వేమన పద్యాలు ఎ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎంగిలెంగిలనుచు ఆ నోటితోడనే[మార్చు]

ఎంగిలెంగిలనుచు ఆ నోటితోడనే
వేదములను చదువు వెర్రులార
యెంచిచూడ నదియు నెంగిలే కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ!

ఎండచీఁకటులకు నిమ్మయియుండెడు[మార్చు]

ఎండచీఁకటులకు నిమ్మయియుండెడు
నిండు కుండలోన నిద్రమఱచి
దండియైన పరమతత్వంబు దెలియురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎండిన మా నొకటడవిని[మార్చు]

ఎండిన మా నొకటి యడవి
నుండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చరచును వేమా!

ఎండయన తిరుగు నిర వెఱింగిన యోగి[మార్చు]

ఎండయన తిరుగు నిర వెఱింగిన యోగి
యుండు నెల్లకాల ముర్విలోనఁ
దిండిపోతు వశమె తెలియంగ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎండవేళఁ జీఁక టేకమైయున్నట్లు[మార్చు]

ఎండవేళఁ జీఁక టేకమైయున్నట్లు
నిండుకుండ నీరు నిలిచినట్లు
దండిగఁ బరమాత్మ తత్వంబు దెలియరా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎంత సంపదున్న నంత కష్టపుఁజింత[మార్చు]

ఎంత సంపదున్న నంత కష్టపుఁజింత
చింతచేత మిగుల చివుకు మనసు
చింతలేయుంట చెదలని సంపద
విశ్వదాభిరామ వినర వేమ!

ఎంతకడుగ నోటి ఎంగిలిబోవునె[మార్చు]

ఏంతకడుగ నోటి ఎంగిలిబోవునె
ఎల్లకాలమందు నెంగిలి తగులు
అనుదినంబుజూడ ననృతమ్మాడెనా
నోరుకాదు క్రిందినోరువేమ!

ఎంతకరువు నయిన నెంగిలి యన్నము[మార్చు]

ఎంతకరువు నయిన నెంగిలి యన్నము
పరులకిడెడు ధర్మపరులు చూడ
భూమిమీద నెంగ్లిపుల్లెలు నాకెడు
కుక్కలై పుడుదురు కూడి వేమా!


ఎంతకష్ట ముండు నంత పాపపుఁజింత[మార్చు]

ఎంతకష్ట ముండు నంత పాపపుఁజింత
చింతచేత మిగులఁ జివుకు మనసు
చింతలేకయున్న చెడనిసంపదఁజూచు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎంతచదువుఁ జదివి యెన్ని విన్నను గాని[మార్చు]

ఎంతచదువుఁ జదివి యెన్ని విన్నను గాని
హీనుఁ డవగుణంబు మానలేఁడు
బొగ్గు పాలఁగడుగఁ బోవునా మలినంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎంతభూమి దిరిగి యేపాటు పడుచున్న[మార్చు]

ఎంతభూమి దిరిగి యేపాటు పడుచున్న
నంటనీకప్రాప్తి వెంటదిరుగు
భూమిక్రొత్తదైన భోక్తలుక్రొత్తలా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎంతసంపదొనరు నంత కష్టపుచింత[మార్చు]

ఎంతసంపదొనరు నంత కష్టపుచింత
చింతచేత మిగుల చివుకుమేను
చింతలేకనున్న చెడని సందగ జూచు
విశ్వదాభిరామ వినురవేమ!

ఎంతసేవఁజేసి యేపాటుపడినను[మార్చు]

ఎంతసేవఁజేసి యేపాటుపడినను
రాచమూక నమ్మరాదు రన్న
పాముతోడిపొందు పదివేలకైనను
విశ్వదాభిరామ వినర వేమ!

