Jump to content

మనుచరిత్రము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

మనుచరిత్రము

సటీకము

————

తృతీయాశ్వాసము


వేంకటేశపదప
ద్మావేశితసదయహృదయ హరనిటలనట
త్పావకపరిభావిమహః
ప్రావృతనిఖిలాశ కృష్ణరాయమహీశా.

1

టీ. శ్రీ...హృదయ - శ్రీ = లక్ష్మీతో కూడిన, వేంకటేశ = వేంకటేశ్వరస్వామియొక్క, పదపద్మ = పాదపద్మములందు, ఆవేశిత = ఉంపఁబడినట్టియు, సదయ = దయతోఁ గూడినట్టియు, హృదయ = డెందముగలవాఁడా, హర...నిఖిలాశ - హర = శివునియొక్క, నిటల = నొసట, నటత్ = వర్తించు, పావక = అగ్నిని, పరిభావి = తిరస్కరించు, మహః = ప్రతాపముచే, ప్రావృత = ఆవరింపఁబడిన, నిఖిలాశ = ఎల్లదిక్కులుగలవాఁడా, కృష్ణరాయమహీశా = కృష్ణరాయప్రభూ.

ఇందుఁ బరాక్రమము అగ్నిగా నుపమించఁబడెను. అగ్ని రక్తగణములోఁ జేరినది. పరాక్రమమును ఎఱ్ఱగను గీర్తిని తెల్లగను కవులు వర్ణించుట కవిసమయము. దృష్టాంతము.

శ్లో. “శుక్లత్వం కీర్తిహాసాదౌ కార్ష్ణ్యం దుష్కీర్త్యఘాదిషు,
    ప్రతాపే రక్తతోష్ణత్వే రక్తత్వం క్రోధరాగయోః."

కావ్యకల్పలత

తా. శ్రీవేంకటేశ్వరస్వామిపాదకమలమందు మనసు గలవాఁడా! దయాస్వభావము గలవాఁడా! శివునిచిచ్చఱకంటిమంటకంటె వేఁడిమి గల ప్రతాపము గలవాఁడా! కృష్ణరాయనరనాథా!

అలం. ఉపమాలంకారము.

వ.

అవధరింపు మమ్మహాత్మునకుం బక్షు లిట్లనియె.

3

టీ. అవధరింపుము = చిత్తగింపుము. అమ్మహాత్మునకున్ = ఆమహానుభావుఁడగు జైమినిమునితో, పక్షులు = కథఁ జెప్పెడిపక్షులు, ఇట్లనియెన్ = ఈవిధముగాఁ జెప్పెను.

శా.

ఆభూదేవకుమారుఁ డేఁగినఁ దదీయానూనరమ్యాకృతిన్
దా భావంబున నిల్పి యంగభవకోదండోగ్రమౌర్వీరవ
క్షోభాకంపితధైర్యయై యలఁత నచ్చో నిల్వ కచ్చెల్వ త
ద్భూభృన్మేఖలవెంటఁ[1] గానలబడిన్ దుఃఖాబ్ధినిర్మగ్న యై.

4

టీ. ఆభూదేవకుమారుఁడు = ఆకొమరుఁబ్రాయపుబ్రాహ్మణుఁడు, ఏఁగినన్ = వెడలిపోఁగా, అచ్చెల్వ = ఆవరూథిని, తాన్ = తాను, తదీ...కృతిన్ - తదీయ = ఆతనిదైన, అనూన = కొఱఁతలేని, రమ్య = చక్కఁదనపు, ఆకృతిన్ = ఆకారమును, భావంబునన్ = మనస్సునందు, నిల్పి = నిలుపుకొన్నదై (ఎల్లపు డాయాకారమునే తలంచికొనుచు ననుట), అంగ...ధైర్యయై - అంగభవ = మదనునియొక్క, కోదండ = ధనుస్సునందలి, ఉగ్ర = క్రూరమైన, మౌర్వీ = నారియొక్క, రవ = ధ్వనివలని, క్షోభ = పీడచే, ఆకంపిత = కదల్పఁబడిన, ధైర్యయై = ధైర్యము గలదై, అలఁతన్ = శ్రమచే, అచ్చోన్ = అయ్యెడ, నిల్వక = నిలువఁజాలక (ఆప్రవరుఁడు లేమిచే నాప్రదేశము నివాసయోగ్యముగా భావింపక) దుఃఖాబ్ధినిర్మగ్నయై = దఃఖసముద్రమున మున్గినదై, తద్భూ...వెంటన్ - తత్ = ఆ, భూభృత్ = కొండయొక్క, మేఖలవెంటన్ = నడిప్రదేశమువెంబడి, కానలబడిన్ = అడవులత్రోవను, పైపద్యముతో నన్వయము. (పా. కానలఁబడెన్ అనుపాఠము స్వీకరింతుమేని తిరుగుచున్ అనుక్రియతో నన్వయింపదు గాన నీపాఠము గ్రాహ్యము కాదు.)

ప్రవరునియాకారము చిత్తమున నిలుపుకొన్నంతన వలపు జనించెను. మన్మథునినారి తుమ్మెదలు. వానిమ్రోఁత వలపువ్రేగుచే నుండువరూథినికి క్షోభ గూర్చెను. మన్మథునినారి తుమ్మెద చాలనుటకు —

శ్లో. “ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
    వసంతః సామంతో మలయమరుదాయోధనరథః.”

సౌందర్యలహరి

తా. ఆవిప్రుఁ డట్లు తన్నుఁ ద్రోసిపుచ్చి యరుగఁగా నావరూథిని యతనిచక్కఁదనమును దలఁచితలఁచి మన్మథబాణములతాఁకులచే ధైర్యము దక్కి దుఃఖమున మునిఁగి యచ్చట నిల్వలేక యాకొండనడితావులందలి యడవులత్రోవలఁ బడి.

క.

తిరుగుచు ధరణీసురవరుఁ
డరిగినచొ ప్పరసి యరసి యట కానక యా
హరిణాంకముఖి సఖీజన
పరివృతయై మగిడివచ్చి భావములోనన్.

4
టీ. తిరుగుచు = సంచరించుచు, ధరణీసురవరుఁడు = బ్రాహ్మణశ్రేష్ఠుఁడు, అరిగినచొప్పు = పోయినవిధము, అరసి అరసి = విచారించి విచారించి, అట = అక్కడ, ఆహరిణాంకముఖి = చంద్రునిఁబోలు ముఖము గల యాయింతి, సఖీజనపరివృతయై = చెలికత్తెలచే వెనుదవులఁబడినదై, చెలిమికత్తెలచే నావరింపఁబడినదై (తన్ను వెదుకవచ్చి కలిసికొన్నచెలులతోఁ గూడి), మగిడివచ్చి = తిరిగివచ్చి, భావములోనన్ = మనస్సులో, (పా. మరలివచ్చి) పైపద్యముతో నన్వయము.

తా. అట్లు వరూథిని యడవులఁ బడి తిరుగుచుఁ బ్రవరుఁ డరిగినజాడ వెదకి వెదకి కానలేక యంతలో దన్ను వెనుదవిలిన చెలికత్తెలతోఁ దిరిగివచ్చి మనస్సులో.

ఉ.

అక్కట వాఁడు నాతగులు మాఱడి సేసి దయావిహీనుఁడై
చిక్కక త్రోచి పోయె దరిఁ జేరఁగ రాని వియోగసాగరం
బెక్కడ నీఁదుదాన నిఁక నీకొఱనోములు నోఁచినట్టి నే
నెక్కడ వానికౌఁగి లది యెక్కడ హావిధి యేమి సేయుదున్.

5

టీ. అక్కట = అయ్యో, వాఁడు = ఆబ్రాహ్మణుఁడు, నాతగులము = నావలపును, ఆఱడి చేసి = రట్టు చేసి, వ్యర్థము చేసి (రట్టు అన నల్లరి. తాను మనుష్యుని వలపింపలేకపోయెనే వేలుపుముగుదయై వ్యర్థురా లయ్యెనని తోడివా రొనరించు నల్లరి.) దయావిహీనుఁడై = కరుణ లేనివాఁడై, చిక్కక = అందక, త్రోచిపోయెన్ = (కౌఁగిలించుకోఁబోయినప్పుడు) తొలఁగఁద్రోసి యరిగెను. దరిన్ = గట్టును, చేరఁగన్ = చేరుటకు, రానివియోగసాగరంబు = అలవి కాని విరహసముద్రము, ఎక్కడన్ = ఎంతవఱకని, ఈఁదుదానన్ = ఈఁదఁగలను? ఇఁకన్, ఈకొఱనోములు నోఁచినట్టి నేను = తక్కువనోములు నోఁచిన యీనేను, ఎక్కడ? వానికౌఁగిలి అది = వానియావిధమగు కౌఁగిలింత, ఎక్కడ? (ఆసుందరాకారునికౌఁగిలి నావంటి కొఱనోములు నోఁచిన నిర్భాగ్యురాలి కెటుల లభించు ననుట) హావిధి = అయ్యో దైవమా! ఏమి సేయుదున్ = విరహ మెటులఁ దొలఁగించుకొందును? (పా. విధి నేమి చేయుదున్ = నా కిట్టి దుర్విచారము కలుగఁజేసిన బ్రహ్మ నేమి చేసి పగ తీర్చికొందును.)

వేల్పుచెలువ తనంత వలచిరాఁగా మానవుఁడు తొలంగిపోవుట వేల్పుచెలువ నోఁచినకొఱనోములఫలము గాని వేఱుగాదు.

తా. అయ్యో! అతఁడు నాయంత నేనై వలచినను, నావలపును ఱట్టు చేసి చేఁజిక్కక త్రోపు త్రోసిపోయెను. దరిగానని యీవిరహసముద్రము నెఁ ట్లీఁదఁగలను? తక్కువనోములు నోఁచినట్టి యీ నే నెక్కడ? వానికౌఁగి లెక్కడ? హా దైవమా! యేమి చేయఁదును?

అలం. పరిణామము. విషమము.

ఉ.

కమ్మనికుందనంబు కసుగందనిమే నెలదేఁటిదాఁటులన్
బమ్మెరవోవఁ దోలుఁ దెగబారెఁడు వెండ్రుక లిందుబింబమున్
గిమ్మననీదు మోము గిరిక్రేపులు మూఁపులు కౌను గానరా
దమ్మకచెల్ల! వానివికచాంబకముల్ శతపత్త్రజైత్రముల్.

6

టీ. అమ్మకచెల్ల = ఔరా! వాని = ఆప్రవరుని, కసుగందనిమేను = ఇంచుకంతయినవాడు దేఱని (వాని) శరీరము, కమ్మనికుందనంబు = పరిమళించు మేలిమిబంగారము, తెగబారెఁడువెండ్రుకలు = బారకొలఁదినిమించిన (వాని) తలవెండ్రుకలు, ఎలదేఁటిదాఁటులన్ = కొదమతుమ్మెదబారులను, బమ్మెరవోవన్ = అదరిపోవునట్లు, తోలున్ = పాఱదోలును, మోము = ఆతనిముఖము, ఇందుబింబమున్ = చంద్రబింబమును, కిమ్మననీదు = ఏమి యని వాయెత్తి మాటలాడనీయదు. తిరస్కరించును. మూఁపులు = భుజశిరస్సులు, గిరిక్రేపులు = పర్వతశిఖరములు, మిగుల నున్నతముగా నున్న పనిభావము. కౌను = నడుము, కానరాదు = అగపడదు. వాని వికచఅంబకముల్ = విరఁబాఱియుండు వానికన్నులు, శతపత్త్రచైత్రముల్ = పద్మములను జయించునివి.

శైలశిఖరములవలె భుజము లున్నతములుగా నుంట సౌందర్యాతిశయము. విజయవిలాసంబునం దిటులె "ఎగుభుజంబులవాఁడు" అనియు, ఇందే ద్వితీయాశ్వాసమున “నిక్కి వీనులతోడ నెక్కసక్కెము లాడుకరణి నున్నవి వీనిఘనభుజములు" అనియుఁ జెప్పఁబడెను.

తా. ఆహా! ఏమని వర్ణింతును? ఇంతైన వాడుదేఱని వానిశరీరము పరిమళము కల మేలిమిబంగారము. బారతో బారెఁడు నిడుపుగల వానివెండ్రుకలు తుమ్మెదలబారును మీఱునెఱులు గలిగి యున్నవి. ముఖమా చంద్రబింబమును మించి యున్నది. భుజశిరస్సులు పర్వతాగ్రములవలె నున్నత ములై యున్నవి. వహ్వా! వానికన్నులు విశాలములై కమలములను లెక్కగొనక యున్నవి.

అలం. ఉత్ప్రేక్ష, ఉపమ, రూపకము, ఆతిశయోక్తి.

ఉ.

చొక్కపుఁబ్రాయమున్ మిగులు సోయగమున్ గల ప్రాణనాయకుం
డెక్కుడువశ్యతన్ రతుల నేఁకటఁ దీర్చి సమేళ మొప్పఁగా
నక్కున గారవించి ప్రియమందఁగ నోఁచనియింతిదైనయా
చక్కఁదనం బదేమిటికి జవ్వన మేటికిఁ బ్రాణ మేటికిన్?

7

టీ. చొక్కపుఁబ్రాయము = తేఱినయౌవనమును, మిగులన్, సోయగమున్ = చక్కఁదనమును, కలప్రాణనాయకుఁడు = కలిగినప్రియవల్లభుఁడు, ఎక్కుడు వశ్యతన్ = ఎక్కువయధీనతతో, రతులన్ = సంభోగములయందలి, ఏఁకటన్ = అత్యపేక్షను, తీర్చి = సవరించి, సమేళము = ఐక్యము, (ఒకటిగాఁ గలిసి యుండుట) ఒప్పఁగాన్ = చెలఁగునట్లు, అక్కునన్ = ఱొమ్మున, గారవించి = గారవింపఁగా, ప్రియము = ప్రేమమును, అందఁగన్ = చెందుటకు, నోఁచనియింతిది = నోఁచుకొనని దురదృష్టవంతురాలగు స్త్రీది, ఐనయాచక్కఁదనంబు అది = అట్టిసౌందర్యము, ఏమిటికిన్ = ఎందులకు? జవ్వనము = యౌవనము, ఏటికిన్ = ఎందులకు? ప్రాణము = ఉసురు, ఏటికిన్ = ఎందులకు? ఇన్నియు వ్యర్థ మని భావము.

రతులఁ దృప్తిదీర్చుట, సమేళ మొప్ప నక్కున గారవించుట అనువానిచేఁ బురుషాయితభోగ మూహ్యము. ఇదియే రతికిఁ బరమావధి. అట్టిభాగ్యమునకు నోఁచనైతి ననుట. అక్కున గారవింపఁబడుటయే పురుషాయితధర్మ మనుటకు

శ్లో. “ఉరసి నిపతితానాం స్రస్తధమ్మిల్లకానాం
    ముకుళితనయనానాం కించిదున్మీలితానాం
    ఉపరిసురతఖేదస్విన్నగండస్థలానా
    మధరమధు వధూనాం నాభాగ్యవంతః పిబంతి.”

భర్తృహరి. శృం. శ.

తా. తేఱినయౌవనమును నిండారు చక్కఁదనమును గల్గుమనః ప్రియుఁడు మిక్కిలి స్వాధీనుఁడై సంభోగకాంక్షలఁ దీర్చుచు ఱొమ్మునఁ జేర్చుకొనుచుండ సౌఖ్య మందుటకు నోఁచుకొననియాఁడుదానిచక్కఁదనము యౌవనము ప్రాణము నిష్ప్రయోజనములు.

అలం. అప్రస్తుతప్రశంసాలంకారము.

ఉ.

ఎంతతపంబు సేసి జనియించినవారొకొ మర్త్యభామినుల్
కాంతుఁ డవజ్ఞ సేసినను గాయము వాయుదు రే నమర్త్యనై
చింతల వంతలం జివికి సిగ్గఱితిన్ మృతి లేనినాదుచె
ల్వింతయు శూన్యగేహమున కెత్తినదీపిక యయ్యె నక్కటా!

8

టీ. మర్త్యభామినుల్ = మనుష్యస్త్రీలు, ఎంతతపంబు చేసి = ఎంతపెద్దతపస్సును గావించి, జనియించినవారొకొ = పుట్టిరో? కాంతుఁడు = ప్రియుడు, అవజ్ఞ = అవమానము, చేసినన్ = చేసిన పక్షమున, కాయము = శరీరమును, పాయుదురు = వీడుదురు, ఏన్ = నేను, అమర్త్యనై= (చావులేని) దేవతాస్త్రీనై, చింతలవంతలన్ = దుఃఖములతోను అవస్థలతోను, చివికి = చీకుచెంది, సిగ్గఱితిన్ = సిగ్గుమాలితిని,మృతి లేనినాదుచెల్వు ఇంతయున్ = చావు లేని నాచక్కఁదనమంతయు, శూన్యగేహమునకున్ = పాడుకొంపకు, ఎత్తినదీపిక = పెట్టినదీపము, అయ్యెన్ = ఆయెను. అక్కటా = అయ్యో!

"మ్రియత ఇతి మర్త్యః” అను వ్యుత్పత్తిచేత మనుష్యజన్మము చావు గల దని, తద్వ్యతిరేక మగుటచే నమర్త్యులు చావు లేనివా రని భావము.

తా. మనుష్యస్త్రీ లెంతయేని పుణ్యము చేసినవారు. ప్రియులు వారియెడ నవజ్ఞను జూపునపుడు దేహము వీడి దుఃఖముఁ దీర్చుకొందురు. దేవతాస్త్రీ నగుటచేఁ జింతలను వంతలను చీకుచెంది సిగ్గుమాలవలసినదే కాని చావఁదరము గాదు గదా! చావులేని నా యీచక్కఁదన మంతయుఁ బాడుకొంపకుఁ బెట్టినదీపమువలె నయినది.

అలం. ఉత్ప్రేక్ష, పరికరాంకురము, నిదర్శన.

వ.

అని వితర్కించుచుం గ్రించుఁదనంబునన్ బునఃపునఃపరిభవ
కారి యై కాఱియంబెట్టుసిరిపట్టి బెట్టేయన్ గాఁడి చనునల

రంపకట్టియల గుట్టు చెడి వెచ్చవెచ్చనై హెచ్చి విచ్చల
విడిం గాయునుద్దామవిరహదవదహనదాహంబున దేహంబు
తల్లడిల్ల మల్లడిగొని పెల్లడరునిట్టూర్పుగాడ్పు విసరులంగస
రెత్తి యంతకంత కంతరంగంబున నింతం తనరాక పొంగి
చింతాసాగరంబు వేగిరంబ వెల్లివొడిచె ననన్ దుడిచిన నడం
గక సారెకుం బారకల నీరికలెత్తుపొగ రన నిగనిగ లినుమ
డిగ నిగుడ మిగులువగల బుగులుబుగులున నెగసి యెగసి
యొప్పులకుప్ప లగుఱెప్పలం జిప్పిలుకాటుక లప్పళించి కరంచి
దరదళదరుణకమలదళశోణంబు లగుదృక్కోణంబులం దిగు
వాఱుకన్నీరు చెన్నారుకర్ణద్వయీగోళంబులు నిండి తను
తాపతప్తం బగుహాటకతాటంకయుగళంబునం బడి క్రొం
బొగ లెగయింప బిసకిసలయసగంధం బగు మణిబంధం
బునఁ జికురబంధంబుఁ జేర్చుకొని పొరలం దుఱిమిన
విరు లురుల నరవిరిసి కవిసి యిరులుకొనుగరగరని
నెఱికురులు గుఱి గడవఁ బెరిఁగిన వగుటం జేసి రాశివడి
మెయి మూసికొని గ్రహగణంబులం జెన్నగుమిన్ను విఱిగి
పయిం బడినవడువున బెడంగువడఁ గలయం దలకొనుపులక
మొలకపయిరునకుం బాఱు దుర్వార వారిపూరంబనం గ్రమ
క్రమంబున నంగంబులం గ్రమ్ము చెమ్మటలమిన్నేటి పెన్నీటి
వఱ్ఱున మునుంగకుండ సవరించినమించుకుంభప్లవం బనం
బరిభ్రష్టోత్తరియం బై బయలువడి యబ్బురంపుగుబ్బచను
దోయి నిబ్బరంపుమెఱుంగు లీనం గుపితహరనయనశిఖిశిఖా
భస్మీకృతస్మరవిరహశోకంబునం బడి చందురునిం బట్టుకొని
యడలురతిరమణిచందంబునం గుసుమితలతాంతనిశాంతశశి

కాంతవేదికాంతరంబున మేను సేర్చి వివిధదశాంతరంబుల
వేఁగుచుండె నంత.

9

టీ. వితర్కించుచున్ = చింతసేయుచు, క్రించుఁదనంబునన్ = నైచ్యముచే, పునఃపునఃపరిభవకారియై = మాటిమాటికి నవమానము చేయువాఁడై, తిరస్కార మని కొందఱు వ్రాసిరిగాని పరాభవ మనుటయే తగియున్నది. కాఱియం బెట్టు సిరిపట్టి = బాధపెట్టుమన్మథుఁడు, బెట్టు = మిక్కిలి, ఏయన్ = వ్రేయఁగా, కాఁడి = గ్రుచ్చుకొని, చనుఅలరు అంపకట్టియలన్ = (దూసి) పోవుపూములుకలచే, గుట్టుచెడి = మర్మము చెడి, వెచ్చవెచ్చనై = ఇంచుకవేఁడియై, హెచ్చి, విచ్చలవిడిన్ = అడ్డులేక, కాయు = కాయుచున్న. అలం. పరిణామము. ఉద్దామ...దాహంబునన్ - ఉద్దామ = మితిమీఱిన, విరహ = వియోగవ్యధ యను, దవదహన = దవాగ్నియొక్క, దాహంబునన్ = తాపముచే, దేహంబు = శరీరము, తల్లడిల్లన్ = అదురుకొనఁగా, మల్లడిగొని = దట్టమయిన, పెల్లు = మిక్కిలి, అడరునిట్టూర్పు గాడ్పువిసరులన్

= అతిశయించు దీర్ఘశ్వాసపుగాలియొక్క వీచుటచే, కసరెత్తి = తుపానుగల్గి, అంతకంతకున్ = అప్పటప్పటికి, అంతరంగంబునన్ = హృదయమున, ఇంత అంత అనన్ రాక = పరిమాణము చెప్పఁదరము గాక, పొంగి, చింతాసాగరంబు = దుఃఖసముద్రము, వేగిరంబ = శీఘ్రముగా, వెల్లివొడిచెననన్ = పొర్లి ప్రవహించెనో యనునట్లు. అలం. రూపకోత్ప్రేక్షలు రెండును. తుడిచినన్ = వస్త్రపుకొంగుతోఁ దుడుచుకొన్నను, అడంగక = మానక, సారెకున్ = మాటికిని, తారకలన్ = నల్లగ్రుడ్లనుండి, ఈరికలు = మొలకలు, ఎత్తు = ఎత్తునట్టి, పొగరు = నల్లనయో (నల్లనివర్ణ మేమో), అనన్ = అనునటుల, నిగనిగలు = నిగనిగనికాంతులు, ఇనుమడిగన్ = రెట్టింపుగా, నిగుడన్ = వ్యాప్తి చెందఁగా, మిగులువగలన్ = హెచ్చైనదుఃఖముచే, బుగులుబుగులునన్ = బుగులుబుగులు మనునట్లు, ఎగసి యెగసి = ఉప్పతిల్లి యుప్పతిల్లి, ఒప్పులకుప్పలు = చక్కఁదనాలప్రోవులు, అగుఱెప్పలన్ = ఐన కనుఱెప్పలవలననుండి, చిప్పిలుకాటుకలు = ఉబికెడుకాటుకలను, అప్పళించి = ఆక్రమించి, కరంచి = కరఁగం జేసి, దర...శోణంబులు - దరదళత్ = కొంచెము విచ్చు, అరుణకమల = ఎఱ్ఱదామరలయొక్క, దళ = ఱేకులవలె, శోణంబులు = ఎఱ్ఱనివి. అలం. ఉపమ. అగు దృక్కోణంబులన్ = అగునట్టి నేత్రాంతములనుండి, దిగువాఱు = స్రవించునట్టి, కన్నీరు, చెన్నారు కర్ణద్వయీగోళంబులు = ఒప్పునట్టి చెవిదోయియొక్క రంధ్రములను, నిండి, తనుతాపతప్తంబు = శరీరపువేఁడిమిచేఁ గాఁచబడినది, అగు హాటకతాటంకయుగళంబునన్ = అగునట్టి బంగారుకమ్మలజతపై, పడి = పడినదై, క్రొంబొగలు = క్రొత్తపొగలను, ఎగయింపన్ = రేఁపఁగా, అలం. అతిశయోక్తి. బిసకిసలయసగంధంబు = తమ్మిచిగురుఁ బోలినది, అగు మణిబంధంబునన్ = అగునట్టి మణికట్టున, అలం. ఉపమ. చికురబంధంబున్ = వెండ్రుకలముడిని, చేర్చుకొని= పెట్టుకొని (నిలుపుకొని) పొరల = దొరలునట్లుగ, తుఱిమినవిరులు = చెరివినపూలు, ఉరులన్ = తొఱఁగునట్లు, అరవిరిసి = సగము విచ్చి, కవిసి = క్రమ్మి, ఇరులుకొను...కురులు - ఇరులుకొను = చీకట్లు కమ్ము, గరగరని నెఱికురులు = అందముగల్గి నొక్కులు దీఱిన వెండ్రుకలు, గుఱి = హద్దు, కడవన్ = కడచునట్లు, పెరిగినవి = వృద్ధినొందినవి, అగుటం జేసి = కాఁబట్టి, (వెండ్రుకల నల్లదనమును జీకటితోఁ బోల్చుటయు నొక్కులుగా నున్నవెండ్రుకలు చీకటులఁ బోలి మనోహరముగా నుండుటయు సాజము. ఇందులకు సీ. “మొలకచీకటి జలజల రాల్పఁగారాదె నెరులు మించిన వీరికురులయందు" — పాండురంగమాహాత్మ్యము. రాశిపడి = ప్రోవై, మెయిన్ = శరీరమును, మూసికొని = ఆవరించుకొని, గ్రహగణంబుల = గ్రహసమూహములచే, చెన్నగుమిన్ను = ఒప్పగునాకాశము, విఱిగి = తునిఁగి, పయిన్ = తనమీఁద, పడినవడువునన్ = పడినవిధమున, బెడంగుపడన్ = అందమగుచుండఁగా, కలయన్ = అంతటను, తలకొను..పయిరునకున్ - తలకొను = సంభవించు, పులక = రోమోద్గమమను, మొలకపయిరునకున్ = మొక్కపైరునకు, అలం. రూపకము. పాఱు...పూరంబు - పాఱు = ప్రవహించు, దుర్వార = అడ్డగింపరాని, వారిపూరంబు = జలప్రవాహము, అనన్ = అనునట్టు, అలం. ఉత్ప్రేక్ష. క్రమక్రమంబునన్, అంగంబులన్ = అవయవములందు, క్రమ్ము...వఱ్ఱునన్ - క్రమ్ము = వ్యాపించు, చెమ్మటల = చెమటచేనైన, మిన్నేటి = గంగయొక్క, పెన్నీటివఱ్ఱునన్ = పెద్దనీటివఱదయందు, మునుంగకుండన్ = మునిఁగిపోకుండునటుల, సవరించినన్ = సరిచేయఁగా, మించుకుంభప్లవం బనన్ = అతిశయించునట్టి కుండల బోరగిలఁ బెట్టి కట్టిన తెప్పయో యనునట్టు. అలం. ఉత్ప్రేక్ష, పరిభ్రష్టోత్తరీయంబై = జాఱినపైఁట గలదై, బయలువడి, అబ్బురంపుగుబ్బచనుదోయి = అపురూపమైన వట్రువగల కుచద్వయము, నిబ్బరంపుమెఱుంగులు = నిద్దపుకాంతులను, ఈనన్ = కలిగించుచుండఁగా, వలువ తొలంగుటచేఁ గనిపించు గబ్బిగుబ్బలు చెమ్మటమిన్నేరు దాటుటకుఁ గట్టిన కుండల బోరగిలవైచి కట్టిన తెప్పకైవడి యున్న వనుట. వట్రువయు బిగియుఁ గల చన్నులకాంతి కందళించును. ఇట్లనుటకు - ఉ. "క్రిక్కిఱిచన్నుదోయి యిరుక్రేవల కాంతియుఁ బంచబాణుఁ గ్రొవ్వెక్కఁగఁజేయ” - శృంగార నై. ఆ-7. కుపిత...శోకంబులన్ – కుపిత = కోపించిన, హర = శివునియొక్క, నయనశిఖి = నేత్రాగ్నియొక్క, శిఖా = జ్వాలలచే, భస్మీకృత = బూదిగాఁ జేయఁబడిన, స్మర = మన్మథునియొక్క, విరహ = ఎడఁబాటువలని, శోకంబునన్ = దుఃఖమునందు, పడి = పడినదై, చందురునిన్ = చంద్రుని, పట్టుకొని, అడలు...చందంబునన్ - అడలు = దుఃఖించు, రతీరమణిచందంబునన్ = రతీదేవివిధమున, అలం. ఉపమ. కుసుమిత...తరంబునన్ - కుసుమిత = పూచిన, లతానిశాంత = లతాగృహమందలి, శశికాంతవేదికాంతరంబునన్ = చంద్రకాంతమణిమయ మగు తిన్నియపై, మేను సేర్చి = శరీర ముంచి, చంద్రకాంతశిలపై వరూథిని పరుండుట భర్తృమరణమునకుఁ బరితపించుచు రతీదేవి చంద్రుని బట్టుకొని విచారపడునటులున్న దనుట, వివిధదశాంతరంబులన్ = పలుతెఱఁగులగు నవస్థాభేదముల, వేఁగుచుండెన్ = బాధపడుచుండెను. (మన్మథావస్థలు పది — చక్షుఃప్రీతి, మనస్సంగము, సంకల్పము, జాగరము, కృశత, అరతి, లజ్జాత్యాగము, ఉన్మాదము, మూర్ఛ, మరణము.)

పూర్వానురాగరూప మగు విప్రలంభమునందుఁ బదియవస్థలు, కొందఱిమతమునఁ బండ్రెండవస్థ లని చెప్పఁబడినవి. పైని చెప్పఁబడిన దశావస్థల నిటుల నాలంకారికులు నిర్వచించిరి —

శ్లో. "చక్షుఃప్రీతిః ప్రథమం చింతాసంగస్తతో౽థ సంకల్పః
    నిద్రాచ్ఛేదస్తనుతా విషయనివృత్తి స్త్రపానాశః
    ఉన్మాదో మూర్ఛా మృతి రిత్యేతే స్మరదశా దశైవ స్యుః."

ఈ పదియవస్థలు విరహజన్యములు. కొందఱు ద్వాదశావస్థలు చెప్పిరి. ప్రతాపరుద్రీయమునందు శ్లో. "అవస్థా ద్వాదశ మతాః కామశాస్త్రానుసారతః” అనుదానికి అలంకారశాస్త్రమునుబట్టి యవస్థలు పదియే యని వ్యాఖ్యాత యనెను. “దశావస్థాను తత్రాదౌ” అని దశరూపకమునందును, “దశావస్థా స్సమానతః” అని సింగభూపాలీయకమునందును అవస్థాదశకమే చెప్పఁబడియున్నది. ద్వాదశావస్థలు కామశాస్త్రానుసారముగ నై యుండును.

తా. ఈవిధముగా వరూథిని వితర్కించుచు మన్మథతాపమునకు దేహము తల్లడిల్లఁగా, నిట్టూర్పుగాడ్పు లనుతుపాను గొట్టి పొంగి పొర్లు సంతరంగమందలి చింతాసాగరపువెల్లువ యనునట్లు తుడిచినను దగ్గక ఱెప్పలకాటుకను గలసి నల్లగ్రుడ్లకాంతులో యన నిగనిగలాడుచు నెఱ్ఱదామరఱేకులవంటి కన్నులకొనలనుండి దిగవాఱుకన్నీరు బంగరుకమ్మలపైఁ బడి క్రొత్తకాంతులఁ గల్పింపఁగా, తమ్మిచివురుం బోలు మణికట్టుపయి వెండ్రుకలముడి నేర్చికొనుటచే సగము వీడి నిండుగాఁ దుఱిమినపూలు పొరలుచుండఁ జీకట్లు క్రమ్ము పొడవయిన నెఱికురులు రాశివడి శరీరమునిండ మూసికొని నక్షత్రగ్రహములతో నొప్పెడు నాకసము విఱిగి మీఁదఁ బడిన విధమునఁ గాఁగా, అంతటను మొలకలెత్తిన పులకలకుఁ బాఱు జలప్రవాహ మనున ట్లున్న చెమ్మటవఱదలో మునిఁగిపోకుండఁ బెట్టిన (రెండుకుండలతోఁ గట్టిన) తెప్ప యనునట్లు పైఁట జాఱిన గబ్బిచనుదోయి మెఱుఁగులు కురియఁగా, మన్మథుఁడు శివునికంటిమంటచే నీఱు చేయఁబడఁగా నాతని విరహమునకుఁ దాళలేక చంద్రునిఁ బట్టుకొని యేడ్చు రతీదేవివిధమున, పూచిన లతాగృహమునందు చంద్రకాంతశిలాతలమున శరీరము చేర్చి బహుదశాభేదములతో బాధపడుచుండెను.

చ.

తరుణి ననన్యకాంత నతిదారుణపుష్పశిలీముఖవ్యథా
భరవివశాంగి నంగభవుబారికి నగ్గము సేసి క్రూరుఁ డై
యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గషాయదీధితిన్.

10

టీ. తరుణిన్ = వయసుదానిని, అనన్యకాంతన్ = మఱొకప్రియుఁడు లేనిదానిని, అతి...శాంగిన్ - అతిదారుణ = మిగులఁ గ్రూరమయిన, పుష్పశిలీముఖ = పూవిల్తునివలని, వ్యథాభర = అధికబాధచే, వివశ = పరవశమగు, అంగిన్ = శరీరముగలదానిని, వరూథినిని, అంగభవుబారికిన్ = మదనావస్థకున్, అగ్గము చేసి = పాల్పఱిచి, క్రూరుఁడై = కఠినుఁడై, దయాశూన్యుఁడై యనుట. మహీసురాధముఁడు = అధమబ్రాహ్మణుఁడు, అహంకృతితోన్ = అహంకారముతో, అరిగెన్ = పోయెను, అని = అనుకొని, రోషభీషణస్ఫురణ = కోపముచే భయంకరమగు తేజమును, వహించెనో = తాల్చెనేమో, అనన్ = అనునటుల, నభోమణి = సూర్యుఁడు, కషాయదీధితిన్ = ఎఱ్ఱనికాంతిని, తాల్చెన్ = దరించెను.

కోపము రక్తవర్ణగణములోనిది. (మూఁడవ ఆశ్వాసములోని మొదటిపద్యవ్యాఖ్య చూడుము.) అస్తమించుతఱి సూర్యుఁ డెఱ్ఱనగుట సాజము.

కషాయమన ఎఱుపురం గనుటకు —

    'కషాయో రసభేదే౽సి నిర్యాసే చ విలేపనే,
    అంగరాగే చ న స్త్రీ స్యాత్ సురభౌ లోహితే త్రిషు.

మేదిని

తా. చిన్నారివయసుది ఇతరు నెవ్వనిఁ బ్రేమింపనిది తన్ను వలచినది యగువరూథినిని ప్రేమించక మన్మథావస్థలపాలు చేసి ప్రవరుఁడు క్రూరుఁడై త్రోసి చనియె నని కోపము దాల్చి యెఱ్ఱవాఱెనో యనునట్లు సూర్యు డెఱ్ఱనికాంతి గలవాఁ డయ్యెను.

అలం. పరికరము, ఉత్ప్రేక్ష, కావ్యలింగము.

సీ.

ఉరుదరీకుహరసుప్తోత్థశార్దూలముల్
          ఝరవారి శోణితశంకఁ ద్రావ
వనకుంజమధ్యశాద్వలచరన్మృగపంక్తి
          దావపావకభీతిఁ దల్లడిల్ల
నాశ్రమాంతరభూరుహాగ్రముల్ మునికోటి
          బద్ధకాషాయవిభ్రాంతిఁ జూడ
ఘనసానుశృంగశృంగాటకంబులఁ గాంచి
          యమరులు హేమాద్రి యనుచు వ్రాలఁ


తే.

గాసెఁ బేశలరుచిఁ గింశుకప్రవాళ
ఘుసృణకిసలయకంకేళికుసుమగుచ్ఛ
బంధుజీవజపారాగబాంధవంబు
లన్నగంబున జరఠారుణాతపములు.

11

టీ. ఉరు...శార్దూలముల్ - ఉరు = గొప్పవగు, దరీకుహర = గుహలకలుగులలో, సుప్తోత్థ = నిద్రించి లేచిన, శార్దూలముల్ = పెద్దపులులు, ఝరవారి = సెలయేళ్లలోని నీటిని, శోణితశంకన్ = రక్త మనునూహతో, త్రావన్ = త్రాఁగగా, (గుహలలో నిద్రించుచుండి అప్పుడే లేచి వచ్చిన పెద్దపులులు సెలయేళ్లలోనినీటిని రక్త మని త్రాగఁగా ననుట), వన...మృగపంక్తి - వన = అడవియందలి, కుంజ = పొదరిండ్లయొక్క, మధ్య = నడిమి, శాద్వల = పచ్చికపట్టులందు, చరత్ = చరించు, మృగపంక్తి = జింకలగుంపు, దావపావకభీతిన్ = దావాగ్ని యనెడు భయముచే, తల్లడిల్లన్ (పొదరిండ్ల నడిమి పచ్చిక నేలలందు మేత మేయుజింకలు పొదరిం డ్లెఱ్ఱగాఁ గాన్పించుటచేఁ గాఱుచిచ్చని జడియఁగా ననుట), ఆశ్రమాం...గ్రముల్ ఆశ్రమాంతర = మునిపల్లెలలో నున్న, భూరుహాగ్రముల్ = వృక్షాగ్రములను, మునికోటి = మునిసమూహము, బద్ధకాషాయవిభ్రాంతిన్ = ఆరఁగట్టిన కావివస్త్రములను భ్రమతో, చూడన్, (మునిపల్లెలలో నున్నవృక్షములకొనలను జూచి మునులు తమకావివస్త్రముల నెండఁగట్టినట్టు భ్రాంతి చెందఁగా ననుట), ఘన...శృంగాటకంబులన్ - ఘన = గొప్పవైన, సాను = చఱియలను, శృంగ = శిఖరములను, శృంగాటకంబులన్ = నాల్గుత్రోవలు కలియుచోట్లను, కాంచి, అమరులు = దేవతలు, హేమాద్రి యనుచున్ = మేరుపర్వత మని, వ్రాలన్ (విమానము లెక్కి యాకసమునఁ దిరుగుదేవత లెఱ్ఱనిచఱియలను శిఖరములను జదుకములను గాంచి మేరుపర్వతమే యనుకొని దిగి రాఁగా ననుట), హిమవంతము సాంధ్యరాగముచే నెఱ్ఱపడెను. సువర్ణము రక్తగణములోనిది గాన నెఱ్ఱగా నున్న మంచుకొండను వేల్పులు మేరుగిరిగా భ్రమించిరి. అన్నగంబునన్ = ఆ కొండపై, కింశుక...బాంధవంబులు - కింశుక = మోదుగుపూవులయొక్కయు, ప్రవాళ = పవడములయొక్కయు, ఘుసృణ = కుంకుమపూవుయొక్కయు, కిసలయ = చిగురుటాకులయొక్కయు, కంకేళికుసుమగుచ్ఛ = రక్తాశోకపుఁబూగుత్తులయొక్కయు, బంధుజీవ = మంకెనపూలయొక్కయు, జపా = జపాకుసుమములయొక్కయు, రాగ = ఎఱుపునకు, బాంధవంబులు = చుట్టాలు (అగు) జరఠారుణాతపములు = ముదిరినయెఱ్ఱయెండలు (సంజయెండలు), పేశలరుచిన్ = మృదుకాంతితో, కాసెన్.

అలం. భ్రాంతిమంతము నుపమయు.

సాయంసమయమునందు ఎండ ఎఱ్ఱగానుండి సమస్తవస్తువులను రక్తవర్ణముతో నలరారఁజేయుచు నలుగడల వ్యాపించి వేఁడిలేక యొప్పె నని భావము.

శా.

శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు లుష్ణాంశుపా
షాణవ్రాతము కోష్ణ మయ్యె మృగతృష్ణావార్ధు లింకెన్ జపా

శోణం బయ్యెఁ బతంగబింబము దిశాస్తోమంబు శోభాదరి
ద్రాణం బయ్యె సరోజషండములు నిద్రాణంబు లయ్యెన్ గడున్.

12

టీ. పక్షులు = పులుఁగులు, నభః+అంతరాళంబునన్ = ఆకాశము మధ్యభాగమునందు, శ్రేణుల్ కట్టి = బారులు దీరి, పాఱెన్ = పఱచెను (పరుగెత్తె ననుట), ఉష్ణాంశుపాషాణవ్రాతము = సూర్యకాంతపురాళ్లసమూహము, కోష్ణము = నులివేఁడి గలది, అయ్యెన్ = ఆయెను. కోష్ణ మన నులివేఁడి యనుటకు — "కోష్ణం కవోష్ణం మందోష్ణం కదుష్టం” అమరము. మృగతృష్ణావార్ధులు = ఎండమావు లను సముద్రములు — సముద్రములవలె నంతులేక కానబడు నెండమావులు, ఇంకెన్ = ఇంకిపోయెను. పతంగబింబము = సూర్యమండలము, జపాశోణంబు = జపాకుసుమము (దాసాని) వలె నెఱ్ఱనిది, అయ్యెన్, దిశాస్తోమంబు = దిక్కులసమూహము, శోభోదరిద్రాణంబు = కాంతిచేఁ బేదఱికము చెందినది. (కాంతి మాలినది), ఆయ్యెన్ = ఆయెను, సరోజషండములు = వద్మసమూహములు, నిద్రాణంబులు = ముకుళించినవి, ఆయెన్.

తా. పక్షులు మేఁతకుఁ బోయినతావులనుండి తమతమయునికితావులకు బారులు దీరి పఱవఁగా నెండ సోఁకి మండుచున్న సూర్యకాంతపురాళ్లు చల్లఁదనము నొందుచుండఁగా నెండమావు లణఁగిపోఁగా దిక్కులకాంతి తఱుఁగఁగాఁ గమలములు ముడుఁగఁగా సూర్యమండల మెఱ్ఱవాఱెను. అనఁగాఁ బ్రొద్దు గ్రుంకుసమయ మయ్యె నని తా.

అలం. స్వభావోక్తి, పరిణామము, ఉపమయును.

క.

తరణి యిదె క్రుంకుచున్నాఁ
డరుదె మ్మని చంద్రుఁ బిల్వ నరిగెడురజనీ
తరుణీమణిదూతిక లన
నరిగెన్ దూర్పునకు నీడ లతిదీర్ఘము లై.

13

టీ. తరణి = సూర్యుఁడు, ఇదె = ఇదిగో, క్రుంకుచున్నాఁడు = అస్తమించుచున్నాడు. అరుదెమ్ము = ఏతెమ్ము, నీవు త్వరగా రమ్ము, అని, చంద్రున్ = చందమామను, పిల్వన్ = పిల్చుటకు, అరిగెడు...దూతికలు - అరిగెడు = వెళ్లునట్టి, రజనీతరుణీమణి = రాత్రియను స్త్రీయొక్క, దూతికలు = తార్పుకత్తెలు, అనన్ = అనునటులు, నీడలు = (వస్తువుల)ఛాయలు, అతిదీర్ఘములై = మిగుల నిడుపులై, తూర్పునకున్ = తూర్పుదిక్కునుగూర్చి, అరిగెన్ = పోయెను.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

రాత్రి యనుచెలువకుఁ జంద్రుఁడు ప్రియుడు. ప్రతాపశాలియగు తరణి యఁన్నంతవఱకుఁ గలయిక పొసఁగదు. తూర్పునకుఁ బొడవు సాగిన నీడ లుదయింపఁబోవు చంద్రుని బిలుచుదూతిక లని భావము.

తా. ప్రతావవంతుఁ డయిన సూర్యుఁ డనువైరికి వెఱచి చంద్రుఁడు డాఁగియుండఁగా నాతఁ డస్తమించుచున్నాఁ డింక నీవు రమ్మని పిల్చుకొని వచ్చుటకై పోవు రాత్రి యనుస్త్రీయొక్క దూతికలో యనునట్లు వృక్షాదులనీడలు దూర్పునకుఁ బొడవుగాఁ బోవుచుండెను.

క.

క్రుంకె నపరాంబురాశిం
బంకజబంధుఁడు తదీయబడబాముఖవీ
క్షాంకురితకుతుకరథ్యని
రంకుశవేగాపహృతశతాంగుఁడువోలెన్.

14

టీ. పంకజబుధుఁడు = సూర్యుఁడు, అపరాంబురాశిన్ = పడమటిసముద్రమున, తదీయ...తాంగుఁడువోలెన్ - తదీయ = ఆపడమటిసంద్రపుసంబంధ మగు, ఆపడమటిసముద్రమునం దుండెడు, బడబా = ఆఁడుగుఱ్ఱముయొక్క, ముఖ = ముఖముయొక్క, వీక్షా = చూచుటచే, అంకురిత = అంకురించిన, కుతుక = కుతూహలముగల, రథ్య = రథాశ్వములయొక్క, నిరంకుశ = అడ్డులేని, వేగ = వేగముచే, అపహృత = ఈడ్చుకొని పోఁబడిన, శతాంగుఁడువోలెన్ = రథముగలవాఁడువలె, (సంజవేళ సూర్యునిగమన మతివేగము గల్గినట్లు కన్పడుట ప్రసిద్ధము.) క్రుంకెన్ = అస్తమించెను.

సూర్యునియశ్వములను ఏ డని కొందఱు ఒకటి యని కొందఱు చెప్పుదురు. సప్తాశ్వనామముచే నే డనుట ప్రసిద్ధము. (ఒకటి యనుపక్షమును పెద్దన స్వీకరించునటులఁ దోఁచును. సముద్రమునం దాఁడుగుఱ్ఱము గలదనియు దానికడుపున బడబాగ్ని యుండి యది వాననీరు గ్రోలు నని పురాణకథ.) కొందఱు సూర్యునిరథాశ్వము సప్త+అను నశ్వము కాననే సప్తాశ్వుఁ డయ్యెనందురు. సూర్యునియం దేడురంగులు గలవు. వానిచే సప్తాశ్వముగాఁ జెప్పి రని ప్రకృతిజ్ఞు లందురు. గురుబాలప్రబోధికలో “సప్త అశ్వాః యస్య నః సప్తాశ్వః” అనియు; “సప్తనామకః అశ్వః యస్యేతి వా సప్తాశ్వః” అనియు నుభయపక్షముల కనుకూలము లగు వ్యుత్పత్తులు గలవు.

తా. సూర్యరథము పడమటిసముద్రముఁ జేరఁబోవునపు డందు బడబాగ్నిని వహించి యుండెడు నాఁడుగుఱ్ఱపుమోర కన్పడఁగానే దానిని కలయుతమకముతో నతివేగమున సూర్యాశ్వములు రథము నీడ్చుకొనిపోయెనో యనున ట్లంతలో సూర్యుఁ డస్తమించెను.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

వ.

ఆసమయంబున.

15


సీ.

ఏవిహంగముఁ గన్న నెలుఁ గిచ్చుచును సారె
          కును సైకతంబులఁ గూడఁ దారుఁ
దారి కన్గొని యది తనజోడు గా కున్న
          మెడ యెత్తి కలయంగ మింట నరయు
నరసి కన్నీటితో మరలి తామర యెక్కి
          వదన మెడఁగ సరోవారి నద్దు
నద్ది త్రావఁగ సైఁప కట్టిట్టు గన్గొని
          ప్రతిబింబ మీక్షించి బ్రమసి యుఱుకు

తే.

నుఱికి యెఱకలు దడియ వే ఱొక్కతమ్మి
కరుగు నరిగి రవంబుతోఁ దిరుగు తేంట్లఁ
బొడుచు ముక్కున మఱియును బోవు వెదక
సంజఁ బ్రియుఁ బాసి వగ నొక్కచక్రవాకి.

16

టీ. ఒక్కచక్రవాకి = ఒకయాఁడుజక్కవ, సంజన్ = సంధ్యాకాలమున, ప్రియున్ = మగజక్కవను, పాసి = ఎడబాసి, వగన్ =విచారముతో, సైకతంబులన్ = ఇసుకతిన్నెలపై, ఏవిహంగమున్ = ఏపక్షిని, కన్నన్ = చూచినను, ఎలుఁగు ఇచ్చుచును = కూఁతనొసఁగుచు (అది తన్ను గుఱుతించుటకు), సారెకును = మాటికిని, కూడన్ = (దానిని) కలయుటకు, తారున్ = వెన్నాడును. తా నెవతెయో కంఠస్వరంబుతోఁ దెలుపుకొనుచుఁ బ్రియుఁడేమో యని యితరపక్షిని సమీపించును. తారి = అట్లు వెన్నాడి, కన్గొని = చూచి, అది, తనజోడు = తనజంటది, కాకున్నన్ = కాకపోగా, మెడయెత్తి = (తనజంటపులుఁ గెటు పోవుచున్నదో యెచట వాలునో యని చూచుటకు) మెడ సాచి, కలయంగన్ = అంతటను, మింటన్ = ఆకసమున, అరయున్ = చూచును. అరసి = చూచి, కన్నీటితోన్ = కన్నుల నీరు రాఁగా, (ప్రియుఁడు కనిపింపఁడాయెనే యని కన్నీరు గార్చుచు), మరలి = వెనుకకుఁ దిరిగి, తామర = తామరపూవును, ఎక్కి, వదనము = ముఖము, ఎండఁగన్ = ఎండిపోవుచుండఁగా, (ఆఱచి యఱచి నోటి తడి యాఱిపోవఁగా) సరః+వారిన్ = సరస్సునందలి నీటిని, అద్దున్ = ఆనును, అద్ది = ఆని, త్రావఁగన్ = త్రాగుటకు, సైఁపక = చవికాక, అట్టిట్ట = అటునిటు, కన్గొని = చూచి, ప్రతిబింబము = (నీటిలోఁదోఁచు) తనమాఱురూపును, ఈక్షించి = కాంచి, బ్రమసి = భ్రమించి, (తనప్రియుఁడో యని), ఉఱుకున్ = దుముకును. ఉఱికి, ఎఱుకలు = ఱెక్కలు, తడియన్, వేఱొక్కతమ్మికిన్ = మఱొకపద్మమునకు, అరుగున్ = పోవును, అరిగి, రవంబుతోన్ = ధ్వనితో, తిరుగు తేంట్లన్ = తిరిగెడు తుమ్మెదలను, ముక్కునన్ = ముక్కుతో, (తాను జింకతో నున్నపు డుల్లానముగాఁ జెలరేగి కూయుచున్నవే యని) పొడుచున్ = పొడుచును, మఱియును = మరల, వెదకన్ = (ప్రియుని) వెదకుటకు, పోవున్ = (వేఱొకదిక్కునకు) పోవును.

చక్రవాకమును జెప్పక చక్రవాకిని జెప్పుట వరూధిని యవస్థ సూచించుట. చక్రవాకములకు వియోగమునఁ గన్నీరు గారు ననుటకు

సీ. “చక్రవాకములలోచనయుగ్మకముల నె
              ట్లుబ్బెనో విరహబాష్పోదకములు.”

(శృం. నై. ఆ-8.)

