మహేంద్రజాలం/మహేంద్రజాలం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మహేంద్రజాలం

(ఇంద్రజాల రహస్యాలు)

పామును పడగ విప్పకుండా చేయుట

1. ఎలాంటి భయంకరమైన (లేక, దేవతా) సర్పమైన పెద్ద ఉల్లిపాయ (వెల్లుల్లి) ను నూరి వాసన సూపినా, మధ్యకు కోసి వాసన చూపినా - పాము పడగ విప్పకుండా ముడుచుకు పోతుంది. లేకపోతే పారిపోతుంది.

2. పై విధంగానే తెల్ల ఈశ్వరీ వేరునుదెచ్చి, గంధము తీసి, సర్పమునకు వాసనచూపినా పడగ విప్పలేదు.

ఈ ప్రదర్శన చేయువారు ఈ రెంటిలో దేనినైననూ ఆచరించవచ్చును. ఈ ప్రదర్శనకు పాము స్వంతమైనదే కానక్కరలేదు. అప్పటికప్పుడు ఎవరైనా పామును తెచ్చి - పడగవిప్పకుండా చేయమన్ననూ నిరభ్యంతరముగా పై విధానంతో పాము పడగ విప్పకుండా చేయవచ్చును.


నిద్రపుచ్చుట

ఇంద్రజాలికుడు ప్రేక్షకులతో - నిద్రపోనని భీష్మించుకొని వున్న వారిని సైతం నా మహిమతో నిద్రపుచ్చుతానని చెప్పి - వచ్చిన వ్యక్తిని నిద్ర పుచ్చి - అందరిని ఆశ్చర్య పరుచవచ్చును.

ఆ రహస్యం ఏమిటంటే ? విషముష్టి అనే చెట్టు వేరును దెచ్చి, దాని నూనెను దీసి - ఆ నూనెను కుంకుమలోనో, విభూదిలోనో, సిందూరంలోనో కలిపి జాగ్రత్తగా భద్రపరచుకొని, ప్రదర్శన సమయంలో - దానిని వచ్చిన వ్యక్తికి బొట్టు పెట్టి - " తదేకంగా నా కళ్ళలోకి చూడు " అనో లేక ఏదయినా వస్తువును గాని, చిత్రములను గాని చూడమనో చెప్పి - తను ధ్యానం చేసినట్లుగా కొంచెంసేపు నటిస్తే - ఈ లోపులో మూలిక పనిచేసి ఆతను సుఖనిద్రలోకి జారిపోతాడు.

నూనెను పాలుగా మార్చుట

ప్రదర్శకుడు ప్రేక్షకులాతో ఎలాంటి వంట నూనెనైనా పాలుగా మారుస్తానని చెప్పి - అనుమానం లేకుండా నూనెను వారినే తెమ్మని చెప్పాలి. వారు నూనె తేగానే - తన దగ్గర సిద్ధంగా వున్న క్షారాన్ని చాక చక్యంగా ఆనూనెలో కలిపిన వెంటనే పాలుగా మారి పోవును. ఈ ప్రదర్శన చాల వింతగా వుండును.

ఇది ప్రదర్శించు వారు ముండుగా ఉత్తరేణి వ్రేళ్ళను తెచ్చి, బాగా కాల్చి తెల్లగా పొడి చేయలి. ఆ పొడిని నీటిలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత కదలకుండా తేరుకోనివ్వాలి. మరు రోజు కొంత పొడి వేసి బాగా కలపాలి. తిరిగి కదలకుండా తేరుకోనివ్వాలి. ఇలా 7 - 8 రోజులు చేసినచో క్షారము తయారవుతుంది. దీనిని సీసాలో భద్ర పరచుకొని ప్రదర్శన సమయములో ఉపయోగించాలి.

మండకుండా (మంట పెట్టకుండా) అన్నం తయార్

ప్రదర్శకుడు తన దగ్గర సిద్ధంగా వున్న బియ్యాన్ని చూపి - మంత్ర మహిమతో ఈ బియ్యాన్ని మంట (పొయ్యి) లేకుండానే ఉడికిస్తానని చెప్పి - ఆ బియ్యాన్ని ఒక పాత్రలో పోసి, మంత్రిస్తూ (నటిస్తూ) నీరు పోసిన వెంటనే ఆ బియ్యం కుతకుతా ఉడికి అన్నం తయారవుతుంది. ఇది చూచిన వారికి ఎంతో అద్భుతంగా వుంటుంది.

ఈ ప్రదర్శనకు ముందుగా తగినన్ని బియ్యాన్ని దెచ్చి వాటిని సున్నంబట్టిలో గొయ్యితీసి పాతి పెట్టాలి. తరువాత సున్నం బట్టి చల్లారి పోతుంది. అప్పుడు బియ్యాన్ని తీసి భద్రపరచుకొని ప్రదర్శన సమయంలో పైన చెప్పిన విధంగా చేసినచో అన్నం తయారవుతుంది. ఈ విధంగా బియ్యమే కాకుండా జొన్నలు, తైదులు, సజ్జలు, గోదుమలు మొదలగు ఆహార పదార్థములకు పనికి వచ్చు ఏ గింజలనయినా ప్రయోగానికి వినియోగించ వచ్చు.


టెంకాయ బాంబులా ప్రేలుట

ప్రదర్శకుడు ఒక టెంకాయను చూపి - నాశక్తితొ దీన్ని బాంబులాగా ప్రేల్చి వేస్తానని చెప్పి కొంత సేపు ధ్యానంలో వుండి మంత్రించిన (నటించి) కొబ్బరికాయ మీద నీరు పోయవలెను. వెంటనే ఆ టెంకాయ బాంబువలే ప్రేలి పోగలదు. ఈ ప్రదర్శన తిలకించిన వారు భయ - భ్రాంతులై అనంద పడగలరు. ఈ ప్రదర్శనకు ముందుగా పీచు వలవని పచ్చి కొబ్బరి కాయను కొత్త సున్నం నీటిలో 10 - 15 రోజులు నాన బెట్టాలి. తరువాత ఆ కొబ్బరి కాయను ఎండించి, భద్రపరచుకొని, ప్రదర్శన సమయంలో వినియోగించాలి.

నీళ్ళతో పేలాలు

ఇంద్ర జాలికుడు ప్రేక్షకులతో మీరందరూ పొయ్యిమీద బాండీ పెట్టి,. మంట చేసి పేలాలు తయారు చేస్తారు. కాని నేను మాత్రం నామహిమతో నిప్పు - పొయ్యి లేకుండా నీళ్ళతో మాత్రమే పేలాలు తయారు చేస్తానని చెప్పి - వడ్లు, గోదుమలు ఏవైనా సరే సిద్ధంగా వుంచినవి తీసుకొని వాటిపై మంత్ర జలం (మంత్రజలంలా నమ్మించి) చల్లగానే అవి పేలాలుగా మారి సభికులను ఆశ్చర్య చికితులను చేసి వేస్తాయి.

ముందుగా పొట్టు వలవని ధాన్యం (వడ్లు, జొన్నలు, గోదుమలు) మొదలగునవి తీసుకొని సున్నం బట్టీలో గుంట తీసి పాతి పెట్టాలి. సున్నం బట్టి చల్లారిన తరువాత వాటిని తెచ్చి భద్రపరుచుకొని ప్రదర్శన సమయంలో ఉపయోగించాలి.

క్షణంలో బ్రాంది

వేడి వేడి నీళ్ళలో ఇప్పపూలు మంచివి- పది పూలు వేసి నా మహిమతో ఇప్పపూలు బ్రాందీగా తయారు అవుతాయి అని చెప్పాలి. కొద్ది సేపు తరువాత పూలు తీసి వేసి అ నీరు ప్రేక్షకులకు పోస్తే అవి త్రాగగనే బ్రాందిలాగ వుండి వారు చాల అబ్బుర పడతారు. ప్రదర్శకుడు ముందుగా ఖాళీ మందు గొట్టాలు (మెడికల్ షాపులలో దొరుకును) తీసుకొని వాటి నిండా బ్రాంది పోసి మూతలు బిగించి వుంచుకోవాలి. తదుపరి ప్రదర్శనలో అలా బ్రాంది పోసిన గొట్టము నొకదాన్ని నేర్పుగా చేతి ప్రేళ్ళ సందులలో ఇరికించుకొని - పూలు వేయునప్పుడో లేక పూలు తీయు నప్పుడో, కలుపునప్పుడో ఆ గొట్టాన్ని దానిలో జార విడిచిన ఆ గొట్టము వేడినీటిలో కరిగి పోయి, దానిలోని బ్రాంది నీటిలో కలసి ఆ నీరంతా బ్రాందీ రుచిని సంతరించుకొంటుంది. ఇలాగే విస్కీ, రమ్ము, సారాలను కూడ సమయానుకూలంగా వినియోగించవచ్చును.

పాలలో ఎన్ని నీళ్ళు

ఇంద్ర జాలికుడు సభికులలో మీలో ఎవరయినా పాలు తీసుకురండి.... ఆపాలలో ఉన్న నీటిని తీసి మీకు చూపిస్తానని చెప్పి, వారు పాలు తీసుకు రాగానే ఆ పాలలో మహిమ (బూటకము) గల విభూదిని వేసి పొయ్యిమీద వేడి చేయగానే పాలు ఆవిరి అయిపోయి, పాలలో వుండే నీరు మాత్రమే మిగిలిపోయి, చూచు వరు మిక్కిలి ఆనంద పడతారు.

ఈ ప్రద్ర్శనకు ముందుగా తామర గింజలను తెచ్చి ఎండబెట్టి పొడిగా (మెత్తగా) చేసి వుంచుకొని ప్రదర్శనసమయంలో దానిని విభూదిలా పాలలో వేసిన పాలలో నీరు మాత్రమే మిగులుతుంది.

బంగారాన్ని రాగిగా మార్చుట

నా మంత్ర శక్తి మహిమతో బంగారన్ని గాగి లాగా మార్తి వేస్తానని చెప్పి, ప్రేక్షకులలో ఎవరి దగ్గరయినా బంగారు వస్తువును తీసుకొని దాని పైన తన దగ్గర నున్న శక్తివంతమయిన పచ్చ కర్పూరపు పొడిని బాగా రుద్దాలి. అప్పుడు బంగారం రాగిగా మారి ఎంతో ఆశ్చర్య పరుస్తుంది.

ఈ ప్రక్రియను చేసే ముందు ప్రదర్శకుడు ఏమి కష్ట పడవలసిన పని లేదు. కారణం ఏమంటే? పచ్చ కర్పూరం తగులగానే బంగారము రాగి రంగులోకి సహజంగా మారి పోతుంది గాబట్టి. ఈ క్రియ చాల మందికి తెలియదు. రాగిగా మారిన బంగరాన్ని మంచి నీటితో కడిగితే తిరిగి మామూలుగా బంగారం అవుతుంది.

రాగిని బంగారంగా మార్చుట

మణిసిల, గంధకము, ఊడుగ రసం, తంగేడు, జిమ్మి, తాళకములను కలిపి మెత్తగా నూరి, పౌడర్ గా చేసి వుంచుకొని ప్రదర్శన సమయములో తెలివిగా మాటలు చెప్పుతూ పై పౌడర్ ను సున్నితంగా ఒక రాగి ముక్కకు పట్టించిన (పూయటం) ఆ రాగి బంగారంలో ధగ ధగా మెరిసి పోతూ............ చూచువారికి దిగ్బ్రాంతిని కలిగిస్తుంది.

నిమిషములో పాలు పెరుగుగా మారుట

ప్రేక్షకులను పాలు తెమ్మని చెప్పి - నా మహిమతో ఈ పాలను వెంటనే పెరుగుగా చేస్తానని; తను ముందుగా సిద్దం చేసుకొన్న పెన్నేరు గడ్డ పొడిని కొంచెం వేసి బాగా తిప్పగానే అపాలు చిక్కగా గడ్డ కడతాయి. అప్పుడు దానిలో లక్టిక్ యాసిడ్ ఒక చుక్క వేస్తే చక్కని గడ్డ పెరుగు తయారవుతుంది.

