Jump to content

వరాహపురాణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరమణీనిశ్చలతా | కారణ! సుగుణాభిరామ! కల్పమహీజో
దార! హరినిహితమానస | సారస! కొలిపాక యెఱ్ఱసచివవరేణ్యా!

1


వ.

అవధరింపుము. రోమశమహాముని మార్కండేయున కిట్లనియె. అట్లు జయవిజయులు భూలోకంబున సంభవింప నరుగుటయు, ననంతరంబ యంబుజాక్షుండు దేవమునిగంధర్వాదుల నవలోకించి.

2


మురారి మునిబృందారకబృందము నూరడించుట

తే.

ఏమి కార్యంబు మీర లూహించి కలఁగి | యిటకు వచ్చితి, రత్కార్య మెల్ల ఫలిత
మయ్యె, నిర్భీతులై నిజా[1]యతనములకు | నుత్సుకత నేఁగి వసియింపుఁ డొకటి వినుఁడు!

3


ఉ.

కోపము పాపకారణము గూడిన తద్దురితంబు దుర్గతి
ప్రాపక, మట్లుగావునను బద్మజు నంతటివానికైన రో
షాపనయం బొనర్పక రయంబునఁ గార్యము దీరునే? మన
స్తాపము నొందనేల? భవితవ్యము లయ్యెడు దైవికంబునన్.

4


క.

రాక్షసకుల మణఁచి, భవ | ద్రక్షణ మొనరింతు నని, సురప్రవరులఁ బ
ద్మాక్షుం [2]డూరార్చి, తగన్ | వీక్షాగోచరుఁడు గాక వేగం బరిగెన్.

5


వ.

అంత.

6


హిరణ్యాక్షజననము

క.

జయవిజయులు దితిగర్భా | శ్రయముఁ బ్రవేశించి, రందు జయుఁ డరిభయదు
ర్జయుఁడు, హిరణ్యాక్షసమా | హ్వయుఁడై యుదయించెఁ ద్రిభువ[3]నార్పిత[4]భయుఁడై.

7


శా.

ఈరీతిం బ్రభవించి రాక్షసకులాధీశుండు బాలత్వకౌ
మారంబుల్ [5]తరియించి, యౌవనమదోన్మాదంబునన్ శత్రుసం
హారోదారవిభూతి నొంది, సురకన్యాశ్రేణి సేవింప, జం
భాతిప్రతిమానుఁడై వసుమతీ[6]భాగంబుఁ బాలింపుచున్.

8

పంచజనావతపట్టణవర్ణనము

క.

పంచజనావతనామో | దంచిత మగుపట్టణంబు, దైత్యుఁడు సంప
ద్వంచితసురపురముగ ని | ర్మించెం, దద్వైభవం బమేయము పొగడన్.

9


సీ.

పరిఖాసమాకీర్ణబంధురమణిమయ | ప్రాకారవలయవిభాసితంబు,
విమలకాంచనకుంభరమణీయగోపుర | ద్వారతోరణజాలవర్ణితంబు,
నసమయప్రసవనేత్రానందశృంగార | వనజాతమారుతవాసితంబు,
రాజమార్గాబద్ధరమణీయకుట్టిమ | పద్మరాగప్రభాభాసితంబు,


తే.

భద్రగజవాజీరథభటభామినీస | [7]మాజదనుజకుమారవిభ్రాజితంబు,
సురగణాపేక్షణీయవస్తుప్రమోద | కరము, పంచజనావతాఖ్యానపురము.

10


చ.

నిరుపమపద్మరాగమణినిర్మితతత్పురహర్మ్యకోటిసు
స్థిరవరహేమకుంభములు తీవ్రతఁ దాఁకి పరిభ్రమించి తే
రురవడి [8]దోరగల్పడిన నొప్పదటంచునొ? దక్షిణోత్తర
స్ఫురదయనాపదేశమునఁ బోవు దివాకరుఁ డబ్దిఁ గ్రుంకఁగన్.

11


చ.

అతులితతత్పురీవిమలహాటకవప్రబహి టాంతిక
స్థితబహుతారకంబులు, తదీయమహాపరిఖాజలంబులన్
బ్రతిఫలితంబులై, యురగపాలకమౌళి సహస్రభాగకీ
లితమహనీయరత్నపటలిం దలపించుఁ బ్రతిత్రియామమున్.

12


చ.

విలసితచంద్రకాంతమణి[9]విశ్రుతతత్పురగోపురంబులం
బొలసిన పూర్ణిమేందుకరపుంజమునన్ జనియించినట్టి ని
ర్మలజలపూరముల్, కడఁగి మంజులహేమమయప్రణాళికా
గళితములై, ప్రపూరములుగా నొనరించు సరోవరంబులన్.

13


ఉ.

రాజితరత్నసౌధగతరాజముఖీముఖలోచనాబ్జవ
క్షోజ[10]కచాదులందుఁ గల సొంపుఁ గనుంగొను వేడ్క మానసాం
భోజమునన్ జనింప, సురముఖ్యులు హేమవిచిత్రపుత్రికా
వ్యాజమున న్వసింతు రనివారణ, దత్పుటభేదనంబునన్.

14

శా.

భావజ్ఞానవచోవిశేషవిజితబహ్మల్, ప్రతాపావలే
పావిర్భావనిరస్తభాస్కరులు, విత్తాదానదానక్రియా
ప్రావీణ్యాపరకిన్నరేశ్వరులు, శౌర్యశ్రీకిరీటుల్, మహీ
దేవక్షత్రియవైశ్యశూద్రులు పురస్థేము ల్విచారింపఁగన్.

15


చ.

తరణిశతప్రతాపుఁడగు దానవభర్తకు రాజధాని, యిం
దిరకు విహారమందిరము, నిర్జరకోటికి సంతతస్పృహా
కరవిభవాకరంబు ననఁగాఁ, బురి బల్మియుఁ గల్మియు న్మనో
హరతయు వేఱువేఱ కొనియాడఁగ నేటికి మాటిమాటికిన్?

16


సీ.

తరుణీరతిశ్రమాహరణమాత్రమె కాని | [11]విచ్చలవిడి గాడ్పు విసర వెఱచుఁ,
[12]గమలవికాసమాత్రమె కాని భానుండు | దీపించి వేఁడిమిఁ జూప వెఱచుఁ,
దరుసస్యపోష్యమాత్రమె కాని జలదంబు | ఘోషించి యతివృష్టి గురియ వెఱచుఁ,
[13]బచనాదిసత్క్రియారచనమాత్రమె కాని | శిఖి తీక్ష్ణకీలలఁ జెలఁగ వెఱచుఁ,


తే.

జండభుజదండమండితమండలాగ్ర | ఖండితాఖండలీయ[14]కాఖండసైన్య
మండలుండగు దనుజేంద్రు మహితశౌర్య | బుద్ధిపాలితమైన తత్పురవరమున.

17


హిరణ్యాక్షుని భీకరతపశ్చర్య

వ.

ఇవ్విధంబున సకలలోకనయనానందకరంబైన పంచజనావతనగరంబున కధీశ్వ
రుండగు హిరణ్యాక్షుం డొక్కనాఁడు, జగంబు నేకచ్ఛత్రంబుగాఁ బాలింపందలంచి, నిజ
రాజ్యభారం బమాత్యాధీనంబు చేసి, జటావల్కలంబులు ధరియించి, మునివేషంబునం
జనిచని ముందట.

18


ఉ.

స్వర్వనితావిహారవిలసద్వనఝాటము, శేముషీ[15]తపః
కుర్వదనేకమౌనియుతకూటము, శాఖిశిఖానిరుద్ధస
ప్తార్వరథోరుఘోటము, ననంతవరాటము, శోభమానసౌ
పర్వణపర్వత[16]ప్రవర[17]భర్మకిరీటము, హేమకూటమున్.

19


క.

కనుఁగొని, తచ్చిఖరంబునఁ | గనకాక్షనిశాటకులశిఖామణి, యేకాం
తనిశాంతమధ్యమంబున | ననుమోదవిరాజితాననాంభోరుహుఁడై.

20

సీ.

 జ్వాలాకరాళపావకచతుష్టయమధ్య | ధరణిపై [18]నేకపాదమున నిలిచి,
సతతోర్ధ్వభాగప్రసారితబాహుఁడై | సూర్యబింబముమీఁదఁ జూడ్కిఁ జేర్చి,
యాత్మసంయోజితప్రాణుఁడై పవమాన | భోజియై శాంతిప్రపూర్ణుఁ డగుచుఁ,
బార్వతీయుతవామభాగు సర్వేశ్వరుఁ | గరుణామృతాంశు శేఖరుగుఱించి,


తే.

వర్షశీతాతపాదితీవ్రతకు నోర్చి, | నిర్జితేంద్రియుఁడై, [19]మౌననియతిఁ దాల్చి,
త్రిజగదాశ్చర్యభయదచరిత్ర మొదవ, | [20]నుద్ధతాకృతి నొనరించె నుగ్రతపము.

21


వ.

తత్సమయంబున.

22


ఫాలాక్షుని సాక్షాత్కారము

సీ.

ఘనజటాజూటశేఖరితచంద్రద్యుతి | సీమంతమౌక్తికశ్రీల [21]బెరయ,
గ్రైవేయఫణిఫణారత్ననూత్నప్రభ | తారహారజ్యోత్స్నఁ [22]ద్రస్తరింపఁ,
గటిమండలాబద్ధకరటిచర్మచ్ఛాయ | చీనాంశుకచ్ఛవిఁ జిక్కుపఱప,
రమణీయభసితాంగరాగనైర్మల్యంబు | కుచచందనస్ఫూర్తిఁ గూడి నిగుడ,


తే.

వనిత సామేనఁ గలిగిన వన్నెకాఁడు, | భావసంభవు గెల్చిన పరమయోగి,
పూని యొరులకుఁ బొడగానరానివేల్పు, | దానవాధీశ్వరునకుఁ బ్రత్యక్షమయ్యె.

23


హిరణ్యాక్షవరప్రదానము

వ.

ఇట్లు సాక్షాత్కరించిన ఫాలాక్షునకు హిరణ్యాక్షుం డక్షయప్రణామంబు లాచరించి,
నిటలతటఘటితకరకమలపుటుండై, యుదంచితవాక్ప్రపంచంబున వినుతించి, యప్పర
మేశ్వరునివలన దేవమానవభోగిమనోనిక్షిప్తభయంబగు త్రైలోక్యజయంబును, బరిపంథి
జాలహృదయాభీలంబగు శూలంబును, [23]దళితాఖిలదివ్యశస్త్రంబగు పాశుపతాస్త్రంబును, దిర
స్కృతమేరుమహత్త్వంబగు బాహుసత్త్వంబును వరంబులుగాఁ గొని, పునఃపునఃప్రణామము
లాచరించి, సకలసంపన్మందిరంబగు నిజపురంబున కరిగి, భృత్యామాత్యసాంగత్యనిత్యా
నందకందళితమానసారవిందుండై, ప్రాజ్యసామ్రాజ్యవిభవంబు లనుభవించుచు, నొక్కనాఁ
డాత్మభవనదక్షిణద్వారప్రాంగణసభామధ్యమంబున.

24


మ.

ధరణీశుల్ సచివుల్ పురోహితులు గంధర్వుల్ దిగీశాది ని
ర్జరులుం గిన్నరు లప్పరోనికరమున్, జ్వాలాముఖాది క్షపా
చరసైన్యంబును గొల్వ, దివ్యమణిభాస్వద్భర్మసింహాసన
స్థిరుఁడై, భూషణదీప్తి భానురుచి నాక్షేపింపఁ గొల్వుండఁగన్.

25

ఉ.

విక్రమశాలి, నయ్యసురవీరుఁ గనుంగొను వేడ్క, నీతినీ
ర్వక్రుఁడు, బుద్ధివైభవనిరాకృతశక్రుఁడు, తత్త్వబోధతీ
క్ష్ణక్రకచాగ్రనిర్దళితసంసృతిచక్రుఁడు, కాంతిధౌతది
క్చక్రుఁడు, రక్షితస్వజనచక్రుఁడు, శుక్రుఁడు వచ్చె నత్తఱిన్.

26


ఉ.

అమ్మునిరాకఁ గాంచి దనుజాగ్రణి, చయ్యన లేచి, యర్ఘ్యపా
ద్యమ్ములు వందనాదివిహితాచరణంబులు చేసి, రత్నపీ
ఠమ్మున నుంచి, యంజలిపుటంబు లలాటమునన్ ఘటించి, వా
క్యమ్ములపద్ధతి న్వినయగౌరవముల్ [24]*గొనసాగ నిట్లనున్.

27


క.

గంగాప్రోతస్విని విక | లాంగునిపై నరుగుదెంచినట్లు, దయాసం
సంగమతి నీవు వచ్చుట | నంగీకృతపుణ్యమూర్తి నైతి మహాత్మా!

28


శా.

