Jump to content

రామాయణ విశేషములు-10

వికీసోర్స్ నుండి
​

10

వానర రాక్షస తత్త్వము


మన పురాణాలలో సాధారణముగా అన్నింటను రాక్షసులు కాన వచ్చుచున్నారు. రామాయణములో రాక్షసులతోపాటు వానరులు కాన వచ్చుచున్నారు. ఒక ఎలుగుబంటి, మూడు పక్షులు (గరుడ జటాయు సంపాతులు), తాటకవంటి యక్షిణి కానవచ్చుచున్నారు. పురాణాలలో పైవారేకాక కిన్నర, గంధర్వ, అప్సర, నాగ మున్నగు విచిత్రజాతులు వర్ణింపబడినవి. ఈ వర్గములవారు మనుష్యులకు భిన్నించిన వారును, మనుష్యాతీతశక్తి కలవారును, మాయారూపులును, ఆకాశగాములునై యున్నారని తెలిపినారు. హిందువులలో బహుళ సంఖ్యాకులు వీటిని నమ్ముచున్నారు. ఈ పేరులు గల జాతు లుండెనని నేను విశ్వసింతును. కాని, వారు మనవంటి మనుష్యులే యనియు, వారికిని మనకును ఏమియు భేదము లేకుండెననియు తలతును. ఆది పౌరాణికులకు వీరి నిజతత్త్వము తెలిసి యుండెను. ఆర్యులకు మధ్య ఏషియాలోను ఏషియా మైనరు లోను, హిందూస్థానమందలి దక్షిణాపథమందును, తూర్పున బర్మా మలయాలోను, జవా బోర్నియో బలి సుమిత్రా ద్వీపాలలో తమతో భిన్నించిన ఆచార వ్యవహార విశ్వాసములు కల జాతులు కనిపించినారు. పలుమారు వీరితో ఆర్యులకు సంఘర్షణలుకూడా జరిగెను. అందుచేత తమ కనుకూలురైన వారిని నిందించక మంచివారని వర్ణించిరి. తమకు ప్రతికూలురైన వారికి ఘోర రూపములనిచ్చి వారిని దూషించిరి. తర్వాత పౌరాణికులకిది తెలియక తమ యూహబలము కొలది వీరిని వర్ణించిరి. వీరికి రెండుచేతులకు మారుగా అనేక హస్తములను ప్రసా దించిరి. ఒక తలకు మారుగా మూడు తలలు, పది తలలు పెట్టిరి. ​ఒక్కొక్కమారు (కబంధునికివలె) తలనే తీసివేసిరి. మరొకమారు గుఱ్ఱము తలల నతికించిరి. అంతటితో తృప్తినొందక వారికి శిరశ్ఛేద శిక్ష నియ్యక తక్కిన శరీరమునంతయు పాముగానో చేపగానో గుఱ్ఱము గానో చేసివేసిరి.

ఇదంతయు వారు పై వర్గములవారి నిజతత్త్వము తెలియక చేసిన యపరాధ మనవలెను. వానరరాక్షసాదు లెవరై యుండిరో చర్చించుటకు ముందు వారికి సంబంధించిన పర్యాయపదము లేవో అమరసింహుని నిఘంటువునుండి ఎత్తి వ్రాయుచున్నాను.

“విద్యాధరో, ప్సరో, యక్ష, రక్షో, గంధర్వ, కిన్నరాః, పిశాచో, గుహ్యక, స్సిద్ధోభూతో౽మీ దేవయోనయః. అసురా, దైత్య, దైతేయ, దనుజేంద్రారిదానవాః శుక్రశిష్యా, దితిసుతాః, పూర్వదేవా, స్సురద్విషః. రాక్షసః, కోణపః, క్రవ్యాత్, క్రవ్యాదో౽స్రప, ఆశరః, రాత్రించరో, రాత్రిచరః, కర్బురో, నికషాత్మజః, యాతుధానః పుణ్య జనో, నైరృతో, యాతు, రక్షసీ.”

ఈ పదములేకాక ఇంకను 'కిర్మీర' అను పదము కూడ రాక్షసు లకు వాడినారు. ఆ పదము మేదినీనిఘంటువులో కలదు. రాక్షసాదు లను గురించి విచారించుటకు ముందు వానరులను గురించి తెలుసు కొందము.

వానరులెవరు ?

ఈ ప్రశ్న ఇంచుమించు నూరేండ్ల నుండి బయలుదేరినది. వానరులు కోతులని అందరికినీ తెలియునుకాని రామాయణములోని వానరులు కోతులేనా అని పండితులు సందేహించినారు. వారు అడవి ​మనుష్యులని, బెత్తెడు పొడవుగల చిన్న తోకలను కలిగియుండిన ఆటవికు లనియు, కాదు నిజముగా వారు కోతులేయనియు, అదికాదు తోకలవలె గోచులను పెట్టి కౌపీనములు కట్టిన యాటవికులనియు, ఎవరికి తోచినట్లు వారు వ్రాసినారు. ఈ చర్చ ఇంకను ముగియలేదు. రామాయణ వానరులు కోతులు కారనియు, వారు దక్షిణాపథ మందుండిన ఆటవికు లనియు నా అభిప్రాయము. దీనిని గురించి పరిశోధకులిచ్చిన అభిప్రాయ ములను కొన్నింటిని తెలుపుదును. శ్రీయుత గో. రామదాసు, బి ఎ. గారు క్రోధన, ఫాల్గుణమందలి భారతి మాసపత్రికలోను, అక్షయ చైత్ర భారతి లోను 'రామాయణమునందు వానరులెవరు?' అని వ్రాసిన వ్యాసములు అత్యుత్తమములైనవి. వారి వాద సారాంశమిది: “వానరులకు రాక్షసుల కును సామీప్యత కలదు. వారిరువురును సవర మూండా జాతులవారు. వారి నామములు సవరభాషలోనే అర్థవంతములుగా ఉన్నవి. లంకా పదము సవరభాషలో పెద్దమిట్ట అని యర్థమిచ్చును. జైతాన్ అనగా దిగువ లేక బయటిభూమి. అదే జనస్థానము. జటాయువు సవరజాతి వాడు. దాన్‌డాన్ అనిన జలము కలది. అదే దండక ఋశ్యమూకము ఏనుగులకొండ. ఆనెమల అన్నామలె అయి యుండును. సవరలలో అసురులు అను జాతివారు కలరు. వారిని లంబోలంజియా అని యందురు. కౌపీనము కట్టి తోకవలె క్రిందికి బట్టను వదలుదురు. రామాయణములో మగకోతులకే తోకలున్నట్లు వర్ణించినారు. స్త్రీలకావర్ణనలేదు.” అభిలాషులు రామదాసుగారి వ్యాసములను పూర్తిగా చదువవలెను.

శరచ్చంద్రరాయ్ (Mundas and their Country) ముండా జాతిని గురించి ఒక గ్రంథమును వ్రాసినారు. అందలి కొన్ని విషయ ముల నిందుదాహరించుచున్నాను:

“ముందాలుండు ప్రాంతములోని గట్టులను మందరపహాడ్ అందురు. రావణుడు వానరసైన్యమును చూచినప్పుడు అందు మందర పర్వతము ​నుండి వచ్చిన “హరి" జాతివారున్నారని వినెను, ముందాజాతిలో “హరో” అని ఒక జాతి కలదు. హరో అనగా మనుష్యుడు అని వారి భాషలో అర్థమిచ్చును. (సంస్కృతములో వారి అనిన కోతి అనియొక అర్థము). ముందాలలో "ఉరోవన్" (Uroans) అను శాఖ కలదు. తాము రావణసంతతి వారమని వీరిప్పటికినీ చెప్పుకొనుచున్నారు. ఉరోవనులకును ముందాలకును పూర్వము యుద్ధములు జరిగెనని చెప్పుకొందురు.” కాల్డ్వెల్ తన ద్రావిడభాషాశాస్త్రములో ఇట్లు వ్రాసినాడు. “ఇంగ్లీషులోని కోరమాండల్ తీరము అనునది తెనుగువారు చోళమండలమునకు ఇచ్చిన పేరునకు ఏర్పడిన పదము. (హిందూస్థానములోని దక్షిణముననుండు) తూర్పుతీరమును తెనుగువారు ఖరమండలము అనిరి. అనగా ఉష్ణ ప్రదేశమను నర్థములో ప్రయోగించిరి."

కాని ప్రాచీనమందు రావణునితమ్ముడగు ఖరుడు రాజ్యముచేసిన దేశమగుటచేత ఖరదేశమని ఆదికాలమందు ప్రఖ్యాతియై యుండెనో యేమో?

తిరుచునాపల్లిని పూర్వము త్రిశిరప్పల్లి అనిరి. అనగా త్రిశిరుని పట్టణము. త్రిశిరునిపేర కట్టిన గ్రామమగుటచేత రావణుని వర్గమువారా ప్రాంతములో పాలించిరని ఒకరనిరి. కాని యది విశ్వసనీయ మన వీలులేదు..


బ్రహ్మాండ పురాణమున నిట్లున్నది. -

“ఆంధ్రవాకా ముద్గరకా అంతర్గిరి బహిర్గిరాః
తతః ప్లవంగ వోజ్ఞయో మలదామలవర్తికాః
........................................................................
మల్లామగధ గోనర్దాః ప్రాచ్యాం జనపదాః స్మృతాః."

​ఇచ్చట నానాజాతులతోపాటు ప్లవంగజాతి యొకటి పేర్కొన

బడినది. తక్కినవన్నీ మనుష్యజాతులైతే ప్లవంగజాతియు మనుష్య జాతీయే. ఆంధ్రాది ప్రాచ్యజాతులలో నిదొకటియన్నారు. కావున రామాయణకాలములోని ప్లవగజాతియు అనార్యజాతియే. తర్వాతి ప్రక్షిప్త కారులు ప్లవగశబ్దమునకు కోతియను నర్థముండుటచే వారు కోతులని భావించి పేరువ్రాసినారో యేమో?

వనచర శబ్దమునకు వానర (కోతి) అని అర్థము కలదు. అడవి మనిషి (వనేచరః) అని యర్థముకూడా కలదు. రామాయణమును పెంచిన వారు అడవిమనుష్యులకు మారుగా కోతులనే అర్థమునే స్వీకరించి యుందురు.

యస్. యస్. ప్రధాన్‌గారు (Chronology of ancient India లో) ఇట్లు వ్రాసినారు: “మహాభారతము, 13 వ పర్వం, 53-21 లో మంద పాలుడను బ్రాహ్మణుడు శార్జ్గి అను శూద్రి యందు నలుగురు కుమారు లను కనెను. అనార్యులలోని ఇంటిపేరులలో శార్జ్గి అనునదొకటి. అనా ర్యులలో అజ, మర్కట, సర్ప, నాగ, మృగ, మత్స్య అను పేరులు కల జాతులుండెను.”

ఈ విధముగా వానరులు అనార్యజాతి వారని వివిధ పండితుల అభిప్రాయము ఇక రామాయణమే ఏమి తెలుపుచున్నదో కనుగొందము. రావణునికి వానర ముఖ్యుల వర్ణించి చెప్పునప్పుడు వారు నర్మదానది, వింధ్య, పారియాత్ర, సహ్య, సుదర్శన, కృష్ణగిరి, సాల్వేయ పర్వతాల నుండి వచ్చినట్లు తెలిపెను. ఒకరిద్దరు హిమాలయ, మేరు ప్రాంతాల నుండి వచ్చినట్లు తెలిపినను ఎక్కువ వానరవీరులు దక్షిణాపథము వారే అని విశదమైనది, కృష్ణగిరి నల్లమల యేయో తెలియదు. నీలగిరి కూడా కానవచ్చును. సుదర్శన, సాల్వేయ గిరు లెచ్చటివో తెలియదు. ​వానరులకొక భాష యుండెను. వారిలో ముఖ్యులైన వారికి సంస్కృ తముకూడ వచ్చి యుండెను. హనుమంతుని మొట్టమొదట రాముడు కలసినప్పు డతనిగూర్చి యిట్లనెను: “ఇతడు మూడు వేదాల నెరిగిన వాడుగా కనబడుచున్నాడు" (కి. 3-28). పైగా వ్యాకరణ జ్ఞాన మున్నది. (కి. 3-29). హనుమంతుడు సీతను జూచినప్పుడు ఆమెతో సంస్కృ తములో మాట్లాడుదునా లేక నా భాషలో మాట్లాడుదునా అని వితర్కించు కొనెను. (సు. 30-7). ఇందతిశయోక్తి యున్నను వానరులకొక భాష యుండెననియు వారార్యులతో మాట్లాడగలవారై యుండిరనియు ఊహించుకొనవచ్చును వానరులలో వివాహాచారములలో ఒక విశిష్టత యుండెను. అన్నదమ్ములలో ఎవరైనను గతించిన అతనిభార్యను మిగిలిన తమ్ముడు పొందుచుండెను. వాలి తన తమ్ముడగు సుగ్రీవుడు బ్రతికి యుండగా తమ్ముని భార్య యగు రుమను పొందెను. ఇది పాప కార్యమని రాముడిట్లు వాలిని దూషించెను:


“అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయం పాపకర్మకృత్.”
                                                            (కి. 18-19)


వాలి చనిపోయినప్పుడు అతని శవమునకు రాముడు దహన సంస్కారము చేయించెను. వానరులలో దహనకర్మ లేకుండెనేమో. కాని ఆర్యాచారములను రాముడు వానరులందును, రాక్షసులందును ప్రచారము చేయువాడుగా కనిపించుచున్నాడు. అందుచేతనే కబంధాది రాక్షసులను వారి కోర్కెచేత పూడ్చినవాడైనను రావణునికి దహనసంస్కారమే చేయించెను.

