మత్స్యపురాణము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

మత్స్యపురాణము

పంచమాశ్వాసము

శ్రీరంగమందిరోజ్జ్వల
చారువిమానాంతరంగశయనధరిత్రీ
శ్రీరమణ భక్తవత్సల
నారాయణ రంగనాథ నలినదళాక్షా.

1


వ.

అవధరింపు. మిట్లు విష్ణుదత్తుండు నిజభామిని యగు సుగంధిం దోడ్కొని
కొన్నిదినమ్ములకుఁ దద్వింధ్యదేశమ్ముఁ బ్రవేశించి యొక్కశబరాలయం
బునకు నేతెంచిన నందుఁ జంచలుండను శబరనాయకుండు తద్విప్రదంప
తులం గనుంగొని వారలకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి కృతాం
జలియై యిట్లనియె.

2


సీ.

గజసింహశార్దూలగవయాదిమృగయూధ
        విస్తృతం బగుచు నీవింధ్యభూమి
నెలకొన శక్యమౌ నిలుచువారిక కాని
        చేరి యొరులు ప్రవేశింపఁ గడిఁది
కలలోననైనను గన మిందు విప్రుల
        నట్టిచో మత్పూర్వమైన పుణ్య
ఫలమున మీరు మాపల్లెకు నేతేరఁ
        బావనం బయ్యె మాప్రాభవంబు
తేనియలు కందమూలముల్ తీయనైన
ఫలములును నీడలైనట్టి పాదపములు
ఫుణ్యజలములు గలవు మాపొలములోన
నిట నివాసంబు దగును విప్రేంద్ర నీకు.

3

క.

కూటువ కూడి కిరాతులు
కోటానంగోట్లు గలరు ఘోరాకృతు లీ
వీటను మద్వశులై సొం
పాట నెదిర్చినను గెల్తు రమరులనైనన్.

4


మ.

ఫలముల్ మాక్షికముల్ భవద్గృహమునం బర్యాప్తమౌనట్లుగా
నిలుపంజాలుదు నేను మీ రిచట సుస్నిగ్ధాత్ములై యున్నచో
ఫలియించున్ మదవాప్తపూర్వజననప్రఖ్యాతపుణ్యంబు లు
జ్జ్యలరూపంబున నాయశంబు నిగుడున్ సర్వప్రపంచంబునన్.

5


వ.

అని యిట్లు శబరనాయకుండు సాంత్వనపూర్వకంబుగా బలికిన వచనం
బులకు సమ్మతించి విప్రదంపతులు తదాలయంబున నొక్కగృహంబున నిలి
చి వన్యంబులైన కందమూలఫలాదులు భుజియించి యొకసంవత్సరము
కాఁపురము సేయుచునుండి. రాసమయంబున విష్ణుదత్తుండు సుగంధితో ని
ట్లనియె.

6


చ.

ఎఱుఁగము మద్రదేశ మిపు డేక్రియ నున్నదొ సర్వధాన్యముల్
పరువడిఁ బండియున్నవొకొ భామిని యే నటు చూచివచ్చెదన్
మఱవక సర్వకాలము రమావరుపాదయుగంబు వేడ్కతో
వెఱవక పూజ సేయు మిట వేగమ వత్తును దత్ప్రసన్నతన్.

7


మ.

అని యీరీతి ధరామరాధిపుఁడు భార్యన్ సౌమ్యవాక్యంబులన్
వినయం బొప్పఁగ బుజ్జగించి మదనావేశంబుతో నంతఁ ద
ద్వనితారత్నముఁ గౌఁగిలించి తులసీదామంబులన్ విష్ణుపా
దనవాంభోరుహపూజ సేసి తుదఁ దద్ధ్యానప్రసన్నాత్ముఁడై.

8


గీ.

విష్ణుదత్తుఁ డిట్లు వేడ్కతో శ్రీవిష్ణు
పూజ తీర్చి తనదు పూర్వమైన
దేశమునకు యాత్ర సేసెద నని పూను
నపుడు శబరనాథుఁ డరుగుదేర.

9


క.

ముదమున నావిప్రుఁడు దన
సదనంబున కరుగుదెంచుశబరాధిపుతో
నిదె నీకుఁ జెలియలని తన
సుదతిం గరసంజ్ఞచేతఁ జూపె మునీంద్రా!

8

వ.

ఇట్లు శబరనాయకుం డగు చంచలునకు నిజభామిని నప్పగించి విష్ణుదత్తుం
డు హరికి సమర్పితంబులైన వన్యాహారంబులు భుజియించి నిజదేశంబున
కుం జనియె. నంత సుగంధి పాతివత్యంబున శుచియై ప్రత్యహంబు సాల
గ్రామమూర్తియందుఁ దులసీదళంబులం బూజసేయుచుఁ దద్భక్తిసమేత
యై యుండె. నయ్యవసరంబున నొక్కమహీసురుండు తద్గృహంబున కేతెం
చిన నమ్మానినీరత్న మమ్మహాత్మున కర్ఘ్యపాద్యంబులు సమర్పించి యుచి
తాసనసమాసీనుం గావించి యిట్లనియె.


క.

కనుఁగొనియెద మనినను నీ
వనమునకున్ రాఁడు విప్రవర్యుం డొకఁడున్
వనజాక్షరూప మగు నిన్
గనుఁగొన నోభూసురేంద్ర కౌతుక మొదవెన్.

12


సీ.

చర్చింప మద్రదేశంబు మన్నిలయంబు
        రంతిదేవుం డను రాజవరుఁడు
తద్దేశ మేలుచో ధర్మహీనుం డైనఁ
        గుంభినివర్షముల్ గురియవయ్యెఁ
దన్మూలమున సస్యతతులెల్ల శుష్కింప
        దుర్భిక్ష మేతేరఁ దొలఁగి యిటకు
వచ్చి యేము ఫలాదివన్యాశనములచేఁ
        గాలంబుఁ గడపంగఁ గ్రమ్మఱియును
బూర్యదేశంబు చూడంగ బుద్ధివొడమి
చనియె మత్సతి నాల్గువాసరము లయ్యె
నతఁడు సేమమునఁ దిరిగి యరుగుదెంచు
నట్టి సువ్రతమొకటి నా కానతిమ్ము.

13


చ.

ఫలములు కందమూలము లపారము లున్నవి మద్గృహంబునన్
వలసినరీతి నిచ్చకును వచ్చినవెల్ల భుజించి వేడ్కతో
లలితవిచిత్రపల్లవములన్ విలసిల్లెడు పుష్పశయ్యపై
నలయికదీర నిద్రసుఖ మందుము విప్రకులైకభూషణా.

14

వ.

అని యివ్విధంబున సుగంధి పల్కిన ప్రియవచనంబులకు సంతసించి భూ
సురుం డిట్లనియె.

15


గీ.

తల్లిమాడ్కి నీవు దయతోడఁ బల్క నా
యలయికెల్లఁ దీఱె నంబుజాక్షి
యతిథి పుత్త్రభావ్యుఁ డను శాస్త్ర మిచ్చటఁ
బ్రకటమయ్యె నేఁడు పద్మవదన.

16


క.

శ్రీకాంతుని దివసము నేఁ
డేకాదశి యీదినమున నేవరుఁ డైనం
జేకొని భుజియించిన వృజి
నాకరుఁడై నరకలోకమందు వసించున్.

17


గీ.

ఈమహావ్రతంబు నెవ్వారలైనను
జలుపఁగలిగిరేని సర్వమైన
వాంఛితముల గలుగు వారికెల్లను బంక
జాక్షుకరుణచేత నభినుతింప.

18


గీ.

నేఁటి కుపవసించి నీగృహంబున నిల్చి
పుండరీకనయనుఁ బూజ సేసి
బారనందువేడ్క ఫలరూపపారణ
చేసి చనెడువాఁడఁ జిత్త మలర.

19


వ.

అని విప్రుండు పల్కిన వనితాలలామ యిట్లనియె.

20


క.

ధరణీసురేంద్ర! మాకును
గురువవు దయచేసి నీకు గోచరమగు శ్రీ
హరివాసరవ్రతక్రమ
మురవడి వినిపింపవలయు నొదవెడు వేడ్కన్.

21


వ.

అని వినయంబునఁ బల్కిన సుగంధికి విప్రవరుం డిట్లనియె.

22


సీ.

సర్వతీర్థస్నానసంభవఫలదంబు
        తర్కింప వాంఛితార్థప్రదంబు
సకలసంపదలకు సదనంబు వైభవా
        కరము దుష్కర్మౌఘఘాతుకంబు
బ్రహ్మహత్యాదిపాపఘ్నము బహురోగ

        సంక్షయంబునకును సాధనంబు
జయకారణము మహీశ్వరులకు వైకుంఠ
        పురనివాసమునకుఁ బూఁటకాఁపు
చక్రహస్తాంఘ్రిజలజప్రశస్తబుద్ధి
సత్యనైర్మల్యహేతువు నిఖిలవిబుధ
మాన్యమై లోకధన్యమై మహిమ మెఱయు
సువ్రతంబగు నేకాదశీవ్రతంబు.

