ముసలమ్మ మరణము
షష్ఠిపూర్తి ముద్రణము
౧౯౪౦
తొలిపలుకు
ఇప్పటికి రమారమి ఇరువది యైదేండ్లక్రింద శ్రీరామలింగారెడ్డిగారీచిన్నపొత్తమును ప్రకటించుకొనునధికారమును ప్రీతిపూర్వకముగా నాకొసంగిరి. నేనొక్కముద్రణము వేయించితిని. లఘుటీక చేర్చితిని. మధ్యకాలమున పునర్ముద్రణము చేయవలెనను కుతూహల ముండినదికాని నా స్వంతగ్రంథములకు పట్టిన యదృష్టమే నా సంపర్కము చేత దీనికిని బట్టినది. అనుదిన జీవిత మతిప్రయత్నముమీద గడుపుకొనునట్టిస్థితి నాకు చిరకాలముగ తప్పినదికాదు. కావున స్వంత పూచీమీద గ్రంథముద్రణము చేసికొనుట నాకు సాధ్యముకాలేదు. శ్రీ రామలింగారెడ్డిగారి షష్ఠిపూర్తి మహోత్సవసందర్భము తటస్థించినందున ఈ గ్రంథముద్రణమున కవకాశముకలిగినది. ఇది నా స్వశక్తిచే నిర్వహించినదిగాదు. ఆంధ్రదేశ గ్రంథాలయసంఘమునకు నేను అధ్యక్షుడుగానున్నాను. కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణము డిప్. లిబ్. గారును నేనును ఉదారచరితులగు శ్రీ రెడ్డిగారికి మా యుద్యమముపరముగా నేరూపమున నీషష్ఠిపూర్తిలో గౌరవముచూపి కృతజ్ఞతను వెల్లడించగలమా యని యాలోచించితిమి.
చంద్రునకొక నూలిపోగన్నట్లు ఈ గ్రంథము షష్ఠిపూర్తి ముద్రణమువేసి వారి కందియ్యదలచితిమి. గ్రంథాలయోద్యమధర్మము ప్రాతకాలపు పండితులధర్మము. విజ్ఞానము సర్వజనులకును వ్యాపింపజేయుట వారివిధి. ఆ విధియే మా యదియు. పండితుల కెట్టులచ్చి యచ్చిరాదని లోకోక్తికలదో అట్టులే మా యుద్యమమునకును లచ్చి యచ్చిరాలేదు. రాజాశ్రయమున్న శ్రీనాథుని గతి మాదికాదు. పొలముదున్నుకొని బ్రతికిన పోతన మా కాదర్శమయినాడు. కావున 1914 ప్రాంతముల ఆరంభమయిన మాగ్రంథాలయోద్యమము సిరులకొరవడినను ప్రజాభక్తి ప్రజాసేవల కొరవడక పనిచేసికొనివచ్చినది. నూర్లకొలది గ్రంథాలయములు స్థాపితమయినవి. నడచినవి. నడచుచున్నవి. పత్రికాపఠనము ప్రముఖముగా సాగినది. పల్లెటూరి గ్రంథాలయముల స్థాపన నిర్వహణములలో భారతభూమిలో తక్కిన యన్నిప్రాంతములకును ఆంధ్రభూమి యొజ్జయనిపించుకొనినది. ఆంధ్రభూమిలో జీవకళ యున్నదనిన నీ యుద్యమప్రభావమని చెప్పిన నది యతిశయోక్తి కాజాలదు. ప్రజాసామాన్యమును వారియిండ్లవద్ద కలుసుకొని వారి హృదయములను చూఱగొను ప్రయత్నములు ఎచ్చటనులేని విచ్చట జరిగినవి. మొదటి 25 ఏండ్ల కార్యదర్శి ఏకైక కార్యనిర్వాహకుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య మెదడున గ్రంథాలయ యాత్రస్వరూపము మొదలినది. అది కార్యరూపము దాల్చి కొన్నిప్రాంతముల దివ్యమైన పనిసాగినది. అతడు ‘గ్రంధాలయ సర్వస్వము’ పత్రికను ఏకైకవీరుడై సాగించినాడు. కన్నబిడ్డకంటె గారాబముగ నీ యుద్యమమును సాకినాడు. అతనిపిదప కార్యభారము తలదాల్చిన మా నాగభూషణ మతనిని మించువాడు. ఈతని మెదడున బోటుగ్రంథాలయము మెదలినది. అది ఇతర ప్రాంతముల కుదాహరణప్రాయమైనది. వయోజన విద్యార్హ గ్రంథరచనప్రచురణము లితని వాంఛ దగిలినవి. పెదపాలెములోని ఇతని సేవాశ్రమము— పదులఏండ్లుగా పదిలముగా పనినడుపుకొని వచ్చిన పలుకుదంభములేని పట్టుదలసంస్థ—ఈపని నారంభించినది. అటు తాడేపల్లిగూడెమున గ్రామసేవాసమితి యనుపేర గ్రంథాలయోద్యమ సేవకులు—డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి ప్రభృతులు—చక్కని చిన్నిప్రచురణములు బయల్వరచు చున్నారు. మా కార్యదర్శి శ్రీ నాగభూషణము పట్టుదలచేత వారిమిత్రులు శ్రీ కొమ్మా సీతారామయ్యగారి యౌదార్యాభిమాన త్యాగములచేత పటమటలంకలో మాయుద్యమ కార్యాలయమునకు భవననిర్మాణ ప్రయత్నమును సాగుచున్నది. ‘గ్రంథాలయసర్వస్వము’ ‘ఆంధ్రగ్రంథాలయ’ మనుపేరిట పునరుజ్జీవితమయి నడచుచున్నది. ఇప్పటి గవర్నమెంటు ఉత్తమాధికారుల మంచితనముచే లోకల్ బోర్డులు మునిసిపాలిటీలు మా సభ్యులగుటకు అవకాశ మిటీవల చిక్కినది. విజ్ఞానవ్యాప్తి కార్యక్రమచరిత్రయందు మనదేశమున నేటియుగమును వయోజన విద్యయుగమని వర్ణింపవచ్చును. ప్రజాప్రభుత్వయుగమున నిది యంతర్భాగము. ఇట్టి తరుణమున శ్రీరామలింగారెడ్డిగారు ప్రజలలో వ్యక్తులు-అందులో అబలలు-ప్రజాక్షేమమునకై చేయగల అఖండత్యాగమును వర్ణించుచు రచించిన ఈ ‘ముసలమ్మమరణము’ను ప్రచురించుటకంటె వారికి మా చేయగల గౌరవము వేరుకలుగదని నిశ్చయించితిమి.
శ్రీ క. రామలింగారెడ్డి నాకు జ్యేష్ఠసోదరుడు. నాయందలి ప్రేమచే కొంతకాల మతడు నన్ను ‘సీనియర్’ –జ్యేష్ఠుడని–వ్యవహరించినను, అతడు క్రైస్తవకళాశాలలో బి. ఏ. పట్టపరీక్షయందు చరిత్రలో తేరి డబుల్ డిగ్రీకొరకు–దుశ్శాలువలకొఱ కన్నమాట– తత్వశాస్త్రము చదువుచు ఉపన్యాసవేదికలమీద ఇంగ్లీషు తెలుగుల రెంటిని అనర్గళముగా వెల్లువ లురికించుచు ప్రసంగించు దినములలోనే నా కళాశాలను ప్రవేశించి ఇతనియంతటివాడను నే నెప్పుడగుదునో యని నోరూర్చుకొనుచు నొసటిమీది ఆ పెద్దమచ్చమీదను అతని ముఖముమీదను తదేకధ్యానముగా దృష్టినిలిపి అతనిని రమారమిగా ప్రేమించితిని. నాటినుండి నేటిదనుక అతనిచరిత్ర వ్రాయుట నిటనాకు పనిగాదు. కాని అతనికి నాకును—అతడెచటనున్నను నే నెచటనున్నను— బంధుత్వ మెక్కడకలదా యని ఆలోచించినపుడు మాకు తెలిసిన సువార్త మరియొకరికి వ్యాపింపజేయు గుణమునందున్నదని పలుమరు తోచుచుండును. కవిత్వతత్త్వవిచారము, అర్థశాస్త్రములు మహత్తమసృష్టులే. రామలింగారెడ్డి ద్రౌపది శీలవర్ణనవ్రాసియుండిన నంతకంటె మహత్తరసృష్టి యయియుండును. కాని రెడ్డిప్రతిభ ఇట్టి సృష్టులలో ఇముడలేదు.
