మీఁగడతరకలు/కాపువాడు—బోయీలు

వికీసోర్స్ నుండి

కాపుఁవాఁడు - బోయీలు




కలఁడొకానొకపురమున కాఁపువాఁడు;
వానియాఁ బెయ్య యొక నాఁడు పాఱిపోవ,
పల్లకీ మోయు చాకలివాండ్రఁ బిలిచి
వెదకితెం డని వారికి ముదల వెట్టె.

"అందలము మోయుపని కాని, ఆవుదూడ
వెదకుపని మాది కా "దని బెదరు లేక
పొగరుఁబోతుతనంబున బోయ లంత
బదులుపల్కిరి యాకాఁపువానితోడ.

బోయ లాడినమాట కబ్బురము జెంది
"ఔర వీరల కింతటి యాగడంబ?
మూర్ఖు లగు వీరి కెటు లైన బుద్ది సెప్పి
గర్వ మడఁచెదఁ గా' కంచు కాఁపువాఁడు.


"సరియె మంచిది, మీరలు సలుపరాని
పనుల నియమించి మిము శ్రమపఱుప నేల?
నేనె స్వయముగ దూడను నెమకికొందు
కాన పల్లకి మోయుఁ ” డం చానతిచ్చె.

ఇట్లు వచియించి, పల్లకి నెక్కి కాఁపు
దారుణం బగు నాఁటిమధ్యాహ్న వేళ
చౌటిపఱ్ఱల, పొలముల, తోట దొడ్ల,
సందుగొందులఁ ద్రిప్పించె నందలంబు.

మండుటెండల మలమల మాడి మాడి
వేసటంబడి బోయలు గాసినొంది
"అయ్య ! మే మింక నొకయడు గైన నకట
మోప లే ” మని మొఱవెట్ట , కాఁపువాఁడు.

"అందలము మోయుపని మీది, ఆవుదూడ
రోయుపని నాది కావున బోయలార !
అందలము మీరు మోయుఁడి, ఆవుదూడ
వెదకికొందును నే" నని బదులు వలికె .


అంత బోయలు మాఱు మాటాడలేక
వాని పదములపైఁ బడి దీను లగుచు
'మేము చేసినతప్పు క్షమింపుఁ ' డనుచు
వేడి, వేగమె దూడను వెదుకఁ జనిరి.

రాజు - కాఁపువాఁడు




ఒక్కనాఁ డొక భూవరుఁ డుదయ వేళ
హయము పై నెక్కి స్వారీకి బయలువెడలె;
కోట దాఁటి యతం డట్లు కొలఁదిదూర
మేగుసరి కొకకాఁపువాఁ డెదురుపడియె.

ఏమిచిత్రమొ కాని- యానృపునిహయము
కాఁపువానిని దవ్వునఁ గాంచినంత
బెదరి యట్టిట్టు గంతులువేసి తుదకు
నేలమీఁదికి భూవరుఁ గూలద్రోసె.

క్రిందఁ బడినను గాయంబు నొందకుండ
తోడనే లేచి యొడ లెల్లఁ దుడిచికొనుచు
హయముపై నెక్కి క్రమ్మర రయము మీఱ
కోటలోనికిఁ జనె ఱేఁడు కోప మడర.