23


క.

ఉపవాసవ్రత మిది యిల
నపరిమితఫలంబు లిచ్చు హరిదినకృత మీ
యుపవాసము కలుషావృత
చపలాత్ములకైనఁ బూర్ణచంద్రనిభాస్యా.

24


క.

పతియనుమతి గలిగినచో
వ్రతములు సతి కాచరింపవచ్చును లక్ష్మీ
పతి వాసరోపవాస
వ్రతమునకుం బతియనుజ్ఞ వలవదు తలఁపన్.

25


క.

పరమంబగు సద్భక్తిని
బురుషుం డొకదూరయాత్ర పోయిననైనన్
హరిపూజయు నుపవాసము
హరిదినములఁ జేయవలయు నతివల కెల్లన్.

26


క.

ఇదె నేఁ డేకాదశి స
మ్మద మలరఁగ నుపవసించి మధుసూదనుఁ బు
ష్పదళములను బూజింపుము
విదితంబుగ నీప్రియుండు వేగమె వచ్చున్.

27


క.

ఇది యాది చేసి లెక్కగు
పదియాఱవదినమె తలఁపఁ బద్మాక్షుదినం
బది యెఱిఁగి యందు నీవ్రత
మొదవెడు సద్భక్తిఁ జేయ నుచితము తరుణీ.

28


వ.

అని యిట్లు భూసురుండు హరివాసరోపవాసవ్రతప్రభావంబును దద్వ్రతా
చారంబునుం జెప్పిన విని సుగంధి సంతసంబున నుప్పొంగుచు నాదినంబున

నుపవసించి మఱి పూజాపూర్వకంబుగా జాగరణంబు దీర్చి మఱునాఁడు త
ద్విప్రునకుఁ గందమూలాదులు సమర్పించి తద్వీఘనంబునఁ దాను బారణ
సేసినపిమ్మట నవ్విప్రుండు తృప్తినొంది దీవించి చనియె. నంత పదియాఱవ
దినంబున నేకాదశి వచ్చిన విధ్యుక్తప్రకారంబున నాసాధ్యి వ్రతంబు సలు
పుచున్నంత.

29


గీ.

అచటి కొక్కవిప్రుఁ డధ్వపరిశ్రమం
బునను జేరి కందమూలఫలము
లాఁకటికి దగంగ మాకు నొసంగంగ
వలయు ననుచు నతఁడు పలికె నంత.

30


మ.

విని యవ్వాక్యములన్ సుగంధి పలికెన్ విప్రేంద్ర నిన్నజ్ఞతన్
జనువాఁ డందును బల్కరాదు గమనశ్రాంతుండవై యున్నచో
దినముల్ సూటి నెఱుంగవైతివొ ననుం దీవ్రంబుగా మాయగొ
ల్పను నుద్యోగము నీమదిం బొడమెనో పల్కంగ నింకేటికిన్.

31


క.

ఆకంజాక్షుని దివసం
బేకాదశి నేఁడు ఫలము లెట్లు భుజింపన్
గైకొనఁ దివిరితి విఁక నీ
వాకలుషము లాత్మఁ గానవైతివి విప్రా!

32


క.

హరిదినమున నన్నము భూ
సురులకు నిడువారు విగతసుకృతంబున దు
ష్కరసంచితాఘములచేఁ
బరవశులై చనరె యముని భవనంబునకున్.

33


గీ.

వృద్ధరోగబాలవిపశాంగులక కాని
యన్యజనుల కెందు హరిదినమున
నన్నమిడినవారు నన్నాభికాంక్షులు
చనెడువారు యముని సదనమునకు.

34


వ.

అని యిట్లు విప్రభామిని యగు సుగంధి హాసపూర్వకంబుగాఁ బలికినవచ
నంబులకు రోషాయత్తమనస్కుండై యాధరామరుం డిట్లనియె.

35


చ.

అతివవు గాన నీ వెఱుఁగ వంత తలోదరి యీవనంబునన్
వెతకఁగ సాక్షి చెప్ప నొకవిప్రుఁడు నైనను లేఁడు నిన్ను నే

కతమున నేనొడంబఱుపఁ గర్తను నీ విట హాస్యమోహసం
గతి మము నీక్రియం బలుకఁ గారణ మెయ్యది గల్గె మానినీ!

36


క.

ఈదినమునకును ముందర
నైదవదివసంబు పంకజాక్షుని దిన మీ
వాదము నెఱుఁగక మాతో
వాదడువఁగ నిట్లు తగునె వనరుహనయనా.

37


మ.

అనినన్ విప్రునితోడ నిట్లనియె నయ్యబ్జాస్య యోభూసురేం
ద్ర ననున్ వంచన సేయ నేమిటికి నీతథ్యంబుఁ దెల్పంగ నా
క్షనవాంభోరుహలోలనేత్రుఁ డగు లక్ష్మీనాథుఁ డీపుణ్యకీ
ర్తనుఁ డేరీతిన యానతిచ్చె నదియే తథ్యంబు వీక్షింపఁగన్.

38


వ.

అని పలికి సుగంధి స్నాతయై ధౌతవస్త్రంబు ధరియించి ప్రాఙ్ముఖి యై
నమస్కారపూర్వకంబుగా నిట్లనియె.

39


శా.

శ్రీకాంతాధిప! శంఖచక్రవిమలశ్రీవత్సలక్ష్మాంకితా!
లోకాధీశ! సురేంద్రవందిత! దయాలోలాక్ష! కల్పద్రుమ!
వ్యాకోచప్రసవావతంస! త్రిజగద్వ్యాపారసంయుక్త! నే
మీకున్ మ్రొక్కెదఁ బక్షిరాజగమనా! మిత్రాయుతాభాంగకా!

40


గీ.

హరిదినంబె నేఁడు నగుచుండఁ గాదని
ధూర్తవిప్రుఁ డిట్లు దుండగమునఁ
బలుకుచున్నవాఁడు ప్రత్యక్షమున నీవు
సాక్షి చెప్పవలయు జలజనాభ.

41


వ.

అని యిట్లు నిశ్చలభక్తిసమేత యగు నమ్మానినీరత్నంబు పలికినవచనం
బు లాకర్ణించి సర్వపరిపూర్ణుం డగుటం జేసి యప్పరమపురుషుండు సర్వాభ
రణసమేతుండును బీతాంబరధరుండును గరుడవాహనారూఢుండు నైన లక్ష్మీ
వల్లభుం డచటఁ బత్యక్షం బై విప్రునిం గనుంగొని యిట్లనియె.

42


సీ.

వినుము భూసురవర్య విశ్వంబులోపలఁ
        గాలరూపంబునఁ గలిగి యేను
నఖలలోకోద్భవవ్యయకారణంబ నై
        వర్తింతు జగములవన్నె మీఱి
తత్కాలమైన వత్సరమాసపక్షర్తు

        దివసయామాకృతిఁ దేజరిల్లి
లలితమత్పాదనిశ్చలభక్తిసంయుక్తు
        లెట్లు చేసిన నది యట్ల యగును
సప్తతంతుసరణి జరిపెడు మీవంటి
కర్మయుక్తులకును గాదు గాని
యీపురంధ్రివంటి యిల్లాండ్ర కెల్లను
నేఁడె హరిదినంబు నిశ్చయంబు.

43


వ.

అని లక్ష్మీవల్లభుఁ డంతర్ధానంబు నొందిన విప్రవరుండు సుగంధియందలి
విష్ణుభక్తి కాశ్చర్యంబు నొంది యావామనయనకు నమస్కారం బాచరిం
చి నిజనిలయంబునకుం జనియె. నంత విష్ణుదత్తుండును శబరాలయంబున
కేతెంచి భార్యాసమేతుం డై నిజదేశంబునకుం జని తద్వ్రతప్రభావంబున
ధనధాన్యపుత్త్రపశుసమేతుం డై విష్ణుభక్తి మఱవక భగవద్భాగవత
కైంకర్యపరుం డై యుండెనని పద్మభవుండు చెప్పిన నిని నారదుండు మఱి
యు నిట్లనియె.

44


సీ.

పుండరీకాక్షుని పూజావిధానంబు
        సకలచరాచరసంభవంబు
సాయుజ్యముక్తిలక్షణమును శ్రీవిష్ణు
        సేవకు లగువారి చిహ్నములును
వనరుహాక్షాకారవర్ణనంబును గర్మ
        యోగలక్షణమును నూర్ధ్వలోక
గతియును భక్తియోగప్రశంసయును నే
        కాదశీనియమంబు కాలమాన
మధిక మగునట్టి తులసీమహత్త్వ మన్న
దానవిధియును సామాన్యధర్మములును
మొదలు గాఁగల సర్వంబు తుదకు వెడల
వింటి నీచేత లోకేశ వేడ్కతోడ.

45


గీ.

