Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సాహిత్య విమర్శ/ప్రభావతీప్రద్యుమ్నము

వికీసోర్స్ నుండి

ప్రభావతీ ప్రద్యుమ్నము

కవి కాలాదికము

ప్రభావతి వజ్రనాభుఁడనెడి రాక్షసుని కుమార్తె. ప్రద్యుమ్నుఁడు శ్రీకృష్ణుని పుత్రుఁడు. వీరిరువురి ప్రణయకథను ఆధారముగా గ్రహించి మహాకవి పింగళి సూరన శృంగారరస ప్రధానముగను, దృశ్యప్రబంధ లక్షణోపేతముగను రచించిన ప్రబంధరాజము ప్రభావతీ ప్రద్యుమ్నము.

ఆంధ్రసాహిత్య లోకమునఁ గల ఉత్తమ ప్రబంధములలో నిది యొకటి. ఇందలి సంభాషణ వైచిత్ర్యము తిక్కన భారతరచనను తలపించుచుండును. ఈ కావ్య రచనయందు సర్వతోముఖ చాతుర్యము గోచరించును. ఇందలి కథాకథన నైపుణ్యము కళాపూర్ణోదయము నందలి ప్రావీణ్యముతో తులతూగకున్నను, సామాన్య ప్రబంధముల కంటె నెంతయు మిన్నయైయున్నది. మృదుపదగుంభితమై కవిత ద్రాక్షాపాకముగ నొప్పారును. 'ప్రభావతీప్రద్యుమ్నము, చక్కని స్వభావోక్తులను కలిగి లలితపద ఘటితమై కథాచమత్కృతి గలిగి చదువువారికి కర్ణరసాయనముగా నుండెడి ప్రౌఢకావ్యము' (కవిచరిత్రకారుడు).

పింగళి సూరన

'తిక్కన సోమయాజి తఱువాత నింత ప్రౌఢముగాఁ గవిత్వము జెప్పిన కవి మఱియొకఁడు లేఁ' డని విఖ్యాతిగన్న ఈ పింగళి సూరన మహాకవి, క్రీ.శ. 16 శతాబ్ది మధ్యకాలమున జీవించి తన కవితావ్యవసాయమును సాగించెను. ఈతఁడు తన రాఘవ పాండవీయమును ఆకువీటి పెదవెంకటార్యుని ప్రేరణమున క్రీ.శ. 1550 ప్రాంతమునను, కళాపూర్ణోదయమును క్రీ.శ. 1560 ప్రాంతమున నంద్యాల కృష్ణరాజునకు నంకితముగను రచియించెను. ఈ ప్రభావతీప్రద్యుమ్నమును తన పండబారిన వయసులో క్రీ.శ. 1580 ప్రాంతమున రచియించి, తండ్రియగు అమరనార్యున కంకిత మొసఁగెను.

పింగళి సూరన గౌతమగోత్రుఁడు. ఆపస్తంబ సూత్రుఁడునైన బ్రాహ్మణుడు. ఈతని వంశమువారు నేఁటి గుంటూరు జిల్లా యందలి పల్నాడు తాలూకాలోని పిన్నలి గ్రామవాస్తవ్యులు. ఈ వంశస్థులలో ఒక శాఖవారు ఒంగోలు తాలూకాలోని నిడమానూరు గ్రామమును చేరిరి. సూరనార్యుని తండ్రియగు అమరన్న యా గ్రామమున శ్రీకృష్ణరాయలిచ్చిన భూదానముల ననుభవించెను. ఈ వంశమున పండితులు, కవులు, రాజకీయవ్యవహర్తలు, బ్రహ్మవిద్యావేత్తలు ఎందరో జన్మించినట్లు ప్రభావతీ ప్రద్యుమ్నమునందలి పీఠిక వలన తెలియుచున్నది.

సూరనార్యుని తండ్రి అమరనార్యుఁడు - తల్లి అంబమ్మ, సూరన తల్లిదండ్రులకు ప్రథమపుత్రుఁడు. కావున వారీతని యెడ గాఢాభిమానము వహించి విద్యాబుద్ధులు నేర్పుటలో కడు శ్రద్ద బూనిరి. సూరన అనన్యసామాన్య విద్వాంసుఁడుగా పరిణమించెను.

నాటకాలంకార సాహిత్య పాండిత్యమే గాక తర్క, మీమాంస సాంఖ్యయోగాది శాస్త్రపాండిత్యమును నీ మహాకవి సంపాదించెనని యీతని కృతులవలన వెల్లడియగుచున్నది. 'పూతక్రితయా', 'సౌవర' మొదలైన వ్యాకరణైక సమధిగమ్యశబ్దముల నీ కవీంద్రుఁడు ప్రయోగించి తన వ్యాకరణశాస్త్ర పాండితిని వెల్లడించినాఁడు. అన్నిటిని మించిన దీతని లోకజ్ఞత. బాహ్య, మానవ ప్రకృతుల రెంటితో నితనికి పరిపూర్ణ పరిచయమున్నది.

సూరన కృతులు

రాఘవపాండవీయము, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అను మూడు కృతులు నేఁడు సూరనార్యుని రచనలై కన్పట్టుచున్నవి. ఇవికాక సూరన గరుడ పురాణము, నితరకృతులను చెప్పినట్లు ప్రభావతీప్రద్యుమ్న, రాఘవ పాండవీయ పీఠికలను బట్టి తెలియుచున్నది. గరుడ పురాణము ఈతని తొలినాటి కృతులలో నొకటైయుండును.

పిమ్మట కీర్తి వహించిన కృతి రాఘవపాండవీయము. ఇది ఆంధ్రభాషయందలి తొలి ద్వ్యర్థికావ్యము. దీనిని సూరన ఆకువీటి పెద వెంకటాద్రి ప్రేరణమున రచియించెను. ఇది సూరనార్యుని భాషాపాండిత్యమునకు నికషోపలమైన (ఒరపిడిరాయి) గ్రంథము. సంస్కృత భాషలో క్రీ.శ. 8, 9 శతాబ్దములలో నిదే వస్తువుతో రెండు ద్వ్యర్థికావ్యములు పుట్టినవి. వీని కర్తలైన కవిరాజధనంజయులను పింగళి సూరన ఎఱుగునో ఎఱుగఁడో! భీమన పూర్వము రాఘవపాండవీయమును చెప్పెననెడి మాటయే గాని సూరనయే ప్రథమాంధ్ర ద్వ్యర్థికావ్యకర్త. ' రాఘవపాండవీయమునకు పిమ్మట కీర్తిగన్న సూరన కావ్యము, 'కల్పనాచాతుర్యము నందును, కథాకథన చమత్కారము నందును నద్వితీయమైన కావ్యము' కళాపూర్ణోదయము. ఇందలి అపూర్వకథ, పాత్రపోషణమును, శైలీప్రావీణ్యమును మనోజ్ఞములు. మూఁడవ ప్రసిద్ధకృతి ప్రభావతీ ప్రద్యుమ్నము. దారిద్ర్యముచే కుందింపఁబడు కాలమున నీతఁడు శైవవైష్ణవ ప్రభువుల చిత్తవృత్తుల కనుగుణములైన కావ్యములను రచియించి, వానితో తృప్తినొందక, వార్ధక్యమున స్వతంత్రుడై తన పిత్రాది వంశవర్ణనముతో నీ ప్రభావతీప్రద్యుమ్న కావ్యమును రచియించెను. ఈ కావ్యమునందును కళాపూర్ణోదయములో వలె 'ప్రబంధ కవు లెవ్వరియందును గనఁబడని ప్రతిభయు, సందర్భశుద్ధియు, పాత్రోచితరచనయు కన్పట్టును. కాలప్రభావముచే ప్రబంధములందు సామాన్యముగ కన్పట్టు రచనారీతిని గూడ సూరనార్యుఁడు ఆదరించుట ఈ కావ్యమునందును కన్పట్టును. మహాకవి పింగళి సూరన "రాఘవ పాండవీయ, కళాపూర్ణోదయ, ప్రభావతీ ప్రద్యుమ్నములు మూఁడు నొక్కొక్కరీతి కొక్కొక్కటి సుప్రసిద్ధములై వెలసిన రత్నములు" - (కవిత్వవేది)

కళాపూర్ణోదయమును రచించువేళనే పింగళి సూర్యనార్యునకుఁ బ్రభావతీ ప్రద్యుమ్నమును రచియింపవలె ననెడి కోర్కె యున్నట్లు విమర్శకాభిప్రాయము. (డా. చిలుకూరి నారాయణరావు - 125 భారతి వృష, శ్రావణము) కళాపూర్ణోదయ కావ్యకృతిపతియైన నంద్యాల కృష్ణ భూపతిని

మ. "ఒక ప్రద్యుమ్నుని గాంచె తొల్లి యదువంశోద్భూతి పెంపొందుచున్,
సకలక్ష్మాసురులం గరంబపుడు శ్రీనంద్యాల కృష్ణక్షితీం
ద్రక రాజాన్వయసంభవంబు కతనన్ ప్రద్యుమ్నులం జేయుచున్,
బ్రకటంబయ్యెడు దానవారి యవతారం బంది ధాత్రీస్థలిన్.”

- అని వర్ణించుట యిట్టి యూహకు మూలాధారము.

ప్రభావతీప్రద్యుమ్నము - చరిత్ర

ప్రభావతీప్రద్యుమ్నము మూలమున సూరనార్యుఁడు తన కాలమునాఁటి రాజకీయ పరిస్థితులను గూడ వెల్లడించినాఁడని మఱియొక యూహ. కళాపూర్ణోదయమునకు కృతిపతి నందాల్య కృష్ణరాజు, ఇతఁడు సామంతుఁడు. ఇతని చక్రవర్తి సదాశివరాయలు. ఈ కాలమున సకలము తిమ్మయ యనెడి నిరంకుశుని దుశ్చేష్టలకు రాజ్యము పాలుకాఁగా, అళియ రామరాయలు, తిరుమల రాయలు దానిని నుద్ధరించిరి. ప్రభావతీప్రద్యుమ్నము నందలి వజ్రనాభుఁడు సకలము తిమ్మయ యనియును, సదాశివరాయ లింద్రుఁ డనియును, అళియ రామరాయ, తిరుమలరాయ, వెంకటాద్రులు ప్రద్యుమ్న గదసాంబులుగ గన్పట్టుచున్నారనియును, జాకరూకతతో పరిశ్రమ యొనర్చి వెదకినచో మిగిలిన పాత్రలకును చారిత్రకవ్యక్తులు లభింతురనియును, నిట్టి చారిత్రక సంబంధమును జూపెట్టువారి యభిప్రాయము (చిలుకూరి నారాయణరావు - భారతి. వృష శ్రావణము - ప్రభావతీ ప్రద్యుమ్నము).

ప్రభావతీప్రద్యుమ్నము - నామకరణము

వజ్రనాభవధకు సంబంధించిన రాజకీయవ్యవహారము, ప్రభావతీ ప్రద్యుమ్నుల ప్రణయవృత్తాంతమునను రెండు కథావస్తువు లీ కావ్యమున నున్నవి. ప్రబంధములు సర్వసామాన్యముగ శృంగారరస ప్రధానములై యుండుటవలనను, వజ్రనాభవధ యనెడి రాజకీయకృత్యము ప్రభావతీప్రద్యుమ్నుల ప్రణయసహాయమును పొందబడుటచేతను, కథాంతమున రాక్షసవంశ ప్రతినిధియైన ప్రభావతికిని, దేవతావంశ ప్రతినిధియైన ప్రద్యుమ్నునకును సఖ్యము చేకూరుట వలనను, సూరనార్యుఁడు తన కావ్యమునకు ప్రభావతీప్రద్యుమ్నమని నామకరణ మొనర్చినాఁడు.

ఈ కథావస్తువునే స్వీకరించి క్రీ.శ. 12వ శతాబ్దము నందు దృశ్యకావ్యముగ నొనర్చిన మలయాళ దేశరాజగు రవివర్మ, ఈ కథకు ప్రద్యుమ్నాభ్యుదయము అని నామకరణ మొనర్చినాఁడు. ఆధునిక విమర్శకు లొకరు (డా. చిలుకూరి) దీనికి శుచిముఖీవిజయమని పేరిడినచో సమంజసముగ నుండెడిదని సూచించినారు. సూరన శుచిముఖికి మిగిలిన పాత్రల కంటే విశేషప్రాముఖ్యమును కల్పించి, యా పాత్రముఖమున రాజకీయ ప్రణయకథల రెంటిని నడిపించుటచే, నా విమర్శకులిట్లు సూచించిరని భావింపవలసియున్నది. వజ్రనాభప్రళయమును తప్పించుకొనుటకై యత్నమారంభించిన ఇంద్రుఁడు కథాంతమున నాతని వధను పొందినవాడగుటచే దీనికి ఇంద్రవిజయమని నామకరణము చేయవచ్చునని కొందఱు భావించిరి. కాని శృంగారరసప్రధానమైన ప్రణయకథకే ఇందు విశేషప్రాముఖ్యమిచ్చి సూరన నడిపించుటచే, దీనికి ప్రభావతీ ప్రద్యుమ్నమను నామముగూడ సముచితముగనే యున్నదని మనము సరిపెట్టుకొనవచ్చును. ప్రభావతీప్రద్యుమ్నము - కావ్య గుణదోషములు

అపూర్వ ప్రతిభాన్వితుఁడును, కావ్యశిల్పదక్షుఁడునునై ఆంధ్రసాహిత్య ప్రపంచమున నొక దృష్టితో పరిశీలింపగా, తిక్కనార్యునకు పిమ్మట ద్వితీయస్థాన మాక్రమించిన కవిశ్రేష్ఠుఁడు పింగళి సూరన. ఈతని కృతులలో కళాపూర్ణోదయమనెడి కావ్యము సర్వశ్రేష్ఠగ్రంథమై, కథాకథన వైచిత్రికి దానితో తుల్యమైన కావ్యము మఱియొకటి లేదని ఖ్యాతిగన్నది.

ఇందు విమర్శకులు గుణదోష విచారమొనర్చి ఎన్ని దోషములున్నను నవి యల్పములనియును, గుణములే యధికములనియును నిర్ణయించిరి.

సూరనార్యుఁడు తన పండబారిన వయసున నిర్మించిన ఈ ప్రభావతీప్రద్యుమ్న కావ్యమందలి గుణదోషముల విషయమున పండితులు భిన్నాభిప్రాయులైయున్నారు. కొందఱు అల్పదోషముల నావల నుంచిన నిదియును సర్వోత్కృష్టమైన ప్రబంధమనియును, గుణవిశేషములలో నిది దేనికిని తీసిపోనిదనియును భావింతురు. అనేక ప్రబంధములనుండి గ్రహించిన కథావస్తువర్ణనాదులతో నిదియొక జల్లికూర్పనియును, నిందు సూరనార్యుని ప్రతిభ ప్రతిఫలించుట లేదనియు మఱికొందరి అభిప్రాయము. (డా. కట్టమంచి, డా. చిలుకూరి ప్రభృతులు) ప్రభావతీ ప్రద్యుమ్నము నందును సూరనార్యుని కథాకథనదక్షత, పాత్రోన్మీలనప్రజ్ఞ, మానసికస్థితి నిరూపణము, నాటకోచితరీతి, అవసరోచిత వర్ణనలు మొదలగు గుణవిశేషములు, కన్పట్టుచున్నవి. ప్రబంధసామాన్యములైన నఖశిఖపర్యంత స్త్రీవర్ణనలు, చంద్రాది దూషణములు మొదలగు యాధునికులు పరిగణించు కొన్ని దోషములును కన్పట్టుచున్నవి.

కథాకథనము

కథ చెప్పుటలోని శిల్పమునకు పింగళి సూరనతో సాటియైన కవిశేఖరుఁడు ఆంధ్ర సాహిత్యమున లేఁడని చెప్పవచ్చును. కథ చెప్పుటకు రెండు పద్దతులున్నవి. కథయందు జరిగిన యంశములను బట్టి కాలక్రమానుసారముగా కథను చెప్పుట యొక పద్ధతి. దీనిని కాలక్రమ పద్ధతి యందురు. కాలక్రమమును వదలి సరసముగ నొక సందర్భమును గైకొని కథ నారంభించి, తఱువాత ముందు వెనుకగా కథను పెంచి పూర్తియొనర్చుట రెండవ పద్ధతి. దీనిని కార్యకారణ క్రమపద్దతి యందురు. రసప్రధానములైన కావ్యములందు కార్యకారణక్రమముగ కథ చెప్పుటయే సముచితము. ఆంధ్రభాషలో నీ మార్గము ననుసరించినవాఁడు సూరన తప్ప మతెవ్వఁడును లేఁడు. కళాపూర్ణోదయమునం దీ మహాకవి ఇట్టిమార్గము ననుసరించుట వలననే నా కావ్యమునకంతటి విలక్షణత, విఖ్యాతి కలిగినవి.

ప్రభావతీప్రద్యుమ్నము నందును సూరనార్యుఁడు కథ చెప్పుటలో తాను కళాపూర్ణోదయమున ననుసరించిన కార్యకారణ క్రమపద్ధతినే యనుసరించినాఁడు. ఇందు వజ్రనాభరాక్షసబాధల వలన వేసారిన ఇంద్రుఁడు, వాని వధ కుపాయమును గూర్చి కృష్ణునితో నాలోచించుటకు ద్వారకకు వచ్చుటతో కథను సూరన ప్రారంభించినాఁడు. ప్రబంధములలో నిందు కనుపించునంతటి సుదీర్ఘమైన కథయే యుండదు.