శరీరం అగ్ని జ్వాలల్లో కాలదు

ఉప్పి చెట్ల మధ్యలో వున్న పుట్ట మట్టి, ఉరుములు - మెరుపుల కాలంలో పుట్టుకొచ్చే పుట్టగొడుగులు (పుట్ట కొక్కులు) కలిసి ఒక క్రొత్త కుండలో వేసి గట్టిగా మూత పెట్టి వుంచాలి. కొంత కాలానికి ఒక విధమైన తైలము వాటి నుండి వస్తుంది. దాన్ని ఒక సీఆలో భద్ర పరచి ప్రదర్శన సమయంలో ఒంటికి పూసుకొని, మంటలో ప్రవేశించినా శరీరం కాలదు. ఇది చూసిన వారు చాల ఆశ్చర్య పడతారు.

బాధాకరమైన పంటి నొప్పి చిటికెలో మాయం

తగినన్ని మోదుగు మాడలు తెచ్చి బాగా ఎండబెట్టి ఇనుప మూకుడులో (బాండీలో) వేసి బాగా వేయించి, మెత్తగా చూర్ణం చేసి, పలుచని గుడ్డలో వేసి గాలించిన పౌడర్ ను ప్రదర్శన సమయంలో మహిమ గల్గిన విభూతిగా చెప్పి, చిటికెడు పౌడర్ పంటి నొప్పి వున్న చిగురుకు పట్టించిన, క్షణంలో నొప్పి మాయమవుతుంది. ఈ పొడి నాలుక మీద వేసిన చురుక్కుమని మంట పుట్టును.

ఎంతమంటతో కాల్చినా కాగితం కాలదు

న్యూస్ ప్రింట్ కాగితం లేక బ్లాటింగ్ పేపరును సేకరించాలి. పటికను పొడిగొట్టి, నీటిలో చిక్కగా కలిపి ఆ కాగితాన్ని తడిపి (5 - 20 సార్లు) ఎండబెట్టి దగ్గర వుంచుకోవాలి. ప్రేక్షకులెవరినయినా పిలిచి ఆకాగితాన్ని తగల పెట్టమని చెప్పాలి. వారు ఆ కాగితాన్ని ఎంత కాల్చినా మండదు. ఈ ప్రదర్శన చాల అద్బుతంగా వుంటుంది.

పాలు - పంచదార - టీపొడి లేకుండా టీ

బాగా కండ కలిగిన మంచి ఉసిరికాయలు - ఆవుపాలు లేక గేదె పాలు లో వేసి బాగా ఉడికించాలి. ఆ తరువాత ఎండ బెట్టి మెత్తగా చూర్ణం చేసి దానిలో టీ పొడి, సువాసనకు ఏలకుల పొడి వేసి మరలా బాగా నూరి పొడిచేసి కొంచెం చాక్రెన్ గాని, గ్లూకోజ్ గని కలిపి వుంచుకొని - ప్రదర్శన సమయంలో స్టౌ మీద వేడి నీళ్ళు మరగించి - దానిలో ఈ పొడిని (మంత్ర భస్మంగా భ్రమింపజేసి) వేసిన చక్కిని టీ తయారవుతుంది. ఇది చూచు వారికి చాల విచిత్రంగా వుంటుంది.

నాణెమునకు చుట్టిన దారము ఎంత మంట పెట్టినా కాలదు

నాణెమునకు దారం గట్టిగా కట్టి వ్రేలాడదీయాలి. తరువాత ప్రేక్షకులను పిలిచి నా మంత్ర మహిమతో - మీరు నాణెమును కాల్చినా వ్రేలాడే దారం తప్ప నాణెమునకు చుట్టూ ఉన్న దారము మాత్రము కాలదు." అని చెప్పాలి. వారు వ్రేలాడే దారానికి తగలకుండా నాణెము చుట్టూ ఉన్న దారాన్ని 20 - 30 అగ్గి పుల్లలతో కాల్చినా ఆ దారం కలదు. ఈ ప్రక్రియ చాల వింతగా వుంటుందు.

చిటికెలో సంకెళ్ళు ఊడిపోవుట

ప్రదర్శకుడు, ప్రేక్షకులతో - మీలో ఎవరయినా సరే ఎంత బలమయిన సంకెళ్ళు నాకు వేసినా క్షణంలో వాటిని విడిపించు కొంటానని చెప్పాలి. వారు ఎటువంటి సంకెళ్ళు వేసినా క్షణంలో ఊడదీసుకొని అందరిని ఆశ్చర్య పరచ వచ్చు.

ఈ ప్రదర్శనకు ముందుగా పెద్దమందాకు పాలు, జువ్వి పాలు, జెముడు పాలు, మర్రి పాలు, జిల్లేడు పాలు, మేడి పాలు సమపాళ్ళలో తెచ్చి, అన్ని కలిపి ఒక తెల్లని గుడ్డ (జేబు రుమాలు) - ఆ పాలలో ముంచి, ఆర బెట్టి, ముంచి ఆరబెట్టి - ఇలా 5 - 6 సార్లు చేసి - ఆ గుడ్డను జాగ్రత్త చేసుకొని ప్రదర్శన సమయంలో దానిని మంత్రించి ( అలా నటించి), సంకెళ్ళు తొడిగిన చేతి పైన వేసినచో సంకెళ్ళు వెంటనే వూడిపోతాయి.

(ప్రస్తుత కాలంలో ఇది చాల కష్ణ సాధ్యం)

నీళ్ళతో నెయ్యి తయార్


ప్రదర్శకుడు సభికులతో - నెయ్యి ఈ రోజులలో కిలో 80 రూపాయల దాకా వుంది. నేను నీటితో నెయ్యి చౌకగా తయారు చేస్తానని చెప్పి - తన వద్ద సిద్ధంగా వుంచుకొన్న సబ్జాగింజల పొడిని తగు మాత్రం నీటిలో వేసి బాగా త్రిప్పాలి. వెంటనే నెయ్యి (నెయ్యిలా వుండే పదార్థము) తయారయి చూచు వారికి చాల సంతోషం కలుగుతుంది.

మటుమాయం - క్షణాలలో చెవుడు!

ప్రదర్శకుడు ప్రేక్షకులతో - మీలో ఎవరయినా వినిపించని వారుంటే వారికి క్షణాలలో చెవుడు పోగొడతానని చెప్పి, తన దగ్గర సిద్దంగా వుంచుకొన్న నూనెను మంత్రించి(అట్లు నటించి) చెవిలో వేసినచో చెవుడు తగ్గిపోయి - వారు పరమానందం పొందుతారు.

ప్రదర్శకుడు ముందుగా ఏడాకుల పొన్న (బూరుగు చెట్టు ఆకులా వుంటుంది) అకులను - కాటన్ ఆయిల్ (ప్రత్తి గింజల నూనె)ల్లో, వేసి, బాగా కాచి ఆరిన తరువాత పలుచని తెల్ల గుడ్డలో, వడగట్టి, ఆ నూనెను సీసాలో జాగ్రత్తగా దాచి ప్రదర్శన సమయంలో వినియోగించ వలెను.

అగ్గిపెట్టె తనంతట తానే మండిపోవుట

నా మంత్ర బలముతో అగ్గి పెట్టె - పుల్లలు వాటి అంతట అవే కాలిపోయేటట్లు చేస్తాను. మీలో ఒకరు అగ్గిపెట్టె ఇవ్వవలెను. అని చెప్పి అగ్గి పెట్టె తెచ్చిన తరువాత తన దగ్గర సిద్ధంగా వున్న సల్పూరిక్ యాసిడ్ ను మంత్రించిన నీరుగా భ్రమింప జేసి, చేతితో తాక కుండా ఆ యాసిడ్ ను అగ్గి పుల్లల మందుపైన వేయగానే అది భగ్గున మండి పోయి - చూచు వారికి ఎంతో ఉల్లాసాన్ని కలిగించును.

బొమ్మ కప్పకు ప్రాణప్రతిష్ట

ప్రదర్శకుడు-- తనవద్ద సిద్ధముగా వుంచికొన్న కప్పబొమ్మనుచూపి, "దీనికి నా మంత్ర బలముతో ప్రాణం పోస్తాను " చూడమని చెప్పి కొంచెం సేపు ధ్యానించి [అలా నటించి ] ఆ బొమ్మను తీసుకొని, సాంబ్రాణి ధూపం వేసి, బొమ్మను క్రింద పెట్టగానే దానికి ప్రాణం వచ్చి ఎగిరెగిరి పడుతుంది. ఈ వింత చూచిన ప్రేక్షకులు ఎంతో ఉద్వేగం చెంచుతారు.

ఈ ప్రదర్సనికి ముందుగా - చిన్న ఇనుప గోలి గాని, పెట్టె లాంటిది గాని [తాయెత్తు అయినా పరవాలేదు] తీసుకొని దానిని పాదరసంతో నింపి- మైనంతోగాని, లక్కతో గాని మూతిమూసివేసి దానిని బొమ్మ కప్పకు క్రింద భాగంలో దారంతో కనిపించకుండా కట్టాలి [మైనంతో గాని, లక్కతో గాని, అంటించవచ్చు] ధూపం వేసేటప్పుడు బాగా వేడి తగిలేటట్లుగా - కాసేపు వుంచి క్రింద, పెడితే - లోపలి పాదరసం వేడికి వ్యాకోచించి కదులుతుంది. ఆ కదిలే సమయంలో కప్ప కూడ ఎగెరెగిరి పడుతుంది. అది వేడి వున్నంత వరకే ఇలా ఎగురుతుంది.

ఈగలు పారిపోవుట

ఈగలు మెండుగా వుండే [జూన్, జూలై] సమయాల్లో మాత్రమే ఈ ప్రదర్శన బాగా రక్తి కడుతుంది. ఈగలను చూచి ప్రదర్శకుడు చిరాకుతో ఈ మహా మాంత్రికుడంటే ఈగలకు సరిగా తెలియదు. చూడు మిమ్ములను ఏం చేస్తానో అని తన దగ్గర అంతకుముందే సిద్ధంగా వున్న తాళకము యొక్క పొడిని [సాంబ్రాణిలో కలిపి వుంచుకోవాలి] నిప్పుల పై విసరికొట్టి మంత్ర ధ్యానం (నటన)లో మునిగి పోవాలి. అలా కొంచెం సేపు వుండి కనులు తెరిచి, చూసే సరికి ఒక్క ఈగకూడ లేకుండా పోతుంది. అది చూచిన వారు ఇతని శక్తికి చాల ఆశ్చర్య పడతారు.

ఊస్తే ఉమ్ము - మంటలు భగ్గున!

ప్రదర్శకుడు సభికులతో నేను గొప్ప మహిమాన్వితుడను. ఎంత గొప్ప వాడినంటే నేను ఉమ్మి ఊసినా సరే భగ్గున మంటలు పుడతాయి. చూడండి నా మహా శక్తి అని చెప్పి గడ్డిమీదో లేక కర్పూరము మీదో, గుడ్డ మీదో సమయానుకూలంగా ఊసిన వెంటనే - ఉమ్మిపడిన ప్రాంతంలో ఉన్న పదార్థాలు భగ్గున మండి పోతాయి. ఈ ప్రదర్శన తిలకించిన వారు ఊపిరి సలపనంత ఆశ్చర్యం పొందుతారు.