జిగిబిగిగల తెలుగుశైలి వ్రాసి చప్పటి తెలుగు వాక్యరచనకు చవులూరు గుణముకల్పించిన కీర్తి యతనికి చెందవలెనేమో! నన్నయ యెడల నెంతయభిమానము నితడు చూపినను తేలికవ్రాతలలో తిక్కన ననుకరించినవారిలో మా రెడ్డియొకడనియు రాయలసీమ వచనరచనకు నితడు పురోగామియనియు నాయూహ. శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మబోటి ప్రతిభావంతులను కనిపెట్టి లోకమునకు ఇచ్చుటలో రామలింగారెడ్డి అప్రతిమాన బుద్ధికౌశలమును మహోదారహృదయమును కనుపరచినాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయము — సవ్య తేజోవిభాసితము — విద్యాపక్షమున పూర్ణముగా నతని సృష్టి.
ఇట్టి ఈ భాషాసేవకునికి సరస్వత్యారాధకునికి దేశసేవాపరాయణునకు రెండరువదియేండ్ల ఆయువొసంగినను నొసంగతగినదే. ఈశ్వర కృప అపారముగ నీతనియెడల వెలయుగాక.
14 ఏ. సుంకువారివీధి
ట్రిప్లికేన్, మద్రాసు
29-11-40
ఇట్లు, బుధజనవిధేయుడు
గాడిచర్ల హరిసర్వోత్తమరావు
ఆంధ్రదేశ గ్రంథాలయసంఘాధ్యక్షుడు
మొదటికూర్పునకు
ముఖపత్త్రము
చెన్నపురి క్రైస్తవకళాశాలకుం జేరిన శ్రీమదాంధ్రభాషాభిరంజనీ సమాజమునఁ దత్పోషకులగు రాజశ్రీ, సమర్థి రంగయ్యసెట్టిగారిచే నూతనముగ స్థాపింపఁబడిన బహుమానకావ్య పద్ధతి ననుసరించి ఈ కావ్యము రచియించితిని. ఇయ్యది పారితోషికమునకుఁ దగినదని యామోదించినందులకు వారి కనేక వందనము లర్పించుచున్నాఁడను.
ఒకానొక త్రిలింగదేశీయునిచే వ్రాయఁబడి బ్రౌన్ దొరగారిచేఁ బ్రకటింపఁబడిన ‘అనంతపుర చరిత్రము’ అను గ్రంథమునుండి యిందలి కథం గైకొంటిని. అయినను గొన్నియెడల రసాధిక్యమునకై నూతనకల్పనలు చేసినాఁడ.
అనంతపురమునకు సమీపమున బుక్కరాయ సముద్రము నేఁటికి ఉన్నది. ఆ యూరి చెఱువుకట్టకు “ముసలమ్మకట్ట” యనియే పేరు. అచ్చట నేఁటేఁట జనులందఱుఁ బొంగళ్ళుపెట్టుచు ముసలమ్మను గ్రామదేవతగాఁ గొలుచుచున్నారు. ఆ పల్లెలో నీ విషయమైన శిలాశాసనమున్నదఁట. ఈ గ్రంథము రచియించుటకు బూర్వమే నాకీ సంగతులు తెలిసియుండిన నే నచ్చటికి బోయి సర్వమును జూచి తత్ ప్రదేశస్వభావవర్ణన మిక్కుటముగఁ జేసియుందును. అనంతపురములోఁ గొన్ని సంవత్సరములు నివసించిన నా మిత్రులగు నారాయణస్వామి నాయనిగారి యింట నే నీపుస్తకమును జదివినప్పుడు వారే తద్‌గ్రామ సంబంధ విషయములం జెప్ప నా కపరిమితాశ్చర్యమైనది.
ఈ చిన్నిపొత్తము ముఖ్యముగా స్త్రీలకొఱకుఁ జేయబడినది. వారి కుపయుక్తముగా నొప్పినయెడల నా ప్రయాస సఫలతనొందినట్టే.
ఈ కార్యమును నేఁ జదువగా విని కొన్ని తప్పుల సవరించినందులకు బ్రహ్మశ్రీ, కొక్కొండ వెంకటరత్నము పంతులుగారికిని, ముద్రాపణకార్యమును నిర్వహించిన మామక మిత్రులగు కందుకూరు మల్లికార్జునాచారిగారికిని, వందనము లర్పించెదను. మఱియు నెన్నఁడు నన్నుఁజూచి యెఱుఁగనివారయ్యు మల్లికార్జునాచారిగారి ప్రేరణచే విశేష కాలవ్యయమున కోర్చి యీ గ్రంథమును శ్రద్ధతోఁ జదివి యనేక విషయములను సూచించిన దయాశాలురగు బ్రహ్మశ్రీ దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారికి మత్కృతజ్ఞతాసూచక నమస్కారములు. పదిమందికిఁ దెలియునట్లు నివేదింపఁ దరుణమబ్బినందున కెంతయు సంతసంబయ్యెడి.
ఆర్యులారా! నేను నిశ్చయముగఁ బండితుఁడనుగాను. మరి పామరుఁడను. బాలుఁడను కావున, నిం దెవ్వియేని దోషములున్నఁజూపి ననుం గృతార్థునిఁ జేయ మీ రెల్లరుఁ బ్రార్థితులు.
ఇట్లు విన్నవించు
సకలజనవిధేయుఁడు,
కట్టమంచి రామలింగారెడ్డి
ఉపక్రమణిక
శ్రీమత్కటుమంచీ పుర
ధామా! శుభనామ! దేవతాకోటి కిరీ
టామల పాదాంభోజ!
కామాక్షీ సహిత! సౌఖ్య కర! బాల్యేశా. 1
ఉ. శ్రీలఁ జెలంగు లోకములు సృష్టి యొనర్ప విరించియై, తగం
బాలన సేయ విష్ణువయి, వాని లయింపఁగ శూలపాణియై,
లీల సరస్వతిన్ గలిమి లేమను బార్వతిఁ గూడి వెల్గు ది
వ్యాలఘు శాంత తేజము జనౌఘమహార్తి హరించుఁ గావుతన్.
ఉ. శ్రీల నొసంగె యక్షున, కరిప్రకరంబుల భండనంబునం
గూలఁగ నేయఁ జక్రమిదె కొమ్మని శ్రీహరి కిచ్చె, నిచ్చె గౌ
రీ లలనా లలామకు శరీరము నం దొక యర్ధ, మిచ్చె గో
పాలున కన్యభాగ, మిటు బాపురె సర్వముఁ గోలుపోయియున్.
