ముసలమ్మ మరణము/ఉపక్రమణిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉపక్రమణిక

శ్రీమత్కటుమంచీ పుర
ధామా! శుభనామ! దేవతాకోటి కిరీ
టామల పాదాంభోజ!
కామాక్షీ సహిత! సౌఖ్య కర! బాల్యేశా. 1

ఉ. శ్రీలఁ జెలంగు లోకములు సృష్టి యొనర్ప విరించియై, తగం
  బాలన సేయ విష్ణువయి, వాని లయింపఁగ శూలపాణియై,
  లీల సరస్వతిన్ గలిమి లేమను బార్వతిఁ గూడి వెల్గు ది
 వ్యాలఘు శాంత తేజము జనౌఘమహార్తి హరించుఁ గావుతన్.

ఉ. శ్రీల నొసంగె యక్షున, కరిప్రకరంబుల భండనంబునం
  గూలఁగ నేయఁ జక్రమిదె కొమ్మని శ్రీహరి కిచ్చె, నిచ్చె గౌ
  రీ లలనా లలామకు శరీరము నం దొక యర్ధ, మిచ్చె గో
  పాలున కన్యభాగ, మిటు బాపురె సర్వముఁ గోలుపోయియున్.

               గీ సకల జగములకును సాక్షియై, కర్తయై,
                   విభుఁడు నై, శివుండు వెలుఁగుఁగాదె;
                   యిల్లు లేని వాని కెల్ల గృహమ్ములు
                   సొంత మయ్యె ననెడు సూక్తి దోఁప. 4

ఉ. ఏమనుజున్ దలంతు రిల నెల్లరు నేమియు లేని వాఁ డటం
   చా మనుజుండ సర్వము సమగ్రము గాఁ గల వాఁ డటంచు నే
   స్వామి నిజైక చర్య జనసంతతికిం బ్రకటించు, వాని, లో
   కామల సద్గురుం, గొలుతు, నద్రిసుతాహృదయేశ్వరున్, హరున్.

సీ. అంచ తేజీ నెక్కి యలరు సామిని జేరి
    చదువుల గొంతియై చాల వెలిఁగెఁ
జిలువల యెకిమీని సెజ్జఁ బండెడువని
    చెలువయై కలుముల చేడె యయ్యె
గిత్తతత్తడి రౌతు కేల్గేలఁ గీలించి
    బుత్తి ముత్తుల నిచ్చు సత్తి యయ్యె
ముగురు సాములకును మొదలింటి వెలుఁగయి
    యట్టిట్టి దనరాని యవ్వ యయ్యె

[1]తే. నచలసంభూత, సదయ హృదంబుజాత,
     నిర్గుణోపేత, పరిపూర్ణ, నిత్యపూత,
     వాఙ్మనోతీత, సుగుణసంపత్సమేత,
     పార్వతీమాత, మదభీష్ట వరము లీత. 6

క. అమ్మా! మీకృప నేఁ బ
    ద్యమ్ముల రచియింపఁ గడఁగి, తప్పొప్పుల భా
    రమ్మొడి గట్టెద మీ కన
    యమ్మును ననుఁ బ్రోవ వమ్మ, యభవునికొమ్మా. 7

శా. ప్రాహ్నంబందు నభంగశోణమయతన్ బ్రహ్మన్ విడంబించి, మ
     ధ్యాహ్నంబందుఁ బ్రచండధీధితుల రుద్రప్రక్రియంబొల్చి, సా

యాహ్నంబందు ననంతశాంతత ననంతాధీశునిం బోలి, స
ర్వాహ్నంబుల్‌ వెలుఁగొందు భాస్కరుఁ ద్రిమూర్త్యాత్ముం మదిన్నిల్పెదన్‌. 8

____

క. ఇలలో స్వచ్ఛందంబుగ
మొలచిన యే శాకమైన భుజియించి, తపం
బులు సల్పుచు దారుణ వన
ముల నుండెడు పెద్దలెంత పుణ్యాత్మకులో. 9

గీ. కవికులబ్రహ్మఁ దిక్కన గణన చేసి,
సూరనార్యుని భావంబు సొంపుఁ బొగడి,
వేమన మహాత్ము సహజ విద్యా మయాత్ము
మ్రొక్కి, కవన మొనర్పంగఁ బూని నాఁడ. 10

____


మ. తనరన్‌ రంగయ సెట్టిగారు కవితా ధారానుమోదాత్ములే
చిన ఠీవిం బహుమానకావ్యముల నీ శ్రీయాంధ్ర భాషాభిరం
జనినిం గోరిరి చేయ, నట్లగుట నస్మచ్ఛక్తికిం దీటుగా
నొనరింపంగఁ గడంగినాఁడ విహితప్రోత్సాహతన్‌ గబ్బమున్‌. 11

____

సీ. ఆ ప్రొద్దు కూటికి నమ్మరో యనుచుండు
                 నట్టి బీదల యింట నవతరించి
పాలివారందఱుఁ బగఁగొని యొనరించు
                 కుటిల కృత్యంబులఁ గ్రుంగకుండ

దైవంబునే నమ్మి దైవారెఁ దుదకు న్యా
               యస్థానవాదియై యలరెఁ జాలఁ
గార్వేటి నగరాది గంభీర సంస్థాన
               ములకెల్ల నొజ్జయై పూజ లందె

తే. నేకపత్నీవ్రతస్థుఁ, డహీనగుణుఁడు
శారదేందు ప్రభా తిరస్కార కీర్తి,
కట్టమంచి సుబ్రహ్మణ్య ఘనుఁ డతండు
తండ్రి గానొప్ప నెంతయుఁ దనరినాఁడ. 12

క. భారత భాగవ తోజ్జ్వల
వారిధి గత సార పద్య వరమణి చయమున్‌
హారముగఁ గూర్చె నెవఁడా
సూరిని మజ్జనకుఁ దలఁచి చూడుఁడు నన్నున్‌.

[2]
 1. పాఠాంతరము:
  తే. ఆశ్రితవ్రాత, సదయహృదంబుజాత,
  నిర్జరోపచితిప్రీత, నిత్యపూత,
  వాఙ్మనోతీత, సుగుణసంపత్సమేత,
  భువనమాత, భూభృజ్ఞాత, ప్రోచుఁ గాత.
 2. స్తుతిప్రకరణమునందలి పద్యములు పెక్కులు 1897-వ సం. చేయఁబడినవి. మా తండ్రిగారు “భారతసారరత్నావళి” బ్రకటించుటకు బూర్వమును, కూచిమంచి సోమసుందరకవిగారు వ్రాసిన,

  మ. తత బోధారస దీపితాఖిలమహా ధర్మోర్మికోవేత భా
  రతవార్ధిన్ గల సార పద్యమణులన్ రత్నావళిం గూర్చె నీ
  శ్రుతితత్త్వజ్ఞుఁడు సూతుఁడో, శుకుఁడో, వ్యాసుండో, గదేయంచు ధీ
  రత మిమ్మందురు కట్టమంచికుల సుబ్రహ్మణ్య పుణ్యా హ్వయా.

  అను పద్యమునుజూచి 13-వ పద్యమును గట్టితిని.