ప్రబంధకవి ప్రభావతీప్రద్యుమ్నమునందలి కథను జెప్పవలసినచో, కాలక్రమ పద్ధతి ననుసరించి ముందుగనే వజ్రపుర వర్ణనముతోనో యారంభమొనర్చి, తదుపరి వజ్రనాభుని ఘోరతపమును, బ్రహ్మ ప్రత్యక్షమగుటను, వాని స్వర్గజైత్రయాత్రను, ఇంద్రుని నిర్వేదమును, ప్రభావతీజననమును, స్వప్నవృత్తాంతమును, ఇంద్రుఁడు ద్వారకకు వచ్చుటను కాలక్రమమున వర్ణించియుండెడివాఁడు. ఇట్టిపద్ధతి చరిత్ర కనువైనదిగాని రసవత్కావ్యరచనమున కనువైనది కాదని గ్రహించి, స్వత్రంత మార్గమును ద్రొక్కుటకు జంకని సూరనార్యుఁ డీ మార్గముననుసరించి, తన కళాపూర్ణోదయ ప్రభావతీప్రద్యుమ్నముల రెంటను కథఁ జెప్పినాఁడు.

పాత్రోన్మీలన సామర్థ్యము

మహాకవుల శక్తిసామర్థ్యములను వెల్లడించు కవితాగుణములలో పాత్రోన్మీలన సామర్థ్యము ప్రముఖమైనది. స్వీకరించిన కథలోని వివిధపాత్రల భావనాబలముచే నూహించి, నానికి రూపమునిచ్చి సజీవమూర్తులనుగా చిత్రించుటకు అసామాన్యశక్తి కావలయును. ఈ శక్తి ఏ మహాకవియందధికాంశమున గోచరించునో, యాతఁడు నిర్మించిన పాత్రలకు నిత్యత్వము కలిగి యా మహాకవికీర్తిని చిరస్థాయిగ నొనర్చును. ఆంధ్ర సాహిత్యమున నిట్టి పాత్రచిత్రణ సామర్థ్యము గల కవులెందరో లేరు. తిక్కన భారతమునందలి పాత్రలు వ్యాసునివే యైనను, యా కవిబ్రహ్మ వానిని పునఃసృష్టించినాఁడు. కావున తిక్కన భారతమునందలి పాత్రలు సజీవమూర్తులు. పెద్దన ఇదేరీతిగ తన మనుచరిత్రమునందు వరూథినీప్రవరాఖ్య పాత్రలను పునఃసృష్టించి కవితాపితామహుఁ డనిపించుకొనినాఁడు. పిమ్మట చెప్పదగినవాఁడు సత్యభామ పాత్రను తన పారిజాతాపహరణ కావ్యమున పునఃసృష్టించిన తిమ్మన. పింగళి సూరన మహాకవికిని నిట్టి పాత్రోన్మీలన సామర్థ్య మనంతముగ నున్నది. కళాపూర్ణోదయమున ఈ మహాకవి యద్వితీయమగు కలభాషిణీపాత్రమును చిత్రించి విమర్శకుల జోహారులందుకొనినాఁడు. ప్రభావతీప్రద్యుమ్నమునందును నీ ప్రతిభ విశేషముగ గోచరించుచున్నది. ఇందు పింగళి సూరన సృష్టించిన పాత్రలలో నన్నిటికంటే నవరూపమైనది శుచిముఖి పాత్రము. మూలమందలి శుచిముఖికిని, దీనికిని నెట్టి సంబంధము లేదు.

సూరన తన అనంత ప్రతిభచే మేధ, వచోనిపుణత్వము, నీతి విదురత్వము, రాజకీయ ధౌరంధర్యము, స్వామిభక్తి, వినయవిధేయతలు, కార్యసంధానవిధాన తత్పరత్వము, మొదలగు నుత్తమ గుణములను, సమయోచిత సంభాషణలను, చేష్టలను దీనికి ప్రసాదించి, ఈ పాత్రమును ప్రభావతీప్రద్యుమ్నమునందలి పాత్రలన్నిటికి నాయక మణినిగా పునఃసృష్టించినాఁడు.

దేవతాయజ్ఞప్రియుఁడైన కృష్ణుని, శత్రుభీతిచే వికలచిత్తుఁడును, నిరాశాశోభితుఁడును, శ్రీకృష్ణోత్తేజితుఁడును, కార్యవిధానతత్పరుఁడునునైన ఇంద్రుని, పింగళి సూరనార్యుఁడు పాత్రోచిత ప్రవర్తనలిచ్చి కన్నులగట్టునట్లు పునఃసృష్టించినాఁడు. నవానురాగముచే శృంగారభావ శబలితచిత్తయైన ఈతని ప్రభావతి పాత్రము తన చేష్టాదికముచే తొలుతనే రసికుల దృష్టి నాకర్షించుచున్నది. అప్రధానపాత్ర యగు ప్రభావతి చెలికత్తెను చిత్రించుటయందును సూరనార్యుఁడు ప్రమత్తుఁడై మెలఁగలేదు. వజ్రనాభరాక్షసుని కూడ నిట్టి సామర్థ్యముతోనే ఈ మహాకవి చిత్రించి చూపినాఁడు. ఇంత యెందులకు? విష్కంభములందలి పాత్రలవలె తోచు భద్రనట బ్రహ్మచారుల పాత్రలును విశిష్టములై మన కన్నులకు గట్టుచు, మరపురాని చైతన్యముతో నొప్పుచున్నవి గదా! సూరనార్యుని పాత్రను లెల్ల సజీవ చిత్రములు.

మానసికస్థితి నిరూపణము

సూరనార్యుని కథాకథన కౌశలమునందు కథానుసంధానముతో బాటు మానసిక నిరూపణము, పాత్రోన్మీలనము, సంభాషణవిరచనము లక్షణములై కన్పట్టుచున్నవి. కథలోని వివిధ సన్నివేశములను పూర్వోత్తర విరోధము లేకుండగ ననుసంధించుకొని, యందలి పాత్రలకు ఉచిత రూపములను కల్పించి, పిమ్మట సూరనార్యుఁడు ఆ యా పాత్రలు ఆయా సన్నివేశములందు ఎట్టి మానసికస్థితి వహించునో, కథాగమనము ననుసరించి యా మానసిక స్థితులెట్లు పరిణమించునో ప్రదర్శించి చూపుటయందు ప్రముఖ పండితుఁడు. ప్రభావతీప్రద్యుమ్న కావ్యమునందలి పాత్రల మానసికస్థితి నిరూపణమిందుకు ఉచితమగు తార్కాణమై యొప్పుచున్నది. వజ్రనాభరాక్షసుఁడు దండెత్తివచ్చినపుడును పిమ్మటయును, నింద్రుని మనోవృత్తినంతటిని యుద్ధమున ప్రతిబింబింపజేసి చూపించినట్లు సూచన ప్రదర్శించినాఁడు.

వజ్రనాభుఁడు నందనవనమున సైన్యముల విడియింపగా నతని మనసెట్లు బాధపడినదియును, రాక్షసులు తమకు తగిన మర్యాదలు చేయలేదని నిందించినపుడు ఇంద్రపదవిని గూర్చి యాతనికెట్టి యూహలు గలిగినదియును, వాఁడు సింహాసనమాక్రమించినపు డాతని కేమి తోచినదియును, ద్వారకలో కృష్ణునకు సర్వమును నివేదించిన పిమ్మట నాతని మానసమున నిరాశాభావమెట్లు క్రమ్మినదియును, కృష్ణుఁడిచ్చిన యుత్సాహముతో నతని మన మెట్లుత్తేజితమైనదియును క్రమముగ నూహించి, సూరనార్యుఁ డనంతప్రతిభతో నుచితజ్ఞుఁడై నిరూపించి తన కావ్యకళాశిల్పనైపుణ్యముచే మనల దిగ్భ్రాంతులఁ గావించినాఁడు.

ఇదేరీతిగ, ప్రభావతి ప్రియుని చిత్రపటమును చూచినది మొదలుగ అనురాగబీజము రూఢమగు నంతవఱకును నామె ముగ్ధహృదయమెట్లు పరిణమించినదో దానిని, పాత్రోచితముగ నతికోమల మధురఫణితిని నిరూపించి చూపినాఁడు.

సూరన మహాకవి కథాకథన నైపుణ్యమునకు మూలశక్తులైనవానిలో నీ మానసిక నిరూపణ మొకటి యనుటలో నెట్టి సంశయము లేదు.

నాటకోచితరీతి

కథకులు రెండు తెఱంగులుగ నొప్పుదురు. ఇందొక తెగవారు తామే పూనుకొని పాత్రల రూపచేష్ట సంభాషణాదులు వర్ణించుచు కథ జెప్పెదరు. రెండవజాతివారు నాటకప్రదర్శనమునందలి సూత్రధారునివలె వర్తించి, కథనంతటిని కొన్ని యంకములుగను, దృశ్యములుగను విభజించి, పాత్రలను ప్రవేశపెట్టి తాము తప్పుకొనుచు, వానిచే నాయా సన్నివేశములందు గుణవస్తు కాలానుగుణముగ స్వేచ్ఛగ సంభాషణాదికమును జేయించుచు, సంధివాక్యము లవసరమైనపుడును దృశ్యములు మారునపుడును నెడనెడ కన్పట్టుచు కథ చెప్పెదరు. ఇందు రెండవజాతివారిని ఉత్తమ కథకులుగా రసికలోక మెన్నుచున్నది. మహాకథకుఁడయిన సూరనార్యుఁ డీ రెండవజాతికి జెందిన కథకుఁడు. ఈ విషయమున ఈతఁడు సర్వవిధములు కవిబ్రహ్మ తిక్కనకు గురూత్తముని గుణములనెల్ల గ్రహించిన శిష్యోత్తముఁడు.

ప్రభావతీప్రద్యుమ్నము నందలి ప్రథమాశ్వాసము సూరనార్యుని నాటకోచితరీతికి చక్కని నిదర్శనము, ఈ కథాభాగమును సూరన కొన్ని దృశ్యముల క్రిందికి విభజించినాఁడు. - ఇంద్రుఁడు ద్వారకుకు వచ్చుట, ఇంద్ర శ్రీకృష్ణుల సంభాషణము, ఇంద్ర శుచిముఖీసంభాషణము అనునవి ఇందలి దృశ్యములు. భద్రనటబ్రహ్మచారుల వృత్తాంతము ఒక విష్కంభకము వలె నొప్పుచున్నది. నాటకోచితరీతిని ఇందలి పాత్రలు ఎదుటకు వచ్చి నటించినట్లు కన్పట్టును. కవి ప్రతి దృశ్యము పిమ్మటను నూతన దృశ్యమునందలి పాత్రలను ప్రవేశపెట్టి తప్పుకొనుట కన్నట్టును. కొలదిమార్పులు గావించినచో నీ ప్రథమాశ్వాసమెల్ల చక్కని నాటకభాగమై యొప్పును. ఇట్లే మిగిలిన కథయును నడచినది.

సంభాషణనైపుణ్యము

ప్రభావతీ ప్రద్యుమ్నమునందలి గుణవిశేషములతో సంభాషణనైపుణ్యమొకటి. ఇదియును పాత్రోన్మీలనముతో బాటుగ నాటకరీతిలోని యంతర్భాగము. సంభాషణలు నడుపుటలో సూరన తిక్కనకు దీటయినవాఁడు. పాత్రల అధికార ప్రాభవాది విభేదముల ననుసరించి ఔచిత్య మెఱిఁగి సంభాషణలు నడిపినాఁడు. ఇందలి ప్రధాన గుణములలో సంభాషణ మొకటియగుట చేతనే విమర్శకులు, ఈ ప్రభావతీప్రద్యుమ్నమున విశేషభాగము సంభాషణవైచిత్ర్యమే యనిరి. (తల్లాప్రగడ సూర్యనారాయణరావు, ప్రభావతీప్రద్యుమ్న పీఠిక -వావిళ్ళ ప్రతి).

రాక్షసబాధల వలన నిరాశాయుతుఁడయిన ఇంద్రుని దైన్యము అతని ప్రతిపదమున గోచరించునట్లును, స్వర్గమునకు నా రాక్షసదండయాత్రవలన కలిగిన కష్టనష్టముల కాతఁడెంతగా చింతించినదియును, నాతని రసికతయును ఇంద్రుని సంభాషణములందు ప్రతిఫలించినది.

శ్రీకృష్ణుని సంభాషణములందు అతని యజ్ఞప్రియత్వ దేవతాభిమానములు ప్రతిఫలించినవి. శుచిముఖి సంభాషణములు ఆ మహనీయపాత్రకుఁగల ధీశక్తిని, ఇతరగుణవిశేషములను ప్రదర్శించినది. సఖీప్రభావతుల సంభాషణములు సహజ కోమలములై యెప్పినవి. నాటకోచితరీతిలో సంభాషణల నడిపించి, తన కావ్యమునకు ఈ దృశ్య ప్రబంధ లక్షణము నొక గుణ విశేషముగ సూరనార్యుఁడు కల్పించినాఁడు.

సమయోచిత వర్ణనలు

ప్రబంధములు వర్ణనప్రధానములు. వానియందు అష్టాదశ వర్ణనము లుండవలయునని నియమము. ఈ నియమమును అందముగ అనుకరించి ప్రతిభలేని ప్రబంధకవులు అనుకరణమయములైన కావ్యముల సృజించిరి. అద్వితీయ ప్రతిభాన్వితుఁడైన సూరన వర్ణనలను సహితము అవసరోచితముగ ప్రవేశపెట్టి యా వర్ణనములను కావ్యమునకు గుణములై యొప్పునట్లు రచించినాఁడు. ప్రభావతీప్రద్యుమ్నమున ప్రబంధ లక్షణముల ననుసరించి పుర, ఋతు, స్త్రీ, విరహాది వర్ణనలు కన్పట్టును. ఈ వర్ణనలను తానై వర్ణింపక, పాత్రల ముఖమున చేయించుట సూరన విశిష్టత. ప్రభావతీప్రద్యుమ్న ప్రథమాశ్వాసము నందలి ద్వారకానగర వర్ణనమును మాతలిచే చేయించుట ఇందుకు చక్కని నిదర్శనము. వర్ణ్యవస్తువు దొరికినది గదా యని సందర్భశుద్ధి లేక మైమరచి వర్ణించుట సూరనయందు గోచరింపదు.

ప్రథమాశ్వాసమందలి వజ్రనాభ స్వర్గయాత్రావర్ణనము, వసుదేవుని యజ్ఞవర్ణనము నిందుకు చక్కని నిదర్శనములు. కథకు ప్రయోజనకారులు కాని వర్ణనములిందుండవు. కొందఱు ద్వితీయాశ్వాసమున శుచిముఖి ప్రభావతిని గూర్చి చేసిన నఖశిఖ పర్యంత వర్ణనమును విమర్శించిరి. కాని రసిక దృష్టితో పరిశీలించిన ప్రభావతి పట్ల ప్రద్యుమ్నుని హృదయము నాకర్షించుట కట్టి సుదీర్ఘ వర్ణన మవసరమేమో యనిపించును.
అలంకారాభిరుచి
సూరన తన కావ్యమును ప్రబంధోచిత ధోరణిని నడిపించినప్పటికిని వసుచరిత్ర, మనుచరిత్ర, నైషధములలో వలె కావ్యమున సర్వాలంకారముల నిముడ్చవలయునను నాతురత గలవాఁడు కాఁడు. ఈతని యలంకారములు సందర్భోచితములై, సహజములై యొప్పుచున్నవి. ఉపమ రూపక 'ఉత్ప్రేక్ష' అతిశయోక్తి సందేహాద్యలంకారములను సమయోచితముగ ప్రయోగించి, వానినిగూడ తన కావ్యమున గుణములుగనే సూరన భాసింపజేసినాఁడు.

అలంకారముల నిబిడత్వము చేత శాస్త్రపాండిత్య ప్రదర్శనమున కీతఁడు పూనుకొనినట్లు కన్పట్టదు. మాతలి ద్వారకను వర్ణించుచు సందేహమును పదేపదిగా వాడుట సూరన యుచితజ్ఞతకు ఒక నిదర్శనము. 'శ్లేష'ము ఘటించుటలో నద్వితీయ పండితుఁడై రాఘవ పాండవీయకృతిఁ జెప్పిన యీతఁడు, తన రసవత్కావ్యమైన దీనియందు దానిని ఎచటనో తప్ప యుపయోగింపకపోవుట యీతని ఉచితజ్ఞతను వెల్లడించుచున్నది.

రసోచితభాషాప్రయోగము

“సూరనయందు ప్రబంధకవులకు గల వర్ణనశక్తితోడ వారికి లేని కథా కల్పనాశక్తియు వివిధములైన సందర్భములను సంధానమునకు దెచ్చు ప్రతిభయు సహవాసములు, మఱియు భానవాశక్తికిఁ దోడు భాషాశక్తియు నీతనికిఁ గలదు.” (కట్టమంచి - కళాపూర్ణోదయపీఠిక). ప్రభావతీ ప్రద్యుమ్నమునకు గుణాధిక్యమును సంపాదించిన విశేషములలో నాతని భాషాప్రయోగ మొకటి. సామాన్యముగ నీతనికి సంభాషణవైచిత్ర్యముపై నభిమానము గావున నీతని వాక్యములు అలఁతియలఁతి తునియలుగ సాగుచు నాటకోచితరీతిని ప్రదర్శించుచుండును.

వర్ణనలం దీతని భాష నిబిడమై సమాసభూయిష్టముగ నుండును. వసుదేవ యజ్ఞమును వర్ణించుచు నీతఁడు చెప్పిన సీసపద్య మిందుకు నిదర్శనము. సహజముగ నీతని భాషయందు క్లిష్టత లేదు. పదమైత్రి అర్థసంపదలతో నొప్పును, ముత్తెపుసరులు పోహళించిన రీతిగా నీతని భాషలో శబ్దములు తమంతట తామే దొరయును, భాషయందు సహజమాధుర్యము గోచరించును. శుచిముఖియందు సహజవాణీ రామణీయకమున్నట్లు సూరనార్యుఁడు చెప్పిన వాక్యము, తన భాషకే అన్వయించునట్లు చెప్పినాఁడేమోయని మనమూహింపవచ్చును.