గీ సకల జగములకును సాక్షియై, కర్తయై,
విభుఁడు నై, శివుండు వెలుఁగుఁగాదె;
యిల్లు లేని వాని కెల్ల గృహమ్ములు
సొంత మయ్యె ననెడు సూక్తి దోఁప. 4
ఉ. ఏమనుజున్ దలంతు రిల నెల్లరు నేమియు లేని వాఁ డటం
చా మనుజుండ సర్వము సమగ్రము గాఁ గల వాఁ డటంచు నే
స్వామి నిజైక చర్య జనసంతతికిం బ్రకటించు, వాని, లో
కామల సద్గురుం, గొలుతు, నద్రిసుతాహృదయేశ్వరున్, హరున్.
సీ. అంచ తేజీ నెక్కి యలరు సామిని జేరి
చదువుల గొంతియై చాల వెలిఁగెఁ
జిలువల యెకిమీని సెజ్జఁ బండెడువని
చెలువయై కలుముల చేడె యయ్యె
గిత్తతత్తడి రౌతు కేల్గేలఁ గీలించి
బుత్తి ముత్తుల నిచ్చు సత్తి యయ్యె
ముగురు సాములకును మొదలింటి వెలుఁగయి
యట్టిట్టి దనరాని యవ్వ యయ్యె
[1]తే. నచలసంభూత, సదయ హృదంబుజాత,
నిర్గుణోపేత, పరిపూర్ణ, నిత్యపూత,
వాఙ్మనోతీత, సుగుణసంపత్సమేత,
పార్వతీమాత, మదభీష్ట వరము లీత. 6
క. అమ్మా! మీకృప నేఁ బ
ద్యమ్ముల రచియింపఁ గడఁగి, తప్పొప్పుల భా
రమ్మొడి గట్టెద మీ కన
యమ్మును ననుఁ బ్రోవ వమ్మ, యభవునికొమ్మా. 7
శా. ప్రాహ్నంబందు నభంగశోణమయతన్ బ్రహ్మన్ విడంబించి, మ
ధ్యాహ్నంబందుఁ బ్రచండధీధితుల రుద్రప్రక్రియంబొల్చి, సా
యాహ్నంబందు ననంతశాంతత ననంతాధీశునిం బోలి, స
ర్వాహ్నంబుల్ వెలుఁగొందు భాస్కరుఁ ద్రిమూర్త్యాత్ముం మదిన్నిల్పెదన్. 8
____
క. ఇలలో స్వచ్ఛందంబుగ
మొలచిన యే శాకమైన భుజియించి, తపం
బులు సల్పుచు దారుణ వన
ముల నుండెడు పెద్దలెంత పుణ్యాత్మకులో. 9
గీ. కవికులబ్రహ్మఁ దిక్కన గణన చేసి,
సూరనార్యుని భావంబు సొంపుఁ బొగడి,
వేమన మహాత్ము సహజ విద్యా మయాత్ము
మ్రొక్కి, కవన మొనర్పంగఁ బూని నాఁడ. 10
____
మ. తనరన్ రంగయ సెట్టిగారు కవితా ధారానుమోదాత్ములే
చిన ఠీవిం బహుమానకావ్యముల నీ శ్రీయాంధ్ర భాషాభిరం
జనినిం గోరిరి చేయ, నట్లగుట నస్మచ్ఛక్తికిం దీటుగా
నొనరింపంగఁ గడంగినాఁడ విహితప్రోత్సాహతన్ గబ్బమున్. 11
____
సీ. ఆ ప్రొద్దు కూటికి నమ్మరో యనుచుండు
నట్టి బీదల యింట నవతరించి
పాలివారందఱుఁ బగఁగొని యొనరించు
కుటిల కృత్యంబులఁ గ్రుంగకుండ
దైవంబునే నమ్మి దైవారెఁ దుదకు న్యా
యస్థానవాదియై యలరెఁ జాలఁ
గార్వేటి నగరాది గంభీర సంస్థాన
ములకెల్ల నొజ్జయై పూజ లందె
తే. నేకపత్నీవ్రతస్థుఁ, డహీనగుణుఁడు
శారదేందు ప్రభా తిరస్కార కీర్తి,
కట్టమంచి సుబ్రహ్మణ్య ఘనుఁ డతండు
తండ్రి గానొప్ప నెంతయుఁ దనరినాఁడ. 12
క. భారత భాగవ తోజ్జ్వల
వారిధి గత సార పద్య వరమణి చయమున్
హారముగఁ గూర్చె నెవఁడా
సూరిని మజ్జనకుఁ దలఁచి చూడుఁడు నన్నున్.
- ↑ పాఠాంతరము:
తే. ఆశ్రితవ్రాత, సదయహృదంబుజాత,
నిర్జరోపచితిప్రీత, నిత్యపూత,
వాఙ్మనోతీత, సుగుణసంపత్సమేత,
భువనమాత, భూభృజ్ఞాత, ప్రోచుఁ గాత. - ↑ స్తుతిప్రకరణమునందలి పద్యములు పెక్కులు 1897-వ సం. చేయఁబడినవి. మా తండ్రిగారు “భారతసారరత్నావళి” బ్రకటించుటకు బూర్వమును, కూచిమంచి సోమసుందరకవిగారు వ్రాసిన,
మ. తత బోధారస దీపితాఖిలమహా ధర్మోర్మికోవేత భా
రతవార్ధిన్ గల సార పద్యమణులన్ రత్నావళిం గూర్చె నీ
శ్రుతితత్త్వజ్ఞుఁడు సూతుఁడో, శుకుఁడో, వ్యాసుండో, గదేయంచు ధీ
రత మిమ్మందురు కట్టమంచికుల సుబ్రహ్మణ్య పుణ్యా హ్వయా.అను పద్యమునుజూచి 13-వ పద్యమును గట్టితిని.
అంకితము
క. ఎవ్వఁడు ప్రియమిత్రుఁడు నా,
కెవ్వండు సమీపబంధుఁ, డెవని మొగము లే
న వ్వలర లేక చూడనొ,
యెవ్వఁడు విధి లేక విడిచి యేగెనొ దివికిన్. 14
క. అతఁడు రఘునాథా హ్వయుఁ
డాతత గుణశాలి, యతని కర్పించెద; హా!
వ్రాఁత! యదెట్లగు? నీకృతి
నాతని యాత్మకు నొసంగ నౌ; నింతియపో. 15
క. విస్తార హార సన్నిభ
నిస్తంద్ర యశో ధవళిత నీలగళ గళా!
