మిత అయ్యల్‌వార్లు/II. వైష్ణవ మతాల ఆవిర్భావం - వికాసం
1. పరిచయం
భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతాన విశేషంగా బ్రహ్మవాదాలు కొన్ని వెలసిల్లాయి.ఈ బ్రహ్మవాదాలను ఆళ్వారులు తమ దివ్య ప్రబంధాలలో ప్రస్తావించటమేకాక ఈ భగవద్గుణాలను, స్తోత్రాలను మొదలైన వాటిని అత్యంత మనోహరమైన శైలిలో గానం చేసి మనదేశంలో విష్ణు భక్తితత్త్వం నశించిపోకుండా నిలబెట్టినవారు పన్నెండుమంది ఆళ్వారులు. వీరు కారణ జన్ములు. ఈ పన్నిద్దరు ఆళ్వారులను 'ద్వాదశసూరులు' అని కూడా వ్యవహరిస్తారు. పన్నిద్దరు ఆళ్వారులలో దాదాపు శూద్రులుండటం గమనార్హం. 'సూరి' అనగా మోక్షస్థానమైన విష్ణులోకంలో నిలిచి ఉండే విష్ణుదేవుని నిత్యము దర్శించే భగవంతుని పరివారంలోని వారని అర్థం.
- శ్లో॥ తద్విష్ణోః పరమంపదం సదా పశ్యతి సూరయః” (విష్ణు సూక్తం)
అనగా నిత్యము (సదా) విష్ణులోకంలో (పరం-పదం) భగవంతుడిని (విష్ణోః) దర్శించుతూ (పశ్యంతి) ఉండే వారే ఈ దివ్యసూరులు అని భావము. భూమి పై కారణజన్ములుగా అవతరించిన పన్నెండుగురు ఆళ్వారులచే పరంపరంగా విష్ణుభక్తిని తెలిపే భాగవత ధర్మము అన్న వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రబోధించబడింది. దీనినే భగవద్రామానుజులు ప్రపంచానికి ఉపదేశించారు. కాబట్టి, రామానుజుల ఉపదేశమును గ్రహించాలంటే ఆళ్వారులు భక్తి తత్త్వ పరంపర గురించి తెలుసుకోవాలి.
2. వైష్ణవ వ్యుత్పత్తి అర్థం
వైష్ణవ మతం అను వాక్యం రెండు అర్థాలతో ఉన్నది. మొదటిది వైష్ణవ అను పదము “మతము”. ఇందులో 'వైష్ణవ' అను పదం 'తసేద్యం' అను పాణినీయ సూత్రం (అష్ట 4-3-120) అనుసరించి విష్ణోరిదం వైష్ణవం అను వ్యుత్పత్తిచే విష్ణువుకు సంబంధించిన మతమని స్పష్టమవుతుంది. ఈ విష్ణు శబ్దము సువర్ణ, సుధాకరాది శబ్దములవలె, స్వార్థమందలి మహత్వమును, సర్వవ్యాపకత్వాన్ని ప్రబోధిస్తూ సర్వేశ్వరుని యందు రూఢమై ఒప్పుచున్నది. 3. వైష్ణవమతం - వేదాలు
భారతదేశంలో వేదాల నుండి మొదలవుచున్నది సంస్కృతి. వేదములన్నింటిలోను విష్ణు శబ్దం, ఇతర పర్యాయ పదములలా కాకుండా అధిక ప్రచారం పొంది విరాజిల్లింది. ఋగ్వేదములో ఐతరేయ బ్రహ్మణ ప్రారంభములో...
“అగ్నిర్వైదేవనా మవయః విష్ణుః పరమః
త దంతరేణ సర్వే అన్యదేవతా!" అని ఉన్నది
దేవతలలో అగ్నిదేవత తక్కువ అని, విష్ణువు - దేవతలు అందరికంటే గొప్పవారని వారి ఇద్దరి మధ్యలో పరబ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు అందరు నిలచి వున్నారని ఈ మంత్ర భావం.
అదే విధంగా పంచమకాండ పంచమ ప్రశ్నలో
- “అగ్ని రవమో దేవతానాం విష్ణు పరమః”
దేవతలో అగ్ని - అవముడు, విష్ణువు పరముడు అని ఉన్నది. ఇదేవిధంగా పలుచోట్ల వేదములలో విష్ణు వైశిష్ట్యం గురించి విశదీకరించబడింది.
4. వైష్ణవమత చారిత్రక నేపథ్యం
పురాణేతిహాసాదులు: పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వ్యాఖ్యానాల మూలములో కూడా విష్ణు పరత్వమునే ప్రబోధిస్తున్నాయి.
Any History of Srivaishnavism Naturally begins with the redas2 వేదాలతోనే శ్రీ వైష్ణవ చరిత్ర ప్రారంభమైందని, వేదకాలం నుండి, అంతకంటే ముందునుండి కూడా ఈ మతం వ్యాప్తిలో ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. వేదకాలాన్ని ఖచ్చితంగా చెప్పలేం. అలాగే వైష్ణవ మతం ఎప్పుడు ప్రారంభమైందో కూడా చెప్పలేం.
