రాధికాసాంత్వనము (సముఖము)/రాధికాసాంత్వనము

వికీసోర్స్ నుండి

రాధికాసాంత్వనము


సముఖము వేంకట కృష్ణప్పనాయకుడు

క. శ్రీ రాధామణిలోలా
ధారాధరనీలనీల దైత్యవిఫాలా
వారిధిశయన సుశీలా
శ్రీ రాజదురోవిశాల శ్రీ గోపాలా. 1

చ. వెలయు నభీష్ట మి మ్మనుచు వేంకటకృష్ణనృపాలశేఖరుం
డిల రసికావతంసులకు హృద్యముగా మృదుమాధురీరసా
కలితచమత్క్రియాకలనగల్పనగా రచియింప నొప్పు ని
శ్చలమగు రాధికారమణి సాంత్వనముం గృతి సల్పుమం చనెన్. 2

గీ. అవధరింపుము స్వామి దివ్యగుణభూమి
యని పరీక్షిన్మహారాజుఁ గని శుకుండు
వినయసంభ్రమభయభక్తు లినుమడింప
నవల వృత్తాంత మిట్లని యానతిచ్చె. 3

క. ఇంబై వనరుహజావా
నంబై ద్విజరాజవైశ్యజననివహంబై
డంబై తగు బహుబలసే
వ్యంబై ద్వారకపురంబు హరిధామంబై. 4

గీ. అచట నెప్పుడుఁ గాపుర మై వసించు
దేవదేవుండు శ్రీకృష్ణదేవుఁ డగుచు
రాధికాసత్యభామలు రాజసమునఁ
బ్రేమఁ గొలువంగ జగదభిరాముఁ డగుచు. 5

గీ. ఇట్టు లుండంగ నత్తవా రేగుదెంచి
దేవకితనయు సత్యను భావ మలరఁ
దోడుకొని పోవ వారలఁ ద్రోవఁ బనిచి
రాధ తన కేళికామందిరమ్ముఁ జేరి. 6

వ. చిలుకం గని. 7

క. అచ్చట నడిచే వింతలు
ముచ్చట లెల్లయును దెలిసి ముద్దులు గులుకన్
అచ్చుతుని దోడి తెమ్మని
యచ్చిలుకను బనిచి రాధ యలమటపడఁగన్. 8

చ. చిలుకవజీరుఁ డత్తఱిని జిందఱ వందఱ సేతు నంచు నా
[1]చిలుకలకొల్కిపై, గదిసి చివ్వల రవ్వ లిడంగ జాతిపెం
జిలుకలకోరికోల లటు చెండెను దుమ్మెదనారి మ్రోయఁగాఁ
గలికి మెఱుంగుగుబ్బలను ఖంగు ఖణీలు ఖచిక్కు రింగనన్. 9



క. ఇట్లేసిన మది ఝుల్లనఁ
బట్లెల్లను సడలి రాధ భయ మందుచుఁ దా
నిట్లని పలుకఁదొడంగె
[2]బొట్లం బై చుట్టునుండు పొలతులతోడన్. 10

ఉ. శౌరిని బిల్వగాఁ జనిన చక్కని కీర మ దేల రాదా, యే
దారిని జన్నదో నడుమ దాఱెనొ చేరెనొ లేదొ గోపికా
జారునిఁ గానదో కనెనొ చక్కగ నా వెత విన్నవించెనో
సారెకు; లేక శౌరినుడి చక్కెరయుక్కెఱ మెక్కి. చొక్కెనో. 11

సీ. తడవు చూచిన దృష్టి దాకునో యని వాని
నునుమోము గనులారఁ గనఁగనైతి
గబ్బిగుబ్బలు సోఁకఁ గందునో యని వాని
గదిసి నా మనసారఁ గలియనై తిఁ
(గదియ నొక్కిన నేడఁ గందునో యని వాని
యధరంబుఁ దనివార నాన నైతిఁ)
(దడవు చేసిన మేను బడలునో యని వానిఁ
జెలఁగి నా మనసారఁ గలియనైతి)



గీ. నొచ్చు నం చని చెక్కిలి నొక్కనైతి
నలుగు నని మేము గౌఁగిట నలమనైతి
నందసుతుప్రేమ సతతమని నమ్మి యుంటి
నిప్పు డీ రీతి నడచు నం చెన్న నైతి. 12

సీ. తాను నా మో వాని తనమోవి బదు లిచ్చి
తెఱవ నీదు ఋణంబు దీఱె ననును
నేను బైకొనఁ గానె తాను బైకొని యేలి
యింతి యీడుకు నీడు నిదిగొ ననును
నేను ముద్దిడఁగానె తాను ముద్దిడికొని
మదిరాక్షి బదులుకు బదు లి దనును
నేను జెక్కిలి నొక్కఁ దాను జెక్కిలి నొక్కి
చెలియ మేలుకు మేలు చేసి తనును
గీ. గడియ గడియకు నొక వింత గడన సేయు
వేళ వేళకు నొక్కొక్క లీల నుండుఁ
బార మెఱుఁగని ముద్దుల శౌరిచిన్నె
లెన్ని యెన్నని తలపోతు నెట్లు సైతు. 13

క. ఆ మాలిమి యా తాలిమి
యా మేలిమి యా వినోద మాగళరవమున్
ఆ మాటలు నా నీటులు
నా మీటులు నాటపాట లతనికె చెల్లున్. 14

సీ. మదహత్తిపై నెక్కి మావటీ ల్గొలువంగ
విచ్చలవిడిఁ జొచ్చి వచ్చునటుల
సాంబ్రాణి తేజిపై సాహిణీ ల్వొగడంగఁ
బట్టాను జేపట్టి వచ్చునటుల

పే టందలమ్మున[3] విచ్చుకత్తులవారు
మెచ్చఁగా దులదుల వచ్చునటుల
గిలుకు పావలు మెట్టి చెలికాండ్రు వెంటరాఁ
బావురంబును బూని వచ్చునటుల
గీ. పడతు లిరువంకఁ దెలనాకుమడువు లీయఁ
గొనుచుఁ బెండెము ఘలుఘల్లు రనఁగ నాదు
పడుకటిలు సేరఁగా శౌరి వచ్చుదారి
తోఁచునే గాని మఱియేమి తోఁచలేదు. 15

సీ. కురు లంటఁగా రాకు గుట్టు బొయ్యీ ననఁ
జీకాకుగాఁ దీసి చిక్కువఱచుఁ
గెమ్మోవి నొక్కకు గేలి సేయుదు రనఁ
గసిమీఱఁ బలుమొనగంటు సేయు
వలుదగుబ్బలు ముట్టవలదు న వ్వే రనఁ
గ్రొత్తనెత్తురు గ్రమ్మ గోరు లుంచు
సరగఁ బో వలె నింకఁ బరులు చూచెద రన
జూముల తరబళ్లు జాగు సేయుఁ
గీ. బలుకవద్దనఁ బావురా పలుకు వలుకు
నత్త నేఁ గాన యనఁ బ్రీతి హత్తె ననును
అట్టి నా ప్రాణవిభుఁ బాసి యకట మేను
జీవములు పోక యల్లాడె సిగ్గు లేక. 16

