మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఆలోచన, ప్రేమ

వికీసోర్స్ నుండి

4. ఆలోచన, ప్రేమ

ఆలోచన ఆవేశపూరితమైనదీ, ఉద్రిక్తకరమైనదీ కాబట్టి అది ప్రేమ కాదు. ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకి తావు లేదు. ఆలోచన జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ జ్ఞాపకం కాదు. మీరు ప్రేమించే ఒక వ్యక్తి గురించి మీరు ఆలోచించునప్పుడు ఆ ఆలోచన ప్రేమకాదు. మీ స్నేహితుని అలవాట్లనూ, ప్రవర్తించే లక్షణాలనూ, అవలక్షణాలనూ గుర్తుకి తెచ్చుకోవచ్చు. ఆ వ్యక్తితో మీకున్న సంబంధాన్ని బట్టి జరిగిన మంచి సంఘటనల్నీ చెడు సంఘటనల్నీ గుర్తుకి తెచ్చుకోవచ్చు. కాని, ఆ ఆలోచనలు ప్రేరేపించే మనశ్చిత్రాలు మాత్రం ప్రేమకాదు. విభజన చేయటం ఆలోచన సహజ లక్షణం. సమయాభావం, స్థలాభావం, దూరం, దు:ఖం, అన్నీ ఆలోచన వల్ల పుట్టినవే. ఆలోచనా ప్రక్రియ ఆగిపోయినపుడే ప్రేమ ఉండటానికి సాధ్యమవుతుంది.

ఆలోచన ఎప్పుడైతే ఉందో అప్పుడు తన సొంతం అనే భావం కలగక మానదు. సొంతం చేసుకోవాలనే భావం వ్యక్తంగా కాని, అవ్యక్తంగా కాని, ఈర్ష్యని పెంచుతుంది. ఈర్ష్య ఉన్నప్పుడు ప్రేమ ఉండదనేది స్పష్టమే. అయినా చాలామంది ఈర్ష్య ప్రేమకి చిహ్న మనుకుంటారు. ఈర్ష్య ఆలోచన వల్ల వచ్చేదే. అది ఆలోచనలోని ఆవేశానికి ప్రతిక్రియ. తన సొంతం చేసుకోవాలనే భావానికి గాని, తను ఇంకొకరి సొంతం కావాలనే భావానికి గాని అవరోధం కలగగానే ఎంతో శూన్యత ఏర్పడి, ఆస్థితిలో ప్రేమ స్థానంలో ఈర్ష్య చోటుచేసుకుంటుంది. ఆలోచన ప్రేమ స్వరూపాన్ని దాల్చుతుంది కనుకనే అన్ని చిక్కులూ, దు:ఖాలూ కలుగుతున్నాయి. ఒకరి గురించి ఆలోచించకుండా ఉంటే ఆ వ్యక్తిని ప్రేమించలేదనుకుంటారు. కాని ఒక వ్యక్తిని గురించి ఆలోచించినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? మీరు ప్రేమించే స్నేహితుడెవరి గురించైనా మీరు ఆలోచించకుండా ఉంటే, మీరు దాన్ని ఘోరమైన విషయమనుకుంటారు. అనుకోరా? చచ్చిపోయిన ఒక స్నేహితుణ్ణి తలుచుకోక పోయినట్లయితే మీకు విశ్వాసం లేనట్లూ, ప్రేమ లేనట్లూ, ఇంకా ఎన్నో అనుకుంటారు. అటువంటి స్థితిని లెక్కచేయక పోవటమనీ, నిర్లక్ష్యమనీ అనుకొని, ఆ వ్యక్తిని గురించి ఆలోచించటం మొదలుపెడతారు. ఫోటోగ్రాపులూ లిఖితచిత్రాలూ పెట్టుకుంటారు. మానసికంగా చిత్రించుకుంటారు. ఆ విధంగా మానసికమైనవాటితో హృదయాన్ని నింపేసుకుంటే ఇక, ప్రేమకి చోటు లేకుండా చెయ్యటమే అవుతుంది. మీరొక స్నేహితుడితో ఉండగా అతడి గురించి ఆలోచించరు. మనిషి దగ్గర లేనప్పుడే గడిచిపోయిన దృశ్యాలనూ, జరిగిపోయిన అనుభవాలనూ, గతించిన వాటిని నెమరు వేసుకుంటారు. ఈవిధంగా గతాన్ని స్మరించటమే ప్రేమ, సజీవంగా ఉన్నది కాదు అనుకుంటాం. గతంతోనే బ్రతుకుతాం - గతించి పోయిన వాటితోనే. అందుచేత మనంకూడా గతించి పోయినట్లే, దాన్నే ప్రేమ అన్నప్పటికీ.

ఆలోచనా ప్రక్రియ ప్రేమను త్రోసిపుచ్చుతుంది. ఆలోచనలోనే ఆవేశం తెచ్చే చిక్కులుంటాయి, ప్రేమలో కాదు. ఆలోచన ప్రేమకి పెద్ద అవరోధం. ఉన్నదానికీ, ఉండాలనుకునేదానికి మధ్య భేదం ఆలోచన సృష్టించినదే.

ఈ విభేదం మీదనే నీతి ఆధారపడి ఉంది. నీతిగా ఉన్న వాళ్ళకీ అవినీతిగా ఉన్నవాళ్ళకీ కూడా ప్రేమంటే ఏమిటో తెలియదు. సాంఘిక సంబంధాలను కట్టుదిట్టం చెయ్యటానికే నీతి అనేదాన్ని సృష్టించింది మనస్సు - అది ప్రేమ కాదు. కేవలం సిమెంటులా గట్టి పరిచేది మాత్రమే. ఆలోచన ప్రేమకు దారి తీయదు. ఆలోచన ప్రేమను పెంపొందించదు. ప్రేమ అనేదాన్ని తోటలో మొక్కలా పెంచటానికి వీలుకాదు. ప్రేమను పెంపొందించుకోవాలనే కోరిక కూడా ఆలోచనా ప్రక్రియే.

మీకు తెలుసునో లేదో, మీ జీవితంలో ఆలోచనకి ఎంత ప్రముఖమైన పాత్ర ఉన్నదో మీరే చూస్తారు. ఆలోచనకి దానికుండవలసిన స్థానం దానికుంది. కాని, దానికీ ప్రేమకీ ఏ సంబంధమూ లేదు. ఆలోచనకి సంబంధించిన దానిని ఆలోచనతో అర్థం చేసుకోవచ్చు. కాని ఆలోచనతో సంబంధం లేనిదాన్ని మనస్సుతో పట్టుకోవటం సాధ్యం కాదు. అయితే, ప్రేమంటే ఏమిటి అని అడుగుతారు మీరు. ప్రేమ ఉండే స్థితిలో ఆలోచన ఉండదు. కాని ప్రేమకు నిర్వచనం కూడా ఆలోచించే చెప్పాలి. అందుచేత ఆ నిర్వచనం కూడా ప్రేమ కాదు. ఆలోచనని అర్థం చేసుకోవాలి. అంతేకాని, ఆలోచనలో ప్రేమని బంధించటానికి ప్రయత్నించటం కాదు. ఆలోచనని కాదన్నంత మాత్రాన ప్రేమ సాధ్యం కాదు. ఆలోచన యొక్క ప్రాముఖ్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నప్పుడే ఆలోచననుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అందుకు అపారమైన ఆత్మజ్ఞానం అవసరం, అంతేగాని, పైపై డాబులూ, దర్పాలూ కాదు. ధ్యానం చేయటం అంటే పునశ్చరణ కాదు, తెలుసుకోవటం అంటే నిర్వచనం కాదు - ఇవే ఆలోచనా రీతుల్ని విశదం చేస్తాయి. ఆలోచనా రీతుల్ని తెలుసుకోకుండా, పరిశోధించ కుండా ప్రేమ సాధ్యం కాదు.