వేదజాల మెల్ల వీక్షించి తద్వేద
సారమైనయట్టి చక్రిమతము

పద్మజాత నీవు పాటించి చెప్పిన
జన్మ మెల్ల నాకు సఫలమయ్యె.

46


వ.

అని యిట్లు నారదుండు చతుర్ముఖునకుఁ బ్రణామం బాచరించి తద్విస్పష్టుం
డై పర్వతునితోడఁ గూడి స్వేచ్ఛావిహారంబున నరిగె. నీక్రమంబున నార
దునకుఁ జతుర్ముఖుండు చెప్పెనని నారాయణమునీంద్రుండు తద్వృత్తాంతం
బు శౌనకునకు నుపన్యసించిన సంతసంబంది గతసంశయుండై పుండరీకా
క్షుండె పరతత్త్వంబని యెఱింగి యమ్మునీంద్రుం డిట్లనియె.

47


క.

నారాయణమునివర! దు
ర్వారాఘసమూహతిమిరవనజప్రియ! నీ
వారూఢిగ వినిపింపుము
నారదుజన్మంబు మాకు నయతత్త్వనిధీ.

48


గీ.

జ్ఞానహేతువైన సత్కర్మమార్గంబు
విడిచి భక్తియోగవిధ మెఱింగి
యతఁడు ముక్తి నందె నని చెప్పితిరి దాని
విధముఁ దెలుపవలయు విశదభంగి.

49


వ.

అని పలికిన శౌనకునకు నారాయణమునీంద్రుం డిట్లనియె.

50


సీ.

పూర్వకాలంబునఁ బుండరీకాక్షుండు
        సంగతి బలి నడంపంగఁ బూని
వామనుఁడై చిన్నివడువురూపముఁ దాల్చి
        యతఁడు యజ్ఞము సేయునపుడు వోయి
యెడపక వసుధ మూఁడడుగులమాత్ర మ
        య్యవనితలేశ్వరు నడిగికొనియు
భూతలం బెల్ల సంపూర్ణంబుగా నొక్క
        పాదాంబుజాతంబుఁ బాదుకొల్పి
మఱియునొక్కటి సకలదిఙ్మండలమున
సందులేకుండ మింటిపైఁ జాఁచియుండ
భాసిలుచునుండు తద్విష్ణుపాదజలజ
ముద్ధృతము చూచి తద్భక్తియుక్తుఁ డగుచు.

51

సీ.

అట్టి లక్ష్మీశుపాదాభిషేకార్థంబు
        జలముఁ దెచ్చుటకు నై జలజభవుఁడు
తనచిత్తమందు నత్తఱి నొక్కపురుషుని
        సృజియించి యతని నీక్షించి యపుడు
జలము తెమ్మని కమండలువు సూప నతండు
        చని యంత హేమపుష్కరిణిలోన
వర్ణితోదకము సత్వరముగఁ గొని తేరఁ
        బురుషసూక్తంబునఁ బొలుపు మిగిలి
చేరి తత్పాదాభిషేకంబు సేయఁ ద
త్పాదతీర్థ ముర్విఁ బడకయుండ
శంకరుండు వచ్చి సంప్రీతి ధరియించె
మౌళిభాగమందు మహిమ మెఱయ.

52


క.

ఈరీతిఁ గమలజాతుఁడు
నారంబన నుదకమునకు నామం బగుటన్
నారద యని పల్కినఁ దా
నారదుఁ డన వెలసె నతఁడు నామాంకితుఁ డై.

53


వ.

అంతఁ జతుర్ముఖునకు మానసపుత్త్రుఁ డగు నారదుండు శారదాసమక్షం
బున సంగీతం బభ్యసించి యంత మారుతలోకంబున కరిగి తద్గంధవాహ
దేవతాదత్తం బగు మహతి యను వీణఁ బరిగ్రహించి యొక్కనాఁడు దేవ
మునియక్షకిన్నరకింపురుషగరుడగంధర్వాదిసమాజసంకులం బగు
బ్రహ్మదేవుని యాస్థానంబున కరుగుదెంచి మహతి యను వీణ సారించి
స్థాయిరూపంబులును సంచారిరూపంబులును నారోహణరూపంబులును నవ
రోహణరూపంబులును నై వాది సంవాది యను పాదభేదంబుల సారియల
యందు సారితంబు లైన మధ్యమ పంచమ గాంధార ఋషభ దైవత షడ్జ
నిషాదంబులను సప్తస్వరంబుల నందుఁ బాదుకొల్పి షాడవంబులు వైడ
వంబులును సంపూర్ణంబులును నై శుద్ధసాళగరూపంబులను బ్రవృత్తంబు
లగు భైరవి భూపాళ శ్రీరాగ పడవంజరంబులును వసంతంబు, మాళవి,
బంగాళి, నాట, దేవక్రియ, మేఘరంజి, వేళావుళి, మలహరి, జాళి, హిం

దోళము, భల్లాటనవనీతఝంకారధ్వని, నాదనామక్రియ, వరాళి, మంగళ
కౌశికి, గుండక్రియ, ఘూర్జరి, ధన్యాసి, శంకరాభరణంబులు మొదలైన
రాగోపరాగంబులు చంచత్పుటషడ్విధాపుత్త్రకసింహనందనరాయభేంక
ళవేణువాద్యలీలావినోదినీధ్రువాది నానాతాళయుక్తంబులుగఁ దంత్రీముఖం
బులయం దాహతం బనాహతంబు నను గానమాత్రవిశేషంబుల వాయించుచు మ
ఱియుం దత్తాళసమన్వితంబు లైన మాలితాగవాద్యతుల్యంబులుగ వదనంబు
న సందష్టప్రవృష్టసూత్కృతిభీతశంకితకరాళకపిలకాకవితాళసాం
బకతుంబకప్రసాదవినిమీలవిస్వరాపస్వరావ్యక్తస్థానభ్రంశకమిశ్రం
బు లనంబరఁగు బహువిధరాగదోషంబులం బరిత్యజించి పాడుచుకఁ దద్గా
నంబున నిజజనకుం డగు చతురానను హర్షితహృదయుం గావించి యిట్లనియె.

54


సీ.

నిఖిలాబ్జజాండంబు నిలిచె నెవ్వనిచేత
        మహిమతో జలరాశిమధ్యమమున
నెవ్వనికతమున నీచరాచరవిశ్వ
        ముదయమును బ్రవృద్ధి నొందుచుండు
నెవ్వనిక్రోధాగ్ని నిది నష్టరూపమై
        కలయును నీటిలో గర్వ మడఁగి
యెవ్వనిఁ దలఁవంగ నీప్సితంబులు గల్గు
        నెలకొని సర్వదేహులకు నిలను
నామహామహుఁ డే జపధ్యానములను
వందనస్తుతులను మాకుఁ బొందువడును
నిట్టిసూక్ష్మంబు లెల్లను నీక్ష చేసి
తెలుపవలయును లోకేశ జలజనయన.

55


క.

ఈకర్మసరణి విడువక
యేకాలము నడపవలయు నెయ్యది ధరలో
మాకుంగల యధికారము
లోకోత్తర చెప్పవలె విలోకించి తగన్.

56


వ.

అని విన్నవించిన నారదునకుఁ జతురాననుండు సంప్రీతి నిట్లనియె.

57

సీ.

వినుము కుమార యీవిశ్వంబులోపల
        ధరణితలాకాశగిరులయందు
వార్ధినదీద్వీపవాయుతేజములందు
        ధరణీరుహోదకస్థలములందుఁ
బశుపక్షిమృగకీటపన్నగంబులయందు
        వసుధానిలింపదేవతలయందు
ఫలపుష్పపల్లవపరిమళాదులయందు
        విమలకాంచనరత్నసమితియందుఁ
దిలలయందును దైలంబు నిలుచుమాడ్కి
సర్వవరిపూర్తితోడుత సంక్రమించి
నెలయుచుండును వేదాంతవేద్యుఁ డైన
విష్ణుఁ డఖిలాండమధ్యప్రవిష్ణుఁ డగుచు.

58


క.

ఆపరమమూర్తి వరనా
భీపద్మమునందు నేను బృథుతరభక్ష్యా
రోపితనిజహృదయుఁడ నై
చూపట్టితి సంభవించి సురలు నుతింపన్.

59


క.

నిలిపితిని సర్వజనములఁ
దలకొలిపితి నందుఁ జెడని ధర్మము మిగులన్
గలఁచితి నసురుల హృదయము
లలయించితి విష్ణువిముఖు లగు దుర్జనులన్.

60


వ.

