మెటిల్‌డా

వికీసోర్స్ నుండి
(మెటిల్డా నుండి మళ్ళించబడింది)

మెటిల్‌డా

నేను వృక్షశాస్త్రము యమ్‌.యే పరీక్షకు చదువుతూ వుండే రోజులలో మైలాపురి పెద్ద రోడ్డున ఒక మిద్దె యింట్లో బసచేసి వుంటిని. నాతో పాటు పది పన్నెండుగురు విద్యార్థులు మనదేశపు వాళ్ళు ఆ మేడ యింట్లో ఉండేవారు.

నేను వచ్చినమూడో రోజున రామారావు నన్ను సౌజ్ఞ చేసి పిలిచి రహస్యంగా మెటిల్డాను చూశావా? అని అడిగాడు. "లేద"న్నాను. "అదుగో... చూసీ చూడనట్టు చూడు" అని చూపించాడు.

చూశాను.

"చాలు, యికరా" అన్నాడు.

మెటిల్డా వైపు తిప్పిన మొహం తిప్పకుండానే యెలా రావడం: కళ్ళు భగవంతుడు యిచ్చినందుకు యిదే కదా ఫలం-మనోహరమైన భగవంతుడి సృష్టిలోకల్లా మనోహరమైనది సొగసైన స్త్రీ. మనస్సులో చెడుచింత లేనప్పుడు చూస్తే తప్పేమి? అన్నాను.

నీలా శ్రీరంగ నీతులు చెప్పిన వాళ్ళని చాలా మందిని చూశాను. కొత్తవాడివి యెరిగివుంటే మంచిదని చూపించాను. మరి యెన్నడూ యిటు కన్ను తిప్పకు అని రెక్క పట్టుకు గెంటుక పోయినాడు.

"మంచి మనిషా, చెడ్డ మనిషా?" అని అడిగాను.

మంచయితే మనకేల? చెడ్డయితే మనకేల? ఒకర్ని మంచి కాదండానికి మన మంచేం తగలడుతూంది? మెటిల్డా వైపు చూడవలెనని తిరిగి యెన్నడైనా చూస్తివా నీకూ నాకూ నేస్తం సరి అన్నాడు. రామారావు నాకు ప్రాణసమానమైన మిత్రుడు. యేం చెయ్యను, మనసు నిరోధించి మెటిల్డా యింటి పెరటి వేపు వున్న డాబా పొంతకు నే వెళ్ళలేదు, కొన్నాళ్ళు.

పసుపు రాసుకొని స్తానమాడిన పైని బంగారు చాయలు దేరిన మేని సొంపు, నెమలి పింఛమువలె ఒడలును కమ్మి చెదిరిన తలకట్టూ, బావి నుంచి నీరు తోడిన వయ్యారమూ, 'తోడుతూ వొక్కొకతరి తలయెత్తి యిటు అటూ చూసిన కన్నుల తళుకూ, మోము అందమూ నా కన్నులు కట్టినట్టు వుండి మరుతునన్న మరపు రాకపాయను. వారం పది రోజులు కట్టుమీద ఉన్నాను. ఆపైన మనసు పట్టలేక పచారు చేస్తూ చదివే మిష మీద, చేత పుస్తకం, దృష్టి పెరటి వైపూ వుంచి డాబా మీద గస్తు తిరిగే వాణ్ణి రామారావు యింట లేనప్పుడు.

ఆ రోజుల్లో రెండు మార్లే యేదో పని మీద పెరట్లోకి వచ్చి వెంటనే యింట్లోకి వెళ్ళిపోతూ వచ్చింది - మెరుపులా.

కాలేజీకి వెళ్ళేటప్పుడు మెటిల్డా యింటి యెదట చీమలాగ నిమ్మళంగా ఆ యింటివేపు చూస్తు నడిచేవాణ్ణి అప్పుడప్పుడు చిత్తరపు చట్రంలా ప్రతిమలాగ, గవాక్షంలోంచి మెటిల్డా కనపడేది.