నీసామర్థ్యముచేతఁ గాదె రిపుల న్నిర్జించి తత్కాంతలన్
దాసీవర్గముగాఁగ నేలుట, భుజా[25]దండోద్ధతిన్ దిగ్వరా
వాసశ్రేణులు కొల్లలాడుట, జగ[26]ద్వర్ణ్యంబుగా రాజ్యల
క్ష్మీసంపన్నుఁడనై చెలంగుటయుఁ జర్చింపన్ మునీంద్రోత్తమా!

29


ఆ.

నీవు [27]గలుగ మాకు నిఖిలదానవరాజ్య ! వైభవంబు చెడక వన్నెమిగిలి
శత్రురహిత మగుచు శాశ్వతంబై యున్న | దీజగంబులోనఁ దేజరిలుచు.

30


వ.

అనవుడు భార్గవుం డిట్లనియె.

31


ఉ.

తొల్లి నిశాచరేశ్వరులు ధూర్జటితుల్యపరాక్రమోన్నతుల్,
బల్లిదులైన దేవతలఁ బాఱ నదల్చి, సమస్తమేదినీ
వల్లభులైరి, కాని, [28]*జనవర్ణితచారుభవత్సమానసం
పల్లలితప్రభావగుణపారగులే? పరికించి చూడఁగన్.

32


సీ.

శోధించితివి శాస్త్రసూక్ష్మంబులైనట్టి | నీతిమార్గంబులు నేర్పుతోడ,
సాధించితివి [29]జగత్సన్నుతం బగుచండ | భుజదండబలమున భువనతతుల,
బాధించితివి ప్రతాపంబున సురకోటి( | గారాగృహంబునఁ గడిమి నునిచి,
రోదించితివి యప్సరోనికాయము నెల్ల | భవదీయశుద్ధాంతభవనభూమి,


తే.

సంహరించితి వనుపమచక్రవాళ | శైలపర్యంతమేదినీశ్వరకఠోర
బాహువిక్రమగర్వవిస్ఫారమహిమఁ, | గలరె నినుఁబోల నొరులు నక్తంచరేంద్ర!

83

శా.

సర్వైశ్వర్యకళానిధాననిజరాజ్యసుండవై, యస్మదా
శీర్వాదంబునఁ బుత్ర[30]మిత్రవనితాశ్రీశాలివై, దేవగం
ధర్వాజేయపరాక్రమస్థిరుఁడవై, ధారాళదానక్రియా
[31]వార్వాహప్రతిమానమూ ర్తి వగుచు న్వర్ధిల్లు దైత్యోత్తమా!

34


వ.

అని భార్గవుం డనర్గళాశీర్వచనపూర్వకంబుగాఁ బలికినఁ, గలికినవ్వులేమొలకలు
కపోల[32]పాలికల నందంద కందలింప, నానందిచంద్రికాసందీప్తవదనేందుమండలుం డగుచు,
నాఖండలవిరోధిమండలేశ్వరుం డమ్మునీశ్వరున కిట్లనియె.

35


జగదుత్పత్తిప్రకారనిరూపణము

క.

లోకత్రయంబులోన సు | ఖాకరమగు భువన మెద్ది? యచ్చట దనుజూ
నీకముతో విహరించెద, | నా కెఱుఁగఁగ నానతిమ్ము నయగుణనిలయా!

36


సీ.

ఆధార మెయ్యది - యఖిల లోకములకు? | వారిధిద్వీపవిస్తార మెంత?
తద్ద్వీపములకు నెందఱు రాజముఖ్యులు? | [33]మన కసాధ్యప్రయోజనము లెవ్వి?
కనకాచలాదులఁ గల వస్తుతతి యెద్ది? | వనజాప్తుఁ డేమార్గమునఁ జరించు?
జంభారినగరంబు సాధించు వెరవేది? | యేవేల్పు నాథుండు దేవతలకు?


తే.

రాజితంబుగ నెవ్వనిచే జగంబు | విరచితంబయ్యె? నన్నియు విస్తరించి
తేటపఱపుము నావుడు, దితిజగురుఁడు | హర్ష మందుచు నిట్లను నసురపతికి.

37


క.

భువిఁ బూర్వదైత్యు లడుగని | వివిధరహస్యములు దెలియవేఁడితివి ననున్
భవ[34]దుదితప్రశ్నములకు | వివరింతు సదుత్తరముల విను మసురేంద్రా!

38


చ.

పులహుఁ డనంగ నొక్కమునిపుంగవుఁ డార్యుఁడు, వాలఖిల్యులం
దలఘుఁ డతండు, మున్ను జలజాప్తునియొద్ద నధీతవేదమం
డలుఁడయి, యమ్మహాత్మువలనన్ ద్రుహిణాండజనిప్రకారముం
దెలియనెఱింగి, యాఘనుఁడు దేవపురంబున కేఁగి నేర్పునన్.

39


క.

ఆమూలచూడముగ సు | త్రామున[35]కు నుపన్యసించెఁ దత్కథ మౌని
గ్రామణి, గీర్వాణసభా | సామాజికకర్ణపుటరసాయనఫణితిన్.

40

చ.

కరుణ దలిర్ప నాదివిజకాంతుఁడు సర్వముఁ జెప్పె నాకు వి
స్ఫురితవచోగతిన్, వరుణపుష్కరతీరమనోజ్ఞకుట్టిమ
స్థిరమణిసౌధమధ్యమవిచిత్రహిరణ్మయభద్రపీఠికాం
తరమునఁ జిత్రకేతుముఖధన్యులు గొల్వ సుఖోపవిష్టుఁడై.

41


మ.

అగభిజ్జల్పితవాక్యపద్ధతి, జ్జగద్వ్యాపారమున్, స్వర్గప
న్నగలోకాచలముఖ్యవిస్తరణముం, దత్తత్ప్రదేశోదితం
బగు సత్పుణ్యకథావిశేషసముదాయంబున్, వచోమాధురిన్
దగ నీకు న్వివరించెద న్వినుము, దైత్యస్తోమచూడామణీ!

42


క.

శిఖివాయుజలవియద్భూ | ముఖభూతసమావృతంబు మునిమర్త్య[36]మరు
త్సుఖసంచరణార్హమునై | నిఖిలబ్రహ్మాండఘటము నెఱి నుదయించెన్.

43


ఉ.

అరయ నయ్యజాండమును, హాటకశైలము దేవతాగిరిన్,
మారుతభుగ్విభుండు ఫణిమండలనాథుఁడు, దిక్కరుల్ హరి
ద్వారణసంఘముం, గమఠవర్యుఁడుఁ గచ్ఛపసార్వభౌముఁ, డా
ధారవిశిష్టశక్తియును దాల్చుచునుండుఁ గ్రమక్రమంబునన్.

44


పాతాళలోకసౌభాగ్యము

వ.

అయ్యాధారశక్తియు విలయసమయంబుల బ్రహ్మాండమధ్యగతంబులగు స్వర్గమర్త్య
పాతాళంబుల హరించు. [37]ఆలోకంబులలోనం బాతాళసౌభాగ్యం బెట్టిదనిన.

45


సీ.

సార్వకాలికశుద్ధజలపూరితములైన | హేలాదిపుణ్యవాహినులు గలిగి,
కిసలయకోరకప్రసవఫలోద్దామ | తరుశోభితోద్యానతతులు గలిగి,
ప్రకటసంజీవనాద్యకలంకదివ్యౌష | ధములఁ జూపట్టు శైలములు గలిగి,
ప్రాకారగోపురప్రాసాదమణిదీప్తి | విమలశాఖాపట్టణములు గలిగి,


తే.

రూపలావణ్యగుణముల రూఢి కెక్కు | నవవయఃపూర్ణనాగకన్యకలు గలిగి,
కల్పభూరుహ[38]నవరత్నకామధేను | పుంజములు గల్గి పాతాళభువన మమరు.

46


చ.

ఎఱుఁగరు కామినీపురుషు లెందు వియోగము, దుఃఖలేశముం
బొరయరు, ప్రాణికోటి సుఖపూర్ణత నొంది, భయంబు లేక య
ధ్వరము లొనర్తు రార్యు, లహివర్యవిషాగ్నికి నోడి శాత్రవుల్
చొరరు, హిమోష్ణబాధలును సోఁకవు తద్భువనాధివాసులన్.

47

క.

శక్రారివర్య! విను, కా | మక్రోధవిమోహలోభమదమాత్సర్యా
ఖ్యాక్రూరాంతరరిపుష | ట్చక్రము నచ్చోట గగన[39]జలజము దలఁపన్.

48


చ.

కలకలకంఠనాదముల గర్వము సర్వము [40]జట్టిగొన్న [41]మం
గళగళసుస్వరంబు గలకాంతలు చెంతలఁ జేరి కొల్వఁగాఁ
గొలకొలమంచు దేవతలు కోరిక లీరిక లొత్త [42]నా గమిం
గిలకిల నవ్వి కేళిఁ [43]దులకింతురు కాంతురు సౌఖ్య [44]మచ్చటన్.

49


వ.

ఇ ట్లనన్యసామాన్యరామణీయకధురంధరంబై పురసరిద్గిరివనరాజివిరాజితంబై న ఫణి
భువనంబు, ద్వాదశకోటియోజనాయతంబును, ద్రయోదశశతాధికపంచాశత్కోటియోజన
విస్తృతంబునునై యొప్పుచుండు. మఱియు జగత్త్రయంబునకు మధ్యమలోకంబైన మహీ
మండలం బెట్టిదనిన.

50


చ.

పురశరధిప్రసిద్ధవనపుణ్యసరిద్గిరియుక్తయై, మనో
హరతరయై, సమస్తవిభవాకరయై చెలువొందు నివ్వసుం
ధర, నురగాధినాయకుఁడు దాల్చు వినిర్మలరత్నమండలాం
తరతరళప్రభావలనధన్యసహస్రఫణాగ్రసీమలన్.

51


కాంచనాద్రి కమనీయత

క.

రాత్రించరేంద్ర! యిట్టి ధ | రిత్రీమధ్యమునఁ గిన్నరీగానకళా
పాత్రమన నొప్పుఁ గాంచన | గోత్రము, మణిసానుకాంతిగుణచిత్రంబై.

52


ఆ.

ఆసువర్ణశైల మాధారముగ దివ్య | రత్నశోభమానరథము నెక్కి
దివిజవరులు పొగడఁ దేజస్సమగ్రుఁడై | సంచరింపుచుండు జలజహితుఁడు.

53


సీ.

రాజహంసావళీరమణీయ మానసా | ద్యమితపుణ్యసరోవరములు గలిగి,
సంతతఫలపుష్పసంపత్సమాకీర్ణ | చైత్రాదివనసమాజములు గలిగి,
యమృతాశనాంగనాసముదయక్రీడామ | నోహరరత్నసానువులు గలిగి,
యభ్రంకషప్రభావిభ్రమోదంచిత | కాంచనశృంగసంఘములు గలిగి,


తే.

పూర్వపశ్చిమసాగరంబులు గమించి | జంభశాసనముఖదేవసదన మగుచు
[45]సోమసూర్యులు [46]చనుపందఁ జోద్యమంది | రాజితంబయ్యె మేరుధరాధరంబు.

54

క.

సంచితతపఃప్రభావో | దంచితులై దనుజవరులు ధరణీస్థలి జ
న్మించినవేళ, భయంబునఁ | గాంచనశైలంబు బలసి కదలరు దివిజుల్.

55


జంబూద్వీపవైభవము

శా.

ఆభర్మాద్రికి దక్షిణంబున, సహస్రాఖండశాఖావళీ
సౌభాగ్యంబును, యోజనద్విశతకోచ్ఛ్రాయంబునుం గల్గి, [47]యా
శాభద్రేభ[48]తనుప్రమాణఫలపుంజవ్యాప్తమై యొప్పు జం
బూభూజాతము, తన్మహాఫలరసోద్భూతప్రభావం బిలన్.

56


క.

జంబూనది యన వరుణది | గంబుధికిం బర్వెఁ, దన్మహావాహినిలో
నం బరఁగు [49]నిసుము పసిఁడై | జాంబూనదనామమునఁ బ్రశస్తి వహించెన్.

57


క.

తద్విటపియోగమున జం | బూద్వీపం బనఁగ భువనపూజ్యంబై యే
తద్వీప మమరె, భూధర | విద్వేషిప్రార్థనీయవిభవం బగుచున్.

58


వ.

