Jump to content

లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/వర్ణ విభాగము

వికీసోర్స్ నుండి

2. వర్ణ విభాగము విషయసూచిక

వర్ణములు :


1) సంస్కృత - ప్రాకృత - దేశ్యములు

2) అచ్చులు - హల్లులు

3) వర్ణోత్పత్తి స్థానములు

4) రేఫలు

5) దంత్య - తాలవ్యములు

6) బిందువు

7) నకారము-ద్రుతము

1. అక్షర పరిచ్ఛేదము Orthography.

శ్రీశైలము, కాళహస్తి, దక్షారామము, నను నీ మూడు పుణ్యక్షేత్రములమధ్య నున్న దేశమును త్రిలింగదేశమందురు. ఈ త్రిలింగ దేశమునందు, నివసించు జనులుపయోగించు భాషను, తెలుగు, లేక తెనుగందురు. ఈ భాషకే ఆంధ్రమనియు పేరు. సంస్కృతమునుండి కొన్నిశబ్దములును, ప్రాకృతమునుండి కొన్ని శబ్దములను ఈ తెనుగు భాషలోనికి వచ్చినవి. చాల భాషలకు మూలభాషయైన సంస్కృతమును, ఆద్య ప్రకృతి యనుచున్నారు. ఒక్కతెలుగు భాషకు మాత్రము, మూలభాషయైన, ప్రాకృతమును ద్వితీయ ప్రకృతి యనుచున్నారు. సంస్కృత ప్రాకృతశబ్దములు, కొన్ని మార్పులను జెంది, తెలుగు భాషలో ప్రవేశించుచున్నవి. కాన ఆంధ్రభాష వికృతియని వ్యవహరింప బడుచున్నది.

భాషకును, లిపికిని సంబంధము చంద్రునకు, చంద్రికకు గల సంబంధము వంటిది. భాష తెలిసినంత మాత్రమున లిపి తెలియదు. ప్రతి నాగరిక భాషకు లిపియున్నట్లే, తెలుగు భాషకును, లిపికలదు. లిపికి అక్షరము మూలము. అక్షరమనగా నశింపనిది అని అర్థము. అక్షమనగా నాలుక - కంఠము మొదలగునవయవములు. వాని కదలికచే ప్రకాశించును కాబట్టి అక్షరము. అనగా ప్రత్యేక ధ్వనులు కలది. అక్షరమునకు 'వర్ణ' మను మరియొక పేరు గలదు. ఈ అక్షరములను దెల్పు భాగమును అక్షరపరిచ్ఛేదము - లేక - వర్ణపరిచ్ఛేదము అని పేర్కొనవచ్చును.

దేశభాషలయందు లెస్స - యని ప్రశంసింపబడిన తెలుగు భాషకు అక్షరముల సంఖ్యఅధికము. నియమము లనంతము.

వర్ణములు

సంస్కృతభాషకు అక్షరము లేబది. అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ౠ - ఌ - ౡ - ఏ - ఐ - ఓ - ఔ - అం - అః - 16.

క - ఖ - గ - ఘ - ఙ

చ - ఛ - జ - ఝ - ఞ

ట - ఠ - డ - ఢ - ణ

త - థ - ద - ధ - న

ప - ఫ - బ - భ - మ

య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - 34.

అకారము మొదలు క - కారమువరకు ఉన్న పదునా రక్షరములను అచ్చులందురు. (VOWELS) - తక్కిన ముప్పది నాల్గక్షరములు హల్లులు. (consonants).

ప్రాకృతభాషకు వర్ణములు నలుబది. ఇందు అచ్చులు పది. హల్లులు ముప్పది. అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఏ-ఓ-అం-అః - 10

క-ఖ-గ-ఘ-చ-ఛ-జ-ఝ-ట-ఠ-డ-ఢ-ణ-

త-థ-ద-ధ-న-ప-ఫ-బ-భ-మ-

య-ర-ల-వ-స-హ-ళ- 30

తెలుగుభాషకు వర్ణములు ముప్పది యేడు - 37

ఇందు - హల్లులు - ఇరువదిమూడు.

అచ్చులు - పదునాలుగు.

అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఎ-ఏ-ఐ-ఒ-ఓ-ఔ-అం-అః - 14

క-గ-చ-ౘ-జ-ౙ-ట-డ-

ణ-త-ద-న-ప-బ-మ-య-

ర-ఱ-ల-వ-స-హ-ళ- 23

2) అచ్చులు - హల్లులు

(హ్రస్వములు - దీర్ఘములు అని రెండు విధములు.) అ-ఇ-ఉ-ఋ-ౡ-ఎ-ఒ- ఈఏడును హ్రస్వములు. హ్రస్వములనగా కురుచగా పలుకబడునవి.