2


మెటిల్డా చరిత్ర అడిగి వారి వల్లా, వీరి వల్లా, అడక్కుండా నా నేస్తాల వల్లా గ్రహించాను.

మెటిల్డా పెనిమిటికి మా వాళ్ళు పులి, ముసలి పులి అని పేరు పెట్టారు. అంత ముసలివాడు కాడు. యాభై అయిదు, యాభై ఆరు యీడు వుండువచ్చును. కొంచెం తెల్లగా, పొట్టిగా వుంటాడు. పెద్ద కళ్ళూ, కోర మీసాలు, స్ఫోటకం మచ్చల మొహం రెండేళ్ళాయ వచ్చి మా ప్రక్క బంగళాలో బసవేశాడు. యెక్కణ్ణించి వచ్చాడో యెందుకు వచ్చాడో యెవరూ యెరుగరు. వీధి వేపు పెరటిలోకి వొరసుకొని పెద్ద గది వొకటి వుంది. దానిలో మూడు బీరువాలతో పుస్తకాలు వున్నాయి. అమేషా రాస్తూనో, చదువుతూనో కనుపడేవాడు. వీధి పెరటిలోనూ, వెనక పెరటిలోనూ పూల చమన్‌ బహు సొగసుగా వుంచేవాడు. ఉదయం, సాయంత్రం మొక్కలకు గొప్పు తవ్వేవాడు. మెటిల్డా మొక్కలకి నీరు పోసేది. ఇది యింగ్లీషు పద్ధతి ప్రకారం యిద్దరికీ శరీర వ్యాయామం. అంతే మరి యిల్లు కదలి నాలుగు అడుగులు పెట్టడమన్నది లేదు. యింటికి చుట్టాలూ, పక్కాలూ రాకపోకలు యెన్నడూ లేదు. పులి మెటిల్డాని యెక్కువ కాయిదా పెట్టేవాడు. గుమ్మంలోకి రాకూడదు అని శాసనంట. గాని అప్పుడప్పుడు వచ్చేది. ఆ పిల్ల మొఖాన వొక మోస్తరు విచారం కనపడేది. వింతేమి? మొగుడు కంట్రక పెట్టేవాడు. మొగుడి అప్ప ( అక్క) ఒక ముదసలి, చిలిపి జగడాలు పెట్టేది. ఇంటిలో మిగిలిన వాళ్ళు ఒక ముసలి వంట బ్రాహ్మణుడు.

మెటిల్డా పెనిమిటిని పులి, పులి అనడమే గాని అతని పేరేమిటో యెవడూ యెరగడు. పోస్టు బంట్రోతు ఆయన పేర వచ్చిన ఉత్తరముల పై విలాసం ఎవరికీ చూపకుండా నిర్ణయం అట. ఒక్క పోస్టు మేష్టరికీ, పులికీ మాత్రం పరిచయం వుందని అనుకునేవారు.

అది రహస్యం కాపాడడం కోసమే ఉంటుంది.

3

ఒకనాడు అభ్యంగనమై జుత్తు విరయబోసి, షోకుగా టోపీ తలనమర్చి, మల్లిపువ్వు లాంటి బట్టలు కట్టి బరికి పోతూ, మెటిల్డా యింటి యెదట జాలంగా నడుస్తూ వుంటిని. అంతట గుమ్మం దగ్గిరికి వచ్చి ఆమె వైపు చూస్తూ నిలిచిపోయినాను. అర మినుటు కావచ్చు, పులి గుహలోంచి పైకి దుమికి అబ్బాయీ యిలారా అన్నాడు. తంతాడేమో పరుగుచ్చుకుందాము అనుకున్నాను. గాని అట్టి పని చేస్తే నాయందు నేరం నిలవడం కాకుండా మెటిల్డా యందు నేరం నిలుస్తుందేమో? నాకు యేమైతే ఆయను, ఆమెను కాపాడదామని వెళ్ళాను.

