మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/దుఃఖం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

84. దుఃఖం

చచ్చిపోయిన ఒక పెద్ద జంతువు నదిలో కొట్టుకుపోతుంది. దానిమీద కొన్ని రాబందులు కూర్చుని దాని చర్మాన్ని ఒలిచేస్తున్నాయి; తక్కిన రాబందుల్ని చెదరగొడుతున్నాయి - తమ కడుపులు నిండేదాకా. నిండిన తరవాత ఎగిరి పోతాయి. తక్కినవి కొన్ని చెట్లమీదా, ఒడ్డుమీదా ఉన్నాయి. కొన్ని నెత్తిమీద తిరుగాడుతున్నాయి. సూర్యుడు అప్పుడే ఉదయించాడు. గడ్డి మీద మంచు బిందువులున్నాయి. నదికి అవతల ఒడ్డున ఉన్న పచ్చని పొలాలు మసగ్గా కనిపిస్తున్నాయి. రైతుల గొంతులు నీటికవతల నుంచి స్పష్టంగా వినవస్తున్నాయి. అది రమణీయమైన ఉదయం, స్వచ్ఛంగా, కొత్తగా ఉంది. ఒక కోతిపిల్ల తల్లి చుట్టూ ఆడుకుంటోంది చెట్ల కొమ్మల్లో. కొమ్మ పొడుగుతా పరుగెత్తి పక్క కొమ్మమీదికి గెంతుతోంది. మళ్లీ పరుగెత్తుకుంటూ వస్తోంది. తల్లి దగ్గరగా పైకి ఎగరటం, క్రిందికి దూకటం. ఈ చేష్టలన్నిటితో విసుగెత్తాక ఆ చెట్టుమీంచి దిగి మరోటి ఎక్కుతోంది. క్రిందికి దిగుతూనే మధ్యలో వెళ్లి తల్లిని కరుచుకుంటోంది. వీపుమీదకెక్కటం, దాని క్రింద ఊగిసలాడటం చేస్తోంది. దాని ముఖం ఎంతో బుల్లిది. దాని కళ్లు ఆటతో, భయంతో చేసే అల్లరితో నిండి ఉన్నాయి.

కొత్తదన్నా తెలియనిదన్నా ఎంత భయపడతాం మనం! మనకి నిత్యం ఉండే అలవాట్లలో దైనందిన చర్యల్లో, దెబ్బలాటల్లో, ఆదుర్దాలో మూసుకుపోయి ఉంటాం. అదే పాత పద్ధతిలో ఆలోచించాలనుకుంటాం. అదే దారిలో వెళ్లాలనుకుంటాం. అవే ముఖాలు చూస్తాం. అవే ఆందోళనలు పెట్టుకుంటాం. క్రొత్తవారిని కలుసుకోవటానికి ఇష్టపడం. ఒకవేళ కలుసుకున్నా ముభావంగా వ్యాకులపాటుతో ఉంటాం. తెలియని జంతువేదైనా ఎదురైతే ఎంత భయపడతాం! ధైర్యం చేసి బయటికి వచ్చినా అది ఆ గోడలు ఇంకా విస్తృతం చేసుకుని వాటి మధ్యనే. మనకి అంతం అంటూ ఉండదు. ఎప్పుడూ కొనసాగే దాన్నే పోషిస్తూ ఉంటాం. రోజురోజుకీ నిన్నటి భారం మోసుకుపోతూ ఉంటాం. మన జీవితం సుదీర్ఘంగా కొనసాగే చలనం. మన మనస్సులు మందకొడిగా సున్నితత్వం లేకుండా ఉంటాయి.