మఱియు నప్పరమపురుషుం డైన లక్ష్మీవల్లభుండు త్రిజగత్సంపూర్ణుం డై
కర్మాచారసమేతు లగు మహీసురులచేతఁ గ్రతువులయందు శ్రౌషడ్వౌష
ట్స్వధాస్వాహాంతంబు లైన మంత్రంబులచేత నాహూయమానుం డై తద
గ్నులయందు హుతంబు లైన పురోడాశాదులు భుజియించి క్రతుకర్తలకు
వాంఛితంబు లొసంగుచు నతిగహనంబు లగు సంసారంబు లందుఁ బుత్త్ర
ధనవధూపశుబాంధవగృహాదిదుర్మోహంబులం బరిత్యజించి ప్రపన్ను
లైన దాసులచేత ననవరతంబును హృదయపయోరుహంబులయందు
ధ్యేయుండై తద్ద్వైగుణ్యంబులు దలంపక వారికిం బరమపదంబు గృప

సేయునట్లు కర్మజ్ఞానప్రతిపాదకంబు లగు వేదంబులు తన్మహాత్ముని పా
దాంబురుహంబులకు భూషణంబు లై వర్తించున ట్లగుటం జేసి సేవ్యుండును
వంద్యుండును ధ్యేయుండును స్తుత్యుండును దత్పయోరుహలోచనుండకాని
యితరు లిందుల కర్హులు గారు. అమ్మహాతత్త్వంబునే తలంపఁగవలయునని
చెప్పి లోకేశుండు మఱియు నిట్లనియె.

61


చ.

హరి జగదీశ్వరుండు భువనైకనివాసుఁడు సర్వదేవతా
వరుఁడు దయాసమన్వితుఁడు వారిజనాభుఁడు భక్తలోకదు
ష్కరకలుషౌఘమర్దనుఁడు కంజదళాయతనేత్రుఁ డిందిరా
ధరుఁడు మనస్సరోజమునఁ దార్కొని నిల్చును నెల్లకాలమున్.

62


క.

శ్రీవరుఁడే దైవంబని
భావంబునఁ దలఁపు నీవు ప్రత్యక్షం బై
యావనరుహాక్షుం డొసఁగును
నీవాంఛితమెల్ల సతతనిత్యచరిత్రా.

63


మ.

హరి సంగీతవినోదలోలు డగుఁ బొ మ్మత్యంతశీఘ్రమ్ముగా
వరగానంబుల నాత్మసద్గుణకథావర్ణ్యంబు లైనట్టి గీ
తరసంబుల్ రసనం జవింగొనెడు మర్త్యశ్రేణి కిష్టార్థముల్
పరిపూర్ణంబులుగా నొసంగును దయాపారీణుఁ డై వేడుకన్.

64


గీ.

సామవేదమందు సంగీత ముదయించె
నట్టి గీతమునకు నఖిలజగము
వశము నొందుచోట వరుస నీకును బొంద
రానిచో టదొకటి యైనఁ గలదె?

65


క.

కల దొకమంత్రరాజము
కలుషనివారకము ముక్తికరమును నగుచున్
జెలువొందును దన్మంత్రము
దెలిపెద వినవలయు సర్వదివిజాభినుతా.

66


గీ.

సర్వవేదోక్తసన్మంత్రసారమయము
సుప్రసన్నత వాంఛితార్థప్రదంబు

చతురకైవల్యసంప్రాప్తిసాధనంబు
శ్రీమదష్టాక్షరంబు రాజితచరిత్ర.

67


క.

అష్టాక్షరమంత్రము వి
స్పష్టంబుగ జపము సేయ జలజాక్షుఁడు దా
నిష్టప్రాప్తియు మఱియు న
నిష్టనివృత్తియు నొసంగు నిర్మలచరితా.

68


వ.

అని పలికి బ్రహ్మదేవుండు మఱియు నిట్లనియె.

69


సీ.

వినుము పుత్త్రక పూర్వవృత్తాంత మొక్కటి
        చర్చింపఁ గుకురుదేశంబునందుఁ
బరిపూర్ణనిత్యశోభనమున విలసిల్లు
        భ్రమరావతీనామపట్టణంబు
ఆపట్టణమున విత్తాధికుండై యుండుఁ
        బులహుండు నా నొక్కభూసురుండు
అతఁడు తద్విత్త మత్యంతంబు వృద్ధిమూ
        లంబుగం బెంచి తలంపులోన
ధర్మమంతయు వర్జించి దాన ముడిగి
మోహలోభాదిసక్తుఁడు సాహసమున
దేవతానింద సేయుచుఁ దెలివి తప్పి
యండె నొకకొంతకాలంబు నిండువేడ్క.

70


వ.

అయ్యవనరంబున.

71


గీ.

సుతులచేతఁ గొంత సతిచేత నొకకొంత
యప్పువారిమీఁద నడఁగి కొంత
యనలభూపతస్కరాదులచే గొంత
చనియెఁ దద్ధనంబు జనవరేణ్య.

72


క.

ఆసమయంబున సుతని
ష్కాసితుఁ డై పులహుఁ డపుడు ఘనదుఃఖమునన్
ధీసంపద్విరహితుఁ డై
మోసంబును బొంది దైన్యమున నిట్లనియెన్.

73

ఉ.

దానము మాని యెంతయును ధర్మము సేయక భక్ష్యభోజ్యముల్
గానక కష్టవృత్తి నతికాంక్షను నే నిటఁ గూర్చు విత్తముల్
గానఁగరాక వాయుపరిఘట్టితతూలముమాడ్కిఁ బోయెనే
వానికినైన దైవగతి వచ్చినఁ దప్పఁగఁ జేయవచ్చునే.

74


చ.

వెనుకకు మోసమయ్యె నిదె వీక్షణ సేయఁగ వార్ధకంబు వ
చ్చెను బలువైన రోగములు సెందెను ని ట్లుదయించె దుఃఖముల్
మనమున నెవ్వనిం దలఁప మానునొ యాక్రియ నిత్యముక్తుఁ డై
ఘనుఁడగు విప్రుచే వినినఁగాని యెఱుంగఁగరాదు నిక్క మై.

75


వ.

అని యిట్లు పులహుండు పరితాపసక్తుం డై పుణ్యతీర్థజలంబుల స్నానము
సేయుచు దేహాభిమానంబు విసర్జించి వన్యాహారంబులు భుజియించుచుఁ
జనిచని.

76


చ.

ఖరకరతీవ్రతాపమునఁ గంపితుఁ డై యటఁ గాంచె నమ్మహీ
సురుఁడు విచిత్రరత్నపరిశోభితనిర్మలసామమంత ము
త్కరచమరీలులాయకిటిగండకభల్లుకబృందమర్కటీ
హరివరమత్తనాగశరభాదిదురంతము మాల్యవంతమున్.

77


వ.

అంత నప్పర్వతంబు చేరంజని యామునిప్రవరుండు శీతలం బగు నిర్ఝర
జలంబులు గ్రోల యచ్చట నొక్కమహీజశాఖాగ్రంబున నధోముఖుం డై
వ్రేలుచు బ్రహ్మజ్ఞానసమేతుం డై బాహ్యంబు మఱచి తపంబు సేయుచున్న
యొక్కయోగపురుషునిం గనుంగొని తద్దర్శనమాత్రంబున శ్రమంబు విస
ర్జించి తద్ధ్యానసమాప్తిపర్యంతంబు నిరాహారుం డై గతకాలక్రమం బెఱుం
గక దినత్రయం బచ్చట నుండు నంత నమ్మునివరుండు ధ్యానంబుఁ జాలిం
చి యతని నవలోకించి తదాగమనవృత్తాంతంబు మనోమార్గంబున నెఱింగి
దరహసితవదనుం డై యిట్లనియె.

78


గీ.

కష్టవృత్తితోడ ఘనమైన విత్తంబు
గూర్చి దానమహిమఁ గొదవపఱిచి
నిజజనంబుచేత నిష్కాసితుండ వై
వెడలవలసె నిట్లు విప్రవర్య.

79

క.

ధనమునకును దానము ఫల
మనయంబును హరిఁ దలంచు టాయుష్యఫలం
బని యెఱిఁగి యివ్విధంబునఁ
జననేర్చినవాఁడె జగతి సర్వజ్ఞుఁ డగున్.

80


క.

వినయముఁ జెఱుచును గన్నుల
కును దిమిరకరంబు చెవులుకును బధిరతఁ జే
యును దేహము మఱపించును
జనులకు ధనసంగ్రహంబు సామాన్యంబే.

81


వ.

అని పలికిన యోగివరునకు విప్రవరుం డిట్లనియె.

82


క.

గతకార్యంబులు మఱి యా
గతకార్యంబులును యోగగతి యతినియతిన్
మతి నెఱుఁగనేర్చు భావం
బితరులకును గలదె జగతి నీక్షింపంగన్.

83


శా.

స్వామీ నీవు మహానుభావుఁడవు నీసందర్శనం బాఁచు నీ
భూమిం బ్రాణుల కాత్మపావనతతులన్ బుణ్యస్వరూపంబు దాఁ
బ్రేమన్ వర్థిలఁజేయు నిచ్చు సిరులున్ బెక్కైన కర్మంబులన్
సామర్థ్యంబునఁ గ్రుంగఁద్రొక్కు నడఁచున్ సంసారదుఃఖంబులన్.

84


గీ.

