మనుషుల్లో మాణిక్యాలు
మనుషుల్లో మాణిక్యాలు
రచన, కూర్పు
జన విజ్ఞాన వేదిక
జన విజ్ఞాన వేదిక
ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అనుబంధం
మనుషుల్లో మాణిక్యాలు
లెవెల్ - 4
రచన, సీరస్ సంపాదకుడు :
వి. బాలసుబ్రమణ్యం
మొదటి ముద్రణ : మే, 1992
మూడవ ముద్రణ : అక్టోబరు 2009
వెల : 12/-
ప్రతులకు
'ప్రజాశక్తి బుక్‌హౌశ్
1-1-187/1/2 వివేక్ నగర్,
చిక్కడపల్లి, హైద్రాబాద్-20, ఫోన్: 27608107
'సి. మోహణ్
కన్వీనర్ - జె.వి.వి. ప్రచురణల విభాగం
జి.ఎఫ్ - 4, నీహారికా అపార్ట్మెంట్స్, గాయత్రి నగర్,
ముత్యాలరెడ్డిపల్లి, తిరుపతి -517 502.
ఫోన్ : 0877-2244551
ముద్రణ
ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్
వేగుచుక్క వీరేశలింగం
ఒక ఊళ్ళోకి ఒక మంత్రగాడు వచ్చాడు. భూతాలు తరిమేస్తానన్నాడు. దయ్యాలు వదిలిస్తానన్నాడు. డబ్బులు గుంజసాగాడు.
ఒక పదేళ్ళ పిల్లవాడు ఆ మంత్రగాడి వెంటబడ్డాడు. నాకు దయ్యాన్ని చూపిస్తావా? అని అడిగాడు.
అలాగే చూపిస్తాను. అయితే ఒంటరిగా రాత్రికి శ్మశానానికి రావాలి. జడుసుకోగూడదు. సరేనా అన్నాడా మాంత్రికుడు.
ఆ పిల్లవాడు ఏ మాత్రం జంకలేదు. ఈరోజే వస్తాను అని వెంటబడ్డాడు. మంత్రగాడు అలాగేనని తీసుకొనిపోయాడు. ఒక మర్రిచెట్టు మీద పిల్లాడిని కూర్చోబెట్టాడు. దయ్యాన్ని పిల్చుకొస్తానని వెళ్ళాడు. పిల్లవాడు కళ్ళు కాయలు కాచేలా రాత్రంతా చూచాడు. దయ్యం అంతులేదు. తెల్లారిపోయింది. మంత్రగాడూ పత్తాలేడు.
ఇంత గడుగ్గాయి పిల్లవాడు ఎవరనుకొన్నారు? ఆయనే వీరేశలింగం పంతులు.
దేన్నంటేదాన్ని వీరేశలింగం గుడ్డిగా నమ్మేవాడు గాదు. ప్రతిదాన్నీ ప్రశ్నించేవాడు.
ఒకసారి ఆయనింటి దూలానికి తేనెపట్టు పెట్టింది. అది అపశకునం అని అందరూ అన్నారు. ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. అయినా ఆయనేమీ లెక్క చెయ్యలేదు.
మరోసారి పెరటిలో అరటి చెట్టు మధ్యలోంచి గెలవేసింది. ఇది అరిష్టమని అంతా గోల పెట్టారు. మన వీరేశలింగం లెక్క చెయ్యలేదు. అలాగే వుంచి కాయలు పెద్దవయ్యాక కూర చేసుకొని తిన్నాడు.
మరోసారి కావాలని అమావాస్య రోజు ప్రయాణమై ఉద్యోగంలో చేరాడు.
ఇలాంటి వీరేశలింగం గార్కి ఒక ప్రశ్న ఎదురైంది. ఆ కాలంలో ఆడ పిల్లలకు చాలా చిన్న వయసులో పెళ్ళిచేసేవారు. వాళ్ళు పసితనంలోనే భర్తలను పోగొట్టుకునేవారు. వాళ్ళకు మళ్ళీ పెళ్ళి ఎందుకు చెయ్యగూడదు? బతుకంతా అలాగే ఎందుకుండిపోవాలి? ఇదీ ఆయన వేసుకొన్న ప్రశ్న.
పుస్తకాలూ, పురాణాలూ తిరగేశాడు. ఎక్కడా అలా పెళ్ళి చెయ్యగూడదని లేదని తేల్చాడు. అంతే రంగంలోకి దిగాడు. తన సొంత ఖర్చుతో ఇలాంటి పెళ్ళిళ్ళకు పూనుకొన్నాడు.