లైబ్రరీ గదిలోకి తీసికెళ్ళాడు. కుర్చీ మీద కూలబడి రౌద్రాకారమైన చూపుతో యింగ్లీషున అడిగాడు?

నా పెళ్ళాం వైపు చూస్తున్నావా?

కిటికీ లోంచి కనపడుతూండే మీ లైబ్రరీ చూస్తు మీరు యెటువంటి మనుష్యులు, యేమి చేస్తుంటారు అని ఆలోచిస్తున్నాను

నా పెళ్ళాన్ని చూడలేదూ?

చూశాను. యెదట నిలుచుంటే కనపడరా, అంతే పిడుగులాగ 'ఔనే! ఔనే!' అని పిలిచాడు. మెటిల్డా రాలేదు.

"వొస్తావా రావా లంజా!" అన్నాడు. వొణుకుతూ మెల్లగా వచ్చి తల వొంచుకు నిలబడ్డది.

యింగిలీషున నాతో మళ్ళీ అన్నాడు.

ఓ తెలివి తక్కువ దద్దమ్మా - చూడు యెంత సేపు చూస్తావో. యీ ముండ మొహం వేపు యేం, నా వేపు చూస్తావేం, దాని వేపు చూడక? నా మొహం దాని మొహం కన్నా బాగుందనా?

నేను మాట్లాడలేదు. కథ బాగుంది కాదని, కాలు గుమ్మం వేపు సాగించబోతూండగా, కనిపెట్టి మెల్లగా "వుండు" అన్నాడు.

నిలిచాను.

నిమిషం కిందట కన్నుల రాలిన నిప్పులు చల్లారాయి.

అబ్బాయీ అన్నాడు.

నిజవాడ్డం యెన్నడైనా నేర్చావా? తల్లిదండ్రుల దగ్గిర గాని గురువుల దగ్గిర గాని నా తల్లీ తండ్రీ తలపుకు వచ్చారు. "నేర్చవలసిన అవసరం లేకుండా నిజాయితీ నాకు పుట్టుకతోనే వచ్చింది" అన్నాను.

"అయితే పుట్టకతో పుట్టిన ఆ నిజాయితీ చూదాం, చెప్పు నా పెళ్ళాం అందంగా వుందా లేదా?"

"ఆమె అందంగానే వున్నాదనుకుంటాను"

"సంశయవేవైనా వున్నదా?"

"లేదు"

"తోవంట వెళ్ళేటప్పుడు రోజూ, దానికోసం యీ వేపు చూస్తు వుంటావా లేదా?"

"నిజమాడమన్నారు గనుక వొప్పుకోక విధి లేదు. చూస్తున్నానుగాని, చెడ్డ తలపు మనసులో యీషత్తు వుంటే దేవుడు సాక్షి?"

"దాని మాటకేం - అది కంటిక్కనపడితే నీకు ఆనందం అవునా కాదా? నిజవన్నదేదీ?"

"అవును"

"అయితే ఈ ముండని తీసుకుపో - నీకు దానం చేశాను తీసుకో, నాకు శని విరగడై పోతుంది".

నేను మాటడకుండా కదలి పైకొచ్చాను. యిళ్ళు కనపడలేదు. మనుషులు కనపడలేదు. శృంగభంగమై నన్ను నేను దూషించుకుంటూ బరికి పోయినాను.

అక్కడ బస యెత్తెయడానికి నిశ్చయించాను. బస యెత్తేసి మరి ఆ వీధి మొహం చూడకూడదనుకున్నాను.

నా కళ్ళకి కట్టినట్లు ఆ వొంచిన మొఖం. బిందువులుగా స్రవించిన కన్నీరు. కాచుకొన్న నిట్టూర్పుల చేత కంపించిన రొమ్ము - యే మహాకవి రచనలోనూ లేదనగలను, అగాధమై ప్రౌఢమైన కరుణ రసం ఆ సరిలేని సొగసున్ను.