ఈ ప్రదర్శనకు ముందుగా ఇంద్ర జాలికుడు - గౌఠీపాషాణము (వైట్ ఫాస్పరస్) ను ఆవగింజ పరిమాణం పుల్లతో తీసుకొని, నాలిక క్రింద గాని, దవడ ప్రక్క గానీ పెట్టుకొని, సమయం వచ్చినప్పుడు ఉమ్మితో పాటు దానిని కూడ లక్ష్యము పైన ఊయ వలెను. తడి ఆరిన వెంటనే అది మండి పోయి ప్రక్క పదార్థములను కూడ మండిస్తుంది. ఈ వైట్ ఫాస్పరస్ ను ఎప్పుడూ నీళ్ళలోనే వుంచాలి. బయటకు తీయగానే ఆరిపోయి తనంతట తానే మండి పోయే గుణముగల దీనిని తెల్ల భాస్వరమని చాల మంది అంటారు.

గాఢ నిద్ర కల్పించుట

ఇంతకు ముందు నిత్ర పుచ్చుట (సుఖ నిద్ర) గురించి చెప్పుకున్నాము. ఇది అమితమైన గాఢ నిద్రను కలిగించే ప్రక్రియ. ముందుగా గసగసాలను వేగీ వేగకుండా, కచ్చాపచ్చిగా వేయించిన తరువాత గుడ్డలో వేసి, మూటగట్టుకొని వుంచాలి. సమయానుకూలమైన మాటలు చెపుతూ ఆ మూటను నిద్ర కావలసిన వారికి - బాగా (5 - 6 సార్లు) వాసన చూపాలి. ఇలా వాసన చూసిన వారు 10 - 15 నిముషాల్లో బ్రహ్మాండమయిన గాఢ నిద్రను పొందుతారు.

నీళ్ళతో దీపాన్ని వెలిగించుట

ప్రదర్శకుడు తన పవిత్రమయిన మంత్ర శక్తితో నీళ్ళతో గూడా దీపాన్ని వెలిగిస్తానని చెప్పి, తన దగ్గర సిద్దంగా వున్న వత్తిని - నీళ్ళతో నింపిన ప్రమిదలో వేసి, వెలిగించగానే అద్భుతంగా ఆ దీపం వెలుగుతుంది. చూచు వారికి ఇది ఎంతో వింతగా వుంటుంది.

ముందుగా వజ్రదుగ్ధంతోనూ, నూనె తోనూ దూదిని బాగా తడిపి, వత్తులు చేసుకొని, ఆరబెట్టి, జాగ్రత్త చేసుకొని, ప్రదర్శన సమయంలో - వీటిని ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి.

బూడిద వూస్తే సెంట్ గా మారుట

సభికులతో సందర్భానుసారంగా మాట్లాడుతూ - మీకు సెంటు వాసనతో కూడిన బూడిదను ఇస్తానని చెప్పి - వారినే ఏదయినా కాగితంగాని, గుడ్డ గాని ఇవ్వమని అడిగి తీసుకొని తను స్టేజిమీద గుర్తుగా వుంచుకొన్న ప్రదేశంలో వారిచ్చిన కాగితాన్ని కాల్చి, ఆ బూడిదను వారికి పంచిన - ఆ బూడిదకు సెంటు వాసన వచ్చి వారికి మితి మీరిన ఆనందం కలిగి ఉత్తేజ పడతారు.

1) ప్రదర్శించు వారు ముందుగా స్టేజిమీద తనకు అనుకూలమయిన ప్రదేశములో సెంటును పోసి ఆ ప్రదేశంలో వారిచ్చిన కాగితాన్ని కాల్చాలి.

2)లేదా- కాళీ మందు గొట్టాము (ఎమ్టి మెడిసన్ క్యాప్సూల్) లోపల సెంటును నింపి - ప్రదర్శన సమయములో (కాగితాన్ని కాల్చునపుడు ఆ మంటలో చాక చక్యంగా ఆ గొట్టాన్ని వెయ్యవలెను) దాన్ని వినియోగించాలి.

నీటిలో పన్నీటి ఘుమ ఘుమలు

ప్రదర్శకుడు తనను చూచు వారితో - తన దివ్యమయిన మంత్ర మహిమతో నీళ్ళను కూడ పన్నీరుగా మారుస్తానని చెప్పి - మంత్రించిన (అలా నటించి) విభూతిని తీసి - పాత్రలో వున్న నీటిలో (పాత్రలో వున్న నీళ్ళను ప్రేక్షకుల చేతనే తెప్పించడము మంచిది. అలాగయిన వారికి అనుమానము రాదు) వేసి కలియ బెట్టాలి. (కలియ బెట్టడం - ఎంతో చాక చక్యముగా అనుమానము రాకుండా - జాగ్రత్త గా కలపాలి) ఇక ఆనీరు పన్నీటి వాసనలతో విరాజిల్లి చూచు వారు చాల ముచ్చట పడతారు. ప్రదర్శకుడు ముందుగా ఆ విభూతిలో రోజ్ ఎస్సెన్స్ కలిపి జాగ్రత్తగా వుంచుకొని - ప్రదర్శనా సమయములో ఆ బూడిదను వాడాలి.

మంత్రానికి అరటిపండ్లు

ప్రదర్శకుడు తన మంత్ర మహిమచే అరటి పళ్ళను సృజించి ఇస్తానని చెప్పి నేల మీద (స్టేజీ పయిన) ఒక గుడ్డ పరచి, ఆ గుడ్డ మీద తను సిద్ధంగా వుంచుకొన్న బుట్ట (వెదురు గంప) ను బోర్లించి - ఆ బుట్టను పూర్తిగా గుడ్డతో (లేక దుప్పటి, బట్ట నలుపు రంగుది వాడటం మంచిది) కప్పాలి. ఆ తదుపరి మంత్రాలు చదువుతూ (అలా నటించి ) కొంచె సేపు వుండి, గంప పైన కప్పిన పస్త్రమును తొలగించి, గంఫ లేపి పక్కన పెట్టగానే క్రింద పరచిన వస్త్రంమీదకొన్ని అరటికాయలు కనిపించి చూచు వారికి అద్భుతంగా వుంటుంది.

ఈ ప్రదర్శన ఎక్కువ భాగం వాక్ చాతుర్యంమీద హస్తవాఘవం మీద ఆధారపడి వుంటుంది. ముందుగా కొన్ని అరటి పళ్ళకు సన్నని దారములు (తేలికగా తెగేవి) కట్టి, గంపకు లోపల వుండే అడుగు భాగంలో కట్టి, సిద్ధంగా వుంచుకోవాలి. గంప స్టేజి మీద వుండు నప్పుడు, గంపను తీసుకొని వస్త్రం పైన బోర్లించే సమయంలో గంప లోపలి భాగం ప్రేక్షకులకు ఎట్టి పరిస్థితులలోను కనిపించ కుండా జాగ్రత్త పడాలి. తరువాత ప్రదర్శన చేసేటప్పుడు - బోర్లించె సమయంలోనో, వస్త్రం కప్పే సమయంలోనో, వస్త్రం తీసే సంద ర్భంలోనో అరటి కాయలకు కట్టిన దారాలను మెళూకువగా త్రెంచి వేస్తే ..... అవి తెగి క్రింద బట్టమీద పడతాయి. ఇంకా తేలికగా ఈ అరటి కాయలకు కట్టిన దారలను త్రెంచ వలెనంటే సుమారు పది అరటికాయలను కట్టామనుకుంటే - గంప బోర్లించే టప్పుడు 1 - 2 దారాలను, వస్త్రం కప్పేటప్పుడు 1 - 2 దారాలను ఇలా అంచెలంచెలుగా కూడ త్రెంచుతూ జాగ్రత్తగా ఈ ప్రదర్శన ఇవ్వవచ్చును.

ఇసుకతో పసందైన హల్వా

తన మహిమతో ఇసుకను హల్వాగా మారుస్తానని చెప్పి, ఒక చిన్న గిన్నెలో ఇసుకను పోసి, దానిని పరీక్ష నిమిత్తం, తన అసిస్టెంట్ ద్వారా సభికులకు చూపి, వారి దానిని 'ఇసుకే అని చెప్పిన తరువాత తిరిగి గిన్నె తీసుకొని - దానిలో ఉడుకు నీరు పోసి కలియ బెట్టగానే అది అద్భుతంగా హల్వాలాగా మారిపోయి, చూచువారికి దిగ్భ్రమ కలుగుతుంది.

ఈ ప్రదర్శన చేసే ముందు మూడు వంతులు కండ చెక్కెర, బాదంపప్పు (బాదం మసికి) నాలుగున్నర వంతుల కేసరి (కుంకుమ పువ్వు) తగినంత (అంటే కండ చెక్కెర, బాదం కలిపి కిలో (1000. గ్రా) వుంటే కేసరి 50 గ్రాములు వుండాలి) రోటిలో వేసి దంచాలి. ఇలా దంచిన అతరువాత ఆ పొడుము అచ్చం ఇసుకలాగా (గోధుమ రవ్వలాగా) వుంటుంది. దీనిలో వేడి నీరు పోయగానే హల్వా తయారవుతుంది. అయితే ప్రదర్శకుడు రెండూ ఒకే రకం గిన్నెలు తీసు కొని ఒక గిన్నెలో పైవిధంగా తయారయిన మిశ్రమం రెండో గిన్నెలో మాములు ఇసుక పోసి ఉంచాలి. సభికులకు చూపించే టప్పుడు మాతరం ఇసుక పోసిన గిన్నెను చూపి, వేడి నీరు పోసేటప్పుడు (గిన్నెలను ప్రదర్శకుని అసిస్టెంట్ గాని, ప్రదర్శకుడు గాని చాక చక్యముగా మార్చ వలసి వుంటుంది) మాత్రం మిశ్రమం పోసిన గిన్నెను వాడాలి.

వేడినూనెలో ఉడికించినా చచ్చిపోని పిచ్చుక

విచిత్రమైన ఈ ప్రదర్శనకు ముందుగా ప్రదర్శకుడు ఒక ఆరోగ్య కరమైన ఊర పిచ్చుకను పట్టుకొని (దానికి రెక్కలు, ఈకలు అన్నీ కూడా రాలిపోనివి అయివుండాలి). దానికి కడుపు నిండా ఆహారం పెట్టి, నీళ్ళు త్రాగించిన తరువాత 10 నిముషాలు ఆగి, దాని ఒళ్ళంతా వైన్ (సారాయి) లో ముంచి దట్టంగా పట్టించాలి. తదుపరి గోధుమ రొట్టెలు పలుచనివి రెంటిని తయారు చేయాలి. ఆ రెండు రొట్టెల మధ్య వైన్ తో తడిపిన పిచ్చుకను పెట్టి జాగ్రత్తగా (కజ్జికాయ మధ్య కొబ్బరి., సెనగ పప్పు మొదలగు వాటితో తొక్కిన ముద్ద పెట్టి మూసే విధంగా రొట్టెల చివరలను మడవాలి. వెంటనే అంతకు ముందే సిద్ధంగా వుంచుకొన్న పొయ్యిమీద భాండీలో వేడిగా కాగి వున్న నూనెలో వేసి, రెండు సార్లు అటు ఇటూ పొర్లించిన వెంటనే తీసి, త్వరగా ఆ రొట్టెలను విడదీయాలి. అప్పుడు అందులో వున్న పిచ్చుక రొట్టెలు విడదీసిన వెంటనే ఎగిరి పోతుంది. ఈ కార్య క్రమాలన్నీ రొట్టెల మధ్యన పిచ్చుకను బంధించిన తరువాత ఆలస్యము జరిగితే పిచ్చుక ప్రాణానికి హాని కలుగుతుంది. రొట్టెలు తయారు చేసేటపుడే పొయ్యిమీద సన్నని సెగతో నూనె వేడి చేస్తూ వుండాలి. ఇంకొక విషయం రొట్టెలు తయారు చేసిన తరువాత మాత్రమే పిచ్చుకను వైన్ లో ముంచాలి.