ఏతపంబు సేయ నీమనోదుఃఖంబు
మొదలి కడఁగి చనును మునివరేణ్య!
యిది తలంపులోన నెంతయు వీక్షించి
యానతీయవలయు నమరవంద్య!

85


వ.

అని విన్నవించిన వసుధాసురేంద్రునకు మునీంద్రుం డిట్లనియె.

86


సీ.

నయముగ నచ్యుతానంతగోవిందనా
        మము లేకమైన నామత్రయంబు
అట్టినామత్రయం బనెడు వైష్ణవమంత్ర
        మనయంబు జపము సేసిన నరుండు
సంసారవార్ధిసంజనితదుఃఖవిహీనుఁ
        డై విష్ణుపదమున కరుగుచుండు

నట్లు గావున భక్తి నలరుచు హృదయంబు
        పదిలంబుగా లోనఁ బాదుకొల్పి
సరణి మీఱంగ విజనదేశంబునందుఁ
జక్షురాదీంద్రియజ్ఞానజనితవస్తు
నిచయసంభవసుఖలేశరుచుల నెడలి
తన్మహామంత్రరాజంబుఁ దలఁపవలయు.

87


క.

ఈ నామత్రయజపమున
శ్రీనాయకుఁ డైన చక్రి చింతితఫలముల్
పూనిక నీకు నొసంగెడు
దీనావనలక్షణాత్తదీక్షాపరుఁ డై.

88


గీ.

గురువుచేత నందికొనిన మంత్రముగాని
బయలు ప్రాఁకిచూడఁ బనికిరాదు
ఇదియఁ గారణముగ నే నిచ్చెదఁ బ్రతిగ్ర
హింపు మంత్రరాజ మిష్ట మలర.

89


వ.

అని యోగీంద్రుండు పల్కిన యంత నాపులహుం డమ్మహాత్మునివలన న
మ్మంత్రంబు పరిగ్రహించి యప్పర్వతంబునకు వాయవ్యభాగంబునం గలు
గు ద్రోణికామధ్యమంబునకుం జని యచ్చట ఫలపుష్పసమేతంబు లైన
మహీరుహంబులచేత నావృతం బగు సువర్ణపుష్కరిణీతీరంబున సమాసీనుం
డై హృదయపంకజంబునఁ బుండరీకాక్షుని భవ్యాకారంబు ధ్యానంబు
సేయుచు నామత్రయమంత్రజపంబు మఱవక జపియించె. నయ్యవస
రంబున.

90


సీ.

మకరకుండలయుగ్మమణిదివ్యరోచులు
        చెక్కుటద్దములపైఁ జెంగలింప
హారకౌస్తుభమున నలమి సుస్నిగ్ధమై
        తులసికాదామంబు తొంగలింప
శంఖచక్రగదాసి శార్ఙ్గయుక్తంబు లై
        కరపంకజంబులు కరము మెఱయ

నభినవవరకిరీటాంగదహారాది
        దివ్యభూషణములు దేజరిల్లఁ
బీతనిర్మలవస్త్రపరీతుఁ డగుచుఁ
గంతుశతకోటిసుందరాకారుఁ డగుచుఁ
బుండరీకాక్షుఁ డచటఁ దద్భూసురేంద్రు
కడకుఁ జనుదెంచె దేవతాగణము వొగడ.

91


వ.

ఇట్లు పుండరీకనయనుం డైన లక్ష్మీవల్లభుండు పులహునకుఁ బ్రత్యక్షుం
డైన యంత నతండు తన్మహాత్ముని దివ్యాకారం బవలోకించి హర్షపులకిత
దేహుం డై ప్రణతిపూర్వకంబుగా నిట్లనియె.

92


చ.

సరసిజసంభవాదినుతచంద్రదివాకరనేత్ర! సద్గుణా
కర! కమలాలయాకరయుగస్థితకుంకుమముద్రితాంగ! సం
గరతలయాతుధానబలగర్వవినాశక! సర్వభూషణా
పరిమితకాంతిరంజిత! కృపాసముదంచిత! భక్తవత్సలా.

93


మ.

ధనధాన్యంబులు గోలుపోయి నిజపుత్త్రభ్రాతృవర్గంబుచే
తను రోషంబున వెళ్ళఁగొట్టఁబడి యాత్మన్ దుఃఖయుక్తుండ నై
చని నానావిధతీర్థతోయముల సుస్నాతుండ నై యిచ్చటన్
గనుఁగొంటిం గమలాక్ష మిమ్ముఁ గృతసత్కర్మంబునన్ మాధవా.

94


క.

భవదంఘ్రియుగళభక్తియు
భవదీయులతోడి చెలిమి ప్రబలెడు వేడ్కన్
భవమందలి వైరాగ్యము
భవహర కృప సేయవలయుఁ బన్నగశయనా.

95


వ.

ఇట్లు నామత్రయమంత్రజపప్రభావుం డగు పులహుండు విన్ననించిన
యంత లక్ష్మీకాంతుం డగు గోవిందుఁ డతనికి సుస్థిరం బగు సంపదయు
ను దానధర్మపరోపకారసమర్థం బగు బుద్ధియును నిశ్చలంబగు నిజపాదాం
భోరుహయుగళభక్తియును గృప సేసి యాసువర్ణపుష్కరిణీతీరంబునను
బరమమూర్తి లోకానుగ్రహంబునకు నై మరకతశిలాస్వరూపంబుఁ గైకొని
శతకోటిమన్మథాకారుం డై హేమమండపమధ్యంబునఁ గల్పమహీరుహ

చ్ఛాయాసమాశ్రితుం డయ్యె నని చెప్పి కమలసంభవుండు నారదునకు
మఱియు నిట్లనియె.

96


సీ.

వర్ణితం బగు మాల్యవత్పర్వతమున వా
        యవ్యదిగ్ద్రోణికాప్రాంతమందు
నిరుపమహేమపుష్కరిణీతటంబున
        విమలతత్కాంచనవేదినడుమ
బ్రాహ్మణోత్తమునకుఁ బ్రత్యక్షుఁ డై శుభా
        కారంబుఁ గైకొని కమలనేత్రుఁ
డమరభూజచ్ఛాయ నలరుచునున్నవాఁ
        డచటికిఁ జని నీవు హర్ష మొదవ
వీణ సారించి సంగీతవిద్యచేతఁ
బ్రతిదినంబు సంగీతసంస్తుతు లొనర్ప
నమ్మహాత్ముండు ప్రత్యక్ష మగుచు వేడ్క
నిష్టమగు వస్తుసంతతు లిచ్చు నీకు.

97


వ.

అని యిట్లు చతురాననుం డానతిచ్చిన నట్లకాక యని నారదుండు కమల
సంభవునకుఁ బ్రణామంబు లొనర్చి మహతి యను వీణ నిజభుజంబున నిడు
కొని తద్గదితం బగు హేమపుష్కరిణీతటంబుఁ జేరి యచ్చట సఘమర్షణ
స్నానంబు సేసి సంధ్యాదినిత్యకర్మంబులు సమాప్తించి తత్తీరంబున సువర్ణ
వేదికామధ్యంబున మణిమయాకారంబుఁ గైకొనిన లక్ష్మీవల్లభుని సంద
ర్శించి యప్పరమమూర్తికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి వీణ సారిం
చి యందు రాగాలప్తి రూపకాలప్తి భేదంబునఁ దత్పుండరీకాక్షగుణపౌరు
షసమేతంబు లైన గీతంబులు నాడుచునున్న సమయంబునఁ దద్గీతామృత
పానపరవశుఁ డై యాలక్ష్మీవల్లభుండు సంతసంబున నుప్పొంగి యమ్ము
నీంద్రున కిట్లనియె.

98


సీ.

బ్రహ్మకుమార యీపగిది శారదకైన
        సంగీత మొనరించు సరవి రాదు
చతురవీణాదండకృతరూపకాలప్తి
        వాద్యామృతమునకు వశము నొంద

హర్షసంయుక్తంబులై మదీయాంగక
        ప్రకరంబు లెల్లను బరిణమించె
మెచ్చితి నేమైన నిచ్చెద నడుగంగ
        వలయును నీయభివాంఛితంబు
ముందుగాఁ గల్గు నీ కింక ముక్తిసౌఖ్య
మనుచుఁ దత్పుండరీకాక్షుఁ డానతీయ
ముదముతో నంత నారదమునివరుండు
కరసరోజముల్ సిరసుపైఁ గదియఁజేర్చి.

99


వ.

ఇట్లనియె.

100


సీ.

ఓపుండరీకాక్ష యోదయాసాగర
        యోరమాధీశ్వర యోకృపాత్మ
సనకాదియోగీంద్రు లనయంబు వాయువుల్
        కుంభకంబునఁ బాదుకొల్పి యందుఁ
గుండలి మేల్కొల్పి నిండువేడుకతోడ
        ద్వాదశాక్షరములఁ దవిలినట్టి
హృత్పయోరుహమందు హేమరూపం బగు
        మీదివ్యరూపంబు మోద మలర
ధ్యానమార్గమునఁ దలఁపనైన యుష్మ
దీయతేజోమయాకృతిఁ దెలియలేని
యట్టిచో సర్వనిత్యులరైన మిమ్ము
దర్శనము సేయఁగంటి నేత్రమ్ము లలర.