తా. సాయంకాలమున జతఁ బాసి యొకయాఁడుజక్కవ తనప్రియనిఁ గానఁజాలక యిసుకతిన్నెలపై నేపక్షిని జూచినను గూఁత యందిచ్చుచుఁ దనప్రియుఁడే యనుకొని కదియ వెనుదవులును. అట్లు వెనుదవిలి చూచి యది తనజోడు కాఁకపోఁగాఁ దాను జూచినది యాకసమున కెగరెనేమో యని మెడ పైకెత్తి మింట నంతటను జూచును. చూచి యట కానక కన్నుల నీరు గ్రుక్కుకొనుచుఁ దిరిగివచ్చి కొలనిలోఁ దామరపూ వెక్కి నోరఁ దడి యారుటచే నీట నో రద్దును. అద్ది త్రావ రుచింపక యిటు నటుఁ జూచుచు నీటిలో దనప్రతిబింబ మగపడఁగాఁ బ్రియుఁ డని బ్రమసి దుముకును. అంత ఱెక్కలు దడియఁగా వేఱొక్కతామరపూవుఁ జేరును. చేరి యిక్కడ ఝంకారము సేయుచుఁ దిరుగు తుమ్మెదలఁ జూచి సైఁపరాక ముక్కునఁ బొడుచును. అంత మఱియు వెదకఁబోవును. (జక్కవలకు రేల కనులు కానరావు. కావున నవి ప్రొద్దు క్రుంకినచోఁ గలసికొనలేక విరహవేదన పడుట ప్రసిద్ధము. పక్షికే యింతవిరహవేదన కల్గునప్పుడు వరూథినివంటిదాని కెంత కల్గునో యచునది దీనిచే నెఱుఁగదగినది.)

అలం. స్వభావోక్తి భ్రాంతిమంతము లలంకారములు.

సీ.

రవిబింబపతనదీర్ణపయోధిగర్భని
          ర్గతశేషఫణిఫణారత్నరుచియొ

దివసావసానసందీప్తాస్తగిరిశిఖా
          జ్యోతిర్లతాప్రతానాతపంబొ
తపనధూర్దండనిర్దళితదిక్తటదృశ్య
          కమలజాండకటాహకనకఘృణియొ
చండీశతాండవోత్సవసంభృతక్షపా
          హస్తాగ్రదీపగభస్తిచయమొ


తే.

దాగ్విదాహచ్ఛిదావినిద్రాణమదవ
దంజనాలానమూలశయ్యావిధాన
వారుణాధోరణాకల్పితోరుశోణ
మృత్తికారాశియో యన మెఱసె సంధ్య.

17

టీ. సంధ్య = సంజకెంపు, రవి...రుచియొ - రవిబింబ = సూర్యబింబముయొక్క, పతన = పడుటచే, దీర్ణ = నెఱివిచ్చిన, పయోధి = సముద్రముయొక్క, గర్భ = లోపలిభాగమునుండి, నిర్గత = బయలువెడలిన, శేషఫణి = (నాగలోకమందుండు) ఆదిశేషునియొక్క, ఫణా = పడగలయందలి, రత్న = మణులయొక్క, రుచియొ = కాంతియొ, దివసా...తపంబొ - దివసావసాన = సాయంకాలమున, సందీప్త = ప్రజ్వలించు, అస్తగిరి = అస్తాద్రియొక్క, శిఖా = శిఖరములందలి, జ్యోతిర్లతా = మెఱుఁగుఁదీగెల, ప్రతాన = సమూహముయొక్క, ఆతపంబొ = వెలుఁగో, జ్యోతిర్లత యన తీగెలవలె వెలుఁగుచుండు జ్యోతులని కొందఱు చెప్పుదురు గాని యంత సరసము గాదు. అడవులందుఁ గొండలందు జ్యోతిర్లతలు చీకటిరాత్రులయందుఁ బ్రకాశించును. దృష్టాం — శ్లో. “వనేచరాణాం వనితాసఖానాం దరీగృహోత్సంగ నిషక్తభాసః, భవంతి యత్రౌషధయో రజిన్యామతైలపూరాస్సురతప్రదీపాః.” కుమారసంభవము. తపన...ఘృణియొ - తపన = సూర్యునియొక్క, ధూర్దండ = రథపునొగచే, నిర్దళిత = పగులఁగొట్టఁబడిన, దిక్తట = దిక్ప్రదేశములందు, దృశ్య = తోఁచునట్టి, కమలజాండ = బ్రహ్మాండ మను, కటాహ = గంగాళముయొక్క, కనకఘృణియొ = బంగారుకాంతియో, చండీశ...చయమొ - చండీశ = శివునియొక్క, తాండవోత్సవ = నాట్యోత్సవమందు, సంభృత = పట్టుకోఁబడిన, క్షపా = రాత్రియను స్త్రీయొక్క, హస్తాగ్ర = చేతికొన నున్న, దీప = దివటీయొక్క, గభస్తి = కాంతులయొక్క, చయమొ = సమూహమో, ద్రాక్...రాశియో - ద్రాక్ = త్వరగా, విదాహ = అతిదాహమును, ఛిదా = పోఁగొట్టుటయందు, వినిద్రాణ = మెలఁకువతో నున్న, మదవత్ = మదము గల, అంజన = అంజన మనెడు పడమటిదెసయేన్గుయొక్క, ఆలాన = కట్టుగొయ్యయొక్క, మూల = మొదట, శయ్యావిధాన = పడక నేర్పఱుచుకొఱకు, వారుణ = వరుణునిసంబంధి యగు, ఆధోరణ = మావటివానిచే, ఆకల్పిత = కల్పింపఁబడిన, ఉరు = పెద్ద, శోణమృత్తికా = ఎఱ్ఱమట్టియొక్క, రాళియో = ప్రోవో, అనన్ = అనునటుల, మెఱసెన్ = ప్రకాశించెను.

(మదమెక్కువయైన యేనుంగులకు దప్పిక యతిశయించును. ఆదప్పిక యెఱ్ఱమట్టిపైఁ బరున్నచో మానును గాన నట్టియేనుంగుల శయనస్థలమున నెఱ్ఱమన్ను వోయవలె నని గజశాస్త్రమునందుఁ గలదు.)

తా. సూర్యుఁడు పడునెడఁ బాయ విచ్చిన పడమటిసముద్రమునుండి మీఁదికి కానిపించిన శేషునిపడగలమీఁది రత్నముల కాంతియో? (శేషుఁడు వేయిపడగలు గలవాఁడు గావునను సూర్యుఁడు సహస్రకిరణుఁడు గావునను కిరణకాంతులు రత్నకాంతులో యన నుండె ననుట యత్యంతసముచితము.) అస్తాద్రిశిఖరములందు సూర్యుఁ డస్తమింపఁగానే ప్రజ్వలించు మెఱుఁగుడుఁదీగెలవెల్తురో? సూర్యునిరథపునొగ తాకి దిక్ప్రదేశము బ్రద్దలయి లోనికి ప్రసరించిన బ్రహ్మాండ మను బంగారుగంగాళముయొక్క కాంతియో? శివుఁడు తాండవమాడుతఱి రాత్రి యనుస్త్రీ తాల్చిన దివ్వటీవెలుఁగో? పశ్చిమదిగ్గజమునకు మద మెక్కి విదాహము కలుగఁగా దానిని దగ్గించుటకై వరుణునిసంబంధి యగుమావటివాఁ డాదిగ్గజపుఁగట్టుఁగంబముదగ్గఱఁ బఱచిన ఎఱ్ఱమట్టిప్రోవో యనునట్లు సాయంసంధ్యారాగము ప్రకాశించెను.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

క.

బహుళజలప్లవమాన
ద్రుహిణాండము చెమ్మ యుఱికి రూక్షార్కవిభా
రహితతఁ గాటుకపట్టెను
రహి చెడి యన నంధతమసరాసులు బెరసెన్.

18

టీ. బహుళ...డము - బహుళ = విస్తారమయిన, జల = నీటియందు, ప్లవమాన = తేలుచున్న, ద్రుహిణాండము = బ్రహ్మాండము, చెమ్మ యుఱికి = చెమ్మ దిగి, రూక్షా...రహతతన్ - రూక్ష = తీక్ష్ణమైన, అర్కవిభా = సూర్యకాంతియొక్క, రహితతన్ = లేకపోవుటచే, రహి చెడి = సొగసు దక్కి, కాటుక పట్టెన్ = బుగులుకొని నల్లనిబూజు పట్టెను. అనన్ = అనునటుల, అంధతమసరాసులు = కటికిచీకటిప్రోవులు, బెరసెన్ = వ్యాపించెను.

తా. అధికమైన యావరణజలమునఁ దేలియాడు బ్రహ్మాండము చెమ్మగిల్లి తీక్ష్ణమైనయెండ తాఁకమిచే బుగులుకొని నల్లనిబూజు పట్టెనో యనునట్లు కటికిచీకట్లు క్రమ్ముకొనెను.

అలం. ఉత్ప్రేక్ష.

సీ.

మృగనాభిపంకంబు మెయినిండ నలఁదిన
          మాయాకిరాతుమైచాయఁ దెగడి
నవపింఛమయభూష లవధరించి నటించు
          పంకజాక్షునిచెల్వు సుంక మడిగి
కాదంబనికురుంబకలిత యై ప్రవహించు
          కాళిందిగర్వంబుఁ గాకు సేసి
తాపింఛవిటపికాంతారసంవృత మైన
          యంజనాచలరేఖ నవఘళించి

తే.

కవిసె మఱియును గాకోలకాలకంఠ
కంఠకలకంఠకరిఘటాఖంజరీట
ఘనఘనాఘనసంకాశగాఢకాంతిఁ
గటికచీకటిరోదసీగహ్వరమున.

19
టీ. కటికచీకటి = గాఢాంధకారము, (ఇది కర్తృపదము) మృగనాభిపంకంబు = కస్తూరీరసమును, మెయినిండ = శరీరమంతటను, అలఁదిన...చాయన్ - అలఁదిన = పూసిన, మాయాకిరాతు = కపటపుబోయనియొక్క (శివునియొక్క), (పా. కిరాతి = బోయెత, కాళి) మైచాయన్ = శరీరకాంతిని, తెగడి = తిరస్కరించి, నవ...భూషలు - నవ = క్రొత్తవైన, పింఛమయ = నెమలిపురితోఁ జేయఁబడిన, భూషలు = అలంకారములు, అవధరించి = తాల్చి, నటించు...చెల్వు - నటించు = నాట్యము జేయు, పంకజాక్షుని = కృష్ణునియొక్క, చెల్వు = అందమును, సుంకము అడిగి = పన్ను అడిగి (తన్నుంబోలి యుండుటచేఁ దనకు పన్ను తెమ్మని), కాదంబ...కలిత - కాదంబనికురుంబ = నల్లనిహంసలసమూహముతో, నల్లనిముక్కు తెల్లనికాళ్లు గల హంసలను కాదంబము లందురు. కలిత ఐ = కూడినదై, ప్రవహించు, కాళింది = యమునయొక్క, గర్వంబున్, కాకుచేసి = వ్యర్థము చేసి, తాపింఛ...సంవృతము - తాపింఛవిటపి = చీకటిమ్రాఁకులయొక్క, కాంతార = అడవులచే, సంవృతము = ఆవరింపఁబడినది, ఐన, అంజనాచలరేఖన్ = కాటుకకొండయొక్క రీతిని, అవఘళించి = మించి, మఱియును, కాకోలు...కాంతిన్ - కాకోల = మాలకాకులతోను, కాలకంఠకంఠ = నెమిళ్లమెడలతోను, కలకంఠ = కోకిలలతోను, కరిఘటా = ఏనుఁగుమందతోను, ఖంజరీట = కాటుకపిట్టలతోను, ఘనఘనాఘన = వర్షించుకాఱుమబ్బులతోను, సంకాశ = పోలెడు, గాఢకాంతిన్ = దట్టమయిన ప్రకాశముతో, రోదనగహ్వరమునన్ = భూమ్యాకాశముల నడిమిప్రదేశమున, కవిసెన్ = క్రమ్ముకొనెను.

ఇందు నలుపున కతిశయత్వము గల్పించుటకై సహజముగా నల్లనివస్తువులకుఁగల యాయానీలవిశేషములను జెప్పెను. కిరాతుఁడు, కృష్ణుఁడు, కాళింది, అంజనాచలము ఇవి స్వయముగా నల్లనివి. వీనికిఁగల కస్తూరిపూఁత నెమిలియీఁకలు, నల్లనిహంసలు, చీకటిచెట్టులతోడి సంబంధము నలుపునకుఁ గల యతిశయత్వము దెలుపును. కారుచీకటులు గవిసె నని భావము.

తా. మాయాకిరాతుఁ డయి మేనెల్లఁ గస్తూరి యలఁదికొన్న శివుఁడు, నెమిలిపించెము నలంకరించుకొన్న కృష్ణుడు, నల్లహంసల గల్గిన యమున, చీకటిచెట్లతోఁపులు గలకాటుకకొండ, మాలకాకి, నెమిలిగొంతు, కోకిల, ఏన్గుమంద, కాటుకపిట్ట, కాఱుమబ్బు — వీనియొక్క కాఱునలుపును మించిన నలుపుతోఁ గటికిచీకటి జగ మెల్లఁ గ్రమ్ముకొనెను.

అలం. నిదర్శనాలంకారము.

క.

అంతటఁ బ్రాచి నిశాపతి
యంతికగతుఁ డౌట విని ముఖాలంబితమః
కుంతలములు దీర్పఁగఁ గొను
దంతపుదువ్వెన యనంగ ధవళిమ దోఁచెన్.

20

టీ. అంతన్ = ఈవిధముగాఁ జీఁకటి యావరింపఁగా, ప్రాచి = తూర్పుదెస యనుస్త్రీ, నిశాపతి = (రాతిరికిఁ బెన్మిటి యగు) చంద్రుఁడు, అంతికగతుఁడు = దగ్గఱకువచ్చినవాఁడు, ఔటన్ = అగుటను, విని = ఆలకించి, ముఖా...కుంతలములు - ముఖ = ముందఱిభాగమను ముఖమునందు, ఆలంబి = వ్రేలాడు, తమఃకుంతలములు = చీకటియను వెండ్రుకలు, తీర్పఁగన్ = చక్కదిద్దుటకు, కైకొను = తీసికొను, దంతపుదువ్వెన = ఏనుఁగుదంతముతోఁ జేసినదువ్వెనయేమో, అనంగ = అనునటుల, ధవళిమ = తెలుపు, తోఁచెన్ = కాననయ్యెను. చంద్రోదయమునకు ముందుఁ దెలుపురంగుతో మిన్ను గానవచ్చె నని భావము.

తా. ఆపైఁ దూర్పనెడుస్త్రీ చంద్రుఁడు చేరువకు వచ్చుచున్నాఁ డని విని మోమున వ్రాలియున్న చీకట్లను వెండ్రుకలను జక్కఁజేసికొనుట కెత్తికొన్న దంతపుదువ్వెనయో యనునట్లు తూర్పునఁ దెలుపు చూపట్టెను.

అలం. ఉత్ప్రేక్ష, రూపకము.

చ.

మరున కొసఁగఁ గాలము తమశ్ఛట గాటుక గా నవోదయ
స్ఫురదరుణప్రభాపథికశోణితసిక్తసితోడుభక్తమున్
హరిహయదిఙ్నభస్స్థలమునన్ బలిచల్లి వటాంకమున్ వసూ
త్కరభరితంబునై వెలుఁగఁ గాంచి సుధానిధి నెత్తె నత్తఱిన్.

21

టీ. అత్తఱిన్ = ఆసమయమున, కాలము = కాల మను పురుషుఁడు, మరునకన్ = మన్మథునకు, ఒసంగన్ = ఇచ్చుటకు, తమఃఛట = చీకటిరాశి, కాటుక = (నిధులను గుర్తించుట సాధన మగు) అంజనము, కాన్ = కాగా, నవో...భక్తమున్ - నవోదయ = క్రొత్తగా నుదయించుకాలమునందుఁ బొడమి, స్ఫురత్ = ప్రకాశించు, అరుణప్రభా = ఎఱ్ఱనికాంతియను, పథిక = వియోగులయొక్క, శోణిత = రక్తముచే, సిక్త = తడుపఁబడిన, సిత = తెల్లని, ఉడు = నక్షత్రము లనెడు, భక్తమున్ = అన్నమును. (నెత్తురుచేఁ దడుపఁబడిన యెఱ్ఱనియన్నమును) హరి...స్థలమునన్ - హరిహయదిక్ = తూరుపుదెసయందలి, నభస్స్థలమునన్ = ఆకాశమున, బలి = భూతబలిని, చల్లి, పటాంకమున్ = మఱ్ఱిచెట్టుగుర్తు గలదియఁ, వసూత్కరభరితంబును = కిరణసమూహ మను ధనసమూహముతో నిండినదియు, ఐ, వెలుఁగన్ = ప్రకాశింపఁగా, కాంచి, సుధానిధిన్ = అమృతమునకు నిధి యగు చంద్రుని — చంద్రుఁడనెడునిధిని, ఎత్తెన్ = పైకిఁ దీసెను. చంద్రునిలోని కళంకమును మఱ్ఱిగా వర్ణించుటయుఁ గలదు. సీ. "అమృతాంశుమండలం బాలవాలము గాఁగ మొలచె నొక్కటి జగన్మోహనముగ, మఱ్ఱిమాత్రంబ.” జైమినీభారతము. ఆశ్వా. 1.

తా. లోకమున నిధుల నెత్తువారు నిధిసాధకమగుకాటుకను కన్నులకుఁ బెట్టుకొని చూచి యానిధులఁ గాచియుండిన పిశాచాదులవలని బాధ తొలఁగు టకై నెత్తుటికూడును దూర్పుదిక్కున బలివైచి దానికిఁ జెట్టునో పుట్టనో గుఱుతుంచుకొని త్రవ్వి యెత్తుదురు. ఆవిధముననే ప్రకృతము కాలపురుషుఁడు చీకటి యనుకాటుకను బెట్టుకొని చూచి చంద్రునియుదయమునఁ దూర్పునఁ దోతెంచురక్తిమ యనురక్తము కలిపి నక్షత్రము లనునన్నమును దూర్పుదిక్కున భూతబలిగాఁ జల్లి మఱ్ఱిగుఱుతుగల (చంద్రునిలోనికళంకమును మఱ్ఱినిగా వర్ణించుట కలదు.) చంద్రుఁ డనునిధిని మన్మథున కిచ్చుటకై త్రవ్వి యెత్తెను.

అలం. రూపకాలంకారము.

మ.

జలజాగారపరంపరల్ మఘరదాశాభిత్తిఁ దీండ్రించుచున్
దళమై వెన్నెలచిచ్చు లంటిన మిళద్బాహ్యచ్ఛదశ్యామికా
చ్ఛలసంగంది ముడుంగుచో సిమసిమచ్చబ్దంబుతోఁ బుట్టున
గ్గలపుంగ్రొంబొగలో యనంగ వెడలె న్గర్భస్వవద్భృంగముల్.

22

టీ. జలజాగారపరంపరల్ - జలజ = పద్మములను, అగార = ఇండ్లయొక్క, పరంపరల్ = వరుసలు, మఘవత్ ఆశాభిత్తిన్ = తూర్పుది క్కనెడుగోడనుండి, తీండ్రించుచున్ = ప్రజ్వలించుచు, వెన్నలచిచ్చులు = వెన్నెల యనునిప్పులు, దళమై = మెండై, అంటినన్ = తాఁకఁగా, మిళ...చ్ఛలనన్ - మిళత్ = కలసికొను, బాహ్యచ్ఛద = పైఱేకులయొక్క, శ్యామికా = నలుపను, ఛలనన్ = మిషచే, కంది = కమలి, ముడుంగుచోన్ = ముడుఁగుకొనునప్పుడు, సిమసిమచ్ఛబ్దంబుతోన్ = సిమసిమ యనుధ్వనితో, పుట్టు...బొగలో - పుట్టు, అగ్గలపు = అధికమగు, క్రొంబొగలో = క్రొత్తపొగలో, అనంగన్ = అనఁగా, గర్భస్వనద్భృంగముల్ = లోపలిభాగమునుండి ధ్వనిచేయుతుమ్మెదలు, వెడలెన్ = బయలుదేఱెను.

రాత్రులందుఁ దమ్ములు ముకుళించును. అందుచే ముకుళములందు నిర్బంధము గలుగునేమో యని తుమ్మెదలు ముందుగనె వెడలుట సహజము. తుమ్మెదలు నల్లగా నుండును గాన పొగ వెడలినటుల బయట వచ్చుచున్న వని చెప్పఁబడెను. పొగ కృష్ణగణములోనిది. తమ్ములనుండివచ్చు తుమ్మెదలరాకడ పొగవలె నున్న దనుటకు —

ఉ. “అంబుజినీపురంధ్రీ హృదయాధిపుఁ గానక స్రుక్కి యబ్జవ
   క్త్రంబునఁ దేటియూరుపుపొగల్ వెడలంగను నిద్రవోవఁ గో
   కంబది హేళికిం దెలుపఁగాదె ప్రియప్రమదానియోగశో
   కంబు గరుణింపకేఁగె నిజకార్యము లెంతురె మిత్రతత్పరుల్.”

(వసు.ఆ.4)

తా. చంద్రోదయము కాఁగానే తూర్పుది క్కనెడు గోడనుండి వెన్నెల యనునగ్నిజ్వాలలు పడి పద్మము లనునిండ్లవరుస ముడుఁగుచున్న పైకప్పుఱేకుల నలుపనునెపమునఁ గమిరి క్రుంగుచో సిమసిమ యనుధ్వనితోఁ బైకి రేఁగు తొలిపొగలో యనునట్లు ఝంకారము చేయఁతుమ్మెద లాపద్మము లనుపుట్టలలోనుండి పైకి వెడలెను. చంద్రుఁ డుదయించెను. వెన్నెల నిండారెను. పద్మములు ముడుచుకొనిపోవుచుండ వానిలోనితుమ్మెదలు రొద సేయుచుఁ బైకి వెడలెను.

అలం. రూపకము, అపహ్నుతి, ఉత్ప్రేక్ష.

సీ.

ప్రిదిలి కైరవదళశ్రేణి నొక్కులు దీరె
          శశికాంతపంక్తుల జలము లూరెఁ
గోరి కాంతులతోఁ జకోరికల్ రతిఁ గేరె
          వారాశిగర్వంబు మేర మీఱెఁ
ద్రోపడి యిరులు పటాపంచలై పాఱె
          దిఙ్ముఖంబుల వింత తెలివి సేరెఁ
జక్రవాకంబు లబ్జకుడుంగములు దూఱెఁ
          గామినీకాంతులకలఁక దేఱె


తే.

మదనుఁ డమ్ముల నూఱె హిమంబు పేరె
జడిసి విరహిణి వగఁ గూరె జారచోర
దర్పములు జాఱె రవికరతాప మాఱెఁ
జూడఁ జూడంగఁ దారకస్ఫురణ దాఱె.

23
టీ. కైరవదళశ్రేణి = కలువఱేకులవరుస, ప్రితిలి = విరఁబాఱి, (పా. శిథిలకైరవదళశ్రేణి, శిథిల = చందము దక్కిన), నొక్కులు దీరెన్ = గొగ్గులు మాసెను. శశికాంతపంక్తులన్ = చంద్రకాంతపురాళ్లవరుసల, జలములు = నీరు, ఊరెన్ = స్రవించెను, కోరి = అభిలషించి, కాంతులతోన్ = ప్రియులతో, చకోరికల్ = వెన్నెలపులుఁగులు, రతిన్ = సురతమున, కేరెన్ = చెలరేఁగెను, వారాశిగర్వంబు = సముద్రపుఁబొగరు, మేరమీఱె = హద్దు దాఁటెను. (పోటుపొడిచె ననుట.) త్రోపడి = తొలఁగఁద్రోయఁబడి (వెన్నెలచే), ఇరులు = చీకటి, పటాపంచలై = ఎక్కడి దక్కడనే రూపు చెడి, పాఱెన్ = పర్వెత్తెను, దిఙ్ముఖంబులన్ = దిక్కులమొదళ్లందు, వింతతెలివి = క్రొత్తతేట, చేరెన్ = ప్రవేశించెను. చక్రవాకంబులు = జక్కవలు, అబ్జకుడుంగములు = తామరపొదలు, తూఱె = చొచ్చెను, కామినీకాంతులకలఁక = దంపతుల ప్రణయకలహము, తేఱిన్ = తేటదనము చెందెను. మదనుఁడు = మన్మథుఁడు, అమ్ములన్ = బాణములను, నూఱెన్ = పదను బెట్టెను, హిమంబు = మంచు, పేరెన్ = పేరుకొనెను, విరహిణి = విరహమునొందిన యంగనాజనము, వగన్ = విచారమును, కూరెన్ = పొందెను, జారచోరదర్పములు = జారులయొక్కయుఁ జోరులయొక్కయుఁ బొగరులు, జాఱెన్ = తొలంగెను, రవికరతాపము = సూర్యకిరణముల వేడిమి, ఆఱెన్ = చల్లాఱెను, చూడన్ చూడన్ కన్ = అంతటంతట, తారకస్ఫురణ = నక్షత్రములవెలుఁగు, తాఱెన్ = మాసెను, (కోరి కాంతలతోఁ జకోరముల్ అని పా.) అన్నియు బహువచనాంతములుగాఁ జెప్పి విరహిణి యను నేకవచనాంతపదముఁ జెప్పుటచే వరూథిని వెన్నెలకు వెఱచి శ్రమల నొందె ననునర్థ మూహింప నగును. కామినీకాంతులు. చెలువలు కామించినవారు. పురుషులు వారికి మనోహరముగా నుండువారు. వెన్నెల గాయుటచే వలపు చెలరేఁగఁ బ్రణయకోపము తగ్గె నని భావము.

తా. చంద్రోదయము కాఁగానే కలువలు వికసించెను, చంద్రకాంతశిలలు కరఁగెను. చకోరపక్షులు సంభోగసుఖము ననుభవించెను. సముద్ర ముప్పొంగెను. చీకట్లు తొలఁగెను. దిక్కులన్నియుఁ దెల్లఁగాఁ గనఁబడెను. చక్రవాకపక్షులు తామరతీఁగజొంపములలో ముడుఁగుకొనెను. పురుషులు ప్రణయకలహములు మాని క్రీడించిరి. మన్మథుఁడు విరహులను వేధింపసాగెను. మంచు హెచ్చెను. విరహిణీస్త్రీలు చంద్రునిచే విరహవేదన పెరుఁగఁగా విచారపడసాగిరి. జారచోరులసంచారము నిలిచిపోయెను. పగటివేళఁ గాసిన యెండవలనివేండ్ర మంతయు వెన్నెలచే నుపశమిల్లెను. నక్షత్రములు క్రమక్రమముగా మఱిఁగిపోయెను. (ఇందు విరహిణి యనుపదము ఏకవచనాంతముగాఁ బ్రయోగింపఁబడుటచే వరూథిని చంద్రప్రకాశమునకు వెఱచి దుఃఖము నొందె ననునర్థ మూహింపఁదగియున్నది.)

అలం. స్వభావోక్తి.

మ.

స్ఫుటసౌగంధికరాగరక్తరుచి మైఁ బూనెన్ జపాసన్నిధి
స్ఫటికంబ ట్లుదయాద్రిగైరికశిరస్స్థానస్థితిన్ జంద్రుఁ డ
చ్చోటు వాయన్ శుచి యయ్యెనౌఁ బ్రకృతినచ్చుండైనసన్మార్గి యె
న్నఁటికిం గూటమివంకవచ్చు వికృతిన్ మగ్నుండు గా నేర్చునే.

24

టీ. చంద్రుఁడు, ఉదయా...స్థితిన్ - ఉదయాద్రి = ఉదయపర్వతముయొక్క, గైరిక = మనశ్శిలాదిగైరికధాతువులతోఁ గూడిన, శిరస్స్థానస్థితిన్ = శిఖరప్రదేశమం దుండుటచేత, జపాసన్నిధిస్ఫటికంబట్లు - జపా = దాసానిపువ్వుయొక్క, సన్నిధి = సమీపమునం దున్న, స్ఫటికంబట్లు = పటికపుఱాతివలె, స్ఫుట...రుచిన్ - స్ఫుట = విచ్చిన, సౌగంధిక = ఎఱ్ఱగల్వయొక్క, రాగ = ఎఱుపువంటి, రక్త = ఎఱ్ఱని, రుచిన్ = కాంతిని, మైన్ = శరీరమున, పూనెన్ =ధరించెను. అచ్చొటు = ఆప్రదేశము, పాయన్ = విడువఁగా, శుచి = పరిశుద్ధుఁడు, (తెల్లనివాఁడు), అయ్యెన్, ఔన్ = అగును. ఇది యుక్తమే ప్రకృతిన్ = స్వభావముచే, అచ్చుండు = నిర్మలుఁడు (తెల్లనివాఁడు), ఐన సన్మార్గి = అగునట్టి మంచినడవడి కలవాఁడు (నక్షత్రమార్గము కలవాఁడు), ఎన్నఁటికిన్ = ఎప్పటికైనను, కూటమివంకన్ = సహవాసమువలన, నచ్చువికృతిన్ = వచ్చెడువికారమున, మగ్నుండు = మున్గిననాఁడు, కానేర్చునే! కాజాలఁ డనుట.

ఉదయించుతఱిఁ జంద్రుఁడు ఎఱ్ఱగా నుండి యావల ధవళకాంతితో నలరు ననుట యిందుఁ జెప్పఁబడెను. చంద్రుఁడు సహజస్వచ్చుఁడు. స్వచ్ఛమగు స్ఫటికముదగ్గఱ దాసానిపువ్వు నుంచిన స్పటిక మెఱ్ఱగా నుండును. ఉదయాచలము గైకాదిధాతువులచే నెఱ్ఱగ నుండునది. దానిచెంత నుంటచేతనే చంద్రుఁ డెఱ్ఱగా నుండెను. ఉదయచంద్రుఁ డెఱ్ఱగా నుండు ననుటకు —

తే. "లలితకాశ్మీరభవసమాలంభకర్మ
    పాటలంబైన నీముఖాబ్దంబుతోడ
    నొరయుఁ గాన భవిత్కేళియోగ్యమైన
    పొడుపుగుబ్బలిఁ బొడతెంచు పూర్ణవిధుఁడు."

(శృంగారనైషధము ఆ. 5)

తే. "ప్రాచి తెలిచాయ యనుమంచు ప్రబలభాస్వ
    దంశుకవిహీన గానఁ దా నందుకోర్వఁ
    బాల కూన్చిన నవకీలిచక్ర మనఁగ
    నపుడు తొలికెంపుతో సారసారి పోల్చె.”

(చంద్రికావరిణయము. 4.)

తా. చంద్రుఁ డుదయించుచోఁ దూర్చుఁగొండశిఖరమునందలి ధాతురాగము సోఁకుటచే జపాకుసుమముదగ్గఱ నున్న స్ఫటికమువోలె నెఱ్ఱగాఁ బొడకట్టెను అవ్వల నటనుండి తొలఁగి పైకి రాఁగా స్వచ్ఛరూపుఁ డయ్యెను. స్వభావముచే నిర్మలుఁ డైనవాఁడు సహవాసదోషముచే నొకవికారము తనకు వాటిల్లినను వెంటనే తప్పించుకొనును గాని యందే మునిగియుండఁడు గదా!

అలం. అర్థాంతరన్యాసోచనలు.

శా.

ఆరూఢస్థితిఁ జంద్రికాధవళితాజాండంబులోఁ జంద్రుఁ డొ
ప్పారెన్ గాలభిషగ్వరుం డవిరతం బై కాముకశ్రేణికిన్
మారోత్సాహము నిల్వఁ బాదరసమున్ బంధించి గ్రాసార్థమై
క్షీరస్థాలికఁ బెట్టినట్టి గుటికాసిద్ధౌషధంబో యనన్.

25

టీ. చంద్రుఁడు, ఆరూఢస్థితిన్ = ఆకసమున కెక్కియున్న యునికియందు, చంద్రి...డంబులోన్ - చంద్రికా = వెన్నెలచే, ధవళిత = తెల్లఁగాఁ జేయఁబడిన, అజాండంబులోన్ = బ్రహ్మాండమున, కాలభిషశ్వరుండు = కాలమను వైద్యవర్యుఁడు, కాముకశ్రేణికిన్ = కాముకుల సమూహమునకు, మారోత్సాహము = మన్మథోత్సాహము, అవిరతంబై = ఎడతెగనిదై, నిల్వన్ = నిల్చుటకు, పాదరసము = పాదరస మను రసద్రవ్యమును, బంధించి = వస్త్వంతరప్రయోగమున గడ్డకట్టునట్టు చేసి, (పా. మర్దించి = మూలికలతోఁ జేర్చి గడ్డకట్టునటుల నూరి) గ్రాసార్థమై = మ్రింగుటకై, క్షీరస్థాలికన్ = పాలకుండలో, పెట్టినట్టి, గుటికాసిద్ధౌషధంబో - గుటికా = గుళిక యగునట్లు, సిద్ధ = సిద్ధులచేత సాధింపఁబడిన, ఔషధంబో = మందేమో, అనన్ = అనునట్లు, ఒప్పారెన్ = ఒప్పెను.

చంద్రికాధవళితాజాండము క్షీరస్థాలికగను, జంద్రుఁడు పాదరసగుళికగను, రూపింపఁబడెను. రసగుళికవలనఁ బుంస్త్వ మతిశయించును గానఁ జంద్రికాప్రసాదముచేఁ బ్రపంచము ధవళముగా నుండఁ గాముకులు యథేచ్ఛముగాఁ గ్రీడించి రని భావము.

గుండ్రముగా నుండువాని గుటికగా వర్ణించుట గలదు.

సీ. “హరిహరబ్రహ్మ మహానుభావంబు లొక్కటిగాఁ గరంగిన గుటిక యనఁగ
    భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగెన్"

(భారతము విరాట.)

    "...చిగురువిందుల నీలిగయాళికిన్ హలా,
    హలగుళికాభదుర్మదఘనా
    ళికి నాళికి లోఁగి యాత్మలోన్"

(వసు. ఆ. 3.)

తుమ్మెదలు గుండ్రముగ నుండుఁ గాన వినపుగుండ్లుగాఁ జెప్పఁబడెనని తెలియునది.

తా. కాల మను వైద్యుఁడు కాముకుల కెడతెగక కామోద్రేకము నిల్చియుండుటకై పాదరసమును మూలికలతోఁ గలిపి గడ్డకట్టునట్లు చేసి మ్రింగుటకై క్షీరపాత్రమున నుంపఁబడిన ఘుటికాసిద్దులు సాధించిన యౌషధమో యనునట్లు వెన్నెల నిండారి యున్న బ్రహ్మాండమునఁ జంద్రుఁడు చెలఁగుచుండెను.

అలం. ఉత్ప్రేక్షా రూపకములు.

తే.

రాజు తేజస్వియై గ్రహరాజుమీఁద
నలిగి దాడిగ వెంటాడ నిలువ కతఁడు
బెగడువడి పాఱుచోఁ జెఱఁ దగిలినట్టి
ఛాయ యిది యన నీలలాంఛనము మెఱసె.

26

టీ. రాజు = చంద్రుఁ డనురాజు, తేజస్వియై = ప్రభగలవాఁడై, గ్రహరాజుమీఁదన్ = సూర్యుఁ డనువేఱొకరాజుపై, అలిగి = కోపించి, దాడిగన్ = దండయాత్రగా, వెంటాడన్ = వెంబడింపఁగా, అతడు = ఆసూర్యుఁ డనురాజు, బెగడుపడి = భయపడి, పాఱుచోన్ = పర్వెత్తునపుడు, చెఱన్ = చెఱసాలకు, తగిలినట్టి = చిక్కినట్టి, ఛాయ = (అతనిభార్యయగు) ఛాయాదేవి, ఇది = ఈకానఁబడునది, అనన్ = అనునట్లు, నీలలాంఛనము = చంద్రునిలోని (నల్లనిగుర్తు) కళంకము, మెఱసెన్ = ప్రకాశించెను.

కళంకము లాంఛనము సమార్థకము లనుటకు శ్లో. "కళంకాంకౌ లాంఛనం చ” అమరము. విరోధి బలవంతుఁడై వెనుదగిలినపుడు ప్రాణభయముచేఁ బిఱికిరాజులు సర్వస్వము వదలి పాఱిపోవుదురు. అపుడు రాజపత్నుల బంధించుటగాఁ గళంక ముత్ప్రేక్షింపబఁడెను.

తా. చంద్రుఁ డనురాజు ప్రతాపశాలియైఁ సూర్యుఁ డనుపగరాజుపై దాడి వెడలి వెంబడింపగా నాతఁడు భయపడి పాఱిపోవుచోఁ జెఱకుఁ జిక్కిన యాతనిభార్య ఛాయాదేవి యనునట్లు చంద్రునిలోని కళంక మొప్పారెను.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

తే.

కలయ జగమునఁ గలయట్టినలుపు లెల్లఁ
దెలుపులుగఁ జేరి నీడలు దెలుపు సేయఁ
గా వశము గామిఁ బొడముదుఃఖమునఁ బోలె
సాంద్రచంద్రిక తుహినబాష్పములు గురిసె.

27

టీ. సాంద్రచంద్రిక = దట్టమైన వెన్నెల, జగమున = లోకమున, కలయన్ = అంతటను, కలయట్టినలుపులెల్లన్ = ఉన్న నల్లనివస్తువుల నన్నింటిని, తెలుపులుగన్ = తెల్లనివస్తువులుగా, చేసి = చేసియు, నీడలు = చెట్టులు మొదలగువాని నీడలు, తెలుపు = తెల్లనివిగా, చేయఁగాన్ = చేయుటకు, వశము గామిన్ = శక్యము కాకపోవుటచే, పొడము దుఃఖమునన్ పోలెన్ = పుట్టుదుఃఖముచేతనువలె, తుహినబాష్పములు = మంచుచినుకులను, కురిసెన్ = కురియించెను. వెన్నెలనుండి మంచుగురియు ననుట ప్రసిద్ధము.

సీ. “చంద్రాతపమున నేచందాన గురిసెనో ధారాళ మగుచు నీహారవృష్టి”

(శృంగారనైషధము. అ-9)

తుహినమన మంచు అనుటకు —

    “అవశ్యాయస్తు నీహారస్తుషారస్తుహినం హిమం"

(అమరము.)

తా. వెన్నెల తాను జగమునందలి నల్లనిపదార్థములఁ దెల్లఁగాఁ జేసియు నీడలను దెలుపు చేయుటకు శక్యము కాకపోవుటచే జనించినదుఃఖముచేతనో యన మంచుచినుకులను గురిసెను.

అలం. ఉత్ప్రేక్ష.

వ.

మఱియు వికసితకైరవంబు లగుసరోవరంబుల నిజధవళధాళ
ధళ్యంబున నాక్రమించి యందు నానందించునరవిందమం
దిరకుం బుట్టినింటిసొబగు చూపి, చూపఱకు నిందుబింబం
బిది గ్రహంబు లివి యనునంతరంబు లేకుండ నేకవర్ణంబు
గావించి, సేవించుచకోరకదంబములపుక్కిళ్లకు వెక్కసంబై
ముక్కులకు నెక్కి చిక్కంబడి, యొండొండ బొండు

మల్లియలదందడిం దొరఁగుపుప్పొళ్ల నుప్పతిల్లునెత్తావులకు
వెకలు లై యాడు మొకరితుమ్మెదలు రొదలు గలమెఱుఁగు
డుంబురువులట్లు మిసమిసని మెఱవ ససిమెఱుంగుమొత్తం
బుల నుమిసి యుమిసి, యందంద ప్రవహించునిందూపల
స్యందంబులకు విందు లగునిందీవరమరందంబుల బెందడింబడి
బందన గొనువలిమించు క్రొమ్మంచుటౌదు లీఁదియీఁది వడి
సడలి సుడివడుచు నొడ లోముసోమరిగాలి యలవోకసోఁ
కులం గదలీకదల వనం గదలునుపవనకదళీకేతకీతాల
హింతాలనారికేళపూగావళికోమలపలాశద్రోణికల నునుపు
గలపొరలయోరల శరధితరఁగలమీఁదనుఁబోలె గిఱికొని,
యెల్లవల్లికలుం బూవక పూచిన ట్లుల్లసిల్ల ఱె ల్లుల్లసిల్లిన
చందంబునం దెల్లతెల్లనై, మొల్లమిగ నంతకంతకు దిగం
తంబులు దంతంబులు దీరిచిన యిడుపులుంబోలెఁ దీండ్రింప
రేయెండ దానగుటం జేసి యెండమావులం బుట్టించె ననం
బట్టు గలపటికంపురాచట్టునేలలు నెట్టుకొని, వెండియుం జిట్ట
కంబులకుం బెడమొగంబు పెట్టుకొని, పట్టఁబట్టం బోవుప్రాణ
భర్తలవెంటం బడి నూపురంబులు మొరయ వేనలులు
విరియఁ గ్రమంబున బుట్టునిట్టూర్పుపవనంబు జవంబునం
బైఁటకొం గెడలింప నందనికౌఁగిటం బొదివి ప్రియంబు చిలుకం
బలికి ముద్దాడుజవరాండ్ర దంతచంద్రికలసాంద్రతం బంతంబు
మెఱసి, మంతనంపువేళల మాటతబ్బిబ్బునం బుట్టుపొలయలు
కలం దలలు వంచి రొద లేని నాలియేడ్పు లేడ్చుప్రియల
ననునయింప నింపునం జనవు మెఱసి చెక్కుటద్దంబులు
నొక్కి మొగం బెగయనెత్తి ముత్తియంపుముంగఱరంగునఁ

గడలుకొనుబుడిబుడికన్నీటం బ్రతిఫలించి తుఱంగలించు తనదు
నిగనిగలు గనుంగొని నగెనగె ననుచుం జుంబనం బిడం
బోయిం కెంగేల సదరంట వాటువడుకాముకుల వెలవెల
పాటుకూటువం గోటికిం బడగలెత్తి, పిండిచల్లినగతిం గాయ
డాయ లజ్జించి బుజ్జవంబునం బొదరిండ్లకుం దార్చి కాంతులం
గవయునంగనాచులగు నంగనలయంగంబులపస ముంగిటం
బండ జలితకిసలయాంతరాళంబులం దూఱితూఱి యిరులు
విరియించి పతులప్రార్థనంబులం బుంభావసుకతాడంబరంబు
నకుఁ దోడుసూపి దూపటిలి యంగరాగంబులు గరంగం
జెమర్చినచంచలాక్షులనిద్దంపుఁదనూలతలం బుట్టి దట్టంబు
లగు చిఱుచెమటబొట్టులం బొడకట్టి తెలుపారు మలయ
జంపు జిటులుగందంబులయందంబు లొసంగి, సంజకడం
దారు నొడివినసంకేతంబుల నుండక తెరువు గట్టి పొరువుఁ
దరువుల నీడల నడంగి నవ్వుటాలకు వెనుకపాటునం గదిసి
ముసుంగు లెడలింప బెగడి కళవళంపుఁజూపుల వల్లభులం
జూచి యల్లన నగునభిసారికలవెడందకన్నులచెన్ను నన్ను
కొని, పొదలు మదనోన్మాదంబునకుం బ్రోదిగా మోదంబునం
గాదంబరి గండూషించి విటకదంబంబునకు నొసంగునంబు
రుహముఖుల యెప్పులకుప్ప లను నిప్పపూమొగ్గలం బోని
బుగ్గలం దగ్గలిక సూపుకమ్మపంజులవజ్రపుంజకచకల నకనకలు
వీడుకొని, కలికితనంబులం గలసి మెలసి రతాంతంబునం
బరిశ్రాంతి యడంగ నంగణంబుల నిలిచి యొండొరులకురులు
దువ్వుచు విహరించుసమయంబునం బల్లవులు కేళి కల్లప్పు
డన్న తమమాటలు దలఁపించిన నుదరిపడి మందస్మితంబు లంకు

రించుహుంకృతుల జంకించి కంకణంబులరత్నంపుఁదళుకులు
సెదర నుంకించి వైచుచేమంతిపూబంతులం బుటపుటనై,
మిటమిటం గాయుదట్టంపుఁబండువెన్నెలమెండున బెండువడి
డెందంబు గంది తాలిమి చిందువందై కెందలిరుపాన్పునం
దనువొందక లేచి కూర్చుండి కన్నీరు గోట మీటుచు
బోఃటితో వరూథిని యిట్లనియె.

28

టీ. మఱియున్, వికసితకైరవంబులు = విచ్చినకలువలు గలవి, అగు సరోవరంబులన్ = అయినట్టి మేఁటికొలఁకులందు, నిజధవళధాళధళ్యంబునన్ = తన తెలుపుయొక్క ధళధళయనుకాంతిచే, ఆక్రమించి = ఆవరించి, అందున్ = ఆకొలనియందు, ఆనందించు నరవిందమందిరకున్ = సంతోషించులక్ష్మికి, పుట్టినింటిసొబగు = పాలసముద్రముయొక్క సొగసును, చూపి = చూపించి (సరోవరములు వెన్నెలచేఁ దెల్లనై పాలసముద్రమువలె లక్ష్మీఁకి దోఁచునటులఁజేసి యనుట) పా. పోలిక చూపి, అలం. ఉపమ. చూపఱకున్ = చూచువారికి, ఇది, ఇందుబింబంబు = చంద్రబింబము, ఇవి, గ్రహంబులు = అంగారకాది గ్రహములు, ఇట నక్షత్రములుకూడ గ్రాహ్యములు. అనునంతరంబు = అనుభేదము, లేకుండన్ = లేకుండ నుండునటుల, ఏకవర్ణంబు = ఒకటే (తెలుపు)రంగు, కావించి, అలం. మీలనము. సేవించు...పుక్కిళ్లకున్ - సేవించు = (వెన్నెలను) అనుభవించు, చకోరకదంబంబుల = వెన్నెలపులుఁగుల మొత్తములయొక్క, పుక్కిళ్లకున్ = బుగ్గలలోపలిభాగములకు - నోళ్లకు, వెక్కసంబై = ఎక్కువై, ముక్కులకున్ = ముక్కులలోనికి, ఎక్కి = ఎగదట్టి, అలం. అతిశయోక్తి. వెన్నెలలను జకోరములు తృప్తి దీర నారగించు ననుటకు —

సీ. “విరహులమై సోఁకి వేఁడియౌ వెన్నెల వచ్చి వెన్నెల నులివెచ్చఁ జేసి
    కలువపుప్పొళ్లచేఁ గనటైన వెన్నెల వలిపెవెన్నెలలోన వడియఁదేర్చి

    చంద్రకాంతపునీటఁ జా లైనవెన్నెల ముదురువెన్నెల జుట్టుబదను జేసి
    సతులమైపూఁత పిసాళించువెన్నెలఁ దనుపువెన్నెల రసాయనము గూర్చి
తే. చిగురువిలుకానిజాతరఁ జేయఁబూని, కొలముసాములనందఱఁ గూడబెట్టి
    వంతుగలయంగ బువ్వంపుబంతివిందు, పెట్టి రెలమి చకోరంపుఁబేరటాండ్రు.”

(పారిజాతాపహరణము)

చిక్కంబడి = చిక్కనై, అలం. ఉత్ప్రేక్ష. (వెన్నెలపులుఁగులపుక్కిళ్లు నిండి యెక్కువై ముక్కున వచ్చె ననుట.) ఒండొండ = ఒక్కొటొక్కటిగా, బొండుమల్లియల = బొండుమల్లెలనుండి, దందడిన్ = తఱంచుగా, తొరఁగుపుప్పొళ్ల = రాలు పుష్పపరాగముచే, ఉప్పతిల్లునెత్తావులకున్ = పుట్టునిండుసువాసనలకు, వెకలులై = ఆశపడునవై, ఆడు మొకరితుమ్మెదలు = (మీఁద) తిరుగునట్టి ఝంకరించు తుమ్మెదలు, రొదలుగల మెఱుఁగుడుంబురువులట్లు = ధ్వనులుగల మిడుఁగుఱుఁబుర్వులవలె, మిసమిసని మెఱవన్ = మిసమిసలాడుచుఁ బ్రకాశింపఁగా, ససిమెఱుంగు. మొత్తంబులన్ = నిగ్గయిన వెలుఁగుప్రోవులను, ఉమిసి యుమిసి = వెళ్ల గ్రక్కి క్రక్కి, (బొండుమల్లెపూలపరిమళమునకై ఝంకరించుచుఁ దిరుగాడు తుమ్మెదలు వెన్నెల పైఁబడఁగా మిసమిసలాడుచు మిడుఁగుఱుఁబుర్వులవలెఁ బ్రకాశించె ననుట) అలం. ఉత్ప్రేక్ష. అందంద = అటనట, ప్రవహించు...స్యందంబులన్ - ప్రవహించు = పాఱుచున్న, ఇందూపల = చంద్రకాంతపుఱాళ్లయొక్క, స్యందంబులకున్ =నీటిఊటలకు, విందులు = చుట్టాలు, అగు...బెందడిన్ - అగు, ఇందీవర = నల్లగల్వల, మరందంబుల = తేనెలయొక్క, బెందడిన్ = ఱొచ్చునందు, పడి, బందనగొను...టౌదులు - బందనగొను = జిగటగొను, వలిమించు = చలిమీఱిన, క్రొమ్మంచుటౌదులు = క్రొత్తమంచునీటికాల్వలు, ఈదియీఁది, వడి, సడలి = తగ్గి, సుడిపడుచున్ = సుడిపడుచు, ఒడలు = దేహమును, ఓము...సోఁకులన్ - ఓము = కాపాడు, సోమరిగాలి = మందానిలముయొక్క, అలవోకసోకులన్ = విలాసపుఁదాఁకులచే, కదలీకదలవు = కదలియును గదలలేదు, అనన్ = అనునట్లు, కదలీకదలక వ్యాకరణదుష్టమని యిటీవల ముద్రణములలోఁ గదలెంగదలవు అని మార్పఁబడెను. కదలీకదలక లోనగుచోటులఁ గ్త్వార్థకయిత్తులకు దీర్ఘముగూడఁ బ్రాచీనప్రయోగములందుఁ గలదు. కాన నిది గ్రాహ్య మని మాతలంపు. ప్రాచీనగ్రంథములం దిట్టిప్రయోగములు గలవు.

క. “నమ్మమి మృత్యువు పెద్దయు, నమ్ముట యపమృత్యు వగుట నరపతి నమ్మీ
నమ్మక పనులను గొని ని, త్యమ్మును సూక్ష్మమతి దాని నరయఁగ వలయున్.”

(భారతము, శాంతి. ద్వి. ఆ. 351 ప.)