శస్తాఖిల గుణ సహితా
ర్యస్తుత! రఘునాథరెడ్డి యాత్ముఁడ! వినుమా. 16
____
ముసలమ్మ మరణము
క. శ్రీలాలిత వసుధా నా
రీ లలిత లలాట తిలక రీతిని ధన ధా
న్యాలిఁ బొలుచు నొక పల్లియ
చాలంగా బుక్కరాయసంద్రం బనఁగన్. 17
సీ. చెఱకుఁ దోఁటలఁ జొచ్చి కొఱికి పాడొనరించి
దొరలట్లఁ బోవు పందుల గణంబు,
నెండ్రకాయల కొఱ కేతెంచి గుంటిపై
మెక్కి కూసెడు గుంట నక్క గములు,
బడుగు బక్కలు గాక కడుపారఁ దిని పంది
గున్నలతో రాయు గొఱియ పిండుఁ,
బొలముల లేఁ బచ్చికల మేసి చియ్యచే
నిగనిగ లాడు గో నికరములునుఁ,
తే. గలకలారావములు మీఱఁ గలిసి జొన్న
చేలపైవ్రాలు గువ్వల చెలువుఁ, గలిగి
పైరు పచ్చల నొప్పు నా పల్లె, చెఱువు
నిండి నీరంబు లొసఁగుచు నుండ నెపుడు. 18
వ. ఆ యూరి చేరువ 19
మ. చలదుత్తుంగ మహోగ్రభంగపటలీ సంఘట్టనారావ, ము
జ్జ్వల కూలాగ్రనటత్తరంగవ, మంచన్మధ్యభాగ్భూమి భృ
త్కులసంపాతి మహోర్మికానికర నిర్ఘోషంబునుం, గూడఁగా
నలరున్ ఘోరసరస్సు దిగ్విదళన వ్యాపార పారీణమై 20
చ. కడవల ముంచి వంచిన ప్రకారము, మన్నును, మిన్ను నేక మ
య్యెడు గతి, రేవగళ్లు నొకటే విధమొప్పఁగ, నాకసంబు తూఁ
టిడెనొ యనంగ, బల్పిడుగు లెక్కడఁజూచిన రాలుచుండఁగా
సుడిగొని గాలియున్ విసర, జోరని వాన లొకప్డు వచ్చినన్ 21
శా. ఆ లాగుంగని రెడ్లు రైతులును దా మాలోచనల్ చేసి “యే
కాలం బందును నిట్టి వానల వినం గానంగ లేదెవ్వరున్
ఏలాగో మన మేమి చేయఁగల” మం చెంతేని భక్తిన్ వడిం
“బోలేరమ్మకుఁ బొంగలో” యనుచు సమ్మోదించి చాటించినన్ 22
క. నల్లని కోళ్లను బొట్టే
ళ్ళెల్లరుఁ గొని మగలఁగూడి యే తెంచిరి యా
పల్లియ కొమ్మలు మిక్కిలి
జిల్లను నా గాలి తనులు చిలచిల వడఁకన్ 23
క. పొంగళ్లు దిగిన తోడనె
రంగుగ బలులిచ్చి, పళ్ళెరమ్ముల తళియల్
వొంగారఁగఁ, బూజారు ల
నంగారిశుభాంగి వర్ణనల్ చేసిరొగిన్ 24
క. కరిముఖ విశాఖ చండీ
శ్వరభైరవ వీరభద్ర భవ్య కిరీట
స్ఫుర దురు మణిగణ తేజో
భరభాసిత దివ్యపాదపద్మా! కాళీ! 25
గీ. తల్లి! నీకుఁ గోటి దండంబు లర్పించి
భక్తి విన్నవించు వార మమ్మ
యాలకించి వేగ నాదరింపుము మమ్ము
జాగు సేయుట కిది సమయ మౌనె? 26
ఉ. ఇంతకొ యింకఁ గొంతకొ యహీనతరంగ భుజాగ్ర దర్పదు
ర్దాంతతఁ గట్టఁ ద్రెంచి, పటుదంత విఘర్షణపీడ మానసా
క్రాంతమహోగ్రకోపశిఖి గల్గు నురుంగు మొగంబు నిండఁగా,
సంతత సింహనాదము విశాల వికార శరీరముం దగన్ 27
గీ. రక్కసుని మాడ్కి మమ్మెల్ల నొక్క గ్రుక్క
గొనఁగ మారి మసంగి నట్లెనసివచ్చు
నీ చెఱువు బారినుండి మమ్మెల్ల నెట్లు
శుభముగా నేలుకొందువో చూడవలయు 28
క. అమ్మా! నేఁటివఱకు మము
ముమ్మరమగు కూర్మిఁ బెనిచి మురిపెంబఱ నేఁ
డిమ్మాడ్కిఁ జెఱువు వాతం
జిమ్మఁగ మనసెట్లు వచ్చుఁ జెప్పుము తల్లీ! 29
వ. అనునంత నాకాశవాణి. 30
క. బసిరెడ్డికిఁ గడ కోడలు
ముసలమ్మ యనంగనొప్పు పుణ్యాంగన తా
వెస బలిగాఁ బోయిన మీ
కిసుమంతయుఁ గష్టమెన్నఁడేలా కలుగున్? 31
క. అని తెగ నాడిన మాటలు
విని విస్మయశోకతాపభృత భావముతో
మనములఁ బొంగిన దుఃఖము
కనుల వెడలె ననఁగ నశ్రుకణము లొలుకఁగాన్. 32
క. మన మొండు తలఁప దైవం
బున కామోదంబు లేక పోయెనుగద! బా
విని ద్రవ్వఁ బోవ లేచెం
బెను భూతం బనెడు మాట విశదం బయ్యెన్. 33
క. సుదతీమణి, కడుమెత్తని
హృదయంబును గలది, పసిది, యేమియెఱుఁగ, దా
పదలం బడ దెన్నండును,
హృదయేశుని విడిచిపోవ నెట్లోపునొకో. 34
వ. అనుచు వగచు జనంబులతోఁ గొందఱు గద్గద కంఠంబున నిట్లనిరి. 35
క. హృదయముల వగలు నెగయఁగ
నిది యేమిటి? వెఱ్ఱికూఁత లేలాకూయన్?
మది నుబ్బి నీరి కుఱకక
పదివేల విధాలఁజెప్ప బాల నిలుచునే! 36
చ. గుడిసెల మూఁటిఁ బీఁకికొని కొండొక చోటికిఁబోదమన్న “నీ
యెడ విడనాడమీకుఁదగునే” యని పల్కదెయాపె? యయ్యయో
చెడెఁజెడెఁ గార్య; మూరఁగలచెల్వము మాసెను; ముల్లుదీసి కొ
ఱ్ఱడిచెను గాదె దేవి? యిఁక నయ్యెడు శోకము చెప్పఁదీరునే! 37
సీ. లేఁగ మై నాకుచు లీలమై మెడ మలం
చిన గోవుఁబిండెడు వనరుహాక్షి
బొండుమల్లెలతోఁటఁ బువ్వులు గోయుచు
వనలక్ష్మి యననొప్పు వనజగంధి
బీదసాదలనెల్ల నాదరించుచుఁ గూడు
గడుపారఁ బెట్టెడు కన్నతల్లి
వ్యాధిబాధల నెవరైన నడల ఱెప్ప
వేయక కాచెడు వినుతచరిత
గీ. బిడ్డలెల్లరుఁ దమవారి విడిచిచేరఁ
జంక నిడికొని ముద్దాడు సదయహృదయ
అమ్మ! నీకిట్లు వ్రాయంగనౌనె బ్రహ్మ
కనుచు నూరివారందఱు నడలియడిలి. 38
సీ. అత్తమ్మకొంగు నన్వహము బట్టికొని తా
తిరుగుచుండును బిడ్డకరణి బాల
తనవారు పెఱవార లను భేదమేలేదు
హృదయ మన్ననొ యప్పుడెత్తువెన్న
యేవేళఁ జూచిన నెలనవ్వులేకాని
చిడిముడి పడ దెంత యుడుకు లున్నఁ
దనముద్దుమోముఁ జూచినఁజాలు హృదయ తా
పంబెల్ల నప్పుడె పాఱిపోవు
తే. నహహ! మామపైఁగలభక్తి, యాత్మవిభుని
మీదిఁ మక్కువ, మఱఁదుల మీఁదికూర్మి,
ప్రజలమీఁది వాత్సల్యంబు, బ్రహ్మకైనఁ
జూప శక్యమే వేఱొక్క సుదతియందు. 39
చ. అదియును గాక నీమె మగఁడాత్మ సహోదరుఁడట్ల మమ్ముఁజూ
చు; దినముతప్పె నేనియును సువ్రతనెన్నఁడు బాయఁ; డాతఁడిం
కఁదనమనంబు శోకశిఖి కాఱియ వెట్టఁగ గుండె చీలఁగా
