Jump to content

మొల్ల రామాయణము/సుందరకాండము/దధివనమున వానరవీరుల యుత్సాహ క్రీడ

వికీసోర్స్ నుండి

దధివనమున వానర వీరుల యుత్సాహ క్రీడ

[మార్చు]

ఉ. వచ్చిన పావనిం గని, జవంబున నంగదుఁ డాదియౌ కపుల్‌
గ్రచ్చఱ భక్తితో నెదురుగాఁ జన, నందఱఁ గౌఁగిలించి, వా
రచ్చటి కార్యమంతయుఁ బ్రియంబునఁ ద న్నడుగంగఁ, బోయి వే
వచ్చిన చంద మేర్పడఁగ వారికిఁ జెప్పెను దప్పకుండఁగన్‌. 227
క. రఘువరుఁ డిచ్చిన ముద్రిక
రఘువల్లభు దేవి కిచ్చి, రభసంబున నా
రఘువరున కానవాలుగ
రఘువల్లభు దేవిచేతి రత్నముఁ గొంటిన్‌. 228
మ. అని చెప్పన్‌ఁ విని, యంగదాదులు మహాహ్లాదంబునన్‌ బొంగి, పా
వని బాహాబల సత్త్వముల్‌ వొగడుచున్‌, వర్ణింపుచున్‌, వే పునః
పునరాలింగన మాచరింపుచు, వడిన్‌ భూషించుచున్‌ మ్రొక్కుచున్‌,
ఘనతం బాడుచు నాడుచున్‌, బలువిడిన్‌ గర్వంబునన్‌ దాఁటుచున్‌. 229
శా. నేనే చాలుదు రావణాసురు తలల్‌ నేలం బడంగొట్టఁగా,
నేనే చాలుదు వాని పట్టణము మున్నీటం బడం ద్రోయఁగా,
నేనే చాలుదు దుష్ట దానవ తతిన్‌ నిర్భీతి దండింపఁగా,
నేనే చాలుదు నంచుఁ బంతంబులు పూన్కిం బల్కుచున్‌ ద్రుళ్ళుచున్‌. 230
క. ఆ రాత్రి కీశు లందఱు
మారుతితోఁ గూడి నిలిచి, మఱునాఁడచటన్‌
ధీరత దుర్ధర శైలము
చేరం జని, నిద్రచేసి చిత్తము లలరన్‌. 231
వ. అమ్మఱునాఁ డుదయంబున మధువనంబులోఁ బ్రవేశింప నుద్యోగించి,
యందఱకన్నను బెద్దవాఁడగు జాంబవంతునిం బిలిచి, నీవు
శ్రీరామునకు హితుండవు, సుగ్రీవునకు మంత్రివి, కావున మాకు
నొక బుద్ధి యానతిమ్ము. ఈ కపులు క్షుద్బాధావశంబునం బొరలి,
మహాశ్రమంబును బొందియున్నవారు, గావున సుగ్రీవుని మధు
వనంబున నుండెడు ఫలంబులం బరితృప్తులమై, రాముని సన్ని
ధానంబున కేఁగుట లెస్స యని యంగద హనూమంతులు పల్క
జాంబవంతుండును నత్యుత్సాహంబున నంగీకరించి, కపులం
బురస్కరించుకొని, మధువనంబులో బ్రవేశించినంత. 232
సీ. ఒక్కఁ డాఁకొని కొమ్మ నూఁచినఁ బండ్లెల్లఁ-జేకొని తేర భక్షించు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని రేఁపు చున్నట్టి తేనియల్‌-తడయక కొల్లాడి త్రూగు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని కోయుచున్నట్టి కాయలు-మిన్నక యూటాడి మ్రింగు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని గోళ్ళ నొలిచినట్టి చివుళ్ళఁ-బుక్కిళ్ళ కొలఁదిగా బొక్కు నొకఁడు,
తే. తరువుపై నుండి తరువునకు దాఁటు నొకఁడు-పండ్ల కెటువంటి మ్రాఁకైన బ్రాకు నొకఁడు,
దిగువఁ గూర్చుండి తరువున కెగురు నొకఁడు-పెద్ద పొడవున నుండి కుప్పించు నొకఁడు. 233
ఉ. కాయల వ్రేటు లాడుచును, గంతులు వైచుచుఁ, బూవు దీవలం
దూయల లూగుచున్‌, దరువు లూఁపుచుఁ, బండ్లను బొట్టనిండఁగా
మేయుచు, వెక్కిరింపుచును, మిన్నక దాఁటుచు, దోఁక లెత్తుచుం
గూయుచు, నేల దూఁకుచును, గుంపులు గూడి కపీంద్రులెంతయున్‌. 234
క. వన మెల్ల గాసి చేయఁగ
వన పాలకు లేఁగుదెంచి, వడిఁ గోపముతో
డను నదలించిన, వారల
హనుమంతుఁడు మొదలుగాఁగ నగ చరులెల్లన్‌, 235
క. మెడఁబట్టి వనములోపల
వెడలఁగ నటు పాఱద్రొబ్బి, వెడలుం డన్నన్‌
దడయక దధిముఖుఁ డను తమ
యొడయని కడ కేఁగి వార లుగ్రముగాఁగన్‌. 236
వ. విన్నవించిన యంతనే. 237