వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/ఉడతా భక్తి
ఉడతా భక్తి
"ఏం చేశాం - మనమేం చేశాం
మన క్షేమానికి మన గ్రామానికి - ఏం చేశాం
పిన్నలు పెద్దలు - పేదలు ధనికులు
ఉడతాభక్తితో ఉత్సాహంతో ఏం చేశాం”
(దూరం నుంచి ప్రచారగీతం వినిపిస్తూ వుంటుంది)
సుబ్బారాయుడు: (కోపకంఠంతో) చెయ్యకేం చేయగలిగిందంతా చేశాం. కరువు కాలంలో నల్లబజారు వ్యాపారం చేసి, నానావిధాల పెట్టెలు నింపుకున్నాం. అడిగినవాడికల్లా అప్పులు పెట్టి, ఆస్తిపాస్తులు కట్టుకున్నాం. డాబాలు పడగొట్టి మేడలు వేశాం. పెళ్ళాల మెళ్ళలోకి పెట్టుకోలేనన్ని నగలు చేయించాం. నాలుగు దిక్కులా డబ్బుగుప్పి, అన్నివిధాలా నాయకులమై కూచున్నాం.
జగన్నాథం: సుబ్బారాయుడు కొంచెం శాంతించవయ్యా...
సుబ్బా: లేకపోతే ఎందుకొచ్చిన ప్రచారాలయ్యా ఇవి. ఎన్నికల కోసమేనా...? ఆనాడు గాంధీజీ కృష్ణజన్మస్థానానికి రమ్మని పిలిచిననాడు పత్తా చిక్కకుండా దాక్కున్న పెద్దలు కారయ్యా వీరు. అసలు తప్పుమీది. మీ బోటివాళ్ళంతా చేరి వీళ్ళకింత ఆధిక్యం తెచ్చిపెట్టారు.
జగన్నాథం: సంగతేమిటో తెలుసుకోకుండా తొందరపడతావేమిటి? ఈ ప్రచారం ఎవరు చేయిస్తున్నారని?
సుబ్బా: ఎవరేమిటి? గ్రామనాయకుడు వినాయకుడు - శ్రీమంతు
జగన్నాథం: పొరపాటు డాక్టరు కుటుంబరావుగారు. సేవాసమితి అంటూ స్థాపించి దానిద్వారా గ్రామానికి కొంత సేవ సేద్దామని, ఆయన నిశ్చయించుకున్నాడు.
సుబ్బా: చెప్పవేం, కొంపదీసి అల్లాగుటయ్యా! జగన్నాథం: ఊళ్ళో పెద్దలందరినీ ఒక్కచోట చేర్చి కార్యక్రమాన్ని గురించి ముచ్చటిద్దామనుకున్నారు.
సుబ్బా: ఇదొక ఊరు. ఈ ఊరికో పెద్దలూనా... వీళ్ళంతా కలవటమే... ఒక్కచోటే కలిసేది కాట్లో.... ఆ వచ్చేది డాక్టరుగారు కదూ...
జగన్నాథం: అవును. మరి నాకు కొంచెం పనివుంది. వెళ్ళివస్తా.
సుబ్బా: (పిలుపుగా) అయ్యా! డాక్టరుగారూ... డాక్టరుగారూ ఒక్కమాటు మా ఇంటికి దయచెయ్యాలి. తమకోసమే రాబోతున్నా.
కుటుం: ఏమిటీ విశేషాలు? ఇంట్లో అంతా కుశలంగా ఉన్నారా?
సుబ్బా: ఏం ప్రశ్న అడిగారండీ? నే బ్రతికి ఉండగా అటువంటి అపభ్రంశపు పని ఎపుడైనా జరుగుతుందీ? ఇల్లంతా ముట్టడుగా ఉంది. చిన్నవాడికి వేప్పూత, మధ్య పిల్లకు మసూచి, పెద్దమ్మాయికి ఒళ్ళెరగని జ్వరం, ఇంటిదానికి కంటిమీద కురుపు, నాకు నడుములో నొప్పి - రాత్రంతా భళ్ళున తెల్లవారింది.
