Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/సాక్షాత్కారము (దృశ్యనాటిక)

వికీసోర్స్ నుండి

సాక్షాత్కారము

(దృశ్యనాటిక)

పాత్రలు : పోతరాజు, శ్రీనాధుడు, మాచమ్మ, మల్లన్న

కాలము: క్రీ. శ. 15వ శతాబ్ది మధ్యభాగము

ఒకటవ దృశ్యము

(ఓరుగంటి బ్రాహ్మణవీథి పూరిల్లు. మట్టితో అలికి ముగ్గులు పెట్టిన అరుగుమీద కోదండరామస్వామి దారు విగ్రహము. న్యగ్రోధ వృక్షచ్ఛాయలో ఒక వ్యాసపీఠం మీద వ్యాస భాగవతముంటుంది. దానిముందు పరిచిన కృష్ణాజినంమీద మహాకవి పోతరాజు కూర్చొని తదేక దీక్షగా, భక్తి పారవశ్యంతో భాగవత మూలాన్ని ఆంధ్రీకరిస్తుంటాడు.)

పోతరాజు : (సంస్కృత భాగవతములో నుంచి)


“యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం
యద్వందనం యచ్ఛ్రవణం యదర్హణమ్
లోకస్య సద్యో విధునోతి కల్మషం
తస్మై సుభద్ర శ్రవసౌ నమో నమః”


(శ్లోకాన్ని పఠించి నిమీలిత లోచనాలతో రామచంద్ర విగ్రహానికి నమస్కరించి క్రింది విధంగా ఆంధ్రీకరించి తాళపత్ర గ్రంథంలో ఘంటంతో నిబద్దం చేస్తాడు)


ఏ విభు వందనార్చనము లేవిభు
చింతయు నామకీర్తనం
బే విభులీలలద్భుతము లెవ్వని
సంశ్రవణంబు సేయదో
షావళి బాసి లోకము శుభాయత
వృత్తి చెలంగునండ్రునే
నావిభు నాశ్రయించెద నఘౌఘ
నివృత్తిడు భద్రకీర్తియున్-

(నమ్రభావంతో మళ్ళీ నమస్కారం చేసి నీడ తనలో లీనమై పోతూ ఉండడం వల్ల

ఒకమాటు ఆకాశం వైపుకు చూస్తాడు. ఆదిత్యుడు గగనరంగ మధ్యంలో గంభీర నాట్య భంగిమతో ప్రకాశిస్తుంటాడు)

మాచమ్మ : (లోపలినుంచి ప్రవేశిస్తూ) ఏమండీ. మీకే వెర్రిపడితే అదే వెర్రి. తిండీ తిప్పలూ లేవా ఏమిటి? అపరాణ్హం దాటి ఎంతసేపైందో చూచారా? ఇకనైనా కనికరించి దేవతార్చనమ్ చేస్తారా?

పోతరాజు : (చిరునవ్వుతో తాళపత్రగ్రంథాన్ని కట్టి పెడుతూ) అమ్మీ! నా కాశీ కమండలం తెచ్చి పెట్టు. ఇక్కడున్నట్లుగా గంగకు వెళ్ళి వస్తాను.

(భార్య లోపలికి వెళ్ళుతుంది)

కోదండరామా! కోదండరామా!!

(వెలిగే కన్నులతో ఒక్కమాటు నాలుగువైపులా లేచి చూస్తాడు. భార్య ప్రవేశించి)

మాచమ్మ : ఇదుగో కమండలం. అదుగో అంగవస్త్రము దణ్ణెంమీద, నిన్నా మొన్నా ఉపవాసం, మరిచిపోయినారేమో! అనుష్ఠానం కొంచెం త్వరగా పూర్తిచేసుకోండి. నా ప్రాణాలు అన్నుబట్టి పోతున్నవి.

పోతరాజు : (కమండలము భార్యచేతిలో నుంచి అందుకుంటూ దణ్ణెం వైపుకు నడుస్తూ) నాలుగు దినాలైంది. ఉద్ధరిణెడు పచ్చిగంగ ఎరుగను. నిన్నా మొన్నటికే అల్లట తల్లటై పోతున్నావు పిల్లా!

మాచమ్మ : మీకేం మహాత్ములు. పవనపర్ణాంబుభక్షులు. మీతో నాకెక్కడి వంతు. మీరేమిటో మీ వ్రాసుకోవటమేమిటో. రెండో ప్రసంగం పట్టిందా? ఇతర ప్రపంచం పట్టిందా? ఈ మహాగ్రంథం ఎప్పటికి పూర్తౌతుందో గాని వేళపట్టుకు భోజనానికి నిద్రకూ మోమువాచిపోతున్నాము. మీరు మటుకు నోచుకున్నారా?


"చేసుకున్న వారికే గోవిందారామ
చేసుకున్నంతాయె గోవిందారామ”


పోతరాజు : అమ్మా మన కోదండరాముడి కృపవల్ల భాగవత సముద్రాన్ని ఈది బయటపడాలి గాని ఈ అన్నమయకోశాన్ని పోషించుకోలేక పోతామా? అదంతా ఆ మహాప్రభువు కరుణ వెంటనే వచ్చేస్తాను.

(గంగకు బయలుదేరుతాడు)

(భార్య అక్కడే చేటలో ఉన్న బాదమాకులు విస్తరి కుడుతూ గోవిందనామాల పాట

పాడుకుంటుంది.)

మల్లన్న : (ఆదుర్దాగా ప్రవేశించి ఇల్లు నాలుగు మూలలా వెతుకుతుంటాడు.)

మాచమ్మ : అబ్బాయీ! మళ్ళీ వచ్చావు మేడికోల మరిచిపోయినావా ఏమిటి?

మల్లన్న : మామ రాలేదామ్మా!

మాచమ్మ : ఏ మామ నాయనా?

మల్లన్న : శ్రీనాథుడు మామ.

మాచమ్మ : ఏడీ! రాలేదే! వాడు బతికున్నాడా? పోనీ ఇప్పటికైనా అక్కయ్య బతికున్నదని జ్ఞాపకం వచ్చింది అంతే పదివేలు.

మల్లన్న : మేనా మన ఇంటికి రాలేదూ? ఈ ఊరి పక్కగా మామ ఎక్కడికైనా వెళ్లుతున్నాడేమో!

మాచమ్మ : ఎవరినైనా జూచి మామనుకున్నావేమో!

మల్లన్న : ఎవరినో చూడటమేమిటి? అంతకథ జరిగితే ఉఁ - ఇంకా రాలేదేం.

మాచమ్మ : ఏం కథ జరిగిందేమిటి?

మల్లన్న : మామయ్య మేనా ఎక్కి

మాచమ్మ : ఆ c......

మల్లన్న : మన పొలిమేర పొలం గట్టు మీదగా వస్తున్నాడమ్మా!

మాచమ్మ : నిన్నుజూచి మేనాలో పిలిచి ఎక్కించుకోలేదురా? ఏదో సామెతలా ఉంది ఎందుకంటాడేం!

మల్లన్న : రాజాస్థానాలల్లో భట్రాజులలాగా కవిత్వం చెప్పి ప్రాభవం సంపాదించిన ఆయన కళ్లకు ఎక్కడో పొలం దున్నుకొంటూ పొట్ట పోసుకుండే మనం కనబడతామా, దానికేం కనబడక పోతేమానె-

మాచమ్మ : ఏం చేశాడేమిటి? మల్లన్న : నన్ను దూరాన్నేజూచి గుర్తుపట్టి సగర్వంగా మేనా ఆపించి పగటిదివ్వె వెలిగించమన్నాడు. ఒక పడుచు కోయపిల్ల దారిన పాడుకుంటూ పోతుంటే పిలిచి ఒక మాడ విసిరి పారేశాడు నాకు కనబడేటట్లుగా.

మాచమ్మ : వాడు రమ్మనకపోతే మాని, నీవైనా పోయి 'ఎక్కడినుంచి మామా' అని పలకరించక పోయినావా?

మల్లన్న : ఎందుకు పలకరించాలేం? నేను మటుకు తక్కువ తిన్నానా? ఆయన గొప్ప ఏమిటో కొంచెం చెపుదూ వింటాను - లేదని ఎందుకనాలి. ఉంటే ఆయన్నే ఉంచుకోమను.

మాచమ్మ : అనవసరంగా ఎందుకురా ఇంత ఉక్రోషం. నిన్నేం తక్కువ చేశాడని.

మల్లన్న : అవమానించటానికి యత్నించాడు.

మాచమ్మ : నిన్నేమన్నా మాటన్నాడా?

మల్లన్న : మాటనకపోతే సరా! నా దారిని నేను పొలం దున్ను కుంటుంటే ఇష్టముంటే మర్యాదగా పిలిచి మాట్లాడాలి లేదా తన దారిని తాను పోవాలి. వెర్రిడాంబికం నా దగ్గరనా. చూడు నా ప్రజ్ఞ అన్నట్లుగా మేనా బోయీలను ఒకవైపు మానేయించి నడిపిస్తాడా!

మాచమ్మ : నడిచిందిరా మేనా నాయనా? ఈ విద్యంతా వాడికి మీ నాన్న నేర్పిందేలే!

మల్లన్న : నాకూ మానాన్న నేర్పలేదు మరి. నేను మటుకు ఊరుకున్నానా? అరక ఎద్దును ఒకదాన్ని ఒదిలిపెట్టి పొలం దున్నించాను.

మాచమ్మ : ఆయనకు అన్ని మంత్రాలు రాబట్టేనా ఇలా ఉన్నాము - అయితే అరకవైపు మామ చూచాడా?

మల్లన్న : ఆఁ చూచి, బోయీలను రెండోవైపు కూడా విడిచి పెట్టమని మేనా నడిపించాడు.

మాచమ్మ : తరువాత నీకేం చెయ్యాలనో తెలియలేదుగామాలి.

మల్లన్న : అబ్బా! ఈపాటి క్షుద్రశక్తికే భయపడ్డాననుకుంటున్నావేం, ఒక్కమాటు భూదేవిని మనస్సులో స్మరించి రెండో ఎద్దును కూడా వదిలిపెట్టి అరక నడిపించాను - ఊరుకుంటానా మరి. మాచమ్మ : తరువాత?

మల్లన్న : ఏముంది. మేనాలో ఉన్న అంత మామా అమాంతంగా దిగివచ్చి కొంటెతనంగా వెనక ఎరగనట్లు 'ఎవరబ్బాయివిరా నీవన్నాడు' - మనస్సులో చేయిపెట్టి కలిచినట్లయింది నా పని. ఆపుకోలేక రాజాస్థానాలల్లో కవితా సేవకు కుదరలేక కేదారఖండాన్ని నమ్ముకున్న ఒక కర్షక కవి కుమారుణ్ణన్నాను - పెడసరంగా.

మాచమ్మ : ఎందుకన్నావు ఆ మాట. వాడికి కోపం రాదూ?

మల్లన్న : ఏం వస్తే? నన్నేం తలగొట్టి మొలేస్తాడా?

మాచమ్మ : అయినా వాడు కాస్తకూ కూస్తకూ కోపం తెచ్చుకునే స్వభావం కలవాడు కూడా కాదులే. ఆఁ

మల్లన్న : ఓరి నీవట్రా మల్లన్నా? ఓరి నీ తస్సదియ్య ఎంతవాడివైనావురా? నేనెవరినో ఎరుగుదువా? ఎప్పుడో చిన్నతనంలో చూచానురా? చిన్నప్పుడు నీచేత నా నైషధంలో పద్యాలు వల్లె వేయించే వాణ్ణి మా ఇంటికి వచ్చినప్పుడు అని మంచి చేసుకొని మేనాలో ఎక్కు ఇంటికి పోదామన్నాడు. నీవు పద, నేను ఎడ్లకు మేతవేసి నీడనకట్టి వస్తానన్నాను.

