వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/10. బసవోదాహరణము - తొలిపలుకు (1928)
బసవోదాహరణము
(తొలిపలుకు)
పాల్కురికి సోమనాథకవీశ్వర ప్రణీతములయిన తెల్గు గ్రంథములలో నేఁటి చరిత్ర పరిశోధనకు లింతదాఁక దీనిఁ దాఁకలేదు. బసవపురాణ పీఠికలో నేను దీని యాద్యంతములఁ జూపితిని. సంబోధనముతో నెన్మిదియగు విభక్తులతో నెన్మిది పద్యములును, కళికలును, నుత్కళికలును నెల్లవిభక్తులతోఁ గడపటి పద్యమును గల స్తుతిప్రశంసాపర మయిన గ్రంథమున కుదాహరణ మని పేరు. సంస్కృతాంధ్ర కావ్యలక్షణకారులు దీని లక్షణమును నిర్వచించిరి. తెలుఁగునఁ గల యుదాహరణములలోని కెల్ల నిదియే ప్రాచీన మయినది. రావిపాటి త్రిపురాంతకుని త్రిపురాంతకోదాహరణము దీనికంటెఁ దర్వాతిదయినను, దీనికంటె హృద్యతరము. ఇందుఁ గడపటి పద్యమున సప్తమీ విభక్త్యంత పదము బసవవాచకముగా లేదు. 'నీ యందు' అని యా పద్యమునఁ జేర్పఁ గుదురదు. పద్యపాఠము సరిగాదేమో! చతుర్థీవిభక్తిరూపము లిందుఁబర్యాలోచింపఁదగినవి. ప్రాఁతకాలపుఁ దెల్గుకృతి గాన యభిమానమున దీనిని బ్రకటించితిని. సంస్కృత కర్ణాట భాషలలో నీ కవి రచియించిన లఘుకృతులను శ్రీ బండారు తమ్మయ్యగారు ప్రకటింపఁ దలంపుగొన్నట్లు నాకుఁ దెలిపిరి. అట్లు వారు ప్రకటించినచో సోమనాథుని కృతులెల్ల వెల్లడియయిన ట్లగును.
(భారతి -ఫిబ్రవరి 1928. ప్రభవ సంవత్సర మాఖమాస భారతి నుండి పునర్ముద్రితమైన లఘుకృతి కిది వేటూరివారు కూర్చిన తొలిపలుకు - ప్రకాశకులు )
నీతి ద్విషష్టిక - ఉపోద్ఘాతము
'నీతి ద్విషష్టిక'[1] అనే ఈ కృతి సుందరపాండ్యుడు రచించి నట్లు మొదటి శ్లోకం ద్వారాను, చివరి శ్లోకం ద్వారాను, గ్రంథాంతంలో ఉన్న పుష్పిక ద్వారానూ తెలుస్తూన్నది. పాండ్యదేశానికి రాజధానియైన మధురలో వెలసి ఉన్న పరమేశ్వరుని పేరు సుందరపాండ్యస్వామి అనే విషయం ప్రసిద్ధమే. ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి చిహ్నంగా ఆ దేశంలోని రాజులు తదితరులూ కూడా ఆ పేరు పెట్టుకొనేవారు. ప్రాచీన పాండ్యరాజులలో సుందరపాండ్యుడు అనే పేరు కలవారు ఎంతోమంది ఉన్నట్లుగా ఐతిహాసికులు చెపుతున్నారు. శాసనాదులలో పేర్కొన్న రాజులైన సుందరపాండ్యులు చాల మంది ఉంటూండగా, గ్రంథకారులైన ఎంతో మంది సుందరపాండ్యులు కూడా ఉన్నారు. ఇంతవరకూ గ్రంథపరిశీలకు లెవ్వరూ గుర్తించని ఒక గొప్ప మీమాంసా పండితుడైన సుందరపాండ్యుని గూర్చి మహామహోపాధ్యాయ యస్. కుప్పుస్వామి శాస్త్రిగారు ఇదం ప్రథమంగా తెలిపి ఉన్నారు. [2] శ్రీ శంకర భగవత్పాదులు, ఈ సుందరపాండ్యుడు రచించిన ఏదో గ్రంథంలో ఉన్న రెండు కారికలను, సమన్వయాధికరణం చివర ఉదాహరించారు. ఐతే ఈతని పేరు నిర్దేశించలేదు. భగవత్పాదులు సుందరపాండ్యుని పేరు చెప్పకపోయినా, వారి కంటె అర్వాచీనులు, మనకంటె చాలా ప్రాచీనులూ అయిన కొందరు అద్వైత విద్యాచార్యులు ఈ కారికలను ఉదాహరించి, ఇవి సుందరపాండ్య విరచితములని చెప్పి ఉన్నారు. ఇలా చెప్పినవారు - పంచపాదికా వివరణానికి వ్యాఖ్య యైన 'ప్రబోధపరిశోధిని' రచించిన ఆత్మరూపాచార్యులు, సూతసంహితకు వ్యాఖ్యానం వ్రాసిన మాధవాచార్యులు. అమలానందుడు బ్రహ్మసూత్రభాష్యవ్యాఖ్యలో (3-3-25 ) “ఆహ చాత్ర నిదర్శనమాచార్యసున్దరపాణ్డ్యః" (ఇందుకు నిదర్శనంగా సుందరపాండ్యుడు ఇట్లు చెప్పుచున్నాడు.) అని అంటూ కొన్నికారికలు ఉదాహరించినాడు. తంత్రవార్తికంలోని బలాబలాధికరణంలో, కుమారిలభట్టుకూడా, ఈ కారికలనే ఉదాహరించి ఉన్నారు. దీనిని బట్టి మీమాంసాగ్రంథకారుడైన ఒక సుందరపాండ్యుడు శంకరాచార్యులకంటె, కుమారిలభట్టుకంటె కూడా పూర్వం ఉండేవాడని తెలుస్తూన్నది. అందుచేత ఈ సుందరపాండ్యుడు క్రీ. శ. సప్తమ శతాబ్దికి పూర్వం ఉండేవాడనే విషయం స్పష్టం అవుతున్నది.
కేరళదేశీయు డైన కృష్ణలీలాశుకముని, తను రచించిన “పురుషకారము” అనే వ్యాకరణగ్రంథంలో, ఒక సుందరపాండ్యుని పేర్కొంటూ ఆతని వాక్యం అన్నట్లుగా - "నిక్షతి చుమ్బతి నింస్తే తన్వ్యా ముఖపఙ్కజం ప్రేయాన్" అనే శ్లోకార్థాన్ని ఉదాహరించాడు. కృష్ణలీలాశుకముని - రాజరాజచోళుని గురువూ, "ఈశానశివగురుదేవపద్ధతి" అనే గ్రంథం రచించినవాడూ అయిన ఈశానదేవునికి శిష్యుడు. ఈశానదేవుడు తన “పద్ధతి"లోను, కృష్ణలీలాశుకుడు 'పురుషకారం' లోను భోజుని గ్రంథాలను పేర్కొన్నారు. అందుచేత వీరిద్దరూ క్రీ. శ. పన్నెండవ శతాబ్దిలో ఉండి ఉంటారు. ఈ విధంగా 'పురుషకారం' లో పేర్కొన్న సుందరపాండ్యుడు క్రీ. శ. పన్నెండవశతాబ్దానికి పూర్వమే ఉండి ఉండాలని తెలుస్తూన్నది.
ఐతే ఇక్కడ ఒక చిక్కు ఉన్నది. “నిక్షతి చుంబతి” ఇత్యాది శ్లోకార్థం సుందరపాండ్యవిరచితం అన్నట్లుగా 'పురుషకారం'లో చెప్పబడినా, ఇది వీరపాండ్య విరచితంగా ప్రసిద్ధమూ ముద్రితమూ అయిన క్రియా నిఘంటువులో కనబడుతున్నది. ఆ గ్రంథప్రారంభం ఈ విధంగా ఉన్నది :-
"తిఙన్తరూపపర్యాయాః కేచిత్కావ్యోపయోగినః
వీరపాణ్డ్యక్షితీశేన వక్ష్యన్తే శిక్షితుం శిశూన్.”
ఈ విధంగా ప్రారంభించిన గ్రంథంలో -
"కక్ఖతి కఖతి ప్రహసతి గగ్ఘతి ఘగ్ఘతి చ తక్కతి స్మయతే.
నిక్షతిచుమ్బతి నింస్తే తన్వ్యా ముఖపఙ్కజం ప్రేయాన్."
