మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/ఆల్సిబియాడీసు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆల్సిబియాడీసు

ట్రోజను యుద్ధములోఁ బ్రసిద్ధికెక్కిన 'అజాక్సు' అను వాఁ డితని వంశమునకు మూలపురుషుఁడు. ఇతని తల్లిపేరు 'దినోమాచి'; తండ్రి 'క్లినియసు'. ఇతఁడు 'ఆర్టిమీయమ్‌' వద్ద జరిగిన నౌకాయుద్ధములోఁ బోరాడి పేరుఁబొందెను. ఇతఁడు 'పెరికిలీసు' సంరక్షణలో నుండెను. 'నిసియసు', 'డెమాస్తనీసూ ఇతని సమకాలికులు. మహామహోపాధ్యాయుఁడైన 'సోక్రెటీసు' ఇతనిఁ బ్రేమించుటచేత ఇతనికిఁ గీర్తివచ్చిన దని చెప్పుదురు.

బాల్య యౌవన కౌమారావస్థలలో నితని రూపలావణ్యము లా సేచనములు. అతఁ డస్పుటముగ మాటల నాడుట చేత, ప్రసంగములు రమ్యముగ నుండి మనుష్యుల నాకర్షించు చుండెను. మొదటినుండియు నతని నడవడిక లేకరీతిగ నుండ లేదు. ఆతని భోగభాగ్యములు వృద్ధిక్షయములొందఁ దదను గుణ్యముగ నవియు మారుచుండెను. అతఁడు మనోవ్యాపారములకు లోఁబడెను; ఎదిరించి పోరాడి జయము నొందవలయునను కోరికఁ గలవాఁడు. మల్లయుద్దములో నతఁడు నేలకు ద్రొబ్బఁబడినప్పుడు, పట్టువదలించుకొనుటకు శత్రువు యొక్క వ్రేళ్లను కొరుక, వాఁడు 'ఆడుదానివలె' కఱచుచుంటి'వని యెత్తిపొడువ, “లేదు, సింహమువలె"నని అతఁడు జబాబు చెప్పెను.

ఒక రోజున నతఁడు బాలురతో వీధిలో పాచికలాడు చుండ బండి తోలుకొని యొకఁడు వచ్చి వీరిని దారి యొసల మనెను. అతఁ డప్పుడు పాచిక వేయవలసిన సమయము, బండి వాఁడు మోటుతనమున గుఱ్ఱముల నదరి వచ్చుచుండ బాలు రందఱు నొసలిరిగాని యతఁడు మార్గమున కడ్డుగా పండు కొనెను. వాఁ డది చూచి భయపడి శకటమును నిలిపెను.

విద్యార్థిగా నుండుకాలమున నతఁడు "వేణుగానమును నేర్చుకొనుట కిష్టపడలేదు. మురళీ గానము సేయువా రుచ్ఛ్వాస నిశ్వాసముల నరికట్టి మాటలాడుటకు వీలులేదు. వైణికులు గాత్రముచే పాటను వినికిడి చేయఁగలరు. "మే మాథెన్సు పట్టణమువారము, వేణుగానమును నేర్చుకొన"మని యతఁడు పలికినందున నతనివలె నితర బాలురుకూడ దానిని మానిరి.

పెద్దలంద ఱతని స్నేహమును గోరి యతనివద్దకు వచ్చుచుండిరి. అతని సుందరవిగ్రహమును జూచి వారు తనివిఁబొంద లేదు. ధనికుఁడు గనుక నతనిని పరులు చెఱుపుదురను భయముచేత నతని మనోవ్యాపారములు విచ్చలవిడిగ సంచరింప కుండునట్లు నానిని 'సోక్రెటీసు' నిగ్రహించెను. అందుచేత నతఁడు మంచిమార్గమునకు వచ్చి యుక్తాయుక్త విచక్షణత గలిగియుండెను. అతఁడు 'సోక్రెటీసు'ను గురువుగ భావించెను. దైవాధీనమువలన నట్టి గురువు సంప్రాప్తుఁ డయ్యెనని యతఁడు సంతసించెను. సద్గురువులు దొరుకుట దుర్లభము; దొరికినపుడు వారి యనుగ్రహమునకుఁ బాత్రులగుట కష్టతరము. వారి యనుగ్రహము కలిగినపుడు వారియుపదేశముల ననుసరించి నడచుట కష్టతమము. సర్వకాలముల యం దతఁడు గురుసన్నిధానమున వర్తించెను. అతఁ డతనితోఁ గలిసి భోజనము సలిపి యతనితో మల్లయుద్ధము సేయుచుండెను. గురువునుతప్ప తదితరుల నతఁడు లక్ష్యము సేయ లేదు. గురువునకుఁ దెలిసిన యంశము లాకాలములో నెవ్వరికిఁ దెలియవని యతఁ డూహించెను. స్నేహితు లతనిని సన్మార్గము నుండి తప్పింపఁజూచినను గురువున కతఁడు . భయపడి వారి బోధలకుఁ జెవియొగ్గలేదు. ఒక వేళ విషయములకు లోఁబడినను నిప్పుతగిలి యినుముకరఁగి తదుపరి చల్లారి గట్టియగువిధమున 'సోక్రెటీసు'చేత మందలించఁబడి యతఁడు మనోబలము నొందుచుండును.