మదికొకటైనఁ దోఁప కతిమౌనముతో నొకమూలఁజేరఁడే? 40
చ. అహరహమున్ దదుజ్జ్వల కరాబ్జకృతాఖిల సౌఖ్యపాలికా
సహితుఁడు, తన్మనోవిభుఁడు, చంద్రముఖిన్ గులకాంతఁబాసి దు
స్సహతర దుఃఖ హవ్యవహ చండతరోగ్ర శిఖాపరంపరం
బహువిధబాధలం బొరల, వానిఁ గనుంగొను టెట్లొ యీశ్వరా! 41
వ. అనుచు సమస్త జనంబులుఁ బురపురఁ బొక్కు సమయంబున 42
గీ. తనకుఁ గడుఁగూర్చు ప్రజలకై తాను వేగఁ
బ్రాణముల్ వీడ సంతసపడియు బాల
మగని నత్తను మామను మఱఁదుల మఱిఁ
గలజనమ్ముల విడిచిపోఁ గాళ్లురాక, 43
క. లేనగవును గన్నీళ్ళును
గా, నెద తటతటయనంగఁ గాంతుని యెదుటన్
వానయు నెండయుఁ గలసెడు
చో నొప్పెడు నభమనంగ, సుందరి నిలిచెన్. 44
వ. నిలిచిన నతండు వచ్చిన కార్యమేమని యడుగుటయు, 45
చ. అసమచరిత్ర! భూమి, జలమందును, నగ్నిని, గాలిలోన, నా
కసమున, మీకు గోచరము కానివిలే; వయినన్ మదీయమా
నసమును నేన చెప్పఁగ వినం గడు వేడుకపుట్టెనొక్కొ మీ
కు? సతుల మాటల న్వినఁగఁ గోరుట భర్తల రీతియే గదా! 46
క. అని, పూస గ్రుచ్చినట్లుగ
వనితామణి దెలిపె దేవి వార్తలరీతిన్,
జనముల కష్టము చందముఁ
దన పూన్కి తెఱంగు, వినయ తత్పరమతియై. 47
వ. పిట్ట పిడుగున్నట్టుండి శ్రవణరంధ్రంబుల విదారించిన వడువునఁ గర్ణకఠోరంబులై, నిజమృదులతర హృదయ పుటవిభేదనకారణంబులగు మార్గణంబులై, వీతెంచిన యాయోషామణి భాషణంబులచేఁ దన మనంబు తామరపాకునందలి జలబిందువుం బలె నల్లలనాడ, నుల్లంబు జల్లన, మూర్ఛవోయి, కళదేఱి, యన్నిటికి నీశ్వరుండు గలండని ధృతివహించి, దీర్ఘనిశ్వాసపూరిత ముఖుండయ్యును, చలింపని యెలుంగేర్పడ నతండిట్లనియె. 48
గీ. ఎంతమంచి మాటలు పల్కితేమిచెప్ప!
యింత కఠినచిత్తము నీకు నెట్లుకలిగె?
తెలిసి తెలిసి నన్నిట్టులు పలుకఁ దగునె?
పడఁతి! నీవు లేకున్న నే బ్రతుకఁ గలనె? 49
క. నినుమాని నిముస మేనియు
వనజానన! యుండఁగలనె? ప్రతిన నెఱపఁగన్
జనఁదలఁచితేని, నన్నున్
గొనిపో నీవెంట, నిపుడ గోరిక వత్తున్. 50
క. అది గాని నాఁడు, సేమ
మ్మొదవఁగ నీయూరు విడిచి యొండొక యెడకే
గుద మది మేలుగదా మన
కుఁదగన్ గాఁపులను గూడి గొబ్బునఁ దరుణీ! 51
గీ. నోరునొవ్వఁ బల్కఁగనేల? సారసాక్షి
వినుము ననుఁ జంపినను నీకు ననువుగాఁగ
నాజ్ఞయొసఁగ నేనొసఁగ; నీవలుగ వలవ
దింతి నాముద్దు చెల్లింపవేని విడువ. 52
వ. అనిన నయ్యింతి చింతాక్రాంతయై, “కట్టా! యెట్టిమాటల విననయ్యెఁ! బ్రాణేశ్వరుని పలుకులు వినవిన బాలసూర్యోదయమ్మున విఱుగుమంచువోలె మన్మనోనిశ్చయము కరుగుచున్నది. ఇక నీశ్వరుఁడే నా హృదయమున ధృతినూరఁ జేయుచుండవలయు” నని చింతించి, ధైర్యం బవలంబించి, యా శుకవాణి తిన్నని యెలుంగేర్పడ నించుక కఠినంబుగా నిట్లు మందలించె. 53
గీ. ఎఱిఁగి యెఱిఁగి మీర లీరీతి వాక్రువ్వ
సంతసించితిరి ప్రశస్తభంగి![1]
మిమ్ముఁ జెప్పనేల? మీఱి నేనొడిఁ గట్టి
కొన్న పాపఫలముఁ గుడువకగునె? 54
ఉ. పెద్దలనాఁటినుండి కడు వేడ్కవసించిన యిండ్లవీడుటల్
వృద్ధులఁ దల్లిదండ్రులను వీధినిడించి చనంగఁ జూచుటల్
ముద్దుల సోదరుల్ వగవ మోదముతో సతిఁగూడి పోవుటల్
గద్దఱికంబొ కాదొ మదిఁ గాంచుఁడు వేఱుగఁ జెప్ప నేటికిన్. 55
శా. హేయంబైన ప్రపంచసౌఖ్యములు మిమ్మేలాగునంగట్టె? నా
థా! యత్యద్భుతమయ్యె; సంతతము నేదైవంబుగాఁ గొల్చు మీ
రే యిట్లాడిన నేమిచెప్పనగు? నన్నీసారికిం “బోయిరా
వే” యంచుందయఁ బంపవే; గుణనిధీ! యేనిన్నుఁ బ్రార్థించెదన్. 56
వ. అని వెడవెడ శంకవొడమ వెండియు నిట్లనియె. 57
క. ఇది తగు నిది తగదని మీ
కుఁ దెలుప రాలేదు నేను గ్రొవ్వి మహాత్మా!
మది మీకుఁ గోపమయ్యెడు
నదియైన నెఱుంగఁ జేయుఁ డణఁగెద నింతన్. 58
క. అనినం జిఱునవ్వానన
మున మొల కెత్తంగ నతఁడు పోలునె నీకి
ట్లనఁ బల్లంతైనను నిను
వనజానన! యెన్నఁడైన వారించితినే? 59
వ. అని సకరుణంబుగాఁ బలికిన నబ్బాలయుఁ బ్రత్యుత్తరంబునకొక లేనవ్వుఁ బ్రచురించి యిట్లనియె. తాతముత్తాతలనుండి తర తరంబుగ వచ్చిన యిండ్లు వాకిండ్లు విడువఁబాడికాదు. అట్లు కాదని విడిచిపోయినను మేలులేదు. 60
గీ. తిండియెట్టులు? నీళ్లెట్లు? తిరిపమునకు
నమ్మరో యని యిల్లిల్లు నరుగఁ గలరె?
ఎవ్వరిత్తురు నేల? మీకెట్టు లిండ్లు?
చావరే పసిబిడ్డ లీసంకటముల? 61
క. నిలిచిన వారును దుఃఖం
బుల మునుఁగరే? యాకలముల భుజియింతురే? వా
రల కేలా యీ యిడుములు
లలితంబుగఁ బంపుఁడునను లాభము కలుగున్. 62
క. కుడువను గట్టను దొరకక
కడు వగలం బొగలు జనులఁ గాంచెదవా? యీ
పుడమికి భారంబగు న
న్విడనాడఁ దలంతువా? వివేకనిధానా! 63
వ. మఱియు దేవా! భవత్కృత పద్యంబులు కొన్నిగలవు. అవధరింపవలయు. 64
గీ. తనకు దేవుఁ డిచ్చిన శక్తికనుగుణముగ
నన్నదమ్ములు నాఁదగు నఖిలజనుల
కలఁక నేనాఁడు దీర్పంగఁ దలఁపఁడేని
పుట్టనేల నరుఁడు మఱి గిట్టనేల? 65
క. జనులకు మేలొనరింపని
తనువేలా? కాల్పఁదగదొ? తానొక్కండై
తన వార లడల నేలా
గునఁ దలయెత్తికొని తిరుఁగ గూడు నరునకున్? 66
వ. అని మఱియు. 67
గీ. మీరు కన్నారఁ జూచుచు గారవింపఁ
గన్ను మూసికొనుట నాకు ఘనము కాదొ?