101


వ.

మఱియును సంతతాచారపరాయణులై కర్మమార్గప్రవర్తకులైన యాజకు
లచేత శ్రౌషట్ వౌషట్ స్వాహా స్వధాకారంబులను దత్క్రియావిశేషం
బుల నాహూఁతుండ వై హుతంబు లగు పురోడాశ దధ్యాజ్య సమిధాదిద్ర
వ్యంబులచేతఁ దృప్తుండ వై యజ్ఞేశ్వరుండును యజ్ఞఫురుషుండును
భోక్తయు నన సంస్తుతుండ వై తత్కర్మనిష్ఠులకు వాంఛితార్థంబు లొసం
గుదువు. దేవా! అట్టి స్థావరజంగమాత్మకం బై నిరర్గళనిరతిశయదృష్ట

సంకల్పవికల్పసముదాయాదిగుణసమేతంబై లోచనగ్రాహ్యం బగు నీ
విశ్వంబున గుణద్రవ్యక్రియావత్స్వరూపంబున శబ్దమాత్రభేదస్వరూపగతుం
డవై తిలగతం బగు తైలంబుచందంబున వృద్ధిశూన్యుండవై వర్తించుచు
సర్వజీవాంతఃకరణగతుండ వై తద్వ్యాపారంబు లెఱింగి నిశ్చలనిజపాద
భక్తిసమేతులైన మహాత్ములకు సాయుజ్యంబుఁ గృప సేయుదువు; పరమ
పురుషా! నీవు దయాపరిపూర్ణుండ వగుటం జేసి లోకానుగ్రహార్థంబు బోధ్య
బోధకభాగవతుండ వై ప్రాణిసమూహంబులను గర్మజ్ఞానాచరణరూపంబు
న సాయుజ్యంటు నొందింతుపు; సకలపరిపూర్ణరూప! భవద్గుణంబులు
వర్ణింప బ్రహ్మాదులకైనను మనోవాగ్గోచరంబులు కావు. అట్లయినచో నస్మదా
దులు మీదివ్యపౌరుషంబులు వర్ణింపఁగలరే యని పల్కి నారదుం డిట్లనియె.

102


సీ.

శైలంబులందుఁ గాంచనమహీభ్రం బన
        జలధులందున దుగ్ధజలధి యనఁగ
ఫణిసంఘములయందుఁ బన్నగేశ్వరుఁ డన
        మణులందుఁ గౌస్తుభమణి యనంగ
దేవతాపతులందు దివిజనాథుం డన
        నరులయందున మహీసురుఁ డనంగ
సర్వవేదములందు సామవేదం బనఁ
        గర్మంబులందు యాగం బనంగ
దినములందున శ్రీవిష్ణుదిన మనంగ
నఖిలభూతచయంబులం దనల మనఁగ
వస్తువులయందు ఘనమైన వస్తురూప
మునఁ బ్రవర్తింతు వీరీతి వనజనయన.

103


గీ.

పలుచనై యొక్కరోమకూపంబులోన
నుండు మీదేహమునను బ్రహ్మాండకోట్లు
తలఁపనైన నశక్యమై తనరుచోట
వచనముల మిమ్ముఁ బొగడంగ నుచిత మగునె.

104


శా.

వైగుణ్యంబులు పెక్కు గల్గినను దేవా భూసురుల్ భక్తిచే
భోగాంతశ్శయనుండ వైన నిను సంపూర్ణాత్ము లై కొల్చి య

జ్ఞాగారంబులయందు హోమముఖకర్మాచారముల్ సల్పి త
ద్వైగుణ్యోద్భవపాపహీను లగుచున్ వర్తింతు రెల్లప్పుడున్.

105


క.

మిముఁ బొగడక తుద నాచరి
తము లగు కర్మములు సంతతంబును ఫలశూ
న్యములై చనుఁ దత్కర్తకు
నమితం బగు నరకనిలయ మాసన్న మగున్.

106


గీ.

వరుసఁ గర్మతంత్రవైగుణ్యములు గల్గు
కర్మసరణి మిగులఁ గలుషహేతు
వట్ల యగుటఁ జేసి యెట్లైన మీపాద
యుగళభక్తి మాకు నొసఁగవలయు.

107


వ.

అని విన్నవించిన నారదునకుఁ జక్రధరుం డిట్లనియె.

108


క.

ఆర్తుం డయ్యును మద్గుణ
కీర్తన సేయంగనేర్చు కృతకృత్యుఁడు మ
న్మూర్తిం గలయును సన్నుత
కీర్తిప్రఖ్యాతుఁ డగుచుఁ గీర్తితపుణ్యా.

109


క.

సంగీతామృతధారల
నంగీకృత మైనయట్లు యజ్ఞాదులచే
తం గరగదు సంతోషత
రంగిత మై మన్మనంబు రమ్యచరిత్రా.

110


చ.

జననుత సామవేదమున సంభవ మయ్యెను గానవిద్య త
జ్జనితము లైన రాగములు చక్కఁగఁ గూర్చి మదీయసద్గుణా
భినవములైన గీతములు ప్రేమఁ దలిర్పఁగఁ బాడనేర్చు స
జ్జనుఁడు మదీయుఁ డాతనికిఁ జక్కన యిత్తును వాంఛితార్థముల్.

111


క.

కొంకక కలుషంబులకును
శంకింపక మత్పదాబ్జచిరతరభక్తిన్
బంకజభవసుత మద్గుణ
సంకీర్తన సేయవలయు జగములలోనన్.

112

గీ.

సంతతానపాయసంపత్కరంబును
సకలధర్మములకు సాధనంబు
దేవమిళితమత్పురావాసహేతువు
కృతము నదియ సుగుణకీర్తనంబు.

113


వ.

మఱియు శిలాదారుమయంబు లైన ప్రతిమావిశేషంబులు నిల్చి యందు
మదీయాకారంబు భావించి పూజాదిక్రియ లొనర్చుటయు మత్ప్రీతిగా య
జ్ఞంబు లాచరించుటయు మదర్పితంబులుగ దీనులయెడ దానంబులు సేయుట
యును బుణ్యతీర్థంబుల యందు స్నానంబును దీర్థయాత్రయు మొదలైనయవి
జ్ఞానంబునకుఁ గారణంబులు. అట్టి సుజ్ఞానసమేతుండైన మద్భక్తుండు బా
హ్యవస్తు మోహంబుఁ బరిత్యజించి ధ్యానయోగంబున స్వసంమేధ్యసుఖం బ
నుభవించుచు నాత్మారాముండై వర్తించునట్లు గావున నిత్యనైమిత్తికకా
మ్యనిషిద్ధకర్మంబులఁ ద్యజించి.

114


చ.

వరుస మదీయదాసజనవర్గములోపల నగ్రియుండవై
సురనరనాగలోకములు చొచ్చి విశేషములైన ఠావులం
దిరుగుచు మద్గుణాకలితనిర్మలగీతములెల్ల వైణిక
స్వరముల గానముల్ సలుప సంతసమందుదు నేను భూసురా.

115


వ.

అని యీచందంబున లక్ష్మీవల్లభుం డాన తిచ్చి తొల్లిటి యట్టివిగ్రహంబు ధ
రియించి సువర్ణవేదికామధ్యంబున నిలిచె. నంత నారదుండును బహ్మానంద
సంపన్నుండై యాపుండరీకాక్షవిగ్రహంబునకుఁ బ్రణామం బాచరించి జీవన్ము
క్తుండై హరినామస్మరణంబు సేయుచు విష్ణుభక్తిపరిపూరితాంతరంగుండై క
ర్మయోగంబుఁ బరిత్యజించి జ్ఞానమార్గంబున సంచరించుచునుండె నని నారా
యణమునాంద్రుఁ డీప్రకారంబున నారదుజన్మవృత్తాంతంబు సెప్పిన విని శౌ
నకుం డిట్లనియె.

116


క.

వేదానధికారులకును
మోదంబున నాచరింప ముఖ్యము లగు త
ద్వేదోక్తము లగు కర్మము
లాదరమున నాన తిమ్ము హర్షం బొదవన్.

117

వ.

అని పలికిన శౌనకునకు నారాయణమునీంద్రుం డిట్లనియె.

118


క.

దానంబును సత్యము సం
తానస్థాపన మనంగ ధరలో నివియే
మానవులకు వేదోక్తము
లై నియతము లాచరింప నగు ధర్మంబుల్.

119


క.

దానమునఁ గల్గు పుణ్యము
దానముెనే కీర్తి నిలుచు దర్పితు లెల్లన్
దానముననె వశులగుదురు
దానమునకు నధికమైన ధర్మము గలదే.

120


క.