మాచమ్మ : పాపం. మేనాఎక్కి రాకపోయినావా? వాణ్ణి ఎంత చిన్నబుచ్చావురా?

మల్లన్న : నన్ను చిన్నబుచ్చటం నీకు నచ్చిందేం? ఇంకా ఇంటికి చేరలేదే, అరఘడియైనా. మనం పేదవాళ్ళమనీ మన ఇంట్లో మర్యాదలు సక్రమంగా జరగవనీ ఇంకెవరింట్లోనైనా విడిది దిగారేమో మామగారు.

మాచమ్మ : మల్లన్నా! మామను ఎంత అన్యాయం చేస్తున్నావురా!

మల్లన్న : ఇంతసేపైతే మరి ఎక్కడికిపోయి ఉంటాడంటావు - ఆఁ ఎక్కడికేమిటి? మరిచి పోయినాను. ఉందిగా మా అత్త భోగినీదేవి. దేశదేశాల నుంచీ తెచ్చిన చీరెలూ, సారెలూ ముందు అక్కడ చెల్లించుకోరావద్దూ?

మాచమ్మ : అది గోపాలోత్సవాలకు రాచకొండ వెళ్లిందటగా. దాని ఇంటికెందుకు వెళ్ళుతాడు. మా ఇంటావంటా లేవే అటువంటి గుణాలు. ఎందుకురా అన్యాయంగా అంతంత అభాండాలు వాడినెత్తిన వెయ్యటం? మల్లన్న : పాపం! మీ తమ్ముడు కేవలం శ్రీరామచంద్రమూర్తి - నీకేం తెలుసు దేశం ఏమని చెప్పుకుంటున్నదో మామను గురించి - పోనీ ఒక సంగతి ఆలోచించు. ఇన్ని ఆస్థానాలు తిరిగి, ఇంతమంది ధనికులను ఆశ్రయించి చేసిన సంపాదనంతా మీ తమ్ముడు కేవలం శ్రీశుకులే అయితే ఏం చేశాడంటావు.

మాచమ్మ : ఆఁ ఈలోకం చూచి వచ్చింది.

మల్లన్న : (ఉక్రోషంతో) లేదు. నన్ను చెప్పమన్నావా. లంకెబిందెలకేసి పడిపోయిన కొండవీటి కోటకొమ్మల్లో పాతేయించాడు - రాజమహేంద్రవరము నుంచీ అయ్యగారు ఎందుకు స్వస్తి చెప్పారో విన్నావో 'రన్ని' విషయంలో రాజుగారికీ ఈయనకూ రక్తపాతాలదాకా వచ్చిందట -

మాచమ్మ : పోనీ - నీవన్నట్లే అదంతా మనకెందుకొచ్చింది చెప్పు. మా నాన్నకు ఒక్కడైనా రత్నం. ఇంత వృద్ధిలోకి వచ్చాడు. పదిమంది పెద్దల్లో తిరగనేర్చాడు. తండ్రి తాతల పేరు నిలువ బెడుతున్నాడు. ఏంచేస్తేనేం. సంపాదనంతా ఏం చేస్తేనేం? నీకు పిల్లనిచ్చేటప్పుడు కట్నమివ్వలేక పోతాడనేనా నీ దిగులు, ఆ భయం పెట్టుకోకు.

మల్లన్న : పిల్లిని చంకన వేసుకొని తిప్పినట్లు ఊరూరా పిల్లను తిప్పుతున్నాట్ట. పట్టణాలల్లో నిముషానికి ఒక కొత్తపోకడతో సింగారించుకుంటూ సీతాకోక చిలుకలాగా పెరిగే ఆ అమ్మాయిని అంటగట్టుకుంటే మన కాపురం నెగ్గినట్లే.

మాచమ్మ : అయితే మేనరికం పోగొట్టుకుంటాముట్రా.

మల్లన్న : 'నందోరాజా భవిష్యతి' - ఇప్పుడెందుకా విషయం.

మాచమ్మ : వాడే వస్తే ఈ తడవ వచ్చే కార్తికమాసంలో ముహూర్తం పెట్టించమని అడుగుదామనుకుంటున్నాను.

మల్లన్న : అప్పటికిమల్లె మనకు డబ్బువస్తుందా ఏం?

మాచమ్మ : అంతగా మనకు అప్పటికి రాకపోయినా లేకపోయినా మనకయ్యేది కూడా వాడే ఎక్కడనో తెచ్చిపెడతాడు.

మల్లన్న : అంత ఖర్మం మనకేం పట్టింది. భూదేవి చల్లగా చూడాలిగాని. నవ్విన మన నాపచేనే పండదుటే-

(కాహళధ్వని ఒకటి వినిపిస్తుంది)

మాచమ్మ : గంగకు స్నానానికని వెళ్లారు మీనాన్న. ఇంతవరకు అతీగతీ లేదు. అదుగో

కోదండరామ స్వామి ఆలయంలో అర్చన అవుతున్నట్లున్నది.

మల్లన్న : (విడ్డూరంగా) అది స్వామి ఆలయంలో నుంచి కాదు వినిపిస్తున్నది. మీ తమ్ములు శ్రీనాథ కవి సార్వభౌములవారి లాంఛనం. ఈమధ్య విజయనగరంలో కర్ణాటరాజు కనకాభిషేకం చేసి ఆయనకు ఇచ్చాడులే ఈ లాంఛనం.

మాచమ్మ : అయితే మావాడు కర్ణాటక చక్రవర్తిని కూడా ఎరుగునన్నమాట! చూచావా మామయ్య పేరెత్తితే ఒంటి కాలిమీద వస్తావు గాని వాడి వెంటపోతే ఇటువంటి గౌరవాలన్నీ మీ నాన్నకు చేయించడురా మా వాడు. వాడి పొళకువంటే గిట్టదాయె ఆ మనిషికి.

మల్లన్న : రాజులను ఆశ్రయించటానికి ఆయన మనస్సే అంగీకరించాలి గాని అప్పుడు మీ వాడూ అవసరం లేదు మా వాడూ అవసరం లేదు. అయినా మహాకవులు లాంఛనాల కోసం, రాజబిరుదాల కోసం కవిత్వం చెపుతారటమ్మా. ఏనాటికైనా మహారాజులే మా నాన్నగారి కోసం మన ఇంటికి రావలసిందేగాని ఆయన వాళ్ల దేవిడీ గుమ్మాలు దాటుతారా?

మాచమ్మ : చూస్తున్నాను గదా మల్లన్నా, ఎప్పుడు బట్టినా సరిగా ఆ తండ్రికి కొడుకువనిపిస్తావురా. డబ్బున్న వాళ్ళంటే గిట్టదు. డబ్బు సంపాదించటమంటే గిట్టదు. ఒక ముచ్చటా లేదు. అచ్చటా లేదు. ఎన్నాళ్ళూ కాపురం చేసినా కట్టుకోను ఓ మంచి బట్టా పెట్టుకోను ఓ నగ! మా వాళ్ళు పెట్టిన పులిచేరు అమ్ముకున్నారు గదా? ఈ పుస్తెలతాడూ నేను మూసివాయినాల ముత్తైదులాగా మిగిలాను.

మల్లన్న : (నవ్వుతూ) అయితే నేను ఒక మాట చెప్పనా? నేను తండ్రికి తగ్గ కొడుకునైతే నీవు అక్షరాలా ఆ తమ్ముడికి తగ్గ అక్కవేనమ్మా!

మాచమ్మ : తప్పేముంది. ఎవరి వాళ్ళలాగా వాళ్లుంటారు.

మల్లన్న : ఎలాగైనా మొదటినుంచీ మీ వంశం గొప్పదే.

మాచమ్మ : మీ వంశం ఇంకా గొప్పదిగా? అంతా బ్రహ్మజ్ఞానులు. ఉగ్గుబాలతోటే వేదాంతం రంగరించి పోస్తారు. మీ ఇంట్లో- (దూరాన శ్రీనాథుణ్ణి చూచి) అడుగోరా మామయ్య. ఒక మనిషి నెత్తి మీద పెద్ద మేదర పెట్టె పూరి వసారాలో దించి వెళ్ళిపోతాడు. మాచమ్మ లోపలికి పోయి కాళ్ళకు నీళ్ళు తెచ్చి చెంబు వాకిట్లో పెడుతుంది. శ్రీనాథుడు ప్రవేశించి కుళాయి తీసి చిలక కొయ్యకు తగిలించి “ఒరేయ్. మీరు ఆ నీడలో కూర్చోండి" (నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటాడు).

మాచమ్మ : (నీళ్ల చెంబుతో) అబ్బాయీ! అక్కయ్య ఉన్నదనుకున్నావా - ఊడిందను కున్నావా?

శ్రీనాథుడు : ఏం మల్లన్నా! నాకంటే నీవే ముందు చేరుకున్నావే.

మల్లన్న : (గర్జితంగా) మీరు ఊళ్లో చూడవలసిన వాళ్లనందరినీ చూచివచ్చేటప్పటికి ఆలస్యమైనదను కుంటాను. నేను అడ్డదారిని త్వరగా వచ్చేశాను.

శ్రీనాథుడు : అక్కయ్యా! అల్లుడు బలే గట్టివాడే - మేము ఇద్దరమూ పొలిమేరలోనే కలుసుకున్నాం.

మాచమ్మ : ఏమో నాయనా మరి నీ పిల్ల వీడితో ఎలా నెగ్గుకోవస్తుందో - అయిదేళ్ళ నాడు నవమికి రావటమే తప్ప మళ్ళీ చీటి ముక్కైనా వ్రాశావు కాదు.

శ్రీనాధుడు : ఏదీ - నేను ఒకచోట స్థిరంగా ఉన్నదెప్పుడు? అమ్మ పోయినప్పటి నుంచీ మనస్థితి ఏమీ బాగాలేదు. కొంతకాలం దేశాటనం చేస్తే బాగుంటుందని కొండవీడు వదలి బెట్టాను.

మాచమ్మ : అయితే మా మేనగోడలు సరస్వతి ఎక్కడ ఉందిరా? దాన్ని ఒక మాటు తీసుకొచ్చి తలంటి పోసి పంపిద్దామంటే పడిందికాదు. పాపం తల్లి పోయిన పిల్ల. దానికి మాత్రం ఏ నూరుమంది ఉన్నారు.

శ్రీనాథుడు : అది వాళ్ల అమ్మమ్మ గారింట్లో ఉన్నది. దాన్ని చూచికూడా ఆరు నెలలు దాటింది. ఇదుగో అన్నిటికీ నేను దేశంలో లేక పోవటమే.

మాచమ్మ : నీవు ఎక్కడికో వెళ్ళేటప్పుడు పిల్లను అమ్మమ్మ గారింట్లో ఉంచకపోతే నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళకూడదూ! నీవు ఉంచకూడదా? మేము ఉంచుకోకూడదా? అవునులే - పెద్దవాళ్ళము పోషించలేము. పెద్దది ఆమె ఎప్పుడు పోయిందో నీకూ నాకు దూరమయినది.

(కంట తడి పెడుతుంది)

మల్లన్న : మామగారూ! ఏ ఏ దేశాలు చూచారేమిటి?

మాచమ్మ : 'మామగారు' అదేమిటి 'మామ' అను నాయనా!

శ్రీనాథుడు : ఒక దేశమేమిటి? యావద్భారతమూ తిరిగి వచ్చాను. చూడని ఆస్థానమూ, ఆడని తీర్థమూ లేదు.

మాచమ్మ : మాటమాత్రమన్నా అన్నావు కాదురా. నీతోటి వచ్చి దేశమన్నా చూచేదాన్ని.

శ్రీనాథుడు : మహారాజులతో యాత్రకు బయలుదేరినవాణ్ణి 'నాకూ-నీకూ' ఎక్కడ కుదురుతుంది.

మాచమ్మ : నాయనా! అన్నిచోట్లా తీర్థవిధులు జరిగించావా.