"విష్ణువును త్రివిక్రమ, నారాయణ, వాసుదేవ, కృష్ణ మొదలైన నామాలతో వ్యవహారించడం తరువాత కాలంలో జరిగింది. వైష్ణవమతాన్ని క్రీస్తు పూర్వం భాగవత మతమని, స్వతంత్ర మతమని కూడా పిలుస్తుండేవారు"3
పూర్వకాలంలో ప్రధానమైన మూడు మతములు వేదములచే విశ్లేషించబడిన విష్ణువును పరతత్త్వముగా భావింపబడిన నారాయణుడు, చారిత్రక దైవమగు వాసుదేవుడు అను మతభావము ఒక దానితో ఒకటి కలిసి తరువాత కాలంలో వైష్ణవ తత్త్వముగ పరిణామం చెందినది అని ఆర్.జి. బండార్కరు అభిప్రాయపడ్డారు.
క్రీ.పూ. 4వ శతాబ్దంలో మధుర ప్రాంతమున ప్రారంభమైన భాగవత మతం క్రీ.పూ. 2వ శతాబ్ది నాటికి మధురను దాటి భారతదేశములో ఇతర ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాపించినట్లు తెలుస్తుంది. రామానుజాచార్యుల మత సంస్కరణలకు ముందే వైష్ణవం ఆంధ్రదేశంలో విస్తరించి ఉంది. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు కృషిచేసిన తొట్టతొలి రాజవంశం శాతావాహనుల వంశం. వీరు తెలుగు దేశమున క్రీ.పూ.275 సం॥ నుండి క్రీ.శ.275వ సంవత్సరం వరకూ దాదాపు 500 సం॥రాలు పరిపాలించినట్లు తెలుస్తుంది. శాతావాహనులలో మొదటివాడు శ్రీముఖుడు. ఇతని తమ్ముడి పేరు కృష్ణుడు. దీనిని బట్టి అప్పటికే వైష్ణవ నామాలు, ప్రభావం ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి ఉన్నటువంటి పేర్లు, కులగోత్రములు, గ్రామాల పేర్లను బట్టి వైష్ణవ ప్రభావం శాతావాహనులు వచ్చు నాటికే ఆంధ్రప్రదేశ్లో వైష్ణవమతం వ్యాపించి ఉందని చెప్పవచ్చు.4 ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శాతావాహన రాజులు బౌద్ధమతం అవలభించినప్పటికి శ్రీముఖుడు మొదటి శాతావాహన రాజు పేరులోనే విష్ణు సంబధమైన శబ్దం కనిపిస్తున్నది.
ఆంధ్రదేశాన విజయవాటికకు దగ్గరలో ఉన్న శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు స్థానమై వెలసిల్లింది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు తాను కళింగను జయించి విజయవాటికలో కొన్ని నాళ్ళు ఉండి శ్రీకాకుళ నికేతనుండగు ఆంధ్రమహా మధమధనుని సేవింపబోయి హరివాసరోప వాసంబునచటగావించిన రాత్రి చతుర్థ యామంబున శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు స్వప్నంబున లక్ష్మీసమేతుడై సాక్షాత్కరించి ఆముక్తమాల్యదా ప్రబంధమును రచింపుమని ఆనతిచ్చినటుల తత్ప్రబంధ పీఠికయందు శ్రీకృష్ణదేవరాయలు బంధించెను. ఈ విధంగా ఆంధ్ర మహావిష్ణువు ప్రముఖాంధ్ర శైవమత ప్రబంధావతరమునకు కారకుడయ్యెను.5
తమిళదేశ సాంఘిక సాహిత్యాన్ని పరిశీలిస్తే క్రీ.పూ.300 సం॥ వెలువడిన ఐదు ఉత్తమ కావ్యాలలో మొదటిది "ఇళంగో” రచించిన 'శిలప్పాధికారమ్'. దీనిలో ఆనాటి ప్రసిద్ధ మతాలను వర్ణించుచున్నప్పుడు 'తిరుమల ధర్మం' (శ్రీ సంప్రదాయము)ను గొప్పగా ప్రశంసించటం తెలుస్తుంది. ఇటువంటిదే రెండవ ఉత్తమ కావ్యం అయిన "మణి మేఖలై” గ్రంథకర్త 'సిత్తలై సత్తనార్'. ప్రధానముగా బౌద్ధ ధర్మమును నిరూపించినప్పటికి వైష్ణవ ధర్మ మహత్వంను, కృష్ణలీలలను కూడా ప్రస్తావించాడు. దీనిని బట్టి ఆనాటి సంఘములో క్రీ.పూ. 500 సం॥ తమిళదేశంలో శ్రీవైష్ణవ ధర్మం వ్యాపించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కాలములోనే 'తిరువరంగమ్' (శ్రీరంగము) తిరు వేజ్జుగమ్ (తిరుమల) తిరుపతి, తిరుమాలిరుం శోలై తిరుక్కురుగూరు, తిరక్కురంగుడి, తిరుక్కణ్ణపురమ్ మొదలైన దివ్య క్షేత్రాలలో తిరుమాలమూర్తులు వెలసి, నిత్య పూజలచే విరాజిల్లుచుండినట్లు 'శిలప్పాధికారమ్' ద్వారా తెలుస్తుంది. ఆయాచోట్ల గల తిరుమాల విగ్రహాల రూపాలు సైతం శిలప్పాధికారమ్ ద్వారా వర్ణింబడి, వైష్ణవ సంప్రదాయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమాల కోవెల (విష్ణ్యాలయం)లో పంచరాత్రగమము అనుసరిస్తే మరికొన్నిచోట్ల వైఖానసాగమముననుసరించి అర్చనలు జరిగేవి. ఈ విష్ణ్వాలయంలో గుడికి ఎదురుగనున్న ధ్వజస్తంభం నందు “వెఱియ తిరువడి" గరుడాళ్వారు వేంచేసినట్లు తెలుస్తోంది.