అనే శ్లోకం ఉన్నది. ద్వాదశ శతాబ్దిలో ఉన్న లీలాశుకుని వాక్యమే ప్రమాణం అని అంగీకరించిన పక్షంలో, వీరపాండ్యుని పేరు ఉన్న క్రియా నిఘంటు ప్రారంభశ్లోకం ప్రక్షిప్తమనేనా అనాలి ; లేదా ఇది అపపాఠ మనేనా అనాలి. ఐతే - క్రియానిఘంటువు క్రమబద్ధంగా ఉండడంచేతనూ, వీరపాండ్యుని పేరు శ్లోకనిబద్ధమై ఉండడం చేతనూ ఈ ముద్రితగ్రంథమే ప్రామాణిక మని అంగీకరించడం యుక్తం అని మా అభిప్రాయం.
'పురుషకారం'లో కూడా వీరపాండ్యుడనే వ్రాసినా, మీమాంసాపండితుడైన సుందరపాండ్యు డొకడు ప్రసిద్ధుడుగా ఉండడంచేత, లేఖకుడు వీరపాండ్యునికి బదులు సుందరపాండ్యుని పేరు చేర్చి ఉంటాడని ఊహించడానికి కూడా
అవకాశం లేకపోలేదు. ఏమైన ఈతడు సుందరపాండ్యుడా తద్భిన్నుడా అనే సందేహం అలాగే ఉండిపోతున్నది.
ఈ నీతిద్విషష్టిక రచించిన కవి సుందరపాండ్యులలో ఒకడు. సుభాషిత సంకలనకర్తలు చాలామంది ఈతని శ్లోకాలు సేకరించారు. వల్లభదేవుడు ఈ కృతిలోనుంచి చాలా ఆర్యలను తన “సుభాషితావళి" లోనికి గ్రహించాడు. ఐతే- ఇతడు శ్రుతానుశ్రవికమీదనే (వినికిలి) మీదనే ఈ ఆర్యలను గ్రహించాడు. అసలు గ్రంథాన్ని చూచినట్లు లేదు. ఇందులోని ఆర్యలను కొన్నింటిని ప్రకాశవర్షుడివనీ, కొన్ని రవిగుప్తునివనీ, కొన్ని అమృతవర్థనుడి వనీ, ఏవేవో క్రొత్తపేర్లన్నీ కల్పించి వారికి అంటకట్టి ఉన్నాడు. వల్లభదేవుడు ప్రసిద్ధులవో, అప్రసిద్ధులవో ఎవరో కొందరు కవుల పేర్లు కల్పించి, వారు రచించినట్లుగా ఉదాహరించిన శ్లోకాలు తద్భిన్నులైన కవులు రచించిన కొన్ని కావ్యాలలో లభించడం పండిత లోకానికి తెలిసిన విషయమే. చాలామంది సుభాషిత సంకలన కర్తలు ఇలాగే కనిపిస్తున్నారు. జల్హణుడు కూడా “సూక్తిముక్తావళి”లో ఈ ఆర్యలను ఈ విధంగానే గ్రహించి రవిగుప్తుడు మొదలైన వాళ్ళని రచయితలుగా పేర్కొన్నాడు. శార్‌ఙ్గధరుడు కూడా అంతే. ఒక్క ఆర్యను తీసుకొని, ఈ ముగ్గురూ ముగ్గురు వేర్వేరు కవులకు దానిని సంబంధింపచేశారు. పోతయార్యుడు "ప్రసఙ్గరత్నావళి" లోను, పెద్దిభట్టు “సూక్తివారిధి”లోను, రచయిత పేరు చెప్పకుండగా ఈ ఆర్యలను ఉదాహరించారు. సుభాషితసంకలనకర్త లందరూ పదమూడవ శతాబ్దికి పూర్వులు గారు. జల్హణుడు 257వ సంవత్సరంలో సూక్తిముక్తావళి రచించాడు.
వల్లభదేవుడు 'సుభాషితావళి' ని
శార్‌ఙ్గధరుడు 'పద్ధతిని'ని 1400 సం ప్రాంతంలో రచించారు.
పోతయార్యుడు 'ప్రసఙ్గరత్నావళి'ని 1460 సం.లో రచించాడు.
పెద్దిభట్టు 'సూక్తివారిధి'ని 1500 సం.లో రచించాడు.
వీరిలో ఏ ఒక్కరికీ కూడా ఈ సుందరపాండ్యుని కృతిని గూర్చి తెలియకపోవడం ఆశ్చర్యకరంగానే ఉన్నది. ఐతే వీరి అందరికంటే ప్రాచీనుడైన ఒక పండితునికి ఈ కృతిని గూర్చి యథార్థంగా తెలిసి ఉండడం ముదావహమైన విషయం.