ఎందు నెఱుకవాని కిహపరములు లేవు[మార్చు]

ఎందు నెఱుకవాని కిహపరములు లేవు
ప్రాణహానిలేదు ప్రళయమునను
ప్రళయకాలమైనఁ బరమాత్ముఁ గలయురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎంబెరుమతమని యెసఁగ మాంసము తిని[మార్చు]

ఎంబెరుమతమని యెసఁగ మాంసము తిని
మారుపేరుఁ బెట్టి మధువు ద్రావి
వావివరుస దప్పి పలికి పాడౌదురు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎక్కడయినయాశ లినుమడియుండఁగా[మార్చు]

ఎక్కడయినయాశ లినుమడియుండఁగా
తిక్కపట్టి నరుఁడు తిరుగుచుండు
కుక్కవంటి యాశ కూర్చుండ నీయదు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎక్కడిసుతు లెక్కడిసతు[మార్చు]

ఎక్కడిసుతు లెక్కడిసతు
లెక్కడిబంధువులు సఖులు నెక్కడి భృత్యుల్‌
డొక్కువడి పోవు వేళలఁ
జక్కటికిని నెవరురారు సహజము వేమా!

ఎట్టిమంత్రమైన ఎంగిలిగాకుండ[మార్చు]

ఎట్టిమంత్రమైన ఎంగిలిగాకుండ
పలుకవశముకాదు బ్రహ్మకైన
ఎంగిలెంగిలందురీనోటితోడనే
విశ్వదాభిరామ వినురవేమ!

ఎట్టిరూపుఁ జూడ నీరూపు కనిపించు[మార్చు]

ఎట్టిరూపుఁ జూడ నీరూపు కనిపించు
నీదురూపుఁజూడ నెగడుఁ దెలివి
హెచ్చు తెలివి యున్న నీశ్వరుఁ డేతోఁచు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎట్టివాఁడు తానో యెఱుఁగడు తొలిపుట్టు[మార్చు]

ఎట్టివాఁడు తానో యెఱుఁగడు తొలిపుట్టు
నీచబ్రతుకుకింత నీమమేల
కష్టనరుల కెల్ల కలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎట్టివానికైనఁ బుట్టును మోహంబు[మార్చు]

ఎట్టివానికైనఁ బుట్టును మోహంబు
పుట్టు మోహమెల్లబ్రోవఁద్రొక్కి
గట్టిచేసి చూడఁ గాన్పించు బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎట్టిస్త్రీలఁ గనిన నింతంత యనరాదు[మార్చు]

ఎట్టిస్త్రీలఁ గనిన నింతంత యనరాదు
కాలవహ్ని లక్క కరఁగినట్లు
ఇట్టిగాఢమోహ మెంతైనఁ జేయురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎడ్డె దెలుపవచ్చు నేఁడాది కైనను[మార్చు]

ఎడ్డె దెలుపవచ్చు నేఁడాది కైనను
మౌనిఁ దెలుపవచ్చు మాసమందు
మొప్పెఁ దెలుపరాదు ముప్ప దేండ్లకు నైన
విశ్వదాభిరామ వినర వేమ!

ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ[మార్చు]

ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ
యెరువులేకపోయి తిరిగె విలువ
నేర్పెఱుఁగనివాని నెఱయోగి యందురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎదుటితనబలంబు లెంచుకోనేరక[మార్చు]

ఎదుటితనబలంబు లెంచుకోనేరక
డీకొని చలమున నెదిర్చెనేని
యెలుగు పందిసేత కేర్పడు చందంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎన్ని జాతులందు ఏజాతి ముఖ్యమో[మార్చు]

ఎన్ని జాతులందు ఏజాతి ముఖ్యమో
ఎరుక కల్గువారె హెచ్చువారు
ఎరుకలేనివార లేజాతి నున్నను
హీనజాతియందు రెరుగ వేమ!

ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు[మార్చు]

ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు
మృతిని గెలువలేని యెఱుఁకలేక
దొంగరీతి కాఁగ దొరుకునో మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎన్ని మతములైన జరుగఁ దగదు[మార్చు]

ఎన్ని మతములైన జరుగఁ దగదు
సత్య మింతలేక జరుగఁ దగదు
సత్యము గలవాఁడు జగతిలో ద్విజుఁ డయ్యె
విశ్వదాభిరామ వినర వేమ!

ఎన్నఁగ మనసే కారణ[మార్చు]

ఎన్నఁగ మనసే కారణ
మన్నిటికిని జూడఁజూడ నాత్ముఁడు తానై
యున్నంతకాలమెచ్చట
నున్నను నిది నిజముఁ దెలియ నొప్పగు వేమా!