కుటుం: ఎపుడూ మీ ఇంట్లో ఏదోఒకటి వస్తూనే వుంది. మీరు మీ ఇంటి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోకపోతే మా మందులు ఎంతని పనిచేస్తయ్... అవిగో ఇంకా ఆ పెంటదిబ్బలు, మురికి కాలవలు అన్నీ ఇంటి చుట్టూ అలాగే వున్నాయ్.
సుబ్బా: గ్రామపెద్దలతో చెప్పి చెప్పి నోరు కాయ కాసింది. ఈ నిష్టదరిద్రపు గ్రామం ఒదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి ముష్టెత్తుకొని బ్రతుకుతా - ఈ మాటుకు గట్టెక్కించండి.
కుటుం: ఊరేం చేసింది. మన గుణాలు మంచివైతే... దేనికి ఎవర్ని కదిలించినా మీ పేరు చెబుతున్నారు.
సుబ్బా: అవును., చెప్పకేం చేస్తారు. దొరికాను ఊరికెల్లా పాపాలకు భైరవుణ్ణి.
కుటుం: మీకు శ్రీమంతుగారికి ఉన్న శత్రుత్వం వల్ల గ్రామం అష్టకష్టాల పాలౌతున్నది. (అర్ద్రంగా) గ్రామాన్ని ఎలాగైనా బాగు చేయాలని సంకల్పించండి.
సుబ్బా: నేనేం చేస్తాను తాడూ బొంగరం లేనివాణ్ణి ఊరుకోలేక ఏవో నాలుగంటాను, పది పడతాను - ఆ అంతేగా... కుటుం: గ్రామానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉత్సాహవంతులైన కొందరు యువకుల్ని చేరదీసి, సేవాసంఘం స్థాపించాము. ఉడతాభక్తిగ ఎవరికి తోచిన త్యాగం వారిని చెయ్యమని ప్రార్థిస్తున్నాము. మీరూ మాకు మాట ఇవ్వాలి.
సుబ్బా: సాలోచనగా ఏమని?
కుటుం: మీ ఇరువురి శత్రుత్వాలను వదిలిపోవటమే మీ దగ్గరనుంచి మేమర్థించే త్యాగం. తప్పదు. వాగ్దానం చెయ్యండి.
సుబ్బా: (ఆర్ద్రకంఠంతో) గ్రామం బాగుపడుతుందంటే నేను అడ్డు వస్తానా? తప్పకుండా... అతడు అంగీకరిస్తాడని నేననుకోను.
కుటుం: ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి. అదుగో ఆ వచ్చేది శ్రీమంతుగారేనా! శ్రీమంతుగారూ... ఒక్కమాట.
శ్రీమంతు: అక్కడికి రానులెండి. ఇలా తామే దయచెయ్యండి.
కుటుం: అలాకాదు, మీరు ఇక్కడికి వచ్చితీరాలి. చూస్తావేం పిలవ్వయ్యా సుబ్బారాయుడు.
సుబ్బా: రా అన్నయ్యా! అరుగుమీద కూర్చొని మాట్లాడుకుందాం.
కుటుం: శ్రీమంతుగారూ! ఈనాటినుంచీ మీరిద్దరూ సోదరులు. మనస్సులో మాలిన్యమంతా కడిగేసుకోవాలి. గ్రామక్షేమం కోసం మిమ్మల్ని యాచిస్తున్నాను.
శ్రీమంతు: అంతకంటె నాకు కావల్సిందేముంది? నేనెప్పుడూ సంసిద్ధమే.
సుబ్బా: నేనూ అంతే. అన్నయ్యా! ఇంట్లో పిల్లలంతా క్షేమంగా వున్నారా?
శ్రీమంతుడు: ఆఁ మదరాసు నుంచి రాత్రే వచ్చాను. మీ వదినకు జబ్బు కొంత నెమ్మదించింది. ఆసుపత్రిలో నుంచి ఇంకా ఆరు రోజులకు విడుదల చేస్తారు.