సీ. విభునిఁ బాసితి నంచు విని సంతసం బందు
తోయజాక్షులఱొమ్ము ద్రొక్కు నటుల
హామిక స్రుక్కెనా యనుచుఁ దలాడించు
మించుఁబోణుల తల ల్మెట్టి నటుల
హరి రాధ నేలుట యది యొక కథ యను
కొమ్మలనాలిక ల్గోసి నటుల
కరఁగు న న్గను గొని కనుగీఁటి నవ్వేటి
మోహనాంగుల కన్నుఁ బొడిచి నటుల
గీ. మాధవుని జేరి సామి రమ్మనుచుఁ జీరి
గెలివి యొనగూర్చి నిండుఁ గౌఁగిటను జేర్చి
దయలు దయివాఱ యెడఱేని తాప మాఱ
మేలిమిని గూడఁ గలదె యీ మేనితోడ. 17

వ. అని యిటుల జవరాలు విరాళిం జెందు సమయంబున. 18

గీ. హరునుదుటి కంటిమంటల నంటి బెదరి
త్రుళ్లి రౌతును బడవైచి వెళ్లి వచ్చు
తియ్యవిలుకాని సాంబ్రాణి తేజి యనఁగ
గగనమార్గంబునను దోఁచెఁ గలికిచిలుక. 19

క. ఇటు లే తెంచిన చిలుకం
గుటిలాలక లేచి చూచి కులుకుచుఁ జిలుగా
యిటు రమ్ము ర మ్మటం చన
దిటవున ముంజేత వ్రాలె దీనత దోపన్. 20

గీ. అటులు ముంజేతిపై వ్రాలినట్టి ముద్దుఁ
జిలుక నటుదువ్వి చిలుకలకొలికి పలికె
మోవి గంపింప ముక్కఱముత్య మదరఁ
గప్పుతావియు గుప్పునఁ గప్పుకొనఁగ. 21

ఉ. దేవకిచిన్నికుఱ్ఱ వసుదేవునికూన యశోదపట్టి నా
దేవుఁడు నందుకందు బలదేవుని తమ్ముఁడు గోపగోపికా
జీవనజీవనంబు యదుసింహము శౌరి కిరీటిబావ శ్రీ
దేవియనుంగుజోడు వసతి న్వసియింపఁగఁ గంటె కీరమా. 22

సీ. చుఱుకు చూచినఁ గందు సుకుమారు నెమ్మేను
విరహజ్వరంబున సొరుగకుండ
నిట్టూర్పు లోర్వని నీలవర్లునిపైన
సోమరివలిగాలి సోఁకకుండఁ
జనుముల్కు లాగని శౌరివక్షంబున
విరిశరంబులు చాల నొరయకుండ
మణితము ల్వినలేని మాధవు వీనుల
స్మరచాపటంకృతు ల్నెరయకుండ
గీ. నెన్నఁ డిటువంటి కడగండ్ల నెఱుఁగనట్టి
విభుఁడు వెన్నెలచిచ్చులో వేఁగకుండ
కనులఁ గప్పుక నాసామి మన సెఱింగి
సరసు నెనయునె కీరమా సత్యభామ. 23

గీ. ఎంతవేడిన బదు లాడ వేమి చీలుక
కాలగతు లెట్టు లున్నవో గడచినాము
కాఁగలవి కాక మానవు గాక తెలుపు
చల్ల గొన వచ్చి ముంత దాఁచంగ నేల. 24

వ. అనిన విని చిలుక యిట్లనియె. 25

క. తెఱవా యే మని చెప్పుదు
హరి యున్న గృహంబుఁ జేరి యటు చూతుఁ గదా
సురతోద్యుక్తుల సత్యా
మురహరులం జూచి ఖేదమోదములయ్యెన్. 26

వ. అది యెట్లంటి వనిన. 27

సీ. పన్నీటి మేరువుల్ బాగాలతట్టలు
కలపంపుగిన్నెలు గందవొళ్లు
ముడిపూల పొట్లముల్ పునుఁగుఁగరాటముల్
జవ్వాజిగిండ్లు ద్రాక్షారసంబు
అద్దముల్ సొమ్ములు నత్తరుచెంబులు
కుంకుమపింగాండ్లు గుసుమతతులు
కపురంపుఁ గ్రోవులు గస్తూరివీణియల్
గట్టు వర్గంబులుఁ జుట్టుదనరఁ
గీ. జలువచప్పరకోళ్లమంచమ్ములోనఁ
జెంపబిల్లలుఁ దలగడల్ చెలఁగుదిండ్లు
బటువు లొరుగులు గల పూలపాన్పుమీఁదఁ
దమకమున సత్య హరియును దగఁబెనంగి. 28

సీ, కొసరుపల్కులఁ బమ్మి గోటికత్తులఁ జిమ్మి
కాసెలోఁ జెయి వేసి కదియఁదీసి
కర్ణాతు[4] లాగించి కౌఁగిట బిగియించి
సరిబిత్తరుల నొత్తి సాగనెత్తి

కల్లంబు[5]నకు వచ్చి కలికి యౌ నని మెచ్చి
మెఱుఁగుఁజెక్కిలి గొట్టి కురులు పట్టి
తొడగంబముల నాని తోపునూకులఁ బూని
సందు చేసుక నొక్కి చాల దక్కి
గీ. యదలుపులుఁ పొగడికలును నెయ్యంపుఁ దిట్లు
గళరవంబులు దుడుకులుఁ జెలఁగ సత్య
మాధవుండును గడిదేఱి మరునిసాము
చేసి చెలరేగి నెఱిహాయిఁ జెంది మఱియు. 29

సీ. కిలకిలనవ్వులు గిలిగింతలును బంధ
భేదపు రవములు వింతవగలు
పావురాపలుకులు వాతెఱనొక్కులు
చిగురుమకారముల్ జిలుఁగుఁదిట్లు
దురుసు పైసరములు దొంతరముద్దులు
బిగికౌఁగిలింతలు బేరజములు
కొనగోటిమీఁటులు గోరింపు లుబుకులు
కొసరుఁగన్బొమముళ్లు కుఱుచసన్న
గీ. లౌర సేబాసు మేలు చల్లారే బాప
అహహ తడబడ కెడ మీకు నాయె నాయె
విడకు విడువకు నడు మని నుడువు లపుడు
చెల్లఁబో యేమి చెప్పుదుఁ గొల్లకొల్ల. 30

క. నానా విభవాకరమై
మానససంజాతజాతమహిమార్ణవమై
కైనికతరమై[6] యాసుఖ
మానందబ్రహ్మమైన హరి యేమఱచెన్. 31