అట్టి జంబూద్వీపంబునఁ గనకశైలంబును, మాల్యవత్కుధరంబును, నిషధభూధరం
బును, వింధ్యవసుంధరాధరంబును, హిమవత్పర్వతంబును, బారియాత్రాచలంబును, గంధ
మాదననగంబు ననం బరఁగు సప్తకులపర్వతంబులును, జిత్రశైలకేతుమాలసంవర్తకాది
కేసరనగంబులును, మలయదర్దురశ్వేతశైలత్రికూటాది ప్రత్యంతభూధరంబులును దేవతాధిష్ఠి
తావకాశంబులై, యతిశీతలద్రోణిప్రదేశంబులై, సకలపుష్పఫలసమంచితంబులై, కిన్నర
కింపురుషగంధర్వాదిదివ్యగణనివాసయోగ్యవనవ్రాతంబులై విలసిల్లు. మఱియును
బవిత్రోదకతరంగపటలీనటీనటనరంగాయమానగంగాయమునానర్మదాచర్మణ్వతీ
సరస్వతీశోణాచంద్రభాగాసరయూప్రముఖనిఖలపుణ్యనదీకదంబంబును, మగధ
మత్స్యకళింగశూరసేనకేరళచోళపాండ్యక్రథకైశికాదిసకలదేశనికురుంబంబును,
నారాయణబదరీశంఖకదళీనిషధాదివిశిష్టాశ్రమసముదాయంబునుం గలిగియుండు.
వెండియు, శ్వేతద్వీపంబు లవణేక్షుమధుక్షీరదధిఘృతసలిలపూరితసప్తసాగరపరీతం
బును, గుశక్రౌంచశాకశాల్మలీప్లక్షపుష్కరద్వీపసమేతంబులును, జతుర్వర్గమూల
కందంబును, సకలజగదానందంబునునై యొప్పు. అందు.

59


ఉ.

ఏలిరి మున్ను దేశము లనేకవిధార్జితపుణ్యులై, మహీ
పాలవరేణ్యు లత్యధికబాహుపరాక్రమనిర్జితారులై,
ఫాలమృణాళహారహిమపారదనారదహీరశారదా
వ్యాళవరాలఘుద్యుతిసమంచితకీర్తివధూవిహారులై.

60

క.

ఆ నరనాయకు లెల్లను | దానవకరతీవ్రఖడ్గదళితాంగకులై
ప్రాణములు విడిచి యమర | స్థానమునకు సంతసమునఁ జనిరి మహాత్మా!

61


క.

నీనామము విని [50]యచ్చటి | భూనాయకు లెల్ల వణఁకి భూధరవిపిన
స్థానంబులఁ జరియింతురు | దానోజ్జ్వలగుణసనాథ! దానవనాథా!

62


శా.

శాకద్వీపముఖాంతరీపములు, రాజద్వైభవశ్రీల న
స్తోకఖ్యాతి వహించి దేవసుజనస్తోమాభిరామంబులై,
యేకాలంబును జూడనొప్పు ఋషభాధీశాత్మజవ్రాత[51]బా
హాకౌక్షేయకశక్తిలాలితములై , యక్షీణభావంబులన్.

63


తే.

అట్టి దీవులకడ నుండు నయుతయోజ | [52]నాయతంబగు బంగారుచాయభూమి
యాధరిత్రికిఁ దుదవంక నమరుఁ జక్ర | వాళశైలంబు సకలదిగ్వ్యాప్త మగుచు.

64


క.

అని భార్గవుండు పలికిన | యనుపమవాక్యముల కలరి, యమ్మునితోడన్
దనుజేంద్రుఁ డనియె వెండియు, | ఘనసమయపయోదనినదగంభీరోక్తిన్.

65


మహాప్రళయవివరణము

ఉ.

ఏగతి నాశ మొందు జగ [53]మింతయుఁ? గ్రమ్మఱ సంభవించు నే
లాగునఁ? దద్విభుండును దలంపఁగ నెవ్వఁడు? సర్వమున్ దయా
సాగర! యానతిమ్మనిన, సంయమివర్యుఁడు, దానవాన్వయ
శ్రీగురుమూర్తి, యాదనుజసింహున కిట్లను సాదరంబునన్.

66


క.

సురరిపువర! విను, షష్ట్యుత్తరశతసాధనసమంచితాఖిలసృష్ట్యా
వరణముల నెద్ది దృగ్గో | చరమగు నది నశ్వరంబు చర్చింపంగన్.

67


క.

కాలము సర్వచరాచర | జాలమునకు నాశకమును జనకంబును, ద
త్కాలంబును వంచింపఁగఁ | జాలఁడు కాలాత్ముఁడైన జలజోదరుఁడున్.

68


తే.

అపరపక్షము వచ్చిన నమృతకరుఁడు | కాలపర్యయమునఁ గళాక్షయము నందు
నట్ల, సమయంబు డగ్గఱ నఖిలజగము | నణఁగు, నది మాన్ప నేరికి నలవి గాదు.

69


వ.

అట్టి జగన్నాశప్రకారం బెట్టిదనిన.

70

సీ.

శతవత్సరములు వర్షము లేక ధరమీఁది | సస్యభూరుహలతాజాల మెల్ల
ఫలశూన్యమై పోవఁ బ్రజలు దుర్భిక్షంబు | చేత బెగ్గిలి యతిక్షీణు లగుచు
నిజకులోచితధర్మభజనంబు వర్జించి |చౌర్యసాహసముఖాకార్యనిరతు
లగుచు జీవితములకై పుత్రభార్యాదు | లను విక్రయింపుచు వనములందు


తే.

గిరులయందును దృష్టిగోచరములైన | శాక[54]మూలాదిభక్ష్యముల్ చవులు చూచి
క్షుత్పిపాసాతిశయజాతశోకవహ్ని | చే నశింతురు కాలావసానమునను.

71


క.

పక్షిపశుకీటతతి యధి | కక్షుతృష్ణానలమునఁ గడతేరి [55]చనన్
బక్షీణమగుచు విశ్వము | వీక్షింపఁగ సర్వశూన్యవృత్తి వహించున్.

72


ఉ.

అంతటఁ జండభానుఁడు సహస్రకరంబులు సాచి, భూతలా
భ్యంతర వారిపూరముల నన్నిటిఁ గ్రోలి, యశేషవల్లికా
క్రాంతమహీజగుల్మతృణ[56]రాజిరసంబుల నెల్లఁ బీల్చి, దు
ర్దాంతనిజప్రతాపమున రాయిడివెట్టు నజాండభాండమున్.

73


మ.

ఘనశౌర్యోన్నత! యంతలో నురగలో- కంబందు సంకర్షణా
ననజాతంబగు పావకం బనిలబృందప్రేరితంబై ఘన
స్వనసంపన్నతఁ బ్రజ్వలింపుచును బంచాశచ్ఛతాబ్దంబు లు
గ్రనిరూఢిం గబళించి యాహుతిగొనున్ బ్రహ్మాండసారాంశమున్.

74


క.

నీరేరుహగర్భాండం | బారయ దందహ్యమానమై యప్పగిదిన్
సారము చెడి దగ్ధపటా | కారంబునఁ గానఁబడు జగన్నుతచరితా!

75


మ.

శతపంచాబ్దము లయ్యెడ న్విసరు ఝంఝామారుతం బుగ్రగ
ర్జితము ల్మీఱఁగ మేఘబృందమును వర్షించున్ దిశాసామజా
యతశుండాసమవారిధారల [57]జగం బావారిలోఁ గజ్జల
ప్రతిమంబై యణుఁగు [58]న్విధీందురవితారాముఖ్యపూర్వంబుగన్.

76


వ.

ఇట్లు జగం బేకార్ణవంబైన, వసుంధర గంధరహితయై జలంబునం గలయు. తత్సలిలం
బును గతరసంబై తేజోలీనంబగు. తత్తేజంబులును రూపశూన్యంబై వాయుగతంబగు. త
ద్వాతూలంబును స్పర్శవర్జితంబై యాకాశంబున నణంగు. తద్గగనంబును విగళితశబ్దంబై
భూతాదిం బ్రవేశించు. తద్భూతాదిమహద్రూపస్థగితంబగు తన్మహద్రూపం బహంకార
గ్రస్తంబగు. తదహంకారంబు సత్త్వాదిగుణమిళతంబై కాలగళితంబగు. ఆకాలం బపరి

మేయంబును, నిరవయవంబు నగుటంజేసి యాద్యంతరహితంబును నిత్యంబునై ప్రవర్తించు.
కావునఁ గాలంబుచేతనే చరాచరంబునకు లయంబును బునరుద్భవంబునుం గలుగు. జగత్కర్త
కాలంబ యని చెప్పిన విని, రక్షోవర్యుండు నిజాచార్యున కిట్లనియె.

77


క.

దుర్గమమై [59]యమృతాంధో | వర్గమునకు సతత[60]మును నివాసంబగు నా
స్వర్గమునఁ గల మహత్త్వము | భార్గవ! నా కానతిమ్ము పరమప్రీతిన్.

78


వ.

అనిన శుక్రుం డిట్లనియె.

79


సురలోకభోగభాగ్యములు

క.

శ్రీకరరాజద్విజపట | లీకృతవివిధాధ్వరావళీపుణ్యఫలం
బై కామ్యమాన [61]మగుటయు | [62]నాకముఁ గొనియాడ వశమె నా కమరారీ?

80


ఉ.

భర్గజటాటవీగళితభవ్యనదీతటమందు, శత్రుష
డ్వర్గము నొంచి, భూమి సుఖవర్జితులై తప మాచరించి, స
న్మార్గవిహారులై సుజనమానితులై విలసిల్లువారికిన్
స్వర్గమె కాదె కామ్యఫలసారము, దానవవంశశేఖరా?

81


సీ.

అష్టాంగయోగవిద్యాభ్యాసదక్షులు, | బ్రహ్మచర్యవ్రతఫలితగతులు,
నగ్నిహోత్రాదిక్రియామార్గనిరతులు, | సాంగవేదత్రయాధ్యయనపరులు,
నన్నదానోపార్జితాఖండకీర్తులు, | నిజకులోచితధర్మభజనరతులు,
సముచితౌదార్యనిస్తంద్రు, లత్యంతప్ర | [63]శాంతులు, [64]సంతతసాధు[65]మతులు,


తే.

కదనమున వైరిసేనకు నెదురు నడచి | శస్త్రహతిఁ బ్రాణములఁ బాసి చనిన ఘనులు,
దివ్యకాంతాసహస్రసంసేవ్యు లగుచు | నమరపురమున వసియింతు రసురవర్య!

82


మ.

శ్రుతిపారంగతుఁడై , సదక్షిణమఖస్తోమంబు వాటించి, [66]సం
గతపుణ్యుండగు భూసురోత్తముఁడు, నాకంబందుఁ బ్రాపించు, నూ
ర్జితకల్పద్రుమమంజరీమధుర[67]మైరేయామృతాస్వాద[68]
ర్వితగీర్వాణవధూసితంబభరనీవీమోక్షసత్సౌఖ్యముల్.

83

వ.

మఱియుం దత్పురసౌభాగ్యం బెట్టిదనిన.

84


సీ.

కాంచన[69]గోపురకాంతాన్యదుర్గమ | ప్రాకారపరిఖా[70]విభాసితంబు,
దీపితానేకరథ్యాపార్శ్వ[71]సౌధాగ్ర | కలశనూతనరత్నకాంతియుతము,
దివిజతరంగిణీతీరకల్పకభూజ | భూరిపుష్పామోదపూరితంబు,
సర్వలోకాంగనాసౌందర్యగర్వని | ర్వాపణపటువధూరంజితంబు,


తే.

సతతరాజాధ్వ[72]4పుంజపుంజాయమాన | సంచరద్దేవతాప్రజసంకులంబు,
సకలకల్యాణసౌభాగ్యజననభూమి, | లోకవిశ్రుతచరితంబు నాకపురము.

85


ఉ.

తామరసాపకాంతిసముదాయముతోడుత నంధకారముల్
ప్రేమదలిర్పఁ జెల్మి యొనరించునొకో యనఁ బొల్చుఁ, దన్మరు
ద్ధామమునందు వప్రసముదంచితనిర్మలపద్మరాగసు
త్రామమణిప్రభల్ నభముఁ దార్కొని యొక్కటఁగూడి పర్వినన్.

86


ఉ.

ఆనగరంబులోన దివిజాధిపమండితహేమసౌధసం
తానవిరాజితాగ్రభవనంబులఁ గ్రీడలుసల్పు దేవతా
మానిను లంబుజాసనవిమానతురంగమహంసపంక్తికి
న్మానుగ మందమందగమనంబులు నేర్పుచు నుందు రెప్పుడున్.

87


ఉ.

కారుమెఱుంగురాపొడియుఁ గమ్మపసిండిరజంబుఁ గూర్చి, నీ
హార[73]కరామృతంబుఁ బదనంటఁగఁ జల్లుచుఁ, గాయజుండు శృం
గారరసంబు దీపకళగా నిడి చేసిన బొమ్మలో యనన్,
వారనితంబినీమణు లవారణఁ బొల్తురు తత్పురంబునన్.

88


శా.

ప్రోడ ల్నాథులఁ గూడి యానగరి నారోహావరోహాంగజ
క్రీడాబంధములం బెనంగి[74]నఁ, దదంగిస్వేదముల్ వాయ నీ
రాడం, దత్కుచకుంకుమారుణములై యభ్రాపగాతోయముల్
చూడం బొల్చుఁ, బ్రవాళకాంతి[75]పిహితాస్తోకాభి[76]రామాకృతిన్.

89


క.

నాకమునఁ గల వదాన్యా | నీకముఁ గొనియాడ నేల? నీరసశిలలున్,
[77]మాఁకులుఁ, బశువులు దివిజుల | యాకాంక్షలు దీర్చుచుండు ననిశము ననినన్.

