వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సాహిత్య విమర్శ/ఆంధ్రభారత రచనోద్దేశ్యము
ఆంధ్రభారత రచనోద్దేశ్యము
రాజరాజనరేంద్రునిచే భారతము మత ప్రచారార్ధము పుట్టింపబడినదనియు, సారస్వత పోషణార్ధము పుట్టింపబడినదనియు వాదించే ఇరువాగుల వారికిని భిన్నమగు, 'భారత రచనము వంశచరిత్ర రచన' ముగానుద్దేశింపబడినదను నా యభిప్రాయము వెగటుగ తోపక మానదు. కాని నా వ్యాసోద్దేశమును చదువరులు సహృదయముతో గమనింతురుగాక యని ప్రార్థించుచున్నాను.
శ్రీయుత గొడవర్తి సూర్యనారాయణమూర్తిగారు 'వీణ' నవంబరు - డిశంబరు సంచికలలో భారత రచనము మతప్రచారార్థము జరిగినది కాదని నిరూపించి, వాఙ్మయ పోషణార్ధ ముద్దేశింపబడినదని తేల్చియున్నారు. మతప్రచారార్ధము కాదన్నమాట సత్యము. అందులకు వారా కాలమునాటి మతపరిస్థితులు విపులముగా చర్చించి, భారతరచనము వలన జరుగవలసిన మతప్రచారమేమియు లేదని చూపియున్నారు. భారతరచనము 'వాఙ్మయపోషణార్ధమే' జరిగినదని వారు తీర్మానించిన వాదమును అంత సహేతుకముగ కన్పట్టదు.
రాజరాజు లోకమునం దాదికావ్యమగు రామాయణ మాంధ్రీకరింపజేయక, భారత మాంధ్రీకరింప జేయుటలో నీతని యుద్దేశ్యము సారస్వత పోషణము గాక అన్యమని స్పష్టమగుచున్నది. అదియే తన వంశచరిత్ర రచనోద్దేశ్యము. రాజరాజు విద్యావిలాస గోష్ఠిలో నుండి నన్నయ భట్టారకుని చూచి తాననేక కావ్యములను, ఈశ్వరాగమములను పరికించితిననియు, కాని 'అనవరతంబును శ్రీమహాభారతంబువిన నభిలాష పెద్దయైయుండు' ననియు చెప్పియున్నాడు. అట్టి అభిలాషకు కారణముగా భారతము తన వంశచరిత్రయని తలపోయుచు రాజరాజు :
చ."హిమకరు దొట్టిపూరు భరతేశ కురుప్రభు పాండు భూపతుల్
క్రమమున వంశకర్తలనఁగా మహినొప్పిన యస్మదీయ వం
శమునఁ బ్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవో
త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమెంతయున్.”
వ్యాసరచిత భారతము నాంధ్రీకరింపు మనుటలో రాజరాజు కన్నడ వాఙ్మయమునందలి పంప రన్నల భారతముల చూచినాడనవలయును. క్రీ.శ. 940 ప్రాంతమున పంపకవి తన ప్రభువగు 'అరికేసరి'ని అర్జునునితో పోల్చి, అర్జునునకు ప్రాధాన్యమిచ్చి, 'విక్రమార్జున విజయ'మను పేర భారత కథను క్రోడీకరించి వ్రాసియున్నాడు. క్రీ.శ. 11వ శతాబ్దిని రన్న కవి పశ్చిమచాళుక్య ప్రభువగు సత్యాశ్రయుని నాయకునిగా నుద్దేశించి భీమునకు ప్రాధాన్యమిచ్చి, 'సాహస భీమ విజయము' ను వ్రాసి యున్నాడు. కృతిభర్త కృతికర్తలు జైనులైనను, కథావస్తువు మాత్రము చాళుక్యవంశ చరిత్రయగు భారతమే. కన్నడ వాఙ్మయము నందలి భారతములలో 'ఆది వంశావతార సంభవము' విపులముగా నుండక పోవుట వలన వ్యాస భారతము నాంధ్రీకరింప వలసినదని రాజరాజు కోరియుండును.
రాజరాజునకు వంశచరిత్రయగు భారతశ్రవణాసక్తి హెచ్చు. 'అస్మదీయ వంశమని' సగర్వముగా చెప్పికొని యున్నాడు. బహుభాషల తన వంశచరిత్రను విని యున్నాడు. భారత శ్రవణము వలన "సువర్ణ శృంగ ఖురమై కపిలంబగు గోశతంబు నుత్తములకు వేద విప్రులకు దానము చేసిన ఫలము, బహు యోగ ఫలము' గలుగునని చెప్పియున్నాడు. తన పూర్వుల చరిత్రయగు భారతమును కృష్ణద్వైపాయన భారతము నందలి బద్ధ నిరూపితార్థ మేర్పడునట్లుగా తెనుగున రచింప వలయునని నన్నయభట్టారకుని కోరియున్నాడు. నన్నయ భట్టారకుడు ఆరణ్యపర్వములో కొంత భాగము వరకు తెనిగించి పరలోక గతుడయ్యెను.
