రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/పదునేనవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునేనవ ప్రకరణము


రాజశేఖరుఁడు గారు స్వగ్రామమునకుఁ బోవుట__సుబ్రహ్మణ్యము వివాహము__సీత వివాహము__రాజశేఖరుఁడుగారు తానుబడిన కష్టములవలన కృత్యమును నేర్చుకొని సుఖముగా జీవనము చేయు చుండుట.

మఱునాఁడు రాజుగారి యుత్తరువుప్రకారము రాజశేఖరుఁడు గారు సభకు వచ్చినప్పుడు, కృష్ణజగపతి మహారాజుగారు తన సభికులలో నొకరిని బిలిచి రూపాయలసంచులను రెంటిని తెప్పించి ముందు బెట్టి 'మీ రీ ధనమును బట్టుకొని రాజశేఖరుఁడుగారితో ధవళేశ్వరమునకుఁ బోయి గృహమును మాన్యములను విడిపించియిచ్చి ర'డని యాజ్ఞాపించి అవిగాక మఱి నాలుగువందల రూపాయలను రాజశేఖ యఁడుగారికిచ్చి 'మీ రీసొమ్ముతోనే సీతయొక్కయు సుబ్రహ్మణ్యము యొక్కయు వివాహములనుజేసి వచ్చుబడికి మించిన వ్యయ మెన్నఁడును జేయక సుఖజీవనము చేయుచుండుఁ' డని హితబోధచేసి వారికి సెలవిచ్చి పంపిరి. రాజుగారివద్ద సెలవు పుచ్చుకొని రాజశేఖరుడుగారు భీమవరమునకు వెళ్ళునప్పటికి, జగ్గంపేటనుండి వచ్చి యింటికడ నెవ్వరో బంధువులు కాచియున్నారని సమాచారము తెలిసెను. ఆ మాట విని వేగిరపడి యిల్లు చేరఁగా వీధియరుగుమీఁద నొక ముసలి బ్రాహ్మణుఁడు కూరుచుండి యుండెను. రాజశేఖరుఁడుగా రాయనను జూచి మీరెవరని ప్రశ్నవేయఁగా, తమ యింటిపేరు భావరాజుగా రనియు తనపేరు సూర్యనారాయణ యనియు జెప్పి 'రాజశేఖరుఁడు గారు మీరేకారా' యని ప్రశ్నవేసెను.

రాజ__అవును, మీ రేమిపనిమీఁద వచ్చినారు?  సూర్య__మీ యింటి కీనడుమ సుబ్బరాయఁ డనుచిన్నవాఁడు వచ్చినాఁడు అతఁ డెక్కడనున్నాడు?

రాజ__ఆపేరుగల చిన్నవాఁడెవ్వఁడును మాయింటికి రాలేదు.

సూర్య__మీ కొమార్తెను దొంగ లెత్తుకొనిపోయినప్పుడు మా గ్రామమునుండి తీసికొని వచ్చినాఁడు. అతఁడు వేంకటేశ్వరుల మ్రొక్కును బట్టి తల పెంచుకొన్నాఁడు; మిక్కిలి చక్కనివాఁడు;ఒక రాజుతోడఁ గూడ బయలుదేఱి మీయింటికి వచ్చెదనని మాతోఁ జెప్పి నాడు: చిన్నతనములో మీవద్ద విద్య నేర్చుకొన్నాడట!

రాజ__అతనితో మీకేమి పని యున్నది?

సూర్య__మా యింటియొద్ద గొన్నిదినములున్నాఁడు; అతని రూపగుణసంపదను జూచి యతనికి నాకొమార్తె నిచ్చి వివాహముచేసి, నాకు పుత్రసంతానము లేదు గనుక అతని నిల్లఱిక ముంచుకోవలెనని నిశ్చయించుకొన్నాము.

