Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/"నేను" (అహం)

వికీసోర్స్ నుండి

22. "నేను" (అహం)

ఎదురుగా ఉన్న సీటులో హోదా, అధికారం ఉన్న ఒకాయన కూర్చుని ఉన్నాడు. అవి తనకున్న సంగతి ఆయనకు బాగా తెలుసును. ఆయన చూపులూ, చేష్టలూ, మనోవైఖరీ అన్నీ ఆయన ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వంలో చాలా ఉన్నతస్థితిలో ఉన్నవాడు. ఆయన చుట్టుపక్కల వాళ్లందరూ చాల వినయవిధేయతలతో ఉన్నారు. ఎవరితోనో పెద్ద గొంతుతో చెబుతున్నాడు - అంత చిన్న వ్యవహారం కోసం తనను ఇబ్బంది పెట్టటం దౌర్జన్యం అని. తన క్రింద పనిచేసే వాళ్ల పనుల గురించి సాధిస్తున్నాడు. వింటున్నవాళ్లు భయంతో ఒణుకుతున్నారు. మేము ఆకాశంలో పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున మేఘాలకు బాగా పైనుంచి వెడుతున్నాం విమానంలో. మేఘాలమధ్య సందుల్లోంచి క్రింది నీలి సముద్రం కనిపిస్తోంది. మబ్బులు మధ్యమధ్య విడిపోయినప్పుడు మంచుతో నిండిన పర్వతాలూ, ద్వీపాలూ, విశాలమైన సముద్రశాఖలూ, అక్కడక్కడ ఇళ్లూ, చిన్న చిన్న ఊళ్ళూ, ఎంత దూరంగా ఎంత అందంగా కనిపిస్తున్నాయి! కొండల్లోంచి పారుతూ వచ్చిన నది సముద్రంలోకి ప్రవహిస్తుంది. మధ్యలో ఒక పెద్ద పట్టణంలోంచీ ప్రవహిస్తూ వచ్చింది. దాని నీళ్లు మురికి కలిసిన చోట మసి బారినట్లు వెలవెలబోయి నట్లుండి, మరికొంత దూరం వచ్చాక, మళ్లీ పరిశుభ్రంగా అయి, తళతళ లాడుతున్నాయి. కొన్ని సీట్లకి అవతల ప్రత్యేకమైన దుస్తుల్లో ఉన్న ఒక ఉన్నతోద్యోగి కూర్చున్నాడు. ఆయన ఛాతీ నిండా రిబ్బన్లు. ఆత్మ విశ్వాసంతో, ఎవ్వరితోనూ కలవకుండా కూర్చున్నాడు. ఆయన వేరే వర్గానికి చెందినవాడు. అటువంటి వర్గంవారు ప్రపంచమంతటా ఉన్నారు.