పై గుణములలోనెల్ల ప్రధానమైనది కథానుసంధానవైచిత్రితో గూడిన కథాకథనము. రాజకీయ, ప్రణయవృత్తాంతములతో రెండు ప్రత్యేకస్రవంతులుగా నడచు కథ నొక మహావాహినిగా నీ మహాకవి సంధానమొనర్చుట యిందలి గుణములలో నెల్ల నుత్తమమైనది.

దోషములు

విమర్శకులు ప్రభావతీప్రద్యుమ్నమునందు కొన్ని దోషముల నెన్నుచున్నారు. శుచిముఖి చిలుకలనెడి పక్షులను పాత్రలుగా స్వీకరించి, నాటక ప్రయోగమునకు భంగమును కలిగించుట యొక దోషము. ఇది నాటక ప్రయోగ సంబంధి. శుచిముఖిపాత్రకు అనంతప్రాధాన్యము నిచ్చి ఇంద్రోపేంద్రులవంటి ప్రముఖులను అసమర్థులుగను, అవశులుగను చిత్రించుట రెండవ దోషము. శుచిముఖి యనెడు హంసను కృష్ణ ప్రద్యుమ్నుల పక్షమున నిల్పినట్లే, వజ్రనాభుని పక్షమున చిలుకను నిలిపి ఈ రెంటిచేత నెత్తుకు పై ఎత్తు వేయించిన బాగుండెడిదని యొక విమర్శకుని సూచన (డా. చిలుకూరి), ఇంద్రకృష్ణులకు, శుచిముఖికిని నికటసంబంధము నేటి కథలో లేదు. అట్టిదానిని కల్పించిన బాగుండెడిదని యొక యూహ. నేడు శుచిముఖి పూనుకొనినదంతయును నూసుబోని పనియని తోచుచున్నదట. ఇంద్ర రాజ్యములోని ప్రాణులగు హంసలకు దేవకార్యమునకుఁ బూనుకొనుట కర్తవ్యమగునుగదా!

వసుదేవుని యజ్ఞము, అందు భద్రనటనాట్యము, వటు ధూర్తత్వములు అనవసరములనియు నొక విమర్శ, కృష్ణునంతటి ధీశాలికి ధూర్తబ్రహ్మచారి వాక్యముల నుపశ్రుతిగ గల్పించుట యొక లోపముగ కొందతెన్నెదరు. ప్రద్యుమ్నుని అశ్వవిహార వర్ణన మప్రస్తుతమనియు, కవికి దానిని వర్ణింపవలె ననెడి కుతూహలము తప్ప దాని ఉనికికి తగిన హేతువు లేదనియు నొక యభిప్రాయము. ప్రద్యుమ్నుఁడు భద్రుని వేషమున పట్టణమునందున్నప్పుడు అతఁడేమి చేయుచున్నాఁడో గుర్తింపనంతటి మూర్ఖుఁడుగాను, అవివేకిగాను వజ్రనాభుఁడు చిత్రింపఁబడుట యొకదోషముగ నెన్నఁబడుచున్నది. ప్రభావతీప్రద్యుమ్నుల మితిమీరిన వర్ణనలు ఈ కావ్యమున పెద్దవై వస్తువునందలి బింకమును చెడగొట్టుటచే, వస్వైక్యము చెడుట యొకలోపముగ చెప్పఁబడుచున్నది. ప్రభావతీప్రద్యుమ్నుల రతిని, ఉపరతిని విపులముగ వర్ణించి నడివీథిన బెట్టుట యొక లోపముగఁ జెప్పబడుచున్నది. ఇట్టి దోషము లెన్నియున్నను, ఇందలి గుణములు వాని ననేకరీతుల నతిశయించి ప్రభావతీ ప్రద్యుమ్నమునకు ఆంధ్రకావ్య ప్రపంచమున నొక మహనీయ ప్రబంధముగ విఖ్యాతిని గడించిపెట్టినవి. ప్రభావతీప్రద్యుమ్నము - మహాప్రబంధము ప్రబంధ శబ్దమునకు ప్రకృష్టమైన బంధము గలదియని యర్థము. ఈ బంధము వస్తురస రీతులందు ఉండవలెను. తిక్కన మహాకవి భారత కృత్యాదియందు తన రచనలను ప్రబంధమండలిగా బేర్కొనినాఁడు. కాని యట తిక్కన వాడిన


మూస:RH ప్రబంధశబ్దమునకు అర్థము వేరుగ గోచరించుచున్నది. పురాణములందు వస్తు రస విన్యాసాదులలో ప్రబంధత యుండదు. ప్రబంధ జాతి రచనలను పరిశీలింపగా నందు విస్తు విషయమున నైక్యము (Unity of Plot) రసవిషయమున శృంగార వీరములలో నొకటి అంగిరసమై (ప్రధాన రసము) మిగిలినవని అంగరసములగుట, కన్నట్టును. వీనియందు అష్టాదశ వర్ణనలుండుట, అలంకార ప్రియత్వము, ప్రౌఢ చతురోక్తులు కన్నట్టును. ప్రబంధము దృశ్య శ్రవ్య విభేదములతో నొప్పును. నేఁడు మనము ప్రబంధములని వ్యవహరించు శబ్దము సామాన్యముగ శ్రవ్య ప్రబంధముల యెడనే యుపయోగింపఁబడుచున్నది.

పింగళి సూరన ప్రభావతీప్రద్యుమ్న గద్యమునందు "ఇది నిఖిలసూరి లోకాంగీకారకవిత్వ వైభవ పింగళి యమరనార్య తనూభవ సౌజన్యజేయ సూరయ నామధేయ ప్రణీతంబైన ప్రభావతీ ప్రద్యుమ్నంబను మహాప్రబంధంబునందు" అనుచోట తన కావ్యము మహాప్రబంధమని తెలిపినాఁడు. ఇందు ప్రబంధ లక్షణము లెంతవఱకున్నవో గమనింతము.

వస్తువు

ప్రబంధములందు సర్వసామాన్యముగా ప్రఖ్యాత ఉత్పాద్య మిశ్రములనెడి మూఁడురీతుల నున్న వస్తువులు (Story) లో ప్రఖ్యాతమే కన్పట్టును. సూరన కళాపూర్ణోదయమున అపూర్వ కథాసంవిధాన వైచిత్రీమహనీయమగు కథను కల్పించినాఁడు. అది ఉత్పాద్య (కవిచే కల్పింపబడినది) మైన దగుటచే సమకాలమున తగిన ఖ్యాతి రాకపోవుటవలననో యేమో, ప్రభావతీప్రద్యుమ్నమున ప్రఖ్యాతమగు నితివృత్తమును గ్రహించినాఁడు.

ప్రభావతీప్రద్యుమ్నమునకు మూలమైన కథ హరివంశములోనిది. సూరన దానిని స్వీకరించి సందర్భశుద్ధి లేనిపట్టులను సంస్కరించి, యొక కథాసంవిధాన మేర్పఱిచి మూలమునకు కొన్ని మార్పులు చేర్చి, మిశ్రకథగా నొనరించినాఁడు.

ఈ రీతిగా వస్తు విషయమున సూరన మూలములందు లేని ప్రబంధ గుణమును సాధించినాఁడు. కాని ఇందు వసుచరిత్రాదులకంటె ఎన్ని రెట్లుగనో ప్రబంధమున కవసరమైన దానికంటే కథ కన్పట్టును. ఇంతటి దీర్ఘమైన కథను గైకొని నిర్వహించుటకు పూనుకొనుటవలననే, మిగిలిన ప్రబంధములకంటె ప్రభావతీ ప్రద్యుమ్నము విశిష్ట స్థానమును పొందదగినదైనది. కాని వసుచరిత్రలోవలె దీనికి వస్త్ర్యైక్యము (Unity of Plot) లేదనుట అంగీకరించక తప్పదు. ఇందలి కథ ఒక మహాఖ్యాయికకు (A great novel) తగినంత విస్తృతిని కలిగియున్నది. మనుచరిత్రయందు వృత్తము ప్రబంధ లక్షణోచితముగ లేదు. శృంగార శాకుంతలము, నైషధములందును కథ ప్రబంధములలో నుండదగిన దానికంటె విస్తృతమై యున్నది.

నామకరణము

ప్రబంధములకు, ముఖ్యముగా దృశ్యప్రబంధములకు నామకరణమొనర్చుటకు కొన్ని నియమములున్నవి. సామాన్యముగ వీని నామకరణము నాయకుని బట్టి జరుగుచుండును - మనుచరిత్ర, వసుచరిత్ర, రాజశేఖరచరిత్ర యిత్యాదులు. కొన్నిట నాయికకును ప్రసక్తి గోచరించును - తారాశశాంకము. ప్రభావతీప్రద్యుమ్ననామకరణ మీ రెండవజాతికి చెందినది. ఇందు నాయికానాయకులిరువురి నామములను కూర్చి నామకరణమొనర్చుటయందును పింగళి సూరన ప్రబంధగుణమును సాధించినాఁడు.

నాయికానాయకులు

ఇందు నాయిక ప్రభావతి, వజ్రనాభ రాక్షసుని పుత్రిక. సర్వ శుభలక్షణ సంపన్న, రూపవతి, కన్య. నీకు తగిన భర్త ఈతఁడని శివ వ్రాసియిచ్చిన చిత్రపటమునందలి ప్రియునిరూపమును చూచినది మొదలుగ, నాతని యెడల ననురాగము వహించి యాతని పరిణయమాడిన అనుకూలవతి. నాయకుఁడు ప్రబంధములందు ధీరోదాత్తుఁడు, బలము, గాంభీర్యము, కృప మొదలగున వీ నాయకునకు ముఖ్యలక్షణములు.

ఈతఁడు సర్వసామాన్యముగ దేవతామూర్తియో, సద్వంశ క్షత్రియుఁడో యైయుండును. ప్రభావతీ ప్రద్యుమ్నమున నాయకుఁడైన ప్రద్యుమ్నుఁడు యదువంశమున బుట్టిన రాజపుత్రుఁడు. జగదేకవీరుడైన శ్రీకృష్ణుని కుమారుఁడు. ధీరోదాత్తుఁడు. ఈ రీతిగా నాయికానాయకుల విషయమున ప్రభావతీప్రద్యుమ్నము ప్రబంధ లక్షణములతో నొప్పుచున్నది.

రసము

దృశ్య ప్రబంధములందు (నాటకములందు) వీర శృంగారములలో నొకటి అంగిరసముగ (ప్రధాన రసమున) నుండవలయుననెడి నియమమున్నది. ఈ నియమమును కొన్ని దృశ్య ప్రబంధములు పాటింపకపోయినను, ఇది యొక సామాన్య లక్షణముగా గ్రహింపదగియున్నది. ఆంధ్రసాహిత్యమున ప్రబంధములందు శృంగారము ప్రధాన రసముగా గోచరించును. పింగళి సూరనకును శృంగారరసముపై ప్రీతి యధికము. కళాపూర్ణోదయమును గూర్చి తెలుపుచు నాతఁడు దానిని శృంగార రసప్రాయమని వర్ణించినాఁడు.

ప్రభావతీప్రద్యుమ్నమునందును శృంగారమే ప్రధానరసమని చెప్పనగును. ఇందు సూరన శృంగారమును ప్రధాన రసముగ గ్రహించినాఁ డగుటవలననే, నాయికా నాయకుల పరముగా కావ్యమునకు ప్రభావతీ ప్రద్యుమ్నమని నామకరణమొనర్చినాఁడు.

ప్రభావతి శివ వ్రాసి యిచ్చిన చిత్రపటము నందలి ప్రియుఁడగు ప్రద్యుమ్నుని చూచినపుడు యామెయందు బొడమిన శృంగార భావాదులను వర్ణించి యా రసమును నిక్షేపించినాఁడు. శుచిముఖి చేసిన ప్రభావతీవర్ణనమును విని 'వినుకలి' (వినుటచే నగు ప్రేమవలన కలుగు విరహము) కి చిక్కిన ప్రద్యుమ్నుని యందును రసమును సూరనకవి జాగరూకతతో నిక్షేపించినాఁడు. ఇరువురియనురాగమును పోషించి దాని పరిణామావస్థల ప్రదర్శించి ఈ ప్రభావతీప్రద్యుమ్న కావ్యమున శృంగార రసస్వరూప నిరూపణ మొనర్చినాఁడు.

ఇందు సర్వవిధములైన పూర్వరాగ విరహ రసాభాస సంభోగాది శృంగార విభేదములను చూపినాఁడు. ఇందుమూలమున రసవిషయమునను సూరన ప్రకృష్ట బంధతను (ప్రబంధతను) సాధించినాఁడు. ఇందు వీరాదు లంగరసములుగ నున్నవి.

పంచ కార్యములు

నాయికానాయకుల యనురాగకథకును, వజ్రనాభవధకును తగిన ఆరంభయత్న ప్రాప్త్యాశ ఫలాగమము లనెడి పంచకార్యముల నడిపి, కథారచనమునందును సూరన ప్రబంధ లక్షణమును సాధించినాఁడు.

అష్టాదశ వర్ణనలు

ప్రబంధమున కష్టాదశవర్ణనములుండుట ముఖ్యలక్షణము. ఈ వర్ణనములలో నెన్ని యధికముగ నున్న నా కావ్యము ప్రబంధ లక్షణమంత యధికముగా సాధించిన

దగుచున్నది. ఈ యష్టాదశ వర్ణనములు ఇవి :

క.“పురసింధు నగర్విన శశి
సరసీ వన మధు రతిప్రసంగ విరహముల్
పరిణయ తనయోదయ నయ
విరచన యా త్రాజిదౌత్య విభువర్ణనముల్.”

ప్రభావతీప్రద్యుమ్నమున ద్వారకానగర వర్ణనము, యజ్ఞవర్ణనము, అశ్వక్రీడావర్ణనము, హంసల వర్ణనము, స్త్రీవర్ణనము (ప్రభావతీవర్ణనము), విరహ వర్ణనము, చంద్రోపాలంభము, సూర్యోదయ వర్ణనము మొదలగు వర్ణనలెన్నియో యున్నవి. ఇందు ఇన్ని వర్ణనము లుండుటవలననే సూరన మహాప్రబంధమని చెప్పినాఁడాయనిపించును.

కాని ఈ వర్ణనములలో నెవ్వియును సామాన్యముగ ప్రబంధములందలి వర్ణనములవలె సుదీర్ఘములు కావు. ఈ రీతిగా సూరనార్యుఁడు తన కావ్యమున ప్రబంధ లక్షణములను పాటించియున్నాఁడు. కవితలలో వ్యంగ్యప్రధానమైన కవిత ఉత్తమకవిత. సూరన కావ్యమున వ్యంగ్యోక్తులు నెడనెడ కనిపించును. కొన్ని తావులందు శ్లేషలు ధ్వనులును నున్నవి, శృంగార రస ప్రధానమైన ఈ కావ్యమున ప్రధానముగ మాధుర్య ప్రసాదాదిగుణములు కైశిక్యాదివృత్తులు, వైదర్భిరీతి గోచరించును. శృంగారము ప్రధానరసమై అంగరసములలో అద్భుతము ముఖ్యమైనదై యొప్పు నీ ప్రభావతీ ప్రద్యుమ్నము మహాప్రబంధము.

మూలకథ - మార్పులు

ప్రబంధములందు కథావస్తువు ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రమము అని త్రివిధము. ఇందు ప్రఖ్యాతము పురాణాదులందు ఖ్యాతిగన్న కథావస్తువు. ఉత్పాద్యము కవికల్పితమైన కథావస్తువు. ప్రఖ్యాతమైన కథనే గ్రహియించి సందర్భశుద్ధి ననుసరించి కవి మార్పుల నొనర్చిన కథావస్తువు మిశ్రమము. ఆలంకారికులలో ప్రఖ్యాతుఁడైన విశ్వనాథపంచాననుఁడు ప్రబంధములలోని కథావస్తువు ప్రఖ్యాతమైయుండవలయునని నియమించినాఁడు.

ఆంధ్ర సాహిత్యమునందు జన్మించిన ప్రబంధములలోని కథావస్తువు ప్రఖ్యాతము. ప్రబంధ కవులు భారతరామాయణాది పురాణములనుండియో లేక బృహత్కథాది మహాగ్రంథముల నుండియో కథను గ్రహించి, అష్టాదశవర్ణనములతో శృంగారరసము ప్రధానముగ కావ్యములఁ జెప్పిరి. పింగళి సూరనార్యుఁడు ప్రబంధకవు లెవ్వరిలోఁ గన్పట్టని విశిష్ట ప్రతిభగలవాఁడు. ఈతఁడు తొలుత రాఘవపాండవీయ మనెడి భాష్య, కావ్యమును జెప్పి పిమ్మట నపూర్వమైన కల్పనాసామర్థ్యమును, కథాకథనదక్షతను ప్రదర్శించుచు, నుత్పాద్యమగు కథావస్తువుతోఁ కళాపూర్ణోదయమును రచియించెను. ఇది ఆంధ్ర సాహిత్య లోకమునందు అద్వితీయ మహాప్రబంధము. ఐనను అతని కాలమునాటివారికి ఈ ప్రబంధము కేవల కల్పితమగుటచే నచ్చలేదు. 'కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నములు' అన్న సూక్తి బయలుదేరినది. కావుననే పింగళి సూరన తన ప్రభావతీప్రద్యుమ్నమును మిశ్రకథగా నొనర్చెను. ఇందు సూరన మూలకథను హరివంశమునుండి గ్రహియించి, తన కావ్యరచనా శిల్పమున కనుగుణములైన మార్పులను గావించెను.