చ. పరవశుఁ డైన శౌరిఁ గని పంకజలోచన రాధికామణిం
దొఱఁగు మటంచు వేడికొనఁ ద్రోయక నాథుఁ డొసంగె నమ్మికల్
పురుషల కేటి సత్యములు పూనిక లేడవి పుణ్య మెద్ది నీ
మరు లిటు కొండలై పెరుఁగు మాత్రమె కాని కురంగలోచనా. 32

వ. అని యి ట్లాడు చిలుకను జూచి. 33

శా. ఏ మేమే వెఱ పింత లేకనె భళా హేమాంగి యి ట్లాడెనా
యామాట ల్విని మంచి దం చనియెఁగా యా ధూర్తుడు న్మించె హా

రామా యట్లనె కాని, మంచిపని మేలాయెన్ మఁఱే మాయె నా
భామారత్నము దాను గూడి సుఖమై వర్ధిల్లినం జాలదే. 34

సీ. మఱచెనో నా చేత మణితోక్తు లన్నియుఁ
బలుక నేర్చిన నాఁటి పంజరింపు
ఎంచఁడో నా చేత నెలజంత్రగాతంబు
లభ్యసించిన నాఁటి యనుసరింపు
తలఁపఁడో నా చేతఁ దగు దేసి గుజరాతి
విత మెఱింగిన నాఁటి వేఁడికోళ్లు
వీడెనో నా చేత వెడవిల్తుశాస్త్రంబు
దెలియఁ బూనిన నాటి తెఱవుమఱువు
గీ. గణన సేయఁడొ మరుసాముగవనములను
దాను నా చేతఁ బడిన బెత్తంపుఁబెట్లు
బరులు గని గేరి నవ్వ దబ్బఱ మురారి
మాయలకె పొంగె సత్యభామా లతాంగి. 35

గీ. నిన్నఁగుప్పయు నేఁ డాళ్లు; నెలఁత తాను
కోరి నా మీదనే సేసె కారుబారు[7]
ముక్కుపచ్చలు మానక మునుపె బిరుదు
[8]పెచ్చుకొలతోడఁ గొట్లాడ వచ్చినట్లు. 36

గీ. మంచిపామును బా ల్వోసి పెంచినట్లు
యింత దెలియని దాని నే సంతరింపఁ
దాను పెంచిన పొట్టేలు తఱిమి తఱిమి
సన్నబడు సామ్య మాయెనే చిన్నిచిలుక. 37

క. అడుకులు దిన్నం తాయెనె?
కడుపునఁ గు ట్టెత్తు నపుడు గానీ, తా నే
కడఁ జనునొ వంటయింటను
సుడివడు కుందేలు రేపె చూడుము చిలుకా. 38

గీ. పొల మెఱుంగని నిన్నటి [9]వళికె పడుచు
యింత సేసిన నేఁ జేయ నెంత కాను
వ్రేలు వాచిన [10]ఱోలంత పెరిఁగె ననిన
ఱోలు వాచిన నది యెంత పోలు చెపుమ. 39

వ. అని మఱియుఁ జిలుకతో నిట్లనియె. 40

గీ. ఈవు చెప్పిన మాట యొక్కింత యైన
జెవిని బెట్టక దాని నేఁ జేరఁ దీసి
మానిసిని జేసి నందుకు మగుడ నిఫుడె
ఫలము తోడ్తోడఁ గైవసం బాయెఁ గదవె. 41

గీ, తన్ను గట్టను దారంబు తానె కొనిన
జాడ నిటు దెచ్చి గోపాలుతోడఁ గూర్చి
చాలఁ జేసిన దీనికి మేలి మెల్ల
బూదిలోఁ జేయు హోమ మై పోయెఁ గదవె. 42

గీ. చెలఁగి కాలిమెట్లు తల కెక్కు చందాన
నాదు క్రింది బుడుత నన్ను మించె
వెలయ గ్రుడ్డు వచ్చి పిల్లను బెదరించె
గాన్గఁ ద్రుళ్లుటెద్దె గంత మోయు. 43

గీ. కాని పదరకు మిఁక మీద దాని మోము
గాన వ ద్దని శౌరి నాఁకట్టు కట్టి
బింకములు గూల నఱకాలఁ బెట్టి, నేల
రాయ కున్నను నా పేరు రాధ గాదు. 44

గీ. ఒదుగుచును నంగనాచి యై యున్న దీనిఁ
దొలుత రుద్రాక్షపి ల్లని తెలియ నైతిఁ
దేలు నిప్పునఁ బడకుండఁ గేల నెత్త
మీట కుండునె విస మెక్కి మిట్టిపడఁగ. 45

గీ. నక్క యురులలోనఁ జిక్కుకొన్న వితానఁ
గోరి మనము చేసికొన్న కతలు
ప్రేగు లోని తీఁట విధ మాయె; ననరాదు
అత్తకోక తొలఁగి నటుల చిలుక. 46

గీ. అత్తవా రింటి కప్పుడే హరినిఁ బంపఁ
దనకు గో రంత యైనను మనసు లేదు
నందు డనుపఁగఁ గని మన మందు కెల్ల
నుబికి తడ సేయ రాదని యుంటిఁ గాని. 47

వ. అని మఱియును. 48

సీ. ఆశుకవిత్వంబు నల్లితేనే సరా
చిత్రప్రబంధంబు సెప్పవలదె
పదచాళిరాగము ల్పాడితేనే సరా
హిత మొప్ప వర్ణంబు లెత్తవలదె
గోటిచేతను వీణా మీటితేనే సరా
కొంచక రాల్ గరఁగించవలదె
అభినయదేశ్యంబు లాడితేనె సరా
యెత్తిన బిరుదు చెల్లింపవలదె
గీ. వింతవింతగఁ గలసిన యంత సరియె
యెమ్మేకాని మనోభావ మెఱుఁగవలదె
యేమి నేరని నిన్నఁటి యింత మొటికె
నన్ను విడనాడఁ గోరెనా చిన్నిచిలుక. 49

క. అన విని శుక మి ట్లనియెన్
వనితా యే మందు దీని వగలో త్రుళ్ళో
మినుకో గెలివో తెలివో
విను వెన్నకుఁ బండ్లు వచ్చు విత మాయెఁ గదే. 50

గీ. చూపులోపల నొక వింత చూపుఁదళుకు
నడుపులోపల నొక వింత నడుపుబెళుకు
నుండు నునికిని నొక వింత యుండుకులుకు
వచ్చెఁ గద వమ్మ మన యిళావనిత కిపుడు. 51

గీ. లేని పట్టింపు లెల్లను బూని చాన
నేనె యెదురైన నింతైనఁ గాని చూడ
దల్పునకుఁ గల్మి వచ్చిన నర్ధరాత్రి
గొడుగు దెమ్మన్న కత గాను కోమలాంగి. 52

