మొల్ల రామాయణము/అవతారిక/సంస్కృతాంధ్ర మహాకవి స్తుతి

వికీసోర్స్ నుండి

సంస్కృతాంధ్ర మహాకవి స్తుతి[మార్చు]

సీ. సుర సన్నుత జ్ఞాను సువివేకి వాల్మీకి-నఖిల వేదాగమాభ్యాసు వ్యాసు,
ఘోరాంధకార ప్రభారవి భారవి-సత్కాంతి హిమకరశ్లాఘు మాఘు,
వివిధ కళాన్విత విఖ్యాతి భవభూతిఁ-బ్రకట కార్య ధురీణు భట్టబాణు,
మానినీలోక సమ్మద ముద్రు శివభద్రుఁ-గవితా రసోల్లాసుఁ గాళిదాసు,
తే. స్తుత గుణోద్దాము నాచన సోము, భీము-నవ్య మంజుల వాగ్ధుర్యు నన్ననార్యు,
రసికుఁ డైనట్టి శ్రీనాథు, రంగనాథుఁ-దిక్క కవిరాజు, భోజు నుతించి మించి, 9
క. తొల్లిటి యిప్పటి సత్కవి
వల్లభులను రసిక వినుత వాగ్విభవ కళా
మల్లులఁ గవితా రచనల
బల్లిదు లైనట్టి ఘనుల భక్తిగఁ దలతున్‌. 10
క. గురు లింగ జంగ మార్చన
పరుఁడును, శివభక్తి రతుఁడు, బాంధవ హితుఁడున్‌
గురుఁ, డాతుకూరి కేసయ
వర పుత్రిని మొల్ల యనఁగ వఱలినదానన్‌. 11