మనం అందరి చేతా గుర్తింపబడాలనీ, గొప్పగా చెప్పుకోబడాలనీ, ప్రోత్సహింపబడాలనీ ఎందుకు ప్రాకులాడుతాం? అంత డాబూ, దర్పం ఎందుకు ప్రదర్శిస్తాం? ప్రత్యేకమైన పేరునీ, పదవినీ, ఆస్తినీ పట్టుకుని ఎందుకు వ్రేలాడతాం? అనామకులుగా ఉంటే చిన్నతనంగా ఉంటుందా? మనగురించి ఎవరికీ ఏమీ తెలియకుండా ఉంటే నీచంగా ఉంటుందా? పేరు పొందిన వారినీ, ప్రజాదరణ పొందిన వారినీ మనం ఎందుకు అనుసరిస్తాం? మన మాదిరిగానే ఉండటంలో ఎందుకు తృప్తి పొందం? మనం ఉన్న స్థితికి మనకే భయం, సిగ్గూ కలుగుతున్నాయా? పేరు, పదవి, ఆస్తి - ఇవన్నీ అంత ప్రధానమైనవా? మనం గుర్తింపబడాలనీ, అభినందింపబడాలనే కోరిక ఎంత ప్రబలమైనదో నమ్మశక్యం కాదు. యుద్ధోన్మాదంలో చేసిన దుష్కృత్యాలకు గౌరవింపబడతారు. తోటిమానవుని చంపినందుకు సాహసవీరుడనిపించు కుంటాడు. హక్కులతోనూ, గడుసుతనంతోనూ, సామార్థ్యంతోనూ కొంత పైకొస్తారు - ఈ పైకి అనేది ఒక స్థిరమైన స్థానానికనికాదు. విజయం కలిగించే మత్తులో ఆ ఎత్తు ఇంకా ఇంకా పైకి పెరుగుతుంది. దేశమైనా, వ్యాపారమైనా అంతా మీరే. మీ మీదే సమస్యలన్నీ ఆధారపడి ఉంటాయి. మీరే అధికారం. మత సంస్థలో పదవి, ప్రతిష్ఠ, గౌరవం లభిస్తాయి. అందులో కూడా మీరు ఒక ప్రత్యేకమైన వారు. అందరిలోకి ప్రముఖులు. లేకపోతే, ఒక గురువుకి శిష్యుడైపోతారు మీరు. వారు చేసే పనిలో సహకరిస్తారు. మీరూ ప్రముఖులవుతారు - వారికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి, వారి బాధ్యతను పంచుకుంటారు కాబట్టి మీరు ఇచ్చేదాన్ని ఇతరులు స్వీకరిస్తున్నారు కాబట్టి. వారి పేరుతోనే అయినా, మీరే సాధనం. మీరు గోచీ పెట్టుకోవచ్చు, కాషాయ వస్త్రాలు ధరించవచ్చు, కానీ, ఆ చేష్టలు చేసేది "మీరు" - అన్నిటినీ త్యజిస్తున్న "మీరు"

ఏదో ఒక విధంగా, పైకి తెలియకుండా అయితేనేం, బాహాటంగా తెలిసేటట్లయితేనేం, అహాన్ని పెంచిపోషిస్తూ ఉంటారు. సమాజానికి ప్రతికూలమైన, హానికరమైన కార్యకలాపాలతో అహం తన్ను తాను పోషించుకోవలసిన అవసరం ఏమిటి? మనం కష్టాల్లోనూ, దుఃఖాల్లోనూ అంతరంగిక సుఖాలకోసం, ఆఖరుకి వాటి వల్ల బాధ, దుఃఖం తప్పవని తెలిసికూడా ఎందుకు అర్రులు చాస్తుంది? ఈ కష్టపడటమే మనం జీవించటమనీ, మన జీవితానికొక ధ్యేయం ఉన్నదనీ, క్రమంగా మన సంఘర్షణకీ, దుఃఖానికీ కారణభూతమైన వాటిని త్రోసి పారవెయ్యగలుగుతామనీ అనుకునేట్లు చేస్తుంది. మన కార్యకలాపాలన్నీ ఆగిపోతే మనం ఏమీకాము అనీ, మనం తప్పిపోతామనీ, జీవితానికి అర్థం ఉండదనీ అనుకుంటాం. అందుకని అదే సంఘర్షణలో, సందిగ్ధతలో, ప్రతికూలతలో ముందుకి సాగుతూ ఉంటాం. కాని అంతకన్న ఇంకేదో ఉందనీ, ఈ దుఃఖానికి అతీతమైనది ఇంకేదో ఉన్నదనీ మనం ఎరుగుదుము. అందుకనే మనలో మనకి నిరంతర సంఘర్షణ.

పైడాబుసరి ఎంత ఎక్కువగా ఉంటే లోపలి దారిద్ర్యం అంత ఎక్కువగా ఉంటుంది. కాని, ఈ దారిద్ర్యం నుంచి లభించే స్వేచ్ఛ గోచీ గుడ్డలో లేదు. ఈ అంతర్గత శూన్యతకి కారణం ఏదో అవాలనే కోరికే. మీరేం చేసినాసరే ఆ శూన్యాన్ని నింపలేరు. మోటుగానో, సున్నితంగానో, ఎలాగో దాన్నుంచి తప్పించుకోవచ్చు. కాని అది మీ నీడలా మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది. ఈ శూన్యత వైపుకి మీరు చూడదలుచుకోకపోవచ్చు. అయినా అది అక్కడే ఉంటుంది. అహం ఎన్నివిధాల అలంకరించుకున్నా, ఎన్ని త్యజించినా, ఈ అంతరంగిక దారిద్ర్యాన్ని కప్పిపుచ్చలేదు. తన అంతరంగిక కార్యకలాపాల్లోనూ, బాహ్య కార్యకలాపాల్లోను "నేను" సంపత్తిని ఆశిస్తుంది. వాటిని అనుభవం అనీ, మరొకటి అనీ, తన వీలునీ, తృప్తినీ బట్టి ఏదో ఒక పేరుతో పిలుస్తుంది. "నేను" ఎన్నటికి అనామికగా ఉండదు. కొత్త వేషం వెయ్యవచ్చు, వేరే పేరు పెట్టుకోవచ్చు, కాని దాని వ్యక్తిత్వమే దాని సారాంశం. దాన్ని గుర్తించే పద్ధతే దాని తత్వాన్ని గ్రహించనీయకుండా చేస్తుంది. ఈ గుర్తించే ప్రక్రియ మొత్తం "నేను"ని రూపొందిస్తుంది. వ్యక్తంగా ఉన్నా, అవ్యక్తంగా ఉన్నా, దాని కార్యకలాపాలన్నీ స్వార్థపూరితమైనవే - వాటి పరిధి ఎంత పెద్దదైనా. ఏదో అవాలనో, అవకూడదనో "నేను" చేసే ప్రతి ప్రయత్నమూ ఉన్న దాన్నుంచి దూరంగా జరిగిపోయేటట్లు చేస్తుంది. దాని పేరూ, లక్షణాలూ, మానసిక బలహీనతలూ, ఆస్తులూ - ఇవి కాక "నేను" అంటే వేరే ఏముంది? ఈ లక్షణాలన్నిటినీ తీసి పారేస్తే "నేను" అనేది, అహం అనేది ఉంటుందా? ఏమీ ఉండదనే భయమే "నేను"ని ఈ కార్యకలాపాల్లోకి లాగుతుంది, కాని, అది ఏమీ కాదు. అదొక శూన్యత.

ఆ శూన్యతని మనం ఎదుర్కోగలిగినట్లయితే, బాధాకరమైన ఒంటరితనంతో ఉండగలిగినట్లయితే, భయమనేది మాయమవుతుంది. ఒక సమూలమైన పరివర్తన సంభవిస్తుంది. ఇది సంభవించటానికి ఆ శూన్యత అనుభవంలోకి రావాలి. అనుభోక్త (అనుభవించేది) కనుక ఉంటే దీనికి ఆటంకం కలుగుతుంది. ఆ శూన్యతని అనుభవించాలనే కోరిక ఉన్నప్పుడు, లేదా ఆ శూన్యతని అధిగమించాలని, దానిని దాటి పోవాలనుకున్నప్పుడు, అప్పుడు అనుభవం పొందటం కుదరదు, ఎందుచేతనంటే, అహం ఒక వ్యక్తిత్వంతో కొనసాగుతూనే ఉంటుంది కనుక. అనుభోక్తకి (అనుభవించేదానికి) అనుభవం కలిగినప్పుడు అది అనుభవం పొందటం అనేస్థితి కాదు. ఉన్నదాన్ని ఫలానా అని పేరు పెట్టకుండా అనుభవం పొందటం జరిగితేనే, ఆ ఉన్నదాన్నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.