వ. అను కీరవాణుల కడ్డంబు వచ్చి మధురవాణియగు నొక్క విరిబోణి మధుపవేణి యగు దొరసానిం జూచి నెఱజాణతనంబునం దల యూఁచి చెయి సాంచి సమయోచితంబుగా నిట్లనియె. 53

క. నిన్నెఱుఁగు నెదిరి నెఱుఁగును
దన్నుం దన మట్టు నెఱుఁగు దామోదరుఁ డా
కన్నియకై నిను వేడె న
టన్నన్ మఱి శౌరి, నగరె యహహా జనముల్. 54

గీ. తగరు కొండమీఁద దాఁకఁగోరిన దారి
నెదిరిఁ దన్నుఁ దెలియ కింత పలికె
నింత మీను వచ్చి యెంత మీనును మ్రింగె
నువిదబుద్ధి వెనుక నుండుఁ గాదె. 55

గీ. కుట్టఁ దేలు; కుట్టకున్నఁ గుమ్మరబూచి
త్రోసిరా జటంచుఁ జేసెఁ జెలియ
దాని వ్రేలు దీసి దాని కన్ను వొడిచి
నట్లు సేయకున్న నడుగ రమ్మ. 56

క. మును నీ విచ్చిన చనువున
నిను నిట్టుల దూలనాడెనేని న్వినుమా
తన యింటి దీపమం చని
కని ముద్దులు వెట్ట మూతి కాలకపోనే. 57

క. ని న్నంటే మానిసి యై
నిన్నే వెలి సేయఁబూనె నెలఁత బళారే
కొ న్నంగడిలోనే విను
మన్నాఁడే మాఱుబేర మవునే చెలియా. 58

గీ. [11]మాయదారిమాట మది నిజం బని యెంచి
పొలఁతి నమ్మి నానఁబోసికొనియె
తగిలేనా తగిలెను దప్పెనా తప్పెను
నాతి వెఱ్ఱివాని చేతిరాయి. 59

గీ. పడఁతి మును దెల్పనా పదంబదియుఁ గాను
దాని వినయంపుఁ బోకిళ్ళు తగ నెఱింగి
మానిసిని జేయ వలవదు దీనిఁ జేర్చి
తెలియ నిది మేఁకవన్నియపులి యటంచు. 60

వ. అన విని రాధ యిట్లనియె. 61

గీ. దాని నింతయు నన నేల తగవు మాలి
తప్పుతంటల కొడఁబడు దానవారి
ననవలయుఁ గాని తెగనిండ దొనకుఁ దీసి
వేయువాఁ డేయ న మ్మేమి సేయు నమ్మ. 62

క. కలలో నైనను బాయక
కలకాలం బున్న విభుఁడు కసిగాయకు నై
పలుచన చేసె నఁటన్నను
జెలియా మగవారి నెమ్మి చెడ్డది సుమ్మీ. 63

క. నెఱతన ముడి గింటింటను
దిరుగుచు బతిమాలు హరికిఁ దెఱవలు కఱవా
తిరిపెం బెత్తేవానికిఁ
బెరుగుం గూ డేమి బ్రాఁతి విధుబింబాస్యా. 64

గీ. నందసుతుఁడు మున్ను నామీఁది ప్రేమచే
నొకటి సేయఁ బూని యొకటి సేయు
[12]నత్తమీఁదఁ గన్ను లంగడిపైఁ జేతు
లాయె ననుచుఁ జెలియ లరసి నవ్వ. 65

సీ. కీరవాణులచేతఁ గిళ్ళాకుఁ బంపిన
శిరసా వహించు నో సరసిజాక్షి
నాతి యెవ్వతె యైన నా మేలు వేఁడినఁ
గను లెఱ్ఱసేయు నో కంబుకంఠి
ఎలమి నాకోసమై యెట్టివారల నైనఁ
దెగనాడఁ దలఁచు నో చిగురుఁబోఁడి
యేఁ జూచి చూడకయే మాట లాడిన
మాటాడ వెఱచునో మందగమన
గీ. తడవు పైకొని వీరాయితంబు సలుపఁ
జూచి సైరింపఁజూలఁ డో సుందరాంగి
అట్టి శౌ రిట్లు కడగండ్లు పెట్టె ననినఁ
దిరుగ బ్రతు కాస వలె నటే తెలుపు మకట. 66

సీ. ఇటు లుండువారల కెడయికల్ వచ్చిన
దనువులు నిలుచునే యనినమాట
నిను బాసి యెట్టివారిని విలోకించినఁ
గను తాళియుండ లే దనినమాట

నీ పొత్తు మాని నే నేడ భుజించిన
నాహార మింపు గా దనినమాట
యలుకువచే నీవు నవలి మో మాయినఁ
కనులకు నిదుర రాదనినమాట
గీ. కరుణ దైవాఱ బిగియారఁ గౌఁగిలించి
మానినీమణి వేయి జన్మాల కైన
వినుము నీ మేలు మఱువ లే ననినమాట
మఱచెనో శౌరి తగు నిళామాయ మీఱ. 67

క. అను వనితామణి పలుకులు
విని కీరం బిట్టు లనియె విమలాంగి వినే
వనజక్షుని విత మెఱుఁగవె
కని తెల్పిన భారతంపుఁ గతలై పెరుఁగున్. 68

గీ. దొరకనటువంటి రత్నంబు దొరకినట్లు
ఱొమ్మునేగాని, దించఁ డే యెమ్మె నైనఁ
గౌఁగ లెడలినఁ బ్రాణముల్ కదలు ననుచుఁ
గట్టి కాచుక యున్నాఁడు కడల నీఁడు. 69

గీ. మగువ యిది గాక యిఁక నొక మాట గలదు
వినుము వలపుల దొరసాని యనెడుపేరు
దాని కిచ్చెను నిను బిల్వఁబో ననంగ
నెటులు నో రాడెనో శౌరి కెఱుఁగ వమ్మ. 70

వ. అన విని చిలుకం జూచి రాధ యి ట్లనియె. 71



గీ. ఎల్లవారికి శకునంబు లెఱుఁగఁబలికి
బల్లి తాఁ బోయి తొట్టెలోఁ బడిన రీతి
నొకరి నని నేనె మోసపో[13]తిఁక న దేల
వెనుక చింతించు టెల్లను వెఱ్తఱినము. 72

గీ. నీవు పోయిన పనికి రానీవు కొదవ;
పట్టి పల్లార్చి దేవకిపట్టి నిటకుఁ
దోడుకొనివత్తు వనుచు నీ తోడు చిలుక
నమ్మిఁకను నెమ్మనంబున నమ్మియుంటి. 73

వ. అన విని శుకం బి ట్లనియె. 74

క. తల కెక్కిన వలపున హరి
యలుకుచు దాసానుదాసుఁ డై మెలఁగంగాఁ
గలవే యిఁక నడియాసలు
కలిఁ బోసిన వెనుక నుట్టి కనుగొను రీతిన్. 76

