Jump to content

మిత అయ్యల్‌వార్లు/VI. మిత అయ్యల్‌వార్ల భాష, వాడుకపదాలు

వికీసోర్స్ నుండి

1. తెలుగు భాష - పరిచయం

ప్రపంచంలో సమస్త ప్రాణికోటి లేదా జీవరాశులలో కేవలం మానవునికి మాత్రమే ఉన్న అమూల్యమైన శక్తి మాట్లాడగలగటం. దీనినే భాష అంటాము. ప్రపంచంలో అనేక దేశాలు, జాతులు, మతాలు, కులాలు, ఇలా ఎన్ని ఉన్నా వారందరూ ఏదో ఒక భాష మాట్లాడుతూనే ఉంటారు. భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే, భాష మాట్లాడగల మానవేతర ప్రాణి ఏదీ లేదు. శారీరికంగా ఒక వ్యక్తి మెదడులో గాని, ఇతర అవయవాలలో గాని ఏమైనా లోపాలున్న వారు తప్ప మిగిలిన మానవులందరికీ ఈ మాట్లాడే శక్తి ఉంది.

ఆచార్య నేతి అనంతశాస్త్రి భాషను నిర్వచిస్తూ, “మానవుడు తన మనస్సులోని అభిప్రాయాలను బహిర్గతం చేయటానికి నోటిద్వారా చేసే ధ్వనులే భాష. మనకు తెలియని భాష ఒకరు వ్యవహరిస్తున్నప్పుడు మనం వినేవి ఆ వ్యక్తి నోటి ద్వారా చేసే రకరకాల ధ్వనులే. ఆ భాష తెలిసిన వారికి ఆ ధ్వనుల అర్థం బోధ పడుతుంది. తెలియనివారికి వాటి అర్థం బోధపడదు. కాబట్టి భాషంటే కొన్ని ధ్వనుల సముదాయమేనని తెలుస్తుంది” అని వివరించారు.

ప్రతి వ్యక్తికి భాష మాట్లాడి అర్థంచేసుకోగల శక్తి పుట్టుకతోనే వస్తుంది. కాని పుట్టగానే ఏ భాషా రాదు. పుట్టిన శిశువు మొదట అవ్యక్త ధ్వనులు చేస్తూ పెరిగే కొద్దీ తన చుట్టూ ఉన్న వ్యక్తులు చేసే ధ్వనులు వింటూ, అవి సూచించే అర్థాలు తెలుసు కొంటూ భాష మాట్లాడటం అర్థం చేసుకోవటం అలవాటు చేసుకొంటుంది. ఈ విధంగా 5,6 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి, ప్రతివ్యక్తి ఒకటి లేక అంతకంటే ఎక్కువ భాషలు తన దైనందిన వ్యవహారానికి సరిపోయేటంత వరకూ నేర్చుకుంటాడు. నెలల బిడ్డను ఒక నిర్జన ప్రదేశంలో వదిలివేస్తే వాడు బతికి పెద్దయినా ఏ భాషా రాదు. అలాగే ఒక భాష మాట్లాడే తల్లిదండ్రులు మాట్లాడే భాషా రాదు. దీనిని బట్టి భాష అభ్యాసం వల్ల వచ్చేదని మాత్రమే తెలుస్తుంది. అంతే తప్ప ఒక వ్యక్తికీ, ఒక భాషకీ మధ్య జన్మ సంక్రమణ సంబంధం ఏదీ లేదని స్పష్టమవుతుంది.

భాషను అభివర్ణించే శాస్త్రాన్నే భాషాశాస్త్రం అంటారు. భాష ఒక సహజమైన వ్యవస్థ. అంటే కట్టుబాటు అన్నమాట. ఇది మృదువైనది, స్థిరమైనదీ కూడా. పరిణామశీలం కలది. వ్యవహారంలో ఇది సజీవంగా విలసిల్లుతుంది. దీని స్వరూప స్వభావాల్ని ఎటువంటి పూర్వ అభిప్రాయాల మీద ఆధారపడకుండా పరిశీలన ప్రధానంగా నిర్ణయించే శాస్త్రాన్ని భాషాశాస్త్రం అంటారు.

ఒక మానవ సమాజాన్ని పరిశీలించాలంటే మనం ఆ భాషను అవగాహన చేసుకోవాలి. ఆ సమాజపు విధానాలను, వారి చారిత్రక మూలాలను నిశితంగా గుర్తించడానికి వారి భాషయొక్క క్రమబద్ధమైన పరిణామాన్ని సంపాదించాలి. మానవజాతి గురించి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా వివిధరకాలైన సమాజాలను పరిశీలించాలి. మానవుని గురించి ఏ కొంచెం మనకు తెలిసినప్పటికీ అది ఈ విధమైన అధ్యయనం వల్లనే తెలుస్తుందని అమెరికన్ భాషా శాస్త్రవేత్త అయిన బ్లూమ్ ఫీల్డ్ ఈ విధంగా చెప్పాడు.

"In order to observe a human group, we must understand its speech. If we want to prove deeper into the ways of the community and their historical origin, we must possess to begin with, a systematic description of its language. In order to know anything about mankind, we must study in this way a varied set of community".

“భాష్యతే ఇతి భాషా” అన్నది భాషా శబ్ద వ్యుత్పత్తి. భాషింపబడేది భాష. భాష అంటే వ్యక్తమగు వాక్కు అని అర్థం. ఉచ్చారణ అవయవాల వల్ల వ్యక్తమయ్యే వాక్కుల సమూహానికి భాష అన్న వ్యవహారం చెల్లుతుంది.

"ప్రజలు మాట్లాడుకునే తీరే భాష - అంతేగాని ఇలాగే మాట్లాడాలి అని ఉద్దేశించే తీరు మాత్రం కాదు ” అని ఒక భాషావేత్త నిర్వచించాడు.

అదేవిధంగా మరొక భాషా శాస్త్రవేత్త "పరిమిత సాధనాన్ని అపరిమితంగా వాడుక చేసేది భాష" అని అన్నాడు.

“మాటలాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్తే భాష" అని హకెట్ అంటాడు. ఇక్కడ సంక్లిష్టమంటే అనేక వ్యవస్థలతో కూడినది అని అర్థం.

“ఒక సమాజంలోని సభ్యులు వ్యవహరించటానికి ఉపయోగించే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష" అని Sturtevant అనే భాషావేత్త తాను రచించిన లింగ్విస్టిక్ సైంస్ లొ చెప్తాడు.

నిత్య వ్యవహార ఉపయోగ పదజాలం శబ్దార్థ సామ్యాన్ని కలిగి ఉండాలి. ఆ సామ్యం యాదృచ్ఛికం మాత్రం కారాదు. అంటే ఇంగ్లీషులోని mouth తెలుగులో మూతి, అలాగే prop ప్రాపు, neat (నీటు-తె) సజాతీయతను నిర్ణయించటానికి శబ్దపరమైన, సువ్యాప్తమైన శబ్దమొకటి ప్రామాణంగా ఉండాలి.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భాషలలో తెలుగు భాష కూడా ఒకటి. తెలుగు వారు తమ మాతృదేశాన్ని, మాతృమూర్తులనూ, కమ్మనైన తమ తెలుగు భాషనూ ఏనాడు మరువలేరు. అలాగే మన పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలనూ, మన కట్టుబాట్లనూ, విలువలను కూడా ఎప్పటికీ మరచిపోలేము. భారతదేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. మన తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను చాలాకాలం పూర్వమే చాలామంది గుర్తించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా వారసత్వంగా వస్తున్న మన తెలుగు భాష దేశవిదేశాల్లో మాట్లాడేవారి సంఖ్య ఈనాడు 16 కోట్లకు పైగా పెరిగింది. భారతదేశంలో హిందీ భాష తరువాత ఎక్కువమంది మాట్లాడే రెండవ భాష మన తెలుగు భాష.

"ఆరు బయట చల్లని పిండివెన్నెల్లో చందమామను చూపుతూ, గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ నాకు నేర్పిన భాషే తెలుగు భాష, అమ్మ భాషే అమృతం. ఏ వ్యక్యి అయినా గుండె లోతుల్లోంచి వచ్చే భావాన్ని మనసు విప్పి చెప్పగలిగేది మాతృభాషలోనే. స్వంతభాషపై పూర్తిగా పట్టు ఉంటేనే ఇతర భాషలపై పట్టు దొరుకుతుంది. ఈనాడు ఒక భాష అంతరించిందంటే ఆ జాతి యావత్తు అంతరించినట్టే. కన్నతల్లిని మనము ఎన్నడూ మరువలేనట్లే తల్లి భాషను కూడా ఎనాడు మరువకూడదు. తుపాకి శరీరాన్ని లొంగ తీసుకుంటే, భాష ఆత్మను లొంగతీసుకుంటుంది. ఒక భాషను దూరం చేయటమంటే ఆ జాతి సంస్కృతిని దూరం చేయటమే. పరమత ద్వేషం ఎంత నీచాతి నీచమో, పరభాషా వ్యామోహం కూడా అంతే నీచం. పరాయి భాష మెదడునుండి శరీరాన్ని, మనసు నుంచి మెదడును విడదీస్తుంది. మాతృభాషను ప్రేమించలేనివాడు, మాతృదేశాన్ని కూడా ప్రేమించలేడు. తెలుగు భాష వాడుక మన జాతి మనుగడకు వేడుక కాగలదు. విద్య, సాహిత్య, సాంస్కృతిక రంగాల ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించినప్పుడే ఆ భాష పది కాలాలపాటు జీవిస్తుంది. అమ్మపాల కమ్మదనంతోపాటు అచ్చతెలుగు మకరందాన్ని మన ముందుతరాల వారికి అందిద్దాం.”2

2. భాషా సాహిత్యాలు

భాష భావ వినిమయానికి తోడ్పడే సాధనం. ఒక జాతి ప్రత్యేక లక్షణాల్లో భాష మొదటిది. ఆ జాతికున్న ప్రత్యేకమైన భాష, ఇతరజాతుల నుంచి ఆ జాతిని వేరుచేసి చూపుతుంది. భాషలో విలక్షణాన్ని చూపేవి మాండలికాలు. వీటిలో కుల మాండలికాలు ఎంతో వైవిధ్యం చూపుతాయి. ప్రాంతీయ మాండలికాలు కూడ కుల మాండలికాల మీద ప్రభావం చూపినా, సాధారణంగా ఒక్కో కులానికి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. 'భాషతోపాటు పలుకుబళ్ళు, సామెతలు, పొడుపు కథలు, కథలు, గేయాలు మొదలైన సాహిత్య సంపదను' అధ్యయనం చేయటంవల్ల ఆ జాతి జీవన విధానాన్ని, సంస్కృతిని అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. అదే విధంగా ఒక కులానికి సంబంధించిన సాహిత్య సంపదలో ఆ కులంవారి జీవన విధానం, వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది.

ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రతి జాతికి, కులానికి కొన్ని సంకేత పదాల్లాగా కొన్ని ప్రత్యేక భాషా పదాలున్నాయి. భాషా పదాలతోపాటు పలుకుబళ్ళు, సామెతలు, కథలు మొదలైనవాటిలో వీరి కుల ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రధానంగా వీరి భాషా సాహిత్యాలను ముఖ్యంగా ఏడు భాగాలుగా వర్గీకరించి, పరిశీలించవచ్చు. అవి 1. సంకేత భాష 2. జాతీయాలు -పలుకుబళ్లు 3. సామెతలు 4. పొడుపు కథలు 5. కథలు 6. గేయాలు 7.మిత అయ్యల్వార్ల తిరునామాలు, రచనలు.

మిత అయ్యల్వార్ల ఉపకులాల జానపద కళారూపాల్లో, ప్రదర్శనల్లో, పాటల్లో, పద్యాలలో మనకు అనేక రకాలైన భాషావిశేషాలు కనిపిస్తాయి. ధ్వనిపరిణామం, మాండలికాలు, జంటపదాలు, వారానువర్తనాలు, ఛందోరీతులు, జాతీయాలు, విచిత్ర పదబంధాలు, అన్యదేశ్యాలు, సామెతలు, వాడుక పదాలు, ధ్వన్యనుకరణ పదాలు, పలుకుబళ్ళు, ద్విపద, మంజరీ ద్విపద మొదలైనవి ఈ క్రింది విధంగా కనిపిస్తాయు.

3. ధ్వని పరిణామం

సాధారణంగా ఏ కులానికైనా మరియు వారి ఉపకులాల జానపద కళాకారులు ప్రదర్శనల్లో, వాడుక భాషల్లో ధ్వని పరిణామం ఈ విధంగా వుంటుంది. అలాగే మిత అయ్యల్ వార్లలో కూడా ఈ విధంగానే ఉంటుంది

''చ'కారం 'స'కారంగా మారుటా

చూడు సూడు
చక్కదనం సక్కదనం
చీమలు సీమలు
చేన్లు సేన్లు
ఏమిచేతు ఏమిసేతు
చెల్లెమ్మ సెల్లెమ్మ
పొడిచేపొద్దు పొడిసేపొద్దు

పదాది 'వ 'కార లోపం

వాళ్ళు అల్లు
వచ్చి అచ్చి
విప్పిన ఇప్పిన
వాన ఆన
విందు ఇందు
విషం ఇసం
వచ్చినారు ఒచ్చిండ్రు, అచ్చిండ్రు
విలువిద్యలు ఇలువిద్యలు
వినవె ఇనవె

పదాదిన 'హ'కార లోపం

హత్య అత్య
హారం ఆరం
హారతి ఆరతి

4. మాండలికాలు

బాగోతం భాగవతం
ఆర్మాని హార్మోనియం
ఇంత వింత
నీసు మాంసం
జల్మం జన్మం
అత్తవా వస్తావా
గాబరైతుంది ఆకలవుతోంది
సాస్త్రం శాస్త్రం

5. జంటపదాలు

చిప్పగప్ప, కూరనార, సితుకు బొతుకు, కూడుగూడు మొదలైనవి.

6. వారానువర్తనాలు

మిత అయ్యల్వార్ల ఉపకులాల జానపద కళారూపాల్లో మనకు చాలా వారానువర్తనాలు కనబడతాయి. పడికట్టుమాటలు, రూప వర్ణనలు వీరు మాటిమాటికి ప్రయోగిస్తారు. వీటినే వారానువర్తనాలు అంటారు. అవి...

రూపవర్ణన

పసిడివెన్నెల పాలబుగ్గలు
పద్మరేకులవంటి కన్నులు
సుకుమార సుందరుడు

ప్రయాణవర్ణన

వాయువేగమున వెళ్ళినాడు
చటచట ముందుకురికినాడు
సైసై అంటూ నడిచాడు
చయ్యనబోయినాడు

కోపవర్ణన

భగ్గున మండెను

పటపట పండ్లు కొరికెను
అగ్గిమీద గుగ్గిలం అయినాడు

భయం, దుఃఖవర్ణన

గజగజ వడికి పోయింది
మలమల మాడిపోయింది
జలగంధి వలవల వలపోసింది

నవ్వు, యుద్ధ వర్ణన

ముక్కుమీద వేలు వేసి ఫక్కున నవ్వినాడు, పకపక నవ్వినాడు, పగలబడి నవ్వినాడు, కిలకిల నవ్వులు, కిసుక్కున నవ్వెను, చిత్రకన్నుతో భస్మం చేసినాడు, పట్టరానికోపం చేసింది, దోసకాయలవలె కోసివేసినాడు, కొంగవాలు కత్తి అటునిటు తిప్పినాడు, పొట్టజీల్తురా.

ఊర్ల పేర్లు

సత్యకైలాసాపురిపట్నం, అహూల్లాపురిపట్నం, గిరిరాజ నగరం, వైకుంఠాపురి పట్నం, సత్యబ్రహ్మలోకం, మాతంగాపురి పట్నం, శివకేశవాపురి పట్నం, మద్రాదేశం, కాశీపురిపట్నం, మధురాపురి పట్నం, అయోధ్యాపురిపట్నం, మాలవదేశం, నాగళ్లపూడి వంటివి.

7. ఛందోరీతులు

జానపద కళారూపాల్లో, పాటల్లో, పద్యాల్లో మనకు ఎన్నో రకాల ఛందోరీతులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ కథాగానాల్లో ద్విపద, మంజరీ ద్విపద, దరువులు ఎక్కువగా కనపడుతాయి. మనందరికీ అవి ఆశువుగా చెప్పిన కథలుగానే కనపడుతాయి. అలాగే ఈ భాగవతాల్లో కూడ అక్కడక్కడ కొంత సంప్రదాయ ఛందస్సు అయిన ఆటవెలదులు, తేటగీతులు, సీసపద్యాలు, ద్విపద దరువులు, మంజరీ ద్విపదలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా వీరినోట వాటంతట అవే ఆప్రయత్నంగా వెలువడుతుంటాయి. వాటిలో కొన్ని...


'తల్లినిన్ను కొలచి దండముల్ పెట్టి
కరమెత్తి మ్రొక్కెద నాగకన్న తల్లి
అవనిలో జనులకు అంబవే తల్లి
బవనీల పాలిటి ఓ కల్పవల్లి
గవ్వదర్శనాలు ఘనముగా పెట్టి
ముప్పొద్దు పూజలు చేసేము తల్లీ'

పై ద్విపద పాదాలు వీరు సహజంగా, కంఠోపాతంగా నేర్చుకున్నవే. దీనిలో ద్విపద, మంజరీ ద్విపద లక్షణాలు ఉన్నాయి. దీనిని బట్టి వీరి కథాగానాల్లో ఎక్కువగా మంజరీ ద్విపదలు ఉంటాయి. ఇదేవిధంగా వీరి భాగవతాల్లో కూడ ద్విపదలు, ఆటవెలదులు, తేటగీతులు, సీసపద్యాలు మనకు చాలా కనిపిస్తాయి. దానిలో ఒకదానిని పరిశీలిద్దాం. నల్లచెరువు నట్టనడుమ తెల్లదామెర పువ్వున్నది తెల్లాదామెర పువ్వులోనా తెటతెలివిగ దేవుడున్నాడు రాతేకట్టూ నూతిలోన, పైడిమర్రిచెట్టు పుట్టిపైడి మర్రిపండు పండెను యతిరామానుజా పైడిమర్రి చెట్టులోపల పంచవన్నెల చిలుకావాలెను చిలుకలున్న దోనలోన వజ్రంలా వానకురిసే కలికి చిలుకలు వణుకుపుట్టెను కలువపూలా నెగడివేయుమి పరముపదముపోతననీ మొదటనే పయనమైన త్రోవతప్పి కంచిరాయిన సుంచురీతిగా పరమపదము పోతనని పయనమయిన వారెవరు పరవస్తు జియ్యరుబంటు యతిరామానుజా పరమపదమూ సూరగొన్నాడు అడవిలోన చేనువేసి ఆకాశాన మంచెవేసి మయావధిని ఇది మిత అయ్యల్వార్లు పాడుకునే నిర్యాణ పాట. ఈ తిరునామంలో భగవతత్త్వం ఏమిటో తెలియచేస్తుంది. నల్లచెరువు మధ్యలో తెల్లతామెర ఉన్న ఆ పువ్వులోపల అందమైన దేవుడు అవతరించి ఉన్నాడు. దాని చుట్టూ రాళ్ళు పొదగబడిన నూతిలోన ఒక మర్రిచెట్టు పుట్టి దానికి మర్రిపండు పండెను. ఆ విధంగా రామానుజులు ఈ భూమి మీద ప్రజల బాధలను తీర్చడానికి, తిరుమంత్రం బోధించడానికి జన్మించాడని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ మర్రిచెట్టులోపల పంచవన్నెల చిలుకవాలెను. చిలుకవున్న మర్రిచెట్టు తొర్రలోపల వాన కురిసింది. ఆ వానకు చిలుకలకు వణుకు పుట్టింది. ఆ వణుకును పారద్రోలుటకు కల్వపూలతో చలిమంట వేయండి వైకుంఠాన్ని చేరడానికి. మొదటిసారిగా వైకుంఠం పోతానని పయనమై దారితప్పిన వారెవ్వరు? పరవస్తు జియ్యరు వైకుంఠం చేరి ఉన్నాడు. అడవిలోన పంటవేసి, ఆకాశాన్ని తాకే రీతిగా మంచును నిర్మించి, మయము మంచె గాడిదను కాపలుంచెను ఓ రామానుజా! ఆవుదూడలైదు చేను మేసెను. హద్దులేని వాన కురిసెను. వరదలేని వాగు పారెను. కుంట నిండెను. పంట పండెను. కుప్ప కూలెను. అప్పు తీరెను. ఓ రామానుజా! తీగ పాకింది. ఆ తీగకు ఫలములాంటి వైకుంఠము ప్రసాదించింది. ఆ వైకుంఠములో నిత్యము వైకుంఠములో విముక్తులై ఉన్నాము. స్థిరముగా నిన్నే నమ్ముకున్నాము. ఈ విధంగా ఈ తిరునామము భగవంతుని నమ్ముకొని స్థిరముగా ఎలా ఉండాలి అనే తత్త్వాన్ని తెలియజేస్తుంది. ఇందులో ద్విపదలక్షణాలు కావాల్సినన్ని ఉన్నాయి. అని పద్య రూపంలో పాడుకుంటారు. ఈ విధంగా వీరు పాడే తిరునామాలు పాటలు పద్యాలు, పద్యలక్షణాలు కలిగి వినసొంపుగా వుండడం వలన ప్రజలు వీరిని ఆదరిస్తారు.