శ్రీనాథుడు : అందులో లోపం చేస్తానా? అమ్మా నాన్నలకు ఏం కొదవని?

మాచమ్మ : వాళ్లకే కొదువాలేదు. ఉన్నన్నాళ్లు సుఖంగా బ్రతికారు. ఆ కన్నకొడుకు చేతిమీదుగా దాటి పోయినారు. ఒక్కడివైనా ఇంత పేరు ప్రతిష్ఠలలోకి వచ్చావు.

మల్లన్న : మామా! ఈ దేశాలన్నీ తిరిగేటప్పుడు ఎక్కడైనా నీకు మా అమ్మ గుర్తు వచ్చేదేనా?

మాచమ్మ : చూడు వాడి చమత్కారం. ఆటలు పట్టిస్తున్నాడు మామను.

శ్రీనాథుడు : మల్లన్నా! కంచిలో నీకు ఒక మంచి జరీ కుళ్లాయి కొన్నాను. కాశ్మీరంలో మీ నాన్నగారికి ఒక శాలువా పట్టుకొచ్చాను. మా అక్కయ్యకు ఏవో చాలాచోట్ల చాలా చీరెలూ రవికలూ పట్టుకొచ్చాను.

(మేదర బుట్టవైపు చూస్తాడు)

(దొడ్డిగుమ్మం తలుపు చప్పుడు)

మాచమ్మ : (శ్రీనాథుడితో) అబ్బాయీ అడుగో మీ బావగారు గంగ నుంచి మడి కట్టుకొని వచ్చి దొడ్డిగుమ్మం తలుపు తడుతున్నారు. తరువాత చూపిద్దువుగాని ఇప్పటికే చాలా పొద్దు పోయింది. మడికట్టుకో (మల్లన్నతో) అబ్బాయీ మామను భావి దగ్గరకు తీసుకొని పోయి స్నానానికి నీళ్లు తోడి అందించు.

శ్రీనాథుడు : అల్లుడైనందుకు ఆ మాత్రం పరిచర్య చేయడూ? లేకపోతే పిల్ల నిస్తానా? మల్లన్న : మామా ఇటు - (మల్లన్న దారిచూపిస్తుంటే శ్రీనాథుడు వెనుక నడుస్తాడు) (మళ్లీ దొడ్డిగుమ్మం తలుపు చప్పుడు విని మాచమ్మ తలుపు తీయటానికి వెళ్లిపోయింది).

రెండవ దృశ్యము

(శ్రీనాథుడు ప్రయాణ సన్నాహంలో ఉంటాడు. ప్రాతః సమయంలో మాచమ్మ గంగకు మంచి నీళ్లకుపోయే ఉద్దేశంతో చంకన బిందెపెట్టుకొని ఇంట్లో నుంచి సావట్లోకి వచ్చి!

మాచమ్మ : అబ్బాయీ! ఏమిటి అప్పుడే ఆ పెట్టె సర్దించడం వచ్చినట్లా పెట్టినట్లా. అంత తీరుబడి లేకపోతే ప్రస్తుతము రావటమే మానుకోక పోయినావూ? వచ్చినందుకు రెండు దినాలైనా....

శ్రీనాథుడు : ఇవాళటికి నాలుగో నాటి సాయంకాలానికల్లా రాచకొండ చేరుకోవాలి. ఈతడవకు నన్ను ఆపకక్కయ్యా!

మాచమ్మ : ఏమంత అవసరము. రెణ్ణాళ్ళు ఆలస్యమైతే ముంచుకోబోయ్యేది ఏమన్నా ఉన్నది గనుక.

శ్రీనాథుడు : (అవీ ఇవీ సర్దుకుంటూ) రాచకొండలో గోపాలోత్సవాలకు సింగభూపతి ఆహ్వానిస్తే నేనూ తిప్పయసెట్టీ విక్రమ సింహపురం నుంచి బయలుదేరి వెళ్లుతున్నాము. అతడు అలాగే వెళ్ళిపోయినాడు. నేను నిన్ను చూచి వెంటనే బయలుదేరి వస్తానని చెప్పి ఇలా వచ్చాను.

మాచమ్మ : పోనీ ఇవాళ సాయంత్రందాకా నైనా ఉండకుండా అదేమిట్రా - ఆగర్భ శ్రీమంతు అతగాణ్ణి కూడా మన ఇంటికి తీసుకోరాక పోయినావూ, మీ బావగారికీ అతనికీ పరిచయం ఉంటే ఎన్నిటికైనా మాకు ఉపయోగించేది.

శ్రీనాథుడు : నిజమే, నాకు ఆ ధోరణే లేకపోయింది. ఔను అతని పరిచయము సామాన్యులకు లభించటము చాలా దుర్లభము. అతడు కేవలం ఆగర్భ శ్రీమంతేకాదు. మంచి రసికుడు. విశేషించి కవితాభిమాని. అయినా ఇంతలో ముంచుకో పోయిందేముంది. మరిచిపోయినాను బావగారు కూడా రాచకొండ గోపాలోత్సవాలకు వస్తారుగా. అక్కడ అతని పరిచయభాగ్యం కలిగిస్తాను. రాజు ఆహ్వానం పంపించాడా?

మాచమ్మ : వచ్చినట్లు లేదురా అబ్బాయీ? శ్రీనాథుడు : ఇంకా గడువు చాలా ఉన్నదిగా. మొదటినుంచీ సింగభూపతి ఆశ్రయంలో ఉన్న కవిగూడానై పోయె బావగారు. ఆహ్వానం పంపించకుండా ఉండరు.

మాచమ్మ : ఏమో నాయనా? మొదటి మాట మీ బావగారికి ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో కూడా తెలియదు. భోగినీ విషయంలో ఎవరితోనో ఈన ఏదో అన్నాడనీ దానిమీద భూపతి మందలిస్తే ఈన ఏదో పెడ సమాధానం చెప్పాడట. బాగా మనస్పర్థలు ఏర్పడ్డట్లున్నవి. ఈన మాటలను బట్టి చూస్తే ఆహ్వానం వస్తుందో రాదో!

శ్రీనాథుడు : సింగభూపతి ఇలాటి చిన్నవిషయాలు మనస్సులో పెట్టుకుండేవాడు కాదు. పైన బావగారంటే విశేషాభిమానం ఉన్నట్లు విన్నాను కూడా. ఆయన మనస్సులో స్పర్ధ ఉంటుందని అనుకోను - నేను ఇవాళనే బయలుదేరి వెళ్లుతున్నానుగా. భూపతితో మాట్లాడి బావగారికి వెంటనే ఆహ్వానం వచ్చేటట్లు చేయిస్తానుగా.

మాచమ్మ : ఒకవేళ వచ్చినా ఈన బయలుదేరవద్దూ.

శ్రీనాథుడు : దానికి ఎవరేం చేస్తారు - పోనీ మరొక సమయంలో తిప్పయసెట్టి పరిచయం చేస్తాను.

మాచమ్మ : అబ్బాయీ! అయితే ఉత్సవాలలో ఆధ్వర్యం నీదేనా ఏమిట్రా.

శ్రీనాథుడు : అందుకనే తిప్పయసెట్టి నేనూ ఇంతముందుగా బయలుదేరి రావటము. ఉత్సవ కలాపాలన్నీ వచ్చే పౌర్ణమికి పూర్తి కావాలి. మల్లన్న ఏడిఅక్కయ్యా! బావగారితో వాడుకూడా వస్తే ఎంతో బాగుంటుంది. ఏదో సందర్భంలో సెట్టికీ, సింగభూపతికీ మా కాబోయే అల్లుడని చూపిస్తాను.

(దొడ్లో నుంచి మల్లన్న పొలానికి పోవటానికి సిద్ధపడి బయటికి వచ్చి)

మల్లన్న : మామా! పొలిమేర చేలో గుంటక తోలటం కొంత మిగిలిపోయింది. త్వరగా పూర్తి చేసుకువస్తాను.

శ్రీనాథుడు : అబ్బాయీ! నేను ప్రయాణమౌతున్నాను. నీవు కూడా మీ నాన్నగారితో పాటు రాచకొండ గోపాలోత్సవాలకు తప్పకుండారావాలి. నడిపించేది నేనే.

మల్లన్న : ఇంత ఆలస్యం చేశావేం మామా! నిన్న సాయంత్రమే బయలుదేరక పోయినావేం. మాచమ్మ : ఏమో! నాయనా, చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని వచ్చాడు. వెళ్లక తప్పదట.

మల్లన్న : వెళ్లక తప్పదూ? ఎందుకు తప్పదో చూతాం. ఉత్సవాలెప్పుడో ఇంకా మాసం పై చిలుకుంటే వీరంతా ఎంత కార్య నిర్వాహకులైనా ఇప్పటినుంచే ఏం చేస్తారేం. ఆయన ఉండదలచుకోక ఇదొక సాకుచెప్పుతున్నాడు గాని.

శ్రీనాథుడు : కాదులే మల్లన్నా, నన్ను బలవంతం చెయ్యవద్దు. నేను ఒక్కణ్ణేకాదు, తిప్పయ్యసెట్టి కూడా బయలుదేరి వచ్చాడు. అతడు నాకంటే ముందే రాచకొండ చేరుకుంటాడు.

మాచమ్మ : అబ్బాయీ! తిప్పయసెట్టి అంటే నీకు తెలుసునా మామకు చిన్నప్పటి నుంచీ స్నేహితుడు. గొప్ప శ్రీమంతుడు.

మల్లన్న : మనిషినైతే చూడలేదుగాని తిప్పయ్య పేరు వినకపోవటమేం. తిరగటి కల్లులాగా దేశదేశాలూ తిరిగి కర్పూరం, చందనం, పునుగు జవ్వాజి అదే పేర్లతో రాజుల నందరినీ దోచుకుంటుంటాడు. ఆ రాజులు మనబోటి కర్షకులను దోచుకుంటుంటారు.

శ్రీనాథుడు : మల్లన్నా! అది దోపిడీ ఏమిటి, వ్యాపారానికి లక్షణం. వాళ్ళు ధనవంతులు కాక పోతే దేశానికి వస్తు సంభారాలు వచ్చే వీలేలేదు. రాజులు ప్రజల మీద పన్నులు వేసి గ్రహించక పోతే పరిపాలనే లేకుండా అరాజకమైపోతుంది దేశం.

మాచమ్మ : మల్లన్నా! ఎలాగైన మామను ఇవాళ పోనీయకుండా ఆపే భారం నీది.

శ్రీనాథుడు : అక్కయ్యా! ఎందుకీ నిష్ఠూరం వృథాగా! రానా పోనా?

మల్లన్న : అమ్మా! ఎలా పోతాడో చూస్తాను. నేను పొలం పని మానుకుంటాను. పోనీ రేపౌతుంది. నీవు త్వరగా గంగకు వెళ్ళి రాపో మడికట్టు కుందువుగాని.

మాచమ్మ : అబ్బాయీ, పొద్దున్నే మీ నాన్న పోతవరం వెళ్లారు. ఆయన వచ్చేలోపల మామయ్యకు మీ నాన్నగారు వ్రాసిన కవిత్వం వినిపించు తప్పులుంటే దిద్ది సరిచేస్తాడు.

(బిందెతో గంగకు బయలుదేరుతుంది)

శ్రీనాథుడు : మల్లన్నా! అనవసరంగా ఇక్కడ నేను ఆగిపోటమూ, అక్కడ మానెత్తిన తలకు మించిన బరువు కాచుకో కూర్చోటమూ.

మల్లన్న : కొంత కాలంనుంచి మా నాన్నగారు భాగవతము ఆంధ్రీకరిస్తున్నారు. అది నీవు వినకుండా పోవటానికి వీలులేదు. శ్రీనాథుడు : ఆఁ..... సాహసమో...... శక్తో...

మల్లన్న : సాహసమో, శక్తో.... వినాలి. ఇప్పుడే వస్తాను.