చీకట్లో భగవాన్

ప్రదర్శకుడు ప్రేక్షకులతో దేవుడ్ని నేను చూడాలనుకుంటే చూడగలను. మీకు చూపాలనుకుంటే చూపగలను. మీకు ఇప్పుడు నా ఇష్టదైవాన్ని చూపుతాను. అని చెప్పి ముందుగా ఏర్పాటు చేసుకొన్న గదిలోకి వారిని తీసుకెళ్ళి తలుపులు, కిటికీలు మూసి వేసి కొంచెం సేపు ధ్యానం చేసి తన అసిస్టెంట్ తో లైట్లన్నీ తీసి వేయించగానే గోడ మీద ఆశ్చర్యకరంగా భగవంతుడు దర్శనం ఇస్తాడు. మరల లైట్లు వేయగానే భగవంతుడు అదృశ్యమవుతాడు.

ఈ ప్రదర్శనకు ముందుగా రేడియం ఫిష్ (చీకటిలో మెరిసే చేప) అనే చేపల యొక్క పొట్టు (పొలుసు ) ను తెచ్చి (పచ్చిగానే వుండాలి. తడి ఆరగూడదు) మెత్తగా నూరుతూ "ఈథర్ అనే ద్రావకాన్ని పోయాలి. ఆ తరువాత దాన్ని మంచి గాజు సీసాలో పోసుకొని భద్ర పరచుకోవాలి. సమయం వచ్చి నప్పుడు ఈ మిశ్రమ పదార్థంతో మనకు ఇష్టమైన బొమ్మను గోడ మీద వేసుకోవాలి. బొమ్మ వేసేటప్పుడు కూడ చీకటిలోనే వేయాలి. లేకపోతే ఈ ద్రవం గోడ మీద వేసే టప్పుడు ఎక్కడ వేస్తున్నామో వెలుగురు వలన తెలియదు. ముఖ్యంగా గది - పగలు కూడ కిటికీలు, తేలుపులు మూసి వేస్తే బాగా చీకటిగా వుండే గదై వుండాలి.

పాము తలమీద కప్ప

ప్రదర్శనకు బజారులో అమ్మే ప్లాస్టిక్ పాము ఒకటి, ప్లాస్తిక్ కప్ప ఒకటి తీసుకోవాలి. పాము తలపై భాగంలో నేర్పుగా కోసి శక్తి వంతమైన అయస్కాంతాన్ని అంటించాలి. అలాగే కప్ప అడుగు భాగంలో కూడ మాగ్నెట్ (అయస్కాంతం) ను అంటించాలి. అవి ఆకర్షించుకొనే పరిధిని ముందుగానే పరీక్ష చేసుకొని చూడాలి. పాము, కప్పకంటే బరువు వుండేదిగా ముందే చూసుకోవాలి. అలాగయితేనే కప్ప వెళ్ళి పాము తలమీద కూర్చొన గలగుతుంది. రెండూ సమానమయిన బరువయినచో - పాముకి పెట్టిన అయస్కాంతము బరువుగా వుండాలి. లేక పోతే రెండు కదలి ముందుకు వచ్చిన తరువాత మాత్రమే కప్ప, పాము తలమీద కూర్చుంటుంది. ఈ ప్రదర్శన కొద్ది మార్పులతో కప్పను మ్రింగే పాముగా కూడ మార్చు కోవచ్చును. ఎలాగంటే నోరు పెద్దగా తెరుచుకొని వున్న పాము (పాము తోలుతో) ను తయారు చేసుకొని కప్పను పాము కంటే బరువుగా వుండేటట్లు చూసుకొంటే - పామే కప్ప దగ్గరకు ప్రాకుతూ వచ్చి; దాన్ని నోట కరుచుకుంటుంది. అయితే కప్ప బొమ్మ మాత్రం పాము నోటిలో పట్టేటట్లుగా వుండాలి.

గాజు పెంకులను నోటితో నములుట

ప్రదర్శకుడు సభికులతో - నేను గాజు పెంకులను నోటితో నమిలి పిండి పిండి చేస్తానని చెప్పి తను సిద్ధంగా వుంచుకొన్న గాజు పెంకులను, పరీక్ష నిమిత్తముగా ప్రేక్షకులకు చూపి - వాటిని నోటిలో వేసుకొని, కసా బిసా పిండి పిండిగా నమిలి వేయాలి. తరువాత దానిని నోటిలో నుండి బయటకు తీసి ప్రేక్షకులకు చూపి - ఈ విచిత్ర మయిన శక్తిని చూచువారు అమితాశ్చర్యాన్ని పొందుటయే గాక, ఆనంద పడగలరు.

ఈ ప్రదర్శనకు ముందుగా - అక్కలకర్ర అనే మూలికను దెచ్చి, దాన్ని బాగా మెత్తగా నలగ గొట్టి, రసాన్ని పిండి, ఆ రసాన్ని - తాను నమలబోయే గాజు పెంకులకు దట్టముగా పట్టించి , ఆరబెట్టి జాగ్రత్త చేసుకోవాలి. గాజు పెంకులను నమలబోయే ముందు కూడ అక్కలకర్ర వేరును నోటిలో వేసుకొని, బాగా మెత్తగా నమిలి - నోటిలోలోపలి భాగమంతా (నోరంతా) మందంగా పట్టించాలి. ఇలా చేస్తే గాజు పెంకులు నోటిలో వేసుకొని నమిలినా - మన కెలాంటి బాధావుండడు.

సన్నమూతిగల సీసాలో కోడి గ్రుడ్లు

ఎంత సన్నటి మూతి గల సీసాలో అయినా కోడి గ్రుడ్డు (ఏ జాతి పక్షి గ్రుడ్డయినా పర్వాలేదు) పట్టు విధానం ఏమి టంటే? ముందుగా కొన్ని గ్రుడ్లు తెచ్చి - ద్రాక్షా సారాయి నందు [సెనగపులుసు అయిన పరవలేదు] వేసి. పది పదిహేను రోజులు నానబెట్టాలి. అప్పుడు గ్రుడ్డు పై భాగంలో - వుండే పెంకు మెత్తబడి [తోలు గ్రుడ్డులా] పొతుంది. అలా మెత్తబడిన వాటిని దీసి -సీసాలోనికి మెల్లగా నెట్టాలి. ఆ తర్వాత చల్లని నీరు పొసిన వెంటనే మెత్తబడిన గ్రుడ్ల పై పెంకు గట్టిపడిపోతుంది. చూచేవారికి ఆ గ్రుడ్డ్లు సీసాలోకి ఎలా వెళ్ళాయో అర్ధంగాక - ఆలోచించినా, ఆ ఆలోచనకు అందక ఆశ్చర్యపోతారు.

కోడిగ్రుడ్డు భయంకర శబ్దం చేస్తూ నీటిలో ఈదుట

ప్రదర్శకుడు ముందుగా ఒక కోడిగ్రుడ్డును(పక్షిజాతి గ్రుడ్డు ఏదయినా పర్వాలేదు) తీసుకొని చిన్న బెజ్జంవేసి-దానిలోపల వుండే పదార్థం (పచ్చసొన, తెల్లసొన) మొత్తం తీసివేయాలి. తరువాత దాన్ని ఎండలో - తడి లేకుండా బాగా ఆరబెట్టాలి. ఆ తరువాత రాళ్ళ సున్నము, గంధకము తెచ్చి విడివిడిగా మెత్తని పౌడర్ లాగ నూరాలి. గంధకము, సున్నములను సమపాళ్ళలో కలిపి, ఆ పౌడరును ఎండబెట్టిన అండం బెజ్జంలో నుండి జాగ్రత్తగా గ్రుడ్డు పగలకుండా కూర్చి, తరువాత ఆ బెజ్జాన్ని తెల్లని కాగితంతో కనిపించని విధంగా అంటించాలి. చూచు వారికి అనుమానం రాకుండా అంటించిన గాగితం కొసలకు మైనం రాసి నునుపుగా రుద్దాలి. ఆతరువాత అప్రదర్శన సమయములో ఈ గ్రుడ్డును నీటిలో వేసిన - తుపాకి గొట్టంనుండి గుండు బయటకు వచ్చే శబ్దాన్ని కలిగిస్తూ స్టీం బోట్ లా నీటిలో ప్రయాణిస్తుంది. అద్భుతమయిన ఈ ప్రక్రియ చూపరులకు ఎంతో ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని కలిగించును.

ప్రయాణించే దివ్య దీపం

ప్రదర్శకుడు ముందుగా టేకు చెక్కతో తయారు చేసిన నునుపయిన (బాగా పాలీష్ చేసినది) పీటగాని, బల్ల గాని తీసుకు రావాలి. తరువాత మైనం కరగించి.. ఆ చెక్క మీద పోసి ఇంకా బాగా నున్నగా వచ్చేటట్లు పరిశుభ్రంగా తుడవాలి. ఆ చెక్క ఒక వైపు కొంచెం పల్లంగా (చాలా స్వల్పంగా) ఉండేటట్లు చేసుకోవాలి. ఆ తరువాత ఓక రాగి నాణెమును పరిశుభ్రంగా (చిలుము లేకుండా ) మెరసి పోయేటట్లుగా తోమి వుంచుకోవాలి.

ప్రదర్శన సమయములో సిద్ధంగా వుంచుకొన్న పైన చెప్పిన పీటమీద (ఎత్తువున్న వైపు) ఈ రాగి నాణాన్ని పెట్టి దానిమీద చిన్న కర్పూరపు గడ్డ పెట్టి వెలిగిస్తే - ఆ రాగి నాణెం ఒకరి ప్రమేయం లేకుండా తనంతట తానే మెల్లగా పల్లం వైపుకు ప్రయాణం చేస్తుంది. ఇది చూచు వారికి - చాల విచిత్రంగా వుంటుంది.

కర్పూర దీపాల దివ్యసంగమం

ఈ ప్రదర్శన - పైన చెప్పిన (ప్రయాణించే దివ్య దీపం) దానిలి చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. పీటకు ఆ చివరా, ఈ చివరా [బయట వైపులు] ఎత్తుగా వుంచి పీట మధ్య భాగంలోకి రెండు వైపుల నుండి క్రమేపి ఏట వాలుగా [కనిపించనంత తక్కువగా] వచ్చేటట్లు చేయించు కోవాలి. పైన చెప్పిన విధంగా ఒకటి కాకుండా - రెండు రాగి నాణాలను శుభ్రపరచి - పీటకు ఆచివరా ఈ చివరా పెట్టి వాటిమీద కర్పూరం వెలిగిస్తే - అటునుండి ఆ దీపం, ఇటు నుండి ఈ దీపం ప్రయాణించి - పీట మధ్యలోకి వచ్చి ఒకటిగా కలసి [సంగమించి] పోతాయి. ఇది చూడటానికి చాల ఇంపుగా వుంటుంది.

ఈ విధంగానే నాలుగు దీపాలు సంగమిస్తున్నట్లుగా కూడ చేయ వచ్చు. ఆ విధానం ఈ పాటికే మీకు అర్థ అయివుంటుంది కదూ.

ఆకు దొన్నెలో నీళ్ళు కాచుట

ఒక అరటి (ఏ చెట్టు ఆకు అయినా పరవాలేదు. ఉదా: బాదం, తామర, మఱ్ఱి మొదలగునవి] ఆకును తెచ్చి దానికి రెండు వైపులా కప్ప కొవ్వును బాగా పట్టించి ఆర బెట్టి వుంచుకోవాలి. ప్రదర్శించే సమయంలో ప్రేక్షకుల ముందే ఆకును, దొన్నెగా కుట్టాలి. ఆ దొన్నెలో నీరు పోసిన తరువాత దొన్నె పై భాగమందా స్పిరిట్ ను బాగా పట్టించి అగ్గి పుల్ల గీయగానే దొన్నె భగ్గున మండి పోతుంది. కాని ఆకు దొన్నె కాలదు. నీరు వేడిగా వుంటుంది.

