Jump to content

మిత అయ్యల్‌వార్లు/రచయిత్రి మాట

వికీసోర్స్ నుండి

రచయిత్రి మాట

ఒక జాతిని అధ్యయనం చేస్తున్నప్పుడు దానిలో ఉండే సాధక బాధకాలన్నీ క్షేత్ర పర్యటన ద్వారా అర్థమవుతాయి. నేను ఎంచుకున్న అంశం "మిత అయ్యల్వార్ల భాషా సాహిత్య సాంస్కృతికాంశాలు - సమగ్ర పరిశీలన". ఈ అంశాన్ని ఎంచుకోవడానికి ముఖ్యకారణం మా గురువర్యులు డా౹౹ఎన్.ఆర్.వెంకటేశం గారు. ఎందుకంటే సార్ బుడగ జంగాల మీద పరిశోధన చేశారు అనే విషయాన్ని తరగతి గదిలో వెల్లడించారు. అప్పుడు నేను ఉత్సాహంతో లేచి 'అన్ని కులాల మీద ఇలా పరిశోధనలు జరిగాయా? సార్' అని అడిగాను. ఆ తర్వాత లైబ్రరీకి వెళ్ళి వెతకసాగాను. చిట్టచివరికి 'విశ్వవిద్యాలయా ల్లో పరిశోధన' పుస్తక రచయిత అయిన నా ఇష్ట గురువర్యులు నా పర్యవేక్షకులు శ్రీ వెలుదండ నిత్యానందరావు గారు బహూకరించిన పుస్తకాన్ని వెతికి చివరికి నిరుత్సాహపడి మా కులం మీద ఎవరూ పరిశోధన చేయలేదని దిగ్భ్రాంతికి గురయ్యాను. ముందుగానే తెలుగు ఉపాధ్యాయుడు కాబట్టి (స్కూల్ అసిస్టెంట్) మా నాన్నగారు ఆవాల గోపాల కిష్టయ్య గారిని అడిగాను. 'నాన్న! మన కులంమీద ఎవరూ పరిశోధన చేయలేదా?' అన్న నా ప్రశ్నకు మా నాన్నగారి సమాధానం 'ఎవరో ఎందుకు బిడ్డా! నువ్వే పరిశోధన చేయి' అన్న మాటలతో నిజంగానే నేను పరిశోధన చేయాలనే ఆత్రుత నాలో పెరిగింది. దానికి అన్నీ సహకరించినట్లుగా నేను పి.జి. రెండవ సం॥లో ఉన్నప్పుడు ఏదైనా అంశంపై సంగ్రహ వ్యాసం రాయమని మా గురువులు ఆదేశించడం జరిగింది. అప్పుడు నేను మా పర్యవేక్షకులు అయిన శ్రీ వెలుదండ నిత్యానంద రావుగారి దగ్గరికి వెళ్ళి 'సార్ మా కులంపై కొన్ని పాటలు ఉన్నాయి. వాటిపై నేను పరిశోధన చేయనా? సార్!' అని అడిగాను. అప్పటి నా సంగ్రహ వ్యాసానికి బీజమే ఇప్పటి నా పరిశోధనకు నాంది. అలా నేను ఈ నా పరిశోధన అంశాన్ని ఎంచుకున్నాను.

జానపద విజ్ఞానంలో మిత అయ్యల్వార్ల భాషా సాహిత్యం సాంస్కృతికాంశాలు - సమగ్ర పరిశీలన అనే అంశాన్ని జానపద విజ్ఞానం కోణం నుంచి మొదలు పెడదాం. జానపద విజ్ఞానం శాస్త్రీయమైన అధ్యయనం. విషయపరంగా సంప్రదాయక విజ్ఞానం మీద ఎన్నో ఆసక్తికరమైన పరిశోధనలు 18వ శతాబ్ది చివరలో జరిగాయి. జానపద విజ్ఞానం ప్రయోజనం, సంస్కృతిని రక్షించడంలో మనం ముందు వుండాలి. ఈ విశిష్టమైన సంస్కృతి సంప్రదాయలు ఎప్పటికీ నిలిచిపోవాలి అని, అలాగే కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడటమే జానపదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

తెలుగువారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు మిగిలిన భారతీయులకంటే భిన్నంగా వుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాలలో 61 ఉపకులాలు ఉన్నట్లు 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఈ 61 ఉపకులాల్లో ఒకటి మిత అయ్యల్వార్లు. వీరు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలను కలిగి వున్నారు. అతి తక్కువ జనాభా ఉండటం వలన అక్కడక్కడ మాత్రమే ఈ కులంవారు కనిపిస్తారు. మాలదాసరి, మిత అయ్యల్వారు సంఘంలో వేర్వేరు కులాలుగా గుర్తించబడినా కొన్ని పద్ధతులవల్ల మిత అయ్యల్వార్ల వద్ద ఉన్న ప్రత్యేకమైన కడ్డీ తంత్రీ వాద్యంవేరు చేస్తుంది అని చెప్పవచ్చు. ఈ రెండు వీరిని కులాలు వేర్వేరు అని అవగతం అవుతుంది. కానీ పూర్తిగా రెండు కులాలు వేర్వేరు అని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు దొరకకపోవటం వలన ఆ విషయాన్ని నేను నా ఈ రచనలో ఎక్కువగా ప్రస్తావించలేదు.

కావున నేను నా క్షేత్ర పర్యటనలో సంపాదించిన తిరునామాలు గానీ, సంస్కృతి సంప్రదాయాలు గానీ, కేవలం మిత అయ్యల్వార్ల పెద్దలవద్ద మాత్రమే సేకరించడం జరిగింది. వారు చెప్పిన అంశాల ఆధారంగా నా పరిశోధనను, రచనను కొనసాగించాను.

చాలామంది ఇటువంటి కులం అంటూ ఒకటి ఉందనీ సాహిత్యము, సంప్రదాయాలు ఉన్నాయనీ వీటిని బయటి ప్రపంచానికి తెలియజేయాలనీ, మౌఖిక సాహిత్యాన్ని పదిలపరచాలనీ దృఢసంకల్పంతో నా ఈ పరిశోధన ప్రారంభించాను. అలా ముందుకుసాగి 2012లో ప్రారంభం అయిన నా ఈ పరిశోధన 2021 నాటికి పూర్తయినది. ఏది ఏమైనా మా కులం సంస్కృతిని, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించానని తృప్తి మాత్రం నాకు ఉంది.

ప్రత్యేకంగా మిత అయ్యల్వార్ల గురించి ఏ సిద్ధాంత గ్రంథం లేదు. మొట్టమొదటిగా ఈ పరిశోధన చేపట్టినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కొంతమంది ప్రముఖ కవులు మిత అయ్యాల్ వార్ల గురించి ప్రస్తావించారు. వారిలో బిరుదురాజు రామరాజు, కొలకలూరి ఇనాక్, పులికొండ సుబ్బాచారి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ముఖ్యులు. అందువల్ల మిత అయ్యల్వార్ల మీద పూర్తిగా సిద్ధాంత వ్యాసం రాసిన మొదటి మహిళను నేనే అనీ అలాగే మా మిత అయ్యల్ వార్లలో పి.హెచ్.డి చేసిన మొదటి మహిళను కూడ నేనే అనీ కొంచెం గర్వంగా చెప్పుకుంటున్నాను.

ఈ పుస్తకంలో మిత అయ్యల్వార్లు ఏవిధంగా వచ్చారు? గెజిట్లో నమోదు అయిన పద్ధతి, వివిధ పుస్తకాలలో వచ్చిన కథనాలు, ఆ కులంలోని వారు చెప్పిన కథనాలను. వారి జీవన విధానం, ఆహరపు అలవాట్లు అలాగే ఆశ్రిత కులాలలో మిత అయ్యల్వార్ల పాత్ర గురించి చర్చించటం జరిగింది. అలాగే మిత అయ్యల్వార్ల స్త్రీల జీవన విధానం వారి నివాసానికి ఉపయోగించే పద్ధతులు, నివాసానికి ఆచరించే కొన్ని సంప్రదాయాలును మిత అయ్యల్వార్లు మాత్రమే పూజారులుగా కొన్ని దేవాలయాలలో కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాలను, పూజలు నిర్వహించే పద్ధతులను, ఈ పుస్తకంలో వివరంగా భారతదేశంలోని అనేక మతాలు, కులాలు వారికి సంబంధించిన భిన్న భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయిని, ఈ నేపథ్యంలో నా పరిశోధనలో మిత అయ్యల్వార్ల ఆచార వ్యవహారాలును స్త్రీ ప్రసవం అయిన తరువాత, శిశువుకు నామకరణం చేసే విధానం, తలనీలాలు సమర్పించే (జుట్టు కత్తిరించే) పద్ధతులను, రజస్వల అయిన తర్వాత నిర్వహించే కార్యక్రమాలు వ్యక్తులు మరణించి నప్పుడు మగవారికి, పెండ్లికాని రజస్వల అయిన ఆడవారికి, పెండ్లి అయిన స్త్రీలకు, వితంతు స్త్రీలకు వీరు నిర్వహించే కర్మకాండల విధానంను, ఈ గ్రంథంలో పసిపిల్లలకు దిష్టి యంత్రాలు కట్టటం, చెడుపీడల నుంచి, చెడుగ్రహాల నుంచి రక్షించు కోవటానికి తాయెత్తులు కట్టే సంప్రదాయం సాంప్రదాయబద్ధంగా పాటించే కొన్ని మంత్రాలను ఈ గ్రంథంలో వివరించడం జరిగింది.