నూతనముద్రణమునందు "నరపతిమిత్రున్, నమ్మి పనులు గొనునది” అని మార్పఁబడింది. ఇది సాహసము. “కూడీకూడని చిన్నకూకటులతో గోపార్భకశ్రేణితో" దేవకీనందనశతకము. కదలు..ద్రోణికలన్ - కదలు, ఉపవన = ఉద్యానములందలి, కదళీ = అరఁటిచెట్లయొక్కయు, కేతకీ = మొగిలిచెట్లయొక్కయు, హింతాళ = హింతాళవృక్షములయొక్కయు, నారికేళ = కొబ్బరిచెట్లయొక్కయు, పూగ = పోఁకచెట్లయొక్కయు, ఆవళి = వరుసలయొక్క, కోమల = మృదువులైన, పలాశద్రోణికలన్ = ఆకుదొన్నెలయందు, నునుపు = నున్నన, కలపొరలయోరలన్ = కలిగినయావరణలప్రక్కలందు, శరధితరఁగలమీఁదనుంబోలె = సముద్రపుతరంగములమీఁదనువలె, గిఱికొని = వ్యాపించి (మందమారుతము సోఁక కదలీకదలనట్లున్న యయ్యైవృక్షములకొన యాకులపైఁ బడుచో సముద్రతరంగములపైఁ బడిన ట్లుండె ననుట.) అలం. ఉపమ. ఎల్లవల్లికలు = అన్నితీవలును, పూవక = పుష్పింపకయే, పూచినట్లు, ఉల్లసిల్లన్ = రంజిల్లఁగా, ఱెల్లు = ఱెల్లుగడ్డి, ఉల్లసిల్లినచందంబునన్ = విరియఁబూచినవిధమున, తెల్లతెల్లనై, మొల్లమిగన్ = దట్టముగా, అంతకంతకున్, దిగంతంబులు = దిక్కులకొనలు, దంతంబులు = ఏన్గుదంతములును, తీరిచినయిడుపులుబోలెన్ = తీర్చిన పార్శ్వభాగములవలె, తీండ్రింపన్ = ప్రకాశింపఁగా, రేయెడ = రాత్రివేళయెండ (రేయెండపదమునకు వెన్నెల యనునర్థము నింతకుఁ బ్రాచీనకావ్యములందు మృగ్యము. రేయెండ ఈరెండ, సమానార్థకముగాఁ జూపట్టెడు) రాత్రివేళ కాయునట్టి యెండ యని యొకరు చెప్పిరి కాని యంతసరసముగా లేదు. పూవులు శ్వేతగణములోనివిగాన నన్నితెగలపూవులను జెప్పునపుడు తెల్లవిగానె చెప్పుదురు. ఇట్లనుటకు

శ్లో. "శుభ్రాణిభారతీధర్మశేషేశవరుణేందవః,
    ముక్తాకుసుమనక్షత్రదన్తస్వేదాంబుబిందవః”

కావ్యకల్పలత

తాన్ = తాను, అగుటం జేసి, ఎండమావులన్ = ఎండవేళ బయళ్లలో నీటిప్రవాహమువలెఁ బొడకట్టువానిని, పుట్టించెను. అనన్, పట్టుగల = అవకాశమున్న, పటికంపురాచట్టునేలలన్ = స్ఫటికపురాతిచట్టుగలనేలలందు, నెట్టుకొని = ఒత్తుకొని, (తాను రాత్రియెండవేళనుండు నెండమావులఁ బుట్టించెనో యనునట్లు స్ఫటికపుచట్టునేలలపై దట్టముగాఁ బ్రసరించె ననుట.) అలం. ఉత్ప్రేక్ష. వెండియున్ = మఱియు, చిట్టకంబులకున్ = ఎకసక్కెములకు, పెడమొగంబు పెట్టుకొని = మారుమొగము పెట్టుకొని, చట్టఁబట్టన్ = అందుకొని పట్టుకొనుటకై, పోవు = కప్పుకొనిపోవు, ప్రాణభర్తల = మిగుల ప్రియముగలమగలయొక్క, వెంటంబడి = వెంబడి దగిలి, నూపురంబులు = కాలియందెలు, మొరయన్ = ధ్వని సేయఁగా, పూర్వకాలమున నొకవిధమగు గజ్జెలయందియలు స్త్రీలు ధరింప వానిమ్రోఁత మిగుల మనోహరముగ నుండెడిది. అందియలు మ్రోగు ననుటకు —

    "ఏతాశ్చలద్వలయసంహతి మేఖలోత్తఝంకారనూపురపరాజితరాజహంస్యః
    కుర్వంతికస్యనమనో వివశంతరుణ్యోవిత్రస్తముగ్ధహరిణీసదృశైఃకటాక్షైః.”

(భర్తృ - శృంగా.)

    “కింకిణీ, నూతనఘల్‌ఘలాచరణనూపురఝాళఝుళీమరందసంజాత......”

పెద్దనార్యునిచాటువు

వేనలులు = వెండ్రుకముళ్లు, విరియన్ = విడఁగా, క్రమంబునన్ = వరుసతో, పుట్టు నిట్టూర్పుపవనంబు = నిడుదయూర్పులఁగాలి, జవంబునన్ = వేగముచే, పైఁటకొంగు, ఎడలింపన్ = తొలఁగింపఁగా, అందనికౌఁగిటన్ = అమరనికౌఁగిటిలో, పొదివి = కుదుర్చుకొని, ప్రియంబుచిలుకన్ = ప్రేమ తొలఁకగా, పలికి ముద్దాడు...సాంద్రతన్ - ముద్దాడు = ముద్దు పెట్టుకొను, జవరాండ్ర = యువతులయొక్క, దంశచంద్రికల = దంతకాంతులయొక్క, సాంద్రతన్ = పట్టుదల మీఱి, మంతనంపువేళలన్ = చిక్కఁదనముచే, పంతంబు మెఱసి = ఏకాంతపువేళలందు, మాటతబ్బిబ్బునన్ = మాటలతడఁబాటుచే, పుట్టుపొలయలుకలన్ = కలుగు ప్రణయకలహములచే, తలలు వంచి, రొద = చప్పుడు, లేని, నాలియేడ్పులు = వగయేడ్పులు, ఏడ్చు, ప్రియలన్ = ప్రియురాండ్రను, అనునయింపన్ = ఓదార్చుటకు, ఇంపునన్, చనవు = స్వాతంత్ర్యము, మెఱసి = మెఱయించి, చెక్కుటద్దంబులు = అద్దములఁబోలు చెక్కిళ్లను, నొక్కి, మొగంబు, ఎగయనెత్తి = పైకెత్తి, ముత్తియంపుముంగఱరంగునన్ = ముత్తెము గట్టిన ముక్కరవిధమున, కడలుకొను బుడిబుడికన్నీటన్ = వెల్వడు చినుకుచినుకుకన్నీటిలో, ప్రతిఫలించి = ప్రతిబింబించి, తుఱంగలించు తనదు నిగనిగలు = ప్రకాశించు తనయొక్క నిగనిగ మనుకాంతులను, కనుంగొని = చూచి, నగెనగెన్ = నవ్వెనవ్వె, అనుచున్, చుంబనంబు = ముద్దు, ఇడఁబోయి, జవరా లేడ్చుటఁ గని విటుఁడు బుజ్జగింప నెంచి మొగము నెత్తఁ జెక్కులఁ జిందు కన్నీట వెన్నెల ప్రతిబింబించెను. ప్రియురాలు నవ్వుచుండె నని మోవి నొక్కి మఱింతకోపము గల్గించె నని భావము. కెంగేలన్ = ఎఱ్ఱనిహస్తములతో, అదరంటన్ = చుఱుకంటఁగా, వాటు...కూటునన్ - వాటువడు = దెబ్బపడుగట్టి, కాముకుల(యొక్క), వెలవెలపాటు = తెల్లపోవుటయొక్క, కూటువన్ = కలయికచే, కోటికిం బడగలెత్తి = మహోన్నతసంపద చెంది, (అమితమైన తెల్పు చెంది యనుట.) అలం. ఉత్ప్రేక్ష. పిండిచల్లినగతిన్, కాయన్ = (వెన్నెల) కాయఁగా, డాయన్ = డగ్గఱుటకు. లజ్జించి = సిగ్గిలి, బుజ్జవంబునన్ = లాలనముచే, పొదరిండ్లకున్, లతాగృహములకు, పొదరిండ్లు భోగయోగ్యములు. పుష్పరజము పూవులు సెజ్జవలె నుండును. పరులు గుర్తించనటుల పొదరిల్లు దట్టముగా నుండుఁ గానఁ గాముకులు పొదరిండ్లను గోరుదురు. తార్చి = చేర్చుకొని, కాంతులన్ = ప్రియులను, కవయు నంగనాచులు = కూడు ధూర్తురాండ్రు, అగు నంగనలయంగంబులపస = అగునట్టి స్త్రీలయొక్క యవయవములమేలిమి, ముంగిటంబడన్ = బయలుపడునట్లు, చలికకిసలయాంతరాళంబులన్ = కదలియాడు చిగురుటాకులసందులలో, తూఱితూఱి = ప్రవేశించి ప్రవేశించి, ఇరులు = చీకట్లను, విరియించి = విడఁగొట్టి, పొదరిండ్లు దట్టముగా నుండుటచేఁ జెలువల యవయవసౌందర్యముల నరయ వీలు కాదయ్యెను, చలితకినలయము లనుటచేఁ జిఱుగాలి వీచి వారి కానందకరముగ నుండె ననియు నాకులు గదలుటచే సందులనుండి వెన్నెల ప్రసరించి చెలువలయవయవదర్శనమున కనుకూలముఁ జేసె నని భావము. అలం. ఉత్ప్రేక్ష. పతులప్రార్థనంబులన్ = ప్రియుల వేఁడుకొనుటచే, పుంభావసురతాడంబరంబునకున్ = పురుషాయితమందలి విజృంభణమునకు, తోడు సూపి = సాహాయ్యమును చూపఁగా, దూపటిలి = డస్సి, అంగరాగంబులు = మైపూఁతలు, కరంగన్ = కరఁగునట్లు, చెమర్చిన...లతలన్ - చెమర్చిన = చెమటపట్టిన, చంచలాక్షుల = స్త్రీలయొక్క, నిద్దంపు = నునుపైన, తనూలత = తీఁగలవంటి శరీరములందు, పుట్టి, దట్టంబులు, అగు, చిఱుచెమటబొట్టులన్ = చిన్నచిన్నచెమటబొట్టులందు, పొడకట్టి = ప్రతిఫలించి, కన్పడి, పురుషాయితము నందు నాయిక కైబడలిక యెక్కువ. అలయికచేఁ జెమటమేన జనించుటయు మైపూఁతలు కరఁగుటయు సాజము. స్త్రీలబడలికయే యెక్కు డనుటకు —

శ్లో. "ఉరసి నిపతితానాం స్రస్తధమ్మిల్లకానాం
    ముకుళితనయనానాం కించిదున్మీలితానాం
    ఉపరిసురతఖేదస్విన్నగండస్థలానా
    మధరమధువధూనాం భాగ్యవంతః పిబంతి.

(భర్తృహరి)

స్రగ్ధర. ...పతులఁబదరిపైఁ బ్రౌఢి వాటించి నిట్టూ
    ర్పెకదొట్టన్ డస్సి వీరాయితమరి మఱితారెట్లొ మున్నట్లయౌనా,

    యికలం గందర్పుఁ డోటం బెఱిఁగి తరిమివీఁ సేసె."

(ఆముక్తమాల్యద)

తెలుపారు...అందంబులు- తెలుపారు = తెల్పెక్కిన, మలయజంపు = మంచిగంధము యొక్క, చిటులు = చిట్లిన, గందంబుల = గంధపుఁబూఁతలయొక్క, అందంబులు = చక్కనలు, ఒసంగి = యిచ్చి, అలం. నిదర్శనము. సంజకడన్ = సంజవేళ, తారు = తమరు, నొడివినసంకేతంబుల = చెప్పిన రహస్యస్థలములందు, ఉండక, తెరువు గట్టి = దారికాచి, పొరువుఁదరువులనీడలన్ = ప్రక్కలనుండుచెట్లనీడయందు, అడంగి = దాఁగి, నవ్వుటాలకున్ = వేళాకోళమునకు, వెనుకపాటున్ = వెనుకపడుటచేత, కదిసి = చేరవచ్చి, ముసుగులు = (ఎఱుక పడకుండుటకు వేసికొన్న) ముసుగులను, ఎడలింపన్ = తొలఁగింపఁగా, బెగడి = భయపడి, కళవళంపుఁజూపులన్ = బెదరుపాటుగలచూపులతో, వల్లభులన్ = ప్రియులను, చూచి, అల్లనన్ = మెల్లగా, నగు...చెన్నునన్ - నగు = నవ్వునట్టి, అభిసారికల = అంఱంకుటాండ్రయొక్క, వెడందకన్నులచెన్నునన్ = విశాలనేత్రములయందముచే, అన్నుకొని = మదముగొని (అతిశయించి యనుట), అలం.ఉత్ప్రేక్ష. పొదలుమదనోన్మాదంబునకున్ = కలుగు మన్మథోద్రేకమునకు, ప్రోదిగాన్ = తోడ్పాటుగా, మోదంబునన్ = సంతోషముతో, కాదంబరి = కల్లును, గండూషించి = పుక్కిలించి, విటకదంబంబునకున్ = జారులసమూహమునకు, ఒసంగు...బుగ్గలందున్ - ఒసంగు = ఇచ్చునట్టి, అంబురుహముఖుల = పద్మములవంటిముఖము గలస్త్రీలయొక్క, ఒప్పులకుప్పలు = చక్కఁదనాలరాసులు, అగునిప్పపూమొగ్గలంబోని = అగునట్టి యిప్పపూవులమొగ్గలంబోలు, (కల్లు గ్రోలినవారిబుగ్గలు కొంచెమెఱుపు గలిసిన తెలుపుతో నుండును గాన నిట నిప్పపూవులతోఁ బోల్పఁబడె నని గ్రహించునది) బుగ్గలందున్, అగ్గలిక = హెచ్చును, చూపు...చకచకల - చూపు, కమ్మపంజుల = పంజులవలెఁ దేజరిల్లు కమ్మలయందలి, వజ్రపుంజకచకల = వజ్రకాంతులచే, నకనకలు = సన్నఁదనములు, వీడుకొని = వదలి, అలం. ఉపమ. కలికితనంబులన్ = మెలపులతో, కలిసిమెలసి, రతాంతంబునన్ = సురతావసానమున, పరిశ్రాంతి = బడలిక, అడఁగన్ = శాంతింప, అంగణంబులన్ = ముంగిళ్లయందు, నిలిచి, ఒండొరులకురులు = (ఆలుమగలు) ఒకరొకరి వెండ్రుకలు, దువ్వుచున్ = చిక్కుదీర్చుచు, విహరించుసమయంబునన్, పల్లవులు = విటులు, కేళికిన్ = రతికి, అల్లప్పుడు= ఆసమయమున, అన్నతమమాటలు, తలఁపించినన్ = తలఁపఁజేయఁగా, ఉదరిపడి = సిగ్గుపడి, మందస్మితంబులు = చిఱునవ్వులు, అంకురించుహుంకృతులన్ = పొడమునదలింపులచే, జంకించి = బెదరించి, కంకణంబుల...తళుకులు - కంకణంబుల(యొక్క), రత్నంపుఁదళుకులు = రత్నములకాంతులు, చెదరన్ = వ్యాపింపఁగా, ఉంకించి = ఊఁచి, వైచుచేమంతిపూబంతుల = వేయునట్టి సేవంతిపూలచెండ్లచేత, పుటపుటనై = పిక్కటిల్లి, మిటమిటన్ = మిటమిట యనుకాంతి, కాయు...మెండునన్ - కాయు = ప్రకాశించు, దట్టంపు = చిక్కనైన, పండువెన్నెల = ముదురువెన్నెలయొక్క, మెండునన్ = అతిశయముచే, బెండువడి = తేలికపడి, డెందంబు = హృదయము, కంది = కమలి (తాపము నొంది), తాలిమి = ధైర్యము, చిందువందై = కకాపికలై, కెందలిరుపాన్పునన్ = ఎఱ్ఱనిచివుళ్లు పఱచిన ప్రక్కపై, తనువు = శరీరము, ఒందక కుదురుపడక, పరుండియుండ నించుకేనియు ననువుపడక, లేచి = పానుపునుండి లేచి, కూర్చుండి = (విచారముతోఁ) గూర్చుండి, కన్నీరు = కంటినీరు (బాష్పములు) గోటన్ = గోటితో, మీటుచున్ = ఎగజిమ్ముచు (గోటితోఁ జిందఁగొట్టుచు) వరూథిని ఇట్లనియెన్ = ఈవిధముగాఁ బలికెను. (తన చెలికత్తెతో పక్ష్యమాణవిధముగా వాకొనెను.)

ఉ.

నోములు నోఁచినమ్మలు మనోరథముల్ దయివాఱనిత్తఱిన్
దామరతంపరై ప్రియులుఁ దారువిహారము సల్ప వీరిలో
నీమెయి దుఃఖశీల నగు నే వసియింపఁ దరంబె పోద మా
రామముఁ జూడ నందు సుకరం బగు సర్వము నంబుజాననా.

29

టీ. అంబుజాననా = పద్మముఁబోలు మోము గలదానా! చెలీ! నోములు నోఁచినమ్మలు = (వెనుక) మంచివ్రతములు చేసిన పుణ్యశాలినులు, మనోరథముల్ = కోరికలు, దయివాఱన్ = నెఱవేఱఁగా, ఇత్తఱిన్ = ఈవెన్నెలరాత్రియందు, తామరతంపరై = పెంపుచెంది, ఇష్టము వచ్చిన విధముగా, ప్రియులున్ = ప్రాణనాయకులును, తారున్ = తామును, విహారము = వేడుకగా సంచారము చేయుట, సల్ఫన్ = చేయుచుండఁగ, వీరిలోన్ = ఇట్లు సౌఖ్యము ననుభవించుచున్న యీస్త్రీలలో, ఈమెయిన్ = ఈవిధమున, దుఃఖశీలను = దుఃఖపడుస్వభావము గలదానను, అగునేన్, వసియింపన్ = ఉండుటకు, తరంబె = శక్యమా! ఆరామము చూడన్ = ఉద్యానవనమును జూచుటకు, పోదము = పోవుదము, అందున్ = ఆతోఁటయందు, సర్వమున్ = సమస్తము, సుకరంబు = సుఖముగాఁ జేయఁదగినది, అగు = కాఁగలదు. ధన్యురాండ్రగు స్త్రీలకుఁ బూర్వవ్రతఫలమున నిష్టక్రియసంయోగభాగ్యము సిద్ధించినది. నే కొఱనోముల నోఁచి దుఃఖశీలనైతిని. కాననే నేను వసింప తరముగా దని వరూథిని యనెను. విరహిణులకుఁ జంద్రికానిశలు ప్రియాసహచరులసందర్శనము మిగుల వ్యథాకరములు.

తామరతంపరయనం దామరలగుంపువలెఁ బెనవేసికొనియనుట. ఇది కలసిమెలసి, అభివృద్ధినొంది యనునర్థమున వాడఁబడును. కలసిమెలసి యనుటకు —

    “తామరతంపరైన చెలులు చుట్టలు కలిసి"

(భార. ఉద్యో- ఆ. 3.)

తా. చెలీ! పూర్వజన్మమున మంచినోములు నోఁచుకొన్న పుణ్యవతులు కోరికలు నెఱవేఱఁగా ప్రియులుం దామును దామరతంపరగా సౌఖ్యము ననుభవించుచుండఁగా వీరిలో నొక్కరితనై ప్రియసమాగమము దొరకక దుఃఖపడు నేను నిల్వఁగల్గుదునా? శృంగారవనమునకుఁ బోవుదుము. సర్వము నక్కడ చక్కఁబడఁగలదు.

అలం. కావ్యలింగాలంకారము.

క.

అని పలికి పాన్పు డిగి కా
మిని చంద్రాతపమువేఁడిమికిఁ బైటచెఱం
గున ముసుఁ గిడి నిజకేళీ
వనిఁ జొచ్చి వియోగవహ్ని వడఁబడి తెగువన్.

30

టీ. అని, పలికి = తనచెలిమికత్తెతో నిటులఁ జెప్పి, పాన్పు = పఱపు, డిగి = దిగి, కామిని = ప్రియసంగమవాంఛతోఁ బరితప్తురా లగువరూథిని, చంద్రాతపమువేఁడిమికిన్ = వెన్నెలవేఁడికి, పైఁటచెఱంగునన్ = పయ్యెదచెంగుతో, ముసుఁగిడి = ముసుఁగు వేసికొని (సమస్తావయవములకు వెన్నెల సోకకుండఁ జేసికొని), నిజకేళీవనిన్ = తనవిహారవనమును, చొచ్చి = ప్రవేశించి, వియోగవహ్నిన్ = విరహాగ్నిచే, వడఁబడి = సొక్కి, తెగువన్ = సాహసముతో, (పైపద్యముతో నన్వయము.)

దిగి యనుశబ్దమునందలి దకారమునకు డకారము వచ్చుటకు —

తే. "దాఁక దగ్గఱి దిగ్గియ దాయఁబోయి
    దాపలను దిగ్గుమనువైకృతముల మొదల
    డాఁక డగ్గఱి డిగ్గియ డాయఁబోయి
    డాపలను డిగ్గుమని డా కడంగి నిల్చు.”

(అప్పకవీయము)

విరహిణులకుఁ జంద్రాతమము సహింపరానియంత వేఁడిగా నుండును. కానఁ బయ్యెంటచెఱంగుతోఁ గప్పుకొందురు. ఇటు లనుటకు —

శ్లో. "స్తనోత్తరీయేణ కరోద్ధృతేన
    నివారయంతీ శశినో మయూఖాన్.”

(భర్తృహరి శృం.)

సీ.

చనుఁగప్పు దొలఁగ వాసనగాలి కెదురేఁగుఁ
          బరు వొప్ప నలుఁగులఁ బాఱుకరణి
నిడుదవేనలినూనెముడి వీడఁ జిగురాకుఁ
          బొదఁ దూఱుఁ గార్చిచ్చుఁ గదియుకరణిఁ

బసిఁడిగాజులు పైకి వెసఁ ద్రోచి నునుఁదీగఁ
          దెమలించు నురిత్రాఁడు నెమకుకరణి
మొలనూలు బిగియించి వెలఁది వెన్నెలఁ జొచ్చుఁ
          బిఱుదీయ కేటిలో నుఱుకుకరణి


తే.

జడియ దళులకుఁ గురియుపుప్పొడుల మునుఁగు
మావికడ నిల్చు విరులనెత్తావిఁ గ్రోలు
విషమసాయకునేఁపుల విసివి విసివి
తనువుఁ దొఱఁగంగఁ దలఁచి యవ్వనరుహాక్షి.

31

టీ. అవ్వనరుహాక్షి = ఆవరూథిని, విషమసాయకునేఁపులన్ = మన్మథబాధలచేత, (పా. విషమసాయకుతూపులన్ = మన్మథునిబాణములచే) విసివివిసివి = మిగుల విసువు చెంది, తనువు = శరీరమును, తొఱఁగంగన్ = విడుచుటకు, తలఁచి = నిశ్చయించి, పరువు = పరుగు, ఒప్పన్ = ఒప్పునట్లు, అలుఁగులన్ = బాణములందు, పాఱుకరణిన్ = పర్వెత్తురీతిని (బాణములు తనపైకి వచ్చుచుండ వాని కెదురు పరుగిడువిధమున ననుట), చనుఁగప్పు = చనులకుఁ బైనున్నపయ్యెద, తొలఁగన్ = తొలఁగిపోవ, వాసనగాలికిన్ = పరిమళము గల వాయువునకు, ఎదురేఁగు = ఎదురుగాఁ బోవును. (అలుఁగులన్ = కత్తులమీఁద నని కొందఱు వ్యాఖ్యాతలు) కార్చిచ్చున్ = దావాగ్నిని, కదియుకరణిన్ = చేరఁబోవువిధమున, నిడుద...ముడి - నిడుద = పొడవైన, వేనలి = సిగయొక్క, నూనెముడి = దూముడి (నూనియ రాచి వేసినముడి యూరక వీడును) వీడన్ = వదలగా, చిగురాకుఁబొదన్ = చిగురాకులు గలపొదలో, తూఱున్ = ప్రవేశించును. విరహిణి మతి చలనముచే మరణింప నెంచి చిగురుటాకులరాశి యగ్నికుండమని దూఁకు ననుటకు —

శ్లో. "అధివసతి వసంతే మర్తుకామా దురంతే
    నవకిసలయతల్పం పుంజితాంగారకల్పం,

    విరహమసహమానా చక్రవాకీసమానా
    చకితవనకురంగీలోచనా కోమలాంగీ.”

(పుష్పబాణ.)

ఉరిత్రాడు = ఉరిత్రాటిని, నెమకుకరణిన్ = వెదకువిధమున, పసిఁడిగాజులు = బంగారుగాజులు, పైకి, వెసన్ = వేగ, త్రోఁచి = ఎగద్రోఁచి, నునుఁదీగెన్ = నునుపైనతీవను, తెమలించున్ = లాగును. ఏటిలోన్ = సముద్రమున, (ఏ ఱన సముద్ర మర్థ మనుటకు "పాలేఱు వేత్రచ్చుచో” నని ప్రయోగము.) ఉఱుకుకరణిన్ = దుముకునట్లు, మొలనూలు = మొలత్రాటిని, బిగియించి = బిగియదీసి, వెలఁదివెన్నెలన్ = తేటవెన్నెలను, చొచ్చున్ = చొరఁబడును, అళులకున్ = తుమ్మెదలకు, జడియదు, కురియుపుప్పొడులన్ = రాలుపుష్పపరాగమున, మునుఁగున్, మావికడన్ = మామిడిచెట్టునొద్ద, నిల్చున్, విరులనెత్తావిన్ = పూవులనిండుపరిమళమును, క్రోలున్, అలం. ఉత్ప్రేక్షాలంకారము.

ఇది మృతి యను చివరి మన్మథావస్థ. ఇందు మరణప్రయత్న మభివర్ణింపఁబడినది.

శ్లో. "స్మరార్త్యా మరణోద్యోగో మృతి రిత్యభిధీయతే” ఇది యంతయుఁ దాప మను నాఱవ మన్మథావస్థ లక్షణములు. తాపలక్షణములు —

    “చక్షుః ప్రీతి శ్చిన్తా సంకల్పో గుణమతిః క్రియాద్వేషః
    తాపో లజ్జాత్యాగో మూర్ఛా మృతిర్దశావస్థాః.
    తత్ప్రాప్తేర్విప్రకర్షేణ తాపః స్యాత్ కామజో జ్వరః
    వైవర్ణ్యమశ్రునైరస్యం శయనే పరిలుంఠనం
    నిశ్వాసముఖశోషాద్యా అనుభావాస్తదుద్భవాః.”

(సాహిత్య చింతామణి.)

వెలఁదివెన్నెల యన ధవళ మగువెన్నెల వెలఁది యన ధవళ మనుటకు —

గీ. "ఈ వెలందియొడల్ పైడిలో వెలంది"

(విజయవిలాసము.)

సీ. “ఓలి నన్నింటి సద్యోఘృతంబుల నించి వెలఁదిపట్టున వర్తు లలవరించి”

(భోజరాజీయము. ఆ. 2.)

క.

అట్టియెడ నమ్మృగేక్షణఁ
బట్టి సఖీజనము వెడఁగుఁబట్టీ తగవే
యిట్టితెగు వనుచుఁ జెక్కులఁ
దొట్టినకన్నీరు వోవఁ దుడుచుచుఁ బలికెన్.

32

టీ. అట్టియెడన్ = ఆ సమయమున, అమ్మృగేక్షణ = జింకచూపులవంటి చూపులు గల యావరూథినిని, సఖీజనము = చెలికత్తెలసమూహము, పట్టి = చుట్టుముట్టి, వెడఁగుఁబట్టీ = పిచ్చిబిడ్డా! ఇట్టితెగువ = ఇట్టిసాహసము, తగవే = తగునా, అనుచున్, చెక్కులన్ = చెక్కిళ్లియందు, తొట్టినకన్నీరు = కాఱినకన్నీటిని, పోవన్ = పోవునట్లు, తుడుచుచున్ = వస్త్రముతో నొత్తుచు, పలికెన్ = వాకొనెను.

ఉ.

పూఁతపసిండివంటివలపున్ బచరించుకులంబునీతికిన్
లేఁత గదమ్మ యిత్తెఱఁగు లేదు సురాంగన లెల్ల నిట్టినీ
చేఁతకు మెత్తురమ్మ దయసేయక తిన్ననిమేను వెన్నెలన్
వేఁతురఁటమ్మ యింత కనువేఁదుఱు సెల్లునఁటమ్మ యింతికిన్.

33

టీ. లేమ = చిన్నదానా! పూఁతపసిండివంటివలపున్ = నీరూఁదినబంగారువలెఁ బైపైఁ దోవఁ జేయుమోహమును, హృదయమునందు లేకున్నను బయటి కున్నటుల వర్తించుట సహజము. అట్టికృత్రిమ మగువలపును, పచ...నీతికిన్ - పచరించు

= నటించు, కులంబు = వంగడముయొక్క, నీతికిన్ = న్యాయమునకు, వేశ్యజాతి మర్యాదకు, ఇత్తెఱఁగు = ఈవిధము, ఈవిధముగా నిక్కువమగు వలపునఁ బడి పరితాపము నొంది విరహాగ్నిమగ్న మగుట, లేఁత = చుల్కన, కదమ్మ, సురాంగనలెల్లన్ = దేవతాస్త్రీ లందఱును, ఇట్టి నీచేఁతకున్ = ఇటువంటి నీవ్యాపారమునకు, మెత్తురమ్మ = మెచ్చుదురఁటమ్మా? దయసేయక = ప్రేమింపక, తిన్ననిమేను = చక్కనిశరీరము, వెన్నెలన్, వేతురఁటమ్మ = తపింపఁజేయుదురా! ఇంతికిన్ = స్త్రీకి, ఇంతకనువేఁదుఱు = ఇంతచూపుపిచ్చి, చెల్లునఁటమ్మ.

బంగారు ఒకనికి మోహము గలిగించును గాని తా నొకడిని మోహింపదు మనకుల మట్టిది. అట్టికులమునఁ బొడమియుఁ గరువేఁదుఱుచే నిటుల మెలఁగు నిన్నుఁ జూచిన వేల్పుచెలులు నవ్వకపోరు. ఈ మనోహరాకారము నెడఁ గనికరము లేమి తగ దనియు "శరీరమాద్యం ఖలు ధర్మసాధన" మన్నటులఁ గామధర్మసాధనభూత మగు దేహమునెడఁ గనికరింప నగు నని చెలులు వరూథినికిఁ దెలిపిరి.

తా. నీరూఁదిన బంగారమువలె పైపై వలపులు చూపవలసిన భోగముకులముమర్యాద లేక యిట్లు నిక్కపుమోహము నిల్పి తాపపడుట తగదు. నీకులమువెలఁదు లెవ్వరును నీనడవడికి మెచ్చుకొనరు. కాపాడుకొనక యీ చక్కఁదనాల శరీరమును వెన్నెలలో వేఁచుట తగదు. ఆఁడువాండ్ర కింత చూపుపిచ్చి కూడదు.

చ.

ఉడుపతిబారికిన్ వెఱచి యూఱట యౌ నని పేరుటామనిన్
ముడిపడుకంతుసేనలకు ముయ్యెలగు ట్టయినట్టి యిందు రా
నడఁగునె తాపవహ్ని మనమై హరిణేక్షణ ముల్లు పుచ్చికొ
ఱ్ఱడఁచినచందమయ్యెఁ బదమా యెలదోఁటఁ జరింప కింటికిన్!

34

టీ. హరిణేక్షణ = జింకచూపులు గలవరూథినీ! ఉడుపతిబారికిన్ = చంద్రునివలని హింసకు, వెఱచి, ఊరట యౌన్ = కొంతశాంతి యగును, అని = అనుకొని, పేరుటామనిన్ = నిండారినవసంతకాలమున, ముడివడుకంతుసేనలకున్ = గుమిగూడు మరునిదండునకు, ముయ్యెలగుట్ట = కూడలిపట్టు, అయినట్టి = అయి యొప్పుచున్నటువంటి, ఇందున్ = ఈతోఁటకు, (మన్మథుని పరివారమున కునికిపట్టగు నీయుద్యానవనము మీఁదు మిక్కిలి తాపకరము గాని వేఱుగాదు గాన) రాన్ = వచ్చినయెడ, తాపవహ్ని = విరహతాపాగ్ని, అడఁగునె = శాంతించునా, మనమై = మరయంతమనము, ముల్లుపుచ్చి = ముల్లు తీసివైచి, కొఱ్ఱు = ఇనుపమేకును, అడఁచినచందము = దిగగ్రుచ్చినవిధము, అయ్యెన్ , ఎలదోఁటన్ = లేఁదోఁటను, చరింపక = తిరుగక, ఇంటికిన్, పదమా = నడువుమా!

వనము తాపహర మని యిందుఁ జొచ్చితివి గాని వసంతుఁ డిందు నిండారియున్నాఁడు. వసంతఋతు విది యనుట. వసంతుఁడు మరుని సామంతుఁడు. పూవులు, తుమ్మెదలు, మలయానివాదులు మరునిపరివారమె గాన నిటఁ జేరుట ప్రమాదము. మరుని పరివారము —

శ్లో. "ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
    వసంతః సామంతో మలయమరుదాయోధనరథః”

(సౌందర్యలహరి)

తా. వరూథినీ! చంద్రునివలన బాధకుఁ దాళలేక యూఱట చెందుట కని నిండారిన వసంతకాలమున శుకపికాదుకు నెలవయిన యీ యెలఁదోఁటకు రాఁదగునా? ఇది ముల్లు తీసి యా గాయమున కొఱ్ఱు గ్రుచ్చుకొనినట్లున్నది. ఇక్కడ తాపము హెచ్చునే కాని యుపశాంతి కలుగదు. ఇంతట నీ యెలఁదోఁటలోఁ దిరుగుట మాని యింటికిఁ బోవుదము రమ్ము. అలం. ఇందు విషమాలంకారము ధ్వనించుచున్నది. లోకోక్తి; కావ్యలింగము.

క.

అని యెొడఁబడఁ బల్కుచుఁ దో
డ్కొని వచ్చినఁ బాన్పుఁ జేరి గురుకుచ దనపైఁ
గనకనఁ గనలెడు వెలుఁగులఁ
గనికర మఱి మండుచంద్రుఁ గని కర మలుకన్.

35

టీ. అని = ఇటులని, ఒడఁబడ = అంగీకరించునట్లు, పల్కుచున్ = చెప్పుచు, తోడ్కొని వచ్చినన్ = తీసికొనిరాఁగా, గురుకుచ = గబ్బిగుబ్బలు గల యా వరూథిని, తనపైన్ = తనమీఁద, కనకనన్ = కనకనమనుచు, (ఇది మండుట కనుకరణము) కనలెడు వెలుఁగులన్ = వెలిఁగెడి కిరణములతో, కనికరము = దయ, ఆఱి = దయమాలి, మండుచంద్రున్ = వెలుఁగుచున్న చందు రుని, కని, కరము = మిక్కిలి, అలుకన్ = కోపముతో, (పైపద్యముతో నన్వయము.) విరహిణులకుఁ జంద్రకిరణములు మిగుల వేఁడిగా నుండును. కాన వెన్నెలలోఁ జొరవెఱచి చంద్రుని దూషింతురు.

"శ్లో. చంద్రః చండకరాయతే”

(శృంగారతిలకము.)

తా. అని యొప్పించి నెచ్చలు లింటికిఁ గొనితేఁగా నా వరూథిని నివ్వు లొలుకుచు వెలుఁగుచున్న చంద్రునిఁ జూచి మిగులఁ గోపముతో.

క.

ఓచెల్ల! విరహిణీవధ
మేచతురత నీకు దురితమే చేయుపనుల్
రాచఱికపుఫలమే య
య్యో! చంద్రవివేక మెఱుఁగవొకొ గురుసేవన్.

36

టీ. ఓచెల్ల = ఇస్సిరో! ఇది సంతాపార్థకము. చంద్ర = చంద్రుఁడా, నీకు, విరహిణీవధము = వియోగినులను హింసించుట, ఏచతురత = ఎట్టి నేర్పరితనము? దురితమే = పాపమునే, చేయుపనుల్ = కలిగించునట్టిపనులు, రాచఱికపుఫలమే = దొరతనపుఁ బ్రయోజనమా? గురుసేవన్ = గురుశుశ్రూషచే, వివేకము = యుక్తాయుక్తములు తెలిసికొనునట్టి తెలివిని, ఎఱుఁగవొకో = తెలిసికొన్నవాఁడవు కావో యేమో! (ఇది వెక్కిరింపు మాట.) బృహస్పతియొద్ద శుశ్రూష చేసి నీవు గడించిన వివేక మాయనభార్యను జేరఁదీసికొనుటయే కాదా? గురుసేవచే వివేకమును గడించి పుణ్యకార్యములు గావించినవాఁడవు కావు. కాననే విరహిణీవధూమారణమునకుఁ బూనుకొంటివి. చంద్రునకు రా జను నామాంతరము గలదు. రాజధర్మము రాచఱికము. విరహిణీవధ నీపరిపాలనాఫలితమా యని యాక్షేపణ.

    “రాజీవాక్షుల నేచుపాతకివి చంద్రా రాజవా నీవు"

(వసుచరిత్ర)

సీ.

తొలుదొల్తఁ గమలమిత్రునివంక రూ పౌట
          దక్షాధ్వరధ్వంసి తన్ను గనుటఁ

బరివేషమిషమునఁ బాశంబు దాల్చుటఁ
          గప్పు దేహమునందుఁ గానఁబడుటఁ
గాలవశంబునఁ గాని తోఁపక యుంట
          సతతనిష్ఠురగదాన్వితతఁ గనుటఁ
బూని పాండుక్షేత్రమునఁ బ్రవర్తించుటఁ
          బ్రకటానురాగతారకుఁ డగుటను


తే.

నంతరం బెద్ది యాత్మలో నరసి చూడ
రాజ నీకును నలధర్మరాజునకును
బ్రాణిలోకంబు బాధలఁ బఱుచునపుడు
ధర్మపద మొక్కఁ డెక్కు డా ధన్యునందు.

37

టీ. (ఈపద్యమునందు యమునకును జంద్రునకును సమత్వము తెలుపఁబడినది. కావున రెండుపక్షముల నర్థముఁ జూచుకొనునది.) తొలుదొల్తన్ = మొట్టమొదట, కమలమిత్రునివంక = సూర్యునివలన, రూపౌటన్ = స్వరూపము చెందుటచేతను, (సూర్యకిరణములు సోఁకి రూ పేర్పడుటచే నని చంద్రపరమునను, సూర్యునకుం గొడు కగుటచే నని యమపరమునను సరిచూచుకొనునది) సూర్యకిరణములు సోఁకగాఁ గళలం వృద్ధినొంది చంద్రునకు స్వరూప మేర్పడుట శాస్త్ర సిద్ధము.

సీ. “చండదీధితికరజ్వాలమండలములోఁ బ్రోదిబొందినమహోగ్రుండు వీఁడె”

(శృం.నై.)

చంద్రునివృద్ధిక్షయములకు సూర్యుఁడే కారకుఁడు.

    “కలాః షోడశ సోమస్య శుక్లే వర్ధయతే రవిః
    ... ... .... .... .... ... .... ...
    కలావశిష్టో నిష్పీతప్రవిష్టః సూర్యమండలం
    అమాయాం విశతే రశ్మౌ అమావాసీ శతఃస్మృతా.
    ఏవం సంక్షీయతే సోమః క్షీణస్యాప్యాయతే పునః
    తస్మాత్ సూర్యః శశాంకస్య క్షయవృద్ధివిధే ర్విభుః."

(దేవీపురాణము)

దక్షాధ్వరధ్వంసికన్ను = (చం) దక్షునియజ్ఞము చెడఁగొట్టిన వీరభద్రుని కాలితాఁపును, (య) దక్షయజ్ఞము చెడఁగొట్టించిన శివుని కాలితాఁపును, కనుటన్ = పొందుటచేతను, పరివేషమిషమునన్ = (చం) గాలి గుడి యను నెపమున, “పరివేషస్తు పరిధి రుపసూర్యకమండలే”. చంద్రునకు సూర్యునకుఁ బైని మండలాకారముగ నుండు తేజమును బరివేష మందురు. అది చుట్టచుట్టినత్రాడువలెఁ దోఁచుచున్న దని భావము. పాశంబున్ = పాశమును, కాల్చుటన్ = ధరించుటచేతనుఁ (య) పరివేషమిషమునన్ = (ప్రాణిసమూహమును) చుట్టుకొనునెపమున, పాశంబున్ = త్రాడును, తాల్చుటన్ = ధరించుటచేతను, (ప్రాణుల సర్వత్ర యాక్రమించు నెపమున స్వతస్సిద్ధ మైన వల్లెత్రాటిని (కాలపాశమును) దాల్చుటచేతనని యముని పరమగు నర్థము.) కప్పు = (చం) కళంకము, (య) నలుపు, కానఁబడుటన్, కాలవశంబునన్ కాని (చం) కాలమును బట్టియే కాని, (కళలవృద్ధిక్షయాదికమును బట్టి యనుట) (య) చావుకాలముననే కాని, తోఁపకయుంటన్ = అగపడకుండుటచేతను, సతతనిష్ఠురగదాన్వితతన్ = (చం) ఎప్పుడును ఘోరమైన క్షయరోగముతోఁ గూడికొనుటను, (య) ఎప్పుడును గ్రూరమైన గద యను నాయుధముతోఁ గూడియుండుటను, కనుటన్, పూని = ప్రయత్నవడి, పాండుక్షేత్రమునన్ (చం) తెల్లనిశరీరముతో, (య) పాండురాజుభార్యయందు, ప్రవర్తించుటన్ = (చం) వర్తించుటచేతను, (య) ప్రవర్తన చేయుటచేతను, ప్రకటానురాగతారకుఁ డగుటను, (చం) ప్రసిద్ధమయిన అనురాగముగల యశ్విన్యాది నక్షత్రములు గలవాఁడు, (య) ప్రస్ఫుటమయిన యెఱ్ఱఁదనముతోఁ గూడిన గుడ్లు గలవాఁడు అగుటను, ఆత్మలోన్, అరసిచూడన్, రాజ = రాజనామము గల చంద్రుఁడా! నీకును, అల ధర్మరాజునకును = ఆ యమధర్మరాజునకును, అంతరంబు = భేదము, ఎద్ది. ప్రాణిలోకంబున్ = ప్రాణులసమూహమును, బాధలఁ బఱుచునపుడు = బాధలఁ బెట్టునెడ, ఆ ధన్యునందున్ = ఆ పుణ్యాత్మునందు, ధర్మపదము ఒక్కఁడు = ధర్మశబ్దము ఒక్కటి, ఎక్కుడు = ఎక్కువ.

చంద్రా! నీవు రాజవు. అతఁడు ధర్మరాజు. మీయిరువురు పరపీడారతు లైనను ఆతనియెడ ధర్మపదమొకటి యతిశయముగా నున్నది. కాన నాతఁడు ధర్మవిచారణ మొనరించి యధార్మికులను మాత్రము హింసించి యన్వర్థనాముఁడై యున్నాఁడు. నీ వధర్మాత్ముఁడవు గాన ధర్మరాజగు యమునికంటెఁ గూడఁ గ్రూరుఁడవు. మీయిరువురి కంతరము ధర్మపదమునఁ దక్కఁ బ్రాణిలోకమును బాధపఱచునపుడు లే దనుట.

తా. నీవును యమధర్మరాజును సమానులే. కాని యాతఁడు ప్రాణిహింసపట్టున ధర్మమును విచారించువాఁ డగుటచే ధర్మపద మొక్కటి హెచ్చు కలదు. నీకంటె యముఁడే మేలని భావము.

అలం. రూపకము వ్యతిరేకము గమ్యము.

చ.

ఒక పెనుఁబాపఱేఁడు చల మొప్ప రసాతలసీమకున్ జకో
రకములు భూతధాత్రికి సురల్ దివికిన్ బగ దీఱునట్లుగా
మెకమెకపాటుతోడ నిను మ్రింగకపో రెపుడున్ ద్రిలోకకం
టకుఁడవు గాన నీయొడలు నజ్జుగఁ జేసి కురంగలాంఛనా.

38

టీ. కురంగలాంఛనా = చంద్రుఁడా! జింకవలెఁ గానవచ్చు మచ్చ గలవాఁడా! కళంకితాత్ముఁడా యనుట. త్రిలోకకంటకుఁడవు = మూఁడులోకములకును బాధకుఁడవు, విరోధివి. కానన్ = కావున, చలము = మత్సరము, ఒప్పన్ = అమరునట్లు, రసాతలసీమకున్ = పాతాళప్రదేశమునకు, ఒక పెనుఁబాఁపఱేఁడు = ఒక్క పెద్దసర్పరాజును — రాహువు, భూతధాత్రికిన్ = భూలోకమునకు, చకోరకములు = వెన్నెలపులుఁగులును, దివికిన్ = స్వర్గలోకమునకును, సురలు = దేవతలును, పగదీఱునట్లుగాన్ = మూఁడులోకములవారికిని గలవిరోధము తీరిపోవునటుల, మెకమెకపాటుతోడన్ = త్రుళ్లుతో, గర్వ ముతో, నీయొడలు = నీశరీరమును, నజ్జుగఁ జేసి = నులినులి చేసి - నలఁగఁగొట్టి, నినున్, మ్రింగకపోరు = మ్రింగనే మ్రింగుదురు.

చంద్రుని దేవతలు భుజింతు రనుటకు —

శ్లో. “పర్యాయపీతస్య సురైర్హిమామశోః కలాక్షయఃశ్లాఘ్యతరోభివృద్ధేః.”

రఘు.

శ్లో "భక్ష్యార్థం సర్వదేవానాం సోమః సృష్ట స్స్వయంభువా,
    త్రయశ్చ త్రిసహస్రాశ్చ దేవా స్సోమం పిబంతి యే.”

దేవీపురాణము

చకోరములు వెన్నెలఁ దిను ననుట కవిసమయసిద్ధము.

శ్లో. "జ్యోత్స్నా పేయా చకోరైర్జలధరసమయే మానసం యాంతి హంసాః
    ఇత్యాద్యున్నేయ మన్యత్ కవిసమయగతం సక్కవీనాం ప్రబంధే.”

(సాహిత్యదర్పణము)

తా. చంద్రా! నీవు ముల్లోకములకును బాధకుఁడవు కావున నీమచ్చ మడఁగించుటకై పాతాళలోకమున నొకసర్పరాజును (రాహువు), భూలోకమున వెన్నెలపులుఁగులును, స్వర్గలోకమున దేవతలును నీయొడలు నజ్జునజ్జుగఁ జేసి మ్రింగుచుందురు. రాహువు పర్వముల గ్రసించుటయు, చకోరములు కిరణంబు లాహారించుటయు, వేల్పులు కళలను హరించుటయు నెఱుంగునది.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

క.

వాతాపివలన నెఱిఁగితొ
శీతకిరణ కడుపుఁ జొచ్చి జీర్ణింపని యీ
రీతి నినుఁ దినియు నాయువు .
చేత సురల్ చెడరుగాక చెఱుపవె వారిన్.

39

టీ. శీతకిరణ = చంద్రుఁడా, కడుపు చొచ్చి = కడుపులోఁ బ్రవేశించి, జీర్ణించని యీరీతిన్ = అఱుగకయుండు నీవిధమును, వాతాపివలనన్ = వాతాపి రాక్షసునివలన, ఎఱిఁగితొ = తెలిసికొంటివా యేమి, (ఈనీతిన్ = ఈన్యాయమును పా.) నినున్ = నిన్ను, తినియున్ = భుజించియు, ఆయువుచేతన్ = ఆయుష్యము గలవా రగుటచేత (చావు లేనివా రగుటచే), చెడరు గాక = చెడరుగాని, (లేనిచో) వారిన్ = నశించువారైనయెడల నాదేవతలనుగూడ, చెఱుపవే = చంపవా. నీవు నిశాచరుఁడవు. వాతాపి నిశాచరుఁడు గాన నిరువు రొకతెగవారు. కాననే యాతనివద్ద నీజీర్ణముగానివిద్య నభ్యసింవఁగలిగితివి. శీతకిరణ యనుటచేఁ జలిదియన్నమువలె నీవు జీర్ణము గాకుంటి వనుభావ మూహ్యము. సురు లనక సుర లనుటకు సుగశబ్దము నిత్యముగా స్త్రీసమం బని బాలవ్యాకరణము. “చంద్రమా జాయతే పునః నవోనవో భవతి జాయమానః ... ప్రచంద్రమాః” ఇత్యాదులచేఁ జంద్రుఁడు మాటిమాటికిఁ బుట్టి వృద్ధినొందుచుండు నని తెలిసికొననగును.

తా. జీర్ణింపక మఱల వెడలి వచ్చు నీరీతిని వాతాపిరాక్షసునియొద్ద నేర్చుకొంటివా యేమి? దేవతలు చావులేనివా రగుటచే నినుఁ దినియుఁ జావరైరి గాని లేనిచో నశింపఁజేయవా? (వాతాపి యనురాక్షసుఁడు మేఁకయై మునివేషధారి యగువానితమ్ముఁ డిల్వలునిచే నతిథు లగుమునులకు మాంసభోజనమునకు తాను వండిపెట్టఁబడుటయుఁ వా రామాంసము భుజించినతోడన కడుపుఁ జించుకొని స్వస్వరూపముతో బయల్వెడలి వచ్చినయామునులను రక్షించుటయుఁ బురాణప్రసిద్ధము.)

తే.

త్రిపురసంహార మొనరించునపుడు హరుఁడు
బండికల్లుగ నీమేను గండి చేసె
నదియు నెలవాఱి తెగటాఱ వైతి చంద్ర
యకట! రోహిణియెడ నపథ్యమునఁ జేసి.

40

టీ. చంద్ర! హరుఁడు = శివుఁడు, త్రిపురసంహారము = రాక్షసుల మూఁడుపురములయొక్కయు వినాశమును, ఒనరించునప్పుడు = చేయునపుడు, బండికల్లుగన్ = రథచక్రముగా, నీమేను = నీశరీరమును, గండి చేసెన్ = తొలఁచి రంధ్రము చేసెను. అదియున్ = ఆరంధ్రపుగాయమును, సెలవాఱి = సెల వేసి, రోహిణియెడన్ = ప్రియసతియగు రోహిణివిషయమున, అపథ్యమునన్ చేసి = (సంసర్గమును) అపథ్యమువలన (దోషించి), తెగటాఱవైతి = చావవైతివి. అయ్యో = అక్కటా (పా. అపథ్యంబు గలిగి) చంద్రునకుఁ దక్కినగ్రహాదులకంటె రోహిణి మిగులఁ బ్రియమగుభార్య గాన రోహిణీసంగమము చెప్పఁబడెను.

శ్లో. హేరోహిణి త్వమసి వాత్రి చరస్య భార్యా.”

(శృంగారతిలకము)

తా. చంద్రా! శివుఁడు త్రిపురసంహారము చేయునాఁడు నీశరీరమును బండిచక్రముగఁ జేసికొని గండి పొడిచెను. ఆగండి సెలవేసి రోహిణీసమాగమమువలన దోషించి చావనైనఁ జావకపోతివిగదా! మేము నీచే హింస లొందవలసిన యోగ ముండుటచేతనే నీవు బ్రదికితివి.

తే.

పాలఁ బుట్టినమాత్రాన మేలిగుణము
నేఁడు నీ కేల గల్గునో నీరజారి
నీటఁ బుట్టినవాఁడు కాఁడోటు వహ్ని
గాల్చుచున్నాఁడు జగ మెల్లఁ గరుణ లేక.

41
టీ. ఓనీరజారి = చంద్రా! పాలన్ = (పాలసముద్రమం దనుట) క్షీరమునందు, పుట్టినమాత్రానన్ = జననము నొందినంతమాత్రముచేతనే, నేఁడు = ఈదినము, మేలిగుణము = ఉత్తమభావము, నీకున్, ఏల కల్గున్ = ఏవిధముగాఁ గలుగఁగలదు? మంచిగొనములు గలుగుటకు మంచితావునఁ బుట్టుట యెన్నఁటికిఁ గారణము కాఁజాలదు. ఎటులన, నీటన్ = జలమున, పుట్టినవాఁడు కాఁడోటు = పుట్టినవాఁడు కాఁడా యేమి? వహ్ని = అగ్ని, జగ మెల్లన్ = లోకమంతయు, కరుణలేక = దయలేక, కాల్చుచున్నాఁడు = దహించుచున్నాఁడు. నీరజారి యను సంబోధనముచే నీతోఁబుట్టువు లగు నీరజములకే పగవాఁడ వగు నీవు పుట్టు వొకచోటనే గల యచ్చరలయెడఁ గనికరింతువా యని స్వారస్యము.

తా. నీటఁ బుట్టి యగ్నిహోత్రుఁడు జగ మెల్లఁ గాల్చుచున్నాఁడు. పాలఁ బుట్టినమాత్రాననే నీకుమాత్రము మంచిగుణము కల్గునా యేమి?

అలం. ప్రతివస్తూపమాలంకారము.

క.

గోవధము సేయు తురకల
దైవంబవు నీవు మొదలఁ దక్కక పాంథ
స్త్రీవధము సేయ రోయుదె
నీవర్తన మేమి చెప్ప నీరజవైరీ.

42

టీ. నీరజవైరీ = చంద్రా! నీవు, మొదలన్ = మొదలనే, గోవధము = గోవులహింసను, చేయుతురకలదైవంబవు = చేయునట్టితురకలకు దేవుఁడవు (తురుష్కులు చంద్రోదయమును జూచికాని నమాజు మొదలగునవి చేయరు.) తక్కక = మానక, పాంథస్త్రీవధము = విరహిణీవధము, చేయన్ = చేయుటకు, రోయుదె = రోఁతపడుదువా? నీవర్తనము = నీనడువడి, ఏమి చెప్పన్ = ఇంక నే మనఁగవచ్చును?