(లోపలికి పోయి ధావళీకట్టుకొని భాగవతము తీసుకోవస్తాడు. శ్రీనాథుడు ఈ లోపల అటూ ఇటూ పచారు చేస్తూ ఆలోచిస్తుంటాడు)

(కృష్ణాజినం మీద మడికట్టు కొని కూర్చొని మల్లన్న గ్రంథ ప్రారంభం చేయబోతూ)

మల్లన్న : మామా! మొదలు పెట్టమన్నావా?

శ్రీనాథుడు : (పచారుచేస్తూనే) అబ్బాయీ! మీ నాన్న కవితా ధోరణి ఏమన్నా మారిందా? లేకపోతే వెనకటి వేళ్ళలోనే నడుస్తున్నదా బండి.

మల్లన్న : వెనుకటి వేళ్ళలోనంటే?

శ్రీనాథుడు : భోగినీ దండకమా, వీరభద్ర విజయమూ రెండు నడిచిన వేళ్లు-

మల్లన్న : ఏమో అదంతా నీవే చెప్పాలి.

శ్రీనాథుడు : శైలిలో మార్పేమీ నీకు కనిపించలేదా! ఔచిత్యాన్ని ఆదరించటమూ, అనౌచిత్యాన్ని పరిహరించటమూ, భావాన్ని ఉపలక్షించటమూ వీటికేమన్నా ప్రయత్నించాడా. 'ముక్కస్య ముక్కార్థః' కాదుగదా?

మల్లన్న : ఆయనకు ఈ విషయమైన భ్రాంతే ఉన్నట్లు నాకు తోచలేదు.

శ్రీనాథుడు : మరి?

మల్లన్న : ఒకనాడు ప్రాతఃస్నానం చేసి గంగ నుంచీ యింటికి వచ్చి 'మల్లన్నా ఘంటం తాళపత్రం త్వరగా తీసుకోరా అన్నారు. తీసుకోవచ్చాను. తదేక దృష్టితో ఏ విధమైన స్మరంతీ లేకుండానే చెప్పేది వ్రాయమన్నారు. వెంటనే చెప్పండి అన్నాను. ఆయన -


"పలికెడిది భాగవతమట.
పలికెడివాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండుగాథ పలుకునేలా”


అని చెప్పి దేవతా ప్రార్థనము చేశారు. నేను వ్రాశాను. శ్రీనాథుడు : వీరభద్ర విజయం వంటి వీరశైవ కావ్యాల మీద నుంచి ఒక్కమాటుగా మనస్సు భాగవతం మీదికి ప్రసరించి వేదాంతవీథి విహారం చేయటానికి సంకల్పించింది.

మల్లన్న : ఏమో మామా! ఈ పద్యమేమిటి ఈ దైవప్రార్థన మేమిటి నాన్నా అని ప్రశ్నించాను. ప్రశ్నిస్తే - స్నానంచేసి గంగ ఒడ్డున తారకమంత్రం జపించుకుంటూ కూర్చున్నానురా అబ్బాయీ, ఇంతలో కనుచూపు మేరలో మెరపుచెంగట ఉన్న మేఘములాగా ఒక దేవతా స్త్రీతో ఒక శ్యామసుందర మదనమోహనమూర్తి నా కళ్ళకు కట్టింది. అటే తదేక దృష్టితో చూస్తూ ఉండగా కొంతసేపటికి ఎక్కడో చూచినట్లు అనుమానం కలిగింది. స్మరణకు వచ్చి ప్రభూ! అని కేక వేసేటప్పటికి శ్రీ సీతారామ పరబ్రహ్మము నా చేరువకు వచ్చి 'పోతన్నా ఏ మహాకవి చేతనైనా భాగవతము ఆంధ్రీకరణము చేయిద్దామనే సంకల్పంతో వచ్చాను. నీవు చేస్తే బాగుంటుందని కోరటానికి వెతుక్కుంటూ వచ్చాను. నాకు బాసట ఇస్తేగాని వెళ్ళిపోనని చేతులో చేయివేయించు కుని తిరోహితుడై నాడురా ప్రభువు' అని చెప్పారు.

శ్రీనాథుడు : (వ్యంగ్యగర్భితంగా) ఒక కావ్యమన్నా కవి సమాజాల నోట పడకుండానే, మహారాజుల మన్నన పొందకుండానే బావగారు రామచంద్రమూర్తి మమతతో అర్థించి కావ్యాన్ని వ్రాయించుకోదగ్గ మహాకవి ఐనారు. అందుకు సంతోషము.

మల్లన్న : ఈ రాజులూ తరాజులు మన్నిస్తేనేం మన్నించకపోతేనేం, చూస్తున్నాంగా లోకంలో ప్రచారంలో ఉన్న కవి సమాజాలన్నిటినీ, చిత్తచాంచల్యంతో చెలరేగుతూ ఉన్నవి. కపి సమాజాలంటే బాగుంటుంది. అటువంటి వాటి నోటికెక్కితేనేం ఎక్కకపోతేనేం. రాజాధిరాజు, రాజ పరమేశ్వరుడు రామచంద్రమూర్తి స్వయంగా వచ్చి అర్థించిన తరువాత.

శ్రీనాథుడు : (గర్భితంగా) తనను మహాకవిని చేసిన రామచంద్రమూర్తిని బావగారు కృతిపతినైనా చేయటానికి సంకల్పించుకున్నారా?

మల్లన్న : మామా అది వేమభూపతి కృపావీక్షణం లేనిదే ఘంటం బెత్తెడు సాగని నీకది నచ్చుతుందా.

శ్రీనాథుడు : (చిరునవ్వుతో) మల్లన్న - మీనాన్న నిరాశలో పడ్డారు. నిరాశకు పుట్టిల్లు భ్రాంతి. భ్రాంతి తన్నాశ్రయించిన వాళ్లకే కాదు వాళ్ల మాటలు వినేవాళ్ళకు కూడా మతి పోగొడుతుంది. మల్లన్న : ఆ విభ్రాంతాత్మతోనే నాన్నగారు భాగవతము పూర్తి చేస్తున్నారు. ఆత్మీయతతో అతిశయించే ఈ భాగవతమంటే భ్రాంతి నీ మతినికూడా పోగొడుతుందో లేదో చూదము.

శ్రీనాథుడు : ఈపాటికే మామతి పొయ్యెటట్లయితే ఈ దిగ్విజయాలేం చేస్తాము. ఈ కనకాభిషేకాలేం చేయించుకుంటాం.

మల్లన్న : మామా! ప్రారంభించమన్నావా. ఈ కూశాస్తరణం మీద కూర్చొని వింటే ఎంతో బాగుంటుంది.

శ్రీనాథుడు : ఇలాగే తిరుగుతూ వింటుంటే విశేషాలు త్వరగా తల్లో ప్రవేశిస్తవి. కానీ.

మల్లన్న : (గొంతు సవరించి వ్యాసపీఠానికి నమస్కారం చేసి)


శ్రీకైవల్యపదంబు చేరుటకునై
చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా
సంరంభకున్ దానవో
ద్రేక స్తంభకు,


(అని వరుసగా చదువుతూ ఉంటాడు)

మూడవ దృశ్యం

(సాయం సమయం - వేదికమీద సంధ్యారుణ కిరణ ప్రసారం వల్ల కిమ్మీరిత మౌతుంటుంది. శ్రీనాథ మహాకవి నీలాకాశం వైపు చూస్తూ ఆలోచించుకుంటూ మధ్య మధ్య బంగారపు టొరలోనుంచి ఘంటం బయటకు తీస్తూ తాళపత్ర గ్రంథం మీద వ్రాసుకుంటుంటాడు. మల్లన్న అప్పుడే పొలం నుంచి తిరిగి వచ్చే వేషంతో ముల్లుగర్ర, చెన్నకోల దూరంగా పెట్టి దగ్గరికి వచ్చి కూర్చొని)

మల్లన్న : ఏమిటా గ్రంథం మామా!

శ్రీనాథుడు : కాశీఖండం మల్లన్నా - వచ్చే వసంతోత్సవాలల్లో రాజమహేంద్రవరం వీరభద్రారెడ్డికి కృతి ఇవ్వాలి. మొన్న మేమంతా కాశీయాత్రకు వెళ్ళినప్పుడు ప్రసంగవశాత్తూ ఆయనకు ఆ క్షేత్ర మాహాత్మ్యం చెప్పవలసి వచ్చిందిలే. మల్లన్న : ఓహో! అప్పుడు ఈ బేరం తగిలిందన్న మాట! ఊఁ

శ్రీనాథుడు : బేర మేమిటిలే. ఆ మహారాజు కోరటమే కాదు. నాకు చిన్నతనం నుంచీ కాశీఖండం కూడా అనువాదం చెయ్యాలనే అభిలాష కూడా ఉందిలే. అయితే ప్రస్తుతం ఆ మహారాజు కోరిక ఉద్బోధనమైంది. అంతే.

మల్లన్న : మంచిది. బాగుంది మామా! 'కాశీఖండ మయః పిండం నైషధం విద్వ దౌషధం' అన్నారు పెద్దలు. అయితే ముందే ఏదో ఒక ఆంధ్రరాజుచేత ఆ అయః పిండాన్ని మింగించి తరువాత నైషధ విద్వదౌషధాన్ని ప్రసాదించవలసింది. సమంజసంగా ఉండేది.

శ్రీనాథుడు : ముందు ఔషధం చేతిలో లేందే, ఏమోతుందో చూద్దామని ఇనపముద్ద మింగిస్తే, రోగి అస్తుబిస్తెతే తరువాత గుడ్లు మిటకరించాలిసిందే వైద్యుడు. ఆయన చేతి మాత్ర వైకుంఠ యాత్ర ఔతుంది మన పని.

మల్లన్న : అందుకని ముందే నైషధవిద్యదౌషధాన్ని కనిపెట్టి ఇప్పుడు ఆయు: పిండం మింగబోతున్నావన్న మాట - అయితే ఇది స్కాంద పురాణాంతర్గతం కదూ! మామా సగానికి పైబడ్డదా?

శ్రీనాథుడు : పంచమాశ్వాసంలో ఉన్నాను. కానీ ఇవాళ ఉదయం నుంచీ ఘంటం సాగటం లేదోయ్-

మల్లన్న : కారణం?

శ్రీనాథుడు : మీ నాన్నగారి అనువాద పద్ధతి చూచిన తరువాత కావ్యమంతా మరొక దృక్పథంతో ఆంధ్రీకరిస్తే బాగుంటుందేమోననిపిస్తున్నది.

మల్లన్న : మా నాన్న పద్దతి నిన్నాకర్షించిందా? చిత్రమే - వెనుక ఒక మాట అన్నావు జ్ఞాపకముందో లేదో!

శ్రీనాథుడు : ఏమన్నానేమిటి?

మల్లన్న : కొత్తగా ఛందస్సు నేర్చుకున్న వాళ్ళు చెప్పినట్లుందన్నావు.

శ్రీనాథుడు : ఎప్పుడు?

మల్లన్న : ఆయన నీకు వెనక వీరభద్ర విజయం వినిపించినప్పుడు. శ్రీనాథుడు : ఏమో! అంటే అనే ఉండవచ్చు - అప్పుడు నైషధం సింగామాత్యున కంకితమిచ్చాను. అత్తలేని కొత్త కోడలి కాపురంలా ఉండేది నా పని. నన్ను మహాకవి అని పొగడినా నాకు మనస్సుకు తృప్తిగా ఉండేది కాదు. ఇంకొకడు కవి అంటేనే సహించేవాణ్ణి కాదు. ఛందస్సు కొత్తగా నేర్చుకున్న వాళ్లు చెప్పినట్లుందనన్నా అన్నాను. అప్పటికి విశేష గౌరవమిచ్చి మాట్లాడినట్లే - నా స్థితిని బట్టి -

మల్లన్న : అంతేకాదు. పాండిత్యము ఏ మాత్రమూ లేదన్నావు.