The Silappadikaram, which was composed at this time describes in him as the rechining deity in Srirangam and tall god in Thirupathi .6
తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పదిగారం క్రీ.శ. 2వ శతాబ్ద కాలములో వచ్చినట్లు చరిత్రకారులు గుర్తించారు. అందులో 'తిరుపతి' ఉన్న శ్రీ వెంకటేశ్వరుని గూర్చి వర్ణించినట్లు తెలుస్తోంది. వైష్ణవ సంప్రదాయం ఆంధ్రదేశంలో విస్తరించినట్లు స్పష్టమవుతుంది.
క్రీ.శ. 3వ శతాబ్ది నాటికి తెలుగు ప్రజానీకంపై రామాయణ ప్రభావం ఉన్నట్లు అమరావతి శిల్పాల ద్వారా తెలుస్తుంది. నాగానిక, నానాఘాట్ శాసనములలో సంకర్షణ, వాసుదేవులను స్తుతించుట శాతావాహనులు వేయించిన శాసనములలో విష్ణుస్తోత్రం కన్పిస్తుంది. వీటన్నంటిని బట్టి ఆంధ్రదేశంలో వైష్ణవం ప్రారంభదశ నుండే మొదలైందని చెప్పవచ్చు.
శాతావాహనుల తరువాత ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు అర్ధశతాబ్దం వరకు పాలించారు. ఈ వంశ స్థాపకుడు వాశిష్ఠపుత్ర శాంతమూలుడు. విష్ణువర్ధన గోత్రానికి సంబంధించినవాడు. శాంతమూలుడు వైదిక మత సాంప్రదాయకుడు. శ్రీపర్వతం మీద ఉన్న విజయపురి వీరి రాజధాని. తదనంతరం ఆంధ్రదేశాన్ని పల్లవులు పరిపాలించారు. వీళ్ళు కాంచీపురంను రాష్ట్ర రాజధానిగా చేసుకొని క్రీ.శ. 3వ శతాబ్దం నుండి క్రీ.శ. 9వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని దాదాపు 600 యేండ్లు పరిపాలించారు. వీరు పరమ భాగవతులు. వీరికాలంలో దక్షిణాపథంలో వైష్ణవమునకు గొప్పస్థానం లభించింది. వైష్ణవం ప్రభుత్వ మతంగా ఆదరించబడింది. విష్ణువును పూజించు విషయంలో వీరు తమ శాసనాలలో ప్రకటించారు7.
విష్ణుస్తుతి ప్రారంభదశ వీరి శాసనాల ద్వారా పరిశీలించవచ్చును. పల్లవుల వంశోత్పత్తి, విష్ణువుతో ప్రారంభమైనట్లు నరసింహవర్మ వేయించిన వాయటూరి శాసనము ద్వారా స్పష్టమౌతుంది.
దాళూరు శాసనం ద్వారా క్రీ.శ. 4వ శతాబ్దం నాటికే పల్లవుల కాలంలో విష్ణు ఆలయాలు ఉన్నాయి. కందుకూరులో ఒక సేనాపతి నిర్మించిన విష్ణ్వాలయంనకు పల్లవ వంశీయులలో ఒకరు ఉరువల్లి గ్రామాన కొంత దానం చేసినట్లు తెలుస్తుంది.
క్రీ.శ.4,5 శతాబ్దములలో కృష్ణా, గోదావరి నదుల మధ్యగల తెలుగుదేశమును పరిపాలించిన శాలంకాయనులు వైష్ణవ సంప్రదాయులుగానే కన్పిస్తున్నారు. వీరు పరమ భాగవతులు. వీరి ఆరాధ్య దైవము సూర్యుడు. వైదిక సంప్రదాయానుసారం ఆదిత్యుని పూజిస్తారు. ఆ తర్వాత శాలంకాయన వంశీకుడగు నందివర్మ విష్ణుగ్రహ స్వామి ఆలయాలకు వేరు వేరు గ్రామాలలో కొంత భూమిని దానం చేశాడు. ఇప్పటి ఏలూరు దగ్గరున్న పెదవేంగిలో విష్ణుకుండినులు క్రీ.శ. 5,6 శతాబ్దములలో చిత్రరథస్వామి ఆలయాన్ని పాటూరు నందు విష్ణుగ్రహ స్వామి ఆలయాన్ని నిర్మించారు9.