పింగళి సూరన ప్రభావతీప్రద్యుమ్న పంచమాశ్వాసము చివర

తే. "అఘహరణహరివంశ కథాశ్రయంబు
నాత్మ పుత్రగుణ స్తవనాంకితంబు
నైన యీ కావ్యమునకు మహాప్రసిద్ధి
నిచ్చుగావుతఁ గరుణ లక్ష్మీశ్వరుండు”(5-221)


అను పద్యముచే తన ప్రభావతీప్రద్యుమ్నకథకు మూలము హరివంశమని చూపించినాఁడు. దీనినిబట్టి మూలగ్రంథమునందలి కథలోని ముఖ్యాంశములను గ్రహించి, సూరన దన యిచ్చ వచ్చినట్లు మార్పులు చేసి సందర్భశుద్ధి, పాత్రేచిత్యము, సంభాషణనైపుణ్యము మెరయగా సర్వోత్కృష్టమగు కావ్యమును జెప్పినాఁడని మన మూహింపవలసియున్నది.

సమస్త పురాణములందలి కథలవలెనే హరివంశపురాణమునందలి ప్రభావతీ ప్రద్యుమ్న కథయును అసంగతములు, అసందర్భములునగు నంశములతోఁ గూడి అంగాంగీభావము బొత్తుగ లేక జల్లికూర్పు వలె నున్నది. ఈ హరివంశమందలి కథను ఇతివృత్తముగా గ్రహించి క్రీ.శ. 12వ శతాబ్దమందలి రవివర్మ (మలయాళ దేశపాలకుఁడు) ప్రద్యుమ్నాభ్యుదయ మనెడి యొక నాటకమును సంస్కృతభాషలో రచియించెను. అతఁడును సందర్భశుద్ధి లేనిదియును, నాటకోచితము కానిదియును నగు కథాభాగములను మార్చి కొన్ని నూతన కల్పనములు చేర్చి తన రూపకమును రచించెను. శుచిముఖిపాత్ర పక్షియగుటచే ప్రదర్శనానుగుణము కాకుండుట వలన దాని నతఁడు తొలఁగించెను. ప్రభావతీప్రద్యుమ్నుల మధ్య దూతకృత్యమునంతటిని ఈ రవివర్మ భద్రనటుని మూలముననే నడిపెను. చిత్రపట ప్రదర్శన మూలమున నాయికకు అనురాగబీజము నారోపించుట రవివర్మ కల్పనము.

పింగళి సూరన రచన రూపకము కాదు, ప్రబంధము. కావున నీతఁడు తన శ్రవ్యకావ్యమున కనుగుణముగ హరివంశ మూలము నందలి కథను మార్చుకొనెను. సూరన నాయికానాయకుల మధ్య దౌత్యమును శుచిముఖి మూలముననే నడిపినాఁడు భద్రనటుఁడు ఆడుచు పాడుచు మెలఁగెడి తేలిక మానసి. అట్టివాఁడు నాయికా నాయకుల మధ్య అనురాగమును పోషించుచు దౌత్యము నెఱపుట కనర్హుఁడని తోఁచి,రహస్య గోపనమునందు సమర్థమైన మూలమునందలి శుచిముఖిపాత్రనే సూరన గ్రహించినాఁడు. నాయిక పక్షమున పురుషునికంటె స్త్రీ దూతకృత్యము నెఱపుటకు తగినది గదా! భద్రనటదౌత్యము రసోచితము కాదని వేరె చెప్పవలసిన పనిలేదు. సూరనార్యుఁడు మూలమందలి శుచిముఖిని యథాతథముగ గ్రహింపక పునఃసృష్టి యొనర్చినాఁడు. దానికి అనంతధీశక్తి నిచ్చి కథారంగమున ప్రవేశపెట్టినది మొదలు సర్వవ్యాపారములకు సూత్రధారిని గావించినాఁడు. ఈ సృష్టియందు సూరన తన ఆత్మీయతను (Personality) ప్రతిబింబింపజేసినాఁడు.

మూలమునందు ప్రభావతీప్రద్యుమ్నుల ప్రణయమునకును, గద సాంబ సునాభపుత్రికల ప్రణయమునకును, నెట్టి సంబంధము లేదు. వారి ప్రణయము స్వాభావికపరిణామము నొందినట్లు కనిపించదు.

“ఒక దినమున వజ్రనాభుని తమ్ముడగు సునాభుని కుమార్తెలగు ప్రభావతి చెల్లెండ్రు ప్రభావతీసౌధమునకు వచ్చిరి. అపుడు వారు ప్రభావతి ప్రద్యుమ్నునితోఁ గూడియుండుటను జూచిరి. ప్రభావతి వారితో తన మంత్రప్రభావమును, దేవమానవుల నెవరినైనను తనకడకు రప్పించఁగలనని తెలుపఁగా, వారామె నా మంత్రమును జెప్పవలసినదని నేఁడుకొనిరి. ప్రభావతి ప్రద్యుమ్నుని తన చెల్లెండ్రుకు దగిన భర్తల నిరువురఁ బేర్కొనుమనఁగా నతఁడు గదసాంబుల పేర్లు చెప్పెను. ప్రభావతి చెల్లెండ్రు మంత్రప్రభావమున వారిని బిల్పించుకొని వివాహమాడిరి.”

అర్థరహితమగు దీనిని సూరనార్యుఁడు స్వీకరింపక చిలుక రాయబారమును కల్పించినాఁడు. దీని మూలమున ప్రధాన నాయికానాయకులైన ప్రభావతీప్రద్యుమ్నుల ప్రణయకథకును, వీరి ప్రణయకథకును, ప్రతియోగము (Contrast and Parallelism) కలిగినది. ప్రధాన నాయికానాయకుల ప్రణయదౌత్యమునకు మేధాసంపన్నయైన శుచిముఖి పూనుకొనఁగా, ఉపనాయికానాయకుల ప్రణయ కార్యభారము నంతకంటె గొంతగ నల్పసామర్థ్యము గల వ్యక్తి పూనుకొనిన దన్నమాట! ఇట్లు రెండు శృంగారకథావాహినులను పింగళి సూరన తన కావ్యమున సంగమింపఁజేసినాఁడు (శ్రీ పింగళి). వజ్రనాభవధకును, ప్రభావతి వివాహమునకును మూలమున నెట్టి సంబంధమును లేదు. సూరనార్యుఁడు తండ్రి చావునకును, కుమార్తె వివాహమునకును అవినాభావసంబంధమును కల్పించి, ఏకసూత్రమున కథను నడిపించి కథకు నిబిడత్వమును జేకూర్చినాఁడు.

మూలమునందు వజ్రనాభవధానంతరము ఇంద్రుఁడు రాక్షసరాజ్యమును తన కుమారుఁడైన జయంతునికి, కృష్ణుని కుమారులకు, సోదరులకుఁ బంచి ఇచ్చినట్లున్నది. వజ్రనాభోపద్రవము నుండి తన్ను దాను రక్షించుకొనఁజాలక 'రక్ష రక్ష జనార్దన' యని తొలుత వేడుకొన్న ఇంద్రుఁడిపు డిట్లు కృష్ణుని సరకుగొనక స్వతంత్రించినట్లు వర్ణించుట పాత్రోచితికి భంగకరము. కావున సూరనార్యుఁడు యుద్ధానంతరము లభించిన రాజ్యభోగములను బంచుకొనుటకు తనవారం బంపి, వజ్రనాభుని హతమార్చిన శ్రీకృష్ణుని మధ్యవర్తిగ నిలిపి, ఉచితిజ్ఞతను బాటించినాఁడు. మూలమునందు వజ్రనాభునికొక కుమార్తె (ప్రభావతి) కలుగునట్లు వరమిచ్చుటయే తప్ప, ప్రభావతి ప్రణయకథలో పార్వతికెట్టి సంబంధమును లేదు. సూరనార్యుఁడు రవివర్మనుండి గ్రహించియో, మఱి స్వయముగా నూహించియో ప్రభావతిస్వప్నమును, చిత్రపట సన్నివేశమును గల్పించినాఁడు. ఇది మనోజ్ఞమైన కల్పనము. దీనివలన సూరనార్యుఁడు ఎన్నో ప్రయోజనములను సాధించినాఁడు. వజ్రపుర ప్రవేశమొనర్చి, వానిని సంహరించువాఁడెవ్వఁడా యని ఇంద్రోపేంద్రు లూహించువేళ, శుచిముఖివలన చిత్రఫలక వృత్తాంతమును వినిపించి, ప్రద్యుమ్నుని మూలమున నీ కార్యమును సాధింపవచ్చుననెడి యాశను యింద్రునకుఁ గల్పించినాఁడు.

శృంగార ప్రబంధమగు నీ ప్రభావతీ ప్రద్యుమ్నమున ప్రభావతి ప్రథమదర్శనవేళనే యెంతటి యుక్కటానురాగము నొందినదో తెలిపినాఁడు. ఇట్లే భద్రనటునకును, ధూర్తవటువులకును జరిగిన సంభాషణమనెడి రసవత్సన్నివేశమును సూరనార్యుఁడే కల్పించెను. ధూర్తవటువుల వాక్యములను కృష్ణుఁడుపశ్రుతిగా గ్రహించి ప్రద్యుమ్నుని నటవేషమున వజ్రపురమునకు పంపుటయనెడి నిశ్చయమొనర్చుట కీ సన్నివేశము తోడ్పడుచున్నది. ప్రభావతికి ప్రద్యుమ్నుని భర్తగా మున్నే పార్వతి నిశ్చయించుటయను నంశము సూరన కల్పనయే. అదేరీతిగ నామె చెల్లెండ్రగు చంద్రావతీగుణవతులకు గదసాంబులు భర్తలగునట్లుగా నారదుని దీవనను కల్పించినాఁడు.

కవి ఇందలి నాయికలైన అక్క చెల్లెండ్రనందఱ నొకే రీతిగ నన్ని సందర్భములఁ జూడఁదలచుటయే ఇందుకు కారణము. మూలమునందు వజ్రనాభుఁడు కశ్యపుని యజ్ఞము ముగిసిన పిమ్మట నాతనికడ కేగినట్లును, నాతఁడు స్వర్గ రాజ్యాధిపత్య సత్త్వము వానికి లేదని తెలుపఁగా నా రాక్షసుఁడు మఱల స్వర్గముపై దండెత్తినట్లును నున్నది. మహాకవి తిరిగి వజ్రనాభునిచే స్వర్గముపై దండెత్తింపఁ జేయుట కేవలము ఇంద్రునియెడ నీర్ఘ్యాభావము నాతఁడు ప్రదర్శించుటయే యగుటవలన, దానిని మాన్పించి సూరన యాతని దృష్టిని ప్రద్యుమ్నద్రోహము (తన యంతఃపురమునఁ బ్రవేశించి కన్యామానాపహరణ మొనర్చుట) వంకకు మరల్చినాఁడు.

ఇదే రీతిగా బరిశీలించిన మూలమును సూరన సూక్ష్మదృష్టితోఁ బరికించి మార్పు చేర్పుల నొనర్చుటయే గాక, తన యపారప్రతిభతో దానినొక యపరసృష్టి గావించినాఁడని వ్యక్తమగును.

ద్వారకావర్ణనము

సముజ్జ్వలమహిమతో శ్రీకృష్ణుఁడు ద్వారకయందుండఁగా, నొకనాఁడు ప్రభువుకడకు ఇంద్రుఁడు వజ్రనాభదానవుని దుశ్చేష్టల వలన బాధనొందుచున్న లోకములకు మేలును జేకూర్చు కార్యమును గూర్చి పర్యాలోచనమొనర్చుటకు, స్వర్గమునుండి దిగివచ్చుచుండెను. అతనికి దూరమున భూదేవి ధరించిన సముద్రమనెడి మొలనూలునందలి రత్నపుమొగపో యనునట్లుగను, సముద్రమనెడి తలపాగను ధరించిన భూమియనెడి శివమూర్తి చిత్రతిలకమో యనునట్లుగను, పశ్చిమ దిక్కనెడి కట్టుకొనిన సముద్రమనెడి వస్త్రపు కొంగునందలి జలతారు మొగ్గయో యనగను, వరుణుని గోపురమునకుఁ గట్టఁబడిన సముద్రమనెడి తోరణమునకు మధ్య వ్రేలాడు పూగుత్తియో యనునట్లుగను, అనేక మణిగృహములు కాంతిచే ప్రకాశించుచుఁ గన్పట్టెను. అప్పుడు ద్వారక తన్నుఁ జూచుటకు ఇంద్రుని వేయి కన్నులును జాలక యాశ్చర్యపడు నట్లింద్రునకుఁ దోచెను.

ఇంద్రునకు మాతలి ద్వారకానగరమును వర్ణించి చూపుట

ఆ పట్టణసౌందర్యమును తిలకించి తలయూచి యాశ్చర్యమునొందుచున్న దేవేంద్రునిఁ జూచి, యాతని రథసారథియగు మాతలి "ఏమేమి? ప్రభువువారి కీ నగర మింతటి యాశ్చర్యమును గొల్పుచున్నదా? స్వర్గాధిపతుల కాశ్చర్యమును గల్గించు నగరము భూమియందు కలిగినది. ఏమనవచ్చును? ప్రభూ! సముద్రమనెడి తెఱ వెనుకనుండి వచ్చి నాట్యమునకై రంగస్థలమున నిల్చిన నట్టువరాలి వలె (నర్తకి) యీ పురలక్ష్మి యింపులుగులుకుచు నున్నది. గమనించినారా? పడమటి దిక్కున సముద్రము యొక్కయు, మిగిలిన దిక్కుల వనసమూహముల యొక్కయు నలుపు అతిశయింపఁగా నీ పురలక్ష్మి విష్ణువు హృదయప్రదేశమున సుఖించుచున్న ఠీవితో నొప్పుచున్నది.

“దోహద ధూప ధూమములతో నొప్పుచున్న యీ నగరమందలి వన సమూహమును జూచితినా, ఓ విబుధోత్తమ! నీటిని త్రావుటకై కుతూహలముతో వచ్చి పైన వ్రేలాడుచున్న మేఘమాలికతో నొప్పారు సముద్రమాయనెడి భ్రాంతిని కల్పించు నైపుణ్యముతో నతిశయించుచున్నది. తన శరీరవలయములే కోటలుగను, కిరీటములవలె ప్రకాశించు తన ఫణముల సమూహమే మేడల వరుసగను నొప్పి ఆదిశేషువు విష్ణువును విడువఁజాలక ఈ రీతిగ వచ్చి సేవించుచున్నాఁడేమోయన్న యూహ నాకు కల్గించుచున్నది. సౌధశిబిరములందలి మణుల కాంతులచే ననేకములైన వర్ణములను పొందినవై మేడలపైనున్న జెండా గుడ్డలచే నెఱుక పడక యీ ద్వారకానగరముపై భాగమున మేఘములు నిల్చినవి. ఓ ఇంద్రా! చూచితివా! ఇప్పటికిని నమ్మరాదు. అవి కాలాగరుధూపముల పొగలో లేక మేఘములో! ఆ కన్పించునది కెంపులతో గట్టబడిన మేడలచే ప్రకాశించునట్టి గరుడపచ్చల యరుగులతో నేలయో లేక లేఁజివురాకుల యెఱ్ఱందనము యొక్క యతిశయముచే తేజరిల్లు మామిడితోపో, ఆ బృహస్పతికైనను దగ్గరకు పోయి చూచినగాని నిశ్చయింప వీలులేకయున్నది.

"ఓ దేవతాధిపా! చూడుము, ఆ బంగారు కోటయందలి శృంగారోద్యానవనములో క్రీడకొఱకైన వెండికొండ కాఁబోలును, శివుని శరీరమువలె నొప్పుచున్నది. అది గొప్ప పుష్పములు గల సంపెంగ తోఁటలవరుస కాఁబోలును, శివుని పులితోలువలె ప్రకాశించుచున్నది. ఇంద్రనీలములతో నొప్పారు మెట్లవరుస కాఁబోలును. అది శివుని నాగహారమును బోలియున్నది. అది పవడములు గూర్పఁబడిన నీటిజాలు గాఁబోలును. జటాజూటకాంతితో నొప్పారుచున్నది. అది సరోవరము కాఁబోలును. ఆకాశగంగవలె నొప్పారుచున్నది. అది క్రీడానౌక కాఁబోలును. చంద్రకళవలె నొప్పారుచున్నది. విస్తారముగాఁ గదిలెడి నాచుతీవగుంపు యొక్క చక్కదనము తిరిగెడి పూఁదోటలవలెను, పెద్ద తరంగముల వరుస నడచునట్టి కోటలవలెను నురుగు ముద్దయొక్క సొగసు తిరిగెడి పూఁదోటలవలెను, మేడలగుంపువలెను, నీటితుంపురులు పెద్దజల్లు కాన్కలు పెట్టు ముత్యాలవలెను ఉండగా, నీ ద్వారకానగరపు కోటచుట్టు తవ్విన యగడ్త లాయా దిక్కులందలి గాలిపాటులచే నీ పురశ్రేష్ఠమును కొలుచుటకై శాసనపూర్వకముగాఁ గొనిరాఁబడిన శత్రుపురముల వరుసవలె ప్రకాశించుచున్నది.

'ఈ నగరమునకు పడమటి దిక్కునందు సముద్రమున్నది' అని యెఱిఁగిన పెద్దలు చెప్పుకొను మాట తప్ప నితరుల కీ పురమునకు నాల్గువైపుల నున్నట్టివి యగడ్తలో లేక సముద్రములో తెలిసికొనశక్యము గాదు. ఈ నగరమందలి స్త్రీలనెడి మెఱపులు సంచరించుటచే ధన్యమైన వనపంక్తి తన్ను మిక్కిలిగా మీఱుటను జూచియును మేఘము సిగ్గు లేక యిచ్చటికి వచ్చిన వచ్చుగాక, ఒకవేళ నది రాకున్నను నీ పురమందలి జనుల పైరు పంటలకు క్రింద ప్రవహించు పూఁదేనెల ప్రవాహములే చాలును. మేఘము రాకున్న నీ నగరమునకెట్టి లోపమును గలుగదు.”