ఇంకా ఈ గ్రంథంలో మిత అయ్యల్వార్లు పాడుకునే కీర్తనలైన తిరునామాలు, ఆధ్యాత్మిక తిరునామాలు లేదా కీర్తనలు, సంకీర్తనలు, గేయాలు, మరియు మనిషి మరణించినపుడు విరక్తితో గానం చేసే నిర్యాణ లేదా మరణ సంబంధ తిరునామాలు గురించి మిత అయ్యల్వార్లు వాడుకునే నిత్య వ్యవహారంలో వంటలకు సంబంధించిన, కులానికి సంబంధించిన మరియు సామాన్యంగా వాడుకునే పదాలను కూడా కొన్నింటిని వివరించడం జరిగింది.

ఈ గ్రంథ రచనకు మూలమైన "మిత అయ్యల్వార్ల భాషా సాహిత్యం సాంస్కృతికాంశాలు సమగ్ర పరిశీలన" అనే అంశంపై పరిశోధన చేయడానికి సువర్ణావకాశాన్ని ఇచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖకు ముందుగా నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

పరిశోధనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ గారికి, ఆచార్య మసన చెన్నప్ప గారికి, పూర్వ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఆచార్య మాదిరెడ్డి అండమ్మ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య శ్రీమతి సూర్య ధనంజయ్ గారికి, తెలుగు శాఖ పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు ఆచార్య చింతకింది కాశిం గారికి, పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు, పర్యవేక్షకులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారికి, డా॥ ఎస్. రఘుగారికి, డా॥ సాగి కమలాకర శర్మ గారికి, డా॥ వారిజా రాణి గారికి, డా౹౹ ఎ. విజయలక్ష్మి గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నా పరిశోధనలో భాగంగా నాకు అవసరమైన గ్రంథాలను, పుస్తకాలను, మ్యాగజైన్లు మరియు ఇతర సామగ్రిని అందించిన విశ్వవిద్యాలయ గ్రంథాలయ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

నా అభిరుచిని గమనించి నా రాష్ట్రణ. పూర్తి అయ్యేంత వరకు నా వెన్నంటి వుండి ప్రోత్సహించిన నా జీవిత భాగస్వామి త్రికోవెల శ్రీనివాస్ గారికి, నా పరిశోధనాంశం పూర్తియ్యేంత వరకు విసిగించకుండా సహాకరించిన నా చిన్నారి తల్లి బేబి దివ్యజ్ఞకు ఆశీస్సులు. మిత అయ్యల్వార్ల గురించి వంశపారంపర్యంగా అనేకాంశాలను చెప్పి మార్గదర్శకం చేసిన మా తల్లిదండ్రులైన శ్రీమతి ఆవాల సీతాదేవి, శ్రీ ఆవాల గోపాలక్రిష్ణయ్య గార్లకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువర్యు లందరికీ నా పాదాభివందనాలు.

నా పరిశోధనను ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన నా గురువులు, బంధువులు, మిత్రులు మరియు ఇంకా ఎవరినైనా మరచిన వారందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గ్రంథాన్ని శ్రమగా భావించకుండా ఓపికతో డి.టి.పి. చేసిన చెరుకుపల్లి నాగలక్ష్మి మరియు రణధీర్ గార్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ పరిశోదను పుస్తకంగా ప్రచురించిన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారికి కృతజ్ఞతలు

-డా౹౹ ఆవాల వీణ