రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము

రుక్మిణి యింటికిఁ బోవుట__గృహవర్ణనము__రాజశేఖరుఁడు గారు వచ్చి కచేరీచావడిలో గూర్చుండుట బంధుదర్శనము స్వహస్త పాకియైన వైశ్వదేవపరుఁడు.

సిద్ధాంతిగారి భార్యయు రుక్మిణియు బయలుదేఱి సోపానము లెక్కి వీధిపొడుగునను దేవాలయముదాఁక తిన్నగా నడిచి, అక్కడ నుండి కుడిచేతివంక నున్న వీధిలోనికి మళ్ళి కొంతదూరము పోయిన తరువాత, రుక్మిణి తూర్పు వైపు సందులోనికి రెండడుగులు పెట్టి నిలుచుండి వెనుక తిరిగి రెండుమాఱులు మెల్లగా దగ్గెను. ఆ దగ్గుతో సిద్ధాంతిగారి భార్యకూడ నిలుచుండి 'అమ్మాయీ! నేనుందునా!'ఆవి వెనుక తిరిగి పలికెను.

రుక్మి __మంచిది. సోమిదేవమ్మగారూ ! నాకొఱకయి మీరు చుట్టు తిరిగి యింటికి వెళ్ళవలసి వచ్చినదిగదా?

సోమి__ఎంత చుట్టు? నిమిషములో వెళ్ళెదను.

రుక్మి__పోయిరండి.

సోమి__బీదవాండ్రము, మా మీఁద దయ యుంచవలెను జుండీ.

రుక్మి__దానికేమి? వెళ్ళి రండి. అని నాలుగడుగులు నడచి మరల వెనుక తిరిగి "సోమిదేవమ్మగారూ! చెప్ప మఱచిపోయినాను. సాయంకాలము దేవాలయములోనికి వెళ్ళునప్పుడు మీరొక్క పర్యా యము వచ్చెదరు కాదా?"

సోమి__అవశ్యము. ఆలాగుననే వచ్చెదను. నేను పోయి వస్తునా?

అని సోమిదేవమ్మ నడచినది. పిద్ధాంతిగారు గాని, ఆయన పెద్దలుగాని యెప్పడును యజ్ఞము చేసినవారు కాకపోయినను, సోమి దేవమ్మ పుట్టినింటివంక వారిలో మాత్రము యజ్ఞము చేపినవారు బొత్తిగా లేకపోలేదు. సాక్షాత్తుగా ఆమె పితామహుఁడే యజ్ఞముచేసి యేటేట నొక్కొక్కటి చొప్పున మూడుపదుల మీఁద నాలుగు శ్రావణపశువులను బట్టి మఱి రంభాదులతో స్వర్గసుఖ మనుభవింపఁ బోయెను. సోమిదేవమ్మ తండ్రి యజ్ఞము చేయకపోయినను, తండ్రి యెంతో ధనవ్యయము చేసి సంపాదించుకొన్న పేళ్ళను మాత్రము పోగొట్ట నిష్టములేనివాఁడయి తన కుమారునకు సోమయాజులనియు, కుమార్తెకు సోమిదేవమ్మ యనియు నామకరణములు చేసెను.

రుక్మిణియు సందులో నూఱు బారలు నడచి, అక్కడ నుండి దక్షిణముగా తిరిగి, ఆ సందులో రెండు గుమ్మములు దాఁటి పెరటి దారిని మూడవయిల్లు ప్రవేశించెను.

రాజశేఖరుఁడుగారి యిల్లు ఆకాలపుటిండ్లలో మిక్కిలి సుందర మైనది. వీధి గుమ్మమునకు రెండు ప్రక్కలను రెండు గొప్ప అరుగులు కలవు. ఆ రెండు ఆరుగులకును మధ్యను పల్లముగా లోపలికిఁ బోవ నడవ యున్నది. ఆ నడవ మొగమున సింహద్వార మున్నది. ద్వారబంధపు పట్టెలకు గడపదాపున ఏనుఁగుతలమీద సింహము గూర్చుండి కుంభ స్థలములను బద్దలు చేయుచున్నట్లు చిత్రముగా చెక్కబడి యున్నది. ఇరుప్రక్కలనుండు నాసింహములయొక్క శిరో భాగములు మొదలుకుని గొడుగుబల్లవఱకును పువ్వులను కాయలను గల లత చెక్కఁబడియున్నది. ఈ కమ్ములకు పయిగా రెండు ప్రక్కలను కఱ్ఱ గుఱ్ఱములు వీధి వైపునకు ముందఱి కాళ్ళు చాచి చూచు వారిమీఁద దుముకవచ్చునట్లుగాఁ గానిపించును. ఈ గుఱ్ఱముల కాళ్ళకే శుభదినములందు మామిడాకుల తోరణములు గట్టుచుందురు. గుఱ్ఱముల రెంటికిని నడుమ నుండు గొడుగుబల్లమీఁద నడుమను పద్మ మును, పద్మముల కిరు పార్శ్వములను గుఱ్ఱములవఱకు చిత్రము లయిన యాకులను, పువ్వులనుగల తీఁగెయును చెక్కఁబడి యున్నవి. ఆ తీగపైని కాళ్ళు మోపి ఫలములను ముక్కుతో పొడుచుచున్నట్టు నడుమనడుమ చిలుకలు చిత్రింపబడి యున్నవి. వీధి తలుపులకు బలమయిన గ్రంధులు చేయఁబడి వాని పయిని సహిత మొకవిధమైన పుష్పలత మలఁచఁబడి యున్నది.