ఈ రీతిగా రథిక సారథులైన ఇంద్రుఁడును మాతలియును నాయా వస్తువులుఁ జూచినపుడు సమయోచిత సంభాషణలతో వినోదించుచు, కొంతదూరము గడచి భూమికి దిగిరి.

ప్రథమాశ్వాస కల్పనలు - ప్రయోజనములు

శ్రీకృష్ణరాయల పరిపాలనకాలమునుండి (క్రీ.శ. 15వ శతాబ్ది పూర్వార్ధమున) నుండి ఆంధ్రసాహిత్య ప్రపంచమున ప్రబంధములనెడి నూతన కావ్యములు పుట్టినవి. వీని రచనకు తొలుత తన శృంగార నైషధ కావ్యరచనచే మార్గదర్శియైనవాఁడు శ్రీనాథుఁడు. తఱువాత పెద్దన, నందితిమ్మనాదులు ఈ ప్రబంధ రచనామార్గము ననుసరించిరి. వీనియందు కథకంటే అష్టాదశవర్ణనలకు ప్రాముఖ్యమధికము. ఈ దృష్టితోఁ జూచినచో భట్టుమూర్తి వసుచరిత్ర సమగ్రమైన ప్రబంధ లక్షణములు గల కావ్యము.

పెద్దన మనుచరిత్రయందును ప్రబంధమునకు వలసినదానికంటే కథ యధికముగా నున్నది. పింగళి సూరనార్యుఁడు కథాకల్పనముపై విశేషమైన మక్కువ గలవాఁడు. అతని కళాపూర్ణోదయమునందు కథ నానారీతులు పెరిగిపోయినది. ఆ లక్షణము కొంతగా ఈ ప్రభావతీప్రద్యుమ్నము నందును కన్పట్టును. వసుచరిత్రాది ప్రబంధములందలి కథలతో పోల్చినచో, ఈ కథయును దీర్ఘమైనదనియే చెప్పవలసివచ్చును. ప్రభావతీప్రద్యుమ్నమున ప్రధానకథ రాక్షసరాజగు వజ్రనాభుని కుమార్తెయగు ప్రభావతి శ్రీకృష్ణపుత్రుఁడైన ప్రద్యుమ్నుని వలచి వివాహమాడుట. దీనికి వజ్రనాభవధ యనెడి రాజకీయ వ్యవహారము జోడింపఁబడినది. కావున కథ పెరిగినది.

వజ్రనాభరాక్షస వధవలన గాని జరుగనేరని ప్రభావతీప్రద్యుమ్నుల వివాహమును సాధించుటకు సూరనకెన్నియో కల్పనలావశ్యకము లైనవి.

సూరన మహాకవి తన ప్రభావతీ ప్రద్యుమ్న కావ్యమునందలి ప్రథమాశ్వాసమున కథాపర్యవసానమందు కలిగెడి వజ్రనాభవధోపేత ప్రభావతీ ప్రద్యుమ్న వివాహమునకు అవసరమైన బీజమును నాటవలసివచ్చినది. కథాకల్పనయం దద్వితీయప్రతిభగల సూరన, యొక వంక వజ్రనాభవధకును, మఱియొక వంక ప్రభావతి శృంగార జీవిత పరిణామమునకును బీజములను ఈ ప్రథమాశ్వాసమున అంకురింపఁజేసినాఁడు.

ప్రథమాశ్వాసమందు కన్పించు ప్రధాన సన్నివేశములు - మాతలితోఁగూడి ఇంద్రుఁడు ద్వారకకు వచ్చుట, ఇంద్రుఁడు వజ్రనాభ దుర్జయముల శ్రీకృష్ణున కెఱింగించుట, వసుదేవయజ్ఞము, భద్రనట ధూర్తవటువుల సంభాషణము, శుచిముఖి ప్రభావతీస్వప్నానంతర వృత్తాంతమును ఇంద్రునకెఱింగించుట యను కల్పనములు. వీనివలన కవి సాధించిన ప్రయోజనము లేమియో గమనింతము.

వజ్రనాభుని వలన బహుబాధల నొంది ఇంద్రుఁడు వాని మదోద్ధతి నణచుటకు తగిన చర్య చేయింపఁదలచినవాఁడై, వాని దుశ్చరిత్రమును శ్రీకృష్ణునకు నివేదించు నుద్దేశముతో ద్వారకకు మాతలితోఁ గూడి స్వర్గము నుండి దిగివచ్చుచు ద్వారకను చూచి యాశ్చర్యమగ్నుఁడగుట, మాతలి ఇంద్రునకు ద్వారకను వర్ణించి చూపుట యనునవి ప్రథమాశ్వాసమునందలి సన్నివేశములు. వీని మూలమున కవియగు సూరన తన కథాకథనమును నాటకీయముగ నడుపుట యనెడి గుణమును సాధించినాఁడు.

సర్వసామాన్యముగ ప్రబంధములు పురవర్ణనముతో నారంభించుచుండును. సూరనయు నట్లె తన కావ్యమున ద్వారకను వర్ణించినను, ఈ నూతన మార్గముననుసరించి విశిష్టతను నిలుపుకొనినాఁడు. ఈ వర్ణనమువలన ఇంద్రుని మానసిక స్థితిని, మాతలి సంభాషణము మూలమున సేవాధర్మాది యుత్తమగుణములను సూరన వెల్లడించినాఁడు. ఇంద్రునంతటివానికిఁ దోడ్పడదగిన శ్రీకృష్ణుని యాధిక్యమును స్థాపించుట కాతని నగరము నిట్లు మహాద్భుతముగ వర్ణించినాఁడు. రెండవ కల్పనము ఇంద్రుఁడు వజ్రనాభుని దుశ్చర్యలను శ్రీకృష్ణున కెఱింగించుట. మహాకవి సూరన ఈ సన్నివేశమున నింద్రుని దైన్యస్థితిని, వజ్రనాభుని గర్వోద్ధతిని మనోజ్ఞముగ నిరూపించినాఁడు. ఇంద్రునిచే నీతఁడు చేయించిన సంభాషణము సాధుజనరక్షణకు బద్ధకంకణుఁడైన శ్రీకృష్ణునే కాదు, పఠితలనుగూడ కరిగింపఁగలిగియున్నది. ఈ సన్నివేశము మూలమున సూరన ఇంద్రోపేంద్రులను మనోజ్ఞముగ చిత్రించి తన పాత్రోన్మీలనసామర్థ్యమును వెల్లడించినాఁడు.

వసుదేవయజ్ఞము శ్రీకృష్ణుని యజ్ఞప్రియత్వమునకు, దేవతాపక్షపాతమునకు నిదర్శనమైన సన్నివేశము. యజ్ఞదూర్వహుఁడగు కృష్ణుఁడు భవిష్యత్కాలమున వజ్రనాభ రాక్షస వధాభారము నెత్తికొనుటకు పూనుకొనునని తోఁచును. ఈ యజ్ఞాంతమున జరిగిన సన్నివేశము భద్రనట దుష్టవటువుల కలహము. సూరనార్యుఁడు ఈ విచిత్ర సన్నివేశము మూలమున, అతితీక్షముగ నడిచిన పూర్వకథాసన్నివేశముల తైక్ష్యమునుండి పరితలమనసులను చతురహాస్యమువంకకు త్రిప్పినాఁడు. బ్రహ్మచారులిందు పలికిన -

సీ. "ఏము మ్రుచ్చులమె? యూహింప మ్రుచ్చుఁదనాల
           పుట్టిన యిండ్లు మీబోంట్ల కాక !
యాటవాండ్రని నమ్మి యనుమతింపఁగ నెట్టి
           పురమైన నశ్రమంబునను జొచ్చి
పగలెల్ల నాటల బ్రమయించుచును సందు
           గొందులెల్ల నెఱింగికొనుచు, రేలు
కన్నగాండ్రగుచు నగళ్ళు ప్రవేశించి
          యందు నెంతటివారలడ్డమైన


ఆ.వె. జక్కడఁచుచుఁ బేను గ్రుక్కిన పాటిగా
నిష్టమైన యర్థ మెల్లఁ బడసి
బ్రతుకుచునికి మీ స్వభావ మింతయును ద

ప్పదు యథార్థమనుచు బలుకుటయును”

(1-108)


అను వాక్యములను 'విప్రవాక్యం జనార్దన' యనుమాట యథార్థమై పరగునట్లుగా గ్రహించుట జరిగినది. ఇంద్రుని కార్యము దెస లగ్నమైన మనసుతో నున్న శ్రీకృష్ణుఁడు, భద్రనటుని నిందించుచు పలికిన ఈ వాక్యములను ఉపశ్రుతిగ గ్రహించి, నర్తక వేషముతో ప్రద్యుమ్నుని వజ్రపురమున బ్రవేశబెట్టి వజ్రనాభ వధాకార్యమును సాధింప నిశ్చయించుట, నా రాక్షసున కపజయమును, వధయును నిశ్చితము లగుచున్నవి.

ఈ సన్నివేశమువలన నివి సూరనార్యుఁడు కథ కొదవించిన పరమ ప్రయోజనములు :

ఇంద్రుఁడు గంగానదియందు విహరించు హంసలను తమకు వేగుపడవలసిన దని కోరుట, శుచిముఖి ప్రభావతీస్వప్న - స్వప్నానంతర వృత్తాంతములను ఇంద్రున కెఱిఁగించుట యనునవి తఱువాతి కల్పనలు. కృష్ణునితో సంభాషణ ముగించి వెడలునపుడు 'నీవు నుపాయాన్వేషణము గావింపుచునుండు మల్పకార్యం బదిగా దే వెఱవున దత్పురి చొరగావలయునో యెవ్వరోర్వఁగలరో వానిన్' అని పలికినాఁడు. ఇంద్రుఁడు వజ్రనాభాపాయమునకు ఉపాయమును భావించి హంసలు వేగు నడుపగలవని వానిని రప్పించుట సహజము.

వజ్రనాభవధకు మార్గము నన్వేషించుచున్న ఇంద్రునకు, వాని రాజ్యసంపద తుదకు వచ్చినట్లు హంసలు తెలుపుట మిక్కిలి ప్రయోజనకారియైన యంశము. తఱువాత శుచిముఖి ఇంద్రునితో ప్రభావతీస్వప్న - స్వప్నానంతర కథలను విన్నవించినది. స్వప్నమువలన ప్రభావతీప్రద్యుమ్నులకు గలుఁగు కుమారుఁడు రాజ్యమేలవలసియుండుటచే కొన్ని విషయములు జరిగినవి. రాక్షసవనితయైన ప్రభావతికి ప్రద్యుమ్నుఁడు భర్తయని పార్వతి శాసించుట ఇంద్రకార్యమునకు ప్రయోజనకారియైన యంశము.

చిత్రపటమును తిలకించి ముగ్ధయగు ప్రభావతి మన్మథరాగమును వెల్లడించుచు శృంగారవిలాసములను బ్రదర్శించుటచే నామె ప్రద్యుమ్నుని గాఢముగ బ్రేమించుచున్నదనియును, అంకురించిన యామె ప్రణయము పరిణమించి సత్ఫలము నొసఁగు ననియును వెల్లడి యగుచున్నది. శుచిముఖి తెలిపిన వృత్తాంతమంతయును దేవకార్యమునకు ఉపయోగకారకము. ఈ కల్పనలందు సూరన కడుసామర్థ్యముతో ముగ్ధయైన ప్రభావతిని సమ్మోహనముగ చిత్రించినాఁడు. తఱువాత నొక వంక కృష్ణాదుల రాజకార్యమును, మరొకవంక ప్రభావతీప్రద్యుమ్నుల శృంగారజీవితమును కడు సమర్థతతో నిర్వహించిన శుచిముఖి పాత్రను సూరనార్యుఁడు కడుజాగరూకతతోఁ ప్రవేశపెట్టినది మొదలుగ, తుదివఱకును నీ యాశ్వాసమున పోషించినాఁడు. తఱువాతి కథయందు కన్పించు తంత్రనిర్వహణ ప్రావీణ్యము, అనంతధీశక్తి, సంభాషణ చాతుర్యము, ఉచితజ్ఞత, పరేంగితజ్ఞానము, విషయనిరూపణ సామర్థ్యము మొదలగు శుచిముఖి గుణవిశేషములనన్నింటిని ప్రథమాశ్వాసమునందే సూరనార్యుఁడు స్థాలీపులాకన్యాయమున ప్రదర్శించినాఁడు. ఈ ప్రథమాశ్వాసపఠమువలననే శుచిముఖి సూరనార్యుని అపూర్వమైన అపరసృష్టియని ద్యోతకమగును. ఈ రీతిగ సూరనార్యుఁడు ప్రథమాశ్వాసమందలి కథాసన్నివేశముల మూలమున తఱువాతి కథకత్యావశ్యములైన ప్రయోజనములను సాధించుటయే గాక, పాత్రోన్మీలన సామర్థ్యముచే తన కథయందలి పాత్రకు విశిష్ట రూపరేఖలను కల్పించుటయు, వానికి స్వాభావికములైన మనఃప్రవృత్తులను, సంభాషణ సామర్థ్యములను కల్పించి సజీవమూర్తులనుగా నొనర్చి, మహత్తర ప్రయోజనములను సాధించినాఁడు.

ప్రభావతీప్రద్యుమ్నము - వర్ణనలు

(నవ్యత - సార్థకత)

ఆంధ్ర సాహిత్యమునందలి ప్రబంధములు, వానిలో వస్తువేదైనను ఒకే మార్గముననుసరించి నడిచినవి. సర్వసామాన్యముగ ప్రతి ప్రబంధమును పురవర్ణనముతో నారంభించి, చాతుర్వర్ణ వర్ణనము, పుష్పలావికాదివర్ణనము మొదలగు వర్ణనములతో సాగిపోయినవి. పింగళి సూరనార్యుడు ఈ పద్ధతి నచ్చకపోవుటవలన నొక నవ్యతను కనబరచవలెనని ఉద్దేశించినట్లు తోచును. స్వతంత్రబుద్ధిగల సూరన పూర్వసంప్రదాయమును పరిపూర్ణముగా విసర్జింపవలె ననెడి దృష్టి కలవాఁడు కాఁడు. ఆ సంప్రదాయమునే హృదయంగమమైన రీతిలో నిర్వహించుటకు నిశ్చయించినాఁడు. తన వర్ణనల నీ దృక్పథముతో నడిపించినాఁడు.

శిశుపాలవధను వ్రాసిన మాఘ మహాకవి తన కావ్యమును

'శ్రియఃపతిః శ్రీమతి శాసితుం జగ
జ్జగన్నివాసో వసుదేవ సద్మ ని
వసన్ దదర్శావతరంతమంబరా
స్థిరణ్యగర్భాంగభవం ముని హరిః ॥'

అని యారంభించినాఁడు. తఱువాత పాఠకుని ఇంద్రునితోఁబాటుగ నాకాశమార్గమునకుఁ గొనిపోయి అక్కడనుండి యాతనికి ఇంద్రమాతలుల ముఖమున ద్వారకానగర సౌందర్యమును చవిచూపించినాఁడు. ఇంతటి ఉన్నతస్థలము నుండి కథలోని ఒక పాత్ర వర్ణించి చూచునపుడు, పాఠకునకు విశాలములైన ప్రకృతి చిత్రములన్నియును నొకే మారు గోచరించి మనోమోదమును గూర్చును. కావ్యమందలి ఒక పాత్ర తనకు ద్వారకను వర్ణించి చెప్పుటయనెడి యానందము నతఁడనుభవించును. ఇందువలన నెంతటి దీర్ఘవర్ణనమైన విసుగును గల్పింపదు. ఈ రీతిగ సూరన ద్వారకావర్ణనమున నొక నవ్యతను జూపినాఁడు. తన ప్రబంధ ప్రారంభమునందే యొక నవ్యత నిట్లు ప్రదర్శించిన ఖ్యాతి పింగళి సూరనార్యునిదే.

ఈ ద్వారకానగర వర్ణనమున ఉత్ప్రేక్ష సందేహములనెడి యలంకారములను సూరనార్యుఁడు విరివిగ వాడియున్నాఁడు. ఈ రెండును ఆశ్చర్యములతోఁ గూడినయానందము నొసంగుటకు సమర్థములు. రాక్షసబాధ వలన మానసిక వ్యథ ననుభవించు ఇంద్రుఁడు కృష్ణునిపై బుద్ధినిడి యాశతో వచ్చుచుండగా, నాతనికి శ్రీకృష్ణుని నగరమగు ద్వారక ఇట్టియానందమును కూర్చుట యొకరీతిగ భావిఫల ప్రదర్శకముగ నున్నదని చెప్పదగును.

ఇది సూరనార్యుని వర్ణనసార్థకతకు నిదర్శనమై యొప్పుచున్నది. ఇందు కొన్ని పద్యములు (తను తరుణి తటిద్విహృతిన్, భోగపుచుట్లు కోటలుగ, అవచూడోపలదీప్తి చిత్రితములై) ఇత్యాదులు ఆంధ్రప్రబంధములందలి నగర వర్ణనములందలి పద్యములలోనెల్ల నుత్కృష్టస్థాన మాక్రమింపదగినవై యొప్పుచున్నవి.

బ్రాహ్మణవర్ణనమునందును నవ్యత గోచరించుచున్నది. ఈ వర్ణనమును భద్రునిచేఁ జేయించుట వలన, పాఠకునకు దీనిని కవియే స్వయముగ నిట్లు వర్ణించినాఁడను భావము కలుగదు. ఔచితికి భంగము లేనిరీతిగ, అవసరవర్ణనమని పాఠకునికి అనిపించునట్లు చేసిన ఈ బ్రాహ్మణవర్ణనము హాస్యరసపూరితమై పాఠకునికుత్సాహమును గల్గించుచున్నది.

