Jump to content

మిత అయ్యల్‌వార్లు/సంపాదకీయం

వికీసోర్స్ నుండి

సంపాదకీయం

జానపద కళాకాశంలో కథన తారలు-మిత అయ్యల్ వార్లు!

- డాక్టర్ మామిడి హరికృష్ణ

No Art form is neither static, stationary nor sedentary. Art is very dynamic in its nature, style and presentation. As such the art forms across the globe have the essential quality of transforming themselves from one form to other or to various dimensions of the same form from time to time, according to the changes in the ideology and demands of the public.

Moreover, the art forms, with the changes as per the times, will enrich, expand, enhance themselves from earlier shape and style to the next level and will continue their legacy beyond generations and establish themselves as the tradition. In this series, folk arts are the true examples of this transformation, which made them to continue till date, even after centuries of their origin. Especially the folk arts of Telangana have survived against all odds with the patronage, support and encouragement from the people and conquered the threat of extinction. - పైన చెప్పినట్టు కళలు అంతరించి పోకుండా అనాదికాలం నుంచీ కొనసాగుతూ వస్తున్నాయంటే, దాని వెనుక ఉన్న ప్రధాన సూత్రం ఆయా కళారూపాలు మారుతున్న పరిస్థితులు, కాలాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ రూపురేఖ, ప్రదర్శనా రీతులను మార్చుకుంటూ రావడమే అని చెప్పవచ్చు. ఇలా నిరంతర మార్పులతో, నిత్య చైతన్య శీలంగా ఉన్న కళారూపాలలో జానపద కళారూపాలను ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు. అందుకే Cultural Anthropologists "కళల పరిణామ క్రమమే మానవ పరిణామం" (Human evolution, in other words, is nothing but the evolution of arts') అని ప్రకటించారు. జానపద కళలు - ప్రదర్శనా విధానం - పరిణామం

మానవుడు తొలిసారిగా సామూహిక జీవనాన్ని ప్రారంభించిన కాలం నుంచి జానపద కళలు అతనితో పాటే రూపొంది కొనసాగుతూ వచ్చాయి. అయితే ఈ జానపద కళలు క్రమ పరిణామం చెందుతూ ఆయా కాలమాన పరిస్థితులను, ఆయా దశలలో రూపొందిన అవసరాలను అనుసరించి ఎలా మార్పులు చెందుతూ వచ్చాయో, ఆ మార్పులన్నీ వాటి ప్రదర్శన విధానంలో సంభవించిన పరిణామంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. తొలినాటి జానపద కళల ప్రదర్శన అంతా మౌఖికంగా మాత్రమే ఉండేది. కానీ, క్రమక్రమంగా అభినయ, నృత్య, నాట్య, నటన, ఆంగిక, ఆహార్య రూపాలను సంతరించుకుని నేటి దశకు చేరుకుంది. ఈ పరిణామ వికాస రీతులను నాలుగు దశలలో చెప్పవచ్చు.

1. మౌఖిక శైలి

ఈ మౌఖిక శైలిలో తొలి తరం నాటి జానపద కళలు, ఆదిమ కాలపు జానపద కళలు మనిషి నోరు, భాష కేంద్రితంగా ఉండేవి. (Oral-centric traditions) ఆశువుగా నోటిద్వారా కథన శైలిలో రాగం, స్వరంతో కలిసిన ప్రదర్శన రూపంగా ఇవి ఉండేవి. ఆయా రకాల కథలన్నీ మౌఖిక శైలిలో వివరిస్తున్నప్పుడు గొంతే ప్రధానంగా ఈ కళల ప్రదర్శన ఉంటూ, ఆ గొంతులోని తారతమ్యాలు స్వరాల స్థాయి ద్వారానే అన్ని రకాల పాత్రల్ని గొంతులోనే పలికించే విధానం ఆచరణలో ఉండేది.