శ్రీనాథుడు : ఆ మాటా అని ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు అంగీకరించ టానికి ఏ అభ్యంతరమూ లేదు. అయినా పాండిత్యానికీ కవిత్వానికీ చుక్కెదురు. లక్ష్మీ సరస్వతులకున్నంత సంబంధం, సహవాసం.

మల్లన్న : మామా, నిన్న రాత్రితో మా నాన్న భాగవతమంతా విన్నావు గదా, నీ వెనకటి అభిప్రాయమేమన్నా సడలిందా?

శ్రీనాథుడు : అబ్బాయీ, బావగారి భాగవత శ్రవణం నాకేదో చెప్పరాని నూతనోత్తేజం కలిగించింది. లేఖిని, వెనక నడచిన నడక నడవనని మొరాయిస్తున్నది.

మల్లన్న : లోపాలేమన్నా ఉంటే దాచకుండా నాతో చెప్పు మామా, నాన్నకు చెప్పి సవరణ చేయిస్తాను.

శ్రీనాథుడు : లోపాలకేం లేవోయ్. వెదకటం మొదలు పెడితే లోపాలు కవికుల గురువు కాళిదాసు కావ్యాలలోనే కనిపిస్తవి. కావలసినన్ని అపాణినీయ ప్రయోగాలు. వాటిజోలెందుకు.

మల్లన్న : మామా ఏమిటాలౌక్యము - రాజా స్థానాలల్లో అలవాటు పడ్డందుకు అది నిన్ను వదిలిపెట్టదా ఏం ఆప్తులతో మాట్లాడేటప్పుడు కూడా!

శ్రీనాథుడు : అయినా బావగారు నిర్దుష్ట, నిర్గద్య నిరోష్ఠ్యాలే వ్రాస్తానని ప్రతిజ్ఞ చేయలేదుగా - అదీకాక మహానుభావుడు ఆయన భాగవతం వింటున్నప్పుడు ఈ చెదపురుగు చేసే పని చెయ్యటానికి మనస్సుకు ఆసక్తే కలగలేదు. వెనుక బావగారి కవిత్వమంటే నాకు గౌరవ ముండేది కాదు. మనస్ఫూర్తిగా చెప్పుతున్నాను. నిన్నటితో నా విశ్వాసం మారిపోయింది.

మల్లన్న : ఆయన ఆశించడు. కాని భవిష్యత్తులో మా నాన్నగారికి ఆంధ్ర కవికుల సార్వభౌముల్లో ఏమన్నా స్థానముంటుందా? శ్రీనాథుడు : ఆయనది ఒక అద్వితీయస్థానము. భావి విమర్శకులు ఆయనను సారస్వతాకాశ శీతమయూఖుడిగా పరిగణిస్తారు. ఆంధ్ర జాతికెంత వయస్సున్నదో ఆంధ్రభాగవత కన్యకకూ అంతవయస్సు. బావగారు ఆంధ్రభాషను పునీతం చేయటానికి పుట్టిన పుణ్యమూర్తి. కవిత్రయం ఏ మహోన్న తాశయాలతో కవితా వ్యవసాయం సాగించారో, ఆ దృక్పథంతో కావ్య రచనకు పూనుకున్నది మళ్ళీ బావగారే - మల్లన్నా! ఆయన చెప్పుకున్నాడే - 'నా జతనంబు సఫలంబు సేసెద పునర్జన్మంబు లేకుండగన్' అని ఆ విధంగానే ఆయనకు పునర్జన్మ లేదనే నా నిశ్చయము. తన తరణోపాయం చూచుకొని కాలం వెళ్ళబుచ్చుకు పోదలుచుకున్న కవి సామాన్యుడు కాడు ఆ వ్యక్తి. తనతో పాటు ఆంధ్రజాతినంతటినీ మోక్షమార్గ సాంయాత్రికులను చేసుకుంటేగాని సంతృప్తి కలగనట్లుంది ఆయన ఆత్మకు. ద్వైపాయనతుల్యుడు గాని సామాన్యుడా?

మల్లన్న : మామా! నీ వింత భావోద్వేగివని నేను ఎన్నడూ అనుకోలేదు.

శ్రీనాథుడు : ఈ మాటలన్నీ శిలాక్షరాలు మల్లన్నా! సమస్త కవితా సాగరాలలోనూ నాకు అందుకోలేని అగాధ జలధిలా ఉన్నది మీ నాన్నగారి కవితాత్మ. - ఇదంతా సత్యమని నమ్ము.

మల్లన్న : సత్యం కాదని కాదు. నీకు అభిమానం కలిగితే అది అవధులు దాటిపోతుందేమోనని నా భయం. లేకపోతే - అష్టాదశ మహాపురాణాలను ఆపోశనం పట్టిన ద్వైపాయన మహర్షికీ మా నాన్నగారికీ ఎక్కడి సామ్యం - ఆయన ఋషిత్వం.....

శ్రీనాథుడు : (సోద్వేగంగా) ఆయన ఋషిత్వమేమిటి? ఆయన దార్శనికస్థితిని తలతన్ని పోయినారు బావగారు.

మల్లన్న : ఏమో!

శ్రీనాథుడు : ద్వైపాయనమహర్షికంటే బావగారిలో ఇంకో విశేషగుణమున్నది. భక్తి భావ పారవశ్యము.

మల్లన్న : ఒకటి మాత్రం సత్యము. మహర్షిని కవితా వైదగ్ధ్యంలో మా నాన్న మించుతాడు.

శ్రీనాథుడు : ఏ మహారాజుకో అంకితమిచ్చేనాడు కవిపండిత సమాజాలు ఏమంటవో వింటావుగా.

మల్లన్న : నరాంకితం చెయ్యటానికి నాన్న అంగీకరిస్తాడా? శ్రీనాథుడు : లేకపోతే గత్యంతరమేముంది. ఈ ఘోర దారిద్ర్యాన్ని ఎన్నాళ్ళు అనుభవిస్తారు.

మల్లన్న : మేమేం దారిద్ర్యాన్ని అనుభవించటం లేదే! కష్టపడిపొలం దున్నుకుంటాం. పండిన దేదో వండుకొని సుష్ఠుగా భోజనం చేస్తాము. పత్తి పండించుకొని వడికి నేయించుకొని బట్టలు కట్టుకుంటాం. మాకేం లోపము? దేనికీ లోపము?

శ్రీనాథుడు : బాగుంది పద్ధతి. ఏముంది. గురివెంద చేరులు పెట్టుకొని కులికే కోయపిల్లకు కంసాలితో పనేముంటుంది. సుఖపడటమంటే ఏమిటో ఎరగని వాళ్ళకు తమకేం కావాలో, ఏం లోపమో ఏం తెలుస్తుంది.

మల్లన్న : భౌతిక జీవితానికి అవసరమైనంత వరకు కోరుకుంటాం. కష్టపడి సంపాదించుకుంటాం. కోరికల కళ్ళాలు సడిలిస్తే మళ్ళీ చేతికి చిక్కుతాయా? ఏదో పరమేశ్వరుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి గాని ఊరికే కోరికలు పెంచుకుంటే మానవజీవితం ఎంత దుర్భరమై పోతుందో ఆలోచించావా?

శ్రీనాథుడు : మేము కష్టపడుతున్నామంటావు. అదంతా వృథా శ్రమ. మనకు కాని శ్రమ. లేకపోతే కవులకు కర్షక వృత్తేమిటి? ఎందుకు -

మల్లన్న : స్వేచ్ఛను చంపుకోకుండా కాపాడుకోటానికి, సత్యాన్ని రాజభయం లేకుండా బహిర్గతం చేసే స్వాతంత్ర్యాన్ని రక్షించుకోటానికి -

శ్రీనాథుడు : స్వనాశన సమయంలో కూడా స్వాతంత్ర్య రక్షణ మనబోటి సంసారులకేం సాగుతుంది. మహాత్ములైన మహర్షులకు గాని.

మల్లన్న : మామా! అయితే నీవు మా నాన్నను ఏ మహారాజునైనా ఆశ్రయించి ఒక అగ్రహారం సంపాదించమంటావు. అంతేనా?

శ్రీనాథుడు : లేకపోతే జీవన సముద్రాన్ని తరించేదెట్లా? దారిద్య్ర నౌక నెక్కితే దరిజేరటానికి అవకాశం ఉందో లేదో ఆలోచించుకోకపోతే ఎలా?

మల్లన్న : 'పునరపి జననం, పునరపి మరణం'గా జీవయాత్ర సాగిద్దామనుకుంటే మటుకు యీ సాంయాత్రికతకు అంతెక్కడో, అవధియెక్కడో కూడా ఆలోచించుకోవాలి కదా? శ్రీనాథుడు : బాగున్నది వేదాంతము. దాని మెళ్ళో మేం పెట్టిన పులిచేరుతాడు పోయినంతకు అమ్ముకుతిన్నారు. పుస్తెల తాడూ అదీ మిగిలింది. సంసారాన్ని ఇంత అయోమయంలో పడేస్తే తరువాత సాగేదెట్లా?

(లోపలినుంచి మాచమ్మ ఎందుకో పని ఉన్నట్లుగా బయటికి వస్తుంది)

మాచమ్మ : ఏమో నాయనా, బాగా నచ్చచెప్పిపో తండ్రీ వీడికైనా. ఆయనకు పట్టిన పిచ్చే వీడికి పట్టింది. సంసారం గొడవ ఆ తండ్రికీ పట్టదు ఈ కొడుక్కూ పట్టదు. పొద్దున లేచింది మొదలు పూజా పునస్కారాలతో ఆయనా, పొలం పనితో వీడూ-

శ్రీనాథుడు : అయితే - ఇంకేం - బాగుపడ్డట్టే.

మాచమ్మ : మీ బావగారితో ఏం చెప్పుతావో ఆలోచించుకో. వియ్యానికీ, కయ్యానికీ సరిసాటి కావాలిగా, సాటివాళ్ళనుగా చేస్తావో సంబంధమే మాను కుంటావో. నేను ఎన్ని తడవలు నెత్తిన నోరు పెట్టుకొని కొట్టుకున్నా, ఆ తండ్రి తండ్రే, ఈ కొడుకు కొడుకే - సంగతులన్నీ ఒక్క మాటు నీవు మాట్లాడితేగాని తేలదు. ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట.

శ్రీనాథుడు : ఆయనకు నా మాటమీద కొంత విలువ ఉన్నదనుకుంటాను. మాట్లాడి చూస్తాను.

మాచమ్మ : చూస్తానంటే కాదు. అదుగోనంటే ఆయన ఆరు నెలలకు మనిషి. నీ యిష్టం ఏమైనా చెప్పు. ఒప్పించి ఇప్పుడే నీ వెంట ఎక్కడికైనా తీసుకోపోతే సరిగాని లేకపోతే నా కాపురం వల్లకాడే.

శ్రీనాథుడు : ఇప్పుడే నా వెంట బయలుదేరుతానంటే నాకు మరీ సంతోషము. రేపటి గోపాలోత్సవాలలోనే భాగవతము సింగభూపతికి ఇప్పించి బావగారికి ప్రత్యేకంగా ఒక ఖండ్రిక శాశ్వతభోగం చేయించనూ.

మల్లన్న : అమ్మా! అదుగో నాన్న (లేచి దూరంగా వస్తూ ఉన్న పోతన్నకు ఎదురుపోయి నెత్తిమీద మూట అందుకొని తీసుకువచ్చి సావట్లో దించుతాడు. మల్లన్న వెనుక పోతన్న నేలచూస్తూ అలసిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ వేదికమీదకు వచ్చి కూర్చుంటాడు. పోతన్న : (మోకాళ్ల మీద చేతులు పెట్టుకొని కూర్చోబోతూ)

రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో

(నెమ్మదిగా కూర్చున్న తరువాత)

శ్రీనాథుడు : బావగారూ.... ఎక్కడ నుంచి?