కుటుం: ఈనాటినుంచీ మన గ్రామ జీవితంలో ఒక నూతన ఘట్టం ఆరంభమైంది. శ్రీమంతుగారూ.. పెద్దల సహాయంతో పెద్దపని నెత్తికెత్తుకున్నాం. అన్ని రంగాల్లో గ్రామాన్ని ఒక దారికి తీసుకొద్దామని. గ్రామం స్థితిగతులు నానాటికీ తీసికట్టుగా ఉన్నవి. ఆహారానికి, వృత్తికీ, విద్యకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీమంతు: మీ ఉద్దేశం చాలా మంచిదే. దేశంలో అన్ని గ్రామాల స్థితి ఇలాగే వుంది. చింతపడటం తప్ప ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదు. వీటిని ఉద్ధరించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పూనుకోవాలి. అపుడేదైనా మోక్షం కలగాలి. ఏమంటావోయ్ సుబ్బారాయుడు.
సుబ్బా: నా అభిప్రాయమూ అదే. అయినా డాక్టరుగారు శక్తిసంపన్నులు. ఉత్సాహవంతులు.
కుటుం: ప్రతిపనీ ప్రభుత్వం చెయ్యాలనటం సమంజసం కాదు. అదిమటుకు యెన్ని సమస్యలకని? మనమేం చేశామన్న విజ్ఞానం కలిగిస్తే ఆబాలగోపాలం కదిలివస్తుందనీ - అనేక పనులు సాధించవచ్చుననీ నా విశ్వాసం.
శ్రీమంతు: కానివ్వండి. కార్యక్రమం ఏమన్నా వేశారా?
కుటుం: సేవాసంఘం స్థాపించాం. కాని యాజమాన్యాన సమస్తం నడపించాలని అంటే దానికొక మందిరం కట్టాలి. ఉడతాభక్తిగ గ్రామక్షేమానికి ధనం, ధాన్యం, విద్య, శ్రమ, అన్నీ త్యాగం చెయ్యమని అర్థిద్దాం.
శ్రీమంతు: అయితే, నేనే ప్రారంభిస్తాను. ఊరిబయట దక్షిణంగా ఉన్న నా మామిడితోట మందిరానికి నేను త్యాగం చేస్తున్నాను.
సుబ్బా: చాలా బాగుంది. అన్నా! అందులో మందిరం నేను కట్టిస్తాను.
కుటుం: భేష్! నేను ఉచిత వైద్యశాలకు ఒక భవనం కట్టిస్తాను.
శ్రీమంతు: తరువాత వైద్యం కూడా చెయ్యాలి సుమా...
కుటుం: మీ అందరి సహాయం వుంటే అలాగే తప్పకుండా... ఇక గ్రామంలో చిన్న, పెద్ద అందరినీ కలుపుకోవాలి. స్త్రీలలో ఉత్సాహవంతులు ఒకరు కొంత ప్రచారం చెయ్యాలి.
శ్రీమంతు: మా అమ్మాయి గోవర్ధనమ్మతో మాట్లాడండి. నేను చెబుతాను.
సుబ్బా: అయ్యా, డాక్టరుగారూ... అది ఒప్పుకుంటే ఆడవాళ్ళందరితో ఎంత పనైనా చేయిస్తుంది. మహా చురుకైన పిల్ల.
కుటుం: వచ్చే సోమవారం కార్యనిర్వాహక వర్గ సమావేశం. మీరు ఇద్దరూ తప్పకుండా హాజరు కావాలి. సుబ్బారాయుడుగారూ లోపలికి పదండి... పిల్లలెలా వున్నారో చూచి,
చీటి వ్రాయిస్తాను. కంపౌండరు దగ్గరికి వెళ్ళి మందు తీసుకోండి. రెండవ రంగము
(కాలువలోని నీరు పారుతున్న చప్పుడు. పక్షులు కిచకిచలు)
రాళ్ళు బళ్ళమీద తోలుకువచ్చి క్రిందపడవేసే చప్పుడు. కట్టుబడి వేసేవాళ్ళు ఉలితో రాళ్ళు మలిచే చప్పుడు.