ఈ తొలి తరం జానపద కళల్లో ప్రధాన ఆకర్షణ గొంతులోని స్వరస్థాయీ భేదాలతోనే నాటకీకరణ చేయడం, పాత్రాను గుణ్యమైన స్వరాలని అనుకరించడం అని చెప్పవచ్చు. పాత్ర స్వభావాన్ని ఆధారంగా చేసుకుని దానికి తగిన స్వరాన్ని రాగ, భావ, ఉద్వేగయుక్తంగా గానం చేస్తూ మౌఖిక సంప్రదాయ పద్ధతుల్లోనే తొలినాటి జానపద కళలు ప్రజలందర్నీ అలరించాయి. వినోదాన్ని పంచాయి. వికాసాన్ని అందించాయి.

2. సంగీత వాయిద్యాల తోడు

ఆ తర్వాత క్రమక్రమంగా మానవుడు ప్రకృతిలోని చెట్టు, కర్రల ఆధారంగా, అలాగే జంతువుల చర్మం ఆధారంగా వివిధ రకాల ధ్వని ఉత్పత్తి సాధనాలను, పరికరాలని కనుక్కున్నాడు. అప్పటినుంచీ ఈ జానపద కళల్లో మౌఖిక కళా ప్రదర్శనకి తోడుగా ధ్వనిని సృష్టించే వాయిద్యాల జోడుకట్టాయి. కథలు చెప్పే విధానంలో, జానపద కళలను ప్రదర్శించే విధానంలో అవిభాజ్యమైన ప్రత్యేక సంగీత వాయిద్యాలుగా పరిణమించాయి. ఆ తర్వాత జంతువుల చర్మాలను వివిధ రకాల పాత్రలూ, వస్తువుల మీద అతికించి దాన్ని లయబద్ధంగా చేతితో లేదా కర్రలతో తాడించడం ద్వారా, ఒక వాంఛిత ధ్వనిని సృష్టించారు. ఆ తర్వాత వెదురుబొంగుల లోంచి వాయువులను పంపడం, గాలితో ఊదడం ద్వారా ఒక శ్రావ్యమైన ధ్వనిని, ఆ తర్వాత స్వరాలని, సంగీతాన్ని సృష్టించే నైపుణ్యం పెరగడం వల్ల పిల్లనగ్రోవి నాదాలు మొదలయ్యాయి వాటితోపాటు లోహాల గురించి మానవుడికి తెలిసిన తర్వాత, ఆ లోహాలను తీగలుగా తయారు చేసి, ఆ తంత్రుల మీద చేతులు, లేదా మరో లోహంతో తాడనం చేయడం ద్వారా సంగీతాన్ని సృస్టించవచ్చు అనే రహస్యం తెలిసిన తర్వాత సంగీత వాయిద్య పరికరాలలో గొప్ప విప్లవం వచ్చింది వాటి ద్వారానే తంత్రీ వాయిద్యాలు కూడా జానపద కళల ప్రదర్శనలో మౌఖిక విధానానికి, సంగీత వాయిద్యాలకి తోడుగా జతగూడటం జరిగింది. జానపద కళల ప్రదర్శనా పరిణామంలో దీనిని రెండవ దశగా భావించవచ్చు.