వ. అనిన విని దురంతచింతాభరంబున విరహవేదనాదోదూయమానమానసురాలై దిగ్గున బెగ్గడిల్లి. 76

సీ. జడ వేగ వదలించి ముడి పూలు విదలించి
యలజడిఁ గీల్గంటు నందగించి
జిగివల్వ సడలించి బిగిరైక నెడలించి
సగము మాసిన చీర సంఘటించి

తిలకంబు పెకలించి కలపముల్ దెరలించి
పచ్చికస్తురి తలపట్టు పెట్టి
కల సొమ్ము వెడలించి కాటుక నిరసించి
సొంపు వాసెనకట్టు సంపుటించి
యాసల నడంచి చెలులపై యాస డించి
చెఱఁగు మై నిండ ముసుఁ గిడి చీకటింట
మేని వెత లార్చి కంకట మీఁదఁ జేర్చి
పొరలె మరు లూరి చిలువరాపొలఁతిదారి. 77

చ. ఉలుకును వెచ్చ నూర్చుఁ గడునుస్సు రనున్ దల యూచు లేచు లో
గలఁగఁబడున్ దిగుల్పడును గానిపను ల్దలపోయు వేసరున్
గళవళ మంది కన్గొను వికావిక నవ్వు భయంబుఁ జెందుఁ గన్
గొలఁకుల నీరు నించు మదిఁ గొంకు దలంకు వడంకు నెంతయున్. 78

ఉ. రా యను వింత పుట్టినదిరా యను నింతకు దట్టి గట్టినా
రా యను దాళియుంటిఁ గదరా యను జూతువు గానీ వేడ్క లే
రా యను మేలువార్త వినరా యను నా వల వింత చేసె నౌ
రా యను నిన్ను దూఱ నగరా యను హా యదుశేఖరా యనున్. 79

చ. అనుచును బ్రజ్వరిల్లు విరహానలకీలల మేను గంద నా
వనరుహనేత్ర యోర్వకను వావిరి నేడ్చెఁ బికస్వరంబునన్
కనుఁగవ నిండి వెల్లురికి కాటుక ఱెప్పలఁ జిల్కి చెక్కులన్
మినమిన జారి గుబ్బచనుమిట్టల నశ్రులు జాలువాఱఁగన్. 80

శా. ఆ వేళం జెలు లెల్లఁ గొల్లు మని హాహాకారము ల్సేయుచున్
నీవే యిట్టులు ధైర్యము న్విడిచినన్ మే మెల్ల నె ట్లౌదుమో
వ్రేవా రెల్లరు సిగ్గునం బొగులరో వేమారు నీ వంత నీ
కావంతం బని లేదు వచ్చె నిదిగోఁ గంసారి కంజాననా. 81

సీ. అల జక్కవల పెక్కువల ద్రొక్కు చల మెక్కు
నిక్కు చన్గుబ్బలు సుక్కు నమ్మ
అనయమ్ము నునుదమ్ములను దమ్ముల నయమ్ము
గను కనుంగవ తెల్వి కలఁగు నమ్మ
తొగవిందు బిగి ముందు తనుపొందు సొగసొందు
వదనారవిందంబు వాడు నమ్మ
తులకించు బలుమించు నలయించు కళనించు
నందంపు మైఁదీగ కందు నమ్మ

[14]తొగరు వాతెఱ మేలిమి తొఱఁగు నమ్మ
చిన్ని చిన్నారు ముంగురు ల్చెదరు నమ్మ
యెల్లి యెల్లుంట నా యల్లు డించు వచ్చుఁ
[15]గుంద వలవదు నా యాన మందయాన. 82

వ. అనిన విని. 83

క. తను వెల్ల ఝల్లు మనఁగా
నునుమోవి చలింప లేచి నుదురు చెమర్పన్
ఘనకేశబంధ మూఁడగఁ
గనుఁదమ్ములు మోడ్చి వ్రాలెఁ గామిని మూర్ఛన్. 84

వ. అంతట నయ్యిందువదన లందఱుం గూడుకొని. 85

క. ఏ మంద మేమి సేయుదు
మే మందున దీరుఁ దేరు నెటు లోర్తు మయో
యే మందయాన నడుగుద
మీ మందరకుచ తెఱఁగు లిట్టివి యనుచున్. 86

క. అని పలుకుచు వెస నులుకుచు
గని తలఁకుచుఁ గనుల నశ్రుకణములు చిలుకన్
ఘనశోకమగ్న లగుచును
గనకాంగిని చుట్టు ముట్టి కాంతలు వేగన్. 87

ఉ. కోమలి సిబ్బెపు న్మెఱుఁగుగుబ్బల జొబ్బిల నొప్పు కప్పురం
బా మరునగ్గి సోకి యది యంతట భగ్గున మండ మన్మథ

స్వామికి భామలుం జమురువత్తియు లేని నివాళిజోతు లో
సామజయానలార యని సారెకుఁ జేతులు తట్టి యార్పఁగన్. 88

గీ. సారవంతం బగు పటీరపూరమునను
సేద దేర్చిన నొక్కింత సేద దేఱి
చెలులఁ గని రాధ వింటిరే చెలియలార
కలను గనుఁగొంటి శౌరి రాకల ననంగ. 89

సీ. తప్ప దీ మాట నా తనువు జు మ్మనిపించెఁ
జూడు జూడు మటంచుఁ జూపె నొకతె
రమణి యీ దిక్కు తోరణగౌళి పలికేని
అదె యదే విను మంచు నాడె నొకతె
వెన్నుఁ డీడకు వచ్చియున్నట్టె కనుపించెఁ
గల నిక్క మౌనంచుఁ బలికె నొకతె
నెమ్మది యిపు డెంతొ నెమ్మది యున్నది
యమ్మమ్మ యిది నిజం బనియ నొకతె
పడఁతి నీ వామనేత్రంబు పదరె నిదిగొ
కలికి నీ వామభుజము దాఁ గదలె నిదిగొ
అతివ నీ వామభాగంబు నదిరె నిదిగొ
దిగులు మాను మటంచు నా తెఱవ లనఁగ. 90

గీ. అంత నచ్చట నర్జునాహ్వయసఖునకుఁ
జెలులు రాధిక పంచిన చిలుక యలుకఁ
చెప్పకయపోయె నని పల్కఁ జిత్తగించి
కమలనేత్రుఁడు మనము ది గ్గనఁగ లేచి. 91



సీ. రాజాస్య కీలించు రవల పావలు మాని
ధవలాక్షి యిచ్చు కైదండ మాని
కాంచనాంగులు పట్టు కరదీపికలు మాని
పడఁతులు విసరు సాపడలు మాని
భామలు కొనివచ్చు బారిపల్లకి మాని
మగువలు వీచు చామరలు మాని
గీ. మరుఁడు వెంటాడ రాధ పై మరులు గూడ
దిట్టతన మూడ హృదయంబు కొట్టుకాడ
మేను నసియాడ సరిజోడు లేని ప్రోడ
సనియె సఖుతోడ శృంగారవనము జాడ. 92

సీ. తప్పక తను జూచి ఱెప్ప వేయక వచ్చు
జలజాక్షిపై దృష్టి సైత మిడక
మోహాపదేశత మోము చాచుక వచ్చు
సకియ మోమున ముద్దు సైత మిడక
బహుదూరమున నుండి పైఁట విప్పుక వచ్చు
చాన గుబ్బల గోరు సైత మిడక
బ్రమఁ బోఁకముడి సగ్గఁ బాఱు వేసుక వచ్చు
చెలియ కౌఁగిట మేను సైత మిడక
జారుసిగ వీడ తెలిముత్తెసరులు నాడ
పదట మెదమీఱ బంగారుపటము జాఱ
యందెరవ బల్క మొలక ఘర్మాంబు లొలుక
వచ్చె నీ దారి నా మురవైరి శౌరి. 93



సీ. ఆసతో నను బిల్వు మని యింతి యేమేమి
పలికి కీరంబును బంచె నొక్కొ
వచ్చి యచ్చట నాదు వర్తమానము జూచి
వేఁ బోయి శుక మేమి వినిచె నొక్కొ
యెలనాగ వినినంత నీనిన పులి వోలెఁ
బదిరి భగ్గన మండిపడియె నొక్కొ
యది యొక్క నెపముగా నతివలు పగ చాటి
మించి యే మంచు బోధించి రొక్కొ
గీ. తోయజానన మది నేమి తోఁచె నొక్కొ
దైవ మేమేమి సేయంగఁ దలఁచె నొక్కొ
గ్రహగతులక్రౌర్య మెట్టిదో కలికి నెడసి
యేల వచ్చితి చెలికాఁడ యెలసి యీడ. 94

సీ. నినుఁ బాసి నిముసంబు నిలువఁజాల నటంచుఁ
గౌఁగిటఁ జేర్చుక గడియ సేపు
నీ వెంటనే వత్తు నేఁ దాళలే నంచుఁ
గరములు పట్టుక గడియ సేపు
నను బిల్వఁ బంపుమీ నాయాన నీ కంచుఁ
గన్నీరు నించుక గడియ సేపు
దాని మాయలఁ జెంది దయ వీడకు మటంచుఁ
గలికి మోము గదించి గడియ సేపు

గాఁగ వగచుచు గద్గదకంఠ యగుచుఁ
బ్రేమ మీఱంగ దీవెనవీడె మిచ్చి
పనుపఁజాలక పైనంబు పనిచినట్టి
యువిద నెడబాసి యిందుండు టుచిత మగునె. 95
… … … … … … … …
… … … … … … … …
… … … … … … … …
… … … … … … … …
(ఇటఁ గొంత గ్రంథపాతము దోఁచెడిని)

సీ. (మగతేఁటి గఱులకు మగువ ముంగురులకు
నేనాటి నేస్తమో యెఱుఁగ రాదు)
♦అల మించు సోగకు నతివ మైతీఁగకు♦[16]
నేమి చుట్టఱికమొ యెఱుఁగ రాదు
పూర్ణసోమునకును బొలఁతి మోమునకును
నెచ్చటి మచ్చికో యెఱుఁగ రాదు
కపురంపుఁ దావికిఁ గలికి కెమ్మోవికి
నే యనుబంధమో యెఱుఁగ రాదు
గీ. చెలియ జిగిచూపు నును నల్లగల్వ తూపు
కొమ్మ పాలిండ్లు బంగారు నిమ్మపండ్లు
చెలువ నూగారు సల్లని చీమబారు
లొక్కచోటను బుట్టని దొక్కకొదవ. 96

గీ. ఇందుబింబాస్య నవ్వుల కెంచి చూడఁ
జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె
నింతి నునుగప్పు కొప్పున కెంచి చూడ
జంద్రకి[17] రణవిలాసంబు సహజ మయ్యె. 97

సీ. శృంగారయౌవనక్షీరాబ్ధినడుమను
దనరారు బంగారుతమ్మి యనఁగఁ
దళుకుమించును మించు తనుచంద్రరేఖలో
బరిఢవిల్లు కురంగపద మనంగఁ
గలదు లే దను నట్టి కౌనుదీవియయందుఁ
బూచిన గెంటెనపు వ్వనంగ
నలువొందు నాభిపున్నాగంబునను బుట్టి
ప్రవహించు జిగితేనెవాక యనఁగఁ
గీ. జొక్కి మరు లెక్కి మెత్తలఁ జుట్టి చూడ[18]
నజుఁ డొనర్చిన మోహనయంత్ర మనఁగ
మరులు గొల్పెడు దొరసాని మరునియిల్లు
కళలు కరఁగంగ ముద్దాడి కలయు టెపుడు. 98

సీ. పంచబాణునిచేతఁ బ్రాణము ల్పోనీక
పరగెడు యమృతంపుబావి యనఁగ
మారుని ఘోరజ్వరారుచు ల్దీర్పంగఁ
బరిఢవిల్లెడు తేనెవాక యనఁగ

దర్పకు కోపాగ్ని దాహంబు మాన్పంగ
నలరారు నెలనీటి కొల ననంగఁ
దలిరాకువిలుకాని దాపంబు లణగింపఁ
జెలువొందు పన్నీటిచెఱు వనంగ
గీ. నాదు మన మను రాయంచ నటమటింప
చెఱకువిలుబోయ త్రవ్విన చెలమ యనఁగ
మరులు గొల్పెడు దొరసాని మరుని యిల్లు
కళలు కరగంగ ముద్దాడి కలయు టెపుడు. 99

వ. అంతట ననంతశయనుం డగు మురాంతకుండు మంతన సేసి సాత్రాజితిని వీడ్కొని యిళాదేవిం దోడితేరం దగువారల న్నియమించి మంచిలగ్నంబున రథారోహణంబు చేసి వెంబడించి వచ్చు బంధుజూలంబుల నిలువకరం బమర్చి కదలి మనోవేగంబున గోకులంబున కరుదెంచి రథంబు డిగ్గి భృత్యామాత్యాదిబంధువర్గంబుల వారి వారి విడుదులకుఁ బొమ్మని నిజగృహంబునం బ్రవేశించి నందయశోదాదులకు నమస్కరించి వార లొనరించుదీవనలు గాంచి యచటివృత్తాంతం బంతయు నెఱింగించి కొండొకతడ వందు వసియించి యచ్చటి యాప్తసఖులచే రాధికావృత్తాంతం బంతయు నాకర్ణించి యిందుల కేమి సేయువాఁడ నని చింతించి తానె పోక తీరదని నిశ్చయించి బెట్టునిట్టూర్పులు నిగుడించి మించిన దిగులునం బొగులుచు పగలు పగలాయె

నంచు వేగించి యా రాత్రి జననయనచకోరంబులకుఁ బండుగై యుండు పండువెన్నెలలోనఁ బయలుదేఱి మందగమనంబున రాధామందిరంబు చేరంబోవు సమయంబున,

గీ. అపుడు నచ్చట రాధ కంసారి రాక
చిలుకచే విని తనయొద్ధి చెలులఁ బిలిచి
నెన్నుఁ డిట కేగుదెంచిన విడువ వలదు
వాకిటనె నిల్పుఁడని చెప్పి పనిచె నంత. 101

వ. వారలు దేవదేవుండైన గోపాలదేవుం గనుంగొని. 102

చ. పొలతి యేమి త్రోవ విడు పోవలె నెచ్చటి కింతిచెంత కే
తొలి రుచి వీడవో విడను ద్రోతుము దొబ్బుదు పొమ్ము పొమ్ము మా
టల కెడ మౌను గాని వికటానికిఁ జొచ్చితి వౌను యెవ్వరో
బలిమి మిటారి ర మ్మిదిగొ వచ్చితి, రాకల మానవో హరీ. 108

గీ. ఇటుల నాడిన మాటల కిముడఁ బలికి
రాజసము మీఱఁగా యదురాజమౌళి
బలిమి జులుముల సందడుల్ దొలఁగఁద్రోచి
చొరవ చేసుక లోపలఁ జొచ్చువేళ. 104

సీ. విడు విడు మని డాసి కడకన్ను లెఱఁ జేసి
కమ్మ నెత్తమ్ముల గ్రమ్మె నొకతె
లేచి ముందఱఁ జంగఁ జాఁచి కోప మెసంగ
సన్నజాజుల చేతఁ జవిరె నొకతె
అడ్డంబుగా నిల్చి యవల కేగ నదల్చి
కమ్మ నెత్తమ్ముల గ్రమ్మె నొకతె
నిలు నిలు మని పల్కి నీటు మీఱఁగఁ గుల్కి
విరజాజి విరులచే విసరె నొకతె
గీ. గుప్పుమని తావి పుప్పొడి గుప్పె నొకతె
చలువ పన్నీరు మైనిండఁ జల్లె నొకతె
దానవారిని జొరనీక తలుపు మూసి
యానుఁ డని రాధపై బలం బనుపఁ జెలఁగి. 105

గీ. కాంత లిట్టులు రానీక ఱంతు సేయ
నీటి చిమ్ముల కళుకక నిలుచు గంధ
సింధురం బన నిలఁబడి శ్రీధరుండు
పలికె వారలఁ గని నయభయము లమర. 106

గీ. సుదతి యిసుమంత కడకంటఁ జూచినంత
నింత ఱంతు ఘటింతురా యింతులార
మీరు నామాఱు పదముల మీద వ్రాలి
కలయఁ గలయించి సుకృతంబు గట్టుకొనరె. 107

వ. అను శౌరితోడ నా చెలు లిట్లనిరి. 108

సీ. ఈవైన మానాటి కెటు పోయెనో యని
చెప్పి కరమ్ములు విప్పువారు
గలయఁ గల్పులు సేయఁగా రాదె యీ గుణా
ఢ్యుని నంచు నౌదల లూఁచువారు
నీ యతివినయంబు నీ యిళకె కొని పొ
మ్మంచును బహుధిక్కరించువారు[19]
ప్రాలుమా లిటువలె బ్రదుకవచ్చునె యంచు
మెఱుఁగుఁ గెమ్మోవిని విఱచువారు
గీ. మామగారింటిలో నున్న మందెమేల
మెందు దాఁగెనొ యిపు డటం చెన్నువారు
బెళుకుఁ గౌనులు బెళుకంగఁ గులుకువారు
నగుచు నగుచున్న చెలుల కి ట్లనియె శౌరి. 109

గీ. ఇంత కోపము మదినున్నఁ జెంతఁ బిలువఁ
బంచి రాధిక నన్ను దండించ రాదె
వాకిటిన లాకు నను జేయ వశమె వలదు
గౌరవము లాఘవము నెందుఁ గాంచవలదె[20]. 110

క. అన విని రాధిక భావం
బున నించుక కోప మాఱి ముసుఁగిడి తిరుగన్
గని కీరము చని వేగం
బున రమ్మని పిలువ శౌరి ముద మొదవంగన్. 111



ఉ. లోపలి కేఁగి గారుడవిలోలశిలాగృహసీమ శయ్యపై
గోప మెసంగఁగాఁ జిలువకోమలి చాడ్పున నున్న యింతి సం
తాపముఁ జూచి పుష్పశరతాపము మీఱ మురారి చేరి బె
ట్టూపిరితోడఁ బాదముల యోరకు రాఁ గని లేచి దిగ్గునన్. 112

ఉ. ఎవ్వరు పిల్చి రిచ్చటికి నెందుకు వచ్చితి వేమి కార్య మే
నెవ్వతె నీ వెవండ విక నెవ్వరి కెవ్వరు కంటిఁ గంటి మీ
జవ్వని విన్న రవ్వ లిడు చాల్ తడవాయెను వచ్చి లేచి పో
నవ్వెద రెల్లవారు గని నన్నును నిన్నును గోపశేఖరా. 113

క. అనఁ జెలి పాదంబులపై
ఘనచింతారత్నఘటితకనకకిరీటం
బును మోపి లేవకుండిన
వనజానన సిగ్గు వలపు వడ్డికిఁ బాఱన్. 114



క. దేవుఁడ వేలిన స్వామివి
పోవయ్యా నీవు నాకు మొక్కఁగఁ దగునా
లేవు మని గుబ్బచనుమొన
లా విభు నెద సోఁక నెత్తె నంగన ప్రేమన్. 115

ఉ. ఎత్తిన పట్టు వీడక యుపేంద్రుఁడు తత్కుచకుంభపాళిపై
నత్తమిలెన్ దురంతవిరహార్ణవపూరము నీదు కైవడిన్
హత్తి రసాలసాలమున నల్లెడు మల్లియతీగ కైవడిన్
గుత్తపు గుబ్బలాఁడి చనుగుత్తులఁ దత్తను వొత్తి సొక్కుచున్. 116

వ. ఇట్లు మదనకదనారంభసముజ్జృంభమాణమనోభిలాషల నా రాధామాధవు లమందానందకరచందనాదికస్తూరికాపరిమళద్రవ్యంబులకు సొమ్మసిల్లియుండి రప్పు డమ్మందయాన పురందరాదిబృందారకవందితపాదారవిందుం డగు నా గోవిందునిఁ గలయు మోహావేశంబునఁ బట్టరాని గుట్టెనసి చిట్టాడు మట్టు మీఱి యతండు కౌఁగిటం జేర్చినం జేర్పనీయక యబ్బురపు గబ్బిసిబ్బెంపు గుబ్బల నిబ్బరంబున సోఁక సోఁకనీయక కటికచీకటితప్పులన్ గుప్పునం గప్పు గొప్పకప్పుకొప్పు నిమిరిన నిమురనీయక మిక్కిలి