గుమ్మము దాటి లోపలికి వెళ్ళినతోడనే చావడి యుండెను. ఆ చావడి కెదురుగా పెద్ద కుండు ఒకటి యుండెను. వర్షము కురియు నప్పుడు నాలుగు వైపులనుండియు చూరునీళ్ళా కుండులోఁబడి వీధి చావడి క్రింద నుండు తూముగుండ వీధిలోనికిఁ బోవును. ఆ కుండు కుత్తరపవైపుననుదక్షిణపువైపునను ఒకదానికొకటి యెదురుగా రెండు చావళ్ళుండును. అందు దక్షిణపుది కచేరిచావడి. దానిలో వివాహాదుల యందు తాంబూలములకు పిలిచిన బంధువులను పెద్దమనుష్యులను సభ చేసి గూర్చుండఁగా, క్రింద బోగము మేళము జరుగుచుండును. ఇతర సమయములలో పెద్దమనుష్యులు చూడవచ్చినప్పడును, మధ్యాహ్నభోజన మయిన తరువాత పురాణ కాలక్షేపము జరుగునప్పుడును, శిష్యు లప్పుడప్పుడు చదువుకో వచ్చినప్పుడును రాజశేఖరుఁ డుగా రందు కూర్చుందురు. ఆ చావడికి రెండు ప్రక్కలను రెండు గదులు గలవు. ఆ చావడి దక్షిణపువైపు గోడకు పొడుగునను ఱెక్కల తలుపు లుండి, తీసినప్ప డెల్లను సభవారి చెమటలార్ప మలయ మారుతమును లోపలికిఁ బంపుచుండును. ఆ తలుపులకు వెనుక పంచ పాళియు, దాని వెనుక పలువిధములయిన పూలమొక్కలతో నేత్రము లకు విందుగొలుపు చిన్న దొడ్డి యుండెను. ఆ చావిడిలో మూడు గోడలకును నిలువెడెత్తునకు పయిని మేకులకు గొప్ప పటములు వేయఁబడియున్నవి. అందు దశావతారములు మాత్రమే కాక, కృష్ణుడు గోపికల వలువలు నెత్తికొనివచ్చి పొన్నచెట్టుమీఁదఁ గూర్చుండి వారిచేఁ జేతులెత్తి మ్రెుక్కించుకొనుచున్నట్టును, వెన్నలు దొంగిలినందుకయి తల్లి రోటను గట్టిపెట్ట దాని నీడ్చుకొనిపోయి మద్దులఁ గూ ద్రోచినట్టును, మరియు ననేకవిధముల కృష్ణలీలలు గల పటములును, కుమారస్వామి తారకాసురుని జంపుచున్నట్టును, పార్వతి మహిషాసురుని వధించుచున్నట్టును, శివుఁడు త్రిపురసంహా రము చేయుచున్నట్టును నున్న శివ సంబంధము లయిన పటములను, , విఘ్నేశ్వరుఁడు, సరస్వతి, గజలక్ష్మీ, చతుర్ముఖుఁడు మొదలుగాగల మఱికొన్ని పటములును గోడల నలంకరించు చుండును. ఉత్తరపు ప్రక్క చావడియు ఈ విధముగానే యుండును గాని, గోడ కొక్క గుమ్మము మాత్రమే యుండి అది తరుచుగా మూయబడి యుండును. ఈచావడిలో రెండుమూడు పాతసవారీ లెప్పుడును వేలాడఁ గట్టబడి యుండును. రాజశేఖరుఁడుగా రప్పుడప్పుడు గ్రామాంతరములకుఁ బోవునప్పుడును పెద్దమనుష్యు లెవ్వరయినఁ దఱుచుగా నెరువడుగునపడును ఉపయోగపడుచుండు క్రొత్త సవారి మాత్రము బురకా వేయఁబడి చావడిలో క్రిందనే పడమటిగోడ దగ్గరఱఁ జేర్పబడి యుండును. ఈ చావడి గోడకున్న తలుపు తీపి యుత్తరపు పంచపాళిలోనికి పోయినతోడనే దొడ్డిలో నుయ్యి యొకటి కనఁబడును. ఆ నూతిపయినుండు గిలకలు కీచుధ్వని చేయు చుండ నిరుగుపొరుగులవారు సదా నీళ్ళు తోడుకొని పోవుచుందురు. ఆ నూతికి పడమటివైపున ధాన్యము నిలవచేయు గాదెలు రెండు లోగిలిని చేరక ప్రత్యేకముగా గట్టింపఁబడి యున్నవి. నూతికి సమీప ముగా వీధిలోనికి పాణి ద్వార మొకటి యున్నది. ఇంతకు మునుపు రుక్మిణి వచ్చిన దాద్వారముననే ఆ దారినే యిరుగుపొరుగువారు వచ్చి నీళ్ళు తోడుకొని పోవుచుందురు. మఱియు మధ్యాహ్న సమయమున చుట్టుప్రక్కల నుండు స్త్రీలు వారిని చూడవచ్చునప్పడును, రాజ శేఖరుఁడుగారు కచేరిచావడిలోఁ గూర్చున్న కాలమున లోపలి యాఁడువారు వెలుపలికి వెళ్ళవలసినప్పడును, ఆ త్రోవనే వచ్చుచుఁ బోవుచుందురు.