రాజరాజ నరేంద్రుడొక భారత మాంధ్రమున వ్రాసెనని, విజయాదిత్యుని శ్రీకూర్మక్షేత్ర శాసనమునందలి క్రింది శ్లోకము వలన తెలియుచున్నది.
'శ్రీ రాజరాజ నృపతి స్సువిశాల
కీర్తిః యస్యూరిభి స్సహఖిలస్మృ
తిజాలసార మంధ్రీచకార వర భా
రతవంశ వృత్తమ్'
(Ep. Ind Vol Vpp 32)
ఈతడు తన వంశచరిత్ర నాంద్రీకరించి వంశగౌరవమును చాటుకొని యున్నాడు. ఈతని భారతము చోళచాళుక్య యుగముననో, వేంగి చాళుక్య రాజ్యపతన కాలముననో అంతరించి యుండును. కాబట్టి రాజరాజునకు భారతమన్న తన వంశచరిత్రమన్న దృష్టియే గాని, మత వ్యాప్తికిని, సారస్వత పోషణమునకును తగిన యుపకారణమను దృష్టి లేదని తెలియుచున్నది. అట్టి రాజరాజు తన వంశచరిత్రకు వన్నెచిన్నెలు దిద్దగల మహాకవిని, అవిరళ జపహోమ తత్పరుడును, సంహితాభ్యాసుడును, బ్రహ్మండాది నానాపురాణ విజ్ఞాన నిరతుడగు నన్నపార్యునియందు కల్గొనగల్గెను. నన్నయభట్టారకుడు భారత మాంధ్రీకరించుటకు రాజరాజే ముఖ్యకారణము గాని, యాతనికి భారతము తక్క మిగిలిన గ్రంథములు అర్జునునకు గాండీవము తక్క తదితరములగు విండ్లు నచ్చనట్లు నచ్చక పోవుట కాదు.
చంద్రవంశజులగు చాళుక్యులందరికిని తమ శాసనము లందైనను చంద్రుడు మొదలు పులకేశి వరకు తమ వంశచరిత్ర వ్రాయించుట అలవాటు. (Ref-Tel-Aca-Joumal Vol 24 Pt 1 C.P. No. 8 of 1924-25) శాసనమునందు వచ్చు పూర్వుల చరిత్ర అంతయు పంప, రన్నల భారతములలో వలె గాక నన్నయభట్టారకుని భారతమున విరివిగా వర్ణింపబడియున్నది.
పశ్చిమ చాళుక్యులకును, పూర్వ చాళుక్యులకును తమ వంశచరిత్రమగు భారతమన్న గౌరవము మెండుగా నుండెడిది. పశ్చిమ చాళుక్యులు గ్రంథముల ద్వారా మతమును వ్యాప్తిలోనికి గొనిరాదలచినచో 'జైనతీర్థంకర' చరిత్రలను, పూర్వచాళుక్యులు మతమును వ్యాప్తిలోనికి గొనిరాదలచినచో 'శివపురాణము' లను, అంకితము గొనియుండెడివారు గాని, భారతము కన్నడమునకు నాంధ్రమునకు గొనివచ్చియుండెడివారు కారు.
వంశచరిత్ర రచనమే పరమార్థముగా గలిగి సారస్వతమునకు చేయూతనిచ్చిన ఆ కాలపు కావ్యప్రవృత్తి నించుక తడువవలసి యున్నది. చాళుక్యులు తమ వంశ చరిత్రయగు భారతమును వ్రాయించియు, వ్రాసియు తమ వంశగౌరవమును చాటుకొనిరి. చాళుక్యుల అనంతర మాంధ్ర దేశమున సూర్యవంశజులగు కాకతీయులు సామ్రాజ్యాధిపత్యము వహించిరి. వీరి కాలమున సూర్యవంశ చరిత్రయగు రామాయణము వివిధముఖముల దాల్చినది. తిక్కన సోమయాజిచే సూర్యవంశజుడగు మనుమసిద్ధి నృపాలుడు నిర్వచనోత్తర రామాయణమును కృతిబొందెను. సూర్యవంశజులగు కాకతీయుల కాలమున రచింపబడిన సూర్యవంశ చరిత్రలగు రామాయణములు - భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము, శాకవెల్లి మల్లికార్జున భట్టు రామాయణము, వాసిష్ఠ రామాయణము. ఇట్లీ కాలమున చంద్రవంశజుల పరిపాలనమున చంద్రవంశ చరిత్రయము భారతమును, సూర్యవంశజుల పాలనమున సూర్యవంశ చరిత్రయగు రామాయణమును ఆంధ్రీకరణములయ్యెను. ఇది ఆ కాలపు సారస్వత చిత్తప్రవృత్తి.
కావున ఆంధ్రసారస్వత ప్రథమావస్థలో రాజన్యుల వంశచరిత్ర రచనములే సాహిత్యలోకము నాకర్షించినవనవచ్చును. దానికి రాజన్యులే కారకులు. భారత రచనము వలన మతాభివృద్ధియు, భాషాపోషణమును, అవాంతరఫలములు. ముఖ్యోద్దేశ్యము వంశచరిత్ర రచనమే.