గోదావరి నుండి మహానది వరకు వ్యాపించి ఉన్న కళింగదేశ రాజ్యాన్ని గంగ వంశీయులు ఎక్కువకాలం పరిపాలన చేశారు. వీరు క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందినవారు.
ఈ వంశంలో భాగవతులు అధికం. వీరి కాలంలో భాగవతాలు కళింగాంధ్రలో వ్యాప్తి చెందాయి. కళింగలో గంగ వంశజులలో హస్తవర్మ, నారాయణుని బలి చతురుత్ర ప్రవర్తనం ఖండస్పుటిత సంస్కారం నిమిత్తం “రోహణికి" గ్రామంనందు ఆరుహలా ల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. ఇతని కాలం ఆరవ శతాబ్ది. కళింగంనందలి మొదటి విష్ణ్వాలయం.ఈ హస్తివర్మ కు తొమ్మిదేళ్ళ తర్వాత ఇంద్రవర్మ మరొక గంగవంశపు రాజు హరిభట గ్రామములో రామేశ్వరస్వామికి బలిచరు సత్ప్రవర్తనము మరియు ఖండస్పుటిత సంస్కారం కోసం రెండునాగళ్ళ భూమిని దేవాగ్రహారము చేసెను. దీనిని బట్టి కృష్ణా గోదావరులకు దక్షిణమున ఉన్నట్లే ఉత్తరాన కూడా క్రీ.శ. 7వ శతాబ్ది ఆరంభమున విష్ణు దేవాలయాలు ఉన్నట్లు చారిత్ర కాధారాల ద్వారా తెలుస్తోంది. మల్లంపల్లి సోమశేఖర శర్మ “వైష్ణవం”.10
వీరికాలంలో నిర్మించిన శ్రీముఖలింగం, శ్రీకూర్మము పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ లోని సూర్యదేవాలయాలు ప్రధానమైనవి. వైష్ణవ మత వ్యాప్తికి వీరెంతగానో పాటుపడ్డారు. కళింగాంధ్రదేశంలో క్రీ.శ. 7వ శతాబ్దానికి పూర్వమే భాగవతమతంగా ప్రచారంలోకి వచ్చింది.
తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశాన్ని క్రీ.శ. 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఈ సామ్రాజ్య వ్యవస్థాపకుడు విష్ణువర్ధనుడు. వైష్ణవ మతానికి మరింత ప్రాధాన్యం ఇచ్చి ఆదరించాడు. తరువాతి కాలంలో వచ్చిన రాజులు కూడా వైష్ణవ మతాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడానికి ఎంతో కృషిచేసారు.
ప్రాచీన కాలంలో భాగవత మతం అని పిలువబడిన వైష్ణవ మతం ఆంధ్రప్రదేశ్లో క్రీ.శ.3వ శతాబ్ది నుండి క్రీ.శ. 7వ శతాబ్దం నాటికి ప్రధాన మతంగా వ్యాప్తిలోకి వచ్చింది. వైష్ణవ మతం అన్ని చోట్ల ఆదరించబడింది.
వివిధ రాచరిక పాలనలోకి పోయిన్పటికీ ఆంధ్ర ప్రాంతాలలో వైష్ణవ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. జైన, బౌద్ధ, శైవ వైష్ణవ సంక్లిష్ట సంస్కృతులు ఆంధ్రదేశంలో ఆచరణలో ఉన్నప్పటికీ వైష్ణవ సంప్రదాయం తమ ఉనికిని కోల్పోలేదు.
ఆళ్వారులు ప్రారంభించిన వైష్ణవతత్త్వ వ్యాప్తి ఈనాటికీ కొనసాగుతున్నది.
5. విశిష్టాద్వైత సిద్ధాంత స్వరూపం
విశిష్టాద్వైతానికి కూడా ఇతర వేదాంతాలవలే ప్రస్థానత్రయమే ప్రమాణము (ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు, గీతాశాస్త్రం). ఈ సిద్ధాంతానికి తొలి ప్రవర్తకుడు రామానుజులు. తన వేదాంత సంగ్రహానికి శ్రీభాష్యం (వేదాంత సూత్ర వ్యాఖ్య) అని పేరు. తన సిద్ధాంతానికి ఆధారం ప్రాచీన గురువు బోధాయన వృత్తి, అంతకుముందున్న ద్రవిడక గుహదేవ నమ్మాళ్వారు బోధనలు ఆధారాలు. శ్రీవైష్ణవ ఉత్తమభక్తుడు క్రీ.శ. 824లో నాథముని ఆళ్వారుల దివ్యగీతాలను వేదాంత ఉన్నతికి చేర్చి ఉభయ వేదాంతం అను పేర వ్యాప్తిలోకి తెచ్చాడు. నాథముని మనుమడు అల్వాందార్ పాంచరాత్రంనకు, వేదాంతమునకు కీర్తి తీసుకొచ్చాడు. తరువాత రామానుజులు క్రీ.శ. 1017లో ఆల్వంచారు వేదాంతానికి అనుయాయి. రామానుజులు తన ప్రేమతత్త్వము గూర్చి ఆ తత్త్వశాఖకు నూతనాధ్యాయాన్ని, నవ్యతను చేకూర్చి సత్యతను నిర్ణయించారు ".11
రామానుజాచార్యులు స్త్రీ-పురుష, పండితపామర, కుల, జాతి, వయోబేధాలకు అతీతంగా భక్తిమార్గాన్ని, ప్రపత్తిమార్గాన్ని ప్రబోధించవలసి వచ్చింది. ఆయన కృషి కారణంగానే యజ్ఞయాగాలు, కర్మకాండ, జ్ఞానకాండ మొ॥న వాటితో ప్రమేయం లేకుండా భక్తిమార్గం భారతదేశమంతటా సర్వజనులకు అవలంబనీయమైనది".12
భారతదేశం అంతా పర్యటించి విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసి, శూద్రులకు, దళితలకు మత దీక్ష యిచ్చాడు. తరువాతి కాలంలో తెంగల్, వడగల్ శాఖలుగా వీడిపోయి ఆంధ్రదేశంలో వైష్ణవ మతం క్రీ.శ.11వ శతాబ్దం నుండి వైష్ణవ మతాలు ఉన్నట్లు చరిత్ర ఆధారాలనుబట్టి తెలుస్తోంది. ఇది రామానుజాచార్యుల ప్రచారంతో మరింత బలపడింది.
