మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/స్వలాభం కోసం వినియోగించుకోవటం, కార్యకలాపం

వికీసోర్స్ నుండి

76. స్వలాభం కోసం వినియోగించుకోవటం, కార్యకలాపం

తెల్లవారటంతోనే పక్షులు కిలకిలమంటూ తెగ గొడవ చేస్తున్నాయి. సూర్యకాంతి చెట్లపైన మాత్రమే పడుతోంది. చిక్కని నీడల్లో ఇంకా వెలుగు పడటం లేదు. గడ్డిమీద అంతక్రితమే పాము వెళ్లి ఉంటుంది. మంచుమీద సన్నగా పొడుగ్గా చారపడింది. ఆకాశం రంగు ఇంకా పోలేదు. పెద్ద పెద్ద తెల్లని మేఘాలు పోగవుతున్నాయి. ఉన్నట్లుండి పక్షులచప్పుడు ఆగిపోయింది. మళ్లీ హెచ్చరికతో, అరుపులతో ఎక్కువైంది. ఒక పిల్లి వచ్చి పొద క్రింద పడుకుంది. పెద్ద డేగ ఒకటి తెలుపు నలుపు రంగుల్లో ఉన్న ఒక పక్షిని పట్టుకుని పదునుగా వంపుతిరిగిన ముక్కుతో చీల్చేస్తోంది. దొరికిన ఆహారాన్ని శక్తికొద్దీ ఆత్రుతగా పట్టుకుని, రెండు మూడు కాకులు దగ్గరకు రాబోతే బెదిరించింది. డేగ కన్నులు పసుపు పచ్చగా ఉన్నాయి మధ్యని నల్లని చారలతో. ఆ కళ్లు మమ్మల్నీ, కాకుల్నీ రెప్పవాల్చకుండా గమనిస్తున్నాయి.

"నేను ఎందుకు వినియోగింపబడకూడదు? ఒక ప్రయోజనం కోసం. నన్ను ఉపయోగించుకుంటే నాకు అభ్యంతరం లేదు. దానికి ఎంతో విలువ ఉంది. దానితో ఐక్యం పొందాలని ఉంది నాకు. నన్ను వాళ్లు ఏం చేసుకుంటారన్నది అంత ముఖ్యం కాదు - నాకేమీ విలువ లేదు కనుక. ఈ లోకంలో నేను చెయ్యగలిగిందాట్టే లేదు. అందుచేత చెయ్యగలిగేవాళ్లకి సహాయం చేస్తున్నాను. కాని, నా వ్యక్తిగతమైన మమకారం ఒకటి నా దృష్టిని ఆ పనిమీద నిమగ్నం కాకుండా చేస్తోంది. ఈ మమకారాన్నే అర్థం చేసుకోవాలనుకుంటున్నాను."

కాని, మిమ్మల్ని ఎవరైనా ఎందుకు వినియోగించుకోవాలి? మిమ్మల్ని వినియోగించుకునే వ్యక్తిగాని, సంఘంగాని - వారంత ముఖ్యమూ కాదా మీరు?

"ఒక ప్రయోజనం కోసం నేను ఉపయోగపడితే నాకభ్యంతరం లేదు. అందులో ఎంతో అందం ఉంది. దానికి ఈ లోకంలో విలువ ఉంది. నేను ఎవరితో పని చేస్తున్నానో వాళ్లు ఆధ్యాత్మికంగా ఉన్నతాదర్శాలున్నవాళ్లు. ఏం చెయ్యాలో వాళ్లకే బాగా తెలుసును."

మీకన్న వాళ్లకే మంచి చెయ్యగల స్తోమత ఉన్నదని ఎందుకనుకుంటారు మీరు? మీరన్నట్టు వారు ఆధ్యాత్మికమైనవారని మీకెలా తెలుసు? వారికి ఎక్కువ వివేకదృష్టి ఉన్నదని మీకెలా తెలుసును? మీరు మీ సేవల్ని అంకితం చెయ్యాలనుకున్నప్పుడు ఈ విషయం గురించి ఆలోచించే ఉంటారు కదా. లేక, ఆకర్షితులై, భావావేశంతో చలించిపోయి మిమ్మల్ని మీరు ఆ కార్యానికి అర్పించుకున్నారా?