పోతన్న : అదుగో! పోతవరం పొలిమేరలలో పెద్ద మర్రిచెట్టు నాయనా, విస్తరాకుల కోసమని వెళ్ళి వస్తున్నాను.

శ్రీనాథుడు : మీకు వృద్దాప్యం వచ్చేసింది.

పోతన్న : రాకేముంది. షష్టిపూర్తికి నాలుగో మెట్టులో ఉన్నాను? - ఇదుగో ఈ పని బడి నీతో పగలు భోజనం చేసిన తరువాత మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. ఊఁ ఇప్పుడేమన్నా కొత్తకావ్యం చెపుతున్నావా?

శ్రీనాథుడు : రాజమహేంద్రవరం రెడ్డిరాజు వీరభద్రారెడ్డికి వచ్చే వసంతోత్సవాలల్లో కాశీఖండం అంకితమివ్వాలి. పోయిన ఆషాఢారంభంలో కర్పూరపు తాంబూలము అందుకున్నాను. వ్రాస్తున్నాను.

పోతన్న : గ్రంధం సగభాగమైనా అయిందా? - మొదటినుంచీ నీ కావ్యకన్యకు ప్రౌఢతేనోయ్ -

శ్రీనాథుడు : ప్రౌఢలను మహారాజులుగాని ఏలుకోలేరని నా అభిప్రాయం.

పోతన్న : నీ ఛలోక్తి నేను ఉద్దేశించలేదు.... నాయనా!

శ్రీనాథుడు : బావగారూ! మల్లన్న వినిపిస్తే మీ భాగవతము విన్నాను.

పోతన్న : నా భాగవతమా! నాదేముంది నాయనా! అది వ్యాసభగవానులు భాగవతము.

శ్రీనాథుడు : మీరు వారి అపరావతారము. మీ ఆంధ్రీకరణమార్గం అన్యకవిపాంథగమ్యం కానిది.

పోతన్న : ఆ ఆంధ్రీకరణములో నా ప్రతిభ ఏముంది తండ్రీ! ఆ రామచంద్రమూర్తి నా జిహ్వాగ్రంలో నిలిచి ఏం పలికిస్తే అది వ్రాశాను - భాగవతకర్త శ్రీరామచంద్రమూర్తి కాని మరెవ్వరూ కాదు. శ్రీనాథుడు : మీరెలా భావించినా లోకం భవిష్యత్తులో భాగవతము పోతనామాత్యులదనే చెప్పుకుంటుంది.

పోతన్న : లోకం ఏమని చెప్పుకుంటే నాకెందుకు

శ్రీనాథుడు : బావా, మీరు చాలా అదృష్టవంతులు. కాబట్టే భాగవతము ఆంధ్రీకరించే మహాభాగ్యం మీకబ్బింది - అంతకంటే మరొక విధంగా - భాగవతాంధ్రీకరణము మీ చేతుల్లో పడటము వల్ల ఆంధ్రులు అదృష్టవంతులనటం మరీ సమంజసమైన అభిప్రాయము.

పోతన్న : ఆంధ్రుల అదృష్టముమాట నాకు తెలియదు గాని ఒక విధంగా నేను అదృష్టవంతుడననే భావించుకుంటున్నాను. నా పురాకృత శుభాధిక్యం కాకపోతే రామచంద్రమూర్తి భాగవతం నా నోట పలికించటానికి సంకల్పిస్తాడా?

శ్రీనాథుడు : నన్నయాది మహాకవులు పురాణాలు తెలుగుచేస్తూ భాగవతం తెలిగించక పోవటము నా పురాకృతపుణ్యమని వ్రాసుకున్నారు గానీ - ఆ మహాకావ్యానికి అవసరమైన శక్తి సంపన్నత వారికి లేదని నా అభిప్రాయం.

పోతన్న : ఎంతమాట! ఆంధ్రకవితా విశ్వానికి త్రిమూర్తులు మహాత్ములు నన్నయాదులకు భాగవతాంధ్రీకరణానికి అనుయోగ్యమైన శక్తిలేదని నా అంతరాంతరాలల్లో కూడా అనుమానం లేదు. అవిరళ జప హోమతత్పరుడూ, సంహితాభ్యాసి, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాననిరతుడూ అయిన నన్నయ్యభట్టారుడికి భాగవతాన్ని తెలిగించే ప్రజ్ఞ లేదనుకోటం భావ్యంకాదు. ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడూ శిల్పపారకుడూ, తను కావించిన సృష్టితక్కొరులచేత కాదనిపించుకున్న తిక్కన మహాకవికి ఎదురుతిరిగే వస్తువెక్కడ ఉంటుంది. ఎర్రన్న మాత్రం - సామాన్యుడా. ఆదిగురువులు నడిచిన అనన్య సాధ్యమార్గద్వయంలో అందెవేసిన చేయి - భాస్కరాదులు.

శ్రీనాథుడు : మీ భాగవత కన్యకకు తగ్గ వరుణ్ణి ఊహించాను, బావగారూ!

పోతన్న : మా కన్యకకు సమస్త విధాలా తగ్గవరుణ్ణేనా?

శ్రీనాథుడు : అవును - మదన మోహనుడు, సర్వజ్ఞుడు

పోతన్న : రసార్ణవ సుధాకరుడు!

శ్రీనాథుడు : సింగభూపతి, ఔను రసార్ణవ సుధాకరుడు. పోతన్న : (చెవులు మూసుకొని) ప్రభో! రామచంద్ర ప్రభో!

శ్రీనాథుడు : మీరు కోరుకున్నది ఇప్పిస్తాను.

పోతన్న : మా 'ఓలి' ఈ మండలాధిపతులు ఏమివ్వగలుగుతారు.

శ్రీనాథుడు : మీరు కోరినది ఇప్పించే భారం నాది.

పోతన్న : నాకొక శాశ్వత మహాదానం చేయించాలి.

శ్రీనాథుడు : మీరు కోరిన గ్రామం శాశ్వతవృత్తులతో దాన మిప్పేంచేటట్లు - అంగీకరిస్తారా.

పోతన్న : శాశ్వత వృత్తులతోనా! - కల్ల నాయనా! పిచ్చివాడా, సగరుడు, మాంధాత, నహుషుడు, నాభాగుడు - ఎంతెంత మంది మహాచక్రవర్తులు ఈ లోకంలో జన్మించారో - మృత్యువులు తప్పించుకొని చిరంజీవులైన వాళ్లే అరుదు. అంతటివారే అశాశ్వతులైనప్పుడు ఈ సామాన్య మహా మండలాధిపతులు శాశ్వతులా - వీరు నాకేవిధంగా శాశ్వతదానం చేస్తారు. ఆ శాశ్వతమైన బ్రతుకుతో నేను శాశ్వత దానానికి ప్రతిగ్రహీతను ఎలా కాగలను.

శ్రీనాథుడు : బావగారూ, మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు - పోనీ కర్ణాట చకవ్రర్తిచేత కనకాభిషేకం చేయిస్తాను - ప్రతిగ్రహీతలుకండి. కావ్యకన్యక నిచ్చి కల్యాణం చేయించండి.

పోతన్న : నాయనా! శ్రీనాథా! కర్ణాటభూపతి చేత కనకాభిషేకం చేయించినా - కేవలం కనక కల్పితమైన అగ్రహారం దానం చేయించినా అతడు నా కావ్యకన్యకను వరించటానికి తగ్గ వరుడు మాత్రం కాలేదు - అయినా నాకీ రాజుల వివక్షతో పని ఏముంది. ఆమెను ఎన్నడో పురుషోత్తముడి కిచ్చి ధారవోసి తరించటానికి నిశ్చయించుకున్నాను.

శ్రీనాథుడు : ఇంత వృద్ధాప్యంలో కూడా మీరు ఈ దారిద్ర్య దేవతకు స్వస్తి చెప్పటానికి సంకల్పించుకోలేదన్నమాట.

పోతన్న : అబ్బాయీ! అనిత్యాలైన ఈ శరీరాలకు ఈ దారిద్ర్యమెన్నాళ్లు, ఈ సుఖాలెన్నాళ్లు, క్షణకాలం అయినా నా దారిద్ర్యం ఎవరినీ బాధపెట్టేది కాదే.

శ్రీనాథుడు : ఇదివరకు బాధ పెట్టకపోయినా ఇక ముందు బాధపెట్టక మానదు.

పోతన్న : అంటేమాచమ్మ : (ప్రవేశించి) అంటేనా మల్లన్నకు మావాడు పిల్లనివ్వ దలచుకున్నాడు. చూడబోతే మన ఇంట్లో సూర్యచంద్రాదులు తప్ప ఏమీ లేకపోయెను. ఏమని ఇస్తాడు. వాణ్ణయినా వాడివెంట పంపిస్తే ఇంత పెద్దవాణ్ణిచేసే వాడనుకుంటే అదీ ఆలోచించకపోతిరి. వాడి మెడకు వ్యవసాయం గుదిగొయ్య తగిలించి ఒక వేదాంతిని చేసి కూర్చోపెడితిరి.

పోతన్న : అయితే ఏతావత మల్లన్న పెళ్ళికోసం నాకు ఏ మహారాజుకో కాళ్ళుకడిగి కన్యక నర్పించుకోటం తప్పదన్నమాట! అదేనా మీ అభిప్రాయం. రామచంద్ర ప్రభో, రామచంద్ర ప్రభో!

(మల్లన్న ప్రవేశిస్తాడు)

శ్రీనాథుడు : ఏదో నాకూ కొంత బాధ్యత ఉండబట్టి చెప్పదలచుకున్న మాట లేమిటో నాలుగూ బయట పెట్టాను. తరువాత మీ ఇష్టం.

మాచమ్మ : మన బాగు కోరే గదా వాడు ఏదిచెప్పినా? అంత మీకు తలకు ఎక్కకపోతే ఎవరేం చేస్తారు. ఏమిటా విస్తుపోయి దొంగలు పడి కొంప దోచుకుపోయినట్లు ఆ దిగులూ మీరూ, ఎందుకా తలపట్టుకొని కూర్చోవటం - ఏమిరా మల్లన్నా! మామ ఏమన్నాడో వింటున్నారా?

మల్లన్న : వినకేం, అన్నిమాటలూ లోపలికి వినిపిస్తూనే ఉన్నవి.

మాచమ్మ : అయితే నీ యభిప్రాయమేమిటో స్పష్టంగా మామతో తేల్చిచెప్పు.

మల్లన్న : నా కోసమని ఆయన మనస్సుకు నచ్చని పని బలవంతం చేసి ఆయనచేత ఒప్పించటానికి నేను ఎంత మాత్రమూ అంగీకరించను - అయినా నా పెళ్ళికీ - ఆయన గ్రంథం ఏ రాజుకో అంకితమివ్వటానికి ఎక్కడి సంబంధం?

మాచమ్మ : అయితే మామతో సంబంధం వదులుకోటానికే నిశ్చయించుకున్నావన్న మాట.

మల్లన్న : భాగవతాన్ని మానాన్న మహారాజుకు అంకితమివ్వకపోతే నాకు పిల్లనివ్వటానికి వీల్లేదన్న మాట!

శ్రీనాథుడు : ఏం చూచి ఇవ్వమంటావు?

పోతన్న : సంప్రదాయం చూచి - సౌశీల్యం చూచి. శ్రీనాథుడు : అవేం నా పిల్లకు అచ్చటా ముచ్చటా తీరుస్తవా? అన్నం పెడతవా - అయినా ఒక మాట అడుగుతాను మీకు కోపం రాకుండా ఉంటే. మహారాజులంటే మీకు తృణప్రాయంగా ఉన్నది గాని మీరేం మహాకవులు. తిక్కనాదుల కంటె ఎక్కువా? ఆయన మనుమసిద్ధికి కావ్యం అంకితమివ్వలేదా. ఆయనచేత 'మామా' అని పిలిపించు కోటానికి మనసు పడలేదా-

పోతన్న : చిన్నతనంలో చేసిన తప్పిదాలను చెరిపేసుకోటానికే యజ్ఞం చేసి సోమయాజిగా మారి భారతాన్ని హరిహరనాథాంకితం చేసి అమృతమూర్తి అయినాడు.