ఎన్నిఫలములున్న నీ ఫలంబెక్కుడు[మార్చు]

ఎన్నిఫలములున్న నీ ఫలంబెక్కుడు
అన్ని సుఖములందు నధికమగుచు
కన్నది కననిదై కనిపించు కర్మంబె!
విశ్వదాభిరామ వినురవేమ!

ఎన్నిమతములైన ఏమంత్రమైనను[మార్చు]

ఎన్నిమతములైన ఏమంత్రమైనను
సత్యమింతలేక జారవిడచు
సత్యముకలిగున్న జగతిలో ద్విజుడగున్
విశ్వదాభిరామ వినురవేమ!

ఎన్నియెన్ని పూజలెచటఁ జేసిన నేమి[మార్చు]

ఎన్నియెన్ని పూజలెచటఁ జేసిన నేమి
భక్తిలేని పూజ ఫలములేదు
భక్తి గల్గుపూజ బహుళ కారణమురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎన్నాళ్ళకుఁ దానుండును[మార్చు]

ఎన్నాళ్ళకుఁ దానుండును
ఎన్నాళ్లను దాను నేర్చి యెన్నిటవెలయున్‌
కొన్నాళ్లకుఁ దాఁ జన్నను
మన్నేయగు విద్యలెల్ల మహిలో వేమా!

ఎపాపమైన జక్కగ[మార్చు]

ఎపాపమైన జక్కగ
బాపును గురుమర్మఘటిక బహుజన్మ తతిన్
జూపట్టి యడగ ద్రొక్కుచు
కాపయి మదిలోన వెలుగు ఘనముగ వేమా!


ఎప్పుడు చూచిన న్నితర మేమియుఁ జూడక ముక్తి యందుఁగ[మార్చు]

ఎప్పుడు చూచిన న్నితర మేమియుఁ జూడక ముక్తి యందుఁగ
ఱెప్పల మూసి మూయకయ రేయిఁ బగ ళ్ళొకరీతి నుండఁగా
దప్పుల నొందఁ జేయు యమ ధర్ముని పాలికినొంద నేర్చునే
చెప్పఁగ నేమి వేమనకు జెల్లునుముక్తి విధానమంతయున్‌!


ఎర్రనాడుదాని ఏపారచూచిన[మార్చు]

ఎర్రనాడుదాని ఏపారచూచిన
నేకిబుట్టు చాల వెర్రిబుట్టు
పల్లు తెరచి నగిన పట్టు పెన్భూతంబు
విశ్వదాభిరామ వినురవేమ!

ఎఱ్ఱని ఆడుదానిన్ ఏపారన్ చూచినన్, ఏకి (ప్రేమ, attraction) పుట్టు, చాల వెఱ్ఱి పుట్టు, (ఆ ఆడుది) పల్లు (పళ్ళు) తెఱచి నగిన (నవ్వితే), పెన్భూతంబు (కోరిక అనే పెద్ద దెయ్యము) పట్టు

ఎరుక మాలు వాఁడు యేమేమి చదివినఁ[మార్చు]

ఎరుక మాలు వాఁడు యేమేమి చదివినఁ
జదివినంత సేపె సద్గుణి యగు
కదసి తామరందుఁ గప్ప గూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా[మార్చు]

ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా
బ్రతుకలేదు వట్టి బ్రాంతిగాని
గొడ్డుటావుపాలు కోరిన చేపునా
విశ్వదాభిరామ వినురవేమ!

ఎఱుక బ్రహ్మమనెను యిల శంకరార్యులు[మార్చు]

ఎఱుక బ్రహ్మమనెను యిల శంకరార్యులు
తెలివి బ్రహ్మమనుచు దెలిపె వ్యాసు
లెఱుక దెలివి రెంటి నెఱుగడు వేమన
విశ్వదాభిరామ వినుర వేమ!

ఎఱిఁగిన శివపూజ యెన్నడు చెడిపోదు[మార్చు]

ఎఱిఁగిన శివపూజ యెన్నడు చెడిపోదు
మొదలఁబట్టుపట్టి వదల రాదు
మొదలు విడిచి గోడ తుదిఁ బెట్ట గల్గురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎఱుఁగక పుట్టును తనువులు[మార్చు]

ఎఱుఁగక పుట్టును తనువులు
ముఱికి మునిఁగి తనువులెన్నొ మోయుటగాదా
యెఱుకగల తనువు నొందిన
మరియును జన్మించు టెట్లు మహిలో వేమా!

