వల్లభాయి పటేల్/భార్యావియోగము - స్థితప్రజ్ఞత్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భార్యావియోగము - స్థితప్రజ్ఞత్వము

పటేలు గోధ్రాలో నున్నప్పు డా పట్టణమునఁ బ్లేగు వ్యాధి యతిభయంకరముగాఁ బ్రబలినది. ఆ కోర్టు నాజరు కుమారునకుఁగూడ నా వ్యాధి సోకెను. ఆ కుఱ్ఱవానికి వల్లభాయి చాల సపర్యలుచేసెను. కాని యతని మరణము తప్ప లేదు. వల్లభాయికిఁగూడ జబ్బుచేసినది. ఆ జబ్బుస్థితిలోనే యాయన బండిమీద నానందపట్నమునకు వచ్చెను. వచ్చి భార్యతో కరంసాద్ గ్రామమునకుఁ బొమ్మనిచెప్పి తాను నడియాడ్‌కుబోయెను. ఆయనభార్యకు జబ్బుగానున్న భర్తకు సేవ చేయువలయునని యుండెను. కాని పటేలుమాటకుమాఱాడ లేక యామె యూరకుండెను. ఇంతకు విధి వేఱువిధముగా నున్నది. వల్లభాయి నడియాడ్ చేరఁగనే యారోగ్యము నొందెను. కులాసాగానున్న యాయన భార్య కరంసాద్ చేరఁగనే మంచము పట్టెను. వల్లభాయి యామెను బొంబాయి పంపి యాపరేషను జేయించెను. ఆస్పత్రినుండి భార్య యారోగ్యమును గూర్చి యాయన కనుదినము వార్తలు వచ్చుచునే యుండెను. ఆమె యారోగ్యము నానాటికిఁ జెడి తుదకుఁ బ్రాణాపాయమే కలిగెను. ఆయన కోర్టులో వాదించుచుండగా (1908) భార్య చనిపోయినదని టెలిగ్రాము వచ్చినది. పటేలు వాదమధ్యమున నుండెను. టెలిగ్రాము చదువుకొని యీషణ్మాత్రమైనఁ జలించక తన వాదమును బూర్తిచేసెను. తరువాత మిత్రులు టెలిగ్రాముసంగతి నడుగగా వారి కీ సమాచరముఁ దెలియఁ జేసెను. ఒకసారి పటేలుకు జబ్బుచేసినది. డాక్టరు క్లోరోఫాం మిచ్చి యాపరేషను చేయవలయునన్నాఁడు. "నే నెంత బాధకైన నోర్చుకొనఁగలను. క్లోరోఫార మక్కరలేదు. నా కాపరేషను చేయు'డని పటే లన్నాఁడు.

ఆ ప్రకారమే చేసి యిట్టి ధీరుని నాజన్మములోఁ జూడలేదన్నాఁడు డాక్టరు.

ధీరప్రవృత్తి యాయనకుఁ బ్రధమమునుండి పెట్టిన వెన్నయే.

బారిష్టర్

పటేలు కన్నిఁట నుత్తమశ్రేణియం దుండవలయుననియే కోరిక. తనకంటె నన్నివిధములఁ దక్కువైనవారందఱు నున్నత స్థానముల యందుండుట నాయన సహించలేకపోయెను. ప్లీడరీ వల్ల ధనము నార్జించెను. దానితో బారిష్టరీ చదివి రావలయునని సంకల్పించి యందులకుఁ దగిన యేర్పాటు లన్నిటిని సిద్ధము చేసెను. ప్యాసుపోర్టుకూడ వచ్చినది. అయితే పెద్దపటేలు పేచీలు పెట్టుటలోఁ బ్రముఖుఁడన్న సంగతి ప్రపంచ విఖ్యాతము. అట్లే యాయన తమ్మునితోఁగూడఁ బేచీలోనికి దిగినాఁడు. "నేను నీకంటెఁ బెద్దవాఁడను. నేను బారిష్టరీ చదివిన తరువాత నీవు చదువవలయు"నని తమ్ముని యొప్పించినాఁడు. ఇంగ్లీషులో నిద్దఱపేర్లును వి. జె. పటేలే గనుక నా ప్యాసుపోర్టు పనికి వచ్చినది. అనుకొన్న ట్లన్నగారు వచ్చినతరువాతఁ దమ్ముఁ డింగ్లాండునకుఁ దరలినాఁడు.