రాజస్థాన కథావళి/చిత్తూరు మూడవముట్టడి

వికీసోర్స్ నుండి

లోలోపల నుదయసింగునకే కడుగూర్చును. ఒకమారు చిత్తూరుకోటలోనున్న వనవీరుని సైనికులకు భోపనసామగ్రులు కావలసియుండినందున వేయిబండ్ల మీఁద సరకులు వచ్చుచున్న వని మంత్రి వనవీరునితోఁ జెప్పి తలుపులు పూతి౯గా దీయించెను. వేయిబండ్లును గోటలోఁ బ్రవేశించిన పిదప బండ్లలోనుండి సరకులకుమారు వేయిమంది రాజపుత్రవీరులు వడివడి దిగి కావలివాండ్ర నందఱఁ దెగటార్చిరి.

ఉదయసింగు విజయుఁ డై భేరీ భాంకరణములతో గోటలోఁ బ్రవేశించెను. వనవీరుఁడు వెనుక విక్రమజిత్తును నుదయసింగును జేసినట్లు వాని నప్పుడు రాజపుత్రప్రభువులు చేసినచో బాగుండును. కాని తామే వానిఁ జిత్తూరు సంరక్షుకునిఁగా నేర్పఱచినందున తామే వానిం జంపుట యనుచితమని కరుణించి వానిం గడతేర్పక సకుటుంబ సపరివారముగ కోటవిడిచి యావలకుం బొమ్మని వానిని విడిచిరి. వనవీరుఁడును రాజ్యభ్రష్టుడై బంధువిరోధియై నిర్భాగ్యుఁడై యసహాయుఁడై తనవస్తువులను దాను తీసికొని కోటవిడిచి దక్షిణ హిందూస్థానమునకుం బోయి యచ్చట నొక చిన్న సంస్థానమున కధిపతియై కాలము సుఖముగఁ గడపెను. ఉదయసింగు చిత్తూరు రాణా యయ్యెను. పున్న యనఁగా హిందీ భాషలో వజ్ర మని యర్ధము. ఆశబ్దమునకు నిజముగా పున్న దగినది యగుటచే నామెకీతి౯ యాచంద్రార్కము లోకమున నిలుచుఁగాక!


చిత్తూరు మూడవముట్టడి.


చిత్తూరు దేశములోని సమస్తజనులకు గన్నులు చల్లఁబడున ట్లుదయసింగు రాజ్యపాలన మారంభించెను. అతఁడు చిత్తూరునకు వచ్చిన సంవత్సరమే చిత్తూరుకోటను పూర్ణముగఁ బాడు చేసిన యొక మహాశత్రువు జన్మించెను ఆశత్రువుఁడు ప్రసిద్ధికెక్కిన అక్బరు చక్రవతి౯యే.

ఉదయసింగు కొండకోటలోఁ గోమటియింటఁ బెరుగుచున్నప్పుడు ఢిల్లీలో మార్పుల నేకములు జరిగినవి. హుమాయూను చక్రవతి౯ పరమసాధువగుటచేఁ దనమీఁద పితూరీలు చేసి జనులను తన పైఁ దండెత్తివచ్చి తన్ను జాల చిక్కులు పెట్టుచువచ్చిన తమ్ములను క్షమియించి కనికరించి యెప్పటియట్లు గౌరవమున జూడఁ దొడఁగెను. యుద్ధములో నతఁ డెంత శౌర్యవంతుఁడై యొడలు మఱచి పోరుసేయునో తదితర కాలములయం దతఁ డంత భోగ పరాయణుఁడై నిశ్చింతతో గాలము పుచ్చును. వేయేల? వాని దయాస్వభావమును, వాని సోమరితనమును తుట్టతుదకు వానిని సింహాసనబ్రష్టుని జేసినవి. అతఁడు కష్టపడి చెమట యూడ్చి మాళవ దేశమును జయించెను. కాని లొంగినదానిని పూతి౯గ లోఁబఱచుకొనక సంతోష పరవశుఁ డై బంధుమిత్రులతో విందులనారగించుటతోను మహాభోగములతోను గాలము వెళ్ళబుచ్చెను.

ఇట్లుండ 'షర్ఖాను' అను ' పఠాణిజూతిలోఁ జేరిన యొక తుఱక బంగాళమునందు చక్రవతి౯ యధి కారమునకు తిరుగుబాటు చేసి యొక సేనం గూర్చుకొని దానిం జయించి తాను నవా బగుటకుఁ దలఁచుచుండెను. వెనుక హుమాయూను బంగాళా దేశమును జయించుచుండఁగాఁ జిత్తూరునుండి కర్ణావతీ దేవి వానిని రమ్మని వత౯మాన మంపుటయు నతఁడు బంగాళము సరిగా లోఁబఱచుకొనకయే కర్ణావతి కుమారుని రక్షించుటకుఁ ద్వరపడి చిత్తూరునకు బోవుటయుఁ జదువరులంద ఱెఱుంగుదురు. షర్ఖానుండు రేఁగిన వాఁడని వినినతోడనే హుమాయూను సేనాసమేతుఁ డై వాని నడఁ చుటకు బంగాళమునకుఁ బోయెను. అతఁ డక్కడకుఁ బోయినతోడనే తొల్లి వానిచే దెబ్బలుతిని రాజ్యమును విడిచి యనామకుఁ డై యెందో యడంగి యున్న బహదూరుషా మరలఁ దలయెత్తి గుజరాతు మాళవదేశముల నాక్రమించుకొనెను. హుమాయూను కనఁబడినతోడనే షర్టానుఁ కొంచెము 'వెనుకదీసెను. చక్రవతి౯యు బంగాళమునఁ బ్రవేశించి పగతుఁడు పారిపోయెనుగదా యని గర్వించి యెప్పటియట్లు భోగాసక్తుఁడై కేళీఖినోదములతోఁ గాలము బుచ్చుచుండెను. వాని జాడ యెఱిఁగి షర్ఖానుఁడు దారు లరికట్టి చక్రపతి౯కి ఢిల్లీకి నుత్తర ప్రత్యుత్తరములు జరుగకుండ నాటంకము గలిగించెను. హుమాయూనునితమ్ము లప్పుడయినను వానికి సాయము చేయరయిరి. అందొకఁడు హుమాయూసు సేనకు భోజన పదాథ౯ములు పంపుదునని వెళ్ళి యాగ్రానగరమున దానే చక్రవతి౯నని లోకులకుఁ జాటఁ బంచెను. రెండవ సోదరుఁడు గద్దెయెక్కిన యాతమ్ముని నావలకుఁ బారఁ దోలెను; కాని గట్టిపగతుఁడగు షర్ఖాను విషయమున నేమియుం జేయఁడయ్యె. అందుచే హుమాయూను తన పగతునితో సంధి చేసికొనవలసివచ్చెను. అంతట సంధిమాటలు జరుగుచుండఁగా ప్రాఁత పగలు మరచిపోయి హుమాయూనుని సైనికులు శత్రు సైనికులతో మనసిచ్చి మాటలాడుచుండఁగా నాకస్మికముగా నొక్కనాఁడు షర్ఖా నుఁడు తన సైనికులం దీసికొని చక్రపతి౯ సేన పయింబడి నిద్రపోవు చున్న సిపాయిలను నందఱను గటిక వాఁడు మేఁకలం గోసి చంపినట్లు చంపెను. అప్పుడు హుమాయూలను ప్రాణములు దక్కుటయే దుర్ఘటమయ్యెను.

పరాజయమునందిన యాచక్రవతి౯ తాను తప్పించుకొని పారిపోవుట కేయుపాయమును గానక గంగానదిలో దుమికి యీదిపోవుటకుఁ బ్రయత్నించి మిక్కిలి శ్రమపడుచుండఁగా నీళ్ల కావటివాఁడొకఁడువచ్చి మేఁకతోలుతోఁ గుట్టిన యొకసంచి తెప్పగా చేసి దానిపై హుమాయూనుని గూర్చుండఁ బెట్టి యెట్టెటో నావలకు దాఁటిం చెను. ఆవలఁబడి యతఁ డొక సంవత్సరము మంచి సైన్యమును పోగుచేసి రాజపుత్ర వీరులకు నిలయమని పూర్వము పేరు పడిన కన్యాకుబ్జ నగరమువద్ద షర్ఖానుని గలిసికొని యుద్ధము చేసెను. అతఁ డప్పుడు తెచ్చిన సైన్యము వెనుక వాని తండ్రి యగు బేబరు తీసికొనివచ్చిన సేనవంటిది కాదు. ఆసేనలో లెక్కకు లక్ష మంది బట్లుండిరి. కాని వారందఱు చావు పేరు చెప్పిన నడలి పారిపోవువారే. అందుచే గొందఱు యుద్ధ ప్రారంభముకన్న మున్నే యాచోటు విడిచిరి. కొందఱుశత్రువుల మొదటి ఫిరంగిచప్పుడు వినిన తోడనే గుండెలు చెదరి చెల్లా చెదరై సిగ్గు లేక కాలికోలఁది పరుగెత్తిరి. హుమాయూను మరల ప్రాణములతో దాఁటిపోయి కొలఁది పరివారముతో నొక తావునుండి మరియొక తావునకుఁ బోవుచు నుండుట కిల్లు లేక భగవంతునిపై భారమువేసి తిరుగుచుండెను.

ఎంత మెత్తని మనసుగలవాఁ డై నను హుమాయూనునివద్ద తండ్రి కడనున్న పట్టుదలయుఁ బబ్ల యు గొంతవఱ కున్నట్లు గనఁబడు చున్నది. ఏలయన నతఁను తనకుఁ గలిగిన దుఃఖముచే నుత్సాహభంగమునందక నాపదలు గడచుచు కొత్త స్నేహితుల సంపాదించుకొనుచు దారపుత్రాది వియోగదుఃఖము ననుభవించుచు పదునైదు సంవత్సరములు గడపెను. మొట్టమొదట కొంతకాల మతఁ డతిదారుణములగు దుఃఖముల ననుభవించుచు నెప్పటికప్పుడు తలఁ గొట్టు కొనిపోవునట్టి యాపడలను గడచుచు సింధు దేశమునందు రాజపుత్ర స్థానమునందుఁ గల యెడారులలోఁ దిరిగెను. ఆయవస్థను గనిపెట్టి రాజపుత్రప్రభువులు చక్రవతి౯కి తమ యోపినకొలఁది ధనమును సైన్యము నిచ్చి సాయము చేసి వానిని సింహాసన ప్రతిష్ఠితునిఁ జేసిన పక్షమున మొగలాయివంశస్థులు సూర్య చందవంశస్థులు నెల్లకాలము కృతజ్ఞులై యుందురు; కాని యట్లు జరుగలేదు. హుమాయూను సహాయము చేయుమని జసల్మీరుసంస్థాన ప్రభువు నడుగ తన కత నితో స్నేహము చేసికొనుట కష్టము లేదని ప్రత్యుత్తరము చెప్పెను. అనంతరము చక్రవతి౯ మార్యారు సంస్థాన ప్రభువగు రావుమాల్దీవును దోడుపడుమని యడగ నతఁడు సహాయముఁ జేయకపోవుటయే గాక మీదుమిక్కిలి యాహుమాయూనుం బట్టి చెరసాలలో బెట్టింపఁ బ్రయత్నించెను. ఆచక్రవతి౯ రాజ్యభ్రష్టుడై తిరుగుచున్న కాలముననే యెక మహమ్మదీయ యోగికూఁతురు హామిడా యనునామె వానిని మోహించి తినుట కన్నము నిలుచుటకు నీడలేని యారాజును వివాహము చేసికొనియెను. మంచియవస్థలోనున్నపు డెందఱు భార్యలైన రావచ్చును. దురవస్థలో నున్నపుడు మరల రాజ్యప్రాప్తియగుననియైన లేనపుడు తన యంతనేవచ్చి తనతోఁ గలిసి తన కష్టములనే యనుభవించుటకుఁ దన్ను వివాహమాడిన యాకాంతను వెంటఁ బెట్టుకొని హుమాయూను ప్రాణభీతిఁ బగుగెత్త నారంభించెను.

ఆ బాలిక కష్టదినములు వెంటనే బయలుపడెను. దేశమునందెచ్చటఁ దలఁ దాఁచుకొనుటకు వీలు లేక యాదంపతులు స్వసంరక్షణ నిమిత్తము సింధు దేశపు జెడారిం బ్రవేశించిరి. ఈయెడారి నీళ్ళు లేని సముద్రమయి యంతము లేనిదై యుండెను. ఇందు ప్రచండ వాయువు లప్పుడప్పుడు వీచుచుండును. ఆగాడ్పులు విసరునపు డిసుక నేలనుండి నూరుగుల యెత్తువరకుఁ బెద్ద కెరటములాగున లేచి బాట సారులను మట్టిలో గప్పి చంపి వేయును. అక్కడక్కడ నెన్నో యామడల కొకచోట నొకనూయి యుండును. అది రమారమి యెనుబది నిలువులలోతు గలిగియుండును. అందుచే నాయెడారిలో నీరుదొరకనే దొరకదు. ఇట్లు దుర్గమమగుట చేతనే యీ యెడారి మరణభూమి యని పేరు గలగినది ఎంతో జాగ్రత్తతోఁ బోయిన వారికే యనేక యాపదలు సంభవించు చుండును. ఇట్టి భయంకరప్రదేశమును,కోత్తభార్యను, కోలది పరిజనమును వెంటఁ బెట్టుకొని హుమాయూను ప్రవేశించెను. నడచిన కొలఁది మధ్య మధ్య వారికి యెండమావు లగపడి బ్రమ పెట్టి మోసముచేయుచు వచ్చినవి. వారిప్రయాణములు వారి గుఱ్ఱముల బలమునే యాధారము చేసికొనియుండెను. అవి కదలలేక పోయిన వారిప్రయాణములు తుద ముట్టినవని చెప్పవచ్చును. మాగ౯ మధ్యమున వడగొట్టి యెవఁడై న పడిపోయెనా వానిగతి యంతే. కాని తక్కిన వారు వానికొఱ కాగుటకు వీలు లేదు. ఒక నాటి యర్థరాత్రమున హుమాయూను గుఱ్ఱము నెక్కి స్వల్ప సేనాపరివార సమేతుఁడై కుటుంబము తోడ్కొని యమరకోట యను నగరమును జేరుటకుఁ బయనమై పోవు చుండెను. అప్పుడాయన యెక్కిన గుఱ్ఱము మార్గా యాసమునఁబడి చచ్చెను. చక్రవతి౯ తనకుం దోడై వచ్చుచున్న 'టార్ డీ బేగ్' అనువాని యొద్దకుఁబోయి దృఢముగా నడచుచున్న యాతని గుఱ్ఱమును తనకిమ్మని యడిగెను. చక్రవతి౯ యాదినములలో మిక్కిలి యల్పుఁడగుటచే 'టార్ డీ బేగ్' వానిమాట లెక్క సేయక నిర్దయాత్ముండై నియ్యను పొమ్మని బదులు చెప్పెను.

మాల్దీవు యొక్క సైనికులు హుమాయూనుం బట్టుకొనవలెనని వెను వెంటఁ దరుముకొనివచ్చుచుండిరి. కాబట్టి యెక్కుటకు గుఱ్ఱమైనను లేని యాచక్రవతి౯ వెంటనే యపాయము తప్పించుకొనుట కొక యొంటె నెక్కెను. అతనియవస్థఁజూచి జాలినొంది పరిజనులలో నొకఁడు నీడంకోలాయను వాఁడు గుఱ్ఱముమీదనుండి తనతల్లిని దింపి యాగుఱ్ఱమును జక్రవతి౯ కిచ్చి చక్రవతి౯ యెక్కిన యొంటె మీద యామె నెక్కించి యామె పక్కనే పాదచారియై తానునడచెను. వారు పోయెడు దారి జలశూన్యమగు గొప్ప యడారియగుటచే దాహమునకు నీరు దొరకక కొందఱు మృతులైరి. కొందఱు పిచ్చివాండ్రయి కేకలు వేయ నారంభించిరి. ఆక్రందనధ్వనులతోడను హాహాకారములతోడను నింగి నిండిపోయెను ఈ కష్టములకు దోడు పగవారు దాఁపునకు వచ్చిరను వత౯మానము దెలిసెను, యుద్ధము చేయఁగలవారి నందఱిని పయనము మానిపించి తనవద్దనుంచి స్త్రీలను సామగ్రులను సాగిపొమ్మని పంచెను. శత్రువు లెంత సేపటికి రానందున చక్రవతి౯ " తనకుటుంబ మెట్లున్నదో చూచుటకు ముందు వెళ్ళేను. ఆ కారుచీఁకటిలో హుమాయూను సైనికులలోఁ గొందఱు దారితప్పి శత్రువులకంటఁ బడిరి, అప్పుడు రాజపుత్రులకు మొగలాయిలకు నొక చిన్న యుద్ధము జరిగెను. మొగలాయీలు ప్రాణములపై నాసవిడిచి ఘోరముగఁ బోరి రాజపుత్ర సేనాపతిం జంపి సేనం బారదోలి వారియొంటెలను గుఱ్ఱములను సామగ్రులను దోఁచుకొనిరి.

ఎన్ని దొరకినను మూఁడుదినములవఱకు నీటి చుక్కయైన వారికి దొరకదయ్యె. నాలుగవనాఁడు వారికిఁ గన్నులపండువుగ నొక బావి గనఁబడెను. అది యెంతలోతున్నదో చెప్పఁ జాలముగాని మోటఁ గట్టి నీళ్లు తోడు నపుడు బొక్కెన పైకి వచ్చిన దని మోట యెడ్లను తోలువానికి తెలియఁ జేయుటకై మాట వినఁబడక పెద్ద భేరీ వాయించవలసి వచ్చెను. ఇట్లతిప్రయత్నమున వచ్చిన యానీటి నిమిత్త మదివఱకే నోళ్లు తెఱచుకొని యున్న యాజనులలోఁ గొందఱు దాహాతురులై నిలువ లేక తిన్నగా బొక్కెన నూతియంచువఱకు రాఁక మునుపే దాని పయిం బడి నీరు త్రాగఁబోవ 'వెంటనే యాత్రాడు తెగి బొక్కెన నూతిలో బడెను. బొక్కెనతోఁ గూడ కొందఱు మనుష్యు లానూతిలో బడి మృతినొందిరి. కొందఱు మితిమీరిన దాహ బాధ కాగలేక నాలుకలు దెఱచుకొని, వగర్చుచు వేడియిసుక పైఁ బడి దోల౯సాగిరి. మఱికోందఱా బాధ కోర్వలేక నూతిలో గుభాలున నుఱికి తక్కిన వారికంటే త్వరగా ప్రాణములు విడిచి సుఖపడిరి. మరునాడు వారు మరల నొక నీటి పట్టుం జేరిరిగాని వారిదురవస్థ వెనుకటి దినముకంటే తక్కువ కాలేదు.

అదివఱకు చాలదినములనుండి నీరు దాగి యెఱుఁగకపోవుటచే నోంటెలు నీరు పోసిన తోడనే మితి మీరఁ ద్రావి యొక్కనముచే యెన్నియో తక్షణమే మృతినొందెను, ఆయోంటెలవలెనే మనుష్యు లును గొందఱు నీరు త్రావిన కొంత సేపటికి గుండెల బరువువలన బాధపడి చనిపోయిరి. ఎట్టకేలకు హుమాయూను కొందఱుపరిజనులతో చచ్చిచెడి యమరకోటఁ జేరెను. అమరకోట మృత్యు దేవతకోటలలో నొకటియని చెప్పఁదగి యున్నను అక్కడికోట యిటుక గోడలు రాతిబురుజులు చుట్టుగుడిసెలు గలిగి దర్శనీయముగ లేకున్నను నిరాధారు లగు నాజనులకు నయనోత్సవము గావించెనుఁ ఆయూరి కుత్త రమున మంచినీళ్ళ కాలువ యొకటి యుండెను. హుమాయూను పరిజనులందఱుఁ దమ కాదినము పండగదినమట్లు భావించి కరువుదీర నీరు ద్రావి సుఖించిరి. ఆయూరి రాజు వారి బాధలు తొలగించుటకు తనకుఁ జేతనైనంత పని చేసి చక్రవతి౯కి విధేయుఁడై యుండెను. హుమాయూనుని కొత్త భార్యయగు హామిడా నిండు చూలాలై యాయెడారులలో మగ వారికంటె నెక్కుడు ధైర్యముఁ గలిగి యద్భుత శక్తితోఁ బయనము చేసి దారుణ కష్టములం గడిచి యమరకోటఁ జేరెను. అక్కడ వారున్న కాలముననే 1542 వ సం౹౹ ము అక్టోబరు నెలలో నక్బరు పుట్టెను. అతఁడు చక్రవతి౯ చూడామణి యనియు రాజన్య చూడామణియనియు భరతఖండమును బాలించినదొరలలో నగ్రగణ్యుఁ డనియు పేరువడసెను. తన భార్యలను బిడ్డలను ప్రాణప్రదాత యగునమరకోట రాజు సంరక్షణములో నుంచి హుమాయూను బయన మారంభించెను. ఇటు కొంతకాలము తిరిగి తిరిగి యతఁడు పారశీక దేశము జేరి యారాజు ననుగ్రహమున తనపిత్రార్జిత మగుకాబూలు గాంధార దేశములను జయించెను. అవి మొద లతఁడు కొంచెము నిలువఁదొక్కుకొని క్రమక్రమముగా బలపడఁబొచ్చెను, వాని సోదరులలోఁ గొందఱు మృతినొందిరి. కొందఱు రాజ్యభ్రష్టులై దేశముపాలైరి.

ఇక్కడ ఢిల్లీలో షర్ఖ్హాను హుమాయూనుం బారఁదోలి గద్దె యెక్కి ధర్మాత్ముఁడై 'దేశమును జక్కగా పాలించి చివఱకు యుద ములలో మృతినొందెను. వానివంశస్థులు నీతిదూరులు బలహీనులు నగుటచే రాజ్యము వారికిఁ దక్కదయ్యె. ఆయప్రయోజకులు దేశము నంతయుఁ బాడు చేసి యరాజకమగునట్లు గావించి ప్రజల కవాతులగుటంజేసి యాయద నెఱింగి హుమాయూను ముందుగా పాంచా లము జయించి తరువాత శత్రువుల నోడించి ఢిల్లీని పట్టు కొని మరల చక్రవర్తి యయ్యెను. అతఁడు మఱల సింహాసన మెక్కిన పిదపఁ జిరకాలము రాజ్య మేల లేదు. గద్దెయెక్కిన యారు నెలలకే యతఁడు తన మేఁడమీఁది స్ఫటికపురాళ్ళ మీదనుండి జారి మెట్ల మీదఁనుండి దొర్లి క్రింద పడి తత్కారణమున కొన్ని దినములలో మృతుఁడయ్యెను.

అతని యనంతరమున రాజ్యమును వహించిన యతఁడు తొల్లి యమరకోట, నుదయించిన బాలుఁడే తండ్రి పోవునప్పటి కతఁడు పదుమూడేండ్ల ప్రాయము వాఁడు. అక్బరు పాంచాలమును ఢిల్లీని మఱియుదండ్రి పాలనము క్రిందనున్న కాబూలు గాంధారములను జేకొనియెను చిత్తూరును బాలించుట కుదయసిం గెంత చిన్న వయస్సులో నారంభించెనో యక్బరు ఢిల్లీ నేలుట కంత చిన్న తనమున నారంభించెయి. కాని వీరిరువురు వేరు వేరు స్వభావములవారు.

ఉదయసింగు రమారమి ముప్పదినువత్సరములు రాజ్య పాలనము చేసి యున్నను వాని యేలుబడిలో మంచిపని యని చెప్పఁదగిన దొకటియు జరుగ లేదు. శూరశిఖామణులలో నగ్రగణ్యుఁ డని చెప్పఁదగిన రాజుకడుపున బుట్టియు నుదయసింగు సింగముకడుపున బుట్టిన మేఁక పిల్ల వలె సమయము వచ్చినప్పుడు పిరికియై మూర్ఖుఁడై నగుబాట్ల నొందుచువచ్చెను. వేయిమాట లేల? బప్పరావులవంశస్థుల యొద్దఁ గానఁబడవలసిన శుభ చిహ్నములు రాజలక్షణములు వాని యొద్ద కానబడక పోవుటచే వెనుక పున్న యను దాని చేఁ బెంపఁబడిన మీవారు రాజపుత్రుఁ డతఁడు గాడనియు నెవరో యొక దొంగపిల్లవానిం దెచ్చి యతఁడే రాజ పుత్రుఁడని భ్రమ పెట్టి రనియుఁ గొందఱు దలంచిరి. అది యటుండ నిచ్చట హుమాయూనునకు నమ్మిన చెలికాఁడును మంత్రియు నైన బేరాంఖా ననునతఁ డక్బరుయొక్క చిన్న తనమందు నాలుసంవత్సరములు చక్కఁగా పరిపాలించి పిదపనక్బరున కప్పగించెను. అక్బరు చక్రవర్తియై తాను బాలుఁడై నను దృఢమనస్కుఁడై తనమాటయందు ప్రజలకు మంత్రికి గౌరవము నిలుచునట్లు నడచుకొనజోచ్చెను. అతఁడు రాజ్యముబూనిన కొద్దిదినములకే రాజపుత్రుల మీఁద దండయాత్ర చేసెను, వాని తండ్రి సింహాసనభ్రష్టుడై దేశాంతరముల పాలై పోయినప్పుడు రాజపుత్ర ప్రభువులు చేసిన యనాదరణము ద్రోహముఁ బలుమారు తల్లి యగు హామిడాదేవివలన విని యుండుట చేతనో లేక తల్లి పడిన బాము లన్నియు గర్భములో నున్నపుడు వాని మనస్సుమీఁద ముద్రితము లయ్యెనో లేక శూరులను జయించి కీర్తి జెందగోరుట చేతనో యతఁడు రాజస్థానము మీదికే వెడలెను.

