Jump to content

రామాయణ విశేషములు-11

వికీసోర్స్ నుండి

11

పరిశిష్టము


రామాయణములో నేను చెప్పదలచిన విషయచర్చ ముగిసినది. అచ్చటచ్చట వ్రాయవలసియుండిన కొన్ని విషయములు మరచిపోయి నందున వాటిని కూర్చి పరిశిష్టమను పేరుతో ఈ ప్రకరణములో వేసి పరిసమాప్తిచేయుచున్నాను.

మహాభారతములో ఈ క్రింది శ్లోకము లున్నవని ఒక విమర్శకుడు వ్రాసినాడు.


“శ్లోకశ్చాయం పురా గీతో భార్గవేణ మహాత్మనా
ఆఖ్యాతే రామచరితే నృపతిం ప్రతి భారత!
రాజానం ప్రథమం విందేత్ తతో భార్యా తతో ధనం
రాజన్య సతి లోకేస్మిన్ కుతో భార్యా కుతో ధనం."
                                                    -మ. భా. 7,67,15.


ఈ రెండవశ్లోకము రామాయణములో ఎక్కడ నున్నదో ఏమో. పై శ్లోకములో భార్గవుడనగా వాల్మీకి.

లంక త్రికూటపర్వతముపై కట్టబడియుండెను. రఘువంశములో త్రికూటము అపరాంతములో నున్నట్లు వర్ణింపబడినది.

నాసికవద్ద అంజమేరి అను స్థలమున్నదనియు అచ్చట కొన్ని ప్రాచీన శాసనములు లభించినవనియు అందు పూర్వ త్రికూటవిషయము పేర్కొనబడిన దనియు అందుచేత త్రికూటము నాసిక్ ప్రాంతములోని దనియు ఒక చరిత్రకారుడు తెలిపినాడు. అట్లైతే రామాయణములో తెలిపిన దక్షిణమందుండు లంక అబద్ధమగునా?

రామునికాలములో చాతుర్మాస్యమును పాటించుచుండిరి. (కి. 27- 48) ఆషాఢ శ్రావణమాసాలలో విష్ణువు నిద్రించుచుండెను (కి. 28-25).


"ఉదీచ్యాశ్చ ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ కేవలాః”.
                                                          అయో. 82-8.


ఇచ్చట కేవలాః అనిన సింహాసనములేనిరాజులు అని అర్థము చెప్పుదురు. అది నిరర్థక పదమనియు, దక్షిణ దేశములో 'కేరలులు' ఉండిరికాన కేవలాః అనుటకు మారుగా కేరలాః అని సవరించవలెననియు వాష్‌బరన్ హాప్కిన్సుగారు (Great epic of India లో) వ్రాసినారు. వీరి పాఠమే అర్థవంతముగా ఉన్నది. పైగా గుజరాతులో ముద్రించిన రామాయణములో కేరళాః అను పాఠమే యున్నదని తెలిపినారు తెలుగు దేశపు పాఠములలో ఈ సవరణను చేసుకొనవలెను.

బాలకాండ సర్గ 45 లో అమృతోద్భవకథను చెప్పినారు. అదంతయు కల్పితమే. ధన్వంతరి సముద్రమథనములో పుట్టెనట! విష్ణు పురాణములో కాశిరాజగు కాశునికి దీర్ఘతముడు. అతనికి ధన్వంతరి పుట్టెననియు, అతనికి కేతుమానుడు, అతనికి భీమరథుడు, అతనికి దివోదాసుడు పుట్టెనని వ్రాయబడినది. ధన్వంతరి శకకర్తయైన విక్రమా దిత్యుని యాస్థానములోని నవరత్నములలో నొకడని "ధన్వంతరి క్షపణకామరసింహశంకువేతాళభట్ట ఘటకర్పరకాళిదాసాః" అను శ్లోకము వల్ల తెలియవచ్చుచున్నది. సముద్రమథనములో సురాపానాధిష్ఠాన దేవత యగు వారుణి పుట్టెనట సురను సేవించినవారు సురలైరనియు, సురను గ్రోలనివారు అసురులైరనియు వ్రాసినారు సురశబ్దార్థముపై యీకథ పుట్టినది. ఋగ్వేదములో 'సుర' శబ్దము లేదనియు, అసురు శబ్దమే యున్నదనియు, సురకు మారుగా దేవశబ్దమే యున్నదనియు, అసురలో నఞ్ కలదని భావించి దానిని తొలగించి తర్వాతి వారు సుర శబ్దమును సృష్టించిరనియు తెలుసుకొనినచో ఈ కథ యంతయు కల్పి తము, ప్రక్షిప్తము అని ద్యోతమగును.

రామాయణములో (అయో. 68-18) విష్ణుపాద అను స్థలమును తెలిపియున్నారు. ఇది బాహ్లికవద్ది పర్వతము కావచ్చును.

మాల్యవంతపర్వతము బల్లారివద్దనుండు కొప్పల్, ముద్గల్, రాయచూరు ప్రాంతాలలో నున్నదని కొందరు. పంచాప్సరసరస్సు బీరారునకు తూర్పున నున్నదని ఒకరు అనినారు.