90

క.

అందంబై, భోగలతా | కందంబై, దివిజనయనకంజాతకృతా
నందంబై, శోభిల్లును | నంందనవన మాపురంబునకు నికటమునన్.

91


ఆ.

[78]అఖిలవిబుధలోచనాహ్లాదకారియై | నవ్యమైన తద్వనంబునందు
ననిచి చిగురు చూపి నవపుష్పఫలములఁ | బొలుచు నెపుడు సకలభూజములును.

92


సీ.

నీరజాప్తాలోకనిరవకాశానేక | సంతానభూరుహచ్చాయలందు,
మకరందరసపానమత్తభృంగీగాన | మహితకేళీలతాగృహములందుఁ,
గుముదారవిందసంకులవాసనాబృంద | వాసితనవసరోవరములందుఁ,
గర్పూరమృగనాభికలితసౌరభశోభి | పల్లరచితతల్పమ్ములందుఁ,


తే.

జతురరంభాదికామినీసహితులగుచు, | వాసవానలయమదైత్యవరుణపవన
యక్షవరశంకరాది[79]సమస్తసురులు | వరుసఁ గ్రీడింతు రమ్మహావనములోన.

93


వ.

ఇట్టి నందనారామంబుచేత నభిరామంబగు దివిజధామంబు రామణీయకంబు
మఱియు నెట్టిదనిన.

94


చ.

మరునకు బొమ్మవెట్టి, యభిమానమునం దుదిముట్టి, తాపస
స్ఫురణ వహించినట్టి యతిపుంగవు బుద్ధిసరోరుహంబు, త
త్పురహరిణేక్షణాజనకపోలమిళద్దరహాసచంద్రిక
ల్బెరసిన యాక్షణంబ, ముకుళించును దానవలోకనాయకా!

95


శా.

ఆలోకంబున నుండు సజ్జనులు [80]దేహాశావిపచ్ఛోకతృ
ష్ణాలోభాదివిదూరులై, యమృత మాస్వాదింపుచున్, యౌవన
లావణ్యసమేతులై, [81]యమరులై, శృంగారసంపన్నులై,
కేళీతత్పరులై, సుఖింతురు మృగాక్షీయుక్తులై నిచ్చలున్.

96


క.

[82]అరివీరులఁ దూలింపను, | బరువడిఁ ద్రిదశాలయంబుఁ బరిపాలింపన్
హరి గలఁడు గాన, దివిజులు | వెఱవక వర్తింతు రధికవిభవోన్నతులై.

97


మ.

లలనా[83]రూపము దాల్చి, దైత్యవరులన్ లావణ్యవారాశిలో,
గలయన్ముంచి, విలాసహాసవిలసద్గంభీరవాక్పాశబ
ద్ధులఁ గావించి, పురందరాదులకు సంతోషంబుగాఁ దొల్లి యా
జలజాక్షుండు సుధారసం బొసఁగడే చౌర్యక్రియాశాలియై!

98

క.

అమృతరసాస్వాదనమున | నమరత్వము నొంది సౌఖ్య మందిన దివిజుల్,
క్రమమునఁ [84]దావకసాయక | సముదయమునఁ గూలఁగలరు సమరక్షోణిన్.

99


వ.

అది గావున, భవన్నిశితనారాచధారాసంపాతంబున సురశిరస్సరసిజవ్రాతంబుల
విదళించి, త్రిదశేంద్రసింహాసనారూఢుండవై, నాకలోకసుఖంబు లనుభవించి, నక్తంచ
రాన్వయసముద్ధరణం బొనర్పవలయు. ఇది నీకు విజయకాలంబును, సురలకుఁ బరాజయ
కాలంబునుంగా నెఱుంగుము. అది యెట్లనిన.

100


విశ్రవుని వృత్తాంతము

సీ.

పుండరీకం బనాఁ బురరాజ మొక్కటి | పారియాత్రాచలపశ్చిమమునఁ
బ్రాకారగోపురప్రాసాదకలితమై | విలసిల్లు, నందొక విప్రవరుఁడు
విశ్రవుం డనువాఁడు విత్తాభిలాషియై | వెస నగ్రనందను విక్రయించి,
ధనసంగ్రహము చేసి, తద్విత్త మంతయుఁ | గ్రమమున వృద్ధిమూలమునఁ బెనిచి,


తే.

యనుభవింపను, సముచితవ్యయ మొనర్పఁ | జాల కత్యంతలోభియై సంతతంబు
తద్గతస్వాంతుఁడై యుండి, [85]తౌల్యుఁ డనెడి | వైశ్యునకు నాదరంబున వడ్డికిచ్చె.

101


తే.

అంతఁ దద్వైశ్యమందిరాభ్యంతరమునఁ | గల ధనంబెల్లఁ దస్కరాక్రాంతమైన,
విప్రవర్యుండు తద్విత్తవిలయశోక | తాపదందహ్యమానుఁడై తనమనమున.

102


చ.

అనుచితవర్తనంబనక యాత్మజునిం దెగనమ్మికొన్న యా
ధన మది, భోగదానవిహితవ్యయధర్మపరోపకారసా
ధనముగఁ జేయనేరక, వృథామతినై బహువృద్ధిలాభవ
ర్ధనమదపారవశ్యమునఁ దౌల్యున కిచ్చితి నేఁటి కీగతిన్.

103


చ.

విడిముడి గల్గి యోగ్యమగు వెచ్చము సేయని కష్టలోభిచే
పడిన ధనంబు, చోరనృపబాధలఁ బొందక నిల్వనేర్చునే?
జడమతినైతి, భూమిసురజాతి విశిష్టపథప్రచారమున్
గెడసితి, బేలనైతి, విధి గెల్వఁగవచ్చునె యెంతవారికిన్?

104


క.

చోరుల [86]చేపడి నర్థము | చేరునె పలుమారు చింత చేసిన? నిఁక నే
దారసుతవిత్తమోహవి | కారము వర్జించి, యూర్ధ్వగతిఁ బొందుటకున్.

105

ఉ.

యోగ్యతపం బొనర్తు, నని యుత్తమవర్ణుఁడు నిర్ణయించి, వై
రాగ్యమునొంది, [87]చందనధరాధరబిందుసరోవరంబునన్
వాగ్యతుఁడై, సువర్ణమయవారిజకర్ణిక నుండి, నిత్యసౌ
భాగ్యుని, వేద[88]వేద్యునిఁ, గృపానిధి, సంచితభక్తసేవధిన్.

106


తే.

విష్ణు, బ్రభవిష్ణు నిజమనోవీథి నిల్పి, | చండమార్తాండమండలస్థాపితాగ్ర
దృష్టియై చేసెఁ దపమును స్థిరత మెఱయ, | భూరిమారుతపూరకపూర్వకముగ.

107


వ.

ఇట్లు భూసురశ్రేష్ఠుండు తపోనిష్ఠుండై యుండునంత నొక్కనాఁడు.

108


ఉ.

నీరజమిత్రదత్తమగు నిర్మలహారముఁ బ్రేమఁ దాల్చి, యం
భోరుహతుల్యనేత్రరుచిపుంజము దిక్కులఁ బర్వఁ, గిన్నరీ
స్మేరనుతుల్ చెలంగ, యమ[89]సింధువరాదులు గొల్వఁగా, సునా
సీరుఁడు వచ్చె నచ్చటికి శ్రీకరశుభ్రగజాధిరూఢుఁడై.

109


చ.

దివిజవరేణ్యుఁ డిట్లు చనుదెంచి, సరోవరలక్ష్మి లోచనో
త్సవ మొనరింపఁ గన్గొని, నిజద్విపరాజముచేఁ దదంతర
ప్రవిమలహేమపద్మనికరంబు వెసం [90]దివియింప, నల్గి వి
శ్రవుఁడను విప్రపుంగవుఁడు, జంభనిషూదనుతోడ నిట్లనున్.

110


వ.

సురేంద్రా! నీవు రాజ్యమదాతిరేకంబునఁ గన్నుగానక తపోనిష్ణాగరిష్ఠుండనగు నాచే
నధిష్టితంబగు నేతత్కమలషండంబు భవద్వేదండంబుచేతం ద్రెంచివైపించితివి. కావున, నీ
[91]మహైశ్వర్యంబు రాక్షసాక్రాంతం బగుఁగాక! యని శపియించె. అది కారణంబునఁ ద్రిదశ
రాజ్యంబు సాధ్యంబగు. నీవు చతురంగబలయుతుండవై దండయాత్రకుం బ్రయత్నంబు సేయుమనిన తాపసాధ్యక్షునకు, హిరణ్యాక్షుం డిట్లనియె.

111


ఆ.

అమృత మెట్లు పుట్టె? నది రాక్షసుల వల | పించి, చక్రి దేవబృందమునకు
నెట్లు పంచిపెట్టె? నిక్కథ వినుపింపు | మనుడు, మునివరేణ్యుఁ డతని కనియె.

112


క్షీరసాగరమథనము

క.

దనుజేంద్ర! వినుము, దైత్యులు | ననిమిషపుంగవులుఁ గూడి యమృతరసోత్పా
దనమునకుఁ దగిన యత్నము | మనమున నూహించి, విగతమత్సరు లగుచున్.

118

క.

పొందుగఁ గవ్వము చేసి ర | మందభుజాబలము మెఱయ మణిశిఖరాళీ
సుందరము, విభవవిజితపు | రందరము, మనోజ్ఞకందరము, మందరమున్.

114


క.

తరిత్రాడు చేసి [92]రమరా | సురు లురగీజానిఁ జంద్ర[93]చూడపదాబ్జా
[94]భరణపరికీర్తిగామిని, [95]నరనుతసుగుణైకభూమి, నాగస్వామిన్.

115


వ.

ఇవ్విధంబున సకలసాధనసంపన్నులై, మున్నీరుఁ దరువ సమకట్టినసమయంబునం,
బట్టు బిగితప్పి, యప్పర్వతంబు ఘుమఘుమధ్వానంబుతో మునింగిన.

116


క.

దేవాసురు లపుడు క్రియా | కోవిదభావమును, మథనకుధరోద్ధరణ
ప్రావీణ్యముఁ జాలక, ల | జ్ఞావనతముఖాబ్దులైన యవసరమందున్.

117


కూర్మావతారము

మ.

చతురామ్నాయములుం బదాంబురుహముల్, చండాంశు శీతాంశు ల
ప్రతిమానాక్షియుగంబు, పావకుఁడు శుంభద్వక్త్రముంగా రమా
పతి కూర్మాకృతి దాల్చి, యెత్తె వెరవొప్పన్ వార్ధినిర్మగ్నప
ర్వతరాజంబు. సమస్తరాత్రిచరగీర్వాణుల్ ప్రశంసింపఁగన్.

118


తే.

చరమభాగంబునందు వైశాఖనగముఁ | బూని, మీఁదికి నెత్తి, యంబోనిధాన
మధ్యమున నున్న కమఠేంద్రుమహిమ గాంచి, | యద్భుతంబంది సురలుఁ గ్రవ్యాదవరులు.

119


క.

నిజదివ్యజ్ఞానంబున | భుజగేశ్వరతల్పుఁ డగుటఁ బోలించి, కరాం
బుజములు మొగిచి; రమాపతి, | నజు నిట్లని వినుతి చేసి రందఱు వరుసన్.

120


సురాసురకృతవిష్ణుస్తుతి

లయగ్రాహి.

సాధుజనరక్షణ! ధరాధృతివిచక్షణ! వి | రోధిమదశిక్షణ! రమాధర! పయఃపా
థోధికృతవాస! నిరుపాధికవిలాస! మిహి | కాధవళకీర్తి! దివిజాధిపతిముఖ్యా
రాధికశరీర! పరిశోధితవిచార! ముని | బోధఫలసార! విన[96]తాసుతవిహారా
యోధనజితాసుర! పయోధరసుభాసుర! కృ | పైధితమహీసుర! యశోధనవరేణ్యా!

121

సీ.

సర్వలోకాధీక! సనకాదిసేవిత! | పరమయోగారూఢ! దురితహరణ!
కౌస్తుభశ్రీవత్సకలితవక్షస్స్థల! | రమణీయహారవిరాజమాన!
రత్నకుండలదీప్తిరంజితవదనాబ్జ! | మణికంకణప్రభామహితహస్త!
లలితపీతాంబరాలంకృతకటిసీమ! | కరుణాకటాక్షవీక్షణవిలాస!


తే.

బాలభాస్కరకోటివిభాసమేత! | భాగవతలోకమందారపరమపురుష!
పుండరీకాక్ష! గోవింద! పుణ్యనిలయ! | నిన్ను నెప్పుడుఁ దలఁతు మాపన్నవరద!

122


ఉ.

[97]ఆపదనూనవహ్నిహతు లయ్యు, ముకుంద! గుణాభిరామ! నీ
రూపము సంస్మరించిన నరుల్ ధర దైవికభౌతికాదిసం
తాపములం ద్యజించి, వితతంబగు పుత్రధనాదిలాభ ము
ద్దీపితలీలఁ గాంచి, ప్రముదింతురు శ్రీవనితామనోహరా!