అనిన తరువాత రాజశేఖరుఁడుగారు రుక్మిణి సుబ్బరాయఁడను పేరున పురుషవేషము వేసికొనియుండుట లోనుగాఁగల వృత్తాంతము నంతను వినిపించి, యాచిన్నదానిని తన కుమారుడైన సుబ్రహ్మణ్యమునకు జేసికొనియెదని వాగ్దానము చేసిరి. అంతట సూర్యనారాయణ గారు పెన్నిధి దొరికిన పేదవానివలె పరమానంద భరితుడై రాజశేఖరుడుగారియొద్ద సెలవు పుచ్చుకొని వెంటనే తన గ్రామమునకుఁ బోయి భార్యను కుమార్తెను వెంటబెట్టుకొని మఱునాఁడు మధ్యాహ్న మునకు మరలవచ్చెను. ఆ దినముననే రాజశేఖరుఁడుగారు చల్లపాటు వేళ బండ్లుచేసికొని సకుటుంబముగా బయలుదేరి, రెండుమూడు దిన ములలో సూర్యనారాయణ గారితోఁ గూడ రాజమహేంద్రవరముచేరి, ఆక్కడ రామమూర్తిగారి లోపల రెండు దినములుండి, వారికడ దాచిన పాత్రసామగ్రిని దీసికొని వారినిగూడ వివాహమునకై వెంటఁ బెట్టుకొని సుఖముగాఁ బోయి ధవళేశ్వరము ప్రవేశించిరి.

పెద్దాపురమునుండి వచ్చిన కృష్ణజగపతి మహారాజుగారి సభికుఁడు రాజశేఖరుఁడుగారికి మాన్యములను గృహమును విడిపించి యిచ్చి, మరల దన ప్రభువుగారి యొద్దకు పోఁగోరఁగా రాజశేఖ రుఁడుగా రాయనను బహువిధముల బ్రతిమాలుకొని కొమారుని యొక్కయు కొమార్తె యొక్కయు వివాహములు జరుగువరకు నిలుచు నట్లొడబఱిచిరి. రాజశేఖరుఁడుగారు మరల గ్రామమునకు వచ్చి మాన్యములు వదలించుకొని ధనికులయి యున్నారన్నవార్త విన్న తోడనే బీదతనము వచ్చినప్పుడు మొగముచాటు వేసిన పూర్వపు స్నేహితులందఱును పెల్లగిలి రాసాగిరి. మున్నుపిలిచినను పలుకని యాశ్రితకోటిలోని వారందఱును దినమును కారుపర్యాయము లింటి చుట్టును దిరుగ నారంభించిరి; తొల్లి చూడమనసయినను గనబడని భృత్యవర్గము జీతబత్తెములులేకయే సదా గుమ్మమువద్ద నిలువఁ జొచ్చెను. రామశాస్త్రియు సిద్ధాంతియు వచ్చి ముఖస్తుతులయందుఁ దమకుఁగల పాండిత్య ప్రకర్షమును మునుపటికంటె ద్విగుణముగా బ్రకటించుచు వచ్చిరిగాని, తమ విద్యాసారస్యమును గ్రహించి యక్షర లక్షలిచ్చెడి మునుపటి యౌదార్యమును రసికత్వమును రాజ శేఖరుఁడుగారియం దప్పడున్నట్లు వారికి కనఁబడలేదు. వారిలో సిద్ధాంతి తనమీఁద రాజశేఖరుఁడుగారికి కోపమువచ్చినదేమో యను కొని తదనుగ్రహమును మరలఁ బడయఁగోరి, నారాయణమూర్తి తన యొద్ద దాచిపెట్టిన దామోదరయ్యయొక్క నగలపెట్టె నొక కూలివాని చేత మోపించుకొనివచ్చి రాజశేఖరుఁడుగారి కొప్పగించెను; మఱియు రాజశేఖరుఁడుగారికిఁ దెలియవలయు నని బంధువుల ముందరను మిత్రులముందరను ఆయనను కొనియాడఁజొచ్చెను; సుబ్రహ్మణ్యము జాతకమంత జబ్బుది లేదన్న నోటనే యిప్పుడు మరల మారకదశ తొలగిపోయినది, కాబట్టి దానియంతటి దివ్యజాతకము లోకములో మఱియొకటి లేదని పొగడ దొడంగెను. ఆ సంగతి తెలిసికొని బీద తనము వచ్చినప్పుడు పిల్లనియ్యమన్నవారే యిప్పుడేలాగుననైన దమ కన్యలను సుబ్రహ్మణ్యమునకుఁ జేసికొండనియు, నాలుగు వందల రూపాయలు వరదక్షిణ యిచ్చెదమనియు రాజశేఖరుడుగారి చుట్టును దిరిగి యనుసరింప మొదలుపెట్టిరి. వారు భాగ్యవంతులను అల్లునకు కానుకలను కట్నములను పెట్టువారును అయినను, వారి పిల్లల నెవ్వరిని జేసికోక రాజశేఖరుఁడుగారు కొమారునకు సూర్య నారాయణగారి కొమార్తె మహాలక్ష్మినిఁ జేసికొనుటకే నిశ్చయించిరి.