153


కాంత వేదాంతార్యులనె కనులగంటిని
వింతగ తిరువడిఘళ చెంతనుంటినే ॥
నిర్హేతుక కృపచే దాసుల నిర్వహించిరే
విరజరదరి జేరుటకు హితవొసగిరే ॥
ముడివిడుమని భుజములందు ముద్రలుంచిరే
కడుకృపచే తిరుమంత్రము కరుణనుంచిరే ॥
సరసముగ ద్వయమునొసగి సంతసించిరే
కరుణతో చరమార్థమున గారవించిరే ॥
మించిన కృపతోడ మిథునశేషముంచిరే
అంచితముగ పరమపదమము వాంఛ దీర్చిరే ॥
నల్లబల్లిశౌరి తామై అవతరించిరే
చల్లగ కృపతోడ దాసుని కౌగిలించిరే ॥

8. జాతీయాలు

కడుపుగుత్తది, పులెగండుది చాటుగ తినాలనే కోరిక గలది
పొట్టగంజిదానా ఎంత తిన్నా చాలక తినేవారు
ఆయుషుగూడింది పోయేకాలం దగ్గర పడింది.
కడుపుల కసరున్నంతసేపు కడుపు నిండా అన్నమున్నంత సేపు
కానివాడు కరువుల, దూరమైనవాడు, మాటవిననివాడు
కంపల పోవాలె ఎక్కడికి పోయినా ఏమిలేదనుట
పొలమారుట చనిపోవుట
రెండుజీవుల మనిషి గర్భవతి
పూసిందే పువ్వు, కలిగిందే సంతానం అనే అర్థంలో
కాసిందే కాయ వాడే జాతీయం
ఆకుచాటు పిందె తల్లిచాటు బిడ్డ

9. విచిత్ర పదబంధాలు

పదబంధాలు/పలుకుబళ్ళు అర్థం
అందని పొందని అతకని మాటలు
అంశమంతుడు అదృష్టవంతుడు
దుంపనాశనము చేయు సమూలంగా నాశనము చేయటం
కంచముపొత్తు కలిసి భోజనం చేయటం
అడ్డగోలుగా ఎటుపడితే అటు
అర్లుగలవాడు ప్రేమగలవాడు
నాలిముచ్చు మాటల దొంగమాటలు (కుత్సితపు మాటలు)
నల్లికుట్లోడు మర్మం చెప్పకుండా ఉండేవాడు
నీల్గుడు మాటలు పనిచేయలేక రోషము మాటలు మాట్లాడుట
మర్నాగి మంది కొంపలకు ఎసలు పెట్టేవారు
ఒక్కపొద్దుండుట ఒక్కపూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండుట
బొచ్చె పలగాలె ఛాతిభాగం పగులగొట్టు, లేదా తిట్టు

10. వాడుక పదాలు

అడ్డెడు ఎనిమిది సోలలు
సోల ధాన్యం కొలుచు పాత్ర
బాండువ పెద్దకుండ
అగారం ఆహారం
తాంబాలం వెడల్పైన ఇత్తడి పళ్లెం
గర్వదర్శనాలు గవ్వల దండలు
చంద్రపట్నం కుంకుమ, పసుపు, ఆకుపచ్చ, తెల్లపిండితో చేసిన పట్నం, పోలు
జడ్త యాటను జడ్డ పట్టటం
సందుగ పెట్టె
కచ్చురం ఎడ్లబండి
మైలలు తీయటం శుద్ది చేయటం
బైరాగి తిరుగుబోతు (పనికిరానివాడు)
పర్ణము సిగరెట్
నాళ్ళం పొగాకు

ఇవికాక మిత అయ్యల్వార్లు వైష్ణవ సంప్రదాయంలో కొన్ని పదాలముందు 'తిరు' అనే శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉచ్చరిస్తారు. 'తిరు' అంటే శ్రీ పదమైన అని అర్థం. అలాగే కొన్ని సహజమైన వైష్ణవ సంబంధమైన పదాలను కూడా ఉచ్చరిస్తారు. అటువంటి కొన్ని పదాలను నా క్షేత్ర పర్యటనలో మిత అయ్యల్వార్ల2 నుంచి సేకరించి ఇక్కడ పేర్కొంటున్నాను.

పురాండాలు పురాణాలు
ఆరాధనము పూజ
ఇలయాళ్వారులు శ్రీ రామానుజులు
చతురాక్షరి 'రామానుజ' అను నామ మంత్రం
కైంకర్యము భగవంతుని సేవ
గురుపరంపర ఆచార్య పరంపర
చరమము చివరిది
తళియ ప్రసాదము అన్నము, కూర
తిరుచూర్ణము పసుపు, బియ్యము చేర్చి చేసిన బొట్టు
తిరుమణి వైష్ణవులు నుదుటన పెట్టుకునే కుంకుమ నామం
తిరుమంత్రము అష్టాక్షరి
తిరుముడి శ్రీ వైష్ణవుడు, శ్రీ పదమైన కిరీటము
తిరుముఖము దివ్యాజ్ఞ
తిరుమేను శ్రీ పదమైన శరీరము
తిరువణిపుల బొట్టుపెట్టుకోవడానికి పెట్టే రాగిపుల్ల
తిరుమోము బొట్టుపెట్టు ముఖము
తిరుపల్లె సమాధి
తిరువారాధనము దేవతార్చన
తిరువీధి పవిత్రమైన వీధి
తిరువడిఘళ్ శ్రీ పాదములు
ద్రావిడ వేదము ఆళ్వారులచేత రచింపబడిన నాల్గువేల పద్యముల సంపుటి (నాలాయిరము)
ద్వయము శ్రీమన్నారాయణ చరణా శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అను మంత్రము

