మొల్ల రామాయణము/సుందరకాండము/హనుమంతునిచే శ్రీరామచంద్రుని గుణ కీర్తనము
హనుమంతునిచే శ్రీరామచంద్రుని గుణ కీర్తనము
[మార్చు]క. ఇనతనయుని వర మంత్రిని,
జనపతి యైనట్టి రామచంద్రుని దూతన్,
ఘనుఁడగు వాయు కుమారుఁడ,
వినుమీ హనుమంతుఁ డనఁగ వెలసినవాఁడన్. 202
క. రాముని పంపున వచ్చితి,
రాముని సేమంబు నీ పురంబున ను న్నా
రాముని సతి కెఱిఁగించితి,
రాముని కడ కేఁగుచుండి రాజస వృత్తిన్. 203
క. నా రాక మీకుఁ దెలియఁగ
బీరంబున వనము గలయఁ బెఱికితి శక్తిన్,
ఘోరాజి నాకు నెదిరిన
వారలఁ బంపితిని యముని పట్నము చూడన్. 204
క. నినుఁ జూచి తిరిగి పోయెడు
మనమున మఱి కట్టఁ బడితి మనుజాశన! నీ
యను వెల్లఁ గంటి, నింకను
వినుమా నా బుద్ధిఁ దెలియ వివరముతోడన్. 205
చ. ఘనుఁడవు, నీతిమంతుఁడవు, కార్య మెఱుంగుదు, సాహసంబునన్
నిను నెదిరించి పోరుటకు నిర్జర వల్లభుఁ డోపలేఁడు, నీ
వనిన జగత్త్రయం బళుకు, నద్భుత రూపము సెప్పరాదు, నీ
యనుపమ భోగ సంపదల కాఱడి తెచ్చితి విప్డు రావణా! 206
క. కడ లేని బలము, ధర నె
క్కడ లేని మహా ధనంబు కరి తురంగంబుల్,
కడ గానరాని సంపద,
చెడ కుండఁగ నీకు బుద్ధి చెప్పెద వినుమా! 207
సీ. కుదియించి సింహంబు కోరలు పెఱుకంగ-శేషాహి దౌడలు చీల్చివేయఁ,
బీడించి దంభోళిఁ బిడికిటఁ బట్టంగఁ-గఠిన కాకోలంబు కడి గొనంగఁ,
జెలఁగి బ్రహ్మాండమ్ము చిప్ప లూడఁగఁ దన్న-హంకారమున బడబాగ్ని నుఱుక,
నంభో నిధానంబు లఱచేత నడవంగ-గిరి వర్గములఁ దలక్రిందు చేయఁ,
తే. గల మహాబాహుసత్త్వ విఖ్యాతి విపుల-చండ భుజదండ సాహసోద్దండ విజయ
కాల రుద్రావతార సంగ్రామ భీమ-మూర్తి మంతులు కపులు, సత్కీర్తియుతులు 208
వ. అదియునుంగాక దశరథరాజ నందనుండును, గౌసల్యా గర్భ
సంభవుండును, దాటకా ప్రాణాపహరుండును, విశ్వామిత్ర యాగ
సంరక్షకుండును, నహల్యా శాప మోక్ష దీక్షా గురుండును, హర
కోదండ ఖండనుండును, జామదగ్ని బాహుబల భంగుండును,
విరాధ నిరోధుండును, ఖర దూషణ త్రిశిర శ్ఛేదనుండును,
మాయామృగ సంచారి మారీచ సంహారకుండును, గబంధాంత
కుండును, వాలి ప్రాణ నిబర్హణుండును, సుగ్రీవ రాజ్య సంస్థాపన
పరమాచార్యుండును, ధనుర్విద్యా ప్రవీణుండును, నమోఘ
బాణుండును, రాక్షస కులాంతకుండును, గాకుత్స్థాన్వయాంభోనిధి
చంద్రుండును, గరుణాసింధుండును, నగు శ్రీరామ
చంద్రుండు కరుణాలంకారుఁడు గావున, 209
ఉ. వారక సీత నిచ్చి, రఘువల్లభునిన్ శరణంబు చొచ్చినన్,
నేరము లెంచి చంపమికి నీ యెడ కెప్పుడు నేను బూఁటగా
భారపడంగఁ జాలుదు, శుభ స్థితి నమ్ముము, నమ్మ కూరకే
పోరఁగఁ జూచితేనిఁ, బొరిపుచ్చక మానఁడు నిన్ను రావణా! 210
ఉ. నావుడు మండి, దైత్యకుల నాయకుఁ డుగ్ర విలోకనంబులం
బావక విస్ఫులింగములు పైకొని పాఱఁగ, వీర ఘోర దై
త్యావళిఁ జూచి, మీరలు మహా విశిఖంబుల వీనిఁ జంపుఁడీ
యావల రాముఁ డుల్కుచు భయాకులుఁడై చెడిపోవు నట్టుగన్. 211
వ. అనిన విభీషణుం డిట్లనియె. 212