ప్రాచ్యదేశము మగధ ప్రాంతములోని దనియు, దానినే ఋగ్వేద ములో కీకట అని పేర్కొనిరనియు భాండార్కరుగారు (Ancient Indian culture లో) వ్రాసినారు .

వారే వానరులను గూర్చి యిట్లు వ్రాసినారు: “ధార్వాడును పూర్వము పాలించినరాజులు తాము కిష్కింధను పాలించినామనియు, తాము వాలివంశమువారనియు చెప్పుకొనిరి. వారిది కపిధ్వజము. వానరులకును పూర్వము కపిధ్వజముండినందున వారిని వానరు లని రేమో?"

ఆర్యులు తమ శత్రువులను ఋగ్వేదములో నానావిధములుగా వర్ణించిరి. వారు కృష్ణత్వక్కులనియు, ఘోరదృక్కులనియు, విసిప్రులు (ముక్కులేని వారనియు), మృధ్రవచు లనియు, అనాసులనియు, శిశ్న దేవులనియు (ఋ. 8, 21, 5), క్రవ్యాదులనియు (ఋ.10,87, 2), యాతుధానులనియు (10, 87, 5, మరియు 1, 35, 10), ఆయజ్వను లనియు దూషింపబడిరని శరశ్చంద్రరాయి 'ముండాలు' అను గ్రంథ ములో తెలిపినారు. అసిరియాపైన ప్రధాన పరిశోధకుడని (Famous assyriologist) పేరు పొందిన సెయస్ (Sayee) గారు హిబ్బర్టు ఉపన్యాసాలలో (1887) ఇట్లన్నారు: "హిందూస్థానమునకు బాబిలోనియాకును క్రీ. పూ. 3000 ఏండ్లనాడు వ్యాపారము జరుగుచుండెను. ఉర్ బగస్ రాజు బాబిలోనియాను రాజ్యముచేసిన కాలములో ఈ వ్యాపారము సాగెను. ఊర్ నగర ఖననము లలో హిందూదేశపు టేకుకట్టెలు దొరికినవి. బాబిలోనియనులు బట్టలను 'సింధు' అనిరి. ఈపదము జండ్ మాట్లాడు వారిద్వారా వచ్చియుండిన హిందు అయియుండెడిది.” ఈ వాక్యాలను బట్టి ఆర్యులవ్యాప్తి ఎంతటి ప్రాచీనముదో తెలియవచ్చును.

ఇంగ్లీషులో గూస్ (Goose) అనునది ఆంగ్లో సాక్జను భాషలో గాస్ (Gois) అని యుండెను. ప్రాచీన హంగరీ భాషలో దానినే కన్స (Kans) అనిరి. ఇప్పటి జర్మన్ భాషలో గన్స్ (Gans) అందురు. ఆంగ్లోసాక్జన్ భాషలో ఫ, స, ధ (f, s, th) ధ్వనులకు ముందుండు ‘న’ కారధ్వని (n) లోపించును. గాధిక్ లో ముంత్సు అనునదే మూత్ ఆయి మౌత్ (నోరు) అయినది. లాటిన్‌లోని డెన్స్ (dens) టోత్ అయి, తర్వాత టూత్ అయినది.

లాటిన్‌లో ఆన్సర్, సంస్కృతములోని హంస, రష్యనులోని గూస్, బొహీమియన్‌లో హస్, ఇంగ్లీషులో గూస్ అయినది[1] ఇంగ్లీషులో గూస్ అనిన బాతు. కావున మన పూర్వుల హంసలన్నియు బాతులే!

వసిష్ఠుడు విశ్వామిత్రునికి విందుచేసినప్పుడు (బాలకాండ) చెరుకు రసమును కూడా ఇచ్చెను. చెరకులను హిందూ స్థానమునుండి పూర్వము ఇతర దేశాల కెగుమతి చేయుచుండిరని ప్రాచీన గ్రీకులు వ్రాసినారు.[2] రామాయణములో (అరణ్యకాండ) ఫలములనుండి చెరుకులనుండి ఒక విధమగు మద్యమును చేయుచుండినట్లు తెలిపినారు.[3]

రామాయణకవితనుగూర్చి హీరెన్ ఇట్లు వ్రాసెను: 'ఇతర పురాణా లన్నింటికంటే రామాయణకవిత అతిసుందరము. ఋశ్య శృంగునికథ హిందూకవితలో అతిమనోహరమైనది.”[4]

బ్రహ్మాండ, వాయు, మత్య్స పురాణాలలో ప్రచేతసుని కుమారులు మ్లేచ్ఛ సంతతికి మూలపురుషులైరని తెలిపినారు.


“ప్రచేతసః పుత్రశతం రాజాన స్సర్వ ఏవ తే
మ్లేచ్ఛ రాష్ట్రాధిపా స్సర్వే హ్యుదీచీం దిశ మాశ్రితా:"[5]


"హిందువుల నాలుగుయుగము లిట్లుండెను. మహాభారత యుద్ధముతో ద్వాపరయుగము ముగిసెను. హైహయులను సగరుడు ఓడించుటతో మూడవ యుగము ముగిసెను. రావణుని రాముడు సంహ రించుటతో రెండవయుగము ముగిసెను. పరశురామునితో మొదటియుగము ముగిసెను.”[6]

“అహల్యయొక్క భర్తపేరు శరద్వంత గౌతముడు. అహల్య కుమారుడు శతానందుడు. అతడు జనకుని పౌరోహితుడు. అహల్య పొందినది ఇంద్రునికాదు. ఒక పరపురుషుని పొందెను. ఇట్టి తావులలో పౌరాణికు లింద్రుని తెచ్చి పెట్టుదురు. రాముడు అహల్యయొక్క ఆతిథ్య మును స్వీకరించితే ఆమె తప్పు మాసిపోవునని చెప్పిరి. దీనివలన ఆ కాలములో పాతివ్రత్యమహిమ ఇంకను వికాసము పొందలేదని ఊహింప వచ్చును."[7]

“రాముని సమకాలికుడు భీమసాత్వతుడు. భీమసాత్వతునికి 12 తరములతర్వాత శ్రీకృష్ణుడు పుట్టెను. విదురథుడు దశరథుని సమకాలి కుడు. విదురథుని వంశములో 16 వ తరములో అర్జునుడు పుట్టెను. రోమపాదుడు అంగరాజు. దశరథుని సమకాలికుడు. అతనికి 12 వ తరములోని అంగరాజుకు కర్ణుడు దత్తుడయ్యెను. కావున మహాభారత కాలము కంటే 15 తరముల ముందు కాలములో దశరథుడుండెను. వాజినేయ భరద్వాజుడు రామునికాలపు ఋషి. అతడే ఋగ్వేదములో గోహత్య నిషేధించినవాడు (ఋ. 6,28,4), వల్మీక భార్గవుని కుమారుడు ఋక్ష అనువాడు. అతడే వాల్మీకి.”[8]

“మహాభారతకాలము 1150 క్రీ. పూర్వము దివోదాసుడు, దశ రథుడు అంతకంటే 13 తరాలకు ముందుండిన వారు. తరమునకు 28 ఏండ్లచొప్పున గుణించినచో రామాయణకాలము క్రీ. పూ. 1514 అని తేలును రావణుని చంపినప్పుడు రాముని వయస్సు 42 ఏండ్లు కావున లంకాయుద్ధము క్రీ. పూ. 1450 లో జరిగెను. నలచక్రవర్తి క్రీ. పూ. 1575 లో నుండెను.”[9] ముగింపు


వాల్మీకి రచితమైన శ్రీమద్రామాయణములో నాకు తోచిన విషయ ములు తెలుపుకొనినాను. ఇది చారిత్రిక విమర్శ. ఇట్టి విమర్శ పూర్వా చారాభిమానులకు సరిపడదని నేనెరుగుదును. కొందరికి ఆగ్రహము కూడా కలిగియుండును. కాని ఆగ్రహానుగ్రహములకు చారిత్రక విమర్శ లలో తావులేదు. ఎవరికేది సత్యమని తోచునో వారు దానిని గట్టిగా ప్రకటించుటలో తప్పుండదు. రామాయణమును గురించి వేదాంతపరము గాను వైష్ణవ సిద్ధాంతపరముగాను పలువురు సంస్కృతములోను దేశ భాషలలోను విపులముగా చర్చించినారు. కాని చారిత్రికముగా సమగ్ర ముగా తెనుగులో చర్చించినటుల నాకు కానరాలేదు. నేను రామాయణ మును చదివినప్పుడు నాకు స్ఫురించినవాటిని గుర్తు పెట్టుకొని యుంటిని. వాటినే యిందు వ్రాసితిని.

నేను చేసిన చర్చలో, ఇచ్చిన అభిప్రాయములలో విశేష భాగము తప్పులుండవచ్చును. తప్పులు చేయనివారెవరు? వాటిని పండి తులు, విమర్శకులు, పరిశోధకులు, సయుక్తికముగా ఖండించవచ్చును. తప్పులుండిన సవరించుకొందును క్రొత్తసంగతులు తెలిపిన నేర్చు కొందును. శ్రీమద్రామాయణముపై నాకు అద్వితీయమైన ప్రేమ, భక్తి, కలవని అందలి కవితను అత్యుత్తమమైనదిగా భావించువాడనియు మరొకమారు మనవిచేసుకొనుచు ఈ చర్చను పరిసమాప్తి చేయు చున్నాను.


  1. Max Muller & Science of Language, Vol. II, P. 244.
  2. Heeren Historical researches Vol. III
  3. Heeren Historical researches Vol. III P. 259
  4. Heeren Historical researches III P. 169
  5. Pergiter - Ancient Ind. Hist. Tradition
  6. Pergiter - Ancient Ind. Hist. Tradition
  7. S. N. Pradhan. Chron of Anc. India.
  8. S. N. Pradhan. Chron of Anc. India.
  9. S. N. Pradhan. Chron of Anc. India.