“ఎవరో చేస్తారని మనముంటే
ఏమౌతుందో ఎంతౌతుదో
ఉడతాభక్తితో ఉత్సాహంతో
ఏం చేద్దాం మనమేం చేద్దాం
మనక్షేమానికి మన గ్రామానికి”
జగన్నాథం: డాక్టరుగారూ! మీరు సంకల్పసిద్దులు. గ్రామంలో చిరకాలం నుంచీ నిద్రిస్తూ
ఉన్న శక్తిని మేల్కొల్పారు. మహత్తర కార్యాలు సాగిపోతున్నవి. మన గ్రామప్రజల్లో
ఇంత త్యాగనిరతి ఉందని నేను ఎన్నడూ అనుకోలేదు.
కుటుం: (దగ్గుతూ) ఇంతేనా... ఇంకా ఎంతో వుంది. మనజాతికి శక్తి సామర్థ్యాలు లేకనా, జిజ్ఞాస కలగక, కలిగించేవాళ్ళు లేక... స్వాతంత్ర్యం వచ్చింది... దాని ఫలితాలు అనుభవింపపోయేముందు సంధియుగం ఏ దేశానికీ తప్పదు.
జగన్నాథం: నిజం. అందువల్లనే అర్థం చేసుకోక పోవటం వల్ల స్వార్థం, ద్వేషం, ఈర్ష్య ఈ మధ్యకాలంలో కనిపించి, అంతా అంధకార ప్రాయంగా ఉంది. శ్రీమంతుగారు గొప్పదానం చేశారు.
కుటుం: కాలవ ఒడ్డున ఇంత అందమైన తోట మన గాంధీ మందిరానికి లభించడం మన అదృష్టం. (దగ్గుతాడు పెద్దగొంతుతో) చంద్రయ్యా, అక్కడికే మహాత్ముని విగ్రహం వస్తుంది. దిమ్మ బలంగా కట్టాలి. అ... అక్కడే విగ్రహం కూడా... ఎంత ముచ్చటగా వుంది... (దగ్గుతాడు)
జగన్నాథం: మీకు శ్రమ ఎక్కువై బాగా సుస్తీ చేసింది. ఈ పనులు ఇంకెవరికైనా ఒప్పచెప్పి విశ్రాంతి తీసుకోకూడదూ...
కుటుం: విశ్రాంతా! ఆగస్టు 15 అయిన తరువాత... మందిరంలో అన్ని శాఖలూ ప్రారంభమైతే గాని, నా ప్రాణం కుదుటపడదు. (దగ్గుతూ) అయితే శేఖరం మిమ్మల్ని కలుసుకున్నాడా! ఏడాదిపాటు రాత్రి పాఠశాలలో వయోజనులకు విద్య నేర్పే అవకాశం ఇప్పించమంటూ వచ్చాడు. జగన్నాథం: వచ్చాడు. ఉద్యోగాలన్నిటికీ ఏంగాని, మెచ్చుకోదగ్గవి - కూటికిలేని కూలి జనం చూపిన త్యాగం... రోడ్లు వేయడం, నీటి కాలవలు తీయటం, మురికి గుంటలు పూడ్చటం ఇది సామాన్యమైన పనా... అనుకున్నపనిలో అర్ధభాగం అప్పుడే అయిపోయింది.
కుటుం: వారి హృదయాలల్లో మహాత్ముడు ప్రవేశించి పని చేయిస్తున్నాడు., (దగ్గుతూ) సాముదాయిక వ్యవసాయ విషయంలో శ్రీమంతుగారూ సుబ్బారాయుడు గారూ కృషి చేస్తామని వాగ్దానం చేశారు.
జగన్నాథం: వారి మైత్రితో గ్రామంతో వాతావరణమంతా మారిపోయింది. చినుకుపడ్డ తరువాత అంతా కలిసి దున్నుదామని రాత్రి రైతులు చెప్పుకుంటుంటే చెవిన బడ్డది.
కుటుం: మంగమ్మగారు బాలబాలికలకు ఆటస్థలం ఇచ్చిందటగా...?
జగన్నాథం: అంతేకాదు, అందులో ఒక మందిరం కట్టించి రేడియో పెట్టిస్తానన్నది.
కుటుం: గోవర్ధనమ్మగారు మహాదొడ్డ ఇల్లాలు. అంత గొప్ప ఇంట పుట్టానన్న గర్వం ఆమెకు అణుమాత్రమైనా ఉందేమో చూడండి. నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నది.
జగన్నాథం: ఆమె దారి చూపించకపోతే గ్రామంలో స్త్రీలు చలించేవాళ్ళు కాదు. చివరకు స్త్రీల త్యాగమే విశేషంగా ఉండేట్లు కనిపిస్తున్నది.
కుటుం: ఎప్పటికైనా కోమల హృదయం స్త్రీల సొత్తు. (దగ్గుతూ) వారిది మాతృ హృదయం - కష్టాలకు కరిగిపోతుంది. త్యాగానికి నిలుస్తుంది. ధర్మానికి కట్టుబడుతుంది.
జగన్నాథం: అదుగో... ఆ వచ్చేది గోవర్ధనమ్మగారేనా? మందిరం చుట్టూ తిరిగి చూసి వస్తున్నట్లున్నది.
కుటుం: మరిచిపోయినాను. స్వాతంత్రోత్సవ సభలకు కార్యక్రమం సక్రమంగా ఏర్పాటు చేశారా? ఏ లోపం రాకూడదు!
జగన్నాథం: అందరికీ ఆహ్వానాలు పంపించాను. ప్రత్యేకం స్వహస్తంతో కలెక్టరుగారు తాము సభకు వస్తామని వ్రాశాడు. శ్రీమంతుగారు ఒక భాగవతార్ గారినీ, సంగీత విద్వాంసులనూ పిలిపిస్తున్నారు. రాత్రి కార్యక్రమం ఏర్పాటు జరిగిపోయింది. అబ్బో 7.20 అయింది. నాకు సెలవియ్యండి. నేను శ్రీమంతుగారిని కలుసుకోవాలి. కుటుం: మంచిది. గోవర్ధనమ్మగారూ! ఇటు, ఇటు..., యెలా వుంది. మన సేవాసంఘం - గాంధీ మందిరం (దగ్గుతాడు)
గోవర్ధ: నమస్తే డాక్టరుగారూ. మహాగొప్పగా వుంది. 'ఉడతాభక్తి' అని పేరు పెట్టి ఊళ్లో వాళ్ళందరినీ దోచేస్తున్నారు.
కుటుం: మీ మహిళాలోకం ఏమనుకుంటున్నారేం?
గోవర్ధ: ఏమనుకుంటారు? డాక్టరుగారు మహానుభావు డనుకుంటున్నారు.
కుటుం: పొగడకండి. గర్వం వస్తుందని భయంగా వుంది. (దగ్గుతాడు)
గోవర్ధ: మీరెంతైనా గర్వపడవచ్చు. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మా గ్రామాన్ని స్వర్గభూమి చేశారు. గ్రామోద్దరణ చరిత్రలో మీ పేరు స్వర్ణాక్షరాలతో లిఖించాలి.
కుటుం: నేను చేసిందేముంది? మన గ్రామానికి మనమేం చేశాం, ఏం చేద్దాం అనే విజ్ఞాన ప్రజలకు కలిగింది. ప్రజాహృదయ రాతిరథం కదలక కదలక కదిలింది. ఇక సమస్తం పూర్తి చేసుకొని నిద్రపోదు. అయినా మీ కృషి ముందు మా కృషి ఎంత? ప్రభాతసేవకు మహిళలు అంగీకరించారా?