తా. చంద్రా! తొల్తనే నీవు గోవులం జంపి తినుతురకలకు దైవమవు ఇట్టి నీ వింక విరహిణీస్త్రీలను జంపుట కేవగించుకొందువా! నీ నడువడి నేమనవచ్చు? భక్తులచే గోవధఁ జేయించు మహానుభావుఁడ వగు నీవు పంచమహాపాతకములఁ జేయుటలో వెనుకాడుదువా? అందు విరహిణీస్త్రీవధము నీకు మఱియుఁ జులకనకదా!

అలం. అర్థాపత్త్యలంకారము.

క.

విడువక తలపయిఁ గొన్నా
ళ్లిడి చూచి కళంకి వగుట యెఱిఁగి మహేశుం
డుడుకుచు దక్షాధ్వరమున
నడుగునఁ బడవైచె దాన నడఁగవు చంద్రా.

43

టీ. చంద్రా! ఓ చందమామా! (నిన్ను) మహేశుండు = శివుఁడు, విడువక = మానక, తలపయిన్ = తలమీఁద నలంకారముగా, కొన్నాళ్లు = కొన్నిదినములు, (నీగుణ మెఱుంగరానియంతవఱకు) ఇడి = ఉంచుకొని, చూచి, కళంకివి = కళంకము గలవాఁడవు — అపవాదము గలవాఁడవు, అగుట = ఐయుండుట, ఎఱిఁగి = తెలిసికొని, ఉడుకుచున్ = కోపించుచు, దక్షాధ్వరమునన్ = దక్షునియజ్ఞమున, అడుగునున్ = కాలిక్రింద, (వీరభద్రాకృతి గలవాఁడై), పడవైచెన్ = పడవైచి త్రొక్కెను. దానన్ = ఆకాలిక్రిందఁ బడి చెందిన నలుగుడుచేనైనను, అడఁగవు = నశింపవైతివి, చచ్చినవాఁడవు కాకపోతివి!

తా. చంద్రా! శివుఁడు నిన్నుఁ గొన్నాళ్లు తలపైఁ దాల్చి చూచి నీకళంకము నెఱిఁగి దక్షయజ్ఞమున వీరభద్రమూర్తియై కాలిక్రింద నలుగఁద్రొక్కెను. అప్పుడును జావవైతివి గదరా!

అలం. విశేషోక్త్యలంకారము.

క.

గాండీవము నీచేతిది
పాండవునిన్ జేరఁబట్టి బ్రతికితి మా వి
ల్లుండిన నేఁడు నిశాచర
చెండవె యల్లునికిఁ దోడు శితభల్లములన్.

44

టీ. నిశాచరరాత్రులయందుఁ జరించు నోరాక్షసుఁడా! చంద్రుఁడా! నీ చేతిది = నీచేతిలో నుండెడిది, గాండీవము = గాండీవ మనువిల్లు, పాండవునిన్ = అర్జునుని, చేరఁబట్టి = చేరుటచేతనే, బ్రతికితిమి = జీవించియున్నారము, ఆవిల్లు = ఆగాండీవధనుస్సు, ఉండినన్ = (నీచేతనే) ఉన్నయెడల, నేఁడు = ఈదినము - ఇప్పుడు, ఈవిరహావస్థయందు, అల్లునికిన్ = మేనల్లుఁడగు మన్మథునికి, తోడు = సహాయముగా, శితభల్లములన్ = వాఁడిములుకులచే, చెండవె = ఖండింపక యూరకుందువా? ఖండించితీరెదవు.

పూలములఁకులతోడను జెఱకువింటితోడను నీయల్లుఁడే ప్రాణములు తీయుచుండ నంతకు గొప్పవాఁడవును మామ వగునీవు గాండీవమె యున్నచో వాఁడిబాణము లేయుటలో నాశ్చర్య మేమున్నది? నీవు నిశాచరుఁడవు గాన నెపుడో చంపెడివాఁడవు. తా. ఓరి నిశాచరుఁడా! మున్ను నీచేనున్న గాండీవ మాయర్జునునిచేఁ జిక్కెఁ గావున బ్రతికితిమిగావలయు. అట్లుకాక యావిల్లు నీచేతనే యుండినచో మేనల్లునకుఁ దోడుగా వాఁడిములుకు లేసి మమ్ముఁ జెండాడవా?

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

వ.

కాని పలికి యక్కలికి తేనియ లొలుకు పూములుకుల జళుకుం
బుట్టించు నించువిలుతు నుద్దేశించి.

45

టీ. అని పలికి = అని వాకొని (ఇట్లు చంద్రుని నిందించి,) అక్కలికి = ఆస్త్రీ, వరూథిని, తేనియ లొలకు పూములుకులన్ = తేనెలు చిందు పుష్పబాణములచే, (అవి విషము పూసిన ములుకులవలె నయ్యె నని వ్యంజితము) జళుకు = భయమును, పుట్టించు = కలఁగఁజేయు, ఇంచువిలుతున్ = మన్మథుని, చెఱుకవింటివానిని, ఉద్దేశించి = గుఱించి.


చ.

తొడిఁబడఁ బాఱి పైకుఱికి ధూర్జటి కంటికడిందిమంటలో
నడపొడ గానరాక తెగటాఱియుఁ గాలినయట్టిమ్రోడుకై
వడి రతిలోచనాంబువులవాన నిగిర్చితె పాంథబాధకై
మడియ కనంగయవ్వెలఁదిమంగళసూత్రమహత్త్వ మెట్టిదో.

46

టీ. అనంగ = శరీరము లేనివాఁడా! మన్మథుఁడా! తొడిఁబడన్ = తత్తఱపడఁగా, పాఱి = పర్వెత్తి, పైకిన్ = (శివునిమీఁదికి) ఉఱికి, ధూర్జ...మంటలోన్ - ధూర్జటి = శివునియొక్క, కంటి, కడిందిమంటలోన్ = తీవ్రాగ్నిలో, అడపొడ గానరాక = ఉన్నయునికియే కన్పడకుండునట్లు, తెగటాఱియున్ = నశించియు, కాలినయట్టి మ్రోడుకైవడిన్ = (కారుచిచ్చుచే) మాడిపోయిన వృక్షమువలె, మడియక = చావక, రతి...వానన్ - రతియొక్క, లోచనాంబువుల = కన్నీళ్లయొక్క, వానన్ = వర్షముచే, దుఃఖాతిశయముచే వానచినుకులవలె నెడతెగకుండ రాలుచున్న కన్నీటిచే, పాంథబాధకై = విరహులహింసకొఱకై, ఇగిర్చితె చిగిర్చితివా, ఆవ్వెలఁది...హత్త్వము - అవ్వెలఁది = ఆరతియొక్క, మంగళసూత్రమహత్త్వము = తాలిబొట్టుయొక్క సామర్థ్యము, ఎట్టిదో = ఎంత యద్భుతమైనదోగదా! శివలోచనాగ్నిచే మన్మథుఁడు బూది యయ్యెను. రతి విలపింపఁగా శివుఁ డనుగ్రహించి యనంగుఁడుగా నుండునటుల వరమును బ్రసాదించెను. కాన మన్మథుఁ డనంగుఁడై యుండఁగలుగుట రతి కన్నీటియొక్కయు మంగళసూత్రముయొక్కయుఁ జలువవలన.

తా. మన్మథా! శివునికంటిమంటలో రూపఱియు, కాలినమ్రోడువలెఁ జావక రతియొక్క కన్నీటివానచేఁ దిరిగి మాబోంట్ల హింసించుటకై చిగిర్చితివా? ఆమె మంగళసూత్రమహత్త్వ మెట్టిదో గదా! శివునికంటిమంటను మన్మథుఁడు భస్మము కాఁగాఁ బిదప రతివిలాపము నాలించి శివుఁ డామెకు మన్మథునకుఁ జావు లేనట్లు వర మిచ్చె ననియుఁ బురాణకథ.

అలం. విషమము, ఉత్ప్రేక్ష, ఉపము, హేతువులు.

శా.

సాహంకారత శంకరుం డలిగి నేత్రాగ్నిన్ బయిన్ బంపినన్
స్వాహాకాముకుఁ డౌట ని న్నతఁడు గావంబోలు మోమోడిసం
దేహంబేని రతీశ నీవు మగుడన్ దేహంబుతో నుండు టె
ట్లాహా! దైవము దోసకారులకె తోడై వచ్చు నెప్పట్టునన్.

47

టీ. రతీశ = మన్మథా! సాహంకారతన్ = గర్వముతోఁ గూడియుండుటచేత, నీవు గర్వించినవాఁడ వగుటచేత, శంకరుండు = శివుఁడు, అలిగి = కోపించి, నేత్రాగ్నిన్ = కంటిమంటను, పయిన్ పంపినన్ = నీమీఁదికిఁ బంపఁగా, అతఁడు = ఆప్రయోగింపఁబడిన యగ్నిహోత్రుఁడు, స్వాహాకాముకుఁడు = స్వాహాదేవిని గామించినవాఁడు, అగుటచే, మోమోడి = కామమును గలిగించు నీకు నపకృతిఁ జేయలేక మొగమోటపడి, కావంబోలున్ = కాపాడియుండవచ్చును. సందేహంబు ఏనిన్ = (ఈవిషయమున) సందియ మయినపక్షమున, నీవు, మగుడన్ = తిరిగి, దేహంబుతోన్ = శరీరముతో, ఉండు టెట్లు = ఉండుట యెటుల సిద్ధించును? దైవము = దేవుఁడు, దోసకారులకే = పాపపుఁబను లొనర్చువారికే, ఎప్పట్టునన్ = ఎప్పుడును, తోడై వచ్చున్ = సాయమై వచ్చును. ఆహా = ఇది యాశ్చర్యము.

మన్మథుఁడు ఇంద్రుఁడు మొదలగువారిప్రేరణచేతనేగాక యహంకారముచేతఁ గూడ శివునిపైకి విజృంభించెను. మన్మథుఁడు సాహంకారి యనుట కతనివాక్యములు.

శ్లో. "ప్రసీద విశ్రామ్యతు వీర వజ్రం శరైర్మదీయైః కతమః సురారిః,
    బిభేతు మోఘీకృత బాహువీర్యః స్త్రీభ్యో౽సి కోపస్ఫురితాధరాభ్యః.
శ్లో. తవ ప్రసాదాత్ కుసుమాయుధో౽పి సహాయ మేకం మధు మేవలబ్ధ్వా,
    కుర్యాం హరస్యాపి పినాకపాణేః ధైర్యచ్యుతిం కేమమధన్వినో౽న్యే.”

(కుమార సం. తృ. స.)

తా. మన్మథా! ఎదిరి నెఱుఁగక వర్తించు నీగర్వమునకు శంకరుం డాగ్రహించి నీపైకి నేత్రాగ్నిని బ్రయోగింపఁగా నాయగ్నిహోత్రుఁడు స్వాహాకాముకుఁ డౌటచే మొగ మోడి నిన్నుఁ జంపఁ డయ్యెను. కానిచో నీవు తిరిగియు దేహముతో నుండు టెట్లు? ఆహా! దైవము సైతము పాపాత్ములకే తో డగుచుండును గదా?

అలం. అర్థాంతరన్యాసాలంకారము.

చ.

జడ నొకయింతలేని నెఱచక్కఁదనంబుల నెల్లఁ గూర్పఁగాఁ
బొడ వయినట్టి ధన్యుఁడవు భోగివి పూవిలుకాఁడ విట్టి నీ
వెడపక నిష్ఠురత్వమున కె ట్లలవాటుగఁ జేసి తక్కటా!
పడఁతులమీఁద నేయ రతిపయ్యెదకున్ ననువైన చేతులన్.

48

టీ. జడను = మాంద్యము, ఒకయింత = ఇంచుకైనను, లేని, నెఱచక్కఁదనంబులనెల్లన్ = నిండుసౌందర్యములనన్నిటిని, కూర్పఁగాన్ = రాశి చేయఁగా, పొడవు = ఆకారముగా, అయినట్టి ధన్యుఁడవు = ఏర్పడిన కృతార్థుఁడవు. మిగులఁ జక్కఁదనము గలిగి లోకోత్తరుఁడవై వర్తించువాఁడవు, భోగివి = భోగముల ననుభవించువాఁడవు, పూవిలుకాఁడవు = పూవులు విల్లుగాఁ గలవాఁడవు. ఇట్టినీవు = ఇట్టిమృదులక్షణములు గలవాఁడ వగునీవు, రతిపయ్యెదకున్ = రతీదేవిపైఁటకు, ననుపు = ప్రియము, ఐనచేతులన్ = అగునట్టిచేతులతో, ఎడపక =ఎడతెగక, పడఁతులమీఁదన్ = స్త్రీలపై, ఏయన్ = ప్రయోగించునట్లు, బాణప్రయోగము చేయునంతటి, నిష్ఠురత్వమునకున్ = కాఠిన్యమునకు, ఎట్లు, అలవాటుగన్ = అభ్యాసముగా, చేసితి = కావించితివి, అక్కట = అయ్యో!

మన్మథుఁడు చక్కనివా రందఱికంటెను మిగులఁ జక్కనివాఁడు. రతీదేవి ప్రలాపించుచు నీయభిప్రాయమునె చెప్పెను.

శ్లో. “ఉపమానమభూద్విలాసినాం కరణం యత్తవ కాంతిమత్తయా,
    తదిదం గతమీదృశీం దశాం న విదీర్యే కఠినాః ఖలు స్త్రియః.”

(కుమార. చతు.)

తా. మన్మథా! నీవు లోకమునందలి నిండుచక్కఁదనముల నెల్లఁ బ్రోవు చేసి యేర్పఱుపఁబడిన ట్లున్నసౌందర్యము గలవాఁడవు, మిగుల భోగపురుషుఁడవు. మృదుళము లైనపూలు విల్లుగాఁ దాల్చువాఁడవు. ఇట్టి నీవు రతీదేవియొక్క నునుపైఁట నంటఁదగిన యెలచేతులను విరహిణులపై బాణములు ప్రయోగించుపాటి కఱకుఁదనమున కె ట్లలవాటు చేసితివి?

అలం. విషమాలంకారము.

తే.

అనుచు నిందించి వలవంత యినుమడింప
నవ్వరారోహ విదళితహల్లకముల
కమ్మపుప్పొడిపై దుమారమ్ము రేఁచు
మలయమంథరపవనుపై నలుక వొడమి.

49

టీ. అనుచున్ = ఇటులని, నిందించి = (మన్మథుని) దూషించి, వలవంత = మదనతాపము, ఇనుమడింపన్ = రెట్టింపఁగా, అవ్వరారోహ = (నెఱిపిఱుఁదులు గల) ఆస్త్రీ, విద...దుమారమ్ము - విదళిత = విరియఁ జేయఁబడిన, హల్లకముల = ఎఱ్ఱగలువలయొక్క, కమ్మపుప్పొడి = కమ్మనివాసన గలపుష్పపరాగముయొక్క, పైదుమారమ్ము = మీఁదిధూళిని, రేఁచు...తమపైన్ - రేఁచు = తనపైకి రేఁగించు, మలయమంథరపవనుపైన్ = మలయపర్వతమునుండి వచ్చు మందమారుతముమీఁద, అలుక = కోపము, పొడమి = కలిగి, దీనికి ముందున్న వచనములోని “అని పలికి” యనుదానితో నన్వయము.

మలయమంథరపవన మనుటచే మలయగిరినుండి గందపుఁదావులతో వీచునది యనియు, మంథర మనుటచే నెఱ్ఱగలువలపుప్పొడి బరువున మెల్లఁగా వీచుచున్న దనియు భావము. ముందుపద్యములోని గంధవాహ యనుసంబోధనచే నీభావము సువ్యక్తము.

తా. అని యీపైనిఁ జెప్పినచొప్పున వరూథిని మన్మథుని నిందించి మన్మథతాపము హెచ్చఁగా నెఱ్ఱకలువలపుప్పొడితోఁ జల్లఁగా వీచుచున్న పరిమళముతోడి దక్షిణపుగాలి సోఁకులకుఁ దాళలేక యాగాలిపైఁ గోపించినదై యని తా.

అలం. కావ్యలింగము.

ఉ.

అక్కట గంధవాహ తగవా హరిణాంకునిఁ గూడి పాంథులన్
బొక్కఁగఁ జేయఁ బావకునిపొం దొనరించి జగము లేర్చునీ
యక్కొఱగామి మాన వది యట్టిద చుల్కనివృత్తిదుర్జనుం
డొక్కనిఁ జొచ్చి క్రిందుపడు నొండ్లకుఁ గీ డొనరింపగల్గినన్.

50

టీ. అక్కట! గంధవాహ = (సుగంధమును మోయు) మారుతమా! హరిణాంకునిన్ = చంద్రుని, కూడి, పాంథులన్ = విరహులను, పొక్కఁగఁ జేయన్ = పరితపింపఁజేయుట, తగవా = యుక్తమా, పావకుని పొందు = అగ్నిచెల్మి, ఒనరించి = చేసి, జగమ్ములు = లోకములు, ఏర్చునీయక్కొఱగామి = కాల్చునట్టి నీ (అగ్నివలన నేర్చుకొన్న) యాపనికిమాలినతనము, మానవు, అది యట్టిది అ = అగునది యట్లే, ఆదుష్టస్వభావ మటువంటిదే. దుర్జనుండు = దుష్టుఁ డయిన మనుష్యుఁడు, ఒండ్లకున్ = ఇతరులకు, కీడు = అపకారము, ఒనరింపన్ = చేయుటకు, కల్గినన్ = వీలు కలిగినయెడ, చుల్కనివృత్తిన్ = నీచవ్యాపారమున, ఒక్కనిన్ = ఒండొకని, చొచ్చి = చేరి, క్రిందు పడున్ = లోఁబడును. అల్పవ్యాపారమునం దింకొకదుష్టునిఁ జేరి లోఁబడి యుండు ననుట.

గంధవాహుఁడు పావకుని పొందొనరించిన విధము — ఆగ్నేయమూలకు నంటియుండునది దక్షిణదిశ. అటనే మలయపర్వతము గలదు. అటనుండి వీచుగాలియే మలయపవనము! ప్రక్కన నగ్ని గలఁడు గాన నగ్నితోడ జెలిమి చేసె ననుటకుఁ గారణములు.

తా. అయ్యో! మారుతమా! ఇది నీకుఁ దగునా? చంద్రునితోఁ గూడి విరహులను మాడ్చుచుంటివే. అగ్నితోఁ గూడి లోకములఁ గాల్చు పనికిమాలినతనము మానవైతివి. అవు నదియంతే. దుర్మార్గుఁ డొకరికి కీడు చేయ నందు గుదిరినప్పుడు వేరొకదుష్టునిఁ గూడి యానీచకృత్యమున వానికి లోఁబడును గదా!

అలం. అర్థాంతరన్యాసపరికరాలంకారములు.

క.

నాలుకలు రెండు నిన్నున్
గ్రోలనె కల్పించె నలువ ఘోరాహికి న
న్నాలిగ్రహ మిపుడుఁ దెగఁ దినఁ
జాలద మృదుపవన విరహిజనదురితమునన్.

51

టీ. మృదుపవన = చల్లగాలీ! నలువ = చతుర్ముఖుఁ డగుబ్రహ్మ, ఘోరాహికిన్ = భయంకరమైన సర్పమునకు (జాత్యేకవచనము), నాలుకలు రెండు = రెండునాలుకలు (పాము ద్విరసన మనుపేరు గలది) నిన్నుం గ్రోలనే = నిన్నుఁ దినుటకె, కల్పించెన్ = కలుగఁజేసెను. అన్నాలిగ్రహము = ఆకుత్సితపిశాచము, (పాము వేయేండ్లు జీవించినఁ బిశాచ మగు నందురు.) ఇప్పుడును = ఇప్పటికిని, విరహిజనదురితమునన్ = వియోగి జనులపాపము కారణమున, ప్రియుల నెడబాసి తపించు మాబోంట్లపాపము చేతనేమో! తెగఁదినఁజాలద = మొదలంటఁ దిననే లేకుండెను.

తా. మలయమారుతమా! బ్రహ్మ సర్పములకు రెండేసినాల్కలు నిన్ను మ్రింగుకొఱకే కల్పించెను. అయినను మాబోఁటి విరహిజనుల పాపముచే నిప్పటికిని నాసర్పములు నిన్ను నిశ్శేషముగా మ్రింగివేయనే లేకున్నవి.

అలం. విశేషోక్త్యలంకారము.

వ.

అని పలికి యక్కలకంఠకంఠి దీపించుతాపంబుపెల్లున మూర్ఛిల్లినం దోడిపల్లవోష్టు లల్లనల్లన హల్లకంబుల హిమాంబుపూరంబులం గర్పూరపటీరకర్దమాసారంబులం జెంగావుల మృణాళభంగంబుల నంగంబులకుం జలువ పుట్టింప నెట్టకేలకుం దెలిసె నంతఁ బ్రభాతసమయం బగుటయు నొక్కపువ్వుఁబోఁడి వరూథినితో నిట్లనియె.

52

టీ. అని = ఇటులని, పలికి = మలయమారుతమును నిందఁ గావించి, అక్కలకంఠకంఠి = కోయిలపల్కు గల యావరూథిని, దీపిం...పెల్లునన్ - దీపించు = ప్రజ్వలించు, తాపంబు = మన్మథతాపపు, పెల్లునన్ = అతిశయముచే, మూర్ఛిల్లినన్ = మూర్ఛ నొందఁగా, చూచి = చూచినవారై, తోడిపల్లవోష్ఠులు = వరూథినితోఁ గూడియున్న చిగురాకువంటి పెదవిగల చెలిమికత్తెలు, అల్లనల్లన = మెల్లమెల్లఁగా, హల్లకంబులన్ = కలువలచేతను, హిమాంబుపూరంబులన్ = పన్నీటివెల్లువలచేతను, కర్పూ...బులన్ - కర్పూర = కర్పూరము చేర్చిన, పటీర = గంధముయొక్క, కర్దమ = పంకముయొక్క, ఆసారంబులన్ = ఎడతెగని చల్లుటచేతను, చెంగావులన్ = చెంగావివల్వలచేతను, మృణాళభంగంబులన్ = తామరతూండ్లతుంపులచేతను, అంగంబులకున్ = అవయవములకు, చలువ = చల్లఁదనము, పుట్టింపన్ = కలుఁగఁజేయఁగా, శిశిరోపచారములు చేయఁగా ననుట. ఎట్ట కేలకున్ = బహుప్రయత్నమున, తెలిసెన్ =(స్మృతి) తెలిసెను. అంతన్ = అప్పుడు, ప్రభాతసమయంబు = తెల్లవారుసమయము, అగుటయున్ = కాఁగా, ఒక్కపువ్వుఁబోఁడి = ఒకపూలవంటి మనోహరాంగకములం గల చెలువ, వరూథినితోన్ = వరూథినిని గూర్చి, ఇట్లనియెన్ = ఇట్లు పలికెను.

చెంగావికిని ఉదయచ్చంద్రచంద్రికకును సామ్యము గలదు, చెంగావి యుదయచ్చంద్రికవలెఁ జల్లనైనది. చంద్రిక వేఁడిగ నుండును. చంద్రికవలె నించుక నెఱ్ఱగా నుండు చెంగావి చల్లగా నుండును. విరహిణికిఁ జెంగావి తాపహారి యనుటకు —

దమయంతికిఁ జెలులు చేయు శిశిరోపచారభాగమునుండి దృష్టాంతము,

సీ. “వలిపెంపుఁజెంగావివలువ గప్పు చకోరి బిసకాండహారంబు పెట్టు హరిణి”

(శృం.నై. ఆ.2)

తా. ఇట్లు పలికి వరూథిని తాపము హెచ్చి మూర్ఛిల్లె, నెచ్చెలులు బహువిధోపచారములఁ జేసి తేర్చిరి. అంతఁ దెల్లవాఱువేళ యయ్యె. అప్పు డొకచెలి వరూథినితో నిట్లనియె.

ఉ.

పాటన సేయమిన్ గురులు పైఁబడి శీర్ణపటీరపంకలా
లాటిక మై దరస్మితవిలాసపుఁజంద్రిక డొంకి వాడుటన్
దేటఁదొఱంగి విన్న నగునీమొగమోయన మాసిచంద్రుఁడో
పాటలగంధి వ్రాలె నదె భానురుచిన్ దనకందు మీఱఁగన్.

53

టీ. ఓ పాటలగంధి = పాటలపుఁబూవులపరిమళముఁ బోలుపరిమళము గలదానా! పాటన సేయమిన్ = చక్కపఱుపకపోవుటచే — దువ్వకపోవుటచేత, కురులు = వెండ్రుకలు, పైఁబడి = పైని గ్రమ్ముకొని, శీర్ణ...లాటిక మై - శీర్ణ = చెదరిన, పటీరపంక = మంచిగందముచే నైన, లాలాటికమై = పాపటబొట్టు కలదై, దర...జంద్రిక - దరస్మిత = చిఱనగవుయొక్క, విలాసపుఁజంద్రిక = వికాస మనువెన్నెల, డొంకి = తగ్గి, వాడుటన్ = వాడిపోవుటచేత, తేట = ప్రసన్నత, తొఱంగి = మాసి, విన్ననగు = చిన్నవోయిన, నీమొగమో అనన్ = నీముఖమేమొ యనునటుల - నీముఖమువలె, మాసి = కాంతితగ్గి, భానురుచిన్ = సూర్యకాంతిచే, తనకందు = తనకళంకము, మీఱఁగన్ = హెచ్చఁగా, అదె వ్రాలెన్ = అస్తమించెను.

కురులు మోమునందు జారిన వరూథినిముఖము కళంకముతో నున్నచంద్రబింబమును బోలియుండెను. ఆచంద్రుఁడు భానురుచిచేఁ గాంతిమాసినచంద్రుఁడు. వరూథినిమోమునఁ జిఱునవ్వును గాంతిలేమిచే నదియుఁ గాంతి కోలుపోయిన చంద్రునివలె నున్నది. అద్దపుబిళ్లవలెఁ జంద్రుఁడు గానవచ్చునటులు వరూథినిముఖము మంచిగంద మంటఁగట్టిన పాపటబొట్టువలె నున్నదని భావము.

తా. ఓపాటలగంధీ! చిక్కులు దీర్చి దువ్వి చక్కపఱుపకపోవుటచేఁ జెదరి నీవెండ్రుకలు క్రమ్ముకొని మంచిగంద మంటి యట్టవలెఁ గట్టి పాపటబొట్టుచందమునఁ గానరాఁగా చిఱునగవుపొలుపు తగ్గి, వాడి చిన్నవోయియున్న నీమొగమో యనునట్లు సూర్యునివెలుఁగుచేఁ దనకాంతి మాసి కళంక మెక్కువ కాఁగాఁ జంద్రుఁడు అస్తమించెను.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

సీ.

సకుటుంబముగ వీఁగి చరమశైలముఁ జేరు
          తుహినాంశుదుముదారుదొర యనంగ
నాసీర మై వచ్చునలినబాంధవుటెక్కి
          యంబుపై దీపించు నద్ద మనఁగ
నరుణాగ్రనిబిడవాద్యములలోఁ గనుపట్టు
          సమయశాంఖికుచేతిశంఖ మనఁగ
నినుఁ డప్పు డజుఁ డౌట మునుమున్న పడివాగెఁ
          గొనివచ్చురాయంచుకొదమ యనఁగ

తే.

నుదయగిరిమీఁదఁ గోపురం బుండి నిగుడు
నహితరవిరశ్మిచే బద్ధుఁ డగుచుఁ దోడి
బలఁగమైనట్టిచుక్కలవలసత్రోవఁ
జూప నేతెంచె నన వేగుఁజుక్క వొడిచె.

54

టీ. సకుటుంబముగన్ = ఆలుబిడ్డలతో, వీఁగి = (సూర్యుఁడను) శత్రునకు భయపడిపాఱి, చరమశైలమున్ = పడమటికొండను, చేరు = చేరుటకుఁ బోవుచున్న (వలసపోవుచున్న) తుహి...దొర - తుహినాంశు = చంద్రునియొక్క, దుముదారుదొర = (రాజునకు వెనుక కాపుదలయై యుండెడు) సేనానాయకుఁడో, అనంగన్ = అనునట్లుగాను, నాసీరమై = సేనాముఖమై — దండునకుముందు నడచునదియై, వచ్చు = వచ్చుచున్న, నలినబాంధవుటెక్కియంబుపైన్ = సూర్యునిధ్వజముమీఁద, దీపించు నద్దము అనఁగన్ = ప్రకాశించు ఆద్దమేమో యనునట్లు, ఆరు...లలోన్ - అరుణాగ్ర = సూర్యునిముందఱ, నిబిడ = ఎడతెగని, వాద్యములలోన్ = భేరి మొదలగు వాద్యములయందు, కనుపెట్టు = కనఁబడుచున్న, సమయ...శంఖము - సమయ = కాల మను, శాంఖికు = శంఖమూఁదువానియొక్క, చేతిశంఖము = చేతిలోని శంఖమేమో, అనంగన్ = అనునట్లు, ఇనుఁడు = సూర్యుఁడు, అప్పుడు = ఆకాలమునందు-ఉదయకాలమునందు, అజుఁ డౌటన్ = బ్రహ్మ యగుటచే, (సూర్యుఁ డుదయమున బ్రహ్మ, మధ్యాహ్నమున రుద్రుఁడు, అస్తమానమున విష్ణువు నగు నని చెప్పఁబడును.) మునుమున్న = ముందుముందుగా, పడివాగెన్ = ఎక్కుటకు సిద్ధపఱుపఁబడినతీరున, కొనివచ్చు = ఎదటికిఁ దీసికొనివచ్చుచున్న, రాయంచకొదమ = చిఱుతప్రాయంపురాజహంస, అనఁగన్, ఉదయగిరిమీఁదన్ = పొడుపుకొండమీఁద, కోపురంబుండి = పగవారిని దెలిసికొనుటకొఱకు పొంచుండి, నిగుడు...రశ్మిచేన్ - నిగుడు = ముందునకుసాగు, అహిత = శత్రుఁడగు, రవి = సూర్యునియొక్క, రశ్మిచేన్ = కిరణము లనుత్రాటిచే, బద్ధుఁ డగుచున్ = కట్టఁబడినవాఁ డగుచు, తోడి = తనతోడి దగు, బలఁగము = ఆత్మజనము, ఐనట్టిచుక్కల = ఐననక్షత్రములయొక్క, వలసత్రోవన్ = విప్లవమునకు వెఱచి ప్రాణార్తులై యితరదేశములకు బ్రదుకఁబోవు త్రోవను, చూపన్ = చూపించుటకు, ఏతెంచెనో యనన్ = వచ్చెనేమో యనునటుల, వేగుఁజుక్క = తెల్లవారుచుక్క (శుక్రుఁడు), పొడిచెన్ = ఉదయించెను.

అలం. ఉత్ప్రేక్షారూపకాలంకారములు.

మ.

సకలాశాగతినర్మకోపవిరతిశ్రౌతక్రియారంభణా
త్మకవర్గత్రయికిన్ మదుచ్ఛరితశబ్దజ్ఞానమే మూలమిం
తకుఁ బోలన్ వినుఁ డంచుఁ దెల్పుగతిఁ జెంతన్ గొండపై పల్లెలన్
గృకవాకుల్ మొరసె గృహోపరిఁ ద్రిభంగిన్ భుగ్నకంఠధ్వనిన్.

55

టీ. సక...త్రయికిన్ = సకలాశాగతి = (పనిపాటులకు జనులు) ఎల్లదిక్కులకుఁ బోవుట —జనులు స్వకార్యములు నిర్వర్తించుకొనుటకు నెవరిదారిని వారలు యథేచ్ఛముగాఁ బోవుట. నర్మకోపవిరతి = ప్రణయకోపముయొక్క చల్లారుట, స్త్రీపురుషులు పొలయలుకను మానుకొని రతులకు దొరకొనుట, శ్రౌతక్రియారంభణ = వేదచోదితములైనకర్మలఁ జఱుప నారంభించుట — వేదవిహితములగు స్నానసంధ్యాద్యనుష్ఠానములు వేళ దాటనీయక నెఱువేర్చుట, ఆత్మక = (అనునీ)రూపమైన, వర్గత్రయికిన్ = త్రివర్గమునకు, (అర్థ, కామ, ధర్మ పురుషార్థములందుఁ బ్రవృత్తికి), మదుచ్చరితశబ్దజ్ఞానమే = నాచేఁ బలుకఁబడిన పలుకుయొక్క యెఱుకయే — ధ్వని వినుటచేఁ గలిగిన మెలఁకువయే, మూలము = ఆధారము, ఇంతకున్ = ఈవిషయమునకు, పోలన్ = సరిగా, వినుఁడు = (లోకులారా) ఆలకింపుఁడు, అంచున్ = అని, తెల్పుగతిన్ = తెలియఁజేయువిధముగా, చెంతన్ = సమీపమునందున్న, కొండపై పల్లెలన్ = కొండమీఁదిపల్లెలలో, గృహోపరి = ఇండ్లమీఁద, కృకవా కుల్ = కోళ్లు, భుగ్నకంఠధ్వనిన్ = వంగినకంఠపుధ్వనితో, త్రిభంగిన్ = ముత్తెఱఁగుల, మొరసెన్ = కూసెన్.

ఏదేని పదిమంది యాలకింపవలసిన యంశముఁ జెప్పువాఁడు ఎత్తగుస్థలమునందుండి చెప్పినచో నలువురు తొలుత చూచి తఱువాత విన వీలుకలుగును. గాన కోర్టు ఉన్నతస్థలమున నెక్కి త్రివర్గావశ్యకమును దెలుపుచున్నవి. కోడికూఁతయం దున్న ఉవర్ణములు (కొక్కొరోకో యని హ్రస్వదీర్ఘప్లుతరూపములయిన స్వరములు) మూఁడు మూఁడు పురుషార్థముల సూచించినటులుండెను.

తా. ప్రజలు పనిపాటులకు నలుదెసలకై యరుగుట, దంపతులు ప్రణయకోపము నుజ్జగించుట, నైష్ఠికు లనుస్థానములకుఁ బూనుట యను నీ అర్థ, కామ, ధర్మపురుషార్థ వ్యాపారములకు నాకూయుకూఁతయే కారణము. తిన్నఁగా జనులారా! వినుఁ డని తెల్పువిధమున నచ్చటి కొండపల్లెలలో నిండ్లపై నెక్కి గొంతు వంచి ముత్తెఱఁగు లగుకూఁతలను గోళ్లు కూసెను.

అలం. ఉత్ప్రేక్షాస్వభావోక్తులు.

మ.

ఇనుఁ డస్తాద్రికిఁ బోవఁ గొల్లగొని నేఁ డేతేరఁ దద్దీప్తి నం
జనసంబంధజబాంధవంబున రతిశ్రాంతాంగనానేత్రకో
ణనికాయంబుల డాఁచితద్ధవళిమన్ దాఁ బూనెనో చొప్పుమా
ర్ప ననన్ వెల్వెలఁబాఱె దీపకళికావ్రాతంబు శాతోదరీ.

56

టీ. శాతోదరీ = చిక్కినకడుపుగలదానా! (వరూథినీ), ఇనుఁడు = సూర్యుఁడు, అస్తాద్రికిన్ = పడమటికొండకు, పోవన్ = పోఁగా, దీపకళికావ్రాతంబు = దీపపుమొగ్గలసమూహము, తద్దీప్తిన్ = అతనికాంతిని, కొల్లగొని = దోఁచుకొని, నేఁడు= ఈదినమున, ఏతేరఁగాన్ = ఆసూర్యుఁడు మరల రాఁగా, చొప్వుమార్పన్ = ఉన్నవిధము మార్చుటకై, (తాను దొంగ యని గురుతింతు రేమో యని యున్నయునికి మరుగుపఱచి తెలియకుండఁజేయఁటకు,) అంజనసంబంధజబాంధవంబునన్ = కాటుకసంబంధముచేఁ గల్గిన చుట్టఱికముచే, రతి...నికాయంబులన్ - రతిశ్రాంత = సురతముచే బడలిన, అంగనా = స్త్రీలయొక్క, నేత్రకోణ = కనుగొనలయొక్క, నికాయంబుల = సమూహములందు, డాఁచి = దాఁచి, తద్ధవళిమన్ = వానితెల్లఁదనమును, తాన్ = తాను, పూనెనో = వహించెనో, అనన్, వెల్వెలఁబాఱెన్ = తెల్లపోయెను.

సూర్యుఁ డస్తమించినపు డాతనికాంతి యగ్నిహోత్రుని జేరు ననుట ప్రసిద్ధము. సూర్యుఁ డస్తమింప దీపములు సూర్యకాంతిని గొల్లగొనె ననుటచే నగ్నియందు సూర్యకాంతి చేరుట సూచింపఁబడెను. సూర్యకాంతి రాత్రి అగ్నిని జేరు ననుటకు —

శ్లో. "రుచిధామ్ని భర్తరిభృశంవిమలాః పరలోకమభ్యుపగతేవివశుః,
జ్వలనంత్విషఃకథమివేతరధానులభోన్యజన్మని న ఏవపతిః.”

(మాఘకావ్యం)

తా. వరూథినీ! సూర్యుఁ డస్తగిరి కరుగఁగా దీపములు వాని ప్రకాశమును దొంగిలి వెలుంగుచు నేఁడు మఱల నాతఁడు రాఁగా నున్నరూపును మార్చుటకై కాటుకసంబంధముచేఁ దమకు మిత్త్రము లైనరతిశ్రాంత లగునంగనల కడకన్నులడగ్గఱ నీప్రకాశము డాఁచి వానితెలుపును తాము తాల్చెనో యనునట్లు దీపములు తెలతెలవాఱెను. రతిశ్రాంత లగునంగనల కనుఁగొన లెఱ్ఱవాఱె ననియు దీవములు కాంతి తగ్గి తెలతెలవాఱె ననియు భావము.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

శా.

వాలారుంగొనగోళ్ల నీవలసతన్ వాయించుచో నాటకున్
మేళం బైనవిపంచి నిన్న మొదలున్ నీవంటమింజేసి యా
యాలాపంబె యవేళఁ బల్కెడుఁ బ్రభాతాయాతవాతాహతా
లోలత్తంత్రుల మేళవింపఁగదవే లోలాక్షి దేశాక్షికిన్.

57

టీ. లోలాక్షీ = చలించు కన్నులు గలదానా! నీవు అలసకన్ = ప్రాల్మాలికచే, వాలారుంగొనగోళ్లన్ = వాఁడియగు గోటికొనలచే, వాయించుచోన్, నాటకున్ = నాటరాగమునకు, మేళంబు = స్వరస్థానములు సరికూర్పఁబడినది, ఐనవిపంచి = అయినట్టి వీణ, నిన్న మొదలున్, నీవు, అంటమిన్ చేసి = తాఁకకపోవుటచే, ప్రభాతా...తంత్రులన్ - ప్రభాత = ప్రాతఃకాలమందు, ఆయాత = వచ్చిన, వాత = గాలిచే, ఆహత = తాఁకఁబడినవై, ఆలోలత్ = మిగులఁ గదలుచున్న, తంత్రులన్ = తీగలచే, ఆయాలాపంబె = ఆనాటరాగపుస్వరక్రమమునే, (నాటకు మేళము గావింపఁబడియుండుటచే మెట్లపై గాలి సోఁకి యిపుడుగూడ సమయవ్యతిరిక్తముగా నాటరాగమునే,) అవేళన్ = ఆసమయమున, పల్కెడు = పల్కుచున్నది. దేశాక్షికిన్ = దేశాక్షిరాగమునకు, మేళవింపఁగదవే = స్వరస్థానములు కూర్చుమా.

తా. ఓవరూథినీ! నీవు నిన్న మధ్యాహ్నకాలమునం దప్పటికిఁ దగినట్టు నాటరాగమునకు స్వరస్థానములు కుదిర్చి మీటుచున్నవీణ యది మొదలు నీవు దానిని ముట్టకుండుటచేత నిప్పుడును దంతులు గాలిచేఁ గదలఁగా నామేళముతోనే వాఁగుచున్నది. అది యీ యుదయకాలమునకుఁ బొసఁగదు గనుక నిప్పటికిఁ దగిన దేశాక్షిరాగమున కనుకూలముగా స్వరస్థానములు కుదిర్చి జతపఱుపుము. (ఇట్లనుటచేత మధ్యాహ్నకాలమునందుఁ బాడఁదగినది నాటరాగము. ప్రాతఃకాలమునందుఁ బాడఁదగినది దేశాక్షిరాగము అనుట తేఁటపడుచున్నది.)

అలం. స్వభావోక్త్యలంకారము.

చ.

పలుకులు నేర్పువేళఁ గలభాషిణి నీ విటులుండఁ బంజరం
బుల నరగన్ను పెట్టి ముఖముల్ చరణాగ్రనఖాళి గోఁకుచున్
నిలుగుచు నావులింపుచు వనీవిహగోత్కర మెట్లు వల్కు న
ప్పలుకులె యఱ్ఱు లెత్తి విని పల్కెడు వింటివె కీరశారికల్.

58

టీ. కలభాషిణి = అవ్యక్తమధురములగు పలుకులు గలదానా! వరూథినీ! పలుకులు = మాటలు, నేర్పువేళన్ = అభ్యసింపఁజేయు సమయము నందు, నీవు, ఇటులుండన్ = ఈవిధముగా నస్వస్థవై యుండుటచే, (పరాధీనహృదయముతో నుండి బుజ్జగింపకపోవుటచేత, పంజరంబులన్ = పెంపుడుపక్షులకొఱకు ఏర్పాటు చేయఁబడిన గూండ్లయందు, కీరశారికల్ = చిలుకలు గోర్వంకలు, అరగన్ను వెట్టి = మ్రాఁగన్ను వైచి, సగము మూసి సగము తెఱచినటు లున్నకన్నులతో - నిదురచేఁ దూలుచు, చరణాగ్రనఖాళిన్ = కాలిగోటికొనలపంక్తులతో, గోఁకుచున్ = గోఁకికొనుచు, నిలుగుచున్ = ఒడలు విఱుచుచును, ఆవులించుచున్ = ఆవులింతలు విడచుచు, వనీవిహగోత్కరము = అడవిపక్షులగుంపు, ఎట్లు పల్కున్ = ఏవిధముగాఁ గూయునో, అప్పలుకులె = ఆకూఁతలె, అఱ్ఱు లెత్తి = మెడలు పైకెత్తుకొని, విని = ఆలకించి, పలికెడున్ = పలుకుచున్నవి, వింటివె = నీవు విన్నావా?

తా. వరూథినీ! చిలుకలకును గోర్వంకులకును నీవు వాడుక చొప్పున నిప్పుడు మాటలు నేర్పమిచేఁ బంజరములతోఁ నరగన్ను వైచుకొని గోళ్లతో మెడలు గోఁకికొనుచు, నావులించుచు నడవిపక్షులకూఁతలు విని వానినే మరలఁ గూయుచున్నవి, వినుచున్నావా? అడవిపక్షుల యఱపులకె మఱల యలవాటుపడినయెడల నీకలభాషణములు వచ్చుట చాలకష్టము.

అలం. స్వభావోక్తి భ్రాంతిమదలంకారములు.

మ.

ఉరుసంధ్యాతపశోణమృత్కలితమై యొప్పారు బ్రహ్మాండమ
న్గరిడిన్ గాలపుహొంతకాఁడు చరమాగస్కంధమున్ జేర్చుని
బ్బరపున్ సంగడమో యనన్ శశి డిగెన్ బ్రాగ్భూమిభృత్కైతవే
తరబాహాగ్రపుసంగడం బనఁగ మార్తండుండు దోఁచెన్ దివిన్.

59

టీ. ఉరు...కలితమై - ఉరు అధికమైన, సంధ్యాతప = ప్రాతస్సంధ్యవేళఁ గల్గు ప్రకాశ మను, శోణచ్యుత్ = ఎఱ్ఱమట్టితో, కలితమై = కూడినదై, ఒప్పారు= ఒప్పుచున్న, బ్రహ్మాండము, అన్ గరిడిన్ = అనునట్టి గరిడిసాలలో, కాలపుహొంతకాఁడు = కాల మను జెట్టికాఁడు, చరమాగస్కంధమున్ = పడమటికొండ యనుమూఁపున, చేర్చు...గడమో - చేర్చు = పెట్టుకొను, నిబ్బరపు = గట్టిదైన, సంగడమో = గుండో, అనన్ = అనునటులు, (సాధనము చేయునపుడు జెట్టివాండ్రు బంతివలె గుండ్రముగా నుండు పెద్దశిలాఖండమునో లోహవస్తువునో భుజములపై ద్రిప్పుదురు. దీని సంక్తోలా యని యందురు.) శశి = చంద్రుఁడు, డిగెన్ = దిగువకు వ్రాలెను. (అస్తమించెను) ప్రాగ్భూ...సంగడంబు - ప్రాగ్భూమిభృత్ = తూర్పుకొండ యను, కైతవ = మిషగల, ఇతరబాహాగ్రపు = రెండవభుజముమీఁది, సంగడంబు = గుండు, అనఁగన్, మార్తండుండు = సూర్యుఁడు, దివిన్ = ఆకసమున, తోఁచెన్.

జెట్టులు పోరుచోటు అభ్యాసము చేయుచోటు ఎఱ్ఱమట్టితో నించి యుందురు. రక్తపాతము జరిగినను దెలియకుంటకు, ఎఱుపురంగు ప్రతాపమును సూచించునది గాన ప్రతాపాతిశయమునకుఁ గూడ, గరిడి యెఱ్ఱనిమట్టి పఱుపఁబడి రక్తవర్ణముతో నలరారు ననుటకు —

తే. "బహువిరోధిమణిప్రభాపల్లవాగ్ర మల్లసంగ్రామఖురళికామండలాయ
    మాననానాపరిష్కారమహితగాత్రి మనుజపతిపుత్రి యాస్థానమునకు వచ్చె.”

(శృంగారనైష. ఆ. 5.)

తా. ప్రాతస్సంధ్యారాగ మను నెఱ్ఱమట్టితో నెసఁగెడు బ్రహ్మాండమను గరిడిసాలలో కాల మనుజెట్టి పడమటికొండ యనుమూఁపునఁ జేర్చుకొను సంక్తోలా (ఇది యొకగరిడిసాధనము) యనునట్లు చంద్రుఁడు వ్రాలెను. తూర్పుకొండ యను రెండవమూఁపుమీఁద దాల్చు సంక్తోలా యనునట్లు సూర్యుఁ డుదయించెను.

అలం. రూపకోత్ప్రేక్షాపహ్నవములు.

చ.

కరకరి గూఁటఁగఱ్ఱ యిడఁగా మొఱవెట్టెడులీల బాలభా
స్కరకరకాండకందళవిఘట్టన నించుక వాయివిడ్డతా
మర మొఱవెట్టిపెట్టి పలుమాఱును వాకిలి దాఁటి యాఁగుచున్

మొరయ విపంచి మీటుగతి మ్రోసి యళుల్ వెడలెన్ గొలంకులన్.

60

టీ. కరకరి = కఱకుఁదనముతో — క్రూరస్వభావముతో ననుట, గూఁటన్ = గూఁటిలో, కఱ్ఱ యిడఁగాన్ = కొయ్య పెట్టినప్పుడు, మొఱవెట్టెడులీలన్ = పక్షులు మొఱ్ఱోయని కూయునటుల, బాల...విఘట్టనన్ - బాలభాస్కర = బాలసూర్యునియొక్క, కరకిరణము లనెడు, కాండకందళ = కఱ్ఱపుల్లయొక్క, విఘట్టనన్ = పోటుచే, ఇంచుక = కొంచెము, వాయివిడ్డతామరన్ = నోరువిచ్చిన తామరపూవునందు, ఇట జాత్యేకవచనము. మొఱపెట్టిపెట్టి = దుఃఖముతో నఱచియఱచి, పలుమాఱును = మాటిమాటికి, వాకిలి = విడిసిన ద్వారమును, దాఁటి, ఆఁగుచున్ = నిలుచుచు, మొఱయన్ = మ్రోయునట్లు, విపంచిమీటుగతిన్ = వీణ మీటువిధమున, మ్రోసి = ఝంకరించి, అళులు = తుమ్మెదలు, కొలంకులన్ = సరస్సులయందు, వెడలెన్ = తామరపూవులనుండి బయలుదేరెను.

తుమ్మెదలయఱపు వీణమ్రోఁతలవలె నుండునని కవులు చెప్పుట ప్రసిద్ధము. చూడుఁడు. చంపూభారతము.

శ్లో. "ఆలాపకాలసమపల్లవితాంకవీణాసౌరభ్యపాతిమధుపారవసంకులస్య,
    తంత్రీస్వనన్యసమితౌతరుణీరవస్యజానాతియత్ర చతురోపి న తారతమ్యమ్.”

తా. దయమాలినవాఁ డెవఁ డయిన గూఁటఁ గఱ్ఱ పెట్టి పొడువఁగాఁ ప్రాణభయముచేఁ గూటిలో నున్నపక్షులు విచారముతో రొద చేసెడువిధమున బాలభాస్కరుని కిరణములతాఁకుడుచేఁ కొంచెము ద్వార మేర్పడినపద్మమునుండి తుమ్మెదలు వెలువడి యక్కడనే యిటునటుఁ దిరుగాడుచు, వీణ మీటువిధమున మ్రోయుచుండెను.

అలం. స్వభావోక్త్యుపమాలంకారములు.

చ.

అడరునవీనభానుకిరణానల మంటినఁ గూడుకొన్నపు
ప్పొడి కొలుచెల్ల మోచికొనిపోయెడి సంభ్రమ మొప్పఁ గంటివే

పడఁతి భవద్విహారవనపద్మసరఃకుముదాలయంబులన్
వెడలు మిళిందబృందములు వీఁపు పిశంగిమకైతవంబునన్.

61

టీ. పడఁతి = వరూథినీ! భవ...యంబులన్ - భవత్ = నీయొక్క, విహారవన = శృంగారవనమునందలి, పద్మసరః = తమ్మిపూగొలఁకులందలి, కుముద = కల్వలను, ఆలయంబులన్ = ఇండ్లలోనుండి, వెడలు మిళిందబృందములు = బయలుదేరు తుమ్మెదల సమూహములు, వీఁపు పిశంగిమకైతవంబునన్ = వీఁపుయొక్క పసిమి యనుమిషచే, అడరు...అనలము - ఆడరు = అతిశయించు, నవీనభాను = బాలభాస్కరుని, కిరణానలము = కిరణాగ్ని, అంటినన్ = అంటఁగా, కూడుకొన్న, పుప్పొడి కొలుచు = పుష్పరాగ మనుధాన్యము, ఎల్లన్ = అంతయు, సంభ్రమము = తొట్రుపాటు, ఒప్పన్ = ఒప్పఁగా, మోచికొని = ఎత్తుకొని, పోయెడిన్ = పోవుచున్నవి, కంటివే = చూచితివా? తుమ్మెదలు మేనంతయు నల్లఁగా నుండి వీఁపున మాత్రము పచ్చఁగా నుండును. ఆపసుపురంగులతేంట్లు ఇండ్లకాపులు ధాన్యము మోసికొను రైతుగ నుత్ప్రేక్షింపఁబడెను. తుమ్మెదవీఁపులు పచ్చగా నుండు ననుటకు —

ఉ. “తుమ్మెదద్రిమ్మరీఁడు పయిఁదోఁచు పిశంగిమ పద్మినీనిశాం,
    కమ్మదితాఁ బరాగవటిఁ గప్పి”

(వసు. ఆశ్వా. 3-138)

తా. వరూథినీ! నీయుద్యానవనమున యందలి తమ్మికొలఁకులలో సూర్యకిరణములు ప్రసరింపఁగా నచటికల్వలలోని తేంట్లు వానిపుప్పొడి యంటి పచ్చనైన వీఁపులతో వెల్వడిపోవుట, నిప్పంటుకొని తగులఁబడుచున్న యిండ్లలో నుండి నిల్వఁజేసి యుంచుకొన్న ధాన్యమును వీపులపై మోసికొని వెల్వడు సంసారులవలె నున్నవి చూచితివా? ప్రొద్దు క్రుంకఁగనే తమ్ములను వదలి రాత్రియంతయుఁ గలువపూలలో విహరించి కొంచె మాగిన నవి ముకుళించునేమో యని యందుఁ జిక్కక వీఁపునఁ బరాగ మంటుకొనఁ దుమ్మెదలు బైటికి వచ్చుచున్న వని భావము.