6. వైష్ణవ మతం - వికాసం
భారతదేశంలో వివిధ మతాలు, కులాలు ఉన్నప్పటికి దేనికదే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటూ అనేక మార్పులు చేర్పులకు గురౌవుతూ నేటికీ అమలులో ఉంది. వైష్ణవులు భగవంతుని ఆరాధించే పద్ధతుల్లో స్వల్పమైన భేదాలున్నప్పటికి ఇంచుమించు అందరూ అనుసరించే పద్ధతుల్లో ఏకరూపత కన్పిస్తుంది. “శ్రీవిష్ణువుకు" దాసులుగా ఉండి భగవంతునికి సేవ చేస్తూ మోక్షమార్గం పొందడమే వైష్ణవుల కర్తవ్యం. శ్రీమహావిష్ణువుని సుప్రభాతంతో నిద్రలేపి రాత్రివరకు స్వామివారిని నిద్రపుచ్చేంత వరకూ సేవచేయడం ఎంతో భాగ్యంగా శ్రీవైష్ణవులు భావిస్తారు. వైష్ణవులు స్వామిని ఆరాధించే సంప్రదాయం ప్రకారం బంగారంతో గాని, రాగితోగాని, వెండితోగాని శాస్త్రప్రకారం శంఖుచక్ర ముద్రలు వేసుకోవాలి. పుండ్రాన్ని ధరించటం, మంత్ర పఠనం, ధ్యానం, నామస్మరణ, సంకీర్తనం, వందనం, తీర్థసేవనం, ప్రసాదం, భక్తిసేవనం, ద్వయాను సంధానం, తులసీరోహణం, తులసీదళ భక్షణం ఈ విధమైన పంచ సంస్కారాలు ఆచరించేవాడే వైష్ణవుడని వీరి విశ్వాసం. పంచ సంస్కారాలు ఆచరించిన వైష్ణవుడు ఏ కులానికి, ఏ జాతికి సంబంధించిన వాడైనా కూడా పుణ్య పురుషుడేనని పురాణాలు చెబుతున్నాయి .13 7. వైష్ణవ మత శాఖలు
| వడైకల్ (వడ-కలై) వటకలాయి (ఉత్తర శాఖ) ఉత్తర భారతదేశ వైష్ణవ సంప్రదాయాలు | ! తనళ (తెంగళై) (తెంకలాయి) (దక్షిణ భారతశాఖ దక్షిణ భారతదేశ వైష్ణవ సంప్రదాయాలు |
|---|---|
| 1. పరకాల మఠం (మైసూర్ ) | 1. ఈ శాఖ దక్షిణాదిన చాత్తాద వైష్ణవులుగా, శ్రీవైష్ణవులుగా ఉన్నారు. |
| 2. అహోబిల మఠం (అహోబిలం) | 2. ఈశాఖ తమిళ వేదాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. |
| 3. అండమాన్ మఠం | 3. శ్రీ పిళ్ళైలోకాచార్యులు ఈ శాఖకు మూలం |
| 4. మునిత్రయ సంప్రదాయం | 4. వీరి అనంతరం శ్రీమణమాల మహామునులు, ఈ శాఖలో ప్రధాన వైష్ణవ ప్రచార సంస్థలుగా ఉన్నాయి. |
| 5. భాగవద్రామానుజులు శ్రీ వైష్ణవ సిద్ధాంత వ్యాప్తి కోసం 74 సింహాసనాధి పతులను నియమించారు. | |
| 6. మనవాళ మహామునులు ఈ శాఖ వ్యాప్తి కోసం తర్వాత అష్టదిగ్గజముల అనుపేర 8 మంది పండితులను నియమించారు. | |
| 7. వానమామలై జీయర్ | |
| 8. తిరుమలై ఎంజెరుమాన్ జీయర్ | |
| 9. భట్టర్ పిరాన్ జీయర్ | |
| 10. కోయల్ కన్హాడై యాణ్ణన్ | |
| 11. ఎఱుమ్డియప్పా | |
| 12. అప్పిళ్ళార్ | |
| 13. ప్రతివాది భయంకర్ అణ్ణా వీరందరూ ఈ ప్రచారకులు . |
విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం మానవులందరూ భగవంతుని దృష్టిలో సమానులే. రామానుజాచార్యులు కూడా అన్ని కులాలను వైష్ణవంలోనికి ఆహ్వానించారు. కాని కాలక్రమేణా వైష్ణవం శాఖలుగా విడిపోయి కులం పట్టింపులకు దారితీసినట్లు అర్థం అవుతోంది. 8. శైవ, వైష్ణవ మత ప్రభావం