గోవర్ధ: అంగీకరించటమేమిటి? స్త్రీలకు సంబంధించిన శాఖలనన్నిటినీ మనమే నడుపుకుందామనుకుంటున్నారు. అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళి శిక్షణ పొంది రావడానికి సిద్ధంగా కొందరున్నారు.
కుటుం: ఇక నాకు వైద్యశాలకు వెళ్ళవలసిన కాలమైంది... సెల విస్తారా...?
గోవర్ధ: సాయంత్రం మిమ్మల్ని కలుసుకొని సవిస్తరంగా మాట్లాడుతాను.
మూడవ రంగము
"బోలో! మహాత్మాగాంధీకి జై,
సేవా సంఘానికి జై... గాంధీ మందిరానికి జై....
(సభా కోలాహలము... జయజయధ్వానాలు)
శ్రీమంతు: సోదర సోదరీమణులారా! ఈనాడు మన గ్రామచరిత్రలో మహా సుదినం. బాపూజీ రామరాజ్యం కేవలం కలని భావించేవాణ్ణి పూర్వం. స్వల్పకాలంలో ఉడతాభక్తిగా మనం చూపించిన అన్యోన్య సహకారం, సేవ, త్యాగం, అంతటికీ ఒక వ్యక్తి కారకులు. శ్రీ డాక్టరు కుటుంబరావుగారు. మీ అనుమతితో వారికి గ్రామోద్ధారక బిరుదాన్ని ఇస్తున్నాను.
(జై గ్రామోద్ధారక కుటుంబరావుగారికీ జై)
కుటుం: మహాజనులారా! నేనీ బిరుదానికి అనర్హుణ్ణి. అంతేగాక గ్రామానికి నావల్ల జరిగిందేముంది. మీరంతా బీదలు, సాదలు, ధనికులు, కులమతవర్గ విచక్షణ లేకుండా ఉడతాభక్తిగా పిలుపు విని త్యాగం చేశారు. ఇంకా చేయటానికి సంసిద్ధులుగా ఉన్నారు. మనం సాధించవలసినవి ఇంకా ఎన్నో వున్నవి. దీనికి మహత్తర త్యాగం అవసరం. త్యాగం లేని సంఘం జీవించలేదు. ఇది ముఖ్య సిద్ధాంతం. మన మందరమూ ఉత్తమ సేవకులు అయిన శ్రీ జగన్నాథంగారికి ఎంతో ఋణపడ్డాము.
(జై జగన్నాథం గారికీ జై)
జగన్నాథం: సభాసదులారా! మనలో ఏ ఒక్కరూ మరొకరికి ఋణపడ లేదు. మనదంతా ఒక సమష్టి కుటుంబం. ఇందులో ఈర్ష్యలకు, క్రోధాలకు, విరోధాలకూ తావులేదు. అన్యోన్య సహకారం, ప్రేమ, మైత్రి యివి ఈ కుటుంబ సౌఖ్యానికి ముఖ్య సూత్రాలు. సంఘంలో ఒకరు ఎవరేమైనా నేను సుఖంగా ఉంటానని భావించటం తెలివితక్కువ. వ్యక్తి జీవితం సంఘజీవితం మీద ఆధారపడి వుంది. ఇది నగ్నమైన సత్యం. నాకు ఒకందుకు సంతోషం వేస్తున్నది. మన గ్రామంలో స్త్రీ లోకం ఇంత ఉత్సాహంతో ఇంతకు ముందు ఎన్నడూ సభల్లో పాల్గొనటం నేను చూడలేదు. దీని అంతటికి కారణం మన గోవర్ధనమ్మగారు.