ఇంకేముంది? పెద్దలంతా ఎదురుతిరిగారు. ఇది మన ఆచారం కాదన్నారు. పాపం అన్నారు. అలా చేసేందుకు వీల్లేదన్నారు. పైగా ఆయనపై దాడికి దిగారు. రౌడీల్ని పంపారు.
వీరేశలింగం చెక్కుచెదరలేదు. అన్నిటినీ తట్టుకొని అలాంటి పెళ్ళిళ్ళు 100 చేశాడు.
ఆయన ఆడవాళ్ళ కోసం బడి పెట్టాడు. ఒక పేపరు నడిపాడు. వీటికోసం తన ఆస్తినంతా ధారపోశాడు. చివరి క్షణం దాకా ఆడవాళ్ళ కోసమే నిలబడి కన్నుమూశాడు.
వీరేశలింగం ఒక మహానుభావుడు. అలుపెరుగని వీరుడు. ఆయన ఆడవాళ్ళ పాలిట దేవుడు.
జాతిరత్నం దుర్గాబాయి
అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక పాప. ఆ పాప బడికి పోతోంది. చదువుకుంటోంది. టీచరు పాఠాలు చెపుతున్నాడు. ఆ చదువులు ఆ పాపకు ఎందుకో నచ్చలేదు. చదువులు దేనికి పనికొస్తాయో ఆ పాపకు అర్థంగాలేదు.
చదువు అందరికీ కావాలి. ఆడవాళ్ళకు తప్పకుండా కావాలి. చదువు అందరికీ వస్తుంది కూడా. అయితే ప్రేమగా చెప్పాలి. ఉపయోగపడే చదువు చెప్పాలి. ఇలా ఆ పాప ఆలోచన చేసింది.
తానే సొంతంగా బడి పెట్టింది. ఇరుగుపొరుగు ఆడవాళ్ళను పిలిచింది. వాళ్ళకు చదువు నేర్పసాగింది.
ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మ చదువుకోలేదు గదా! ఆమెకూ ఎందుకు చెప్పగూడదు అనుకొంది. అంతే. వాళ్ళమ్మనూ పిలిచి కూచోబెట్టింది. చదువునేర్పింది!
ఎవరీ గడుగ్గాయి పిల్ల? ఆ వయసులోనే అంతకు పూనుకొన్న పిల్ల?
ఆమె పేరు దుర్గాబాయి. ఊరు రాజమండ్రి. ఆడవాళ్ళ కష్టాలు చూస్తే ఆమె తల్లడిల్లిపొయ్యేది.
దుర్గాబాయి పెద్ద చదువులు చదువుకొనింది. పెద్దదైంది. ఏమైనాసరే తన జీవితం అంతా ఆడవాళ్ళ కోసమే పాటుపడాలి అనుకొంది.
ఆ రోజుల్లో దేవ దాసీలు వుండేవారు. వాళ్ళు దేవుడి దగ్గర డాన్సులు చేసేవాళ్ళు. వాళ్ళకు పెళ్ళిళ్ళు వుండవు. వాళ్ళకి పుట్టే పిల్లలకు తండ్రులు ఉండరు. వాళ్ళ బతుకు ఒక నరకం.
దుర్గాబాయిని ఇది కదిలించివేసింది. వాళ్ళకోసం పోరాడింది. గాంధీజీని తీసుకొని వచ్చింది. వాళ్ళ సంగతి చెప్పింది.
ఆడవాళ్ళు చదువుకోవాలి. ఆ ఆ లు నేర్చుకోడమే గాదు, గుర్రపు స్వారీ నేర్చుకోవాలి. సాముగరిడీలు నేర్చుకోవాలి. అన్యాయం జరిగితే ఎదిరించడం నేర్చుకోవాలి. తమ కాళ్ళమీద తాము నిలబడ్డం నేర్చుకోవాలి.
ఈ ఆలోచనతో దుర్గాబాయి పూనుకొంది. ఆంధ్ర మహిళా సభ పెట్టింది. ఆ కాలంలో ఇందులో చేరేందుకు ఆడవాళ్ళు ఎక్కడెక్కడి నుండో వచ్చేవాళ్ళు. సాము గరిడీలతో సహా నేర్చుకొనేవారు. ఆ రోజుల్లో ఇదేం చిన్న సంగతి గాదు.
ఆడవాళ్ళు అన్ని పనులూ నేర్చుకోవాలి, చెయ్యాలి, సంపాదించాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. అప్పుడే మగవాళ్ళ పెత్తనం తగ్గుతుందని దుర్గాబాయి గుర్తించింది.