క్రీ. శ. 1200 ప్రాంతంలో కలింగరాజు అనే నామాంతరం గల సూర్యవిబుధుడు "కులశేఖరసూక్తిరత్నహారం " అనే పేరుతో ఒక సుభాషిత సంకలనగ్రంథం గ్రంథించాడు. ఈ ఆర్యలు సుందరపాండ్య రచితాలని ఆతడు ఆ గ్రంథంలో సరిగానే చెప్పి ఉన్నాడు. అందుచేత ఇది సుందరపాండ్యుని కృతి అని చెప్పడంలో తప్పులేదు. అతడు క్రీ. శ. పన్నెండవ శతాబ్దానికి పూర్వుడనే విషయం కూడా స్పష్టం అవుతుంది. ఐతే, ఇదొక చెప్పుకోదగిన విషయంకాదు. ఎందుచేతనంటే ఈ సుందరపాండ్యుడు షష్ఠశతకం కంటె కూడా ప్రాచీనుడని నిరూపించనున్నాము.
ఈ సందర్భంలో గుర్తింపదగిన విషయం ఇది :- పంచతంత్రం రచించిన విష్ణుశర్మ ఆరవ శతాబ్దానికి అర్వాచీనుడు కాడు అని విమర్శకుల అభిప్రాయం. ఆతడు కూడా ఈ గ్రంథం నుంచి కొన్ని ఆర్యలు ( 29, 30, 48 శ్లోకాలు) తీసుకున్నాడు. అందుచేత ఈ సుందరపాండ్యుడు షష్ఠశతకం కంటె ముందుగానే ఉండేవాడని తేలినది.
ఈ గ్రంథానికి చివర ఉన్న -
"ఇమాం కాఞ్చనపీఠస్థాం సమేత్య కవయో భువి
ఆర్యాం సున్దరపాణ్డ్యస్య స్నాపయన్తి వధూమివ”
కుమారిలభట్టు తంత్రవార్తికంలోను, శంకరభగవత్పాదులు శారీరక భాష్యంలోనూ ఉదాహరించిన మీమాంసాగ్రంథం రచించినవాడు ఈతడే అయి ఉంటాడు. ఇతడు భగవత్పాదాచార్యులకంటె ప్రాచీనుడై ఉండడమే ఈ విధంగా (ఈ సుందరపాండ్యుడూ ఆ సుందరపాండ్యుడూ ఒకడే అని ) ఊహించడానికి కారణం. మరొకకారణ మేమిటంటే - ఈ కవికృతి ప్రారంభంలో "శ్రీమాన్ సున్దరపాణ్డ్యః శ్రుతిస్మృతి ప్రసృతసత్పదార్థజ్ఞః " అని వ్రాస్తూ - తాను శ్రుతిస్మృతి ప్రసృతసత్పదార్థజ్ఞః" అనే విశేషణాన్ని బట్టి ఈ కవి మీమాంసాశాస్త్రంలో నిష్ణాతుడని తెలుస్తూన్నది. ఈ ప్రమాణాలన్నింటినీ పట్టి చూడగా మీమాంసా శాస్త్రగ్రంథం రచించినవాడూ, ఈ 'ఆర్య'ను రచించినవాడుకూడా ఒక్కరే అనీ, ఇతడు క్రీ.శ. షష్ఠశతాబ్దికి పూర్వము ఉండేవాడనీ స్పష్టం అవుతున్నది.
అనేకమైన పంచతంత్రాదిగ్రంథాలలో ఈ ఆర్యలను ఉదాహరించడాన్ని పట్టి చూస్తే పూర్వకాలంలో ఇది ఎంత బహుళప్రచారంలో ఉండేదో విశదం అవుతున్నది. ఈ ఆర్యలకు మూలగ్రంథం ఏదో తెలియకపోయినా, చాలామంది ఆధునికపండితులు కూడా పంచతంత్రభోజప్రబంధాదులలో పరిచయం ఉండడంచేతనూ శ్రుతానుశ్రవికచేతనూ కూడా సహృదయగోష్ఠులలో ఈ ఆర్యలను ఉదాహరిస్తూ ఉంటారు. వజ్రపు తునకల వలె ఊర్జస్వలాలైన ఇందలిపద్యాలు తేనెలో ఊరబెట్టిన అల్లపు ముక్కల వలె కటు-మధురాలుగా, పథ్యంగా హృద్యంగా - ఉంటాయి. అందుచేత ఇవి సహృదయ హృదయా వర్ణకాలుగా ఉంటాయని సంతసిస్తున్నాము.