ఎఱుఁగు వాని దెలుప నెవ్వఁడయిననుఁ జాలు[మార్చు]

ఎఱుఁగు వాని దెలుప నెవ్వఁడయిననుఁ జాలు
నొరుల వశము గాదు వోగుఁ దెల్ప
యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా?
విశ్వదాభిరామ వినర వేమ!

ఎఱుక నెఱుగువాని కెఱుక యే నడుచును[మార్చు]

ఎఱుక నెఱుగువాని కెఱుక యే నడుచును
ఎఱుకలేనివాఁడు నెఱుఁగలేఁడు
ఎఱుకలోని యెఱుక నెఱుఁగుట తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎఱుక లేనిదొరల నెన్నాళ్ళు కొలిచిన[మార్చు]

ఎఱుక లేనిదొరల నెన్నాళ్ళు కొలిచిన
బ్రతుకులేదు వట్టి భ్రాంతి గాని
గొడ్డుటావు పాలుగోరిన చేపునా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎఱుకకన్నను సుఖమే లోకమునలేదు[మార్చు]

ఎఱుకకన్నను సుఖమే లోకమునలేదు
ఎఱుకనెఱుఁగ నెవని కెఱుకలేదు
ఎఱుకసాటి ఎఱుక యేతత్వమున లేదు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎఱుకమాలి జీవి యెంతకాలంబుండి[మార్చు]

ఎఱుకమాలి జీవి యెంతకాలంబుండి
చచ్చిపుట్టుచుండు సహజముగను
ఎఱుకమఱచుచోటు నెఱుగుట బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎఱుకయుండువాని కెఱుకయేయుండును[మార్చు]

ఎఱుకయుండువాని కెఱుకయేయుండును
ఎఱుకలేనివాని కెఱుకలేదు
ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఎలమిని ధనకాంక్ష నెదిరిఁ దన్నెఱుఁగక[మార్చు]

ఎలమిని ధనకాంక్ష నెదిరిఁ దన్నెఱుఁగక
కన్నుఁ గాన కెల్ల కర్మలాగు
పుట్టినపుడు పుట్టె బుద్ధిహీనతవాని
నడుఁగబోవ కష్టమదియ వేమా!

ఎల్లి రేపు నేఁడు నేలాగునైనను[మార్చు]

ఎల్లి రేపు నేఁడు నేలాగునైనను
మనసునిల్పువాఁడు మంచివాఁడు
శివుఁడు భర్త కర్త చింతింపనేలరా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎలుకతోక దెచ్చి యెందాక నుతికిన[మార్చు]

ఎలుకతోక దెచ్చి యెందాక నుతికిన
నలుపుగాక యేల తెలుపు గలుగు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన గుణియౌనె
విశ్వదాభిరామ వినర వేమ!

ఎవ్వ రెఱుఁగకుండ నెప్పుడు పోవునో[మార్చు]

ఎవ్వ రెఱుఁగకుండ నెప్పుడు పోవునో
పోవు జీవ మకట బొంది విడిచి
అంతమాత్రమునకు నపకీర్తి నెఱుఁగక
విరుగఁబడును నరుఁడు వెఱ్ఱి వేమ!

ఎవ్వరి గుణములును యేమన్న మానవు[మార్చు]

ఎవ్వరి గుణములును యేమన్న మానవు
చక్కఁజేయ రాదు కుక్క తోఁక
గడుసురాలు మగని గంపఁ బెట్టమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఎవ్వరేమెఱుంగు నింపయిన వస్తువు[మార్చు]

ఎవ్వరేమెఱుంగు నింపయిన వస్తువు
దేహ మే మెఱుంగు దివ్యబోధ
విధముఁ దెలిసి మీరు వేదాంత మెఱుగుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

ఎసఁగువేత్త యనుచు నెఱుగరే యీనరుల్‌[మార్చు]

ఎసఁగువేత్త యనుచు నెఱుగరే యీనరుల్‌
వేయిమార్గములను వేలు పజుఁడు
అవని సృష్టికర్త యంతకు గురుఁ డెన్న
నతనికి తలయేది యరయ వేమా!వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |