రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/ఆరవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆరవ ప్రకరణము


సొమ్ము పోయినందుకు మంత్రజ్ఞులు చేసిన తంతు__రుక్మిణి మగఁడు పోయిన వార్త నొకఁడు చెప్పుట__రుక్మిణికి రుగ్ణత వచ్చుట __సోదె యడుగుట__మగఁడు పట్టుట__భూతవైద్యము __ సువర్ణ విద్య__బైరాగి సొమ్ముతో నదృశ్యుఁడగుట.

మఱునాఁడు ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు దంతధావనము చేసికొనుచు వీధియరుగుమీఁద గూరుచుండి యుండఁగా సిద్ధాంతి తనతోఁగూడ మఱియొక బ్రాహ్మణునిఁ దీసికొనివచ్చి యరుగుమీద నొకప్రక్కను చతికిలఁబడెను. చేతిలో వెండిపొన్ను వేసిన చేపబెత్త మును పట్టుకొని, తలయును గడ్డమును గోళ్ళను బెంచుకొని కను బొమలసందున గొప్ప కుంకుమబొట్టు పెట్టుకొని గంభీరముగాఁ గూరు చున్న యీ విగ్రహమును నఖశిఖపర్యంతమును తేఱిపాఱ జూచి యాయన యెవరని రాజశేఖరుఁడుగారు సిద్ధాంతి నడిగిరి. "వీరు మహా మంత్రవేత్తలు; మళయాళమునందుఁ గొంతకాలముండి మంత్ర రహస్యముల నామూలాగ్రముగా గ్రహించినారు; వీరు కృష్ణాతీరమున నుండి యాత్రార్థమయి విజయంజేసినారు;వీరి పేరు హరిశాస్త్రులవారు; వీరీవఱకు బహుస్థలములలో పోయిన వస్తువులను నిమిషములో దెప్పించి యిచ్చినారు; వీరు నాలుగు సంవత్సరములనుండి వానప్రస్థా శ్రమమును స్వీకరించి యున్నారు" అని తా నాతనిని రెండుదినముల నుండియే యెఱిగినవాఁ డయినను జన్మదినమునుండియు నెఱిగి యున్న వానివలె నాతని చరిత్రమును చెప్పి, 'నఖలో మైర్వనాశ్రమీ యను దక్షస్మృతి వచనమును జదివి గోళ్లును,వెండ్రుకలను బెంచు కొనుటచే వానప్రస్థుఁడగునని తల్లక్షణమును జెప్పెను. అప్పుడు హరి శాస్త్రులు తన మంత్రసామర్థ్యమును గొంతసేపు పొగడుకొని తా నావఱకు పోయినవస్తువులు తెప్పించినానన్న స్థలములపట్టిక నొక దానిని బహుదినములు ప్రయాసపడి వల్లించిన వానివలె తడవుకోకుండఁ జదివెను. అప్పుడు సిద్ధాంతి రుక్మిణివస్తువు పోయినసంగతి జెప్పి దానిజాడ చెప్పవలయునని ప్రార్థించెను. తోడనే హరిశాస్త్రులు తన ముక్కుపుటములయెుద్ద వ్రేళ్ళుపెట్టుకొని చూచి,ఆకాశమువంకఁ జూడ్కి నిగిడించి వ్రేళ్ళు మణఁచి యేమో లెక్కించి నిమిషమాలోచించిపోయిన వస్తువు ఇక్కడకు వచ్చుచుఁ బోవుచు నుండు వారిచేతనే చిక్కినది కాని యిల్లు దాఁటిపోలేదని చెప్పెను.ఇంతలో రాజశేఖరుఁడుగారి ముఖ ప్రక్షాళన మయినందున నందఱుఁ గలిసి లోపలికిఁ బోయిరి. నడవలో నిలుచుండి హరిశాస్త్రులు వస్తువును దెప్పించి యిచ్చుటకు తనదే భారమనియు, మధ్యాహ్నము వచ్చి యంత్రము వేసెదను కాబట్టి యాసమయమున కింటనున్న సేవకు లందఱను సిద్ధముగా నుంచవలయు ననియుఁ జెప్పి, 'లోపలనుండి కొంచెము బియ్య మిప్పుడు తెప్పింపుడు' అని కోరెను. సిద్ధాంతియే లోపలికిఁ బోయి యొక పళ్ళెముతో బియ్యమును దీసికొనివచ్చి శాస్త్రుల కోరిక ప్రకారము గృహమునఁ గనఁబడ్డ భృత్యవర్గమును బిలుచుకొనివచ్చెను. ఆమీఁదట శాస్త్రులు తన మంత్రప్రభావమును గొంచెము చిత్తగింప వలయు నని మనవిచేసి, అక్కడనున్నవారిలో నెవ్వరైన నొక వస్తువును దీసి రహస్యముగా దాచినయెడల వారి పేరును జెప్పెద నని చెప్పి, తాను వీధిలోనికిఁ బోయెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు తన యుంగరము నొకనిచేతికిచ్చి పదిలముగా దాపించి, యాతఁడు వచ్చి కూరుచున్న తరువాత శాస్త్రులును లోపలికిఁ బిలిచి యుంగర మును దాచిన వానిని జూపమని యడిగిరి. శాస్త్రులు తోడనే యక్కడ నున్న పదిమంది చేతులలో బియ్యమును బెట్టి యొకరొకరే వచ్చి బియ్యమును పళ్ళెములో బోయవలె నని చెప్పి తా నేమో మంత్రమును జపించుచుండెను. అప్పుడందఱును వరుసగా వచ్చి బియ్యము పళ్ళెములోఁ బోసిరి. వెంటనే యతఁడుంగరమును దీసినవాఁ డీతఁడని చూపెను. అప్పు డక్కడనున్న వారందఱును నద్భుతర సాక్రాంతు లయిరి. రాజశేఖరుఁడుగారును ఆతఁడు మహామంత్రవేత్త యని యొప్పుకొని నమస్కారము చేసి, పోయిన నగ యాతని మంత్రశక్తి చేత వచ్చునను నమ్మకముతో మధ్యాహ్న మునఁ దప్పక రావలయునని పలుమారు ప్రార్థించి తీసికొని రమ్మని సిద్ధాంతితోను జెప్పెను. సిద్ధాంతియు శాస్త్రులును ముఖవిలాసముతో సల్లాపసుఖము ననుభవించుకొనుచు నింటికి నడచిరి. ఇక్కడకు వచ్చు నప్పుడే సిద్ధాంతియు శాస్త్రీయ రహస్యముగా నన్ని సంగతులను మాటాడుకొని రాజశేఖరుఁడుగా రిచ్చుబహుమతిలో చెఱిసగమును బుచ్చుకొనునట్లు సమాధానపడిరి. కాబట్టి రాజశేఖరుడుగారికి నమ్మ కము పుట్టించుటకయి ముందుగా చేయవలసిన తంతును కూడబలుకు కొన్న తరువాత, వస్తువును దాచినవాఁడు పళ్ళెములో బియ్యము పోయఁగానే వెనుక దాను బోసెదననియు వాఁడే దానిని తీసి దానినా డని చెప్పవలసిన దనియు సిద్ధాంతి యింటివద్దనే నిర్ణయము చేసి నందున శాస్త్రులాతని సాహాయ్యముచేత నిమిషములో నుంగరము దీసినవానిని చూపఁగలిగెను.

మధ్యాహ్న భోజనము చేసి బయలుదేఱి కావలసిన పరి కరములతో సిద్ధాంతియు హరిశాస్త్రులను రాజశేఖరుఁడుగారి యిల్లు చేరిరి. అంతకు మునుపే యింటగల పరిచారకులును తక్కినవారును రావింపఁబడిరి. హరిశాస్త్రులకు వినఁబడునట్లుగా సిద్ధాంతి రథోత్సవ సమయమున రుక్మిణితో నెవరు వెళ్ళిరో కాసుల పేరు పోయినప్పు డెవ్వరెవ్వరెచటనుండిలో యాసంగతులు వెంట వెళ్ళినవారి నడిగి తెలుసుకొనుచుండెను. అంత సిద్ధాంతి వచ్చి రహస్యముగా శాస్త్రుల చెవులో నొకమాట చెప్పి మరల వెళ్ళి యేమేమో సంగతులను మాటాడుచుండెను. ఇంతలో రాజశేఖరుఁడుగారు వచ్చి వారినందఱికిని లోపలికి రండని పిలిచిరి. హరిశాస్త్రులు అమ్మవారి పెట్టెను తీసికొని యిప్పుడే వచ్చెదనని చెప్పిపోయి గడియసేపు తాళి యిత్తడిపెట్టెను పట్టుకొని కుడిచేతికొక రాగి కడియమును దొడుగు కొని మరల వచ్చి అలికి దిగవిడచియున్న చావడిలో నల్లని పచ్చని మ్రుగ్గులతో నొక్క విగ్రహమును చేసి, దాని నాభిస్థానమునం దాను తెచ్చిన యిత్తడిపెట్టెను బెట్టి మూత తీసి 'జయజననీ' యని కేకవేపి కొంతసేపేమో కన్నులు మూసికొని జపముచేసి, రాజశేఖరుఁడుగారి వంక జూచి యొక తెల్లకాగితము తెమ్మని యడిగెను. ఆ కాలములో కొండపల్లి కాగితములు తప్ప మఱియొకరీతి కాగితములు లేవు. రాజశేఖరుఁడుగారి కుమారుఁడు లోపలికిఁ బోయి యొక తెల్ల కాగితము దీసికొనివచ్చి యిచ్చెను. అప్పడా కాగితము నందఱును జూచుచుండగా సమానములైన యెనిమిది ముక్కలనుగాఁ జించి యందొక్క ముక్కను దనయొద్దనుంచుకొని తక్కిన యేడు ముక్కలను వారి కిచ్చివేసి, తా నుపాసించు దేవత యొక్క శక్తిచేత ఆ కాగితపు ముక్క-మీఁదికి వస్తువును దొంగిలించినవారి పేరు వచ్చునని చెప్పి, యా ముక్కను ఇత్తడిపెట్టెలోఁ బెట్టి నిమిషమందుంచి యొక మంత్రమును జదివి యా ముక్కను మరలఁ బయికిఁ దీసి తన చేతి లోనే పట్టుకొని యందఱకును జూపి, దానిని క్రిందనునిచి మూలలను కుంకుమ రాచి, హారతి కర్పూరపు తునకతో దానిమీఁద బీజాక్షరము లను యంత్రమును వేసి క్రిందనుంచి, యొకరొకరే వచ్చి దానిమీద జేయివైచి పొండని యాజ్ఞాపించెను. స్పష్టముగా గనఁబడుచున్న యా తెల్లకాగితము మీఁద నెల్లవారును చేతులు చేసి పోయు యేమి జరుగునో చూతమను వేడుకచేతఁ దమ స్థానముల గూరుచుండి చూచుచుండిరి. అందఱును ముట్టుకొని పోయిన తరువాత హరి శాస్త్రులాముక్కనుదీసి సాంబ్రాణిధూపము వేసి, హారతికర్పూరము వెలిగించి దానిమీఁద ఆ ముక్కను నాలుగయిదుసారులు మోపి రాజ శేఖరుఁడుగారి చేతికిచ్చెను. ఆయన చేతిలోఁ బుచ్చుకొని చూచునప్ప టికి దానిమీఁద పెద్ద యక్షరములతో 'చాకల సరడు" అని వ్రాసి యుండెను. ఆ కాగితము పయికెత్తగానే యెల్లవారికిని స్పష్టముగా వంకర యక్షరములు కనబడుచుండెను. దగ్గరనున్నవారిలోనొకరు దానిని పుచ్చుకొని చదువునప్పటికి చాకలిసర్వఁ డొకఁడు తప్ప మిగిలిన వా రందఱును నద్భుత ప్రమోదమగ్న మానసులయి చప్పటలుగొట్టి శాస్త్రుల శక్తిని ఉపాసనాబలమును వేయినోళ్ళం గొనియాడఁకొచ్చిరి. కొంద ఱక్కడ నున్నవారిలో 'వీఁడె నగ దీసిన దొంగ; అప్పుడు వెనుక నిలుచున్నా' డని వానిని నిందింప సాగిరి, సీత వచ్చి కాసుల పేరు పోయినప్పుడు సర్విగాఁడు పండ్లు చేతిలోఁ బట్టుకొని మా వెనుక నిలువఁ బడినాఁడని చెప్పెను. అందు మీద నందఱును నగ హరించిన వాఁడు చాకలి సర్విగాఁడుతప్ప మఱి యొకఁడు కాఁడని నిశ్చయించిరి. ఇంటనున్నవారును రాజశేఖ రుడుగారునుకూడ ఆ ప్రకారముగానే నమ్మిరి. ఆ వస్తువును శీఘ్ర ముగాఁ దెచ్చి యిమ్మని యడిగినప్పుడు, ఆ చాకలివాఁడు కంటికి నేలకు నేకధారగా రోదనముచేయుచుఁ దా నేదోషము నెఱుఁగనని బిడ్డలమీఁదను భార్యమీఁదను ఒట్లు పెట్టుకొనసాగెను. కాని యది యంతయు దొంగయేడుపని యెల్లవారును నిశ్చయము చేసికొనిరి. నయమున భయమున వాని నెన్నివిధముల నడిగినను వాఁడు తాను నిరపరాధి ననియే చెప్పి యేడ్చుచు వచ్చినందున, హరిశాస్త్రులు రాజశేఖరుడుగారిని చాటునకు 'మాట' యని పిలుచుకొనిపోయి 'మీ సెలవయినపక్షమున వీనికి ప్రయోగముచేసి పోయిన వస్తువును దెప్పించెద' నని చెప్పెను. వాఁడు చిన్నతనమునుండియు మిక్కిలి నమ్మకముగా బనిచేసినవాఁ డయినందున వానికేహానియఁ జేయ నొడఁబడక రాజశేఖరుఁడుగారు వానిని కొలువునుండి మాత్రము తొలగించివేసిరి. వాడు తాను నిరపరాధి నని యేడ్చుచు నింటికిఁ బోయెను. మొదట సిద్ధాంతి శాస్త్రుల చెవిలో రహస్యముగా జెప్పినది చాకలి సర్వని పేరు వ్రాయమనియే, అతఁ డమ్మవారి పెట్టెను దెచ్చుమిషమీద వెలుపలకుఁబోయి యొకకాగితపు ముక్కమీద నీరుల్లిపాయల రసముతోఁ "చాకల సరడ"ని యక్షరజ్ఞానము చక్కగా లేక పోవుటచేత వా ఒత్తు (వ) పోఁ గొట్టి వ్రాసి యాఱ పెట్టి పెట్టెలో బెట్టుకొనివచ్చెను. రాజశేఖరుఁడుగారి కుమారుఁడు కాగితమును తీసికొనివచ్చినప్పుడు తా నాపేరును వ్రాసిన కాగిత మంత ముక్కను జింపుకొని తక్కినదాని నిచ్చివేసి, దానిని పెట్టెలోఁ బెట్టినప్పుడు మార్చి మొదటి తన కాగితమును పయికిఁ దిసెను. అదియు మునుపటి కాగితమువలెనే యున్నందున నెవ్వరు ననుమానపడలేదు. ఆ కాగితముమీఁద హారతికర్పూరముతో బీజా క్షరములు వ్రాసినది యుల్లిపాయలకంపు పోవుటకేకాని మఱి యొకందునకుఁ గాదు. తరువాత సాంబ్రాణిపొగలోను కర్పూరపు దీపముమీఁదను పొగచూరఁ బెట్టుట మున్నుకనబడకుండ నున్న యక్షరములు స్ఫుటముగాఁ గనఁబడునట్టు చేయుటకయి కావించిన తంత్రము. ఈ ప్రకారముగా తన మంత్రప్రభావముచేత శాస్త్రు లంతటి ఘనకార్యమును జేసినందునకయి వస్తువు దొరకకపోయి నను రాజశేఖరుఁడుగా రాతని కొక ధోవతుల చాపును కట్టబెట్టి నాలుగు రూపాయిల రొక్కము నిచ్చిరి. ఇంటికిబోయినతరువాత హరిశాస్త్రులను సిద్ధాంతియు వానిని సమభాగంబులుగాఁ బంచు కొనిరి.

ఆ మఱునాఁడు జాము ప్రొద్దెక్కిన తరువాత రుక్మిణి యొక్కతెయు పడమటింటి పంచపాళీలోఁ గూరుచుండి యెఱుకత చెప్పిన గడువు నిన్నటితో వెళ్ళిపోయెనే. యింకను మగడు రాఁడాయెనే యని తలపోయుచు వస్తువు పోయినందునకయి విచారించు చుండెను. ఆ సమయమున నిరువది సంవత్సరముల వయసుగల యొక చిన్నవాఁడు లోపలికివచ్చి చేతిలోని బట్టలమూఁటను క్రిందఁబడ వైచి రుక్మిణి మొగము వంకఁజూచి పెద్దపెట్టున నేడ్చెను. అది చూచి రుక్మిణి సంగతి యేమో తెలిసికొనకయే తానును నేడ్వఁజొచ్చెను. ఆ రోదన ధ్వని విని యింట నున్నవా రందఱును లోపలినుండి వరు గెత్తుకొనివచ్చి యేమియని యడిగిరి. అప్పు డాచిన్నవాఁడు గ్రుడ్లనీరు గ్రుక్కుకొనుచు గద్గదస్వరముతో రుక్మిణిమగఁడు నృసింహ స్వామి కాశీనుండి వచ్చుచు త్రోవలో జగన్నాధమువద్ద పుష్యశుద్ధ నవమినాఁడు గ్రహణి జాడ్యముచేత కాలధర్మము నొందెననియు,దహనాదికృత్యము లను తానే నిర్వహించితిననియుఁ జెప్పెను. ఆ మాటలు విన్నతోడనే ఇంటనున్నవా రందఱును నొక్క సారిగ గొల్లుమని యేడ్చిరి.ఆ యాక్రం దనధ్వని విని చావడిలోనున్న రాజశేఖరుఁడుగారును పొరుగిండ్లవారును వచ్చి కారణంబును దెలిసికొని పలుతెఱంగుల విలపించిరి. అప్పు డక్కడనున్న పెద్దలందఱును వారి నోదార్చి వారిచే స్నానములు చేయించి వేదాంత వచనముల నుపదేశింపసాగిరి. ఇట్లు కొన్ని దిన ములు జరిగిన తరువాత బంధువులు మొదలగువారు రుక్మిణికి శిరోజములు తీయించు విషయమయి రాజశేఖరుఁడుగారితోఁ బ్రసంగించిరి గాని, ఆయన కొమార్తెమీది ప్రేమచేత చిన్నతనములోనే యాపని చేయింప నొప్పుకొన నందున, నందఱును గూడ దానివలన నొక బాధకము లేదనిచెప్పి యాయన చెప్పినవిధమే మంచిదని యొప్పుకొనిరి.

మన దేశములో పతిరహితులగు యువతుల దురవస్థను తలఁచుకొన్న మాత్రమున పగవారికయినను మనస్సు కలుక్కుమనక మానదు. పతిశోకమును మఱచునట్లు చేసి యాదరింప వలసిన తలి దండ్రులే జీవితేశ్వరులు పోయి దు:ఖసముద్రములో మునిఁగియున్న తమకడుపున బుట్టిన కొమార్తెలను కరుణమాలి సమస్తాలంకారముల కును దూరురాండ్రనుజేసి, తలగొణిగించి కురూపిణులజేసి ముసుగు వేసి మూల గూర్చుండఁబెట్టదురు; రెండుపూటలను కడుపునిండ తిండియయిన బెట్టక మాడ్చి యందఱి భోజనములు నయిన తరువాత మూడుజాముల కిన్ని మెతుకులు వేయుదురు; మనసయినను మంచిబట్ట కట్టుకోనియ్యక, అంచులేని ముతక బట్టనే కట్టుకోనిత్తరు. వేయేల? మగఁడుపోయిన వారిజీవనములనే దుఃఖభాజనముగాఁజేసి, వారిని జీవ చ్ఛనములనుగా నుంతురు. ఎవ్వరును పెట్టినవిగాక పుట్టుకతోనే భగవంతుఁ డలంకారము దయచేసినట్టియు చిన్నప్పటినుండియు చమురురాచి దువ్వి ప్రాణముతో సమానముగా పెంచుకొనుచున్నట్టియు చక్కని శిరోజములను నిర్దయుఁడైన మంగలివాని కత్తి కొప్పగించుట కంటె మానవతులకు ప్రాణత్యాగమే మేలని తోఁచును; ఇంటఁగల కష్టమయినట్టియు నీచమయినట్టియు పనులన్నియు వారిమీదనే పడును; పుట్టినింటఁ జేరఁగానే, వదినెలను మఱదండ్రును దాసి నిగాఁ జూతురు: గారవమను మాట యుండదు; శుభకార్యముల యందు నలుగురిలోఁ దలయెత్తుకొని తిరుగుటకు నోచుకోక పోఁగా, మొగ మగపడినమాత్రముగ మీఁదిమిక్కిలి యెల్ల వారును దుశ్శకునమని దూషింతురు. ఈ హేతువుచేతనే "విధవ" యను మాటయే వినుటకు శూలమువలెఁ గర్ణ కఠోరముగా నుండును; ఎవ్వనినైన "విధవా" యను పేరను బిలిచిన మాత్రమున ఘోరమయిన తిట్టుగా నెంచుకొని వాఁడు మండిపడును.

ఈ స్థితి యంతయు కన్నులకు గట్టినట్లగపడి, ఆ వర్తమానము తెలిసినదినము మొదలుకొని రుక్మిణి రాత్రియుఁ బగలును గదిలోనుండి వెలుపలికిరాక నిద్రాహారములు మాని మగనికయి శోకించుచు గృశింపసాగెను.విచారమునకుఁ దోడు దేహమున నేదియో వ్యాధి కూడ నాశ్రయించెను. ఆమె లేవలేనంత బలహీనురాలగు వఱకును వ్యాధి సంగతిని నెవ్వరును కనుగొన్నవారు కారు. కను గొన్నతోడనే రాజశేఖరుఁడుగారు ఘనవైద్యుఁడని ప్రసిద్ధికెక్కిన జంగము బసవయ్యను పిలిపించి చేయి చూపించిరి. అతఁడు రుక్మిణి పరున్న మంచముమీఁదఁ గూరుచుండి యెడమచేయి పట్టుకొని నాడిని నిదానించి చూచి వాతనాడి విశేషముగా నాడుచున్నదని చెప్పి యామెకుఁ బెక్కు దినములనుండి శీతజ్వరము వచ్చుచున్నదనియు వెంటనే కనుగొనకపోవుటచేత జ్వరము దేహములో జీర్ణించిన దనియుఁ జెప్పి వైద్య గ్రంథమునుండి-శ్లో॥ పారాదార్వి మహాబలా త్రికటుకాజాజీర సో నాస్త్రధా! విష్ణుక్రాంతసినాడికా గృహభవోధూమ స్తులస్యాద్వయం నారంగస్య శలాటపత్ర మరలు త్వకృత్ర నిర్గండికా భార్టీ పక్వ పటచ్చదాచ్చ సకలాన్ శీతజ్వరాన్నాశయేత్ -అను శ్లోకమును జదివి, తెప్పింపవలసిన వస్తువుల నొక కాగి తముమీఁద వ్రాయించి యప్పటి కింటికిఁ బోయెను. ఆ మధ్యాహ్నమునకే రాజశేఖరుఁడుగారు వస్తువుల నన్నిటిని డెప్పించి వైద్యు నకు వర్తమానము నంపినందున, అతఁడువచ్చి వస్తువులను చూర్ణము చేయించి పొట్లములు కట్టి, తేనె యనుపానముచేసి మూడు వేళలను మూడు పొట్లము లిమ్మని చెప్పి, నూనె, గుమ్మడి, బచ్చలి, పులుసు, కంద, పనస మాత్రము తగులఁగూడదని పథ్యమును విధించి, ప్రతిదినమును రెండు పర్యాయములు వచ్చి చేయి చూచి గుణమును కట్టుకొని పోవుచుండును. మొదట రుక్మిణికి శరీరము కొంచెము స్వస్థపడ నారంభించినది కాని తరువాత రాత్రులు పలువరింతలు పట్టి జ్వర మధికము కాసాగెను. అప్పుడు వైద్యుని బిలిచి జ్వర మింకను నిమ్మళించలేదేమని యడుగగా, అతఁడు "రేవత్యా మనురాధాయాం జ్వలో బహుదినంభవేత్" అని చదివి యీ జ్వరము రేవతీ నక్షత్రమున వచ్చినదికాన బహుదినము లకుఁ గాని పోదని చెప్పెను. కాని యాతని మాటలయం దంతగా నమ్మకము చిక్కక గ్రామములోనున్న మఱియొక వైద్యునిఁ బిలి పించి, రాజశేఖరుడుగారు రుక్మిణిని జూపించిరి. అతడు చేయి చూచి పైత్యజ్వర మని చెప్పి, మూడుపూటలలో రుక్మిణిది వజ్రశరీరము చేసెదనని ప్రగల్చవచనములు పలికి, ఆతనియొద్ద మాటలేకాని మందులు విస్తారముగా లేనందున వాడుక ప్రకారముగా "లంఘనమ్ పరమౌషధ'మన్న యొక్క సూత్రముననే శరణముగావించుకొని లంక ణములు కట్టనారంభించెను. అతఁడు నవజ్వరపక్వము కావలెనని పలుకు చున్నను లక్ష్యచేయక, దినదినక్రమమున రుక్మిణి శుష్కించి యంత కంతకు మఱింత బలహీనురాలగుచుండుట చూచి యాతని వైద్య మును మానిపించి, మరల మొదటివైద్యునినే రావింపఁగా నతఁడు వెంటనే పథ్యము పెట్టించి యౌషధ సేవ చేయింప నారంభించెను. ఆ యౌషధబలమున వ్యాధి కొంచెము మళ్ళుముఖము పట్టినను, ఒక పట్టున నిశ్శేషమయినదికాదు.

ఈలోపల మాణిక్యాంబ యొక యాదివారమునాఁడు నాలుగు గడియలకుఁ దెల్లవాఱుననఁగా లేచి సుబ్బమ్మను వెంటబెట్టుకొని యెవ్వరును వెళ్ళకముందే ముందుగా దాము వెళ్ళవలెనని బయలుదేఱి కొమార్తెమీఁది ప్రేమచేతఁ దాను స్వయముగానే కోరలమ్మగుడికి సోదె యడుగుటకయి వెళ్ళెను. ఆ గుడియొద్ద నున్న మాలది మాణిక్యాంబ ధూపము వేసినమీఁదట నిష్టదేవత తన కావేశమయి నట్లు కనఁబడి తాను రుక్మిణి పెనిమిటినని బయలపడి, కాని దేశములో దిక్కుమాలిన పక్షినయి చచ్చిపోతినని యేడ్చుటయే కాక తాను రుక్మిణిమీఁది మోహముచేతఁ వచ్చితిననియు, ఆమెను దనయొద్దకుఁ దీసికొనిపోయెదననియుఁ జెప్పెను. ఆ సంగతులు చెప్పునప్పుడు మాణిక్యాంబయు సుబ్బమ్మయుఁగూడ నేడువసాగిరి. ఆ యుద్రేకము శాంతి పొందిన పిమ్మట వారా మాలదానికి సమర్పింపవలసినదాని నర్పించి యింటిఁ బోయిరి. రుక్మిణకిని రాత్రులు కలలలోను పగలు సహితము కన్ను మూసికొనునప్పడును మగఁ డెదుటఁ గనఁబడు చుండెను. ఒకానొకప్పుడు మాటాడునట్లు నహిత మామెకు వినఁ బడుచువచ్చెనుగాని యా మాటల నామె గ్రహింపఁ గలిగినదికాదు. ఆమె యొకానొకప్పు డెవ్వరో గుండెలమీఁద నెక్కి కూరుచున్నట్లు తలఁచి నిద్రలోఁ గేకలు వేయుచుండును.

ఇట్లుండఁగా నొకనాఁడు హరిశాస్త్రులు వికృత వేషముతో మరల వచ్చి రుక్మిణిచేయి చూచి భూతనాడి యాడుచున్నదని చెప్పెను. బైరాగిచేత విభూతి పెట్టించి లోపలికి తీర్థమిప్పించిరి కాని, అందువలన రుక్మిణి కేమియు గుణమగపడలేదు. ఒకనాఁ డొక బుడబుడక్కలవాఁడు నెత్తిమీఁది తలగుడ్డలోఁ బక్షియీఁక లను బుజముమీఁద వేపఔత్తముల కట్టయు, వీపన బెత్తము లకు వేలాడఁ గట్టిన పెద్దతోలునంచియు నుండ డక్క వాయించుచు వచ్చి మాణిక్యాంబ శకున మడిగినప్పడు గీతలను బొమ్మ లను వేసియున్న తాటాకుల పుస్తకము చూచి తీర్ధమునకు వెళ్ళిన దినమున రావిచెట్లమీదనుండి వచ్చి యొక కామినీగ్రహము సోఁకిన దనియు దిగఁదుడుపు పెట్టినఁ బోవుననియుఁ జెప్పి యొక వేరు ముక్క యిచ్చి దానిని వెండి తాయెతులోఁ బెట్టి దండచేతికిఁ గట్టు మనిచెప్పి యొక రూపాయ పుచ్చుకొని పోయెను. ఆ ప్రకారముగా మాణిక్యాంబ రుక్మిణికి దిగఁదుడుపు పెట్టెనుగాని యందు వలనను గార్య మగపడలేదు. ఒక దినమున సుబ్బమ్మ కావేశము వచ్చి వేంకటేశ్వరులు బయలఁబడి యదియంతయుఁ దన మాహత్మ్యమే యనియు, కొండకు వచ్చి తనకు నిలువుదోపి చ్చెద నని తల్లి మ్రొక్కుకొన్న పక్షమున సర్వము నివర్తియగు ననియుఁ జెప్పెను. ఆ ప్రకారమే చేసెదనని మాణిక్యాంబ మ్రొక్కు కొని తన నగలలో నొకదానిని ముడుపుగట్టెను గాని దాని వల నను రుక్మిణి దేహస్థితి యనుకూలదశకు రాలేదు. అంతట హరిశాస్త్రులు వచ్చి యీరాత్రి చిన్నదానిచేతఁ బలికించి దయ్యమును వదలఁగొట్టె దనని ప్రతిజ్ఞ చేసి, తాను నాలుగు గడియల ప్రొద్దు వేళ నే వచ్చి చావడి యలికించి దానినిండ రంగు ముగ్గులతో ధైర్య శాలులయిన పురుషులు చూచినను భయపడునట్టుగా వికృతమయిన స్త్రీ విగ్రహము నొకదానిని వేసి తాను స్నానము చేసి జట్టు విరియఁ బోసికొని కుంకుమముతో మొగమంతయు నొకటే బొట్టు పెట్టుకొని, రుక్మిణిని స్నానము చేయించి తడిబట్టతో నాపట్టనడుమఁ గూరు చుండఁబెట్టి మొగమునకు విభూతి రాచి చుట్టును బిందెనాదములు మోగునట్టు మనుష్యులను నియమించి, కన్నులు మిఱుమిట్లు గొన నెదురు గొప్ప దీపములు పెట్టించి, మంచి వారికి సహితము పైత్యో ద్రేకముచేయు ధూపములు వేయుచు, చుట్టుపట్ల యిండ్లలోని పిల్లలందఱును జడిసికొనులాగున "హ్రాం" "హీం" అని పెద్దగొంతుకతో బీజాక్షరముల నుచ్చరించుచు, గ్రుడ్లెఱ్ఱ చేసి బెత్తము పుచ్చుకొని కొట్టఁబోయినట్టుగా రుక్మిణిమీఁదికి వెళ్ళి "ఉన్నది యున్నట్టుగాఁ జెప్పు" మని కేకవేసెను. ఆ వఱకే దేహస్మృతి తప్పి వికారముగాఁ జూచుచున్న యారుక్మిణి తల్లి సోదెకు వెళ్ళివచ్చి చెప్పిన ప్రకారముగా తాను నృసింహస్వామి ననియు భార్యమీఁది మక్కువ తీఱక వచ్చి యావహించినాఁడ ననియు, తనతోఁగూడ నామెను దీసికొనిపోయెదననియు పలికెను. అంత నాపైత్యోద్రేకము పోవునట్టుగా రుక్మిణి మొగమున కేమో రాచి యామెకు తెలివివచ్చినమీఁదట లోపలికిఁ గొనిపోయి శైత్యోప చారములు చేయుఁడని దగ్గఱ నున్నవారితోఁజెప్పి, హరిశాస్త్రులు యింటికి బోయెను.రుక్మిణి యాదినమును మఱునాఁడును బలహీన ముగాను మత్తుగాను పడియుండెను. మఱునాఁటి యుదయమున మరల హరిశాస్త్రులు వచ్చి రుక్మిణిని పట్టినది మొండిగ్రహ మనియు, మహామంత్రముచేతఁ గాని శాబరములచేత సాధ్యము కాదనియు, అయినను తానుజేసిన తపస్సంతయు ధారపోసి వదలఁగొట్టెదననియు జెప్పి, రాత్రికి తొమ్మిదిమూరల క్రొత్తవస్త్రమును, అఖండము నిమి త్తము మణుగునేయియు పుష్పములను, ఆఱుమూరల జనపనార త్రాడును, నాలుగు మేకులును, రెండు కుంచముల నీరుపట్టు లోతైన యిత్తడిపళ్ళెమును సిద్ధముచేయించి రెండవ త్రోవలోని యొక గదిని గోమయముతో నలికించి యుంచఁడని రాజశేఖరుఁడు గారితోఁ జెప్పిపోయెను. రాజశేఖరుఁడుగా రాప్రకారము సర్వము జాగ్రత్తపెట్టించి యాతనిరాక కెదురుచూచుచుండిరి, ఆతఁడు రాత్రి తొమ్మిదిగంట లయినతరువాత వచ్చి గదిలో అఖండదీపమును వెలి గించి, అమ్మవారి పెట్టెను దాని సమీపమున నుంచి, బియ్యపు మ్రుగ్గుతో గదికినడుమ నొక చిన్న పట్టుపెట్టి యందులో రుక్మిణిని గూరుచుండఁబెట్టి కొంచెముసేపు తనలో నేమో మంత్రమును జపించి దిగ్బంధనము చేసి గది నాలుగుమూలలను మంత్రోదకమును చల్లి రుక్మిణి నావలకుఁ దీసికొనిపోవచ్చునని చెప్పి, ఆమెను లోపలికిఁ గొనిపోయిన తరువాత గదితలుపు లోపలగడియ వేసికొని గడియ సేపుండి వెలుపలికివచ్చి పయిని తాళమువేసి, ఆ గ్రహమునకు బ్రతికి యున్న కాలములో నృసింహమంత్రము వచ్చియున్నది, కాబట్టి యది యేదేవతకును లోఁబడునది కాదనియు, తన యావచ్చక్తి విని యోగించి గదిని విడిచి రాకుండునట్లు బంధించి మాత్రము వచ్చితి ననియు, తా నీవలనుండి శరభసాళ్వమును బ్రయోగించినచో ఘోర యుద్ధముచేసి లోబడును గాని మఱియొక విధంగా లోఁబడదనియు చెప్పి-"ఓం-ఖేం-ఖం-ఘ్రసి-హుం-ఫట్ - సర్వశత్రు సంహారిణే- శరభసాళ్వాయ- పక్షి రాజాయ-హుం-ఫట్-స్వాహా"-ఆని శరభ సాళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండుమాఱులు మంత్రము నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొకమనుష్యుని మఱి యెవ్వరో కొట్టుచున్నట్టు చిన్నచిన్నదెబ్బలు వినఁబడినవి; ఆ పిమ్మట నొక పెద్ద దెబ్బ వినబడెను. ఈ ప్రకారముగా నరగడియ సేపు దెబ్బలు వినఁబడుచువచ్చి సద్దడఁగినతరువాత గ్రహము సులభముగానె దొరికెననియు దానినిప్పుడే తీసికొనిపోయి గోదావరిలోఁ గలి పెద ననియుఁ జెప్పి తానొక్కఁడును గదిలోనికిఁబోయి యందలి సమ స్త్ర వస్తువులను దీసికొని హరిశాస్త్రులు వెళ్ళిపోయెను. ఆ మఱుచటి దినము మొదలుకొని క్రమక్రమముగా రుక్మిణి జబ్బు వదలి యారోగ్యమును బొందసాగెను. తరువాత నా బ్రాహ్మణుఁ డొకదినము రాగి రేకుమీఁద నొకప్రక్కను ఆంజనేయ విగ్రహమును బీజాక్షరములను, రెండవప్రక్కను ఎటుకూడినను ముప్పదినాలుగు వచ్చునట్లుగాఁ బదు నాఱుగదులుగల దిగువ నున్నరీతి యంత్రమును వేసి, ఆ రక్షరేకును రుక్మిణి మెడకుఁ గట్టి యదియున్నంతకాలము నేవిధమయిన గాలియు సోఁకదని చెప్పెను. కొమార్తె యొక్క గ్రహబాధ నివారణ

౧౦ ౧౬
౧౫
౧౪ ౧౨
౧౧ ౧౩

చేసినందునకయి రాజశేఖరుడుగారు శాస్త్రులకు దోవతులచాప కట్టఁ బెట్టుటయేకాక నూటపదియాఱురూపాయలను బహుమాన మిచ్చిరి. శాస్త్రులారాత్రి అమ్మవారి పెట్టెను దెచ్చినప్పుడందులో వేసి కొన్ని బొమ్మరాళ్ళను మాత్రము తెచ్చుకొనెను. ఆవలి కందఱను బంపి వేసి తా నొక్కఁడును లోపలఁ గూరుచున్నప్పుడు తలుపువేసికొని, గదియొక్క మట్టిమిద్దెకు నడుముగా మేకలను దిగఁగొట్టి యామేకు లకు జనుపనార త్రాడును గట్టి, క్రొత్తబట్టలో గొంతముక్కను జించి వానికిఁ గొంచెము కొంచెము దూరముగా బొమ్మరాళ్ళను ముడి వైచి గుడ్డను దిట్టముగా నేతిలో ముంచి యొకకొనను జనుపనార త్రాడుకు వ్రేలాడఁగట్టి, దానికి సూటిగా క్రింద భూమిమీద పళ్ళెము నిండ నీళ్ళుపోసి నీళ్ళలో పువ్వులను చక్కఁగా బఱచి, ఆ గుడ్డ కొనను దీపమంటించి హరిశాస్త్రులు వెలుపలికి వచ్చెను. ఆతఁ డీవలకు వచ్చిన రెండుమూడు నిమిషముల కెల్లను గుడ్డయంటు కొనఁగా మండుచుండెడు చమురుబొట్లు నీటిలోఁబడి టప్పుమని మను ష్యునిమీఁద దెబ్బ వేసినట్టు చప్పుడు కాసాగెను. ఆవల బొమ్మ రాళ్ళవఱకును కాలినప్పు డారాయి యూడి నీళ్ళలోఁబడి గొప్ప ధ్వనిని జేయుచు వచ్చెనుగాని పళ్ళెములో నడుగునఁ బువ్వలుంటచేత నిత్తడి పళ్ళెముమీఁద వాయించినట్టెంతమాత్రము వినఁబడినదికాదు. ఆ గుడ్డయంతయు మండిపోయినతరువాత ఆతఁడు లోపలికిఁ బోయి మసి మొదలగు వానిని పూర్ణముగా నెత్తుకొని వెడలిపోయెను.

రాజశేఖరుఁడుగారు సువర్ణవిద్యను గ్రహింపవలెనను నపేక్షతో నిత్యమును బైరాగికి సమస్తోపచారములను జరిపించుచు, ఆతని సమయము కనిపెట్టి యనుసరించుచు, ఆతఁ డొకనాఁడు గంజాయి త్రాగి యుల్లాసముగాఁ గూరుచున్నపుడు చేరబోయి వినయముతో "బావాజీ: లోకములో సువర్ణము చేయు విద్య యున్నదా?" అని యడిగెను. అతఁడు మందహాసము చేసి "ఉన్నది" అని చెప్పెను. ఆ పయిని మాటల ధోరణిని "ఆ విద్యయొక్క సంగతి యెటువంటి" దని రాజశేఖరుడుగారు మహాభక్తి శ్రద్ధలతో చేతులు జోడించుకొని యడిగిరి. అందుమీఁద నతఁడు “ఆ సంగతి పరమరహస్యమయినను నీకు జెప్పెద" నని పూర్వయుగములలో స్పర్శవేదివలన నినుము బంగారమగుచు వచ్చెనుగాని యీ కలియుగములో స్పర్శవేది లేద నియు, పూర్వము శంకరాచార్యులవా రొక యూఁడిగవానికి సువర్ణ ముఖి యను విద్య నుపదేశింపఁగా వాఁడు చిరకాలము బంగారమును జేసి కడపట యోగులలోఁ గలసి వారి కుపదేశించి దేహము చాలించె ననియు, తన గురువా విద్యను తన కుపదేశించెను గాని మంత్రము యొక్క పునశ్చరణము పూర్తికానందునఁ దనకది యింకను ఫలింప లేదనియు, తా నిప్పుడు పసరులతో మాత్రమే బంగారమును జేయఁ గలననియు, రాజశేఖరుఁడుగారిమీఁది యనుగ్రహముచేతనే చెప్పినట్టు చెప్పి, ఎల్లవారును దన్ను బంగారము చేయమని బాధింతురుగాన ఆ సంగతిని మహారహస్యముగా నుంచవలెనని కోరెను.రాజశేఖరుఁడు గారు తా నా ప్రకారము గోప్యముగా నుంచెదనని ప్రమాణముచేసి తనకు సువర్ణముచేయు యోగమును జెప్పుఁడని బహువిధముల వానిని బ్రార్ధించిరి. దానిపయిని ఆ బైరాగి యది గృహస్థులు చేయఁగూడ దనియు, చేసినయెడల వంశ క్షయ మగుననియుఁ జెప్పి తనయెడల విశ్వాసముగలవారికి తానే బంగారమును జేసి యిచ్చెదనుగాని యోగ మును మాత్రము చెప్పనని చెప్పెను.

అందుమీఁద బంగారమునైనఁ జేయించుకోవలెనను నాశ పుట్టి మఱింత శ్రద్ధాభక్తులతో నాతని నాశ్రయించుచు నొకనాఁటి యుదయకాలమున రాజశేఖరుఁడుగారు పాలును శర్కరయుఁ దీసికొని వచ్చి యిచ్చి కూరుచుండియుండఁగా, ఆ బైరాగి రాజశేఖరుఁడుగారి మీఁదఁ దనకుఁ బరిపూర్ణానుగ్రహము గలిగినట్టు ముఖచిహ్నముల వలనఁ గనఁబఱచుచు నొక బేడయెత్తు బంగారమును బేడయెత్తు వెండిని దెమ్మని యడిగి యాతడు తెచ్చి యిచ్చిన తరువాత వానిని రెంటిని నొక గుడ్డలో కట్టి రాజశేఖరుఁడుగారు చూచుచుండగా నిప్పులలో వేసి కొంతసేపుండనిచ్చి యొక పసరును దానిమీద పిండి కొంచెముసేపు తాళి పట్టుకారుతో దీసి రెండుబేడాల యెత్తు బంగారమును చేతులో బెట్టెను. అందుమీద రాజశేఖరుడుగారు మఱింత వెండిని గలిపి యేకముగా బంగారమును జేసి పెట్టుఁడని వానిని బహువిధముల వేడుకొనిరి. అట్లు వేడుకోగా వేడుకోగా గోసాయి యాతని ప్రార్ధన నంగీకరించి యింటఁగల బంగారమును వెండినిఁ జేర్చి యొకమూటగట్ట నియమించెను. ఆతని యాజ్ఞాను సారముగా రాజశేఖరుఁడుగారు తమయింటఁ గలవారి నగలును వెండి పాత్రములను ధనమును ప్రోగుచేసి యొక పెద్ద మూటను గట్టి ఇంట నున్నవారు సహిత మెఱుఁగకుండ రహస్యముగ బైరాగియొద్దకుఁ దీసికొని వచ్చిరి అతఁడు వెంటనే పిడకలదాలి పెట్టించి యా మూటను రాజశేఖరుడుగారి చేతులతోనే దానిలోఁ బెట్టించి పుటమువేసి ఆయ నను లోపలికిఁబోయి విసన కఱ్ఱను దెమ్మని పంపెను. రాజశేఖరుఁడు గారు విసనకఱ్ఱను బట్టుకొని మరల వచ్చునప్పటికి బైరాగి గొట్ట ముతో నూదుచుండెను. అప్పుడు బైరాగి మఱికొన్ని పిడకలను పైనిబెట్టి మంట చేసి, తాను వేమగిరి కొండమీఁదనున్న మూలికలను గొనివచ్చుట కయి వెళ్ళేదననియు, తానుబోయి వానిని గొనివచ్చి వనరు పిండినఁ గాని యంతయు బంగారము కాదనియు, దాను వచ్చులోపల పిడక లను వేసి మంట చేయుచు జాగ్రత్తతోఁ గనిపెట్టుకొని యుండ వలయుననియుఁ జెప్పి, మూలికల నిమిత్తమయి వెళ్లెను. ఆతఁడు వనమూలికలకయి వెళ్ళి యేవేళకును రానందున, రాజశేఖరుఁడుగారు తామక్కడనే యుండి, బైరాగిని పిలుచుకొనివచ్చుటకయి మనుష్యు లను బంపిరి. వారును గొండయంతయు వెదకి యెక్కడను అతని జాడను గానక మందుచెట్టు దొరకకపోవుటచేత దూరపు కొండలకుఁ బోయినాఁడేమో యనుకొని మరలి వచ్చి యా వార్తను జెప్పిరి. ఆ బైరాగి బంగారముచేయు మూలికలు దొరకనందున గాబోలు మరల రానేలేదు. అతని నిమిత్తమయి యొక దినమువఱకు వేచియుండి రాజ శేఖరుఁడుగారు పటముదీసి చూచునప్పటికి దానియందు బంగార మును, వెండియు లేదుగా ని తెల్లని భస్మము మాత్ర ముండెను. సుల భముగా రజత భస్మమును నువర్ణ భస్మమును నయినందున రాజశేఖరుడుగారు పుటముదీసిచూచునప్పటికి దానియందు బంగారమును, వెండియులేదుగాని తెల్లని భస్మము మాత్రము ముండెను.సులభముగా రజిత భస్మమును సువర్ణ భస్మము నయినందున రాజశేఖరుడుగారు సంతోషించి పదిలముగా దానిని దాచిరి. కాని, యేమి కారణముచేతనో యా భస్మమునందు బరువుగాని సువర్ణాది భస్మముల యందుండు గుణముకాని కనపడలేదు.