ఒక రోజున నతఁడు పాఠశాలకుఁ బోయి ప్రాచీనకవియైన 'హోమరు' వ్రాసిన కావ్యము నిమ్మని యుపాధ్యాయుని నడిగెను. అతఁడా గ్రంథము లేదని చెప్పినందున వాని కొక లెంపకాయ వేసి వెళ్లిపోయెను. మఱియొక యుపాధ్యాయుఁ డా గ్రంథమును సవరణఁజేసి యుంచితి నని చెప్ప' 'ఓహో' మీరు బాలురకుఁ జదువు చెప్పెదరా? హోమరును సవరణఁ జేయు శక్తిఁగల తమరే బాలురకు విద్యాభ్యాసము చేయఁ దగినవా”రని ఆల్సిబియాడీసు పలికి యతనికి వందనము చేసెను.

ఒక పర్యాయము గురుశిష్యులు కలిసి యుద్ధమునకు వెళ్లిరి. అందులో శిష్యుఁడు గాయము తగిలి పడిపోయినందున గురు వతనిని రక్షించి శత్రువును శిక్షించెను. యుద్ధము ముగిసినపిదప 'సోక్రెటీసు'న కీయుటకు బదులుగ నతని ప్రేరణమున వీరకిరీటమును ప్రజలు శిష్యున కిచ్చిరి.

ఒక సమయమున బాలురతోఁ గలిసిపోవుచు వారి ప్రోత్సాహమున నిష్కారణముగ నతఁ డొకనికొక లెంపకాయ వేసెను. . అందుకు వాఁడు గినిసి యీ దౌర్జన్యమును గ్రామమంతట సాటెను. మఱునాఁ డుదయమున నతఁడు వానియొద్దకుఁ బోయి తనను శిక్షించవలసినదని దుస్తులుతీసి నానియెదుట , నిలువఁబడెను. వాఁ డందుకు సంతసించి యతనిని క్షమించెను.

అతఁడు భార్యతో పొత్తులేక పరస్త్రీలతో సంచరింప నామె స్వపితృగృహమునకుఁ బోయి విడియాకులీయఁదలఁచి గ్రామపురోహితుని సమీపించెను. అప్పు డతఁ డా సంగతిని విని, పరుగిడి యామె నెత్తుకొని రాజమార్గమున వచ్చి స్వగృహ మును చేరెను. నాఁడు మొదలు దంపతు లిరువురు సఖ్యతగ నుండిరి. కొంతకాలమున కామె మరణమునొందెను.

అతనివద్ద మంచి కుక్కయొకటి యుండెను. సొగసైన దాని పుచ్ఛము నతఁడు కోసివేసెను. ఈ సంగతి గ్రామస్థులు విని నవ్విరి. 'ఎందు కట్లు జేసితి'వని కొంద ఱడుగ 'మీరు పరిహసింపవలసిన దని చేసితిని. ఇంతకంటె హెచ్చు దుర్మార్గము చేసితి నని మీ రభిప్రాయపడఁగూడ'దని యతఁడు సమా ధానము చెప్పెను.

అతనివద్ద మంచి గుఱ్ఱములును రథములును ఉండెను. 'ఒలింపికు' క్రీడలలో నవి మూఁడు నాలుగు పందెములను గెలిచెను. దేశములో వీనిని విశేషముగఁ గలవాఁ డతఁడేగాని పరులు లేరు. క్రీడలకు వాని నధికముగఁ బంపువాఁ డతఁడే.