3. చిత్రాలు, బొమ్మల తోడు

మానవుడు తన ఆలోచన, మేధ, జ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ, తాను చూసిన, విన్న, అనుభూతి చెందిన వస్తువులు, వ్యక్తులు, జంతువులు, దృశ్యాల ప్రతి రూపాలని చిత్రించే నైపుణ్యాన్ని కూడా సాధించాడు. తను చూసిన, తన చుట్టూ ఉన్న ప్రపంచం, తనకు ఎదురైన జీవులు, వాటన్నిటినీ అనుకరిస్తూ వాటిని చిత్రాల రూపంలో దృశ్యమానం చేయడం ప్రారంభించాడు. వాటి చుట్టూ కాల్పనికతని, సృజనాత్మకతను జోడించి కథలు అల్లడం ప్రారంభించాడు. ఆ కథలు మౌఖిక సంప్రదాయ శైలిలో నడుస్తూనే మరొకవైపున ఆ కధనాలు మరింత రక్తి కట్టడానికి దానికి తోడుగా సంగీత వాయిద్యాలను కూడా ఉపయోగించాడు. ఈ దశ వరకూ మనిషి జ్ఞానేంద్రియాలలోని చెవికి, నోరుకు మాత్రమే పని కల్పించాడు. ఉల్లాసాన్ని అందించాడు. కానీ దృష్టిని అందించే కన్నుకు కూడా ఉత్తేజాన్ని అందించడానికి చిత్రాలను ఆసరాగా తీసుకున్నాడు. కళా ప్రదర్శనలో చెపుతున్న కథాగానానికి తగిన దృశ్యాన్ని చూపించడానికి. అలాంటి ఒక రూపాన్ని చూస్తూ కళాకారుడు మరింత ఉద్వేగంగా కథాగానం చేయడానికి, చూసే ప్రేక్షకులు కథానుభూతిని మాత్రమే కాకుండా, పాత్రల రూపాలతో లీనం కావడానికి, ఉద్విగ్నతను కూడా పొందడానికి చిత్రాలు, బొమ్మలు దోహదపడ్డాయి. వాటిలో పటచిత్రాలు, తోలు బొమ్మలు, కొయ్య బొమ్మలు ఉన్నాయి. కథలోని పాత్రానుగుణంగా చేసిన బొమ్మలకు తగిన ఆహార్య, వస్త్ర, అలంకరణ ద్వారా కథలు చెప్పే విధానం కూడా జానపద కళల ప్రస్థానంలో అమలులోకి వచ్చింది. ఇది మూడవ దశ.

దీనిద్వారా ప్రేక్షకులకీ దృశ్య శ్రవణ విధానం (Audio Visual experience) ద్వారా జరిగే అనుభూతిని మొదటిసారి కల్పించడం జరిగింది అంతకుముందు జ్ఞానేంద్రియాలలో చెవికీ, వినికిడికి సంబంధించిన అంశం ద్వారా మాత్రమే కళల ప్రదర్శన జరుగుతూ వచ్చింది మూడవ దశ వచ్చిన కాలంలో చెవులకి మాత్రమే కాకుండా, కనులకి కూడా దృశ్య మాధ్యమం ద్వారా జానపద కళల్ని ప్రదర్శించడం అనే ప్రక్రియ ప్రారంభం అవడంతో అందరూ ఒక కొత్త రసానుభూతిని పొందే అవకాశహమ్ లభించింది.

4. వేష భూషణాలతోడు:

జానపద కళల ప్రదర్శన విధానాలలోని పరిణామంలో ఈ దశను పరాకాష్టగా చెప్పవచ్చు. సాధారణంగా జానపద కళలను ప్రదర్శించేపుడు, కథకుడు కథకుడు గానే ఉండటం, తాను సాధారణ ఆహార్యంతో ఉంటూనే మాటల ద్వారా, దృశ్యాలు, చిత్రాలు, కొయ్య బొమ్మలు, సంగీత వాయిద్యాల సహకారంతో ఆ కథకు సంబంధించిన సన్నివేశాన్ని, దాని తాలూకు వాతావరణాన్ని సృష్టిస్తూ వెళ్లడం అనేది సంప్రదాయంగా ఉండేది. కానీ ఈ నాలుగవ దశలో జానపద కళాకారుడు కేవలం మౌఖిక సంప్రదాయానికి, లేదా సంగీత వాయిద్య పరికరాలు ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని, దానికి ఆలంబనగా బొమ్మలని చూపి, తద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మాత్రమే పరిమితం కాకుండా ఒక అడుగు ముందుకేసి తానే ఆయా పాత్రలను పోషించే పాత్రధారిగా మారడమనేది జానపద కళాపరిణామ ప్రస్థానంలో ఉన్నతమైన దశ. ఏ పాత్ర స్వభావం ఎలా ఉందో ఆ పాత్రకు తగిన ఆహార్యం, (Costume & Makeup) ఆంగికం, (Body Language) వాచకం (Dialogue diction) అలాగే వేష, భూషణాలు, ఆభరణాలు, ఆయుధాలు ధరించి ఆ పాత్రల్ని పోషించే స్థితి జానపద కళల ప్రదర్శనా విధానాల పరిణామంలో ఒక గొప్ప మలుపు.

