యెంకి పాటలు/ఆనాటి నావోడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆనాటి నావోడు

ఆనాటి నావోడు సెందురూడా,
అలిగి రాలేదోయి సెందురూడా
'యెంకి! మన మిద్దరమె
యెవ్వరొ'ద్దన్నాడు;
'యీ సేలు యీ తోట
లింక నీ' వన్నాడు__
మాటాడుతుండంగ సెందురూడా!
మంచిదా పోయేవు సెందురూడా!!
'కలకాల మీదినమె
నిలుసు మన' కన్నాడు;
'గాలికై నా తాను
కవుగిలీ' నన్నాడు__
ననుసూసి నవ్వేవు సెందురూడా!
నాయమా నాముద్దు సెందురూడా!!
నా కాసి సూశాడు
నీ కాసి సూశాడు;
'మద్దె సెంద్రుడె మనకు
పెద్దమని' సన్నాడు__
కన్నీరు నీకేల సెందురూడా!
కనికారమే శాన సెందురూడా!!