11. ధ్వన్యనుకరణ పదాలు

చల్ చల్, టంటం, దండం, గలగల, చకచక,
కిటకిట, కిర్రుకిర్రు, తటతట, బడబడ
బుడిగెలు, బుగబుగ పొంగు, ఫటఫట
చటచట, డమడమ, వలవల వలపోత, జటజట4

12. మిత అయ్యల్వార్ల భాష

భాష అంటే ఏంటి? సామాజిక జీవనంలో అధ్భుతమైన విషయం ఏమిటి అంటే భాష. మనలోని భావాలను ఎదుటి వ్యక్తులకు భావాల ద్వారా వ్యక్తీకరించవచ్చు. కానీ అన్ని విషయాలు అలా సాధ్యపడవు. కనుకనే మనిషి భాషను కనుక్కొని ఉంటాడు. ఈ సమాజంలో జీవించివున్న అన్ని జీవులలో మానవుడు మాత్రమే భాష వాడగలుగుతున్నాడు. మానవుడు మనసులోని భావనను బహిర్గతపరిచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్ఛారణతో అభిప్రాయాన్ని ఎదుటివ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. మిత అయ్యల్వార్లు మాట్లాడుకునే భాషలో ఎక్కువగా తమిళ భాషా పదాలు ఉండటం గమనార్హం. ఎందుకంటే వీరి మూలం ద్రావిడం కనుక. శైవ, వైష్ణవ మత యుద్ధాలప్పుడు వీరు అటునుంచి ఇటు రావడం కూడా ఒక కారణం కావచ్చు. వారు మాట్లాడే కొన్ని భాషాపదాలు ఈ అధ్యాయంలో పరిచయం చేస్తున్నాను. మిత అయ్యల్వార్లు ఎవరైనా ఇతరులు ఇంటికి వచ్చినప్పుడు ఈ పదాలు వాడుతుంటారు. అది ఇతరులకు అర్థంకాకుండా ఉండటానికి అన్నమాట. ఈ భాషా పదాలను నేను మూడు విధాలుగా వర్గీకరించాను. అవి...

1. వంట సామాగ్రికి సంబంధించినవి.
2. కులానికి సంబంధించినవి.
3. సామాన్యంగా వాడుకొనేవి.

1. వంట సామాగ్రికి సంబంధించినవి

కర్తాలు మసిపాత (కర్తాలం తీసుకొనిరా అంటే మసిపాత తీసుకునిరా అని అర్థం)
కౌశారు తెడ్డు (కర్రతో చేసిన గరిటె)
పులిపండు చింతపండు (పులి అంటే తమిళంలో చింత అని అర్థం)
పన్నేరాలు ఫలహారాలు
మెరుగులు మిరపకాయలు
జ్ఞాని కోడిపిల్ల (ఇవ్వాళ జ్ఞాని పక్కం చేశావా అంటే కోడికూర చేశావా అని అర్థం)
మశ్చాలు లేదా అవతారాలు చేపలు
పక్కం వండిన
కణం అన్నం (కణం పక్కం చేశావా అంటే అన్నం వండావా)
పరుపు పప్పు
పళ్ళు బియ్యం
పళ్ళు చేక్కాస్తా బియ్యం తీసుకువస్తా
తైలం నూనె
మధువు ఉప్పు
తాగి కారం లేదా నూరిన పచ్చడి
మంజరం పసుపు
గడి పాఠ్యం మసాలా
ఉభయవూర్తులు లవంగాలు
తులిసె వెందులు ఉల్లిగడ్డలు
రంగపాయలు ఎల్లిపాయలు
మొరం చాట
కత్తెరకాయ వంకాయ
ఆకసం పెరంగాయ సొరకాయ (భూషణకాయ అని కూడా అంటారు)
కల్పం బెల్లం
కర్యమాదు మాంసం
కురుడు అంబలి
పవర్తి బయటకుపోవడం (ప్రపర్తిక పర్రెమంబనవా అంటే గురుశంకకి వెళ్ళినా)6