ఈ అదనపు హంగుల వల్ల ఇక్కడ కళాకారులు తాము ధరిస్తున్న పాత్రలుగా మారిపోతారు. పాత్రకు తగిన వేషం, ఆభరణాలు, ఆయుధాలు, వస్త్రధారణ, భాష, వాచికంతో ఆ పాత్రని మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తారు. కాగా సన్నివేశానికి తగిన వాతావరణాన్ని కలిగించేవిగానే చిత్రాలు, బొమ్మలు నేపధ్యంలో పరిమితం అవుతాయి తప్ప కేంద్ర స్థానంలో ఉండవు. చిత్రాల ఆధారిత కళా ప్రదర్శన స్థానంలో నటుడే, కళాకారుడే పాత్రధారిగా రావడం వల్ల చిత్రాల ప్రాధాన్యత ఈ దశలో తగ్గిపోయింది. కానీ మౌఖిక సంప్రదాయానికి సంబంధించిన పదాలు, పద్యాలు పాడటం కొనసాగింది దీంతో పాటు ప్రేక్షకులకి మరింత రక్తి కట్టడానికి వీలుగా సంగీత వాయిద్యాల తోడు కూడా కొనసాగింది.

ప్రపంచం మొత్తం మీద జానపద కళల ప్రదర్శనా విధాన పరిణామం ఇలా నాలుగు దశలలో వివిధ అంశాల ప్రాతిపదికన జరిగిన విషయం సుస్పష్టం.

తెలంగాణ జానపద కళల ప్రస్థానం కూడా ఇందుకు మినహాయింపు కాదు అందుకే తెలంగాణలో జానపద కళల తొలి స్థానం మౌఖిక - శ్రుత సంప్రదాయానికి సంబంధించి (Oral-Auditory Tradition) మొదలై, ఆ తర్వాత సంగీత వాయిద్యాలను తోడుగా చేసుకుని ఉండే కళారూపాలు, ఆ తర్వాత చిత్రాలు, బొమ్మల ఆధారంగా, సంగీత వాయిద్యాల ప్రాతిపదికగా కథన శైలిలో మౌఖికంగా కళలను ప్రదర్శించే విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత చిందు యక్షగానం బహురూపులు, వంటి కళారూపాలు పాత్రలు-పాత్రధారులు, వేష భూషణాలతో, ఆయుధాలతో, ఆహార్యంతో ప్రేక్షకులకు ఒక నవ్యమైన అనుభూతిని ఇచ్చేలాగా ఈ కళారూపాల ప్రస్థానం కొనసాగింది. ఈ నేపద్యంలోంచి తెలంగాణ-నేలమీద పుట్టిన ఒక కళారూపమే -మిత్త అయ్యల్ వార్ల కళా ప్రదర్శన!

An art form is a true replica of its times. It is not only depicts the socio-cultural, politico-economic status of those times, but also get influence from the same.

కళా రూపాల ప్రస్థాన క్రమంలో సాంస్కృతిక, సాహిత్య, భాష, సంప్రదాయాలకు తోడు ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయని చెప్పుకోవచ్చు. నిజానికి సామాజిక స్థితిగతులు, అంతస్థులు వంటివి కూడా ఆయా జానపద కళారూపాల ఉనికికి, కొనసాగింపుకు కారణభూతమయ్యాయి. సాధారణంగా జానపద కళా రూపాలన్నీ గ్రామీణ ప్రాంతాలు, పల్లె ప్రజలు ఉండే ప్రాంతాలకు సంబంధించి ఉంటాయి. దీనివల్ల సామాజిక వ్యవస్థ కుల వ్యవస్థ పునాదులపై ఎలా నిర్మాణం జరిగిందో, అలాగే ఆయా జానపద కళారూపాలు కూడా నిర్మాణం కావడం అనివార్యంగా జరిగింది. సాంస్కృతిక మానవ శాస్త్రవేత్తల (కల్చరల్ ఆంత్రోపాలజిస్టుల) పరిశీలన ప్రకారం ప్రపంచంలోని ఏ సమాజంలోనైనా సామాజిక స్థిరీకరణ (Social Stratification) సహజమే. ఆ మేరకు వివిధ రకాల కళా రూపాలు సామాజిక అంతస్తులను అనుసరించి ఉండడం ద్వారా ఆయా కళారూపాలు మనుగడ సాగిస్తాయనేది వారు చెప్పిన సూత్రం. ఇది జానపద కళారూపాలకు కూడా వర్తిస్తుంది.