తమకుఁ దమభార్య యిటుచేసెఁదగుఁదగునని
యెల్ల వారును వర్ణింప నింపుకాదొ? 68
వ. కావున నాథా! ప్రసాద బుద్ధిం దేఱిచూడవేయని విన్నవించిన నా సన్నుతాంగిఁ గాంచి యతండిట్లనియె. 69
క. జనకుల నన్నల విడువం
జనదనియును, నూరు విడువఁ జనదనియును, నా
కెనయం దెల్పితివి గదా
వనజానన! సతిని విడువ వచ్చునె చెపుమా. 70
వ. అని యుల్లసమాడి యొక్కింత చింతించి యిట్లనియె. 71
గీ. నీవు చెప్పినదెల్లను నిక్కువంబ
యయిన మనమున కారాట మయ్యెఁ దరుణి
యింతయే కాని యచ్చెరు వింతలేదు
మున్ను తలఁచినదే నేఁడు మొనసెఁ గాన. 72
క. విను ఇచ్చకంబులాడను;
జను లెల్లరు నాడుకొనెడు సంగతి; మాకం
టెను నీవు నూఱు మడుఁగులు
ఘనతరవని బుద్ధి భక్తిఁ గారుణ్యములన్. 73
క. తెలియును నాకునునీవ
న్యులఁబోల వనియును, గొప్ప యొప్పిదములకున్
నెలవ వనియు, నే నీకుం
జలజానన తగననియును సత్యము గాఁగన్. 74
సీ. అరుణోదయ చ్ఛాయ లాకాశ పథమున
నంభోధరముల వేటాడువేళ
మార్తాండ చండాత పార్తికి ననిలముల్
పొదరిండ్ల గుసగుసల్ వోవువేళ
సాయాహ్నలక్ష్మి కసూయ కలుగు భూమి
తళుకు విరుల చీరఁ దాల్చువేళఁ
బండువెన్నెల ఱేఁడు కొండపైజలజల
మని పాఱు నది తాన మాడువేళఁ
తే. గల మనోహరాకృతులెల్లఁ గాంచి నీవు
చొక్కి మ్రొక్కు నిక్కుం గాంచి “యొక్కనాఁడు
మమ్ము మోసపుత్తు" వటంచు మదికి నప్పు
డపుడు దోఁచు; నయ్యది నిజ మయ్యెనేఁడు. 75
వ. అనుచుఁ జెప్పుచుఁ బోవుచుండు బ్రాణకాంతునిఁ గాంచి, యయ్యో నేఁడెట్టి వియోగంబు కల్పింపఁబడె నని చింతించి, మనసున గట్టి పఱచుకొని, లేని కోపంబు మొగంబున మెఱుంగుఁదీఁగవలె వచ్చుచుఁ బోవుచుండ మందహాసకందళితసుందరవదనార విందయై యా సుందరి యిట్లని మందలించె. 76
గీ. చిఱుతనుండి మిమ్ము సేవించుటయకాని
నోరు తెఱచి యడుగ నేరనెద్ది
“యేమి యడుగ” వనుచు నెన్నియోమార్లు మీ
రలుకఁ గొంటి; రిప్పు డడుగ, నీరు. 77
గీ. అనుచుఁ జిఱునవ్వు నవ్వి, యాతని కరంబు
గేలఁ గీలించి, పెదవికి లీలనెత్తి,
“పలు పలుకులేక నేఁబోయి వత్తు” ననిన
మౌనముగనుండె నాతండు మాఱులేక. 78
వ. అంత నక్కాంతయు నయ్యది యాజ్ఞగాఁగొని, యంతకుఁ బూర్వమే యచ్చోటికి వచ్చి ప్రతిమలవలె నిలచి వినుచున్న యత్తమామలకు మ్రొక్కి, మీ కుమారుని వచనంబులు వింటిరిగాదె మీ చేత ననుజ్ఞాతనైకదా పోయిరావలయును? ననినఁ గుములుచుండిన శోకాగ్ని గుప్పున ప్రజ్వరిల్ల వార లిట్లనిరి. 79
శా. కట్టా! యక్కటికంబు లేక మముఁ జక్కంజేయ మాప్రాణమౌ
పట్టిం గట్టిఁడి రీతి బాల్యముననే పాపఁ బ్రయత్నించితీ
వెట్టూ? యేఁట నొసంగు పొంగళుల నీ వేలాగునన్ మ్రింగితీ?
వెట్టూ నేఁటికి నెత్తిఱాయి వయితీ? వేమందుమో దైవమా! 80
వ. అని తమ కోడలి నుద్దేశించి. 81
గీ. చీకు ముసలి వారి చెయి విడనాడ నీ
కెట్లు మనసు వచ్చె? నేమి చెప్ప
భక్తి మాకు నింకఁ బరిచర్య సేయు వా
రెవరు? చెప్పు మాకు నేది గతియొ? 82
గీ. కనులు లేని మాకుఁ గన్నును నూఁతకో
లయును నీవ మా తనయులకంటెఁ
గూర్తు మాకు ముద్దుకోడలా! నీవు లే
నట్టి యిల్లునిల్లె? యడవి గాక. 83
వ. అనుచు. 84
చ. వెడవెడబాష్పముల్ గురియు వృద్ధజనంబులఁ గాంచి యెల్లరుం
గడుపున గంపెఁ డగ్నిపడి గాసి యొనర్చినభంగి నేడ్వఁగాఁ
దడఁబడ మానసంబు వనితామణిదైవమ యేమి చేయుదున్
గడుఁబసినాఁటఁగోలె ననుఁ గాచిన వీరిని నెట్లు వీడుదున్. 85
క. పుట్టియుఁ బుట్టక మున్నే
కట్టిఁడి గతి జనని జనకుఁ గ్రమమున దైవం
బట్టే మ్రింగినఁ దమ సుత
నట్టుల ననుఁ బెంచిరి గద యగునే విడువన్. 86
గీ. అయిన నాచేయు కార్య మీ యఖిలమైన
వారికిని, వీరికిని, శుభం బారఁజేయు
వీరికై విడువక మేను పెంచి పెంచి
యేమి చేయంగఁ బ్రొయిలోన నిడనెయంచు. 87
వ. తలపోసి, తిన్నని యెలుంగేర్పడ నయ్యిందువదన యిట్లని విన్నవించె. 88
గీ. కొడుకులెల్లరు రాములు, పుడమి తనయ
లెల్ల కోడండ్రుఁ, దక్కువ యేమి మీకు?
ఱెప్ప లక్షులఁబోలె మిమ్మెప్పగిదిని
అహరహమ్మును సేవింతు; రడల నేల? 89
వ. అని వెండియు. 90
ఉ. తల్లియుఁ దండ్రియున్ గురువు దైవము లెల్లరు మీర; మీరలే
చెల్లఁగనియ్యరేని యిఁకఁ జెల్లునెనాదగు పూన్కి యెచ్చటన్?