వానరులకు ధనుర్విద్య తెలియదు. రాక్షసులకును ఆ విద్య రాకుండెను వాలి సుగ్రీవులు కుస్తీ పట్టిరి. రాముడు తనబాణముతో వాలిని చంపుదు నన్నప్పుడు సుగ్రీవునికి దాని శక్తి తెలియనందున ​పరీక్ష తీసుకొని తృప్తిపడెను. సుగ్రీవునికి పట్టాభిషేకము చేసినప్పుడు అతనికి అడవిపంది తోలుతో చేసిన చెప్పులను దొడిగించిరి. ఆర్యరాజులకు జరుగు పద్ధతిగానే పట్టాభిషేకము చేసిరి. బ్రాహ్మణులు వేదమంత్రము లతో నతనికి పట్టము కట్టిరి. కిష్కింధలో బ్రాహ్మణు లెక్కడినుండి వచ్చిరి? అప్పటికే ఆర్యులు కొందరు అచ్చట నివసించియుండి రనవలెను. కోతులకు ఇండ్ల యవసరము లేదు కదా! కిష్కింధానగరము మంచి నాగరికత పొందినట్టిది. అందు తెల్లని మేడలుండెను (కి. 33-12). వారికి ఇనుము, బంగారు మున్నగు లోహముల ఉపయోగము తెలిసి యుండెను (కి. 33–16,17). వెండినికూడా వారుపయోగించుచుండిరి. (కి. 33–19). వారు వీణావాద్యసంగీతము లెరిగియుండిరి (కి. 33-21). కోతియందము మనకు తెలిసినదే! మరి కిష్కింధా వానరస్త్రీలు 'రూప యౌవనగర్వితలు.' సుగ్రీవుని సేవకులు ఉత్తమ వస్త్రములను కట్టుకొని యుండిరి (కి. 33-23). వానర స్త్రీలు నూపురములు, మొలనూళ్ళు మున్నగు ఆభరణములు ధరించియుండిరి (కి. 33-24). సుగ్రీవుడును, తారయు బాగా మద్యపానముచేసి మత్తులై యుండిరి (కి. 33-37,45). సీతజాడను కనుగొనివచ్చిన వానరులు సుగ్రీవుని మధువనమంతయు ధ్వంసముచేసి చెడద్రాగిరి.

వానరులకు రాక్షసులకును అంతగా భేదము లేనట్లున్నది. రావణుడు సుగ్రీవునికిట్లు చెప్పిపంపెను:


న కశ్చి దర్థ స్తవ నాస్త్యనర్థ స్తథాహి మే భ్రాతృసమో హరీశ!
                                                          -యు. 20-11.


"సుగ్రీవా! నీవు సత్కుల ప్రసూతుడవు. ఋక్షరజసుని కుమారుడవైనందున నీవు నాకు తమ్మునితో సమానుడవు.” వానరులు వింధ్యకు దక్షిణముననుండిన అనార్యులనియే నా విశ్వాసము. వారు కోతులు కారు. కళింగములో లాంగుల్యా అను నది కలదు. అచ్చటనే ​సవర, కోదుజాతులవారున్నారు. కావున లాంగుల్యా నదీప్రాంతజనులను లాంగూలము కలవారనియు వారు కోతులనియు తర్వాత రామాయణ మును పెంచినవారు భావించియుందురు. శబరి యుండు ప్రాంతమందే సవరులున్నారు. సవరలకు సజాతీయులైన లాంగుల్యానదీ ప్రాంత వాసులగు ఆదిమాటవిక నివాసులు వానరులై యుందురు (లాంగుల్యానది నిప్పుడు నాగావళియందురు).

హనుమంతుని పెండ్లి

సాధారణముగా హనుమంతుడు నిత్యబ్రహ్మచారి యని అందరును భావింతురు. వాల్మీకి రామాయణములో హనుమంతుని పెండ్లి లేదా భార్యముచ్చట లేదని తలచి యీ ప్రవాదము కలిగినదేమో? అట్లైతే, నీలుడు మొదలగు బహువానరవీరుల భార్యలసంగతికూడా తెలుపలేదు. వారందరును నిత్యబ్రహ్మచారులా? హనుమంతుడు బ్రహ్మచారికాడు. అతడు వివాహితుడు. పైగా బహుభార్యలు కలిగియుండినట్టివాడు. ఏమి ప్రమాణ మందురా? వాల్మీకి రామాయణమే ప్రమాణము. రాముడు అయోధ్యకు వచ్చుచున్నాడని హనుమంతుడు ముందుగాపోయి భరతునితో తెలుపగా అతడు అధికానంద భరితుడై యిట్లనెను:

"ప్రియాఖ్యానస్య తే సౌమ్య దదామి బ్రువతః ప్రియం, సుకుం డలా శ్శుభాచారా భార్యాః కన్యాశ్చ షోడశ, హేమవర్ణా స్సునాసోరూ శశిసౌమ్యాననాః స్త్రీయః సర్వాభరణ సంపన్నాః కులజాతిభిః" (యుద్ధ. 128-42,44)

"ఓయీ, హనుమంతుడా! ప్రియమైనవార్తను నాకు తెలిపినందులకు నీకు మంచి కుండలములు కలవారును, మంచి ఆచారములు కలవారును, అందమైనవారును, చక్కని ముక్కు, చక్కని తొడలు కల వారును, చందమామవంటి ముఖములు కలవారును, సమస్త భూషణ భూషితలైన ​వారును, మంచి కులములో పుట్టినవారును, కన్యకలును (పెండ్లికాని వారును) అయిన 16 మంది స్త్రీలను భార్యలనుగా ఇచ్చుచున్నాను" అని భరతుడు చెప్పెను. ఈ మాటలకు హనుమంతుడు 'నాకెందుకయ్యా! నేను నిత్యబ్రహ్మచారిని' అని అనలేదు. పాంచరాత్రములో హనుమంతుని భార్యపేరు సువర్చల యని యందురు. అతనికొక కొడుకుండెనందురు. హనుమంతునికి వివాహమయ్యెనో లేదో కాని దీనినిబట్టి యొకసంగతి స్పష్టమగుచున్నది. ఎంత పెద్దకోతియైనను భరతుడు అతనిని చూచిన వెంటనే మంచిజాతిలో పుట్టిన సుందర స్త్రీలను భార్యలనుగా ఇత్తునని చెప్పునా? హనుమంతుడు యౌవనుడుగను, చూడదగిన మనుష్యుడుగను, ఉండిననేకదా 16 సుందరాంగులైన కన్యలను భార్యలుగా బహూకృతు డగుటకు అర్హుడయ్యెను? ఈ విషయాలన్నింటినిబట్టి వానరులు నాగరికత పొందిన అనార్యజాతివారనియు, వారు కోతులు కారనియు స్పష్ట మగుచున్నది. వీరు సవర, ముందాజాతులకు, సంబంధించిన వారై యుందురు. హనుమంతుడు నిత్యబ్రహ్మచారియె యనువారికి రెండాధార ములు కానవస్తున్న వి.


(1) “అన్యత్ర భీష్మాద్గాంగేయా దన్యత్ర చ హనూమతః
      హరిణీఝరమాత్రేణ చర్మణా మోహితం జగత్."


ప్రపంచములో స్త్రీలచే మోహితులు కానివారిద్దరే యిద్దరట! భీష్మ హనుమంతులట!

(2) హనుమంతునికొక భక్తుడు షోడశనామములిచ్చి స్తుతించెను. అందు బ్రహ్మచారియను బిరుదొకటి.


“అచలోద్ధారకో భీమో బ్రహ్మచారీ మహాబలః.”


ఈ రెంటినెవరు ప్రమాణీకరించిరో తెలియదు. వాల్మీకి రామాయణ ములో నెచ్చటను హనుమంతుడు నిత్యబ్రహ్మచారియని వర్ణింపలేదు. ​స్పష్టముగా హనుమంతునికి పెండ్లియైనట్లును నిదర్శనములులేవు. కాని పైని కనబరచిన కన్యాదానపుముచ్చట మాత్రము కలదు!

జాంబవంతుడు ఎలుగుబంటి కాడు. అతడును అనార్య (వానర) మనుష్యుడే. అందుచేతనే అతడు వానర సేనలో నుండెను. జటాయువు అనార్యుడైన ఆటవికుడు. నమ్మకమైన బంటుగా పంచవటిలో సీతా రాముల సేవ చేసెను. ఇట్టి వానరజాతిలో సేతువులు నిర్మించు మంచి నేర్పరులుండిరి. చికిత్సలుచేయు వైద్యులుండిరి. సకలధర్మము లెరిగిన పెద్దలుండిరి. వీరివంటి అనార్యజాతివారే అయిన రాక్షసులు మనుష్యుల వంటివారే. అయినప్పుడు వీరు మాత్రము కోతులగుదురా! కావున సర్వ విధముల వీరు ఆటవికులైన మనుష్యులే. అనార్యులలో ఉత్తములైనవారే. కోతులలో ఎలుగుబంట్లను, [1]గద్దలను గూడా చేర్చి యుండుటకు తగిన కారణ ముండవలెను. వానరులు కోతులు కారు. వారు వనేచరులు అనగా ఆటవికులని నిర్ణయించినాను. ఋక్షులు ఎలుగుబంట్లు కారు. వారును అడవి మనుష్యులే. వారు ఋక్షవత పర్వతాలలో నివాసము చేసినట్టివారు.


అన్యేఋక్షవతః ప్రస్థాన వతస్థు స్సహస్రశః
అనే నానావిధాన్ శైలాన్ భేజిరే కాననానిచ.
                                    -బాల. సర్గ. 13 శ్లో. 30.


కొందరు వనచరులు ఋక్షవతపర్వతాలలో ఉండిపోయిరి. తక్కినవారు వివిధ శైలాలలో (అనగా ఋక్షవతమునకు దక్షిణమున నుండు భాగాలలో నుండనోవు) ఉండిపోయిరి అని వర్ణించినారు.

ఋక్షవతము అను శబ్దమునుబట్టి ఋక్షులు (ఎలుగులు) ఉండు తావు అని యర్థము వచ్చును. ఆ పదము యొక్క అర్థము నాశ్రయించి ​రామాయణమును పెంచినవారు ఋక్షవతములోని ఆటవిక మనుష్యులను ఎలుగులనుగా చేసివేసిరి.

ఋక్షవత పర్వత మెక్కడున్నది? ఋక్ష పర్వతము అనునది వింధ్య యొక్క తూర్పు కొసలో నుండు భాగమునకు పేరనియు ఆ పర్వతము గోండ్వనములోనిదనియు నందలాల్ డేగారు (The Geographical Dictionry లో) వ్రాసినారు. దీనినిబట్టి ఋక్షులు గోండ్వ నములోనివారని తెలుసుకొనగలిగితిమి. గోండులుండు వనమునకు గోండ్వనమనుట సరియగు వాఖ్య. కావున ఋషులే గోండులు అని యూహించిన తప్పేమియు నుండదు. నిర్ణయమైనదేమనగా రాముడు ఋక్షపర్వతములోను, గోండ్వనములోను నివసించిన గోండులను, గోదావరీ కృష్ణా మధ్య ప్రాంతాలలోన నుండు వానరులను (వనేచరులను) తన సైన్యముగా నేర్పాటు చేసుకొని తూర్పు తీరమందు గోదావరి సముద్రముతో కలియు ప్రాంతాలలో నుండు అనార్యులను రాక్షస వాచ్యులతో యుద్ధము చేసెనని యూహించిన తప్పుండదని తలతును.

మరి గద్దలెవ్వరు? రామాయణములో ఒక కాకి రెండు గద్దలు వచ్చినవి. కాకి కథను గద్దల కథలను పిట్టమ్మ కాకమ్మ కథలన వలెనా? కాకాసురుని కథ మాత్రమట్టిదిగానే కానవస్తున్నది. కాదందురా దానిని గద్దలలోనే చేర్చి చర్చింతము. ఇక గద్దలననేమి? జటాయువు సంపాతియు సోదరులట. జటాయువు భద్రాచల ప్రాంతమందలి పంచ వటివద్ద నుండినవాడు. సంపాతి తూర్పు సముద్రప్రాంతమున మహేంద్రగిరికి సమీపాన నున్నవాడు. ఒకరి సంగతి యొకరికి తెలియ జాలనంత దూరాననుండిరి, అనగా గద్దజాతి యొకటి భద్రాచలము నుండి తూర్పు సముద్రతీరము వరకుండె ననవలెను. గద్దజాతివారు మనుష్యులా లేక గద్దపక్షులా యనునది చర్చనీయము. రామాయణ వానరులు కోతులు కారని, ఋక్షులు ఎలుగుబంట్లు కారని, రాక్షసాది ​పిశాచగణాలు మనుష్యాతీతులు కారని, వీరందరునూ ఆటవికులే యని నిర్ణయించువారికి రామాయణము గద్దలున్నూ మనుష్యులే యని తోచును. వారును ఆటవికులై యుందురు. క్రీస్తుశకము ఏడవశతాబ్ద మందు “గుద్దవాడి” విషయమనున దుండెను. కొమర్రాజు వెంకట లక్ష్మణ రావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవవర్మశాసనములో (భారతి. సం॥ 7-సం9 లో) గుద్దవాడి విషయము వచ్చినది. కొమర్రాజు వారును మల్లంపల్లి సోమశేఖరశర్మగారును అది యిప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రపురము తాలూకాయని నిర్ణయించిరి. దానినే పూర్వము గుద్రహారము (గుద్రవాడి) అనియు పిలిచి రన్నారు. గుద్ర శబ్దాన్ని సంస్కృతములో గృధ్రగామార్చి గద్దలనుగా తర్వాత రామాయ ణాన్ని పెంచినవారు కల్పించినట్లూహింపవలెను. (వీరు నేటి జటాపు లనబడే గిరిజనులు కావలెను).

రాక్షసు లెవరు ?

ఇక రాక్షసు లెవ్వరో కనుగొందము. మొదట రామాయణములో వర్ణింపబడిన రాక్షసులనుగురించి తెలుసుకొందము. రామునికాలములో చిత్రకూటమునుండియే అనార్యులు వ్యాపించుకొనియుండిరి. దానికి దక్షిణమందే తాటకావనముండెను. తాటక రాక్షసికాదట! ఆమె యక్షిణి. ఆమెకు పుట్టిన మారీచుడైతే రాక్షసుడట! మరల యక్షుల మాట యెక్కడ కూడా కానరాదు. అమరుడు యక్షరక్షోజనులను చేర్చి చెప్పినాడు. మన తెనుగుదేశములో జక్కులవారు అని యిప్పటికినీ కలరు. వారే యక్షులు. యక్షజాతితో రాక్షసులు భిన్నించినవారుగా కనబడుచున్నారు. వారు వింధ్యకు దక్షిణముననే యుండియుందురు.


“తయో ర్మధ్యే ప్రవృత్తో౽భూత్ యజ్ఞస్సపురుషోత్తమ,
 సహ్లి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞ కర్మణి”. (బా. 39-5)

​వింధ్యహిమాచలముల మధ్యప్రదేశము యజ్ఞములకు ప్రశస్తమైన

దనియు, సగరుడందే యజ్ఞము చేసెననియు (బాల. 39 సర్గలో) తెలిపినారు.

ఇది తర్వాతికాలపు ప్రక్షిప్తశ్లోకముగా కానవచ్చుచున్నది. రామునికాలములో ఆర్యావర్తముయొక్క హద్దులు వింధ్యవరకు వ్యాపించి యుండలేదని పై తాటకావన వృత్తాంతమే నిరూపించుచున్నది.

వింధ్యనుండి దక్షిణాపథమందంతయు నుండిన అనార్యులలోని ఒక తెగయె రాక్షసుల తెగ. వారు మనుష్యులే కాని కోరలుకలిగి ఆకాశ ములో ఎగిరి ఇష్టము వచ్చినన్ని మాయారూపములను ధరించు విచిత్ర శక్తిమంతులు కారు. వారును ఆర్యులవంటివారే. వాతాపియు, ఇల్వలు డును బ్రాహ్మణవేషములను వేసుకొని సంస్కృతము మాట్లాడి ఆర్యులను మోసగించుచుండిరి. (వాతాపి ఉండిన ప్రదేశమే ఇప్పటి 'బాదామి' అను ప్రదేశము. 'వాతాపి గణపతి' అను ప్రసిద్ధ గణపతి క్షేత్రమును చారి త్రక స్థలమును అయినదీస్థలమే). రావణుడు కూడా చక్కని బ్రాహ్మ ణుని వేషముతో వచ్చినప్పుడు సీత అతడేవర్ణమువాడని విచారింపకయే బ్రాహ్మణుడని గుర్తింపగలిగెను. లంకలో బ్రాహ్మణులుండినట్లు వర్ణింప బడినది. వారికిని దేవాలయములు, చైత్యములుండెను. శైవమతము రాక్ష సులలో ఎక్కువగా వ్యాపించినట్లు కానవచ్చుచున్నది అనేక రాక్షసులు శివునిగూర్చి తపస్సుచేసి వరములను పొందినట్లు పురాణాలలో వర్ణించి నారు. శైవమతము ఆర్యుల వైదికమతముకన్న చాలా ప్రాచీనమైనదిగను శివుడు, శక్తి, నానారూపములతో దక్షిణాపథమందేకాక హిందూ స్థానమునకు పశ్చిమమందున్న అనార్యదేశములందును పూజింపబడు చున్నట్లు కానవచ్చుచున్నది. ​రాక్షసులు మంచి నాగరికతను పొందినవారుగా వర్ణింపబడి యున్నారు. వారు వాస్తుశాస్త్రముప్రకారము సుందరమైనట్టి చక్కని యిండ్లను లంకలో నిర్మించుకొనియుండిరి.


“సితాభ్రసదృశై శ్చిత్రైః పద్మస్వస్తికసంస్థితైః
వర్ధమానగృహై శ్చాపి సర్వత స్సువిభూషితా.”
                                                - సుం. 4-4


రాక్షసుల సౌధములు పద్మము, స్వస్తిక, వర్ధమానము అను పేరులుగల స్వరూపములతో కట్టబడియుండెను. ఈ విధమగు గృహము లెట్టివో వ్యాఖ్యాత లిట్లు తెలిపియున్నారు:

“చతుశ్శాలా చతుర్ద్వారా సర్వతోభద్రసంజ్ఞి తా, పశ్చిమద్వార రహితా మధ్యావర్తా హయాననా, దక్షిణద్వారరహితా వర్ధమానా ధన ప్రదా, ప్రాగ్ద్వారరహితా స్వస్తికాఖ్యా పుత్రధనప్రదా."

'చతుశ్శాలాభవంతి' అని యిప్పటికిని మన దేశములో కొన్ని యిండ్లను సర్వతోభద్రమని యందురు. అవే రామాయణమందు పైన తెలుపబడిన పద్మము అను గృహములు. తెనుగుదేశములో నిన్న మొన్నటివరకు చతుశ్శాలా భవంతులే ఎక్కువగా కట్టబడుచుండెను . దక్షిణద్వారము లేనిది వర్ధమానగృహము. తూర్పుదిక్కు ద్వారములేని యిండ్లను స్వస్తికములని యనుచుండిరి.

పూర్వము విమానా లుండెనా ?

లంకలో విమానము లుండెనని వర్ణించినారు. అవి ఆకాశములో పోవునట్టివి కావు. వారు ఆర్యులు కనిపెట్టనట్టి ఆకాశవిమానముల కనిపెట్టి యుండిరని భ్రమింపరాదు. రావణుడు సీత నెత్తుకొనిపోవుటకు వెళ్ళి నప్పుడు గాడిదలతో లాగబడిన రథముపై వెళ్లెనని వర్ణించిరి. హను

మంతుడు లంకలో ఒక పుష్పకవిమానమును మాత్రమే చూడలేదు. ​


"రథై ర్యానై ర్విమానైశ్చ తథాహయగజై శ్సుభైః." సు. 4-27


రథములను, యానములను, విమానములను, హయగజములను చూచెను. రావణుని సైన్యమును వర్ణించుచోట ఈ మాటలున్నవి. విమాన ములు రథభేదములు. యానములెట్లో అట్లే విమానములును ఒక విధమైన రథములు. దక్షిణదేశములో వాస్తుశాస్త్రపరిభాషలో దేవాలయములపై నిర్మింపబడు గోపురములను విమానము లందురు. యానములపై అట్టి గోపురరూపమగు కప్పులుండినట్టివి విమానములై యుండును. అంతేకాని ఆ కాలములో ఆకాశయానము లుండెనని తలచుటకు వీలులేదు. ఆకాశములో విమానములో పోయినవాడు రావణుడొక్కడే. రావణునికి పది తలలు, లోకాతీత శక్తి మున్నగు విషయాలెన్నో వర్ణించినప్పుడు అతనికి ఆకాశయానమునుకూడ కల్పించుటలో కవిసృష్టిసామర్థ్యము కానవచ్చు చున్నది. దేవాలయగోపురములు సాధారణముగా ఏడంతస్తులు కలవిగా నుండును. హనుమంతుడు “స నికామం విమానేషు విషణ్ణః కామరూప ధృత్, విచచార” (సు. 6-1). విమానాలలో సీతను వెదకెను అని చెప్పుటలో ఏడంతస్తుల మేడలలో వెదకెను అని అర్థముకదా. సాధారణ ముగా రావణుడు పుష్పకవిమానమునెక్కి సంచరించుచుండెనని చెప్పుదురు. రావణుడు సీతను బలవంతముగా అపహరించు కొని వెళ్ళునప్పుడు సీతతో నిట్లు చెప్పెను:


"యస్య తత్పుష్పకం నామ విమానం కామగం శుభం”
                                                         -అర. 48-6.


"నేను కుబేరుని లంకను జయించి అతని పుష్పకవిమానమును లాగుకొంటిని. అది ఆకాశములో సంచరించును" అని చెప్పెను. .రామా యణాంతమందును రాముడు అదే పుష్పక విమానములో ఆకాశ మార్గములో అయోధ్యకు వెళ్ళెనని వర్ణించినారు. పుష్పక మనునది ఆకాశయానమగు విమానము కాదు. అది తొమ్మిదంతస్తుల మేడయైన ​విమానము. అది రావణుని సొంత సౌధము. అది మహారాజుది కావున చాలా గొప్ప మేడ. హనుమంతుడు చూచిన దామేడనే. అది యర్థ యోజనము వెడల్పు, ఒక యోజనము పొడవును కలదై యుండెను.


"పుష్పాహ్వయం నామ విరాజమానం, రత్నప్రభాభిశ్చ వివర్ధమానం,
 వేశ్మోత్తమానామపి చోచ్చమానం మహాకపి స్తత్ర మహావిమానమ్.” - యు. 7-11


పుష్పకమను పేరుగల చాలా గొప్ప మేడను చూచెను. ఆ బంగ్లాలో విశాలమైన గదులుండెను. చుట్టును మైదానములు, తోటలు, నానావిధ పుష్పవృక్షములుండెను. అట్టి పెద్ద బంగ్లానే తర్వాత రామాయణమును పెంచి వ్రాసినవారు. ఆకాశములో సంచరించు విమా నముగా చేసి దానికి రెక్కలు పెట్టి అందలి చెట్లను చిత్తరువులుగా చేసి వేసినారు. వాల్మీకి రామాయణములోనే ఆది భాగమందిట్లున్నది:


“సర్వరత్న సమాకీర్ణాం విమాన గృహశోభితాం”
                                              -బాల. స. 5, శ్లో. 16.


అయోధ్యా నగరము నానా రత్నములతో కూడినదియు “విమాన గృహముల” చేత నిండినదియునై యుండెను అని వర్ణించినారు. విమాన గృహమనగా రాజుల మేడలు అని యర్థము. “విమానోస్త్రీ దేవయానే సార్వభౌమిక సద్మని" (భాస్కర నిఘంటు) అని వ్యాఖ్యాతలందే నిరూపించినారు. విమానమనిన ఆకాశమును కొలుచునది అను నర్థము కూడా ఇచ్చుటచేత తర్వాతికాలమందు రామాయణమును పెంచినవారు విమానమునకు ఆకాశయానమని అర్థముచేసి వర్ణించిరి కాని పుష్పక విమానము అనునది రావణుని యుద్యాన భవనమను వర్ణనలను, రావణుడు గాడిదలతో లాగబడిన రథముపై సీతాపహరణార్థము వెళ్ళెనను వర్ణన ​లను సమన్వయించుటో లేక వాటిని తుడిచివేయుటమో ఆలోచింపక పోయిరి.


"జనౌఘోద్ఘుష్ట సన్నాదో విమానం కంపయన్నివ”
                                                    -అయో. 1-18.


సభ్యులు చేసిన ధ్వని రాజభవనమగు విమానమును కదలించి నట్లుండెను అని వర్ణించినదియు గమనింపదగినది.

మద్రాసు లా జర్నల్ ప్రెస్సువారు ముద్రించిన నాగరిలిపి రామాయణములో విమానమునకు మారుగా 'మేదినీం' అని యున్నది.

శబ్దకల్పద్రుమనిఘంటులో నిట్లు వ్రాసినారు: “విమానః.... సార్వభౌమగృహం - తత్తుసప్తభూమిగృహం.” విమానమనినసార్వభౌమ భవనమనుటకు రామాయణము నుండియే మరి రెండుదాహరణముల జూడుడు.


“తదద్రికూటాచలమేఘసన్నిభం
మహావిమానోత్తమవేశ్మ సంఘవత్.” (అయో. 15-49)

విమానవేశ్మము అనుమాట గమనింపదగినది.

"ప్రాసాదశృంగైర్వివిధైః కైలాసశిఖరోపమైః
అవారయద్భిర్గగనం విమానైరివ పాండరై:
వర్ధమాన గృహైశ్చాపి రత్నజాల పరిష్కృతై:"
                                                   (అయో. 17-108)


ఇక్కడ విమానములతోపాటు వర్ధమాన గృహములనుగూడ వర్ణించినారు శబ్దకల్పద్రుమ మిట్లన్నది: “వర్ధమానః ధనినాం గృహవిశేషః — యథాహలాయుధః — స్వస్తికోవర్ధమానశ్చ నంద్యా వర్తాదయోపిచ - యథాబృహత్సంహితాయాం - ద్వారాలిందోంతగతః - ప్రదక్షిణోన్యః శుభస్తతశ్చాన్యః - తద్వచ్చ వర్ధమానే ద్వారాస్తున దక్షిణం కుర్యాత్.” ​ఈ చర్చనుబట్టి వాస్తుశాస్త్ర విద్యాప్రకారము పూర్వము స్వస్తిక వరమాన నంద్యావర్త విమానాది భేదములుగల సౌధము లుండెననుట స్పష్టము. ఆకాశయానముల ఏరోప్లేనులీకాలములోనే కాని మరేకాలము లోను లేకుండెనని నా భావము.

రాక్షసుల నాగరికతా ప్రసక్తిలో విమానచర్చ వచ్చుటచే ఇంత దూరము వ్రాసినాను. రాక్షసస్త్రీలు చాలా అందమైనవారుగాను, వస్త్ర భూషణభూషితలుగాను, చూడదగినవారుగాను వర్ణింపబడినారు. వారికి కోరలు, భయంకర వికారరూపములు కానరావు. వారిలో సంగీతకళ చాలా వృద్ధిపొందియుండెను. అంగహారాది నృత్తశాస్త్రపరిపాటి నెరిగిన శ్రీ లెందరో అందుండిరి. (యు. 10-36). ఆ స్త్రీలు వీణ వాయించు నేర్పరులు, రాక్షసులు గుమ్మెట, పటహము, పిల్లనగ్రోవి, విపంచి, మృదంగము, పణవము, డిండిమము, ఆడంబరము మున్నగునవి యెరిగి యుండిరి. (యు. సర్గ 10).


రావణుడు


రావణునికి సాధారణముగా 10 తలలు 20 చేతులు ఉండినట్లు రామాయణములో అందందు వర్ణించినది నిజమే. కాని అది కల్పన. అతనికి అందరికివలెనే ఒక తల రెండుబాహువులు ఉండెను. హనుమంతుడు మొట్టమొదటిమారు నిద్రించుచున్న రావణుని చూచు నప్పుడు అతనికి ఒకతల (సు. 10-24) రెండు చేతులే యుండెను. (సు. 10-15 నుండి 22 వరకు). ఈ శ్లోకాలలో చేతులకు ద్వివచనము ముఖమునకు ఏకవచనమును వాల్మీకి ప్రయోగించెను. అతడు నల్లని వాడు. తెల్లని పాన్పుపై మాషరాశివలె (మినుప కుప్పవలె) నుండెను. (సు. 10-28). రత్నాలతో పొదిగిన పోగులు కలిగియుండెను. తెల్లని పట్టుబట్టలను కట్టియుండెను. నానావిధహారములను ధరించియుండెను. ​అతడు మహాకాయుడు. ఆధిక బలాఢ్యుడు. 1000 మంది భార్యలు కలవాడు. రావణునికి నడుములో నల్లని మొలనూలు (శ్రోణిసూత్రము) ఉండెను.

రావణునికి సంస్కృతము బాగా తెలిసియుండెను. హనుమంతుడు సీతతో మాట్లాడుటకు ముం దిట్లనుకొనెను: “నేను సంస్కృతముతో మాట్లాడితే సీతాదేవి నన్ను రావణుడని భ్రమించును” (సు 30-18). అంతేకాదు. రావణుడు మన కింకా దగ్గఱకు వచ్చుచున్నాడు. అతడు ద్రావిడభాషలకు ముఖ్యవ్యాకర్తగా వర్ణించినారు. ఆంధ్రవిజ్ఞానసర్వ స్వములో ఇట్లు వ్రాసినారు "అధర్వణకారికలలో ప్రాచీనాంధ్రలక్షణ వేత్తలుగా బృహస్పతి, కణ్వుడు, హేమచంద్రుడు, పుష్పదంతుడు, రావణుడు, గౌతముడు, ధర్మరాజు పేర్కొనబడినారు. 'అథ పౌలస్త్య రావణః' అని 4 వ కాండములో పేర్కొన్నారు. 'అనుక్తం సర్వశాస్త్రంతు రావణీయే విలోకయేత్' అని 8 వ కాండములో కలదు. ఈ విషయము లిప్పటి ముద్రిత వావిళ్ళప్రతిలో లేవు అందుచేత ఆం. వి. సర్వస్వ మును ఉదాహరించినాను. దాని ప్రకారము రావణుడు ఆంధ్రుడగు చున్నాడు. “రావణుడు అను పదము బహుశః పేరు కాదేమో! తమిళ ములో ఇరైవాన్ అనగా దేవుడు, అని అర్థము. దానినే సంస్కృతీకరించి యుందురు.”[2] రో లేక రై అనిన మన తెనుగులో ధనము అని యర్థము. రైవాన్ అనిన ధనవంతుడు లేక రాజు అని యర్థమగును. కావున రైవాన్‌నుండి రావణపదము వచ్చియుండరాదా? తెనుగు తమిళములకు రావణుని కాలములో భేదము లేకుండెనని ఎట్లు నిర్ణయించినను బాధకము లేదు. ఇరైవాన్ నుండి రావణ యేర్పడెనన్న ఊహ సతర్క్యముగా కానవచ్చుచున్నది. పౌలస్త్య అనిన అర్థమగును కాని రావణ అనిన అర్థము కాదు. అందుచేత కష్టపడి దాని కొక అర్థము ​చెప్పినారు. ఈ పదమునుండి రావణుడు తెనుగువాడో తమిళుడో అని తెలియవచ్చుచున్నది. ప్రాచీనాంధ్రవ్యాకర్తలలో నితడొకడని ప్రతీతి యుండుటచేత ఆంధ్రుడే యైయుండుననుటకు కొంత యాధార మెక్కువగా నున్నది.

రామాయణములో వర్ణింపబడిన రాక్షసులను గురించి మన మీ విధముగా తెలుసుకొనగలుగుచున్నాము. తద్విరుద్ధముగా వారితో ఆర్యులు పోరాడినప్పుడు వారు నరభక్షకులనియు, కోరలు గలవారనియు, మాయావులనియు, నానావిధములుగా వారిపై మనకు అసహ్యము కలుగు నట్లుగా వర్ణించినారు. శత్రువులను ఎన్నియో విధములుగా దూషించుట లోకాచారమే.


రాక్షస వర్గములు


ఇక రాక్షసు లెవ్వరో వారి నిజతత్త్వమెద్దియో విచారింతము. ప్రాచీనార్యులకు వివిధజాతులవారైన అనార్యులతో సంఘర్షణ లుండెను. హిందూస్థానమునకు పశ్చిమోత్తర ప్రదేశములందు ఈరానీలతో తగువు లాడిరి. వారికి పశ్చిమములోనున్న అసీరియా, బాబిలోనియా, ఖాల్డియా, ఫినికియా వారితో తగవులో వ్యాపారమో ఏదో యొకటి యుండెను. అటు హిమాలయోత్తరమున హూణులతో 1000 సంవత్సరములవరకు యుద్దాలు చేసిరి. కాకేసన్ పర్వత ప్రాంతాలలో నున్న శక (సితియన్) జాతితో తగవులాడిరి. హిందూస్థానములో సింధూనదికి తూర్పున మొదట మొదట భిల్లులవంటివారును ఇంకనూ దక్షిణములో యక్షులును, వింధ్యకు దక్షిణములో రాక్షసులును, ఆర్యులతో యుద్ధములు చేయుచుండిరి కావున ఆర్యులు తమకు భిన్నించినవారిని తమతో వైరమూనినవారిని రాక్షస వర్గములోను అసుర పిశాచవర్గములోను కట్టివేసిరి. తమతో వైరమూనిన జాతుల పేరుల నన్నింటిని తర్వాతి పౌరాణికులు కలగలిపి అసుర రాక్షస పర్యాయశబ్దములుగా నిర్వచించిరి. అందుచేతనే 'నేను' మొదలే ​అమరసింహుడిచ్చిన ఆ శబ్దములపట్టిక నుదాహరించినాను. అమరసింహు డిచ్చిన ఆ శబ్దములపట్టికలో శుక్రశిష్య, రాత్రించర, సురారి, పూర్వదేవ వంటి గుణవాచకములను వదలివేయగా మిగిలినజాతులివి: 1. విద్యాధర, 2. ఆప్సర, 3. యక్ష, 4. రాక్షస, 5. కిన్నర, 6. పిశాచ, 7. గుహ్యక, 8. సిద్ధ, 9. భూత, 10. అసుర, 11. దసుజ, 12. కర్బుర, 13. యాతు, 14. పుణ్యజన, 15. నైరృత.

ఈ విధముగా మనకు ఇంచుమించు 15 విధములైన అనార్య జాతులవారు కనిపించుచున్నారు. అయితే వీరితో పాటు మనము ఇంకా కొందరిని చేర్చవలెను. వారు (1) నాగులు (2) కిర్మీరులు. ఈ లెక్క చొప్పున 17 జాతులవారు ఏర్పడుచున్నారు. అమరసింహుడు చూపిన పర్యాయపదాలలో దైత్య, దైతేయ, దితిసుత అనునవి దానవులకు వర్తించును. దానవ, దనుజ రెండును ఒకటే. అందుచేత ఇవన్నింటికిని దనుజ అను పదమొక్కటే గ్రహించినాను. పూర్వదేవ, సురద్విష అనునవి అసురశబ్దవాచ్యములే. కోణపక్రవ్యాత్, క్రవ్యాద, ఆస్రప అనునవి వారి మాంసభుక్తిని సూచించును. పచ్చిమాంసము తినేవారని అట్లు నిర్దేశించియుందురు. శుక్ర శిష్యులని అసురులు ప్రఖ్యాతులు. ఇక ఈ 17 జాతులను గురించి విచారింతము. వీరిలో విద్యాధరులు, అప్స రలు, యక్షులు, పిశాచులు, గుహ్యకసిద్ధులు, భూతములు మన చర్చకు సంబంధించినవారు కారు. వారు హిందూస్థానములో నుండిన ఆదిమ నివాసులే. విద్యాధర గంధర్వులు గాంధారదేశమువారు. పిశాచులు పైశాచీ ప్రాకృతమును మాట్లాడుచుండిన యీ దేశవాసులు. సిద్ధులును భూతములును వారి భేదముగానే కానవచ్చుచున్నారు. భూతములు తిబ్బెట్ (త్రివిష్టప) దేశములోనివారైయుందురు. దాని సరిహద్దులో హిందూస్థా నోత్తరభాగము భూతాన్ దేశము కలదు. భూతాన్ వారినిభోటులనిరి. వారినే భూతములని పౌరాణికులు భావించియుందురు. యక్షులు జక్కుల వారని తెలిపినాను, ​అయితే యీ జక్కు అను పదమైనను ఎట్లేర్పడెను? తెనుగు వాఙ్మయములో జక్కులవారిని కొందరు కవులు వర్ణించినారు. దాన్ని బట్టి జక్కులు శ క్తిని, శివుని పూజించువారని యర్థమగును. శివునికి 'జక్కుల రేడు' అని పేరుకూడ కలదు. జక్కులపూర్వచరిత్ర మన కేమియు తెలియుటలేదు. అనార్యసంఘములగు అసుర, పిశాచవర్గాలలో నుదాహృ తులగుటచేత జక్కులు లేక యక్షులు అనార్యజాతివారనుటలో సందే హములేదు. అయితే వీరు హిందూస్థానమున నుండిన అనార్యులా లేక ఈరాన్, చీనా ప్రాంతాలలో నుండిన అనార్యులా అనునది విచారింప వలసియుండును. అసుర, పిశాచ, గాంధర్వ, దైత్య, దానవ, కిన్న రాది వర్గాలన్నియు హిందూస్థానములో కాక దాని కుత్తరపశ్చిమ దేశాలలో నుండిన అనార్య జాతులగుటచేత వాటితో సహా పఠింపబడిన యక్షులు కూడా బయటివారేయని తలచిన పొరపాటుగా నుండనేరదు. ఇట్టిజాతి యొకటుండుటచేత మన పురాణాలలో వర్ణితమైనది. కాని యద్కెడి జాతియో పురాణాలను అడ్డదిడ్డిగా పెంచిన వారికిమాత్రము తెలియదు. అందుచేత వారిని 'దేవయోనుల'లో జమకట్టిరి.

పూర్వము యక్షులను ప్రత్యేక మానవజాతి యొకటుండెను. 'దేవయోనుల' పుట్టుపూర్వోత్తరాలకై మనము టిబెట్టు, చీనా, ఈరాన్, అసీరియా, ఫణికియా, ఫ్రిజియా, తార్తరీ, బాబిలోనియా, హట్టి(హిట్టైట్) ఖశ (కస్సైట్), ఆర్మీనియా, మీడియా, దేశాలలో వెదకినచో అవన్నియు సులభముగా వెల్లడికాగలవు.

క్రీస్తుశకమునకు పూర్వము నాలుగైదునూర్ల యేండ్ల నుండి తచ్ఛ కారంభమువరకు యఛీ (yuchi) అను జాతి హూణజాతితో సమానముగా ప్రబలమైన జాతిగా నుండెను. అది చీనాదేశచరిత్రలో పై కాలమందు ముఖ్యపాత్ర వహించెను. ఈ యఛీజాతి హూణులవలె మధ్యఏషియాలోని తార్తరీజాతివారు. హూణులతో యుద్ధాలు చేసినవారు. వీరు క్రీ.పూ. 165 ​ప్రాంతములో ఈరానులో యార్‌ఖండ్, కషఘర్, మండలాల నాక్ర మించుకొని యచట స్థిరపడిరి. ఆ సమయములోని చీనా చక్రవర్తి యఛీ జాతితో సంధిచేసుకొని హూణుల నెదిరించెను క్రీస్తు శకారంభమున యఛీలు హిందూస్థానములో ప్రవేశించి కాశ్మీరు, పంజాబుదేశాలలో నిలచి పోయిరి. వారు క్రమముగా గూర్జర ప్రాంతానికిని వ్యాపించిరి. వారిలోని వాడే కనిష్క చక్రవర్తియని చారిత్రికులు తేల్చినారు. గూర్జరమునుండి కొందరు క్రీస్తుశకాదినుండి పదవ శతాబ్దమువరకు తెనుగుదేశములోనికి వచ్చియుండిన ఆశ్చర్యము కాదు. కావున ఈ యఛీ జాతివారే యక్షులని యనుకొందును. మన ప్రాచీనశైవము కాశ్మీర శైవమనియు, ద్రావిడ శైవ మనియు రెండు విధాలుగా నుండెను. కాశ్మీరము తురకాణముగా మారు వరకు కాశ్మీరులు పరమవీరశైవులు. యచీ లచటనే శైవమును పుచ్చుకొన్నవారై యుందురు. అందుచేతనే జక్కులవారున్నూ శివశక్తుల పూజకులై యున్నారు.

యూరోపుఖండములోని బ్లాక్‌సీ (Black sea) అను సముద్రానికి ప్రాచీనకాలమందు యుక్షైన్ సముద్రమని (Euxine sea) పేరుండెను. యుక్షైన్ ప్రాంతమందుండిన జనులను యక్షులనిరేమో అనియు నొక యూహను తెలుపుకొంటున్నారు. అక్షస్ (Oxus) నదీప్రాంతము వారైనా అయియుందురు. అక్షస్ పదాన్ని బట్టి యక్షస్ యేర్పడియుండును. ఈ మూడింటి నేదైనా ఒకటి మూలమైయుండును.

ఇక కిన్నరు లెవరో తెలుసుకొందము. ప్రాచీన గ్రీకు చరిత్ర కారులు (Kanarii) ‘కనారియై' అను జాతియొక్కటి ఏషియా మైనరులో నుండినట్లు వ్రాసినారు. ఆ జాతి ఏషియా మైనరులో సిరియా మున్నగు దేశాలలో నుండిన ఒక శక (Sematic) జాతియై యుండును.

మన తెనుగు కిన్నర లేక కిన్నెర అనిన ఏకతంత్రీ సమాయుక్త మగు తంబురావంటి యొక వాద్య విశేషము. అయితే చిత్ర మేమన గ్రీకు ​భాషలోకూడ కిన్నెర (Lyre) అనిన మన తెనుగుకిన్నెరవంటిదే. కిన్నెరనుగూర్చి ఆడోనిస్ (Adonis) అను గ్రంథములో (Thinker's library) జే. జీ. ఫ్రేజర్ ఇట్లు వ్రాసెను: “సిరియా సముద్రతీర ప్రాంతమును పూర్వము శకరాజగు కినిరాస్ (Cinyras) ఏలెను. అతడు తంతీవాద్యమందు నిపుణుడు. కినిరాస్ పదమునకు స్పష్టముగా గ్రీకు కినిరాతో సంబంధము కలదు కినిరా అన తంత్రీవాద్యము (Lyre). ఆ పదము గ్రీకుభాషలోనికి శకభాషలోని కిన్నర్ (Kinnor) అను పదమునుండి యేర్పడినది. పూర్వకాలమందు జరుసలెంలో తంత్రీవాద్యము దేవుని సేవలో ప్రధానమైనదిగా కానవస్తున్నది. వాద్యగీతముల ద్వారా దేవుని ప్రసన్నునిగా జేసుకొనుచుండిరి. ఈ వాద్యములందే అచ్చటి పూజారులకు ఒళ్ళు నిండుచుండెను.” (పుట. 38).

పై విషయాలనుబట్టి కిన్నరులనుజాతి శకజాతివారనియు, వారు గానవాద్యములందు ముఖ్యముగా కిన్నెరవాద్యమందు ప్రవీణులనియు వారు సిరియాప్రాంతమందుండిన వారనియు గ్రహింపవచ్చును. మన పౌరాణికులును కిన్నరులును, గాంధర్వులును (గాంధార దేశమువారు) గీతవాద్యములందు ప్రవీణులని వర్ణించిరి.

గ్రీకు పురాణములలో కెంతౌరులు (Centaurs) అను వారుండిరి. వారు సగము గుఱ్ఱము సగము మనిషి ఆకారము కలవారు. వారు లాపితులు (Lapiths) అను మానవజాతితో వైరము కలిగి వారి స్త్రీలను బలాత్కరింప తలపెట్టుచుండెడి వారగుటచే ఉభయవర్గాలకును నిరంతర యుద్ధములు జరుగుచుండినట్లును, గ్రీకుల సంగీతాధిదేవతయగు అపోలో లాపితుల పక్షము వహించి సాయపడినట్లును గ్రీకు పురాణాలు వర్ణించెను కెంతౌరు పదమే కిన్నర పదమని స్పష్టమగుచున్నది. గ్రీకుల సృష్టిని హిందువులు గ్రహించిరో యేమో? ​టిబెటు హిందూస్థానము సరిహద్దుతో కలియుచోట నొకజాతి కలదు. దానిని నేటికిని కిన్నరజాతి యందురు. ఆ జాతివారు సంగీత మునకు ప్రసిద్ధులు.

యక్షజాతియొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ సందేహాలతో నిండి యుండగా వాటికి మరొక సందేహమునుగూడ జతజేయవలసియున్నది. ఏ. నంది అనువారు “ఇండియన్ ఎత్నాలజీ" అను గ్రంథములో నిట్లు వ్రాసిరి:

"విష్ణుపురాణములో దక్షుని కూతురగు ఖశ అనునది కశ్యపుని భార్యయయ్యెననియు ఆమెకు యక్షులు రాక్షసులు పుట్టిరనియు వ్రాసినారు. ప్రాచీన సంస్కృత రచయితలకు యక్షులుఖశ జాతివారనియే తెలిసియుండెను. ప్లినీ అను ప్రాచీన గ్రీకుచరిత్రకారుడు యక్షులు నేటి కుమవాన్ (Kumaon) మరియు నేపాలు దేశాలకు పశ్చిమముననుండి నట్టివారని వ్రాసెను."

కాశ్మీరమందు ఇంచుమించు 1000 ఏండ్ల క్రిందట వ్రాసిన పౌరా ణిక గాధయగు నీలమతపురాణమందు నికుంభుని నాయకత్వమున కొందరు పిశాచులు హిమాలయోత్తరమునుండి వాలుకార్ణవములో ఆరు యోజనముల పొడవుగల నొక ద్వీపమునకు (దేశమునకు) వెళ్ళిరని వ్రాసినారు. గ్రీర్సన్ పండితుడు దరదులే పిశాచులని అభిప్రాయపడి నాడు. హిమాలయోత్తరమందలి వాలుకార్ణవము (ఎడారి) గోబీ యను నది. అది మంగోలియాలో కలదు. కాశ్మీరులోని భాగమును దరద్దేశమని కల్హణుడు వర్ణించినాడు. వీటినిబట్టి కాశ్మీరు, టిబెటు ప్రాంతాలలోని ఆదిమజనులను పిశాచు లనుటలో సందేహము లేదు. నైరృత శబ్దము రాక్షస పర్యాయముగా అమరుడు తెలిపినాడు. ఇదికూడ ఒక దేశమందలి జనులను తెలుపును. డి. జి. హోగర్తు ప్రాచీన ప్రాచ్యము (Ancient East) అను గ్రంథములో నిట్లు వ్రాసినాడు: ​“అసీరియా కుత్తరమున కాల్డియా యుండెను. దానినే ఉరర్తుదేశ మనిరి. టైగ్రిసు నది పైభాగమును మెసపొటేమియా పైభాగమును అసీరియావారు పూర్వము నైరీ (Nairi) భూములనిరి.” ఆ భూములే నైరృతిభూములై యుండును. అచ్చటి జనులనే మనవారు నైరృతులని యుందురు. అసుర దానవ దైత్యవర్గాలుండు ప్రాంతములందే నైరృతు లుండుటయు నీ యూహను బలపరచును.

ఇక అప్సరులెవరో తెలుసుకొందము. అలెగ్జాండరు మన దేశముపై దండయాత్ర చేసినప్పుడు హిమవత్పర్వతప్రాంతాలలో అస్పరులు (Asparians) అతనితో ఘోర యుద్ధము చేసిరని చరిత్రకారులు వ్రాయు టలో అప్సరులజాడను తెలిపినారు. వర్ణవ్యత్యయము వ్యాకరణమందును సారూప్య భాషాశాస్త్ర మనబడు ఫిలాలజీలోను అంగీకృతమైనట్టిది. నేటి కిని ఆంధ్రులలో కల్హార, బ్రమ్హ, మధ్యాన్హము మున్నగునవి, ఉత్తర హిందూస్థానాలలో శ, షల కలగలుపు షక్తి, షాస్తర్ పదాద్యపభ్రం శోచ్చారణము వీటి కుదాహరణములు. కావున అస్పర తొందరగా సులభముగా అప్సర అయ్యెను.

ఇక మిగిలినవారు (1) రాక్షస, (2) కిన్నర, (3) అసుర, (4) దనుజ, (5) కర్బుర, (6) యాతు, (7) పుణ్యజన, (8) నాగ, (9) కిర్మీర - వీ రందరును ఒకే జాతివారు కారు. భిన్నభిన్న జాతుల వారు. నైరృతులు అనగా ఆర్యులకు నైఋతిదిక్కుననుండిన వారు. అసురులు, రాక్షసులు ఒకే జాతివారనుట సరికాదు. సురలు కాని వారు అసురులు అనుటయు సరికాదు. ప్రాచీనములో దేవతలు, అసురులు అను రెండు జాతు లుండెను. ఋగ్వేదములో సురశబ్ద మెచటను కానరా దాని తద్‌జ్ఞులనుచున్నారు. అందు దేవశబ్దమే వాడినారు. ప్రాచీన ఈరా నీలయొక్క జంద అవెస్థా గ్రంథములో దేవ అనిన దుష్ట జనుడు, అహుర అనిన మంచి జనుడు. ఆపదములే ఋగ్వేదములో తలక్రిందైనవి. ​అందుచేత ఆర్యులు ఈరానీలనుండి వివాదపడినది స్పష్టము. అసీరియా దేశమువారే అసురులు అని పలువురన్నారు. అయితే అసీరియావారే అసురులని చెప్పజాలము. ముందాజాతిలో ఒక అసుర జాతి యిప్పటికినీ కలదు[3] మొత్తముపై అసురులు రాక్షసులు భిన్న జాతులుగా కనిపించుచున్నారు. దనుజులు అనువారు దనుసంతతివారని స్పష్టమగుచున్నది దానవులు క కేసన్ పర్వతములకు ఉత్తర భూమిలో నివసించినట్టివారు. కీరోపండితు డిట్లు వ్రాసెను:

"దనుజాతి జోర్‌దన్‌నుండి వచ్చెను. వారు వ్యాపించిన ప్రదేశ ములలో తమ జాతినామమును స్థిరముగా ముద్రించిపోయిరి. దాన్‌యూబ్, దానిష్టర్, దానిట్జ్, దాన్‌దారి, దాన్‌రిక్‌గట్లు, దాన్‌మార్క్, ఐర్లాండులోని కొన్ని ప్రదేశాలున్నూ వారి పేరుతో నిండియున్నవి."[4] కావున దానవులు లేక దనుజులు రాక్షసులతోను అసురులతోను భిన్నించియుండిరి. దానవులు ​కకేసస్ పర్వతాలకు ఉత్తరసీమలో నిండియుండినవారు. అసురులు ఈరానులోనివారు. దైత్యులను శబ్ద మెట్లేర్పడునో విచారింతము. దితే రపత్యంపుమాన్ దైత్యః, దైతేయః అని పురాణాల పెంచిన మహాశయులు కల్పించుకొనుటచే దితి అను దేవతను సృష్టించిరి. దితి యెప్పుడు పుట్టెనో అప్పుడు అదితి యేల పుట్టరాదు? ఆమెనుకూడా పుట్టించిరి. ఆమెకు సంతాన మిచ్చి వారిని ఆదిత్యులనిరి. మరి దితికి అదితికి భర్త కావలె కదా! కశ్యపు నేర్పాటుచేసిరి. దేవదానవులను పుట్టించినవాడు సాధారణ ముని యగునా? అతడు కశ్యపబ్రహ్మగా మారెను. ఆతని కింకనూ పలువురుభార్యలను కూర్చిరి. వారికినీ సంతానము కలిగెను. వారే దానవాదిత్య దైత్య యక్ష రాక్షస సురాసురాది దేవయోనులైరి. ఈ కథల న్నియు కల్పితములే.

చారిత్రక దృష్టితో మనము యథార్థమును కనుగొనవలెను. ప్రాచీనార్యులగు మన పూర్వులు ఆఫ్రికాఖండోత్తర భాగమందలి బర్బర దేశము నల్లసముద్రమునకు కాస్పియన్ సముద్రమునకు సమీపమందును దక్షిణముననున్న దేశాలు, తార్తరీ, మంగోలియా, చీనాదేశాలు వాటికి దక్షిణముననున్న దేశాలు, ఏషియామైనర్ భూభాగదేశాలు జపాను, ఫిలిప్పైన్ దీవులుతప్ప తక్కిన ఇండోనీషియా దీవులు, మలయా, బర్మా, సయాం దేశాలు ఎరిగియుండిరని గట్టిగా చెప్పవచ్చును. తర్వాత క్రీస్తు శకాదినుండి అయిదారు నూరేండ్లవరకు పురాణాల పెంచుతూ పెంచుతూవచ్చిన పెద్దమష్యులు సముద్రయాణముచేయక విదేశాలకుపోక తమ భారతదేశమే తమకు తెలియక, శబ్దసామ్యాలనుబట్టియే కథలల్లిరి.

శబ్దసామ్యాలపైకథల పుట్టుకకు కొన్ని నిదర్శనములు చూపిం తును. సుగ్రీవుడును వాలియు ఎట్లు పుట్టిరో కనుగొందము. ఒక కోతి నొకనాడు ఇంద్రుడును సూర్యుడును ఒకేమారు చూచి ఒకేమారు మోహాబ్ధిలో మునిగి ఉక్కిరిబిక్కిరియైరట! దేవతలైనను వారి కింద్రియ ​నిగ్రహము లేకపోయెనట! అదెంతటి అందమైనకోతియో యేమో, వెంటనే ఇంద్రుని సూర్యుని వీర్యములు దాని గ్రీవముపై, వాలముపై పడెనట. పడుటయేతడవు - దేవతల వీర్యము వ్యర్థమగునా మరి - సుగ్రీవుడు, వాలియు పుట్టిరట!


ఒకనాడు మనువుదుమ్మిన
వికలుడుగాకతనిఘ్రాణవివరము వెంటన్
బ్రకటయశుం డిక్ష్వాకుం
డకలంకుడు పుట్టె రవికులాధీశుండై .
                              భాగవతము. నవమ స్కంధము. ప. 155.


మను వంతటివాడు “ఇక్షా" అని గట్టిగా తుమ్మితే ఆ తుమ్ము వ్యర్థముగా పోవచ్చునా? పోనీయరాదు. ఇక్ష్వాకుడే పుట్టవలెను.

యువనాశ్వునకు 100మంది భార్యలుండిరట. అందొక్కదానికైన సంతానము కలుగరాదా? ఊహూఁ, కలుగలేదు. కలరుగదా పుత్రులను పుట్టించు మంత్రాలు చదువువారు! (మన తెనుగువారే మంత్రాలకు మామిడికాయలు రాలునా అను సామెతను పుట్టించి అపచారము చేసినారు!) వారు జలములు మంత్రించి రాత్రి యొకచో భద్రపరచి యుంచగా సరిగా ఆ జలాన్నే యువనాశ్వుడు అర్ధరాత్రి దప్పిగొన్నవాడై త్రాగవలెనా? ఆ నీరుత్రాగగానే గర్భముదాల్చెను. ఎవరు? మగవాడు! ఆతనికి కొడుకు గూడా పెట్టెను. ఎట్లు పుట్టెను? భావిసంతతివారికి సందేహము కలుగ కుండా ఆ పిండము తానే కడుపు వ్రక్కలించుకొని చక్రవర్తి చిహ్నా లతో పుట్టనే పుట్టెను. ఇంద్రుడు వచ్చి “మాంథాస్యతు” (నా వ్రేలు కుడువుము) అని అన్నాడట. అందుచేత ఇంద్రునివేలుచీకి పెద్దవాడై మాంధాతయను పేరుపొందెను.

(భాగవతము. నవమ స్కంధము. ప.167)

​


“పెద్దలైన మునులు పృథివీస్థలికి రాజు
లేమిజూచి నిమిక ళేబరంబు
దరువ నొకడుపుట్టె తనయుండు వానిని
జనకుడనుచు బలికె జగములెల్ల .


మరియు నతండు విదేహుండు కావున వెదేహుండనియు మథన జాతుడు గావున మిథిలుండనియు ననంబరగె.”

(భాగవతము. నవమ స్కంధము. 370-1)

మగపీనుగనుండి జనించెగాన జనకుండట! ఒక్క నవమస్కంధము లోనే యిన్ని కథలు. తుమ్మునుండి, మగవాని కడుపునుండి, మగపీనుగ నుండి పిల్లలను పౌరాణికులుతప్ప ప్రపంచమందు మరెవ్వరైన పుట్టించి నారా? ఇవి మన పౌరాణికుల ఘోర కల్పనలు!

కావున ఇట్టి కల్పనలలోపల దాగిన మూలవిషయములను విడదీసి తేల్చుట అత్యంతకష్టసాధ్యమగు పనియైపోయినది.

కశ్యపునికి పలువురు భార్యలనియంటిమికదా! కశ్యపుడెవరు? ఆలోచించి పరికించిన కాస్పియన్ సముద్రమే కశ్యపసముద్రము. ఆ సముద్రమునకు భార్యలు దానిలోనికి పారునదులు. డాన్ నది అందు లోనికి పారును. కాన తత్ప్రాంతీయులు దానవులనబరగిరి. దైత్యక అను మరొకనది దానిలోనికి పారును. అందుచేత తత్ప్రాంతీయ జనులు దైత్యులనజెల్లిరి.

రాక్షసులు అను పద మెట్లు వచ్చెనో ఎవ్వరునూ ఊహింపజాల కున్నారు. దైత్య, అసుర, కిమ్మీర, యక్ష, గాంధర్వాది జాతులవలె రాక్షసులును ఒక అనార్యవర్గమువారై ప్రాచీనార్యులకు సన్నిహితులై వారితో తగవులు, బాంధవ్యాలు చేయుచూవచ్చినవారై యుందురు. వారు ​ఆఫ్‌గనిస్థానుకు పశ్చిమోత్తరమందుండియుందురు. ఆ ప్రాంతములో ఆరల్ సముద్రము (Sea of Aral) కలదు. దానిలోనికి అరక్షస్ (Araxes) అను నది పారుచున్నది. రకార(రేఫ)మునకు ముందు అ,ఇ,ఉ అను నచ్చులుపయోగించి పలుకుట బహుప్రాంతాలలో ముఖ్య ముగా ద్రావిడులలో, శకజాతులలో వర్తించు నాచారము. తమిళములోని ఉరల్ మన రోలు. ఇట్టి వనేకముగా కలవు. అరబ్బులు అల్ శబ్దమును పదాలకు చేర్చుదురు. ఇర్రహిమాన్, ఇర్రహీం ఇత్యాదులు కలవు. కావున అరక్షన్ అనునదే రక్షన్ అయినది. అరక్షస్ నదీ ప్రాంతవాసులే రక్షస్సులు-రక్షోగుణమువారు. వేదాలలో రక్షన్‌శబ్దమేకలదుకాని రాక్షస శబ్దములేదని తలతును. రాక్షసశబ్దము పౌరాణికులదిగా కానవస్తున్నది. అదే విధముగా అసుర అనుదానిలో అకారము న ఙర్థములో తీసుకొని దాన్ని తొలగించి సుర శబ్దమును కల్పించినది ఉపనిషత్తులకాలము నుండియే. కావున అరక్షస్ నదీప్రాంతవాసులే రాక్షసులై యుండిరని నా యభిప్రాయము.

రామాయణమందు ప్రారంభమందే, 'నిషాద' శబ్దము కలదు. దానిపైననే శ్లోకమారంభమయ్యెనందురు. గుహుడు నిషాదరాజు. (అయో. 50-33) రామునికాలమందు నిషాదుల “భక్ష్యభోజ్యపేయ లేహ్యములు" (50-39) రాముని కంగీకారయోగ్యములుగా నుండెను. కాని అమరునికాలమువరకు నిషాదులు చండాలురైరి! నిషాదు లెవ్వరు? వా రాటవికులైయుందురు. హిందూకుష్ పర్వతమునే నిషధపర్వత మనిరి. పూర్వము దానినే నిషద లేక నిషాదపర్వత మనిరి. అర్రియన్ అను ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు దానిని “నిస” (Nysa) అనెను. టాలమీ దానినే పరోప-నిసస్ (Paropa - Nisos) అనెను. అచ్చటి ఆదిమనివాసులే నిషాదులు. గాంధారలోని గాంధర్వులవలెనె నిషదలోని నిషాదులును మంచి గాయకులై యుందురు. అందుచే "నిషాదర్షభగాంధార షడ్జమధ్యమధైవతాః" అని యమరుడు వ్రాసెను. ​ఈ విధముగా వారు భిన్న దేశములందుండగా మూడు జాతులును ఒక టే యని యెట్లు చెప్పవలెను? అసురులకును దేవతలకును ఎల్లప్పు డును యుద్ధము జరుగుచుండెను. సాధారణముగా దేవతలే ఓడిపోవు చుండిరి. బలము తక్కువకలవారికి ఉపాయములు మెండు. దేవతలలో అదే గుణమే కనబడుచున్నది. ఐతరేయబ్రాహ్మణములో నిట్లువ్రాసినారు:


"దేవా౽సురావా ఏషు లోకేషు సమయతంత... తాంస్తతో సురా అజయన్...
దేవాబ్రువన్ నరాజతయా వైనోజయతి రాజానం, కరవామహే ఇతితథేతి” (1-14)


అసురులకు రాజులుండిరి. దేవతలకు రాజులు లేకుండిరి. ఓడి పోయిన దేవతలు తామును రాజుల నేర్పాటు చేసికొనిరి. అసురులకును దేవతలకును కల ముఖ్యభేద మిందు కానవచ్చుచున్నది.

దండకారణ్యమందలి ఆదిమవాసులలో ఆర్యుల నెదిరించినవారిని కూడా పౌరాణికులు రాక్షసులనిరి. యస్.యన్. ప్రధాన్‌గారిట్లు వ్రాసి నారు: దశరథుడు 'రాజర్షి'యగు దివోదాసునికి సహాయముగా దండ కారణ్యములోని వైజయంత ప్రభువైన శంబరతిమిధ్వజునితోడి యుద్ధములో సహాయపడెను. (ఈ విషయమును అయోధ్యకాండలో 9 సర్గలో చూడ నగును. అందు దివోదాసునికి మారుగా ఇంద్రుడు అని చెప్పినారు.) ఋగ్వేదములో (4, 30, 14) తిమిధ్వజ శంబరుని పూర్వికుడు 'కులితర' అని చెప్పబడినాడు. శంబరునికి 100 నగరా లుండెననియు, వాటిని దివోదాసుడు ధ్వంసము చేసెననియు తెలిపినారు. శివపురాణ ములో (6, 13) మయునికి మాయావతి, మందోదరి యను ఇద్దరు కుమారైలుండిరని తెలిపినారు. మాయావతి శంబరునికి, మందోదరి రావణునికిని ఇయ్యబడెను. రావణుడు మాయావతిని ఎత్తుకొనిపోజూచెను. శంబరుడు వాని నోడించి పట్టుకొనెను. మామయగు మయుని ప్రార్థనపై ​రావణుని క్షమించి వదలిపెట్టెను”[5] పై విషయములు మనకు కొన్ని సత్యములను బోధించుచున్నవి. రావణుడు దండకారణ్యప్రాంతమం దుండెననియు, వాడు దశరథుని సమకాలికుడనియు, రావణుని షడ్డకు డగు శంబరునితో దశరథునికి వైర ముండెననియు, రావణుడు భార్య చెల్లెలినిగూడ బలాత్కరింపబోయిన దుష్టకాముకుడనియు, రావణుని మర్దించిన శంబరుడే ప్రబలుడనియు దీనివలన విశద మగుచున్నది. ఇంతవరకు అసుర, దనుజ (దానవ) రాక్షసులను గురించి తెలిపినాను. ఇక కిన్నర, కర్బుర, కిర్మీరులను గురించి చర్చింతును. కిర్మీరులను కిమ్మీరులనియు మనవారు వ్రాసినారు. ఈ మూడు జాతులను ఒకే జాతివారని అనుకొనుచున్నాను.

కర్బుర అనిన ఒక చిత్రవర్ణ మనియు దానికి కిర్మీర అను పదము పర్యాయపదమనియు అమరసింహు డనినాడు.

"చిత్రకిర్మీరకల్మాష శబలైతాశ్చ కర్బురే” (ప్ర. ధీవర్గ). కిమ్మీ రులు అను నొకజాతి బహు ప్రాచీనకాలములో ఇప్పటి క్రిమియాలోను, నల్లసముద్ర (Black Sea) ప్రాంతములోను నివసించియుండిరి. బైబిల్ లోని పూర్వ నిబంధనము (Old Testament)లో వీరిని గోమర్ జాతి అని యనిరి. ప్రాచీనశాసనములలో వీరినే గిమ్మరై (Gimittai) అనియు, గ్రీకుల చరిత్రలలో కిమ్మీరులు (Kimmerians) అనియు పేర్కొనిరి.[6] “రష్యాకు దక్షిణభాగములో ఒక సంచార జాతి (Nomads) నివసించు చుండెను. వారిని గ్రీకులు కిమ్మీరులు అని పేర్కొనిరి. అజోఫ్ (Azoff) సముద్రమును నల్లసముద్రములో కలుపునట్టి జలసంధిని కిమ్మరియన్ బాస్ఫరస్ (Cimmerian Bosphorus) అని పిలుచుచుండిరని హెరొడోటస్ ​చరిత్రకారుడు వ్రాసెను. పాతాళలోకమున కదేద్వారమనియు, అచ్చట అంధకార ముండెననియు గ్రీకులు విశ్వసించిరి. అందుచేత 'కిమ్మీరాంధకారము' అని వారిలో సామెత యయ్యెను."[7]

(ఇదే అజాఫ్ సముద్రమువద్దనుండు ద్వీపకల్పము. ఇప్పుడు క్రిమియా అని యందురు. అనగా కిర్మీరుల దేశము అను నర్థమిందు స్ఫురించుచున్నది.)

రాక్షసులకు 'పుణ్యజనులు' అను నదొక పర్యాయపదము. పుణ్యజనులుకూడ వేరు జాతివారు. నా అభిప్రాయములో ఫనికియా (Phoenicia) దేశ జనులనే మన పూర్వికులు పుణ్యజనులు అని వ్యవహరించి యుందురు. వారిని పూర్వము 'పున' (Puna) అని పిలుచుచుండిరి.[8] ఫణికులు నరబలు లిచ్చెడివారని యిదివరకే తెలిపియున్నాను. రాక్షసులు నరభక్షకులని మనవారనిరి. “గ్రీకుభాషలోఫైనోస్ లేక ఫోనస్ (Phoenus) అనిన రక్తవర్ణము. వారు రక్తవర్ణు లగుటచే అట్లు పిలువబడినట్లున్నది.”[9] ఫణికులు సూర్యుని 'బాల' అను పేరుతో పూజించుచుండిరి. అదే ఋగ్వేదములో 'వల' అనగా సూర్యుడు అను నర్థములో (మండలం 4 సూ. 18 మరియు 33) ప్రయోగింపబడినదని ఒకరు వ్రాసిరి. కాని నాకీ 'వల' పదము ఋగ్వేదములో కానరాలేదు.

యాతు, యాతుధాన పదములు రాక్షసులకు పర్యాయపదములుగా ఋగ్వేదములో ప్రయోగించినట్లు కనబడుచున్నది. కాని వారు ​వేరుజాతిగా కానవచ్చుచున్నారు. హీబ్రూ భాషలోని బైబిల్‌లో యాఫ్త్ (Yaphth) అను వాడుండెనని తెలిపినారు. అతడే మన 'యాతు' అయి యుండును. అతని సంతతివారే యాతుధానులై యుందురని ఊహించు చున్నాను.


"యః పౌరుషేణ క్రవిషాసం దుక్తేయో అశ్వ్యేన పశునా
యాతుధానః" (ఋగ్వేదము 10-87-16)


యాతుధానులు మనుష్యులను చంపుకొని తినువారనియు గుర్ర ముల మాంసమును తినువారనియు పై మంత్రము తెలుపుచున్నది. శకజాతి వారిలో మధ్య ఏషియా తురానీలు, తార్తారులు, హీబ్రూలు, అరబ్బులు చేరినవారే! పూర్వము శకజాతివారు మనుష్యులను తినెడివారు. “వారు గుర్రము మాంసము తిని, గుర్రము పాలు త్రాగుచుం డిరి” అని అసీరియా చరిత్రలో రగోజిన్ గారు వ్రాసిరి. "సితియనులు (శకులు) మహా క్రూరులు, ఓడిన శత్రువులను చంపి వండి విందు చేసు కొనుచుండిరి” అని మావర్ (Mavor)(Universal History 1812 A.D) తన ప్రపంచ చరిత్రలో వ్రాసెను. కావున శకజాతి భేదమే యాతుధాన వర్గమనుట స్పష్టము.

రామాయణమందలి రాక్షసులు, దానవ, దైత్యాసుర, కిమ్మీర యాతుధాన పుణ్యజన నైరృతాది వర్గాలవారు కారు. వారు కృష్ణా గోదావరీ ముఖ ద్వారముల మధ్య ప్రదేశమందుండినవారని నా యభిప్రా యము. జనస్థానము సవరల 'జైతాన్' అనుటయే సమంజసము. జనస్థానము నుండి ఖరదూషణులు విపులసైన్యముతో రాము నెదుర్కొ నుటచేత వారు పంచవటికి సమీపమున నుండియుండవలెను. వారు సముద్రము దాటివచ్చి దాడిచేసినట్లు రామాయణము చెప్పలేదు. బౌద్ధ మత గ్రంథమగు సుత్తనిపాతములో అశ్మకదేశము గోదారీతీరమున ​నుండినట్లును 'మహాజనపదము' అందుండినట్లును తెలిపినారు. బౌద్ధ కాలమందును గోదావరీ ప్రాంతములందు జనస్థానముండినట్లు తెలుపుట చేత రామాయణ జనస్థానము జాడ స్పష్టమైనది గోదావరి సముద్రమునకు సమీపమందుండిన ప్రాంతమంతయు జనస్థానమనియు, గోదావరి లంకలలోనే లంక యుండెననియు నిర్ణయించుకొనిన యథార్థమునకు సమీపములో నున్నామనుకొనవలయును. ఇక 'నాగులు' మిగిలినారు . వారు మన రామాయణములో రాలేదు. మహాభారతము వారి కథతోనే ప్రారంభమగుచున్నది. అనగా అప్పటికి వారు కనిపించుచున్నారు. వారు హూణులలోని తెగవారు.

ఇచ్చటనే మరొక విషయము వ్రాయవలసియున్నది. దైత్యులు దితిసుతులని అమరసింహుడు వర్ణించెనని చెప్పినాను. దైత్య శబ్దమునకు వ్యుత్పత్తి కల్పించినాడు అమరుడు. కాని 'దైత్య' అనునదే మూల శబ్దము. దానిని విభజించి సమాసముగా చేయరాదు. మీడియాను ఆర్మి నియా నుండి వేరుపఱచునట్టి ఆరాస్ (Aras) నదిని పూర్వము దైత్య నది యని వ్యవహరించిరి. పార్సీల వేండీదాద్ అను పవిత్ర గ్రంథములో నిట్లున్నది : "అహురమజ్దాను అయిన నేను మంచి యుత్తమ దేశమగు ఐర్యాణ వీజ(Airyana Vaeja) అను దేశమును మొట్టమొదట సృజించినాను. అది దైత్య నదీ సమీపమందుకలదు”[10]. ఆరాన్ నదిని అరక్షస్ (Araxes) అనియు వ్యవహరించిరి. కావున ప్రాచీనమందు-అరక్షస్ అనగా - దైత్య నదీ ప్రాంత జనులను దైత్యులనిరి. వారే అరక్షస్సులు అనగా ​రక్షోవర్గమువారు "దైత్యుల ముఖ్యనగరము హిరణ్యపురమని మన పురాణాలు చెప్పెను. అదే యిప్పటి హిర్కేనియా (Hyrcania). ఆ ప్రాంతమందే కాస్పియా దేశముకలదు అచ్చటనే హిరణ్య కశిపు, హిరణ్యాక్షులు రాజ్యము చేసిరి":[11]

నాగులు మనచర్చకు సంబంధించకున్నను వారెవరో తెలిపి యీ చర్చముగింతును. వారు హూణులని తెలిపినాను. నందలాల్‌దేగారిట్లు వ్రాసినారు: “సంస్కృతభాషలో సర్పములకిచ్చిన పర్యాయపదములలో హూణులలోని వివిధజాతుల పేరులు సరిపోలుచున్నవి. హింగ్ నూ (Hiung nu) అనునది హూణులపేరు. దానినుండి నాగశబ్దము వచ్చినది. సర్ప అనునది సర్తస్ప జాతిపదము. ఉరగ ఊగురుస్ (Uigurs) జాతి పదము. పర్ని, నాగాయ అను రెండు శకజాతులు జక్సార్టీసు నదీ ప్రాంతాలలో నివసించుచుండిరి. ఆ రెండు జాతుల పదమే పన్నగ అయినది. అజి పదమే అహియైనది. ఫణి యనునది ఫనికియాలోని ఫనికుల నుండి ఏర్పడెను"[12] హూణులకు మొదటిపేరు తలె (Tele) రసా-తల, అ-తల, కు-తల మున్నగు పేరులు దీనినుండియే వచ్చెను.”[13] సుగ్రీవుడు పశ్చిమదిగ్భాగ మందలి దేశములను తెలుపునప్పుడు హిమవత్పర్వత ప్రాంతాలలో అపర తాలపర్వత మున్నదనెను. ఈ పదము తాల (లేక హూణుల) జాతిని సూచించునేమో !

రాక్షసుల పర్యాయపదములను చెప్పుచు అమరసింహుడు వారిని శుక్రశిష్యులని ప్రత్యేకముగా తెలిపియున్నాడు. శుక్రుడు రాక్షసులకు కాదుకాని అసురులకు గురువు. అసురులే జరథుస్త్రమతములోని ​అహురులు. జరథుస్త్రుడే భృగువని మూడవ ప్రకరణములో తెలిపినాను. శుక్రుడు భార్గవుడు. కావున అసురగురు వయ్యెను.

రాక్షసులు మాయావులని పౌరాణికుల అభిప్రాయము. శుక్రుడు అసురులను బ్రదికించు క్రియల నెరిగియుండెనని వర్ణించినారు. 'యాతు' అనునది రాక్షసుల పర్యాయపదము. యాతు అనిన కర్మనాశకుడు అనియు పీడ అనియు అర్థము చెప్పుదురు. సాయణాచార్యులు రాక్షసుడు అని అర్థము చేసిరి. పార్సీభాషలో ఒక పదమిప్పటికినీ నిలిచియున్నది. అది 'జాదూ' అను పదము. మాయ లేక గారడి అని యర్థములో వాడుదురు. యకారము జకారముగా తకారము దకారముగా మారును. యాతుపదమే జాదూ అయియుండును. ఈ చర్చనుబట్టి అసురాది జాతులవారందరు ఒక్క రాక్షసులు మాత్రమే కారనియు, వారందరు వేర్వేరు జాతులవారనియు నా యభిప్రాయము.


రాక్షసుల నాగరకత


మరల మొదటికి వచ్చుచున్నాను. వింధ్యకు దక్షిణభాగములో రావణపాలితులై యుండిన రాక్షసులు పనికిరానివారు కారు. ఆర్యులకు ప్రబలప్రతిస్పర్ధులు. గొప్ప నాగరికత పొందినవారు. వారి నగరము, నగరములోని సౌధములు, సౌధములలోని సుందరాంగులు, సుంద రాంగులు నేర్చిన నాట్య సంగీత చిత్రకళలు, వారి యానందములు- ఇవన్నియు వారి నాగరకతను బాగా సూచించుచున్నవి. రావణుడంతటి దుష్టకాముకుడయ్యును సీత నెత్తుకొనిపోయిన తర్వాత ఆమె యంగీకార మెందుకు కోరుచుండెను? ఆతనికి వేదవతియొక్క శాపముండెనని ఉత్తర కాండలో తెలిపినారు. అది ప్రమాణము కాదు. నిజమైన విషయమేమన రావణుడు సీతకు సమ్మతించుటకు ఒక సంవత్సరము గడువిచ్చెను అటు తర్వాత ఆమె ఒప్పుకొననిచో ఆమెను బలాత్కరింతునని తెలిపెను. ​ఒక సంవత్సరమువరకు మాత్రమెందుకు గడువిచ్చెను ? అది రాక్షసాచారము. ప్రాచీనకాలములో అష్టవిధ వివాహము లుండెను. అందు రాక్షస వివాహమొకటి నింద్యమైన దుండెను. రాక్షస వివాహ స్వరూప మును మను విట్లు నిరూపించెను:


“హత్వా ఛిత్వా చ భిత్వా చ క్రోశంతీం రుదతీం గృహాత్,
ప్రసహ్య కన్యాహరణం రాక్షసో విధి రుచ్యతే". (3-33)


ఇట్టి రాక్షస వివాహాలలో ఒల్లని కన్యకలకు ఒక సంవత్సర కాలము గడువిచ్చుచుండినట్లు కానవచ్చుచున్నది. మహాభారతములో రాక్షసముగా కొనిపోబడిన స్త్రీలకు ఒక సంవత్సరపు గడువునిత్తురని తెలిపినారని సి. పి. వైద్యాగారు (Riddle of the Ramayanam) లో వ్రాసినారు. కాని ఆ మాట యెచ్చటనున్నదో నిరూపించలేదు. రావణు డును తన కులాచారప్రకారము ఒక సంవత్సరము గడువు నిచ్చినట్లు తోచుచున్నది.

రాక్షసులలో మంచి నాగరకత యుండెనని తెలుపుచు ప్రాసంగిక ముగా రాక్షస వివాహచర్చ చేయబడెను. రాక్షసులు వైద్యవిద్యను బాగా నెరిగియుండిరి. కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత రాక్షసవీరులు కత్తి దెబ్బలను గాయములను మాన్పునట్టి ఔషధములను పూసికొని యుద్ధ మునకు వెళ్ళిరి.


“సర్వౌషధీభి ర్గంధైశ్చ సమాలభ్య మహాబలాః".
                                                         యుద్ధ. 69-18.


ఈ యౌషధము లెట్టివో వ్యాఖ్యాతలిట్లు తెలిపినారు: “కోష్ఠం, మాంసి, హరిద్రేద్వే, మురా, శైలేయ, చందనే, త్వచా, చంపక, మస్తాశ్చ, సర్వౌషద్యోదశస్మృతాః". కోష్టు, జటామాంసి, పసుపు ​కొమ్ములు. పెన్నేరుగడ్డ, రాతిపువ్వు, చందనము, లవంగము, సంపెంగ, తుంగముస్త - ఈ 10 యోషధులు ఆయుధములవలన కలిగిన గాయము లను మాన్పును.

రాక్షసులు మనుష్యులను తినువారుగా వర్ణింపబడినారు. అది నిజమగునా? వ్రాసినదంతయు నిజమే యైనట్లైన ఆర్యులు మాత్రము తక్కువవారా? వారు నరమేధములను చేయుచుండిరని విశ్వసింపవచ్చునా? మహాభౌముడను రాజు 1000 నరమేధములను చేయుటచేత (యః పురుష మేధే పురుషాణా మయుత మానయత్ తత్తస్య ఆయుతానాయత్వం) 'అయుతానాయ' అను బిరుదము పొందెనని మహాభారతము (ఆదిపర్వము) చెప్పుచున్నది. హర్షవర్ధనుని కాలములో నరమాంస విక్రయము జరుగు చుండెనని హర్ష చరిత్ర చెప్పుచున్నది. రామాయణములో రాక్షసులు నరమాంసము తినువారని వర్ణించినారు కాని అట్టి జాడలు రాక్షసులలో కానరావు. ఏషియామైనరులోని కొన్ని అనార్యజాతులలో నరమాంసము తిను నాచారముండెను. దానిని తీసుకొనివచ్చి దక్షిణాపథములోని రాక్షసుల కంటగట్టినారు. శకజాతివారు (Scythians) తమ చేజిక్కిన శత్రువులను చంపి వారి మాంసమును తినుచుండిరి. తమ శత్రువుల పచ్చి రక్తమును త్రాగుచుండిరి వారి చర్మములను ఒలిచి కర్రచేసి కప్పుకొను చుండిరి. శత్రువుల పుఱ్ఱెలను సారాయి పాత్రలుగా నుపయోగించు చుండిరి.[14] మెస్సాజెటిన్ (Messagetes) అను శకజాతి ముసలివారిని చంపి వారి మాంసమును వండి తినుచుండిరి.[15]

రాక్షసుల రాజనీతిని గురించి యిదివరకే చర్చించియున్నాను వారిలో మత్రిసభలు, రాజ్యాంగచర్చలు, రాజ్య నిర్వహణ పద్ధతి ​యుండెను. తర్వాత కాలములో రాక్షసులతో ఆర్యులు బాంధవ్యములు చేసిరి. భీమసేనుడు హిడింబను వివాహమాడెను. రాక్షసులు ఘోర రూపులైన, నరభక్షకులైన, శ్రీకృష్ణుని బావమరిదితో వారికి బాంధవ్య మెట్లు పొసగెను? కావున, రాక్షసులు మంచి నాగరకత చెందినవారని తోచుచున్నది. ఆర్యులు రాక్షసులను లోబరచుకొనుటకై ప్రయత్నించిరి. రాక్షసులు ఆత్మ స్వాతంత్ర్యమును కాపాడుటకై పోరాడిరి. ఆ సంఘర్ష ణలలో సీతాపహరణమువంటి ఘట్టములు సంభవించెను. మరి దానికి మూలకారణమేమి? శూర్పణఖకు ముక్కు చెవులు కోయుట. శూర్పణఖ కామచారిణి. అది తప్పా? ఏ కాలములో ఏ జాతిలో ఏ యాచారము లుండెనో ఆ దృష్టితోనే విచారింపవలెను. కాని దేశకాలాచారాంతరములచే విమర్శింపరాదు. మహాభారత కాలమునకు ముందు కాలములో ఆర్య స్త్రీలు అనావృతలుగాను, స్వేచ్చాచారిణులుగాను ఉండిరని పాండురాజు కుంతితో చెప్పలేదా? దీర్ఘతముడను బ్రాహ్మణుడు కాశీరాజు భార్యలను పొంది సంతానోత్పత్తి కావింపలేదా? శూర్పణఖ చేసిన యా తప్పునకు ముక్కు చెవులు కోసిరి. అది ఆర్య ధర్మములో తప్పు కాకపోవచ్చును. రాక్షస వివాహాలలో శత్రువుల స్త్రీలను ఎత్తుకొనిపోవుట ఆర్య ధర్మముల ప్రకారము తప్పు. ఈ విధముగా ఆర్యులకును అనార్య రాక్షసులకును నిరంతరము సంఘర్షణలు జరిగెను. మేలైనఆయుధాలు, ధనుర్విద్య ఆర్యులలో నుండెను. వారే జయించిరి. దక్షిణా పథము ఆర్యులకు దాసోహం అని ఆక్రోశించెను.

  1. ↑ విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో జటాపులను కోండులున్నారు.
  2. ↑ Pergiter Ancient Ind. Hist. Tradition.
  3. ↑


    “తే అసురా ఆత్మవచసోహే ఆళవోహే ఆళవ ఇతివదంతః పరా
    బభూవుః తస్మాన్నబ్రాహ్మణో మ్లేచ్ఛేత్ అసుర్యాహిఏషావాక్".
                                                            శతపథ బ్రాహ్మణము 3-2-123


    అసురులు ఆరయః అని యుచ్చరించలేక అలవ అని పరాభూతులై నందున అది మ్లేచ్ఛవాక్కు అని యర్థము కదా! అనురులు మ్లేచ్చులు ఛందో భాషనే అపభ్రంశముగా మాట్లాడిరనుటచే వారు ఆర్యులకు సంబంధించి వేరై పోయినారని యర్థమిచ్చును. పై బ్రాహ్మణ వాక్యాలే మహా భాష్య పశ్పశమందును కలవు.

  4. ↑ The tribe Dan came from the land of Jordan Th s is borne out by the names they left behind in their northward march such as the Dan-ube, Danister, Dan etz, Dan-dari, Dan-ric Alps, Dan-mark. In Ireland are seen such names as Dan-lough, Dan-sower, and Dan-gan - -Cheiro's World Predictions. PP 60-64.
  5. ↑ S.N Pradhan - Chronology of Ancient India.
  6. ↑ Z A. Ragogin - Assyria.
  7. ↑ Z. A. Ragogin-Assyria.
  8. ↑ Z. A. Ragogin-Assyria.
  9. ↑ R. E. Anderson - The story of the extinct civilization of the East.
  10. ↑ రసాతల--పుట. 4. (ఇచ్చట ఐర్యాణ వీజ అనునది నేనింతకుముందు 8వ ప్రకరణములో చూపిన ఆర్యాణదేశము. ఆహురమజ్దాను ఋగ్వేదములో 'అసురమేధాః' ఆని పేర్కొనినారు. దైత్యులు పూర్వదేవతలు, ఆ నదివద్దనే దేవతల ఆర్యావర్తముండుట గమనింపదగినది.)
  11. ↑ రసాతల పుట. 31-32.
  12. ↑ రసాతల పుట. 51.
  13. ↑ రసాతల పుట. 9.
  14. ↑ Mayor Uaiversal History (1812)
  15. ↑ Mayor Uaiversal History (1812)