ముసలమ్మ మరణము/తొలిపలుకు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తొలిపలుకు

ఇప్పటికి రమారమి ఇరువది యైదేండ్లక్రింద శ్రీరామలింగారెడ్డిగారీచిన్నపొత్తమును ప్రకటించుకొనునధికారమును ప్రీతిపూర్వకముగా నాకొసంగిరి. నేనొక్కముద్రణము వేయించితిని. లఘుటీక చేర్చితిని. మధ్యకాలమున పునర్ముద్రణము చేయవలెనను కుతూహల ముండినదికాని నా స్వంతగ్రంథములకు పట్టిన యదృష్టమే నా సంపర్కము చేత దీనికిని బట్టినది. అనుదిన జీవిత మతిప్రయత్నముమీద గడుపుకొనునట్టిస్థితి నాకు చిరకాలముగ తప్పినదికాదు. కావున స్వంత పూచీమీద గ్రంథముద్రణము చేసికొనుట నాకు సాధ్యముకాలేదు. శ్రీ రామలింగారెడ్డిగారి షష్ఠిపూర్తి మహోత్సవసందర్భము తటస్థించినందున ఈ గ్రంథముద్రణమున కవకాశముకలిగినది. ఇది నా స్వశక్తిచే నిర్వహించినదిగాదు. ఆంధ్రదేశ గ్రంథాలయసంఘమునకు నేను అధ్యక్షుడుగానున్నాను. కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణము డిప్. లిబ్. గారును నేనును ఉదారచరితులగు శ్రీ రెడ్డిగారికి మా యుద్యమముపరముగా నేరూపమున నీషష్ఠిపూర్తిలో గౌరవముచూపి కృతజ్ఞతను వెల్లడించగలమా యని యాలోచించితిమి.

చంద్రునకొక నూలిపోగన్నట్లు ఈ గ్రంథము షష్ఠిపూర్తి ముద్రణమువేసి వారి కందియ్యదలచితిమి. గ్రంథాలయోద్యమధర్మము ప్రాతకాలపు పండితులధర్మము. విజ్ఞానము సర్వజనులకును వ్యాపింపజేయుట వారివిధి. ఆ విధియే మా యదియు. పండితుల కెట్టులచ్చి యచ్చిరాదని లోకోక్తికలదో అట్టులే మా యుద్యమమునకును లచ్చి యచ్చిరాలేదు. రాజాశ్రయమున్న శ్రీనాథుని గతి మాదికాదు. పొలముదున్నుకొని బ్రతికిన పోతన మా కాదర్శమయినాడు. కావున 1914 ప్రాంతముల ఆరంభమయిన మాగ్రంథాలయోద్యమము సిరులకొరవడినను ప్రజాభక్తి ప్రజాసేవల కొరవడక పనిచేసికొనివచ్చినది. నూర్లకొలది గ్రంథాలయములు స్థాపితమయినవి. నడచినవి. నడచుచున్నవి. పత్రికాపఠనము ప్రముఖముగా సాగినది. పల్లెటూరి గ్రంథాలయముల స్థాపన నిర్వహణములలో భారతభూమిలో తక్కిన యన్నిప్రాంతములకును ఆంధ్రభూమి యొజ్జయనిపించుకొనినది. ఆంధ్రభూమిలో జీవకళ యున్నదనిన నీ యుద్యమప్రభావమని చెప్పిన నది యతిశయోక్తి కాజాలదు. ప్రజాసామాన్యమును వారియిండ్లవద్ద కలుసుకొని వారి హృదయములను చూఱగొను ప్రయత్నములు ఎచ్చటనులేని విచ్చట జరిగినవి. మొదటి 25 ఏండ్ల కార్యదర్శి ఏకైక కార్యనిర్వాహకుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య మెదడున గ్రంథాలయ యాత్రస్వరూపము మొదలినది. అది కార్యరూపము దాల్చి కొన్నిప్రాంతముల దివ్యమైన పనిసాగినది. అతడు ‘గ్రంధాలయ సర్వస్వము’ పత్రికను ఏకైకవీరుడై సాగించినాడు. కన్నబిడ్డకంటె గారాబముగ నీ యుద్యమమును సాకినాడు. అతనిపిదప కార్యభారము తలదాల్చిన మా నాగభూషణ మతనిని మించువాడు. ఈతని మెదడున బోటుగ్రంథాలయము మెదలినది. అది ఇతర ప్రాంతముల కుదాహరణప్రాయమైనది. వయోజన విద్యార్హ గ్రంథరచనప్రచురణము లితని వాంఛ దగిలినవి. పెదపాలెములోని ఇతని సేవాశ్రమము— పదులఏండ్లుగా పదిలముగా పనినడుపుకొని వచ్చిన పలుకుదంభములేని పట్టుదలసంస్థ—ఈపని నారంభించినది. అటు తాడేపల్లిగూడెమున గ్రామసేవాసమితి యనుపేర గ్రంథాలయోద్యమ సేవకులు—డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి ప్రభృతులు—చక్కని చిన్నిప్రచురణములు బయల్వరచు చున్నారు. మా కార్యదర్శి శ్రీ నాగభూషణము పట్టుదలచేత వారిమిత్రులు శ్రీ కొమ్మా సీతారామయ్యగారి యౌదార్యాభిమాన త్యాగములచేత పటమటలంకలో మాయుద్యమ కార్యాలయమునకు భవననిర్మాణ ప్రయత్నమును సాగుచున్నది. ‘గ్రంథాలయసర్వస్వము’ ‘ఆంధ్రగ్రంథాలయ’ మనుపేరిట పునరుజ్జీవితమయి నడచుచున్నది. ఇప్పటి గవర్నమెంటు ఉత్తమాధికారుల మంచితనముచే లోకల్ బోర్డులు మునిసిపాలిటీలు మా సభ్యులగుటకు అవకాశ మిటీవల చిక్కినది. విజ్ఞానవ్యాప్తి కార్యక్రమచరిత్రయందు మనదేశమున నేటియుగమును వయోజన విద్యయుగమని వర్ణింపవచ్చును. ప్రజాప్రభుత్వయుగమున నిది యంతర్భాగము. ఇట్టి తరుణమున శ్రీరామలింగారెడ్డిగారు ప్రజలలో వ్యక్తులు-అందులో అబలలు-ప్రజాక్షేమమునకై చేయగల అఖండత్యాగమును వర్ణించుచు రచించిన ఈ ‘ముసలమ్మమరణము’ను ప్రచురించుటకంటె వారికి మా చేయగల గౌరవము వేరుకలుగదని నిశ్చయించితిమి.