కొందరు ప్రాచీనాంధ్రకవులు కూడా ఈ ఆర్యలను అనువదించి తమ గ్రంథాలలో పొందుపరచుకొన్నారు. క్రీ.శ. 1300 ప్రాంతానికి చెందిన మంచనకవి, రాజశేఖరుని 'విద్ధసాలభంజిక' ను అనుకరించి రచించిన 'కేయూరబాహుచరిత్రం' అనే రసభరితమైన ఆంధ్రప్రబంధంలో ఇందులోని రెండు ఆర్యలను రెండు పద్యాలుగా అనువదించాడు.
క్రీ. శ. 1400 ప్రాంతానికి చెందిన కవిసార్వభౌముడు శ్రీనాథుడు కూడా ఒక ఆర్యని అనువదించి భీమఖండంలో ఉపయోగించుకున్నాడు. అతని పద్యం ఇది :-
తే. నికటమున నుండి శ్రుతిపుటనిష్ఠురముగ
నడరి కాకులుచేరి బిట్టరచునపుడు
ఉడిగి రాయంచ యూరక యుంట లెస్స
సైపరాకున్న నెందేని జనుట యొప్పు.[3] (చూ. శ్లో. 113)
వేరే మాతృక గల మరొక పుస్తకం మాకందజేశారు. దీనిపై అక్కడి అధికారులు 'ఆర్యావలీ' అనే పేరు వ్రాసి ఉన్నారు. ఇందులో 33 ఆర్యలు అధికంగా ఉన్నాయి. లేఖక ప్రమాదాలూ, పాఠాలూ కూడా చాలా వరకూ ( మాకు అంతకు పూర్వం లభించిన ప్రతితో) సమంగానే ఉన్నాయి. "కులశేఖరసూక్తి రత్నహారాన్ని” గూర్చీ, అందులో సుందరపాండ్యుని ఆర్య ఉదాహరింపబడడాన్ని గూర్చీ వారి ద్వారానే మాకు తెలిసినది. అధికంగా లభించిన ఆర్యలను గ్రంథాంతంలో అనుబంధంగా చూపించి ఉన్నాము. గ్రంథాద్యంతశ్లోకాలలో ఈ కృతికి "ఆర్యా" అనే పేరు మాత్రమే కనబడుతూన్నది. చెన్నపుర పుస్తకశాలలోని తాళపత్రపుస్తకానికి, ఎవరోలేఖకుడు, తన కెక్కడో అరవైరెండు శ్లోకాలు మాత్రమే లభించడంచేత "నీతిద్విషష్టికా” అనే పేరుపెట్టి ఉంటాడు. తలవని తలంపుగా లభించిన ఈ సహాయానికి, ఉపోద్ఘాతం వ్రాస్తున్న నేనూ, ఈ గ్రంథాన్ని ప్రచురిస్తూన్న మా మిత్రుడూ కూడా సుహృద్వరులైన బ్రహ్మశ్రీ రామనాథ అయ్యరుగారికి, సంతోషంతో, కృతజ్ఞతను తెలుపుకుంటున్నాము. మా మిత్రుడైన మార్కండేయశర్మ, ఇంతకు పూర్వం చాలా అవసరమైన అనేక గ్రంథాలు ఆంధ్రలిపిలో ప్రచురించి ఉన్నాడు. ఇటుపైన ప్రఖ్యాతులైన ఆంధ్రులు రచించిన గ్రంథాలను ప్రప్రథమంగా నాగరీలిపిలో ప్రచురించడం జరుగుతుంది. ముద్రించడంలో అవకాశం ( Space ) ఇచ్చే పద్ధతిని ఆంధ్రముద్రణ సంప్రదాయం ప్రకారం అనుసరించినాము. సహృదయులు ఈ పద్ధతిని మెచ్చుకొనే పక్షంలో ఇటుపైన కూడా ఈ పద్ధతినే అనుసరిస్తాము. దీన్ని నిర్విఘ్నంగా నిర్వహించేటట్లు సర్వేశ్వరుడు అనుగ్రహించుగాక అని అభిలషిస్తూన్న:
విద్వద్విధేయుడు
చెన్నపురి
వే. ప్రభాకరశాస్త్రి
( నీతి ద్విషష్టిక - ఉపోద్ఘాతము ( 1928 - సంస్కృతము)
శ్రీ ప్రభాకరుల రచన (సంస్కృతోపోద్ఘాతమునకై చూ. పరిశిష్టము).