నవ్యమార్గము ననుసరించి యొనర్చిన ఈ బ్రాహ్మణవటు వర్ణనము వలన బ్రహ్మచారులు "ఆటవాండ్రని నమ్మి మీ స్వభావము” అని భద్రుని యాక్షేపించుటయు, ఇంద్రకార్యము దెస వర్తిల్లు చిత్తముతో నున్న కృష్ణుఁడు తనయపేక్షకు సమాధానముగ దానిని స్వీకరించుటయును, జరిగినవి. వటువుల వాక్యముల ననుసరించియే ప్రద్యుమ్న గదసాంబులు వజ్రనాభపురిని ప్రవేశించి వాని వినాశనమునకు కారణులైనారు.

భద్రవటుని బ్రాహ్మణవర్ణన మూలముగా వటువులు అప్రయత్నముగను, అన్యాపదేశముగను వజ్రనాభవధకు బీజమును నాటినారు. ఈ ఘట్టము కావ్యమునకు ప్రాణపదము. ఇట్లు సూరనార్యుఁడు అతికౌశలముతో ప్రబంధ సంప్రదాయమును కాపాడుకొనుచు నవ్యరీతిని వర్ణనమును కావ్యబీజోత్పాదనమును చేయగలిగినాఁడు.

సరస్వతీబ్రహ్మల ప్రణయ సమయమున బ్రహ్మయొనర్చు మన్మథోపాలంభమును వర్ణించి, దాని మూలమున సూరన ప్రభావతీప్రద్యుమ్నుల సంయోగము నిశ్చితమని యుత్తరార్ధమును సూరన సూచించినాఁడు. ఇందు పుష్పలావికల వర్ణనములను కావ్య వస్తుపోషకములుగా నొప్పుచున్నవి. సూరనకు ప్రబంధకర్తలు సామాన్యముగ స్త్రీపురుషవర్ణనము లందుపయోగించు ఉపమానవస్తువుల ప్రసక్తి రుచించినట్లు కనపడదు.

'నెత్తమ్ములనుచు త్రొన్నెలలంచు వటఫల శ్రీలంచు తాబేటి చిప్పలనుచు... ఇట్టివి గదయ్య చెప్పఁబోయిన నుపమలు వీనిఁదడవ సిగ్గొదవు' అను ప్రభావతీవర్ణనమునందలి పద్యమిందుకు సాక్ష్యము.

స్త్రీల వర్ణించుటలో నుపమానవస్తువుల నన్నిటినొక చోటికి చేర్చిన నొక వికృతరూపము కలుగును. ప్రత్యేకంగవర్ణనము శరీర సౌందర్యమునకు పుష్టిని కలిగింపదు. శరీరవర్ణనములలో నుపమానములు చొప్పించుట ఈతనికి నచ్చదు. సహజ సౌందర్యమును సహజధోరణియందే ఉపమానవస్తు నిరపేక్షకముగా వర్ణించుట ఈతనికిష్టము. సౌందర్య వర్ణనమునకు చంద్ర మన్మథమలయ మారుతోపాలంభములకు ఒకటి రెండాశ్వాసములను ప్రత్యేకించుట సూరనకిష్టము కాదు. ప్రబంధవర్ణనములందు నిరసనభావమున సూరన శుచిముఖికి 'ఉపమాతిశయోక్తి కామధేనువు' అను బిరుదమును ప్రసాదించినట్లు తోఁచును.

ఇదియంతయును సూరన నవ్యతను ప్రదర్శించుచున్నది. విప్రలంబ శృంగారవర్ణనము నందును సూరకవి ఒక నూతనమును, లలితమునునైన పద్ధతి ననుసరించినాఁడు. ప్రణయ కలహమువలన నాయికానాయకులకు తాత్కాలిక వియోగమును కల్పించుట ఒక సుకుమార ప్రయోగము. ప్రణయకలహమునకు గోత్రస్థాలిత్యమును (సవతి పేరును పలుకుట) కారణముగా నీతఁడు కల్పించి కథకు నవ్యతను, పుష్టిని చేకూర్చినాఁడు.

కొన్ని వర్ణనములలో చెప్పిన యన్ని యంశములు నొక రీతిగనే యున్నట్లు స్థూలదృష్టికి గోచరించును. కాని సూక్ష్మముగ పరిశీలింపగా, వానియందు సూరనార్యుని విశిష్టత, కళాకేళి అభివ్యక్తములగును. ఇందుకు స్వర్గముపై దండెత్తివచ్చిన రాక్షసులింద్రుని పెట్టిన బాధల నాతఁడు కృష్ణునితో వర్ణించి చెప్పు సందర్భము లోని క్రింది పద్యమొక చక్కని నిదర్శనము.

సీ.
"తన కులుపా చాలదని మిట్టిపడఁగ న
నామధేయపు దైత్యునకు నడంగి
తనవిడిదికి రంభ ననుపవైతని తిట్టు
కిగ్గాడి యసురకుఁ గేలు మొగిచి
తనకుఁ బెద్దఱికంబు మును సేయవని దూఱు
నధమ రాక్షసునకు నర్చలొసంగి
తనకమృతముఁ బోసి యనుపవంచు నదల్పఁ
బినుగు రక్కసునకుఁ బ్రియము చెప్పి


తే. పంకరుహనాభ! యేఁబడ్డపాటు లరయ
నెందు నెవ్వరుఁ బడరు నీకేమి చెప్ప?
నెంత పాపంబు చేసిన జంతువొక్కొ
యింద్రుఁడగునని యపుడాత్మ నెన్నుకొంటి.”

(1-78)

ఇందు మొదటిపాదమున తిండికి, రెండవ పాదమున కామమునకు, మూడవపాదమున పెద్దఱికమునకు, నాల్గవ పాదమున దివ్యత్వమునకు రాక్షసులు క్రమముగా నాతనితో కలహము లొనర్చుట కననగును. అనగా వారు తుచ్ఛ వైషయిక భోగములు మొదలుగ దివ్యత్వము వఱకును కోరిరన్నమాట! ఇట్టి నిగూఢ కళాకేళి మహాకవుల కావ్యములందే గోచరించును.

ఈ రీతిగా ప్రబంధ నిర్మాణమునందు సూరన కొన్ని నూతన మార్గముల నాదేశించినాఁ డనుటకు ఎట్టి సందేహమును లేదు. స్వభావమునకు సాధ్యమైనంత సమీపముగా కథను నడిపించుట, వర్ణనలొనర్చుట ఈ మహాకవికిష్టము, అమానుష వర్ణనములు, సన్నివేశముల మూలమున పాఠకులకు విశ్వాసమును చేకూర్చి యానందమును కలిగించుటకు దుర్ఘటమని సూరన గ్రహించుటచేతనే, పూర్వప్రబంధ మార్గములను సంపూర్ణముగా ననుకరింపక నవ్యరీతులలో తన కావ్యమున వర్ణనల సాగించినాఁడు.

ఈ వర్ణనములందు నవ్యత సార్థకతలతోఁ బాటుగ, నీ మహాకవి భావనాబలము, భాషాపాండిత్యము, ప్రకృతి పరిజ్ఞానము మొదలగు నట్టి గుణములు వెల్లడియగుచున్నవి. ప్రథమాశ్వాసమునందు ద్వారకయందలి యగడ్తల వర్ణించుచుఁ జెప్పిన 'ఆలోల శైవాలజాలాలిత్యంబు జంగమోద్యానవేషము వహింప' ఇత్యాది వర్ణనము భావనాబలమును, వసుదేవుని యజ్ఞమును వర్ణించుచు చెప్పిన 'నిఖిల దేశాయాతనృపతి భూషాకర్షరేణు సంపోషిత క్షోణికంబు' అనునది భాషాపాండిత్యమును, 'ముగ్ధయగు ప్రభావతి ప్రియుని చిత్రమును తొలిసారిగ జూచునపుడు “చిత్తరువన్న నిశ్చయముచే నెదురుండి మొగంబు చూడ మోమెత్తును" ఇత్యాది ప్రకృతి పరిజ్ఞానమును వెల్లడించుచున్నవి. ఇందలి వర్ణనము లే మహాకవి వర్ణనములకును దీసిపోవునవి కావు.

ప్రథమాశ్వాస ప్రాముఖ్యము

ప్రబంధ కవులెవ్వరియందును కన్పట్టని కథానుసంధానశక్తి, భాషాశక్తి గల మహాకవి సూరనార్యుఁడు. ఈతఁడు తన పండబారిన వయసులో కృతిపతుల కోరికలనెడి బంధములనుండి విడివడి చెప్పిన కావ్యము ప్రభావతీప్రద్యుమ్నము.

కథావస్తువిషయమునను, కవితాసామర్థ్య నిరూపణము నందును నీ కావ్యము నందలి ప్రథమాశ్వాసము విశేషప్రాముఖ్యము వహించియున్నది.

ప్రభావతీప్రద్యుమ్న ప్రథమాశ్వాస ప్రాముఖ్య కారణములలో మొదటిది కథానుసంధాన గుణము. వజ్రనాభ రాక్షసవధ, ప్రభావతీప్రద్యుమ్నుల ప్రణయమునను రెండు కథల కడు సమర్థతతో ననుసంధించి, సూరనార్యుఁ డీ యాశ్వాసమున రెంటికిని డీ బీజములను నాటి కొంత నడిపినాఁడు. ఇంద్ర నివేదనముచే వజ్రనాభవధ యనెడి దేవకార్యమున కుద్యుక్తుఁడైన శ్రీకృష్ణునకు ధూర్త బ్రహ్మచారి వాక్యము లుపశ్రుతి యగునట్లు కల్పించి, సూరన బీజావాప మొనర్చినాఁడు. ఇంద్ర శుచిముఖీ సంభాషణమునందు ప్రభావతిచే శివ వ్రాసి యిచ్చిన చెలువుని చిత్రపటమును తిలకింపఁజేసి ఆమెయెడ ననురాగబీజావాప మొనర్చినాఁడు.

ఈ ప్రథమాశ్వాసమునకు వైశిష్ట్యమును గల్పించిన రెండవయంశము కార్యకారణ పద్ధతితో కథ చెప్పుట. వజ్రనాభ స్వర్గజైత్రయాత్ర, ప్రభావతీస్వప్నవృత్తాంతములు పూర్వము జరిగిన యంశములు. కథ జెప్పుటలో మేటియైన సూరన, సందర్భము ననుసరించి ఉచితజ్ఞుఁడై యా పూర్వ వృత్తాంతములను చెప్పవలసిన యవసరము వచ్చినపుడు చెప్పించినాఁడు. దృశ్య ప్రబంధ లక్షణములతో కథ నడుచుట ఈ ప్రథమాశ్వాస ప్రాముఖ్యమునకు మఱియొక హేతువు. మిగిలిన యాశ్వాసములందలి కథయును కొంతగా దృశ్య కావ్యమార్గమునే యనుసరించినను, నీ యాశ్వాసములో వలె నందు రూపకోచిత లక్షణములు విరివిగ కన్పట్టవు. ఇందు సూరన కథను ఒక మహానాటకకర్తవలె కొన్ని దృశ్యముల క్రింద విభజించి, ప్రతి దృశ్యమునందును పాత్రల ప్రవేశపెట్టి, వానిచే నుచిత సంభాషణములు చేయించి పాఠకులకు చదువునది యొక దృశ్యకావ్యమా యని యనిపించినాఁడు. ఈ యాశ్వాసమున దృశ్యములు ఒకదాని వెనుక నొకట వేగవేగముగా సాగిపోయినవి.

ఈ యాశ్వాసమున సూరనార్యుఁడు ప్రభావతీప్రద్యుమ్న కథయందలి ప్రధానపాత్రలైన ఇంద్ర కృష్ణ శుచిముఖి ప్రభావతీప్రద్యుమ్నుల ప్రవేశపెట్టి, ఆ యా పాత్రలతో పఠితకు పరిచయమును కలిగించినాఁడు. ఇందలి పాత్రలెల్ల విశిష్ట రూపరేఖలతోను, ఉచిత సంభాషణ వైచిత్ర్యములతోను నతిసహజములై కన్నులయెదుట నటియించునట్లు కన్పట్టును. ఇదియును ప్రథమాశ్వాసమునకు ప్రాముఖ్యమును గూర్చు నంశములలో నొకటి.

పాత్రలలో నెల్ల ప్రముఖమైనది శుచిముఖి. ఈ శుచిముఖి భారతమున శ్రీకృష్ణుఁడెంతటి పాత్రమును వహించినాఁడో, ప్రభావతీప్రద్యుమ్నమున నంతటి పాత్ర వహించినది, అట్టి పాత్రతో పాఠకులకు ఈ ప్రథమాశ్వాసమునందే పరిచయము కలిగించి దాని ధీగుణాది విశేషములతో సూరన దిగ్రమను కల్పించినాఁడు. ప్రథమాశ్వాస ప్రాముఖ్యమునకు ఇదియొక హేతువు. మానసికస్థితి నిరూపణము కూడ నీ యాశ్వాసమునకు ప్రాముఖ్యము నొడగూర్చు నంశములలో నొకటై యొప్పుచున్నది. పాత్రల మనస్సులు ఆ యా సన్నివేశములందెట్లు వర్తించునో భావించి చిత్రించుటలో సూరన తిక్కనకు బిమ్మట పేర్కొనఁదగినవాఁడు. ఇంద్రుని మనోవృత్తిని, ప్రభావతి మనోవృత్తిని ఈ యాశ్వాసమున కడు రమణీయముగఁ జిత్రించినాఁడు. ఈ యంకమునకుఁ బ్రాముఖ్యమొసఁగు నంశములలో నిది యొకటి.

ఈ అంకమునకు గొప్పదనమును గూర్చు నంశములలో వాదమునందు, నిర్మాణమందును గల నైశిత్యము (logical Exactness of arguments and structure) మఱియొక యంశము. ఇందుకు ఈ ఆశ్వాసమున ఉదాహరణమైనది శుచిముఖి ఇంద్రునితో వజ్రనాభవినాశనము సత్యమని నిరూపించుటకు చేసిన వాదము యింతి ప్రద్యుమ్నుజాయగా బలికిన గౌరి మాటకు బొంకు గలుగదనుము) మరియొక విశేషము ప్రకృత్యనుకరణ మహిమ. ప్రియుని చిత్రపటమును జూచినపుడు ప్రభావతి యెట్లు వర్తించినదో సూరన 'తన చిత్తరువన్న నిశ్చయముచే’ అను పద్యమున 'బహిఃప్రకృతికి నట్టె యెత్తిన చిత్తరువువలె' రచియించి చూపినాఁడు.

కవితావిషయికముగను నీ ప్రథమాశ్వాసమునకు విశేష ప్రాముఖ్యమున్నది. ఇందలి వర్ణనములు సమయోచితములు, సరసములు, సకారణములునై యొప్పుచున్నవి.

వీనియందలి నవ్యత, ప్రబంధజాతి వర్ణనములకును, వీనికిని గల విభేదములు నీ యాశ్వాసమునకు విశిష్టతను గలిగించుచున్నవి. భాషావిషయకముగను నీ యాశ్వాసమున కొక ప్రత్యేకత యున్నది. ఇందలి పాత్రలు అనేకములైన యంతరములలోనివారు. వారివారికి తగిన పాత్రోచితభాషను సూరన ఇందు వాడినాఁడు. ఎందును శబ్దసంస్కారము జారినట్లు కన్పడదు. పదమైత్రి అర్థసంపదలతో పొదలుచున్నది. అక్లిష్టత దీపితమగుచున్నది. వాక్యములు మహాకావ్య తాత్పర్యమున కొనరఁ బలికింపఁబడినవి.

ఇందు కొన్ని చక్కని నానుడులు, జాతీయములు, తెలుగు పలుకుబడులు కన్పట్టును. - అపోతర మేమి చెప్పననుఁ బూరికిఁ గైకొనక, మెఱియలవంటి రక్కసులు; పులి నోరికండ విడివడ్డ గతిన్; తలనిండగ నర్థము పోసితేని; ఓడలు బండ్లవచ్చు; పేనుగ్రుక్కిన పాటిగా; పోతుటీగకున్ పొలయగరాని చోట; చిచ్చులేక చిముడు మచ్చురీడు - ఈ యాశ్వాసమునకు విశిష్టత చేకూర్చిన యంశములలో నొకటి. ఇట్టి గుణవిశేషములతో నీ ప్రభావతీప్రద్యుమ్నమునందలి ప్రథమాశ్వాసము మిగిలిన వానికంటె విశిష్టమైనదై, 'తెలుగు భారతి'కి కొత్త పోకడలదిద్ది, యుగకర్తలైనవారిలో నొక స్థానమును సంపాదించిన సూరనార్యుని కళాప్రతిభయను సువర్ణమునందలి మచ్చుతునకయై యొప్పుచున్నది.

ప్రభావతీప్రద్యుమ్నము - దృశ్యప్రబంధ లక్షణములు

కవిబ్రహ్మ తిక్కన సోమయాజి భారతమున ననేక ఘట్టములను నాటకోచితరీతిలో నడిపినాఁడు. అతనికి పరోక్షశిష్యుఁడైన పింగళి సూరనకు నీ నాటకరీతిపై అభిమానము విశేషము. కాని ఈతఁడు తన కళాపూర్ణోదయకావ్యమున నీ నాటకోచితరీతికి విశేష ప్రాముఖ్యము నీయలేదు. ప్రభావతీప్రద్యుమ్నమున నీ కవితారీతిని మేటిగ ప్రదర్శించినాఁడు. విమర్శకులును నీ యభిప్రాయముతో పూర్తిగ నేకీభవించుచున్నారు. ప్రభావతీప్రద్యుమ్న పీఠికాకర్త ఈ యంశమును గూర్చి ఇట్లు వ్రాసిరి.