ఆమహాశూరుఁడు తొలుదొల్త మారువారు దేశము మీఁదికి జని మాల్ దేవుని నోడించెను. అంబరు సంస్థాన ప్రభువు చక్రవర్తికి జడిసి కప్పముగట్టి తనకూఁతును వానికిచ్చి వివాహము చేయుటజే నక్బరు వానిం గరుణించెను. తురక రాజునకుఁ దమకూఁతునిచ్చి పెండ్లి చేసి యుత్తమ క్షత్రియవంశమును పవిత్రము చేసిన రాజపుత్రులలో మొట్ట మొదటి వాఁ డితఁడే. తక్కిన రాజపుత్ర ప్రభులందఱు 'తెలివిఁ దెచ్చుకొని జాగ్రత్తపడి చక్రవతి౯కి లోఁబడి కప్పముఁ గట్టిరి. అక్బరును వారిమతము జోలికిఁ బోక లోఁబడిన పిదప వారినఁదఱ సన్మానించెను. హిందువులు తమ పుణ్య క్షేత్రములకు యాత్రనిమిత్తము పోవునపుడు తురక చక్ర వర్తులు వారియొద్ద నొక పన్ను గ్రహించుచువచ్చిరి. అదిగాక తురకలు కానందుకు హిందువు లేడాదికి తలకొక రూపాయ వంతున పన్నియ్యవలసి వచ్చెను. హిందువుల మీద నన్యాయముగఁ గట్టఁబడిన యీ రెండు పన్నుల నక్బరు చక్రవతి౯ తీసివేసెను. ఇట్ల నేక రాజపుత్రులు ఢిల్లీశ్వరునకు లోబడినను సంధికిరాని మూర్ఖుడొకఁ డుండెను. అతఁడు చిత్తూరు రాణా యగునుదయసింగు.

ఆయన గర్వము చేతఁ బౌరుషము చేత నక్బరునకు లోఁబడక పోలేదు. సోమరితనము చేత మూర్ఖత చేత నతఁడు చక్రవతి౯ దర్శన ముచేసి సంధి కోరఁడయ్యె. ఉదయసింగు బాల్యము నతిక్రమించి యవనమును బ్రాపించి తన సంరక్షకుల నావలకుఁబంపి యొక యుం పుదుకత్తెను 'జేరఁదీసి దానివలలోఁ జిక్కి రాజ్య వ్యాపారాదివిముఖుఁడై దానితోడిదే బ్రతుకని యొడలుమఱచి యుండెను. అక్బరు మాళవదేశమును జయించి దాని రాజగు రాజబహదూరును బారఁదోల నుదయసింగు వానికి శరణ మిచ్చి యట్టిపనివలన గలుగు నష్టము నాలోచింపకయే వానిం దనకడ నుంచుకొనెను. అందుచే నక్బరు కుచ్చితుఁ డై పగఁదీర్చుకొనుటకు మీవారు పై దండు విడిసెను. ఢిల్లీ చక్ర వతి౯ యంటి వాఁడు మహా సేనాసమేతుఁడై తనపై కెత్తివచ్చుచున్నాఁడని వినియు నుదయసింగు విననివాఁడు వోలె నేప్రయత్నములు చేయక మొద్దువలె నూరకుండెను.

ఉదయసింగు స్త్రీకన్న నధముఁ డై యింటఁ గూర్చుండుటం జేసి వానియుంపుడుకత్తె నగరమునకు రాదలచిన దుస్థితినిఁ జూచి రోసముఁ దెచ్చుకొని పనిఁ జేయబూనెను. సిగ్గు లేనిదియు వంచకురాలు నైనను నాపడఁతి రాజస్థానమునఁ బుట్టినదగుటచే దేశాభిమానముం గలిగి పౌరుషవంతుఁడగు పురుషుఁడట్లు పనిచేయఁజొచ్చెను. వెనుకటి చిత్తూరిముట్టడిలో రాణి జవాహిరీభాయి చేసినట్లే యీమెయుఁ గవచము ధరించి పురుష వేషము వేసికొని సేనలం దోడ్కొని మొగలాయి శిబిరముం బ్రవేశించి యొకమా రక్బరు చక్రవతి౯ యున్న స్థలమునకే సాహసించి పోయెనఁట. ఇట్లేమే పనిచేయుచుండ దైవవశమున నక్బరు చక్రవతి౯ పనులతొందరచేఁ జిత్తూరు విడిచి సేనాసమేతుఁడై మఱియొక చోటికిఁ బోవలసివచ్చెను. చక్రవతి౯ చిత్తూరు విడిచిపోవుటకుఁ దన యుంపుకత్తెయే కారణ మనియు నామె తనకుఁ జేసినమహోపకారమువలననే తన రాజ్యము తనకు దక్కిన దనీయు నుదయసింగు చెప్పి సంతోషించెను.రాణాకు దనయుంపుడుకత్తెమీఁద నున్నంతమాత్రపు గౌరవమైనఁ దనమీఁద లేదనియుఁ దాము కష్టపడి ప్రాణముల కాశపడక పోరాడుట యెల్ల నిరర్థకము జేసి మెప్పునంతయుఁ తుద కతఁడు తన వలపుకత్తియకే యిచ్చె ననియు రాజబంధువులు కోపోద్దీపితులై యా వలఫులాడినిఁ జంపించిరి. అప్రయోజకుఁ డగు రాణా దనరాజ్యమును నిలిపిన యాపడఁతి ప్రాణరక్షణముఁ జేయం బ్రయత్నింపలేదు సరిగదా, దానిం జంపిన వారిని శిక్షింపనైన లేదు. ఈ పర్యాయ మక్బరు రాణా యొక్క భోగభార్యవలనఁ బరాజితుఁ డయ్యె నని మహమ్మదీయ చరిత్ర కారు లెవ్వరు వ్రాయరైరి. చరిత్రకారులు వ్రాసిన దేమనఁగా 1567 వ సంవత్సరమున నక్బరుచక్రవతి౯ రాజస్థానమును దండెత్తి చిత్తూరుకోటను బట్టుకొనుటకు నాలుగు వేల సేనతో వచ్చెనని ఈ సంవత్సరమునఁ జక్రవతి౯ కోటను ముట్టడించి పట్టుకొనుటచే నది మాత్రమే వారు వ్రాసి వెనుకటి పరాజయమును వారు వ్రాయరైరి. అక్బరు మంచి ఫిరంగులతోడను సాధన సామగ్రుల తోడను వచ్చియున్నను జిత్తూరుకోటలో భోజన సామగ్రులు జలము సమృద్ధిగా నుండుటచే దుర్గసంరక్షకులు మొగలాయిసేనం జూచి వీరా! మనల జయించువారని పరిహసించిరి. అక్బకు సైనికులును మొట్ట మొదట కోట దుస్సాధ్యమని యాస వదలుకొనిరి. కోటగోడఁ దూర్పున నుత్తరమున నల్ల రాతితోఁ గట్టఁబడుటచే నా వైపులగోడలకు ఫిరంగులవలన 'నేమియు భయము లేదని వార లనుకొనిరి. అట్టికోట ప్రపంచమం దెచ్చట లేదని విదేశీయు లనేకులు వ్రాసిరి. బురుజులు మిక్కిలి దృఢముగా నుండెను, తుపాకిమందు కొట్లకోలఁది యుండెను. అక్బరు కోటకు దూరముగా నొక కొండమీఁద బస చేసి తన సైన్యమునకు రాత్రులు వెలుతురు కలుగునట్లు తనయున్న పర్వతము యొక్క శిఖరము మీఁద పెద్దమంట వేయించుచువచ్చెను. ఆమంటలు చిత్తూరు కోట కావలివాండ్రకుఁ బ్రతిరాతము స్పష్టముగఁ గనఁబడుచు వచ్చెను. ఉదయసింగు మహారాజు ప్రాణముల కాసపడక చిత్తూరు గౌరవము నిలుపుటకై రేలుఁబవళ్ళు పోరాడుచున్న వీర యోధులకుఁ బోత్సాహముఁ గలుగఁ జేయుటకు మారు దుర్గరక్షణ మన్యులపాలు చేసి, తాను కోటవిడిచి హారావళీ పర్వతములకుం బారిపోయెను. అయినను మీవారు దేశముపై నభిమానముఁగల తక్కిన రాజపుత్రులు తత్సహాయార్ధము రాకపోలేదు. బదనూరు ప్రభు వగు జయమల్లుఁడును చందావతువంశస్థుఁడై 'ఖేల్వా' సంస్థానప్రభు వైన ఫుట్టాయను పదునాఱేండ్ల బాలుఁడును వచ్చి తోడుసూపిరి. వారిలో నప్పుడు పుట్ట తక్కి నరాజపుతులకన్నఁ జిన్నయయ్య. చందా వంశస్థుఁ డగుటచే తాను రాణాకు ముఖ్యుఁడనియు రాణా లేనపుడు కోట సంరక్షించు భారము తన దనియు దాను మొనఁగాఁడై సేనల నడుపుదు ననియు, జెప్పి కయ్యమునకు మొదట సిద్ధమయ్యెము. దేవలనగరాధిపతి తన పితృపితామహుల జన్మస్థాన మగుచిత్తూరు పై మహాభిమానముఁ గలిగి యావిపత్సమయమున దానికిం దోడ్పడుటకుఁ దనకొడుకు నంపెను.

