మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/వ్యక్తి, సమాజం

వికీసోర్స్ నుండి

21. వ్యక్తి, సమాజం

రద్దీగా ఉన్న వీధిలో నడుస్తూ వెడుతున్నాం. వీధి కిటువైపూ అటువైపూ దారి జనంతో నిండి ఉంది. కారులూ, బస్సులూ, వదుల్తున్న పొగ వాసనతో మా ముక్కులు నిండి పోయాయి. దుకాణాల్లో ఎన్నో ఖరీదైన వస్తువులూ, చవకబారు వస్తువులూ ప్రదర్శింపబడి ఉన్నాయి. ఆకాశం వెలవెలబోతున్న వెండి రంగులో ఉంది. ఆ రహదారి చప్పుళ్లలోంచి బయటపడి పార్కులోకి వచ్చేసరికి హాయిగా ఉంది. పార్కులో బాగా లోపలిదాకా వెళ్లి కూర్చున్నాం.

ప్రభుత్వం సైనికీకరణంతోనూ శాసనాలతోనూ, ప్రతిదాంట్లోనూ వ్యక్తిని తనలో లీనం చేసుకుంటోంది అంటున్నాడాయన. దైవాన్ని బదులు ప్రభుత్వాన్ని ఆరాధించటం జరుగుతోందిప్పుడు. చాలవరకు అన్ని దేశాల్లోనూ ప్రభుత్వం ప్రజల అంతరంగిక జీవితాల్లోకి కూడా ప్రవేశిస్తోంది. వాళ్లు ఏం చదవాలో, ఏం ఆలోచించాలో కూడా ఆదేశింపబడుతున్నారు. ప్రభుత్వం తన ప్రజలపైన ఒక కన్ను వేసి ఉంచుతోంది. తన దివ్య నేత్రాన్ని వారిపై ప్రసరింప జేస్తోంది - మత సంస్థ చేసే దానికి బదులుగా. ఇదొక కొత్తమతం. మనిషి ఇదివరకు చర్చికి దాసుడుగా ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వానికి దాసుడు. ఇంతకుముందు చర్చి, ఇప్పుడు ప్రభుత్వం అదుపులోనూ ఉందతని చదువు. మనిషి విమోచన గురించి అ రెండూ పట్టించుకోవు.

వ్యక్తికీ, సమాజానికీ మధ్య ఎలాంటి సంబంధం ఉంది? సమాజం వ్యక్తికోసం ఉన్నది గాని వ్యక్తి సమాజంకోసం కాదు నిశ్చయంగా. సమాజం ఉన్నది వ్యక్తికి లాభదాయకంగా ఉండటం కోసం. అది ఉన్నది వ్యక్తికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వటం కోసం, తనలోని అత్యున్నతమైన వివేకాన్ని మేలుకొలుపుకునే అవకాశాన్ని వ్యక్తికి కలుగజేయటం కోసం. ఈ వివేకం సాంకేతిక నైపుణ్యాన్నీ, జ్ఞానాన్నీ అలవరచుకోవటం కాదు. ఇది పైపై మనస్సుతో సంబంధం లేని సృజనాత్మక సత్యాన్ని తెలుసుకుంటూ ఉండటం. వివేకం సాధన చేసి పొందే ఫలితం కాదు; క్రమక్రమంగా పెరిగే ఘనతనుంచీ, విజయం నుంచీ పొందే స్వేచ్ఛ. వివేకం స్థిరంగా ఉండేది కాదు. దాన్ని అనుకరించటం, సూత్రబద్ధం చేయటం సాధ్యం కాదు. అందుచేత దాన్ని నేర్పటం సాధ్యంకాదు. వివేకం స్వేచ్ఛలోనే సాక్షాత్కరిస్తుంది.

సామూహిక ఇచ్ఛ, దాని కార్యాచరణ - ఇదే సమాజం అంటే, సమాజం వ్యక్తికి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించదు. అది జీవం, చలనం లేనిది కాబట్టి సమాజం వ్యక్తికి సానుకూల పడేందుకే ఏర్పడింది. దానికి సొంత రూపం అంటూ ఏమీ లేదు. మనుషులు సమాజాన్ని వశం చేసుకుని, దానికి మార్గం చూపించి, దాన్ని రూపొందించి దానిపైన నిరంకుశత్వం వహించవచ్చు, వారి వారి మనస్థితిని బట్టి. కాని సమాజం మనిషికి అధిపతి కాదు. మనిషిని ప్రభావితం చెయ్యవచ్చు, కాని మనిషి దాన్ని ఎప్పుడూ ఖండిస్తాడు. మనిషికీ సమాజానికీ మధ్య సంఘర్షణ ఎందుకున్నదంటే మనిషి తనలో తానే ఘర్షణ పడుతున్నాడు కాబట్టి, స్థిరమైనదానికీ, సజీవమైనదానికీ మధ్య సంఘర్షణ. వ్యక్తి బాహ్యరూపమే సమాజం. అతనికీ, సమాజానికీ మధ్యనున్న సంఘర్షణ అతనిలో అంరర్గతంగా ఉన్న సంఘర్షణే. అత్యున్నతమైన వివేకం మేలుకునేంతవరకూ ఈ సంఘర్షణ అంతర్గతంగానూ బహిరంగంగానూ ఉండి తీరుతుంది.

మనం సంఘజీవులమే కాక వ్యక్తులం కూడా. మనం ప్రజలమే కాక మనుషులం కూడా. సుఖదుఃఖాలకు రెండు విధాలా లోనవుతాం. శాంతి ఉండాలంటే మనిషికీ పౌరుడికీ మధ్య ఉండే సరియైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. మనం పూర్తిగా పౌరులుగానే ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. అది ప్రభుత్వం తెలివితక్కువతనమే. అయితే మనం కూడా మనిషిని పౌరుడి చేతికి అప్పజెప్పడానికి ఇష్టపడతాం. ఎందుచేతనంటే, మనిషిగా ఉండటం కన్న పౌరుడిగా ఉండటం సులభం. మంచి పౌరుడిగా ఉండటమంటే అమలులో ఉన్న సాంఘిక పద్ధతి ప్రకారం సమర్థతతో పనిచెయ్యడమే. సామర్థ్యం, పద్ధతి ప్రకారం నడుచుకోవడం - ఈ రెండూ పౌరుడికి ఉండి తీరాలి. వాటివల్లనే అతడు రాటుదేలి నిర్దయుడిగా తయారై, మనిషిని పౌరుడికోసం, త్యాగం చెయ్యగలుగుతాడు. మంచి పౌరుడు మంచి మనిషి అయి ఉండాలని లేదు. కాని మంచి మనిషి అయి ఉంటే అతడు సరియైన పౌరుడు అయితీరుతాడు, ఒక ప్రత్యేక సమాజానికీ, ఒక ప్రత్యేక దేశానికీ చెందిన వాడుగా కాదు. అతడు ప్రప్రథమంగా మంచి మనిషి కనుక అతని చర్యలు సంఘవిద్రోహకరంగా ఉండవు. అతడు మరో మనిషికి వ్యతిరేకంగా ఉండడు. మంచి వాళ్ళందరితో సహకరిస్తూ జీవిస్తాడతను. అధికారాన్ని కాంక్షించడు. అతనికి అధికారం ఉండదు. నిర్దాక్షిణ్యత లేకుండా సామర్థ్యం చూపించ గలుగుతాడు. పౌరుడు మనిషిని త్యాగం చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తాడు. కాని, అత్యున్నత వివేకాన్ని శోధించే మనిషి సహజంగా ఆ పౌరుడి తెలివి తక్కువతనాన్ని పట్టించుకోడు. అందుచేత ప్రభుత్వం అటువంటి మంచిమనిషికీ, వివేకవంతుడైన మనిషికీ వ్యతిరేకంగా ఉంటుంది. కాని అటువంటి మనిషి అన్ని ప్రభుత్వాలనుంచీ, అన్ని దేశాల నుంచీ స్వేచ్ఛగా ఉంటాడు.

వివేకవంతుడైన మనిషి మంచి సమాజానికి దోహదం చేస్తాడు. కాని మంచి పౌరుడు మనిషి అత్యున్నత వివేకాన్ని పొందగలిగే సమాజాన్ని సృష్టించ లేడు. పౌరుడు ఆధిక్యం ప్రదర్శిస్తున్నప్పుడు పౌరుడికీ, మనిషికీ మధ్య సంఘర్షణ అనివార్యం. మనిషిని కావాలని నిర్లక్ష్యం చేసే ఏ సమాజమైనా నాశనమవుతుంది. మనిషి మానసిక ప్రక్రియ అర్థం చేసుకున్నప్పుడే పౌరుడికీ, మనిషికీ సామరస్యం కుదురుతుంది. ప్రభుత్వం, ప్రస్తుత సమాజం బాహ్య మానవుడిని, అంటే పౌరుడిని తప్ప అంతర్గతమైన మనిషిని గురించి పట్టించుకోదు. అంతర్గతమైన మనిషిని కాదనవచ్చు. కాని అతడే ఎప్పుడూ బాహ్యమానవుడిని ఓడిస్తాడు. పౌరుడికోసం కపటంగా చేసిన పథకాలను ధ్వంసం చేస్తాడు. ప్రభుత్వం భవిష్యత్తు కోసం ప్రస్తుతాన్ని త్యాగం చేస్తుంది. భవిష్యత్తు కోసం తన్ను తాను సదా సంరక్షించుకుంటూ ఉంటుంది. భవిష్యత్తుకే ప్రాధాన్యాన్ని అంతా ఇస్తుంది, ప్రస్తుతానికి కాదు. వివేకవంతుడైన మనిషికి ప్రస్తుతమే అత్యంత ప్రధానం; ఇప్పుడే, రేపు కాదు. రేపు అనేది అదృశ్యమయినప్పుడే ఉన్నదాన్ని అర్థం చేసుకోగలం. ఉన్నదాన్ని అర్ధం చేసుకున్నట్లయితే ప్రస్తుతం తక్షణమే పరివర్తన చెందుతుంది. ఈ పరివర్తనే అత్యంత ప్రధానమైనది; అంతేకాని పౌరుడికీ, మనిషికీ మధ్య సామరస్యం కుదర్చడం ఎలాగ అని కాదు. ఈ పరివర్తన జరిగినప్పుడు మనిషికీ, పౌరుడికీ మధ్య సంఘర్షణ అంతమవుతుంది.