“ఈతఁడు (పింగళి సూరన) రాఘవపాండవీయము వ్రాసి తన పాండిత్యప్రకర్షను గనుపరచినాఁడు. కళాపూర్ణోదయమును వ్రాసి తన కల్పనాచాతుర్యమును కథాచమత్కారమును వెలయఁజేసినాఁడు. రెండింటియందును గూడ దృశ్య ప్రబంధము నందుండదగిన లక్షణములు విశేషముగ లేవు. అట్టి కొఱఁత బాపఁదలంచి ఈ శ్రవ్య ప్రబంధముననె దృశ్యప్రబంధ లక్షణము లన్నియుఁ బుట్టించి నాటక పాత్రములన్నియు నెదుటకు వచ్చి నటించినట్టు లీ గ్రంథమును రచించినాఁడు. ఈ ప్రభావతీ ప్రద్యుమ్నమున విశేషభాగము సంభాషణ వైచిత్ర్యమే. ఆ పట్టులు మనము శ్రద్ధతోఁ బరిశీలించి చదివితిమేని, దృశ్యప్రబంధ లక్షణములెంతవఱ కిందిమిడి యున్నవో తేటతెల్లముగాఁ గలదు. ఇందీతఁడు నెలకొల్పిన రంగస్థలముల జాగరూకతతో విడదీసి మధ్యమధ్య సందర్భములను విష్కంభరూపమున నమర్చుకొని కొలది మార్పులు గావించుకొనినచో, నిది యొక చక్కని నాటకమగును.” (శ్రీ తల్లాప్రగడ)

పింగళి సూరనార్యుని గూర్చి ఆంగ్లభాషలో విమర్శ గ్రంథమును వ్రాసిన శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుగారును ప్రభావతీప్రద్యుమ్నమునందు దృశ్యలక్షణములున్నవని భావించినారు. 4

శ్రీ టేకుమళ్ళవారు చెప్పినట్లు ప్రబంధములందు దృశ్యకావ్య లక్షణములను బ్రవేశపెట్టిన మహనీయుఁడు పింగళి సూరన.

ఈ దృశ్యకావ్య లక్షణములేమో ఈతని ప్రభావతీప్రద్యుమ్నము ప్రథమాశ్వాసమును తిలకించి పరిశీలింతుము. నాటకములందెట్లు పాత్రల సంభాషణ మూలమున పూర్వము జరిగిపోయిన కథ వెల్లడియగునో, యిందును నట్లే ఇంద్రోపేంద్రుల సంభాషణము మూలమున వజ్రనాభ దుర్జయములు, ఇంద్ర శుచిముఖి సంభాషణము మూలమున ప్రభావతీ స్వప్న - స్వప్నానంతర సన్నివేశములు తెలియవచ్చుచున్నవి.

ఈ ప్రథమాశ్వాసమంతయును కొన్ని రంగములవలె కన్పట్టును. ఇందు తొలుత కన్పించు 'ధాత్రి మహాదేవి... వెఱగుపడగ' అన్న పద్యము సూత్రధారవాక్యముగ స్వీకరింపఁదగియున్నది. పిమ్మట మాతలి ఇంద్రునకు ద్వారకానగరమును వర్ణించి చూపు దృశ్యము సహజ మనోజ్ఞమై యొక స్వగతము (Monologue) వలె నున్నది. ఇందు ఇంద్రుఁడు కేవలము వినువాఁడు. ఆంగ్ల భాషలోని బ్రౌనింగ్ మహాకవి వ్రాసిన నాటకీయ స్వగతములు (Dramatic Monologues) ఇదే రీతిగ నడుచును. పిమ్మట రంగస్థలము ద్వారక. ఇంద్రుఁడు తన నిర్వేదమును శ్రీకృష్ణున కెఱిగించును. ఇదియొక దీర్ఘ సంభాషణము. ఇంద్రుని సంభాషణానంతరము శ్రీకృష్ణుఁడు సంభాషించును. ఇట కృష్ణుఁడు తన సంభాషణ మారంభించుటకు పూర్వము ఇంద్రుఁడు “నిన్నే కొల్చియుండెద” అని చెప్పిన మాట వినిన వెంటనే 'కర్ణంబులు మూసికొని’ నట్లు సూరన చెప్పినాఁడు. ఇది రంగసూచిక (Stage Direction) వలె నున్నది.

తఱువాతిరంగము బ్రహ్మచారి, భద్రనటవృత్తాంతము. ఇది యంకమున నొక చిన్న హాస్యదృశ్యమువలె నొప్పుచున్నది. తరువాతి దృశ్యము స్వర్గమునందు. ఇంద్రుఁడు తొలుత హంసలతో సంభాషించును. శుచిముఖి వల్లభునితో నతడు సంభాషించుచుండ, నతఁడు తన భార్యయైన శుచిముఖిని ప్రవేశపెట్టి తప్పుకొనినాఁడు. శుచిముఖి ఇంద్రునితో దీర్ఘపన్యాస మిచ్చినది.

ఈ ఆశ్వాసమునందలి దృశ్యములలోని సంభాషణములను పరిశీలింపగా శైలి నాటకీయము వాక్యరచనాదులు నాటకోచితములు. కాని సంభాషణము నాటకములందువలె వెంట వెంటనే పాత్రనుండి పాత్రకు మారుట గోచరింపదు. ఇందలి సంభాషణమును స్వల్పమగు మార్పులొనర్చి రంగస్థలమున బ్రదర్శించుట కవకాశమున్నదా యను ప్రశ్నకు లేదనియే సమాధానము చెప్పవచ్చును. కావున మనము సూరనార్యుని దృశ్య ప్రబంధ లక్షణములు కేవలము సంభాషణ యందలి వాక్యగమనమునకు, రంగస్థల విభాగములకు కొన్ని రంగసూచికలకు మాత్రమే పరిమితముగాని కొలది మార్పులతో రంగస్థలమున బ్రవేశపెట్టుటకు యోగ్యములైనవని భావింపరాదు. అనగా చదువునపుడు కావ్యమున దృశ్యప్రబంధములందువలె పాత్రలు కంటి యెదుట కన్పట్టి సంభాషణాదుల నెఱపుటయేగాని, సూరన రచనను ఉన్నదున్నట్లుగాగాని, కొలది మార్పులతో గాని రంగస్థలమున నభినయింపనగునని కాదు.

సూరన స్థానము

పాత్రపోషణము

స్వీకరించిన కథలోని పాత్రలను భావనాబలముచే దర్శించి, వానికి తగిన రూపరేఖల కల్పించుకొని, వానిచే నుచితరీతిని అంతరములకు, మనోవృత్తులకు అనుగుణముగ నాయా సన్నివేశముల సంభాషణచేష్టాదికములను జేయించుచు, నా పాత్రలను సజీవమూర్తులునుగా నొనర్పజాలిన శక్తి అపురూపమైనది. అది కొందఱు మహాకవులకు మాత్రమే కరతలామలకమైన కమనీయ విద్య. అట్టి మహాకవులలో ఆంధ్ర సాహిత్యమున ప్రథమస్థాన మలంకరించి రసికలోకముల జోహారులందుకొనజాలిన మేటి కవీశ్వరుఁడు కవిబ్రహ్మ తిక్కన సోమయాజి. సూరనార్యునిది ద్వితీయ స్థానము. ఈ మహాకవి పాత్రలును భారతమునందలి పాత్రలవలె నాయా సన్నివేశములందు సమయోచితరూప భాషాచేష్టాదికములతో వర్తించి పాఠకులకు మనోమోద మొడగూర్చుచున్నవి.

ఆంధ్రసాహిత్యమున తిక్కన భారతమునందలి పాత్రల దూరముగా నుంచిన పిమ్మట, అల్లసానినాని ప్రవర వరూథినులు, తిమ్మనార్యుని సత్య, పింగళి సూర్యనార్యుని కళాపూర్ణోదయములోని కలభాషిణి, సుగాత్రీశాలీనులు నిట్టి జీవమయమూర్తులు.

ప్రభావతీప్రద్యుమ్నమునందును పింగళి సూరన తన లేఖనీసామర్థ్యము మెఱయగా సజీవమూర్తులఁ గొన్నింటి చిత్రించినాఁడు. అట్టివానిలో ప్రథమాశ్వాసమున విశేష ప్రాముఖ్యమును గైకొనినవి ఇంద్ర శుచిముఖీ ప్రభావతుల పాత్రలు.

ఇంద్రుఁడు

సూరనార్యుఁడు ఇంద్రుని, యాతని గురువైన బృహస్పతిచే సుశిక్షితుఁడైన రాజనీతిజ్ఞునిగను, సమయాసమయజ్ఞునిగను, సంభాషణచతురునిగను, పరేంగితజ్ఞునిగాను, కార్యదక్షునిగను చిత్రించి, యా పాత్రపై పాఠకులకు ఆదర గౌరవములు కలుగునట్లొనర్చినాఁడు.

వజ్రనాభ రాక్షసుఁడు స్వర్గముపై దండెత్తి వచ్చి యల్లకల్లోలమొనర్చి, యెట్లో ఇంద్రుని నీతినిపుణత కారణముగ కొంతకాలము స్వర్గాధికారమును స్వీకరించుట కోర్చియుందునని తిరిగి వజ్రపురమునకేగగా, మఱల నాతఁడెపుడు పై బడునో యను భయముచే రాక్షసాపాయమునకుఁ దగిన ప్రతిచర్య నొనర్చు నుద్దేశముతో ద్వారకకు వచ్చుటతో, నింద్రుఁడు కథలో ప్రవేశించినాఁడు. వజ్రనాభపీడవలన వ్యథితమైనయాతని మనసునకు ద్వారకానగర సౌందర్యమాహ్లాదమును గూర్చుటయే గాక, అబ్బురమును గల్గించినది.

ఇతఁడు తన రథసారథియైన మాతలితో నాయా వస్తువులను సందర్శించుచు సమయోచిత సంభాషణ లొనర్చి, మనసునకు గొంత సంతోషమును జేకూర్చుకొనినాఁడు. ద్వారకానగర మెట్లు తన కాశ్చర్య మొనగూర్చి యానందమును కల్పించినదో, యట్లే తానేగుచున్న పనికిని శ్రీకృష్ణుని యంగీకార సహకారములు లభించి శుభము ప్రాప్తించునను నాశ యతనికి ద్యోతకమైయుండును.

ఇంద్రుఁడు త్రిలోకాధిపతి. సర్వైశ్వర్యసంపన్నుఁడు. మహాభోగి, రసికుఁడు. వజ్రనాభుఁడు తన సైన్యములను నందనవనములో విడియించినపుడు, వా రావనమున కొనర్చిన కష్టపుపాటును జూచి అతని రసిక హృదయము పరితపించిపోయినది. ఈ రాక్షస దండయాత్రాకాలమున ముల్లోకములను శాసించు నీ ప్రభువతంసుఁడు ఎంతగనో మానసిక బాధ నొందినాఁడు. శ్రీకృష్ణునకు నాఁటి తన మానసిక స్థితిని నివేదించుచు రాక్షసులు తిండికి, కామమునకు, పెద్దఱికమునకు, దివ్యత్వమునకు తనతో తగాదా పడినపుడు,

తే. "పంకరుహనాభ! యేఁబడ్డ పాటులరయ
నెందు నెవ్వరుఁ బడరు నీకేమి చెప్ప?
'నెంత పాపంబు చేసిన జంతువొక్కొ
యింద్రుఁ డగు' నని యపుడాత్మ నెన్నుకొంటి.”

(1-78)

అని తెలిపినాఁడు. ఈ సందర్భమున ఇంద్రుఁడు దయనీయుఁడై శ్రీకృష్ణుని హృదయము నాకర్షింపగలిగి యొప్పుచున్నాఁడు.

ఇంద్రుఁడు పరేంగితజ్ఞుఁడు. తామసప్రవృత్తి గల వజ్రనాభుని హృదయము నాతఁడు గ్రహించినాఁడు. ఆ చండ దానవునితో నెట్లు పలికిన నాతని మనసున కెక్కునో గ్రహించినాఁడు. గురుభక్తితత్పరుఁడును, నీతిశాస్త్రనిపుణుఁడును, బృహస్పతిచే శిక్షితమైన వాగ్వైచిత్రి గల యీతఁడు ఆ రాక్షసునితో -

తే. "అక్క సెలియండ్ర సంతానమైన యట్టి
మనకు మనలోన నింత దుర్మత్సరంబు
వలదు మా పల్కు నీవు నీ పల్కు మేముఁ
జేసి బ్రతుకుట మేలు...”

(1-76)

అని సోదరభావమును నటియించి వానిని 'శాంతసంరంభుని' గావించినాఁడు.

రెండవ మారు మఱల నుద్ధతుఁడై వాఁడు తన యగ్రసింహాసనము నాక్రమింపగా, శాంతమును నటించి

ఆ.వె. "నిగ్రహముల కేమి నీవును మేము న
న్యోన్యమైత్రిఁ బొదలునట్టి తెఱఁగు
నడపవలయుఁగాక యడసి పోనాడుకోఁ
దడవె వేగిరింపఁ దగునె యనఘ?"

(1-89)

అని పలికి, వానిని కశ్యపునొద్దకు గొనిపోయి తగిన మాటలు జెప్పించి పంపి, బయట బడినాఁడు. పెనుచేటు తప్పినదని తాత్కాలికముగ నెంత సంతసించినను నాతనికి వజ్రనాభరాక్షసభయము వదలలేదు.

ఇంద్రుఁడు సంభాషణచతురుఁడు. తనకంటె నధికుఁడును లీలామానుష విగ్రహుఁడును నైన శ్రీకృష్ణునితో నీతఁడు సంభాషించునపుడు తన వాక్చాతుర్యమును ప్రదర్శించినాఁడు. తొలుత నాతఁడు కుశల మడిగినపుడు 'అఖిలవిదుఁడవు నీ వెఱుఁగని యదియుఁ గలదె' యని కృష్ణునిపై తన గౌరవమును ప్రదర్శించి, వజ్రనాభ వృత్తాంతమును దెలిపి పిమ్మట-

ఉ. “వారిజనేత్ర! యేనిపుడు వచ్చుచునుండి యలౌకికాద్భుత
శ్రీరుచిర త్వదీయ నగరీగరి మాతిశయావలోక లీ
లారసదూర ధూత సకల వ్యథచిత్తుఁడనై యథాపురా
కారత నీకుఁ దోచెదనో కాని తనుద్యుతిఁ బాసితిం జుమీ!”

(1-79)

అని పలికి, శ్రీకృష్ణహృదయమును తనపై కరుణకు నిలయమును గావించుకొనినాఁడు. వజ్రనాభుఁడు తన యగ్రమహాసనము బలిమిమై నాక్రమించిన వృత్తాంతమును దెలుపుచు, వాఁడు మఱల నెపుడు దండెత్తునో యని పలికి శ్రీకృష్ణునితో నాతఁడు 'సురపట్టణ రాజ్యసుఖాశ యేర్పడ న్విడిచితి నింక తలనిండగ నర్థము నోసితేని నేనడుగటు పెట్టగా వెఱతు నచ్యుత నిన్నునె కొల్చియుండెదన్" అనినాఁడు.

ఇందు ఇంద్రుని సమయోచిత సంభాషణము పరాకాష్ఠ నందుకొని కన్పించుచున్నది. ఇక కృష్ణుఁడు ఇంద్రునుపలాలించి సాయమొనర్తునని ప్రతిన యొనర్చుకుండు టెట్లు?

హంసలతో నింద్రుఁ డొనర్చిన సంభాషణము కూడ నాతని సముచిత సంభాషణ ప్రావీణ్యమును వెల్లడించుచున్నది. ఆ హంసలతో నతఁడు కార్యతత్పరబుద్ధియై సంభాషించినాఁడు. అతని సంభాషణమున పని చేయించుకొను నేర్పు విశేషముగా గోచరించుచున్నది. ఇట ఇంద్రుఁడు 'మీ విహారములారయ నేరికి నతి ప్రియంబులు కానే' అని పలికి, వాని ప్రత్యేకతను గమనించినవానివలె కన్పట్టి, వానికుత్సాహము గల్పించినాఁడు. ఇట్టి ప్రభువునకు హంసలు తోడ్పడకుండుటెట్లు? ఈ రీతిగ సూరనార్యుఁడు ఇంద్రుని మనోజ్ఞముగ చిత్రించి తాఁ దలపెట్టిన వజ్రనాభ వధయనెడి కృత్యమును తప్పక నెఱవేర్చుకొనగల సమర్థునిగ ప్రథమాశ్వాసమున ప్రదర్శించినాఁడు.

శుచిముఖి

ప్రభావతీప్రద్యుమ్నమునందలి పాత్రములకన్నింటికిని నాయకమణి శుచిముఖి. ఈ పాత్రమును సూరనార్యుఁడు భారతమునందలి శ్రీకృష్ణపాత్రముతోఁ దుల్యముగ చిత్రించినాఁడు. ఈ పాత్రము యొక్క గుణాగుణములను విమర్శించితిమేని కవి యొక్క అపార శాస్త్రసాంగత్యము, పాండితీ విలసనము, రాజకీయకార్య గౌరంధర్యము, సమయోచిత సంభాషణవిశేషము, కార్య సంధానవిధానతత్పరత, స్వామిభక్తి, వినయ విధేయతలు మొదలగు సల్లక్షణములు గోచరించును. దీనికి సర్వవిషయమున నాకళింపు విశేషము.

శుచిముఖి ధీశక్తి యనంతమైనది. మంత్రికుండవలసిన లక్షణములన్నియు దీనికడనున్నవి. దీని సమయజ్ఞత, సముచిత సంభాషణరీతులు, సద్యఃస్ఫూర్తి, ఆశ్చర్యజనకములు. బృహస్పతికిఁ దోచని విజయోపాయములు శుచిముఖికి స్ఫురించినవి.