అక్బరు చక్రవర్తి యీకోటఁ బట్టుకొనుట కెన్ని ప్రయత్నములు చేయవలయునో యన్నియుఁ జేసి హిందూ దేశ మంతటనుండి నేర్పుగల పనివాండ్ర ననేకులఁ బిలిపించెను. కోటబురుజుల మీఁదనుండి రాజపుత్రులు నిప్పులవర్షము గురియించు చున్నను వెరువక మొగలాయీ సేన లంతకంతకు దరికిఁ బోవ సాగెను. గెలిచినచో చాల బహుమానము లిత్తునని చక్రవర్తి యాశ పెట్టుట చేఁ బనివాండ్రు సైనికులు నోడలు దాచుకోనక యెవరు చేయవలసిన పని వారు చేయఁబూనిరి, సొరంగములు త్రవ్వువారు సొరంగములు త్రవ్విరి. అందులో మందులు కూరువారు మందులు కూరిరి. మొగలాయి సైనికులు దినమునకు నూరుగురు చొప్పున చచ్చిరి. చావనివారు చచ్చిన వారికళేబరములను దమకు దెబ్బలు తగులకుండ నడ్డు వెట్టుకోనుచు బనిచేసిరేగాని జంకి వెనుకంజ నిడరైరి. కోట సంరక్షించుచున్న రాజపుత్రులు తమ దురవస్థ నప్పుడు దెలిసికొని భయపడఁజొచ్చిరి. రాణా యదివఱకే తమ్ము విడిచిపోయి తనదారి తాను జూచుకొనుటచే వారు నిరుత్సాహులై ధైర్యలక్ష్మియే తమ్ము విడిచినట్లు కళవళ పడఁజొచ్చిరి. కోటదెస చూడ రాజుతోఁగూడ రాజ్యలక్ష్మి యాతావు విడిచి పోయినట్లు పాడు వారు చుండెను.

అందుచే రాజపుతు లేమియుం దోఁచక తడబడుచుండ నింతలో తుపాకిమందు కూరిన యొక నేలసోరంగ మంటుకొని చుట్టు ప్రక్కల ప్రదేశ మంతయు నాశనము చేసెను. ఒక ప్రక్క కోటగోడ గుభాలునఁ గూలెను. దానితో ముట్టడించుతురకలు, ముట్టడింపఁబడు రాజపుత్రులు వందలకొలఁది జచ్చిరి. తరువాత నుభయ సేనలు కలియం బడి సందడికయ్యముఁ జేసెను. అంతలో మరియొక నేలసొరంగ మంటుకొన, తురకలు రాజపుత్రులు మేనులు దెగి తుత్తునియలై మృతి నొందిరి. బ్రహ్మాండము వగులునట్లు మహాధ్వనితో నాసొరంగము లంటుకొనుటచే కోటగోడలు కూలిపోయెను. ఆ ప్రాంతమం దాకాశమంతయు దుమ్ముతోను పొగతోను నిండి యుండుటం జేసి మనుష్యుల కూఁపిరి సలుపదయ్యె. ఆకసమున కెగిరిన మనుష్యావయవశకలములు మట్టిముద్దలు రాతిముక్కలు వర్షము కురిసినట్లు క్రింద రాలఁజొచ్చెను. దుర్గసంరక్షణము చేయవచ్చిన వీరులలో వృద్ధులు కొందఱు ముందుగా వీర స్వర్గము నలంకరించుటచే సైన్యాధిపత్యము బాలుఁ డగు 'పుట్ట' మీదఁబడెను. ఆబాలుని తల్లి చిత్తూరునగరమునందె యాసమయమున నుండుటచేఁ దన కుమారుఁ డదివఱకుఁ గొన్ని దినముల క్రిందట నూతనముగా వివాహమాడిన బాలికపైఁ గలయను రాగాతిశయము చే జావునకు వెఱచి వెనుక దీసి యప్రతిష్ట తెచ్చునేమొ యని బెంగ బెట్టుకొనెను. కాని యావీరమాతకడుపునఁ బుట్టిన బాలకుఁడు కులమున కప్రతిష్ఠ రానీయలేదు. చిత్తూరుకోటలో దల నెరసిన వృద్ధులు, మీసములు రాని బాలురు, మహా యుద్ధములలో గాయములు దిని బ్రతికిన శూరులు, నంతఃపురము విడిచి యెఱుఁగని పుష్పకోమల లగు స్త్రీలు, సేవకులు మెదలగు నందఱు గెలువవలయు చావవలయు నను మాటమీఁద నిలువఁబడి యుండిరి. ఈ యుద్ధములోనే నూతనముగ భర్తను గోల్పోయిన యాబాలుని తల్లియు, వానిం గోరి వరించిన కొత్త పెండ్లి కూఁతురును కవచములఁ దొడుగుకొని, బల్లెములు బూని యుద్ధసన్నద్ధు లై మీవాఱు రాజపుత్రులతో గలిసి పోరుసలిపి వీర స్వర్గమును జూరగొనిరి. ఆఁడువాండ్రే యంత సాహస మొనర్చినపుడు మగ వాండ్రు వెనుకదీయక సమరోన్ముఖులైరి. చిత్తూరుముట్టడికథ యన్నిటి కంటే నెక్కువ దుఃఖకర మయినదియు నతిసాహసవంత మయినదియు నని చెప్పవచ్చును. అక్బరు తాను వసియించు కొండచివఱనుండి చూచుచు నడుమనడుమ మంట వెలుతురులోఁ గోటమీఁద నెవరైన మనుష్యులు నిలిచినట్లు గనఁబడినపుడు తనతుపాకితో వారిం గొట్టు చుండును. ఆదినమున 'సాయంకాలము నమాజు వేళ నక్బరు చక్రవర్తి మున్ను వేఁట కరణ్యమునకుఁ బోవునప్పుడు పట్టపు టేనుఁగు నెక్కి పెద్ద పులిరాఁకకై యెదురు చూచినట్లే పర్వత శిఖరమునుండి మెలకువతో నెవరినిమిత్తమో కని పెట్టి యుండెను.

అప్పుడు దుర్గ సంరక్షణము చేయుచున్న జయమల్లుఁడను రాజపుత్ర వీరుఁడు తనబంట్లకు గొంతయుపదేశము చేయవలసి బురుజుమీఁ దికి వచ్చెను. కొండమీదనుండి జాగరూకతతోఁ జూచుచున్న యక్బరు నకు వానియాకృతి చూచాయగఁ గనఁబడియె. కనఁబడినతోడనే చక్రవతి౯ సంగ్రమను తనతుపాకిని బట్టుకోని గురిజూచి కొట్టెను. వెంటనే జయ మల్లుఁడు ప్రాణములు విడిచి నేలఁబడియెను. అతఁడు వడుటయుఁ గోటలోపల సైనికులు జయమునం దాశ వదలుకొని కడపటి కృత్యమునుఁ జేయఁ బూనిరి. ఆఁడువాండ్రు బారులు కట్టి జోహారు సేయుటకు సిద్ధమైరి. మగవారు రక్తాంబరధారులై తాంబూలములు నమలుచు నూరేగింపు మహోత్సవమునకు జనునట్లు యుద్ధమునకుఁ జనిరి. పర్వత శిఖరమునందున్న యక్బరునకుఁ గోటలో పొగలు మంటలు గనఁబడి కమురుకంపు కొట్ట నారంభించెను. మొగలాయి 'సైనికులు తత్కారణము లెఱింగి రక్షణము బోత్తిగా లేకయున్న యుత్తరపువైపున నుండి లోపలఁ బ్రవేశించిరి. కాని యప్పటికినిఁ జిత్తూరు కోట పగతురచేఁ జిక్క లేదు. ఏలయన నిర్భయముగా నగ్నికుండములఁబడి మృతినొంది వీరపత్నుల యొక్కయు వీరమాతలయొక్కయు గన్యలయొక్కయు భత౯లు పుత్రులు తండ్రులు రక్తవస్త్రములు గట్టి కోటలోఁ బ్రవేశింపఁబోవు మొగలాయి సైనికుల హుమ్మని దలపడిరి. ఆ యుభయవీరులు పోరు సల్పిన తావునఁ బ్రత్యంగుళము రక్తముతోఁ దడిసి యడుగు జారుచుండెను. తురక సైనికులు చిత్తూరునగరమునందలి యిరుకు సందులును వంకరవీధులను జొచ్చి యడుగడుగునకు నొక్కొక్క రాజపుత్ర వీరుని వధియించుచుఁ గ్రమక్రమంబునఁ జొరుచుకొని లోలోపలకుఁ బోయిరి. ఆదుర్దినమున నెనిమిది వేలనుంది రాజపుత్ర వీరులు మృతులై రణరంగము నలంక రించిరి. మృతినొందిన యాఁడువాండ్ర బలగములో దొమ్మండుగురు పట్టపు దేవులు నైదుగురు రాజపుత్రికలు నుండిరి. ఆనాఁటితో చిత్తూరు యొక్క భాగ్యము కడముట్టెను.అది మొద లానగరము మీవారు రాజ్యమున కెన్నడు మరల రాజధానిగ నుండ లేదు.

అట్లు చిత్తూరునగరమును నిర్వీరముగఁ జేసి యక్బరుచక్రవతి౯ 1567వ సంవత్సగము మెయినెలలో నొక దినమున కోటలోఁ బ్రవేశించెను. మీవారు రాణా తరువాత నెన్నఁడు నాభయంకర బ్రదేశమునకు వచ్చి కాపుర ముండలేదు. మరల మీవారు దేశస్థులు పగతుర బారి బడకుండ దానిని సంరక్షించ లేదు. రాజస్థానకథావళిం జదివి మివారు రాజ్యము యొక్కయుఁ జిత్తూరునగరము యొక్కయు మహావైభవమును దెలిసికొన్న వారందఱుఁ జిత్తూరు యొక్క యీనాఁటి యవస్థం జూచిన పక్షమున మున్ను సకలైశ్వర్య సంపన్నమై బహుజన సంకులమైన యానగర మంత పాడుగ నుండుటకును రాజ్యలక్ష్మి కిట్లు వైధవ్యము గలుగుటకును కారణమేమని తలంపకపోరు. తలంచి విచారింపక పోరు. ఉదయసింగు హిరావళీ పర్వతములోనికిఁ బారిపోయి మరల నెన్నఁడు జిత్తూరురాక యాపర్వతముల సమీపముననే యుదయపుర మను పేర నొకపట్టణమును గట్టించి దానిని రాజధానినిఁ జేసికోని దేశమును పాలించుచు దనజీవితకాల శేషమును గడపెను. అందుచేతనే నేటికిని మీవారు రాణా యుదయపుర మహారాణా యను పేరం బిలువఁ బడుచుండును, ఉదయసింగు తనజీవిత కాలమంతయు మరలఁ జిత్తూరును బట్టుకొని విజయము నొందవలయు నని తలంచుచుండువాఁడు. అందు చేతఁ దనయుద్యమము నెరవేఱువఱకు గడ్డమును కత్తిరించుకొన నని యతఁడు ప్రతినఁ జేసెను. ఆ ప్రతిన నెరవేరక మునుపే యతఁడు లోకాంతరగతుఁడగుటం జేసి యాతని సంతతి వారగు నుదయ పుర మహారాణాలు నేటివఱకుఁ దమవంశకత౯వలెనే గడ్డములు కత్తి రించుకొనక యుందురు.

చిర కాలమునుండి మీవారు సంస్థానమునకు రాజధానియగు చిత్తూరు నగరమును నామావ శేషముగ నొనర్చి యక్బరు చక్రవర్తి చరిత్రము సంగ్రహముగా నిచ్చట దెలిపెదము. ఢిల్లీ పాదుషాలలో నక్బరు వంటి యోగ్యుఁడు గుణసంపన్నుఁడు మఱి యొకఁడు లేఁడని చెప్పవచ్చును. తండ్రి రాజ్యభ్రష్టుడై సింధు దేశపు టెడారులలోఁ జరియించుకాలమున 1542 సం౹౹రమున నమరకోట పట్టణమునందతఁడు జన్మించె ననియు జనకుని మరణానంతరము 1556 వ సం౹౹రమున బదునాలు గేండ్ల ప్రాయము వాఁడై యున్నపుడు సింహాసన మెక్కెననియు నిదివఱకుఁ జెప్పియుంటిమి, ఇతఁడు గద్దె యెక్కిన తోడనే షర్షా యొక్క సంతతి వారికి మంత్రియగు హేముఁడను హిం దువుఁడు తన స్వామి పక్షమున నభిమానము గలిగి మహాసేనం గూర్చుకొని యక్బరు మీఁదికి యుద్ధమునకు వచ్చెను. అక్బరును వానిగుండె కాయయు సంరక్షకుఁడు నగు బేరాముఖానును గలిసి హేమునిమీఁదిఁకి బోయి వాని నోడించి పట్టుకొనిరి. హేముని స్వహస్తముతోఁ జంపుమని బేరాముఖానుఁ డక్బరుతో జెప్పెను. అసహాయుఁ డై చెరలోనున్న దీనునిఁజంపుట యనుచిత మని యతఁ డట్టిపని కొల్లండయ్యె. బేరాముఖానుఁడు హేముని స్వహస్తముతో నరికిచంపెను. బేరాముఖానుఁ డక్బరును పుత్ర ప్రేమతో నాదరించి యుక్త వయస్కుడైన పిదప రాజ్యము నప్పగించెను. అక్బరు రాజ్యభారమును వహించి హిందువు లొక కన్నుగ మహమ్మదీయులు రెండవకన్నగ నెంచుకొని భరతఖండమును న్యాయముగఁ బాలించెను. ప్రజలంద ఱక్బరుని కేవలము ధర్మరాజని కొనియాడిరి. మహమ్మదీయు లని పక్షపాతము లేక హిందువులని క్రోధము లేక యిద్దఱను సమానముగ నమ్మియిరువురకు గొప్పగొప్ప యుద్యోగములు భేదము లేకుండఁగ నిచ్చెను. సేనాధిపతులు దేశాధిపతులు వానిక్రింద హిందువు లనేకు లుండిరి. రాజపుత్రునకుఁ దనకు మైత్రి హెచ్చునట్లు వారిపిల్లలం దాను 'బెం డ్లియాడి పట్టపు దేవులం జేసెను. ఈతని జ్యేష్ఠపుత్రుండును వాని యనంతరమున రాజ్యమునకు వచ్చినయతఁడునగు జహంగీరు చక్రవతి౯ యొక రాజపుత్ర స్త్రీ వలనఁ గలిగినకుమారుఁడే. రాజపుత్ర వీరులును దమయెడలఁ జక్రవతి౯ చూపు గౌరవమునుబట్టి తాముగూఁడజక్ర వతి౯కి విధేయులై చుట్టములై నెచ్చెలులై యవసరమగునప్పుడు తమ ప్రాణములనైన నడ్డము వేసి వాని ప్రాణమును గాపాడుచు వచ్చిరి. అక్బరు మిక్కిలి పండితపక్షపాతి. ఆచక్రవతి౯ యాస్థానమున అరబ్బీ పారసీ భాషలు నేర్చినపండితులే గాక సంస్కృతమును దేశభాషను నేర్చిన పలుపండితు లుండి యనేక బహుమానముల నందుచువచ్చిరి. అతనికి స్వమతమునందు గౌరవము దక్కినమతములందు నిరసనము లేదు. ఖురాను నేర్చిన మౌలవీలను క్రైస్తవమతబోధకులను బౌద్ధ పండితులను వేదాంతశాస్త్రజ్ఞులగు బ్రాహ్మాణులను పారసీమతస్థులను దనకోలుపునకు బిలిపించి వారిచే వాదములు చేయించి సర్వమతముల సారములం గ్రహించుచుండు వాఁడు. వానిని హిందువులు వేదాంతి యనియు క్రైస్తవులు క్రైస్తవుఁ డనియు మహమ్మదీయులు మహమ్మదీయుఁడనియు జెప్పుచుందురు. ఉపనిషత్తుల యెడ నక్బరునకుఁ గడు ప్రేమయని చరిత్రకారులు చెప్పుదురు. ఆయన వితంతు వివాహములు హిందువులలోఁ జేయింపవలయునని కొంత ప్రయత్నము చేసెను. ఘోరదురాచారమగు సహగమనమును దన దేశమునఁ జాల వఱకు మానుపించెను.

ప్రజలకు భాగముగానున్న పన్ను లనేకములు దొలగించెను.'రాజాటోటర్ మాల్' అను హిందువునకుఁ గొప్ప యుద్యోగమిచ్చి దేశమునందున్న యీనాం జిరాయితీ భూములను వాని చేత జాగ్రత్తగా కోలిపించి పంటనుబట్టి యాభూములకు పన్నులుగట్టించెను. పండిన పంటలో నాలుగవ వంతు చక్రవతి౯ పన్ను క్రింద గ్రహించుచుండును. అక్బరు చక్రవతి౯ విద్యావంతుఁడు మహావీరుఁడు లోక వ్యవహారములు చక్కగఁ దెలిసినవాఁడు. ఈతనివంటి చక్రవతి౯ నేటివఱకు హిందూదేశమునకు మరల రాలేదని జనులు చెప్పుకొందురు. ఆయన రమారమి యేఁబది సంవత్సరములు భరతఖండమును బాలించి సకల జనస్థవనీయుఁ డై క్రీస్తుశకము 1605 సంవత్సరమున లోకాంతరగతుఁ డయ్యెను.