భారతీయులకు వేదములు ప్రమాణములు. ఉపనిషత్తులు, అరణ్యకములు, వాటి అనుబంధములు. హైందవ మత సంప్రదాయము ప్రకారం బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు అధిష్టాన దైవములు. వేదాలలో వారికి ప్రధానమైన స్థానం ఉంది. ఇది దేవ వాఙ్మయము భారతీయులు త్రిమూర్తులను ఈ కాలంలో స్తుతించి, పూజించేవారు. వేదములలో తర్క వాదములు (అర్థవాదములు) ఉన్నాయి. అవి కథలు. వీటితో మానవ జీవిత చరిత్రలకు అనువర్తింపజేసి నూతన విషయాలు చేర్చి ధర్మ ప్రబోధకంగా ఉండేటట్లు ప్రజా ప్రయోజనం కోసం వ్యాస మహాముని పురాణములను రూపొందించాడు. అవే నేటి వేదసారములు. అవి పద్దెనిమిది పురాణములు. వీటి ఉప పురాణములు పద్దెనిమిది. ఈ పురాణాలలో శివుడు ప్రధానుడుగా చెప్పబడిన పురాణములు శైవములు, విష్ణువు ప్రధానుడుగా చెప్పబడిన పురాణములు వైష్ణవాలు. ఇది పురాణ వాఙ్మయం యొక్క సంక్షిప్త వివరణ. హైందవ మత సాంప్రదాయాలను అనుసరిస్తూ యజ్ఞ యాగాదులు చేయడం జరిగేది. జైనులు, బౌద్ధులు వీటిని తిరస్కరించారు. ఇదే కాలంలో మత విప్లవాలు కూడా జరిగాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చార్వాక మతవాదులు విస్తృతంగా ప్రచారం సాగించారు. మత విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇదే సందర్భంలో మతాభిమానుల మధ్య అంతరాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో భారతదేశంలో ఎన్నో మత సిద్ధాంతాలు వెలిశాయి. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా, వేద సాంప్రదాయములకు విఘాతం కలిగినా తమ ఉనికిని నిలబెట్టుకుని దేదీప్యమానంగా వెలుగొందింది. దీనికి ప్రధాన కారణం ద్రావిడ దేశంలో (పౌరాణిక మతాలు) వైదిక సాంప్రదాయాలకు మక్కువ కనపరుస్తూ హైందవ ధర్మాలపట్ల సుముఖత చూపటం.
ఈ నేపథ్యంలో నాయనారులను శివభక్తులు శైవమతాన్ని ప్రచారము చేశారు. ఆళ్వారులను విష్ణుభక్తులు, వైష్ణవమతాన్ని ప్రచారము చేశారు. ఈ విధంగా వేద సంప్రదాయంతో కూడిన మతాలు భిన్నరూపాలుగా వర్ధిల్లినవి. క్రీ.శ. 7వ శతాబ్ది నాటికి శైవ, వైష్ణవ మతాల ప్రాబల్యం పెరిగిపోయిందని చరిత్రకారుల అభిప్రాయం. 8వ శతాబ్దంలో శేఖరుడు పూర్వమీమాంస అని పేరు పెట్టాడు. ఇందులో జ్ఞానంవలన మోక్షం లభిస్తుందని ఆదిశంకరుని అభిమతం "మరణానంతరం జ్ఞానియైన వాని జీవాత్మ ఆవరణ భంగంచే పరమాత్మయందు ఐక్యము నొందునని ఆయన సిద్ధాంతం" 16.
ఆదిశంకరుడు జగద్గురువుగా విఖ్యాతి పొందారు. వివిధ ప్రాంతాలలో మఠాలను, పీఠాలను నెలకొల్పాడు. జైన, బౌద్ధాది మతాలవారిని వాగ్వాదంలో ఓడించి వేద మత సంప్రదాయాలను ఉద్ధరించారు. 11వ శతాబ్దంలో రామానుజుడు, ముందు కాలంలో ఆళ్వారులుచే పౌరాణిక మతంగా వర్ధిల్లుతున్న వైష్ణవ మతాన్ని దేవ మతంగా రూపొందించారు. దానికి విశిష్టాద్వైత మతమని పేరు. రామానుజుని కాలంలో అనేక మత సంస్కరణలు జరిగాయి. విశిష్టాద్వైతం శ్రీవైష్ణమని (లేదా) వీర వైష్ణవమని ప్రఖ్యాతిగాంచింది. 7వ శతాబ్దంలో శైవ, వైష్ణవ మతాలకు కులభేదాలు లేవు. తక్కువ కులమువారు సైతము భక్తులై అగ్రకులాలవారి పూజలను అందుకుని గౌరవము పొందారు. వైరాగ్యం శైవులకు ప్రధానమైతే, భక్తి వైష్ణవులకు ముఖ్యం. స్కాందాది పురాణాలు శైవులకు ప్రమాణాలు అయితే, భాగవతాది పురాణాలు వైష్ణవులకు ప్రమాణములుగా భాసిల్లినవి. శ్రీరంగంలో విష్ణుతత్త్వాన్ని ప్రచారం చేసారు. ఆళ్వారుల కాలంలో తమిళదేశంలో వైష్ణవ వాఙ్మయం ఉద్భవించింది. తమిళ భాషలో స్మృతులు, ప్రబంధాలు వచ్చాయి. మహాపండితులైన శఠకోపుడు, నాథముని, శ్రీరామమిశ్రుడు యామునాచార్యులు మొ౹౹న వారు వైష్ణవ సాంప్రదాయాలను విస్తృతమైన ప్రజా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు.