అలం. ఉత్ప్రేక్షారూపకాపహ్నవములు.

చ.

కొలకొలఁ గూయుఁ బై నొఱగుఁగుత్తుకఁగుత్తుకఁ జుట్టు బాఱు చి
ల్వలక్రియఁ గానరానిగతులన్ మయిమైఁ బెనుచున్ జనించున
శ్రు లఱుత నొత్తు సోలు నిలుచు విధిచాతురిఁ గూడియు రతిన్
దలఁపవు కంటె పాసినవెతల్ దలఁపించుచుఁ గోకదంపతుల్.

62

టీ. కోకదంపతుల్ = చక్రవాకపక్షుల జతలు, విధిచాతురిన్ = దైవవిలాసముచే, కూడియున్ = మరలఁ గలసియు, పాసినవెతల్ = కడచిన కష్టములను, తలఁపించుచున్ = ఒకదాని నొకటి తలఁచుకొనునట్లు చేసికొనుచు, కొలకొల కూయున్ = కలకలధ్వని నిండార నఱచును. పై నొఱగున్ = ఒకదానిపైకి వేఱొకటి మొగ్గి యానుకొనును. కుత్తుకన్ కుత్తుకన్ = గొంతును గొంతును, చుట్టున్ = అలముకొనును. పాఱుచిల్వలక్రియన్ = పారాడుపాములవలె, కానరాని, గతులన్ = నడకతో, మయిమైన్ = దేహముతో దేహమును, పెనుచున్ = పెనవేసికొనును. జనించు నశ్రువుల్ = జనించుకన్నీళ్లను, అఱుతన్ = ఒండొంటిమెడలచేత, ఒత్తున్ = తుడుచును, సోలును = సొమ్మసిల్లును. నిలుచున్ = ఏమియుఁ జేయక యూరక నిలువఁబడును. రతిన్ = భోగములును, తలఁపపు, కంటె = చూచితివా?

తా. వరూథినీ! చక్రవాకదంపతులు ప్రొద్దు గ్రుంకిన పై గన్ను తెలియక యొండొంటి నెడఁబాసి రేయెల్ల వియోగము ననుభవించి ప్రొద్దు పొడువఁగానే మరలఁ గలసికొని కడచిన కష్టములఁ దలఁపించుకొనుచుఁ గొలకొలఁ గూయఁచుఁ బైపై నొఱగుచు గొంతుగొంతుఁ గలుపుకొనుచుఁ బారాడు పాములవలెఁ బెనఁగొనుచుఁ గన్నీరు కార్చుచు నిట్లు పలుతెఱఁగుల సంకటపడునుగాని సంభోగసౌఖ్యమును దలంపవు చూచితివా?

అలం. స్వభావోక్తి, కారకదీవకము, ఉపమ, విశేషోక్తి.

ఉ.

ఇందునిభాస్య! వాఁ డనఁగ నింద్రుఁడొ చంద్రుఁడొ యాయుపేంద్రుఁడో

యిందులకై వగన్ బొగుల నేటికి నేఁటికినందుఁ బోదమా
నందనభూమి భూమిసురనందనుఁ డుండకపోఁడు రమ్ము నీ
చందము నందమున్ గనిన జవ్వని యెవ్వని వెఱ్ఱిఁ జేయదే.

63

టీ. ఇందునిభాస్య = చంద్రునివంటి ముఖముగలదానా! వరూథినీ, వాఁడు = ఆప్రవరుఁడు అనఁగన్ = అనఁగా, ఇంద్రుఁడొ = దేవరాజొ, చంద్రుఁడొ = చందమామయో, ఆయుపేంద్రుఁడో = ప్రసిద్ధుఁడైన విష్ణుఁడో, సుప్రసిద్ధుడగు నింద్రుఁడు చంద్రుఁడు విష్ణువును కాఁడు. అంతటి దేవుఁడైన విరాళి గొనుటయు వెదుకుటయు సమంజసము గాని సామాన్యమానవునికొఱకా ఇంతటి వలవంతలతో వేగుట, ఇందులకై = వాని సాంగత్యమునకై, వగన్ = విచారముతో, పొగుల నేటికి = దుఃఖింప నేల? నేఁటికిన్ = నేఁడును, అందున్ = ఆయుద్యానవనమునకు, పోదము, ఆనందనభూమిన్ = సంతోషకరమయిన యాప్రదేశమున, భూమిసురనందనుఁడు = ప్రవరుఁడు, ఉండకపోఁడు = ఉండనేయుండును, రమ్ము = పోదమురమ్ము. శృంగారవనము జూచి యాయువకుఁడు కాలూనక యందు నిలువకపోఁగలఁడా? జవ్వని = చిన్నదానా! నీచందమున్ అందమున్ = నీవిధమును జక్కఁదనమును, కనిన = చూచినయెడల, ఎవ్వనిన్ = ఎట్టివానినైనను, వెఱ్ఱిన్ = కామవికార మందినవానిఁగా, చేయదే = చేయదా?

ఇంద్రుఁడు చంద్రుఁడు విష్ణువు లోనగువారె నిన్ను గాంచిన వలతురు. ఇఁక సామాన్యబ్రాహ్మణునిసంగతిఁ జెప్పవలసిన దే మున్నది? ఇంద్రాదులు తమమహత్త్వముచే నీమీఁదివలపు నాపుకొనఁగలుగుదు రేమోగాని సామాన్యుఁడగు ప్రవరాఖ్యుఁడు ముగ్ధుఁడై యీప్రదేశమునం దెందెందొ యుండుననుట.

తా. వరూథినీ! ఆప్రవరుఁ డనఁగా నింద్రుఁడా చంద్రుఁడా! ఆతనిపొందునకై యింతగా చింతపడ నేల? నేఁడు కూడ నయ్యుద్యాన మున కరుగుదము. అచ్చో నవ్విప్రకుమారుఁ డుండకపోఁడు. రా! నీచందము నీయందము చూచినచో నెట్టివానికి వెఱ్ఱి పుట్టదు?

అలం. ఉపమ, ప్రతిషేధము, అర్థాపత్తి.

ఉ.

ఏల దురంతవేదనమెయిన్ బొరలాడెదు తాల్మి దక్కి మే
లే లలితాంగి యెంతపని లెమ్మిది విప్రవరుండు గోలయున్
బాలుఁడు గాన నప్పటికిఁ బైఁబడఁ గొంకెనుగాని వానికిన్
గా లొకచోట నిల్చునె వగన్ మగుడన్ నినుఁ జూచునంతకున్.

64

టీ. లలితాంగి = ఇంపైన యవయవములు గలదానా! తాల్మి = ధైర్యమును, తక్కి = కోల్పోయి, ఏల = ఎందులకు, దురంతవేదనమెయిన్ = అంతము లేనిబాధతో, పొరలాడెదు = క్రిందుమీఁదు పడుచుఁ దపించెదవు? మేలే = మంచిదా - ఇది యుక్తమా? ఎంతపని లెమ్ము = ఎంతమాత్రపుఁబని లే - యసాధ్యము కాదు (లెమ్ము అనుట యలక్ష్యమును సూచించును.) విప్రవరుండు = నీవు వలచిన యాబ్రాహ్మణశ్రేష్ఠుఁడు, గోలయున్ = యుక్తాయుక్తజ్ఞానశూన్యుఁడును, బాలుఁడున్ = పసివాఁడును, కానన్ = కాఁబట్టి, అప్పటికిన్ = ఆసమయమునకు, పైఁబడన్, కొంకెను. కాని, వానికిన్, మగుడన్ = తిరిగి, నినున్, చూచునంతకున్ = చూచువఱకును, వగన్ = విచారముచే, కాలు = పాదము, ఒకచోటన్ = ఒకప్రదేశమునందు, నిల్చునే = నిలుకడగా నుండునా? ఈవనము వదలిపోవనే పోవఁడు. పోయెఁబో వెనుకకు మఱలిపోయినచో నిముస ముండక వచ్చితీరును.

తా. వరూథినీ! ఓర్పు వీడి మితిలేని వేదనఁ జెందె దేల? మేలా యిది? అతని వశపఱుచుకొనుట యనఁగా నెంతపని? ఎఱుఁగనివాఁడును బాలుఁడును గాన నప్పు డాతఁ డట్లు మీఁదఁబడ సంశయించెను గాని వానికి మరల నిన్నుఁ జూడకున్నచోఁ గా లొకచోట నిల్చునా?

క.

రారమ్మనుటయు దివిష
న్నారీరత్నంబు నికటనాకధునీక
ల్హారాంభోరుహమధురస
ధారాచంద్రకితసలిలధౌతానన యై.

65

టీ. రారమ్ము = వనవిహారమునకు రావే రా యని, అనుటయున్ = చెలికత్తె యనఁగా, దివిషన్నారీరత్నంబు = వేల్పుఁగన్నెలలో మిన్న యగు వరూథిని, నికట...ననయై - నికట = సమీపమున నున్న, నాకధునీ = ఆకాశగంగలోని, కల్హార = చెంగల్వలయు, అంభోరుహ = పద్మములయు, మధురస = మకరందముయొక్క, ధారా = ధారలచే, చంద్రకిత = నెమలియీఁకకన్నులవలె జిడ్డు దేఱినదిగాఁ జేయఁబడిన, సలిల = నీటిచే, ధౌత = కడుగఁబడిన, ఆననయై = మొగము కలదై, ఈ పద్యమునకుఁ బైపద్యముతో నన్వయము.

పరిశుద్ధమగు జలమునందుఁ దేనియబొట్టు వేసిన జిడ్డు తేఱును. దానిపై సూర్యకిరణములు వ్యాపించెనేని యింద్రధనుస్సులోని రంగులవలె నుండును. ఇట నది యభివర్ణితము.

తా. ఈ విధముగాఁ జెలికత్తె రారమ్మనుటయం నావరూథిని చెంగట నున్న గంగానదిలోని కలువలనుండియు తామరలనుండియు నొఱఁగిన పూఁదేనెచే జిడ్డుకట్టిన నీట మొగము కడుగుకొని.

సీ.

ఘనసారపంక మొక్కలతాంగి దెచ్చిన
          ముట్టి వ్రేలనె చుక్కబొట్టు పెట్టి
యింతి యొక్కతె పూవుటెత్తు లెత్తినఁ జూచి
          విసువుతో నొకకొన్నివిరులు దుఱిమి
పడఁతి యొక్కతె రత్నపాదుక లిడ నిల్చి
          తొడుగ కవ్వలికిఁ బోనడుగు పెట్టి

బాగాలు వెస నొక్కపద్మాక్షి యొసఁగిన
          వెగ్గలం బని కొన్ని వెడల నుమిసి


తే.

సగము గొఱికినయాకును సఖులు పిలువ
సగ మొసఁగునుత్తరముఁ దెల్వి సగము మఱపు
సగము నయి చింతచే సగ మగుచు నరిగె
నవ్వరూథిని యంతిరోద్యానమునకు.

66

టీ. ఘనసారపంకము = కప్పురపుగందము, ఒక్కలతాంగి = ఒకతీగవంటి మేనుగలచెలువ, తెచ్చినన్ = తేఁగా, వ్రేలనే = కొనవ్రేలితోనె, మట్టి = తాఁకి, చుక్కబొట్టు పెట్టి = చుక్కవలె బొట్టు పెట్టుకొని, ఇంతియొక్కతె = ఇంకొకచెలియ, పూవుటెత్తులు = పూదొంతులు, ఎత్తైనన్ = ఎత్తి చేతఁ బట్టుకొనఁగా, చూచి = ఆకొంకరలఁ జూచి, విసువుతోన్ = విరక్తితో, కొన్నివిరులు = అందుఁ గొన్నిపూలుమాత్రము, తుఱిమి = కొప్పున నిడి, పడఁతియొక్కతె = మఱియొకపరిచారిక, రత్నపాదుకలు = రత్నాలపావకోళ్లు, ఇడన్ = ముందఱికిఁ దెచ్చి పెట్టఁగా, నిల్చి = సరిగా నిలిచి, తొడుగక = కాల ధరింపక, అవ్వలికిన్ పోన్ = తొలఁగిపడునట్లు, అడుగు పెట్టి = పాదము చొన్పి, ఒక్కపద్మాక్షి = ఇంకొక్కపరిచారిక, వెసన్ = త్వరగా, బాగాలు = కత్తిరించినపోకలు, ఒసఁగినన్ = చేతి కందియఁగా, వెగ్గలంబు = హెచ్చు, అని = అని చెప్పి, కొన్ని = ఆబాగములలోఁ గొన్నిటిని, వెడల నుమిసి = పోవునటుల నూచి, సగము కొఱికినయాకును = సగముమాత్రము కొఱికిన తమలపాకును, సఖులు = చెలులు, పిల్వన్, సగము, మఱపు = అజ్ఞానము, సగము, ఐ = కలదై, చింతచేన్, సగము, అగుచున్, అంతికోద్యానమునకున్, వెడలెన్.

ఇందు అరతి యను మదనావస్థ చెప్పఁబడెను. “అరతి ప్రియవస్తు ద్వేషః” అని తల్లక్షణము. శైత్యోపచారవికారము అరతి యని యిటుల కావ్యాలంకారసంగ్రహమునఁ గలదు —

మ. "నిరతం బాత్మకరాంఘ్రి బాహునఖకాంతిస్ఫూర్తికిం దిగ్గుఁడై
    శరణం బొందు ప్రవాళపద్మబిసపుష్పశ్రేణికిం గ్రమ్మఱన్
    శరణం బందుట హీన మంచునొ మదిన్ శైత్యోపచారక్రియా
    గరిమం బొల్లదు మానినీమణి కడంకన్ శ్రీనృసింహాధిపా.”

(తృతీయాశ్వాసము. ప. 175)

తా. వరూథిని ప్రియవిరహవేదనచేత విరక్తి నొందినదై గంధము పూసికొనక, పువ్వులు కొప్పునఁ జక్కఁగాఁ బెట్టుకొనక, పావకోళ్లు కాళ్లఁ దొడుగక, వక్కలాకు లొల్లక, చెలికత్తె లాడుమాటలకు బదులుమాటలు సరిగాఁ జెప్పక, స్మృతి గలిగియు లేనిదానివలెనే విచారముచేఁ గృశించిన దేహము గలదై, మెల్లఁగా నింటివెంబడి శృంగారపుఁదోఁటకుఁ బోయెను.

వ.

ఆసమయంబున దేవజాతిత్వజనితవిమలజ్ఞానపాటవంబునం
దద్వృత్తాంతంబు సమస్తంబు నెఱుంగుటం జేసి.

67

టీ. దేవ...టవంబునన్ - దేవజాతిత్వ = దేవజాతి యగుటవలన, జనిత = పుట్టిన, విమలజ్ఞాన = నిర్మలమగు తెల్వియొక్క, పాటవంబునన్ = గట్టితనముచే (సామర్థ్యముచే), తద్వృత్తాంతంబు = ఆవరూథిని సమాచారము, సమస్తంబున్ = అంతయు, ఎఱిఁగి = తెలిసినవాఁ డగుటచేత (కర్త గంధర్వుఁడు.)

శా.

ఏగంధర్వుఁడు తద్విలాసములు ము న్నీక్షించి తా నెంతయున్
రాగాంధుం డయి గోరి హత్తక గడున్ రారాపులం గంతుఁ డు
ద్వేగం బందఁగఁజేయ నెవ్వగల నువ్విళ్లూరుచున్ వేఁగువాఁ
డాగంధర్వకుమారుఁ డంగభవవిద్యాపారగుం డాత్మలోన్.

68

టీ. మున్ను = పూర్వము (ఇంతకు వెనుక) ఏగంధర్వుఁడు = ఏగంధర్వకుమారుఁడు, తద్విలాసములు = ఆవరూథిని శృంగార చేష్టలను, ఈక్షించి = చూచి, తాన్ = తాను, ఎంతయున్ = విస్తారముగా, రాగాంధుండయి = అను రాగముచేఁ గాననివాఁడయి, కోరి = వరూథినిపొందు నపేక్షించి, హత్తక = జతపడక, కడున్ = మిక్కిలి, రారాపులన్ = ఒత్తిడిచే, కంతుఁడు = మన్మథుఁడు, ఉద్వేగంబు = కలవరమును, అందఁగఁజేయన్ = పొందింపఁగా, నెవ్వగలన్ = నిండువిచారముతో, ఉవ్విళ్లూరుచున్, ఏగంధర్వుఁడు, వేఁగువాఁడు = పరితపించుచుండువాఁడో, అంగభవవిద్యాపారగుండు = మన్మథవిద్యయందు గడిదేరినవాఁడు, (అగు) ఆగంధర్వకుమారుఁడు = యౌవనవంతుఁడగు నాగంధర్వకుమారుఁడు, ఆత్మలోన్ = హృదయమునందు, పైపద్యముతో నన్వయము.

విలాస మనునది ఇష్టుఁడగు ప్రియఁని గవయ నభిలషించి భ్రూనేత్రచాలనాదులచే నుత్సాహము వెల్లడించుట. విలాసమునకు లక్షణము.

శ్లో. "ప్రియసంప్రాప్తిసమయే భ్రూనేత్రాననకర్మభిః,
    తాత్కాలికో విశేషో యస్స విలాస ఇతీరితః."

(రసార్ణవసుధాకరము)

తా.మును పొకగంధర్వుఁడు వరూథినిసౌందర్యమును దానిశృంగారచేష్టలను జూచి మోహించి యది యందులకు సమ్మతింపకపోగా దానిని వలపించు నుపాయము గానక నాఁటనుండి మన్మథవేదన పొందుచున్నవాఁడై వరూథిని ప్రవరాఖ్యుని వలచి వాఁడు త న్నొల్లమిచేత మన్మథవ్యథ పడుచున్నవృత్తాంతము విని తన మనసులో నిట్లాలోచించెను.

ఉ.

ఒక్కొకవేళఁ బద్మముఖుఁ లొల్లమి సేయుదు రొక్కవేళఁ బె
న్మక్కువ నాదరింతురు క్షణక్షణముల్ జవరాండ్రచిత్తముల్
బక్కున వేసఱన్ జన దుపాయములన్ దగునచ్చకంబులన్
జిక్కఁగఁ జేసి డాసి సతిచిత్తముఁ బట్టి సుఖింపఁగాఁదగున్.

69

టీ. పద్మముఖులు = తామరపూవులవంటి ముఖము గలవారు — స్త్రీలు, ఒక్కొకవేళన్ = ఒకానొకసమయమునందు, హృదయము రాగాతిశయముచే విజృంభించనియపుడు, ఒల్లమి సేయుదురు = ఇచ్చగింపక పోవుదురు, ఒక్కవేళన్ = ఒకానొకసమయమున, పెన్మక్కువన్ = పెద్దయపేక్షతో, ఆదరింతురు, జవరాండ్రచిత్తముల్ = యువతులడెందములు, క్షణక్షణముల్ = ప్రతిక్షణమునకు మారునవి, (కాన) పక్కునన్ = తటాలున, వేసరన్ చనదు = విసువరాదు. ఉపాయములు = బహువిధములగు నుపాయములచేతను, తగునిచ్చకంబులన్ = అనువైన యిచ్చకాలతోడను, చిక్కఁగఁజేసి = స్వాధీనపఱుచుకొని, డాసి = డగ్గఱి, సతిచిత్తముఁ బట్టి = ఆఁడుదానిమనసు ననువర్తించి, సుఖింపఁగాఁ దగున్ = సంభోగసౌఖ్యముల ననుభవింపఁగాఁ దగును.

స్త్రీలచిత్తములు క్షణక్షణము చలించునవిగానఁ గాలానుసారములగు ప్రయత్నములు చేయవలయు ననుటకు —

ఉ. “ఇప్పటి నీతలంచు తెఱఁ గిట్టిదయౌ నిటమీఁద నెప్పు డే
    చొప్పున నుండునో! నిజముసుద్ది యెఱుంగము గాని యుగ్మలీ
    చెప్పెడిదేమి! బాలికలచిత్తము లంబుతరంగలోలముల్.”

(శృంగారనైషధము. ఆ. 2)

తా. ఒక్కొకప్పుడు తిరస్కరింతురు. ఇంకొకప్పుడు మిక్కిలి మక్కువ చూపుదురు. స్త్రీలచిత్తములు చపలము లగునవి కావునఁ దటాలున విసివి విడువరాదు. ఉపాయములు చేసి యనువయిన యిచ్చకములు పలికి స్వాధీనపఱుచుకొని డగ్గఱి యాఁడుదానిమనసు గుర్తెఱిఁగి సుఖింప నగును.

అలం. అప్రస్తుతప్రశంస, కావ్యలింగమును.

క.

అని తలఁచి యవ్విలాసిని
యనిశముఁఁ గ్రీడించుపుష్పితారామంబున్
మునుకలుగఁ జొచ్చి యొక చం
దనభూజమునీడ నిల్చి దంభం బమరన్.

70

టీ. అని తలఁచి = ఈవిధముగాఁ దలంచికొని, అనిశమున్ = ఎప్పుడును, అవ్విలాసిని = విలాసవతియగు వరూథిని, క్రీడించు పుష్పితారామంబునన్ = విహరించు వికసించినతోఁటను, మును కలుగన్ = వరూథిని రాకముందే, చొచ్చి = చేరి, ఒకచందనభూజము నీడన్ = ఒకమంచిగందపుఁజెట్టునీడను, దంభంబు = కపటము, అమరన్ = ఒప్పఁగా, నిల్చి = నిలువఁబడి, పైపద్యముతో నన్వయము.

తా. గంధర్వకుమారుఁడు ఎటులేని ప్రయత్నించిన వరూథిని సమాగమము లభింపవచ్చు ననుకొని ఆమెకంటె ముందుగా నామె విహరింపవచ్చు నుద్యానవనముఁ జేరి యటఁగల యొకగందపుమ్రానినీడను గపటాచరణములతో నిలిచియుండెను.

సీ.

అర్ధచంద్రునితేట నవఘళించులలాట
          పట్టి దీర్చినగంగమట్టితోడఁ
జెక్కుటద్దములందు జిగివెల్లువలు చిందు
          రమణీయమణికుండలములతోడఁ
బసిఁడివ్రాఁతచెఱంగు మిసిమి దోఁపఁ జెలంగు
          నరుణాంశుకోత్తరీయంబుతోడ
సరిలేని రాకట్టుజాళువామొలకట్టు
          బెడఁగారునీర్కావిపింజెతోడ


తే.

ధవళధవళము లగుజన్నిదములతోడఁ
గాశికాముద్ర యిడినయుంగరముతోడ
శాంతరస మొల్కు బ్రహ్మతేజంబుతోడఁ
బ్రవరుఁ డయ్యె వియచ్చరప్రవరుఁ డపుడు.

71

టీ. అపుడు = ఆసమయమునందు, వియచ్చరప్రవరుఁడు = గంధర్వుఁడు, అర్ధచంద్రునితేటన్ = అర్ధచంద్రుని తిన్నఁదనమును, అవఘళించు లలాటపట్టిన్ తిరస్కరించునొసలను, తీర్చినగంగమట్టితోడన్ - తీర్చిన = తిలకముగా దిద్దిన, గంగమట్టితోడన్ = గంగానదిలోని మృత్తికతోడను, నదీజలమునందు స్నానము చేసి సంధ్య వార్చునపుడు నదీమృత్తిక మొగమున బొట్టు పెట్టుకొనుట ఆచారము. చెక్కుటద్దములందు = అద్దములంబోలు చెక్కులందు, జిగివెల్లువలు = కాంతిప్రవాహములు, ప్రవాహమువలె వ్యాపించు గాంతివిశేషము లనుట. చిందు = తొలఁకునట్టి, రమణీయమణికుండలములతోడన్ - రమణీయ = మనోహరమైన, మణి = రత్నములు చెక్కిన, కుండలములతోడన్ = కర్ణభూషణములతోడను, (మణిభూషలు గాన కాంతివెల్లువలు) పసిఁడి...మిసిమి - పసిఁడివ్రాఁత = బంగారుపనితనముగల, చెఱంగుమిసిమి = అంచుయొక్క మిసమిస, తోఁపన్, చెలంగు = ఒప్పు, అరుణాంశుకోత్తరీయంబుతోడన్ - అరుణ = ఎఱ్ఱని, అంశుక = రంగుగల, ఉత్తరీయంబుతోడ = జందెమువాటుగాఁ బై వేసికొన్న యుపవస్త్రముతోడను, సరిలేని = సాటిలేని, రాకట్టు = రత్నపుఁగట్టడముగల, జాళువామొలకట్టు = మేలిమిబంగరుమొలత్రాడు, బెడఁగారు = అంద మొసఁగు, నీర్కావిపింజెతోడన్ - నీర్కావి = నీట నానఁబెట్టి నీడను ఆరవేయుటచేఁ గొంచె మెఱపురంగు గలదిగా నున్న దోవతియొక్క, పింజెతోడన్ = వ్రేలాడునటుల విడిచిపెట్టిన కుచ్చెళ్లతోడను, ధవళధవళములు = మిగులఁ చెల్లనివి, అగు, జన్నిదములతోడన్ = యజ్ఞోపవీతములతోడను, కాశికాముద్ర = కాశిముద్ర, ఇడిన = వేసిన, ఉంగరముతోడన్ = అంగుళీయకముతోడను, శాంతరసము, ఒల్కు = చెందుచున్న, బ్రహ్మతేజంబుతోడన్ = బ్రాహ్మణతేజముతోడను, ప్రవరుఁడు = ప్రవరరూపము ధరించినవాఁడు, అయ్యెన్ = ఆయెను.

తా. అప్పుడు నొసట గంగమట్టిబొట్టును, చెక్కిళ్లపై వ్యాపించుకాంతులుగల రత్నాలకర్ణాభరణములును, చెఱఁగులం దక్షరపంక్తివలె సరిగతో నేయఁబడిన కమ్ములుగల యుత్తరీయమును, రత్నములు చెక్కిన మొలత్రాడును, ముందరితట్టుకుచ్చెలు వేలఁగట్టిన నీరుకావిదోవతియు, మిక్కిలి తెల్లగా నుండెడి యజ్ఞోపవీతములును, కాశీముద్రతోడి ముద్దుటుంగరమును ధరించి మొగమునందు శాంతరసమును గనఁబఱచునట్టి బ్రాహ్మణతేజస్సు వెలయఁగా నాగంధర్వుఁడు ప్రవరునిరూపమును బొందెను.

క.

ఇట నవ్వరూథినియు నొ
క్కొటఁ గతిపయసఖులు దన్నుఁ గొలిచి నడువఁగాఁ
జటులఝళంఝళరవపద
కటకసమాకృష్ణకేళికలహంసిక యై.

72

టీ. ఇటన్ = ఇక్కడ, అక్కడ గంధర్వుఁడు వనము చేరియుండఁగాఁ జెలిమికత్తెలచెంత, ఆ, వరూథినియున్ = వలపువంతచేఁ దపించుచున్న వరూథినియు, ఒక్కొటన్ = ఒక్కటిగా, కతిపయసఖులు = కొందఱునెచ్చెలులు, తన్నున్ = తనను, కొలిచి = సేవించి, నడువఁగాన్ = తనవెంట నడచి వచ్చుచుండఁగా, చటు...కయై - చటుల = చలించునట్టియు, ఝళంఝళరవ = ఝళఝళ మనుధ్వనితోఁ గూడినట్టి, పదకటక = కాలియందెలచే, సమాకృష్ణ = వెనుదవులునట్లు చేయఁబడిన, కేళికలహంసికయై = విలాసమునకుఁ బెంపఁబడిన రాయంచలు గలదై, కాలియందెలమ్రోఁత యంచలమ్రోఁతవలె నుండుటచే సజాతీయపక్షిసముదాయ మనుభ్రమతోఁ బెంపుడుహంసలు వరూథినిని వెంబడించెను. కటకరవము అంచలయులివువలె నుంటకు దృష్టాంతములు వెనుక నీయఁబడెను.

ఒక్కట, రూ. ఒక్కొట. ఒక్కొట యనుటకు —

క. "ఇట పాండవకౌరవు లొ
    క్కొట నందఱు గురుననుజ్ఞఁ గొని”

(భారతము. ఆదిపర్వము.)

సీ.

ఉరగఫూత్కారధూమోగ్రగంధముఁ బాసి
              పొలయుఁబో యీతావి మలయపవనుఁ

డనలాక్షుపెడబొబ్బ నలమినతలదిమ్ము
          బాయుఁబో యీతేంట్లపాట మరుఁడు
ఘర్మసామీప్యసంకలితదాహస్ఫూర్తి
          నాఁగుఁబో యీనీడ నల్లమధుఁడు
గరళసోదర్యాత్తకరసుధాకటుకత్వ
          ముడుపుఁబో యీతేనె నోషధీశుఁ


తే.

డనఁగఁ జంపకకురవకపనసతినిశ
నిచులవంజులదాడిమీవిచికిలామ్ర
పాటలీపూగకేసరప్రముఖతరుల
సొబగు మీఱునుద్యానంబుఁ జొచ్చి యచట.

73

టీ. మలయపవనుఁడు = మలయమారుతమునుండి వచ్చుచల్లగాలి, దక్షిణపుదిక్కునుండి వచ్చు గందపుఁదావి గలగాలి, ఈతావిన్ = ఈపరిమళముచే, ఉరగ...గంధమున్ - ఉరగ = పాములయొక్క, ఫూత్కార = బుసలవలనఁ గలిగిన, ధూమ = పొగచే, ఉగ్ర = వేండ్ర మగు, గంధము = వాసనను, పాసి, పొలయుఁబో = ప్రసరించుఁ జుమీ, పాములవిసము అగ్ని గాన బుసకొట్టుటలు పొగలుగాఁ జెప్పఁబడెను. విసము అగ్నిగఁ జెప్పుదు రనుటకు “విసపుఁజి చ్చొండొండ దెసలు వ్రేల్వ”. ఫూత్కృతులనుండి పొగలు వెడలు ననుటగూడ నిటులె సుసుప్రసిద్ధము —

తే. "పొదలుతనఫూత్కృతులనెల్లఁ బొగలు గవిసి
    యబ్జజాండ మూదరవెట్టినట్టు గాఁగ
    కాలకర్కశకాయుండు.”

(హరివంశము. పూ. ఆ. 5)

మరుఁడు = మన్మథుఁడు, ఈతేంట్లపాటన్ = ఈతుమ్మెదలపాటచే, అన...బొబ్బన్ - అనలాక్షు = శివునియొక్క, పెడబొబ్బన్ = పెద్దదద్దరింపుచే, అలమినతలదిమ్మున్ = మూఁగిన శిరోవేదనను, పాయున్ పో = ఎడఁ. బాయనుచుమీ! అల్ల మధుఁడు = ఆవసంతుఁడు, ఈనీడన్ = ఈచెట్లనీడచే, ఘర్మ...స్ఫూర్తిన్ - ఘర్మ = గ్రీష్మముయొక్క, సామీప్య = చేరికచే, సంకలిత = చేకుఱిన, దాహస్ఫూర్తిన్ = తాపపుహెచ్చును, అఁగుఁబో = అణఁచును చుమీ! ఓషధీశుఁడు = చంద్రుఁడు, ఈతేనెన్ = ఈపూఁదేనెచే, గరళ...కటుకత్వము - గరళ = విషముయొక్క, సోదర్య = తోఁబుట్టుతనముచే, ఆత్త = పొందఁబడిన, కర = కిరణములయొక్క, సుధా= అమృతమందలి, కటుశత్వము = చేఁదును, ఉడుపుఁబో = పోఁగొట్టుకొనునుజుమా! అనఁగన్ = అనునట్లు, చంపక...తరులసొబగున్ - చంపక = సంపంగి, కురవక = గోరంట, పనస, తినిశ = నెమ్మి, నిచుళ = ప్రబ్బలి, పంజుళ = అశోకము, దాడిమీ = దానిమ్మ, విచికిల = సన్నమల్లె, ఆమ్ర = మామిడి, పాటలీ = కలిగొట్టు, పూగ = పోఁక, కేసర = సురపొన్న, ప్రముఖ = మొదలైన, తరులన్ = చెట్లచే, సొబగు = సొగసు, మీఱ = అతిశయించు, ఉద్యానము = విహారశృంగారవనమును, చొచ్చి = ప్రవేశించి, అచటన్ = అక్కడ, పైపద్యముతో నన్వయము.

అలం. అప్రస్తుతప్రశంసోత్ప్రేక్షలు.

తుమ్మెదలరవమును పాట యని చెప్పుటకలదు. దృష్టాంతములు —

క. “వీనులవిందై యమృతపుసోనలపొందై యమందసుమచరదళినీ
    గానము క్రందై యారవ మానందబ్రహ్మమైన నధిపతి బలికెన్.

(వసు. ద్వితీ.)

శా. "భృంగా కృష్ణుఁడు మంచివాఁ డనుచు సంప్రీతిన్ బ్రసంగించెదీ
    సంగీతంబున మేము సొక్కుదుమె.”

(భాగవ. దశ.)

సీ. “మాధవీమధుపానమత్తాలినీగాన
              విభవాకులోద్యానవీథులందు”

(కవికర్ణరసాయనము)

తా. ఈ తోటలోని గోరంట సంపెఁగ పనస మామిడి సురపొన్న మొదలుగాఁ గల వృక్షములవలని ఫలపుష్పపరిమళములచేత దుమ్మెదల ఝంకారములచేతను మ్రాఁకులనీడలచేతను తేనెలమాధుర్యముచేతను గ్రమముగా మలయమారుతమును మన్మథుఁడును వసంతుఁడును జంద్రుండును దమతమలోపములను బోఁగొట్టుకొనుచున్నారు. అట్లుండఁగా నితరులకొఱఁతలు దీఱకపోవునా! తప్పక తీఱు ననునిశ్చయముతో నాతోఁటను జొచ్చి యని తాత్పర్యము.

అలం. అప్రస్తుతప్రశంస, ఉత్ప్రేక్షయును.

మ.

పవమానప్లవమానపంకజరజఢపాళీపిశంగచ్ఛవీ
భవదభ్యర్ణవికీర్ణకృత్రిమసరిత్పాథస్తరంగాహతైం
దవపాషాణవితర్దికాతలమునన్ నాళీకపత్త్రాక్షు లు
త్సవ మొప్పన్ విహరించుచున్ సరసవాచాప్రౌఢిమల్ మీఱఁగన్.

74

టీ. పవమాన...తలమునన్ - పవమాన = గాలిచే, ప్లవమాన= తేలియాడుచున్న, పంకజ = తామరపూలయొక్క , రజఃపాళీ = పరాగపుంజముచే, పిశంగచ్ఛవీభవత్ = పచ్చనికాంతి గలవగుచున్న, అభ్యర్ణ = చెంగట, వికీర్ణ = చెదరిన, కృత్రిమసరిత్ = కాల్వలయొక్క, పాథః = నీళ్లయొక్క, తరంగ = తరఁగలచే, ఆహత = కొట్టఁబడుచుండు, ఐందవపాషాణ = చంద్రకాంతమణులు గూర్చిన, వితర్దికాతలమునన్ = అరుఁగుపై, నాళీకపత్త్రాక్షులు = తమ్మిఱేకులవంటి కన్నులు గలస్త్రీలు, ఉత్సవము = వేడుక, ఒవ్పన్ = ఒప్పునటుల, విహరించుచున్ = సంచారము చేయుచు, సరస...ప్రౌఢిమల్ - సరస = ఇంపైన, వాచాప్రౌఢిమల్ = వాక్చమత్కారములు, మీఱఁగన్ = అతిశయింపఁగా, పైపద్యముతో నన్వయము.

వరూథిని విరహిణిగాన శిశిరోపకృతు లవసరము. పరాగము, తరంగములగాలి, చంద్రకాంతవేదిక ఇవి సహజశీతలములు. వీని నుపాయాంతరముచే సమకూర్చిరి. పుప్పొడి గాలికిఁ దమ్ములనుండి రాలుచుండె ననుటచే నాప్రదేశము నేత్రపర్వముగ నుండెననియు అలలతాకిడి చంద్రకాంతవేదికకు సోఁకు చున్న దనుటచే మఱియుఁ జల్లఁగా నుండెననియు భావము. సరసప్రసంగములు అన్యవ్యాసంగవశమున విరహబాధ నపనయించుటకు.

ప్రౌఢిమ - ఇది ఇమనిచ్ప్రత్యయము. ఇట్టివె ముగ్ధను ఇత్యాదులు. ప్రౌఢిమ ప్రయోగములచే సాధువు. “గంభీరవాక్ప్రౌఢిమన్" శ్రీనాథమహాకవి. ఇమనీచ్ప్రత్యయములు మృగ్యములని వామనుఁడు.

తా. గాలిచేఁ దూఁగియాడు తమ్మిపుప్పొడి క్రమ్మి పసిమి గాంచిన చెంగటికాల్వలనీళ్లలోనితరఁగలు తాఁకుచున్న నెలరాతితిన్నెపై నాకమలనయనలు సరసవాక్యము లాడుకొనుచు ఉత్సవముతో విహారము సల్పుచు (పైపద్యముతో నన్వయము.)

చ.

బటువయి విఱ్ఱవీఁగి పరిపాటిగఁ బూచి పరాగపుంజ మొ
క్కొటఁ గలయంగఁ బర్వఁ గొనగొమ్మను గోయిల మించ నొప్పెఁ జెం
గటియెలమావి హారరుచి గందవొడిన్ గనుపట్టి నీలతా
స్ఫుటతరచూచుకం బగుచుఁ బొల్చువనేందిరగుబ్బచ న్ననన్.

75
టీ. బటువయి = వట్రువై, విఱ్ఱవీఁగి = మిగుల నిగిడి నిక్కి, పరిపాటిగన్ = తీరుగా, జొంపముగాఁ బెరిఁగి దర్శనీయముగా, పూచి = పుష్పించి, పరాగపుంజము = పుప్పొడిప్రోవు, ఒక్కొటన్ = ఒక్కసారిగా, కలయంగన్ = అంతటను, పర్వన్ = వ్యాపింపఁగా, కొనగొమ్మను = కొటారుకొమ్మపై, కోయిల, మించన్ = ఒప్పఁగా, చెంగటియెలమావి = దగ్గఱనున్న లేఁతమామిడిగున్న, హారరుచిన్ = ముత్యాలహారపుఁగాంతిచేతను, గందవొడిక్ = బుక్కాపొడిచేతను, కనుపట్టి = కన్పడి, నీలతా...చూచుకంబు - నీలతా =నలుపుచే, స్ఫుటతర = మిగుల స్పష్టమైన, చూచుకంబు = చన్మొన గలది, అగుచున్, పొల్చు = చెలఁగెడు, వనేందిరగుబ్బచన్ను = వనలక్ష్మియొక్క గుండ్రనికుచము, అనన్ ఒప్పెన్.

గున్నమావి గుబ్బచన్నుగను, పుప్పొడి చనులపైఁ బూయుగందపొడిపూతగను, పూలకాంతి హారరుచిగను, కోయిల చన్నుమొనగను జెప్పఁబడినది. హారములు, పూవులు శ్వేతగణములోనివి. గుబ్బచన్ను ఆనుటచే బిగివి నిండారి గుబ్బవలె నిక్కినచన్ను.

తా. గుండ్రనై నిక్కి జొంపములు వైచి తీరుగాఁ బూఁత పూచి, యంతటను బుప్పొడి క్రమ్ముకొని కొనగొమ్మను గోయిల గల్గిన యీలేమావిగున్న ముత్యాలహారములును, బుక్కామును గల్గి నల్లని చన్ముక్కులతో నొప్పు వనలక్ష్మియొక్క గుబ్బచన్నో యనునట్లు చూపట్టుచున్నది.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

తే.

వెలఁది యిచ్చటిసంపెంగవిరులు గహన
దేవతలయిండ్ల నెత్తినదీపశిఖలు
గాక యుండినఁ బంచబంగాళ మగుచుఁ
బాఱునే మత్తమధుకరపటలతమము.

76

టీ. వెలఁది = ఓచెలియా! ఇచ్చటి సంపెంగవిరులు = ఈవనములోని పూచిన సంపెంగపూలు, గహనదేవతలయిండ్లన్ = వనదేవతలయిండ్లలో, ఎత్తినదీపశిఖలు = పెట్టినదీపజ్వాలలు, కాకయుండినన్ = కానిచో, మత్తమధుకరపటలతమము = మదించిన తుమ్మెదలసమూహ మనుచీకటి, పంచబంగాళ మగుచున్ = రూపుమాసినదై, పాఱునే = పాఱిపోవునా!

సంపెఁగపూవును రక్తవర్ణముగాఁ జెప్పుట కలదు. ఇందుచే దీపములు గూడ రక్తవర్ణము లని గ్రహించునది. సంపెంగపూవును జూచినతుమ్మెదలు దీపమును జూచిన చీకటులవలెఁ దొలంగును. మధుకరముల మత్తము లనుటచేతను బటల మనుటచేతను అంధకారమునకు నెక్కువ సాదృశ్య ముంట స్పష్టము.

తా. చెలీ! ఇచ్చటి సంపెంగపూలు వనదేవతలయిండ్లలోని దీపజ్వాల లనఁదగును. కావుననే కాఱుతుమ్మెద లనుచీకట్లు వానినిఁ జేరక దూరముగాఁ బాఱుచున్నవి.

అలం. అనుమానము, రూపకమును.

చ.

అపరిమితానురాగసుమనోలసయై చిగురాకుఁజేతులన్
దపసిని గౌఁగిలించె వనితా యిదె రంభ దలంప రంభ దా
నపరిమితానురాగసుమనోలసయై చిగురాకుఁజేతులన్
దపసిని గౌఁగిలించు టుచితంబెకదా యన నవ్వె రంభయున్.

77

టీ. వనితా = చెలీ, రంభ = అరటిచెట్టు, అపరిమిత...లసయై - అపరిమిత = మితిలేని, అనురాగ = ఎఱ్ఱఁదనముతోఁ గూడిన, సుమనః = పూవుచే, అలసయై = ఓపనిదై, వానియల్లుకొనుస్వభావము గలదై, చిగురాకుఁజేతులన్ = చిగురాకు లనుచేతులతో, తపసిని = అగిసెచెట్టును, కౌఁగిలించెన్ = ఆనుకొనెను - ఆలింగనము చేసికొనెను, ఇదె = ఇదిగోఁ జూడుము, (అని యొకతె చెప్పఁగా మఱియొకతె) తలంపన్ = విచారింపఁగా, రంభ = రంభ యనునచ్చర, తాన్ = తాను, అపరి...లసయై - అపరిమిత = మితిలేని, అనురాగ = అనురక్తితోఁ గూడిన, సుమనః = మంచిమనస్సుచే, ఆలసయై = ఓపిక లేనిదై, చిగురాకుఁజేతులన్ = చిగురాకులవంటి చేతులతో, తపసిని = తపస్సు కావించువానిని, కౌఁగిలించుట = ఆలింగనము చేయుట, ఉచితంబె కదా = యుక్తమే కదా. అనన్ = అనఁగా, రంభయున్ = (వారిలోఁ గలసి విహరించు) రంభ యనునచ్చర, నవ్వెన్ = అందులకుఁ బరిహసించెను.

అవిసెచెట్టుకు జూచినయరఁటిచెట్టు ఆనుకొనెను. దానినే యర్థాంతరవివక్షచే రంభ తపస్విని కౌఁగిలించుకొనె నని పలికి చెలికత్తెలు నవ్వులాడిరి.

తా. వనితా! రంభ (అనఁటి) మెండయిన యనురాగము (ఎఱుపు) గల సుమనస్సుల (= పూవుయొక్క) బరువు మోయలేనిదై తవసిని (అగిసెను) కొగిలించుకొనెను. అని యొకతె మఱొకచెలితో ననఁగా నది యావాక్యమునకే యర్థాంతరకల్పన చేసి మరల ననుచున్నది. అగును, రంభ (అచ్చర) అపరిమిత మగు ననురాగము గలమంచిమనస్సుతో నోపనిదై చిగురాకులం బోలు చేతులతోఁ దపస్విని గౌఁగిలించుట వింత గాదు గదా! యనఁగా రంభయు నవ్వెను.

అలం. వక్రోక్త్యలంకారము.

ఆ.

కొమ్మ కన్నుఁగవకుఁ గోరగింపఁగఁ బూచి
తఱుచుజొత్తు గ్రక్కుదాసనంబు
గవియునీతమాలగహనాంధకారవి
తానమునకు నుదయభానుఁ డయ్యె.

78

టీ. కొమ్మ = బాలా! కన్నుఁగవకున్ = కందోయికి, కోరగింపఁగన్ = వెక్కస మగునట్లు, కనులారఁ జూడ వీలుగాని యటుల, పూచి = పుష్పించి, తఱుచుజొత్తు = ఎక్కువరక్తిమను, క్రక్కుదాసనంబు = వెలిపఱుచు దాసానిచెట్టు, కవియు = క్రమ్ముకొను, ఈతమాలగహనాంధకారవితానమునకున్ = ఈచీకటిమ్రాఁకులతోఁపులోని చీకటితుండమునకు, ఉదయభానుఁడు = ఉదయించుచున్న సూర్యుఁడు, అయ్యెన్ = ఆయెను.

దాసానిపువ్వులు మిగుల నెఱ్ఱఁగా నుండును గాన నుదయించు సూర్యునివలె నుండెను. తమాలవృక్షములు చీకటులవలె నల్లగా నుండెను.

తా. బాలా! ఎఱ్ఱఁగాఁ బూచి యుండిన యీదాసానిచెట్టు చీకటిమ్రాఁకు లనుగాఢాంధకారమునకు నుదయభానునిపగిది యయ్యెను. (ఎఱ్ఱఁగాఁ బూచియుండిన దాసానిపూలకాంతి చీకటిచెట్లనలుపును విరజిమ్ముచున్న దనుట).

అలం. రూపకాలంకారము.

తే.

శ్యామలోపరినిబిడపత్త్రాభ్రములకుఁ
గాండషండంబు దిగువానకాళ్లు గాఁగఁ
బంకరుహనేత్ర వర్షర్తుశంక నొసఁగు
పోఁకబోదియనవకంపుమోకఁ గంటె.

79

టీ. పంకరుహనేత్ర = పద్మనయనా, శ్యామలో...భ్రములకున్ - శ్యామల = పసుపు మీఱిన నల్పుకల, ఉపరి = మీఁది, నిబిడ = తఱచైన, పత్త్ర = ఆకు లనెడి, అభ్రములకున్ = మేఘములకు, కాండషండంబు = బోదెలసమూహము, దిగువానికాళ్లు గాఁగన్ = (నేలపైకి) దిగువర్షధారలు కాఁగా, వర్షర్తుశంకన్ = వర్షకాలమను సంశయమును, ఒసఁగు...మోకన్ - ఒసఁగు = ఇచ్చునట్టి, పోఁకబోదియ = పోఁకచెట్లమొదళ్లయొక్క, నవకంపుమోకన్ = నునుపైనచాలును, కంటె = చూచితివా?

శ్యామలము అన నలుపురంగునకును ఆకుపచ్చనిరంగునకును జెప్పుట గలదు. చెట్లు ఆకుపచ్చగా నున్నను దూరమున నున్నవారి కాయాకువచ్చన నల్లఁగా గానవచ్చును గాన నలు పనుట ప్రసిద్ధము సంస్కృతకవులు వృక్షపత్రవర్ణము శ్యామల మని చెప్పిరి. దానినే పెద్దన యనుకరించెను.

శ్లో. “తస్యాధస్తాద్వయమపి రతాన్తేషు వర్ణోటజేషు
    గోదావర్యాః పయసి వితతశ్యామలానోకహశ్రీః."

(ఉత్తరరామచరిత్రము.అంకము. 2)

తా. సఖీ! పోఁకమ్రాఁకుల పైనుండు నలుపుమీఱినయాకులు మబ్బువలెను, వానిబోదెలు వానకాళ్లుగను దోఁచుటచే నిది వర్షాకాలమేమో యనుసందియము గలిగించుచున్నవి చూడు.

అలం. రూపకము, ఉత్ప్రేక్షయును.

ఉ.

చూతమె డాసి పక్వతరశుక్తిపుటాంతరదృశ్యమౌక్తిక
వ్రాతము లై వెలుంగు గరువంపుఁగొటారులనొప్పు తామ్రప
ర్ణీతట మట్లు జీర్ణదళబృందసమావృతపాండురప్రసూ
నాతిమనోజ్ఞమూలముల నర్థి నెసంగుమధూకసాలముల్.

80

టీ. పక్వ...వ్రాతములై - పక్వతర = మిక్కిలి నిండిన, శుక్తిపుట = ముత్తెపుఁజిప్పలయొక్క, అంతర = లోపల, దృశ్య = చూడఁదగిన, మౌక్తిక = ముత్యములయొక్క, వ్రాతములై = సమూహములు కలవై, వెలుంగు = ప్రకాశించునట్టి, గురువంపుఁగొటారులన్ = గొప్పవగు రాశిపోఁతపోయు నెలవులతో, ఒప్పు, తామ్రపర్ణీతట మట్లు = తామ్రపర్ణీనదీతీరప్రదేశమువలె, జీర్ణదళ...మూలములన్ - జీర్ణ = పండిన, దళ = ఆకులయొక్క, బృంద = సమూహముచేత, సమావృత = కప్పఁబడిన, పాండుర = తెల్లనైన, ప్రసూన = పుష్పములచేత, అతిమనోజ్ఞ = మిగులమనోహరము లయిన, మూలములన్ = మొదళ్లచే, ఎసంగుమధూకసాలముల్ = ఒప్పునట్టి ఇప్పమ్రాఁకులను, అర్థిన్ = ప్రీతితో, డాసి = చేరి, చూతమె - మనము కనుఁగొందమా!

రాలిన పండుటాకులు ముత్తెపుఁజిప్పలుగును ఇప్పపూవులు ముత్తెములరాసులుగను ఇప్పమ్రాఁకులమొదళ్లు తామ్రపర్ణీతీరములుగను నిందుపమింపఁబడెను.

ముత్తెములు తామ్రపర్ణియందు విశేషముగా జనించుననుట కాధారము.

ఉ. “నైపుణిఁజందనాద్రిగహనద్రుమసౌరభవీచిఁ దామ్రప
    ర్ణీపరిలబ్ధమౌక్తికమణిప్రకరంబులు దోఁచి దక్షిణా
    శాపవనుండు సల్లువెదఁ జల్ల జనించెన కాక వీనికే
    లా పొడమంగ నప్పొలప మప్పుడు నా వనిఁ దోఁచెఁ గ్రొన్ననల్.”

(ఆముక్తమాల్యద పంచ. 114)

తా. ముత్యములు వెలికిఁ బ్రకాశించు ముదురుముత్యపుఁజిప్పలకొటారులతో నొప్పారు తామ్రపర్ణీనదీతీరమువలెఁ దొఱగిన యెండుటాకుదొప్పలలో రాలి నిండినపూలు గలయిప్పమ్రాఁకులమొదళ్లను పోయి చూతమా! (తామ్రపర్జీనదిలో ముత్యాలు దొరకుట ప్రసిద్ధము.)

అలం. ఉపమాలంకారము.

క.

పంకజముఖి విరహులపయిఁ
గింకన్ నిజసైన్యకోటికిని సెలవిడుమీ
నాంకునికరతల మన నల
కంకేళిన్ జిగురు గాలిఁ గదలెడుఁ గంటే.