సత్యంబున సిరి నిలుచును
సత్యంబున విష్ణులోకసౌఖ్యము గలుగు
సత్యవ్రతుఁ డగు మనుజుని
బ్రత్యహము నుతింపుదురు సుపర్వగణంబుల్.

121


వ.

మఱియుఁ దనయుండును దటాకంబును వనంబును నిక్షేపంబును దేవతాల
యంబును బ్రహ్మప్రతిష్ణయుఁ గృతియును ననఁగ సప్తసంతానంబు లనం
బరఁగు. నందుఁ దత్తత్ప్రకారంబులు సెప్పెద నాకర్ణింపుము.

122


క.

వినుతి యొనర్పఁగ నిజకుల
వనితాగర్భంబునందు వైభవ మెసఁగన్
దనయుని బడయఁగవలయును
మునుకొని పితృవర్గఋణవిమోచనమునకై.

123


క.

తనయుఁడు చేసిన పుణ్యం
బున నరకనివాసులైనఁ బొందుదురు మహా
ఘనులై పితృవర్గంబులు
జననుత సురలోకదివ్యసౌధచయంబున్.

124


క.

తనయవిహీనుఁడు పుణ్యం
బున నధికుండైన లోకపూజితుఁ డైనన్

జను నంతకుని పురంబున
కును బంధుసమేతుఁ డగుచు గోరిక లెడలన్.

125


గీ.

విప్రు లాత్మవంశవృత్తంబు విడనాడి
శూద్రసతులయందు సుతులఁ బడసి
కాలసూత్రమందుఁ గాలకింకరమర్ది
తాంగు లగుచు దుఃఖమందువారు.

126


వ.

అట్లు కులకాంతాసముత్పాదితు లైన తనయులచేత నాచరితంబు లైన య
జ్ఞాదితంత్రంబులచేతను బుణ్యతీర్థంబులందును నిత్యనైమిత్తికకామ్యకారు
ణ్యపైతృకంబులచేతను దర్పణోదకంబులచేతను బితృపితామహాదులు తృప్తు
లై స్వర్గసుఖానుభవంబు సేయుదురు. మఱియు నట్టి పుత్త్రులు, ఔరసుండు
ను, క్షేత్రజుండును, దత్తుండును, గ్రీతుండును ననఁ జతుర్విధంబులఁ బ్రవ
ర్తింతు. రందు స్వసంభవుం డౌరసుండును, బరసంభవుండు క్షేత్రజుండును,
హేమపూర్వకంబుగా గృహీతుండు దత్తుండును, గ్రయలబ్ధుండు గ్రీతుండును
నగుఁ. దత్కీతుండును దేహక్రీతుండును ధర్మక్రీతుండును నన ద్వివిధంబగు.
నందు మూల్యరూపంబునఁ గ్రీతుండు దేహాశ్రితుండును ననన్యగతికుం డై
యన్నాదులచే రక్షితుండు ధర్మక్రీతుండు నగు. నిట్లు పూర్వతనయభావ
రూపంబున నుత్తరోత్తరసంతానరూపతనయులఁ బరిగ్రహింపవలయు మ
ఱియును.

127


గీ.

న్యాయరూపమునను బ్రాప్తమైనయట్టి
విత్తమున నప్రమత్తుఁ డై వేడ్కతోడఁ
దద్వ్యయంబున కాత్మసంతాప ముడిగి
వరతటాకములు నిలుపవలయు నెచట.

128


క.

ధరణి తటాకము నిలిపిన
నరుఁ డఘనిర్ముక్తుఁ డగుచు నవయౌవనవి
స్ఫురితశరీరుం డగుచును
వరుణాలయమందు నిలుచు వైభవ మెసఁగన్.

129


క.

అరయఁ దటాకమునను గో
ఖురములు తటమందు నిలువ గోలోకమునన్

బరిస్ఫూర్తిని విహరించును
బరికింపఁగఁ దత్తటాకపాలకుఁ డనఘా!

130


క.

పూర్తాదులు గావించిన
కీర్తిసమన్వితులు జగతిఁ గృతపుణ్యులచేఁ
గీర్తితు లగుచును భవరో
గార్తిం ద్యజియించి నిలుతు రమరపురమునన్.

131


వ.

మఱియును దాదృగ్విధతటాకంబు లుత్తమంబులును మధ్యమంబులుసు సా
మాన్యంబులు ననం ద్రివిధంబులం బరఁగు. నందుఁ జత్వారింశద్గోకర్ణప్ర
మాణజలసమేతం బుత్తమంబు వింశతివిష్కుప్రమాణపయఃపూరితంబు
మధ్యంబును దశప్రాదేశమాత్రప్రమాణసలిలసంయుక్తంబు సామాన్యంబు
నగు. నట్టి తటాకంబులయందు జానుదఘ్నసలిలసమేతంబు వారుణలోకప్రా
ప్తియు నితంబప్రమాణజలపూరితంబు గోహత్యాదిపాతకనివృత్తియును
గక్షదఘ్నపయస్సంయుక్తంబు సురాపానాదికలుషచయనివారకంబును
బురుషప్రమాణపానీయసముజ్జ్వలంబు బ్రహ్మహత్యాదినాశకరంబును గజ
దఘ్నకీలాలదర్శనీయంబు విష్ణుమందిరనివాసకారణంబును నై పితృమాతృ
వంశజు లైన కులసంభవులకు స్వర్గలోకనివాసకరం బగుఁ. దత్తటాకజఫలి
తంబు లైన మూలశాకధాన్యాదులు దానంబు చేసిన లక్ష్మీపుత్త్రపౌత్త్ర
కాంతాదిలాభంబులు గలుగు. నందు.

132


క.

అలయికతోడుత మనుజుఁడు
ఫలపరిమితతత్తటాకపానీయంబుల్
చెలు వలరఁ గ్రోలఁ గర్తకుఁ
గలుగును దేవేంద్రసదనఘనసౌఖ్యంబుల్.

133


క.

ఘనసంపత్ప్రాప్తిక మ
య్యును సంతతి నిగుడుకొఱకు నొగి స్వర్గంబం
దును నిలయము గలుగుటకును
వనములు దలకొలుప ధాత్రి వలయు మునీంద్రా.

134


క.

కలకొలఁది సూపసంఖ్యను
ఫలపుష్పసమేతరమ్యపాదపములచే

నిలుపంగవలయు వనములు
గలిమియు సంతతియుఁ గీర్తి కలిగెడుకొఱకున్.

135


వ.

మఱియును నహకారంబులు పదియును నారికేళంబులు ముప్పదియును
జంబీరంబులు పండ్రెండును మాతులుంగంబు లిరువదిమూఁడును ఖర్జూరంబు
లిరువదియును జంబూవృక్షంబులు ముప్పదియును దాలద్రుమంబు లేఁబది
యును గపిత్థంబులు పదునొకండును దాడిమంబు లిరువదియును దింత్రిణీ
భూజంబులు పదియును గదళీశతంబును బిల్వంబులు పదియాఱును హింతా
లంబు లిరువదియును నశోకంబులు పదియాఱును నామలకంబులు నలువది
యును శ్రీచందనపాదపం బొక్కటియు వటంబులు నాల్గును నశ్వత్థంబు
లెనిమిదియును బున్నాగకురువిందకరవీరమల్లికావకుళపాటలశతప
త్రజాతీకుందచంపకతులసీమమపకప్రియం బగు ప్రముఖతరులతావిశే
షంబులు పాదుకొల్ప నది వనం బనం బరఁగు. నట్టివనంబు ఫలోద్భవప
ర్యంతంబు పాలితం బై కర్తకు స్వర్గలోకంబు నిచ్చు. నంత.

136


క.

వనములు దలకొల్పిన య
మ్మనుజుఁడు దివిజాధినాథుమందిరమున సం
జనితకుతూహలమున నిలు
చును భూషావళులచేత శోభిత మగుచున్.

137


గీ.

వేదరహితుఁడైన వృత్తహీనుండైనఁ
బతితుఁడైన దుష్టభావుఁడైనఁ
దెలివిఁ దద్వనప్రతిష్ఠఁ గావించిన
వాంఛితముల నొందు వర్ణితముగ.

138


వ.

మఱియు నిధిప్రకారంబు చెప్పెద నాకర్ణింపుము.

139


సీ.

అంగుగా నరువదియంగుళంబులభూమి
        గర్తంబుగాఁ జేసి క్రమముతోడ
నందు నీవారముఖ్యారణ్యకములైన
        పంచధాన్యంబులు పంచరత్న
ములు హరిద్రయు గవ్యమును సప్తధాన్యముల్
        వేదమంత్రంబులఁ బాదుకొల్పి

సంఖ్యచిన్నము సహస్రము శుద్ధహేమంబు
        తామ్రపాత్రాంతస్స్థితంబు చేసి
యివ్వ లవ్వల నెవ్వరు నెఱుఁగనట్లు
తమము వదలిన యర్ధరాత్రంబునందు
నదియుఁ దగ్గర్తమధ్యమమందు నిల్పి
పుణ్యుఁ డందును స్వర్గోపభోగములను.