"అది చక్కని ప్రయోజనం. దానికి సహాయ పడాలనిపించింది కాబట్టి నా సేవల్ని అర్పించుకున్నాను."

ఒక ఉన్నత ప్రయోజనం కోసం చంపటానికి గాని, చావటానికి గాని సైన్యంలో చేరే వాళ్లలాంటి వారే మీరు కూడా. వాళ్లేం చేస్తున్నారో వాళ్లకి తెలుసునా? మీరేం చేస్తున్నారో మీకు తెలుసునా? మీరు అర్పిస్తున్న సేవ "ఆధ్యాత్మిక ప్రయోజనం" కోసమేనని మీకు ఎలా తెలుసును?

"మీరన్నది నిజమే. క్రిందటి యుద్ధంలో నాలుగేళ్లపాటు నేను సైన్యంతో ఉన్నాను. తక్కిన వాళ్లలాగే నేను కూడా దేశభక్తి భావంతో దాంట్లో చేరాను. ఆ సమయంలో చంపటంలోని అర్థాన్ని గురించి ఆలోచించలేదు. అది చెయ్యవలసిన పని. మేము చేరాం అంతే. కాని, ఇప్పుడు నేను సహాయం చేస్తున్నది ఆధ్యాత్మికంగా ఉన్నవారికి."

ఆధ్యాత్మికంగా ఉండటం అంటే మీకు అర్థం తెలుసునా? ఒకటి మాత్రం నిజం. అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కలిగి ఉండటం ఆధ్యాత్మికత కానేకాదు. వాళ్లకి అభివృద్ధి చెందాలనే ఆకాంక్షలేదా?

"ఉందనే అనుకుంటాను. ఈ విషయాలు నేనెప్పుడూ ఆలోచించ లేదు. ఒక చక్కని - ప్రయోజనానికి తోడ్పడాలని మాత్రమే అనుకున్నాను."

అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉండటం, దాన్ని దివ్య ప్రభువులు, మానవత్వం, కళ, సౌభ్రాతృత్వం, అంటూ ఎన్నో గొప్పగా ధ్వనించే పదాలతో కప్పి ఉంచటం చక్కతనమా? తనతో బాటు పక్కనున్న వాళ్లనీ, అవతలి తీరాన ఉన్న వాళ్లనీ అందరినీ కలుపుకునే ఆత్మకేంద్రీకరణ భారంతో ఉండటం ఆధ్యాత్మికతా? ఆధ్యాత్మికంగా ఉన్నవారికి మీరు సహాయపడుతున్నానను కుంటున్నారు. అదంతా ఏమిటో తెలుసుకోకుండానే మిమ్మల్ని వాళ్లు వినియోగించుకోవటానికి ఇష్టపడుతున్నారు.

"అవును. అదంతా తెలివితక్కువే కదా? నేను చేసే దానికి అంతరాయం కలగటం నాకిష్టంలేదు. కాని నాదో సమస్య ఉంది. మీరు చెప్పేది మరింత కలవరపరుస్తూ ఉంది."

మీకు కలవరం కలగవద్దా? మనకి కలవరం కలిగినప్పుడే, మనం మేల్కొన్నప్పుడే, గమనించటం, తెలుసుకోవటం మొదలుపెడతాం. మన తెలివితక్కువతనం వల్లనే మనల్ని వాళ్ల లాభానికి వినియోగించుకుంటారు. గడుసు వాళ్లు దేశం పేరుతోనూ, దేవుడి పేరుతోనూ, మరికొందరు సిద్ధాంతం పేరుతోనూ మనల్ని ఉపయోగించుకుంటారు. చాకచక్యం ఉన్నవాళ్లే వినియోగించుకున్నప్పటికీ తెలివితక్కువతనం లోకానికి మంచినెలా చేయ గలదు? గడుసువాళ్లు తెలివితక్కువవాళ్లే - ఎందుకంటే, వాళ్ల కార్యకలాపాలు వాళ్లని ఎక్కడికి లాక్కుపోతాయో వాళ్లకే తెలియదు. వాళ్ల ఆలోచన లెటుపోతున్నాయో తెలియకుండా ఉన్న తెలివితక్కువ వాళ్లు చేసేపని సంఘర్షణకీ, గందరగోళానికీ, దుఃఖానికీ దారితీస్తుంది.

మీ సమస్య అన్యమనస్కతకు లోనవటం కాకపోవచ్చు. అది ఉన్నప్పుడు ఏమవుతుంది?

"నేను అంకితమైన కార్యానికిది ఇబ్బంది కలిగిస్తోంది."

మీరు సంపూర్ణంగా అంకితం కాలేదు - మీ సమస్య మీ ఏకాగ్రతని భంగం చేస్తున్నది కనుక. మీరు అంకితం కావటం ఆలోచనారహితమైన చర్య కావచ్చు. ఈ సమస్య దానికి సూచన - ఈ కార్యకలాపాల్లో చిక్కుకోవద్దని హెచ్చరిక.

"నేను చేస్తున్నది నాకిష్టమే."

అదే అసలు చిక్కు అయి ఉండవచ్చు. ఏదో ఒక రకమైన కార్యకలాపంలో మనల్ని మనం మరిచిపోవాలనుకుంటాం - అ కార్యకలాపం ఎంత సంతృప్తినిస్తే దాన్ని అంతగా పట్టుకు వ్రేలాడతాం. సంతృప్తి కలగాలని కోరటం తెలివితక్కువ. సంతృప్తి ఏస్థాయిలోనైనా ఒకటే. సంతృప్తిలో ఉన్నతమైనదనీ, నీచమైనదనీ లేదు. మనం సంతృప్తిపడటాన్ని వ్యక్తంగా గాని అవ్యక్తంగా గాని ఉత్కృష్టమైన మాటల్లో కప్పిపుచ్చవచ్చు, కాని సంతృప్తి పొందాలనే కోరికే మనల్ని మందకొడిగానూ, సున్నితత్వం లేకుండానూ చేస్తుంది. ఏదో ఒక కార్యకలాపం ద్వారా మనం సంతృప్తీ, సౌఖ్యం, మానసిక రక్షణా పొందుతాం. అది పొందుతూనో, పొందుతున్నట్లు ఊహించుకుంటూనో మనకి ఏవిధమైన ఇబ్బందీ కలుగకూడదని వాంఛిస్తాం. కానీ, ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది - మనం చచ్చిపోతేనో, సంఘర్షణ, పోరాటం అనే ప్రక్రియ మొత్తం అర్థం చేసుకుంటేనోతప్ప. మనలో చాలామంది చచ్చిపోవాలనీ. సున్నితత్వం లేకుండా ఉండాలనీ కోరుకుంటారు - జీవించటం బాధాకరం కనుక. ఆ బాధని ఎదుర్కొంటూ, ప్రతిఘటించడానికీ, నిబద్ధులై ఉండటానికీ గోడలు కట్టుకుంటారు. రక్షణ కల్పించేటట్లు కనిపించే ఈ గోడలు మరింత సంఘర్షణనీ, దుఃఖాన్నీ పెంపొందిస్తాయి. సమస్యని తప్పించుకునే మార్గం వెతకటం కన్న సమస్యని అర్థం చేసుకోవటం ముఖ్యం కాదా? మీ సమస్య నిజమైనదే కావచ్చు. మీరు చేసే కార్యం అర్థం లేని పారిపోయే మార్గం కావచ్చు.

"ఇదంతా చాలా కలవరపెడుతోంది. దీని గురించి నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి."

చెట్లక్రింద వేడెక్కువవుతూంటే అక్కడ నుంచి లేచాం. అయితే, లోతులేని మనస్సు మంచినెలా చేస్తుందెప్పుడైనా? "మంచి" చేయటమే లోతైన మనస్సుని సూచిస్తుందా? మనస్సు ఎంత గడుసుగా, సూక్ష్మంగా, జ్ఞానమయంగా ఉన్నా లోతు లేనిదే కదా ఎప్పుడూ? లోతులేని మనస్సు ఎన్నటికీ ఆగాధమైనది అవలేదు. అవటమే లోతులేకుండా ఉండటం. స్వయం కల్పితమైన దాన్ని అందుకోవాలని ప్రయత్నించటమే అవటం. కల్పిత రూపం మాటల్లో అత్యంత ఉన్నతం కావచ్చు, విశాల దృక్పథం కావచ్చు. పథకంగాని ప్రణాళిక గాని కావచ్చు. కాని అది అప్పటికీ లోతులేని దానిలో ఉద్భవించినదే. ఏం చెయ్యాలని చేసినా సరే, మనస్సంచలనం ఏ స్థాయిలోనైనా సరే, లోతులేనిదిగానే ఉంటుంది. లోతులేని మనస్సు తన కార్యకలాపాలు వృథా అనీ, ఉపయోగం లేనివనీ గ్రహించలేదు. లోతులేని మనస్సే కార్యకలాపంలో మునిగి ఉంటుంది. ఈ కార్యకలాపమే దాన్ని ఆ స్థితిలో ఉంచుతుంది. దాని కార్యకలాపమే దాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రభావితం అవటం వ్యక్తంగా అయినా, అవ్యక్తంగా అయినా సంఘర్షణ నుంచీ, పోరాటం నుంచీ విముక్తి పొందాలని కోరుతుంది. ఈ కోరికే జీవన సంచలనాన్నీ, అపరిచిత వాయువులనీ అడ్డుకోవటానికి గోడలు కడుతుంది. నిర్ణయాలూ, నమ్మకాలూ, సమర్ధనలూ, సిద్ధాంతాలూ అనే గోడలతో మనస్సు స్థిరంగా ఉండిపోతుంది. లోతులేనిది నిలవుండి అంతమైపోతుంది.

నిబద్ధం చేయటం ద్వారా రక్షణ కల్పించుకోవాలనే కోరికే మరింత సంఘర్షణనీ, సమస్యల్నీ పెంపొందిస్తుంది. నిబద్ధం చేయటమే వేరు చేయటం. వేరుగా ఉన్నదీ ఒంటరిగా ఉన్నదీ బ్రతకలేదు. వేరుగా ఉన్నది తక్కిన వేరుగా ఉన్నవాటితో కలిసి మొత్తం ఒకటి కాలేదు. వేరుగా ఉన్నది ఎప్పటికీ ఒంటరిగానే ఉంటుంది - అది కూడబెట్టటానికీ, చేరవేయటానికీ, విస్తృతం చేయటానికీ, ఇముడ్చుకోవటానికీ, ఐక్యం చేసుకోవటానికీ ప్రయత్నించినప్పటికీ, నిబద్ధం చేయటం విధ్వంసకరం. వినాశకరం. కాని, లోతులేని మనస్సు దీనిలోని సత్యాన్ని గ్రహించలేదు. సత్యం కోసం వెతకటంలో మునిగి ఉంటుంది. ఈ కార్యకలాపమే సత్యాన్ని గ్రహించకుండా చేస్తుంది. సత్యం అంటే ఆచరణ, అంతేకాని లోతులేని మనస్సు వాంఛించేదీ, అభివృద్ధిని కాంక్షించేదీ కాదు. సత్యంలోనే మంచితనం, అందం ఉంటుంది, నాట్యంలోనూ ప్రణాళికల్లోనూ మాటల్లోనూ కాదు. లోతు లేని వానికి సత్యమే స్వేచ్ఛ కలిగిస్తుంది, అంతేకాని, స్వేచ్ఛగా ఉండాలనుకునే పథకం కాదు. లోతులేనిది - అంటే మనస్సు తనకై తాను స్వేచ్ఛ పొందలేదు. ఒక ప్రభావం నుంచి మరొక ప్రభావానికి జరుగుతూ ఉంటుంది - ఇంకొకటి ఎక్కువ స్వేచ్ఛగా ఉంటుందనుకుని. ఇంకోటి ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండదు. అదొక ప్రభావం, తక్కువ దాన్ని మించినది. అవుతూ ఉండటం - బుద్ధుడు, లేదా యజమాని అవాలనుకునే వాని కార్యకలాపం లోతు లేనిది. లోతులేని వారు ఎప్పుడూ తామున్న స్థితి గురించి భయపడుతూనే ఉంటారు. కాని, వారున్న స్థితే సత్యం. ఉన్నస్థితిని నిశ్శబ్దంగా గమనించటమే సత్యం. సత్యమే ఉన్నస్థితిలో పరివర్తన తీసుకొస్తుంది.