దాత్రుత్వమునం దతనికి సమానులు లేరు. బీదలకును సాధువులకును రెండు చేతుల నతఁ డిచ్చుచుండెను. ఇచ్చిన సొమ్ముకు లెక్క లేదు. పుచ్చుకొనినవారికి పరిమితి లేదు. ఏ విధానమునులేక నిధానముగ దానములను వితానముగఁ జేయుచు ఘనులను మించెను,

కులశీలములు కలిగి ప్రజ్ఞావంతుఁడై బంధుమిత్రవర్గంబుల సంసర్గీయంబుతో నతఁడు ప్రకాశించుచుండెను. రాజకీయన్యవహారములలో నతఁడు ప్రవేశించుటకు మార్గములు నిష్కంటకముగ నుండెను. త్రిశక్తులు గలిగి దురవగాహమైన ధారణాశక్తిఁ గలిగి వాచాలత్వమున నతఁడు ప్రజలను బరవశలుగఁ జేయుచుండెను. అతని దుర్వ్యాపారములను మాత్రము వారు సహింపలేదు. మద్యపానముఁజేసి పరస్త్రీల రతిలోఁబడి మునుఁగుచుఁ దేలుచు నతఁడు కొంతకాలము వ్యర్థము చేసెను. వేషభాషలలోఁగూడ నతఁడు శృంగారపురుషునివలె సంచరించెను. ఇట్టి పురుషునివైఖరి ప్రజారాజ్యములోని ప్రజల కంతగ నిష్టము లేకపోయినను నతనిని వారు మన్నించు చుండిరి. 'ధనమూల మిదం జగత్త'ను న్యాయము సుప్రసిద్ధ మయ్యెను.

భోజనకాలమున నతని గృహములో వీరభద్రపళ్లెరములను వాడుకొనుట కలదు. సహ పంక్తిని నెప్పుడుఁ బదుగురికు తక్కువలేక యతనితో స్నేహితులు భోజనము చేయుచుండిరి. అతిధి యభ్యాగతుల నతఁ డెన్నఁడును పొమ్మని చెప్పలేదు. ఇట్టి సుగుణ దుర్గుణ సంవర్గము గలవాఁడగుట నతనిని ప్రజలు ప్రేమించి యతని దుర్గుణములను బాలచేష్టలని భావించి సహించిరి.

'పెరికిలీసు' కాలధర్మమునొందినందున 'ఆథెన్సు' పట్టణములో వ్యవహారములను నడుపుటకు సమర్థుఁడు లేక పోయెను. అథీనియనులు సిసిలీద్వీపముపైకి దండెత్తిపోవలెనని సమకట్టిరి. 'ఆల్సిబియాడీసు' వారిని ప్రోత్సాహపఱచెను. వా రందుకు సమ్మతించి 'నిసియసు'ను నితనిని నౌకానాయకులుగ నియమించిరి. దండు బయలుదేరుటకు సిద్ధముగ నుండెను. 'బుధుఁ'డను దేవునియొక్క ప్రతిమలన్నియు తునకలు చేయఁబడి యుండెను. ప్రజలందఱు ఖిన్నులైరి. ఈ దౌర్జన్యమును 'ఆల్సిబియాడీసు' చేసెనని యతని శత్రువు లపవాదవేసిరి. యుద్ధమునకుఁ బోవు సమయము గనుక వా రప్పుడతనిని విమర్శింపక దండుతోఁ బోనిచ్చిరి. ఈ యపవాదను పోగొట్టవలసిన దని వారి నతఁడు ప్రార్థించెను గాని వా రందుకు సమ్మతించలేదు. నావలతోఁగూడ నతఁడు బయలుదేరి సిసిలీద్వీపమునకుఁ. బోయెను.

ఈలోపున ప్రజ లీ యపవాదమును బరిశీలించి బంధుమిత్రవర్గంబులనుబట్టి కట్టి శిక్షించిరి. అతనిమీఁద వారు నేర స్థాపన చేసిరి. అతనిని పట్టి శిక్షించక డండుతో పోనిచ్చి నందుకు వారు వగచుకొనిరి. సేనను విడిచి వెంటనే రావలసిన దని వారతనికి వర్తమానముఁ బంపిరి. సిసిలీద్వీపములో యుద్ధము సాంతము కాలేదు. సేనలను విడిచి యతఁడు బయలుదేరెను. అతఁడు విగ్రహములను ధ్వంసము చేయుటయేకాక పురోహితుల వేషమువేసికొని వారిని వ్యధికరణము చేసెననియు నిందారోపణం జేసిరి. అతనిని చండాలునిగఁ బ్రకటనచేసి యతని యాస్తిని జప్తుచేసి రాష్ట్రమునకుఁ గలిపి ప్రజ లతనికి మరణదండన విధించిరి. ఈ సంగతుల నతఁడు విని స్వగ్రామమునకు వెళ్లక 'స్పార్టా' యను పరరాజ్యములోని పట్టణము నకు వెళ్లెను. అక్కడ వా రతనిని మర్యాదగఁ జూచిరి. స్పార్టనుల వేషభాషలను వారి యాచారములను నతఁ డవలంబించి వారికి స్నేహపాత్రుఁ డయ్యెను. వర్తమానములచేత నతఁడు మహాకులీనుఁ డని వా రంతకు పూర్వము వినినందున నతనిని వారు మన్నించిరి. ఆ దేశపు రా జతనినిఁ జూచి మత్సరముచేత జంపుటకుఁ బ్రయత్నించెను. ఆ సంగతి తెలిసికొని యతఁడక్కడనుండి పరారియయ్యెను. పారసీకదేశపు ధనికుఁ డొకఁడు దైవికముగ వచ్చినందున మైత్రికలిపికొని యతనితో కలిసి లేచిపోయెను. అథీనియనులు స్పార్టనులు పోరాడుచున్న సమయమున నీ పారసీకదేశస్థుఁడు స్పార్టనులకు సహాయము చేయుటకు వచ్చెను. స్పార్టనులు మంచివారు కారని యతనితో చెప్పి వారికి విశేషముగ సహాయము చేయఁగూడదని యాతనితో 'ఆల్సిబియాడీసు' పలికెను. అథీనియనులు యుద్ధ సమయమున శూరుఁడైన 'ఆల్సిబియాడీసు' లేఁడని విచారించిరి. ఆ సంగతి నతఁడు విని మంత్రతంత్రములుచేసి పారసీక దేశస్థుని యథీనియనులపక్షము నవలంబించునట్లు చేసెను. వారిలో ద్రోహుల గొందఱనుపట్టి స్వదేశీయుల కతఁ డప్పగించెను. ఈ యుద్ధములో నథీనియనులు గెలిచిరి.

ఇంత కాలమునకు స్వదేశమునకుఁ బోవలెనని యతఁడు యత్నించెను. మహా వైభవముతో నతఁడు స్వగ్రామమునుచేర నతనిని దర్శించుటకుఁ బ్రజలు గుమిగూడిరి, పడిన కష్టములను వారితో నతఁడు చెప్పి గ్రహపాటుచేత నవి కలిగెనని యతఁడు పలికెను. కొంతవఱకు వారు విచారించిరి. ఏరోజున నతఁడు స్వగ్రామమును చేరేనో నారోజు 'మినేర్వా' దేవతయొక్క నిజరూపదర్శనదిన మయ్యెను. ఆరోజున వారు దేవతను చూచుటకు వీలులేదు. అతఁ డా దినమున విజయము చేయుటచేత శుభసూచకము" "కాదని వారు తలంచిరి.

ఇంతలో స్పార్టనులకు ఆధీనియనులకు తిరుగ జగడము వచ్చెను. స్పార్టనులు రాజ్యాధిపత్యములోనివారు, అథీనియనులు ప్రజారాజ్యములోనివారు. వీరు మైత్రితో నుండుట దుర్లభము. వీరి ప్రజారాజ్యమును మాపివేయవలె నని వారు కోరుచుండిరి. కాని శూరుఁడైన 'ఆల్సిబియూడీసు' జీవించియున్నంతవఱ కది సమకూడ దని యెంచి వా రతనిని, యమ మందిరమునకుఁ బంపుటకుఁగాను కొందఱి దుష్టులను సన్నద్ధము చేసిపంపిరి.

అతఁ డప్పుడొక చిన్న గ్రామములోఁ దనప్రియురాలితోఁ గలిసియుండెను. ఒకనాఁటిరాత్రి, తాను తన ప్రియురాలి వస్త్రములను ధరింప నామె వచ్చి తన్ను కౌగలించుకొని, తన ముఖమును స్త్రీ ముఖముగ దిద్దినటుల నతఁడు స్వప్నముఁ గనెను. అతని నెదిరించుటకు భయపడి ఘాతకులతని గృహమునకు నిప్పు ముట్టించిరి. అప్పు డతఁడు బట్టలు తీసి, మంటమీఁదవేసి, యవి ముట్టుకొను లోపున ఖడ్గము ధరించి బయటకు వచ్చెను, ఘాతకు లతనినిఁజూచి చెదరి పోయి దూరమునుండి బాణములను ప్రయోగించినందున నతఁడు నేల వ్రాలి మరణము నొందెను.

సుగుణ దుర్గుణ సంపత్తిఁగలవాఁడై విచ్చలవిడిగ సంచరించి నీతిమార్గము నవలంబింపక స్వదేశీయులకు మేలు కలుగఁ జేయుటకు బదులు వారికిఁ గోపముఁ గలిగించి వారిచేత నతఁడు నిందింపఁబడెను. మంచికాలములోనుండి యుక్తాయుక్త విచక్షణతలేక నడచినందున నతఁడు దుర్మరణము నొందెను.

.

Maha-Purushula-Jeevitacaritramulu.pdf