లోపలి కుండునకు నాలుగు ప్రక్కలను పనసకాయలు చెక్కిన నాలుగు స్తంభము లున్నవి. వీధిచావడి కెదురుగా నుండు పడమటి చావడిలో లోపలికిపోవు నడిమిగుమ్మ మొకటి యున్నది, ఆ గుమ్మమున లోపలికిఁ బోవగానే చావడి యొకటి కనిపించును. ఆ చావడికి దక్షిణపువైపున గుమ్మమొకటి యున్నది. ఆ ద్వారమున లోపలికి వెళ్ళిన రాజశేఖరుఁడుగారు బరుండుగదిలోఁ బ్రవేశింతుము. గదిలో ను త్తరపు గోడ పొడుగునను దూర్పునుండి పడమటకు పందిరిపట్టె మంచము రాతి దిమ్మలమీఁద నాలుగు గాళ్ళను మోపి వేయఁబడి యున్నది. మంచమునకు చుట్టును దోమతెరయును జాలరును దిగవేయబడియున్నది. పందిరి స్తంభములకు నడుమను లక్క పూసిన కొయ్య పళ్ళెములను బరిణెలు నుండెను. పందిరికి మధ్యగా లక్కకాయలను, పువ్వులను గల చిలుకల పందిరి యొక్కటి వేలాడు చుండును. గోడలకు సుద్దతో వెల్ల వేయఁబడి యుండెను. గోడల పొడుగునను రుక్మిణియు, తల్లియు నోపికచేసి కట్టిన గోడసంచులు తగిలించబడి యుండెను. ఆ గోడ సంచులకు కొంచెము మీఁదుగ గుడ్డ చిలుకలు దారములతో త్రాళ్ళకు కట్టబడి గాలికి సుందరముగా కదలుచుండును. గోడకు పెద్ద మేకులు కొట్టి వానిమీఁదఁ బెట్టిన బల్ల మీఁద కొండపల్లి బొమ్మలును, లక్కపిడతలను గది కలంకార భూతముగా నుండెను. గోడనంచులు కొట్టిన మేకులకు దశావతార ములు మొదలయిన పటములు చిన్నవి వేయబడి యున్నవి. దక్షిణపు గోడకు శ్రీరాములవారి పట్టాభిషేకము తగిలింపఁబడి యున్నది. దానినే రాజశేఖరుఁడుగారు నిద్ర లేచిన తోడనే చూచి, ఆవల మఱి యొక వస్తువును జూతురు. గదికిఁ బయిని అందమయిన బల్లకూర్పు కూర్పఁబడి యుండెను. మంచమున కెదురుగా దక్షిణపుగోడ పొడుగునను గడమంచెమీఁద వరుసగా కావడి పెట్టెలు పెట్టఁబడి యున్నవి. ఆ పెట్టెలలో సాధారణముగా ధరించుకొను వస్త్రము లను నాగరలిపితో బంగాళా కాగితములమీద వ్రాయఁబడిన రాజ శేఖరుఁడుగారి సంస్కృత పుస్తకములును వేయఁబడి యుండెను. గదిలో పడమటిగోడతట్టున పెద్ద మందస మొకటి గట్టితాళము వేయఁ బడి యుండెను. ఆ మందసములోపలనున్న చిన్నతాళపు పెట్టెలలో నగలును పండుగ దినములలో ధరించుకొను విలువ బట్టలను రొక్కమును ఉండును. చీఁకటి రాత్రులలో దొంగల భయము విశేషముగా నుండునప్పుడు రాజశేఖరుఁడుగారు ఆ మందసముమీఁదనే పఱుపు వేయించుకొని పరుందురు. మందసమునకును కావడి పెట్టెలున్న గడమంచెకును మధ్యను దక్షిణపు వైపున గదిదొడ్డిలోనికి" బోవు మార్గ మొకటి కలదు. ఆ మార్గమున దొడ్డిలో ప్రవేశించినతోడనే విశాలమయిన చేమంతిమడి యొకటి పచ్చని పూవులతోను మొగ్గల తోను నేత్రోత్సవము జేయుచుండెను. దాని కెడమ ప్రక్కను గొంచెము దూరమున మల్లె తీగలు పందిరిమీద నల్లుకొని యకాల మగుటచే నప్పుడు పుష్పింపక పోయినను పచ్చని కాంతుల నీనుచు మనోహరముగా నుండెను.

రాజశేఖరుడుగారి పడక గది ముందఱి చావడిలో దూలము నకుఁ జిలుకపంజర మొకటి వ్రేలాడఁగట్టఁబడి యుండెను. అందులో నున్న చిలుక సదా "ఎవరువారు" "ఎవరువారు", "పిల్లి వచ్చె కొట్టు కొట్టు", "కూరోయి తోటకూర" మొదలగు మాటలను సహజ మధుర స్వరముతో పలుకుచుండును. ఆ దూలమునకే మఱికొంత దూరమున రామాయణము మొదలయిన తాటాకుల పుస్తకములు త్రాళ్ళతో వ్రేలాడఁ గట్టఁబడియుండెను. ప్రొద్దుననే నిద్రలేచి రుక్మిణి చిలుకను పంజరమునుండి తీసి చేతిమీఁద నెక్కించుకొని "చేతిలో వెన్నముద్ద మొదలుగాగల పద్యములను సహితము నిత్య మును నేర్పుచుండును. ఆ కాలములోఁ దఱుచుగా స్త్రీలు చదువుకొను నాచారము లేకపోయినను, రాజశేఖరుఁడుగారు తన కుమార్తె మీది ముద్దుచేత దానె రుక్మిణికి క్రొత్త పుస్తకమును ఆన్య సాహాయ్యము లేకుండ నర్ధముచేసికొను శక్తి గలుగునంతవఱకు విద్యను చెప్పెను. ఆమె స్వభావముచేతనే తెలివిగలదగుటచే విద్యకూడ దానికి సాయ మయి చిన్నతనములోనే యుక్తాయుక్త వివేకమును జ్ఞానమును కలది యాయెను. తండ్రి యామెకు చదువు చెప్పట చూచి యసూయచేత నిరుగుపొరుగులవారు చాటున గుసగుసలాడుకొనిరిగాని,రాజశేఖరుఁడు గారు ధనికు లగుటవలననేమియు బలుక సాహసింపక పోయిరి. ఆట్లని వారు బొత్తిగా నూరకున్నవారు కారు. పెద్దవాఁడని రాజశేఖ రుఁడుగారు గౌరవముతోఁ జూచుచుండెడి యొక యాప్తబంధుని మెల్లగా బ్రేరేపించి, ఆయన చేత ఆందఱును సభలో గూర్చండి యుండగా "నాయనా! మన యింట ఆఁడుపిల్లలను జదివించు నంప్ర దాయము లేదే, మన రుక్మిణి నేల చదివించెదవు?' శేఖరుఁడుగారు విద్యవలని లాభముల నెఱిగిన వాఁ డగుటవలనను, స్త్రీ విద్య యే శాస్త్రమునందును నిషేధింపఁబడియుండక పోవుటయు పూర్వపు పతివ్రతలందఱు విద్యావతులయి మండుటయునెఱిగినవాఁ డగుటవలనను ఆ వృద్ధుని వాక్యములను లక్ష్యము చేయక స్త్రీ విద్యా భ్యాసమున కనుకూలముగాఁ గొన్ని స్మృతి వాక్యములను జదివి మీ యభిప్రాయ మేమని సభలోనున్న వారి నడిగెను. వారందఱును మనసులో స్త్రీవిద్యయన్న నేవగించువారే యయినను రాజశేఖరుఁడు గారి యభిప్రాయము తెలిసిన పిమ్మట దానికి వ్యతిరి క్తముగా నేమియు జెప్ప నలవాటుపడినవారు కారు గావున స్త్రీవిద్యాభ్యాసమువలన గణనా తీతము లయిన లాభములు గలవని పొగడి రుక్మిణికి విద్య నేర్పు చున్నందునకయో రాజశేఖరుడుగారిని శ్లాఘించిరి.

