మీఁగడతరకలు/మార్గస్థుడు—మఱ్ఱిచెట్టు

వికీసోర్స్ నుండి

మార్గస్థుడు - మఱ్ఱిచెట్టు



 
మిటమిటని కాయు నెండకు కటకటఁబడి
తెరువరి యొకండు బడలిక తీర్చికొనఁగ
మార్గమున నున్న యొక పెద్దమఱ్ఱిచెట్టు
నీడఁ జని, మేను వాలిచె నేలమీద.

నిదుర పట్టక అటునిటు కదలియాడి,
అల్లిబిల్లిగ నేలపై నల్లికొనిన
పండ్లతో నున్న గుమ్మడిపాదు జూచి,
ఇట్లు తలపోసె నాతండు హృదయమందు.

చేవ చాలని గుమ్మడితీవ యందు
బానలంతేసి కాయలఁ బాదుకొలిపి,
విన్ను నంటెడు పెనుమఱ్ఱివృక్షమునకు
చిట్టికాయల నమరించె సృష్టికర్త.



"ఔర ! సర్వజ్ఞుడని పెద్ద పేరెగాని
బమ్మ యొనరించు సృష్టి జాలమ్మునందు
అకటవికటము కానట్టి దొకటి కలదె?
బుద్ధి పెడతలఁ బట్టెఁబో వృద్దుఁ డగుట.

"అట్టె దానొక నేర్పరి యయ్యె నేని
పెద్ద చెట్టున కనువైన పెద్దపండ్లు
చిన్న చెట్టున కనువైన చిన్నపండ్లు
కూర్ప నగుఁ గాని, ఈ తాఱుమార్పు లేల ? ”

అనుచు నీరీతి తలపోసికొనుచు నంత
కొంతసేపటి కాతండు కూర్కు జెందె ;
గాలి కిట్టట్టు కొమ్మలు కదలియాడ
మఱ్ఱికాయలు పడె వానిబుఱ్ఱపైని.

దద్దఱిలి లేచి తనతల తడవికొనుచు
అయయొ! ఇవ్వియె పెద్దపండ్లయ్యె నేని
బళ్ళు మంచును నాతల బ్రద్దలగుచు
యమునివాకిట ప్రాతకాపగుదుఁ గాదె ?



లీల జగముల నెల్ల గల్పించినట్టి,
సృష్టికర్తకె యీరీతి చెట్ట నగుచు
పంగనామము పెట్టఁ గడంగినాఁడ;
ఎట్టిసాహసమున కొడిగట్టికొంటి ?

అల్పబుద్ధిని నే నేడ ? అఖిలసృష్టి
మించి సృజియించి పాలించి త్రుంచునట్టి
అఖిలశక్తి నియామకుఁ డాతఁ డేడ?'
అనుచుఁ జింతించె నాతండు మనమునందు