అతను ఏడుపు ఆపులేకపోయాడు. అది అణుచుకుంటూ నిగ్రహించుకుంటూ ఏడ్చిన ఏడుపుకాదు - ఒళ్లంతా అదిరి పోయేటట్లు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇంకా చిన్న వాడిలా ఉన్నాడు, ఊహా చిత్రాలు చూసిన కళ్లతో. కొంతసేపటి వరకూ మాట్లాడలేకపోయాడు. చివరికి మాట్లాడగలిగేటప్పటికి అతని గొంతు వణికింది. మళ్లీ పెద్దగా వెక్కుతూ ఏడుపు, సిగ్గుపడకుండా స్వేచ్ఛగా ఏడ్చాడు. అంతలోనే చెప్పాడు.

"నా భార్యపోయిన రోజు తరవాత మళ్లీ ఏడవలేదు నేను. అలా ఎందుకేడ్చానో నాకే తెలియదు. కాని తేలికపడింది. ఇంతకుముందు నా భార్య బ్రతికి ఉన్నప్పుడు తనతో కలిసి ఏడ్చాను. కాని, అప్పుడు నవ్వులాగే ఏడుపు కూడా ప్రక్షాళితం చేసేది. తన మరణం తరవాత ప్రతిదీ మారిపోయింది. నేనిదివరకు చిత్రలేఖనం చేసేవాణ్ణి. కాని, ఇప్పుడు కుంచెలు ముట్టుకోలేక పోతున్నాను. నేను గీసిన వాటికేసి చూడలేక పోతున్నాను. గత ఆరుమాసాల్లోనూ నేను చచ్చిపోయానా అనిపిస్తోంది. మాకు పిల్లల్లేరు. కాని, అప్పుడు గర్భిణిగా ఉంది. వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా నమ్మలేక పోతున్నాను. ఎందుకంటే ప్రతీదీ మేమిద్దరం కలిసిచేసేవాళ్లం. తను ఎంత అందమైనదో, ఎంత మంచిదో - నేనేం చెయ్యాలిప్పుడు? అలా ఆపులేకుండా ఏడ్చినందుకు చింతిస్తున్నాను. అలా ఎందుకు జరిగిందో భగవంతుడికే తెలియాలి. అలా ఏడవటం మంచిదే అయిందని తెలుసు. కానిం మళ్లీ ఇదివరకులా ఎప్పటికీ ఉండదు. నా జీవితంలోంచి ఏదో వెళ్ళిపోయింది. మొన్నోరోజు కుంచెలు తీసుకున్నాను. కాని, అవి అపరిచితంగా తోచాయి. ఇదివరకు చేతిలో కుంచె ఉన్న సంగతి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అది బరువుగా, భారంగా ఉంటోంది. తరుచు నదివైపుకి వెళ్ళాను తిరిగి రాకూడదనుకుంటూ. కాని, ప్రతిసారీ తిరిగి వచ్చాను. జనాన్ని చూడలేక పోతున్నాను. ఆమె ముఖమే కనిపిస్తోంది. ఆమెతోనే నిద్రపోతున్నాను. కలగంటున్నాను, కలిసి తింటున్నాను. కాని, మళ్లీ ఇదివరకులా ఎన్నటికీ ఉండదని నాకు తెలుసు. దాని గురించి తర్కించుకున్నాను, ఆ సంఘటనని సహేతుకంగా చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను, కాని, నాకు తెలుసు ఆమె ఇంకలేదని; ప్రతి రాత్రీ ఆమె గురించే కలగంటున్నాను; కాని, ఎంతకీ నిద్రపోలేను ప్రయత్నించినా. ఆమె వస్తువులు ముట్టుకోవటానికి భయం. వాటి వాసన కొంచెం తగిలినా పిచ్చెత్తిపోతోంది. మరిచిపోవటానికి ప్రయత్నించాను. కాని, ఏంచేసినా మళ్లీ ఇదివరకులా ఉండదెన్నటికీ. ఇదివరకు పక్షులగానాన్ని వినేవాణ్ణి. ఇప్పుడు ప్రతివస్తువుని నాశనం చెయ్యాలనిపిస్తోంది. ఇంకా ఇలా ఉండటం నావల్ల కావటం లేదు. అప్పటి నుంచీ నా స్నేహితుల్ని ఎవర్నీ కలుసుకోలేదు. ఆమె లేకుండా వాళ్లు నాకు ఏమీ కారనిపిస్తోంది. నేనేం చెయ్యను?"

మేము చాలాసేపు మౌనంగా ఉన్నాం.

దుఃఖానికీ ద్వేషానికీ దారితీసే ప్రేమ ప్రేమ కాదు. మనకి ప్రేమంటే తెలుసునా? అడ్డం వస్తే ఆగ్రహంగా మారేది ప్రేమేనా? లాభం, నష్టం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుందా?

"ఆమెని ప్రేమించటంలో అవేమీ లేవు. వాటన్నిటినీ పూర్తిగా మరిచి పోయాను. నన్ను నేను మరిచిపోయాను. నాకు ప్రేమ తెలుసును. ఆమె పట్ల నాకింకా అదే ప్రేమ. కాని, ఇప్పుడు తక్కినవి కూడా తెలుసుకుంటున్నాను. నా గురించీ, నా దుఃఖం గురించీ, నా దుర్దినాల గురించీ."

ఎంత త్వరలో ప్రేమ ద్వేషంగా, అసూయగా, దుఃఖంగా మారి పోతుంది! ఆ పొగలో ఎంత లోతుగా కొట్టుకుపోతాం! అంత దగ్గరగా ఉండేది ఎంత దూరమై పోతుంది! ఇప్పుడు మన ఇతర విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. హఠాత్తుగా తెలుసుకున్నాం. హఠాత్తుగా అవి ఎంతో ఎక్కువ ముఖ్యమైపోయాయి. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నామనీ, తోడు లేకుండా ఉన్నామనీ, చిరునవ్వూ, చనువుగా తిట్టటం లేవనీ తెలుసుకున్నాం, ఇంకొకరి గురించే కాకుండా మన గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇది వరకు ఇంకొకరే సర్వమూ, మనం ఏమీకాదు. ఇప్పుడు ఇంకొకరు లేరు. మనం ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాం. ఇంకొకరు కల, వాస్తవమైనది మనం ఉన్న స్థితే. ఇంకొకరు ఎప్పుడైనా వాస్తవంగా ఉన్నారా? లేక మనం సృష్టించుకున్న కలేనా? త్వరలో మాయమైపోయే మన ఆనందం అనే అందమైన వస్త్రం కప్పిన కలేనా అది? మాయమైపోవటమే మరణం. మనం ఉన్నదే జీవితం. మరణంలో ఎప్పుడూ జీవితం ఇమిడి ఉండదు - మనం ఎంత కోరుకున్నా. జీవితమే మరణం కన్న శక్తిమంతమైనది. లేనిదానికన్న ఉన్నదానికే శక్తి ఎక్కువ. కాని మనం మరణాన్నే ఎంతగా ప్రేమిస్తాం, జీవితం కన్న! జీవితాన్ని కాదనటం ఎంతో సంతోషదాయకంగా, విస్మరణీయంగా ఉంటుంది. ఇంకొకటి ఉంటే మనం ఉండం. ఇంకొటి ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా మొహమాటం లేకుండా ఉంటాం. అ ఇంకొకటి పువ్వు, పక్కింటివాళ్లు, సువాసన, జ్ఞాపకం. మనందరికీ ఇంకొకటే కావాలి. ఇంకొకదానితోనే మనల్ని మనం ఐక్యం చేసుకుంటాం. ఇంకొకటే ముఖ్యం, మనం కాదు. ఇంకొక్కటే మన స్వప్నం; లేచిన తరవాత మనం ఉన్నస్థితిలో మనం ఉంటాం. ఉన్నస్థితి మరణం లేనిది. కాని ఉన్నస్థితిని మనం అంతం చెయ్యాలనుకుంటాం. అంతం చెయ్యలనే కోరికలో నుంచి కొనసాగేది పుడుతుంది. కొనసాగేదానికెప్పుడూ మరణరహితమైన దేమిటో తెలియదు.

"నాకు తెలుసును నేనీవిధంగా జీవస్మరణం లాంటి బ్రతుకు ఇంక బ్రతకలేనని. మీరనేదేమిటో నాకర్థం అయిందో లేదో నాకు నిశ్చయంగా తెలియదు. ఏదీ గ్రహించలేనంతగా చెదిరిపోయి ఉన్నాను."

చెబుతున్నదానిమీదా, మీరు చుదువుతున్న దానిమీదా పూర్తిగా శ్రద్ధ చూపించకపోయినప్పటికీ మీకు తెలియకుండానే మీకు ఇష్టం ఉన్నాలేకున్నా ఏదో కొంత మీకు వినిపించి మీలో ప్రవేశించటం మీరు తరుచు గమనించ లేదా? ఆ చెట్లకేసి మీరు ప్రయత్నపూర్వకంగా చూడకపోయినా తరవాత వాటి రూపం హఠాత్తుగా ప్రతి వివరంతోనూ కనిపిస్తుంది. అలా జరగటం ఎప్పుడూ కనిపెట్టలేదా? నిజమే, ఈమధ్య కలిగిన అఘాతం వల్ల, మీరు చెదిరిపోయి ఉన్నారు. అయినప్పటికీ, దాన్నుంచి మీరు తేరుకున్న తరవాత, మనం ఇప్పుడు చెబుతున్నది గుర్తుకి వస్తుంది. అప్పుడేమైనా అది సహాయకరంగా ఉండొచ్చు. కాని ముఖ్యంగా మీరు గ్రహించవలసినది - మీరు అఘాతం నుంచి బయటపడ్డాక మీ దుఃఖం మరింత తీవ్రమవుతుంది. అప్పుడు మీ దుఃఖం నుంచి మీరు తప్పించుకుపోవాలని కోరుకుంటారు. మీరు తప్పించుకునేందుకు సహాయపడటానికి చాలామందే ఉంటారు. వాళ్లు వీలైనన్ని కారణాలూ, నిర్ణయాలూ తమకు గాని, ఇతరులకు గాని తట్టినవి అందిస్తారు. అన్ని రకాల సహేతుకమైన సమర్థనలూ చేస్తారు. లేదా, మీ అంతట మీరే మీ దుఃఖాన్ని అణచివేసుకునేందుకు సంతోషకరమైనదో, అసంతోషకరమైనదో, ఏదో మార్గంలో వెనక్కి తప్పుకోవాలని చూస్తారు. ఇప్పటి వరకూ ఆ సంఘటనకి మరీ సన్నిహితంగా ఉన్నారు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఏదో రకమైన ఉపశమనం కోసం తపిస్తారు; మతం, విశ్వాసరాహిత్యం, సాంఘిక కార్యకలాపం, లేదా, ఏదో సిద్ధాంతం. కాని తప్పించుకునే మార్గం ఏ రకమైనదైనా, అది దేవుడైనా, తాగుడైనా, దుఃఖం అంటే అర్థం అవకుండా ఆటంకం కలిగిస్తాయి.

దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి గాని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దుఃఖం కొనసాగేటట్లు చేయటమే. దుఃఖాన్ని నిర్లక్ష్యం చేయటమంటే దాన్నుంచి పారిపోవటమే. దుఃఖాన్ని అర్థం చేసుకోవటానికి ఆచరణాత్మకమైన, ప్రయోగాత్మకమైన పద్ధతి అవసరం. ప్రయోగం చేయటమంటే ఒక నిశ్చిత ఫలితం కోసం ప్రయత్నించటం కాదు. నిశ్చిత ఫలితం కోసం ప్రయత్నిస్తే ప్రయోగం చేయటం సాధ్యంకాదు. మీకు కావలసినదేదో మీకు తెలిసినప్పుడు దాన్ని అనుసరించటం ప్రయోగం చేయటం కాదు. దుఃఖాన్ని తప్పించుకుందామని మీరనుకుంటే, అంటే దాన్ని నిందిస్తే, అప్పుడు దాని సంపూర్ణ క్రియని మీరు అర్థం చేసుకోరు. దుఃఖాన్ని దాటవెయ్యటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆలోచించేదల్లా దాన్ని ఎలా తప్పించుకోవాలా అనే. దుఃఖాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని సమర్థించటానికిగాని తప్పించుకోవటానికి గాని ఏవిధమైన చర్యా కావాలని తీసుకోకూడదు. మనస్సు పూర్తిగా అనాసక్తంగా, నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటే ఏవిధమైన సందేహం లేకుండా దుఃఖం తేటతెల్లం కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. మనస్సు ఏదైనా ఆశకి గాని, నిర్ణయానికి గాని, జ్ఞాపకానికి గాని కట్టుపడి ఉంటే దుఃఖం యొక్క గాథని అర్థం చేసుకోలేదు. ఉన్నస్థితి యొక్క త్వరితగతిని అనసరించటానికి మనస్సు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ ఆఖరున ఉండవలసినది కాదు, ఆరంభంలోనే ఉండాలి.

"ఈ దుఃఖం అంతటికీ అర్థం ఏమిటి?"

దుఃఖం సంఘర్షణకి - సుఖదుఃఖాల సంఘర్షణకి సూచన కాదా? అజ్ఞానాన్ని తెలియజేసేది కాదా దుఃఖం? అజ్ఞానం అంటే యథార్ధాల గురించి వివరాలు తెలిసి ఉండకపోవటం కాదు. అజ్ఞానం అంటే తనలో మొత్తం ఏం జరుగుతున్నదీ తెలుసుకోకపోవటమే. తన రీతులను అర్థం చేసుకోనంత వరకూ దుఃఖం ఉండి తీరుతుంది. తన పద్ధతులను సంబంధ వ్యవహారాల్లో తీసుకునే చర్యల్లోనే కనుక్కోవాలి.

"కాని నా సంబంధం అంతమైపోతుంది కదా."

సంబంధానికి అంతం ఉండదు. ఒక ప్రత్యేక సంబంధం అంతమై పోవచ్చు. కాని సంబంధం అంతం కాదు. ఉండటమంటేనే సంబంధంతో ఉండటం. ఏదీ ఒంటరిగా ఉండలేదు. ఒక ప్రత్యేక సంబంధం ద్వారా మనల్ని మనం విడిగా ఉంచుకోవటానికి ప్రయత్నించినప్పటికీ, ఆ విడిగా ఉంచుకున్న ప్రతిసారీ దుఃఖం కలగటం అనివార్యం అవుతుంది. దుఃఖమంటే విడిగా ఉంచుకోవటమనే ప్రక్రియే.

"జీవితం మళ్లీ ఎప్పట్లా ఉంటుందా?"

నిన్నటి ఆనందం మళ్లీ ఇవాళ సంభవం అవుతుందా? ఈ రోజున ఆనందం లేనప్పుడే మళ్లీ సంభవం అవాలనే కోరిక పుడుతుంది. ఈ రోజు శూన్యంగా ఉంటే గతం వైపుగాని, భవిష్యత్తు వైపుగాని చూస్తాం. మళ్లీ సంభవం అవాలని కోరటం కొనసాగింపుకోసమే. కొనసాగేదానిలో ఎప్పుడూ కొత్తదనం ఉండదు. ఆనందం గతంలోనూ భవిష్యత్తులోనూ ఉండేది కాదు. ప్రస్తుతం జరిగే దాంట్లో మాత్రమే ఉంటుంది.