గల్లయొ సత్యమో యెఱుఁగ; గణ్యతఁదత్త్వముఁ దెల్పువేళమే
నెల్లఁ బరోపకారమునకే యనిపల్కితి; రట్లు చేసెదన్. 91
సీ. అనవిని మామ యిట్లను నమ్మ నిను దూఱ
నెంచిన వాఁడఁ గా నేను వినుము
నీ వెఱుంగని దేది నే నెఱుంగుదునమ్మ
నీ యిచ్చ వచ్చినట్లే యొనర్పు
మనుచు దుఃఖమ్మున నాననమ్మును వాంచి
యొండు వలను చూచుచుండెనంత
నత్తగా రడలుచు నల్లన ముద్దిడి
పోయిరమ్మని పల్కఁబువ్వుఁబోణి
తే. హృదయమున నగ్గలంబగు ప్రీతి మెఱయఁ
దనదు చిన్నారి పొన్నారి తనయుఁ దేరఁ
బనిచి కన్నుల నొక క్రొత్త ప్రభ సెలంగఁ
జంక నిడికొని ముద్దాడి, జాలిదోఁప. 92
గీ. అన్న పోర; నీకు నమ్మ యెక్కడిదింక?
తండ్రిగారిఁ గూడి తనరు మయ్య;
నన్నుఁ దలఁచి తలఁచి నాయనా యడలంగ
వలదు; పోయివత్తుఁబంపు తండ్రి! 93
మ. అనుచున్ బిడ్డనిఁ గౌఁగిలించి తమి మూర్ధాఘ్రాణముం జేసి, యొ
య్యన, భద్రంబని ప్రాణనాథునికిఁ దానర్పించి యర్పించుచోఁ
దనకుం బట్టక వచ్చు బాష్పముల నాతం డేడలక్షించియే
డ్చునొయంచానన మొండుదిక్కునకు నాశోభాంగిచేర్చెన్వడిన్. 94
వ. అంత మర్యాద తోఁపఁ గొంత దవ్వుల నున్న జన సంఘమ్ము నుపలక్షించి. 95
గీ. అన్నలార! మిమ్ము నడిగెద నొక చిన్న
వరముఁ దప్పకుండఁ బడయఁ గోరి,
కాదు గీదటంచు వాదుసేయక, గొప్ప
బుద్ధిచేసి యిచ్చి ప్రోవరయ్య. 96
క. నను గాఢంబగు రాగం
బునఁ, గాంచిన బిడ్డఁబోలెఁ బ్రోచిన మీకున్
పెనుకష్టము వచ్చెను, మీ
ఋణమిప్పుడు తీర్ప బుద్ధి కెంతయుఁ దోఁచెన్. 97
చ. అని మఱుమాటలాడక నిజానన ముర్వికి వంచి, మానసం
బున శివునెంచి, దేవ! శుభమూర్తి! భవత్కృప నాయఘంబు లె
ల్లనుమటుమాయమయ్యెఁ బ్రజలన్ దయఁ జూడుము పార్వతీపతీ
చనువున నన్ను నేలుమని స్నానము సేయఁగనేగె గ్రక్కునన్. 98
క. లలనా శిరోలలామం
బలరుచుఁ బసుపునను జలకమాడి తలిర్చెన్
దలమీఁది చెట్లు కురిసిన
లలితసుమ పరాగమున వెలయు లతికయనన్. 99
మ. ఉరు హారిద్రపుఁజీరసాంధ్యరుచిగా నొప్పార, నానందవి
స్ఫురితంబైన మొగంబు రక్తమయమై సూర్యప్రభంబోల, శో
క రసాధీనజనాళి పుల్గుల క్రియం గాంక్షన్ మొఱల్ వెట్టఁ దా
సరసీరాజమహాబ్ధికై చనియె విస్ఫారీభవన్మూర్తియై. 100
[2]గీ. అశ్వపాలుండు గొనిపోవ నల్లబాఱు
నదినిగాంచి, మనోహర నాట్యమొప్ప
మెల్లమెల్ల నొయారంబు మీఱఁ గదియు
బాల హరి లీల జనులతోఁ బడఁతియరిగె. 101
వ. అంత నంతరంగ ధ్యానాధిక్యంబునం జేసి. 102
మ. తన దేహంబును, భూమియున్, దివము, మార్తాండుండు, నాశాచయం
బును, వృక్షమ్ములుఁ, బక్షులుం, బ్రజలునుం, భూధ్రంబులున్, సర్వ
మున్ దనకుం దోఁపవ; యెందుఁ జూచిన నుదాత్తంబైన తద్భక్తికా
రణమైయొప్పఁగఁదోఁచు శంకరజలప్రాయాంగసాంద్రద్యుతుల్. 103
సీ. కన్నెఱ్ఱవారిన ఖరకరోదయకాల
మల్లనమ్రింగు జాబిల్లియనఁగ
జ్వలదగ్ని శిఖలపై నెలనవ్వుతోఁ బోవు
ధాత్రీ మహాదేవి తనయ యనఁగ
కెందారమరలబారు సుందరమగు లీల
నల్లనల్లనఁ జొచ్చు నంచ యనఁగ
కాల మహాస్వర్ణ కారకుం డగ్నిలోఁ
గరఁగించు బంగారు కణికయనఁగ
గీ. ప్రళయ కాలానల ప్రభాభాసురోగ్ర
రంగ దుత్తుంగ భంగ సంవ్రాతములకుఁ
గలఁక నొందక, దరహాస మలర, మంద
మందగతి బోయి, చొచ్చె నమ్మగువనీట. 104
గీ. ఇచట నస్తమించి యినుఁడు పశ్చిమగోళ
మందు వెలుఁగు గాదె? యట్టెదేవ
భువనముననుఁ బొలుచు ముసలమ్మ యాంధ్రభా
షాభిరంజనిం దయఁగనుఁ గాత. 105
ఏ. శివమై, చిన్మయమై, యఖండమయి, యర్చిన్మంతమై, నిత్యమై,
భవపాథోనిధినావయై, మునిజనప్రాణంబునై, యద్భుతా
ర్ణవమై, నామనికారరూపరహిత ప్రాశస్త్యమై, వెల్గు వి
ష్ణు విరించీశ్వరనాథతత్త్వము మమున్ శోభిల్లఁగాఁ జేయుతన్.
ఏ. ఇది కట్మంచి నివాసుఁ, డార్యజన మైత్రీచ్చాభిరాముండు, ధ
ర్మదయాశోభిత పాకనాటికుల సుబ్రహ్మణ్య పుత్త్రుండు, దు
ర్మదదూరుండును, ప్రీతబంధుఁడవు రామస్వామికిన్ స్వీకృతుం,
డుదితామోదముమై రచించె విహితప్రోత్సాహ సాహాయ్యుఁడై.
- ↑ *పాఠాంతరము. తెఱఁగటంచుఁ దలఁచితిరి సుమ్ము.
- ↑ ఈ పద్యము హోమరను గ్రీసుదేశకవిచే వ్రాయంబడిన ఇలియడ్డను కావ్యమునుండి తెలిగింపబడినది.
లఘుటీక
1. ధామా = ఇల్లుగలవాఁడా !
2. విరించియై = బ్రహ్మయై; జన, ఓఘ, మహా, ఆర్తి = జన, సమూహముయొక్క, గొప్ప, మనస్సంకటమును; హరియించు = పాపు
3. యక్షునకు = ఇచట కుబేరునకని యర్థము; ప్రకరములు = సమూహములు; ఇచ్చె గోపాలునకన్యభాగము = మోహినీరూపమును దాల్చిన విష్ణువునకు దక్కిన సగభాగము నిచ్చెను.
5. నిజ, ఏక, చర్య = తనదియగు, ప్రత్యేక, ప్రవర్తనముచేత; అద్రి, సుత = మలబిడ్డ: పార్వతి.