తరువాత నొక శుభముహూర్తమున ముందుగా రాజశేఖరుఁడు గారు కుమారుని వివాహము చేసిరి; బోగమేళము లేకపోయినయెడల వివాహము శోభగాంచదని యెందఱు చెప్పినను, వారి మాటల నాద రింపక పాతివ్రత్యమును బోధింపఁదగిన యుత్తమదినములలో లంజల తోడిపొత్తు కూడదని భోగస్త్రీల పాటలకై విశేషధనమును వ్యయ పెట్టక, యల్పధనముతో గాయక శిఖామణులచేత కర్ణరసాయనముగా హరికీర్తనలు పాడించిరి. సదస్యమునాఁడు సంభావన సమయమున నపాత్రదానమున కొప్పుకొనక యోగ్యులును పండితులునగు కొందఱినే యథాశక్తిని సత్కరింపనెంచి, వచ్చిన బ్రాహ్మణుల కందఱికిని సంభావన యియ్యకపోయిన సభవారిలోఁ దలవంపుగా నుండునవి చెప్పవచ్చిన బంధువులతో వివాహాది దినములలోఁ దలయెత్తుకొని దిరిగి యప్పులపాలై తరువాత నెల్లకాలమును దలవంచుకొని తిరుగుటకంటె నీయైదు దినములను తలవంచుకొని యావలఁ దలయెత్తు కొని తిరుగుటయే మంచిదని చెప్పి తమ యిష్టప్రకారమే జరిగించిరి; వీధులుగట్టి సత్రములు వేయుట వృధావ్యయమని బంధువులు మిత్రులు నైనవారిని మాత్రమే భోజనమునకుఁ బిలిచి యాదరించిరి; ఈ ప్రకారముగాఁ జేయుటచేత మొదట నుద్దేశించుకొన్న దానికంటెను వెచ్చము తక్కువ పడినందున, మిగిలిన యాధనము పెట్టి కోడలి కాభరణములు చేయించిపెట్టిరి.

కొమారుని వివాహమైన మూడవదినముననే సీతను మేనల్లుఁడైన శంకరయ్యకిచ్చి రాజశేఖరుడుగారు పెండ్లి చేసిరి. ఈ వివాహమును సమస్త విషయములయందును ముందుగా జరిగిన వివాహమునే పోలియున్నది. ఈ రెండు వివాహములయందును బూజము బంతులు మొదలగు దురాచారములను మోటుతనముగా నుండు వేడుకలును నాకబలియైన తరువాత బుక్కాయును వసంతమును చల్లు కొనుచు స్త్రీలుఁబురుషులునను భేదమును పాటింపక విచ్చలవిడిగా నల్లరిచేయు చెడువాడుకయును మాన్పబడినవి; కంటితనము గ్రుడ్డి తనము లోనుగాఁగల యంగవైకల్యములచేతఁ బాటుపడ నసమర్థులయిన వారును స్వదోషమువలనఁగాక దైవకృతమువలన హీన దశకు వచ్చిన దరిద్రులును సత్ప్రవర్తనముకలిగి సకల విద్యావిశారదులయియున్న పండితులును భగవద్భక్తులను మాత్రము ధన సత్కారమును బొందిరి. ఈ రెండు వివాహములను విధ్యుక్తముగా జరిగిన పిమ్మట నొక దినమున పెద్దాపురమునుండి వచ్చిన సభికుఁడు రాజశేఖరుఁడుగారి కడకు వచ్చి తాను శీఘ్రముగా వెళ్ళవలసియున్నది గనుక సెలవిచ్చి పంపవలయునని యడిగెను.

రాజ__నా ముద్దు చెల్లించి యీ పది దినములను మీరున్నందునకు మనుగుడుపు లయినదాఁక కూడనుండి నా మనస్సును సంతోష పెట్టి మఱి వెళ్ళవలయును.

సభి__ఇఁక నన్ను మన్నించి విడిచిపెట్టవలయును. మనము బయలుదేఱి యిచ్చటికి వచ్చుటకుముందు మా యూరికి విచ్చేసి యున్న యాచార్య స్వాములవారు శ్రీముఖమును బంపినప్పుడు వెంటనే రూపాయల నియ్యక తిరస్కరించినవాఁడని మా మేనల్లున కేమో యాంక్షపత్రిక వ్రాసి నారనియు,మూడు దినములనుండి మావాని యిల్లెవ్వరును తొక్కి చూడకున్నారనియు, మంగలవాఁడు క్షౌరము చేయుటకుఁగాని చాకలవాఁడు బట్టలుదుకుటకుఁగాని రాకున్నా రనియు, ఇప్పడే యు త్తరము వచ్చినది. స్వాములవారు వెలివేసి నప్పుడు పొరుగువారు నిప్పయినను బెట్టరు; నూతిలో నీళ్ళయినను తోడుకోనియ్యరు.

రాజ__సన్యాసు లెప్పుడును కామక్రోధాదులను వర్ణించి పరమశాంతులై యుండవలసినవారే: ఇంత యల్పదోషమున కంత క్రూరశిక్షను విధింతురా?

సభి__సన్యాసులన్న పేరేకాని వారికున్నంత కోపము ప్రపంచములో నెవ్వరికి నుండదు. ఇదియేమిచూచినారు? ఈ స్వాముల వారే క్రిందటి సంవత్సరము శ్రీకాకుళములో భిక్షకు వెళ్ళిన యింటి యజమానుని భార్యతో నేమో సరసమాడఁగా మగఁడు విని సన్యాసి నేమైన నన్న నపరాధమని యూరకుండి భిక్షానంతరము దక్షిణ యియ్యకపోగా ఆతనిని మూఁడు మాసములు వెలివేసి యేఁబది రూపాయలు పుచ్చుకొని ప్రాయశ్చిత్తము చేయించి తరువాత మతములో కలుపుకొన్నాడు. నేను వెంటనే వెళ్ళి మావానిచేత నపరాధ క్షమార్పణము కోరించినఁగాని కార్యము సుష్టుపడదు. కాబట్టి నన్ను బలవంతపెట్టక యీ పూటనే పంపివేయవలయును.

రాజ__మీరింతగా సెలవిచ్చుచున్నప్పుడు మిమ్మిఁక నిర్బంధ పెట్టఁగూడదు.

అని రాజశేఖరుడుగా రాయనకు క్రొత్తబట్టలు కట్టబెట్టి సమస్త విధముల గౌరవించి, కృతజ్ఞతాసూచకముగా ప్రభువువారితో మనవిచేయవలసిన సంగతులను దెలిపి యాయనను బంపివేసిరి. తరువాత వివాహ నిమిత్తము వచ్చిన బంధువు లెవరి యూళ్ళకు వారు పోయిరి. ఆ సభికుఁడును పెద్దాపురము చేరినతోడనే తన విషయమై రాజశేఖరుఁడుగారుచేసిన యాదరణమును ఆయనయొక్క యుపకార స్మృతియును సాధువర్తనమును కృష్ణజగపతి మహారాజుగారితో మనవిచేసి, తన్నాయన ప్రభువువారితో చెప్పవేఁడుకొనిన మాటలను విన్నవించెను.

రాజశేఖరుఁడుగారు భాగ్యవంతులై మరల గ్రామమునకు వచ్చియున్నారని విన్న కొన్ని దినములకు నారాయణమూర్తి యొక నాఁడు వచ్చి, రహస్యముగా రాజశేఖరుఁడుగారితో తానును దామోదరయ్యయు బ్రాణమిత్రులుగానుండుటయు,దామోదరయ్యయొక్క మర ణానంతరము తానాతని చెలికాడను ద్వేషముచేత జనులు తనయింటఁ గల సొత్తంతయు దోపించుటయు అందువలనఁ దానిప్పుడు అన్న వస్త్రములకే యిబ్బందిపడుచుండుటయుఁ జెప్పి సహాయ్యముచేయఁ వేడుకొనెను.

రాజ__కృతఘ్నుఁడును మిత్ర దొహియునగు నీవంటివాని కుపకార మెన్నఁడును జేయరాదు. నేను నీకెంతో మేలు చేసినవాడ నైనను నాకాపద సంభవించినప్పుడు, శక్తిగలవాఁడవై యుండియు నేను వేడుకొన్నను లేశమైన సాయము చేయకపోతివి. దామోదరయ్య ప్రాణమిత్రుఁడుగా నున్నను నీయొద్ద నాతఁడు దాఁచుకొన్న పెట్టెను మిత్రుని పుత్రునికీయక యపహరింపఁ దలఁచితివి.

నారా__ఆ సొమ్ము పెట్టెను తనయొద్ద దాచవలసినదనియు దానిని సులభముగా నపహరించవచ్చుననియు సిద్ధాంతియే మొదట నా కాలోచన చెప్పినాఁడు. నేను సొమ్ముపెట్టె నాతనియొద్దఁ బెట్టిన తరువాతఁ దనకందులో సగము భాగము రావలెనని పోరాడి, స్నేహితుని సొమ్ము పరులపాలగుట కిష్టములేక నే నొప్పుకొననందున మీ మెప్పునకై పెట్టెను మీకు దెచ్చియిచ్చినాఁడు.

రాజ__సిద్ధాంతియే నిన్నుఁ ప్రోత్సాహపఱచినను నీవు సహితము దోషివేకాని నిర్దోషివి కానేరవు. స్వయంకృతాపరాధమువల ననే నీ కిప్పుడీదుర్దశ ప్రాప్తించినది కాబట్టి యెఱుఁగక చేసికొన్న దాని ఫలము నీవవశ్యముగా ననుభవింపవలెను.

అని చెప్పి రాజశేఖరుఁడుగా రాతనికేమియు సాయముచేయక సాగనంపిరి. అదిమొదలుకొని రాజశేఖరుడుగారు వెనుక సిద్ధాంతి మొదలైనవారి చర్యలవలనఁ దెలివితెచ్చుకొని ముఖ స్తుతుల కుబ్బి యెప్పుడును ధనము పాడుచేసికొనకయు, సమీపమునకు వచ్చి మంచిమాటలు చెప్పువారి నందఱిని మిత్రులని నమ్మకయు మెలగ జొచ్చిరి. యోగి వెనుక చేసిన కుతంత్రమువలన నాతనికి యోగులను వారియందెల్లను కేవల జఠరపూరకు లను నభిప్రాయమును మంత్రములయందును సువర్ణకరణాది విద్యలయందును దృఢమైన యవిశ్వాసమును గలిగెను. రుక్మిణికి వెనుక పట్టిన దయ్యములు భూతవైద్యము శకునములు మొదలగువానివలన నెల్లవారికిని వాని యందలి నమ్మకము చెడుటం జేసి మఱియెప్పుడును వారి యింట నెవ్వరికిని గ్రహబాధ కాని ప్రయోగ లక్షణము కాని దేవత లావహిం చుటగాని కలుగలేదు. కుటుంబములోనివారి జాతకములును పెట్టిన ముహూర్తములును పలుమాఱు విరుద్ధ ఫలముల నిచ్చుచు వచ్చినం దున, రాజశేఖరుఁడుగారికిని తత్సంతతి వారికిని జ్యోతిషమందు సహిత మపనమ్మకము కలిగెను. రుక్మిణి వివాహకాలమున చేసిన ధర్మములకై చేసిన ఋణములవలని నష్టముల ననుభవించియుండుటం జేసి రాజశేఖరుఁడుగా రిఁక నెప్పుడును పరులకు ఋణపడకూడదని నిశ్చయము చేసికొనిరి. అంతటి నుండియు రాజశేఖరుఁడుగారు మిత వ్యయమునే చేయుచు వ్యర్థదంభమునకై ధనము పాడుచేసికోక, తమ కీశ్వరుఁడు దయచేసినదానితోడనే తృప్తినొందుచు, కలకొలఁ దిని బీదసాదలకు దానధర్మము చేయుచు, కలలో సహితము సత్యమును భూతదయయును తప్పక, "ధర్మోజయతి" యను నీతి వాక్యమును సదా హృదయము నందుంచుకొని సమస్త కార్యముల యందును నీతి పథమును నీఁగకాలంతయు దాటక ఋజువుగాఁ బ్రవర్తించుచు మంచి వాఁడని లోకమునఁ బ్రసిద్ధికెక్కి, పెక్కండ్రు మనుమలను మనుమరాండ్ర నెత్తి సిరియు సంపదయుఁ కలిగి చిర కాలము సుఖింపచుండిరి. ఆయన జీవిత కాలములోనే సుబ్రహ్మణ్యము పిఠాపురపు సంస్థానములో గొప్ప యుద్యోగములుసి కడచే వడ మంత్రియై రాజకార్యములయందును సన్మార్గ ప్రవర్తనము నందును నసమానుఁ డని పేరు పొందెను: అల్లుళ్ళిద్దఱును పెద్దా పురపురాజుగారి యోలగములోఁ గొలువు కుదిరి క్రమ క్రమముగా గొప్పదశను బొంది విశేష ఖ్యాతిని సంపాదించిరి. రాజశేఖరుఁడు గారి కుటుంబములోనివారే కాక యాయన బంధువర్గములో చేరినవారు కూడ అధర్మవృత్తి కొంతకాల మిహలోక సుఖమును గలిగించినను సద్ధర్మవృత్తియే శాశ్వత సౌఖ్యమునకు నిదానమని రాజశేఖరుఁడుగారి వర్తనమువలన నెఱిగి నిరంతరము ధర్మమార్గ ప్రవిష్టులై యుండుచు వచ్చిరి. చిన్నప్పుడెప్పుడో చచ్చిపోయిన మగఁడు పట్టుకొని వేధిం చుచున్నాఁ డన్న సిద్ధాంతి కొమార్తె పెద్దదై బ్రతికియున్న మఱియొక మగఁడు మిక్కిలి మక్కువతో తన్నాశ్రయించి మోహింపఁ జేయఁగా నాతని వెంట నింట దొరికిన సొత్తు నెత్తుకొని లేచిపోయి చెడి కడపట దాసియయి తమ కన్నుల ముందఱనే గ్రామములోఁ దిరుగుచుండుటయు, బాల్యదశలోనే భర్తలను బోఁగొట్టుకొన్న భాగ్య హీనురాండ్రైన ముద్దియలు పడు కష్టములును, అట్టివారు దురతిక్రమ ణీయమైన కామబాధకు తాళఁజాలక యింద్రియ చాపల్యమున దుష్ట పురుషుల వలలోబడి పాడగుచుండుటయు, కొందఱు కులము వారికి వెరచి రహస్యముగా శిశుహత్యలు గర్భపాతములు మొదలైన ఘోర పాతకముల కొడిగట్టు చుండుటయు, ప్రతి దినమును కన్నులారఁ జూచి మనసు కరగి యట్టి బాలవితంతువుల దుర్దశను తొలగించుట కేమైనఁ జేయవలయు నని పలు ప్రయత్నములు చేసియు మూఢ శిరోమణులయిన జనుల యొక్కయు నాచారపిశాచావేశసన్యస్త వివేకులై యున్న పండితులయొక్కయు మనస్సులను మళ్ళింపశక్తులుగా విఫల ప్రయత్నులై రాజశేఖరుఁడుగారు కొంతకాలమునకు లోకాంతరగతులయిరి. రాజశేఖరుఁడుగారు కాలముచేసి యిప్పటికి రెండు వందల సంవత్సరములైనను, ఆయన వలన మేలు పొందిన వారి సంతతివా రిప్పటికిని ఆయనను బ్రశంసించుచుందురు. రాజశేఖరుఁడుగారి సంతతి వారుకూడ దేశ మంతటను వ్యాపించి యిప్పుడు పెక్కుచోట్ల గొప్ప స్థితికలవారయియున్నారు.