ఆ-ఈ-ఊ-ౠ-ౡ-ఏ-ఐ-ఓ-ఔ. ఈ తొమ్మిది దీర్ఘములు. దీర్ఘములనగా చాచిపలుకబడునవి.

ఐ-ఔ-లు వక్రతమములు. ౦, -ః - ఉభయాక్షరములు.

అచ్చులకు ప్రాణములనియు, హల్లులకు ప్రాణులనియు పేర్లు. క్రమముగా స్వరములు - వ్యంజనములనియు వ్యవహరింపబడు చున్నవి. హల్లులు ఐదు వర్గములుగా విభజింపబడినవి.

క - ఖ - గ - ఘ - ఙ - క వర్గము

చ - ౘ - ఛ - జ - ౙ - ఝ - ఞ - చ వర్గము

ట - ఠ - డ - ఢ - ణ - ట వర్గము

త - థ - ద - ధ - న - త వర్గము

ప - ఫ - బ - భ - మ - ప వర్గము.

వర్గ ప్రధమాక్షరములైన క చ ట త ప లు పరుషములు.

వర్గ తృతీయాక్షరములైన గ జ డ ద బ లు సరళములు.

ప్రతి వర్గములోని సరియక్షరములు ఖ,ఘ,ఛ,-ఝ-ఠ-ఢ-థ-ధ-ఫ-భ లను వర్గయుక్కు లందురు.

ఖ, ఘ, ఙ, ఛ -ఝ -ఞ -ఠ -ఢ -ణ -థ -ధ -న -ఫ -భ -మ -య -ర -ల -వ -శ -ష -స -హ -ళ - లను స్థిరములందురు.

య ర ల వ లు అంతస్థములు.

శ -ష -స -హ - లు ఊష్మములు.

క మొదలు మ' వరకు ఉన్న వర్ణములు స్పర్శములు.

3. వర్ణోత్పత్తి స్థానములు

అ ఆ క ఖ గ ఘ ఙ హః వీనికి ఉత్పత్తి స్థానము - కంఠము.

ఇ ఈ చ ఛ జ ఝ య శ - తాలువు.

ఋ ట ఠ డ ఢ ర ష - మూర్ధము.

ఌ ౡ త థ ద ధ న ల స - దంతములు.

ఉ ఊ ప ఫ బ భ మ - ఓష్ఠము.

ఞ మ ఙ ణ న - నాసిక.

ఎ ఏ ఐ - కంఠతాలువు

ఒ ఓ ఔ - కంఠోష్ఠ్యము

వ - దంతోష్ఠము

అంతస్థములు - స్పర్శములకు - ఊష్మములకు మధ్య నుండునవి.

య ర ల వ లు.

ఇవి లఘువులని, అలఘువులని రెండు విధములు. వీనిని ఒక్కొక్క చోట తేల్చి పలుకుటయు, మరొకచోట ఊదిపలుకుటయు కలదు. తేల్చిపలికినపుడు లఘువులు. ఊది పలికినపుడు అలఘువులు.

సంధి వశమున వచ్చిన 'య'కార వకారములు లఘువులు. అనగా తేల్చి పలుకబడునవి.

హరి + అతడు = హరియతడు.

నిద్ర + పోయెను = నిద్రవోయెను.

ఇచ్చట యకారవకారములు సంధివశమున వచ్చినవి. శబ్దము తోడనే పుట్టిన య కార వ కారములు అలఘువులు. అనగా ఊదిపల్కునవి.

వంకాయ - వంకర -

చాయ - కోయుట - ఇందలి యకార వకారములు సంధివశమున వచ్చినవికావు. అరదము - లరుదు - ఇందలి సాధురేఫలు లఘువు.

ఎ ఱు గు - విఱుగు - ఇందలి శకట రేఫము అలఘువు.

కలత - చలము - వలస - ఇందలి లకారము లఘువు.

బహువచనము పరమగునపుడు ర ల డ వర్ణములకు ఆదేశముగా వచ్చిన లకారము అలఘువు.

త్రాళ్లు - గోళ్లు - ఏళ్లు - మేళము - తాళము - మొదలగు పదము లందుగల ళకారము వర్ణాంతరము గాని అలఘు ళకారము కాదు.