అల్లికలు, వైద్యం, కుట్టుపని లాంటి పనులని వాళ్ళకు నేర్పడానికి ఏర్పాట్లు చేసింది. అనాధలైన ఆడవాళ్ళను చేరదీసింది. ధైర్యం చెప్పింది. బతుకు తెరువు చూపించింది.
ఆరోజుల్లో గాంధీజీ తెల్ల దొరలను తరిమెయ్యాలని పోరాడుతుండేవారు. అందరూ ఆయన వెంట నిలబడే వాళ్ళు. అప్పుడు దుర్గాబాయి తన నగలన్నిటినీ గాంధీ గార్కి ఇచ్చేసింది.
అంత చదువుకొన్న ఆమె ఎప్పుడూ ఒక వాలెంటీరుగా సభల్లో పనిచేసేది. ప్రతి చిన్న పనీ చేసేది. నిక్కచ్చిగా వుండేది.
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయ్
అన్న మాటలు దుర్గాబాయి నూటికి నూరుపాళ్ళు నిజం చేసింది. జాతి రత్నంగా నిలిచిపోయింది.
మట్టిలో మాణిక్యం
గూలపాలెం హంపన్న
మాణిక్యాలు మబ్బుల్లోంచి ఊడిపడవు. మట్టిలోనే పుడతాయి. గొప్పవాళ్ళూ అంతే. వాళ్ళు మనలాంటి వాళ్ళే. మనలోంచే పుట్టుకొస్తారు.
మన హంపన్న పూర్తి పేరు గూలపాలెం హంపన్న. గుంతకల్లు దగ్గర ఆయన రైలు గేటు కాపలాదారుడుగా ఉండేవాడు. రైలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు గేటు ముయ్యడం ఆయన పని.
ఆ గేటు ఊరికి దూరంగా ఉండేది. గేటు దగ్గర ఒక రాతిగూడు ఉండేది. అందులోనే హంపన్న ఉండేవాడు. ఆయనకి సంతకం చేయడం వచ్చు. మరేమీ రాయడం రాదు. చదవడం రాదు. పేదవాడు.
అయితేనేం? హంపన్నది వెన్నలాంటి మనసు. ఆ రోజుల్లో తెల్లదొరలు మనల్ని పాలించేవాళ్ళు. మనమీద పెత్తనం చేసేవాళ్ళు. వాళ్ళు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చారని హంపన్నకు కోపం.
ఇలా ఉంటే ఓ సంగతి జరిగింది. హంపన్నకు నాగులమ్మ, లచ్చుమమ్మ మంచి నేస్తాలు, వాళ్ళు కష్టం చేసుకునే ఆడపడుచులు.
ఒకసారి తెల్ల సిపాయిలు వందలాదిగా గుంతకల్లుకు వచ్చారు. గుడారాలు వేసుకుని మకాం పెట్టారు. వాళ్ళలో కొందరికి నాగులమ్మ, లచ్చుమమ్మల మీద కన్నుబడింది.
ఒకరోజు సాయంత్రం వాళ్ళిద్దరినీ సిపాయిలు అడ్డుకున్నారు. బలవంతం చెయ్యబోయారు.
వాళ్ళు మానవతులు. బొడ్డులోంచి కొడవలి తీశారు. ఎదుర్కొన్నారు. అయినా సిపాయిలదే పైచేయి అయింది. భయంతో పెద్దగా అరిచారు.
హంపన్న ఈ అరుపులు విన్నాడు. ఎక్కడ లేని రోషం వచ్చింది. చిక్కుడు పందిరి కర్ర తీసుకుని పరుగెత్తాడు. సిపాయిల్ని ఎదుర్కొన్నాడు.
నాగులమ్మ, లచ్చుమమ్మలు తప్పించుకుని పరుగెత్తారు. రైలు గేటు దగ్గర ఒక రాతి గూడు ఉండేది వాళ్ళు దాంట్లో దూరి తలుపులు బిగించుకున్నారు.
హంపన్న దెబ్బకు ఒక సిపాయి చచ్చాడు. మిగతా వాళ్ళు తుపాకితో హంపన్న తలమీద మోదారు. ఆయన తెలివి తప్పిపడిపోయాడు.
సిపాయిలు రాతిగూడు తలుపులు పగలగొట్టసాగారు. ఈ చప్పుడుకి మళ్ళీ హంపన్న లేచాడు. పులి పిల్లలాగ వాళ్ళ మీదికి ఉరికాడు. ఇంతలో ఒక సిపాయి వెనక నించి పిస్తోలుతో కాల్చాడు. హంపన్న కూలిపోయాడు.
ఈ గొడవకు ఊరంతా అక్కడ చేరింది. దీంతో సిపాయిలు జారుకున్నారు.
హంపన్న పోరాటం అందర్నీ కదిలించించి వేసింది. ఊరు ఊరంతా హంపన్నకు హారతి పట్టింది. బాట పక్కనే సమాధి కట్టారు. ఒక రాతిమీద హంపన్న గొప్పదనం చెక్కించారు. దాన్ని సమాధి దగ్గర పెట్టారు.
ఈ రోజుకూ గుత్తి దగ్గర మనం దీన్ని చూడవచ్చు. ఇప్పటికీ గుంతకల్లు జనం హంపన్నను తలచుకొని పొంగిపోతారు.
ఇప్పుడు చెప్పండి మాణిక్యాలు ఎక్కడ పుడతాయి?
అగ్గిరవ్వ అయిలమ్మ
"నా పేరు చిట్యాల అయిలమ్మ. నా పెనిమిటిదేం లేదు, నా కొడుకులదేం లేదు. ఎక్కడవోయినా నా పేరే చెప్తారు. ఏం జేసినా నా పేరే చెప్తరు.
ఇవి అయిలమ్మ మాటలు. ఎక్కడికి పోయినా, ఏం జేసినా అయిలమ్మ పేరే ఎందుకు చెబుతారు? ఏమిటామె గొప్పదనం?
తెలుసుకుందామా?
అయిలమ్మది నల్గొండ జిల్లా, పాలకుర్తి గ్రామం.
ఆ కాలంలో పేదల్ని గ్రామాల్లో పెత్తందార్లు పీల్చుకుని తినేవారు. వెట్టిచాకిరీ చేయించుకునేవారు. పొలాలు గుంజుకునేవారు.
పుట్టిన బిడ్డయినా సరే, చచ్చే ముసలిదైనా సరే, పెత్తందారు మాట వినవలిసిందే. చాకిరీ చేయవలిసిందే. ఊళ్ళో భూములన్నీ ఇద్దరు ముగ్గురి చేతుల్లో వుండేవి. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా వుండేది. ఇలా ఎంతకాలం జరుగుతుంది?
జనం మెల్లమెల్లగా ఎదురు తిరగసాగారు. సంగం పెట్టుకోసాగారు.
మన అయిలమ్మ పాలకుర్తిలో అందర్నీ కూడగట్టింది. ఆమె ఇంట్లో మీటింగులు జరిగేవి. తన కొడుకుల్ని సంగంలో చేర్చింది. కూతురినీ చేర్చింది.
ఆ ఊరి పెత్తందారు ఐసునూరి రామచంద్రారెడ్డి, ఐలమ్మ మీద కక్ష గట్టాడు. ఆమె పొలంలో పంట బలవంతంగా కోయించాలని పన్నాగం పన్నాడు. 200 మంది రౌడీలని పంపాడు.
వాళ్ళు పొలంలోకి వచ్చారు. అయిలమ్మకు ఈ సంగతి తెలిసింది. కర్ర తీసుకుని నిలబడింది. ఎవరొస్తారో రమ్మంది. ఆమెకు తోడుగా ఊరంతా ఒక్కటైంది. బీదా బిక్కీ కర్రలు పట్టుకుని వచ్చారు.
ఇది చూసి రౌడీలు అంతులేకుండా పారిపోయారు.
తెలంగాణాలో పేదలు ఇలా చెయ్యడం ఇదే మొదటిసారి. ఇది ఊరూరా పాకింది. అగ్గిరవ్వ రాజుకుంది. దీన్ని జనం కథలు కథలుగా చెప్పుకోసాగారు.
3000 గ్రామాల్లో జనం ఒక్కటయ్యారు. పెత్తందార్లని తరిమికొట్టారు.
ఆ కాలం జనమంతా ఐలమ్మ పేరే అనుకునేవారు. ఆమె మీద పాటలు పాడేవారు.
అయిలమ్మ పేదరాలు. ఆమెకు చదువురాదు. లోకం తెలీదు. చాకలింట్లో పుట్టింది. 'అయితేనేం? మట్టిలో మాణిక్యంగా పేరుపొందింది.
అయిలమ్మ ఇటీవల చనిపోయింది. అప్పుడు వేలాది జనం వచ్చారు. మళ్ళీ ఆమె ఊసులు చెప్పుకొన్నారు. కన్నీళ్ళు తుడుచుకొన్నారు.
అందరు ఆడవాళ్ళూ అయిలమ్మలయితే ఎంత బాగుంటుంది! కొదమ సింగం కొమరం భీము
పిల్లి పులిగా మారితే ఎలా వుంటుంది? మరి పిల్లి ఎప్పుడైనా పులిగా మారుతుందా?
మారుతుంది. నాలుగు గోడల మధ్య వేసి కొడితే పిల్లి ఏం చేస్తుంది? పులిలాగా పైకి దూకి రక్కుతుంది.
మన కొమరం భీము అలాంటి పులి.
మన భీము గోండు జాతి వాడు. గోండులు అడవుల్లో వుండే గిరిజనులు.
వాళ్ళు అడివితల్లి బిడ్డలు. చెట్లలో, పాదల్లో, కొండల్లో, కోనల్లో, వాగుల్లో వంకల్లో పుట్టి పెరిగే వాళ్ళు. వాళ్ళు జింకల్లా అమాయకులు. కుందేలు పిల్లల్లా కల్లాకపటం తెలీని వాళ్ళు.
గోండులు చెట్టూ పుట్టా కొట్టుకొని సేద్యం చేస్తారు. జొన్న పండిస్తారు. అందులో మూడు నెలలకు సరిపడే పంట కూడా రాడు. మిగతా కాలం కాయా కసురూ, ఆకూ అలుమూ తింటారు. వేటాడి జీవిస్తారు.
మన భీము చిన్నప్పటినుంచీ చురుకైన వాడు. ఒకసారి ఒక తాచుపాము తోక పట్టుకుని గిర గిరా తిప్పి విసిరేశాడు. మరోసారి ఒక పెద్ద అడివి పందితో తలపడి తెలివిగా చంపేశాడు. ఎప్పుడూ పిల్లల్ని వెంటబెట్టుకొని తిరుగుతుండేవాడు. కథలంటే చెవికోసుకొనేవాడు.
ఆ రోజుల్లో నిజాం నవాబుది రాజ్యం. తెల్లదొరది రాజ్యం. ఇద్దరూ తోడుదొంగలు.
మాటి మాటికీ అడవుల మీద పోలీసులు తోడేళ్ళలాగా పడేవాళ్ళు. చెట్టు కొట్టారనీ, మేకలు మేపారనీ గోండుల్ని పట్టుకొనేవాళ్ళు. నానా బాధలు పెట్టేవాళ్ళు. వాళ్ళ మేకలు, కోళ్ళు బలవంతంగా లాక్కొనేవాళ్ళు.
వాళ్ళు పండించిన పంటను విపరీతంగా దోచుకునే వాళ్ళు. కాదంటే కొట్టేవాళ్ళు. ఎదిరిస్తే కాళ్ళూ, చేతులూ నరికేవాళ్ళు. అడివిలో పులుల్నీ తోడేళ్ళనీ ఎదుర్కోవడం గోండులకు కష్టం గాదు. ఈ పోలీసుల్ని ఎదుర్కోడం పెద్ద కష్టంగా వుండేది.
కొమరం భీము దీన్ని చూచి చలించిపొయ్యాడు. అందర్నీ కూడదీశాడు.
అప్పటికే రాంజీ అనే గోండు రాజు ఒకసారి సిపాయిల్ని ఎదిరించాడు. అతన్ని సిపాయిలు పట్టుకెళ్ళి చంపి చెట్టుకు వేలాడదీశారు.
అలాగే సీతారామరాజు అందర్నీ కలుపుకొని తెల్లదొరల మీద యుద్ధం చేశాడు. ఆయన్ను తెల్లదొరలు కాల్చి చంపేశారు.
ఇవన్నీ భీముని పురికొల్పాయి.
ఈ అడివి మా రాజ్యం. ఈ అడివి మా తల్లి. మమ్ముల్ని ఇక్కడ బతకనీండి. మా జోలికి రాకండి, అని నవాబుకు రాయబారం పంపాడు. లాభం లేకపోయింది.
భీము గోండులందరినీ ఏకం చేశాడు. 12 గూడేలవాళ్ళు ఒకటయ్యారు. భీము వాళ్ళకు నాయకుడు.
నవాబు సైనికులు, తెల్ల సిపాయిలూ అడవిని చుట్టుముట్టారు. గోండులంతా విల్లూ బాణం తీసుకొన్నారు. ఆడవాళ్ళు కొంగులు బిగించారు.
వాళ్ళ దెబ్బకు సిపాయిలు తట్టుకోలేకపోయారు. చాలా మంది చచ్చారు. మిగిలిన వాళ్ళు పారిపొయ్యారు.
మళ్ళీ పెద్ద దండు వచ్చింది. ఈసారి కొమరం భీమును వాళ్ళు దొంగతనంగా కాల్చారు. ఆయన నేలకొరిగాడు. ఇది 1940 సెప్టెంబరు 1వ తేదీ జరిగింది!
అయితేనేం? అప్పటి నుంచీ గోండులకు కొంత అధికారం ఇవ్వక తప్పలేదు.
భీమును గోండులు తమ జాతిలో పుట్టిన భీముడనే అనుకొంటారు. గుండెలకు హత్తుకుంటారు. ఆయన మీద పాటలు గట్టి పాడుకొంటారు.
మంచికి మరో రూపం మదర్ థెరిసా
అరవై ఏళ్ళ నాటి సంగతి.
అది కలకత్తాలో ఒక మురికివాడ. ఎక్కడ చూచినా మురికి నీళ్ళు. ముక్కులు పగిలే వాసన. ఒంటిమీద నూలుపోగు లేని పసిబిడ్డలు. ఎముకల గూడు లాంటి ముసలి వాళ్ళు. ఎవరికి చూచినా ఏదో ఒక రోగం. అక్కడి జనానికి తినడానికి తిండి లేదు, చదువులేదు, పనిలేదు, దరిద్రం అక్కడ కాపురం చేస్తోంది.
ఆ పేటకు ఒకామె వచ్చింది. ఆమెకు నిండా పాతికేళ్ళు లేవు. తెల్లటి మల్లెపువ్వు లాంటి చీర, అంతే తెల్లని మనసూ. ప్రేమ, దయ, జాలి తొణికిసలాడే తేట ముఖం. పసిబిడ్డ లాంటి నవ్వు. ఇదీ ఆమె రూపం.
ఆ పేటలో అడుగు పెట్టగానే ఆమెకు కన్నీళ్ళు ఆగలేదు. మనసు నిలవలేదు. వాళ్ళకోసం ఏదో ఒకటి చెయ్యాలి. లేకుంటే ఈ జీవితం దేనికి అనిపించింది.
అంతే ఆమె ఆ పిల్లల్ని చేరదీసింది. చెట్టుకిందే బడి పెట్టింది. కుష్టురోగుల్ని దగ్గరకు తీసింది. వాళ్ళ కురుపులు కడిగింది. కట్లు కట్టింది. వాళ్ళ ఇళ్ళు శుభ్రం చేసింది. చల్లటి మాటలతో ఓదార్చింది. ఆ రోజునుంచి వాళ్ళ కోసం అన్నీ వదులుకోవాలని తీర్మానించుకొంది.
ఆమె పేరు ఏమిటో తెలుసా? మదర్ థెరిసా. మదర్ అంటే అమ్మ. ఆమె అందరికీ అమ్మలాంటిది గాబట్టి ఆమె పేరుకే అమ్మ చేరి పోయింది.
ఆమెది మన దేశం కాదు. ఇక్కడామెకు చుట్టాలు నేస్తాలు లేరు. ఎక్కడో యుగోస్లేవియా దేశం నుంచి వచ్చింది. ఇక్కడి పేదలకోసం అన్నీ వదులుకొంది.
ఆమె నిరు పేదల కోసం ఒక ఆశ్రమం పెట్టింది. అందులో రోగులకు వైద్యం ఉచితం. పిల్లలకు చదువులు ఉచితం. అనాథ లందరికీ అది ఆదుకొనే చోటు.
ఇలాంటి పనులు చూచి, ఆమెకు ఎంతోమంది సాయపడ్డారు. కొందరు ఇళ్ళు ఇచ్చారు. కొందరు డబ్బు ఇచ్చారు. కొందరు తోడు నిలబడ్డారు.
దీంతో ఆమె ఇంకా చాలా ఆశ్రమాలు పెట్టింది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోసాగింది. సాటి మనిషి కన్నీళ్ళు తుడవాలి. అంతకంటె గొప్ప మతం లేదు. భక్తిలేదు. సేవలేదు. ఇదీ ఆమె నమ్మకం.
ఇప్పుడు ఆమె సేవ దేశాలను దాటింది. 71 దేశాల్లో ఆమె ఆశ్రమాలు, ఆసుపత్రులు, బడులు ఉన్నాయి. ఆమె సాయంతో చదువుకొన్న వాళ్ళు డాక్టర్లు అయ్యారు. ఇంజనీర్లు అయ్యారు. అధికార్లు అయ్యారు. ఎంతో గొప్ప వాళ్ళయ్యారు. వాళ్ళందరికీ ఆమె అంటే ఎంత అభిమానమో చెప్పలేము.
మదర్ థెరిసా ఎప్పుడూ ఎవర్నీ చెయ్యి చాచి అడగలేదు. పదవుల కోసం పాకులాడలేదు. బిరుదుల కోసం ఎగబడ లేదు. పొగడ్తల కోసం ఎదురుచూడలేదు.
అయితే ఆ తల్లిని వెదుక్కొంటూ బహుమతులు వచ్చాయి. బిరుదులు వచ్చాయి. ప్రపంచంలో ఎవ్వరికీ దక్కని పేరు ఆమెకు దక్కింది. మన దేశంలో అన్నిటికంటె గొప్ప బిరుదు 'భారత రత్న' ఆమెకు దక్కింది.
ఆమె వయసు ఇప్పుడు 84 ఏళ్ళు. ఈ మధ్య ఆమెకు బాగా జబ్బు చేసింది. అప్పుడు దేశ దేశాలు తల్లడిల్లిపోయాయి. ప్రతి ఒక్కరూ ఆ తల్లి చల్లగా వుండాలని తపనబడ్దారు.
చూడండి మరి మదర్ థెరిసా ఎందరి గుండెల్లో నిలిచిపోయిందో. అమ్మ అనే మాట ఆమెకు ఎంత చక్కగా అతికి పోయిందో! ఇలాంటి వాళ్ళు కోటికి ఒక్కరుంటే చాలదూ?
అలుపులేని వీరుడు అంబేద్కర్
బంగారం పుటం పెడితే ఎరుపెక్కుతుంది. ఇనుంపై సమ్మెట పోటు పడితే నిప్పులు చిమ్ముతుంది. బంతిని నేలకేసి కొడితే పైకెగురుతుంది.
కష్టాల నుంచి, అవమానాల నుంచి గొప్ప వాళ్ళు పుడతారు. తయారవుతారు.
మనం ఆప్యాయంగా పిల్చుకొనే అంబేద్కర్ అలాంటి వాడు.
పదేళ్ళ వయసులో ఒకసారి ఆయన పొరుగూరికి పోతున్నాడు. నిప్పులు చెరిగే ఎండ. నాలుక ఆరిపోతోంది. ఒకింటికి పోయి నీళ్ళు అడిగాడు. ఇల్లాలు తలుపు తెరిచింది. ఆయన్ను చూసి నీది ఏ కులం అని అడిగింది. చెప్పగానే దభాలున తలుపు వేసేసింది.
అద్దె బండి ఎక్కడానికి పోయాడు. అక్కడా అదే జరిగింది.
మరోసారి జుట్టు కత్తిరించుకొనేందుకు షాపుకు పోయాడు. అక్కడ కూడా కులం అడిగారు.
బడికి పోతే దూరంగా కూచో పెడుతున్నారు. టీ తాగబోతే దూరంగా ఉంచిన గ్లాసుతోనే ఇస్తున్నారు.
తాను ఏం తప్పుచేశాడు? తనను ఎందుకిలా తరుముతున్నారు? తననేనా - తన జాతి వాళ్ళందరినీ ఎందుకు ఊరికి దూరంగా పెట్టారు? తామెందుకిలా ఉండాలి?
అంబేద్కర్ ను ఇలా ఆలోచనలు చుట్టుముట్టాయి. విలవిలలాడిన ఆ పసిమనసు ఉడికిపోయింది. దీన్ని తుదముట్టించాలి అనుకొన్నాడు. పట్టుపట్టాడు.
అంబేద్కర్ చాలా తెలివైన పిల్లవాడు. బడిలో బుద్ధిగా చదువుకొన్నాడు. టీచర్ల చేత సెభాష్ అనిపించుకొన్నాడు.
వాళ్ళ నాన్న పై చదువులకు బొంబాయి పంపాడు. అక్కడ అవమానాలు ఎదురైనాయి. అవి అతనిలో మరింత పట్టుదల పెంచాయి.
ఆ పైన ఇతర దేశాలకు పొయ్యాడు. అక్కడా పెద్ద పెద్ద చదువులు చదివాడు. ఈ చదువులకు ఒక మహారాజు సాయం చేశాడు.
ఆ కాలంలో అంత చదువులు చదివినవాళ్ళు ఆ పేద కులంలో ఎవ్వరూ లేరు. దీనికి వాళ్ళెంతో సంబర పడిపోయారు. అంబేద్కర్ ఇంటికి రాగానే పండగ చేసుకొన్నారు.
నేను చదువుకోడం గాదు, పెరగడం గాదు, నావాళ్ళంతా నాలాగే కావాలి. వాళ్ళకు న్యాయం జరగాలి. దానికోసం వాళ్ళు నిలబడాలి. దీనికి నేను చేతనయినంత చెయ్యాలి. ఈ నిర్ణయానికి వచ్చాడు అంబేద్కర్.
ఆయనకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. మర్యాదలు దక్కాయి. మంత్రి పదవులు వెతుక్కొంటూ వచ్చాయి. అయినా ఇవన్నీ దేనికోసం? నాలాగా నా జనం అవమానాల పాలు కాకుండా చూడ్డం కోసం అనుకొన్నాడు అంబేద్కర్.
దీనికోసం వెనకబడ్డ జాతుల్ని కూడగట్టాడు: సభలు పెట్టాడు. వాళ్ళకోసం ఎన్నో పుస్తకాలు రాశాడు. ఊరూరా తిరిగాడు. ఊరేగింపులు చేశాడు. పోరాటాలు నడిపాడు.
అంబేద్కర్ పదవుల కోసం పాకులాడలేదు. బిరుదుల కోసం ఎగబడలేదు. చెయ్యిచాచి ఎవర్నీ అడగలేదు. అలాగే ఎంత పైకి వెళ్ళినా తన తోటివారిని మరిచిపోనూలేదు. ఎన్ని కష్టాలు పడినా అలసిపోనూ లేదు.
ఆయన పోరాటం కొంత ఫలించింది. 'మేమూ మనుషులమే. మాకు రావల్సింది మాకివ్వండి' అని వెనకబడ్డ జాతులు ఈరోజు అడుగుతున్నాయి. నిలబడుతున్నాయి.
"తెలుసుకోండి. ఒకటిగా నిలబడండి. పోరాడండి" అని అంబేద్కర్ ఎప్పుడూ చెప్పేవాడు. కులాలు మతాలు లేని రాజ్యం రావాలని కలలు కనేవాడు.
ఇలా బడుగు జనానికి అంబేద్కర్ వెలుతురు లోకం చూపాడు. అందుకే ఆయన వాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడు.
వీర సైనికురాలు లక్ష్మీ సైగల్
మనం ఎన్నో కథలు విన్నాం. కత్తి దూసి యుద్ధం చేసిన మగవాళ్ళ గురించి తెలుసుకున్నాం. బాణాలతో పోరాటాలు చేసిన వాళ్ళ గురించీ చెప్పుకున్నాం.
కానీ అరవై ఏళ్ళ కిందటే - ఒక ఆడకూతురు మరతుపాకీ చేతబట్టిందంటే - యుద్ధం చేసిందంటే - నమ్మగలమా!
ఆ ధైర్యవంతురాలే లక్ష్మీ సైగల్.
ఆమె డాక్టరు చదువుకుంది. కానీ డబ్బు సంపాదనకి దిగలేదు. పైగా తనకి ఉన్నది కూడా ధారపోసింది. స్వరాజ్య పోరాటంలోకి దూకింది.
అప్పుడు మనని తెల్లవాళ్ళు పాలించే వాళ్ళు గదా! దేశంలో ఆడా మగా అంతా స్వరాజ్య పోరాటం జరిపారు.
తెల్లవాళ్ళ మీద పోరాటానికి నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఒక పెద్ద సైన్యం తయారుచేశాడు. ఆ సైన్యంలో మన లక్ష్మి ఒక అధికారి.
మగవాళ్ళతో సమానంగా తుపాకీ చేతబట్టింది. యుద్ధం చేసింది. ఎంతోమంది తెల్లవాళ్ళని గడగడ లాడించింది. స్వరాజ్యం వచ్చాక గూడా ఆమె పదవులకోసం పాకులాడ లేదు. డాక్టరు పని మొదలెట్టింది. బీదా బిక్కీ అందరికీ వైద్యం చేస్తోంది. జనానికి సేవ చేయడమే తన పనిగా పెట్టుకుంది.
ఈ మధ్యనే అలహాబాదులో ఒక సంగతి జరిగింది.
కొందరు దుష్టులు ఒక హరిజన అమ్మాయిని అవమానించారు. నడిరొడ్డుమీదే బట్టలు విప్పి ఎగతాళి చేశారు. అక్కడ ఉన్నావాళ్ళెవరూ నోరు విప్పలేదు.
మన లక్ష్మి అప్పుడక్కడికి వచ్చింది. ఎనభయ్యో ఏట కూడా సింహంలా ముందుకి దూకింది. ఆ పశువులకి బుద్ధి చెప్పింది. ఆ అమ్మాయి కన్నీళ్ళు తుడిచింది.
కులం, మతం తేడాలతో ఇలాంటి అన్యాయాలు చేసే వాళ్ళంటే ఆమెకు మంట. ఈ తేడాలు పోతేగానీ మన దేశం బాగుపడదంటుంది.
ఆడవాళ్లకి ఎక్కడ అన్యాయం జరిగినా ఆమె తాచు పాములా బుస్సున లేస్తుంది.