ఇంద్రోపేంద్రులు మార్గమును మాత్రమే సూచించిరి గాని, కార్యము జరుగు నుపాయముల నన్నింటిని శుచిముఖియే యూహించినది. దాని చతురతా విశేషములు వర్ణనాతీతములు. ఇట్టి పాత్ర సూరనార్యుని పునఃసృష్టి మూలముననున్నది. ఇట్టి గుణవిశేషములతో నొప్పునిది రాజహంస కాదు; కేవలమొక పక్షి. సూరనార్యుఁడు శుచిముఖిని మహత్తర ప్రజ్ఞామూర్తిగ సృజించి పాత్రోన్మీలనము మూలమున తన కీర్తిని చిరస్థాయి యొనర్చుకొనినాఁడు.

ఒక పాశ్చాత్య విమర్శకురాలు స్త్రీ పాత్రలను ప్రేమమూర్తులు (Characters of Love), ప్రజ్ఞామూర్తులు అని రెండు రీతుల విభజించినది. ఈ దృష్టితో పరిశీలించిన శుచిముఖి ప్రజ్ఞామూర్తి (శ్రీ పింగళి). ఈ శుచిముఖి పాత్రమునందు స్తుతియోగ్యములైన విషయములను, తన సృష్టి తనకే మోహము కలిగెనేమో, మహాకవి సూరనయే ఇట్లు తెలిపినాఁడు.

చ. "శుచిముఖి యండ్రు దానిని; వచోనిపుణత్వమునందు, సత్కథా
రచనలయందు, నీతి విదురత్వమునందు, బహుశ్రవావలో
కచణతయందు, నెందు సరిగానము దానికి; వేయు నేల దా
నిచతురతావిశేషములు నీవ కనన్వలయున్ మహాత్మకా!”

(4-57)

వజ్రపురి విశేషములెట్లు తెలియగలవా యని యోజించుచు, హంసలు చారవృత్తికి యోగ్యమైనవని గమనించి, వానిని పిలిపించి యింద్రుఁడు ప్రసంగించుచుండగా శుచిముఖి కథలో ప్రవేశించినది. శుచిముఖి తానై ప్రవేశించలేదు.

'వేడుకొనక నే పనికిని నియ్యకొను' స్వభావ మీ రాజహంసికి లేదు. భర్తయే అది తనకు తెలిపిన వజ్రనాభుని రాజ్యావసానసామీప్యమును ఇంద్రునికి నివేదింపుమనఁగా, కథలో ప్రవేశించినది. తన్ను ప్రవేశపెట్టి వార్తలఁ జెప్పుమని కోరిన భర్త కార్య మా త్రిలోకాధిపతి ఇంద్రునిది.

కావున శుచిముఖి తన ప్రజ్ఞావిశేషములను బ్రదర్శించుకొనుటకుఁ జక్కని యవకాశము లభించినది. సంభాషణ నారంభించినది మొదలు తన వాణీరామణీయకమును, కార్య కామనీయకమును జోడించి ప్రసంగించినది. శుచిముఖి కుశాగ్రబుద్ధి, తన సంచారమును గూర్చి ఇంద్రునికి సందేహము కలుగవచ్చునని ముందే యూహించినది. రాజనీతిజ్ఞత మెఱయఁగా "మేము విపక్షులము గాము పక్షులము. కావున మా రాక్షసదేశమందలి సంచారములు చెల్లును” అని సమర్థించుచు పలికినది. అయినను ఇంద్రునకు నమ్మకము పుట్టునో లేదో యని, జాలి కలుగునట్లు తాము వజ్రనాభుఁడు సర్వనలిన జాతులను అతని కేళీదీర్ఘకలందు నాటించుటచే మేతకై పోవలసివచ్చినదని చెప్పినది. ఈ రీతిగ తన స్థితిని తాను సమర్థించుకొని, పిమ్మట శుచిముఖి ఇంద్రునకు ప్రభావతీస్వప్నకథ చెప్ప నారంభించినది.

శుచిముఖి కథాకథనమున మేటి. కథ చెప్పు నేర్పు నెవరైన దానికడ నేర్చుకొనవలయును, ఏది యెంతవరకవసరమో యంతవరకే యది చెప్పును. ఇంద్రునకు స్వప్నకథను తెలుపునపుడు శుచిముఖి తా జెప్పుచున్న కథ ఇంద్ర కార్యోపయోగియని గమనించినది. దాని బుద్ధి చొరని చోటు లేకపోవుటయే ఇందుకు కారణము. స్త్రీని గదాయని రాజకీయములతో నాకేల యని దూరముగ నుండలేదు. ఇంద్రుఁడు వజ్రనాభుని శిక్షించుటకై యత్నములొనర్చుచున్న సంగతిని గమనించినదగుటచేతనే, ప్రభావతికి పార్వతి కలలో వచ్చి చిత్రపటమిచ్చి పలికిన వాక్యములతో గూడ వెనువెంటనే సంగ్రహముగా తెలిపి, తాను వజ్రనాభుని కాలము చేరువైనట్లు నిశ్చయించితి నని పలికినది. తఱువాత దానిని వివరించి తనయూహ నిశ్చయమని, సందేహమునకు తావులేదని నిరూపించుటకు పలికిన -

సీ. “ఆ యింతి బ్రద్యుమ్ను జాయగాఁ బలికిన
గౌరి మాటకు బొంకు గలుగదనుము
దనుజవిరోధి పుత్రునకు నా దుష్ట దై
త్యుఁడు తనంతఁదనూజ నొసఁగఁడనుము,
ప్రద్యుమ్నుఁడట్లు ప్రభావతీ పతియైన
దానవునకుఁ బోరు తప్పదనుము,
వజ్రపురము ప్రభావతి కొడుకేలుట
యసురకు జయమైనఁ బొసఁగదనుము,


తే. చిత్రఫలకంబు ప్రత్యక్ష సిద్ధమగుటఁ
జేసి, యా కల యధిక విశ్వాస యోగ్య,
మదియు నేకువ కావున నచిరభావి
ఫలము దేవేంద్ర! నీవెంచి దెలిసికొనుము.”

(1-128)


అను వాక్యముల వలన శుచిముఖి బుద్దిబలము, విషయ నిబర్హణశక్తి, తార్కిక ప్రతిభ, భావనాబలము వెల్లడియగుచున్నవి.

ప్రయోజనకారియైన యొక వృత్తాంతము నితరులకు తెలుపునపుడందలి వ్యక్తుల సంభాషణలు యథాతథముగను చెప్పుట యవసరము. వారి యభినయ విశేషములను గూడ కడు జాగరూకతతో తెలియపరచవలయును. శుచిముఖి యీ రహస్యమును గుర్తించినదగుట వలననే ప్రభావతికిని, చెలికత్తెకును జరిగిన సంభాషణమును యథాతథముగ చెప్పినది.

చిత్తరువును చూచునపుడు వారిరువురి చేష్టలను - ప్రధానముగ ప్రభావతి చేష్టలను, మనోజ్ఞముగ కన్నుల కట్టునట్లు వర్ణించినది. ఇట్లొనర్చుటలో నుద్దేశము ప్రభావతి ప్రద్యుమ్నుని యెడ గాఢచిత్తయైనయది యనియును, నామెకు చెలికత్తె ప్రద్యుమ్నుని గొనివచ్చుటకు, వజ్రనాభుని వలని బాధలకైన వెఱువక, తోడ్పడుననియు నింద్రునకు సూచించుటయే.

ఈ యంశమును తుదకు స్పష్టముగను తెలియజేసినది. 'ప్రద్యుమ్ను శీఘ్రయానంబునకు నుద్యోగంబు తద్దయుఁ జేయుట సంభావితంబు' అనియును, 'ఇది దేవకార్యంబునకు నుపకారంబును వోలెఁ దోచుచున్నది' అనియును పలికినది.

ఇంతటి బుద్ధికుశలత, వచన రచనావిచక్షణత్వము, విషయ పరిజ్ఞానములతో శుచిముఖి యింద్రునితో సంభాషింప నతఁడు మెచ్చుకొనకయుండుటెట్లు? శుచిముఖి నాతఁడు 'నీవు విహంగయోషవు కావు. నీ సంభాషణమందలి భాషాప్రావీణ్యము చూడఁగా వాగ్దేవతవో లేక నాకె దిద్దిన కవివో' యని ప్రశ్నించినాఁడు.

శుచిముఖి సంభాషణము నందలి శబ్దసంస్కారమును పదమైత్రిని అక్లిష్టతను; పునరుక్తి దోషరహితతను ప్రకృతార్ధభావమును పాదుకొనునట్లు పలుకుటయు, ఉపపత్తిని అత్యూర్జితముగ వాడకుండుటయు, పూర్వోత్తర విరోధములు లేకుండ పలుకుటయు మొదలగు గుణములను ప్రశంసించినాఁడు. ఈ శుచిముఖి ఇంద్రునకు ప్రథమాశ్వాసమున తన కార్యసాధనమున కొక యాశాజ్యోతియై కన్పట్టినది. శుచిముఖి కథారంగమున ప్రవేశించినది. ఇంద్రోపేంద్రు లిరువురును ప్రక్కకు ఒత్తిగిలిరి.

ప్రభావతి

ప్రభావతీప్రద్యుమ్నము నందు శుచిముఖి అద్భుతమును ప్రదర్శించు స్త్రీ పాత్ర అయినచో ప్రభావతి సరసమైన పాత్ర. ఈమె సహజ సౌందర్య సౌకుమార్యాది సద్గుణములు మూర్తీభవించిన కన్య, ఈమె పాత్రను చిత్రించుటయందు కవి తన సామర్థ్యము నణుమాత్రమైన సడలింపలేదు. ప్రభావతి సూరన చిత్రించిన ప్రేమమూర్తి (Character of Love).

నేటి విమర్శకులలో నొక తెగవారు ఈ ప్రభావతిపాత్రమును విమర్శించిరి. శ్రీ కట్టమంచివారి 'కవిత్వ తత్త్వ విచారమున' నొకచోట 'ఇంక ప్రభావతియన్ననో నాకు జూడ నెంతయు నసహ్యురాలు' (పు. 103) అని వ్రాసియున్నారు. వీరికి పాశ్చాత్యనాయికలపై నభిమానము మెండు. పాశ్చాత్యసాహిత్యమున సర్వసామాన్యముగ గోచరించు స్త్రీ పాత్రల బోలిన కళాపూర్ణోదయమునందలి కలభాషిణిపై వీరికభిమానము విశేషము. ప్రభావతి పట్ల వీరొనర్చిన విమర్శనము విశేషముగ పాటింపదగినది గాదు. ప్రభావతి యందు భారతీయ స్త్రీజాతి సుగుణములన్నియు వ్యక్తములగుచున్నవి.

ప్రభావతి దానవరాజపుత్రి. తండ్రి యామెను 'ఒక పోతుటీగ యైన పొలయగ రాని యంతఃపురమున' పెంచినాఁడు. అయినను నతఁడు సామాన్యదానవుఁడు కాఁడు. జైత్రయాత్ర వెడలి తన సైన్యముల నందనవనమునందు విడియించిన సమయోచితమగు సైనిక కర్కశత్వ మాతని యందు గోచరించినను, నతఁడు సమస్త సరోవరములందలి యుత్తమ నన జాతుల నెల్లనేర్చి తన కేళీదీర్ఘకల నలంకరించుకొనిన రసికుఁడు. అట్టివాని పుత్రికయగు నీమెకును సౌందర్యాభిమానము సహజగుణమై యెప్పియున్నది.

ప్రభావతి పార్వతివరమునఁ బుట్టినది. ఆమె యొక నోముల పంటగా భావింపఁబడినది. భక్తితాత్పర్యములతో పార్వతి నీమె కొలుచుటచే నా యగజ ఈమెపై నభిమానముగొని యనుగ్రహించి, రూపసౌందర్యాధికముల తుల్యుఁడగు ప్రియుని నిర్ణయించి చిత్రఫలకమున వ్రాసి యిచ్చినది. ఇంక నామె యదృష్టవతి యని చెప్పవలసిన పని లేదు.

ప్రభావతి పసిబిడ్డలవంటి తత్త్వముగలది. సహజోద్వేగము ఆమె లక్షణము. శివ వ్రాసి ఇచ్చిన చిత్రఫలకము నందలి ప్రియుని చూచిన తత్క్షణమే ముగ్ధయై యాతనికి తన హృదయము నిచ్చినది. అందలి మూర్తి యెవరో, యే జాతివాఁడో, తన తండ్రికి శత్రుమిత్ర వంశములలో దేనికి చెందినవాఁడో నిలకడగా నాలోచించి తన హృదయమియ్యవలె ననెడు బుద్ధి యామెకు కలుగనే లేదు. తండ్రికి జెప్పక నీతని ప్రేమించిన చిచ్చులేక చిముడు మచ్చరీఁడగు తండ్రి యేమొనర్చునో యన్న భయము గూడ నామెకు కలుగలేదు. ప్రణయము భయ వంశ గౌరవాదులకు అతీతమైనది కదా!

ప్రియుని చిత్రపటమును తొలుత అభిముఖియై ప్రభావతి చూడలేకపోయినది. ఇందులకు ఆమె సహజ ముగ్ధత్వము కారణము. కలకల నవ్వినట్లుగను, తెలికన్నుల నిక్కముగ చూచినట్లును, పలుకుటకు పూనుకొనినట్లును, భావగంభీరత లబ్బినట్లును, శివ వ్రాసి ఇచ్చిన చిత్రపటమందలి ప్రియుని, ఆశ్చర్యతర రూపలావణ్య గాంభీర్య శౌర్యాది గుణములచే నతిశయించు యువకుని ప్రథమదర్శనవేళనే చూచుటకు ఆమెకు పాశ్చాత్య సాహిత్యమందలి నాయికలకు వలె బహుపురుష పూర్వపరిచయము లేదు. ప్రియుని అపురూపసౌందర్య మామె నాకర్షించినది. ఈమెపట్ల 'కన్యా వరయతే రూపం' అన్న ఆర్యోక్తి సార్థకమైనది. ప్రభావతికి ప్రద్యుమ్నునిపై నభిమానము కలిగినది. ఆమెయును సుందరియే. తొలుత నామెకును తన సౌందర్యముపై గాఢాభిమానగర్వ ముండియుండెను. భర్తృసౌందర్య మామెనాకర్షించిన పిమ్మట నది తొలగియుండును. కావుననే 'ఇచ్చెలువంబు గల్గు ఘనుఁ డెక్కడనే నొకఁడుండెనేని నేఁ దచ్చరణ ద్వయంబునకు దాస్య మొనర్పఁగ నైన నర్హనే' అని సఖితో బల్కినది. తన అనురాగము నిల్చినచోటున నామె సౌందర్యాభిమానగర్వములు తొలగిన వన్నమాట! ఇంత విస్పష్టముగ తన యనురాగమును చెలికత్తెయగు రాగవల్లరికి వ్యక్తము చేయగా, నా ప్రణయసఖి యామెను కాదనుటెట్లు? ఆమె ప్రియుని తప్పక కొనితెచ్చుటకు తగిన యుద్యోగమొనర్చును గదా!

ఈ రీతిగ ప్రథమాశ్వాసమందు ప్రభావతి కోమలహృదయగను, నవానురాగయైన ముగ్ధగను, ప్రణయోద్వేగగను కన్పట్టుచున్నది. తన మహాకావ్య తాత్పర్యార్థమునకు ఎట్టి భంగమును కలుగని రీతిగ, పింగళి సూర్యనార్యుఁడు పాత్రల కుచితవేష భాషాచేష్టాదికము లొసఁగి వానిని జీవమయమూర్తులుగ చిత్రించి తన కళాప్రతిభలఁ బ్రదర్శించినాఁడు.

అధఃసూచిక

1. రాఘవపాండవీయమనెడి యీ భాషాకావ్యమును కళాపూర్ణోదయ కృతిపతి యిట్లు ప్రశంసించినాఁడు:

మ. "ఇటమున్ గారుడ సంహితాదికృతు లీ వింపొందఁగా బెక్కొన
ర్చుట విన్నారము చెప్పనేలయని, సంస్తుత్యోభయ శ్లేష సం
ఘటనన్ రాఘవ పాండవీయ కృతి శక్యంబే రచింపంగ నె
చ్చట నెవ్వారికి? నీక చెల్లెనది భాషా కావ్యముం జేయఁగన్.”

2. కళాపూర్ణోదయంలో కనిపించే కల్పనాప్రతిభ ప్రభావతిలో లేదు. ప్రభావతీ ప్రద్యుమ్నం ఇతర కావ్యాలలోనుంచి సందర్భాలనుంచి యాదృచ్ఛికంగా అనాలోచితంగా కవి ఏర్చిన అతుకుల బొంతగ నాకు కనబడుతున్నది. (చిలుకూరి నారాయణరావు - భారతి, వృష, శ్రావణము)

'ప్రభావతీ ప్రద్యుమ్నము రచనావిషయమున కళాపూర్ణోదయమున కన్న మిన్నఁగాని బహుశః కవి వయసు ముదిరినవాఁడైనందువలన రాగములు కృశించె గాబోలు. భావనాశక్తి కొరవడినది. కళాపూర్ణోదయమునందు గల నూతన కల్పన లిందులేవు' (కట్టమంచి - కళాపూర్ణోదయ పీఠిక).

3. "Another outstanding merit of this poem is the logical exactness of its argument and structure. The relationship of cause and effect has been maintained both in measure and quality and little or nothing is left to freak or accident. The element of blind chance has, practically speaking, no chance in this poem. For every incident, great or small, the cause can be sought for in the poem itself. No link is left to be supplied by imagination or conjecture. The whole fabric rests on the basis of inviodable reason" Pingali Suranaraya - T. Atchyuta Rao p. 246

4. "In his poetic art he, for the first time conceived of introducing in his poems, chiefly in his Prabhavati - Pradyumnum, the dramatic method of developing his plots, by planning out scene after scene and making his characters work out the story through monologues and dialogues and by complicating the plot in such a way that it gradually led to a denovement and their resolving the whole in such a way as to suit the sense of dramatic justice."