81

టీ. పంకజముఖి = పద్మాననా! విరహులపయిన్ = వియోగమునందు వారిమీఁద, ప్రియజనము నెడఁబాసిన స్త్రీపురుషులమీఁద, కింకన్ = కోపముతో, నిజసైన్యకోటికిని = తనసేనాసమూహమునకు, సెలవు = అనుజ్ఞను, (దండు వెడలుటకు ఉత్తరువు గావించునట్టి యనుట) ఇడుమీనాంకుని = ఇచ్చునట్టి మన్మథుని, (చేఁప టెక్కెముగాఁ గలవాఁ డనుట) కరతలము = చేయి, అనన్, ఆల కంకేళిన్ = ఆయశోకవృక్షమున, చిగురు = చిగురుటాకు, గాలికిన్ = గాలిచేత, కదలెడున్ = కదలుచున్నది, కంటే = చూచితివా?

తా. చెలియా! వియుక్తులమీఁదఁ గోపముతో దాడి వెడలుటకుఁ దనసేనాసమూహమున కనుజ్ఞ నొసఁగు మన్మథునిహస్తసంజ్ఞయో యనునట్లు ఆయశోకవృక్షమునఁ జిగురాకు గాలిచేఁ గదలుచున్నది. చూచితివా? మన్మథపరివారము వెనుకఁ జెప్పఁబడెను.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

చ.

నునుఁజిగురాకు మేయుతఱి నోరికెలంకులఁ దేఁటి గుట్టినన్
వనతరుశాఖలన్ గువకువధ్వనిఁ బాఱుపికాంగనన్ బికం
బనునయ మొప్పమాన్పుగతి నాత్మముఖంబు ముఖంబుఁ జేర్చి చుం
బన మొనరించె సందుసుడిమాయలుగా మగవారికృత్యముల్.

82
టీ. నునుఁజిగురాకున్ = మిగుల మృదువగు చిగురుటాకును, మేయుతఱిన్ = తినునప్పుడు, నోరికెలంకులన్ = నోటిపార్శ్వములందు, తేఁటి = తుమ్మెద, కుట్టినన్ = నోటితోఁ బొడువఁగా, వనతరుశాఖలన్ = తోఁటలోని చెట్లకొమ్మలపై, కువకువధ్వనిన్ = కువకువమనుకూతతో, పాఱుపికాంగనన్ = పర్విడు నాఁడుఁగోయిలను, పికంబు = మగకోయిల, అనునయము = ఊరడింపు, ఒప్పన్ = ఒప్పునటులు, మాన్పుగతిన్ = ఆతుమ్మెదగుట్టఁగా గలిగిన బాధను బోఁగొట్టునటుల, ఆత్మముఖంబు = తనముఖమును, ముఖంబున్ = ఆఁడుకోయిలముఖముతో, చేర్చి = జతపఱచి, చుంబన మొనరించెన్ = ముద్దిడుకొనెను. మగవారికృత్యముల్ = మగవారిపనులు, సందు సుడిమాయలుగా = సమయము చూచి మోసపుచ్చునవి గదా!

నోటికెలంకులు మిగుల మృదువగు భాగములు గానఁ దేఁటి గుట్టిన మిక్కిలి బాధ. శాఖల పైనుండి చివురుల మేయుతఱి తేఁటి గుట్టెగాన దిక్కు నెఱుంగక లేచినది లేచినటులఁ గొమ్మలనడుమనుండి పరుగెత్తెను. కోకిల పరుగెత్తునపుడు కువకువ యనియు నాగియున్నపుడు కోకోయనియుఁ గూయుట ప్రసిద్ధము.

ఆఁడుకోయిల తేఁటి గుట్టఁగా నవస్థపడుచుండ మగకోయిల మోసముచేఁ దనపని నెరవేర్చుట వరూథిని విరహావస్థలో నుండ మాయాప్రవరవేషముతో గంధర్వుఁడు తనవని నెరవేర్చుకొనెనను కథాంశమునకు సూచన.

తా. నెచ్చెలీ! యాచెట్టునం దొకయాఁడుఁగోయిల చిగురాకు మేయంచో నోరిప్రక్కఁ దుమ్మెద కుట్టఁగాఁ గువకువఁ గూయుచుఁ గొమ్మలమీఁదుగాఁ బర్విడుచుండఁగా పుంస్కోకిలము చూచి బాధ మాన్పునదివోలె దాని మొగముతోఁ దనమోముఁ జేర్చి ముద్దుకొనెను. చూచితివా? మగవారినడవళ్లు సమయము చూచి మోసపుచ్చునవి గదా!

అలం. అర్థాంతరన్యాసాలంకారము.

క.

అని పొగడుచు నొయ్యారపు
టనువున జడ లల్లి జిలుఁగు లగుపయ్యెదలం
జనుకట్లు గట్టి గట్టిగ
ననిమిషకాంతలు లతాంతహరణోత్సుకలై.

83
టీ. అనిమిషకాంతలు = వేలుపుఁజెలువలు, అని = ఇటు లని, పొగడుచున్ = (ఆవనమనోహరత్వమును) పొగడుచు, లతాంతహరణోత్సుకలై - లతాంత = పూవులను, హరణ = కోయుటయందు, ఉత్సుకులై = వేడుక గలవారై, ఒయ్యారపుటనువునన్ = విలాసవైఖరితో, జడలల్లి = జడలను వేసికొని, జిలుగులు = సన్ననివి, ఆగు, పయ్యెదలన్ = పైఁటలచే, గట్టిగన్ = దృఢముగా, చనుకట్టు కట్టి రవికలమీఁదఁ జేర్చి బిగఁగట్టి - పూవులు గోయుటకు వెడలి రనుట యిట నధ్యాహార్యము.

తా. ఆదేవతాస్త్రీలు మీఁదఁ జెప్పినవిధముగా నుద్యానవనమును బొగడి యంతటఁ బువ్వులు గోయఁగోరినవారై పువ్వులచెట్లకొమ్మలు మొదలైన వానికిఁ దలవెండ్రుకలు తగులుకోకుండునట్లుగా జడలు వేసికొని బయట జాఱిపోకుండునట్లుగా ఱొమ్ములపైఁ జుట్టి బిగియఁగట్టుకొని వెడలిరి.

రగడ.

నేర్పుమై నల్లయది నెఱులఁ దొలుపూఁ దుఱిమె
దర్పకున కర్పింపఁ దలఁప దెంతటి పెరిమె
యింతి పావురపురొద యేల వినె దారజము
వింతయే విరహిణుల వెతఁ బెట్టు బేరజము
సురపొన్న క్రొన్ననల్ సొచ్చి నలుగడ వెదకు
తఱుఁగ దందులతావితండంబు క్రొవ్వెదకు
నఱిమి ననుఁ జివురునకు నగునె కంటక మాడఁ
జుఱుకు మనె వేఱక్కచోటఁ గంటక మాడఁ
గుందములు నీ కొసఁగఁ గూర్చితిని గైశికము
నిందులకు వెల యడుగ నేల విడు వైశికము
చిఱుఁదేంట్ల కొసఁగె గుజ్జెనఁగూళ్లు గొజ్జంగ
యెఱుఁగ కది పూ వంద నేల యిటు రజ్జంగ
నెదరింపఁ బోలు నీ వింతి రతిపతిఁ దెగడఁ
బొదలఁ జిగురులతుదలఁ బూచి యున్నది పొగడ
పుడుకు మల్లన గందవొడికి నీప్రేంకణముఁ
దడయ కిటు నీ కిత్తుఁ దగ రత్నకంకణము
నెరసి పోఁ జూచెదవు నిలునిలువుమా కనము
గురియు తేనెల జీబుకొన్న దంతట వనము
కా దల్లయది ఫుల్లకంకేళి పన్నిదము
మోదు గోడిన నీదు ముత్యాలజన్నిదము

ఏటవా లైనయది యీయరఁటి బాలెంత
చేటునకె యగుచూలుచేఁ గలుగుమే లెంత
నెలఁత యీ గేదంగి నీ కబ్బె బుక్కాము
చిలుకు నీపుప్పొళ్లు చెంచెతలబుక్కాము
మితి లేనితేనె నామెత చేసె విరవాది
యితరలతికల మరిగి యేఁగు నది పరవాది
కలిగొట్లు ప్రాఁకువేడ్కలె నీకుఁ దఱచెదను
నలినాక్షి కడిమిగండమున కే వెఱచెదను
గురివెంద నదె గిలుబుకొనియెఁ బయ్యరదొంగ
విరుల గరికుంభకుచ వెరఁజు మై యరగ్రుంగ
మెరమెరనికొలనిదరి మీ లందు లకుముకులు
మరచె నీకనుదోయి మాయింపు చకచకలు
ఏకాంత మని తొలఁగె దెందు నీవఁటె వేఱు
చేకొనవె మున్నాడి చెలువ యీవటివేరు
ఆరిది యీయేడాకులఁరటి నగుకప్పురము
పాళ కల్లది పోఁకఁ బ్రాఁక బందము దెగియె
నాళి యది దిXజాఱునట్టిచందము నగియె
మలయపవనునిఁ బిలిచె మావి బళి యీవేళ
మలయుకోవెలపంచమస్వరం బను నీల
సులభ మై దొరకె మంజులవాణి చంపకము
[2]చిలువానెఁ బూఁబొదలు చేరి యిఁక వంపకుము
చనకుఁ డిఁక దవ్వులకు సఖులార పువ్వులకు
ననుచు నలరులు గోసి రతివ లల్లన డాసి.

84

(ఈరగడ చెలికత్తెలు పూలుకోయుతఱిఁ బరస్పరము కావించు సంభాషణరూపముగ నున్నది. కావున నెక్కడి మాట కక్కడనే యన్వయము) ఆల్లయది = అదిగో నా చెలి, నేర్పుమైన్ = నేర్పుతో, నెఱులన్ = తలవెండ్రుకలలో, తొలుపూన్ = తొల్త గోసినపూవును, తుఱిమెన్ = చెరివెను. దర్పకునకున్ = మన్మథునకు, అర్పింపన్ = సమర్పించుటకు, తలఁపదు = తలంపదు, ఎంతటి పెరిమె = (పూవులందు) ఎంత ప్రేమయే, (పెరిమె యన గౌరవ మనియుఁ బెద్దఱిక మనియుఁ గొంద ఱర్థముఁ జెప్పి యున్నారు. పెద్దఱిక మను నర్థము గ్రహింతు మేని పెద్దఱికముచే మన్మథుని లక్ష్యము చేయలే దని భావము.) ఇంతి = చెలీ, పావురపురొద = పావురాయికూఁత, ఏల వినెదు = (ప్రశ్న) ఎందులకు వినుచున్నావు? (ఉత్త.) ఆరజము = సొంపైనది. వింతయే = ఇది యంతవింత యైనదా? ఎన్నఁడును విని యెఱుంగనిదా? విరహిణులన్ = వియోగము పొందినస్త్రీలను, వెతఁ బెట్టు బేరజము = ఆయాసపెట్టుకొంటెతనము గలది. సురపొన్నక్రొన్ననల్ = సురపొన్నయొక్క క్రొత్తమొగ్గలను, చొచ్చి = ఆచెట్లలో ప్రవేశించి, నలుగడన్ = నాల్గువైపులను, వెదకు = నీవు వెదకుము. అందుల తావితండంబు = ఆపూలవలని పరిమళపుసమృద్ధి, క్రొవ్వెదకున్ = క్రొత్తకొవ్వునకు, తఱుగదు = తగ్గదు, అఱిమి = మీఱి, ఆక్రమించి, ననున్ = నన్ను, చివురునకున్ = చివురుటాకునకు, కంటకము = పరుషవచనము, ఆడన్ = పలుకుట, నిందఁ జేయుట, అగునె = అనఁదగునా? వేఱక్కచోటన్ = ఇంకొక్కప్రదేశమునందు, కంటకము = ముల్లు, ఆడన్ = నాటుకొనఁగా, గ్రుచ్చికొనఁగా ననుట, చుఱుకుమనెన్ = చుఱుక్కుమనెను. కుందములు = మొల్లమొగ్గలు, నీకున్, ఒసఁగన్ = ఇయ్యను, కైశికమున్ = కొప్పునందు, కూర్చితిన్ = చేర్చితిని, పెట్టుకొంటిని. ఇందులకున్ = ఈపూలకు, వెల = క్రయము, అడుగనేల = అడుగుట యెందులకు, వైశికము = బోగముతనము, (మోసమును) విడు = మానుము, గొజ్జంగ = గొజ్జంగపొద, చిఱుఁదేంట్లకున్ = చిన్నతుమ్మెదలకు, గుజ్జెనఁగూళ్లు = ఆటతిండ్లు, (పసిపిల్ల లాటలాడుకొనుచుఁ జిన్నిపిడతలతో వండుకొని తినునన్నమునకుఁ బేరు) (పా. చిఱుతేంట్ల కొదవె గుజ్జనఁగూళ్లు =చిన్నితుమ్మెదలకు గుజ్జనగూళ్లు లభించెను.) ఒసఁగెన్ = ఇచ్చెను, అది = ఆవిషయము, ఎఱుఁగక, పూవు, అందన్ = అందుకోఁగా, ఇటు, రజ్జంగన్ ఏల = నిష్ఠురోక్తు లాడ నేల, ఇంతి = వనితా, నీవు, రతిపతిన్ = మన్మథుని, తెగడన్ = దూఱఁగా, ఎదిరింపన్ పోలున్ = మారుఁడు నీపయి నెదిరించి యుండవలయును. (కనుకనే) పొగడ = పొగడచెట్టు, తుదలన్ = కొనకొమ్మలయందు, చివురులు = చిగురాకులు, పొదలన్ = వృద్ధి నొందఁగా, పూచినది = పుష్పించినది. (మన్మథుని దూషింతువేని నాతనికిఁ గుసుమాయుధములు సిద్ధముగా నున్నవి యనుట), అల్లనన్ = మెల్లఁ, గందవొడికిన్ = బుక్కామునకు, ఈప్రేంకణము = ఈప్రియాళువును, పుడుకుము = వ్రేళ్లతో నానియు నాననటుల నొక్కి పట్టుము. ఇటు = ఈవిధముగా, (పా. తడయకు = ఆలస్యము చేయకుము) తడయక = ఆలస్యము చేయక, నీకున్ = నీకు, తగన్ = (పుప్పొడి త్వరగాఁ గాల్చినందులకు) తగినటుల, రత్నకంకణము = మణులు చెక్కినమురుగును, ఇత్తున్, నెరసిపోన్ = దాఁటిపోవుటకు, (పొదరిండ్లలో దూరి తప్పించుకొనిపోవుటకు) చూచెదవు = యత్నము చేయుచున్నావు, నిలునిలువుమా = అటులఁ బోవల దాగుమాగుము. (ఆదరాద్ద్విరుక్తిః) కనము = అరిగితినేని, తిరిగి నిన్నుఁ గలిసికోఁజాలము, (ఏలన) కురియు తేనెలన్ = కాఱుచుండెడు తేనెలచే, అంతటన్ = అన్నిచోటులందును, వనము = ఈ యుద్యానవనము, జీబుకొన్నది = క్రిక్కిరిసియున్నది. అల్లయది = ఆదిగోనది, (ఆదూరముగా నెట్టయెదుటఁ గనిపించునది) కాదు = మోదుగుకాదు, ఫుల్లకంకేళి = వికసించిన యశోకవృక్షము, పన్నిదము = పందెము (ఎంత), (మఱొక్కతె యనుచున్నది.) మోదుగు = మోదుగు చెట్టే, ఓడినన్ = ఓడిపోయినచో, నీదు ముత్యాలజన్నిదము = ముత్యాలసరము (పందెము పెట్టుము) (కాదు = అది కంకేళి కాదు అనునర్థ మొకానొకరు వ్రాసిరి గాని యంతకంటె నిదియె సరసము). ఈయరఁటిబాలెంత = పూచిన యీ యరఁటిచెట్టు, ఏటవాలైనయది = ఒఱగినది, చేటునకె = చెఱుపునకే, అగుచూలుచేన్ = అగునట్టిప్రసవముచే, కలుగుమేలు = కలుగు నుపయోగము. ఎంత = ఏపాటిది? (అరఁటిని గెలవైచిన పిదపఁ గొట్టివేయుదు రనుట. అట్టి యాపత్కరమయిన చూలు గనుకనే యిప్పు డిట్టి యవలక్షణము పుట్టినదని భావము.) నెలఁత = వనిఁతా, ఈగేదంగిన్ = ఈపచ్చమొగిలిని, నీకున్ = నీకు, బుక్కాము = గందవొడి, అబ్బెన్ = లభించెను, చిలుకు నీపుప్పొళ్లు = రాలునట్టి యీపూదుమ్ము, చెంచెతలబుక్కాణము = చెంచుటాండ్రకు గంధపొడి, విరవాది = విరజాజితీఁగ, మితి లేని తేనెన్ = మేరయే లేనంతమకరందమును, ఆమెతచేసెన్ = (తుమ్మెదకు) విందు చేసెను (ఎంతో తేనియ నొసంగినను ఆతుమ్మెద దానితోఁ బరితృప్తి కొంచెమేని పొందక) ఇతరలతికలన్ = పెఱతీవలను, మరగి = రుచి మరిగి, ఏఁగున్ = పోవుచున్నది. అది, పరవాది = పరులపక్షముఁ బూనునది. (కావునఁ దనివినననిది తన్ను గారవించినవాని దిరస్కరించు ననుట) నలినాక్షి = ఓచెలీ! నీకున్ = నీకు, తఱచు = విస్తారముగా, ఎదను = మదిని, కలిగొట్లు = పాటలీవృక్షములను, ప్రాఁకువేడ్కలె = ఎగఁబ్రాఁకవలయు నను కోరికలే, కడిమిగండమునకున్ = (జాఱిపడినచోఁ గల్గు) పెద్దయాపదకు, అటులఁ బ్రాఁకిన జాఱిపడుట నిశ్చయము గాన నాయపాయమునకె, ఏన్ = నేను, వెఱచెదను = భయపడెదను. కరికుంభకుచ = వీనుఁగు కుంభస్థలముల వంటి గుబ్బలు గల చెలియా! గురివెందన్ = బండిగురివెందతీగెను, పయ్యెరదొంగ = గాలి యనుతస్కరుఁడు, అదె, గిలుబుకొనియెన్ = దొంగిలించెను. కొల్లగొనియెను. తావిగల పూవుల నన్నింటి హరించెను. మై = శరీరము, అర క్రుంగన్ = సగము వంగునట్లు, శరీరమును వంచి, విరులు = గురివెందపూలు, వెరఁజు = ప్రోగుచేయుము. లకుముకులు = టిట్టిభపక్షులు, (మీలవల్లంకు లందురు.) మెరమెరని = మెరమెర యని మెఱయుచుండెడి, కొలనిదరిమీలు = సరస్సుగట్టున నుండెడిచేఁపలు, అంచున్ = అని భ్రమయుచు, నీకనుదోయిన్ = నీకనులజంటను, మరగెన్ = ఆశించెను. చకచకలు = చకచకలాడు కన్నులకాంతులు, మాయింపు = అణఁచివేయుము. ఏకాంతము = రహస్యము. అని, తొలఁగెదు = తప్పుకొనెదవు. ఇందున్ = ఇచ్చో, నీవు, వేఱు అంటే = వేఱయినదానవా, నీవు గూడ మాలోనిదానవే గదా తొలఁగిపో నేల? మున్నాడి = ముందుగా, చెలువ = చెలీ, ఈవటివేఱు = ఈవట్టివేఱును, చేకొనవె = కైకొనవె. ఈయేడాకులరఁటిన్ = ఈకానఁబడు ఏడాకులయరఁటిచెట్టునందు, అగుకప్పురము = కల్గుకర్పూరము, అరిది = అపురూపమయినది, సాధారణముగా లభించునది కాదు. దానికిన్ = ఆకర్పూరమునకు, అల శశియొడలు = ఆచంద్రునిమేను, చంద్రబింబముగూడ, సరిరాదు = సమానము కాదు. (ఏలన) ఉరము = ఱొమ్ము, కప్పు = నల్పు, (చంద్రబింబమునకు మధ్యకళంకము గలదు. ఏకళంకము లేక తెల్లఁగా నున్న పచ్చకప్పుర మాచంద్రుని మించినది) పాళకున్ = పూవుగెలకు, ఆల్లది = అదిగో నాచెలి, పోఁకన్ = పోఁకచెట్టును, ప్రాఁకన్ = ఎగఁబ్రాఁకఁగా, బందము తెగియెన్ = కాలికిఁ గట్టుకొనిన త్రాడు తెగిపోయెను. అళి = దానిచెలి, అది దిగజాఱునట్టి చందము = జాఱిపడిపోవుచున్న తెఱఁగు (చూచి) నగియెన్ = నవ్వెను. ఈవేళన్ = ఈసమయమున, బళి = బాగు, మావి = మామిడిచెట్టు, మలయుకోవెల పంచమస్వరంబు అను ఈలన్ = వ్యాపించునట్టి కోయిలయొక్క పంచమకూజిత మను ఈలచేత, మలయపవనునిన్ = మలయమారుతమును, పిలిచెన్ (గాలి లేనిచో ఈల వేసినయెడ వీచు నని ప్రతీతి) మంజులవాణి = మనోహరవాక్కులు గలదానా (చెలి), చంపకము = సంపంగి, సులభమై = సులువుగా, దొరకెన్ = లభించెను, పూఁబొదలు = పూలపొదలు, చిలువ ఆనెన్ = పాము అంటినది. చేరి = సమీపించి, ఇఁకన్, వంపకము = వంగలాగకుము, (పా. చిలుకవన్నెపుఁ బొదలు, అన్నెపుఁబొదలు = ఇతరములగు పూఁబొదలు, చిలుకవు = పూలనీయవు) సఖులార = చెలిమికత్తెలార, ఇఁకన్ = ఇఁకమీఁద, దవ్వులకున్ = దూరమునకు, పువ్వులకున్, చనకుఁడు = పోకుఁడు. అనుచున్, అతివలు = స్త్రీలు, అల్లనన్, డాసి = చేరి, అలరులు = పూలు, కోసిరి.

అలం. మెరమెరని యనుచో భ్రాంతిమంతము. కావ్యలింగము. అరిదిశశియొడలు అనుచో ప్రతీపము. లకుముకులు నీటిరేవున నున్న చేఁపల మిగులఁ జులకనఁగాఁ బట్టుకొను ననుటకు.

మ. “కలయన్ నీలమయంపుఁ దల్లియొఱ దాఁకన్ దేటనీ రొప్పుర
    థ్యలకూపంబుల మీలఁ జూచి వలభీవ్యాసంగితుంగద్రుశా
    ఖలలో డాఁగి గుభాలనన్ లకుముకుల్ గ్రందై పడున్ లేచు.”

(ఆముక్తమాల్యద ప్రథ. 57)

క.

నాళీకమధూన్మత్తమ, రాళీముఖరాళిసుఖకరంబగుకొలనన్
గేళీలాలసగతి డిగి, యాళీనివహంబు లోల లాలెడువేళన్.

85

టీ. నాళీక...కరంబు - నాళీక = తామరలయందలి, మధు = మకరందముచే, ఉన్మత్త = మదించిన, మరాళీ = అంచపెంట్లవలనను, ముఖర = ధ్వని చేయు, అళి = తుమ్మెదలవలనను, సుఖకరంబు = సుఖమును గలిగించునది, అగు కొలనన్ = అగు సరస్సున, కేళీలాలసగతిన్ = క్రీడలయం దాసక్తి గల స్థితితో, డిగి = దిగి, ఆళీనివహంబులు = చెలికత్తెలసమూహములు, ఓలలు ఆడెడువేళన్ = ఓలలోలలని యీఁదులాడునెడ. పైపద్యముతో నన్వయము.

తా. తామరతూండ్లు దినియుఁ దామరపూఁదేనెలు త్రాగియు మత్తు గొన్నహంసలు దుమ్మెదలు గలిగి సౌఖ్యము గలిగించునదియై యొప్పుచున్న యొకతామరకొలనిలో దిగి వరూథిని చెలికత్తెలందఱును జలక్రీడ చేయుచుండఁగా.

ఉ.

వాడినమోముఁదమ్మి తెలివాలికకన్నులు విన్నఁ బోవఁ దో
నాడక నెన్నొసల్ కరమునం దిడి తీరనిషణ్ణ యై జలం
బాడఁగఁ బిల్చువారి నొకహస్తపుమ్రొక్కున నాడుఁ డంచు దా
జూడక చూచుచూడ్కి నలజోటిదెసల్ పరికింప నొక్కచోన్.

86

టీ. అలజోటి = ఆస్త్రీ (వరూథిని), వాడినమోముఁదమ్మి = (విరహాతిశయముచే) సోలినపద్మమువంటి ముఖమును, తెలివాలికకన్నులు = తెల్లనైన నిడుపులైన కన్నులు, విన్నఁబోవన్ = కళ దప్పియుండగా, తోన్ = కూడ, ఆడక = (జలక్రీడ) సల్పక, నెన్నొసల్ = నిండునొసలు, కరమునందున్ = అరచేతిలో, ఇడి = ఉంచి, తీరనిషణ్ణ = ఒడ్డునఁ గూరుచున్నది, జలంబు ఆడఁగన్ = జలవిహారము సేయుటకు, పిల్చువారిన్ = పిలుచుచున్న చెలిమికత్తియలను, ఒకహస్తపుమ్రొక్కునన్ = (నొసలు పెట్టుకొన్న చేయిగాక రెండవ) ఒంటిచేతిమ్రొక్కుతో, ఆడుఁడు అంచున్ = మీరు సల్పుఁడు (నేను రాను అని, తాన్, చూడక = ఎదిరివస్తువును గ్రహింపక, చూచుచూడ్కిన్ = చూచెడు రిత్తచూపులతో, దెసల్ = దిక్కులు, పరికింపన్ = చూడఁగా,ఒక్కచోన్. పైపద్యముతో నన్వయము.

స్తంభాదులు సాత్వికలక్షణములు; అవి యెనిమిది. కన్నులు చిన్నవోవుట మోము వాడుటయు సాత్వికలక్షణములలోఁ జేరినవనుటకు నాధారము.

    "స్తంభ ప్రళయ రోమాంచాః స్వేదో వైవర్ణ్య వేపథూ
    అశ్రు వైస్వర్య మిత్యష్టౌసాత్త్వికాః పరికీర్తితాః”

(సాహిత్యచింతామణి)

దెసలు పరిశీంచుట చెలులు చెప్పినమాటను బట్టి ప్రవరుఁ డెటనేని కానవచ్చునేమో యని, మ్రొక్కుతోఁ బ్రత్యుత్తరము నొసంగుట విరహాతిశయమునఁ బలుకనోడి.

తా. ఆవరూథిని విరహాతిశయముచేత వెలవెలఁబోయినమోము గలదై తక్కు చెలులతో జలక్రీడ సల్పక వామహస్తమున నొనలు చేర్చుకొని యొడ్డునఁ గూర్చుండి నీ రాడ రమ్మని పిల్చుచెలులకు రెండవచేతితో నేను రాను మీరు కానిం డని మ్రొక్కు మ్రొక్కుచు నెదిరివస్తువును గ్రహింపనేరని రిత్తచూపుతో దిక్కులను జూచుచుండఁగా నొకవైపున.

మాలిని.

రవిరుచిఁ ద్రసరేణువ్రాతముల్ మించువాత్యా
నివహనిహతిలో నిందిందిరశ్రేణు లాడన్
గువలయఘనకుల్యాకూలవల్లీవనీసం
భవము లగుచు మింటన్ బర్వుపుప్పొళ్లలోనన్.

87

టీ. రవిరుచిన్ = సూర్యకాంతియందు (ఎండలో), త్రసరేణువ్రాతముల్ = పరమాణుసమూహములు, మించు వాత్యానివహనిహతిలోన్ = అతిశయించుచున్న సుడిగాలియొక్క సమూహము కొట్టుటలో, ఇందిందిరశ్రేణులు = తుమ్మెదలసమూహములు, ఆడన్ = తిరుగుచుండఁగా, కువ...సంభవములు - కువలయ = కల్వలచే, ఘన = దట్టమైన, కూల్యా = కాల్వలయొక్క, కూల = గట్లయందలి, వల్లీవనీ = తీగలసమూహమునందు, సంభవములు = జనించినవి, అగుచున్ = అయి, మింటన్ = ఆకసమున, పర్వుపుప్పొళ్లలోనన్ = ప్రసరించు పుష్పపరాగములో. త్రసరేణువు: గవాక్షమునుండి వచ్చు వెలుఁగులోఁ గానవచ్చు అణువును రజ మందురు. దానిలో నాఱవభాగమును ద్రసరేణు వందురు. ఇ ట్లనుటకు.

శ్లో. “జాలసూర్యమరీచిస్థం సూక్ష్మం యద్ధృశ్యతే రజః,
    తస్య షష్ఠతమో భాగః త్రసరేణురితి కథ్యతే.”

తా. ఎండవెలుఁగులోఁ గానవచ్చు చిన్నిపరాగముతో సుడిగాలి గొట్టఁగాఁ దుమ్మెద లాసుడిగాలిలో నాడుచుండఁ గలువలు నింపినకాలువలగట్టులందుఁ దీవప్రోవులలోని పుప్పొడులు రేఁగి యాకసమునంతయు నాక్రమించుకొనఁగా నాపుప్పొడిలోన — (పైపద్యముతో నన్వయము.)

సీ.

పసిఁడితోరముతోడి బాహు వల్లన నెత్తి
          సారెకుఁ బొదలపైఁ జాఁచి చాఁచి
బింబాధరంబు గంపింప నొయ్యన విపం
          చీస్వరంబున జట సెప్పి చెప్పి
దిశల మార్గాన్వేషిదీర్ఘలోచనదీప్తి
          గణముచేఁ దోరణకట్టి కట్టి
కమనీయతనుకాంతికనకద్రవంబున
          నారామరంగంబు నలికి యలికి


తే.

యానితంబవిలంబికాలాహికల్ప
ఘనకచగ్రంథి నచటిభృంగముల కసిత
దీధితులు వడ్డి కొసఁగుచు దేవపూజ
విరులు చిదిమెడి కపటభూసురునిఁ గనియె.

88

టీ. పసిఁడితోరముతోడి బాహువు - పసిఁడి = బంగారుతోఁ జేసిన, తోరముతోడి = వ్రతకంకణముతోఁ గూడిన, బాహువు = భుజమును, అల్లనన్ = మెల్లఁగా, ఎత్తి, సారెకున్ = మాటికిని, పొదలపైన్ = పూవులచే నలరారు పొదలపైన, చాఁచి చాఁచి = సాగించి సాగించి (అందుకొనుటకుఁ జాపి) బింబాధరంబు = దొండపండువంటి మోవి, కంపింపన్ = చలింపఁగా, ఒయ్యనన్ = చక్కఁగా, విపంచీస్వరంబునన్ = వీణాధ్వనివంటిధ్వవితో, జట = వేదజటను, (ముందు వెనుక పదములను రెట్టించి రెట్టించి చెప్పెడిక్రమమును జట యందురు.) చెప్పి చెప్పి = పలుమాఱు పఠించి పఠించి, మార్గా...గణముచేన్ - మార్గాన్వేషి = త్రోవను వెదకు, దీర్ఘలోచన = సోగకన్నులయొక్క, దీప్తిగణముచేన్ = కాంతిపుంజముచే, దిశలన్ = దిక్కులను, తోరణ కట్టి కట్టి = తోరణములు కట్టి, పలుమాఱు దిక్కులను దేరిచూచుచు నని భావము. కట్టుపదము పడ్వాదులలోనిది గాన పర మగుటచే మువర్ణలోప మయ్యెను. ఇటులె, జయపెట్టు, భయపడు. కమ...వంబునన్ కమనీయ = మనోహరమైన, తనుకాంతి = శరీరకాంతి యను, కనకద్రవంబునన్ = బంగరునీటిచే, ఆరామరంగంబున్ = వనప్రదేశమును, (ఉద్యానవన మను నాట్యప్రదేశమును) అలికి యలికి = బంగారు కరిగిన నీటివలె నున్నమేనికాంతి యాప్రదేశమునిండ బాగుగాఁ బూసి, ఆనితంబ...గ్రంథిన్ - ఆనితంబ = పిఱుఁదువఱకు, విలంబి = వ్రేలాడు, కాలాహికల్ప = కాలసర్పమువంటి, ఘన = పెద్దదైన, కచగ్రంథిన్ = సిగముడిచే, అచటిభృంగములకున్ = అక్కడి తుమ్మెదలకు, అసితదీధితులు = నల్లనికాంతులు, వడ్డికిన్ = వృద్ధికి, ఒసఁగుచున్ = ఇచ్చుచు, తుమ్మెదలు నల్లనివి; పెన్నెరి యింకను నల్లనిది. కాన తన నీలకాంతి తుమ్మెదలకు వడ్డి కీయఁగల్గుట. దేవపూజవిరులు = దేవతార్చనపుష్పములు, చిదిమెడుకపటభూసురునిన్ = కోయుకృత్రిమబ్రాహ్మణుని, ప్రవరవేషధారియగు గంధర్వకుమారుని, కనియెన్ = వరూథిని చూచెను.

తా. వరూథిని బంగారువ్రతకంకణముగల హస్తమును బూలకై పొదలమీఁదికిఁ జూచుచు దొండపండువంటి మోవి యదరఁగా వీణాధ్వనివంటి ధ్వనితో జట సెనెప్పుచు, త్రోవను నిడుదచూడ్కులచే దిక్కులను దోరణకట్టించుచు కరుగఁ బోసిన బంగరువంటి మేనికాంతిని వనము నెల్ల వ్యాపింపఁజేయుచు బిఱుఁదులవఱకు వ్రేలాడు పెన్నెరుల జాఱుముడిచే నచటి తుమ్మెదల కెక్కువనల్పు నొసఁగుచు దేవతార్చనపుష్పములను గోయు కపటబ్రాహ్మణునిఁ జూచెను.

అలం. ఉపమాపరిణామనిదర్శనాలంకారములు.

ఉ.

కాంచి కలక్వణత్కనకకాంచిక యై యెదురేఁగి యప్పు డ
త్కాంచనకేతకీకుసుమగాత్రివయస్యల డించితన్ని కుం
జాంచలవీథిఁ దాఱుచు ఘనాంతచలచ్చపలాకృతిన్ గలన్
గాంచినవస్తువున్ దెలిసి గాంచినయ ట్లనురక్తిఁ గాంచుచున్.

89

టీ. కాంచి = ఆకపటబ్రాహ్మణకుమారుని జూచి, అక్కాంచనకేతకీకుసుమగాత్రి = పసిమి మొగిలిపూవువంటి మేనుగలయావరూథిని, అప్పుడు, వయస్యలన్ = చెలికత్తెలను, డించి = విడిచి, కల...చికయై - కల = అవ్యక్తమధురముగా, క్వణత్ = ధ్వని చేయు, కనకకాంచిక యై = బంగరుమొలనూలు గలదై, ఎదురేఁగి = ఎదురుగాఁ బోయి, తానే యొంటరిగా నెవ్వతెను సహాయము గైకొనక యతఁ డున్నయెడ కేఁగి, ఘనాంతచలచ్చపలాకృతిన్ - ఘన = మేఘములయొక్క, అంత = సమీపమునందు, చలత్ = సంచరించుచున్న, చపలాకృతిన్ = మెఱుపువిధముగా, తన్నికుంజాంచలవీథిన్ - తన్నికుంజ = మాయావిప్రుఁడు పూలు గోయు పొదరింటియొక్క, అంచలవీథిన్ = చివరిప్రదేశమందు, తాఱుచున్ = నక్కుచు, కలన్ = స్వప్నమున, కాంచినవస్తువున్ = చూచినపదార్థమును, తెలిసి = మేల్కని, కాంచినయట్లు = చూచినవిధమున, అనురక్తిన్ = అనురాగముతో, ఆకపటబ్రాహ్మణుని, కాంచుచున్ = చూచుచు, మీఁదిపద్యముతో నన్వయము.

తా. ప్రవరాఖ్యునిరూపమును దాల్చి యెదుటఁ గానవచ్చిన గంధర్వకుమారునిఁ జూచి ప్రవరుఁడని మనస్సులో నిశ్చయించికొని వానిని బలుమాఱు జూచి కలలోఁ గన్నదానిని మేలుకనినపిదప మరలఁ గాంచినవిధమున సంతసించుచు వయన్యల విడిచి బంగరుగజ్జెలమొలనూలు మ్రోఁగఁగా నెదురుసని, యాతఁ డున్నపొదరిండ్లనడుమనే మబ్బులలో మెఱుపువిధమునఁ దాఱుచు.

అలం. ఉపమోత్ప్రేక్షానిదర్శన అలంకారములు.

ఉ.

ఆకమలాక్షి యింపున దృగంచల మించుక మూసి హర్షబా
ష్పాకులకోణశోణరుచు లగ్రమునన్ జనఁ జూచు చూపుతీ
రై కనుపట్టెఁ దమ్మరస మంటుకొనక్ వెడవింటివాఁడు క్రో
ధైకధురీణతన్ గఱచి యేసినసింగిణికోలయో యనన్.

90

టీ. ఆకమలాక్షి = ఆవరూథిని, ఇంపున్ =ఎలమితో, దృగంచలము = జడకన్ను, ఇంచుక మూసి = కొంచెము మూసికొన్నదై (అరచూపుతో), హర్ష...రుచులు - హర్షబాష్ప = సంతోషబాష్పములచే, ఆకుల = కలఁకఁబాఱిన, కోణ = కనుఁగొనలయొక్క, శోణరుచులు = ఎఱ్ఱనికాంతులు, (పా. శోణకోణరుచులు = ఎఱ్ఱనికనుఁగొనలకాంతులు) అగ్రమునన్ = ఎదుర, చనన్ = ప్రసరించునట్లు, చూచుచూపు = కనుఁగొనునట్టిదృష్టి, తీరై = అంతమై, వెడవింటివాఁడు = మన్మథుఁడు, క్రోధైకధురీణతన్ = కోపోద్రేకముచే, తమ్మరసము = తాంబూలపుద్రవము, అంటుకొనన్ = సోఁకునటుల, కఱచి = పెదవి కొఱికి, ఏసినసింగిణికోలయో = ప్రయోగించినకొమ్ములవింటిబాణమో, అనన్ = అనునట్లు, కనుపట్టెన్ = కనఁబడెను.

తా, ఆవరూథిని యెలమితోఁ గడకన్ను కొంచెము మూసి సంతోషబాష్పములతోఁ గలఁక పాఱినకన్గొనలయెఱ్ఱనికాంతులు ముందునకుఁ బాఱఁగాఁ జూచినచూపు మన్మథుఁడు కోపోద్రేకముతోఁ దమ్మరస మంటునట్లు కసిదీఱఁ గొఱికి ప్రయోగించిన సింగిణికోలయో యనున ట్లుండెను.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

సీ.

తొలుదొల్త వానిఁ గన్నులఁ గాంచినప్పుడ
          పల్లవాధరగుండె జల్లు మనియె
నట రెండుమూఁడంజ లరుగునప్పుడ కాళ్లఁ
          బంకజాక్షికిఁ దొట్రుపాటు గదిరె
డాయంగఁ జనునప్పుడ ముఖాంబుజంబునఁ
          గంబుకంధరకు దైన్యంబు దోఁచెఁ
గదిని నిల్చినయప్డ కనుదోయిఱెప్పల
          లలనకు మిగులఁ జంచలత బెరసెఁ

తే.

గటకటా యనునపుడ గద్గదిక వొడమెఁ
జెఱఁగుపట్టినయపుడ లేఁజెమట గ్రమ్మె
సొలసి మాటాడ నుంకింపఁ దలఁచి మోముఁ
దేరకొని చూచునపుడ కన్నీరు వొడమె.

91

టీ. తొలుదొల్తన్ = మునుముందు, వానిన్ = ప్రవరవేషధారియగు గంధర్వకుమారుని, కన్నులన్ = కన్నులతో, కాంచినప్పుడ = చూచినప్పుడే, పల్లవాధరగుండె = చివురువంటిమోవి గల వరూథిని డెందము, జల్లుమనియెన్ = చలించెను. జల్లు అనుట ధ్వన్యనుకరణము. అటన్ = అవ్వల, రెండుమూఁడు, అంజలు = అడుగులు, అరుగునప్పుడు = చనునప్పుడే, పంకజాక్షికిన్ = పద్మములఁ బోలు కనులుగల వరూథినికి, కాళ్లన్ = అడుగులందు, తొట్రుపాటు = తడబాటు, కదిరెన్ = కలిగెను, డాయంగన్ = చేర, చనునప్పుడ = పోవునప్పుడే, ముఖాంబుజంబునన్ = ముఖపద్మమున, కంబుకంధరకున్ = శంఖమువంటిమెడ గల వరూథినికి, దైన్యంబు = బీదతనము, మనస్సులోనివిచారముచే బయటికిఁ దోఁచిన వెలవెలపాటు, తోఁచెన్ = కనఁబడెను. కదిసి = డగ్గఱి, నిల్చినయప్డ = నిలుచున్నసమయమునందే, లలనకున్ = వరూథినికి, మిగులన్ = విస్తారముగా, కనుదోయిఱెప్పలన్ = రెండుకన్నులఱెప్పలకు, చంచలత = చాంచల్యము, బెరసెన్ = కలిగెను. కటకటా = అయ్యో! ( మోసపుచ్చితివి గదా) అనునపుడ = అనుచునున్నపుడే, గద్గదిక = డగ్గుత్తిక, పొడమెన్ = జనించెను. చెఱఁగు = (వాని)వస్త్రపుఁగొంగును, పట్టినయపుడ, లేఁజెమట = చిఱుచెమట, క్రమ్మెన్, సొలసి = సొక్కి, మాటాడన్, ఉంకింపన్ = యత్నించుటకు, తలఁచి, మోము = (వాని)ముఖము, తేరకొని = తేరఁబాఱి, చూచునపుడ = తిలకించునపుడే, కన్నీరు = బాష్పములు, పొడమెన్ = పుట్టెను. విచారముచేఁ గ్రమ్మెను. “భావమ్మనోగతం సాక్షాత్స్వహేతుం వ్యంజయంతి యే, తేనుభావా ఇతి ప్రోక్తా భ్రూవిక్షేపస్మితాదయః" అనుప్రమాణముచే రత్యాదులఁ దెల్పు భ్రూవిక్షేపాదు లనుభావములు. ఇవి శారీరములు మానసము లని రెండువిధములు. శారీరములు సాత్వికము లని, మానసములు వ్యభిచారు లని పేరు. ఇందు సాత్వికభావములు ఎనిమిది. అవి యే వన,

శ్లో. “స్తంభః ప్రళయరోమాంచాః స్వేదో వైవర్ణ్య వేవథూ
    అశ్రువైస్వర్యమిత్యష్టౌ సాత్వికాః పరికీర్తితాః."

ఈసాత్వికభావము లిందు వరూథినికి మాయాప్రవరసందర్శనమునఁ గలిగినటులఁ జెప్పఁబడెను.

తా. ప్రవరునివేషముతో నున్న యాగంధర్వుని మునుముందు చూడఁగానే యావరూథినికి గుండె జల్లుమనెను. ఆవల రెండుమూఁడడుగులు చనునప్పటికి నడుగులు తడఁబడఁదొడఁగెను. చేరఁబోవునప్పటికి మోమున దైన్యము తోఁచెను. చేరి నిల్చునప్పటికి రెండుకనులందును జాపల్యము కలిగెను. కటకటా! న న్నింత మోసపుచ్చితివి గదా యనునప్పటికి డగ్గుత్తిక పడెను. పైకొంగు పట్టుకొనఁగానే చిఱుచెమ్మటలు గ్రమ్మెను. మాటాడుటకుఁ దలఁపఁగానే కన్నుల నీరు క్రమ్మెను.

అలం. స్వభావోక్తి.

క.

పాటితకరిదంతద్యుతి
పాటచ్చరగండఫలకభాగంబులపైఁ
గాటుకకన్నీ రొలుకఁగ
మాట వెడలఁ గ్రేటుకొనుచు మానిని పలికెన్.

92

టీ. మానిని = స్త్రీ (వరూథిని), పాటిక...భాగంబులపై - పాటిత = పగుల్పఁబడిన, నడిమికిఁ జీల్పఁబడిన, కరిదంత = ఏన్గుదంతములయొక్క, ద్యుతి = కాంతికి, పాటచ్చర = దొంగలైన, గండపలకభాగంబులపైన్ = పలకలవంటి చెక్కిళ్లపట్టులందు, విహారాతిశయమున స్రుక్కుటచే వెలవెలఁ బోయి నీరసముగా నున్న తెల్లనిచెక్కులందు, కాటుక కన్నీరు = కాటుక గలిసిన కన్నీటిబిందువులు, ఒలుకఁగన్ = చిందుచుండఁగా, మాట వెడలన్ = మాట వచ్చుటకు, క్రేటుకొనుచున్ = గొంతు సరిచేసికొనుచు, పలికెన్ = ఇటు లని యొకమాట చెప్పెను.

అలం. ఉపమాస్వభావోక్తులు.

ఉ.

ఏలర యీచలం బుడిగి యేలర బాలరసాలమాలతీ
జాలములో శశాంకకరజాలములో వలవంత నశ్రువుల్
జాలుగ నాల్గుజాలు నిఁకఁ జాలు భవం బనునంతకాఁకకున్
బాలయి రాత్రి పంచశరుబారికిఁ జిక్కితి నీకు దక్కితిన్.

93

టీ. ఈచలంబు = ఈమచ్చరము, పట్టుదల, ఏలర = ఎందునకురా? ఉడిగి =(చలము) మాని, బాల...జాలములోన్ - బాలరసాల = తియ్యమామిడిగున్నయొక్కయు, మాలతీ = జాజులయొక్కయు, జాలములోన్ = సమూహమునందు, వానిమధ్యభాగములయందు, ఏలర = ఏలుకోరా, రాత్రి, నాల్గుజాలున్ = నాల్గుజాములును, వలవంత = మదనతాపముచే, అశ్రువుల్ = కన్నీరు, జాలుగన్ = వెల్లువ కాఁగా, శశాంకకరజాలములోన్ = చంద్రకిరణసమూహమందు, నిండారఁ గాయు పండువెన్నెలయందు, భవంబు = ఈజన్మము, ఇకఁ జాలు = ఇంకమీఁదట నవసరము లేదు, అనునంత = అని తలంచునంతటి, కాఁకకున్ = తాపమునకు, పాలు అయి = లోబడి, పంచశరుబారికిన్ = మన్మథునిబాధకు, చిక్కితిన్ = లోనైతిని, నీకున్ దక్కితిన్ = నీకు వశమైతిని.

తా. భూసురవర్యా! ఏల యీమచ్చరము? లేమావులలోను జాజిపొదరిండ్లలోను న న్నేలుకొనుము. కడచినరాత్రి యెల్లను గన్నీరు జాలువారఁగా వెన్నెలలో మన్మథబాధకుఁ దాళఁజాలక యిఁక నీజన్మము చాలురా యనునంతచింతకుఁ బాలైతిని. ఇదె నీకు దక్కితిని.

శా.

రా వైరాగ్యముఁ బూని నీవు కడు నిర్దాక్షిణ్యచిత్తంబునన్
రావైతేఁ జవిగానియిందులకు హోరాహోరిగాఁ బోరి యే
లా వాలాయము నేయఁగా బ్రదుకు నీ వాచారవంతుఁడ వై
చావో యెక్కుడొ నీయెడన్ బొడము వాంఛన్ భూసురగ్రామణీ.

94

రా= టీ. భూసురగ్రామణీ = బ్రాహ్మణశ్రేష్ఠుఁడా! రా = రమ్ము, (నన్నేలుకొనుము). నీవు, కడున్ = మిక్కిలి, నిర్దాక్షిణ్యచిత్తంబునన్ = దయలేని డెందముతో, వైరాగ్యము = విరక్తతను, పూని, రావైతేన్ = రాకపోతివేని, చవిగాని యిందులకున్ = నీకు రుచింపనిదీనికై, హోరాహోరిగాన్ = నిండుబింకముతో, పోరి = పోరాడి, వాలాయము సేయఁగాన్ = నిర్బంధము చేయఁగా, ఏలా = ఎందులకు, నీవు, ఆచారవంతుడవు ఐ = నిష్ఠ కలవాఁడవై, వేదవిదితాచారముల నతిక్రమింపక యగ్నిహోత్రరక్షణము ఏకపత్నీవ్రతము నొనర్చుచు, బ్రతుకు = జీవింపుము. నీయెడన్ = నీయందు, పొడమువాంఛన్ = పుట్టెడుకోరికచే, చావో = చావుమాత్రమో, ఎక్కుడొ = దానికి మించినదో?

నీవు ఆచారమునే యపేక్షించి పరకాంత నని నన్ను వదలుదువా? చెప్పవలసినవి యన్నియు నిదివఱకె చెప్పితిని గాన నిర్బంధించి ఫలము లేదు. అందుచే నాకు సిద్ధించునది చావు. అంత కెక్కుడు లేదు గదా! దాని కొప్పుకొని యున్నా నని భావము.

తా. భూసురవర్యా! దయమాలి నన్ను గారవింపక వైరాగ్యము పూని యుండునీతోఁ బ్రేమింపు మని బలవంతపెట్టి పోరాడఁగా నేల? నీవు సదాచారమును జెఱచుకొనక నెఱవేర్చుకొనుచుఁ జిరకాలము బ్రదుకుము. నీపై వాంఛచే నాకుఁ జావో దానికంటె నెక్కువో కలిగిన నేమి!

అలం. ఆక్షేపాలంకారము.

క.

కట్టిఁడితనమున కి ట్లొడి
గట్టి మనసు ఱాయి సేసి కరఁగవు మఱి నీ
పట్టినది విడువ విఁక ని
న్నిట్ట ట్టన నేల మాయదృష్టం బుండన్.

95

టీ. కట్టిఁడితనమునకున్ = కాఠిన్యమునకు, ఒడిగట్టి = పాల్పడి, ఇట్లు = ఈవిధముగా, ఎంత ప్రార్థించినను ఆమోదించక, మనసున్ = హృదయమును, ఱాయి చేసి = జాతివలెఁ గఠినముఁ జేసికొని, కరఁగపు = మెత్తఁబడవు, కరుణాభావమును దాల్పకపోతి వనుట, మఱి = మఱియును, నీపట్టినది = నీపట్టును, విడువవు = వదలువాఁడవు కావు, మాయదృష్టము = మాభాగ్యము, ఉండన్ = ఇటు లుండ, ఇఁకన్ = ఇంకపైన, నిన్నున్, ఇట్టట్టనన్ ఏల = ఇది యిట్లని అది అట్లని యనుట దేనికి? నిష్ఠురము లెన్ని యాడినను లాభము లేదు.

తా. బ్రాహ్మణుఁడా! కఠినుఁడవై మనసు ఱాయి చేసికొని యెంత ప్రార్థించినను దయ తలఁపకున్నావు. మాదురదృష్టవశమున నీ కింతటి కఠినబుద్ధి కలిగినదిగాని వేఱుకారణమునఁ గాదు. ఇఁక నిన్ను నే మనినను లాభములేదు. మాదురదృష్టమును గూర్చి లోలోన నిందించుకొనవలసినదే.

అలం. వ్యాజనింద.

వ.

అనిన నక్కుహనాభూసురుండు.

96

టీ. అనినన్ = వరూథిని యిటు లనఁగా, కుహనాభూసురుండు = కపటబ్రాహ్మణుఁ డగు గంధర్వుఁడు.

సీ.

కొనసాఁగి కామినీగోష్ఠిఁ బ్రౌఢములైన
          యుదుటుఁజూపుల ఱెప్పతుదల నాఁచి
సంతసంబున ముఖాబ్దమునందుఁ జిఱునవ్వు
          కందళింపక యుండ డిందుపఱిచి

పొంగారుమైఁ దోఁచుశృంగారచేష్టల
          తమిఁ దెచ్చికోలు మౌగ్ధ్యమున డాఁచి
పొడము రసావేశమున వచ్చునర్మోక్తు
          లొదివి నాలుకకు రాకుండఁ గ్రుక్కి


తే.

మస్తకము వాంచి యుసు రని మౌనముద్ర
నేల బొటవ్రేల వ్రాయుచు నిలిచి కొంత
సేపు వెడవెడ చింతించి శిర సొకింత
యెత్తి సన్నంపుటెలుఁగుతో నిట్టు లనియె.