చిలుక పంజర మున్నతావునుండి నాలుగుబారలు నడచిన తరు వాత పడమటింటిద్వారమున్నది. పడమటియల్ల విశాలమయి యేఁబది మంది బ్రాహ్మణులు భోజనములు చేయుటకుఁ జాలియుండును. ఇక గొంచెముసేపునకు భోజనములకు లేత రనఁగా వెళ్ళి చూచిన యెడల, మూరెడు మూరెడెడముగా రెండుగోడల పొడుగునను పీట లను, పీటలకు ముందఱ పిండి మ్రుగ్గుతో పెట్టిన పట్లును చాలుగా నుండును. పడమటింటి యీశాన్యమూలన గచ్చుతోఁగట్టిన దేవు నరుగు కలదు. ఆ యరుగుపయిని "భువనేశ్వర"మను దేవతార్చన సామానులను సాలగ్రామాదులను పెట్టు పెట్టె యుండును. ఆ పెట్టె మీఁదనే రాజశేఖరుడుగారు మడితో నిత్యమును పారాయణచేయు శ్రీమద్రామాయణము సుందరకాండను పెట్టఁబడియుండెను. రాజశేఖరుఁడుగారు స్నానముచేసి వచ్చి దేవునరుగుమందఱ పీటవేసికొని కూర్చుండి రామాయణమును పంచపూజయు చేసికొందురు. దేవు నరుగున కెదురుగానున్న తలుపుతీసికొని యావలకు వెళ్ళినచో నొక పెరటిలోనికి బోవుదుము. అక్కడ సున్నముతోను ఇటికలతోను కట్టిన తులసికోటయొకటి నాలుగయిదడుగుల యెత్తున నందమై యుండెను. ఆ కోటలోపల లక్ష్మితులసియు కృష్ణతులసియు శ్రద్ధాభక్తులతో బెంపఁబడుచుండును. ఆ సమీపముననే కొంచెము దూరమున తులసివనమును ఆవల నిత్యమల్లెచెట్టును వాని చేరువనున్న నందివర్ధ నపు చెట్టుమీఁద నల్లుకొన్న కాశీరత్నములను రాజశేఖరుడు నిత్యమును దేవతార్చనకయి పుష్పపత్రాదులను సమకూర్చుచుండును. ఆ పైని రుక్మిణియుఁ జెల్లెలును ప్రేమతో బెంచుకొనుచున్న బంతి చెట్లను బొగడ బంతిచెట్లును, చంద్రకాంతపుచెట్లును గోడ పొడుగు నను వరుసగా నుండును. పడమటింటి నంటియే దక్షిణపువైపున నున్న వంటయింటి దొడ్డిలోపల నరఁటిబోదెలు పిలకలతో నిండి యుండి చూపుపండువుగా నుండును. రాజశేఖరుడుగారు ప్రత్యహమును ఆ బోదె మొదలనె స్నానము చేయుదురు.

వెనుక చెప్పినచొప్పున రుక్మిణి స్నానముచేసి వచ్చి గోదావరి నుండి చెంబుతో దెచ్చిననీళ్ళను తులసికోటలోబోసి మ్రొక్కి, తడి బట్టలతోనే చుట్టును మూఁడు ప్రదక్షిణములు చేసి, లోపలికిఁ బోయి తడి బట్ట వదలి పట్టుబట్ట కట్టుకొని యెడమచేతితో గుంకుమ బరిణియు, రెండవ చేతిలో నక్షతలను బసుపును బియ్యపుపిండియునుగల గదుల పెట్టెయును బట్టుకొని వచ్చి, తులసికోటలో నంటియున్న ముందఱి వేదికమీద నీళ్ళు చల్లి చేతితో శుభ్రముచేసి బియ్యపు పిండితో పద్మములు మొదలయిన వింతవింతల మ్రుగ్గులను బెట్టుచు నడుమనడుమ జిత్రముగా గుంకుమతోను పసుపుతోనునలంకరించుచుఁ గూర్చుండి, మధుర స్వరముతో మెల్లగా, "లంకాయాగము"ను పాడుకొనుచుండెను.

ఈలోపుగా రాజశేఖరుడుగారు వెంటనున్నవారితో నానా విషయములను ముచ్చటించుచు నడుమనడుమ వారి కిఱ్ఱుచెప్పుల జోళ్ళచప్పుడులలో నడఁగిపోయిన మాటలను మరల నడుగుచుఁ బలువురతోఁ గలసి యింటికి వచ్చి, పాదరక్షలను నడవలో విడిచి యొకరొక రేవచ్చి కచేరీచావడిలో రత్నకంబళములమీఁదఁ గూర్చుం డగాఁ దామును దక్షిణపు గోడకానుకొని యెండలోనుండి నడచి వచ్చిన బడలికచేఁ బట్టిన చెమ్మట పోవ ను త్తరీయముతో విసరు కొనుచుఁ గూరుచుండిరి. అప్పడు నంబిరాఘవాచార్యుఁడు నామ ముల తిరుమణి బెత్తికలు లేవనెడమచేతితో నద్దుకొని చేతులు నలుపు కొనుచు రాజశేఖరుడుగారి మొగముమీఁద జూడ్కి నిగిడించి, "దేవర వారి కీనడుమ స్వామిమీఁద కొంచె మనుగ్రహము తక్కువగా నున్నది" అని యొకచిఱునవ్వు నవ్వి నిలువఁబడి బట్టలోనున్న గన్నేరుపూలతో మాలనుదీసి చేతిలోఁ బట్టుకుని "స్వామివారియందు బరిపూర్ణ కటాక్షముంచవలెను" అని వినయముతోపఁ బలుకుచు మెల్లగా హస్తమునం దుంచెను