140


క.

నిధి నిలిపిన ఘనపుణ్యుం
డధికమహాకలుషరహితుఁడై తుది నిలుచున్
విధుసూర్యులు గలకాలం
బధిగతపరమార్థుఁ డగుచు నమరపురమునన్.

141


గీ.

ఎంతకాలంబు నిక్షేప మీధరిత్రిఁ
బరులచేఁ బడకుండును బదిల మగుచు
నంతకాలంబుఁ దత్కర్త హర్ష మొదవ
స్వర్గలోకంబు నందుండు సత్యచరిత.

142


క.

ఆనిక్షేపముఁ గైకొని
మానవుని కులస్థుఁ డెల్ల మహిఁ గర్తకు సం
తానము లై మనుచుందురు
మానవపతు లైన సర్వమానితు లైనన్.

143


వ.

మఱియు దేవాలయప్రతిష్టావిశేషంబు లెఱింగించెద.

144


క.

విష్ణుప్రతిష్ఠ చేసిన
వైష్ణవుఁడు ధరిత్రిలోన వైభవముల వ
ర్ధిష్ణుం డై తుదఁ బొందును
విష్టునివాసంబు లోకవిశ్రుతుఁ డగుచున్.

145


క.

అగణితధర్మప్రద మగు
సుగతికిఁ జెడనట్టి తెరువు శోకాదులకుం
బగ వాంచితార్థఫలదము
జగతిన్ విష్ణుప్రతిష్ఠ సామాన్యంబే.

146


క.

అతులితపాషాణవిని
ర్మితమగు సదనమున భక్తి మెలఁగుచు విష్ణు

ప్రతిమాప్రతిష్ట చేసిన
మతిమంతుం డరుగు మోక్షమార్గంబునకున్.

147


చ.

హరునిఁ బ్రతిష్ట సేసిన మహాత్ములు తద్వరరూపయుక్తులై
హరునిపురంబుఁ జేరి ప్రమదావళిలోన సుఖింతు రిందిరా
వరుని బ్రతిష్ట సేయు గుణవర్ణితు లెల్లను విష్ణుదివ్యమం
దిరవరసౌధజాలముల ధీనుతు లై విహరింతు రెప్పుడున్.

148


గీ.

వేడ్క బ్రహ్మప్రతిష్టఁ గావించు నరుఁడు
వైభవంబున దేవతావశ్యుఁ డగుచు
భూతలంబున ధనధాన్యపూర్తిఁ బొంది
యంతమందున సుఖియించు నమరపురిని.

149


వ.

మఱియు భూసురోత్తముల కుపనయనవివాహాదికర్మంబు సేయుటయును
స్వవిత్తమూలంబున విప్రరక్షణంబును దదాపద్విమోదనంబును బ్రాహ్మ
ణునకు నుపకరణపూర్వకముగా గృహనిర్మాణంబును నన నివియ బ్రహ్మప్రతి
ష్ఠ లనంబరఁగు. నిట్టిబ్రహ్మప్రతిష్ఠ సేసినసుజనులు విష్ణుసదనప్రాప్తు లగుదు
రని నారాయణుండు మఱియు నిట్లనియె.

150


మ.

మతిలోనం దలఁపంగ సర్వజననమ్మాన్యంబులై యిందిరా
పతిలోకస్థిరసౌఖ్యకారణములై భవ్యంబులై లోకవి
శ్రుతసంపజ్జయదంబులై భువనసంస్తుత్యంబులై యెచ్చటన్
గృతిమూలంబునఁ గాదె నిల్చుటలు సత్కీర్తుల్ దిగంతంబులన్.

151


క.

క్షితిమీఁద సప్తసంతతు
లతిరయమున నిలుపునరుల కబ్బినఫలముల్
గృతినాయకునకుఁ గలుగును
మతిఁ దలఁపఁగ జగతిఁ గృతియె మాన్యం బనఘా.

152


చ.

వలనుగఁ దత్కృతీశ్వరుని వంశజు లెల్లను గోటిజన్మని
శ్చలవివిధప్రసిద్ధకలుషంబులఁ బాసి మహానుభావులై
పొలుపుగ రత్నభూషణవిభూషితులై విహరింతు రెప్పుడున్
నలినదళాక్షుమందిరమునం బరిపూర్ణమనోరథాత్ములై.

153


వ.

అని యిట్లు నారాయణమునీంద్రుండు సప్తసంతానప్రకారంబులు సెప్పిన

సంతుష్టమనస్కుండై శౌనకుండు మఱియు నిట్లనియె.

154


మ.

హరిరూపంబులు వేదజాలములు తద్వ్యాపారముల్ సూటితోఁ
బరగించున్ గరిమంబు లేక కుమతుల్ భావించి దుష్ప్రజ్ఞలన్
దఱచై తద్గ్రథితార్థమధ్యసరణిం దర్కించి దుర్మార్గసం
చరులై మోక్షము నొందలేక ఘనతన్ సంసారనిర్మగ్నులై.

155


ఉ.

ఆనుక శత్రుపౌరుషము లౌ ననకుండినఁ దన్నిహంతృస
న్మానసనాథకీర్తులు దినంబును వృద్ధిని బొంద వట్లనే
జ్ఞానముచేతఁ గర్మములు సంక్షయ మందెడుచోట వేదముల్
జ్ఞానమహత్త్వముం దెలుప సన్నుతిసేయును గర్మయోగమున్.

156


సీ.

వేదాంతవేద్యుని విశ్వసంపూర్ణుని
        సద్గుణధాముని సత్యచరితుఁ
బద్మజపద్మారిపద్మాప్తవంద్యుని
        బరమయోగీంద్రహృత్పద్మనిలయు
నఖిలలోకశరణ్యు నాదిత్యశతకోటి
        నిర్మలకాంతిసన్నిభశరీరుఁ
గమలాలయానాథుఁ గరుణాసమన్వితు
        నంబుజదళనేత్రు నమరసేవ్యు
దివ్యభూషావిభూషితు దేవదేవు
శంఖచక్రాబ్జవరగదాశార్ఙ్గహస్తు
నాదిమూర్తిని నఖిలవిఖ్యాతచరితు
విష్ణుఁ దలఁపుము మునివర్య! వేడ్కతోడ.

157


క.

సత్యముఁ జెప్పెద హరియే
నిత్యం బన్యంబు మాని నీ వావిభునిన్
అత్యంతభక్తితోడుత
నిత్యము మదిఁ దలఁపు మనఘ నియతుఁడ వగుచున్.

158


క.

ఏ వే మైనను మఱవక
భావంబునఁ దన్నుఁ దలఁచు భక్తుల కెల్లన్
శ్రీవిభుఁ డొసఁగును దయతోఁ

గైవల్యము భూసురేంద్ర క్రమ మొప్పంగన్.

159


క.

నిత్యుం డవ్యయుఁ డమలుం
డత్యంతము చక్రహస్తుఁ డాఢ్యుఁడు జగతిన్
సత్యం బిది సత్యం బిది
సత్యం బిది మునివరేణ్య సంశయరహితా.

160


ఉ.

వృత్తవిహీనుఁ డైన నతివిశ్రుతఘోరదురంతపావకా
వృత్తసమేతుఁ డైన నపవిత్రమనస్కుఁడు నైన విష్ణుధ
ర్మోత్తర మెవ్వఁ డేని విను నూర్జితభక్తిని వాఁడు భూమిలో
నుత్తముఁడై యభీష్టముల నొందును విష్ణుదయాప్రఫూర్ణుఁడై.

161


వ.

అని యిట్లు నారాయణమునీంద్రుండు శౌనకునకు వైష్ణవధర్మంబు లుపదేశించి
న నతండు సంశయంబు మాని లక్ష్మీవిభుండు వేదాంతవేద్యుండని యెఱింగి
తద్విష్ణుభక్తిసమేతుం డై యమ్మహాత్మున కభివందనం బాచరించి నిజాశ్ర
యంబునకుం జనియె.

162


క.

దీనావనసత్వరసత
తానంతశయాన రాక్షసాధిపదళ నా
శ్రీనాథకౌస్తుభాంకిత
నానావిధవిభవపూర్ణ నతసురభూజా.

163


పృథ్వివృత్తము.

జయసురవరాంతకా జయరమాసమాలింగితా
జయప్రకటసాహసా జయసమస్తలోకేశ్వరా
జయశ్రితసురద్రుమా జయసుదర్శనాలంకృతా
జయక్షితిరమాధిపా జయముకుందరంగేశ్వరా.

164

గద్య
ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధవరప్రసాద సహజసారస్వత
చంద్రనామాంక రామవిద్వన్మణికుమార అష్టఘంటా
వధానపరమేశ్వర హరిభట్టారకవిరచితం బైన
మత్స్యపురాణఖండం బగు విష్ణుధర్మోత్త
రంబునందుఁ బంచమాశ్వాసము
సంపూర్ణము.