4

నే బసవున్న యింటి గుమ్మం దగ్గిరకి వచ్చేసరికి పులి యింటి ముసలి బ్రాహ్మణుడు సన్నసన్నగా నా చేతులో ఒక చీటి పెట్టి జారిపోయినాడు. ఇందాకటి కథతో దీనికేదో సంబంధం ఉందని తలచి నా గదిలోనికి వెళ్ళి లోపల గడియ వేసుకొని చీటి చదువుకొన్నాను. దానిలో యేముందీ?

కుదురైన అక్షరాలతో

"మీరు మీ నేస్తులూ నా కాపరం మన్ననివ్వరా? మీకు నేనేం అపకారం చేశాను? తల వంచుకు మీ తోవను మీరు పోతే నే బతుకుతాను. లేకపోతే నా ప్రారబ్ధం".

యేమి చెయ్యను? అక్కడ బస విడిచి మరివక చోటికి పోతే, నా మట్టుకు చిక్కు వొదులు తుందనుకుంటిని గదా? యిప్పుడు మెటిల్డా చేసిన విన్నపం యెలా తొలగి వెళ్ళిపోదును? నా స్నేహితుల వల్ల ముప్పు కలక్కుండా ఆమెను కాపాడవద్దా? కాపాడగలనా?

మెటిల్డాను కాపాడలేకపోతే బతుకేమిటి? పౌరుషమేవిటి? ఈ మనోజ్ఞమైన స్త్రీ రత్నం యొక్క చిత్రకథలో దు:ఖ భాజన కథలో, నేను కూడా చేరానా? దు:ఖం మళ్ళింది. యీ అందకత్తె మనసుతో మెప్పుకొంటే జన్మసార్థకమవుతుంది. ఈ సొగసైన లిపి మెటిల్డా రాసినదా? యేమి అదృష్టవంతుణ్ణి? మెటిల్డా యేమి రాస్తే చెయ్యను. త్రైలోక రాజ్యం నాకుండి యిమ్ము అంటే పట్టం గట్టనా?

గాని యిప్పుడు యేం చేతును? నాకు లోకజ్ఞానం తక్కువ. వినాయకుని చెయ్యి బోయి కోతిని చేస్తానేమో? రామారావు అనుభవజ్ఞుడు, గుణవంతుడు, నేర్పరి, చెప్పిన మాట విననందుకు చివాట్లు పెడితే పడతాను. నా ఉద్యమంలో సాయం చెయ్యమని కాళ్ళు పట్టుకుంటాను.

అని ఆలోచించి రామారావుకు పూస గుచ్చినట్లు కథంతా చెప్పాను. నా నిశ్చయం యిదని తెలియచేశాను. మళ్ళించ ప్రయత్నించవొద్దని గెడ్డము పట్టుకు బతిమాలాను. రామారావన్నాడు. "మళ్ళించగలనని నమ్మకం వుంటే మళ్ళించజూతును, మళ్ళవని యెరుగుదును. చూడవద్దంటే చూడడం మానితివా?"

"గాని నాకు తోచిన మాటా, నాకు తెలిసిన మాటా నీకు చెప్పకపోతే నేను అపరాధిని అవుతాను, స్నేహాన్ని తప్పిన వాణ్ణి అవుతాను."

"ఆలు మొగుళ్ళ దెబ్బలాటల్లోకి వెళ్లవద్దని మన పెద్దల శాసనం. అవి అభేద్యాలు, అగమ్య గోచరాలు. మధ్యవర్తులు కాపరం చక్కచేదామని చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు" ఒకటి.