2. కులాలు

తటుకు చిలుకులు శాలెవారు
పొటుకు చిలుకలు కమ్మరి, వడ్లవారు, ఔసొల్లు
గౌండ్ల వారు వాసుల చిలుకలు
కోమట్లు గొంటెం చిలుకలు
బెస్తవారు శపరు చిలుకలు
మంగళివారు కళ్యాణి చిలుకలు
మాదిగవారు సూరిగాళ్ళు
కిత్తెగళ్ళు మన్నెంపోళ్ళు
మెంచ్ లు తుర్కోలు
సాకలివారు రజకులు
కుమ్మరివారు బాండువ చిలుకలు
కయిపూర్ణం ఎరుకలవారు
లవణగళ్ళు లంబాడోళ్ళు
కయిపీర్ణం గోచి అని అర్థం. పూర్వం ఎరుకల వారు గోచి పెట్టుకొని వస్తే కయి పూర్ణం చిలుకరాలు ఉపాధి అయింది గోచి పెట్టుకున్న మహిళ వస్తున్నది.
వాషగడుపుట మాట్లాడుట
బాండువా దూరం మహిళల ఋతుస్రావం
కశింపులు తిట్లు
గుయ్యం ఆడవారి జన్మస్థలం
కణియ జొన్న ఘటిక
తైరు పెరుగు
కిలింపు చనిపోవడం
పంకిణి వృద్ధురాలు (ముసలివారు)6

3. సామాన్యంగా వాడుకునే పదాలు

కర్యమాదు మాంసం
అంబలి కురుడు
మండలం ముఖం
కంబిడి గొర్రె
పర్రెం తక్కువ
దిట్టం ఎక్కువ
వాసులు మందు (సుర పానకం)
మోరు తెల్లకల్లు
వెన్నవాసులు గుడుంబా
శీలాలు పాలు (శీలాలు పుచ్చుకున్నదా-పాలు తాగిందా అమ్మాయి అని అర్థం)
ఎష్టువలు వస్త్రాలు, దుస్తులు
చెఱుపు బియ్యమవ్వడం
ఎకారాలు డబ్బులు
దినాలు క్రమాలు
రక్ష చెప్పు
దైపు కొట్టడం (రక్షతో దైపుతా)
మంచం కటంగం (కటంగంలో పవళించు అంటే మంచంలొ పడుకొమని అర్ధం}
శుద్ధికట్ట చీపురుకట్ట
శుద్ధిచేయు శుభ్రంచేయు
సొండెలు గుడాలు
పులి పులుసు
తునియలు ముక్కలు
వక్త్రం నోరు
తిరుమణికాయ తలకాయ
పరణాలు చెవులు (పరణాలు పర్రెమైనవా? అంటే చెవులు వినపడతలేవేమో!)
అడుపు పొయ్యి
ఎలిగిరాల్లు పొయ్యిరాలు
కవాటం బంధించినవా తలుపు వేసావా
మాలిక ఇల్లు (మాలిక దిట్టం ఉపాధి అయింది అంటే ఇల్లు బాగుంది అన్నట్టు)
సుకరం పంది7

పాద సూచికలు

1. ఆచార్య నేతి అనంతరామశాస్త్రి, ఆధునిక తెలుగు భాషాశాస్త్ర విజ్ఞానం, పుట-8
2. గాజుల సత్యనారాయణ, నా తెలుగు భాష ఆ చంద్ర తార్కాణం (వ్యాసం) పున్నమి వెన్నెల, పుట-78
3. సేకరణ - శ్రీమతి త్రికోవెల వెంకటయ్య-యశోద, శ్రీమతి త్రికోవెల నర్సయ్య-యశోద, కొత్తగూడెం.
4. పదబంధం పారిజాతం (ప్రథమ సంపుటం) 1959. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు

సంపా: నార్ల, విద్వాన్విశ్వం, తిమ్మావజ్ఝల కోదండరామయ్య.

5. శ్రీయుతులు ఆవాల స్వరూప, త్రికోవెల అరుణ, త్రికోవెల యశోద, సాత్పడి గోదాదేవి గార్ల నుండి సేకరించినవి.
6. శ్రీయుతులు గుండె వెంకటలక్ష్మి, గుండె లక్ష్మీనర్సమ్మ గార్ల నుండి సేకరించినవి.
7. శ్రీయుతులు పరాంకుశం లక్ష్మీనర్సయ్య, పిట్టల పూర్ణయ్య గార్ల నుండి సేకరించినవి.