రాజశేఖరుడుగారు భక్తితోఁ బుచ్చుకొని, "యీ మధ్య మన జనార్ధనస్వామివారికి జరగవలసిన యుత్సవము లేమయిన నున్నవా?' ఆని యడిగిరి,

రాఘ__పదియేను దినములలో మార్గశిర శుద్ధ చతుర్ధశినాఁడును, పూర్ణిమనాఁడును వరుసగా తిరుమంగయాళ్వారియెుక్కయు, తిరుప్పా ణాళ్వారి యొక్కయు తిరునక్షత్రములు వచ్చుచున్నవి. అప్పడు విశేషోత్సవములు జరగవలసియున్నవి. నెలదినములలో ధనుర్మా సము వచ్చుచున్నది. ఆ నెలదినములను స్వామికి నిత్యోత్సవము లను సంక్రాంతి దినములలో నధ్యయనోత్సవమును జరగవలసి యున్నవి. ధనుస్సులోనే పుష్యబహుళ ద్వాదశినాఁడు తొందరడి ప్పొడి యాళ్వారి తిరునక్షత్రము వచ్చుచున్నది. ఆ దినమున స్వామి యుత్సవముకన్నను విశేషముగా జరగవలెను.

రాజ__నిత్యమును స్వామికి బాలభోగమును నందాదీపమును క్రమముగా జర గుచున్నవా?

రాఘ-తమరు ప్రతిమాసమును దయచేయించెడి రెండు రూపాయలును బాలభోగమునకుఁ జాలకున్నవి, ఇప్పుడు స్వాము లధికముగా వచ్చుచున్నారు. నందాదీపము క్రిందఁ దమరు దయ చేయు రూపాయతో మఱియొక రూపాయను జేర్చి యొకరీతిగా జరుపు కొని వచ్చుచున్నాను. కాని నందాదీపములో మఱియొకరికి భాగ ముండుట నాకిష్టములేదు. స్వామికి బొత్తిగా వాహనములు లేవు. పొన్నవాహన మొక్కటి యుండెనా రేపటి యధ్యయునోత్సవములో నెంతయైన నిండుగా వుండును. అది యీ యేటికిఁ గాకపోయిన మీఁదటికైనను మీకే మాటదక్కవలెను. ముందుగా చెవిని వేసి యుండిన నెందునకయినను మంచిదని మీతో మనవి చేసినాను.

రాజ__మొన్న దేవాలయములో స్వాములలో స్వాములేమో పోట్లాడినారఁట.

రాఘ__ద్వారకా తిరుమలనుండి వచ్చిన స్వామి సాపాటుచేసి కూర్చుండియుండఁగా, పెంటపాడునుండి వేంచేసిన స్వామి పెరుమాళ సేవ చేసి వచ్చి కూర్చున్నారు, వారిద్దఱిలో నొకరు తెంగలె వారును ఒకరు వడహలెవారెను గనుక, నామము క్రింద పాద ముంచవచ్చును _ కూడదని మాట పట్టింపులు పట్టుకొన్నారు.

రాజ__ఊరకే మాటలతో సరిపోయినదా?

రాఘ__తరువాతఁ గొంచెము చేయి చేయి కలసినదిగావి ముదరనీయక నేనును నాతమ్ముఁడును అడ్డము వెళ్ళి నివారించినాము.

రాజ__మన జనార్ధనస్వామివారి కేమాత్రము మాన్యమున్నది?

రాఘ__ఏడుపుట్ల మాన్య మున్నదందురుగాని, అయిదు పుట్లు మాత్రము బోగమువాండ్రక్రింద జరుగుచున్నది. తక్కిన రెండుపట్ల భూమియు ఆర్చకులదిగాని స్వామిది కాదు,

రాజ__మొన్నజరిగిన స్వామియుత్సవములో బోగము మేళము రాలేదే :

రాఘ__వా రన్నియుత్సవములలోను రారు. రాజమహేంద్ర వరములోఁ గాపుర మున్నారుగనుక చిల్లర పండువులకెల్ల బండ్లు చేసి కొనివచ్చుట బహుప్రయాసము. ఒక్కస్వామి కళ్యాణదినములలో రథోత్సవమునాఁడుమాత్రము వత్తురు. అవ్పడు వారిబత్తెముక్రింద స్వామి ద్రవ్యములోనుండి నాలుగు రూపాయలు మాత్ర మిచ్చుట యాచారము.  ఇంతలో నెవ్వరో ముప్పది సంవత్సరముల వయస్సుగల చామనచాయగృహస్థు తెల్లబట్టలు గట్టుకుని కుడిచేతిలోనున్న పొన్నుకఱ్ఱ నాడించుచు, ముందఱ నొకకూలివాడు బట్టలమూటను నెత్తిమీఁదఁ బెట్టుకొని నడువ, నడవలోనుండి చావడిలోనికి చొరవగా నడచి వచ్చి, అచ్చట నిలువబడి, "ఓరీ! రామిగా! మూట లోపలికిఁ దీసికొనిపోయి యెవరినైనఁ బిలిచి రాజశేఖరుఁడుగారు పరుండు గదిలోఁ బెట్టిరా" అని కూలివానిని నియమించి, కూరు చున్నవారి నందఱిని త్రోచుకొనుచు నడుమనుండివచ్చి మున్నెంతో పరిచయము గలవానివలెనే తాను రాజశేఖరురుడుగారిముందఱ తివాచి మీద గూర్చుండెను. రాజశేఖరుఁడుగా రావఱ కెన్నఁడును అతని మొగమే యెఱుఁగక పోయినను పెద్దమనుష్యు డింటికి వచ్చినప్పుడు మర్యాదచేయకపోయిన బాగుండదని కొంచెము లేచి "దయచేయుఁడ"ని చేయి చూపి తాను గొంచెము వెనుకకు జరిగి చోటిచ్చి "యింటివద్ద నందఱును సుఖముగా నున్నారా?" యని కుశలప్రశ్నమునుజేసి మీరెవరని యడిగినఁ దప్పుపట్టుకొందరేమోయని సంశయించుచు వూరకుండిరి. అప్పడా వచ్చినాతఁడు తన పొడుముకాయను రాఘవా చార్యులవంక దొర్లించి యాతని పొడుముబుఱ్ఱను పుచ్చుకొని, మునుపు చేతిలోనున్న పట్టును బాఱవైచి క్రొత్తపట్టు పట్టి సగముపీల్చి రాజశేఖరుడుగారివంకఁదిరిగి "రాజశేఖరుడు గారు నను మఱచిపోయి నట్టున్నారు:" అనెను.

రాజ__లేదు లేదు.ఆని మొగమువంకఁ బాఱఁజూచిరి.

క్రొత్త__ఇంకను నానవాలు పట్టలేదు. మీరు నన్ను పది సంవత్సరముల క్రిందట రాజమహేంద్రవరములో రామమూర్తిగారి యింటి లోపలఁ జూచినారు. నేను వామరాజు భైరవమూర్తిని మన మందఱమును దగ్గఱ బంధువులము. మీ తల్లిగారి మేనత్తయల్లుఁడు మా మేనమామగారికి సాక్షాత్తుగా నొక వేలువిడిచిన మేనత్తకొడుకు. మొన్న మా అన్నగారు సాంబయ్యగారు మీయింట నెలదినములుండి వచ్చిన తరువాత మీరు చేసిన యాదరణనే నిత్యమును సెలవిచ్చుచు వచ్చిరి. వెళ్ళునప్పడు మీరు పెట్టిన బట్టలనుసహితము పెట్టెతీసి చూపి నారు. దానిని జూచి మన బంధువులలో నొకరు మీరింత యనుకూల మయిన స్థితిలో నున్నారని పరమానందభరితుఁడ నయినాను.

ఆమాటలు విని లోపలిగదిలోఁ బండుకొనియున్న యొక మన లాయన దగ్గుచు లేచివచ్చి "ఓరీ భైరవమూర్తీ ! నీవెప్పడు వచ్చి నావు?" అని యడిగెను.

బైర__ఓహోహో! ప్రసాదరావుగారా! మీరు విజయంచేసి యెన్నాళ్ళయినది?

ప్రసా__రెండు మాసములనుండి యిక్కడనే యున్నాను. బంధువని రాజశేఖరుని జూచిపోదమని వచ్చి యితనిబలవంతమునకు మారు చెప్పలేక యిక్కడఁ జిక్కుపడ్డాను. మన బంధువులలో రాజ శేఖరుఁడు బహుయోగ్యుడు సుమీ ! అని కూర్చుండెను.

రాఘ__తాతగారూ! మీకు రాజశేఖరుఁడుగా రెటువంటి బంధువులు ?

ప్రసా__ఇప్పడు మావాని బంధుత్వము విన్నారుగదా? వీని మేనమామ బావమఱది నాకుమార్తె యత్తగారి సవతితమ్ముఁడు.

ఈ ప్రకారముగా సంభాషణము జరుగుచుండఁగా లోపలినుండి స్త్రీ కంఠముతో "సీతా! సీతా! " అని రెండు మూఁడు పిలుపులు వినఁ బడినవి. అప్పడు రాఘవాచార్యు లందుకొని,"అమ్మాయీ సీతమ్మా" అని పిలచి, లోపల అమ్మగా రెందునకో పిలుచుచున్నారు అని చెప్పెను. అప్పడు నూతివైపు పంచపాళిలోఁ దన యీడుపడుచు లతోఁగూడి గవ్వలాడుచున్న యేడు సంవత్సరముల యీడుగల చామన చాయ పిల్ల పరికిణి కట్టుకొని కుడిచేతిలో పందెము వేయు గవ్వలను, ఎడమచేతిలో గళ్లుగీచిన సుద్దకొమ్మును బట్టుకొని 'వచ్చె వచ్చె నవి కేకలువేయుచు కాళ్ళగజ్జలు గల్లగల్లుమన చావడిలోనుండి పడమ టింటి గుమ్మమువైపునకుఁ పరుగెత్తుకొని వెళ్ళెను. ఆ చిన్నది రాజ శేఖరుఁడుగారి రెండవ కుమార్తె. ఆట్లు వెళ్ళి గుమ్మమున కీవలనే నిలు చుండి సీత-"అమ్మా! ఎందుకు పిలిచినావు?" అని యడిగెను. మాణిక్యాంబ__నాన్నగారితో వంటయినది స్నానమునకు లేవ వచ్చునని చెప్పు.

మాణిక్యాంబ రాజశేఖరుడుగారి భార్య. ఆమె రుక్మిణితో సమానమయిన తెలివి గలదియు విద్యనేర్చినదియుఁ గాకపోయినను, గృహకృత్యములను జక్కపెట్టుటయందును పాకము చేయుట యందును నిరుపమానమయిన ప్రజ్ఞ కలది: రూపమున చాలావఱకు పెద్దకుమార్తెను పోలియుండునుగాని మొగము కొంచెము ముదురు దిగాను దేహచ్ఛాయ యొకవాసి నలుపు గాను కనబడును. ఆమె ముప్పదినాలుగేండ్ల వయస్సు కలదయ్యును దూరముననుండి చూచుటకు చిన్నదానివలెనే యుండును.

అంతట సీత మరలఁ జావడిలోనికి బరుగెత్తుకొని వచ్చి, నాన్నగారూ అమ్మ స్నానమునకు లెమ్మను చున్నది" అని చెప్పి యెప్పటియట్ల గవ్వలాడుటకయు నూతి పంచ పాళిలోనికిఁ బోయెను.

రాజ__ప్రసాదరావుగారూ! మీరు స్నానము చేయుదురేమో నూతిదగ్గఱకుఁ బొండి. భైరవమూర్తిగారూ! గోదావరికి వెళ్లెదరా ? లేక నూతియొద్దనే నీళ్లు పోసికొనెదరా ?

భైర__కార్తిక సోమవారము గనుక గోదావరికే వెళ్లెదను.

అప్పుడక్కడ నున్నవారందఱును లేచి, రాజశేఖరుడుగారి యొద్ద సెలవు పుచ్చుకొని ఎవరిండ్లకు వారు వెళ్ళిరి. రాజశేఖరుఁడు గారును పడమటింటిలోనికి నడచిరి. లోపల సానమీఁద గంధము తీయుచున్న మాణిక్యాంబ మట్టియల చప్పుడుతో పడమటింటి దొడ్డి తలుపుకడకు నడచి, యొకకాలు గడప కీవలను రెండవకాలు పంచ పాళిలోను బెట్టి, కుడిచేతితో ద్వారబంధమును బట్టుకొని నిలువఁబడి "రుక్మిణీ! బాబయ్యగారు స్నామునకు వచ్చినారు; వేగిరము వచ్చి నీళ్ళందిమ్ము" అని కేకవేసెను. ఆ పిలుపు విని, దేవతార్చనకుఁ బూలు గోయుచున్న రుక్మిణి 'వచ్చుచున్నాను' అని పలికి తొందరగా రాగి హరివాణముతో నిత్యమల్లిపుష్పములను తులసిదళములను దెచ్చి దేవున కరుగుమీఁద బెట్టి తండ్రిగారికి నీళ్ళిచ్చుటకయి వంటయింటి దొడ్డిలోనికిఁ బోయెను. మాణిక్యాంబ కంచుగిన్నెలలో గంధాక్షతలను గూటిలోనున్న యద్దమును విభూతిపెట్టెను గొనివచ్చి దేవు నరుగు వద్దనున్న పీటదగ్గఱఁ బెట్టినది. తోడనే లోపలినుండి నలువది యేండ్లు దాఁటిన విధవ యొకతె పిడిచి కట్టుకొనిన తడిబట్ట చెఱఁగు నెత్తిమీఁది నుండి రానిచ్చి మునుఁగు వేసికొని, పొయిలోని బూడిద నొసటను బొట్టు పెట్టుకొని వెండిచెంబుల జోటితో మడినీళ్ళనుదెచ్చి పీట యొద్ద నుంచెను. తరువాత రాజశేఖరుఁడుగారు స్నానముచేసి, జుట్టుతుడుచు కొని కొనలు ముడివైచుకొని, అప్ప డాఱవేపిన మడిబట్టను గట్టు కొని వచ్చి, దేవు నరుగుముందఱనున్న పీటమీఁద గూరుచుండి యాచమనము చేసి, విభూతిపండు కొంచెము చిదిపి నీళ్ళతో దడిపి చేతి యంగుష్టమును కనిష్టకయుఁ దప్ప తక్కిన మూడువేళ్ళతోను నొసటను భుజములను కంఠమునను కడుపునను ఱొమ్మునను రేఖ లను తీర్చి, భువనేశ్వరము తాళము తీసి విగ్రహములను సాలగ్రామ ములను పళ్ళెములోనిడి మంత్రములు చదువుచు దేవతార్చనమున కారంభించెను. ఇంతలో తక్కివారందఱును స్నానము చేసివచ్చి గోడల పొడుగునను పీటలమీఁద గూరుచుండిరి.

భోజనమునకు రావలసినవా రందఱును లోపలికి వెళ్ళిన తరు వాత మాణిక్యాంబ మడి విడిచి నడిమి తలుపు వేసివచ్చి పడకగదిలో కూరుచుండి తమలపాకులు చుట్టుచుండెను. ఇంతలో వీధి తలుపు వద్ద "రాజశేఖరుడుగారూ" అని పిలుపుమీఁద పిలుపుగా పొలము కేకలు వలె నిరువది కేకలు వినఁబడెను. 'వచ్చె వచ్చె'నని లోపలినుండి పలు కుచు మాణిక్యాంబ వచ్చులోపలనే, కేకలతో గూడ తలుపుమీఁద దబ దబ గుద్దులు వినఁబడెను. ఆమె వెళ్ళి తలుపు గడియ తీయునప్పటికి నుదుట దట్టముగాఁ బెట్టిన విభూతి చెమ్మటతోఁ గలిసి చప్పిడిదౌడ లకు వెల్లవేయఁ జెవులకుండలము లుయ్యాలలూగ ముడుతలు పడి యున్న ముసలి మొగమును అంగవస్త్రముతోఁ జేర్చి చుట్టిన బట్టల నందునుండి కనఁబడు తెల్లని జుట్టగల తలయును, లోపలి నీరు కావి ధోవతులపై నున్న దర్భాసనముచే లావుగాఁగనఁబడు కృష్ణాజినపచుట్ట గల మూపులను, వీపునుండి కుడిభుజముమీఁదుగా వచ్చిన కృష్ణాసనపు త్రాడుకొనను గట్టబడ్డ రాగిజారియును నారసంచియుఁ గల యెండు ఱొమ్మును గల నల్లని పొడుగయిన విగ్రహ మొకటి ద్వారబంధము పొడుగునను నిలువఁబడి యుండెను. తలుపుతీయఁగానే యా విగ్ర హము తిన్నగా పడమటింటి వైపునకు నడచి లోపల రాజశేఖరుఁడు గారికెదురుగా నిలవబడెను.

రాజ__శాస్త్రులుగారూ! మీదేయూరు ?

శాస్త్రి__మాది కానూరగ్రహారము. మాయింటిపేరు బులుసు వారు; నా పేరు పేరయ్యసోమయాజులు. మీకీర్తి జగద్విఖ్యాత మయినది. పదిమంది బ్రాహ్మణుల కింతయన్నము పెట్టినను సంభావన ఇచ్చి నను భూమిమీద సార్ధకజన్మము మీదికాని నా వంటి వ్యర్థుని బ్రతుకెందుకు?

రాజ__కార్తిక సోమవారము.మీరు రాత్రిదాక నుండెదరా?

సోమ__పెద్దవాఁడ నయినాను. ఇప్పుడుండలేను.

రాజ__సోమయాజులుగా రెండఁబడి నట్టున్నారు. అట్లయిన వేగిరము నూతి దగ్గఱ నాలుగుచేదలనీళ్ళు పోసికొని రండి.వడ్డన యవుచున్నది.

సోమ__మీ భోజనములుకానిండు. నాదొక్క మనవియున్నది. నాకు స్వహస్తపాకము కావలెను. పొయ్యి కొంచెము గోమయముతో శుద్ధిచేసి నాలుగు వస్తువులను అమర్చిన యెడల స్నానముచేసి వచ్చి పాకము చేసికొనెదను.

రాజ__వేఱేపొయ్యిలేదు. మీరు దయచేసి మా పాకములోనికే రావలయును.

సోమ__నాకు స్త్రీపాకము పుచ్చుకోనని నియమము.మీయింట వంటచేయువారు పురుషులేకదా ?

రాజ__మా పినతల్లి కుమార్తె వంట చేసినది. మా యింట నెప్పడును స్త్రీలే వంటచేయుదురు.  సోమ__అయ్యో ! స్త్రీ పాకమే కాకుండ నియోగిపాకము కూడ నేనెట్లు పుచ్చుకొందును? కొంచె మత్తెసరు పెట్టించిన నేను వచ్చి దింపుకొనెదను.

రాజ__నేఁడు సందర్భపడదు. ఈ పూఁట మీరు వేరే యొక్కడకయిన విజయం చేయవలెను.

సోమి__(కొంచెము సేవనుమానించి)నే నెఱుఁగుదును. మీది మొదటినుండియు శిష్ట సంప్రప్రదాయము__మీ తాతగారెంతో కర్మిష్టులు; మీతండ్రిగారు కేవలము బ్రహ్మవేత్త, మీయింట నాకభ్యంతరము లేదు గాని యొకచోట భోజనముచేసినానన్న మఱియొకచోటనుగూడ నాలాగుననే చేయుమందురు. నేనిక్కడ భోజనము చేసినమాటను మీరు రహస్యముగా నుంచవలెను. కార్తిక సోమవారము గనుక గోదావరికిఁ బోయి నిమిషములో స్నానముచేసి వచ్చెదను.ఇంతలో వడ్డనకానిండు"

అని పేరయ్యసోమయాజులు కృష్ణాజినమును నారసంచియు నట్టింటఁబెట్టి గోదావరికిఁ బోయి స్నానముచేసివచ్చి, కృష్ణాజినమును చావడిలో క్రిందఁబఱచి దానిమీఁద దర్భాసనము వేసికొని కూర్చుండి. గోముఖములోఁ జేయిదూర్చి లోపల రుద్రాక్షమాలను ద్రిప్పుచు కన్నులుమూసికొని జపముచేయ నారంభించెను. ప్రసాదరావు నల్ల మందువాఁడనని తొందరపడుటను వడ్డించియున్న యన్నమును కూర లను చల్లారిపోవుటను జూచి లోపల విస్తళ్ళముందఱఁ గనిపెట్టు కొని యున్నవారు లేచివచ్చి పలుమాఱు పిలువఁగాబిలువఁగా సోమ యాజులు రెండుగడియలకు మౌనముచాలించి లేచివచ్చి విస్తరి ముందఱఁ గూరుచుండెను. అప్పుడందఱును పరిషేచనములుచేసి భోజనముచేయ మొదలుపెట్టిరి.

రాజ__రాజమహేంద్రవరమునుండి శుభలేఖ తీసికొనివచ్చిన నీళ్ళకావడి వెంకయ్యజాడ లేదు. ఎక్కడఁ గూర్చున్నాఁడు?

వెంక__అయ్య! అయ్య ! ఇదిగో సోమయాజులుగారి వెనుక మూల విస్తరివద్దఁ గూరుచున్నాను. సోమ__ఈ పాకము దివ్యముగా నున్నది. దీనిముందఱ నలభీమపాకములెందుకు ?

వెంక__సోమయాజులుగారూ! నిన్న సత్రములో వండిన బీరకాయ యింతరుచిగా లేదు సుండీ!

రాజ__ఏ సత్రము?

వెంక__నిన్న రాజమహేంద్రవరములో నొక కోమటి యింట గృహప్రవేశమునకు సంతర్పణ జరిగినది. బొల్లి పేరయ్యగాఁడు వంట చేసినాఁడు. అక్కడ సోమయాజులుగారును నేనును ఏకపఙ్క్తి నే కూరుచున్నాము.

ఈ ప్రకారముగా నన్యోన్యసంభాషణములు గావించుకొనుచు భోజనముచేసి యందఱును పడమటింటిదొడ్డిలో చేతులు కడుగుకొని తేన్చుచు బొజ్జలు నిమురుకొనుచు వచ్చి చావడిలోఁ గూర్చుండిరి. సోమయాజులుగారు మొట్టమొదట నాలుగు దినము లుండఁదలఁచు కొనియే వచ్చినను, భోజన సమయమున జరిగిన ప్రసంగమును బట్టి నిలువ మనసొప్పక సంభావనను సహిత మడుగకయే వెంటనే తాంబూలమును బుచ్చుకొని నడచిరి.