నెత్తిమీద పొయ్యి పెట్టి నీరు కాచుట

ఈ ప్రదర్సనను చాలా జాగ్రతగా చేయవలెను. ముందుగా తములపాకులు, ఏనుగు మలము (విసర్జనము), రాతిసున్నము కలిపి వాటిని నీరు తగలకుండా మెత్తగా (మైనంలాగా) నూరి వుంచుకోవాలి. తరువాత తలమీద పెట్టే విధంగ ఒక పొయ్యి (సుమారు 5 - 6 అంగుళాల ప్రమాణంలో) చేయించాలి. పైన చెప్పిన పదార్థముతో మూడు ముద్దలను చేసి పొయ్యికి అడుగు భాగంలో మూడు పక్కలా అంటించాలి. తదుపరి ఆ పొయ్యి ఏనుగు మూత్రము తో బాగా తడిపి, ఆరబెట్టి ఎండించుకోవాలి. ఆ తరువాత సన్నని డబ్బా రేకుతో సన్నగా 'చుట్టు ' [కడవలు - కుండలు పెట్టుకొనే కుదురు] చేయించుకొని ఆ రేకు చుట్టు కనపడకుండా గుడ్డలు చుట్టాలి. కుదురుకు గుడ్డలు చుట్టే ముందు కలబంద చెట్టును తోళ్ళుతీసి, రేకు చుట్టూతా చుట్టటం మరచి పోవద్దు. పైన చెప్పినవన్నీ ముందు సిద్ధము చేసుకొన్న తర్వాతనే ఈ ప్రదర్శన చేయవలెను.

ప్రదర్శకుడు ప్రేక్షకులతో నా మహిమతో నెత్తిమీద పొయ్యి వెలిగించి నూనె గాని, నీరు గాని ఏది కావాలంటే దానిని కాచి ఇస్తాను. కాని తలకు ఎలాంటి ప్రమాదము వాటిల్లదని చెప్పి, ప్రేక్షకులలో ఎవరినైనా రమ్మని పిలిచి శిరస్సు పై సిద్ధంగా వుంచుకున్న కుదురు {చుట్టు] ను వుంచి, దాని మీద పొయ్యి [ సిద్ధంగా వుంచుకొన్న]ని పెట్టి - ఆ పొయ్యి మీద మూకుడు గాని, భాండీ (ఇనుపపాత్ర) గాని నూనె పోసి పెట్టాలి. ఆ తరువాత పొయ్యిలో చమురులో (కిరోసిన్, నువ్వులనేనె, స్పిరిట్ ఏదైనా పరవాలేదు) తడిపిన వత్తులను వేసి, అగ్గిపుల్ల గీసి, ఆ వత్తులను ముట్టించాలి. భాండీలోని నూనె ఫెళఫెళ కాగే వరకు మంట పెట్టినా తలపై పొయ్యి పెట్టిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదము కలుగదు.

కొలిమిలో ఎర్రగా కాల్చిన లోహపు వస్తువును నోటితో పట్టి లేపుట:

1 కిలో లేక 2 కిలోల లోహపు గుండును ఇనుము, రాగి, ఇత్తడి, వీటిలో ఏదైనా పరవాలేదు) కొలిమిలో బాగ ఎర్రగా కాల్ల్చి, దానిని బయటికి తీసిన తరువాత నోటితో పట్టుకొని వైకి లేపి, ప్రేక్షకులకు చూపగానే వారు అమిత ఆశ్చర్యాన్ని పొందుతారు.

కాలిన లోహమును నోటితో పైకి లేపే ముందుగా ఇంద్రజాలికుడు హరిత మండూక తైలము (పచ్చ కప్ప క్రొవ్వు)ను రెండు పెదవులకు, నోటిలోని మొత్తం భాగాలకు (నాలుక, పళ్ళు, చిగుళ్ళు మొ|| ) దట్టంగా పట్టించాలి. ఆ తరువాత కాలిన వస్తువును పళ్ళతో పట్టుకొని ఎత్తి 1 - 2 నిమిషాలలోనే వదిలి వేయాలి. అంతకన్నా ఎక్కువ కాలము వేడి వస్తువు నోటిలో వుంటే కప్ప క్రొవ్వు కరిగి, నోరు కాలే ప్రమాదమేర్పడగలదు.,

స్నానం చేస్తే వంటికి వీబూతి రేఖలు

గుంటూరుజిల్లాలో ఒక దేవీభక్తురాలిగా చెలామణి అవుతున్న అమ్మవారు స్నానంచేసి అలాగే తడిబట్టలతో వచ్చి, తన భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె శరీరంపై తడిఆరిపోగానే ఆమె వంటినిండా విభూతిరేఖలు ప్రత్యక్షమౌతవి. అక్కడ చేరిన భక్తులంతా ఆమె శక్తికి నిశ్చేష్టితులై కానుకలు సమర్పించి వెళుతుంటారు.

ఈ ప్రదర్శనలో గల అసలు రహస్యం ఏమిటంటే? స్నానానికి ముందుగానే తుత్తురుబెండసొన లేక అడవి ఆముదపుచెట్టు సొనతో శరీర భాగాలలో రేఖలు తీర్చిదిద్దాలి, ఆరిపోగానే అవి శరీరంపై కనుపించవు. స్నానం చేసిన తరువాత తడి ఆరిపోవటంతో పూర్వం దిద్దిన రేఖలన్నీ తెల్లగా మారిపోయి, చూచేవారికి విభూతి రేఖలవలె కనుపిస్తవి. ఆశ్చర్యంగా వుంటుంది.

నీళ్ళల్లో మంటలు

"పాస్పరస్"ను నీళ్ళలో కలిపి వుంచుకోవాలి. అవసరమయిన సమయంలో - ఆ నీటిని మండించవలననుకొన్నప్పుడే కొంచెం 'అప్లెయిన్‌'ను వేసినచో - పొగలు, మంటలు పుట్టి: చూచువారి కమితాశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇసుకను కసాబిసా నమిలి ఊయుట

ప్రదర్శకుడు ఇసుకను (స్వచ్చమైన రాళ్ళు, రప్పలు, మట్టి, గవ్వలులేనిది) పంచదారవలె నమలుతానని ప్రేక్ష కులతో చెప్పి, ఇసుకను గుప్పిడతో నోట్లో వేసుకొని కసా బిసా నమిలి ఊసినచో - చూచిన వారు చాలా ఆశ్చర్యం పొందుతారు.

ఈ ప్రదర్శనకు ముందుగా చేయవలసినది - గురువింద ఆకులను నోటిలో వుంచుకోవాలి. మాట్లాడునప్పుడు ఆకులను చూచువారికి కనుపించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆకులు నోటిలో వుంచుకొని ఇసుకను నమిలినచో - ఇసుకకు సహజంగా వుండే గరుకుతనము వుండదు.

గానుగ (క్రషర్) ఎంత త్రిప్పినను నూనె రాకుండ చేయుట

ఉత్తరేణి సమూలమును (వేరును) దంచి మెత్తగా పొడిచేసి - ఆ పొడిని గానుగ అడుగు భాగములో వేసి, తరువాత గానుగ ఆడించాలి. ఆ తదుపరి గానుగలో - నువ్వులు గాని, వేరుసెనగలు గాని వేసి ఎంత త్రిప్పినా నూనెరాదు. మరలా గానుగలో వేసిన ఉత్తరేణి పొడిని శుభ్రంగా కడిగేంత వరకు నూనెరానేరాదు.

నీళ్ళలో కలిపిన పసుపును నీటినుండి వేరు చేయుట

ఒక పాత్రలో నీరు తెప్పించి, ఇందులో పసుపు కలిపి చూపించి - ప్రేక్షకులకు "నా మంత్ర ప్రభావముతో మరలా పసుపును బయటికి తీస్తానని" చెప్పి, విభూతిని మంత్రించి (అట్లు నటించి) ఆ నీటిలో వేయగానే - పసుపు ముద్దగా నీటిలో తేలియాడును. ఈ ప్రక్రియ చూపుటకు ముందుగా ఇంద్రజాలికుడు "నీరుగొల్చి" అనే చెట్టుయొక్క విత్తనములను తెచ్చి - బాగా ఎండించి, మెత్తగా పొడిగొట్టి, ఆ పొడిని ఈ విబూదిలో కలిపి వుంచుకోవాలి. సమయం వచ్చినపుడు ఈ విబూదిలో పసుపు కలిపిన నీటిలో చల్లిన ఆ నీటనుండి పసుపు (కలిపినదంతా) - ముద్దగా వచ్చును.

పాలు కాయకుండానే నిమిషాల్లో పెరుగు తయార్

అరటి చెట్టుకు అడుగున భూమిలో వుండే దుంపనుతీసుకొని, ముక్కలుకోసి, బాగా ఎండబెట్టి, మెత్తగా పౌడర్ చేసి వుంచుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఒక గిద్దెడు పాలలో తులం పౌడర్ చల్లినచో ఆ పాలు నిమిషాలలో గడ్డపెరుగుగా మారగలదు.

ఎంతసేపు వెలిగినా ప్రమిదలో వత్తి కాలకుండా చేయుట

ప్రమిదలో వత్తి చేయుటకు ముందుగా ఆ వత్తిని మనము వరి అన్నము వండినపుడు వచ్చే గంజిలో నానవేసి తరువాత బాగా ఎండించాలి. ఆ వత్తిని ప్రమిదలో వేసి, నూనె పోసి బాగా తడిపి వెలిగించినచో నూనె ఉన్నంత వరకు వెలుగును. వత్తిమాత్రం అలాగేకాలకుండా వుంటుంది.

వేపనూనె మంచి నెయ్యిగా తయార్

ముందుగా ప్రదర్శకుడు వేపనూనెలో "సహాదేవి" ఆకు [వెన్న ముద్ద ఆకు]ను తెచ్చి పచ్చిదిగానే నూరి; తగు మాత్రం కలిపి వుంచుకోవాలి. ప్రదర్శనలో ఆ నూనె అందరకు చూపిన పొయ్యిమీదపెట్టి కాచినచో అచ్చమయిన నెయ్యిలాగా ఘుమఘుమలాడును. దీనిలి తినినచో నెయ్యివలె రుచి గలిగి వుండును.

నూనెతో పాలు తయారు చేయుట

ఇంద్రజాలికుడు ముందుగా ఉత్తరేణి వేరు (సమూలము)ను తెచ్చి - ఎండలో ఎండించిన తరువాత దానిని బూడిద అయ్యేంత వరకు బాగా కాల్చాలి. 100 గ్రాముల బూడిదలో - 200 గ్రాముల నీరుపోసి, మూడురోజులు దానిని కదలకుండా వుంచి. నాలుగోరోజు బాగా కవ్వముతో మజ్జిగలా చిలకాలి. ఆ తరువాత నాలుగు రోజులు కదపకుండా వుంచి దానిపైన తేరుకొని (తెట్టకట్టుకొని) వున్న నవనీతాన్ని జాగ్రత్తగా తీసి, ఎండపెడితే - అతి సున్నితమయిన పౌడర్ తయారవుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ పౌడర్‌ను నూనె (మంచినూనె. నువ్వులనూనె, ఆముదము ఏదైనా పరవాలేదు) లో చిటికెడు వేసి కలియబెడితే, ఆ నూనె పాలు లాగా అవుతాయి.

అగ్గిపెట్టె లేకుండా ఉప్‌మని ఊదితే మండే అగ్గిపుల్లలు

సల్ప్యూరిక్ యాసిడ్‌లో అగ్గిపుల్లలను ఒకటికి నాలుగుమార్లు ముంచితీసి ఆరబెట్టాలి. ప్రదర్శన సమయంలో ఈ అగ్గిపుల్లను తీసుకొని ఉఫ్‌మని ఊదితే మండిపోతుంది.