శ్రీనాథుడు : మీ కుటుంబ స్థితితో ఈ ఆశయాన్ని ఎంతకాలం నెగ్గించుకుంటారో చూడాలి.

పోతన్న : అదంతా ఆ మహానుభావుడి కృప.

(దారువిగ్రహం వైపు చూపిస్తాడు)

మల్లన్న : మామా! నీకు ఈ విషయంలో ఇంతపట్టుదల ఎందుకు - పిల్లనిచ్చేది నాకు గాని, మా నాన్న సంపాదించి యిచ్చే నా అగ్రహారానికి కాదుగా. అధవా నా దురదృష్టం వల్ల అది పోగొట్టుకుంటాననుకో - అప్పుడేం చేస్తావు?

శ్రీనాథుడు : అందుకని చూసి చూసి పిల్లకు స్వయంగా నా చేతులతో గొంతుకు ఉరిబోసి గోతిలో దించుతానా-

మాచమ్మ : (పోతన్నతో) ఏమండీ! ఏమీ మాట్లాడరేం.

పోతన్న: నన్నేం మాట్లాడమంటావు?

మాచమ్మ : మా వాడు చెప్పిన మాటకు మీరేం సమాధానం చెపుతారు?

పోతన్న : కంఠంలో ప్రాణమున్నంతవరకూ నా కావ్య కన్యకను శ్రీరామచంద్ర మూర్తికి తప్ప ఇతరులకిచ్చి వివాహం చేయలేను.

మాచమ్మ : మా పుట్టింటితో సంబంధం వదులుకుంటానికే సంసిద్ధులై నారన్నమాట.

మల్లన్న : ఎందుకాయనకు ఊరికే ఒత్తిడిచేసి బాధ పెట్టటము.

శ్రీనాథుడు : (లేస్తూ) అక్కయ్యా! వారి దృష్టి వేరు నా దృష్టి వేరు. ఇంక నీకూ - నాకూ ఇంతటితో సంబంధం తీరిపోయినట్లే. మల్లన్నా! నీవైనా నావెంట బయలుదేరి రావటానికి ఏమైనా అభ్యంతరమున్నదా? మల్లన్న : తల్లీతండ్రిని ఒంటరిగా విడిచిపెట్టి - స్వర్గమిచ్చినా బయలుదేరను మామా.

శ్రీనాథుడు : ఈ పండీ పండని పొలాలను నమ్ముకొని దున్నుకుంటూ కర్షక వృత్తితోనే జీవిస్తావన్నమాట.

మల్లన్న : ఈ వృత్తిలో ఉన్న స్వాతంత్య్రం సౌఖ్యం రాజ సౌధాలల్లో కూడా లేదనే నా నమ్మకము మామా!

శ్రీనాథుడు : సరే బాగుంది. వినని వాడికి చెప్పేదెవరు? (లేస్తాడు) అక్కయ్యా! వీడి వ్యవహారం కూడా తేలిపోయింది. బావగారూ సెలవు.

పోతన్న : చీకటిపడబోతుంటే ఇప్పుడెక్కడికి పోదామని.

మాచమ్మ : అన్నం తిని పోదువుగాని - పండువంటి సంబంధం పోతే పోగొట్టుకున్నాను గాని.

శ్రీనాథుడు : నన్ను అనవసరంగా బాధపెట్టవద్దు - (బోయీలను ఉద్దేశించి) ఒరేయ్!

(చకచకా నడిచిపోతాడు)

పోతన్న : శ్రీనాథా! శ్రీనాథా!

మాచమ్మ : తరతరాల నుంచీ వచ్చే సంబంధం చేతులారా పోగొట్టుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా, ఈనాటితో నాకూ నా పుట్టింటికి ఋణం తీరిపోయింది. (కన్నీళ్లతో) మల్లన్నా నీవైనా వాడివెంట వెళ్లరా?

మల్లన్న : నీవు వెళ్లు - ఇక్కడ కష్టపడకపోతే-

మాచమ్మ : ఇంతకూ నేను చేసుకొన్న ప్రారబ్దం - ఈ ఘటం కాస్తా హరీ అన్నా వాళ్లు ఎవరు పట్టుకొని పాకులాడుతారు. ఎవరికి ఏం పట్టింది.

మల్లన్న : అమ్మా! ఏం ప్రయోజనం ఈ మాటలతో - పోయి త్వరగా మడికట్టుకో -

మాచమ్మ : నా కడుపులో ఎంత మండిపోతున్నదో నీకేం తెలుసు - ఎవర్నీ ఏమీ అడగరట!

మల్లన్న : వంటకానివ్వు పోవే -

మాచమ్మ : ఏం బెట్టి - చేతులూ, కాళ్లు, నా కెందుకొచ్చింది. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి - ఈ పూటకు బియ్యం లేవు, ఉప్పులేదు, పప్పు లేదు.

(సురాళించుకొంటూ వెళ్ళిపోతుంది)

నాలుగవ దృశ్యం


(ఒక మంచం మీద పోతన కూర్చొని చెపుతూ ఉంటే మల్లన్న వ్రాస్తూ ఉంటాడు. చెప్పలేక చెపుతూ మధ్యమధ్య పోతన్న జ్వరంతో దగ్గుతూ బాధపడుతూ ఉంటాడు)

పోతన్న : ఖోర్, ఖోర్... ఘోర్ (దగ్గుతాడు)

మల్లన్న : నాన్నా! అంత ఆయాసపడుతూ ఇప్పుడు చెప్పలేక చెప్పలేక చెప్పకపోతే ఏం ముంచుకు పోతున్నది గనుక - పరిసమాప్తం చేయలేక పోతారా, పోనీ జ్వరం బాగా నయమైన తరువాత వ్రాయకూడదూ, ప్రస్తుతము కట్టిపెడదామా?

పోతన్న : అలా కాదులే ... నా మాట విను నాయనా, ఏం వ్రాశావు.

ఖోర్, ఖోర్, ఖోర్ - (దగ్గుతాడు)

మల్లన్న : అదుగో అదేకొంప తీసేది. నిన్నా మొన్నా లేదు. మళ్ళీ వెంట పడ్డది. చాలా చెడ్డదని వైద్యుడు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నా వినిపించుకోకపోతే ఆయన ఏం చేస్తాడు. విశ్రాంతి అవసరం మీ నాన్న గారికని ఇందాక రామస్వామి ఆలయం ముందు కనిపించి మళ్ళీచెప్పాడు.

పోతన్న : (దగ్గుతూనే బాధతో) నన్నేం చేయమంటావురా, నేనేం ఈ దగ్గును రమ్మని పిలిచిపీట వేశానా?

మల్లన్న : కావాలని తెచ్చి పెట్టుకోడం కాకపోతే ఏమిటిది. ఈ విధంగా మనస్సుతో శ్రమచేస్తే ఎంత ప్రమాదం.

పోతన్న : ఖోర్, ఖోర్, ఖోర్ - పరిగెత్తే మనస్సును ఎంత పట్టుకుందామన్నా చేత... కావటం లేదు.

మల్లన్న : పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఉంటుందా?

పోతన్న : (దగ్గుతూ) ఆ కొరత కొంచెం పూర్తి అయితేగాని నాకు నిద్రపట్టదురా మల్లన్నా, నన్నెందుకు బాధ పెడతావు. నా మాట విని... కట్టిపెట్టకు... నశ్వరమైన ఈ దేహానికి ఎప్పుడేదో, రామచంద్రమూర్తికి బాస ఇచ్చాను. చెల్లించుకోలేక పోతే చివరకు ఆ ప్రభువుకు - ఖోర్... ఖోర్... ఖోర్... నాయనా ఏదీమూలం? కానివ్వు

...(తల పట్టుకొని) రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో!

(లోపల నుంచి మాచమ్మ తలకు పట్టువేసి ప్రవేశించి)

సీతమ్మ తల్లి! సీతమ్మ తల్లి!! ఈ చెరలు నేను పడలేకుండా ఉన్నానమ్మా... ఈ సంసారంతో నేను వేగలేకుండా ఉన్నానమ్మా... నాకు ఏ నుయ్యో గొయ్యో చూపించు తల్లీ -

మల్లన్న : ఇప్పుడేమొచ్చిందమ్మా?

మాచమ్మ : ఎప్పుడూ వచ్చేదే ఇప్పుడూ వచ్చింది. గొంతుకు ఉరి పెట్టుకుందామన్నా ఊపిరాడదు గదా! ఏ మహాపాపం చేశానో కాని, అన్నిటికీ ఒక్కతెను ఆడపక్షిని. అటు పొలం పోయి గడ్డే తెచ్చేదా ఇటు పొయ్యి మీది పనే చూసేదా... ఈ పూట నాకు కూడా కాక తగిలినట్లుంది.

మల్లన్న : ఊఁ-కానీ నువ్వుకూడా మంచమెక్కు.

మాచమ్మ : (పోతన్నను చూస్తూ) మహారాజులు ఎక్కేవాళ్ళు ఎక్కితే సరిపోతుంది గాని నేనెక్కితే ఊరుకుంటారా. మెడబెట్టి గెంటుతారు.

మల్లన్న : అమ్మా! ఏం తలనొప్పి వచ్చిందా ఏం - దుప్పికొమ్ము గంధం పట్టేశావు. కాసేపు అలా వెన్ను వాల్చరాదూ తగ్గుతుంది.

మాచమ్మ : ఆ అంత అదృష్టం కూడానా ఆ మోపెడు అంట్లూ ఎవరుతోముతారు. నా తాత వెనక వాళ్ళూ, అబ్బ వెనక వాళ్ళూ-

మల్లన్న : అమ్మా! నీకేం కష్టం వచ్చిందనమ్మా అనవసరంగా అనని మాటలు అనుకోటం. అవతల ఆయన లేవలేకుండా బాధపడుతుంటే ఉత్త అఘాయిత్యం తప్ప.

మాచమ్మ : అంతే.... అంతకంటే ఇంకేమయింది అయ్యకు చేతనైనపని. ఆయనను వెనక వేసుకోరావటం - అయినదానికీ, కాని దానికీ. కష్టపడి కనిపెంచినందుకు అమ్మకు చేసే సాయం బాగుంది నాయనా. బాగుంది.

మల్లన్న : అమ్మా! ఇప్పుడెందుకు అనవసరంగా అంత గొంతు పెట్టుకొని అరవటం.

మాచమ్మ : ఔవ్వ..... నోరు నొక్కేసుకోమన్నావా?

మల్లన్న : అసలు విషయమేమిటమ్మా!

మాచమ్మ : (పోతన్నను చూస్తూ) ఊ, ఆ, అనకుండా చేసే పని చేసి బెల్లం కొట్టిన రాయిలాగా ఊరుకోటం. మల్లన్న : ఎవరు చేశారు. ఏం చేశారు.

మాచమ్మ : చేసిన వాళ్లను అడుగు.

మల్లన్న : ఈ గొడవంతా ఏమిటి నాన్నా!

పోతన్న : (భార్యతో) ఆ భట్రాజువాణ్ణి ఇంతకూ ఇక్కడ యీ పూట భోజనం చేసి పొమ్మన్నందుకేనా ఈ వషట్కారాలన్నీ - ఖోర్, ఖోర్, ఖోర్.

