మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/రేడియో, సంగీతం

వికీసోర్స్ నుండి

27. రేడియో, సంగీతం

రేడియో సంగీతం తప్పించుకునేందుకొక అద్భుతమైన మార్గం అని స్పష్టమవుతోంది. పక్కింటివాళ్లు దాన్ని రోజంతా పెట్టుకోవటమే కాక, రాత్రి చాలా సేపటివరకూ పెట్టి ఉంచుతారు. తండ్రి చాలా తొందరగా ఆఫీసుకి వెళ్లిపోతాడు. తల్లీ, కూతురూ ఇంట్లోనూ, తోటలోనూ పనిచేస్తూ ఉంటారు. వాళ్లు తోటలో పని చేస్తున్నంత సేపూ రేడియో గట్టిగా మోగుతూనే ఉంటుంది. కొడుక్కి కూడా ఆ సంగీతం, ప్రచార కార్యక్రమాలూ ఇష్టంలానే కనిపిస్తుంది. అతను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ రేడియో అలా మోగుతూనే ఉంటుంది. రేడియోలో అన్ని రకాల సంగీతాన్నీ, శాస్త్రీయ సంగీతం నుంచి సరికొత్త సంగీతం వరకూ అంతు లేకుండా వినొచ్చు. రహస్య పరిశోధక నాటకాలూ, వార్తలూ వంటివి నిరంతరం ప్రసారమైన వన్నీ వినొచ్చు. ఎవరితోనూ సంభాషించనక్కర్లేదు. ఒకరి ఆలోచన లొకరికి చెప్పుకోనక్కర్లేదు. మీక్కావలిసినవన్నీ రేడియో చేసి పెడుతుంది. విద్యార్థులు చదువుకోవటంలో కూడా రేడియో తోడ్పడుతుందట. పాలు పిండేటప్పుడు ఆవులికి రేడియో వినిపిస్తే పాలు ఎక్కువిస్తాయట.

ఇందులో అన్నిటికన్నా చిత్రమైన విషయమేమిటంటే రేడియో మన జీవన విధానంలో తెచ్చే మార్పు ఎంత స్వల్పమోనన్నది. కొన్ని విషయాల్లో మరికొంచెం వీలుగా ఉండేట్లు చేస్తూ ఉండి ఉండవచ్చు. ప్రపంచ వార్తల్ని మనకి అతి త్వరగా లభ్యం చేయవచ్చు. హత్యల్ని గురించి ఎంతో వివరంగా వర్ణించి చెప్పవచ్చు. కాని, సమాచారం మనల్ని వివేకవంతుల్ని చెయ్యబోదు. అణ్వాయుధాల ప్రయోగం కలిగించే భీభత్సం గురించీ, అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాల గురించీ. ఆకులలోని ఆకుపచ్చ రంగు లక్షణాల పైన పరిశోధన గురించీ, ఇటువంటి వాటి గురించి సమాచారం మన జీవితాల్లో తెచ్చిన ముఖ్యమైన మార్పు ఏమీ లేనట్లే తోస్తుంది. మన యుద్ధ మనస్తతత్వం ఎప్పటిలాగే ఉంది. ఇతర జనాన్ని మనం అసహ్యించుకుంటున్నాం. ఒక రాజకీయ నాయకుని ద్వేషిస్తున్నాం. మరొకరికి చేయూతనిస్తున్నాం. మత సంస్థల వల్ల మోసపోతున్నాం. మనం జాతీయ వాదులం. మన దుఃఖాలూ అలాగే కొనసాగుతున్నాయి. వాటిని తప్పించుకోవాలని మనకింకా పట్టుదల. అ తప్పించుకునే మార్గాలు ఎంత గౌరవప్రదమైనవీ, ఎంత క్రమ బద్ధమైనవీ అయితే అంత మంచిది. సామూహికంగా తప్పించుకోవటం అత్యుత్తమమైన రక్షణ మార్గం. ఉన్న దాన్ని ఎదుర్కొన్నట్లయితే మనం చెయ్యగలిగినది కొంతైనా ఉంటుంది కాని, ఉన్న స్థితి నుంచి ఎగిరిపోయి తప్పించుకోవటం వల్ల మనం తెలివితక్కువగా, మందకొడిగా, అనుభూతులకూ, సందిగ్ధతకీ బానిసలుగా తయారవటం అనివార్యం.

ఉన్న దాన్నుంచి హాయిగా తప్పించుకునే సూక్ష్మమార్గాన్నివ్వటం లేదూ సంగీతం? మంచి సంగీతం మన నుంచి మనల్ని ఎంతో దూరానికి తీసుకుపోతుంది. ఈ దైనందిన దుఃఖాలకీ, అల్పత్వానికీ, ఆదుర్దాలకీ దూరంగా తీసుకుపోయి మనం వాటిని మరిచి పోయేటట్లు చేస్తుంది. లేదా, జీవితాన్ని ఎదుర్కొనేందుకు శక్తినిస్తుంది. మనకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ప్రోత్సాహపరుస్తుంది. శాంతపరుస్తుంది. మనల్ని మనం మరిచిపోవటానికి గాని, ఉత్తేజం పొందే సాధనంగా గాని, ఏవిధంగానైనా అది, మనకి అవసరమవుతుంది. అందమైన దాని మీద ఆధారపడుతూ అనాకారియైన దాన్ని ఏవగించుకుని తప్పించుకుంటే ఆ తప్పించుకునే మార్గం అంతమైపోయినప్పుడు అది దుర్భరమైన సమస్య అవుతుంది. అందం మన సుఖజీవనానికి అవసరమైనప్పుడు, అనుభవించటం అనేది అంతమై, అనుభవం మొదలవుతుంది. అనుభవం పొందే క్షణం వేరు. అనుభూతిని వెంటాడడం వేరు. అవి పూర్తిగా పరస్పర విరుద్ధమైనవి. అనుభవం పొందటంలో అనుభోక్తను గురించి ఎరుక గాని అనుభూతులు గాని ఉండవు. అనుభవం పొందటం అంతమైనప్పుడు అనుభోక్తకు అనుభూతులు ఆరంభమవుతాయి. ఈ అనుభూతులనే అనుభోక్త కోరుతాడు, వెంట పడతాడు. అనుభూతులు అవసరమైనప్పుడు, ఇక, సంగీతం, నది, చిత్రలేఖనం మొదలైనవన్నీ మరికొంత అనుభూతిని కలుగజేయటానికి సాధనాలవుతాయి, అంతే. అనుభూతులకే ఆధిక్యం అంతా - అనుభవం పొందటానికి కాదు. ఒక అనుభవం మళ్లీ కలగాలని తపించటం అనుభూతిని కోరుకోవటమే. అనుభూతులు పునరుద్భవించేటట్లు చేయటం సాధ్యమైనట్లు అనుభవం మళ్లీ అదేవిధంగా పొందటం సాధ్యం కాదు.

అనుభూతిని కోరటం సంగీతాన్ని విడువకుండా పట్టుకునేట్లూ, అందాన్ని తన సొంతం చేసుకునేట్లూ చేస్తుంది. ఒక బాహ్య రేఖ మీదం రూపం మీద ఆధారపడటం మనలోని శూన్యతని సూచిస్తుంది. ఆ శూన్యాన్ని మనం సంగీతంతోనో, లలిత కళతోనో, ప్రయత్న పూర్వకమైన మౌనంతోనో నింపుతూ ఉంటాం. ఈ మార్పులేని శూన్యతని అనుభూతులతో నింపటమో కప్పివేయటమో చేస్తాం కాబట్టే ఉన్న స్థితి అన్నా, మనం ఉన్న పరిస్థితి అన్నా మనకి అంతులేని భయం. అనుభూతులకు ఆది, అంతం ఉంటాయి. వాటిని మళ్లీ పొందవచ్చు. విస్తృతపరచుకోవచ్చు. కాని అనుభవం పొందటానికి కాల పరిమితి లేదు. ముఖ్యమైనదేమిటంటే అనుభవం పొందటం. అనుభూతుల కోసం వెంపరలాడడంలో అదిలేదు, అనుభూతులు పరిమితమైనవి, వ్యక్తిగతమైనవి. సంఘర్షణనీ, దుఃఖాన్నీ కలిగిస్తాయి. కాని అనుభవం పొందటం అందుకు పూర్తిగా విరుద్ధమైనది. అదే అనుభవాన్ని మళ్లీ పొందటం జరగదు. అనుభవం కొనసాగదు. ఎప్పటి కప్పుడు అనుభవం పొందటంలోనే పునఃసృష్టి పరివర్తనం ఉంటాయి.