ఎంతగీసినా మండని అగ్గిపుల్లలు

ప్రదర్శకుడు ముందుగా సోడియం సిరికేట్‌లో అగ్గి పుల్లలను ఒకటికి నాలుగుసార్లు ముంచితీసి, ఆరబెట్టి వుంచుకోవాలి.

ప్రదర్శన సమయంలో ఈ అగ్గిపుల్లలను ఎంత గీచినా మండవు.

సిగరెట్ అంటించకుండానే పొగలు

ప్రదర్శకుడు ముందుగా ఒక గాజుగ్లాస్‌లో "హైడ్రో క్లోరిక్ యాసిడ్" రెండుచుక్కలు వేసి - ఆ గ్లాస్‌లో అంటించని సిగరెట్ (చుట్ట, బీడి అయినా పరవాలేదు) వేసి గ్లాస్ పైన పెట్టే మూతలో రెండుచుక్కలు "అమ్మోనియం"ను వేసి - గ్లాస్‌పైన బోర్లిస్తే, ఆ చుక్కలు గ్లాస్‌లో వున్న యాసిడ్‌తో సంయోగము చెంది పొగలు వస్తాయి.

ఇది ప్రదర్శించువారు సమయానుకూలముగా మాటలాడుచూ చూచువారికి అనుమానము లేకుండా చాకచక్యంగా మెలగాలి.

లెక్కచెప్పకుండా శేషసంఖ్యను చెప్పటం

ఈ ప్రదర్శన - చాలా సునాయాసముగా చేయాడానికి వీలయినది. ప్రదర్శకుడు ప్రేక్షకులలోనే ఎవరినయినా పిలిచి - అతని కిష్టమయిన సంఖ్యను కోరుకోమని చెప్పాలి.

అతను కోరుకున్న సంఖ్యను రెట్టింపు చేయమనాలి. అలా రెట్టింపు చేసిన సంఖ్యకు మరో పదహారు కలిపి కూడమనాలి అలా కూడగా వచ్చిన సంఖ్యను నాలుగు బాగాలు చేయమనాలి.

భాగించగా వచ్చిన సంఖ్యలో నుండి - మొదట అతను కోరుకున్న సంఖ్యలో సగం తీసివేయాలి.

అతను ఇదంతా చెయ్యటం పూర్తి అయిన తరువాత - ఇప్పుడు మీదగ్గర మిగిలిన శేషం 4 అని చెప్పాలి. మిగిలిన శేషం ఎటుతిరిగి నాలుగే కాబట్టి - ప్రేక్షకులు అదేదో మన ప్రతిభగా భావించి ఆశ్చర్యపడతారు.

పై విధానమున ఉదాహరణ:

అతను కోరుకున్న సంఖ్య 16
దాన్ని రెట్టింపుచేయగా 16x2 = 32
మనం కలపమన్నది కలపగా 32+16 = 48
దాన్ని భాగించగా 48÷4 = 12
అతను కోరుకున్న సంఖ్యలో సగం తీస్తే 12-8 = 4

అసలు శేషసంఖ్య చూడకుండా, చెప్పగలగటానికి కారణంం - వారు కోరుకున్న సంఖ్యకు రెట్టింపు చేసిన తరువాత మనం కలపమన్న 16 సంఖ్యలోనే వున్నది.

అదే మనం వారికి 8 కలపమంటే శేషసంఖ్య రెండు అవుతుంది. 32 కలపమంటే 8 అవుతుంది.

ప్రదర్శకుడు సమయానుకూలంగా కలపమనే సంఖ్యలను మారుస్తుంటే ప్రేక్షకులకు అసలు విషయం అర్థంగాక - అదేదో మన మహిమగా భావిస్తారు.

పీటపై నీళ్ళు కాచుట

ఒక పీటవేసి నిప్పు సహాయం లేకుండా దానిపై గిన్నెపెట్టి, గిన్నెలో నీరుపోసి వేడిచేసి, చూపించగలనని ప్రేక్షకులకు చెప్పాలి. తరువాత ఒక చిన్న జర్మన్ సిల్వర్ గిన్నెను దెచ్చి (క్రొత్తది) ఆ పీటమీద పెట్టాలి. అ తదుపరి దానిలో కొంచెం వెలితిగా నీరుపోసి అందులో పాదరసం, మైలుతుత్తం సమభాగాలుగా వెయ్యాలి. కొద్దిసేపు ప్రేక్షకుల్ని - మాటల ద్వారా ఆనందపరుస్తూ గడిపితే, సుమారు పది పదిహేను నిమిషాలలో ఆ నీరు సల సల కాగి ఆవిరి వస్తుంది. గిన్నెకూడా - వెచ్చపడుతుంది. అది చూచిన ప్రేక్షకులు ఆశ్చర్యానందంతో మునిగిపోతారు.

ప్రదర్శకుడు ముందుగా గిన్నెలోపోసేనీటిలో అంతకు ముందే - పాదరసం, మైలుతుత్తం భాగాలకు సమానముగా, ఉప్పు కలిపి వుంచుకోవాలి.

[ఇది రసవాదంలో - పాదరసాన్ని బంధించడాని కుపయోగించే ప్రక్రియ.]

క్షణంలో చెరువులో తామరపూలు

తామర గింజలను మంచివిగా ఏరితెచ్చి, వాటిని ఊడుక గింజల నూనెలో పది - పన్నెండురోజుల వరకు నాన బెట్టిన తరువాత ఎండించి భద్రపరచాలి. వినోదం చూపదలచినప్పుడు - అంతకుముందు తామర తీగెలు లేని చెరువులో ఈ విత్తులు చల్లిన యెడల 5 నిమిషాలలో తామర తీగెలు, పూలు కూడా ఆ చెరువునందు సాక్షాత్కరించి ప్రేక్షకులను విస్మయ సంధ్రమాలలో ముంచివేయగలవు.

పది నిమిషాల్లో మామిడిచెట్లు పుట్టుట

బాగా పండి రాలిన మామిడి పండ్ల నుండి - ఎంగిలి తగలకుండా టెంకలనుతీసి, వాటికి సన్నని రంధ్రములువేసి, ఊడుగ నూనెలో పది రోజుల వరకు నానబెట్టి వుంచాలి. అ తరువాత వాటిని దీసి, యెండించి, భద్రపరచి వుంచుకోవాలి. ప్రదర్శన సమయంలో ఒకచోట మెత్తనిమట్టి కుప్పగాపోసి, ఒక మామిడి టెంకను అందు బెట్టి, మట్టిబాగా తడిసేవిధంగా నీళ్ళు చల్లిన యెడల పది నిమిషాలలో మామిడిచెట్టు పూత, పిందెలతో సహా మొలుచుకు వస్తుంది. ఈ వినోదం తిలకించిన ప్రేక్షకులు ఆనంద పారవశ్యంతో మునిగి, హర్షధ్వానాలు గావించగలరు.[1]

క్షణంలో చెట్లు మొలకెత్తుట

ఏ చెట్టుయొక్క విత్తులనైనా సరే - ముందుగా ఊడుగగింజల నూనెలో కొన్ని రోజులు బాగా నానబెట్టిన తరువాత ఎండించి, భద్రపరచి వుంచుకోవాలి. ప్రదర్శన వేళలో ఏ చెట్టును మొలిపించదలచిన దాని విత్తులను మెత్తటి మట్టిలో వేడి నీళ్ళు చల్లిన యెడల కొద్ది నిమిషాలలోనే ఆ చెట్టు మొలకెత్తి ఏపుగా పెరిగి ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని గావిస్తుండగలదు.

పిండిబొమ్మ కదుల్తుంది

మంత్రగాళ్ళ టక్కరి మాయాజాలంలో ఇది ఒక భాగం. పిండితో బొమ్మనుచేసి దానికి పసుపు - కుంకుమతో అలంకారాలు చేసి - ఒక పల్చటి ఇనుప పాత్రలో పెట్టి వుంచాలి. కొంచెంసేపు (దొంగ) జపం చేసినట్టునటించి, అరచేతిని దానికి కొంచెం సమీపంలో వుంచి - "కదులు! రావే!" అంటూ చేతిని తనవైపునకు నెమ్మదిగా లాగుతూవుంటే ఆ బొమ్మకూడా పాత్రతోసహా ముందుకు నడిచివస్తుంది. అసలు కారణమేమిటంటే అధికశక్తిగల అయస్కాంతపు ఉంగరాలు ప్రదర్శకుడి చేతి వ్రేళ్ళకు వుండి, అవి బొమ్మగల ఇనుప పాత్రను ఆకర్షించటంవల్ల అలా జరుగుతుంది. కానీ చూచేవారికి విషయం తెలీక నిజంగా మంత్రంతో బొమ్మ కదిలిందని భావించి, దిగ్ర్బాంతి జెందుతారు.

శంఖంలో ఓంకార శబ్దం

సముద్రంలో దొరికే శంఖాలు వివిధ రూపాలలో లభిస్తుంటవి. దానిలో వుండే పురుగుయొక్క శరీర నిర్మాణాన్ననుసరించి శంఖంరూపురేఖలు మారుతుండగనవు. కొందరు అవివేకులు కొన్ని శంఖాలలో ఓం అనే శబ్దం వినవస్తుందని, అది ఉత్తమమైనదిగా భావించి ఎక్కువ ఖరీదుకు కొనుగోలు చేసి దాన్ని పూజ్యభావంతో చూస్తుంటారు.

ఏ శంఖానికైనా గర్బానికి సంబంధం కలిగేటట్లుగా రెండు మూడు అతిసన్నని రంధ్రాల నేర్పరచి ఆ శంఖాన్ని గాలి వాటంలో చెవి దగ్గర పెట్టుకుంటే రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన గాలి ప్రతిధ్వనించి, ఒక విధమైన శబ్దం చెవులకు సోకుతుంది. దాన్నే ప్రణవనాదం అని నమ్ముతుంటారు తెలీనివాళ్ళు. వీరి బలహీనతను గుర్తించి కొందరు శంఖాల వ్యాపారంలో అధిక లాభాలార్జిస్తున్నారు.

కొబ్బరికాయ కొడితే పరిమళాలు

బాబాలు మంత్రించి ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి పగలగొడితే పరిమళగంధాలు ఇల్లంతా వ్యాపించటం; ఇంకేముంది బాబాగారి మహాత్మ్యానికా ఇంటిలోని వారేగాక ఇరుగు పొరుగు వారు కూడా దాసోహమనటం నేటి రోజులలో పరిపాటి అయిపోయింది. ఇంద్రజాలం ప్రదర్శించే వారు కూడా ఈ ప్రయోగం చేసి చూపవచ్చు.

పీచు తీసిన కొబ్బరికాయకు పైన మూడు రంధ్రాలు పెంకుతో కప్పబడి వుంటవి. వాటిపైన పీచు మాత్రం తియ్యరు (అది దేవ రహస్యం). ఆ మూడు రంధ్రాలలోను ఏదో ఒక రంధ్రంపైన గల పొర అతి సూక్ష్మంగా వుంటుంది. దాన్ని కనిపెట్టి, సిరంజీ ద్వారా ఏ విలువైన సెంటునో దాని లోపలికి పంపించి వుంచాలి. పైన గల పీచుమాత్రం పోకూడదు. అ తరువాత ప్రేక్షకుల్ని ఒక పీచుగల కొబ్బరికాయను తెమ్మని చెప్పి, దాన్ని ప్రదర్శకుడు కొంచెంసేపు మంత్రించినట్లగా నటించి, వారికిచ్చి కొట్టమనాలి. అప్పుడక్కడే వున్న ప్రదర్శకుడి అసిస్టెంటు - పీచు తీసి ఇవ్వగలనని చెప్పి, వారి వద్దగల కాయను తీసుకొని, పీచు (లాగుచున్నట్లుగా నటించి) లాగివేసి, కాయ ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రం అంతకు పూర్వం సిద్ధంచేసి వుంచిన కాయను ఇస్తాడు. ఈలోగా ప్రేక్షకుల దృష్టిని తన మాటల ద్వారా ప్రదర్శకుడు మరల్చవలసి ఉంటుంది. ఇదంతా చెకచెకా క్షణాలమీద జరిగిపోతుంది మాటలు వినే ధ్యాసలో అసిస్టెంటు ఇచ్చిన కొబ్బరికాయ తమదని బ్రాంతినందిన ప్రేక్షకులు - ఆ కాయ పగలకొట్టి, అందలి సువాసనలకు, సుగంధాలకు ఉబ్బితబ్బిబ్బు కాగలరు. మిగిలిన ప్రేక్షకులంతా ప్రదర్శకుని వేనోళ్ళ కొనియాడకుండా వుండలేరు.

రుద్రాక్షల పై బొమ్మలు

రుద్రాక్షలనేవి ఒక చెట్టుకు కాచే కాయలు. వీటిని హిందువులంతా పరమ పవిత్రంగా భావిస్తుంటారు. వీటిలో ఏర్పడిన పలకను బట్టి ఏకముని, ద్వి ముఖి, త్రి ముఖి, పంచ ముఖి అని విభజించి, వాటి వాటికి అనేక విశేషాలు కూడా చెబుతుంటారు. ఎవరి నమ్మకం వారిది ! కాని ఈ బలహీనతను అసరాగా చేసుకొని కొందరు రుద్రాక్షల వంటి కొన్ని కాయలకు కృతిమమైన పలకలు సృష్టించి, సొమ్ముచేసు కొంటున్నారు.

ఈ రుద్రాక్షల్లో ఏకముఖి (ఒకే పలక గలది) చాలా విశేషమైనది. ఈ మధ్య ఇటువంటి రుద్రాక్షలు కోకొల్లలుగా వస్తున్నవి. విశేషమేమంటే ? వాటిపైన శివలింగం, పాము, త్రిశూలం లాంటి బొమ్మలు కూడా వుంటున్నవి. ఇలాంటి రుద్రాక్షలు ఈ మధ్య కాలంలో తప్ప పూర్వం వునట్లుగా ఆధారాలు లేవు. బాగా లావుగా వుండే అడవిరేగు గింజలను సంపాదించాలి. వాటిని నీటియందు రెండు రోజుల నానబెట్టిన తరువాత బాగా ఉడికించి [ఉడికే సమయంలో కొంచెం రెడ్ కలర్ కలపాలి]. వాటిని తీసి - తమకే విధమైన బొమ్మలు కావాలో అ విధమైన 'డై'ని తయారుచేయించి, వీటిలో ఈ గింజలు బెట్టి ప్రెస్ చేసిన తరువాత వాటిని ఎండబెట్టాలి, అప్పుడివి రుద్రాక్షలవలె యెర్రగా వుండుటమేగాక 'డై' ప్రభావం వల్ల గుబ్బలు, పలకలు, బొమ్మకూడా గలిగి వుంటవి. రుద్రాక్షకాయలు బాగా లావుగా వున్న వాటిని - పండిన తరువాత తీసుకువచ్చి, వాటిపైన వున్న పలకలు, గుబ్బలు చెక్కివేసి, మనకు కావలసిన పలకలు, గుబ్బలు గల 'డై'లో బెట్టి ప్రెస్ చేసిన తరువాత దానిని యెండబెట్టిన, అదికూడా కావలసిన రీతిలో కనుపిస్తుంది.

భూమిలో నుంచి దైవ విగ్రహం పుడుతుంది

ఈ ప్రదర్శనకు నల్లరేగడ భూములు చాలా అనుకూలంగా వుంటవి. లేక మెత్తటి మట్టి గల ప్రదేశాలుకూడా అనుకూలమే! భూమిని గజమున్నరలోతు, గజంవెడల్పువుండేటట్లుగా త్రవ్వాలి. అ తరువాత ఒకరోజు - నానబెట్టిన సెనగలు ఆ గుంటలో అర్ద గజం వరకు పోసి, ఒక పాతిక గజంమట్టి పోసిన తరువాత ఏదో ఒక దైవ విగ్రహాన్ని దానిలోబెట్టాలి. అ తరువాత మట్టిచే అ గోతినిపూడ్చి నేలచదునుచేసిరావాలి. ప్రతి దినం ఆ ప్రదేశంలో బాగా నీళ్ళుపోస్తుంటే ఏదో ఒక రోజు దైవ విగ్రహం భూమిని చీల్చుకొని బైటికి వస్తుంది. ప్రచారం సాగిస్తే ప్రజా వెల్లువ ప్రవాహంలాగా వచ్చి కానుకలు, మ్రొక్కులు సమర్పించిపోతుంటారు. ఇలా జీవించే వారిచే సృష్టించబడిన, "స్వయంభూ దైవక్షేత్రాలు"గా ప్రసిద్ధి వహించినవి చాలా వున్నవి మనదేశంలో.

కర్పూరం అదే వెలుగుతుంది

పల్చటి తెలుపు గుడ్డ పీలికను తడిపి, దానిలో చిన్న భాస్వరం ముక్కను చుట్టి, కర్పూరం వెలిగించే గుంటలోబెట్టి వుంచాలి. ఆ గుడ్డపీలిక తడి ఆరిపోతున్న తరుణంలో అందరూ చూసే విధంగా హారతి పాత్రను పైకెత్తి పట్టుకొని ప్రేక్షకులందచేసిన కర్పూర గడ్డను దానిలో వేసి, కళ్ళు మూసుకొని జపం నటిస్తుంటే - భాస్వరం నుండి కర్పూరం వెలుగుతుంది. అందరూ ఈ వినోదాని కమితాశ్వర్యం జెందగలరు.

ఉత్త కాగితంలో కొత్త పువ్వు

ప్రదర్శకుడు ఒక తేలికైన పుష్పాన్ని తన చేతి వ్రేళ్ళసందులలో - వెనుకప్రక్క కుండునట్టుగా నొక్కిపట్టి వుంచి - ముందు ప్రక్క ఒక కాగితాన్ని వ్రేళ్ళపై వుండునట్టు బొటనవ్రేలితో పట్టుకొని ప్రేక్షకులకు చూపించి, ఆ కాగితంలో పుష్పాన్ని రప్పిస్తానని చెప్పి - తన చేతితో సహా అ కాగితాన్ని ఎడమ అరచేతిలో పెట్టుకొని కొంచెం సేపు ఏదో మంత్రించినట్లు నటిస్తూ పుష్పానికి పట్టు తప్పించి కాగితాన్ని పొట్లం కట్టి - ప్రేక్షకుల కిచ్చి విప్పిచూడమనాలి. వారా పొట్లాం విప్పి అందున్న పుష్పాన్ని చూచి ఆశ్చర్యానందాలు పొందెదరు.

పంచదార లేకుండా తియ్యటి 'టీ'

ప్రేక్షకులలో ఒకరిని వచ్చి స్టౌ మీద టీ పెట్టమని చెప్పాలి. వారికి పాలు, టీపొడి మాత్రమే ఇచ్చి అవి మరిగిన తరువాత ఒడపొయ్యటానికి తెల్లని పరిశుభ్రమైన గుడ్డనొకదాని నందించాలి. ఆ టీని త్రాగితే తియ్యగా నుంటవి. పంచదార లేకుండా టీ తియ్యగా వుండేసరికి ప్రేక్షకులు ఆనందదానుభూతి నందగలరు.

దీనికి ముందుగా ప్రదర్శకుడు తెల్లనిది పల్చగా నున్న ఒక నలుచదరపు గుడ్డను చాక్రిన్ కలిపిన నీళ్లలో నానించి, పిండకుండా ఆరవేసి వుంచాలి. ఆ గుడ్డనే వడపోతకు ఇస్తే ప్రదర్శన రక్తికడుతుంది.

కోడి గ్రుడ్డును వెండిగా మార్చుట?

ప్రదర్శకుడు ముందుగా ఒక గ్రుడ్డుకు దీపపుమసిని దట్టంగా పట్టించి వుంచుకోవాలి. మసి పట్టించని ఒక గ్రుడ్డును ప్రేక్షకులకు చూపి - " నా మహిమతో దీన్ని వెండి గ్రుడ్డుగా మారుస్తానని" చెప్పి - పరీక్షనిమిత్తం ఈ మామూలు గ్రుడ్డును ప్రేక్షకుల దగ్గరకు తన అసిస్టెంట్ ద్వారా పంపాలి. తిరిగి తీసుకొచ్చే సమయంలో చాకచక్యంగా ఆ గ్రుడ్డును మార్చి మసిపట్టిన గ్రుడ్డును ప్రదర్శకుడికి ఇవ్వాలి. ఆ గ్రుడ్డును ప్రదర్శకుడు గాజుగ్లాసులోని నీటిలో వేయగానే అది వెండిలా ధగధగా మెరసిపోతుంది.

ఒకే జాతి పువ్వుకు రెండు రంగులు

ప్రదర్శకుడు ముందుగా పూలచెట్టు నుండి కాండంతో సహా పువ్వును కోసి ఆ పువ్వు యొక్క కాండాన్ని జాగ్రత్తగా మధ్యకు చీల్చాలి. అలా చీల్చిన కాండాలను రెండు వేర్వేరు రంగులు కలిపిన నీటి గ్లాసులలో వేయాలి. ఆ కాండాలు గ్లాసుల నుండి రంగునీరు పీల్చుకొని గంటా రెండు గంటలలో పూవు యొక్క సహజమైన రంగును కోల్పోయి, గ్లాస్ లలోని ఒక రంగులోకి మారిపోతుంది. ఈ పూవు సగం ఒక గ్లాసులోని ఒక రంగులోకి మిగిలిన మరో సగం మరొక గ్లాసులోని మరో రంగులోకి మారుతుంది.

ఈ ప్రదర్శన చేయువారు సమయానుకూలంగా మాటలు చెపుతూ -తన మహిమ అనో మరోటనో చెప్పి చేయవచ్చును.

పటిక బెల్లం ముక్కను దీపంలా వెలిగించుట

ప్రదర్శకుడు ఒక పటిక బెల్లం (పంచదార గడ్డ ముక్కను ప్రేక్షకులకు చూపి - నా మంత్ర మహిమతో దీన్ని మండిస్తానని చెప్పి, అగ్గి పుల్ల గీసి అంటించగానే అది అంటుకొని దీపంలా వెలుగుతుంది. ఇది చూచిన వారు మీ శక్తికి ఎంతో ఆశ్చర్య పోతారు.

ఇది ప్రదర్శించు వారు ముందుగా పటిక బెల్లపు ముక్కకు ఒక వైపు సిగరెట్ నుసిని పట్టించి వుంచుకోవాలి. అలా నుసి పట్టించనిచో పంచదార గడ్డ ఎంత ప్రయత్నించినా మండదు. అగ్గిపుల్ల మంటను నుసి రాసిన చోటనే అంటింఛటం మరచి పోరాదు.

గ్రుడ్డును మ్రింగివేసే సీసా

ప్రదర్శకుడు ఒక గ్రుడ్డును ఉడికించి, దానిపైన వుండే పెంకును తీసి, శుబ్రం చేసుకొని వుంచాలి. తరువాత ఒక మిల్క్ సీసాను ప్రేక్షకులకు చూపి - నా మంత్ర మహిమతో ఈ గ్రుడ్డును సీసా మ్రింగుతుందని చెప్పి - ఒక కర్పూరపు బిళ్ళను వెలిగించి, వెంటనే ఆ సీసాలోవేసి - ఆ సీసా మూతిలో ఉడికించిన గ్రుడ్డును వుంచాలి. అప్పుడు ఆ గ్రుడ్డును సీసా లోనికి లాగి వేస్తుంది. ఇది చూసిన వారికి ఎంతో అద్భుతంగా వుంటుంది.

ఈ ప్రదర్శనకు అసలు కీలకమంతా సీసాలో వేసిన మండే కర్పూరపు బిళ్ళలోనే వుంది. అలా సీసాలో కర్పూరపు బిళ్ళే కాకుండా మండే కాగితం వేసినా ఇలాగే జరుగుతుంది.

నాట్యం చేసే నాణెం

ఈ ప్రదర్శనకు ముందుగా అప్పుడే త్రాగిన లింకా సీసా గాని, ఆరంజ్ జ్యూస్ సీసా గాని తీసుకొని దానిమీద అర్థరూపాయి నాణేన్ని పెట్టి - రెండు చేతులతో సీసాని పాట్టుకొని - మంత్రాలు చదవడం (అలా నటించడం) ప్రారంభించిన అర నిమిషానికి సీసా పైన వున్న నాణెం ఎగరటం ప్రారంభిస్తుంది. దాన్ని చేతులలో నుండి తీసి టేబుల్ మీద పెట్టినను - అలా ఎగురుతూనే వుంటుంది. మీ అపూర్వ మయిన మంత్ర మహిమను చూచి - ప్రేక్షకులు ఎంతో ఉద్వేగం చెందుతారు.

దీనికి ప్రదర్శకుడు పెద్దగా కష్ట పడవలసిన పని లేదు. సీసా మీద నాణెమును పెట్టినప్పుడు గాలి చొరని విధంగా అనగా సీసా అంచుల మీద తడి కొంచెం ఎక్కువ ఉండేలాచూసి పెట్టాలి. ఇక నాణెం ఎగరడానికి మీరు చేసే ముఖ్య మైన పని - సీసాను గట్టిగా పట్టుకోవడమే. అలా మీరు సీసాని గట్టిగా పట్టుకొన్నప్పుడు మీలోని వేడి - సీసా చల్లదనాన్ని వేడిచేసి, సీసా లోని గాలిని వ్యాకోచింప జేస్తుంది. అలా వ్యాకోచించిన గాలి బయటకు పోయే సమయంలో నాణెమును పయికి లేపుతుంది. ఇది చాల మందికి తెలియని విచిత్రము.

నీటిపై తేలుతున్న సూది

మీ మిత్రులతో సరదాగా పందెంకట్టి విజయం సాధించడానికి చాల తేలికైన తమాషా ఇది.

ఒక గాజు గ్లాస్లో నిండా నీరు పోసి , ఒక సూదిని మీత్రుల కిచ్చి, దీనిని నీటిపై తేలేలా చేయమనండి. ఎన్ని సార్లు సూదిని నీటిలో వేసిన అది మునిగి పోతుంది. వారి వల్ల కాక, మిమ్ముల్ని చేయమని పందెం వేస్తారు. మీరు చాల సులభంగా చేసి వరి మన్ననలను పొందగలుగు తారు.

పల్చటి చిన్న ఉల్లిపొర కాగితాన్ని (కొన్ని సిగరెట్ ప్యాకెట్లలో తగరానికి వెనుక భాగాన వుంటుంది) తీసికొని నీటిపై వేయండి. అది తేలుతుంది. దానిపై సూదిని వుంచండి. కాగితంతో పాటు సూది కూడ తేలుతుంది. అయితే దానికి మీ మిత్రులు ఒప్పుకోరు. కాగితం వుండకూడ దంటారు. వెంటనే మరో సూదిని తీసికొని, ఆ కాగితాన్ని నిదానంగా నీటిలో ముంచి - బయటకు తీయండి. కాగితం బయటకు వచ్చినా సూది మాత్రం తేలుతూ వుంటుంది. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. దీనిని చాటుగా చేసి ఒకేసారి నీటిపై తేలుతున్న సూదిని చూపిస్తే మరింత సరదాగా వుంటుంది.

మీ ఆజ్ఞప్రకారం నడిచే గుండీ

ఒక గ్లాసులో సోడాలోని నీరు పోయవలెను. ఆ నీటిలో ఒక చొక్కా గుండీని వేసినప్పుడు - అది పూర్తిగా మునిగి పోతుంది. దానిని అందరికీ చూపించి - మునిగి పోయిన గుండీని అందరిముందు పైకి రా... అని అజ్ఞాపించండి. అది వెంటనే మీ ఆజ్ఞా ప్రకారం పైకి వస్తుంది. అందరూ చూపిన తరువాత క్రిందికి పో.... అని మరల అజ్ఞా పించండి. మీరు చెప్పిన ప్రకారం క్రిందకి పోతుంది. అలా మీరు చెప్పినట్లు చేస్తున్న గుండీని చూచి, అందరూ మిమ్ముల్ని మెచ్చు కుంటారు.

ఇందులో గొప్ప విసేషం ఏమీ లేదు. సోడా నీటిలో కార్బన్-డై-ఆక్స్తైడ్ వుంటుంది. గుండీ నీటిలో వేయగానే సహజంగా అది నీటిలో మునిగి పోతుంది. కొంత సేపటికి గుండీ చుట్టూ కార్బన్ -డై-ఆక్సైడ్ బుడగలు చేరి దానిని పైకి లేపుతాయి. గుండీ; దాని సహజ పద్దతిలో క్రిందకి దిగుతుంది. మీరు చేయ వలసిందల్లా ఈ చర్యలు జరగటానికి ఒక దానికి ఒక దానికి మధ్య ఎంత సేపు పడుతుంతో గమనించి - ఆ లెక్క ప్రకారం మీరు గుండీని అజ్ఞాపించాలి. చూసే వారికి - మీరు చెప్పింట్లు గుండీ చేస్తున్నట్లుగా వుంటుంది.

చేతి వ్రేళ్ళకు తడి అంటకుండా నీటిలో నుండి నాణెం తీయుట

ఒక పళ్ళెంలో గ్లాసుడు నీరు పోసి అంచులకు దగ్గరగా నీటిలో ఒక నాణేన్ని వేసి, ఆ నాణేన్ని నీరు అంటకుండా, నీరు పోకుండా బయటకు తీయాలని మీ మిత్రులను అడగండి. వారికి ఎంత ఆలోచించినా ఎలా తీయాలొ తెలియదు. వారు తీయలేమనీ ఒప్పుకున్న తరువాత మీరు తీసి చూపించడి.

ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక కాగితం ముక్కకు నిప్పంటించి, మండుతున్న కాగితాన్ని గ్లాస్ లో వేసి, ఆ గ్లాస్ ను పళ్ళెం మధ్యలో బోర్లించండి; అప్పుడు విచిత్రంగా పళ్ళెంలో వున్న నీరు గ్లాస్ లోకి వస్తుంది. నాణెం వున్న చోట నీరు లేకుండా పొడిగా వుంటుంది. అప్పుడు మీరు సులభంగా ఆ నాణెమును తీసి అందరికీ చూపండి.

గ్లాస్‌లో మండు తున్న కాగితం వేసినప్పుడు గ్లాస్ లోని గాలి వేడెక్కి బయటకు పోయి, గ్లాస్ లో శూన్యం ప్రదేశం ఏర్పడుతుంది. నీటిలో బోర్లించగానే నీటిపై వున్న గాలి ఒత్తిడికి నీరు గ్లాస్ లోని శూన్య ప్రదేశంలోకి చేరుతుంది. దానితో నాణేం వున్న ప్రదేశంలో నీరు వుండదు.

రాకాసి గ్లాసు

ఒక వైన్ గ్లాస్ లో నిండుగా నీరు పోసి, కొన్ని గుండు సూదులను తీసుకొని మీ మిత్రులతో నీరు కింద పడకుండా ఎన్ని గుండుసూదులు వేయగలరని అడగండి ! రెండు మూడు అని సమాధానం చెపుతారు. మీరు అంతకంటే ఎక్కువ వేస్తానని చెప్పండి ! వారు ఎన్ని చెప్పినా అంతకంటే ఎక్కువ వేస్తానని ధైర్యంగా చెప్పవచ్చు ! ఎందుకంటే మీరు వంద గుండు సూదులు వేసినా నీరు క్రిందపడదు. గ్లాస్ రాకాసిలా గుండుసూదుల్ని మింగుతుందేగాని నీటిని కింద పడనీయదు ! అయితే గుండుసూదుల్ని నీటిలోకి వదిలేటప్పుడు - తలభాగాన్ని పైకివుంచి, మొనభాగాన్ని క్రిందకు వుంచి, చాలా నిదానంగా నీటిలోకి వదలాలి. అలా వందకుపైన గుండు సూదులను వేసినా నీరు క్రిందపడదు. గ్లాస్ మూతి ఎంత వెడల్పు వుంటే అంత మంచిది.

దివ్య దృష్టి

పదిమంది స్నేహితులతో సరదాగా గడిపేటప్పుడు ఈ తమాషాచేసి అందరిని ఆశ్చర్యపరచవచ్చు. ఈ తమాషాను ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన పరికరములు ఏమీ అవసరంలేదు.

మీ స్నేహితులు పదిమందికి ఒకే సైజు తెల్ల కాగితములు ఇచ్చి, పరిశీలించమని చెప్పి, వాటిని తిరిగి తీసికొని వారిని ఒక్కొక్కరిచే - వారికి ఇష్టమైన పేరు ఏదైనా సరే చెప్పమనండి ! ఒకరు ఒక పేరు చెప్పగానే - ఒక తెల్ల కాగితంపై దానిని వ్రాసి మడతవేసి - ఒక టోపిలోగాని, డబ్బాలోగాని వేయండి ! అలాగే మిగిలిన మిత్రులు చెప్పినవిగూడా తెల్ల కాగితంపై వ్రాసి, మడతలు వేసి, మొదటి కాగితం వేసిన దానిలోనే వేయండి. ఇప్పుడు మీరు మరో కాగితం తీసుకొని - ఒక పేరు వ్రాసి, మడత పెట్టి, మీ వద్ద వుంచుకొని - మీ స్నేహితులతో ఒకరిని వ్రాసిన పది కాగితాలలో ఒక దానిని తీసి అందులో ఏమి పేరు వుందో చూడమనండి; చూసినతరువాత - దివ్యదృష్టితో ఆ పేరు నాకు తెలిసిందని, దానిని నా వద్ద కాగితంలో వ్రాసానని చెప్పి - మీ చేతిలో కాగితం మీ మిత్రులకు ఇవ్వండి ! ఆ పేరును చదివి వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రెండుచీటీలలోపేరు ఒక్కటేకాబట్టి.

ఇందులో మాయా - మంత్రం ఏమీలేదు. మీ మిత్రులు పేర్లు చెప్పేటప్పుడు పది రకాల పేర్లు చెప్పినప్పటికి - మీరు మాత్ర వ్రాసేటప్పుడు - అందులో ఏదో ఒక పేరు మాత్రమే అన్నింటిలోను వ్రాస్తారు ! ఆ పేరునే మీ వద్దవున్న కాగితంలో కూడా వ్రాస్తారు ! మీ మిత్రుడు ఏ కాగితం తీసినా మీవద్ద వున్న కాగితంలో పేరే వస్తుంది !

  1. * ( పై ప్రదర్శనవలెనే దానికి ముందు, దానికి తరువాత కూడా కొన్ని సందర్భాలలో ఊడుగ విత్తుల తైలముతో చేయవలసిన ప్రక్రియలున్నవి. ఇంద్రజాల ప్రదర్శకులకు ప్రాణప్రదమయిన ఈ నూనెను తయారు చేయు విధానములను మాచే ప్రచురించబడిన "ఇంద్రజాల రహస్యాలు" అను గ్రంథమునందు చూడగలరు. వెల. రు. 6/-