123


ఆ.

అనుచు సురలు వొగడ, ననుపమదరహాస | భాసమానవదనపంకజుండు,
హరి విరించిసహితుఁడై పుండరీకాక్షుఁ | డసురవరులకడకు నరుగుదెంచె.

124


మ.

హరి యేఁతెంచిన, దేవదానవులు నిత్యానందసంపన్నులై
ధరణిం జాఁగిలి మ్రొక్కి పల్కిరి, జగత్కల్యాణ! దుగ్ధాంబుధిం
దరువంగా వెర వానతిమ్మనుటయున్, దాక్షిణ్యవీక్షాకృతా
దరుఁడై దైత్యులఁ గొందఱం బిలిచి, పద్మావల్లభుం డిట్లనున్.

125


క.

ప్రారంభించిన కార్యం | బూరక దిగనాడ, సాహసోదారులకున్
దూరమగుఁ గీర్తి, మానం | బాఱదచను, మేలు [98]చేర దపసడి వచ్చున్.

126


ఉ.

కావున మీరు దేవతలకన్న బలాఢ్యులు దైత్యులార! మీ
భావుకబాహుసత్త్వపరిపాకము లోకము మెచ్చ, భోగిరా
జావృతమందరాద్రిఁ గలశాబ్ధి మథింపుఁడు గ్రమ్మరు న్నిలిం
పావళితోడఁ గూడి, హృదయాంబురుహంబుల నుత్సహింపుచున్.

127


ఆ.

మధ్యమానజలధిమధ్యమంబున సుధా | రసము వొడము, నాదరమున మీకు,
నమరసంఘమునకు నది పంచిపెట్టెద | ననుడు, సమ్మతించి యసురవరులు.

128

మ.

హరివాక్యానుగుణంబుగా, సకలదేవానీకసంయుక్తులై,
పరిపూర్ణోత్సవ[99]జాతహుంకృతులచే బ్రహ్మాండ మల్లాడఁగాఁ,
దరువం జొచ్చిరి దానవుల్ నిజభుజాదర్పంబు రెట్టింప, సు
స్థిరధాత్రీవలయావధిన్, బహుమణిశ్రేణీనిధిన్ వారధిన్.

129


శంకరుఁడు గరళక్షోభము మాన్పి లోకము నుద్ధరించుట

క.

పురికొని తరువఁగ, నాలోఁ | బరమాద్భుతలీల భువనభయదజ్వాలా
తరళము, సర్వదిగంతా | విరళము, గరళంబు సంభవించెన్ మొదలన్.

130


వ.

[100]ఇట్లు ప్రళయానలాభీలంబును, జ్వాలాజాలకరాళంబును, జగన్నాశమూలంబును
నగు కాకోలంబు వొడమి, సకలబ్రహ్మాండమండలోన్మూలం [101]బొనరింపం దలంప, నిలింప
దానవసముదయంబు భయంబు నొంది, రయంబునం గడలి వెడలి, యిక్కార్యంబు చక్కం
బెట్ట దిక్కు ముక్కంటివేల్పు దక్కం దక్కొరుండు లేఁడని మృత్యుంజయుపాలికిం జని.

131


మ.

“పరమేశాయ, పరాత్పరాయ, గిరిజా[102]భాగ్యాయ, తుభ్యం నమః
కరుణాపూరితమానసాయ, విభవే, కల్మాణరూపాయ, శం
కర! మాం [103]పాహి" యటంచు మౌళిఘటితాఖండాంజలీద్వంద్వులై
సురదైత్యుల్ శరణంబు చొచ్చి, గరళక్షోభం బెఱింగించినన్.

132


ఉ.

పాటవ మొప్పఁ జేరి, కరపద్మమునం గబళించి, శీతరు
గ్జూటుఁడు నవ్వుచు న్మెసఁగెఁ జూర్ణితపద్మభవాండమండలీ
[104]పేటము, నుద్ధతారవవిభీషితదేవనిశాటమున్, నినా
ఘాటముఁ, గాలకూటము, నకాండలయంకర[105]రూపకీటమున్.

133


క.

హాలాహలకీలాభవ ! నీలిమ గళమూలమంద, నిలిచిన కతనన్
బాలేందుధరుఁడు, శంభుఁడు, | కాలహరుం డొప్పె నీల[106]కంధరుఁ డనఁగన్.

134


వ.

ఇట్లు కాలకూటంబు శూలిచేత నిష్పీతంబైన, దేవాసురవరులు [107]నిర్భీతులై, జలధి
కొట్టం దొణంగి రంత.

135

శ్రీదేవి ప్రాదుర్భావము

సీ.

శృంగారరసమున జిలుమువోఁ గడిగిన | లలితసువర్ణశలాక యనఁగ,
నమృతాంశుమండ[108]లంబున సానపట్టిన | కమనీయనవరత్నకళిక యనఁగ,
ఘనసారమృగనాభికర్దమంబున దోహ | లం బొనర్చిన తటిల్లతిక యనఁగఁ,
బటు సుధాజలమునఁ బదనిచ్చి చికిలి సే | యించిన వలరాజు హేతి యనఁగ,


తే.

మథ్యమానపయోరాశిమధ్యమమున | నిందిరాదేవి పొడమి, యానంద మొదవ
విశ్వనిర్మాణపరు, నరవిందనాభుఁ | దనర వరియించి, లోకైకజనని యయ్యె.

136


అమృతాపహరణము

చ.

మఱియును దన్మహాజలధిమధ్యమమున్ మథియింపఁగా నిశా
కరుఁడును, గామధేనువును, గల్పమహీచయంబు, దేవతా
కరితురగంబులున్ మొదలుగాఁ గల భవ్యపదార్థజాలముల్
వరుస జనించి మించె ననివారణలీల, ననంతరంబునన్.

137


క.

కరముల నమృతసమన్విత | వరకాంచనకలశ మొకటి వైభవ మెసఁగన్
ధరియించి వెడలె ధన్వం | తరి, తత్సాగరములోన దనుజాధీశా!

138


క.

అంతట సంభ్రమమున ధ | న్వంతరిచేనున్న యమృతవరకలశము వి
క్రాంతమతిఁ గొని [109]దనుక్షే | త్రాంతరమున కేఁగి రసుర లతిరభసమునన్.

139


తే.

జలజలోచనుఁ డపుడు సాక్షాత్కరించి, | నమితకంధరులైన యయ్యమరవరుల
జూచి, మాధుర్యధుర్యవచోనిరూఢి | నతిదయామృత మొలుక ని ట్లనుచుఁ బలికె.

140


సీ.

ఇంద్రాదిసురులార! యింతమాత్రమునకై | చింతింపవలవదు చిన్నవోయి,
[110]యొకక్రమంబునఁ గొని యురవడి దైత్యుల | నాహవక్రీడల నణఁపరాదు,
అయ్యెడునట్టికార్యము గాక మానదు | ప్రాప్తవ్యకర్మంబు ప్రాప్తమగును,
దత్కర్మమును సత్కృతప్రయత్నంబున | ఫలియించుఁ గాలవిపాకసరణిఁ


తే.

గాన, మీరు మనంబునఁ గలఁక యుడిగి | దైత్యు లున్నెడ కరుగుఁ డుత్కంఠతోడ
నంతలోఁ గామినీమూర్తి నవతరించి, | మోహపుట్టించి, వారి నే మోసపుత్తు.

141

చ.

అని హరి యానతిచ్చిన, సుధార్ణవతీరము వాసి దేవతల్
మనమున సంతసం బొదవ, మారుతవేగముతోడఁ దన్మహా
దనుజసమాజవాక్కలహతారనినాదసమేతమైన, యా
దనువనుభూమికిం జని ముదంబున నిల్చి, రనంతరంబునన్.

142


కమలాక్షుని కామినీరూపము

సీ.

చిగురుటాకులనవ్వు చిన్నారియడుగులు, | కరితుండముల మించుమెఱుఁగుఁదొడలు,
సికతామయంబు నాక్షేపించు జఘనంబు, | గగనంబునకు బొమ్మ గట్టునడుము,
కనకకుంభముల బింకము దీర్చుచనుదోయి, | యరవిందముల [111]నేలుహస్తయుగము,
కంబుసౌందర్యంబు కబళించుకంఠంబు, | ముదురుచందురుఁ బోలుముద్దు[112]మొగము,


తే.

నలినదళములఁ దలఁపించునయనయుగళి, | తేఁటితొక్కలచెలువంబుఁ దెగడుకురులు
గలిగి, శృంగార[113]రసజీవకళయుఁ బోలెఁ | గాంతయై శౌరి, దైత్యులకడకు వచ్చి.

143


సీ.

మఱపించుఁ గొందఱ మంజులవాక్సుధా | మాధుర్య [114]మనుచొక్కుమందు చల్లి,
తగిలించుఁ గొందఱఁ దళుకు[115]వాలికచూపు | [116]గము లనువలలకుఁ గదియ నొత్తి,
తిగుచుఁ గొందఱ గండయుగకందళితనూత్న | మందహాసం బనుమచ్చు వైచి,
వలపించుఁ గొందఱ వలిగుబ్బపాలిండ్ల | సవరనిమెఱుఁ గనుజలధి ముంచి,


తే.

మోవిపస చూపి కొందఱ మోసపఱచు, | హస్తసంజ్ఞలఁ గొందఱ నాదరించు,
నంచనడపులఁ గొందఱ [117]నపలపించు, | గానరసమునఁ గొందఱఁ గరఁగఁజేయు.

144


క.

ఈకరణి సకలదనుజా | నీకము వంచించి, మానినీ[118]రూపధర
శ్రీకాంతుఁడు దయతోడ సు | ధాకలశము దెచ్చి దేవతల కర్పించెన్.

145


చ.

త్రిదశులు తత్సుధారస మతిప్రమదంబునఁ గ్రోలి, యెన్నఁడున్
ముదిమియుఁ జావు లేని దృఢమూర్తులు దాల్చి, యసాధ్వసంబునం
ద్రిదివపురంబునందు [119]నమరీనికురుంబవిరాజమానసౌ
ఖ్యదమణిసౌధవీథుల నఖండితులై విహరింతు రెప్పుడున్.

146


వ.

అని యిట్లు దానవాచార్యుండు హిరణ్యాక్షునకు సముద్రమథనవృత్తాంతంబు,
నమృతోద్భవంబు తెఱంగు లెఱింగించె. ఆ సమయంబున.

147

సూర్యాస్తమయవర్ణనము

చ.

కరములు సాఁచి, [120]రాజనిజకాంతఁ, గుముద్వతి నంటెఁ బద్మినీ
వరుఁ, డని లోకులాడు నపవాదము మాన్చుకొనం, బ్రమాణసు
స్థిరమతియై గమించి, [121]జలదివ్య మొనర్చెడువాఁడెపోలెఁ, దా
మరసహితుండు గ్రుంకెఁ జరమస్ఫురితార్ణవమధ్యమంబునన్.

148


ఆ.

చక్రవాకమిథునజాతవియోగాగ్ని | [122]విపులరుచులు వెల్లివిరిసె ననఁగ,
సాంధ్యరాగ మొదవెఁ , జనుఁగ్రొత్తలేతచీఁ | కటి తదీయధూమపటల మనఁగ.

149


చ.

జలరుహబాంధవుం డపరసాగరనీరము సొచ్చె, నింక రాఁ
గలఁడు సుధాంశుఁ, డీనడిమి కందువఁ గాని మదీయజృంభణం
బలవఁడదంచు, భూధరగుహాంతరమార్గవినిర్గతంబులై
[123]కలయఁగఁ బర్వె రోదసి, నఖండగతిం జరఠాంధకారముల్.

150


చ.

సరసుఁడు, తారకాయుతుఁడు, - తుఁడు, రాజకళాకలాపవి
స్ఫురితుఁడు వచ్చుఁ గూర్మిఁ దనుఁ బొందుట కంచుఁ దలంచు యామినీ
తరుణి, రతిక్రియాసముచితంబగు నంబరనూత్నశయ్యపై
నెఱపిన [124]మల్లెమొగ్గ లన నిర్మలతం గనుపట్టెఁ దారకల్.

151


చంద్రోదయసుషమ

సీ.

మోరచిక్కము పద్మములకు, నాఁకటిపంట | రంగచ్చకోర[125]పతంగములకు,
మొగసిరి కైరవంబులకు, నుచ్చాటన | కలితయంత్రం బంధకారమునకు,
వీడాకు నవచక్రవిహగదంపతులకుఁ, | బాయసాన్నము దేవపటలమునకు,
[126]డాకన్ను పద్మాలయాకళత్రున, కభి | చారకృత్యము జారచోరతతికిఁ,


తే.

గూర్మి సైదోడు లచ్చికిఁ, గొడుకుఁగుఱ్ఱ | యంబుధికి, మేనమామ పుష్పాయుధునకు
ననుచుఁ గొనియాడఁ, బూర్వశైలాగ్ర[127]వీథి | సోముఁ డుదయించెఁ జంద్రికోద్దాముఁ డగుచు.

152

వ.