శ్రీ క. రామలింగారెడ్డి నాకు జ్యేష్ఠసోదరుడు. నాయందలి ప్రేమచే కొంతకాల మతడు నన్ను ‘సీనియర్’ –జ్యేష్ఠుడని–వ్యవహరించినను, అతడు క్రైస్తవకళాశాలలో బి. ఏ. పట్టపరీక్షయందు చరిత్రలో తేరి డబుల్ డిగ్రీకొరకు–దుశ్శాలువలకొఱ కన్నమాట– తత్వశాస్త్రము చదువుచు ఉపన్యాసవేదికలమీద ఇంగ్లీషు తెలుగుల రెంటిని అనర్గళముగా వెల్లువ లురికించుచు ప్రసంగించు దినములలోనే నా కళాశాలను ప్రవేశించి ఇతనియంతటివాడను నే నెప్పుడగుదునో యని నోరూర్చుకొనుచు నొసటిమీది ఆ పెద్దమచ్చమీదను అతని ముఖముమీదను తదేకధ్యానముగా దృష్టినిలిపి అతనిని రమారమిగా ప్రేమించితిని. నాటినుండి నేటిదనుక అతనిచరిత్ర వ్రాయుట నిటనాకు పనిగాదు. కాని అతనికి నాకును—అతడెచటనున్నను నే నెచటనున్నను— బంధుత్వ మెక్కడకలదా యని ఆలోచించినపుడు మాకు తెలిసిన సువార్త మరియొకరికి వ్యాపింపజేయు గుణమునందున్నదని పలుమరు తోచుచుండును. కవిత్వతత్త్వవిచారము, అర్థశాస్త్రములు మహత్తమసృష్టులే. రామలింగారెడ్డి ద్రౌపది శీలవర్ణనవ్రాసియుండిన నంతకంటె మహత్తరసృష్టి యయియుండును. కాని రెడ్డిప్రతిభ ఇట్టి సృష్టులలో ఇముడలేదు.

జిగిబిగిగల తెలుగుశైలి వ్రాసి చప్పటి తెలుగు వాక్యరచనకు చవులూరు గుణముకల్పించిన కీర్తి యతనికి చెందవలెనేమో! నన్నయ యెడల నెంతయభిమానము నితడు చూపినను తేలికవ్రాతలలో తిక్కన ననుకరించినవారిలో మా రెడ్డియొకడనియు రాయలసీమ వచనరచనకు నితడు పురోగామియనియు నాయూహ. శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మబోటి ప్రతిభావంతులను కనిపెట్టి లోకమునకు ఇచ్చుటలో రామలింగారెడ్డి అప్రతిమాన బుద్ధికౌశలమును మహోదారహృదయమును కనుపరచినాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయము — సవ్య తేజోవిభాసితము — విద్యాపక్షమున పూర్ణముగా నతని సృష్టి.

ఇట్టి ఈ భాషాసేవకునికి సరస్వత్యారాధకునికి దేశసేవాపరాయణునకు రెండరువదియేండ్ల ఆయువొసంగినను నొసంగతగినదే. ఈశ్వర కృప అపారముగ నీతనియెడల వెలయుగాక.

14 ఏ. సుంకువారివీధి

ట్రిప్లికేన్, మద్రాసు

29-11-40

ఇట్లు, బుధజనవిధేయుడు

గాడిచర్ల హరిసర్వోత్తమరావు

ఆంధ్రదేశ గ్రంథాలయసంఘాధ్యక్షుడు