మెచ్చులైన చక్కని చెక్కు గీటినన్ గీటనీయక మధురసుధారసధారాధురంధరంభైన బింబాధరంబు గ్రోలినం గ్రోలనీయక కుందనంపుటందంబు గెంటినపువ్వును గంటు పఱుచు తుంటవింటిపాదుశాహుదివాణంబు నంటిన నంటనీయక మెం డొడ్డుకొన నాదరించి యొయ్యన శయ్యంకుఁ జేర్చి లాగించి కౌఁగిలించి బాహాబాహిఁ గచాకచిఁ బెనంగి యల్లందులకుం గమకించి చివురు సౌరు జవురు తావి మోవితేనెలం గ్రోలి పైకొని కోకిలచందంబున గుబగుబం బలుకుచు మేలు భళా పంసందు సేబాసు నాసామి యదిరా యదిరా యని మెచ్చి యొక్కరొక్కరే మేను లప్పళించి వింతవింతపిలుపులం బిలుచుచుఁ గెందామరలం బోలు కందామరల నరమోడ్పులు గావింపుచు మన్మథబ్రహ్మానందంబునం దోలలాడుచునుండి రని చెప్పిన శుకుం డిట్లనియె. 117[21]

శా. కస్తూరీతిలకోజ్జ్వలస్మితముఖా! కైవల్యలక్ష్మీసఖా!
హస్తోదంచితశంఖచక్రరుచిరా! హస్తీంద్రరక్షాపరా!
అస్తోకామృతవర్షవేణునిసదా! యానందలీలాస్పదా!
త్రస్తానేకజనాభయప్రదకరా! ధారాధరశ్రీధరా! 118

క. సారఘనసారనవకా
శ్మీరపటీరాంగరాగశీతలతటరా
ధారమణీకుచదుర్గయు
గారోహవిహారలీల! యదుకులబాలా! 119

మాలిని. దళితవిపులమాయా! ద్రావిడామ్నాయగేయా!
జలరుహదళనేత్రా! సవ్యసాచ్యాప్తమిత్రా!
బలివిభవవిరామా! భానువంశాబ్దిసోమా!
కలశజలధిశాయీ! కామితార్థప్రదాయీ! 120

గద్య. ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీవిజయరంగచొక్కనాథ (మహీనాథ కరుణాకటాక్ష సంపాదిత గజతురంగమాందోళికా ప్రముఖ) నిఖిల సంపత్పారంపరసమేధమాన సముఖ మీనాక్షీ నాయకతనూభవ మీనాక్షీదేవీ కటాక్షలబ్ధ కవితాసాంప్రదాయక వేంకటకృష్ణప్పనాయక ప్రణీతం బైన శ్రీరాధికాసాంత్వనం బను చాటుప్రబంధంబు సర్వంబును నేకాశ్వాసము. 

వ్రాయసకాని మాట :--
క. ఈ కథఁ జదివినఁ వినినన్
బ్రాకటముగ వ్రాసినాను బహుసంపదలన్
కైకొనుఁ డనుచు న్వారికి
శ్రీకరముగ గోపశౌరి చెలువుగ నొసఁగున్.
శ్రీమచ్చెన్నపురవాస శ్రీ చెన్నకేశవస్వామినేనమః

కీలకనామసంవత్సర మార్గశిర బహుళషష్ఠి శుక్రవారమునాఁడు బాగూరు రంగాశాయి కొమార్తె అమ్మికి తంజావూరు కవి వేంకటస్వామి నాయఁడు స్వహస్తలిఖితముగా నిచ్చినది.

  1. చిలుకులకోరి దుష్కంటక శరము
     చిలుకుటమ్ము చిలుకము ------------- ఆంధ్రవాచస్పత్యము
  2. పొట్లము - గుంపు
    (శబ్దరత్నాకరము)
  3. వేటంద లమ్మున - అని. తా. ప. ప్ర.
  4. కర్ణాతు=కన్నాత. మల్లయుద్ధములో నొక విన్నాణము—శుద్ధాంద్ర పద పారిజాతము. లక్ష్మీ నారాయణ నిఘంటువు
  5. కల్లము — మల్లబంధవిశేషము (శ.ర).
  6. కానికతరమై-తా. ప్ర, ము. ప్ర. కాని యామాట కర్ణము లేదు. కైనికతరమై అని సవరణ. ‘కీనము’ మాహాత్మ్యము. వైచిత్ర్యము , ఆనందము, సంతోషము సంస్కృతశబ్దార్థ కల్పతరువు.
  7. కారుబారు = వ్యవహారము, తొందర, ఇబ్బంది — బ్రౌణ్యమిశ్రభాషానిఘంటు
    ప్రయోగాంతరము: ‘కారుబారు సేయువారు గలరే? నీవలె సాకేతనగరిని’ – త్యాగరాజు
  8. పిచ్చికల - అని తా. ప. ప్ర.
  9. వళికె = దీపము — బ్రౌ. మి. భా. ని. సందర్బము? Suggestion మొటికె
  10. ఱోలెంత వెలిఁగె ననిన – తా. ప. ప్ర. పాఠము
  11. ఈఁక తోఁక లేని శ్రీకృష్ణుమాటలు (ము. ప్ర. పా.)
  12. అత్తనెత్తిఁ జేతు లంగడిపైఁ గన్ను (ము. ప. సా.)
  13. మోసపోతి (న్) + ఇక — ఇట నుత్తమపురుషైకవచనక్రియ - 'ఇ' కార సంధివిలక్షణతయు, నిర్బిందుక సబిందుక ప్రాసయతియు గమనింపఁదగినవి.
  14. మెఱుఁగు వాతెఱ మేలిమి కుందునమ్మ-తా. ప. ప్ర.
  15. అడల వలవదు నా యాన మందయాన-తా. ప. ప్ర.
  16. ఈ గుర్తుల మధ్య నున్న పాదార్ధ మొక సర్దుబాటు
  17. చంద్రకి = నెమలి (సూ. రా. ని.)
  18. నేతల చుట్టియాడ - తా. ప. ప్ర
  19. కొంచు పొమ్మని బహు ధిక్కరించువారు (తా. ప. ప్ర. పాఠము)
  20. గాన గురులాఘవము నెందుఁ గాంచు ననిన (తా. ప. ప్ర. పాఠము)
  21. గమనిక : 117 వ సంఖ్య గల గద్యయు, గ్రంథాంతగద్యయు నక్కడక్కడ అహల్యాసంక్రందనమును బట్టి సవరింపఁబడినవి.