తత్సమయంబున, శౌర్యహర్యక్షుండగు హిరణ్యాక్షుండు, పురందరరమాహరణ
చాతుర్యధుర్యుండగు దనుజాచార్యు వీడ్కొని, యభ్యంతరమందిరంబునకుం జన, మజ్జన
భోజనాదికృత్యంబులు నిర్వర్తించి, దివ్యగంధమాల్యాంబరాభరణంబుల నలంకృతుండై,
[128]సంపాదిత[129]ప్రమోదంబగు ప్రాసాదంబునందును, సంతతోత్సాహ[130]నిదానమ్ములగు నుద్యా
నమ్ములందును, వికసితకమల[131]3కహ్లారంబులగు కాసారంబులందును, రూపవిభ్రమవిలాస
శృంగారరసభాజనంబులగు కామినీజనంబులం గూడి, యామ్రేడితరతిక్రీడాపరతంత్రుండై
యుండె. అంత.

153


ప్రభాతవర్ణనము

మ.

జలజాతంబులు నిద్ర మేలుకొన, నక్షత్రంబు లెందేనియుం
దొలఁగంబాఱ, విహంగసంఘములు అంతుల్ సేయఁ, గహ్లారమం
డలి లావణ్యము జాఱ, జక్కవలు వేడ్కన్ నిక్క, మందానిలం
బెలమిన్వీవఁ, బ్రభాత మయ్యె జగతిన్ హృద్యప్రభాన్వీతమై.

154


సీ.

తిమిర[132]కుంభివిదారణమునకు నుదయాద్రి | [133]దరి నిర్గమించు కేసరి యనంగ,
శీతాంశుకిరణమూర్చితపద్మలక్ష్మికి | సముచిత[134]జీవనౌషధ మనంగ,
యామినీవిరహివిహంగదంపతులకు | సాంగత్య [135]మొనరించు సఖుఁ డనంగ,
భువనాంతరక్షేత్రమున నంశుబీజముల్ | వెదపెట్టు కర్షకవిభుఁ డనంగఁ,


తే.

బరమమునిపుణ్యపరిపాకఫల మనంగఁ, | [136]బ్రాక్సతీపద్మరాగదర్పణ మనంగ,
జంభరిపుసౌధకాంచన[137]కుంభ మనఁగ | సూర్యుఁ డుదయించె [138]నభినందితార్యుఁ డగుచు.

155


అమరారి యమరావతి యాక్రమణము

చ.

అట మును మేలుకాంచి, యసురాన్వయనాయకుఁ డాహ్నికక్రియా
పటలముఁ దీర్చి, మంత్రిహితబంధుపురోహితవారణాశ్వస
ద్భటరథసంఘము ల్గొలువ, బంధురదుందుభినాదసైనికా
ర్భటులు చెలంగ, మత్తగజరాజము నెక్కి, మహెూగ్రమూర్తియై.

156

మ.

ధూమ్రాక్షాదిమదాంధదైత్యదనుజస్తోమంబుతో, వారుణీ
తామ్రాక్షీప్రభ బాలభానురుచి నుద్ఘాటింపఁ, జింతామణీ
కమ్రశ్రీయుతసౌధకల్పతరురంగజ్జంభవిద్విట్పురీ
సామ్రాజ్యంబు హరింపఁ గోరి, కదలెం జండప్రభా[139]వోద్ధతిన్.

157


వ.

ఇట్లు కదలి, హిరణ్యాక్షుం డదభ్రశుభ్రతావిజితసుధాకరమరీచికలగు వీచికల
చేతను, [140]బరిహసితశరన్మల్లికాగుచ్ఛవితానంబులగు ఫేనంబులచేతను, సమభ్యస్తశారదా
నాభివిక్రమంబులగు సలిలభ్రమంబులచేతను, సఫలీకృతసుజనాభిలాషంబులగు
ఘోషంబులచేతను, జలక్రీడారంభవిజృంభమాణరంభాముఖ్యాంభోరుహనయనాశ్రుతిపుట
ఘటితప్రమోదంబులగు హంసకారండవక్రౌంచాదిజలవిహంగమనాదంబులచేతను,
దివిజగణమనోహరహసనాకరండంబులగు కమలకహ్లారషండంబులచేతను, సమాక్రాంత
నభోభాగంబగు ప్రవాహవేగంబుచేతను, ముక్తి[141]ప్రాసాదసమారోహణ[142]సోపానకారంబులగు
తీరంబులచేతను, గామితఫలప్రదాన[143]మణిరత్నపేటికలగు నంతికోద్యానవాటికలచేతను
విలోకనీయమై, త్రిభువనజేగీయమానకీర్తిపతాకిని యగు మందాకినిం జేరంబోయి, తత్పరి
సరంబున విడిసె. అంత.

158


క.

రక్షోవిభుఁడైన హిర | ణ్యాక్షుఁడు యుద్ధాభికాంక్ష నమరనదీతీ
రక్షోణి విడియుట సహ | స్రాక్షుఁడు విని, దివిజ[144]బలసమావృతుఁ డగుచున్.

159


సురాసురభీకరసమరము

శా.

భేరీభాంకృతిఘోరఘోషముల దిగ్భిత్తుల్ ప్రకంపింప,
నారావంబున నంబుధు ల్గలఁగ, రత్నస్యందనం బెక్కి, వి
స్తారోదారజయాంకమాలికల గంధర్వుల్ ప్రశంసింప, దు
ర్వారుండై నగరంబు వెల్వడి, రిపువ్రాతంబు భీతిల్లఁగన్.

160


చ.

రణ మొనరింప, దైత్యశిబిరంబునకై చను జంభభేది జృం
భణమున కుత్సహింపుచును, బట్టిన ముద్గరభిండివాలభీ
షణకరవాలముఖ్యబహుశస్త్రసమన్వితహస్తులై, యవా
రణ మునుమున్న దేవతలు రాక్షసవీరులఁ దాఁకి రుగ్రతన్.

161

క.

దానవు లప్పుడు నిర్జర | సేనాసంరంభమునకుఁ జిత్తంబునఁ గ్రో
ధానలము ప్రజ్వలించిన | నానిర్జరబలముఁ దాఁకి రతిరభసమునన్.

162


క.

ఉభయబలంబులశూరులు | నభిముఖులై యిట్లు పోరి రన్యోన్యజయా
[145]రభటి మనంబులఁ గోరుచు | నభినవదోర్దండశౌర్య మతిశయ మందన్.

163


వ.

తత్సమయంబున నిరువాఁగునుం గలయం బెరసి, గజారోహకులు గజారోహకులును, దుర
గారూఢులు తురగారూఢులును, రథికులు రథికులును, బదాతులు పదాతులును దలపడి,
తుండంబులు ఖండించియు, రదనంబులు విదళించియు, శిరంబులు నురుమాడియుఁ, బాదం
బులు ఛేదించియు, [146]మావతుల నిర్జీవితులం జేసియుఁ, గందరంబులు చిందరలాడియు, నడు
ములు కడికండ లొనర్చియు, వాలంబులు గూలనేసియు, పల్లంబులు డుల్లించియు, [147]రాహుత్తులఁ
దుత్తుమురు గావించియు, యుగ్యంబుల వహనయోగ్యత్వంబులు మాన్పియు, సూతుల
నేపణంచియు, రథాంగంబుల భంగించియు, [148]నక్షంబుల శిక్షించియు, రథుల విరథులం
జేసియు, ఖేటంబుల విటతాటనం బొనర్చియుఁ, [149]గైదువ లైదుపది గావించియుఁ, గుత్తుకలు
కత్తరించియు, భుజదండంబులు చెండాడియు, ఫాలంబులు [150]లీలం బొడిచియు విజృంభించిన,
గజకళేబరగిరినికరంబును, దురంగమతరంగంబును, శతాంగతిమింగిలంబును, బదాతి
కమఠవ్రాతంబును, ధవళచ్ఛత్రచామరఖండడిండీరంబును, బలలాంశప్రవాళజాలంబును,
[151]నాంత్రఘోరాహిసమూహంబును, రక్తప్రవాహవ్యూహపూరంబును నగు సమరసముద్రంబు
రౌద్రంబై కనుపట్టె. అందు.

164


సీ.

పోటున కాశించి, పోక ముందఱ నిల్చి | కుంతఘాతంబులఁ గూలువారుఁ,
బఱతెంచి చలమునఁ బరబలంబులు చొచ్చి | యుడుఖడ్గధారల నొరగువారు,
బిరుదులు పచరించి కరకరి నెదిరించి | [152]చక్రపాతంబుల సమయువారుఁ,
దమవారి కడ్డమై తరిమి భీకరవృత్తి | దోమరహతులచేఁ దూలువారు


తే.

నై, రణంబున నుభయసేనాగ్రచరులు | నవ్యవస్థితవిజయభంగాత్ము లగుచు,
దొమ్మికయ్యం బొనర్చిరి దురవలోక | బాహువిక్రమసంపత్ప్రభావ మమర.

165


ఆ.

 [153]తిరిగి వీఁకఁ బోక, ధృతి తప్పి చెదరక, | నిలిచి యుగ్రశౌర్యకలితు లగుచు,
దేవదైత్యవరులు చేవతోఁ గదనంబు | సలుపుచున్నయట్టిసమయమునను.

166

మ.

అనలుం డేసె నిశాటవల్లభునిపై నభ్రంలిహప్రజ్వల
ద్ఘనకీలా సముదాయమున్, జనదృగగ్రాహ్యస్ఫులింగావళీ
జనితధ్వానవిశేషవజ్ర[154]భవగర్జాభిన్నదై తేయమున్,
దినరాణ్మండలకోటితుల్యసుషమాస్థేయంబు, నాగ్నేయమున్.

167


క.

ఏసినఁ గలంగి నిజసే | నాసముదాయంబు చెదరినం గని, భువన
త్రాసకుఁడగు దనుజేశ్వరుఁ | డాసమయమునందు దివిజు లద్భుత మందన్.

168


ఆ.

[155]బెదరి పఱచువారిఁ బేర్వేఱఁ జీరుచు | నెదురునడుచువారిఁ గదియఁ [156]జనుచు
గురుపరాక్రమమునఁ గోదండ మెక్కించి | చతురుఁ డగుచు [157]రాత్రిచరవరుండు.

169


క.

వారుణబాణంబున దు | ర్వారానలబాణజనితవహ్నిప్రభలన్
వారించి, దివిజకులసం | హరుఁడు రోషారుణీకృతాక్షుం డగుచున్.

170


చ.

అనలుని నాఱుబాణముల నంటఁగ నేసి, పదేనుతూఁపులన్
వననిధినాథు నొంచి, యనివార్యసహస్రముల న్నిలింపనా
థుని తనువందుఁ గీల్కొలిపి, దుర్గమమార్గణపంచకంబునన్
ఘనుఁడగు దండహస్తుని బ్రకంపితగాత్రుని జేసె నత్తఱిన్.

171


చ.

అపుడు పురందంరుం డలిగి, యగ్నికణంబులు వేయుకన్నులన్
విపులత నిర్గమింపఁగ, రవిప్రభ మించిన వజ్ర మంది, యా
చపలుని గూలవేయుటయుఁ, జయ్యన మూర్ఛిలి దానవేశ్వరుం
డపగతఖేదుఁడై తెలిసి, యద్భుతరోషకషాయితాస్యుఁడై.

172


క.

ఈశవరలబ్ధమగు భయ | దాశుగమున దేవవిభుని యంగము నొంపన్,
ధీశాలి యతఁడు మూర్ఛిలె, | నాశాపతులెల్ల [158]వణక, నమరులు [159]బెగడన్.

173


ఆ.

అంతలోనఁ దెలిసి యమరేంద్రుఁ డత్యుగ్ర | రోషవహ్నిభయదవేషుఁ డగుచు,
నెలమి దైత్యవరుల నెదిరించి కదనంబు, సలిపె బాహుశౌర్యసంభ్రమమున.

174


క.

హరి హేషితములఁ గరి ఘీం | కరణముల [160]రథాంగనేమి ఘననినదములన్,
వరభటకోలాహలముల | ధరణీతల మద్రువం దొణఁగెఁ దత్సమయమునన్.

175

అమరుల పలాయనము

ఉ.

భీకరదైత్యరాజశరబృందముచేఁ గడు నొచ్చి, నిల్వఁగా
లేక, సురేశ్వరుండు సనిలింపముగా భయవిహ్వలాత్ముఁడై
నాకము నిర్గమించి, శరణంబుగఁ జేరె, నఖండితప్రభా
ప్రాకటచండభానువుఁ, [161]బ్రభానుకృశానువు, రత్నసానువున్.

176


ఆసురపతి యమరలోకాధిపత్యము

వ.

ఇట్లు, వారలు సమరవిముఖులై పఱచిన, నసురచక్రవర్తి నిరమిత్రలోకంబగు నాకంబు
[162]విచ్చలవిడి చొచ్చి, సంతత[163]చింతామణీరామణీయక[164]పరివృతేందిరంబగు సభామంది
రంబున, మహేంద్రసింహాసనంబున సమాసీనుండై, యనర్గళస్వర్గభోగంబుల ననురాగం
బొందుచున్నయెడ, నొక్కనాఁడు [165]భసితసంభవుం డగు సునాసీరుం డను నిశాచరవీరుండు
తత్సమ్ముఖమ్మున నిలిచి యిట్లనియె.