4. రేఫలు

రేఫము సాధురేఫమనియు, శకటరేఫమనియు రెండు విధములు. ఇది సంస్కృత భాషయందులేదు. కేవలాంధ్ర భాషయందు మిక్కిలి పరిపాటిగా చూడబడుచున్నది. కాని తత్సమశబ్దమయమైన ఆంధ్ర భాషయందు ర ఱ ల భేదము కనుగొనుట మిక్కిలి కష్టము. ఇతర ప్రయోజనము ఎట్లున్నను, సంస్కృతాంధ్ర శబ్ద పరిజ్ఞానమునకు మాత్రమిది యుపయోగము. ద్విత్త్వముతో కూడు కొన్నవియు, వాని రూపాంతరములును శకటరేఫలు.

మొఱ్ఱ - మొఱ.

బొఱ్ఱి - బొఱియ.

చుఱ్ఱు - చుఱచుఱ.

గుఱ్ఱు - గుఱగుఱ.

గొఱ్ఱి - గొఱియ.

పుఱ్ఱె - పుఱియ.

కఱ్ఱి - కఱియ.

కిఱ్ఱు - కిఱకిఱ.

బఱ్ఱు - బఱబఱ

పఱ్ఱు - పఱపఱ.


శకట రేఫలు సంయుక్తములు కావు.

చఱువు - మెఱసె.

మఱువు - వెఱచె.

ఒఱుపు - అఱుపు.

అఱచ - పిఱుదు.

పఱచె - అఱకలు.

అడు - ఉవు - ఉము - అంతమందు గల శబ్దములు శకటరేఫలు.

కఱడు - కఱువు - ఉఱుము

ఒఱడు - మఱువు - మెఱుము.

పెఱడు - చెఱువు - మఱుము.

అన్యవర్ణములతో సంయుక్తములైయున్న శబ్దములు శకటరేఫలుగావు.

తనర్చె - పొనర్చె - ఒనర్చె.

5. తాలవ్యములు - దంత్యములు - అని చ - జ లు రెండు విధములు.

ఇ - ఈ - ఎ - ఏ అను అచ్చులతో కూడియున్న చ - జ లు తాలవ్యములు.

ఉ:చిగురు - చీర - చెలిమి

చేడియ - జిగి - జీతము.

జెండా - జేన - మొదలైనవి.

అ - ఆ - ఉ - ఊ - ఒ - ఓ -ఔ - అను అచ్చులతో కూడియున్న చ జ లు దంత్యములు.

ఉ:- చమురు - ఛాకలి - చుంచు - చూలు - చొళ్లెము - చోడి - చౌదంతి - జత - జాతర - జుట్టు - జూదము - జొంపము - జోదు - జౌకు - తాలవ్య చ - జ లకు చెప్పిన కార్యములన్నియు దంత్య చ - జ లకు కూడా వచ్చుచుండును. చ కారముతో పాటు ఛకారము కూడ పరుష సంజ్ఞ కలది యగుచున్నవి. ఇట్లే జ కారముతో పాటు జ కారముకూడ సరళ సంజ్ఞ కలదియగుచున్నది. దంత్యతాలవ్యములగు చ - జ లను పరస్పరము యతి ప్రాసలకు కూర్చవచ్చును. అందువల్ల దంత్యతాలవ్యములైన చ జ లను సవర్ణములనుచున్నారు.

6. బిందువు

తెలుగు భాషయందు బిందువులు రెండు విధములు అవి పూర్ణ బిందువు, ఖండ బిందువులు.

ఉ:- కంచె - గంటము - వంట - పూర్ణ బిందువులు.

తోఁట - కోఁతి - ఖండ బిందువులు.

సిద్ధము - సాధ్యము - అని బిందువులు రెండు రకములు.

శబ్దములందు స్వతసిద్దముగానున్న బిందువులు సిద్ధబిందువులు.

ఉదా:- మంద - మంట - ఁకాపురము - దూఁట - మొదలైనవి.

వ్యాకరణ సూత్రమువల్ల కలుగు బిందువులు సాధ్యబిందువులు.

బిందువుండును కాని, యితర వర్ణములకు పూర్వమందు బిందువుండదు. "కంసాలి జాతివాఁడు చాలలేడు" అని ప్రయోగం కానం బడుచున్నది.

వ్యాజ్యెము - ర్యాలి - (ఒక గ్రామము - పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా లోనిది) మున్నగు లెక్కకు వచ్చు కొన్ని పదములలో దక్క రేఫేతర హల్లుతో సంయుక్తమైన వర్ణము తెలుగులో పదాదినుండదు.


విభక్తులు

ఒక పదమునకు వాక్యమున నితరపదములతో గల సంబంధమును విభక్తి అందురు. ఇవి ఏడు విధములుగా నుండును. వానినే యేడు విభక్తులందురు. విభక్తులను వర్ణకములని గూడ అందురు.