"పులి పులి అని మనం యెంత పేరు పెట్టినా పాపం యీ పులి అరుపే కాని కరువు లేదు. మెటిల్డాని యెన్నడైనా ఒక్క దెబ్బ కొట్టాడని విన్నామా? లేదు. తిండికి లోపం లేదు. గుడ్డకి లోపం లేదు. అతను చెప్పినట్టు మెసులుకుంటే నెమ్మదిగా కాలం వెళ్ళడానికి అభ్యంతరం లేదు" - రెండు

"యిక మూడోది. నీకు మెటిల్డా మీద మనస్సు గట్టిగా లగం అయింది. అది కూడని పని. చెడ్డ తలంపు లేనప్పుడు యేమి ఫర్వా అని అనగలవు. చెడ్డ తలంపు చెప్పి రాదు. యెక్కణ్ణించో రానక్కర్లేదు. కంటిక్కనపడకుండా మనసులో ప్రవేశించి పొంచి వుంటుంది. చూసీ చూడనట్టు మనం వూరుకొని అది పైకొచ్చే ప్రయత్నాలు బాహాటంగా చేస్తూ వుంటాం. చెడ్డ తలపులకి గుర్తు యెవరైనా వుండాలి కదూ. అడవిలో వొంటరిగా వున్న వారికి స్త్రీల విషయమై చెడ్డ తలపులు ఉండవు. సొగసైన స్త్రీల పొందు కోరేవాడికి అవకాశం తటస్థించినప్పుడు చెడ్డ తలపు వస్తుందా రాదా అని ఆలోచన. ఆ అవకాశానికి అవకాశం యివ్వని వాడె ప్రాజ్ఞుడు".


5

"నాకూ నీవూ, నీ స్నేహితుడు రామారావు మరొక గొప్ప వుపకారం చేశారు. మీ మాటలవల్లా చేష్టల వల్లా నా భార్య యోగ్యురాలని తెలుసుకొన్నాను. ఆలోచించుకోగా ఆనాటి నుంచి కళ్లెం వదిలేశాను. నా పెళ్ళాం బహు బుద్ధిమంతురాలు. యిచ్చిన స్వేచ్ఛనైనా పుచ్చుకోలేదు. యెక్కడికి కావాలిస్తే అక్కడికి వెళ్ళమన్నాను. యెవరిని కావలిస్తే వారిని చూడమన్నాను. యెక్కడికి వెళ్ళకోరలేదు. యెవర్నీ చూడకోరలేదు. నాకు నీతో లోకం. మరి యెవరితో యేం పనంది. అలాగే సంచరించింది.

దాని చర వొదిల్చావు. అది నా చర కూడా వొదలడానికి కారణమైంది. హయ్యరు మాథమిటిక్సు చదువుకున్నావా? లేదు పోనియ్యి."

కాల్‌బెల్‌ టింగ్‌ మని వాయించాడు. కీలు బొమ్మలాగా మెటిల్డా ప్రవేశించి గుమ్మం లోపున నిలబడింది.

"కాఫీ యియ్యి"

బల్ల మీద రెండు గిన్నెలతో కాఫీ అమర్చింది.

"నీక్కూడా పోసుకో"

మొగుడు కేసి "కూడునా యిలాంటి పని" అనే అర్థంతో చూసింది.

"పర్వాలేదు నువ్వు కూడా తాగు. మన స్నేహితుడు" అన్నాడు. గాని ఆమె తనకు కాఫీ అమర్చుకోలేదు. ప్రక్కన నిలుచుంది.

"పోనియి. కూచో" అన్నాడు, కూచోలేదు. నేను భార్తాభర్తల సరాగానికి సంతోషించాను. నేను అందుకు కొంత కారణభూతుణ్ణి కదా అని మెచ్చుకున్నాను.

కాఫీ పుచ్చుకున్నంత సేపూ అతను చెప్పిన మాటలు తన భార్యకు చదువు చెబుతున్నానినీ, అమేషా రామాయణం, భారతం చదువుతున్నట్టుందనీ, తను ఫలానా, ఫలానా చోటికి తీసుకువెళ్ళాననీ, కులాసా దిలాసా చూపించానని. అంతట నా చదువు మాట కొంత. చాలా విద్వాంసుడని కనుక్కున్నాను.

వెళ్ళిపోయేముందు "మరి నువ్వు వెళ్ళిపో"


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.