మాచమ్మ : ఒక్కపూట పాలుమాలితే సోలెడు గింజలు ఉడకవేసే ఆడదిక్కు లేదు. కాపరానికి వచ్చింది మొదలు నా వంటఇల్లూ - నేనూ - ఆడదానికష్టం తెలుసుకోలేకపోతే సరి. ఒకరో ఇద్దరో ప్రతిదినం పైమనుషులైతే ఎక్కడ చచ్చేది. పోనీ పంక్తికి భోంచేసి పోయే వాళ్లా అంటే అంతా మా అమ్మ వెనుక చుట్టాలూ, నాన్న వెనుక చుట్టాలూ.

మల్లన్న : ఏదో ఎరిగిన వాడని ఆశిస్తే అంతఅన్నానికి ఏం పోయిందని ఆయన ఉండమన్నారేమో దానికెందుకింత రాద్ధాంతాం. అయినా లేనివాళ్ళకు పెడితేనే ఏమన్నా, ఉన్నవాళ్ళకు పెడితే ఏం వస్తుంది.

మాచమ్మ : లేనివాళ్లకు ఇంతమందికి పెట్టబట్టే మనకింత (నేలచూపిస్తూ) వచ్చింది. అబ్బో! సంస్థానం బమ్మెరవారి సంస్థానం. ఇంటి పేరు కస్తూరి వారు. ఇంట్లో గబ్బిలాల కంపు.

పోతన్న : రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో!! ఖోర్... ఖోర్... ఖోర్ (దగ్గుతాడు)

మాచమ్మ : అయినా నాకెందుకు వచ్చింది. రెక్కల్లో సత్తువున్నంత వరకూ ఇంత ఉడకవేసి పెడతాను. నా మొర ఆలించే వాళ్ళా పాలించే వాళ్ళా - మల్లన్నా! నువ్వు కూడా ఇంత పట్టించుకోక పోతే ఏం చేసేదిరా (కంటతడి పెడుతూ) గింజలు నిండుకున్నవని చెప్పి నాలుగు దినాలైంది కదా... నువ్వు ఏం చేసినట్టు.

మల్లన్న : మొన్న పోటు వేసిన కొర్ర బియ్యం అయిపోయినవా ఏం?

మాచమ్మ : ఇంకా ఎన్నాళ్లువస్తవి నాయనా, అంత అక్షయంగా గడపటానికి నేనేం అనసూయనా! వాటి పుణ్యమా అంటూ అక్కడికి వారం రానే వచ్చినవి.

మల్లన్న : మధ్యాహ్నం ఆ ఉన్న కాసిని సజ్జలూ పోటు వేస్తాను. తరువాత సంగతి తరువాత చూచుకుందాం. ఈ పూటకు ఎక్కడన్నా అప్పు పుచ్చుకో. మాచమ్మ : ఎవరిస్తారు? మన పేరు చెపితే ఎక్కడ పట్టినా భగ్ధం పాడే.

మల్లన్న : అడుగో ఆ దారిన మారన్న మూటనెత్తిన పెట్టుకు వస్తున్నాడు. మరిచి పోయినాను. వెనుక మన కళ్లంలోనే పది మానికలు అప్పు తీసుకున్నాడు. ఇవ్వటానికి వస్తున్నాడనుకుంటాం. నువ్వు త్వరగా మడి కట్టుకొని ఆయనకు ఇవాళనైనా ఇంత ధారకం పోసేటట్టు చూడు.

(మాచమ్మ నిష్క్రమిస్తుంది)

(భార్య వెళ్ళిపోతుంటే) ఖోర్, ఖోర్, ఖోర్ మల్లన్నా! అనేక మాట్లు పరీక్షిస్తున్నాడు, ప్రభువు నన్నెంత అగ్నిపరీక్ష చేస్తున్నాడురా. తీరా సమయం వచ్చేటప్పటికి తానే ఆదుకుంటున్నాడు.

మల్లన్న : మన దగ్గర అప్పు తీసుకున్న గింజలు ఇప్పించటమూ కూడా ఆదుకోటమేనా ఏమైనా ఆయన పరిపూర్ణ కటాక్షాన్ని ఆశించుకొని కూర్చుంటే.

పోతన్న : రామచంద్ర ప్రభో - రామచంద్ర ప్రభో - జగద్రక్షకా తండ్రీ - (లేస్తాడు)

మల్లన్న : నాన్నా! ఏమిటా మంచంలోంచి లేచి పోవటం. నాలుగు లంఘణాలతో పైత్యించి ఆ కాస్తా విరుచుకుపడితే (దగ్గిరికి వచ్చి చేయిపట్టుకొని) దేహం ఇంత కాకెక్కుతున్నదేం (నాడి చూచి) జ్వరం మళ్లీ వచ్చేస్తున్నది. అంతర్గతం పూర్తిగా వదలలేదు మీకు.

పోతన్న : జ్వరం కాదు... చట్టు బండలూ కాదు.

మల్లన్న : మీకీ జబ్బుచేయటమూ నా దరిద్రమే.

పోతన్న : లోకం దృష్టిలో నాకంటే పరమ దరిద్రుడెవ్వడున్నాడు. నాయనా - (మానసిక స్థితిలో మార్పు చూపిస్తూ) అబ్బాయీ, మల్లన్నా చూస్తున్నావా... అదుగో ఎక్కడిదా శతపత్ర సితాంబుజము.... పరిశీలిస్తున్నావా - ఆ అరుణారుణ పాదపల్లవ కాంతులు - నా మీద కనికరించి ప్రభువు వస్తున్నట్లున్నాడురా నేను దరిద్రుడననుకున్నానని ఆఁ - కాదు కాదు నా ప్రభువు కాదు. అయితే ఆ అందెలచప్పుడు వినిపించదే - ఆ కాంచీదామాన్ని చూస్తున్నావా... కాదురా సీతమ్మ తల్లిరా అయోధ్య నుంచి భక్తుణ్ణి చూచి పోదామని బయలుదేరి వచ్చినట్లుంది -

మల్లన్న : నాన్నా! మీకు బాగా పైత్యిస్తున్నది. కాసేపు కళ్లు మూసుకొని పడుకోండి. నేను ఇంతలో కాస్త తేనె పట్టుకొస్తాను. పోతన్న : ఎవరురా యీ తల్లి - ఎక్కడో చూచినట్లే ఉంది కాని గుర్తురావటం లేదు. ఓహో నీవా తల్లీ!

మల్లన్న : అమ్మా! అమ్మా!!

పోతన్న : అమ్మా! రాతల్లీ - అంబుజగర్భురాణీ, నవాంబు జోజ్వల కరాంబుజ - ఈ పేదవాడి కుటీరం మీద ఈనాటికైనా ప్రసరించింది తల్లీ నీ అమృతమయ వీక్షణం - ధన్యుణ్ణి.

(మంచంలో నుంచి లేచి ఊహాకల్పిత మూర్తికి నమస్కరిస్తాడు మోకరిల్లి)

(తలపైకెత్తి) మల్లన్నా అమ్మను పిలూ అర్ఘ్యం తీసుకురమ్మను. పాద్యం తీసుకు రమ్మను. తల్లి వచ్చింది. త్వరగా అమ్మను రమ్మను.

మల్లన్న : (భయంతో వెనకటికంటే పెద్ద గొంతుకతో) అమ్మా! అమ్మా!!

పోతన్న : తల్లీ! కవుల జిహ్వాగ్రంలో నాట్యమాడినంత మాత్రానే వాచాలురను చేసే నీకు నోటిమాటే రావటము లేదు తల్లీ - అదీ నా దారిద్ర్యమే కాబోలు -

మల్లన్న : నాన్నా!

(మాచమ్మ లోపలనుంచీ అబ్బాయీ ఏమిట్రా ఈ గొడవంతా అంటూ ప్రవేశిస్తుంది)

మల్లన్న : పైత్యించిందని ఎంతచెప్పినా వినకుండా అమాంతం ఒకమాటు మంచంలోనుంచి లేచేటప్పటికి నాన్న ఆస్తు బిస్తయిపోయి ఏవో అర్థంగాని మాటలన్నీ మాట్లాడుతున్నాడు.

మాచమ్మ : అయ్యో! అయ్యో! - త్వరగా వైద్యుణ్ణి పిలుచుకురా పోరా - ఒక పని చేస్తారా - ఒకటే మూర్ఖం. ఆ మనిషి పట్టిందేపట్టు - నేను ఆ నొసటి కుంకుమకు కూడా నోచుకోలేదు కామాలి.

మల్లన్న : అమ్మా! నీవేం భయపడవాకు. ఇదుగో ఆయన్ను కదిలించకుండా అలాగే విసనకర్రతో విసురుతూ ఉండు -

(నిష్క్రమిస్తాడు)

పోతన్న : (దీనంగా) అమ్మా! నీ ముఖచంద్రుణ్ణి ఏవో కారుమేఘాలు కప్పేస్తున్నవి తల్లీ - అమ్మా కన్నీరా.... ఎందుకు తల్లీ - ఇలారా అమ్మా నన్ను తుడవనీ - నీ శతపత్ర నేత్రాలు వాడి పోనీయకమ్మా - నా సర్వస్వమూ నీది. ఒక్కమాటు ఆ కారుమేఘాలన్నీ విరిసి పోయేటట్లు తరిపి వెన్నెలలు కాయించుతల్లీ నీ చిఱునవ్వుతో. మాచమ్మ : ఎప్పుడూ మేఘాలు - మట్టీ మశానం - ఇవే మా కొంప తీసినవి - పిచ్చెక్కినా కవిత్వం మానలేదుగదా బ్రాహ్మణుడు. ఈ పిచ్చే అందువల్ల అయితే అదెక్కడికి పోయింది.

పోతన్న : (ఎవరి ప్రశ్నలకో సమాధానమిస్తున్నట్టు). ఔను.... ఆ.... నిరుపేదనే నీవన్నట్లు.... నా జీవనమా? నీ కృపవల్ల... రాజుల నెవరినైనా ఆశ్రయించమంటావా. నా కంఠంలో ప్రాణముండగా.... లేదు తల్లి.... నాకు ఏకోశానా ఆ ఊహలేదు.... ఇదుగో నీవన్నట్లు రామచంద్రమూర్తికే నిన్నిచ్చి కల్యాణం చేస్తాను - వాగ్దానమూ.

(చేతిలో చేయివేస్తున్నట్లుగా చేయి ఉంచి)


కాటుక కంటినీరు చను కట్టుపయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల, ఓ మదంబు, ఓ
హాటక గర్భురాణి నిను నాకటికిం గొనిపోయి అల్ల క
ర్ణాట కరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ -


సంతోషం తల్లీ - తిరోగమిస్తున్నావా - నామాట ఏం చెప్పినట్లు - ఊః సరే-

మాచమ్మ : వెర్రి వేయివిధాలంటారు - ఇది ఆ వేయిలో చేరుతుందో లేదో! ఇటువంటి వాళ్ళు వెనక పుడితేగా చేరటానికి - ఊ చేరదు.

పోతన్న : (అమితానందంతో కళ్ళు.... ముడిచి మళ్ళా తెరిచి) అమ్మా - అమ్మాయి తీరా వెళ్ళి పోయిన తరువాత వచ్చేశాం - అభయమిచ్చేశాను. ఆమె ఆ రామచంద్రమూర్తికే తన్నిచ్చి వివాహం చేయమంది - రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో!! (విగహ్రం వైపు చూస్తూ పరమానందంతో) త్వరలో నీ వివాహం తండ్రీ - అమ్మాయి వచ్చి స్వయంగా నిన్నే వరించింది తండ్రీ - (దారు విగ్రహం ముందు మోకరిల్లి)


నమోనంతాయ సూక్ష్మాయ
కూటస్థాయ విపశ్చితే
నానా వాదానురోధాయ
వాచ్య వాచక శక్తయే -


(సాష్టాంగ ప్రణామం చేస్తాడు. వెనుక మాచమ్మ ఆశ్చర్యంతో ముక్కుమీద వేలు వేసుకొని చూస్తూ నిలబడుతుంది.

(సమాప్తం)

(ప్రజావాణి - 7-10-62 - 28-10-62)

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.