Jump to content

వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/నా జీవిత యాత్ర-1

వికీసోర్స్ నుండి

నా జీవిత యాత్ర-1(1955)- రచయిత:టంగుటూరి ప్రకాశం

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

నా జీవిత యాత్ర పుస్తకం


పుట్టు పేద పట్టుదలతో, గుండె దిటవే పెట్టుబడిగా, పెరిగి పెరిగి పెద్దల పెద్దయై, మహేంద్ర భోగాలననుభవించి,మహాంధ్రనాయకమణియై, దేశదాస్య విమోచన యజ్ఞంలో, తన సర్వస్వం ఆహుతి గావించి భారత స్వాతంత్ర్య మహాసమరంలో, ఆంధ్రుల నొక్క తాటిపై నడిపించిన ఆంధ్రకేసరి ప్రకాశం ఆత్మకథ నా జీవిత యాత్ర. ఈ మొదటి సంపుటంలో ప్రకాశం గారి బాల్యం, చదువు, బారిష్టరు వృత్తి మరియు మునిసిపల్ చైర్మన్ గా రాజకీయాలలో అడుగుబెట్టడంతో పాటు, బారిష్టర్ వృత్తికి స్వస్తి చెప్పి, స్వాతంత్ర్యం సమరంలో 1921 డిసెంబర్ లో స్వరాజ్య పత్రిక స్థాపన వివరాలున్నాయి. దీనిలో కొంత భాగం....

" నాకు అంతో యింతో వెలుగు యిచ్చింది రాజకీయ జీవితం. ఆ జీవితమే నేను ఆంధ్రదేశపు సద్భావం పొందడానికీ, ఈ చరిత్ర వ్రాయడానికీ కారణం అయింది. కనక ఈ విషయం కొంచెం విపులంగా వ్రాస్తాను. నేను ఆదిలో వృత్తి నిర్ణయం చేసుకునే కాలంలో నా దృష్టి ప్లీడరీమీదికి పోవడానికి కారణం వ్రాసే ఉన్నాను. అ కాలంలో ప్లీడర్లకి ఉండే ఆర్జన, హుందా తనమూ మాత్రమే కాకుండా ఆ వృత్తి స్వతంత్ర వృత్తి అనే నమ్మకంకూడా నన్ను అందులోకి ఈడ్చుకు వెళ్ళింది. హనుమంతరావు నాయుడుగారి శుశ్రూష, రాజమహేంద్రవరంలో వీరేశలింగంపంతులు సంస్కర ణోద్యమమూ, కొంతవరకు నాలో రాజకీయాభిలాషలు రేకెత్తించాయి. అప్పటికి 1857 వ సంవత్సరంనాటి స్వాతంత్ర్య యుద్ధపు కథలు యింకా ప్రచారంలోనే ఉన్నాయి. ఏమైనా, ఈనాటి మహదాశయాలు ఇదమిత్థ మని ఏర్పడకపోయినా, నాలో యితర లౌకికాభిలాషలతోపాటు దేశసేవ చెయ్యాలనే అభిలాషకూడా ఉండేది.

నేను రాజమహేంద్రవరంలో యఫ్. ఏ. క్లాసు చదువుకునే కాలానికి కాంగ్రెస్ అనే మాట కొంచెంగా వినబడేది. కాని, ఆ మాట వినిపించు కునేవాళ్ళ సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. నేను 1893 వ సంవత్సరంలో లా కాలేజీలో చదువుకునే రోజుల నాటికి కాంగ్రెస్ మరికొంత పేరు పాతుకుంది. అప్పుడే నేను మద్రాసులో బిల్లిగిరి అయ్యంగారి ఐస్‌హౌస్ భవనంలో శ్రీ వివేకానందస్వామిని దర్శించి ఆయనతో చాలాసేపు చర్చచేశాను. అప్పట్లో బిసెంటమ్మ వర్గంలోని ఓల్డు అనే ఆయన దివ్య దృష్టితో టెలిపతీవిషయాలు చెపుతూ ఉండేవాడు. ఆ విషయా లన్నిటి గురించీ వివేకానందస్వామిని అడిగి తెలుసుకున్నాను. మానవుడికి జ్ఞానం పరిపక్వం అయితే ఆలాంటివి అసాధ్య విషయాలు కావని ఆయన చెప్పారు. ఆయన ఉపన్యాసాలు నాకు కొంత ఉత్తేజం కలిగించాయి."