177


సునాసీరదానవుని రాజనీతిప్రబోధము

ఉ.

నీవు భుజావిజృంభణవినిర్జితనిర్జరవల్లభుండవై
దేవ! మహానుభావమున దివ్యపురీమణిసౌధకామినీ
భావజకేళిఁ దేలుచు, నభంగపరాక్రమశక్రరాజ్యల
క్ష్మీవిభవాదికృత్యమున మించితి వెంతయు దైత్యనాయకా!

178


క.

దైతేయసార్వభౌమ! మ | హీతలమున నిన్నుఁ బోలు నీదృగ్బలవి
ఖ్యాతుల నెవ్వరిఁ గానము | [166]భూతభవద్భావికాలముల నెయ్యెడలన్.

179


తే.

ఏకతంబైన దిచ్చట హేమనయన! | విన్నవింపంగఁ గల దొక్కవిన్నమాట,
సావధానుండవై విను [167]మస్మదీరి | తంబు, నీకు హితంబు తథ్యంబు నగుట.

180


ఉ.

కొందఱు దానవేశ్వరులు కుంభినిలో మును శూరతాలతా
కందము లయ్యు, నీతి[168]గతిఁ గానమి, [169]భోగవశాంతరంగులై
ముందఱికార్యముల్ [170]విఱగి మోచినదాఁక నెఱుంగలేక, తా
మెందుకుఁగాక రాజ్యధనహీనతఁ బొందిరి [171]రాక్షసాగ్రణీ!

181

మ.

సమరాజేంద్రుని గూర్చి సామము, భుజాశౌర్యాధికున్ గూర్చి దా
నము, [172]వీనం గలయంగనేరని మహీనాథాగ్రణిం గూర్చి భే
దము, శక్తిత్రయహీనుఁ గూర్చి కడిమిం దండంబు గావింప యు
క్తము భూపాలున, కాత్మరాజ్యపరిరక్షాకార్యనిస్తంద్రతన్.

182


తే.

[173]నీతిమార్గంబు వదలకనృపతి భావి | కార్య మాప్తబుధామాత్యగణముతోడ
నూహ యొనరించి, కుశలుఁడై యుండవలయు | మంత్రరక్షణవిధి నప్రమత్తుఁ డగుచు.

183


క.

బలిమిగలనాఁడె విమతులఁ | బొలియింపఁగ నేర్పులేనిభూవరులకుఁ, ద
[174]త్కులశేషముచేతనె చెడుఁ | గలిమియు రాజ్యంబు బంధుగరిమయు ననఘా!

184


క.

కావున, శాత్రవశేషము | భూవరుఁ డుచ్ఛిన్నమూలముగ నణఁగింపం
గావలయు, సహితరహితమ | హీవలయం బేలుకన్న హితముం గలదే?

185


చ.

అనిమిషకోటిదక్క మన కన్యులు లేరు విరోధు, లమ్మహా
ఘనులు సురాచలంబున సుఖస్థితి నిల్చినవారు, వారికిం
దనుజవిదారి రక్షకుఁ, డతండు నిశాటులఁ జక్రధారలం
దునిమి, యొసంగు నింద్రున కనూనమతిం ద్రిదివాధిపత్యమున్.

186


క.

[175]నిశ్శేషంబుగ దనుజమ | నశ్శల్యములైన సురగణంబుల నెల్లన్
దోశ్శక్తిఁ దునుముటకు ర | క్షశ్శేఖర! తగునుపాయగతి నూహింపన్.

187


వ.

అని పలికి, వెండియు నిట్లనియె.

188


సీ.

ఒక్క కార్యము దోఁచియున్నది నామది | నది విను మెఱిఁగింతు [176]నసురనాథ!
త్రిదశాలయంబు రాత్రించరేశ్వరులకు | భోగ[177]భాగ్యనివాస[178]భూమి యయ్యె,
దివిజలోకమున వర్తించినవారల | కిష్టంబు గాదు మహీసుఖంబు,
కావున, నీవు బాహావిజృంభణమునఁ | బృథివితోఁ గనకాద్రిఁ బెనఁచిపట్టి


తే.

వార్ధిలోపల మునుఁగంగ వైచితేని, | యమరమునిసిద్ధకిన్నరయక్షవరులు
సమసిపోవుదు, రంత నిశ్శంకలీల | నేలుదువు నీవు సురలోక మెల్ల గరిమ.

189


తే.

అని సునాసీరుఁ డెఱిఁగింప ననుమతించి, | కనకనేత్రుండు తత్కార్యకరణమునకు
సముచితోసాయపరులైన సచివవరుల | తోడ నూహించి, పిదప నుద్యుక్తుఁడయ్యె!

190

దేవదానవద్వితీయమహాసంగ్రామము

వ.

ఆ సమయంబున మహేంద్రాదిబృందారకబృందంబు నాకలోకవిహారులగు దైత్య
వీరులతోడి యుద్ధంబునకు సన్నద్ధంబై వచ్చినం, బెచ్చు పెరిగి, హిరణ్యాక్షప్రేరితులై జ్వాలా
ముఖ కేతుముఖ రుచిక చిత్రకేతు ధూమ్రాక్ష కరాళాక్ష వజ్రదంత సూచీదంత వికట తామ్ర
కేశ దక్షిణావర్త శంబ గవయాది రాత్రించరవరులు హస్త్యశ్వరథపదాతిసమేతులై, శాత
బాణసంపాతంబున నొప్పించె. అంత, గీర్వాణబలంబు చలంబునం [179]బోక పెనంగినం, బతిత
కరివ్యూహంబును, భగ్నాశ్వసందోహంబును, గళితశతాంగంబును, ఖండితవీరభటోత్త
మాంగంబును, నృత్యత్కబంధశతసంకీర్ణంబును, రక్తప్రవాహపూర్ణంబును, మేదో
మాంసపంకిలంబును, శోణితపానమత్తభూతబేతాళసంకులంబును, గాహళమృదంగ
భేరీభయదఘోషణంబును, సర్వలోకైకభీషణంబునై యాయోధనం బద్భుతంబయ్యె.
అందు.

191


ఆ.

దివిజవరులతోడి తీవ్రయుద్ధంబున | విఱిగి దైత్యవరులు విహ్వలించి,
యమరపురికి నరిగి యత్తెఱుఁ గెఱిఁగింప, | నసురవరుఁడు శక్తిహస్తుఁ డగుచు.

192


సీ.

[180]చిటచిటాయితకోపశిఖిశిఖాఘటనల | దంష్ట్రాయుగము ఘోరతరము గాఁగ,
నాసా[181]పుటోగ్రనిశ్శ్వాసమారుతమునఁ | గోరమీసమ్ములు [182]గొకురుపొడువ,
భ్రుకుటీవినిర్మాణవికృతపక్ష్మంబులఁ | దీర్ఘనేత్రంబులు దిరుగువడఁగ,
నఖిలలోకభయంకరాట్టహాసంబున | బ్రహ్మాండభాండకర్పరము వగులఁ,


తే.

బాదఘట్టననదులు - భగ్నములుగఁ, | గాయదీప్తుల దిశలు చీఁకట్లు గొనఁగ,
యుద్ధమున కేఁగె [183]సర్వసన్నద్ధుఁ డగుచుఁ | జటులవిస్ఫూర్తి దానవచక్రవర్తి.

193


చ.

మృగపతి సింధురంబుల నమేయ నఖాహతి సంహరించిన
ట్లగణిత బాహుదర్పసముదంచితుఁడై, సురరాజు గుండియల్
వగులఁగఁ, జక్రకుంతశరపట్టిసశూలముఖాయుధంబులం
దెగి వధియించె, దైత్యులు నుతింప నకంపితలీల నత్తరిన్.

194


చ.

అమరులు తన్మహారణమునందు, సువర్ణవిలోచనప్రతా
పమునకు నోర్వలేక, మదిఁ బాయనిభీతిఁ గలంగి, యాత్మవి
క్రమములు వీటిఁబోఁబఱచి, కాంచనభూధరరాజ[184]తుంగశృం
గము తుదఁ జేరి నిల్చిరి, యఖండతదీయవనాంతరంబునన్.

195

హిరణ్యాక్షుఁడు వసుంధర నుత్పాటించి సముద్రమున వైచుట

క.

సురగిరిఁ జేరిన దివిజుల | హరియింపఁ దలంచి, దానవాధీశ్వరుఁ [185]డు
ద్ధురలీల నార్చె, నాశా | కరికర్ణపుటికుడుంగకంబులు వగులన్.

196


వ.

ఇ ట్లట్టహాసంబు చేసి, హిరణ్యాక్షుండు సకలదేవతానాశ[186]కరణాపేక్షుండై యాక్ష
ణంబ.

197


చ.

నిరుపమ[187]హుంకృతిధ్వనులు [188]నింగికిఁ బర్వ, నఖర్వకోపవి
స్ఫురణకరాళనేత్రుఁ డగుచున్, భయ మింతయు లేక, మేరుభూ
ధరసహితంబు గాఁగ వసుధాతల ముద్ధతిఁ బెల్లగించి, సా
గరమున వైచె బాహుబలగర్వ మెలర్పఁగ, నిట్లు వైచినన్.

198


క.

సాధ్వసమున దివిజులు హా | హా! ధ్వని యొనరించి, రమ్మహాబ్ధియుఁ దత్పా
తధ్వస్తజలచరంబై | సధ్వానం బగుచుఁ గలఁగి చలితం బయ్యెన్.

199


క.

వడి చెడక తద్వసుంధర | బుడబుడమని కడలినడుమ [189]బుగ్గలు [190]వొడమన్
బడి, మునుఁగునపుడు జగములు | వడవడ వడఁకంగఁ దొడఁగె [191]వసుధామర్త్యా!

200


ఆ.

అంత, నాక్షణం[192]బ యఖిలజగత్పాలనక్రియాపరుండు చక్రధరుఁడు,
జలధిమగ్నసర్వసర్వంసహాతలో | ద్ధరణమునకు నాత్మ దయ దలిర్ప.

201


యజ్ఞవరాహావిర్భావము

సీ.

ఆమ్నాయములు చరణారవిందములుగా, | రవిసుధాకరులు నేత్రములు గాఁగ,
గంధవాహస్ఫూర్తి కర్ణయుగ్మంబుగా, | శివపద్మభవులు దంష్ట్రికలు గాఁగ,
నుగ్రానలంబు ఘోణాగ్రభాగంబుగా, | జలధరంబులు సటాచ్ఛటలు గాఁగఁ,
గాకోదరేంద్రుండు కఠినవాలంబుగాఁ, | గాలంబు గమనవేగంబు గాఁగ,


తే.

యజ్ఞరూపంబుతోడ బ్రహ్మాండమెల్లఁ | దానయై నిండి, సుర లద్భుతంబు నొంద,
........ డిందిరాప్రాణవిభుఁడు, | రాక్షసధ్వంసి, యాదివరాహ మయ్యె.

202


వ.

.........డేయునకు రోమశుం డెరింగించినయత్తెఱంగు.

203

ఆశ్వాసాంతపద్యగద్యములు

శా.

[193]చర్యావార్యమహత్ప్రియవ్రతపరా! శౌరిక్రియా[194]చక్రగా!
వర్యారాధ్యహరి[195]స్ఫురన్మఠ! భుజవ్యాకృష్ణవైరిప్రభా!
ధుర్యాహంకృతి[196]సూక్తి[197]మన్నుతజయద్భూతిక్రమా[198]తంద్రకా!
కార్యాలోచనభావబుద్ధి[199]ధుతరాగా! కీర్తి[200]భామోత్సుకా!

204


క.

[201]రాకాశశాంకహరితా | రాకాశతరంగిణీపురారాతిహిమా
నీకాశకుందచందన | నీకాశయశో౽భిరామ! నృప[202]నయధామా!

205


మాలిని.

సతతవిహితదానా! సత్యభాషానిదానా!
[203]పతిహితగుణధుర్యా! పండితాశ్చర్య[204]చర్యా!
గతదురితసమాజా! గంగమాంబాతనూజా!
మతివిభవకలాపా! మంత్రిపుండ్రేక్షుచాపా!

206


గద్యము.

ఇది శ్రీ హనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణితనూజాత, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదవిఖ్యాత, హరిభట్టప్రణీతం
బైన వరాహపురాణంబునఁ గైవల్యఖండంబను పూర్వభాగంబునందు ద్వితీయాశ్వాసము.

