వేమన పద్యాలు ఉ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు[మార్చు]

ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు
యుండి యుండి యుండి యుండలేక
ఉండ వెరవు దెలిసి గండిదొంగను బట్టి
చెండిచెండి తావుచేరు వేమా!

ఉండియుండు జ్ఞాని యుగములు చనినను[మార్చు]

ఉండియుండు జ్ఞాని యుగములు చనినను
బ్రాణహాని లేదు ప్రళయమునను
బ్రాణహానియైనఁ బరమాత్ము గలియునో
విశ్వదాభిరామ వినర వేమ!

ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన[మార్చు]

ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన
సాగుబాటునున్న సమయమునను
పరుల కుపకరించి పరఁగ రక్షించును
విశ్వదాభిరామ వినర వేమ!

ఉచితాహారము వల్లనె[మార్చు]

ఉచితాహారము వల్లనె
యుచితంబుగ బుద్ధిస్థిరత నొప్పునటులనే
ఉచితమగు బోధవల్లనే
సుచరితుడై పరముగాంచుసుమ్ముర వేమా!

ఉడుగక క్రతువుల తపముల[మార్చు]

ఉడుగక క్రతువుల తపముల
నడవుల తీర్థముల తిరిగినంతనే ధరలో
నొడయని కనుగొనజాలడు
కడుథీరత గురుడు తెలుపగలడిది వేమా!

ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద[మార్చు]

ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద
మహిమఁజూపువాఁడు మధ్యముండు
వేషధారి యుదరపోషకుఁడధముండు
విశ్వదాభిరామ వినర వేమ!

ఉత్తముని కడుపున నోగు జన్మించిన[మార్చు]

ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడు చెఱచువానివంశమెల్ల
చెఱకువెన్ను పుట్టి చెఱపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినర వేమ!

ఉద్దరింపగల్గు నుత్తముండు కులంబు[మార్చు]

ఉద్దరింపగల్గు నుత్తముండు కులంబు
మధ్యముండు దాని మాట గనడు
అధముడైన వాఁడంగించు నొక్కట
విశ్వదాభిరామ వినురవేమ!

ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక[మార్చు]

ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక
కన్నుగనక పల్కుగర్వములను
దీనులయినవారి దిగువారిగాఁజూచి
పరము గనకనూత బడును వేమ!

ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ[మార్చు]

ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ
జూడఁ జూడ రుచుల జాడ వేఱు
పురుషులందు పుణ్య పురుషులు వేఱయా
విశ్వదాభిరామ వినర వేమ!

ఉప్పుచింతపండు వూరిలోనుండగా[మార్చు]

ఉప్పుచింతపండు వూరిలోనుండన
తాళకంబెరుగరో, తగరంబు నెరుగరో
విశ్వదాభిరామ వినురవేమ!

ఉపము గలుగు నాత డూరకుండగరాదు[మార్చు]

ఉపము గలుగు నాత డూరకుండగరాదు
గురునితోడ బొందు కూడవలయు
గురుడు సెప్పురీతి గురిమీర రాదయా
విశ్వదాభిరామ వినురవేమ!

ఉపముతోడ గురుని నొప్పుగ సేవించి[మార్చు]

ఉపముతోడ గురుని నొప్పుగ సేవించి
జపము హృదినిజేయు జాడ నెరిగి
తపము చేయువాడు తత్త్వజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినురవేమ!

ఉపముదోపనట్టి యుపవాసముల లేదు[మార్చు]

ఉపముదోపనట్టి యుపవాసముల లేదు
తపముచేయనైన తగులరాదు
జపముతోన గురుని జవదాటకుండురా
విశ్వదాభిరామ వినురవేమ!

ఉపవసించుచుండి యోగి నీళ్ళలోమున్గి[మార్చు]

ఉపవసించుచుండి యోగి నీళ్ళలోమున్గి
కూడువండి వేల్పు గడువుమనుచు
దానినోరుగట్టి తామెతిందురుగదా!
విశ్వదాభిరామ వినురవేమ!

ఉపవసములనున్న నూరపందిగఁబుట్టుఁ[మార్చు]

ఉపవసములనున్న నూరపందిగఁబుట్టుఁ
దపసియై దరిద్రతను వహించు
శిలకు మ్రొక్కనగునె జీవమడుగు పొమ్ము
విశ్వదాభిరామ వినర వేమ!

ఉర్వి గురుని వేడి యబ్బురపడువాడు[మార్చు]

ఉర్వి గురుని వేడి యబ్బురపడువాడు
దబ్బరాడబోడు తత్తరమున
నిబ్బరంపు మదిని నిర్విణ్ణతనుగాంచు
విశ్వదాభిరామ వినురవేమ!

ఉర్విజనులు పరమయోగీశ్వరునిఁ జూచి[మార్చు]

ఉర్విజనులు పరమయోగీశ్వరునిఁ జూచి
తెగడువారె గాని తెలియలేరు
అమృతస్వాదురుచులహస్త మేమెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ!

ఉర్వివారికెల్ల నొక్కకంచముఁబెట్టి[మార్చు]

ఉర్వివారికెల్ల నొక్కకంచముఁబెట్టి
పొత్తుఁ గుడిపికులము పొలయఁ జేసి
తలను చేయిపెట్టి తగ నమ్మఁజెప్పరా
విశ్వదాభిరామ రామరవు మ మమ

ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన[మార్చు]

ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన
పంచలోహములును భస్మమౌను
పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా
విశ్వదాభిరామ వినర వేమ!


వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |