వేమన/ప్రధమ ముద్రణ పీఠిక

వికీసోర్స్ నుండి


ప్రథమ ముద్రణ పీఠిక

శ్రీ సర్ రఘుపతి వేంకటరత్నముగారి యౌదార్యమును ఆంధ్ర విశ్వకళాపరిషత్తువారి యభిమానమును ఈ యుపన్యాసములు నాచేఁజేయించి నన్ను ధన్యుని జేసినవి.

శక్తిలో లోపములు చాలఁగలిగినను శ్రద్ధలో లోపములేకుండ ప్రయత్నించితిని గాని, దూరదేశమందుండుటచే తగిన సహాయ సంపదలేక నాకే తృప్తిగా ఈ కార్యమును నెరవేర్చలేక పోయితిని. కడప కర్నూలు మండలములలో సావకాశముగా సంచారముచేసినఁ గాని, వేమన కాలదేశములు నిర్ణయముగా జెప్పవీలులేదు. పెక్కు వ్రాఁతప్రతులను చూచి పద్యములన్నియు సంగ్రహింపనిది యతని సిద్ధాంతములు నికరముగా ఏర్పరుప వీలుగాదు. కావున నేఁజేయఁగల్గినదంతయు, ముందు వేమన పద్యములను వ్యాసంగముఁజేయఁగలవారి కొకవిధముగా పూర్వపక్షములను సమకూర్చుటయే కాని వేరుకాదు.

ఇందు నే నుదహరించిన పద్యములు సామాన్యముగా బందరుప్రతి నాధారముగాఁగొని వ్రాయబడినవైనను, పాఠములలో నల్పబేధము లందందుఁ గనవచ్చును. నేను చూచిన తక్కిన వ్రాఁత యచ్చుప్రతులందలి పాఠములుగూడ నింకను విమర్శింపవలసి యున్నవి. ఈ పని యిఁకముందు సవిమర్శముగా వేమన పద్యము లచ్చువేయువారు చేయవలసినవి.

మైసూరు

10-11-1928

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