మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఏకాంతం, ఒంటరితనం

వికీసోర్స్ నుండి

5. ఏకాంతం, ఒంటరితనం

సూర్యుడు అస్తమించాడు. చీకట్లు పులుముకుంటున్న ఆకాశం క్రింద చెట్ల ఆకారాలు నల్లగా కనిపిస్తున్నాయి. విశాలంగా ఉధృతంగా ఉండే నది ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంది. చంద్రబింబం దూరంగా ఆకాశంలో లీలగా కనిపిస్తోంది. రెండు మహా వృక్షాల మధ్యనుంచి పైకి వస్తోంది. ఇంకా చెట్ల నీడలు పడటం లేదు.

ఎత్తుగా ఉన్న నదిఒడ్డు మీదుగా నడిచి పచ్చని వరిచేల చుట్టూ ఉన్న మార్గం గుండా వెళుతున్నాం. ఈ మార్గం చాలా పురాతనమైనది. దాని మీద ఎన్నో వేలమంది నడిచారు. తరతరాలుగా నిశ్శబ్దంగా అలాగే ఉందది. చేలమధ్య నుంచీ, మామిడి తోపుల్లోంచీ, చింత తోపుల్లోంచీ, పాడుపడిన దేవలయాల పక్కనుంచీ పోతుందది. మధ్య మధ్య తోటలు; పచ్చ సంపెంగ పువ్వులు సన్నని పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. పక్షులు రాత్రి తలదాచుకునేందుకు గూళ్ళకి చేరుకుంటున్నాయి. పెద్ద చెరువులో నక్షత్రాల నీడలు కనిపించటం మొదలుపెట్టాయి. ప్రకృతి భాషించే స్థితిలో లేదు ఆ సాయంకాలం. చెట్లు నిశ్శబ్దంగా చీకట్లోకి తప్పుకొని ఒంటరిగా ఉన్నాయి. ఎవరో కొద్ది మంది గ్రామస్తులు కబుర్లు చెప్పుకుంటూ సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. మళ్లీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఉండే గంభీర నిశ్శబ్దం, ప్రశాంతతా ఏర్పడ్డాయి. ఈ ఏకాంతం బాధ కలిగించటం లేదు. ఒంటరితనం భయంకరంగా లేదు. ఇది ఏకాంతంగా ఉండటం. కల్మషం లేకుండా, సమృద్ధిగా, సంపూర్ణంగా ఉంది. ఆ చింతచెట్టు అక్కడ అలాగే ఉండటమే గాని దానికి వేరే జీవనం ఏమీలేదు. ఇదే కదా ఏకాంతం. నిప్పులాగ, పువ్వులాగ ఏకాంతంగా ఉండటం. అందులో ఉన్న పవిత్రతనీ, గంభీరతనీ తెలుసుకోలేరు. ఏకాంతం ఉన్నప్పుడే ఏదైనా తెలుసుకోగలుగుతారు. ఏకాంతంగా ఉండటం అంటే అన్నిటినీ త్రోసిపుచ్చి తన చుట్టూ గూడు కట్టుకుని కూర్చోవటం కాదు. అన్ని ఉద్దేశాలనీ, కోరికలు తీర్చుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలనీ, అన్ని లక్ష్యాలనీ ప్రక్షాళనం చేసుకోవటమే ఏకాంతం అంటే. మనస్సు యొక్క అంతిమ లక్ష్యం కాదు ఏకాంతం. ఏకాంతం కోరుకుంటే వచ్చేది కాదు. ఆ విధమైన కోరిక కేవలం తెలుసుకోవటం చేత కాక, ఆ చేతకాని తనం కల్పించే బాధని తప్పించుకునే మార్గం మాత్రమే.

భయమూ బాధతో కూడిన ఒంటరితనం అంటే ఒక్కరూ ఒంటరిగా మిగిలిపోవడం. స్వార్థంతో చేసే పనులవల్ల కలిగే అనివార్య ఫలితం అది. ఒంటరితనం పరిమాణంలో పెద్దదైనా, చిన్నదయినా గందరగోళం, సంఘర్షణ, దు:ఖం ఎదురవుతాయి. ఒంటరితనంలోంచి ఏకాంతం ఉద్భవించదు. ఒంటరితనం పోతేగాని ఏకాంతం లభించదు. ఏకాంతం అవిభాజ్యమైనది. ఒంటరితనం అంటే ఎడబాటు. ఏకాంతంగా ఉన్నదాంట్లో మార్దవం, ఎంతో సహనం ఉంటాయి. ఏకాంతంగా ఉండేవారే కారణరహితమైన దానితో, అపరిమితమైన దానితో భాషించగలుగుతారు. ఏకాంతంగా ఉన్నదానికి జీవితం అనంతమైనదిగా ఉంటుంది. ఏకాంతంగా ఉన్నదానికి మృత్యువు ఉండదు. ఏకాంతంగా ఉన్నది గతించలేదు.

చంద్రుడు ఇప్పుడిప్పుడే చెట్ల పైకి వస్తున్నాడు. నీడలు దట్టంగా, నల్లగా పడుతున్నాయి. మేము ఆ చిన్న గ్రామందాటి తిరిగి నది పక్కనుంచి నడిచి వెళుతుంటే ఒక కుక్క మొరగటం మొదలుపెట్టింది. నది ఎంత నిశ్చలంగా ఉందంటే, నక్షత్రాలూ, వంతెన మీద ఉన్న దీపాలూ అందులో స్పష్టంగా తేలుతున్నాయి. ఒడ్డు మీద దూరాన పిల్లలు కొందరు నిలబడి నవ్వుతున్నారు. ఒక చంటిపిల్ల ఏడుస్తోంది. చేపలు పట్టేవాళ్ళు వలలన్నీ శుభ్రం చేసుకొని చుట్ట చుడుతున్నారు. రాత్రిళ్ళు విహరించే ఒక పక్షి నిశ్శబ్దంగా అటు ఎగిరి వెళ్ళింది. ఆ విశాలమైన నదికి అవతల ఒడ్డున ఎవరో పాడటం మొదలుపెట్టారు. అతడి పాటలోని పలుకులు స్పష్టంగా దూసుకు వస్తున్నాయి. మళ్ళీ, జీవితంలోని సర్వవ్యాప్తమైన ఏకాంతం.