడౌ
విశ్వదాభిరామ వినర వేమ!

దైవమతుల నరులు తమవంటివా రని[మార్చు]

దైవమతుల నరులు తమవంటివా రని
యరసి గూఢతత్వ మరయ లేరు
ఇల్లు మూయఁబడిన నెట్లు మర్మ మెఱుఁగు
విశ్వదాభిరామ వినర వేమ!

ద్వార బంధమునను తనయులు సంపద[మార్చు]

ద్వార బంధమునను తనయులు సంపద
బంధువర్గ మెల్ల ప్రహరిగోడ
మూఢులైన నరులు మొక్కలి కాండ్రయా
విశ్వదాభిరామ వినర వేమ!

దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె[మార్చు]

దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనముల నెక్కి వడిఁదోలు మన్నాఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

దేశదేశములను దిరిగిగాసిలినొంద[మార్చు]

దేశదేశములను దిరిగిగాసిలినొంద
నాత్మయందు ధ్యాన మంటుకొనునె
కాసులకును దిరుగఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

దశయనంగ మెండుధన ముండుటే యండ్రు[మార్చు]

దశయనంగ మెండుధన ముండుటే యండ్రు
కూడు నిద్రలేక కుందుటయెకద!
రాగముంషబోవ బాగుగ నేడ్పించు
విశ్వదాభిరామ వినురవేమ!

దశరధుడు రామధరణీశు పట్టంబు[మార్చు]

దశరధుడు రామధరణీశు పట్టంబు
కట్టచేయదలప, గట్టెజడలు
తలపు మనదిగాని దైవిక మది వేరు
విశ్వదాభిరామ వినురవేమ!

దేశవేషములను తేటసేయక దేవుఁ[మార్చు]

దేశవేషములను తేటసేయక దేవుఁ
డాత్మలోన నుండ ననగిపెనగి
వేషమరసిచూడ గ్రాసంబు కొఱకయా
విశ్వదాభిరామ వినర వేమ!

దోసకారియైన దూసరియైనను[మార్చు]

దోసకారియైన దూసరియైనను
పగతుడైన వేదబాహ్యుడైన
వట్టిలేని పేదవాని కీదగు నీవి
విశ్వదాభిరామ వినురవేమ!

దోసముల్లువంటి తుర్యమం దాత్మను[మార్చు]

దోసముల్లువంటి తుర్యమం దాత్మను
జూచి యాసలనటుతోచివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి[మార్చు]

దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి
ఆవలి చూపుచూచు నతడె గురువు
భ్రమరము తనరూపు క్రిముల కిచ్చినరీతి
విశ్వదాభిరామ వినురవేమ!

దేహ సంకటమును దెగితేరకాండ్రకు[మార్చు]

దేహ సంకటమును దెగితేరకాండ్రకు
మోహదృష్టి విడిచి మూల మెఱిఁగి
వ్యూహ మొక్కటిపన్ని యుల్లంబు సంధించి
స్నేహ మెఱుఁగ యోగ సిద్ధి వేమ!

దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి[మార్చు]

దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి
మోహమందుఁ జిక్కి మోసపోఁడు
ఇంద్రజాలకుండు నెందుకుఁ జిక్కురా
విశ్వదాభిరామ వినర వేమ!

దేహాభిమాన ముండఁగ[మార్చు]

దేహాభిమాన ముండఁగ
మోహాదులు జననవార్ధిముంచును కలగా
నీహా విషయభావన
కూహాదులు పోవు మేలుకొన్నను వేమా!

దేహము లెస్సగ నుండిన[మార్చు]

దేహము లెస్సగ నుండిన
పోషణ తత్వంబులన్ని పొందుగఁ దెలియు
దేహము బడలికఁ బడినను
పోషణ తత్వములు వచ్చి పొందవు వేమా!

దేహియు జ్ఞానానలమున[మార్చు]

దేహియు జ్ఞానానలమున
దాహంబై దేహ మెల్లఁ దల్లడపడ నా
దేహములోఁ బొర్లాడుచు
మోహమడచి శివునిఁ జూడ ముక్తిర వేమా!

దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు[మార్చు]

దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు
బండరాజునకును బడుగుమంత్రి
కొండముచ్చునకును గోఁతియు సరియౌను
విశ్వదాభిరామ వినర వేమ!

దుష్టజనులగూడి తుంటరిపనులను[మార్చు]

దుష్టజనులగూడి తుంటరిపనులను
శిష్టకార్యములుగ చేయుచుంద్రు
కూడదనెడివారిగూడ నిందింతురు!
విశ్వదాభిరామ వినురవేమ!

దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక[మార్చు]

దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక
బారప ట్టెఱుగరు పడినదనుక
దండసాధ్యు లయిరి ధర్మసాధ్యులుగాక
భూమిజనులు వెఱ్ఱిబుద్ధి వేమ!

దూరదృష్టిగనరు తూగినదనుకను[మార్చు]

దూరదృష్టిగనరు తూగినదనుకను
పారుపట్టెరుగరు పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు!
విశ్వదాభిరామ వినురవేమ!

దూలములనుబోలు దురవస్థలనునెల్ల[మార్చు]

దూలములనుబోలు దురవస్థలనునెల్ల
రోసి యాసలన్ని గోసివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

దూలాలు టెంకినుండిన[మార్చు]

దూలాలు టెంకినుండిన
వాలాయము చేటు వచ్చు వసుమతిలోన
లోలాక్ష విడిచిపెట్టిన
మేలిమిగా బ్రతుకవచ్చు మేదిని వేమా!

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు[మార్చు]

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినుర వేమ!

ద్వారంబంధమునకు దలుపులు గడియలు[మార్చు]

ద్వారంబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ !వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |