రామజోగి మందు
Appearance
ఖమాచ్ రాగం ఆది తాళం
ప: రామ జోగిమందు కొనరే ఓ జనులారా || రామ ||
అ ప: రామజోగి మందుకొని - ప్రేమతో భుజియించుడన్న
కామక్రోధ లోభమోహ - ఘనమైన రోగాలకు మందు || రామ ||
చ1: కాటుక కొండలవంటి - కర్మములెడబాపే మందు
సాటిలేని జగమునందు - స్వామిరామ జోగిమందు || రామ ||
చ2: వాదుకు చెప్పినగాని - వారి పాపములు గొట్టి
ముదముతోనే మోక్షమిచ్చే - ముద్దు రామజోగిమందు || రామ ||
చ3: ముదముతో భద్రాద్రియందు - ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు - ముదముతో సేవించే మందు || రామ ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.