ఏడు విభక్తుల స్వరూపము


విభక్తి ఏక వచనము ఉదాహరణము బహువచనము ఉదాహరణము
ప్రధమావిభక్తి (Nominative case) డు-ము-వు రాముడు పాము ఆవు లు రాములు పాములు ఆవులు
ద్వితీయ విభక్తి ని-ను రాముని పామును రాములను పాములను
తృతీయవిభక్తి చేత, తోడ, చే, తో రామునిచేత, రామునితోడ రాముల చేత, రాములతోడ
చతుర్ధీ విభక్తి కొఱకు, కై రాముని కొఱకు, రాముని కై రాముల కొఱకు, రాముల కై
పంచమీ విభక్తి వలన, కంటె, పట్టి రాముని వలన మొ. రాముల వలన
షష్ఠీ విభక్తి కి, కు యొక్క లోపల రామునకు- రామునికి మొ. రాములకు మొ.
సప్తమీ విభక్తి అందు న వనము నందు, వనమున వనములయందు, రాములయందు

ఈ యేడు విభక్తులను తెలియ జేయుటకై పదముల చివర వచ్చు వానిని ప్రత్యయములందురు. పై ప్రత్యయములలో డు - ము - వు - న - అనునవి ఏకవచనములు. లు, బహువచన రూపము

7. నకారము ద్రుతము

ద్రుతము అంతమందుగల పదములు ద్రుత ప్రకృతికములు. ద్రుతము అనగా కరగునది అని అర్ధము. కావలసిన పట్ల కనుపట్టుచు అవసరమైన యెడల లోపించునది. 1. విభక్తులలో ప్రధమ, కూర్చి, కయి, పట్టి, యొక్క, తప్ప తక్కినవి ద్రుతప్రకృతికములు.

2. తాను - నేను శబ్దములు ప్రధమావిభక్తిలో కూడా ద్రుతప్రకృతికములు.

3. సమాసక్రియలలో - నాలుగు కాలములయందలి ఉత్తమ పురుషైక వచనములు.

భూత తద్దర్మ కాలములందలి ప్రధమ పువురాషైకవచనములు.

ఆశీరర్ధకమున వచ్చు ఎడుత అను ప్రత్యయములును ద్రుతప్రకృతికములు.

4. ధాతువులనుండి ఏర్పడు అవ్యయములలో శతృతుమానం తర్య చేదర్ధకములు ద్రుతప్రకృతికములు.

5. సముచ్చయార్దకమునందు వచ్చు యు - ను - అనునవి ద్రుతప్రకృతికములు.

6. పుట్టుకతోనే అవ్యయములుగా ఉన్న వలె - పోలె - ఎల్ల - ఎట్టకేలకు పిదప - బాల - కూడ - మీఁద - కనుక - కావున తప్ప - మిగుల - అంతట - అయిన - ఆవల మొదలగునవి ద్రుతప్రకృతికములు.

ఉదా:

ద్వితీయ: రామునిన్

తృతీయ: రామునిచేతన్ - రామునిచేన్ - రామునితోడన్ - రామునితోన్

చతుర్ధి: రాముని కొఱకున్

పంచమి: రాముని వలనన్, రాముని కంటెన్

షష్ఠి: రామునికిన్ - రామునకున్ రాములలోపలన్

సప్తమి: రామునియందున్ -

వర్తనమానకాలము: చదువుచున్నాను.

భూతకాలము: ఉత్తమపురుష చదివితిని.

భవిష్యత్ కాలము: ఉత్తమపురుష చదువగలను.

తద్దర్మకాలము: ఉత్తమపురుష చదువుదును - చదివెదను.

వ్యతిరేకార్దము: చదువను.

భూతకాలము: ప్రధమ. చదివెను.

తద్దర్మ కాలము: ప్రధమ

చదువును - చదివెడును - చదివెడిని.
ఆశీర్యర్దకము: అయ్యెడున్ - కావుతిన్.
శత్రర్దకము: చదువుచున్.

తుమున్నర్దకము: చదువన్ - చదువగాన్ - చదుగావన్.

అనంతర్యర్దకము: చదువుడున్.

చేదర్దకము - చదివినన్.

ద్రుతప్రకృతికములు కాని శబ్దములు కళలు. అవి - డు, ము, వు, లు, కూర్చి, గుఱించి, కై, పట్టి, యొక్క. చివరకల పదములు కళలు.