అందుకని తెలంగాణలోని కళారూపాలు విశ్లేషణ లేదా కళారూపాల ప్రస్థానాన్ని వివరించేటప్పుడు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అలా తెలంగాణ ప్రాంతంలో ఆయా జానపద కళారూపాలు, ఆయా వృత్తులు, కులాలకి ఆశ్రిత కళారూపాలుగా (Dependent Art Form) కొనసాగిన సందర్భం చారిత్రకంగా, సామాజికంగా రూపొందింది. తెలంగాణ సమాజం భారతీయ హైందవ సమాజంలోని చాతుర్వర్ణ విధానానికి అనుకూలంగా ఉండటం వల్ల, తెలంగాణా సమాజంలోని వృత్తిపనులు కులాలవారీగా వివిధ స్థాయిలలో అంతస్థులు నిర్మాణం అయ్యాయి. అలా సామాన్య నిమ్నస్థాయి ప్రజలలో కూడా తమదైన కళా భాగస్వామ్యం, కళా ప్రదర్శన, కళాపోషణ తత్వాలు ఇమిడి ఉండటం వల్ల ఆశ్రిత కులాల నుంచి కళారూపాలు ఆవిర్భవించాయి.

కళారూపాలు (Art Forms), కళాత్మకత (Artistic Outlook), సౌందర్య దృష్టి (Aesthetics) అనేవి మనుషులకి భౌతిక అవసరాలు తీరిన తర్వాత మాత్రమే అవసరమౌతాయి అనేది సాధారణంగా కనిపించే అంశం. కూడు, గూడు, గుడ్డ వీటి తర్వాత భూమి, అధికారం లాంటివన్నీ సమకూరిన తర్వాత మాత్రమే మనుషులలో సౌందర్యాత్మకత, కళాత్మక దృష్టి ఏర్పడుతుందని సాధారణంగా భావిస్తాం. ఇది నిజమే కావచ్చు కానీ సమాజంలో తమదైన స్థాయిలో వినోదం, వికాసం, సాంస్కృతిక పరిరక్షణ, తమదైన అస్తిత్వం వ్యక్తీకృతం కావలసిన అగత్యం ఒకటి మాత్రం ఉంటుంది. దీనివల్లనే సామాజిక హెూదా, ఆర్థిక స్థాయి, ఉన్నత వర్గ జీవనాలకు అతీతంగా అణగారిన, అట్టడుగు సామాజిక వర్గ ప్రజలలో సైతం వారిదైన స్థాయిలో కళారూపాలు రూపొందాయి. అందుకే ఉన్నత కులాలకు సంబంధించిన కళా ప్రదర్శనలకు తోడుగా, సమాంతరంగా వృత్తి కులాలకు సంబంధించిన నిమ్న స్థాయి ప్రజలలో కూడా ఆయా కళారూపాలు క్రమక్రమంగా బలపడ్డాయి. అందుకే "అంతస్థులకు, సామాజిక హెూదాలు, స్థాయిలకు అతీతంగా మనిషి సహజంగా సరస జీవి, రస హృదయం కలిగిన వాడు” అని సూత్రీకరించారు.

ఇక తెలంగాణ ప్రాంతం విషయానికొస్తే, కుల వ్యవస్థ ప్రకారం ఆయా వృత్తులు లేదా ఆయా వృత్తుల ఆధారంగా కులవ్యవస్థ రూపొందినప్పటికీ, ఆయా కులాలలో, వృత్తులలోని ఔన్నత్యాన్ని పెంచడానికి ఆయా వృత్తుల కులాలకు సంబంధించిన ప్రజలలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని, స్థాయి (Status)ని పెంచడానికి ఆత్మన్యూనతను (Social inferiority) తొలగించి, సమున్నత భావనని తీసుకురావడానికి ఈ ఆశ్రిత కళారూపాలు అవసరమయ్యాయి. అందుకే జానపద కళా రూపాలు ప్రదర్శించే కథా వస్తువులన్నీ ఆయా కులాలకు, వృత్తులకు సంబంధించిన వీరగాథలుగా, వంశ పురాణాలుగా ఉండటం సర్వ సాధారణమయ్యాయి.

ఉన్నత వర్గానికి సంబంధించిన కళా ప్రదర్శనలో అధికంగా రామాయణ, మహాభారత, భాగవతంలు, పురాణాలే ప్రధానాంశాలుగా ఉంటాయి. కానీ వృత్తులు కులాల వ్యవస్థ పునాదులుగా రూపొందిన నిమ్న స్థాయి ఆశ్రిత కులాలకు సంబంధించిన కళా ప్రదర్శనలలో కథాంశాలు కులాలకు, వృత్తులకు సంబంధించిన కథలు కుల, వంశ చరిత్రలు, వీరగాథలు, పూర్వీకుల వృత్తాంతాలు, ఆది జాంబవ ముని విశేషాలు ప్రధానంగా ఉంటాయి తప్ప మహాభారత రామాయణ ఇతిహాసాలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. ఒకవేళ ఉన్నా ఇతిహాసాలలో సైతం విస్తృతమైన నిమ్న స్థాయి పౌరాణిక పాత్రల కథలే ప్రధానాంశాలుగా ఈ గాథలు రూపొందుతాయి.

ఇలా తెలంగాణలో వివిధ రకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యాల నుంచి కుల వ్యవస్థ, వృత్తి వ్యవస్థ కు అనుకూలంగా ఆశ్రిత కళాకారుల వ్యవస్థ రూపొందింది. అలా నిమ్న స్థాయి దళిత సామాజిక కులాలకి ఆశ్రితంగా ఉంటూ రూపొందిన ఒక సామాజిక కళారూపమే (Social Art Form) మిత అయ్యాల్వార్లు. ఇది షెడ్యూల్ కులానికి చెందిన దాదాపు అరవై ఉపకులాల లో ఒకటిగా ప్రభుత్వంచే గెజిట్లో ప్రకటించబడిన సామాజిక వర్గం. సాధారణంగా మాలలు, మాదిగలు, దళితులు సామాజిక పరమైన న్యూనత వల్ల, వర్ణ ధర్మ విధానం వల్ల నిమ్న స్థాయి జీవితాన్ని గడుపు తున్నప్పటికీ వారిలో సైతం సమ్యక్ జీవన విలువలు, నైతిక ప్రవర్తన, ఆధ్యాత్మిక జీవనం కోసం మేధావులైన కొంతమంది ఆధ్యాత్మిక కోవిదులు క్రమక్రమంగా రూపొందారు. వారే మితఅయ్యల్వార్లుగా ఆ తర్వాత పేరు గడించారు. అందుకే మాల, మాదిగ సామాజిక వర్గానికి ఆధ్యాత్మిక సలహాదారులుగా, మార్గదర్శకులుగా, నైతిక బోధకులుగా వీరు మనకు కనిపిస్తారు.

ఇదే సమయంలో సామాజికంగా కులవ్యవస్థకు తోడు, అధ్యాత్మికంగా మత వ్యవస్థ ప్రాచుర్యాన్ని కూడా మనం గమనించాలి. భారతదేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం యావత్తూ వైష్ణవ, శైవ మత సంప్రదాయాల పరంగా బహుళ ప్రచారాలు జరిగిన 12, 13 శతాబ్దాల కాలంలో భారతీయ సామాజిక ఛత్రం (Social Structure) పై మతపరమైన అంశాలు ఎంతగానో ప్రభావితం చేశాయి.

ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, వల్లభాచార్య, మధ్వాచార్య వంటి మహనీయులు వైష్ణవతత్వాన్ని దేశమంతా ప్రచారం చేస్తున్న కాలంలో, తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ వైష్ణవ భక్తి ప్రచారం ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. అలా భక్తి ఉద్యమకాలంలో, వైష్ణవ భక్తి ప్రచారంలో దక్షిణాదిలో పేరెన్నికగన్న వారు "పన్నిద్దరు ఆళ్వారులు” గా ప్రసిద్ధి చెందారు. ఆ 12 మంది ఆళ్వారులలో ఏడవ ఆల్వార్ "తిరుప్పాణాళ్వారు" అయితే ఆయన సంతతిగా ఈ మిత అయ్యల్వార్లు తమనితాము చెప్పుకుంటారు. మిత అయ్యవార్లు పుట్టుకతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినప్పటికీ, వారిలోని ప్రత్యేకతలు వారు పాటించే పూజా విధానాలు, వారి సామాజిక వర్గానికన్నా భిన్నమైన జీవన శైలిని వీరు ఆచరించేలా చేశాయి. అందుకే వీరిని నిత్యులు, నిత్య వైష్ణవులు, మిత్రులోల్లు అని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

మిత్త అయ్యల్వార్లు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఇతర జిల్లాలలో ప్రధానంగా కనిపిస్తారు. వీరిది ప్రధానంగా కథాగాన ప్రక్రియా కళా రూపమే! వీరు రామాయణ, మహాభారత గాధలను, భాగవత, పురాణాలను ప్రధానంగా వైష్ణవ తత్వాన్ని తమ కథాగాన ప్రక్రియల ద్వారా ప్రచారం చేస్తుంటారు. దాంతోపాటు వారి కుల పురాణాలను, వీరగాథలను చెబుతూనే వీరి దాతల వంశ చరిత్రలని గూడ రస రంజకంగా అప్పటికప్పుడు కైకట్టి అశువుగా సైతం చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఒకవైపు తిరు నామ సంకీర్తనలు పాడుతూ, మరొకవైపు కుల గాథలు కొనసాగిస్తూన్నారు.

వీరి ప్రత్యేక సంగీత వాయిద్యాలలో కడ్డీతంత్రి, వకుళాభరణం అనేవి ప్రముఖంగా కనిపిస్తాయి. కథా గానం చేస్తున్న క్రమంలో ఆ కథాగమనానికి తగిన సంగీత లయ కోసం ఈ వాయిద్యాలను ఉపయోగిస్తారు. కడ్డీతంత్రి వాయిద్యం వాయిస్తూ కథకుడు లేదా కళాకారుడు తాను చెబుతున్న కథనానికి, కథకి తగిన సంగీత ధ్వనులు సృష్టిస్తూ చూపరులకు, ప్రేక్షకులకు కథ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తారు. 2015లోనే భాషా సాంస్కృతిక శాఖ కడ్డీ తంత్రి వాయిద్యం వాయిస్తూ కథాగానం చేసే దురిశెట్టి రామయ్య పై ప్రత్యేక డాక్యుమెంటరీని నిర్మించి, ఆ కళాకారుడి జీవన యానంతో పాటు, మితా అయ్యళ్ వార్ల సామాజిక జీవనాన్ని, కడ్డీ తంత్రి కళారూప కథాగానాన్ని దృశ్య రూపంలో నిక్షిప్తం చేసింది.

ప్రస్తుత తరంలోని, మిత అయ్యళ్వార్లలో కొందరు కొన్ని దేవాలయాలలో అర్చకులుగా కూడా బాధ్యతలు నిర్వహించడం విశేషం. సాధారణంగా పౌరోహిత్యం, అర్చకత్వం, పూజలు చేయడం ఇవన్నీ ఉన్నత వర్గానికి సంబంధించిన బ్రాహ్మణ కులపూజారుల ద్వారానే జరుగుతాయి. కానీ మిత అయ్యళ్వార్ల లోని నిబద్ధత,, ఆధ్యాత్మిక స్ఫూర్తి, భాషా పటిమబీ కథన నైపుణ్యాల కారణంగా తెలంగాణలోని కొన్ని దేవాలయాలలో వీరు అర్చకత్వం కూడా చేయడం ఇక్కడ గమనార్హం.

An Art form can represent the ideas, needs, demands and aspirations of the society on one hand and can undergo changes, modifications, additions and alternations in its form, content, shape, size, scale and style. It is crystal clear that, the transformation occurs in the art form can be attributed to the impact of society and the support from the public.

సామాజికంగా వెనుకబడి, సాంస్కృతికంగా ప్రాధాన్యతను సంతరించుకోకుండా, కళాత్మకంగా గుర్తింపుకు నోచుకోకుండా ఉన్న మిత అయ్యళ్వార్ వంటి మరెన్నో జానపద, గిరిజన ఆశ్రిత కళారూపాలపై విస్తృతంగా పరిశోధన చేయాల్సి ఉంది. సాంస్కృతిక కోణంలోంచి కళాత్మక సౌందర్య దృష్టిని, కళారూప ప్రక్రియలని, దాంతోపాటు సామాజిక, ఆర్థిక జీవనశైలి మార్గాలను సంపూర్ణంగా పరిశోధించి నమోదు చేయాల్సి ఉంది. తెలంగాణ సమాజంలోని అన్ని కళారూపాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక కోణాలను కుల పరమైన అంశాలతో సమన్వయం చేస్తూ సమగ్రంగా పరిశోధన జరగవలసి ఉంది. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అక్షరమెత్తు ఉదాహరణే ఈ పుస్తకం!

ఈ నేలపై పుట్టిన ప్రతి సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది. భూమి పై ఆవిర్భవించిన ప్రతి జాతికీ ఒక వారసత్వం ఉంటుంది. అలాంటి చరిత్ర లన్నీ నమోదు కావాల్సి ఉంది. పరిశోధన జరగాల్సిఉంది లోకానికి తెలియాల్సి ఉంది. ప్రతి కులానికి, దానిని ఆశ్రయించుకున్న ప్రతి కళారూపానికి ఒక అద్భుతమైన గతవైభవం, చరిత్ర, వారసత్వం ఖచ్చితంగా ఉంటాయి. ఏవీ సమాజంలోంచి కాకుండా ఆకాశంలో నుంచి ఊడిపడవు, ఎన్నో సంఘటనలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అవసరాలు ఆవశ్యకతల నుంచే ఒక సామాజిక వర్గం పుడుతుంది, పెరుగుతుంది కొనసాగుతుంది. మిత అయ్యల్ వార్ సామాజిక వర్గం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అలాంటి విశిష్ట జీవన సాంస్కృతిక విలువలను డా॥ ఆవాల వీణ గారు విస్తృతమైన పరిశోధన జరిపి తన జాతికి అక్షర నీరాజనంగా ఈ గ్రంథాన్ని సమర్పించారు. మిత అయ్యళ్వార్లకు సంబంధించి తెలియని ఎన్నో విశేషాలను సామాజిక, కుటుంబపరమైన ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలను ఈ గ్రంథంలో వెల్లడి చేసారు.

ఇలా వైవిధ్యమైన, విస్తృతమైన, సామాజిక, సాంస్కృతిక, కళాత్మక, జానపద వారసత్వాన్ని కలిగిన మిత అయ్యళ్వార్ల గురించి ఈ గ్రంధ ప్రచురణ ద్వారా ఎరుక చేసే అవకాశం భాషా సాంస్కృతిక శాఖకు దక్కింది. అయితే ఈ దిశగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇంతటితో ఆపకుండా, తెలంగాణా ప్రాంతంలోని అన్ని ఆశ్రిత కులాలకు సంబంధించిన పరిశోధనలతో కూడిన గ్రంధాలను భవిష్యత్తులో ప్రచురించే గురుతర బాధ్యతని స్వీకరిస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ....

రవీంద్రభారతి,
హైదరాబాద్,
ఆగస్టు 2023

డాక్టర్ మామిడి హరికృష్ణ

సాంస్కృతిక శాఖ సంచాలకులు

తెలంగాణ ప్రభుత్వం