(జై గోవర్ధనమ్మగారికీ జై)
గోవర్ధ: నామీద అభిమానం కొద్దీ సోదరులు నన్ను గురించి చెప్పినమాటను గురించి ప్రసంగించి కాలహరణం చెయ్యదలచుకోలేదు. ఈ స్వాతంత్య్రదినోత్సవ కార్యక్రమంలో ఎన్నెన్నో చిత్రవిచిత్ర విశేషాలను సోదరులు ఏర్పాటు చేశారు. కానీ ఒక్కమాట ఉడతాభక్తిగా అంతో, ఇంతో ధనమనండి, ధాన్యమనండి... లేదు శరీరకష్టమనండి... గ్రామోద్ధరణకు ధారపోయటానికి ముందంజ వేయని స్త్రీ మన గ్రామంలో లేదని నేను సగర్వంగా చెప్పగలను. మేము సంఘంలో మా స్థానాన్ని ఆక్రమించటానికి సమస్తవిధాలా కృషి చేస్తామని ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. (కరతాళ ధ్వనులు) ఏనాటికైనా మన గ్రామం ఆంధ్రదేశంలో... శ్రీమంతు: సోదరులారా! మీకో సంతోషవార్త తెలియజేయడానికి అడ్డువస్తున్నాను. క్షమించండి. కలెక్టరుగారు కారణాంతరాలవల్ల రాలేకపోయినామనీ, మన గ్రామాభ్యుదయాన్ని గురించి ప్రత్యేకచారులవల్ల విని, ఆనందించి ప్రభుత్వం వారికి తెలియజేశామని వార్త పంపించారు
(కరతాళ ధ్వనులు)
గోవర్ధ: మన ఉడతాభక్తి కార్యక్రమాన్ని చూసి వెళ్ళి ప్రభుత్వమే ఈ విధానాన్ని అన్ని గ్రామాల్లో అమలు పరచవచ్చు. అప్పుడు మన ఊరిపేరు మార్మోగి పోతుంది.
(కరతాళ ధ్వనులు)
శ్రీమంతు: అప్పుడు మన గోవర్ధనమ్మగారు, జగన్నాథంగారూ, కుటుంబరావుగారూ ఆఫీసర్లయిపోతారుగామాలి. మనం పంపటానికి వీల్లేదని వ్రాద్దాము. (కరతాళ ధ్వనులు) సోదర సోదరీమణులారా! మేమంతా వృద్ధులమైనాము. ఇక యువకులు ముందుకు రావాలి. వృద్ధులు వారికి స్థానమివ్వాలి. పదవులు అందిపట్టుకుని కూర్చోవటం సంఘద్రోహం. (భేష్... భేష్... భేష్...) ఈ ఉద్దేశంతో ఉడతాభక్తిగా ఇప్పుడే నేను వహిస్తున్న అన్ని అధ్యక్ష పదవులకు రాజీనామా ఇస్తున్నాను. జీవితాంతం వరకూ ఏ పదవీ స్వీకరించను. ఈ మార్గాన్నే అనుసరించమని పెద్దలకు నా మనవి.
(సెహబాస్, సెహబాస్)
సుబ్బా: మహాజనులారా! ఉడతాభక్తి కార్యక్రమానికి తోడ్పడ్డ మహాత్యాగమూర్తులందరికీ సేవాసంఘం కార్యనిర్వాహక వర్గం తరపున వందనాలర్పిస్తున్నాను. ఈనాటి స్వాతంత్య్ర దినోత్సవాలల్లో ఇంకా కార్యక్రమం ఎంతో వుంది. దానిలోనూ తరువాత స్త్రీలకు, పురుషులకు, బాలబాలికలకు ఏర్పాటు చేసిన సంఘం కార్యక్రమాల్లోనూ పాల్గొని ప్రయోజనాలు పొందవల సిందని ఇంతకంటె విరివిగా త్యాగం చేసి గ్రామాన్ని ఉద్ధరించవలసిందని మిమ్మల్ని పదే పదే ప్రార్థిస్తూ విరమిస్తున్నాను.
(దూరం నుంచి క్రింది గీతం వినిపిస్తుంది)
"ఉడతా భక్తితో ఉత్సాహంతో
ఇంకేం చేద్దాం ఈ గ్రామానికి
పిన్నలు పెద్దలు పేదలు ధనికులు
ఏం చేద్దాం మనమేం చేద్దాం”
ఎ.ఐ.ఆర్. విజయవాడ 15-8-1953
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.