అసమాపకక్రియలలో క్త్వార్దక, వ్యతిరేక క్త్వార్ధకములైన చదివి - చదువక - మొదలైనవి కళలు.

అవ్యయములైన కాబట్టి - మిక్కిలి - కొంచెము మొదలైనవి కళలు.

ధాతుజ విశేషములన్నియు కళలే.

వచ్చు రాముడు - వచ్చిన రాముడు.

సమాపకక్రియలలో వత్తురు - వచ్చిరి - రారు - రాడు - మొదలైనవి కళలు.
కొన్ని సూత్రములు :

1. తెనుగు పదముల మొదట రావడి, తక్క, తక్కిన, వడులులేవు.

ప్రాఁత - మ్రాఁకు - త్రుప్పు - క్రింద మొదలగునవి. (వ్యాజ్యము అను పదమొకటి కనబడుచున్నది.)

2. తఱుచుగా తెనుగు పదములలో ఒక అకారమునకు ఆవడియే వచ్చును. వ్యత్యస్తాక్షర సంశ్లేషములు లేవు.

అక్క - చెక్క - మగ్గము - అగ్గి - మచ్చిక - సజ్జ - మజ్జిగ - కట్ట - పట్టు - గడ్డి - అడ్డు - చెత్త - సత్తు - సుద్ది - మద్ది - అన్న - తెన్ను - అప్ప - కొప్పు - జెబ్బ - గొబ్బు - కమ్మి - తమ్ముడు - అయ్య - కుయ్య - మఱ్ఱి - బఱ్ఱె - చల్ల - తల్లి - అవ్వ - సువ్వి - తొస్సె - మొదలగునవి.

3. తద్భవములయందును, దేశ్యపదముల యందును స కార - త కార సంశ్లేషము కలదు.

అంతస్తు - అస్తరు - గేస్తుడు - నేస్తము - ముస్తె - కస్తి - సిస్తు - మొదలగునవి.

4. యావడి కలవి తద్భవ దేశ్యము లందు కొన్నికలవు. జోస్యుడు - పణ్యారము - వ్యాజ్యెము - ముత్యెము - మొదలగునవి.

5. ఠావు - ఢాక - అవధారు - వసనాభి - ఆఱభి - మున్నగు తద్భవ దేశ్యపదములలో వర్గయుక్కులు కలవు. 6. హ కారము అనునాసికములు వత్తుగ వచ్చినప్పుడు అనునాసిక స్వరమే ముందుగ ఉచ్చరింపవలెను.

బ్రహ్మ పలుక వలసినది (బ్రంహ్మ అని) చిహ్నము - మధ్యాహ్నము - అపరాహ్నము - జిహ్మాగము మొదలైనవి.

7. పదము మొదట అర సున్నాగాని, నిండు సున్నాగాని యుండదు.

8. వర్గయుక్కులు వర్గయుక్కులతోనే ద్విత్వములై యుండవు.

ఎబ్భంగి - దిగ్ఘస్తి - జగద్దితము - ఉద్దారణము.

9. ఉయ్యెల - పయ్యెద - తాయెతు - అను మూడు నామపదము లందు మాత్రమే నడిమి యకారము ఎత్వము కలదిగా ఉన్నది. కనియెన్ - వినియెన్ - మొదలగునవి క్రియలు.

10. కప్తము - అనుపదము తక్క.

ప్రశ్నలు

1. సంస్కృత భాషకు అక్షరము లెన్ని ? అవిఏవి?
2. ప్రాకృత భాషకు అక్షరము లెన్ని? అవి యేవి?
3. తెనుగు భాషకు అక్షరము లెన్ని? అవి యేవి?
4. అచ్చులెన్ని? అవి యేవి? హల్లులెన్ని? అవి యేవి?
5. ఉభయాక్షరములెన్ని? అవి యేవి?
6. స్వరము లేవి? ఎందువలన?
7. వ్యంజనము లేవి? ఎందువలన?
8. వక్రములు - వక్రతమములనగానేవి? అవియేవి?

9. వర్గములెన్ని? అ‌వియేవి?
10. వర్ణోత్పత్తి స్థానముల దెల్పుము?
11. య-వలు -లఘువు -అలఘువు వెల్లగును తెల్పుము?
12. రేఫము - లఘు-అలఘు రేఫములను గూర్చి వ్రాయుము.
13. దంత్య, తాలివ్య చ,జలను గూర్చి వ్రాయుము.
14. బిందువు- ప్రాధాన్యతను వివరింపుము.
15. విభక్తు లెన్ని? అవియేవి?
16. ద్రుతము - కళలు - వీనిని సోదాహరణముగ వివరింపుము?