మిణుగురులు

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


మిణుగురులు గురజాడ అప్పారావు పిల్లల కొసం రచించిన కవిత.


మల్లెలు మొల్లలు పూచే వేళ
చల్లని గాలులు వీచే వేళ
మేనుల గంధం బలదే వేళ
ఉరుములు మెరుపులు మెరసే వేళ
తొలకరి వానలు కురిసే వేళ
మామిడి పండులు పండే వేళ
మన్మథ బాణం మ్రోగే వేళ
మగువల మనసులు క్రాగే వేళ.

బూరుగు చెట్టు
చిలకలతోను
ఏమని పలికింది ?
పండిన పండు
ఎండిన దూదై
పకపక నవ్వింది.

చిలకల్లార
చిలకల్లార
కలవలతోను
ఏమని పలికారు ?

"కలవల్లార
కలవల్లార
రాజు వచ్చెను
కన్నులు విప్పండి

కలవల్లార
కలవల్లార
రాజు గ్రుంకెను
కన్నులు మూయండి.

అరటి కాయ బజ్జి
మినప్పప్పు సొజ్జి
కలసి మెలసి తిందాం
కథలు వెథలు విందాం.

ఏనుగు ఎక్కి మనము
ఏ వూరెళదాము ?
ఏనుగు ఎక్కి మనము
ఏలూ రెళదాము.

గుఱ్ఱం ఎక్కి మనము
ఏ వూరెళదాము ?
గుఱ్ఱం ఎక్కి మనము
గుంటూ రెళదాము.

మోటా రెక్కి మనము
ఏ వూరెళదాము ?
మోటా రెక్కి మనము
మోటూ రెళదాము.

వెన్నుకి యెక్కి మనము
ఏ వూరెళదాము ?
వెన్నుని యెక్కి మనము
వెయ్యాళ్ చూదాము.