అనువాదము - డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు (1981).
-సంపాదకులు)
- ↑ ఇది 1928 వ సంవత్సరములో శ్రీ కే. మార్కండేయశర్మగారు ప్రచురించిన నీతిద్విషష్టికకు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సంస్కృతంలో వ్రాసిన భూమికకు హైదరాబాదు సురభారతీ సాంస్కృతిక గ్రంథమాల సంపాదకులైన డా॥ పుల్లెల శ్రీ రామచంద్రుడు గారు కావించిన తెనుగుసేత.
- ↑ See journal of Oriental Research, March Qratrerly, Vol.1. No. 1. January 1927. Pages 5-15.
- ↑ నా ఉపోద్ఘాతాన్ని పరిశీలించిన తరువాత, మా మిత్రులు బ్రహ్మశ్రీ మా. రామకృష్ణ కవి మహాశయులు వ్రాసిన ఆంగ్లోపోద్ఘాతంలో, ఈ సుందరపాండ్య కృతి షష్ఠశతాబ్దికి పూర్వమే రచింపబడినది అని చెప్పడానికి మరొక ప్రమాణంగా జనాశ్రయుని “జానాశ్రయి" అనే ఛందోగ్రంథంలో పథ్యాలక్షణంలో, "చారిత్రనిర్మల జల" అనే (ఈ గ్రంథంలోని) ఆర్యను (24) ఉదాహరించడం చూపబడినది. మా మిత్రుని ఊహ సత్యమే. ఆ జనాశ్రయుడు కృష్ణాతీరాంధ్రదేశాన్ని పాలించిన మాధవవర్మ అనే నామాంతరం గల విష్ణుకుండిన వంశీయుడైన రాజై ఉంటాడు.
అతడు క్రీ.శ. 580 కి పూర్వం ఉన్నవాడు. ఈ 'జానాశ్రయి' ప్రారంభంలో ఉన్న -
"స భూపతిరుదారధీర్జయతి సమ్పదేకాశ్రయో
జనాశ్రయ ఇతి శ్రియా వహతి నామ సార్థం విభుః
మఘై రురుభి రద్భుతైర్మఘవతో జయశ్రీరపి
జితా విజితశత్రుణా జగతి యేన రుద్దా చిరమ్”
అనే శ్లోకాన్ని బట్టి ఈ ఛందో గ్రంథం రచించిన జనాశ్రయుడు ఎన్నో మహాయజ్ఞాలు చేసినట్లు తెలుస్తూన్నది. పులిబూరు శాసనం కూడా ఈ విషయానికి సమర్థకంగా ఉన్నది.- "క్రతుసహస్రయాజీ, హిరణ్యగర్భప్రసూతః, ఏకాదశాశ్వమేధావబృథస్నానవిగతజగదేనన్కః, సర్వభూతపరిరక్షణచుఇచ్చః, విద్వజ్జనతపస్విజనసమాశ్రయో, మహారాజశ్రీమాధవవర్మా..... జనాశ్రయ మహారాజః గుద్దవాడ విషయే” ఇత్యాదికము. ఈ శాసనాన్ని బ్రహ్మశ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ప్రకటించారు. ఈ తామ్రశాసనం కాలం క్రీ. శ. 609 అవుతుంది. ప్రసంగరత్నావళిలో ఈ క్రింది శ్లోం ఉన్నది.
(“నీల?) శ్రీమచ్ఛకాబ్దేబ్ది శశిసాయక (514 శతాబ్దం, 592 క్రీ. శ) సమ్మితే, రాజామాధవవర్మభూ ద్విఖ్యాతో ధరణీతలే”
(సుమతి శతకంలోని "కమలములు నీట బాసిన" అన్న పద్యం అనుబంధంలోని 15వ పద్యానికి అనువాదం అనికూడా కవిగారు వ్రాసినారు. సంపాదకుడు)
1. సంస్కృతోపోద్ఘాతంలో ( 514 AD 192 ) సమ్మితే అనేది ముద్రణ దోషమై ఉంటుంది ( సంపాదకుడు).
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse