రాజవాహనవిజయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

రాజవాహనవిజయము

(ద్వితీయాశ్వాసము)

శ్రీరక్షాకర కరుణా
పూరక్షాళితసమస్తభువనవిశస్తా
క్ష్మారక్షా హరిహయనుత
దోరక్షా శేషశైలదుర్గాద్యక్షా.

1

1. శ్రీరక్షాకర = శ్రీరక్షణ చేయువాఁడా. కరుణా... విశస్తా = దయారసముచేఁ గడగబడ్డ సమస్తలోకములయొక్క దోషములు గలవాఁడా. క్ష్మారక్షా - భూమి నేలువాడా. హరిహయ ...రక్షా = ఇంద్రునిచేఁ గొనియాడబడ్డ భూజావయవముగలవాఁడా. శేషశైలదుర్గాధ్యక్షా = శేషాచలశిఖరముననుండు ప్రభువా.

వ.

అవధరింపు మయ్యవసరంబున వసుమతి వసుమతీపతిని
మేలుకొల్పి యిట్లనియె.

2


క.

భూవర మనపాలిటఁ గల
దేవర మురవైరి శ్రీసతీపతి కరుణన్

నావల కేలికిఁ గలలో
నా వలభి ద్వని ఫలంబు నందించెఁ దగన్.

3

3. వలభి ద్వని ఫలంబు = బలాంతకుఁడైన యింద్రుని తోటలోని పండు. అనఁగా కల్పఫలము.

శా.

ఆపద్బంధుఁ డనేకపావనకళాత్యంతప్రహర్షుండు గో
త్రాపారాయణుఁ డాపగాతనయనిర్వాణప్రదాతృత్వలీ
లాపారీణుఁడు పాండవార్తిహృతిహేలాశాలి కౌచేలదా
నాపూర్ణోదరుఁ డార్తసాదరుఁడు దా నాపాల గల్గెం గదా.

4

4. అనేకపావనకళాత్యంతప్రహర్షుండు =గజమును గాపాడు విద్యయం దధికసంతోషము గలవాడు. (గజేంద్రుని గాపాడెననుట) గోత్రాపారాయణుఁడు = భూరక్షణాసక్తుఁడు. ఆపగా... పారీణుఁడు = భీష్మునకు మోక్షమిచ్చుపనిలో సమర్థుడు. పాండవా...శాలి = పాండవు బాధ నుపహరించుక్రియచేత నొప్పువాఁడు. కౌచేలదానాపూర్ణోరుఁడు = కుచేలుని సంబంధము దానముచే నిండిన యుదరదా గలవాఁడు. ఆర్త...రుఁడు = పీడితులయందు ఆదరముతో గూడినవాఁడు.

క.

అని తా వనితామణి వా
గ్జనితామోదమునఁ బొదలె జనతాధీశుం
డనతాహిదమనతార్క్ష్యుఁడు
తన తామరసాక్షి దాల్చు దౌహృద మనుచున్.

5

5. జనతాధీశుఁడు = జనసమూహప్రభువు, అనతాహి, దమనతార్క్ష్యుఁడు = అవిధేయులనెడు, సర్పముల నణచుటకు గరుడుఁడు. ఇది రాజునకు విశేషము.

గీ.

దేవ నిజదేవపతిశివసేవఁ దనరెఁ
బావనస్వాంత నిజకీర్తిపటలిధవళ
ధవళితాంబర వసుమతీధవళనయన
చెరగు మాయక యుండు టచ్చెరువె యపుడు.

6

6. దేవ... సేవన్ = దేవతలయుఁ గులదేవపతియగు శివునియొక్కయు సేవచే నొప్పెను. ఇదిరాజుతో ముందు కన్వయము. పావనస్వాంత = పరిశుద్ధహృదయ. నిజకీర్తి ... బర= తనకీర్తిసమూహముయొక్క తెలుపుచేఁ దెల్లఁగా జేయఁబడ్డ యాకాశము గలది. వసుమతీధవళనయన = వసుమతీఁనామక రాజకాంత.

మ.

కులుకుందోరపుగబ్బిగుబ్బచనుముక్కుల్ నల్లఁబారె న్నునున్
దళుకుంజెక్కులు తెల్లబారె గ్రమ నిద్రాయాసజాడ్యంబు ల
గ్గలమయ్యెం దరుచయ్యె చిట్టుములు కాంక్ష ల్మించె నింపారఁగాఁ
దలసూపెన్ గడు నోకిలింత పను లంతర్వర్తలై తన్వికిన్.

7

7. చిట్టుములు = వేవిళ్ళు. (చిఱు + ఉమ్ములు)

గీ.

అప్పుడు ఘనాగ్రకుచ హరిణాంశువదన
భంగసంగతవళిక తన్వంగి తరళ
లయనయుగళ హరిమధ్య నాగమంద
గమన చెలువొందె నిర్భరగర్భకలన.

8

8. హరిణాంకుఁడు = తెల్లని కిరణములు గలవాఁడు. చంద్రుడు.

వ.

ఇవ్విధంబున గ్రమక్రమంబున, సువర్ణవర్ణపరి

పూర్ణగర్భంబు దాల్చె నంత నగణ్యసాద్గుణ్యంబగు నొకా
నొకపుణ్యవాసరంబున.

9

9. సువర్ణన్ వర్ణన్ = బంగరువన్నె గలది. అనగా స్త్రీ,

క.

పంచగ్రహమిహిరుని వ
ర్తించని లగ్నమున దిశలు తేజము మించన్
బంచాస్యమధ్యధీరుం
బంచాస్త్రాకారునిం గుమారునిఁ గాంచెన్.

10

10. సూర్యాదిక్రూరగ్రహము లయిదును లేని లగ్నమునందు అనఁగా బృహస్పతి, చంద్రశుక్రులుగల లగ్నమునం దని భావము.

సీ.

మనరాజుతోడ ధీమంతు లూహ యొనర్చి
                 చెప్పిన వీసంబు తప్ప కగునె
చామనిచాయదాసరి ముత్తె మిచ్చిన
                 కల మొన్న మునుమాపు దెలుపవలెనె
యమ్మ కుమారుఁగన్ సుమ్మన మరచితె
                 పున్నమనాఁడు నే నన్నమాట
లటు మున్ను నీకు నీయాన నే నేమంటిఁ
                 బడకింటిపజ్జుఁ జప్పరములోన


గీ.

నగునె నీకల నిక్కల యక్క నీదు
పలుకు తప్పదు తాగట్టి పలవ యిచ్చు
ననుచుఁ దమదేవి సుతునిఁ గన్నపుడె తగిలి
నగవు చిరుగింప నగిరి పూర్ణగిరి చెలులు.

11

11. వీసము = పదియారింట నొకభాగము. చామనిచాయదాసరి = వేంకటేశ్వరుడు. నిక్కల = నిండుకల. పూర్ణగరి చెలులు = పట్టణమందలి నగరునఁ దిరుగు నూడిగపుటాండ్రు, వీండ్రు పరస్పరము నమ్మగారు కుమారునిఁ గన్నవేళ సంతోషముతో సరసము లాడుకొనుచుండుట యీపద్యమందు వర్ణింపఁబడెను.

క.

తోరపుఁ జనుఁగ సదర నొ
య్యారంబున వచ్చి యంత యంతఃపురకాం
తారత్నము విభునకు దే
వేరి సుతుం గన్నవార్త వినిపించుటయున్.

12

12. చనుఁగ వదర = చనుఁగవ + అదర. శేషము స్పష్టము.

మ.

పులుకల్ బిట్టర చట్టియందు నిలువన్ బొల్పొందె హర్షంబునన్
మొలకల్ డెందమునన్ బరంపరలుగా ముంచెన్ సముద్బాష్పము
ల్గలిగె న్నిద్దపుఁ జెక్కుటద్దముల సోగల్వారెఁ జెల్వారఁగా
నల భూజానికి నాత్మజాతకుని వార్తాకర్ణనాపూర్ణతన్.

13

13. పులకల్ = రోమాంచములు. బిట్టరచట్టి = మిక్కిలి నిక్కవొడిచి. అంద = అంకురించినచోటనే, నిలుపన్ = అణఁగిపోక యుండఁగా. పొల్పొందెనని పూర్వమున కన్వయము. హర్ష...ముంచెన్ = సంతోషముతో, తదంకురములు, మనస్సునందు, సమృద్ధిగా ముంచెను. అనఁగా వ్యాపించెననుట. సముద్బాష్పముల్ = ఆనందయుక్తమయిన నేత్రజలబిందువులు. శేషము స్పష్టము.

గీ.

దూరయాత్రాగతుఁడు తనయూరు గనిన
కరణి, తృష్ణార్తుఁ డమృతంబు గాంచు సరణి,
ఖరకిరణఖిన్నుఁ డొకచెట్టు గన్న పగిది,
నందనోదయవార్త నానంద మొంది.

14

14. తృష్ణార్తుఁడు = దప్పిగొన్నవాఁడు. ఖరకిరణఖిన్నుఁడు = సూర్యునివలన శ్రమనొందినవాఁడు.

క.

ఆ నలినాక్షికి వేనలి
చే నలి రుచిఁ గెలువఁ జాలు చెలువకు వలువల్
చే నిచ్చి వెనుక వచ్చిన
మానిని కుడగరలు కొన్ని మన్నించి తగన్.

15

15. అలిరుచి = తుమ్మెదలయొక్క కాంతి, ఉడగరలు = సొమ్ములు.

క.

తానం బాడి మనీషివి
తానంబున కర్థ మిచ్చి తానంతట సం
తానం బనఁదగి మగసం
తానంబున నతఁడు ముదముతానం బయ్యెన్.

16

16. తానము = స్నానశబ్దతద్భవము. మనీషివితానము = పండితసమూహము. సంతానము = కల్పవృక్షము. ముదముతానము = సంతోషస్థానము.

గీ.

పురుడు పరిపాలితాలకాపురుఁడు, శేష
భుజగనూపురుఁడును గాక పుడమిఁ గలఁడె
యనఁగ సిరిగన్న రాజన్యతనయమణికి
హర్ష మందిరి యంతఃపురాబ్జముఖులు.

17

17. పురుడు = సమానము. పరితాలకాపురుడు = పరిపాలించఁబడిన అలకాపట్టణముగలవాడు అనగాఁ గుబేరుడు, శేషభుజగనూపురుఁడు = శివుడు.

క.

ధరణీశుఁడు బుధమణిగణ
వరశరణం బపుడు రాజవాహనసంజ్ఞా
భరణుఁడని బాంధవాంతః
కరణంబు ఫలింప నామకరణం బిడియెన్.

18

18. ధరణీశ = రాజు, బుధమణివరశరణము = పండితశ్రేష్ఠసమూహమునకు ముఖ్యప్రాపకము.

శా.

పౌలోమీధవనీలఖండఖచితప్రాసాదసీమన్ సము
ద్వేలశ్రీల నుయాలతొట్టె నిడి యర్థిన్ జంద్రమఃకందళాం
దోళీభావదయార్ద్రభావ యనుచున్ శుద్ధాంతవాటీనట
ద్బాలాజాలము జోలఁబాడు నచలాపాలాగ్రణీబాలకున్.

19

19. పౌలో...మన్, పౌలోమీధవనీల = ఇంద్రనీలములుయొక్క, ఖండ = శకలములచేత, ఖచిత = కూర్పబడిన, ప్రాసాదసీమన్ = మేడమీఁద, సముద్వేలశ్రీలన్ = అతిశయించిన సంపదలచే, అర్థిన్ = కోరికతో, చంద్రమఃకందళాందోళీభావ = చంద్రఖండమువలె ఆందోళభావముగలవాఁడా, దయార్ద్రభవా = దయచే చల్లనగు మనస్సుగలవాఁడా, శు.. జాలము. శుద్ధాంతవాటి = అంతఃపురవీథిని, నటత్ = నాట్యము చేయుచుండెడి, బాలాజాలము = ఆడపిల్లలసమూహము. అచలా...లకున్ = రాజశ్రేష్ఠుని కుమారుని.

క.

ముద్దుల నిడి పడకిండ్లన్
ముద్దియ లాత్మీయ లెనసి మురియును నిద్దా
సుద్దుల నెత్తుచు నందొగి
విద్దెము విద్దెమని కాళి విద్దెం బనుచున్.

20

20. ముద్దియలు = స్త్రీలు, ముగ్ధాశబ్దవైకృతి. ఆత్మీయులు = స్వకీయులు, ఎనసి = కూడి, నిద్దాసుద్దులన్ = మంచిమాటలచే, ఒగిన్ = వరుసగా.

చ.

జిలిబిలిపాలు జాలుకొను చెక్కులటెక్కును మద్దికాయలున్
గలుకలు రావిరేక చిఱుగజ్జియ లందియ లైదుకైదువల్
గల యపరంజిబిళ్ళ తుదిగం బులిగోరునుఁ బుట్టువెండ్రుకల్
చెలఁగెడి పట్టి పండువులు చేసెఁ దగన్ దలిదండ్రి కంటికిన్.

21

21. జిలిబిలి = అందముగా. జాలుకొను = ప్రసరించునట్టి. మద్దికాయలు = ఆభరణవిశేషములు, కలుకలు = వజ్రశకలములు కూర్చిన. రావిరేక = రావియాకువంటి, చిఱుగజ్జియలు = చిన్నగజ్జెలుగల. అందియలు = అందెలు. ఆయిదంచులుగల యపరంజిబిళ్ళ గలిగిన బంగారపుపతకము. తుదిగన్ = చివర నుండునట్లుగా. పులిగోరును = పులిగోరు గూర్చిన యాభరణము, పుట్టువెండ్రుకల్ = పుట్టువెండ్రుకలును, చెలగెడిుపట్టి = చలించుచుండునట్టి శిశువు.

శా.

ఆలోలాస్యవినీతనూపురపదాజాంగుష్ఠము న్నిస్రవ
ల్లాలాజాలము కేళిధూళిపటలీలబ్ధాంగమున్ హస్తచే
ష్టాలగ్నేక్షణకజ్జలాన్వితముఖాబ్జాంతంబునై మించు త
ద్బాలత్వం బొగి తల్లిదండ్రులకు దృక్పర్వంబు గావింపదే.

22

12. ఆలోల = చలించుచున్నట్టి. ఆస్య, వినీత = నోటియొద్దకుఁ దేఁబడిన, నూపుర = అందెగల, పదాబ్జాంగుష్ఠమున్ = పద్మమువంటి పాదము యొక్క బొటకన వేలు కలది. నిస్రవల్లాలాజాలము = కారుచు నుండెడి చొంగయొక్క సమూహమును గలది. కేళీధూళిపటలీలబ్ధాంగమున్ = ఆటయందు దుమ్ముసమూహమును బొందిన కరము గలది. హస్త...తంబు, హస్తచేష్టా = చేతులాడించుటను, లగ్న = అంటిన, ఈక్షణ = కన్నులందలి, కజ్జల = కాటుకతో, అన్విత = కూడిన, ముఖాబ్జాతంబు =పద్మమువంటి ముఖముగలది. దృక్పర్వంబు = కన్నులపండుగు.

సీ.

సాలముల్ రిపు ముట్టి సాధింతు నను లీల
                 నా లంకెగడి డింపఁ గాలిఁ దిగుచుఁ
బలుమరు నెరయ నిప్పగిది శత్రుశిరంబు
                 చెండుదు నను మాడ్కిఁ జెండు గొనునుఁ
దన దాడి కరి డాఁగు ననురీతిఁ జెలికాండ్ర
                 కదన డాగనముచ్చు లాడ నేర్చు
విమతుఁ డెందేగిన నెమకెద నన్న యు
                 న్నతి నాడు సిరిసింగనాల వృత్తి


గీ.

నసపుఁ గప్పురపుంగుప్ప లవని నుంతు
గూర్మి నను పేర్మి వెన్నెలకుప్ప లాడు
భ్రమరజితమధుకరపాళిరాట్కుమార
మౌళి కేళీవధూటీముదాళి యగుచు.

23

23. సాలముల్ = కోటలు. ముట్టి = తాకి, లంకెపడిన కడియమును. డింపన్ = దింపుటకు, కాలిన్ = పాదముతో. దిగుచున్ = లాగును. నెరయన్ = ప్రసిద్ధముగా, చెండు = బంతిని, దాడికిస్ = దండయాత్రకు, అరి = శత్రువు. అదన = సమయమందే. విమతుఁడు = శత్రుఁడు. నెమకెద = వెదకెదను. సిరిసింగనాలవృత్తి = బాల్యక్రీడావిశేషము. అసఁపు గప్పురపుంగుప్పలు = కీర్తికర్పూరపురాసులు. వెన్నెలకుప్పలు = బాలక్రీడావిశేషము. భ్రమర = ముంగురులచే. జిత = జయించఁబడ్డ. మధుకరపాళి = తుమ్మెదలసమూహముగలవాఁడు.

క.

ఉపనయనకర్మ మంతట
నుపనయనజనంబు పొగడ నొగిఁ దన విధుస
ల్లపన యనయంబుఁ దనరం
నృపనయవలివజుఁడు నడిపె నిజతనయునకున్.

24

24 ఉపనయనసమూహము = జ్ఞానులు, విధుసల్లపన = చంద్రునివంటి ముఖము గలది. అనగాఁ స్త్రీ, అనయంబు = ఎల్లప్పుడును. నృపనయవలివజుఁడు = రాజనీతికి బ్రహ్మయగు రాజహంసుఁడు.

ఉ.

మీసపుమొక్కనిక్కునకు మిక్కిలి దొల్కఱివాన కుంతలా
ళీసురపాలనీలమణిలీలకుఁ గ్రొన్నునుసాన విభ్రమ
శ్రీ సరసీరుహంబు మదసీధురసప్రసంబు సూనబా
ణాసతపఃఫలం బపుడు యౌవన మబ్బెఁ కుమారమౌళికిన్.

25

25. మీసపుమొలకయొక్క నిక్కునకు మిగుల తొలకరివాన. కుంత...లీలకు = వెండ్రుకలసమూహ మనెడు ఇంద్రనీలమణి విలాసకు కొన్నునుసాన = కొత్తదగు నున్నని సానరాయి. విభ్రమశ్రీ సరసీరుహంబు = విలాసలక్ష్మికి పద్మము, మదసీధురసప్రసవంబు = మదమనెడు రసాయనద్రవ్యముయొక్క పుష్పము, సూనబాణాసతపఃఫలంబు = మన్మథునియొక్క తపోలాభము.

క.

అంతస్థితయౌవనమద
మెంతయు వెలికుఱికి రేఖ లిటులై నిలిచెన్

సంతత మల భూమీభు
గ్దంతికిఁ బెంజెంపవెంట్రుకలచా ల్నిగిడెన్.

26

26. భూమీభుగ్దంతి = రాజనెడి గజము. పెంజెంప = పెద్దచెంప.

చ.

కరికలభంబుకొ మ్మపుడు గైకొని బిఱ్ఱునఁ ద్రిప్పు లోడు వై
ఖరి గిరి యెత్తు సంగడము కైవడి నవ్వలయాద్రిఁ బట్టు గో
ట రహిని మత్తఖడ్గిని బడల్చు రజంబుగఁ గొట్టు లోహము
ద్గరసముదాయ మచ్చిఱుతకైపున భూపతి యౌవనోద్ధతిన్.

27

27. కరికలభంబు = గున్నయేనుఁగుయొక్క, కొమ్ము = చంతము. తోడు వైకరి = నరుకు సంచివలె, సంగడము కైవడి = సంకానాలావలె. అవ్వలయాద్రిన్ = ఆచక్రవాళాద్రిని. మత్తఖడ్గిని = మదించిన ఖడ్గమృగమును, బడల్చు = స్రుక్కునట్టు చేయును. లోహముద్గరసముదాయము = ఉక్కుముద్గరల సమూహము. చిఱుతకైపు = కొలది మైకముచే.

క.

వేదంబున సకలకళా
వాదంబున గీతికానవద్యవిపంచీ
నాదంబునఁ గవితాదివి
నోదంబున రాజవాహనుఁడు ఘనుఁ డయ్యెన్.

28

28. విపంచీనాదము = - వీణాధ్వని.

క.

క్షితి వే యభ్యాసను పం
డితవిద్యలు గడియ కుడుకు నీరెచ్చుక్రియన్

బ్రతిపచ్చంద్రరుచిం బల
నతని కళ ల్గనియెఁ బ్రతిదినాభ్యుదయంబున్.

29

29. వే = శీఘ్రమున, అభ్యాసన = అభ్యాసముచేత. ఉడుకునీరు = ఉష్ణజలము. ప్రతిపచ్చంద్రరుచిన్ = పాడ్యమినాటి చంద్రకాంతి, అతని కళలు కన్యలు = అతని విద్యలు. అభ్యుదయము = వృద్ధి.

ఉ.

ఈవికి నిమ్ము భోగమున కింకువ, చక్కదనంపుఁదేటకున్
దావు, ప్రతాపసంపదకు దావక మంచిత సూక్తిసూనపుం
దావికిఁ డెంకి, కార్యకలనంబున కిల్లు, రణాంగణాటవీ
పావకు రాజవాహన నృపాలశిఖామణిఁ జెప్ప నొప్పదే.

30

30. ఇమ్ము, ఇంకువ, తావు, తావకము, టెంకి, ఇల్లు, ఇవి పర్యాయార్ధకములు. రణాంగణానాటవీపావకు = యుద్ధప్రదేశమనెడు అరణ్యమునకు అగ్నిహోత్రుఁడు.

సీ.

ఏకుండు వాగ్ద్యైతి యీకపణావద
                 ధ్యక్షుఁ డాకృతిఁ దృతీయాశ్వినేయుఁ
డుర్వోజమునఁ దుర్యపూర్వదక్షిణవర్తి
                 గాంభీర్యమున పంచమాంభసాంప
తీంద్రుఁ డీగిని షష్టమేంద్రమహీజంబు
                 జనరక్ష సప్తమచక్రవర్తి
శమమునం దష్టమసంయమిప్రవరుండు
                 గరుశక్తి నవమదిక్కుంజరంబు

గీ.

కళ దశమధాత మహిమ నేకాదశావ
తారము కార్ముకవిద్య ద్వాదశభవుండు
దీపకాంతి త్రయోదశసప్తసప్తి
తగదె మగధేంద్రుఁ బొగడ నిద్ధాత్రి నెగడ.

31

31. ఏకుండు = ముఖ్యుడు వా...క్షుఁడు = భాషయందు రెండవశేషుఁడు. ఉర్వోజమునన్ = అధికతేజమునందు, తుర్యపూర్వదక్షిణవర్తి = నాలవయజ్ఞి. పంచమాంభసాంపతీంద్రుఁడు = అయిదవసముద్రుఁడు. ఈగిని =ఈవియందు, షష్ఠమహీజము = ఆఱవకల్పవృక్షము. సంయమివరుఁడు = ఋషిశ్రేష్ఠుఁడు. కళన్ = విద్యయందు, దశమధాత = పదియవబ్రహ్మ. ద్వాదశభవుండు = పండ్రెండవరుద్రుఁడు. త్రయోదశసప్తసప్తుఁడు = పదమూఁడవసూర్యుడు.

తాత్పర్యము. భాషాసంపదయందు శేషుఁడు, చక్కదనమున ఆశ్వినిదేవత, ప్రతాపమునకు అగ్ని, గాంభీర్యమునందు సముద్రుండు, దాతృత్వమందు కల్పవృక్షము, పరిపాలనకు చక్రవర్తి, శాంతమున ఋషి, అధికబలమున దిగ్గజము, విద్యను బ్రహ్మ, మహిమను అవతారపురుషుఁడు, ధనుర్విద్యను రుద్రుఁడు, కాంతిని సూర్యుఁడు అని పొగడుచుండఁగా నెగడుచున్నాఁడనుట. ఈ పద్యమున 1 మొదలుకొని 12 వఱకునుండు సంఖ్య వారితో నాయాగుణములను పోల్చఁబడుటచే సంఖ్యాలంకారము.

క.

కట్టు వడగొట్టు కైదువ
కట్టలు గొను మరున కిరువు గట్టినగతిఁ గ
న్పట్టిన పట్టికి యువరా
ట్పట్టము గట్ట ధరాధిపతి యట్టితఱిన్.

32

32. కట్టు వడగొట్టు కైదువకట్టలు = మిక్కిలి వాడిపోవునట్టి యాయుధముల కట్టలను అనగా పుష్పబాణములను, గొను = గ్రహించెడి, మరునకున్ = మన్మథునకు, ఇరువు గట్టినగతిన్ = వీ లేర్పరచిన, యువరాట్పట్టము = యౌవనరాజ్యాధికారము.

ఉ.

పట్టము గట్టి చుట్టపు నృపాలుర యిండ్లను పెండ్లి చేసి యే
పట్టున లోఁగ కుద్ధతిని బాండ్యులు గప్పము బెట్టకున్కి నా
రట్టతురంగధట్టగజరాడ్భటకోటుల గూర్చి పట్టికేల్
పట్టి యుగంధరాదినయ
వద్వరమంత్రులఁ జూపి యిట్లనున్.

33

33. లోగక = లోఁబడక, ఉద్ధతిన్ = గర్వముచే, పాండ్యదేశపురాజులు, కప్పములు = పన్నులు, ఆరట్టకురంగభట్ట = అరట్టదేశపుగుఱ్ఱములసమూహము, గజరాడ్భటకోటులు = గజశ్రేష్ఠములను, భటసమూహములును, పట్టికేలు పట్టి = కుమారునిహస్తము పట్టుకొని, యుగ...త్రులన్ = యుగంధరుడు మొదలుగాగల నీతిమంతులలో శ్రేష్ఠులయిన మంత్రులను.

ఉ.

చెప్పిన నీతులం జెవులఁ జేర్చుట, శేషమనీషశేషులై
యొప్పిన సోమదత్త సచివోత్తమ వంశసముద్భవుల్ బుధుల్
చెప్పిన కార్యపద్దతులు చేయుట, గొల్చిన పేదసాదులన్
జప్పున జీతనాతము లొసంగుట భూషణమయ్య పుత్త్రకా.

31

31. అశేషమనీషన్ = అధికబుద్ధిని, శేషులు = శేషునివంటివారు.

క.

హితమంత్రిపురోహితబుధ
తతిఁ బ్రోచిన పిదప మనుపఁదగు నొరు సీతా

పతియును “స్వజనస్యచ ర
క్షిత” యన వినవే విపక్షశిక్షాదక్షా.

35

35. హిత...తతిన్ = అనుకూలు లయిన మంత్రులను, పురోహితులను, పండితసమూహమును. ప్రోచినపిదపన్ = కాపాడినపిమ్మట "స్వజనస్యచ రక్షితః" = స్వజనులకు రక్షకుఁడు.

క.

పూట నగు కార్యగతు లొక
నాట న్మఱినాట గనెడు నయకార్యము లొ
క్కేటం జేయుట మేలగుఁ
గోటలపై వేగిరింపకుము వేయైనన్.

36

36. స్పష్టము.

క.

పదరినఁ గార్యము సెడు సం
పద చెదరు మహాపదలకుఁ బదపడు "సహసా
విదధీతనక్రియా” మను
చదు వార్యులు చదువ వినవె శశివంశమణీ.

37

37. పదరినన్ = త్వరపడిన, పదపడు = సిద్ధపడు, సహసావిదధీతనక్రియాం = కార్యము తొందరపడి చేయకు.

క.

సుతవిజయముఁ జేయు మటం
చత డప్పుడు పల్కి ధర్మ మందిన జయముల్
సతములగు “యతో ధర్మ
స్తతో జయ” యనెడు వచనము దలపుమ యనియెన్.

38


లయగ్రాహి.

బంగరపుచెక్కులఁ జెలంగు చవుకట్టుల
మెఱుంగు బలుచుక్కలపయిం గినిసి జంగల్
చంగునఁ గొనన్ సరిగరంగుగల కుట్టు పస
కంగులఁ గడల్కొనిన యంగి పయి దోర

త్నాంగదము కుంకుమతరంగములఁ గుప్ప జిగి
వొంగు బురుసాపని బెడంగు గల కుళ్ళా
నింగికి తళత్తళ లొసంగ నతడంత నృప
పుంగవుహజారమునకుం గదలి వచ్చెన్.

39

38. జంగల్ గొనన్ = దాట్లు వేయఁగా, సరిగ = జలతారు, కంగులఁ గడల్కొనిన = ఉగ్గులు దీరిన, దోక = బాహువునందలి, బురుసా = బ్రూసెల్సు అను పట్టణపుపట్టు, కుళ్ళా = టోపీ, హజారము =సభాస్థలము.

క.

వచ్చి తనభటుల నిటలస
టచ్చటులకరాబ్జులై కడలఁ బొగడఁగ వై
యచ్చరవిభువైభవపా
టచ్చరుఁడు ప్రతాపశిఖిపటచ్చరదరియై.

40

10. వైయ ..చ్చరుడు = ఇంద్రవైభవమునకు దొంగ, అనఁగా నింద్రునిమీరిన వైభవము గలవాఁడు. ప్రతా...రియై - ప్రతాపశిఖి = ప్రతాపాగ్నికి. పటచ్చరత్ = పాతగుడ్డలై యాచరించుచున్న. అరియై = శత్రులుగలవాఁడై.

సీ.

మదనాగ విచలత్ప్రమథనాథవిశిఖశ్వ
                 శురవిశ్వఘుమఘుమీగరిమ జెఁనకి
మిహికాశిఖరిగళన్మహికాతలోచ్చంగ
                 దురుఝరీగుభగుభీవరిమఁ దెగడి
ప్రళయావపరసముజ్జ్వలయాగహరకరో
                 ద్ధతఢాక్కఢమఢమద్రడిమఁ దరమి
బుధరాణ్నికృత్తభూమీధరాగ్రపతదశ్మ
                 పటువర్షఘణఘణార్భటులఁ బరఁగి

గీ.

కకుచిభశ్రుతి భంగ భాంకారభావ
భీమములు భోగి భూభారభిద్భుజారి
భూరిపుటభేదనంబులు భోరనంగ
భేరి జరిపించె భూరిగంభీరమహిమ.

41

41. మదనాగ = మందరపర్వతముచేత. విచలత్- కదలుచున్న, ప్రమథనాథ = శివునియొక్క. విశిఖ = బాణమగు విష్ణువుయొక్క. శ్వశుర = మామయగు సముద్రునియొక్క, విశ్వ = సమస్తమైన్న మిహికాశిఖర = హిమవత్పర్వతము. ఉచ్చంగత్ = కదులుచున్న . ఢాక్కా = ఢక్కా సంబంధమగు. బుధరాట్ = ఇంద్రునిచేత. నిక్పత్త = నరకఁబడిన, అశ్మ = రాళ్ళయొక్క, భూభారభిత్ = భూభారమును కొట్టివేయుచున్న, అనఁగా శేషువు బరువును దేలిక చేయుచున్న, భుజ = చేతులుగల. ఆరిభూ = శత్రురాజుల యొక్క, పుటభేదనంబులు = పట్టణములు.

క.

భువి పగిలెన్ రవి రవినొగిలెన్
దిని పిగిలెన్ దిగ్గజములధృతి సన్నగిలెన్
గవిఁ దగిలెన్ హరుడున్ ధృత
పవి మొగిలెన్ భూరిభేరిభాంకారమునన్.

42

42. గవిన్ = గుహయందు.

సీ.

అపరంజి మొసలి వాయనుసుల శిరసుతోఁ
                 గనుపులు తొమ్మిది గలుగుకొమ్ము
సల సూర్యపుటము పొన్నాణెంపు సరిగ మే
                 ల్కుట్టుపనుల హెచ్చు పట్టుకుచ్చు.
లుదిరి కంకణము లింపొసఁగు దంతపుగొడెల్
                 నయము మించిన ముసనాబు పటము
పై పచ్చడాల్ పత్తి పరపుపై మెఱపుమై
                 రాణించు చలువ పైఠాణి మీరి

గీ.

యొరపు టెఱయె కరంబు రం గొరగు నెదుట
బసివలపు లిచ్చు పచ్చాకు పసిడిపట్టు
బటువు జోడును బటువు పైపుటము గులుకఁ
బూని రందల మెంతయు బోయలంత.

43

43. అపరంజి = బంగారు వికారమైన, మొసలివా = మొసలినోళ్ళుగల, అనుసుల = తోళ్ళుగల, కొమ్ము = పల్లకీ దండీ. పొన్నాణెంపు = పొన్ను = బంగారముచేత, అణెంపు = ప్రశస్తమైన, ఉదిరి = మేలిమి బంగారము, గొడెల్ = బిదికీలు. ముసనాబు = అందలము ప్రక్కతెఱ. పైఠాణీ = పఠానిదేశపు దుప్పటి. ఎఱ = ఎఱుపు, ఒరఁగు = బాలీసు. బటువుజోడు = టెక్కెములజత, పుటము గులుకన్ = అతిశయించగా.

సీ.

గొనబుగా నురులఁ జెక్కిన చెంగుతోడ జే
                 నెడు బాఁకుతో బొల్చు నీవిదట్లు
ముందర ముడిఁగొని ముంగొంగు వెలివెట్టి
                 మాటు చెంగావి రుమాలు వులును
వ్రేలి వలంబున వ్రేలెడు మెడనూళ్లు
                 జాళువా ముంజేతి జతుల త్రాళ్లు
మొనపాటి ముత్తెముం చిననాగవడిగెలు
                 బిగువొప్పఁ దొడిగిన బిళ్ళచెప్పు


గీ.

లొసరు దుప్పట్లు కడ నిల్పి గునుకు నడల
నుచితనిజభాషణంబుల నొంటి యొంటి
హస్తమునఁ బూని యొక్కాస్తి బెస్త బిడ్డ
లందలము నిల్పి రవని పాలాగ్రసీమ.

44. ఉరులన్ = వ్రేలాడునట్టుగా. చెక్కిన = దిద్దినట్టి. నీవిదట్లు = ముడివేసిన కాసెకోకలు. జతులత్రాళ్ళు = చప్పుడు చేయునట్టి గొలుసులు. నాగవడిగలు = చెవులనుంచుకొన్న నాగుజోళ్లు. ఒక్కాస్తి = ఒక్క పొడవుగల.

ఉ.

పట్టుమెఱుంగుజూ లుభయపార్శ్వఘణంఘణనాదఘంటికల్
మట్టుమెఱుంగులై మొరయ మస్తకమందును దృష్టి దండ గ
న్పట్టిన కర్ణచామర మపారపుమేలును మేలు మేలనం
బట్టపుదంతి నిల్పె నరపాలునిచెంగట మావటీ డొగిన్.

45

45. జూలు = ఏనుగుపై పరచు రంగుదుప్పటి; మేలు = ముదము.

ఉ.

సాన మెఱుంగురంగులఁ బొసంగు పిరంగి పరంగికేడె మా
హా నెఱయించు సింగిణులు నంపదొనల్ హురుమంజిపల్ల మిం
పైన ఖలీనముం బిరుదుటందియ గజ్జెలపేరు బూని దా
సానిపటానిఁ దెచ్చె మహిజానికి రాతెరగంటి ఱేనికిన్.

46

46. పరంగికేడెము = హూణదేశపుడాలు. ఆహా నెరయించు = ఆశ్చక్యముఁ గలిగించునట్టి. సింగిణులు = ధనస్సులు. అంపదొనల్ = అంబులపొదులు. పల్లము = జీను. ఖలీనము = కళ్ళెము దాసానిపటాని = దాసానిదేశపుగుఱ్ఱము, రాతెరగంటి ఱేనికిన్ = రాజేంద్రునికి.

క.

పౌరులు జయవెట్టగఁ బరి
చారకు లరచట్ట దౌరు సవరింపఁగఁ దు

ఖ్కారతురంగము నెక్కి యొ
యారంబులఁ జొక్కి జైత్రయాత్రోన్ముఁఖుడై.

47

47. అరచట్టన్ = కటిపర్యంతము వచ్చునట్టి అంగీయందు. దౌరు = హారవిశేషమును. తుఖ్కారతురంగము = తుఖ్కారదేశపు గుఱ్ఱము.

క.

ప్రభుఁ డపుడు వెడలెఁ దపన
ప్రభుఁడై మకకధ్వజములు రా భూచక్రం
బు భయచ్ఛత్రంబుల చల
దుభయ చమర వాలముల సమున్నతి నిగుడన్.

48

48. తపనప్రభుఁడు = సూర్యునివంటి కాంతిగలవాఁడు. రాన్ = రాఁగా, భయచ్చత్రంబుల = భయముయొక్కయు, గొడుగుయొక్కయు, అనఁగా భూజనులు, రా, భయముచేతను, భూమి యావత్తు గొడుగుచేతను, వ్యాప్తమైనదనుట.

సీ.

కదలె నున్నతగంధ గంధమాదనబంధు
                 బంధురంబులు గంధసింధురములు
చనియె నింపు పొసంగ సంగరక్షితిరంగ
                 రంగదంఘ్రిప్రీగతి తురంగసమితి
గమనించె జోకం దఁగం దళద్ద్యుతి కంద
                 కందప్రధానకేళి స్యందనాళి
యరిగె భర్మధరాధరాధరీకృతి సాధి
                 సాధిష్టధృతి మహాయోధవితతి


గీ.

సన్నవీరణములమ్రోత శంఖకాహ
ళార్భటీడక్కికాహుడుక్కారదములు
దిక్కులనుఁ బిక్కటిల్లంగ జక్కి నెక్కి
పుడమిఱే డూరివాకిలి వెడలునపుడు.

49

49. ఉన్నతగంధ = గొప్పగర్వముగల. (ఏనుగులకు విశేషణము ) గంధసింధురములు = మదపుటేనుగులు. కందళ... కేళి = (కందళత్ = అంకురించుచున్న. ద్యుతి = కాంతులకు, కంద = మేఘములయొక్క, ప్రధనకేళి = యుద్ధక్రీడ గలది, అనగా మేఘములవలె నేనుగు లున్నవనుట.) భర్మ... ధృతి = (భర్మధరాధర = మేరుపర్వతముయొక్క. అధరీకృతి = క్రిందుగాఁ జేయుటను. సాధి = సాధించుచున్న, సాధిష్ఠ = మిక్కిలిదృఢమగు, ధృతి = ధైర్యముగల. మేరువుతో సమానమగు ధైర్యము గలది.)

సీ.

అంగంబునఁ బొసంగ నలవరించిన మట్టి
                 యుదయాద్రి నీరెండ యుదుట నిల్పఁ
దలనూనె బలుకప్పు ద్రావిడీస్తనపాళి
                 కస్తూరి నెఱపూత మస్తరింప
కుందనంబు మదంబు కులశైలకూటంబు
                 సెలయేటినీటితోఁ జెలిమి సేయఁ
గొమ్ముకత్తులసొంపు కొమ్మలకొనదండు
                 మొగతి మొగ్గలతోడ ముచ్చటాడఁ


గీ.

గడల బం ట్లిరుగడల రా ఘళఘళీస
మగ్రపదనిర్గళానర్గళోగ్రవృత్తి
పెరగజము కీలుగీల్కొన్నఁ బృధివి మూరు
కొని మసలిపోక యొకభంగిఁ జనియెఁ గరులు.

50

50. కుందనంబు మదంబు = బంగారమువంటి మదము, కొమ్ము...ముచ్చటాడ = దంతములపైనున్న కత్తులు కొమ్మలపై నున్న మొగలిమొగ్గలవలె నున్నవని తాత్పర్యము. నిర్గళ = గొలుసులు. పెర...ల్కొన్నన్ = ఇతరగజముయొక్క జాడఁ దెలిసినయెడ.

శా.

తైలాంచత్కచపాళిఁ గూర్చి మెలులొందం జుట్టి మేల్పాగ లం

గీలు న్సింగిణిచే కటిం దరకసాల్కెంపైన మీసంబు తాం
బూలస్యాబ్జబలంబు లత్యరుణదృఙ్మూర్తుల్ విరాజిల్లఁ దే
జీలం బొల్చు పఠాణిరౌతుగమి వచ్చె న్మెచ్చ రా చెంతకున్.

51


తల నిద్దా తగటీలు పేరణులపై దట్లున్ రుమీచూరగ
త్తులజోళ్ళుం బదనించినట్టి కరహేతుల్ తళ్కు గుల్కంగ ర
క్తలుఠన్నేత్రకరాళవక్త్రముల నగ్రక్షోణిఁ గంఖాణికా
వలి కం దోలి సలాముఁజేసే యవనవ్రాతంబు భూభర్తకున్.

52

52. నిద్దా తగటీలు = తళుకైన జరీలు. (అనఁగా జరీపాగాలు) పేరణులు = అంగీలు, దట్లు = కాసెకోకలు. రుమీచూరకత్తులు = రోముదేశపుకత్తులు, పదనించిన = పదును బెట్టినట్టి. రక్తలుఠత్ = ఎఱ్ఱనివై కదులుచున్న, కంఖాణికా = ఆడుగుఱ్ఱములయొక్క.

చ.

పటిమ నటించు సోగ నగసాగల నెన్నడుచెంగులుం గటీ
పటులఁ గటారులుం గురుచబల్లెము లుండిన పిల్లబంట్లకై
ఘటిలిన డేగలు న్ముడియకట్టల గట్టుప లీడ్చు తట్టువల్.

జిటిలెడుగంద మొప్పఁ గయిజీతపురాజులు వచ్చి రంతటన్.

53

53. నెన్నడుచెంగులు = వీపుమధ్యకు వదలిన కొనలు, కటీపటులన్ = మొలకట్టుబట్టలయందు, కైఘటిలిన = చేతిపై నుంచిన

చ.

చరణతలంబునం బసపు సన్నపుపావడపెట్లు గంటలుం
బిరుదులుగాఁగ నెన్నొసఁటఁ బెట్టిన కాపులు చల్లడాలద
ట్లరయొరడించి వైచిన శయంబుల కత్తులు బిత్తరింపఁగా
నరిగెల బుట్ల చాలరిగె నప్పుడు చప్పుడు గుప్పళింపఁగన్

54

54. పావడలు = లాగులలో భేదము. పెట్టుగంటలు = మిక్కిలి ధ్వనించు ఘంటలు, కాపులు = దిష్టిబొట్లు, చల్లడాలదట్లు = లాగులపై కాసెకోకలు, అరయొరడించివైచిన = సగముగా నొరలో దింపిన, శయంబుల = చేతులయందైన, అరిగెల = డాళ్ళుగల.

ఉ.

దట్టపు వన్నెగుడ్డ కఱదట్టి పొరన్ సవరించి పట్టెపై
గట్టి కటారి జల్లి మడికాసుల కట్టుల యెక్కువిండ్లు పె
న్నెట్టైపుగట్ట నెట్టుకొను నిద్దపువీఁపుదొనల్ నటింప మై
పుట్టున నల్ల బెబ్బులులె పో యనఁ బోయిరి బోయ బల్లిదుల్.

55

55. వన్నెగుడ్డ = రంగుగుడ్డ, కఱదట్టి =నల్లనైన కాసెకోక, కటారిజల్లి = కత్తియొక్కు జాలరు. పట్టె = పటకా, మడికాసుల = వెండితోఁ జేసిన, నెట్టెపుగట్టన్ = పాగాకట్టునందు, నెట్టుకొను = తగులుకొనునట్టి, బోయబల్లిదుల్ = బలవంతులగు బోయవాండ్రు.

క.

బాణాసనములు కోలలు
పాణింగొని హస్తలోహపటుతరకటక
శ్రేణి ఘణిల్లన నృప సుమ
బాణుఁడు గన గోణి గదల బం ట్లరిగి రొగిన్.

56

56. గోణి = చిన్నవస్తువులు వేసికొనుటకు వీపున వేసికొన్న సంచి.

సీ.

నును దట్టిఁ జక్కఁ జెక్కిన వంకి పసపు పా
                 వడఁ బొల్చు చేకత్తి నిడుద గడలు
పెరిఁ జుట్టు సిగ నొంటిపొరగుడ్డ పని వడిఁ
                 దీర్చు కోవెలకుంట తిరుమణులును
మొన వాడిఁ ద్రిప్పి తోమిన మునిపండ్లపై
                 దళుకు తళ్కనెడు కుందనపురవలు
ఱొమ్ము గాయమ్ముల నెమ్మిఁ గాయలు గాచి
                 జిగి నించి మించెడి పగడములును


గీ.

దయనయాదుల గురులిడ్డ తాయెతులును
బులులఁ బొడిచిన నాటి సాములును దొంటి
యొంటిజగడంబు బెళకు లింపొసఁగ నడచె
డాక నరపాలువెంట నొంటరులమూక.

57

57. దట్టిఁజిక్కన్ = కాసెలో నిముడునట్టుగా, చెక్కిన = కూర్చినట్టి, వంకి = బాకు, కోవెలకుంట తిరుమణులు = దేవాలయపు పండులోని తిరుమణులు, మొన...రవలు (మొన లరుగునట్టు దంతధావనముఁ జేసిన ముందరిపండ్లపైని సొగసుకై వేసిన జంగారపు పువ్వులు.) దయ...తులును (దయచేత ననఁగా సంరక్షణనిమిత్తమును, తాయెత్తులన్ = నీతి ఆచారము మొదలయినవానిచేత ననఁగా దేశాచారాదులచేతఁ తలిదండ్రులుంచిన రక్షలు.

ఉ.

ఇంటికి బొమ్ము క్రమ్మరఁ జెలీ! నిలు నిన్నిలు సేర్చి వత్తునో
వెంటనె దండు వచ్చెదవొ వేగమె రా మరియేల యందువో
యొంటి నిటున్న నళ్కొదవునో యని యాత్రకు నిక్కి రొక్కరం
దొంటరి జూచుచుండెఁ జనుచుండెడు మంది సఖీముఖేందునిన్.

58

58. అళ్కు = భయము, ఒంటరి = ఒక్కడుగా, మంది = జనులు

ఉ.

పైనఁపుదట్టిఁ గట్టుకొని బద్దుల పుట్టిక వెంటరాఁగ రా
సాని పసాని నవ్వు నెలజవ్వని రాఁగని యొక్కసాని యో
సాని మిటారి నీకు దొరసానికి నీనడ చెల్లదంచు భూ
జాని పటానిగా యనక జక్కి వెసం దిగి కొమ్మ కొమ్మనెన్.

59

59. పైనఁపుదట్టి = ప్రయాణానుకూలమయిన లాగు. బద్దులట్టిక = అబద్ధాలమారి. అనఁగా ఇచ్చకాలు జెప్పు చెలికత్తె, రాసాని = రాజుభార్యయొక్క. పస = శోభను, అని = పొంది, ఒక్కసాని = ఒక్కస్త్రీ. (ఇచ్చకాలమారియగు చెలికత్తెను వెంటఁబెట్టుకొని రాజభార్యవలె నొకసానిది రాగా దానినిఁ జూచి మరియొకతె యేమనుచున్నదంటే, నీవు దొరసానివంటిదానవు, నడచిపోవుట యుక్తము గాదు. రాజుగారి గుఱ్ఱమని సందేహించక వేగముగా వెళ్ళి ఓకొమ్మా .....కొమ్ము = అనగా దానిని బుచ్చుకో అన్నదని తాత్పర్యము.

శా.

మబ్బుంజాయల గీలుగంట్లు చెవియోరం జాలుకొన్ ప్రోగు లా
గుబ్బ నిబ్బరపుంగనీదు వికెం గ్రొమ్మించు పుట్టించు చన్
గుబ్బల్ పాదపుఁజుట్లు కన్నుల ముసుంగుల్ నుబ్బ బిబ్బోకమాన్
బిబ్బీ గబ్బి మిటారు లెక్కుతురగీబృందంబు చిందెన్ నడల్.

60

60. కీలుగంట్లు = జడలు. చాలుకొన్ = వరుసగానున్న, ఆగుబ్బన్ = అతిశయించగా, పాదపుజుట్లు = కాళ్ళ మెట్టెలు, నుబ్బన్ = ప్రకాశింపగా. బిబ్బోకము = విలాసమును. ఆన్ = పొందిన. బిబ్బీ ...టారులు = మ్లేచ్ఛస్త్రీలు, నడల్ = నడకలను. చిందెన్ = చిమ్మెను.

ఉ.

నెన్నడఁ జూపె వెండి రహి నిండిన సందిటి బొందు భూతితో
నెన్నొస లానఁ బాల్పెరుగు నెయ్యిని వాఁడెడు కోడెకాండ్రపై
వెన్నెలసోగ లీను జెలి వెన్కొను గన్గనఁ గన్న పాయపుం

గన్నడ కన్నె లెక్కిన చొకొరపుమంకెన గిత్త లత్తరిన్.

61

61. వెండి...బొందు = వెండియొక్క శోభచే నిండిన, దండ = చేతిదండ, వెన్నెలసోగలు = వెన్నెలవంటి దీర్ఘప్రసారములు, ఈనన్ = పుట్టించునట్లుగా, చెలి వెన్కొను...గన్న = చెలికత్తెవెనుకకు బోవుచున్న నేత్రద్వందముఁ బొందిన. మంకెనగిత్తలు = పైని వేసినబరువులు జారిపోకుండునట్లు గట్టిన పేపబుట్టలుగల యెడ్లు, నెన్నడఁ జూపెన్= నడువ నారంభించినది.

శా.

నానాధ్వన్యవిలోకబృందములకుం దా విందుఁ గావించె దా
స్యానీతామితవీటికాబహిరితప్రాంచత్కరారాగ్రంబునం
గీనం దుప్పటి దిద్ది యందలములో నిట్లేగి కొం చప్డు క్షో
ణీనాథు న్వరియించు మానిసి హిమానీచ్ఛన్నపద్మాకృతిన్.

62

62 దాస్యా ... గ్రంబునంగు = దాసిచేతఁ దీసుకొనరాఁబడిన తాంబూలముకొఱకు, వెలుపల ఇత = పొందినట్టి. చేతి చివరయొక్క అంగు = శోభ, ఈనన్ = పైకిఁ గనఁబడునట్లుగా, ఏగికొంచుపోవును. క్షోణీ... మానిని = రాజుయొక్క భోగినీ = స్త్రీ, అనగా బురకావేసిన పల్లకీలోనుంచి దాసియిచ్చు తాంబూలమునకై చాపిన చెయ్యిఁ జూచినమాత్రాన చూపరుల కానందమయ్యెనని తాత్పర్యము.

సీ.

లావణ్యలహరి కళానిధి కనకాంగి
                 మదకురంగి మదాళి మణిశలాక
కాలంజి యడపంబు తాళవృంతము గిండి
                 కుంచె వింజామరఁ గొంచు నడువ

కటి నిండఁదోపు దుప్పటి గట్టి యుత్తరీ
                 యము లూని కేలు గే లమరఁ
పట్టెవర్ధనఫాలపట్టిక నిక్క ద్వి
                 జద్వయి రాఘవాష్టకము


గీ.

బిరుద ముద్రలు పెద్దలు బిగిసి రాజు
వెంటఁ గొలుచుచు నడిచెడివేళఁ జేరి
వారి ముద్దులమఱఁది రా వసుమతీశు
గారవపుఁగొమ్మ పల్లకీ గదలె నపుడు.

63

63. ప్రథమచరణమంతయు దాసీజనము పేర్లు. గుడుగుడీ. అడపము = తాంబూలపుసంచి, తాళవృంతము = గండి కూజా. కుంచె = నెమలికుంచె. తోపుదుప్పటి = దుప్పటి. ద్విజద్వయి = ఇద్దరుబ్రాహ్మణులు. (రాజుగారి అప్పగారిపల్లకీతో జాగ్రత్తకై యుండుట న్యాయము.)

చ.

పిడికెడుజందెము ల్నొసలఁ బెట్టిన సన్నఁపుపట్టెనామముల్
గడితఁపుదుప్పటీల్ కుఱుచగాలికటారులు గప్పుమీసము
ల్బడి గతఁ జెప్పుచున్ ద్విపదబాపఁడు నొప్పఁగ నేగెఁ బల్లకీ
కడల నతంబుగా నగరికావలఁ గాఁచిన రాచపైకముల్.

64


64. గడితపు = గొప్పవియగు, కప్పు = నల్లనైన, ద్విపదబాపఁడు = ద్విపదఁ జదువు బ్రాహ్మణుఁడు. నతంబుగాన్ = గలుగునట్టుగా, పైకముల్ = సమూహములు.

మ.

పెసరుం గాయకు మెత్తకన్పులకునై పేఁటాడు మన్ గొఱ్ఱలన్
నుసలం జూచుచు దోసచేల్ చెఱకుచాల్ నుగ్గాడుచున్ సజ్జఁ గో
య సుమాళింపుచు సేనరాపెగసి కా ళ్ళావంక కీడొంకకై
యస దంచం జదరంపుగుంపరిగె నాహా! యాశరద్వేళలన్.

65

65. మెత్తకన్పులు = చేను కోసినతరువాత నిల్చియుండు చొప్పదంట్లు, పేటాడు = పెనుగులాడు. సుసలన్ = లాగుటకు, నుగ్గాడుచున్ = నిలిపివేయుచు, సజ్జన్ = సజ్జవెన్ను. సుమాళింపుచున్ = దుముకుచు, సేనరాపు = పెద్దగందరగోళము. అసదు = కొంచెము. అంచన్ = పంపఁగా. (కాళ్ళు ఇటూ అటూ దుమికించుచున్నవి యనుట.)

గీ.

శారదాభ్రాకృతులఁ బోరు సలుపవచ్చు
శక్రకరిమోముపై నీళ్ళు జల్లె ననఁగ
వమధు లుడువీథిఁ జల్లుచు వారణంబు
లరిగె గెల్చుట కడమ దిక్కరుల నెంత.

66

66. వమధులు = తుండములలోని జలబిందులు. కడమదిక్కరుల గెల్చుట యెంతపని యని యన్వయము.

సీ.

సస్యకైదార్య మాశ్వచ్ఛటాఖురపుటీ
                 త్రుటితమై వేవిలి దుక్కి గాఁగ
గడియలోఁ గరి కొమ్ము కడిమిచే నడవి పాం
                 డవ బలధ్వస్తఖాండవము గాఁగ

రథచక్రకృతనిమ్నపథరేఖ జలధికిఁ
                 బటుతరప్రత్యగ్రతటిని గాఁగ
భటకోటి సున్నంపుపదనుచేఁ జెరువులు
                 మునిముఖ్యచులికితాంబుధులు గాఁగ


గీ.

బిట్టు శతయోజనంబుల పెట్టు కాపు
లాత్మగృహభూమ్యనిర్ణయవ్యధలఁ గదల
విమతనృపకోటి పుటభేదనములమీఁద
దండు దిగె రాజు వికమోద్దండుఁ డంత.

67

67. సస్యకైదార్యము = చేలుగల పొలము. వేవిలి = దున్నని వేట. కడకొమ్ముకడిమిచేన్ = ఏనుగుదంతముల బలముచేత. సున్నంపుపదను = తాంబూలపుసున్నము దడుపుట. మునిముఖ్యచులుకిత = అగస్త్యునిచేఁ ద్రాగఁబడిన, శతపెట్టు = నూరామడపర్యంతము. కాపులు = గృహస్తులు. ఆత్మ ... వ్యధలన్ = తమయింట నేలఁ దెలియక దుఃఖించుచున్నారనుట, పుటభేదనములు = పట్టణములు.

సీ.

మక్షికాబాధ కరాక్షేపణాక్షీణ
                 భోజనాంతరచలద్భోక్తృగణము
చంచత్తురగరోమకుంచికాంచితపాణి
                 చలనయుక్ప్రాప్తవిచ్చరికంబు
ధరణీవరావరోధకవధూటీభూత
                 కటకుటీపటకటీతటగణికము
స్థితి నిత్యతాప్రియార్థీకృతగమనసం
                 త్యక్తధన్యాదిసంతప్తజనము


గీ.

దండు సులభంబె పురుషవేదండులకును
గూచిఁ గావింపఁ గుండియల్ గుబ్బురనఁగ

దిగిన దివసంబు సరిప్రొద్దు దీరువేళ
కోదనాదరదూరులై యుండు టరుదె.

68

68. కరాక్షేపణ = చేతులతోఁ దోలుటయందు. రోమకుంచికా = రోమపుకుచ్చులతోటి. పాణిచలన = హస్తముయొక్క కదలుటతోడ. యుక్ = కూడిన, ప్రాప్తవిచర్చికంబు = పొందఁబడిన గజ్జికలవారు గలది. అనఁగా గజ్జిబట్టినవార, గుఱ్ఱపువెంట్రుకలకుంచెతో విసరుకొనుచున్నారని తాత్పర్యము. ధరణీ...గణికము = ధరణీవర = రాజులకు, అవరోధక, వధూటీభూత = అంతఃపుకరస్త్రీ లైన. కటకుటీ = చాపలతోఁ గట్టిన పాకలయం దున్న, పటుకటీతట = గొప్పపిఱుదులు గల. గణికము = వేశ్యలు గలది. స్థితి .. జనము = (స్థితి = ఉనికియొక్క, నిత్యతా = నిత్యత్వముచేత, ప్రియార్థీకృత = ఇష్టవస్తువులై చేయఁబడినట్టియు. గమన = ప్రయాణమందు, సంత్యక్త = విడువఁబడిన, ధాన్యాది = ధాన్యము మొదలగువానికై, సంతప్తజనము = పరితపించుచున్న మనుష్యులు గలది. అనఁగా స్థిరముగా నుందునని సంపాదించిన ధాన్యాదులను విడిచిపోఁజాలక జనులు విచారించుచున్నారని తాత్పర్యము.) కూచి=దండు బయలుదేరుటకు గుఱుతుగా జేసిన వాద్యము. దిగిన....వేళకు = దిగినరగోజున వేళ దప్పిన హేతువుచేతనని తాత్పర్యము. ఓదనాదూరులై = భోజనాసక్తి లేనివారై.

సీ.

పాళెంబు డిగి యొక్కపజ్జ నిల్వక మున్న
                 కూచివేసినపాటి గుండెదిగులు
త్రావ నీ ళ్ళడని విస్తరదుస్తరపుత్రోవ
                 నెత్తు పైనమునాటి యెండగొట్టు
మదహస్తి గని గిత్త బెదరి చిల్లరగోనెఁ
                 బడవైచి కదలు నప్పంటిగోడు
దంట గుడారు క్రిందటీ వెల్లువల నరు
                 ప్రొయివీఁగఁ గొట్టిన పూట నిట్రు.

గీ.

ఒక్కొకదినంబు తమయింటియొద్దివారి
దలచికొన్నపు డొదవు సంతాపభరము
పూనకుండుట యెట్లు భవానిపతియు
వానిఁ బూని ధరం దండు జేసెనేని.

69

69. పాళెంబు = దండు దిగినచోటు. (బసలో ప్రవేశించకపూర్వమే కూచివేసినట్టు బెదురు) నీళ్ళడని = నీళ్ళు దొరకనట్టి, ఎత్తు పైనము = మకాము లేని ప్రయాణము, గోడు = కష్టము, దంటగుడారు = సమముగా నున్న డేరాలో నున్న, నీఁగఁగొట్టిన = అరిపివేసినట్టి, నిట్రు = ఉపదానము.

సీ.

చవికె బండారాకు సందుల డిగి మంచు
                 తుంపురు ల్దుప్పటిఁ దొప్పఁదోగ
నపుడ వైచిన పచ్చియరుగుపైఁ బవళింతఁ
                 గలువకాఁడై మేను గాసిఁ బొదల
గుడిసె నెన్నడు చక్కిఁ గుడువ వల్పిరిఁగొన్నఁ
                 గడలు దుట్రిల వడవడ వడంక
ప్రభువు వచ్చినదాఁక బయలు గాచుచుఁ జెవుల్
                 సీదరల్ బోదగ్గి చీఁది చీఁది


గీ.

తావు గాసంతె చాలుఁ గాంతారమైనఁ
డాలుఁ గొలువిందుఁ జొప్ప నామా లుడుగును
జనుట మేలిక బనికిరా దనిరి బంటు
లరిది సీతునఁ దండులో నటమటించి.

70

70. దొప్పఁదోగన్ = మిక్కిలి తడియఁగా, వల్పిరిగొన్న = చలి యెక్కిన, తుట్రిలన్ = చినుకులు పడఁగా, కొలువిందుజొప్పన్ = ఇక్కడు సేన యున్నట్టయితే, నామా లుడుగును = చావువచ్చును. అటమటించి = బాధపడి.

చ.

వలి కయి విల్లువంకఁ గని వ్రాసెడి నొక్కటి లెక్క యక్కునం
దల యిడి రెంటిలెక్క యిడి నాఁడు ముడించిన కాళ్ళసొంపుచే
నిలిపెడి మూటిలెక్క భళి నిద్దురవోవుచు లెక్క మానఁ డీ
బలకరపుందవుల్ గలుగు బక్కనియోగి యటండ్రు తద్భటుల్.

71

71. వలి = చలి, వంపుగా నున్నప్పుడు ఒకటియంకెవలెనును, తల గుండెపై వంచినప్పుడు రెండంకెవలెనును,కాళ్ళు ముడిచినప్పుడు మూడంకెవలెను ఉండెను.

చ.

కిలకిల నవ్వి తానె పరికించుఁ బురిన్ విటు నట్టి వీథికాం
తల చరదల్ప వారవనితామణి పిల్చిన నీటువెట్టుచుం
బలుకదు తొంటి పైఁడి తనపాతిక మాటకు మాటలాడ రూ
కలు పదియైదు నిద్దురకు గట్టివరాయను నట్టి దండునన్.

72

72. తొంటి... మాటకు = మునుపిచ్చునట్టి సొమ్ము ఇప్పుడు నాల్గవవంతు మాటకియ్యవలెనని తాత్పర్యము.

శా.

రంభీకారితకుంభచేటిక మురుప్రాసాదభూమీభవ

త్కుంభి న్యుద్యత జీర్ణకంబళ మిళద్గూఢారమాకాశగం
గాంభోభూతగజాశ్వవిడ్జలనిశాంతానంతవేశంతకం
బంభస్సంభవసూతికిం గఠినమే కాదండు ప్రోద్దండతన్.

73

73. రంభీ ... చేటికము = రంభయై చేయఁబడిన నీళ్ళు మోయు దాసి గలది. ఊరు .. గూఢారము = గొప్పమేడలైన చింకికంబళిఁ బరిచిన గుడారు గలది. గంగాం... వేశంతకంబు = గంగోదకమైన యేనుగులయొక్కయు, గుఱ్ఱములయొక్కయు లద్దెల నీళ్ళకు స్థానమైనగోతులు గలది. అనఁగా దండులో నీచవస్తువులు ఘనవస్తువులుగాఁ దోచుచున్నవి. నాల్గవపాదమందుఁ బ్లుతయతి.

క.

ఇత్తెరగున దండెత్తి నృ
పోత్తంసుఁ డుదాత్తవృత్తి నుత్తరధరణీ
భృత్తతుల కోట కొత్తళ
మత్తఱిఁ దుత్తుమురుఁ జేసె నత్యుద్ధతుఁడై.

74

74. ధరణీభృత్, తతుల = రాజుల, తుత్తుమురు = నుగ్గునూచము.

సీ.

కుంతలాధిపు చిక్కు కుటిలత్వ మెడలి౦చె
                 సింధురాడ్భంగంబు క్షితికిఁ దెల్పె
సౌరాష్ట్రవిభురాగసారంబు హరియించె
                 గాంధారవిభు స్వరాక్రాంతుఁ జేసె
గౌడనాయకుఁడు రంగంబున సమరించెఁ
                 గాశభర్తఁ దృణంబుగాఁ బెగల్చె

మత్స్యవల్లభుఁ బట్టి మాన్పించె మిట్టి పా
                 టంగేశుఁ దనుబలాధ్యక్షుఁ జేసె


గీ.

ధాటికాఘోటికాటీకపాటనమున
నరిపురంబులపై నట్యలుక బుట్టి
కిసలయోష్ఠీదృగంభోజకీరరాజ
మోహనుండగు నారాజవాహనుండు.

75

75. ఈ పద్యమందు రెండర్ధములు. కుంత ... ఎదలించె = తలవెంట్రుకలచిక్కు విప్పె. సింధు... తెల్పె = సముద్రమువల్ల భూమికి భంగముగలదు. సౌరాష్ట్ర... సారంబు = సౌరాష్ట్ర రాజ్యముయొక్క బలము. గాంధర...స్వరాకాంతున్ = (స్వః = స్వర్గమును, ఆక్రాంతున్ = ఆక్రమించినవానిగానని ప్రకృతార్ధము.) గాంధారగ్రామమును స్వరములచే నాక్రమించఁబడినదానిగా. గౌడ... సమరించెన్ = గౌడదేశపు గుఱ్ఱములు శ్రేష్ఠములు. మత్స్య... పాటు = చేపను మిట్టిపడకుండఁ జేసెను. అంగేశు... జేసె = అంగరాజును, తనువు = శరీరము. (తనుబలము౼ కొద్దిబలమని ప్రకృతార్థము.)

సీ.

సాగ్రహారు లుదగ్రవిగ్రహారులు గాఁగ
                 నగ్రహారులఁ జేసె నగ్రజనుల
తరువాటులను జేరి తెరవాటుఁ గొట్టించు
                 పరువాటి బల్లెంబు సాలుఁ జేసె
సేవాలయము లైన దేవాలయములఁ బూ
                 జావాలయములుగా సంఘటించె
దనవాసుల సమస్తవనవాసులకుఁ దాన
                 ననవాసుల హరించి ననుపు లిచ్చెఁ


గీ.

జరణశరణాగతాహితభరణకరణ
తరుణకరుణాకటాక్షుఁ డాధన్యుఁ డంత

యుత్తరాంభోధి తటసముదాత్తవిజయ
బంధురస్తంభజృంభితపయన కలన.

76

76. సాగ్రహారులు = ఆగ్రహముతోఁగూడిన శత్రులు. అగ్రజనులు = బ్రాహ్మణులు, తరువాటులు = వృక్షపంఙ్క్త్తులు. తెరవాటు గొట్టించి. త్రోవలు దోచుకొని. నేవాలయములు = పూజాశూన్యములు. పూజా...యములు = (పూజావాల = పూజకుఁ బాదులైన అనఁగా స్థానములైన, యములు = యతులు గలవి.) తనవాసులన్ = తనగౌరవములచేత. ననవ = క్రొత్తవి గాని, అసులన్ = కత్తులను. ననుపు = జీవనోపాధి. పయన = పొందుట.

క.

వనములు బహుజీవనపా
వనవనజాకరమునివరవసుధాధరఖే
దనభంజనజనరంజన
జనపదములు నదులు గడచి చనఁ జన నంతన్.

77

77. బహు.. ధర = విస్తారమైన యుదకముచేఁ బవిత్రమగు కొలకులును, మునిశ్రేష్ఠులును, పర్వతములును గల.

ఉ.

ముందరఁ గాంచె నిందుకులమోదసుధారసమందరంబు పౌ
రందరనీలకందళధురంధరసింధురబృందమందిర
త్కందరనిర్గతావిశదకాంత్యుపమేయనమత్పిరంగికా
తుందరణత్కృశానుధృతధూమవిశాలము వింధ్యశైలమున్.

78

78. ఇందు...మందరంబు = (రాజునకు విశేషణము.) ఉపమేయ = ఉపమేయవస్తువుగాఁ గల, (పిరంగికా. ఇది సంస్కృతశబ్దమని తోచదు.} తుంద = గర్భమందు. రణత్, ధ్వనించుచున్న (పర్వత గుహలో నల్లనియేనుగులు పిరంగిలోనున్న పొగవలె నున్నవని తాత్పర్యము.) ఈపద్యము విచారణీయము.

క.

ఉదిరి మలతోఁడ నొరయఁగ
నెదిరిన దొర పెక్కు వేల యేండ్లిల నధమున్
మెదలంగ నీని బల్లిదుఁ
డదయగ్రహములకు గ్రహమహా యితఁ డనుచున్.

79

76. ఉదిరిమల = మేరువు పర్వతము. అదయగ్రహములకు గ్రహము = గ్రహముల నడ్డగించినది.

క.

కాంచి గిరి కటక శిఖర
ప్రాంచనవైచిత్రి కాత్మ నలరి సరస్వ
త్కాంచీధవపంచానన
మించుక చనఁ దద్ధ రాభృదీశాను దిశన్.

80

80. సరస్వ......పంచాననము = సరస్వత్ = సముద్రము. కాంచీ = మొలనూలుగల భూమికి, ధవ = అధిపతులగు రాజులలో పంచాననము = సింహము, అనఁగా రాజశ్రేష్ఠుడు.

సీ.

భువనాభినవనాట్యభవనాపజవనాల
                 నలనాఢ్యపవనాశ్రయవిటపికము
కలికాపటలికాయుగలికార్క్ష్ణగలికాప్త
                 కులికాగ్రఫలికాంచకుంజగృహము
స్ఫుటజాతికుటజాతికుటజాతతటజాత
                 కటజాగ్రదుటజాపగతదురితము
గమలాసితమలాలితమలాళసమలాస్య
                 విమలాబ్జకమలాకరమహితంబు

గీ.

చూడ నేపారు శశిఖండచూడనేత్ర
తాడనేతరసుమధనూరాడనీక
పీడనేడితహృత్పరివ్రాడనేక
పసవనంబులఁ బొలుచు తాపసవనంబు.

81

81. భువనా... విటపికము. (భువన = లోకమందు. అభినవ = క్రొత్తదియగు. నాట్య = నాట్యమునకు, భవన = గృహమైన, అపజవ = పోయిన వేగముగల, నాలనలన = తామరతూళ్ళు విరుచుటతోడ, ఆఢ్య= కూడిన, పవనాలయవిటపికము = గాలి కాధారమగు వృక్షములు కలది. కలికా...గృహము = (కలికాపటలికా = మొగ్గలగుంపులతోడ, యుక్ = కూడిన, అలి = తుమ్మెదలనెడు, కార్క్ష్ణగలికా = నల్లనికంఠముగల యీశ్వరునిశోభను. ఆప్త = పొందిన, కులిక = వృక్షవిశేషములయొక్క, అగ్ర = చివరయందైన, ఫలికా = ప్రేంకణపుతీగెలచేత, అంచ = ఒప్పుచున్న, కుంజగృహము= పొదలు గలది. స్ఫుట = వికసించిన, జాతి = జాజితీగెలయొక్కయు, కుటజ = కొడిసెచెట్లయొక్కయు, అలి = పఙ్క్తి యనెడు, కుటి = గృహములయొక్క, జాత = సమూహముయొక్క, తట = ఒడ్డునందు (అనగా దగ్గిరను) జాత = పుట్టిన, కట = చాపలచేత, జాగ్రత్ = ఒప్పుచున్న, ఉటజ - పర్ణశాలలచేత, అపగత = పోయిన, దురితము = పాపముగ లది. కమలా... మహితంబు = కమల = పద్మములయందు, అసితమ = మిక్కిలి నివసించినట్టియు, లాలిత = గారవించఁబడిన, మరాళ = హంసలతోడ (రలలకు నభేదము.), సమ = సమానమగు, లాస్య = నాట్యము గల, శశి... నేతర = శివనేత్రపు తాకుడు లేని, సుమధనురాట్ = మన్మథరాజుయొక్క, పరివ్రాడనేకప = మునిశ్రేష్ఠులయొక్క, సవనంబులన్ = యజ్ఞములచేత.

సీ.

ఉటజాజిరరజంబుఁ బటుకర్ణపుటిఁ బోవఁ
                 జరచి తొండమునీరు జల్లెఁ గరిణి

చంచువుకొనఁ దమ్మిఁ జించి చేకొని వచ్చి
                 కట్టాణిమ్రుగ్గులు బెట్టె హంసి
అకరముల్ గొన్ని మేయకమున్నె దేవపూ
                 జకుఁ దెచ్చు జలజముల్ చక్రవాకి
ఘోణహతినిఁ గూర్చి వేణుతండులకంద
                 మూలబృందము లిచ్చు ముందె కిటియు


గీ.

సమయములు గాచి సంయమిసార్వభౌముఁ
డారగించినమీఁద రామాయణంబు
శారి యర్థంబు వినుపింపఁ గీరి చదువు
నేమి చెప్పెద మునివనీభూమి మహిమ.

82

82. చంచువు = పిట్టముట్టె, అకరముల్ =పద్మకింజల్కములు, ఘోణ = పందిముక్కు, కిటి = అడవిపంది, కీరి = ఆడుచిలుక.

గీ.

నీలకంఠతనూభవవ్యాలకంబు
సతతశార్దూలవాసస్ఫురితవృషంబు
పంచముఖలాలితమృగంబుఁ గాంచె నపుడు
నృపుఁడు శివమూలధనము నా తపసివనము.

83


క.

అటఁ జూచి యటవి దక్షిణ
తటమునఁ దనదండు డించి తటుకున జటిరా
డుటజకుటదర్శనాతి
స్ఫట మతి నటియింప నరుగుచోఁటుల నెదుటన్.

84


సీ.

“అణుది త్సవర్ణశ్య చాప్రత్యయ” యటంచు
                 వ్యాఖ్యానమాను వైయాకరణులు
హస్తచేష్టలఁ “బర్వతోగ్నిమా” నని రేఁగి
                 కర్కశోక్తులు బల్కు తర్కవేత్త

లంత కంతకు "నంకురాదిసకర్తృక"
                 మనుచుఁ గొట్లాడు వేదాంతికులును
విదితంబుగ "నకదాచిద నీదృశంజగ
                 త్త" నెడీ మీమాంసావిదావళియునుఁ


గీ.

జెలఁగి తొలునాఁడు తరవాయిఁ జెప్పినట్టి
యెల్ల పన్నంబు లేకరువిడి పదంబుఁ
గ్రమము గుణియించు నెష్ఠికబ్రహ్మచారి
నికరములు గొల్వ వచ్చె శాండిల్యమౌని.

85

85. అణుది...ప్రత్యము, ఇది వ్యాకరణసూత్రము. పర్వగ్నిమాన్ = తర్కవాక్యము. అంకురాదిసకర్తృకం = వేదాంతవాక్యము. నకదా.. జగత్ = మీమాంసాసూత్రము. పన్నము = ప్రశ్నము.

సీ.

జను లెన్నఁగను బిగించిన మోహపాశంబు
                 కట్ట నాఁ బటుజటాగ్రంధి దనర
మూర్తిత్రయీమధ్యమునివర్ణ మిదియ నాఁ
                 ద్రైపుండ్రమధ్య మేదావి యొనర
శీతాంశు మఱ్ఱి డించిన సన్నయూడల
                 గమియ నాఁ బెంపుడుగడ్డ మమర
పాణి పంకజమంచు భ్రమరాళి దిరిగె నా
                 భ్రమదక్షమాలిక పరిఢవిల్ల


గీ.

నంగుళి పవిత్ర ముత్తరీయమును బొదల
యోగపట్టయు రుద్రాక్షయుంగరంబు
జెవుల షట్కుండలము లొప్పు దవులు నట్టి
కాంక్షితార్థప్రదునిఁ బారికాంక్షి గాంచి.

86

86. మేదావి = ఔపాసనాగ్నివిభూతి, శీతాంశు = చంద్రునిలో మఱ్ఱిచె ట్టున్నదని కొందరిమతము, పారికాంక్షి = ముని.

గీ.

అపుడు సాష్టాంగవందనం బాచరించు
పార్థివు “ననేకరాజ్యాధిపత్య మస్తు
మహీపతే” యని దీవించి మండలేంద్రు
దండఁ గూర్చుండ నియమించి తపసి పలికె.

87


క.

జననాథ సుఖమె నీకున్
జనకునకును రాజహంసునకు సేమంబే
జనని వసుమతికి భద్రమె
సనయభవద్భుజభృతప్రజకు భావుకమే.

88


చ.

జనకుఁడు రాజ్య మిచ్చి నిను సర్వబలంబులు గూర్చి కూర్చి పం
పిన పలు కర్జితారిపుటభేదనదండనవార్త దూర్తక
ర్తన మొనరించు మాట యిటు దాడిగ వచ్చితి రన్న సుద్ది శి
ష్యుని ముఖసూక్తిచే వినఁగ నుల్లము చల్లఁగ నుల్లసిల్లెడున్.

89


ఉ.

నీజనకుండు మాయెడఁ బ్రణేయఘృణేయుఁడు నిన్ను మాకు నా
యోజనె యుండుమీ యనుచు నొండన నేటికి మాపురాణముల్
మాజపహోమభాగములు మాసకలాశమయాగయోగముల్

నీజయవార్త వంకఁ దగనెమ్మి వహించుట రాజవాహనా.

90

90. ప్రణేయ = కొత్తదియగు. ఘృణేయుఁడు = దయగలవాఁడు.

క.

జనపతుల సత్యసంధుల
మను మాంధాతలఁ గుమారమణులం గనమా
నినువంటి సుధిని సౌజ
న్యనిధిని గని వినియు నెరుఁగయ్య మహాత్మా.

91


క.

అని మునిమణి కే ల్గైకొని
జనవర మధ్యాహ్నమయ్యె సమయం బిది మా
జనసుతాధిపపదపూ
జనమునకున్ సదనమునకుఁ జనుదెంచి దయన్.

92


క.

వించారగింపఁదగు గో
విదాంఘ్రి మిళింద! మనవి విని చనుదె మ్మీ
విందాక రాచకలువల
విందా! ముఖనిందితారవిందా! నందా!

93

93. ఇందాఁక, చనుదెమ్ము అని యన్వయము.

క.

ఇట జంపు లేక పదమని
కుటజన్మనిభుండనన్ సకోరకపటలీ
కుటజంబున కుటజంబున
కటజంబూద్వీపభూపహరి తా నరిగెన్.

94

94. కుటుజన్మనిభుండు = అగస్త్యునితో దుల్యుఁడు. సకోర...జంబునకున్ = మొగ్గలసమూహముతోఁ కూడిన కొడిసెచెట్లు గల.

క.

అరిగి నృపుఁ డమరధేను
స్మరణస్ఫురణప్రచరణసకలేందిరమం
దిరమై గరిమం దిరమై
కరమందిన మౌనిశాలఁ గని యవ్వేళన్.

95

95. గరిమన్ = గౌరవముచేత.

క.

జలకం బాడి నిటలగత
తిలకంబై నాసికాస్థతిలకము భూభ్ళ
త్తిలకము వచ్చెన్ హితనృప
కులకముతో భోజనంపుకూటంబునకున్.

96


క.

జగతీనుత మౌ నిచ్ఛా
త్రగణంబులు పైఁడిపళ్ళెరంబులుఁ జుట్టుం
దెగబాఱె డనఁటి మేలిమి
చిగురాకులు వైచి జలముఁ జిలికించుటయున్.

97


క.

స్వకరఘృతపాత్రి ముంచుచు
సకలరుచిస్ఫుటదపూప శకలంబునఁ దా
నకలంకనటన మెరయఁగ
నొకసతి పాత్రాభిఘరణ మొనరించంగన్.

98


ఉ.

కుంకమపంక మిచ్చు నలుగు ల్మణుఁగుల్ నునుగీలుగంటులుం
బొంకముఁ జూపఁ దాపసునిపుత్రిక లుజ్జ్వలహేమపాత్రికల్
కంకణనిక్వణాంకకరకంజములన్ ధరియించి రత్నతా

బంకరుచుల్ దటిల్లతల డాపగ బంతులవెంబడిన్ వడిన్.

99

99. కీలుగంటులు = జటలు

మ.

వడియం బప్పడ మొప్పు నింపు వరుగల్ వాటంపు మారీచపుం
బొడి నేయాళికిఁ దేలి తాలిదపుసొంపుల్ నింపు వంకాయవే
పుడు గమ్మదన మందు కందయు నుపుంబొళ్ళున్ రుటంబైన చి
క్కుడుజట్టల్ మొదలైన శాకములు నొల్కుం బప్పు వడ్డింపఁగన్.

100

100. మారీచపుంబొడి = మిరియపుపొడి, ఉపుంబొండ్లు = ఉప్పుగుండలు, రుటంబు = దృఢము, చిక్కుడుజట్టల్ = చిక్కుడుకాయముక్కలు, ఒల్కుంబప్పు = చాయపప్పు.

క.

క్రొం బొగపు కూర వగ తిరు
గం బోతల మెంతి జీరకంబుల వలపుం
దుంబొళ్ళ తావి శిఖరుల
గంబూర జగంబు వొగడఁ గా నట సుడిసెన్.

101

101. దుంబొళ్ళు = జీలకఱ్ఱ మొదలగు పరిమిళద్రవ్యములగుండలు, శిఖరులు = ఒకానొకవిధమైన భక్ష్యములు. గంబూర = పరిమిళము.

క.

లలి జీరకర సభారం
బుల యన్నంబిడిరి లేఁజివురుఁబోఁడులు రా
జుల పళ్ళెరముల వల్లీ
కుల మావాలముల విరులు గురిసె ననంగన్.

102

102. ఆవాలములన్ = పాదులయందు.

క.

కమ్మనితావులు చల్లఁగ
గమ్మనియాజ్యంబు హాటకపుతపెలలఁ పొం
కమ్ముగ వంచిరి పత్రపు
టమ్ముల గిన్నెల నటబ్జటాకవధూటుల్.

103


సీ.

మీఁగాళ్ళమీఁద గ్రమ్మిన పింజ మాదావ
                 ళము సేయ నఖలాక్షదమిఁ గదల్చి
కాయ సమ్రతఁ జెంపఁ కై యింతకై వ్రాలు
                 కీల్దంటు ననురాగకేళిఁ జనకి
భుజమెత్తి చారుమూర్ధజరాజిఁ ద్రోచు న
                 త్తఱి గక్ష రుచి మదిఁ దాల్మిఁ దరమి
ఘళ్లున భాజనాంకము మెట్టమట్టెల
                 పదముల ధైర్యసంపదఁ బెకల్చి


గీ.

మధుపవేణులు వడ్డింప మధురసూక్తి
యధరరక్తిమ విన్నకన్నయ్యలకును
దేనియలయందు శిఖరుల నానవాల
యందు నిక్షురసములందు నరుచివొడమె.

104

104. పింజ = కుచ్చెళ్ళ చివర. మాదావలము = కపిలవర్ణము. భోజనాంకము = భోజనపాత్ర సమీపము. నానవాలు = భక్ష్యవిశేషము.

సీ.

అన్నన్న మృదులసదన్నసౌరభ్యంబు
                 సాటి గల్గునె చారు చారురుచికి
లెస్సాయెగా కదళీశాకపాకము
                 ల్మరి హరించెనె కదా మనసు గినసు

చట్టిలో నెయి వంచి వట్టిగాఁ బ్రేల్చిన
                 పొట్టికాకరకాయఁ బొగడఁ దరమె
మేలింపుచవి గుల్కు తాలింపు వంకాయ
                 యూర్పులు గొనియాడ నేర్పు గలదె


గీ.

భళిరె! కజ్జాయ మయ్యారె పాయసములు
మేటిశిఖరులు పచ్చళ్ళు మెచ్చవచ్చు
నౌర! పెరుగూరుగాయ యమ్మక్క! యనుచు
రహి భుజించిరి సడిసన్న రాచవారు.

105

105. వట్టిగాన్ = ఆరిపోవునట్టుగా, ప్రేల్చిన = వేచిన, తాలింపు = పొగుపు, సడిసన్న = ప్రసిద్ధులైన.

మ.

జననాథేంద్ర మమాశ్రమేతుబహవశ్శాకానసంత్యగ్రజీ
వన మీశార్పితమన్న మేవ భవతాం వస్తూనిసంత్యాలయే
మనసిత్వం స్మరతానితేనపరసీమానేయమేషత్వదీ
య నికాయ్యస్సమయోధికోభవదసౌఖ్యం సర్వమన్వేళలన్.

106


క.

సరసప్రత్యుపచార
స్ఫురణమున భుజించి లేచి పూర్ణహృదయుఁడై
ధరణిపతి “భోజనస్యా
దరోరస” యను వచనము తథ్యము గాఁగన్.

107


క.

శీతలహిమాంబువులు గని
సీతలమను నూతనకలశీతలజలముల్

భూతలనేతలచేఁతుల
కీతల వర్షించి రమ్మునీశ్వరశిష్యుల్.

108

108. సీతలము = సౌమ్యము. కలశీతల = కలశమందలి, ఈతల = వెలుపల.

క.

ఇందుకులరాజనందన
కందర్పులమేన మౌని ఘనసారవరా
మందతుహినాంబుమృగమద
కందళితానందమైన గంద మలందెన్.

109


క.

ఒప్పిన వలిమంచుల నీ
విప్పిన తెలిమంచు లనఁగ వెన్నెల లనఁగాఁ
జొప్పడి పిడికిట నడఁగెడు
దుప్పటి లప్పటియశోనిధులకుం గప్పెన్.

110


క.

అతిరాగపుబాగాలున్
రతిరాజితగండపాండురద్యుతితతికిం
బ్రతి రాజిలు తెలనాకులు
యతిరాయఁ డొసంగె నిజనియతి రాజులకున్.

111


క.

ఇత్తెరఁగున లాలించి నృ
పోత్తము వీడ్కొల్పె పాలె మున్నచ్చటికై
యత్తఱినిం బశ్చిమభూ
భృత్తటికిం బ్రొద్దు వ్రాలె నెఱ్ఱలు దారెన్.

112


శా.

సత్యాలోకనలోల భోజతనయా సల్లాపసాహిత్య యా
దిత్యాపత్యపయోధరద్వయతటీదీవ్యత్కరాలక్షణా

రత్యాహ్లాద నజాంబవత్యధరసారత్యా సుదంతారతాం
తత్యక్తావ్యనితంబినీకథన భద్రామిత్రవిందాధవా.

113


క.

చానూరమల్లగాత్ర
స్థాణూరస్థలకవాటసంఘటనపా
షాణీకృతపాణీ శ
ర్యాణీ వాణీ శచీశవందితచరణా.

114


కవిరాజవిరాజితము.

రణరణకారుణవీక్షణరక్షణ రావణకంఠ నివారణకా
రణకరమార్గణ భర్గశిరోగ్రనిరర్గళవార్గణ యుక్చరణా
మణితనిబంధనమార్గధురంధర మానితకంధర గోపవధూ
మణి మధురాధరబింబ సుధాఝరమత్త రసజ్ఞ రసజ్ఞనిధీ.

115

115. రణరణకము = కోరిక

గద్య
ఇది శ్రీమద్రామభద్ర భజనముద్ర కవిపట్టభద్ర కాద్రవేయాధిప
వరసమాగతసరససారస్వతలహరీపరిపాక కాకమానిమూర్తి
ప్రబోధ బుధకవిసార్వభౌమపౌత్ర రామలింగభట్టపుత్ర
కౌండిన్యగోత్రభాగధేయ మూర్తినామధేయప్రణీ
తంబైన రాజజాహనవిజయం బను మహాప్రబం
ధంబునందు ద్వితీయాశ్వాసము