6. అంచ తేజీ = హంసయనెడు, గుర్రము: హంసవాహనము; చిలువల, యెకిమీడు = పాముల, రాజు; ఆదిశేషుడు; నెజ్జ = పరుపు; గిత్త, తత్తడి, రౌతు = ఎద్దు అను గుర్రమును, సవారిచేయువాడు: వృషభవాహనుడు ఈశ్వరుఁడు; బుత్తిముత్తులు = భుక్తి ముక్తులు; సత్తి = శక్తి: పార్వతి.
7. అభవుడు = పుట్టుకలేనివాడు; ఈశ్వరుడు
8. శోణ = ఎరుపు; అనం, తాధీశుడు = అనంతునకు, అధీశుడు; విష్ణువు.
12. ఒజ్జయై = గురువై.
17. లలాటతిలకము = నొసటిబొట్టు.
18. గుంటిపై = గండశిలపై; చియ్య = కండ; నికరము = గణము; ఆరావములు = శబ్దములు.
20. చలత్, ఉత్తుంగ, మహా, ఉగ్ర, భంగ, పటలీ, సంఘట్టన, ఆరావము =కదలుచు, పొడవై, ఎక్కువ, భీకరమైన, అలల, సమూహముయొక్క, పరస్పరము కొట్టుకొనుట వలనబుట్టిన శబ్దమును; ఉజ్వలత్, కూల, అగ్ర, నటత్, తరంగ, రవము = మొరయుచుండు, తీరపు, చివరలను, ఆడునట్టి, అలలయొక్క, శబ్దమును; అంచత్, మధ్యభాగ, భూమిభృత్, కుల, సంపాతిన్, మహా ఊర్మికా, నికర, నిర్ఘోషంబు = ఒప్పుచు, (సరస్సున) మధ్యభూమినుండెడు, పర్వత, సమూహములకు తాకునట్టి, గొప్ప, అలల, గుంపుయొక్క, రొదయు; కూడగా = ఏకముకాగా; దిక్, విదళన వ్యాపార, పారీణమై = దిక్కులను, బ్రద్దలుగొట్టు, పనియందు, దట్టమగు ప్రవేశము కలదయి; ఘోరసరస్సు = భయంకరమైన చెరువు, అలరున్ = ఒప్పుచున్నది.
21. మన్ను = భూమి; మిన్ను = ఆకాశము.
22. పొంగలి = పులగము.
23. జిల్లను = వణకుకలిగించు.
24. తళియల్ = తళిగరూపాంతరమునకిది బహువచనము, తళిగయనగా భోజనపాత్రము. ఇది వైష్ణవసాంప్రదాయానుసారముగా నుపయోగించునప్పుడు దైవమునకు ఆరగింపుగానిడు పిండివంటయను నర్థమగుచున్నది; అనంగ, అరి = మన్మథుని, శత్రువు: ఈశ్వరుడు; ఆతనిశుభాంగి దుర్గ అనంగారి శుభాంగి.
25. కరిముఖుడు = విఘ్నేశ్వరుడు; విశాఖుడు = కుమారస్వామి; చండీశ్వర, భైరవ, వీరభద్రులు = వీరు మువ్వురును ఈశ్వరుని పుత్రులే.
27. తరంగ, భుజములు = అలలను, బాహువులు.
28. మారిమసంగినట్లు = మశూచకము విజృంభించినరీతిని.
29. ముమ్మరము = దట్టము; అఱ = నశింపగా.
31. పుణ్యాంగన = ముత్తైదువ.
32. తెగన్, ఆడిన = కఠినముగా సాహసించి, పల్కిన; విస్మయ, శోక, తాపములు = భ్రమ, వ్యసనము, తహతహలు.
36. వగలు = దుఃఖము.
38. లేగ = దూడ, మలంచిన = త్రిప్పిన.
40. శోక, శిఖి = వ్యసన, మనునిప్పు; కాఱియవెట్టగ = యాతనపడజేయగా.
41. తత్ = ఆమెయొక్క; హవ్య, వహుడు = హవిస్సులను, దేవతలకు మోసికొని పోయి యిచ్చువాడు: అగ్ని. 46. మానసమును = మనస్సునందలి సంగతిని.
47. పూన్కి = నిశ్చయము.
48. విదారించిన = చీల్చిన; వడువున = విధమున; మార్గణములు = బాణములు; ధృతి = ధైర్యము.
53. చింత, ఆక్రాంత = చింతచేత, ఆవరింపబడినది.
55. గద్దరికము = దిట్టతనము.
57. కట్టె = బంధించెను.
59. పోలునె = తగునో; వారించితినే = అడ్డుపెట్టితినా?
65. నాదగు = అనదగిన.
68. కన్నుమూసికొనుట = మరణించుట యనుటకు సాధుశబ్దము; తగుతగును = మేలుమేలు, సెబాసు సెబాసు.
69. ప్రసాదబుద్ధి = కలకదేరినబుద్ధి.
72. ఆరాటము = తహతహ.
73. ఇచ్చకములాడను = మొగమాటమినిపలుకను; ఘనతరవు = ఎక్కువయైన దానవు.
74. ఒప్పిదములు = సుగుణములు.
75. అంభోధరములు = నీటినిమోయునవి: మేఘములు; చండ, ఆతప, ఆర్తికి = భీకరమైన, ఎండ, వేదనకు; అనిలముల్ = గాలి; తానము = స్నానము.
76. వియోగము = ఎడబాటు.
77. చిఱుతనుండి = చిన్నప్పటినుండి; అలుక = కోపము; ఈరు = ఇయ్యరు.
79. కుములుచుండిన = రాజుచుండిన.
80. చక్కన్ జేయ = చంపుటకు; నెత్తిఱాయి = నెత్తిమీదపడినఱాయి.
82. చీకుముసలి = కండ్లుగాననిముసలి. 83. కూర్తు = కావలసినదానవు.
84. నాటఁగోలె = నాటినుండి.
91. చెల్లగనియ్యరేని = సాగనీయనిపక్షమున.
94. తమి = ప్రేమచే; మూర్థ, ఆఘ్రాణమున్ చేసి = తల, మూసిచూచి; లక్షించి = చూచి.
95. ఉపలక్షించి = చూచి.
97. రాగంబున = ప్రేమచేత.
99. తలమీది = పైభాగమునందలి; కురిసిన = రాల్చిన; లలిత, సుమ, పరాగమున = ఇంపైన, పుప్పొడులచేత; లతిక = తీగ; లలనా, శిరో, లలామము = స్త్రీలయందు, తల, మానికము: ముసలమ్మ.
100. ఈపద్యమున ముసలమ్మ సందెవేళకు పోల్చబడియున్నది. హారిద్రపు, చీర = పసుపు, చీర; శోక, రస, అధీన = దుఃఖమనెడు, నీటికి, లోనైన; పుల్గులు = పక్షులు.
102. ధ్యానాధిక్యము = ప్రార్థనాతన్మయత్వము.
103. ఆశా = దిక్కు; తోపవ = కాన్పించనే కాన్పించవు; శంకర, జల, ప్రాయ, అంగ = శంకరుడనెడు, జలముతో, సమానమయిన ఇచ్చట ఏకమైన అనవచ్చును, దేహముయొక్క.
104. ఖరకరుడు = సూర్యుడు; అతని ఉదయకాలము చంద్రుని మ్రింగునది; ధాత్రీ, మహాదేవి, తనయ = భూ, మహాదేవి, కూతురు: సీత; స్వర్ణకారకుడు = కంసాలి; అనల = అగ్ని; సంవ్రాతము = సమూహము.
మూలాలు
[మార్చు]This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.