శ్రీ రామానుజాచార్యులు ద్రావిడ దేశంలో ప్రబంధాలన్ని సేకరించి కొన్ని మత సంస్కరణలు చేసి వైష్ణవ మతాన్ని విస్తృతమైన ప్రచారంలోకి తీసుకొచ్చారు. కొన్నింటిని భారతదేశంలో ప్రచారంలోకి తీసుకొచ్చారు. రామానుజుల కాలంలో కన్నడ రాజ్యంతో పాటు ఇతర ప్రాంతాలవారు, వివిధ కులాలవారు వైష్ణవం స్వీకరించారు. దళితులు కూడా శంఖుచక్రాలు ధరించి వైష్ణవులుగా మారారు.
ఆంధ్ర దేశములో వైష్ణవమతం సన్నగిల్లి శైవమతం ప్రాబల్యంలోకి వచ్చింది. 12వ శతాబ్దంలో మల్లికార్జున పండితారాధ్యులు శ్రీశైలంలో ఘోరమైన తపస్సుచేసి వీరశైవ మతానికి బీజము వేశారు. కళ్యాణ పురాధీశుడగు బిజ్జలుని మంత్రి బసవేశ్వరుడు నందీశ్వరుని అవతారమని లోకమందు ప్రతీతి. బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని మిక్కిలి వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ కాలంలో ఆంధ్రదేశంలో మతసంస్కరణలు జరిగినట్లు తెలుస్తోంది.
కులభేదాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించడంతోపాటు పంచములను కూడా శైవమతం ఇచ్చి మత ప్రబోధ చేశారు. నేటి అన్ని కులాల్లోను శైవభక్తులు ఉన్నారు. నేటికీ దళితులలో 'మాలజంగాలు' శైవ సంబంధమైన ఆచార సంప్రదాయాలతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరి మూలాలను పరిశీలిస్తే ఆనాడు జరిగిన మత సంస్కరణ కారణం కావచ్చని తెలుస్తోంది. వైష్ణవులు మాలదాసరులుగా, మిత అయ్యల్వార్లుగా; శైవులు మాలజంగాలుగా, బుడగజంగాలుగా ఉన్నారు. - వీరశైవ మతం వ్యాప్తిలోకి రావడంతో ఆంధ్రదేశంలో శైవ సాహిత్యం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నన్నెచోడుని కుమార సంభవం కావ్యం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, బసవపురాణం, శివలింగలీలలు, బసవపురాణాలు మొదలైనవిగా పేర్కొనవచ్చు.
శ్రీనాథుని - భీమఖండం, కాశీఖండం, హరవిలాసం మొ౹౹న గ్రంథాలు వీరశైవ మత ప్రచారం కోరకు రాయబడినవి. ఈ కావ్యాలలో వీరశైవ మతం మరియు మతాచార వ్యవహార సంప్రదాయాలు విస్తరించినట్లుగా స్పష్టమవుతున్నాయి. 15వ శతాబ్దం చివరకు దాదాపు వైష్ణవ సంబంధమైన రచనలు వచ్చాయి.
9. తెలుగు సాహిత్యంపై వైష్ణవమతం ప్రభావం
"సాహిత్యం వాఙ్మయ సారస్వత పదముల కంటెను కొంత పరిమితమైనది. 'హితేన సహితం, సాహిత్యం' అనుటచే సాహిత్యం మేలు కూర్చినట్టిది. ప్రీతిదాయకమైనది. నీతిని బోధించునది ధర్మ ప్రతిపాదనము చేయునది"16.
మానవుని హృదయ వేదనకు వశము కల్గించునది మతము. అట్టి మత స్వరూపాన్ని బహిర్గతము చేయునట్టి సాధనమే వాఙ్మయము. ఈ వాఙ్మయము ఒకానొక విశిష్టార్థమునందు సాహిత్యముగా స్థిరపడింది. మత వాఙ్మయములు రెండునూ తెలుగునాట అన్యోన్యాశ్రయములై ప్రకాశించినవి".17
వేదముని ప్రమాణంగా చేసుకొన్న భాగవత మతం, శ్రీవైష్ణవమతం అను పేర్లతో ఒకే వైష్ణవ సంప్రదాయ తత్త్వాన్ని నింపుకొన్న విశిష్టాద్వైత సిద్ధాంతావరణముచే పరిపుష్టి పొందింది. విశిష్టాద్వైతమున గల విష్ణు సంకీర్తనం, వైష్ణవలీలలు, విష్ణు గాథా కథనములు, భాగవత భక్తి మొ౹౹న అంశాలు తెలుగు సాహిత్యంలో గ్రంథస్థమైనాయి. 11వ శతాబ్దం ప్రారంభం లోనే నన్నయ భారతమున ఆది శ్లోకం (పద్యం) "శ్రీవాణీ గిరిజాశ్చ..."కు శ్రీకారం చుట్టారు. భారతములో అనేక ఘట్టాలు కృష్ణ పరతత్త్వాన్నే బోధించుట నగ్న సత్యం. రంగనాథ రామాయణం, నిర్వచనోత్తర రామాయణం, భాస్కర రామాయణాలు, రామాభ్యుదయం, భాగవతం మొ౹౹న గ్రంథాల ఇతివృత్తం. వైష్ణవ ధర్మబోధకంటే 13వ శతాబ్దికి చెందినవాడు ఆంధ్ర రచన వాఙ్మయి ప్రథమాచార్యుడైన కృష్ణమాచార్యుడు. తిరువాయి మొళిని మొట్ట మొదటి వచన గ్రంథంగా రచించారని, కాకతీయుల కాలంలోని ప్రతాపరుద్రునికి సమకాలీకుడైన వారని తెలుస్తోంది. ద్రావిడ వేదములకు అనువాదాల లాగా పేర్కొన బడుతున్న రచనలను సింహగిరి నరహరి వచనములు అని పొ॥ ఎం.కులశేఖర్ రావుగారు ప్రచురించారు. ఈ గ్రంథం విశిష్టాద్వైత సంప్రదాయాలకు ప్రామాణికంగాను "తిరువాయి మొళి”కి వచన రూపంగాను భావించారు.
తెలుగు సాహిత్యంలో మణిదీపం భాగవతం.
పలికెడిది భాగవతమట
పలికించెడివాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా!
అని భగవదంకితంచేసి, విశిష్టాద్వైతమందలి పరతత్త్వమును ప్రబోధించారు పోతన. తంజావూరు తెలుగు కవులు పై ఆళ్వారుల సంప్రదాయ ప్రభావం వలన వైష్ణవ సంబంధమైన కావ్యాలు తీసుకువచ్చారు. నాయకరాజుల కాలములో తంజావూరు రాజ్యంలో వీర వైష్ణవం మహోన్నత స్థితికి చేరుకుంది. ఇచ్చట రాజులు కూడా వీర వైష్ణవులు. వీరి ప్రోత్సాహంతో వీరవైష్ణవం బాగా ప్రచారంలోకి వచ్చింది.
విజయ రాఘవుని మతావేశము అంతా రాయించిన విజయ రాఘవ నాయకుడు. తండ్రిని మించిన వీర వైష్ణవుడు. తంజావూరు రాజుల ప్రభావం అచట కవుల, రచయితలపై పడింది. ఇతర మతములను నిరసించి యిలన వెలయ వైష్ణవ మతం నిలపై శాశ్వతముగా అని రంగాజమ్మ అన్నారు. దాని విలాసమందు నుడివిన మాటల సత్యం నాయకరాజుల కాలమునందు తంజావూరు రాజ్యంలో వీర వైష్ణవం మహోన్నత స్థితికి చేరుకుంది. వీరంతా వీర వైష్ణవులు కావడంతో వైష్ణవ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించి ప్రచారంలోకి తీసుకువచ్చారు.
పాద సూచికలు
- 1. రామానుజ కీర్తి కౌముది, పుట-63.
- 2. Abiding Grace - Seshadri R.K.P.34.
- 3. ఆముక్తమాల్యద వైష్ణవతత్వం, పుట-37.
- 4. వైష్ణవాంధ్ర వాఙ్మయం, పుట-60.
- 5. శ్రీకృష్ణదేవరాయలు - ఆముక్త మాల్యద, పీఠిక -11,12.
- 6. Abiding Grace - Seshadri R.K, p. 44.
- 7. వైష్ణవాంధ్ర వాఙ్మయం, పుట-63.
- 8. ఆముక్తమాల్యద వైష్ణవతత్వము, పుట-39.
- 9. ఆముక్తమాల్యద వైష్ణవతత్వము, పుట-39.
- 10.తెలుగు విజ్ఞాన సర్వస్వం, 3వ సంపుటి, పుట-562.
- 11.ప్రకృతి తత్త్వశాస్త్ర చరిత్ర, ప్రచురణ సం॥ 1961, పుట-319.
- 12.విశ్వదర్శనం, 1997, పుట-356.
- 13.హరిదాసులు, పుట-15.
- 14.హరిదాసులు, పుట-120.
- 15.తంజావూరు తెలుగు కవులు, పుట-375.
- 16.తెలుగు సాహిత్య సమీక్ష-1, పుట-3.
- 17.తెలుగు తిరువామేవెళి, పుట-51.