  1. లయములకును (యతి?) - తి,తీ,హ,ర,క
  2. డూరార్చియు దగు - తి,తీ,ర
  3. నార్తిత - ర
  4. భరుఁడై - క
  5. ధరియించి - అన్ని ప్ర.
  6. చక్రంబు (యతి?) - తీ
  7. మాజరాజ - త; మాదనుజరాజ మ,తి,తీ,హ,ర,క
  8. వారగల్పడిన - మా; దారకల్ - మ,హ,ర,క; తాదగుల్పడిన - తా
  9. విస్తృత - మా,త,తా
  10. కచాదికౌను - మ,తా,తి,హ,క; కచాదికాంతి - త; కరాబ్జకౌను - క; కచావికాసముల - తీ
  11. విచ్చనవిడి - హ,ర,క
  12. హ,ర ప్ర.లో 2, 4 పాదములు లుప్తము; అనుకూలుఁడై
    కాని యాదిత్యుఁ డురుదీప్తి కిరణముల్ పలుమారు నెఱప వెఱచు - మ, తి, తీ; జనశీతభయనివారణము మాత్రమె గాని మిహిరారి స్వేచ్ఛచే మించ వెఱచు - క
  13. మందమైని యనలుండు మహి నణంగుటె కాని దంటమోము లరణ్య మంట వెఱచు - మ,తా,తి,తీ
  14. నాఖండ - మ
  15. తమః -తి,తీ,ర
  16. ప్రకర - తా
  17. ధర్మ (యతి?) - మ,తా
  18. యందేక - మ,తి,తీ,హ,ర,క
  19. మౌని - త,తి,తీ
  20. నుద్ధురాకృతి - తీ
  21. ఁ బెనయ - హ
  22. బ్రస్తరింప (యతి?) - మా
  23. ధవళితాభీల - తా,మ,మా,తి,తీ,హ,ర,క
  24. గొనియాడ - మ,తి,తీ
  25. దండాహతిన్ - మ,తా,తి,తీ,హ,ర,క
  26. ద్గణ్యంబు (యతి?) - మ,తి,తీ,హ,ర,క; ద్వంద్యంబు - తా
  27. నేఁడు - తి,తీ,హ; గాక - తా; మాకునెల్ల - క
  28. పర - త; చిర - తా
  29. వీరసమ్మతం-త,మా; సురసన్నుతం - తా
  30. పౌత్ర - మ,మా,త,తా,తి,తీ,ర,క
  31. దుర్వార (యతి? )- మ,మా,కి,తీ,హ,ర,క
  32. పులకతిలకితంబులై - తీ,ర,మ మా; సుఖస్ఫీతమగు నవకపోల - త
  33. మనుజసాధ్య - త
  34. దీరిత - హ
  35. కెఱిఁగించెనంత - తీ
  36. సముత్సుక (ప్రాస?)- తి, తీ
  37. నాగలోక - తి,తీ,ర; నాక - హ
  38. సురరత్న - త,క
  39. జలదము - త
  40. జుట్టు - త,తి,క
  41. మంగళతర - మ,తా,తి,తీ,హ,ర
  42. నాగముం - త,మా; నాగమం - తి,తీ,హ,ర; గానమం - మ
  43. మళకింతురు - మ,తి,తీ,హ
  44. మంతటన్ - తి,తీ
  45. ఈ పాదము - మా, త, తా,హ,ర,క ప్ర.లో లుప్తము
  46. పెనుపంద - తి,తీ
  47. యున్నాభద్రేభ - త
  48. తమఃప్రమాణ - మ,మా,తి,తీ,ర,క
  49. నినుము - మా,ర
  50. యిప్పుడు - క
  51. బాహక్షాయక (ప్రాస?)- మ,త,తా; బాహాక్షాసాయక - తి,హ,ర,క; బాహాకృత్యాయక - తీ
  52. నాయుత - మా,హ,ర; నాయిత - మ
  53. మెల్లను - త
  54. భక్ష్యాదిమోహముల్ - ర
  55. శుభం - మా,త
  56. కాది - మా,త
  57. జంబ్వాంభోధి - తీ; జంబూవారి - తి,హ,ర
  58. న్విధుండు - మ,తా,తి,తి,హ,ర,క
  59. యమృతాంధస - తి,తీ; యమృతాగస - మ; యమృతాగమ - మా, తా; యమృతాశన - హ
  60. నిజ - మ,మా,తి,తీ,హ,ర
  61. మగుటన్ - త,తా
  62. నాకమునంగల మహత్వ మానతి యీవే - క
  63. శాంతప్రసన్నాస్య - తా,మా
  64. విన్యాస - త
  65. జనులు - తి,తీ,ర
  66. సన్నుత (యతి?) - మ,మా,త,తి,తీ,హ,ర,క
  67. రసాక్షీణరసా - తా
  68. కల్పిత - మా
  69. గోపురాక్రాంతాస్య - మ,మా,త,ర,క; గోపురకాంతాస్వ - తి,తీ;
  70. విరాజితంబు - క;
  71. సౌభాగ్య - మ,త,తి,తీ,హ,ర,క
  72. రాంతభుం - తా
  73. కళామృతంబు - తా
  74. తనురంగ (యతి?) - మ,మా,త,తి,హ,ర,క; తదంగ (యతి?) తా
  75. పిహితస్తోమాబ్ధి - తా
  76. పూర్వాకృతిన్ - మ,త,తి,తీ,హ,ర,క; పూరాకృతిన్ - మా
  77. మ్రాఁకులు - హ
  78. ఈ ప. తీ. ప్ర.లో లుప్తము
  79. సమస్తసురలు - అన్ని ప్ర.
  80. దేహాశీదిపాశోక - మ,తా; దేహాశాదిపచ్ఛాశోక - మా; దాశశాధిపశోక - త; దేహాశాదిపశ్చోక - తి; దేవశాధిపశ్శోక - ర; దేహశాధిపశ్శోక - హ,క
  81. యమృతులై - మ,తా,తి,తీ,హ,ర,క
  82. ఈ ప.తా ప్ర.లో లుప్తము
  83. భావము - మా,త,తా,తి,తీ,హ,ర,క
  84. దానవ - త
  85. తల్యు - మ,త,తా,తి,తీ,హ,ర,క
  86. చేపడయర్థము - తీ
  87. చెందెను - మ,ర,క; చేరెను-హ
  88. మృగ్యుని - త; వంద్యుని - తా
  89. సింధుధరా - మా; సిద్దపరా - ర
  90. దవిలించ - మ,క
  91. మహదైశ్వర్య - మ,మా,తా,తి,తీ,ర,క
  92. రమరాసురలు - అన్ని ప్ర.
  93. జూట - త
  94. భరణత్వకీర్తి - మ,మా,తా,తి,తీ,హ,ర,క
  95. సుర - తి,తీ
  96. యతి?
  97. ఆపదమాని - అన్ని ప్ర.
  98. చారదశసడివచ్చున్ - మ,త,తా; చారదనవడి - మా,తి,తీ; చారదసపడి - హ; చారధసపడి - ర; చితదనపడి - క
  99. జాల - మ,తా,తి,తీ,హ,ర,క
  100. వ 131, ప 132, ‘ర’ ప్ర. లుప్తము
  101. బు దహింపం - మ,మా,తి,తీ,హ,క
  102. భార్యాయ - మ,మా,తా,తి,తీ,హ,క
  103. త్రాహి - మ,తి,హ,క
  104. ఫేటము నంధతా - మ,మా,త,తి,తీ,హ,క
  105. కీటరూబమున్ - మ,తి,తీ; కీటరూపమున్ - మా,త,తా,హ,క
  106. కంఠుం డనఁగన్ - త,తా
  107. నిర్భయులై - మ,మా,తా,తి,తీ,హ,ర,క
  108. లంబను - త,తా,హ,ర,క
  109. దనుజ (?) - మా,హ,క
  110. యేక్రమంబుఁగాని యిరువడ - తి; యేవిధంబుగఁగాని యిరవుడ - తీ; యేక్రమంబునఁగాని యురువడ (యతి?) - మ,హ,ర,క
  111. బ్రోలు - క
  112. మోము-త,తీ,క
  113. రసములోఁగళయ - తి,తీ,హ,ర
  114. మను సొక్కు - త; మునఁజొక్కు - మ,మా,తి,తీ,హ,క
  115. రాలికె - అన్ని ప్ర.
  116. గతులను - ర
  117. నలపరించు - త
  118. రూపపర - త,తీ,ర; రూపడలి (?) - హ
  119. రమణీ - త
  120. రాజు - తా,తీ
  121. జలధివ్య - తా; జలధిశ్వ - తీ
  122. వీపు - మ,త,తా,తి,తీ,హ,ర,క
  123. త. ప్రలో 4 వ పా. 151 ప. లో 1, 2, 3 పా. లుప్తము
  124. మొల్ల - హ,ర
  125. తరంగములకు - తి,తీ
  126. తీ ప్ర. లో పా. లుప్తము
  127. వనధి - తా
  128. సంపాదిత - పరతంత్రుండై - వఱకు తీ. ప్ర.లో లుప్తము
  129. ప్రమోదితం - త
  130. నిధానము - మా
  131. కలహార - తి,హ; కల్హార - మ,మా,త,తా,ర,క
  132. కుంభ - త
  133. వెలి - మా
  134. జితజీవసౌధ మనఁగ - త
  135. మొదవించు - త
  136. మూఁడుమూర్తులతేజంపుముద్ద యనఁగ - తీ
  137. మణి యనంగ - ర
  138. వందితాచార్యుఁ డగుచు - తా
  139. వోన్నతిన్ - క
  140. నుపహసిత - ర
  141. ప్రసాద - మ,మా,త,తా,తి,తీ,ర,క
  142. సౌపాన - మ,మా,తా,క
  143. గుణరత్న - మా,త,హ,ర,క
  144. గణ - ర
  145. రభట - హ
  146. మావతుల - చెండాడియు తా. ప్ర.లో లుప్తము
  147. రాహుత్తుల - భంగించియు ర. ప్ర. లో లుప్తము
  148. నశ్వంబుల - ర,క
  149. గైదువు - ర
  150. వ్రీలం - క
  151. నంత్ర - మ,తా,తి,తీ,హ,ర,క
  152. చక్రాహతం - తా
  153. ఈ వ. తా.ప్ర.లో లుప్తము
  154. ధవ - క
  155. చెద (యతి?) - తి,హ
  156. నడుచు - మ,తా,తి,తీ,హ,ర,క
  157. రాక్షేశ్వరుండు (యతి?) - మ,తి,హ,ర,క; రాక్షసప్రభుండు - తీ
  158. బెగడ - క
  159. బెదరన్ - మ,తా,తి,హ,ర; వణఁకన్ - క
  160. రథనేమి - మా; రథములనేమి - త
  161. బ్రభావ - మా,త
  162. విచ్చనవిడి - మ,మా,త,తా,తి,తీ,ర,క
  163. చింతామణ్యాది పరివృతేందిందిరం - తీ
  164. పరికృతేందిరం - మా,త
  165. భసితత్రిపుండ్రసంభవుం - క
  166. భూతలమున భావికాల - క
  167. మీవు నామతంబు - హ; సతతంబు నీకు - ర; మస్మదీయహితము - క
  168. రతి - త
  169. క్రూరదశాంత - తీ
  170. పెరిగి - త
  171. రాక్షసాధమా - తీ
  172. దీనం - అన్ని ప్ర.
  173. ఈ ప. తీ.ప్ర. లో లుప్తము
  174. త్కాలవిశేషముచేతనె (ప్రాస?) - మ; త్కలశేషము - తా,హ; త్కలమశేషము - ర
  175. ఈ ప. తీ,ప్ర,లో లుప్తము
  176. నవనినాథ - మ,మా,త,తి,తీ,హ,ర,క
  177. యోగ్య - మ,మా,త,తి,తీ,హ,ర,క
  178. యోగభూమి - క
  179. బోర - త
  180. చిటపటాయిత - తి; చిటగిటాయిత - హ,ర
  181. పుటాగ్ర - మా,త
  182. గొగురు - తీ; గొరుకు - తా,హ; కుకురు - త
  183. గర్వ - మ,త,తి,తీ,ర,క
  184. భవ్యశృంగ - తీ; శృంగము ల్తుమురుగఁజేరి (యతి?) - హ
  185. {గ్రంథపాతం}
  186. కరుణాపేతుండై - క
  187. హీంకృతి
  188. {గ్రంథపాతం}
  189. బుడగలు - అని యుండిన ననుప్రాసశోభ యతిశయించును
  190. {గ్రంథపాతం}
  191. వసుధామాత్యా - మ,మా
  192. బునందు - మ,తా,తి,తీ,ర,హ,క
  193. చక్రబంధము
  194. చక్రిగా - మ
  195. స్మరన్మత - క
  196. శుక్తి - మ,తా
  197. మన్నదయితద్భూతి - హ,ర, క; మన్మచయిత - తి
  198. రప్రకా - తి,హ,ర
  199. ద్రుత - త; మతి - హ; మత - మ,మా,తా,తి,తీ,ర,క
  200. భావోత్సుకా - తా; కావోత్సుకా - తీ; ధామో - క; భౌమో - ర
  201. ఈ ప. తీ.ప్ర.లో లుప్తము
  202. దయ - మ,తా,హ,ర,క
  203. ప్రతి - మా
  204. డుర్యా - మ,హ,ర,క; ధైర్యా - తా; భర్యా - త