97

టీ. కొనసాగి = సమగ్రముగా, కామినీగోష్ఠిన్ = కాముకురాండ్రతోడిసల్లాపమున, ప్రౌఢములు = గడిదేఱినవి, ఐన యుదుటుఁజూపులన్ = అగు నిబ్బరపుఁజూపులను, ఱెప్పతుదలన్ = కొనఱెప్పలచేత, ఆఁచి = అణఁచి, సంతసంబునన్ = సంతోషమున, ముఖాబ్దమునందున్ = తామరపూవువంటిముఖమునందు, చిఱునవ్వు = దరహాసము, కందళింపకయుండన్ = అంకురింపకుండునట్లు, డిందువఱిచి = తగ్గించి, పొంగారుమైన్ = ఉబ్బిపొంగుదేహమును, తోఁచుశృంగారచేష్టలతమిన్ = చూపట్టుశృంగారచిహ్నమాత్రమును, తెచ్చికోలుమౌగ్ధ్యమునన్ = తెచ్చుకొన్న ముగ్ధత్వముచే, డాఁచి = దాఁచి, పొడము రసావేశమునన్ = ఉప్పతిల్లు మోహరసాతిశయముచే, వచ్చు నర్మోక్తులు = నోరికి వచ్చెడు మేలపుమాటలను, ఒదివి = క్రమ్మి, నాలుకకున్ = నాలుకమీఁదికి, రాకుండన్ = రానియటుల, క్రుక్కి = నోటిలోననే యణఁచి, మస్తకము = తల, వాంచి = వంచి, ఉసు రని = ఊస్సు అని యొక్కనిట్టూర్పును విడిచి, మౌనముద్రన్ = మాటలాడకుండునియమముతో, నేలన్ = భూమిమీఁద, బొటవ్రేలన్ = కాలిబొటనవ్రేలితో, వ్రాయుచున్ = అక్షరముల లిఖించునటుల నటు నిటు నొరయుచు, వెడవెడ = ఏమో లేనిపోనిది, చింతించి = ఆలోచించి, శిరసు = తల, ఒకింత యెత్తి = కొంచెముగ నెత్తి, సన్నంపుటెలుఁగుతోన్ = సన్నకంఠధ్వనితో, హీనస్వరముతో (వినఁ బడివినఁబడనియట్లు) ఇట్టులు = ఈవిధముగా, అనియెన్ = ఈరీతిగాఁ బ్రత్యుత్తరము నొసంగెను.

ఆయాశృంగారలక్షణము నుపాయాంతరములచే మాటుపఱచుటయే గాక తాను పరకాంతావిముఖుఁ డని తెలియుటకు మౌనముద్ర తలవంచుట బొటనవ్రేలు వ్రాయుట సలిపెను. ఇందుచే గంధర్వకుమారుఁడు జాణ యని గ్రహింప నగును.

తా. ఆప్రవరవేషముఁ దాల్చిన గంధర్వుఁ డప్పుడు (నిజముగా బ్రవరుఁ డనిపించుటకై) స్త్రీలతోఁ గలసి మెలసి యుండుటచే గడిదేఱిన యుదుటుఁజూపులను ఱెప్పలలోనే యడఁచెను. ముఖమునఁ దోతెంచు చిఱునవ్వును గప్పిపుచ్చెను. శరీరమునఁ గన్పట్టు శృంగారచేష్టలయుద్రేకమును లేనిపోనిమౌగ్ధ్య మభినయించి డాఁచెను. మోహరసము మీఱివచ్చెడు నర్మవచనములను నాల్క దాఁటనీయకే గ్రుక్కగొనెను. తల వాంచి యుస్సు రని మౌసము దాల్చి కాలిబొటనవ్రేలితో నేల రాయుచు నేమేమో లోలోఁ జింతించి యల్లన తల యెత్తి సన్నగొంతుతో నవ్వల ని ట్లనియెను.

శా.

తల్లిందండ్రియు నన్నుఁ గాననిమనస్తాపంబునం బొక్కఁగా
నిల్లాలార్తిఁ గృశింపఁగా సవనవహ్నిశ్రేణి చల్లారఁగా
నిల్లున్ శూన్యత నొంది సొంపు చెడఁగా నిచ్చోట నేఁ జిక్కి యో
ఫుల్లాంభోరుహనేత్ర యేసుఖమతిన్ భోగించెదం జెప్పవే.

98

టీ. ఓఫుల్లాంభోరుహనేత్ర = వికసించిన తమ్మిపూవువంటి కన్నులుగలదానా! వరూథినీ! తల్లిందండ్రియున్ = తల్లిదండ్రులు, నన్నున్, కానని మనస్తాపంబునన్ = చూడమిచేఁ గలిగిన మనస్సులోని చింతచేత, పొక్కఁగాన్ = పరితపించఁగా, ఇల్లాలు = భార్య, ఆర్తిన్ = వియోగవ్యథచే, కృశింపఁగాన్ = దిక్కఁగా, సవనవహ్నిశ్రేణి = యజ్ఞాగ్నులవరుస, త్రేతాగ్నులు, చల్లారఁగాన్ = ఆఱి చల్లఁబడిపోవఁగా, ఇల్లున్ = గృహమును, శూన్యతన్ = లేమిని, ఒంది = పొంది, పాడువడి యని యొక రర్థము చెప్పిరి, సొంపుచెడఁగాన్ = నిండుతనము మాయఁగా, ఇచ్చోటన్ = ఇక్కడ, నేన్ = నేను, చిక్కి = చిక్కుకొని, ఏసుఖమతిన్ = ఎట్టిసుఖేచ్ఛతో, భోగించెదన్ = నీతో సంభోగింతునో, చెప్పవే = నీవే చెప్పుము.

తా. ఉవిదా! నేను తమకన్నులయెదుట లేక యీకాననిక్రంతలయం దుండుటచే నాతల్లిదండ్రులు నాయునికి తెలియక చింతిల్లుచుండ, నాభార్య వియోగదుఃఖ మనుభవించుచుండఁగా, యాజ్ఞికాగ్నులు చల్లారిపోఁగా, గృహము పాడ్వడఁగా, నే నిక్కడఁ జిక్కి యుండి సౌఖ్య మె ట్లపేక్షింతును? ఎట్లు నీతో భోగము లందుదును? నీవే చింతింపుము.

ఆర్తి యన విరహతాప మని నరసభూపాలీయమునం దొసఁగఁబడిన యుదాహరణము.

క. “బెడిదపుమదనజ్వరమున, మిడిసిపడున్ హారలతలు మృగలోచనకున్
    వెడవిలుతునింటికోలల, వడువున సతి నింక నేచవలదు నృసింహా.”

(ఆశ్వా. 3.)

ఉ.

ఓసరసీరుహాక్షి, వినవో రతిఁ గౌఁగిట నీవు చేర్చునిం
పాసురభర్తకైనఁ గలదా వల దంచుఁ బెనంగ నేను స
న్యాసినె యొక్కటే తహతహన్ మన సొగ్గదు కేళిపై 'ననా
శ్వాసితదఃఖితే మనసి సర్వ మసహ్య' మనా నెఱుంగవే.

99

టీ. ఓసరసీరుహాక్షీ = తామరపూవులవంటి కన్నులు గల వరూధినీ! వినవో = విన్నావుకావా, రతిన్ = సంభోగమునందు, నీవు కౌఁగిటన్ చేర్చునింపు = నీవు కౌగిలించుకొనఁగాఁ గలుగునానందము, ఆసురభర్తకైనక్ = ఆయింద్రునకైనను, (సర్వసౌఖ్యముల ననుభవించునట్టి యింద్రునికేని యనుట) కలదా; వలదు = అక్కఱ లేదు, అంచున్ = అని, పెనంగన్ = పెనఁగులాడుటకు, ఏను = నేను, సన్న్యాసినె = సన్న్యాసినా యేమి, ఒక్కటే తహతహన్ = (తల్లిదండ్రులు మొదలగువా రేమైరోయను) నెడతెగనివిచారముచే, కేళిపైన్ = భోగముమీఁద, మనసు, ఒగ్గదు = పోదు. సంభోగేచ్ఛ జనింపక యున్నది! మనసి = మనస్సు, అనాశ్వాసిత = ఊఱట లేనిదియు, దుఃఖితే = దుఃఖము నొందినదియు నగుచుండ, సర్వం = ఎల్లను, అసహ్యం = రోఁత గలదే, అనాన్ = అనఁగా, ఎఱుగవే = నీవు విని యెఱుంగవా?

రతి యన “యూనోరన్యోన్యవిషయాస్థాయినీఛ్ఛారతిర్భవేత్" ఆలంకారికనిర్వచనము. ఇది నరసభూపాలీయమునందు “సంభోగవిషయ మగు నభిలాషస్ఫురణము మనములఁ బొడమిన ధరలో నది రతి" అని చెప్పఁబడెను.

తా. ఉవిదా! నాపల్కు వినుము. ప్రేమతో నీవు కౌఁగిటఁ జేర్చుకొనఁగలుగునానంద మాయింద్రునకైనఁ గలుగదు. నీ విట్లు నన్నుఁ ప్రేమించుచుండఁగాఁ గూడ దని పెనఁగులాడుటకు నే నేమి సన్న్యాసినా? 'ఇ ల్లే మయ్యెనో? తలిదండ్రు లేమైరో? కులకాంత యెట్లుండెనో?' అను పెద్దతహతహచే మనసు గొల్పకున్నది. ఎఱుఁగవా? "అనాశ్వాసితదుఃఖితే మనసి సర్వ మసహ్యమ్” (మనస్సు ఊరట లేక చింతిలుచుండఁగా సర్వమును నసహ్యమగును) అనుపల్కును. అట్టి వెతయే నాకు లేకున్నచో నాకయి నేను నీకొఱకు వెదకికొనుచు రాకయుందునా?

అలం. అర్థాంతరన్యాసము, అర్థాపత్తి, ప్రతిషేధము.

క.

ఐనన్ గానిమ్ము భవ
ద్దీనతకై వ్రతము విడిచితిన్ బరులకు మే
లైనన్ జాలు శరీరం
బైన నుపేక్షింపవలయు నది యట్లుండెన్.

100

టీ. ఐనన్ = అటులైనను, కానిమ్ము = కానీ, నామనసు ఎటు లున్నను దానిం గూర్చి విచారింపను. భవద్దీనతకై = నీదీనత్వమును జూచి, వ్రతము = ఇఁకమీఁద నిది కోర నని యేర్పఱచికొన్న కట్టుపాటు, విడిచితిన్ = ఇపుడె విడనాడితిని. పరులకున్ = ఇతరులకు, మేలైనన్ = మంచి కలిగినను, చాలున్ = అంతియ చాలును. శరీరంబైనన్ = ఈదేహమునైనను, ఉపేక్షింపవలయున్ = విడిచిపెట్టవలయును. అది = ఆవిషయము, అట్లుండెన్ = అట్లుండఁగా.

తా. నాస్థితి యిటు లున్నను దానినిగూర్చి నే నించుకేనియు సంకోచింపఁబోను. నీ వింతగా దైన్యపడి యడుగుచున్నావు గావున నానియమమును విడనాడితిని. శరీరము విడిచి యైనను నితరులకు మేలు చేయవలయు. ఆవిషయ మట్లుండనీ.

అలం. అప్రస్తుతప్రశంస, కావ్యార్థాపత్తియును.

క.

తివురక యిం కొక్కటి విను
కవయునెడన్ వలయుఁ గన్నుఁగవయును మూయన్
భువి నిది యస్మద్దేశ
వ్యవహారము కన్నుఁ దెఱవ నఘ మగుఁ దెఱవా.

101

టీ. తెఱవా = ఉవిదా! తివురక = తొందరపడక, ఇం కొక్కటి వినుము = ఇంక నొకసంగతిని దెలిపెద నాలకింపుము. కవయునెడన్ = కలయిక చెందునప్పుడు, కన్నుఁగవయున్ = నేత్రద్వయమును, మూయన్ = మూసికొనుట, వలయున్ = ఆవశ్యకము, భువిన్ = భూమియందు, కన్ను దెఱవన్ = కన్నులను దెఱచుటచేత, అఘమగున్ = పాపము కలుగును. ఇది = సంభోగసమయమునందుఁ గన్ను మూసికొనుట, అస్మద్దేశవ్యవహారము = మాదేశాచారము.

నిజముగా దోస మేని మా కీయాచార మేల యాచరణమునందు లేకపోయె నని వరూథిని యనునేమో యనిమాయాప్రవరుఁడు అస్మద్దేశవ్యవహార మనెను. అఘ మనుటచేఁ బాపమునకు వెఱచి యటులఁ జేయకుండు ననియుఁ దనగుట్టు మరుగుచెడ కుండు ననియును.

తా. వరూథినీ! ఆత్రపడక మఱొక యీమాటనుగూడ వినుము. భూమిలో మాదేశమున సంభోగసమయమందుఁ బరస్పరము స్త్రీ పురుషులు చూచుకొనరు. కన్నులు మూసికొందురు. కన్నులు దెఱచిన పాప మగును.

అలం. కావ్యలింగాలంకారము.

శా.

ఈమర్యాదకు నీవొడంబడిన మే లీభంగి గాదేని మా
భూమిన్ జేరఁగ నెట్లు నీయెడలితోఁ బోవంగ లేనే కదా
యీమందాకినిపొంత నీమునులతో నీవృక్షవాటంబులో
భామా యేఁ దప మాచరింతు విధి కబ్రహ్మణ్యమున్ బెట్టుచున్.

102

టీ. భామా! ఈమర్యాదకున్ = ఈహద్దునకు, నీవు, ఒడంబడికన్ = అంగీకరించినయెడ, మేలు = మంచిది. ఈభంగి = ఈరీతి, కాదేనిన్ = సంభవింపనియెడ, మాభూమిన్, ఎట్లున్ = ఏవిధమునను, ఈయొడలితోన్ = ఈశరీరముతో, చేరఁగన్ = చేరునటుల, పోవంగన్ = పోవుటకు, లేనే కదా = ఆసమర్థుఁడనేకదా! ఈమందాకినిపొంతన్ = ఈయాకాశగంగానదీతీరమునందు, ఈమునులతోనే = ఈతపస్సు చేయుచున్న ఋషీశ్వరులతో, ఈవృక్షవాటంబులోన్ = ఈచెట్లచాలున, ఏన్ = నేను, విధికిన్ = దైవమునకు, అబ్రహ్మణ్యమున్ = చంపవలదని మొఱను, “అబ్రహ్మణ్య మవధ్యోక్తౌ” అమరము, చంపవల దనుట. పెట్టుచున్ = ఒనరించుచు, తపము = తపస్సు, ఆచరింతున్ = చేసెదను.

లోకములో సుఖము గూర్చునవి రెండె. గంగాతీరమున తపస్సొ, కామినీసంగమమొ. ఈయంశమె భర్తృహరియం దిటులఁ జెప్పఁబడినది —

శ్లో. "ఆవాసః క్రియతాం గాంగే పాపహారిణి వారిణి
    స్తనద్వయే తరుణ్యావా మనోహారిణి హారిణి."

(శృంగారశతకము)

తా. వరూథినీ! ఈనియమమునకు నీ వంగీకరించితివా మేలు. లేదేని నే నీశరీరముతో మాయిల్లు చేరనేలేను గదా! ఈగంగయొడ్డున నీమునులతో నీచెట్లతోఁపులో దైవమా నన్నుఁ జంపవల దని మొఱపెట్టుచుఁ దపము కావించుచు నిచటనే యందును.

తే.

ఇంక నొక్కటి వినుము పూర్ణేందువదన
వ్రతము చెడ సౌఖ్యమైనను వలయుఁ గలుగ
వాంఛితము దీర నను నీవు వదలఁ జెల్ల
దేను నిను సమ్మతిలఁ జేసి యేఁగుదనుక.

103

టీ. పూర్ణేందువదన = పూర్ణచంద్రునివంటి ముఖము గలదానా! (వరూథినీ), ఇంక నొక్కటి, వినుము, వ్రతము చెడన్ = నోము చెడినను, సౌఖ్యమైనన్ = సుఖమైనను, వలయున్ కలుగన్ = కలుగవలయును, వాంఛితము = కోరిక, తీరన్ = తీరఁగా, ననున్, నీవు వదలన్ = నీవు విడిచిపెట్టుట, చెల్లదు = కూడదు. ఏను నినున్ = నేను నిన్ను, సమ్మతిలన్ చేసి = అంగీకరింపఁజేసి, ఏఁగుదనుకన్ = వెడలువఱకును, (నీవు నన్ను) వదలఁజెల్లదు = విడిచిపెట్టఁగూడదు.

తా. వరూథినీ! వ్రతము చెడినను సుఖమయినను దక్కవలెను. కావున నీవాంఛితము తీరఁగానే నన్ను వదలెదవేమో? అది తగదు. నేనై నీసమ్మతిని బొంది వెడలువఱకును నీవు నన్ను విడువరాదు.

అలం. లోకోక్త్యలంకారము.

వ.

ఇంత యేమిటి కంటేనిన్ జెప్పెద నేను వైదేశికుండ బంధు
మిత్రకళత్రంబులం బాసి దైవయోగంబున నింతదూరం
బేఁగుదెంచినవాఁడ మీఁద భవదర్థంబు ప్రార్థితుండ నై
వ్రతహోమాద్యనుష్ఠానంబులు విడువం గలవాఁడ నగుటం
జేసి యంతరంగంబునం గలతెఱంగు తేటపడం బలుకవలసె
నాకర్ణింపుము.

104

టీ. ఇంత యేమిటికిన్ = ఇన్ని కట్టుఁబాటు లేల, అంటేన్ = అనుదువేని, చెప్పెదను = నీకుఁ దెలియఁజెప్పెదను. వినుము = (నీవు) ఆలకించుము. (అనుమానింపకుంటకుఁ దనమాటలకుఁ గారణాంతరములు కల్పించుచున్నాఁడు), ఏను = నేను, వైదేశికుండన్ = పరదేశిని, బంధుమిత్రకళత్రంబులన్ = చుట్టాలను, స్నేహితులను, భార్యను, పాసి = ఎడఁబాసి, దైవయోగంబునన్ = విధివశమున, ఇంతదూరంబు, ఏఁగుదెంచినవాఁడన్ = వచ్చినవాఁడను, మీఁదన్ = అటుపై, భవదర్థంబు = నీకొఱకు, ప్రార్థితుండవైనై = నీచే వేఁడుకొనఁబడినవాఁడనై (నీవు మిగులఁ బ్రార్థింపఁగాఁ దొలఁగఁజాలక), వ్రతహోమాద్యనుష్ఠానంబులు = నియమములు అగ్నికార్యములు మొదలగునిష్ఠలను, సాంతపనాదివ్రతములు వైశ్వదేవాదిహోమము లనుట. విడువఁగలవాఁడను = విడిచిపెట్టనున్నవాఁడను, అగుటంజేసి = కావున, అంతరంగంబునన్ = మనస్సునందు, కలతెఱంగు = ఉన్నవిధము, తేటపడన్ = విస్పష్ట మగునట్లు, పలుకవలసెన్, ఆకర్ణింపుము = వినుము.

ఉ.

నీచనుదోయిసంకుమదనిర్భరవాసన మేన నూన న
య్యోచిరసౌఖ్యముల్ గనుటయొండెఁ దపం బొనరించి పాపముల్
రాచుట యొండెఁ గా కిహపరంబుల కూరక దూరమై వయ
శ్శ్రీ చన రెంటికిన్ జెడిన రేవఁడ నౌదునె నీరజేక్షణా.

105

టీ. నీరజేక్షణా = కమలములవంటి కన్నులుగలదానా! (వరూథినీ) నీచను...వాసన - నీచనుదోయి = నీకుచద్వయమునందలి, సంకుమద = జవ్వాజియొక్క, నిర్భరవాసన = మెండయిన పరిమళము, మేనన్ = శరీరమున, ఊనన్ = తాఁకఁగా, చిరసౌఖ్యముల్ = పెద్దకాలము సుఖములను, కనుట యొండెన్ = పొందుటయైనను, కౌఁగిట బిగించి నీగుబ్బలు మేనొరయుచుండ సుగంధాతిశయమున కానందింపక యనుట. తపంబు = తపస్సు, ఒనరించి = చేసి, పాపముల్ = కలుషములను, రాచుట యొండెన్ = నశింవఁజేయుటనైనను, కాక = (తగును) కాని, ఇహపరంబులకున్ = - ఈలోకమునకుఁ బరలోకమునకును, ఊరక = వ్యర్థముగా, దూరమై = దవ్వై, ఇహలోకసుఖ మగు నప్సరఃకాంతాభోగసౌఖ్యమును బరలోకసుఖ మగు మోక్షమును ననుభవింపక, వయశ్శ్రీ = యౌవనసంపద, చనన్ = పోఁగా, రెంటికిన్ = రెండుకృత్యములకు, చెడిన రేవఁడన్ = చెడిపోయిన చాకలివాఁడను, ఔదునె! అయ్యో! రెంటికిం జెడిన రేవఁడు — ఒకచాకలివాఁడు ఏటిలో గుడ్డ లుదుకఁబోయి, నొకఱాతిపైఁ గొన్నియుదికినబట్టలఁ బెట్టి మరొకఱాతిమీఁద బట్టల నుదుకుచుండఁగా వెల్లువ వచ్చెను. అపుడు వాఁ డుదికిపెట్టిన గుడ్డలకై పర్వెత్తఁగా నచ్చటికిఁ జేరునంతలో నాగుడ్డలు కొట్టుకొనిపోయెను. అటనుండి మరల రెండవఱాతిదగ్గరకు వచ్చునప్పటికి నవియుఁ గొట్టుకొనిపోయెను. తెలివితక్కువదనముచే నొకరేవులోని బట్టలనైనను గాపాడుకొనఁజాలక పోయెను. కావున దానిఁబట్టి "రెంటికిం జెడిన రేవఁడు” అనుసామెత యేర్పడెను.

రేవఁడు అనుట దప్పనియు రేవణ యనుటయే యుక్త మనియు జూలూరి అప్పయ్య పండితులటీకలో రేవణ యనియె కలదనియు లక్ష్మీనారాయణ ఇత్యాదులలో నిది చేరినదనియుఁ జిన్నయసూరివ్యాకరణము బయలుదేరినపిదప నీపదము సంస్కరింపఁబడి చాకలివానికథతో మొన్న మొన్న ముడిపెట్టఁబడిన దని అ. ఉ. గారు వ్రాసి యాధారముగా నీక్రిందిశ్లోకము నుదాహరించిరి —

    "ఉంబేకః కారికాం వేత్తి తంత్రం వేత్తి ప్రభాకరః
    మండనస్తూభయం వేత్తి నోభయం వేత్తి రేవణః.”

శ్లోకవార్తికము, తంత్రవార్తికము రానిరేవణయే యిందలిరేవణ యని ముడి పెట్టిరి. పైగా నీతని నాంధ్రుఁ డనిరి. 1851 లో ముద్రితమైన జూలూరి అప్పయ్య పండితులవారి వ్యాఖ్యలో రేవఁడు అనురూపమె గలదు. చాఁకలికథ యావ్యాఖ్యలో నుదాహరింపఁ బడినది. 1893 లోన మార్పు గలిగె ననుట సాహసము.

రేవు+అన్న, చాకిరేవులో నుండునాతఁ డనుటలో రేవన్న యనుపదము నిష్పన్నమై దానిరూపాంతరము రేవఁడు అయి యుండును. లేదా రేవఁడు ప్రత్యేకము నామమైనఁ గావచ్చును. ఇహపరసుఖములకు దూర మగుట కిచ్చిన యీసర్వసామాన్యతార్కాణము ఎవ్వ రెఱుంగని రేవణాచార్యునకు ముడిపెట్టుట యుచిత మని తోఁచుట లేదు. తాళపత్రగ్రంథములలోఁ బెక్కింట రేవఁ డనురూపమె కనుపించుచున్నది గాన దీనిని గూర్చినచర్చ యుపేక్షార్హము. రేవఁ డనుపదము గౌరన హరిశ్చంద్రద్విపదయందు కాలకౌశికునిభాషణములందు చాఁకలి యనుతలంపుతో నిట్లు చెప్పెను.

ద్వి. దక్కితివని నమ్మఁదగదు. నిన్నెపుడు, కుక్కకూఁతుర! మెడఁ గోసిపోఁగలవు
    రెండు పోనాడిన రేవనిరీతి, నుండబాలకు నిన్ను నోరంతప్రొద్దు.”

తా. వరూథినీ! జవ్వాదివాసనలు మెండుగా గుబాళించు నీచనుఁగవఁ జక్కఁగాఁ గౌఁగిలించుకొని పెద్దకాలము సుఖమైన ననుభవింపవలె, లేదా తపము కావించి పాపముల నెల్ల నశింపనైన జేసికొనవలెఁ గాని దానికిని జెడి దీనికిని జెడి యిహపరములఁ బోఁగొట్టుకొని రెంటికిఁ జెడిన రేవఁడను గా నొల్లను. కావున నాకై నేను నిన్ను వదలిపోవునంతవఱకు నన్ను వీడకుండునటుల బాస గావింతువేని నీతోఁ గలసిమెలసియుండెదను. అటులఁ జేయ నియ్యకొనవేని యిపుడె నాత్రోవ నేను జూచుకొందును.

అలం. లోకోక్త్యలంకారము.

క.

అని యాస గలుగఁ బలికిన
విని వేలుపువెలఁది మోము వికసిల్లంగాఁ
దనచేతిచెఱఁగు బిగియ
బెనంచుచుఁ దల వాంచి నగపు బెరయఁగఁ బలికెన్.

106

టీ. అని = ఇటులని, ఆస గలుగన్ = కోరిక పుట్టునటుల, పలికినన్ = మాయాప్రవరుఁడు పలుకఁగా, వేలుపువెలఁది = దేవతాస్త్రీ, విని, మోము = ముఖము, వికసిల్లంగాన్ = విరియఁబాఱఁగా, తనచేతిచెఱఁగు = తనచేతఁ గైకొన్న యాతని ఉత్తరీయపుఁగొంగును, బిగియన్ = బిగియునటులు, పెనఁచుచున్ = చేత మెలివేయుచు, నగవు, బెరయఁగన్ = కలుగఁగా, తల వాంచి = తల వంచుకొని, పలికెన్ = ఈవిధముగా నొక్కమాట పలికెను.

శా.

హా నీనిష్ఠురవృత్తి మాని కరుణైకాయత్తచిత్తంబునన్
మానన్‌జాల నటంచు నేఁడు శ్రవణానందంబుగాఁ బల్కుటన్
సూనాస్త్రున్ వెలపెట్ట కేలితి సుఖార్ణోరాశిలోఁ గ్రుంకితిన్
నానోముల్ ఫలియించె నావయసు ధన్యం బయ్యె విప్రోత్తమా.

107

టీ. విప్రోత్తమా = బ్రాహ్మణశ్రేష్ఠుఁడా! హా = ఔరా, (ఆఁ = సరే యని పా.) నీనిష్ఠురవృత్తిన్ = నీకాఠిన్యమును, మాని = విడిచి, కరుణైకాయత్తచిత్తంబునన్ = దయకే యధీనమయిన మనస్సుతో, కేవలదయాస్వభావముతో, మానన్‌చాలను = విడువలేను, అటంచున్, నేఁడు, శ్రవణానందంబుగాన్ = చెవులపండువుగా, పల్కుటన్ = అనుటచేత, సూనాస్త్రున్ = మదనుని, వెల పెట్టక = జీతము బత్తెము నీయక, ఏలితిన్ = బంటుగా నేలుకొనఁగలిగితిని, సుఖార్ణోరాశిలోన్ = సౌఖ్యసముద్రమున, క్రుంకితిన్ మునిఁగితిని. నానోముల్ = నావ్రతములు, ఫలియించెన్ = పండెను. నావయసు = నాయౌవనము, ధన్యము = కృతార్థము, అయ్యెన్ = ఆయెను. (క్రుంకితిన్ అనుచోఁ జొక్కితిన్ అనియు నావయసు అనుచో నాకులము అనియుఁ బాఠాంతరములు.)

తా. భూసురవర్యా! ఎన్ని చెప్పినను మునుపటివలెఁ గఠనభావము వహించి నన్ను ఖేదపఱుపక, నేఁడు దయ దాల్చి నిన్ను విడువఁజాల నని పల్కుటచే మన్మథుని జీతబత్తెములు లేనిబంటునుగా నేలితిని సుఖసముద్రమున మునిఁగితిని. నానోములు పండినవి. నా ప్రాయము కృతార్థమయ్యెను.

అలం. రూపకాలంకారము.

వ.

నీ వెట్లు చెప్పి తట్లు సేయంగలదాన నని యతని నొడంబఱుచు
సమయంబునం దోడినెచ్చెలు లచ్చకోరాక్షిం గూడుకొని.

108

టీ. నీవు, ఎట్లు చెప్పితి = ఏవిధముగా నడుచుకొనవలయునని యాజ్ఞ నొనంగితివో, అట్లు = ఆవిధముగానే, చేయంగలదానను = చేసెదను (నడచుకొందును), అని, అతనిన్ = ఆప్రవరాఖ్యుని, ఒడంబఱుచుసమయంబునన్ = (తనతోడికూటమికి) అంగీకరింపఁజేయువేళ, అచ్చకోరాక్షి = చకోరపక్షులవంటి కన్నులుగల యావరూథినిని, కూడుకొని = చేరి, పైపద్యముతో నన్వయము.

సీ.

అకట నిర్దయబుద్ధి వని దూఱెఁ గడు రంభ
          యాహా వివేకివౌ దనియె హరిణి
చేఁదు మ్రింగెద వంచుఁ జిలికి నవ్వె ఘృతాచి
          మాయలాఁ డని తిట్టె మంజుఘోష
న్యాయనిష్ఠురములఁ బ్రార్థించె నూర్వశి
          జంకించె రమ్మంచుఁ జంద్రరేఖ
చెలి నేచి తని దిసంతులు గొట్టె మేనక
          విడువు మాయ లటంచు నొడివె హేమ


తే.

గొంట వనియెఁ దిలోత్తమ గూర్మిఁ గొసరె
ధాన్యమాలిని పుంజికస్థల యదల్చె
దివిజకామిను లీరీతిఁ దిరుగువాఱి
గువ్వకోల్గొంచుఁ దమలోన నవ్వుకొంచు.

109

టీ. అకట = అయ్యో! నిర్దయబుద్ధివి = దయలేని డెందము గలవాఁడవు, అని, కడున్ = మిగుల, రంభ, దూఱెన్ = నింద చేసెను, హరిణి అనునప్సరస, ఆహా! వివేకివి = వివేకము గలవాఁడవు. ఔదు = అగుదువు, అనియెన్ = అనెను, తనకై తాను వలచిరాఁగా వేలుపుఁజేడియను నీవు గాన విడచితివి, ఇంకొకఁ డెవఁడేని విడచునా? నీవివేకము నడుగవలయునా యని యాక్షేపణ. (అట్టికాంత వలచి వచ్చినపుడు విడనాడ నెంచితివే యెంత యవివేకివి? అనెను.) ఘృతాచి, చేఁదు మ్రింగెదవు = చేఁదుపదార్థమును మ్రింగుచున్నావు. బలవంతమున నంగీకరించితివి. వరూథినిపొందు నీకు చేఁదువస్తువు మ్రిఁగినట్లుండెనే) అంచున్, చిలికి = వెల్లడిగా, నవ్వెన్, మాయలాఁడు = మోసగాఁడు, అని, మంజుఘోష = ఈపేరుగలయచ్చరపొలఁతి, తిట్టెన్ = దూషించెను. (వలపు దాచికొని యద్యానవనము దాఁగియుంటయే మోసము) న్యాయనిష్ఠురములన్ = న్యాయముగల నిష్ఠురోక్తులతో, ఊర్వశి, ప్రార్థించెన్ = వేడుకొనెను, రమ్మని = ఈబెట్టుసరి యెందులకు, రమ్మంచున్ = ఇంక లేచిరావయ్యా యని, చంద్రరేఖ, జంకించెన్ = భయపెట్టెను. చెలిన్ = చెలిమికత్తె యగువరూథినిని (పా. నొంచితివి = నొప్పించితివి.) కపటవిరాగముతో విరహపరవశురాలగు వరూథినిని అవస్థలఁ బెట్టితి వనుట, ఏఁచితి = బాధించితివి, అని, మేనక, దిసంతులు గొట్టెన్ = నిందించెను, మాయలన్ = మోసపుఁజేష్టలను, విడు+ఆటంచున్ = వదలిపెట్టుము అని, (విడుపు మీల యని పాఠాంతరము, ఈల = సిగ్గు) హేమ, నొడివెన్ = పల్కెను, గొంటవు = గడసరివి, (అని) తిలోత్తమ, అనియెన్ = వాకొనెను, కూర్మిన్ = ప్రేమతో, ధాన్యమాలిని, కొసరెన్ = కోరెను, పుంజికస్థల, అదల్చెన్ = బెదరించెను, దివిజకామినులు = దేవతాస్త్రీలు, ఈరీతి = ఈవిధముగా, తిరుగువాఱి = చుట్టుమూఁగి, గువ్వకోల్గొంచున్ =గుంపుగూడుచు, (పా. గువ్వకరిగొండ్రు = గుంపుగూడికొందురు.) తమలోనన్ = తమలో దాము, నవ్వుకొంచున్ = నవ్వులాడుచు, ఉండిరి. అధ్యాహారము.

క.

ఆకుహనాభూసురుఁ డపు
డాకాంతలసరససమ్మదాలాపములన్
గైకొనుచు ముదితహృదయుం
డై కేలీవనము వెడలి యరిగి కుఱఁగటన్.

110

టీ. అపుడు = అచ్చెర లిటుల మాటలాడుతఱి, ఆకుహనాభూసురుఁడు = ఆకపటబ్రాహ్మణుఁడు, ఆకాం...పములన్ - ఆకాంతల = ఆస్త్రీలయొక్క, సరస = రసవంతములయిన, సమదాలాపములు = సంతోషసంభాషణములను, కైకొనుచున్ = అంగీకరించుచు, ముదితహృదయుండు = సంతోషించిన మనస్సు కలవాఁడు, ఐ, కేళీవనము = ఉద్యానవనము, వెడలి = అరిగి, కుఱఁగటన్ = చెంతన్.

ఆస్థలము వదలుట యచ్ఛరలనుడువులకు లజ్జించినవానివలె నటించుటకు.

తా. వేల్పుచెలువలంద ఱీవిధముగా సరసాలాపము లొనరించుచునుండ వారల ప్రసంగములకు సంతోషహృదయముతో మాయాప్రవరాఖ్యుఁ డాలకించుచుఁ జెంత నున్న యుద్యానవనమున కేఁగెను.

సీ.

మృగనాభినికరంపుబుగబుగల్ గలచోటఁ
          జదలేటితుంపురుల్ చెదరుచోట
వకుళవాటీగంధవహుఁడు పైకొనుచోటఁ
          గర్పూరతరుధూళి గప్పుచోటఁ
బస మీఱుసెలయేఱు లిసుక పెట్టినచోటఁ
          జిగురుమావులసంజ నిగుడుచోట
నవమాలికలతీవెన ట్లుట్టిపడుచోట
          మాణిక్యదీపముల్ మలయుచోటఁ


తే.

బ్రమదమునఁ దేఁటు లెలుఁగెత్తి పాడుచోటఁ
శారిక లనంగశాస్త్రముల్ చదువుచోటఁ
గీరకలకంఠములు క్రొవ్వి కేరుచోటఁ
బావురము లారజంబులు పలుకుచోట.

111

టీ. మృగనాభినికరంపుబుగబుగల్ - మృగనాభి = కస్తూరియొక్క, నికరంపు = రాశియొక్క, బుగబుగల్ = గుప్పుగుప్పునఁ గొట్టుతావులు, కలచోటన్ = ఉన్నచోటను, చదలేటితుంపురుల్ = ఆకాశగంగలోని నీటితుంపురులు, చెదరుచోటన్ = ప్రసరించునట్టితావునను, వకుళవాటీగంధవహుఁడు = పొగడచెట్లతోఁపుమీఁదనుండి వచ్చువాయఁవు, సుగంధమును గొనితెచ్చువాఁడు గాన గంధవహుఁడు; ఇట గంధవహుఁడు వకుళవాటినుండి తావులను గొనివచ్చుచున్నాఁడు. పైకొనుచోటన్ = ప్రసరించుస్థలమునను, కర్పూరతరుధూళి = పచ్చకప్పురపుటరఁటిచెట్టులయొక్క కర్పూరపుఁబరాగము, కప్పుచోటన్ = క్రమ్ముకొనుతావునను, పస...యేఱులు - పస మీఱు = బాగుమీఱిన, సెలయేఱులు = కొండయేళ్లు, ఇసుక పెట్టినచోటన్ = ఇసుకతిన్నియ లేర్పడునటులఁ బ్రవహించిన తావులయందును, చిగురుమావులసంజ = చిగిర్చినమావిచెట్లకావిరంగు, సంధ్యారాగమువంటి మావిచిగుళ్లకాంతులు, నిగుడుచోటన్ = వ్యాపించుస్థలమునను, నవమాలికలతీవెనట్లు = జాజితీగల (ఉయ్యల) త్రాళ్లు, ఉట్టిపడుచోటన్ = ఉప్పతిల్లెడు స్థలములను, నట్లు = అంటుత్రొక్కిన మొక్కలని యొకవ్యాఖ్యాత. (పా. నవమాలికలతేనె నట్టొట్లుపడుచోటన్ = జాజిపూవులనుండి తెంపులేక తేనియలు కారుచోటులను) మాణిక్యదీకముల్ = దీపములవలెఁ బ్రకాశించునట్టిరత్నములు, మలయుచోటన్ = వ్యాపించుస్థలమునను, ప్రమదమునన్ = సంతోషముచే, తేఁటులు, ఎలుఁగెత్తి = గొంతెత్తి, పాడుచోటన్ = గానములు గావించుప్రదేశమునందును, శారికలు = గోర్వంకలు, అనంగశాస్త్రముల్ = మన్మథశాస్త్రములను, చదువుచోటన్ = పఠించుప్రదేశమునందును (అనంగశాస్త్రములు అచ్చరలు పఠించుట విని తాము నేర్చి గోరువంకలు తమంత తాము పఠించుచున్నచోటున నని భావము) కీరకలకంఠములు = చిలుకలు కోయిలలు, క్రొవ్వి, కేరుచోటన్ = చెలరేఁగుతావునను, పావురములు = పావురాళ్లు, అరజంబులు = ఆమధురధ్వనులను, పలుకుచోటన్, పైఁజెప్పిన మనోహరలక్షణములచే నలరారుచున్నప్రదేశమునందు అని భావము. (పైపద్యముతో నన్వయము).

అలం. ఉదాత్తము, రూపకము, పరిణామము.

తే.

ఆవరూథినిమణిమండితాలయంబుఁ
గాంచి యనురాగమునఁ బ్రవేశించి యంత
వారి నిరువురఁ గూర్చి యవ్వనజగంధు
లాత్మగృహముల కేఁగి రనంతరంబ.

112

టీ. ఆవరూథిని(యొక్క)మణిమండితాలయంబున్ = మణులతో బ్రకాశించు గృహమును, కాంచి = చూచి, అనురాగమునన్ = ప్రేమతో, ప్రవేశించి = అందుఁ జొచ్చి, అంత = అట్లు చేరఁగానే, వారిన్ ఇరువురన్ = వారిద్దఱను, కూర్చి = జతగాఁ జేర్చి, ఆవ్వనజగంధులు = ఆచెలికత్తెలు, ఆత్మగృహములకున్ = తమయిండ్లకు, ఏఁగిరి = వెడలిపోయిరి. అనంతరంబ = వెంటనే మీఁదిపద్యముతో నన్వయము.

క.

ఫుల్లలవలీనవైలా
వల్లిమతల్లికలతోడ వాసంతిక లు
ద్యల్లీల నల్లిబిల్లిగ
నల్లికొనిన యొకలతాగృహాంతరసీమన్.

113

టీ. ఫుల్ల...తోడన్ - ఫుల్ల = వికసించిన, లవలీ = వెన్నెలతీఁగలతోడను, నవ ఏలా = లేఁతయేలకియొక్క, వల్లిమతల్లికలతోడన్ = మేలగుతీఁగలతోడను, వాసంతికలు = బండిగురివెందతీఁగలు, ఉద్యల్లీలన్ = ఉప్పతిల్లువిలాసములతో, అల్లిబిల్లిగన్ = కలిసిమెలసి, అల్లికొనిన = పెనవేసికొనిన, ఒకలతాగృహ = ఒకపొదరింటియొక్క, అంతరసీమన్ = లోపలిప్రదేశమునందు “భోగింపఁదొడంగిరి” అనునంశముగల పైపద్యముతో నన్వయము.

క.

ఆగంధర్వకుమారుఁడు
నాగజగమనయుఁ బ్రఫుల్లహల్లకతల్పా
భోగంబున రహి మిగులఁగ
భోగింపఁ దొడఁగి రాత్మఁ బొంగెడు కాంక్షన్.

114

టీ. ఆగంధర్వకుమారుఁడున్ = ప్రవరాఖ్యునివేషమును ధరించిన గంధర్వకుమారుఁడును, ఆగజగమనయున్ = ఏనుఁగునడకవంటి యొయ్యారపునడకగల వరూథినియును, ప్రఫుల్ల...భోగంబునన్ - ప్రఫుల్ల - వికసించిన, హల్లక = ఎఱ్ఱఁగల్వల, తల్ప = సెజ్జయొక్క, ఆభోగంబునన్ = వైశాల్యమున (విశాలమగుతల్పమున) రహి = రక్తి, మిగులఁగన్ = అతిశయింపఁగా, ఆత్మన్ = హృదయమునందు, పొంగెడుకాంక్షన్ =పెంపుచెందెడునాసతో, భోగింపన్ = సంభోగము చేయ, తొడంగిరి = మొదలుపెట్టిరి.

వరూథినిని తరుణి యనియు గజయాన యనియుఁ జెప్పుటచే నామె ద్వితీయయౌవన యని గ్రహింపవలయును. ద్వితీయయౌవనాలక్షణములు ——

శ్లో. "స్తనౌ పీనౌ తనుర్మధ్యః పాణిపాదస్థరక్తిమా
    ఊరూ కరికరాకారౌ అంగం వ్యక్తాంగసంధికమ్
    నితంబో విపులో నాభిర్గభీరా జఘనం ఘనం
    సువ్యక్తరోమావళిస్నైగ్ధ్యమంగకేసరళేక్షణమ్.

(రసార్ణవసుధాకరము)

వ.

ఆసమయంబున.

115


సీ.

సహసానఖంపచస్తనదత్తపరిరంభ
          మామూలపరిచుంబితాధరోష్ఠ
మతిశయప్రేమకల్పితదంతసంబాధ
          మగణితగ్లానిశయ్యానిపాత
మతివేలమణితయాచ్ఞార్థగల్లచపేట
          మతిదీనవాక్సూచితాత్మవిరహ
మంకురత్పులకజాలావిద్ధసర్వాంగ
          మానందకృతహారవాననాబ్జ


తే.

మాక్రమక్షీణనుతివర్ణ మానిమీలి
తాక్ష మాస్విన్నగండ మాయత్తచేష్ట

మాస్తిమితభూషణారవ మావధూటి
ప్రథమసురతంబు గంధర్వపతిఁ గరంచె.

116

టీ. సహసా...పరిరంభము - సహసా = తొందర కలుగునటుల, నఖంపచ = గోరువెచ్చఁగా నుండెడి, స్తన = చన్నుఁగవచేత, దత్త = ఒసంగఁబడిన, పరిరంభము = కౌఁగిలింతగలదియు, ఆమూ...ష్టము - ఆమూల = అంతయు, కొఱఁతలేకుండ = సంపూర్ణముగా, పరిచుంబిత = బాగుగా ముద్దుఁగొనఁబడిన, అధరోష్ఠము = మోవి గలదియు, అతిశయ...బాధము - అతిశయ = మిక్కుటమైన, ప్రేమ = అనురాగముచేత, కల్పిత = ఒనరింపఁబడిన, దంతసంబాధము = దంతక్షతములు (పలునొక్కులు) గలదియు, అగణిత...నిపాతము - అగణిత = ఎంచఁగా వశము గాని, గ్లాని = శ్రమవలనఁ గల్గినబడలికచేత, శయ్యా = పానుపునందు, నిపాతము = తూలిపడుటయు, అతివేల...చపేటము - అతివేల = విస్తారమైన, మణిత = సంభోగకాలమునఁ గలుగు కంఠధ్వనులయొక్క, యాచ్ఞార్థ = యాచనకొఱకు లభించిన, గల్లచపేటము = చెంపపెట్టులు గలదియు, అతిదీన...విరహము - అతి = మిక్కిలిగ, దీన = విచారమును దెలియఁజేయు, వాక్ = పలుకులచేత, సూచిత = సూచింపఁబడిన - తెలియఁజేయఁబడిన, ఆత్మవిరహము = తమవియోగము గలదియు, అంకురత్...సర్వాంగము - అంకురత్ = మొలచుచున్న, పులకజాల = గగ్గురుపాటుసమూహముచేత, ఆవిద్ధ = బాగుగా గ్రుచ్చుకొనఁబడిన, సర్వాంగము = సమస్తావయవములం గలదియు, ఆనంద...బ్జము - ఆనంద = సంతోషముచేత, కృత = చేయఁబడిన, హారవ = హాహా యనుధ్వనులతోఁ గూడిన, ఆననాబ్దము = తామరపూవులవంటి ముఖములు గలదియు, ఆక్రమ...వర్ణము - ఆక్రమ = క్రమక్రమముగా, క్షీణ = తరిగిపోవుచున్న, నుతి = పొగడ్తమాటల యొక్క, పొగ డ్తమాటల యొక్క, వర్ణము = అక్షరము గలదియు, ఆనిమీలితాక్షము = పూర్తిగా మూయఁబడిన కన్నులు గలదియు, ఆస్విన్నగండము = అంతటను జెమర్చిన చెక్కులు గలదియు, ఆయత్తచేష్టము = స్వాధీనమైన శృంగారచేష్టలు గలదియు, ఆస్తిమితభూషణారవము = మిగులఁ దగ్గిపోయిన కరకంకణాద్యాభరణములమ్రోఁత గలదియు నైన, అవధూటి = ఆవరూథినియొక్క, ప్రథమసురతంబు = తొలికూటమి, గంధర్వపతి = గంధర్వాధీశ్వరుఁడగు మాయాప్రవరుని, కరంచెన్ = కరఁగునటులఁజేసెను. సంతోషపెట్టెను. అక్రమక్షీణ - అని పాఠాంతరము గలదు.

ఇందు శ్రమ మను సంచారీభావము చెప్పఁబడెను. తల్లక్షణము —

    శ్రమః ఖేదో౽ధ్వమృగయా యుద్ధవాహాధిరోహణైః
    సంభోగనృత్తశస్త్రాస్త్రవ్యాయామాద్యైః ప్రజాయతే.
    నిశ్వాసస్వేదసీత్కారాః సంకోచో ముఖనేత్రయోః
    శీతవాతోదకచ్ఛాయాపేక్షా సంవాహనాని చ
    అంగమోటనమిత్యాద్యైరనుభావైస్తు లక్ష్యతే.

ప్రథమసంభోగమునందు శ్రమయు, నిమీలితాక్షము, చెక్కులు చెమర్చుట, వ్యధయు సహజములు. శ్రీనాథకవియు,

తే. "అస్తి వామ్యభార మస్తి కౌతూహలం బస్తి ఘర్మసలిల మస్తి కంప
    మస్తి భీతి, యస్తి హర్ష మస్తి వ్యథం బస్తి వాంఛ మయ్యె నపుడు రతము”

అని:

ఈవిధముగాఁ జెప్పినాఁడు. ఆస్తిమితభూషణ మనువాక్యము సంభోగజనితసుఖపారవశ్యమును దెలుపును. భవభూతియు నిటులె సంభోగావసరమున "న జానే తతః" అనియు, “నహి తతోజానే కిమాసీదితి" అని కాళిదాసుఁడును జెప్పియున్నారు. ఇవి సంభోగసుఖపారవశ్యతను దెలుపును. పరవశమునఁ గంకణాదికచలనము లాగుట సహజము.

అలం. ఉదాత్తము.

క.

అన్నునఁ గనుమూయుట రొద
సన్నగిలుటఁ గౌఁగిలింత సడలుట నేర్పుల్

సున్నగుట వరూథినిరతి
కన్నెఱికపురతియుఁబోలెఁ గడు నిం పొసఁగెన్.

117

టీ. అన్నునన్ = పారవశ్యముచే, కనుమూయుటన్ = కనులమూసికొనుటచేతను, రొద = కంఠధ్వని, సన్నగిలుటన్ = తగ్గుటచేతను, కౌఁగిలింత = ఆలింగనము, సడలుటన్ = వదలఁబాఱుటచే, నేర్పుల్ = మెలఁకువలు, సున్న అగుటన్ = లేనివి యగుటచేతను (లేకుండఁ బోవుటచే), వరూథినిరతి = వరూథినియొక్క సంభోగము, కన్నెఱికపురతియున్ పోలెన్ = తొల్తటికూటమివలె, బోగముపడుచుతోఁ జేయు తొలినాటికూటమివలె, కడున్ = మిగుల, ఇంపు = ఉత్సాహము, ఒసఁగెన్ = ఇచ్చెను.

క.

ఈ విధమున నయ్యిరువురు
భావజతంత్రైకపరత బహుకాలము సౌ
ఖ్యావహలీలల నుండం
గా వేలుపుముద్దరాలు గర్భముఁ దాల్చెన్.

118

టీ. ఈవిధమున = ఈరీతిగా, అయ్యిరువురున్ = ఆవరూథినియు మాయాప్రవరాఖ్యుఁడును, భావజతంత్రైకపరతన్ = మన్మథవ్యాపారములందే యాసక్తి గలిగి, బహుకాలము = విశేషకాలము, చిరకాలము, సౌఖ్యావహలీలన్ = సౌఖ్యమును కూర్చు విలాసములతో, ఉండంగాన్ = ఇటుల వర్తించుచుండఁగా, వేలుపుముద్దరాలు = దేవతాస్త్రీ (వరూథిని), గర్భము = వేఁకటిని, తాల్చెన్ = ధరించెను. (ఇటుల గర్భము ధరించినంత.)

తా. ఇతరవ్యాపారములు మాని వరూథినియు మాయాప్రవరుఁడును సురతవ్యాపారములందు వర్తించుచుఁ జాలకాలము గడపిరి. ఇటులుండ వరూథిని గర్భవతి యయ్యెను.

క.

నడ జడనువడియె నా రే
ర్పడియెన్ జనుమొనలు నల్లవడియెన్ వడియన్

బడియెఁ గడు నొడలు పడఁతికి
బడలికయును నిదురయరుచి బహుళం బయ్యెన్.

119

టీ. పడఁతికిన్ = ఇంతికి, నడ = నడక, జడనుపడియెన్ = మందగించెను, ఆరు = నూఁగారు, ఏర్పడియెన్ = వ్యక్తపడియెను. చనుమొనలు = స్తనాగ్రములు, నల్లవడియెన్ = నలుపెక్కెను. కడున్ = మిక్కిలి, ఒడలు = మేను, వడియఁబడియెన్ = సన్నగిల్లెను. బడలిక = ఆయాసము, నిదుర = నిద్ర, అరుచి = ఇష్టములగు వస్తువులయందు రుచి తప్పుట, బహుళంబు = విస్తారము, అయ్యెన్.

అలం. స్వభావోక్త్యలంకారము.

గర్భము లావగుకొలఁది నారు స్పష్టమగుచుండును —

సీ. “దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట లేమయారున రోమలేఖ మెఱసె”

(భాగవతము దశమ.)

మ.

పలుచంబాఱుటఁ గోమలస్మితరుచుల్ పైఁదోఁచె నాగౌరకాం
తుల గండద్వితయంబు పొల్పెఁ బ్రమదార్ణోరాశిఖేలన్నవో
త్కలికాభంగపరంపరోపరిసముద్యత్పాండుడిండీరపం
క్తులు నాఁ జిట్టుము లుల్లసిల్లెఁ దఱు చై తోడ్తోఁ గురంగాక్షికిన్.

120

టీ. కురంగాక్షికిన్ = జింకకన్నులవంటి కన్నులు గలయావరూథినికి, (ఈవిధముగా గర్భచిహ్నములన్నియు నేర్పడిన) తోడ్తోన్ = వెనువెంటనే, గండద్వితీయంబు = రెండుచెక్కిళ్లును, పలుచుబాఱుటక్ = పల్చనగుటచే, కోమలస్మితరుచుల్ = మృదువైన చిఱునవ్వు వెల్గులు, పైన్ = మీఁదికి, తోఁచెనాన్ = కన్పడెనా యనునట్లు, గౌరకాంతులన్ = తెల్లనికాంతులతో, పొల్చెన్ = ఒప్పెను. ప్రమ...పంక్తులునాన్ - ప్రమద = సంతోషమను, అర్ణోరాశి = సముద్రమునందు, ఖేలత్ = విహరించు, నవ = క్రొత్త, ఉత్కలికా = కోరికలకు, భంగపరంపరా = తరఁగలవరుసలయొక్క, ఉపరి = మీఁద, సముద్యత్ = పుట్టు, పాండు = తెల్లని, డిండీరపంక్తులు = నురుపువరుసలు, నాన్ = అనఁగా, చిట్టుములు = వేవిళ్ల యోకిలింకలు, నురుఁగువలె నోటినుండివచ్చునట్టి యుమ్ములు, తఱుచై = విస్తారమై, ఉల్లసిల్లెన్ = అతిశయించెను.

తా. చెక్కులు పలుచఁబాఱుట మృదువులగు చిఱునవ్వువెలుఁగులు పైకిఁ బ్రసరించెనేమో యన్నటుల వరూథినిచెక్కులు తెల్లపడెను. సంతోష మను సముద్రమందు జనించిన కోర్కులను తరంగములపై బొడము నురుఁగువరుసలవలె నురుగుతోఁ గూడిన యుమ్మి యతిశయించెను. ఇవి గర్భిణీలక్షణములు.

అలం. ఉత్ప్రేక్షారూపకములు

తే.

నాకజలజాక్షినిఱుపేదనడుము బలిసి
యల్లనల్లన వళిసీమ నాక్రమించెఁ
బేర్చి దివసక్రమంబున బీద బలిసి
బందికాఁ డైనఁ బొరువులు బ్రదుకుఁ గనునె.

121

టీ. నాక...నడుము - నాకజలజాక్షి = అవ్సరస్త్రీయొక్క (వరూథినియొక్క); నిఱుపేదనడుము = మిక్కిలిబీదయగునడుము, బలిసి = లా వెక్కి, ఆల్లనల్లనన్ = మెల్లమెల్లఁగా, వళిసీమన్ = కడుపుమీఁదిముడుతలప్రదేశమును, ఆక్రమించెన్ = ఆవరించుకొనెను. నడుము బలియుటచే ముడుత లన్నియు నంతరించెను. బీద = బీదవాఁడు, బలహీనుఁడు, దివసక్రమంబునన్ = దినములవెంబడిని, బలిసి = బలవంతుఁడై, పేర్చి = అతిశయించి, బందికాఁడు = దొంగ, ఐనన్, పొరువులు = ఇరుగుపొరుగులు, బ్రదుకుఁ గనునె = జీవించునా? జీవింపఁజాలదని భావము.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

నిఱుపేదనడు మనుటచే వరూథినినడుము మిక్కిలి సన్ననిది. అల్లనల్లన యనుట గర్భము నానాఁటికిఁ గ్రమాభివృద్ధి నొందిన దనుట.

క.

పాటలసుగంధి పాటలు
నాటలు లే కప్పు డొప్పె నలసతఁ బథికో

త్పాటనజయపరిశాంత
జ్యాటంకృతిచలనమదనచాపముఁబోలెన్.

122

టీ. పాటలసుగంధి = పాదిరిపూవువంటి దేహపరిమళము గలయావరూథిని, అప్పుడు = ఆగర్భము ధరించిన సమయమునందు, పాటలు = సంగీతము బాడుటలు, ఆటలు = నాట్యము మొదలగు క్రీడలు, లేక, అలసతన్ = ప్రాల్మాలికతో, పథికో...చాపముఁబోలెన్ - పథిక = వియుక్తులను, ఉత్పాటన = పెల్లగించుటవలని, జయ = గెల్పుచే, పరిశాంత = నిల్చిపోయిన, విశ్రాంతిని దీసికొనుచుండిన, జ్యా = నారియొక్క, టంకృతి = టాత్కారమును, చలన = కదలికయు గల, మదనచాపముఁబోలెన్ = మన్మథునివిల్లువోలె, ఒప్పెన్ = ఒప్పినదాయెను.

ఇట మదనచాపము వరూథిని; పాటలు నారిమోతలు; ఆటలు వింటిచలనము. వరూథిని యలసత పథికోత్పాటనజయపరిశ్రాంతత. మన్మథుఁడు విరహివధానంతరము విల్లు నెక్కుదించినటులు, జిరకాలభోగానంతరము వరూథినియు గర్భము ధరించి యలసతతో నొప్పెను.

తా. గర్భభారముచే నాటలుఁ బాటలు లేక యలసురాలై యున్న యావరూథిని, మన్మథుఁడు విరహులను జయించిన పిదప, నెక్కుడించి పడవైచుటచే నారిమ్రోఁతయుఁ గదలికయు లేక యుండు విల్లో యనునట్లుండెను.

అలం. ఉత్ప్రేక్షాలంకారము.

సీ.

మనసుకక్కుఱితి మెల్లన లేచి చేతులఁ
          గాంతుని జబ్బుగాఁ గౌఁగిలించు
నలసత మృద్గంథి యైనకమ్మనినోర
          నధరంబు నెడనెడ నాని కూర్కు
మణితాదిపవనధారణశక్తి చాలమి
          నొయ్యన నర్మోక్తి సుబ్బొనర్చుఁ

గాంక్షితక్రీడ కంగము పంపు సేయమి
          నొడ్డుగా నిట్టూర్పు లొరయఁ బొగులు


తే.

నిచ్చ యెఱిఁగినరతికేళి మెచ్చి పొగడు
నప్పు డక్కాంత రతిపరిహాసవేళ
జీవితేశుసమేతంపుఁజేఁత లుడువుఁ
బ్రార్థనాపూర్వదీనసంభాషణముల.

123

టీ. అప్పుడు = గర్భధారణమువలన నాయాసము గలిగిన యాసమయమునందు, అక్కాంత = ఆవరూధిని, మనసుకక్కుఱితిన్ = హృదయము మాటిమాటికి సంభోగక్రియాలోభము గలదగుటచే, మెల్లనన్ లేచి = తిన్నఁగా నెటులో లేచి, చేతులన్ = చేతులతో, కాంతునిన్ = ప్రియుని, జబ్బుగాన్ = మేను లొరసి యొరయ నటుల, కౌఁగిలించున్ = కౌఁగిలించుకొనును, అలసతన్ = (గర్భభారముచేఁ గలిగిన) అలయికచేత, మృద్గంథి = మట్టివాసనఁ గలది, ఐన కమ్మనినోరన్ = అయిన రుచికరమగునోటితో, ఎడనెడ = అపుడపుడు, అధరంబు = ప్రియునిమోవిని, ఆని = చవిగొని, కూర్చున్ = నిదురఁబోవును. మణితాది...శక్తి - మణితాది = గళరవములు మొదలగువానికి, పవన = ఊరుపుగాలిని, ధారణశక్తి = బిగబట్టుబలము, చాలమిన్ = వలసినంత లేకపోవుటచేత, దియ్యనన్ = మెల్లఁగా, నర్మోక్తిన్ = పరిహాసవాక్యములచేత, ఉబ్బు = ప్రియునకు సంతోషమును, ఒనర్చున్ = కలుగఁజేయును. కాంక్షితక్రీడకు = ప్రియుఁడుగోరిన సంభోగక్రియకు, అంగము = దేహము, పంపుసేయమిన్ = వలచినటుల స్వాధీనము కాకపోవుటచేత, ఒడ్డుగాన్ = విశేషముగ, నిట్టూర్పులు = దీర్ఘములగునిశ్వాసములు, ఒలయఁగాన్ = కలుగఁగా, పొగులు = విచారపడును. ఇచ్చ = తనకోరిక, ఎఱిఁగినరతికేళిన్ = తెలిసిన ప్రియునిదైనసురతక్రీడను, మెచ్చి = మెచ్చుకొని, పొగడున్ = కొనియాడును. రతిపరిహాసవేళన్ = సంభోగసమయమునందుఁ బరిహాసముల నాడునపుడు, ప్రార్థ నా...భాషణములన్ - ప్రార్థనా = వేఁడికొనుట, పూర్వ = ముందుగాఁగల, దీన = దైన్యముగల, సంభాషణములన్ = మాటలచేత, జీవితేశు...చేఁతలు - జీవితేశు = ప్రాణనాయకునియొక్క, సమేళంపుఁజేఁతలు = కూటమికొఱకుఁ జేయు చేష్టలు, ఉడుపున్ = మాన్పును.

అలం. స్వభావోక్తి.

గర్భభారముతో నున్నకాంతలు మృదువగు భోగముల కిచ్చగించుట సాజము. ఇటులె గర్భిణీసురతము కవిరాజమనోరంజనమునఁ జెప్పఁబడినది.

ఉ. “వీడనిప్రేమలం గలియు వేఁకటివ్రేఁగుట లంతికూటముల్
    వేడుకకు న్వినోద మొదవింపఁగ నయ్యుపనాథుతో హిత
    క్రీడ మెలంగుచుండ నరిగె న్నవమాసములు.”

(ద్వితీయాశ్వాసము)

ఈపద్యమునందలి గర్భిణీసురతవర్ణనము మిగుల నేహ్యముగ నున్న దని యొకానొకరు వ్రాసిరిగాని యది సరిగాదు. వరూథిని దేవవేశ్య, కేవలకామార్త. గర్భధారణానంతరము గలిగినయశక్తిచేఁగూడఁ గలయికలఁ గోరె ననుట యామెకామాతిశయమునె తెలుపును గాన నిది గర్హ్యము గాదు. అంతియగాక బ్రౌనుదొరవారిటీకలో నీపద్యము లేదు. కొన్నిప్రతులయం దీపద్యము గానరామి ప్రక్షిప్తమేమో యని తోఁచెడిని. ఇంక నిది విచార్యము.

క.

అంత వియచ్ఛరుఁ డభిమత
మంతయు సమకూఱుటయును నచ్చర గర్భ
శ్రాంత యగుటయును గనుఁగొని
యింతట నిచ్చోటు వాయ కే నిఁక నున్నన్.

124

టీ. అంతన్ = వరూథిని పైవిధముగా గర్భభారముతో నున్నపుడు, వియచ్చరుఁడు = (ప్రవరవేషమున నున్న) గంధర్వుఁడు, అభిమతము = కోరిక, అంతయున్ = సంపూర్తిగా, సమకూఱుటయును = సిద్ధించుటయును, అచ్చర = వరూథిని, గర్భశ్రాంత = వేఁకటివలనియలసత గలది, అగుటయున్ = ఐయుండుటయు, కనుగొని = చూచి, ఇంతటన్ = ఇంతటితో, ఏను, ఇచ్చోటు, పాయకన్ = వదలక, ఇంకన్ = ఇఁకమీఁద, ఉన్నన్ = ఉన్నయెడల, పైపద్యముతో నన్వయము.

క.

వంచన యెఱిఁగిన మఱి శపి
యించునొ సురశాంత చెప్ప కేఁగినఁ బ్రేమన్
బంచశరశరపరంపరఁ
బంచత ప్రాపించి మీఁదఁ బాపం బిడునో.

125

టీ. సురకాంత = దేవతాస్త్రీ (వరూథిని), వంచన = (నాచేసిన)మోసము, ఎఱిఁగినన్, మఱి = పిమ్మట, శపియించునో = శాపము పెట్టునో, చెప్పక, ఏఁగినన్ = వెళ్లినచో, ప్రేమన్ = స్నేహముచే, పంచశర...పరంపరన్ - పంచశర = మదనునియొక్క, శరపరంపర = బాణసమూహముచే, పంచతన్ = చావును, ప్రాపించి = చెంది, మీఁదన్ =( రా)పై, పాపంబు = స్త్రీవధపాతకమును, ఇడునో.

సురకాంత గాన శాపశక్తి గలదు. వంచన బయటపడెనా సహించదు. చెప్పకేఁగిన ప్రేమ మరణింపఁజేయును. మన్మథుఁడు పంచశరుఁడు. శరపరంపరకుఁ దప్పుకొను టసాధ్యము. మరునిముల్కులు చంపు ననుటకు —

క. "కూ డుడిగించు నశోకము, వాడించును మల్లెవిరి వివర్ణత సేయున్
    జూడఁగఁజూతము తలఁపుల్, జోడించును దమ్మి చంపఁజూచుం గలువల్.”

ఈదేవతాస్త్రీ నామోసమును గ్రహించెనేని శపించునో లేక చెప్పకయే యరిగినచో విరహమున కోర్వక మేను విడిచి స్త్రీహత్యాపాతకమునకుఁ బాల్పఱుచునో?

అలం. సందేహాలంకారము.

వ.

అని వితర్కించి యక్కపటవిప్రుం డెఱింగించి యనిపించు

కొనియ పోవువాఁడై యప్పు డప్పువ్వుఁబోఁడి డాయం
బోయి బుజ్జవం బొప్ప ని ట్లనియె.

126

టీ. ఇట్లు = ఈవిధముగా, వితర్కించి = తనలోఁ దా నాలోచనము గావించి, ఆకపటవిప్రుడు = ఆమోసపుబ్రాహ్మణుఁడు, గంధర్వుఁడు, ఎఱింగించి = వరూథిని కెటులో చెప్పి, అనిపించుకొనియ = వీడ్కొనఁ జేసికొనియె, ఆజ్ఞ నొందియే, పోవువాఁడై = పోవ నిశ్చయించికొన్నవాఁడై, అపువ్వుబోఁడిన్ = ఆపుష్పమువలె సుకుమార మగు దేహముగల వరూధినిని, డాయం బోయి = చేర నరిగి, బుజ్జవంబు = ఉపలాలనము, ఒప్పన్ = ఒప్పునట్లుగా, ఇట్లనియెన్ = ఈవిధముగాఁ బలికెను.

తే.

ఎవ్వఁడేఁ బాదలేప మొక్కింత నాదు
పాదములఁ బూయ నింతేసిపనులు పుట్టె
నమ్మహాయోగి బహుయోజనాధ్వగామి
యీగిరికి నేఁగుదెంచె నేఁ డేఁగి కంటి.

127

టీ. ఎవ్వఁడేన్ = ఏసిద్ధుఁడు, పాదలేపము = పాదములకు దూరగమనముకొఱకు రాచికొను పసరుపూఁత, నాదుపాదమున్ = నాయడుగులందు, పూయన్ = రాయఁగా, ఇంతేసిపనులు = (మంచుఁగొండకు నారాక, పాదలేపనము మంచు సోకి కరఁగిపోవుట పిదప యిల్లు జేరలేక నీతగులమునకు లోనగుట లోనగు) ఈనడవళ్లన్నియును, పుట్టెన్ = పుట్టెనో, అమ్మహాయోగి = ఆగొప్పవాఁడగు సిద్ధుఁడు, బహుయోజనాధ్వగామి = అనేకములగు నామడలత్రోవ పయనము చేయువాఁడు, ఈగిరికిన్ = ఈకొండకు, నేఁడు, ఏఁగుదెంచెన్ = వచ్చెను. ఏఁగి = నేను పోయి, కంటిన్ = చూచితిని.

తా. ఈహిమవత్పర్వతమునకు వచ్చి నానావిధములయిన యవస్థలు పడుటకుఁ గారణముగా ముందు నాయడుగులకుఁ బసరు రాచి పోయిన సిద్ధుఁడు నేఁ డెక్కడెక్కడనో తిరిగి యీకొండకు వచ్చినాఁడు. నే నాయనను విహారార్థముగాఁ బోయినప్పుడు చూచి మాటలాడివచ్చితిని.

క.

అతఁడు మఱి తీర్థయాత్రా
వ్రతవశమున వచ్చి మాపురంబు తెరువుగాఁ
గతలుగ మాసంసార
స్థితు లెల్లను జెప్పె నేమి సెప్పుదు నబలా.

128

టీ. అబలా = వరూథినీ, ఆతఁడు=ఆ సిద్ధుఁడు, మఱి = ఇప్పుడును గూడ, తీర్థయాత్రావ్రతవశమునన్ = తీర్థములను గూర్చి పయనము చేయుట యను నియమమునుబట్టి, మాపురంబు తెరువుగాన్ = మాయూరిత్రోవఁగా, వచ్చి, కతలుగన్ = కథలుగా, మాసంసారస్థితులు = మాకాఁపురపుస్థితిగతులు, ఎల్లన్ = అన్నియు, చెప్పెను = తెలిపెను. ఏమి సెప్పుదున్ = నే నేమని చెప్పుదును. ఆవృత్తాంతమంతయు నీకుఁ జెప్పఁజాలకుంటిని.

సీ.

పైపరామరిక చొప్పడమిఁ బక్వము దప్పి
          పండఁబాఱినపొల మెండఁబాఱెఁ
గట్టఁ గాపింప దక్షత లేమి నూరూర
          బందెలఁ బడిపోయెఁ బశుగణంబు
వంచనామతిఁ బ్రాడ్వివాకులై వటువు లొ
          జ్జల కొప్పగించిరి చదువు లెల్లఁ
గికురించి రిచ్చిపుచ్చుకొనుచోటుల వార
          లాఁకకు లోనుగా కప్పు లీక


తే.

గ్రహణసంక్రమణాదుల రాచనగరఁ
గాసువీసంబు వెడల గ్రాసమునకు
నాధి వెట్టిరి క్షేత్రంబులందుఁ గొన్ని
లెస్సయుండునె గృహకర్త లేని బ్రదుకు.

129

టీ. పైపరామరిక = పైవిచారణ, చొప్పడన్ = సమకూఱకపోవుటచే, పక్వముఁ దప్పి = ఆదను చెడి, పండఁబాఱినపొలము = పండుటకు సిద్ధమైన చేను, ఎండఁబాఱెన్ = ఎండిపోఁజొచ్చెను. కట్టన్ = గుంజలను గట్టిపెట్టుటకును, కాపింపన్ = మేఁతకుఁ దోలుకొనిపోయి కాచుకొనివచ్చునట్లు చేయుటకును, దక్షత = దిక్కు, లేమిన్ = లేకపోవుటచే, ఊరూరన్ = ఊరికి నూరికి, పశుగణంబు = పశువులసమూహము, బందెలన్ = బందెదొడ్డిలో, పడిపోయెన్ = చిక్కికొని పోయెను. పశువు లసంఖ్యాకములు గాన ఊరూరియందుఁ జిక్కుపడెను. వంచనామతిన్ = కొంటెబుద్ధితో, ప్రాడ్వివాకులై = తగవులమారులై, వటువులు = విద్యార్థులు, చదువులెల్లన్, ఒజ్జలకున్ = ఉపాధ్యాయులకు, ఒప్పగించిరి = అప్పగింతఁబెట్టిరి. మఱచిపోయిరి. వటువులనఁ జదువుకొనుచున్న బ్రహ్మచారులు. బ్రహ్మచారు లనక వటువు లనుట తొందరపాటు సూచించును. కాననే తగవులతంపెలై వచ్చినవిద్దియనంతయు నప్పగింత పెట్టి రనుట. ఇచ్చిపుచ్చుకొనుచోటులవారలు = అప్పు లిచ్చి పుచ్చుకొను సంబంధముగల తావులవారలు. అప్పులు = అప్పు తీసికొన్న సొమ్ము, ఆఁకకున్ = ఏర్పాటునకు, లోనుగాక = లోఁబడక, కికురించిరి = వంచించిరి. గ్రహణసంక్రమణాదులన్ = సూర్యచంద్రగ్రహణములు మకరసంక్రమణాదిసంక్రాంతులు మొదలగువానియందు, రాచనగరిన్ = రాచదివాణమున, కాసువీసంబు = కాసుగాని వీసముగాని, వెడలమిన్ = రాకపోవుటచే, గ్రాసమునకున్ = భుక్తికి, క్షేత్రంబునందున్ = మాన్యములందు, కొన్ని, ఆధిపెట్టిరి = కుదువయుంచిరి. గృహకర్త = ఇంటియజమానుఁడు, లేనిబ్రదుకు = లేనికాఁపురము, లెస్స యుండునె = చక్కఁగా మండునా!

తా. ఇన్నివ్యవహారములు నే నింట నుండి, మెలఁకువతో సవరించుకొనువాఁడను. బహుకాల మిట నుంటచేఁ బ్రసిద్ధినొందిన నాసంసారస్థితిగతు లన్నియుఁ బూర్తిగా మారి కథలయ్యెను. యజమాని లేని యింటినిఁ గూర్చి ప్రత్యేకించి చెప్పవలసిన దేమున్నది?

అలం. అర్థాంతరన్యాసాలంకారము.

క.

అది గా కే నిట వచ్చిన
యది మొదలుగఁ జింతచే నహర్నిశమును నా
కెదురెదురె చూచు చిద్దఱు
ముదుసళ్లును బుత్త్రమోహమున నగునార్తిన్.

130

టీ. అదిగాక సర్వము నేను లేకపోవుటచేఁ జెడిపోవుటయేగాక, ఏన్ = నేను, ఇట వచ్చినది మొదలుగన్ = ఈమంచుకొండకు వచ్చినది యాదిగా, ఇద్దఱు ముదుసళ్లును = వృద్ధులగు నాతలితండ్రు లిరువురును, అహర్నిశమును = పగలును రాతిరియును, పుత్త్రమోహమున = పుత్త్రప్రేమచే, అగునార్తిన్ = కలుగువ్యథచే, నాకున్ = నాకొఱకై, ఎదురెదురె చూచుచున్ = దిక్కులు చూచుటయే పనిగాఁ బెట్టుకొని. (పైపద్యముతో నన్వయము.)

క.

తడిగంట నెపుడుఁ దఱుఁగక
కడి దఱుఁగఁగ వడియుఁ దఱిఁగి గాసిన్ బుడమిన్
బడినఁ గనరాక మంచపుఁ
దొడుగఱ లైరట్టె రుజలతో నేమందున్.

131

టీ. కంటన్ = కంటియందు, ఎపుడున్ = సర్వకాలసర్వావస్థలయందురు (ఎల్లప్పుడు ననుట), తడి = నీరు, తఱుఁగక = తగ్గక, కడి = ఆహారము, తఱుఁగఁగన్ = తగ్గఁగా, వడియున్ = శక్తియును, తఱిగి = తగ్గి, గాసిన్ = శ్రమచే, పుడమిన్, పడినన్ = పడియున్నను, కనరాక = కానఁబడక, నేలపైఁ బడియున్నపుడు బరుండియుండిరని గుర్తించరానంతగా శుష్కించి యని భావము. రుజలతోన్ =వ్యాధులతో, మంచపుఁదొడుగఱలు = మంచముమీఁది తొడుగుమండలు, మంచమును విడిచి బైట నడుగిడలేనివారు, ఐరట్టె = ఐనారఁట, ఏమందున్ = ఏమని చెప్పుదును?

అలం. అతిశయోక్తి.

తా. నన్ను విడచి నాతల్లిదండ్రు లెపుడు దుఃఖించి దుఃఖించి శుష్కించిరి. మంచములో నుండి బైట నడుగుఁ బెట్టరాని యటుల వారు శుష్కించిరి. నాకుటుంబస్థితినిగూర్చి యింకఁ జెప్పవలసిన దే మున్నది?

క.

కావున వారలఁ జూడం
గా వేగను చనఁగవలయుఁ గమలదళాక్షీ
నీ వెఱుఁగనిధర్మాధ
ర్మావస్థితి గలదె దీనికై యడలకుమీ.

132

టీ. కమలదళాక్షీ = తామరఱేకులఁబోలు కన్నులుగలదానా (వరూథినీ) ! కావునన్ = కాఁబట్టి, వారలన్ = ఇట్టి విచారస్థితియందున్న వృద్ధులగు కలిదండ్రులను, చూడంగాన్ = చూచుటకు, వేగమ = త్వరగా, చనఁగవలయున్ = నేను ఇల్లు చేరఁ బోవలయును. నీ వెఱుఁగని = నీకుఁ దెలియరాని, ధర్మాధర్మ = న్యాయాన్యాయమలయొక్క, అవస్థితి = మర్యాద, కలదె = ఉన్నదా? లేదు. సమస్తధర్మములను నీ వెఱింగియే యున్నావు. కావున, దీనికై = నేను నిన్ను విడిచిపోవుటకు, అడలకుమీ = దుఃఖపడకుమా!

తా. వరూథినీ! నీవు ధర్మము అధర్మము నెఱింగినదానవు గాని వట్టిదానవు గావు. మాతలిదండ్రులు కుటుంబముస్థితి యిటు లున్నది. నే నింటికిఁ బోవలసియున్నది. నావియోగమునకుఁ బరితపింపకుము.

క.

వడిఁ గాఁచి కాఁచి యుండన్
గడవలనీ రినుము ద్రావుకైవడిఁ బై పైఁ
బొడమెడుకోర్కులచేఁ బె
ల్లుడికినమది భోగముక్తి కూఱట గనునే.

133

టీ. కాఁకాఁచి = కొల్మిలోఁ గాక యెక్కించి యెక్కించి, ఉండన్, ఇనుము, కడవలనీరు = కుండలకొలఁది నీటిని, వడిన్ = వేగముగా, త్రావుకైవడిన్ = త్రాగువిధమున, పైపైన్ = మీఁదమీఁద, పొడమెడుకోర్కులచేన్ = పుట్టుచున్నకోరికలచేత, పెల్లుడికినమది = మిక్కిలి తప్తమైన డెందము, భోగకాంక్షలచే నుద్రేకవంత మగు హృదయము. భోగముక్తికిన్ = విషయానుభవత్యాగమునకు, ఊఱట = ఓర్మిని, కనునే = పొందునా!

ఇనుము కాఁచఁగాఁ గాఁచఁగాఁ గాక యెక్కినది. హృదయము కోర్కులచే వెట్టకొన్నది. వెట్టచేఁ బెల్లుడికినది. కాన వేఁడియందు హృదయమునకు ఇనుమునకుఁ బోలిక. ఇనుము నీరు గోరునటుల హృదయము భోగముల నపేక్షించుచున్న దని భావము.

తా. ఇనుము కాఁక హెచ్చిన కొలఁది నెక్కువనీటిని బీల్చు పగిదిని, మఱిమఱి పుట్టుచున్న కోరికలచే నుడుకు చెందిన డెందము, భోగము లెన్నియైన నపేక్షించునే కాని విరమించుట కూఱటఁ జెందునా?

అలం. ఉపమాలంకారము.

ఉ.

కావున నెన్నఁడున్ దెగనికాంక్ష నెపం బొకఁ డెన్ని రోసి నేఁ
బోవఁదలంతునేని వలపున్ ననుపున్ దగవున్ బ్రియంబునున్
నీవలనన్ సమగ్రములు నిల్పిన సంపెఁగపువ్వుఁదేనె క్రొ
త్తావికిఁ దేఁటి చిక్కినవిధంబునఁ జిక్కనె లోలలోచనా!

134

టీ. లోలలోచనా = చలించుకన్నులు గలదానా! (వరూథనీ), కావునన్ = కాఁబట్టి, ఎన్నఁడున్ = ఎప్పుడును, తెగనికాంక్షన్ = తీరనికోరికను, రోసి = రోఁతపడి, నెపంబు ఒకఁడు = ఒకనెపమును, ఎన్ని = ఎంచి, కలుఁగజేసికొని, నేన్ = నేను, పోవన్ = నిన్ను విడిచిపెట్టిపోవుటకు, తలంతునేనిన్ = తలంచినయెడ, వలపున్ = మోహమును, ననువున్ = అనురాగమును, తగవున్ = న్యాయమును, ప్రియంబునున్ = ఇష్టమును, నీవలనన్ = నీయెడల, సమగ్రమములు = నిండారియున్నవి. కొఱఁతలేక పరిపూర్ణముగా నున్నవి. నిల్చినన్ = (పోక) నిల్చినయెడ, సంపెఁగ...తావిన్ - సంపెఁగపువ్వు = సంపంగిపుష్పముయొక్క, తేనె = మకరందముయొక్క, క్రొత్తావికిన్ = క్రొత్తపరిమళమునకు, తేఁటి = తుమ్మెద, చిక్కినవిధంబునన్ = తగులుకొన్నవిధమున, చిక్కనె = తగులుకొననా? తప్పక తగుల్కొని తపింతును!

తా. నెచ్చెలీ! భోగములో మానరానివి ప్రయాణమో ఆపరానిది. కౌఁబట్టి యెన్నటికిని దెంపు లేని యీభోగేచ్ఛ కేదే నొకసాకు పన్ని వెడలిపోవుదు నన్నచో నీయెడల మోహము ననురాగము న్యాయము మంచియు నిండుకొనియున్నవి. నీవంటిప్రియురాలి నెటుల విడిచిపోవనగును? విడిచిపోక నీచెలిమి నాసించి యిక్కడనే యుందుమన్నచో సంపెంగపూఁదేనె పరిమళమునకుఁ దుమ్మెద జిక్కుకొన్నవిధమున చుట్టపక్కములకు స్వజనమునకుఁ గానివాఁడనై యిటనే గతింపవలసివచ్చునుగదా! తుమ్మెదలకు సంపెంగపూవుఁదావిగాని తేనియగాని రుచింపదు. పైగా నపాయకరము.

    “నానాసూనవితానవాసనల నానందించు సారంగ మే
    లా న న్నొల్లదటంచు గంధఫలి.”

(వసుచరిత్రము)

అలం. ఉపమాలంకారము.

ఉ.

ఎవ్వఁడు విూఁ దెఱుంగక యథేచ్ఛసుఖైకరతిన్ జరింపఁగా
నవ్వల వంశహాని వ్రతహాని యశోధనహాని పుట్టుఁ దా
నవ్వెడఁ గమ్మనుష్యపశు వయ్యవివేకి చెడున్ జగంబునన్
నవ్వఁగబాలు రౌరవమునం బడఁబాలును నిందపాలునై.

135

టీ. ఎవ్వఁడు = ఏమనుష్యుఁడు, మీఁదు = ముందుఁ జరుగఁబోవుదానిని, భవిష్యత్తును, ఎఱుంగక = తెలిసికొనక, యథేచ్ఛసుఖైకరతిన్ = ఇష్టమువచ్చినట్లు సౌఖ్యములయందే యాసక్తితో, చరింపఁగాన్ = బ్రవర్తింపఁగా, అవ్వలన్ = అటుపై, వంశహాని = కులహాని, వ్రతహాని = ఆచారనియమనాశము, యశోధనహాని = కీర్తికి ధనమునకు నాశము, పుట్టున్ = పుట్టునో, అవ్వెడఁగు = ఆజడుఁడు, అమ్మనుష్యపశువు = మనుష్య రూపముననున్న యాపశువు, అయ్యవివేకి = ఆవివేకహీనుఁడు, తాన్ = తాను, జగంబునన్ = లోకమునందు, నవ్వఁగఁబాలున్ = నవ్వులకుఁ బాలును, రౌరవమునన్ = నరకమున, పడఁబాలును = పడుటకుఁ బాత్రమును, నిందపాలును = నిందకుఁ బాత్రమును, ఐ, చెడున్ = నశించును.

సుఖాదులకుఁ బరిమితి గలదు. యథేచ్ఛసుఖైకరతి పశుధర్మము. దానిచేఁ బెక్కునష్టములు సంభవించును. కామాదికములవలన జనించు సుఖముకంటే తృష్ణాక్షయమువలన లభించుసుఖమే గొప్పది. కాన నింతతో సంబంధము త్రెంచుకొనుచుంటి నని ప్రవరవేషధారి పల్కెను. కామసుఖముకంటెఁ దృష్ణాయక్షసుఖమె గొప్ప దనుటకు —

శ్లో. “యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం,
    తృష్ణాక్షయసుఖస్యైతే నార్హతష్షోడశీం కలామ్.”

(భారతము, శాంతి.)

తా. ఎవఁడు ముందుగతి యెఱుఁగక యిష్టము వచ్చినట్లు విషయైకసక్తుఁడై ప్రవర్తించునో యట్టివివేకశూన్యుఁ డగు మానవపశువు కులమును ఆచారమును కీర్తిని ధనమును సర్వమును జెఱుచుకొని నలువురలో నవ్వులకును నిందలకును బాలై నరకము గాంచును.

అలం. అప్రస్తుతప్రశంస.

మ.

అనినం జిత్తము జల్లనన్ పొరుగు నయ్యంభోజపత్రాక్షి లో
చనగోళంబులఁ జిమ్మ లై చిలుప లై జూలై తరంగంబులై
చనుదోయిన్ గొనబౌకురంగమదచర్చల్ జాఱి పో నొక్కయొ
డ్డున బాష్పాంబుఝరంబు లుప్పతిలెఁ బోటుంబాటుగా నెంతయున్.

136

టీ. అనిన్ = ఇటుల మాయాప్రవరుఁ డనఁగానే, చిత్తము = మనస్సు, జల్లనన్ = జల్లు మనఁగా, (దిగులు నొందగా) సొరుగు...గోళంబులన్ - సొరుగు = వ్రాలిపడినట్టి, అయ్యంభోజపత్రాక్షి = తామరరేకులవంటి కన్నులు గలది యగు నావరూథినియొక్క, లోచనగోళంబులన్ = కనుగ్రుడ్ల యందు, బాష్పాంబుఝురంబులు = కన్నీటి ప్రవాహములు, (మొదట,) చిమ్మలై = బిందువులమొత్తములై, తొలుత చిన్నచిన్నబొట్టువలె స్రవించి, చిలువలై = పడియలై, కొంచెము కొంచెముగాఁ బల్లపుఁదావుల నిలిచి, జాలై = ప్రవాహమై, తరంగంబులై = కెరటములవలెఁ జెలరేఁగినవయి, చనుదోయిన్ = కుచద్వయమున, కురంగమదరచనల్ = కస్తూరితో వ్రాసినపత్రరచనలు, జాఱిపోన్ = జాఱిపోఁగా, ఒక్కయొడ్డునన్ = ఒక్కపూనికఁగా, (ఒక్కమెండునన్ = ఒక్కయతిశయముతో పా.) పోటున్ = ఉబుకుటయు, పాటున్ = తగ్గుటయు, కాన్ = కాఁగా, ఎంతయున్ = మిక్కిలి, ఉప్పతిలెన్ = పుట్టెను.

తా. ప్రవరరూపధారి యగు గంధర్వకుమారుఁ డీవిధముగా స్వగ్రామమున కేఁగుదు నని చెప్పఁగా వరూథిని నేల వ్రాలి పరవశము నొంది గుండియ యదరఁగా విచారము భరింపనోపక గ్రుడ్లనుండి వెల్లువలు వెల్లువలుగాఁ గన్నీరు విడువసాగెను.

అలం. సార్థాలంకారము.

క.

అత్తఱి గంధర్వవిభుం
దత్తామరసాక్షివదన మక్కునఁ గృపతో
నొత్తి మొగ మెత్తి యశ్రులు
మెత్తనఁ గొనగోరఁ బాఱమీటుచుఁ బలికెన్.

137

టీ. అత్తఱిన్ = అప్పుడు, గంధర్వవిభుండు = (ప్రవరవేషమున నున్న) గంధర్వశ్రేష్ఠుఁడు, అత్తామరసాక్షివదనము = ఆవరూథినిముఖమును, అక్కునన్ = ఱొమ్మున, ఒత్తి, కృపతోన్ = దయతో, మొగ మెత్తి = ఆయమముఖమును జేలితో నల్లన పైకెత్తి, అశ్రులు = కన్నీరు, మెత్తనన్ = సుకుమారముగా - గోరు సోఁకనటుల, కొనగోరన్ = గోటికొనతో, పాఱమీటుచున్ = తొలఁగఁజిమ్ముచు, పలికెన్ = ఇట్లు వాకొనెను.

తా. అప్పు డాగంధర్వుఁడు వరూథినిదుఃఖము చూచి జాలికొని దయతో దానిముఖము తనఱొమ్మున నదిమిపట్టి యూఱడించి యంతట మెల్లఁగా మొగ మెత్తిపట్టుకొని కన్నీళ్లు దుడుచుచు దానిదుఃఖ ముపశమించున ట్లొకమాట చెప్పెను.

శా.

ధీరస్వాంతవు వంత నీకుఁ దగునే దివ్యాంగనల్ కోవిదల్
గారే యోగవియోగముల్ సతములే కర్తవ్యముల్ సేయరే
పోరే రారె ప్రియంబు గల్గినజనుల్ పోరామి పోఁ బోవునే
పో రా కుండఁగ నేమి కాళ్లు దెగెనే ఫుల్లాంబుజాతేక్షణా.

138

టీ. ఫుల్లాంబుజాతేక్షణా = విరిసిన తామరపూవువంటి కన్నులు గలదానా (వరూథినీ), ధీరస్వాంతవు = తాల్మిగల డెందము గలదానవు, నీకున్ = నీవంటిదానికి, వంత = దుఃఖము, తగునే, దివ్యాంగనల్ = దేవతాస్త్రీలు, కోవిదల్ = జ్ఞానము గలవారు, వివేకము గలవారు, కారే = కారా? అగుదురుగదా! యోగవియోగముల్ = కలయిక గాని యెడఁబాటు గాని, సతములే = నిత్యములా, కర్తవ్యముల్ = చేయవలసినవి, చేయరే = లోకు లెవ్వరు చేయరా! చేయుదురు గాదా యనుట, ప్రియంబు గల్గినజనుల్ = ప్రేమ గలవారు, పోరే = పోవలసిన తావులకుఁ బోవుట లేదా! రారే = రావలసిన తావునకు వచ్చుట లేదా! పోరామి = ఉన్న స్నేహము, పోన్ = (ఎచ్చటికైన) నరిగినమాత్రాన, పోవునే, పోరాకుండఁగన్ = పోకుండుటకును రాకుండుటకును, పోవలసినచోటులకుఁ బోవకుండుటకును రావలసినచోటులకు రాకుండుటకును, ఏమి కాళ్లు తెగెనే = కాళ్లు విఱిగిపోయెనా యేమి? (గళ్లు తెగెనే = సంబంధములు విడిపోయెనా-పా.)

యోగము (కలిసికొనుట) ఎటుల సతము కాదో వియోగ మటులె సతము గాదు. మనుష్యజాతిస్త్రీవలె దివ్యాంగనయు నిందులకుఁ బరితపించుట కోవిదతకు భంగము. ధీరస్వాంతలు వంత నొందుదురా?

తా. నెచ్చెలీ! నీవు మిగులఁ దాల్మి గలదానవు. దుఃఖంవఁదగునా? దేవాంగనలు వివేకవతులు గదా! యోగవియోగములు శాశ్వతములా? చేయ వలసిన కార్యములు చేసికొనవలదా? పరస్పరముఁ బ్రేమము గలవా రెచటికిని బోరా రారా ? ఎచటికేనిఁ బోయినమాత్రాన స్నేహము చెడునా? ఎందును బోయి రాకుండుటకుఁ గాళ్లు తెగిపోయెనా?

అలం. అప్రస్తుతప్రశంస.

తే.

మూలముట్టుగఁ దెల్పె నమ్మునివరుండు
ప్రార్థితుం డయి నాకు నప్పరమవిద్య
వచ్చుచును బోవుచుండెద వదల నిన్ను
శుకకలాలాప! నము త్రిశుద్ధిగ నను.

139

టీ. శుకకలాలాప = చిలుకవలె నవ్యక్తమధురముగ మాటలాడుదానా! అమ్మునివరుండు = ఆపాదలేపనము నొసంగిన సిద్ధుడు, ప్రార్థితుండయి = నాచే వేఁడుకొనఁబడినవాఁడయి, అప్పరమవిద్యన్ = ఆగొప్పవిద్యను, మూలముట్టుగన్ = సమూలముగా, తెల్పెన్ = తెలియఁజేసెను. వచ్చుచును బోవుచుండెదను = వలసినపుడెల్ల నీయొద్దకు నాకయి నేనే వచ్చిపోవుచునుందును. నిన్ను వదలను = నిన్ను విడిచిపెట్టను, త్రిశుద్ధిగన్ = ముమ్మాటికిని, నమ్ము = నామాటల నమ్ముము. (పా. త్రిశుద్ధికిన్ = ముమ్మాటికి)

తా. నెచ్చెలీ! నిన్ను నే వీడను. ముమ్మాటికిని నమ్ముము. ఆమునివర్యుని బ్రార్థించి యతనియొద్ద పాదలేపముతోఁ గోరినచోటులకుఁ బోవునట్టి యామహావిద్యను సమగ్రముగా నేర్చుకొంటిని, వచ్చుచుఁ బోవుచు నుందును.

తే.

అని వరూథిని నూరార్చి యచటు వాసి
పోయెఁ దనయిచ్చ గంధర్వపుంగవుండు
తప్పరాదు ఋణానుబంధంబు దెగినఁ
బ్రాణప్రదమైనవలపును బాసి చనదె.

140

టీ. అని = ఇటుల నమ్మఁదగినమాటలను దెలిపి, వరూథినిన్, గంధర్వపుంగవుండు = గంధర్వశ్రేష్ఠుఁడు, ఊరార్చి = ఓదార్చి, అచటు = ఆచోటు, వాసి = విడిచిపెట్టి, తనయిచ్చన్ = తనయిష్టము వచ్చినచొప్పున, పోయెన్ = వెడలిపోయినవాఁ డాయెను, ఋణానుబంధంబు = పూర్వజన్మపుఋణసంబంధము, తెగినన్ = తీఱిన యెడల, ప్రాణపదము - జీవితస్థానము, (ప్రాణనమానము) అయినవలపును = అయిన యనురాగము కూడ, పాసి చనదె = తొలఁగిపోదా? తప్ప రాదు = ఇది తప్పదు.

తా. మరలఁ దప్పక వచ్చువాఁడ నని వరూథిని నమ్మునటుల నెన్నియో యిచ్చకములు చెప్పి గంధర్వశ్రేష్ఠుఁడు తన యిచ్చచొప్పున నరిగెను. ఋణానుబంధము తీఱిపోయినచో నెట్టిమోహమేనిఁ దొలఁగిపోదా!

అలం. అర్థాంతరన్యాసము.

వ.

అనుటయున్ దరువాతివృత్తాంతంబుఁ గృపాయత్తం బగు
చిత్తంబున నానతీవలయు నని యడుగుటయును.

141

టీ. అనుటయున్ = ఇటులఁ బక్షులు చెప్పఁగా, తరువాతి వృత్తాంతంబు = ఆపిమ్మటికథాంశమును, కృపాయత్తంబు = దయాధీనమైనది, అగు చిత్తంబునన్ = అగునట్టి మనస్సుతో, ఆనతీవలయున్ = సెల వొసంగవలయును, అని యడుగుటయున్ = అని యడిగినంతనే, (నాలవయాశ్వాసపు 2-వ వచనమునందలి 'అనియెన్' అనుదానితో సస్వయము).

శా.

హిందూరాజ్యరమాధురంధర భుజాహిగ్రామణీకంచుక
త్కుందస్వచ్ఛయశోగుళుచ్ఛ! యవనక్షోణీధవస్థాపనా
మందీభూతకృపాకటాక్ష! యసకృన్మాద్యత్కళింగాంగనా
జందీగ్రాహవిగాహితోత్తరకకుబ్ధాటీసమాటీకనా!

142

టీ. హిందూ... గుళుచ్ఛ - హిందూరాజ్యరమా - హిందూదేశపురాజ్యలక్ష్మియొక్క, ధురంధర = భారము వహించిన, భుజాహిగ్రామణీ = భుజమను సర్పశ్రేష్ఠునకు, కంచుకత్ = కుబుసమువలె నగుచున్న, కుందస్వచ్ఛ = మొల్లపూలవలెఁ దెల్లనైన, యశోగుళుచ్ఛ = కీర్తిపుంజముగలవాఁడా, (కీర్తియనెడు పూలగుత్తి గలవాఁడా! పూలగుత్తివలె స్వచ్ఛమగు కీర్తి గలవాఁ డనుట) యవ...టాక్ష - యవనక్షోణీధవ = తురకరాజుయొక్క, స్థాపన = ప్రతిష్ఠించుటయందు, అమందీభూత = తగ్గని, కృపాకటాక్ష = దయగలచూపు లవాఁడా, అన...సమాటీకనా - అనకృత్ = మాటిమాటికి, మాద్యత్ = పొగరుకొను, కళింగ = కళింగరాజుయొక్క, అంగనా = స్త్రీలయొక్క, బందీగ్రాహ = చెఱగాఁ గొనివచ్చుటయందు, విగాహిత = ప్రవేశింపఁజేయబడిన, ఉత్తరకకుప్ = ఉత్తరదిక్కునందలి, ధాటీ = దాడియొక్క, సమాటీకనా = ప్రయత్నము గలవాఁడా (అని కృష్ణరాయనికి సంబోధనము.)

తా. ఆదిశేషునివలె హిందూదేశరాజ్యభారముఁ దాల్చి కీర్తిగన్నవాఁడవును, లోఁబడిన తురకరాజును దిరిగి దయతోడ రాచఱికమున నిల్పినవాఁడవును, పలుతడప లుత్తరదేశమునకు దండెత్తి కళింగరాజుమద మడచి వానిస్త్రీలను జెఱపట్టి తెచ్చినవాఁడవును (అగు కృష్ణరాయా)!

అలం. ఉపమాలంకారము.

క.

తిరుమలదేవీచరణో
దరలాక్షాకల్పకల్పితస్థలకమల
స్ఫురదిందీవరబంధుర
హరిహయమణివలయకూటహర్మ్యవిహారీ.

143

టీ. తిరు...విహారీ - తిరుమలదేవీ = తిరుమలదేవి యనురాణియొక్క, చరణోదర = అఱకాళ్లయందు, (పాదముల యడుగుప్రదేశమునందు) లాక్షాకల్ప = లత్తుకచేఁ జేయఁబడిన యలంకారముచే, కల్పిత = కలుగఁజేయఁబడిన, స్థలకమల = మెట్టతామరలందు, స్ఫురత్ = ప్రకాశించు, ఇందీవర = నల్లగల్వలవలెనే, బంధుర = దిట్టమయిన, హరిహయమణి = ఇంద్రశీలమణిమయ మయిన, వలయ = గుండ్రని, కూటహర్మ్య = యంత్రాలమేడయందు, విహారీ = విహరించువాఁడా!

తా. ఇంద్రనీలమణి కుట్టిమమందుఁ దిరుమలదేవియొక్క లాక్షాసక్తములయిన పాదములాని లత్తుక యంటినప్రదేశములు మెట్టదామరలవలెను తక్కిన తావులు నల్లగల్వలవలెను నుండె నని తాత్పర్యము. అట్టిమేడమీఁద విహరించువాఁడా యని కృష్ణరాయనికి సంబోధనము. (హర్మ్యాగ్రమున ఇంద్రనీలములు పఱుపఁబడెను. లాక్షారసము సోఁకినచోటులు మెట్టతామరలుగఁ దక్కినతావులు నల్లగలువలుగా నుండెను.)

అలం. ఉదాత్త మలంకారము.

ఉత్సాహ.

వర్ణనీయకీర్తివైభవా! ప్రభూతభూతిదృ
క్కర్ణకుండలా! వితీర్ణికర్ణ! దీర్ణ హృదము
ద్దుర్ణయారిమానహారి! దుర్భరానకార్భటీ
ఘూర్ణమానకొండపల్లికొండవీడుమండలా.

144

టీ. వర్ణ...భవా - వర్ణనీయ = వర్ణింపఁదగిన, కీర్తివైభవా = విస్తారము గలవాఁడా, ప్రభూత...డలా - ప్రభూత = నిండారిన, భూతి = ఐశ్వర్యముచే, దృక్కర్ణకుండలా = (పాములు కుండలములుగాఁ గల) శివుఁడా, (శివుఁ డష్టైశ్వర్యసంపన్నుఁడు అట్టివాఁడా యనుట.) వితీర్ణికర్ణ = దాతృతయందుఁ గర్ణుఁ డగువాఁడా, దీర్ణ...మానహారి - దీర్ణ = పగిలిన, హృత్ = గుండెలు గలవారై, భ్రమత్ = తిరుగాడు, దుర్ణయ = నీతిమాలిన, అరి = శత్రులయొక్క, మాన = గర్వమును, హారి = హరించినవాఁడా, దుర్భ...మండలా - దుర్భర = భరింపరాని, ఆనక = భేరియొక్క, ఆర్భటీ = మ్రోఁతచే, ఘూర్ణమాన = తిరుగుపడుచున్న, కొండపల్లికొండవీడుమండలా = కొండపల్లి కొండవీడు రాజ్యభాగములు గలవాఁడా!

తా. పొగడ్త కెక్కిన కీర్తి గలవాఁడా! ఐశ్వర్యమున శివునివంటివాఁడా! దానకర్ణుఁడా! దుర్జయులైన రాజులు గుండె పగులునట్లు చేయువాఁడా! భేరీధ్వానమాత్రముననే కొండపల్లి కొండవీడు రాజ్యములను వణఁకించువాఁడా!

గద్యము.

ఇది శ్రీమదాంధ్రకవితాపితామహసర్వతోముఖాంక
పంకజాక్షపాదాంబుజాధీనమానసేందిందిరనందవర పురవం

శోత్తంసశఠకోపతాపసప్రసాదాసాదిత చతుర్విధకవితామ
తల్లికాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతం
బైనస్వారోచిషమనుసంభవం బనుమహాప్రబంధంబునందుఁ
దృతీయాశ్వాసము.

145

టీ. శ్రీమ...ప్రణీతంబు - శ్రీమత్ = విద్వత్తాసంపదగల, ఆంధ్రకవితాపితామహ = ఆంధ్రకవిత్వమునకు బ్రహ్మయును, సర్వతోముఖ = అంతట వ్యాప్తిగల, అంక = బిరుదు గల్గినట్టియును, పంకజాక్ష = విష్ణువుయొక్క, పాదాంబుజ = పాదపద్మములకు, అధీన = వశమైన, మానసేందిందిర = మన స్సనెడు తుమ్మెదగలట్టియును, నందవరపురవంశోత్తంస = నందవర మనెడియూరివారివంశమున (నందవరీకులమున) శ్రేష్ఠుఁ డగునట్టియు, శఠకోపతాపస = శఠకోపయతియొక్క, ప్రసాద = కృపచే, ఆసాదిత = పొందఁబడిన, చతుర్విధ = నాల్గువిధము లగు (బంచ, చిత్ర, గర్భ, ఆశు, కవనములు), కవితామతల్లిక = శ్రేష్ఠకవిత్వము గలట్టియు, అల్లసానిచొక్కయామాత్యపుత్ర = అల్లసానిచొక్కయమంత్రికిఁ గుమారుఁ డగునట్టియు, పెద్దనార్య = పెద్దనార్యునిచే, ప్రణీతంబు = రచియింపఁబడినది, మహాప్రబంధంబునందున్ = మహాకావ్యమున, తృతీయాశ్వాసము.

ఇది శ్రీదక్షిణామూర్తిమంత్రోపాసనాసమాసాదితాఖండసాహితీధురీణుండు నాత్రేయగోత్రపవిత్రుండును వావిళ్ల వంశపయోరాశిరాకాసుధాకరుండు నగు రామస్వామిశాస్త్రిచేత ననేకపూర్వవ్యాఖ్యానాభిప్రాయంబులఁ బర్యాలోచించి రచింపఁబడిన రుచిసమాఖ్యానం బగు వ్యాఖ్యానంబునఁ దృతీయాశ్వాసము.

  1. ‘కానలఁబడెన్' వెనుకటిపాఠమున కన్వయసారళ్యమును, ఈపాఠమున నర్థసారస్యమును గలదు.
  2. చిలుకవన్నెపుఁబొదలు — పా.